పదబంధ పారిజాతము/అన్న గళు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అనీ కొనా తెలియ లేదు

 • మొదలూ, తుదీ తెలియలేదు. అల్లుటలో తొలుత ఆరంభించేటప్పుడు 'అని' వేస్తారు. అలాగే ఆఖరున ఉన్నది కొన. అవి రెండూ తెలియుట అనగా అందలి వివర మంతా తెలియుట - తుదీ మొదలూ కూడా.
 • "ఇందులో అనీకొనా తెలియడం లేదు." వా.

అనీ మొనా తెలియదు

 • ఇందులో మొదలేదో తుది ఏదో తెలియదు. అంటే దాని తత్త్వం తెలియ దనుట. జం.
 • "అనీ మొనా తెలిస్తే గానీ ఏ ముడీ విప్పలేము." వా.

అను కణకన్

 • పైపై పడగా, వర్షించగా.
 • "ఉర్వీతల మద్రువంగ నుల్క్స్స్పాతం బనుకణక." కుమా. 2. 11.

అనుకుంటూ ఉండగా

 • ఆ ప్రస్తావమే జరుగుతుండగా.
 • "అనుకుంటూండ గానే వచ్చావు. నూరేండ్లాయుసు." వా.

అనుమానం పెనుభూతం

 • అనుమానం చెడ్డది.
 • చూ. అనుమానం ప్రాణసంకటం.

అనుమానం ప్రాణసంకటం

 • అనుమానం చెడ్డది.
 • "వాని కేదో అనుమానం పట్టుకొంది. రోజురోజుకూ నీరసించి పోతున్నాడు. అనుమానం ప్రాణసంకటం." వా.
 • చూ. అనుమానం పెనుభూతం.

అనుమానపు పీనుగ

 • వట్టి అనుమానపు మనిషి అని నిందగా అనుటలో ఉపయోగించేపలుకుబడి.
 • "వాడింట్లో ఎక్కడ దిగనిస్తాడు రా. ఒట్టి అనుమానప్పీనుగ." వా.

అనుమానపు మనిషి

 • అడుగడుగునా సందేహా లుండే మనిషి.
 • "వాడు చాలా అనుమానం మనిషి. ఏది నిశ్చయించుకోవా లన్నా సంవత్సరాలు పడుతుంది." వా.
 • చూ. అనుమానపుపీనుగ.

అనుము, మినుము అనకుండు

 • ఏమీ అనకుండు, మౌనము వహించు.
 • "అనుము మినుము ననక చాటున గూర్చుండె నక్కటకట!"
 • గుంటూ. వూ. పు. 31.
 • "నే నెంత నెత్తి పగలగొట్టుకుంటున్నా వాడు అనుమూ మినుమూ అనకుండా బెల్లంకొట్టిన రాయిలా ఉంటే నే నేం చేసేది?" వా.

అనువు గానిచోట అధికుల మనరాదు

 • కూడనిచోట మన గొప్ప చూపరాదు.
 • "ఇల్లూ దొడ్డీ అంతా వాడిది. సంపాదించి తెచ్చి వేస్తున్న వాడు వాడు. మనం ఎవరం ఏ మనడానికీ? వాడి ప్రవర్తన బాగా లేకపోతే అది వేరేమాట. మన

మే మనగలం? అనువు గానిచోట అధికుల మనరాదు అని నోరుమూసుకొని కూచోవలిసిందే." వా. అనువు దప్పు

 • పస చెడు.
 • "అనువు దప్పిరి నొచ్చి రలసి రాపద నొంది, రదపద లైరి చీకాకుపడిరి." హరివి. 3. 10.

అనువుపఱచు

 • అమర్చు.
 • "అఱుత రుద్రాక్షమాలిక లనువు పఱచి." కాశీ. 1. 95. శివ. 3. 12.

అనువొందు

 • ఏర్పడు.

"మనుజాధిపదనుజాధిపు లనువొందిరి
రామ రావణా కారములన్."
               శకుంతలా. 3. 135.

అనుష్ఠానము తీర్చు

 • సంధ్యావందనాదులు నిర్వర్తించు.
 • "స్నానంబు సేసి నిజక, ర్మానుష్ఠానంబు దీర్చి." కా. మా. 119.

అన్కను కగు

 • మెత్త మెత్త నగు, ద్రవీభూతమగు.

"అరుణకరోత్క రాభిహతి నన్కను
కయ్యెడు సాంద్రచంద్రికాంతరమున."
                  కుమా. 8. 182.

అన్న గళు

 • అన్న గార్లు.
 • కంచుకి మొద లయినవారు.
 • తమి. "అన్నగళ్."
 • "అన్నగళు మాట..." మన్నారు. పు. 4.

