పండ్రెండు రాజుల కథలు/సుధాకరమహారాజు కథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఐదవనాటి రాత్రి కథ.

పంచమదివసంబున భాస్కరుం డవరవారాశీ గ్రుంకినంతనే నరనారాయణులు రాత్రి భోజనంబొనరించు విలాసవైఖరి సంభాషించుచు, యధాపూర్వకంబుగ, యమునా సైకతభూముల విహరింప నరుదెంచి యట సుఖోపవిష్ణులై తాంబూల చర్వణంబొనరించుతరిఁ బ్రసంగ వశంబున పార్ధుం డధోక్షజుందిలకించి——"యోదేవా! ఇంతకుమున్ను గడచిన యామినీచతుష్కంబునను, నాకు మనప్రమోదకరంబులగు నట్టివియు——నిహపరోత్తారక హేతు భూతంబులగునట్టివియు నగు కథా చతుష్కంబును కర్ణరసాయనంబుగ నెఱిఁగించితివి. నేటిరాత్రి పంచమ యోగంబగు తారకరహస్యముం దెలుపు ఫుణ్య చరిత్రము నొక దాని నెఱిఁగించి, నన్ను ధన్యాత్మునొనరింపుము " నావుడు, పురుషోత్తముఁడు మందస్మితముఖుండై——"విజయా! సావధానుండవై సుధాకర మహారాజు చరిత్రంబు నాలకింపుము. నీసంశయము తొలంగ గలఁదని పలికి, వెండియు నిట్లు పలుకసాగెను.

సుధాకరమహారాజు కథ.

తొల్లి వంగదేశమును, పద్మాకరుం డనురాజు పరిపాలించుచుండెను. ఆరాజోత్తంసునకు, భారతి, విలాసవతియను నిరువురు భార్యల యందును క్రమంబున సుధాకర, ప్రభాకరులను పుత్రులు జన్మించిరి. రాజు కనిష్ఠ సతీతిలకంబగు విలాసవతి యందలి మోహంబు పెంపున నామె సవతి మత్సరంబున నొనర్చిన దుష్టొపదేశంబులచేఁ బ్రేరితుండై సాధ్వీతిలకంబగు భారతిని, నిరాకరించి, యామెను సపుత్తకంబుగ రాజ మందిర బహిష్కృతనుగా నొనరించి, యత్యధమంబగు దిన వెచ్చముం బంపుచు విలాసవతితో సుఖభోగములం గాలము గడుపుచుండెను. శుక్లపక్ష సుధాకరునిభాతి యువరాజగు సుధాకరుండును, దినదిన ప్రవర్ధమానుం డగుచు చతుషష్టి కళలయందును, నష్టాదశ విద్యల యందును వేదవేదాంత విచారాదులయందును సద్గుణసహస్రమునందును, సాటి లేని శక్తిం గలిగి, వృద్ధినందుచు నెల్లరచేఁ గీర్తింపఁబడుచుండ——తద్యశోగాన శ్రవణంబును భరింపఁజాలక, సవతితల్లియగు విలాసవతి యేవిధానంబుననైన నాబాలుని నాశనముంగాంచ నభిలషించి, కొండొక రేయి, శిరోబాధను నటింపుచు, నమూల్య రత్నాభరణాంబరాదుల విసర్జించి కోపా గారముం జేరియుండెను. వృద్ధరాజు యధాప్రకారంబున నిజసతీ సదనంబున కరిగి యామె విచార కారణంబునారసి, 'యేవిధానంబున నీశిరోబాధ శమియించు' నని ప్రశ్నింప, నాహంత కారి కొంత దురంతదుఃఖంబు నభినయించి, “యోరాజా! ఇది సామాన్యమగు శిరోబాధ కాదు. ఇట్టి బాధ నాకు నాపుట్టింటసయితము బాల్యంబున నప్పుడప్పుడు కల్గుచుండెడిది. ఇందులకు శార్ధూలక్షీర మౌషధంబు; నీ పెద్దకుమారుఁ డగు సుధాకరుఁడు దానిని గొనిరాగల సమర్థుండు; మఱియొక మానిసి కది దుస్తరంబగును. వానినంపి నేఁ గోరినపులిపాలు తెప్పింతువా బ్రదుకుదు; లేదా——నేటితో మనఋణానుబంధ మంతంబగు " నని పలికి కపట దుఃఖంబు నటించెను. రాజునకు మనస్సు ద్రవింప, సుధాకరుంబిలిచి, “నాయనా! నీపినతల్లికి దుర్భర శిరోబాధ గల్గియున్నది. అందులకు పులిపా లౌఔషధంబట, దానిం గొనివచ్చుటకు నీవే సమర్ధుండవట! పులి పాలం దెచ్చి, నీతల్లి ప్రాణంబులను నిలుపుదువే తనయా!" యనియడుగ, నాపుత్రరత్నం బత్యంతవినయంబున వల్లేయని పలికి, నిజ జననితో తన ప్రయాణోదంతముం జెప్పెను. పిడుగడచినట్లు వినంబడిన పుత్రునివాక్యంబులకు కొంతవడిఱిచ్చవడి భారతి మహావిషాద చేతస్కయై: "కుమారా! ఇది మహాకపటోపాయము, నీసవతితల్లి నీమరణముంగోరి యిట్టి దురుపాయంబు నరసినది. రాజును చెంగున ముడివేసికొని మన కిట్టిదుర్దశను గలిగించుటతోఁ దృప్తినందక, నామహామారి మననాశనమును సయిత మపేక్షించుచున్నది. ఎచ్చటనైన శిరోబాధకు పులిపాలౌషధంబు లగునా? పులిపాలం దేదలంచుట మృత్యు దేతతా కరాళములం జోచ్చు టయేకాదా? నాతండ్రీ! సాహసించిచని నాకు పుత్రశోకముం గలిగింపకు” మని మఱి మఱి దుఃఖించి వారింపఁజూచినను, సుధాకరుండు సమ్మతింపక తల్లిని యుక్తివచనంబుల ననుమతింపంజేసి, నిరపాయంబుగ వచ్చెదనని పలికి యానాడే పయనంబై చనియెను. అంతనాసాధ్విచేయునది లేక కుమారుని మనఃపూర్వకంబుగఁ గౌగలించి చెక్కిలి ముద్దాడి, దీవించిపంపెను.

