పదబంధ పారిజాతము/అడుగు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అడు_____అడు 45 అడు_____అడు

అడుగవచ్చినవారు

 • పిల్లకు పెత్తనము వచ్చిన వారు.
 • "అడుగ వచ్చినవార లయ్యబలరూప, శిలకులగుణవిఖ్యాతి చాల మెచ్చి."
 • శుక. 2. ఆ. 153 ప.

అడు గామడ యగు

 • ఒక కొంత దూరమే ఆమడ దూరముగా తోచు - దౌర్బల్యాదులవలన.
 • "పొడలు పెట్టుచు దన కడుగామ డై యుండ." కా. మా. 3. 193.
 • "నల్ల రేగడభూమి, వర్షాకాలంలో నడిచే వారికి అడుగు ఆమడగా నుండును."
 • కాశియా. పు. 51.

అడుగు ఆమడగా నడుచు

 • మహాభారముతో, శ్రమతో నడుచు.
 • "ఆ గర్భిణీస్త్రీ అడుగామడగా నడిచివస్తే నీవు ఏమాత్రం కనికరం లేకుండా పొమ్మంటే యెక్కడకు పోతుంది?" వా.

అడుగుకొని తిను

 • యాచించు.
 • "వాడు ఊళ్లో అడుగుకొని తింటున్నాడు. అస్తా? పాస్తా?" వా.

అడుగుగులాము

 • పాదదాసుడు.

"రమ్మని పొమ్మని తెమ్మని
యిమ్మని కానిమ్మ టంచు నే గొమరుంబ్రా
యమ్మున నానల నిడుసమ
యమ్ముననీదృశులు నాదునడుగుగులాముల్"

 • భద్రావత్య. 2. ఆ.

అడుగు తప్పని

 • జవదాటని.
 • నా. మా. 94.

అడుగు దప్పక

 • జవదాటక.

"పతిభక్తితోడ జరిపెడు,
వ్రతములు వల దనెడునట్టి వనితలు గలరే?
పతిమాట కడుగు దప్పక,
సతులకు ననుకూలబుద్ధి జరియింప దగున్." రుక్మాం. 4. 79.

అడుగు దప్పినచో దప్పు పిడుగు

 • కొంచెము పొరపాటు చేసినా ప్రమాద మగును; కొంచెం జాగర్తపడితే అది తప్పును అనుట. పిడుగు పడునప్పుడు ఒక అడుగు అటు వేసిన ప్రమాదము, ఇటు వేసిన ఆ ప్రమాదం తప్పును. తద్వారా యేర్పడినపలుకుబడి.
 • "అడుగు దప్పినచో దప్పు బిడు గటంచు."
 • శుక. 1. ఆ. 319 ప.

అడుగు దాటడు

 • ఏమాత్రం మాట నతిక్రమించడు అనుట.
 • "వాడు అన్నమాట అడుగు దాటితే ఒట్టు." వా.

అడుగు దీయక

 • వెనుకంజ వేయక.
 • "కడగి సింహముమీద గవిసిన నైన నడుగు దీయక గుండె లవియు మోదుదుము."
 • గౌ. హరి. ప్రథ. పంక్తి 477-78. అడు_____అడు 46 అడు_____అడు

అడుగున పడు

 • విస్మృత మగు.
 • "వాడు కౌముది అంతా చదువుకున్నాడు. కాని అది అంతా యిప్పుడు అడుగున పడి పోయింది." వా.
 • "నా అర్జీ అడుగున పడి పోయింది. విచారించేనాథుడు లేదు. వా.

అడుగుపఱచు

 • తక్కువపఱచు.
 • "లలి గొ ప్పెక్కించితి మధుపుల, శుకులను నడుగుపఱచి పుష్పాస్త్రా! మా,లలకును మంచంబులు బా పలకును బీట లనుమాట బళి నిజమయ్యెన్." చంద్రా. 5. 91.

అడుగు పెట్టకుండు

 • ముందుకు సాగకుండు.
 • "...ఎంత చేసిన నాసింహ మెదుటి కడుగు వెట్ట దయ్యెను." కళా. 3. 86.

అడుగు బట్టు

 • మూలబడిపోవు, క్రిం దగు.
 • "బలు సెక నించువి ల్లడుగుబట్టినదే యిపు డాకు బూదిగెంపుల ద్రిరుచిత్వ మూది." ఆము. 4. 96.

అడుగు బడుగు

 • కుండలో ఆఖరున మిగిలినది.
 • "కాస్త అడుగో బడుగో యేదో ఒకటి వేయం డమ్మా. ఆకలిగా ఉంది." వా.