అన్న చొరవ

 • తినుటలో ప్రావీణ్యము.
 • "వాడికి అన్న చొరవే కాని అక్షర చొరవ లేదు. ఏంలాభం?" వా.

అన్న చొఱవే గాని అక్షర చొఱవ లేదు.

 • విద్యాగంధం లేనివా డనుట.
 • "వాడికి అన్న చొఱవే గాని అక్షర చొఱవ లేదు." సా.

అన్నట్టు

 • వాక్యోపస్కారకము.

అన్న తర్వాత

 • అయినప్పుడు...
 • "మొగు డన్న తర్వాత ఆ మాత్రం దండించకుండా ఉంటాడా?" వా.
 • "ఉద్యోగ మన్నతర్వాత ఏవో కొన్ని నిర్బంధాలు లేకుండా ఎట్లా ఉంటాయి." వా.

అన్న దమ్ము లగు

 • సమాన మగు.
 • "క్రేగంటిచూపున గిఱికొన్న సన్న గే దంగిఱేకుల కన్నదమ్ము లగుచు." ఉ. హరి. 1. 151.

అన్నన్న

 • ఆశ్చ ర్యార్థకము.
 • నేటికీ యిది వాడుకలో నున్నది.

"కొన్నంగడిలోపలనే, యన్న నా!
మాఱుబేర మగునే చెలియా!"
                   రాధి. 3. ఆ. 22 ప.

అన్న ప్రాశం

 • పిల్ల లకు తొలిసారిగా అన్నము పెట్టుటకై చేయు సంస్కా రము. పంచదశ కర్మలలో ఒకటి.
 • "ఈ నెలలో చిన్న వాడికి అన్నప్రాశం చేయాలి." వా.

అన్నము నీళ్లు చెల్లు

 • ఋణము తీరిపోవు. చనిపోవు.
 • "అన్నము నీళ్లు చెల్లిపోయాయి. వాడు పోయాడు. ఎవరిని అని ఏమి ప్రయోజనం?" వా.

అన్నము పువ్వులవలె నున్నది

 • ముద్ద కాకుండా విడివిడిగా కనుల పండవుగా ఉన్న దనుట.

"నివ్వరి బియ్యంబున బువ్వులవలె నుండ
వండి వార్చిన యుపహార భాండంబులు." కా. మా. 3. 36.

అన్నమూ లేదు - సున్నమూ లేదు

 • ఏమీ లే దనుట. జం.
 • నిరసనగా అనుమాట.
 • "ఈ వేళప్పుడు ఏం అన్న నయ్యా? అనమూ లేదు సున్నమూ లేదు. పో." వా.

అన్న మో రామచంద్రా యను

 • ఆకలితో అల్లాడు.
 • "దారిద్ర్యంబు తట్టుముట్టాడ, అన్నమో రామచంద్రా యనుచు...."
 • ధర్మరా. 6 పు. 2 పం.

అన్న శాంతి

 • ఏ దైనా దోషం ఉంటే తచ్ఛాంతికై అన్న దానం చేయుట.
 • "అన్నశాంతి చేస్తే ఈ దోషం పరిహార మవుతుంది." వా.

అన్న సంస్కారము

 • వంట.
 • "యామార్ధమునకె కావింతు నన్న సంస్కారంబు." పాండు. 4. 153.

అన్న సూక్తం

 • అన్నం పరబ్రహ్మస్వరూపం అంటూ అన్నాన్ని స్తుతించే వైదికసూక్తం.

అన్న సూక్తం పఠించు

 • ఆకలి గొను.
 • "వాడు అన్నసూక్తం పఠిస్తూ కూర్చున్నాడు." వా.

అన్నానా ఆడానా?

 • ఏమీ తిట్ట కేద నుట. జం.
 • "నే నేమి అన్నానా? ఆడానా? మూతి ముడుచుకొని మూల కూర్చోవలసినంత పనేముందే నా తల్లీ!" వా.

అన్నానికి లేదు

 • దరిద్రుడు.
 • "వాడికి తినబోతే అన్నానికి లేదు. అయినా జంభం చూస్తే యింత పొడుగు వుంది." వా.

అన్ని దొంతులును చెప్పగ నేటికి

 • అన్నీ వరుసగా చెప్పుటెందుకు? దొంతులు పేర్చినట్టు వరుసగా అన్నిటినీ వరుసబెట్టి ఎందుకు చెప్పవలెను అని భావార్థం. దొంతులు క్రమంగా పెద్దది క్రింద, దానికంటె చిన్నది