అడుగుభద్రం<.big>

 • నెమ్మది, నిదానం, పదిలం.
 • "వాడు వట్టి అడుగుభద్రం లేనిమనిషి. ఎప్పుడు ఎక్కడ ఉంటాడో తెలీదు." వా.
 • చూ. అడుగు లేనిగిన్నె.

అడుగు మాడు

 • చూ. అడుగంటు.

అడుగుమనిషి

 • పాదసేవకుడు.
 • పాండు. 4. 304.

అడుగు మాలిపోవు

 • నిర్మూల మగు.
 • "అనుజ తనుజులు జెలులు వియ్యములు నడుగు, మారిసోదరు నీకు గా మనుజ నాథ!, దొరకు గులనాశనుం డనుదూఱు మేలె, పాండవులతోడ నొడ గూడి బ్రదుక వయ్య."
 • భార. ఉద్యో. 3. 341.

అడుగు ముట్టా

 • పూర్తిగా.
 • "ఆవిషయం అడుగుముట్టా తెలుసుకునే దాకా వదిలిపెట్ట దలచుకో లేదు." వా.

అడుగులకు మడుగు లొడ్డు (లొత్తు)

 • అతిభక్తితో సేవించు.
 • పూర్వం ఎవరైనా గొప్పవారు వస్తే వారి అడుగులు నేలకు తగులకుండా ఉతికిన బట్ట పరచి దానిమీద నడిపించుకొంటూ వచ్చేవారు. అందుపై వచ్చినపలుకుబడి. ఇప్పటికీ కొందఱి పెండ్లిండ్లలోనూ, శ్రాద్ధాలలోనూ గౌరవసూచకంగా బట్టలు పఱచి నడిపించుట కానవస్తుంది. అడు_______అడు 47 అడు_______అడు
 • "జనయిత్రీజనకులం గని మది నడరుచు నడుగులకు మడుగు లొడ్డుచు నరుగు సెడ."
 • పాండు. 2. 25.

అడుగుల వ్రాలు

 • పాదాభివందనము చేయు.
 • "దశరథు డడుగుల వ్రాలు తనయుల నిర్వుర దా గౌగిలించి."
 • వర. రా. బా. పు. 207 పంక్తి 18.

అడుగు లాన

 • పాదాల సాక్షిగా.
 • ఒట్టు పెట్టేటప్పుడు చెప్పే మాట.
 • "నీ యడుగులాన." కాశీ. 7. 179.

అడుగులు తడబడు

 • "అడుగులు తడబడ నడరెడు నడపుం గడకల నడుములు గడగడ వడకం..." కళా. 6. 251.
 • "అడుగులు తడబడ బులకలు, పొడమగ సఖివెనుక కొదుగ బోవుచు నరసెం." కళా. 7. 147.

అడుగుల కెఱగు

 • నమస్కరించు.
 • "సంతసంబున వచ్చి యా సంయ మీంద్రు, నడుగులకు నెఱగుడు నత డాదరమున." పారి. 2. 22.

అడుగులు సడుగులు

 • చూ. అడిగండ్లు మడిగండ్లు.

అడుగులేని గిన్నె

 • కుదురు లేని మనిషి.
 • "వాడు వట్టి అడుగు లేనిగిన్నె. ఎక్కడా నాలుగునాళ్లు పని చేయలేడు." వా.

అడుగులో అడుగు వేసుకొంటూ

 • మెల్లగా.
 • "ఇలా అడుగులో అడుగు వేసుకొంటూ వెడితే యిక మనం చేరినట్టే." వా.

అడుగులో దాటిపోవు

 • కొంచెములో తప్పిపోవు.

అడుగులో హంసపాదు.

 • ఆరంభంలోనే విఘ్న మనుట. 'ప్రథమకబళే మక్షి కాపాత:' వంటిది.
 • "వాళ్లు పిల్లను చూడ్డానికి వచ్చేసరికి మా అమ్మాయి ముట్టయి కూర్చుంది. అడుగులోనే హంసపాదు. ఏ మవుతుందో ఏమో!"
 • చూ. అంచపదము.

అడుగువట్టు

 • నీటిలో అడుగుభాగమునకు దిగిపోవు.
 • నౌకలు మొదలగువానివిషయంలో నీరు లోతు తగ్గగా నేల తాకి ఆగిపోయినప్పుడు కూడా అడుగుపట్టిన దంటారు.
 • "నిర్భరగతి ద్రచ్చుచో నడుగువట్టిన తద్గిరి యెత్తవే." పారి. 3. 29.

అడుగు వాసినచో నక్కఱ వాయు

 • ఇల్లు దాటిపోతే ఇంక ఇంటి ధ్యాస ఉండదు.
 • ఇది సామాన్యంగా మగ వాళ్లను గూర్చి చెప్పుటలో ఆడవా ళ్లుపయోగించే పలుకుబడి.