యువరాజగు సుధాకరుండు పులిపాలను సేకరించు నుద్యమంబున బయల్వెడలి, యొక మహారణ్యమునం జొచ్చి, యందుఁగల యాటవికులతోఁ దనవృత్తాంతముం జెప్ప వారు పకపక నవ్వి పరిహసించి, “యో వెఱ్ఱివాఁడా పులుల నెన్నింటినేని, భుజాసారము పెంపున బోకార్చినఁ బోకార్ప నలవి యగుంగాక——ప్రాణములతోడ, ఈనిన శార్దూలముంబట్టి, పాలు బితుక నెవ్వనితరంబు. నీకింతయేని తచాలకపోయెనా? ఏమని తలంచి యీ సాహసకార్యముం దలదాల్చివచ్చితివి. బ్రతుకఁ దలంపు గలదేని సత్వరంబున మజిలిపొమ్ము. నీకిది కరంబుగా ”దని పెద్దగా మందలించిరి. సుధాకరుం డాయెఱుకలనిరుత్సాహవచనంబులను వినియు వెనుదీయక, నలువురం దన వెంట తోడు దీసికొని, భయంకరారణ్యమునం బ్రవేశించి,యనేక శార్దూలంబుల ప్రాణములం బొరిగొనియెనే కాని, సజీవశార్దూలమును డాయునుద్యమంబుఫలింపదయ్యె—— అంత నారాజపుత్రుఁడు మిగుల నిరుత్సాహము జెందియే తదరణ్యంబున, నున్మత్తునిభాతి సంచరించుచు విధివశంబున, నాకానలోనున్న శరభృంగమహాముని యాత్రమముం బ్రవేశించి తన్మునిని దర్శించి, సాష్టాంగ దండ ప్రణామంబుల నాచరించి తనచరిత్రంబు నామూలచూడముగ నెఱిఁగింప నాసంయమి మందస్మితవదనారవిందుఁ డై యాతని నాదరించి దగ్గర గూర్చుండఁ బెట్టుకొని, "యోకుమారా! నీసవతితల్లి నీపై నీర్ష్య పెంపున నిట్టికపటో పాయముం బన్నెనేకాని పులిపాలు నిజముగా నెవ్వరికిని లభ్యములుగావు. నీ వీనిష్ఫల ప్రయత్నంబునుమాని కొన్ని నాళ్లు నాయాశ్రమంబుననుంటివేని, నీ కిహపర సుఖమార్గదర్శకంబగు సదుపదేశంబొనరించెద" నని పలుక నా రాజపుత్రుం డమితానందపరవశుండై యట్లయగుంగాక యని సమ్మతించెను. అంత నాశరభృంగుండు సుధాకరువకు తారకంబును వినుమని యుపదేశించెను.

తదనంతరంబా సుధాకరుండు కొన్నినాళ్లు శరభృంగమునీంద్రు నాశ్రమంబునందుండ, నొకదినంబున, సుదాముండను నామునీంద్రశిష్యుఁ డొకం డరుదెంచి యాకుమారుండు నిర్మలమానసంబుననున్న తరి దరింజేరి——“యోరాజకుమారా! నేను, కాళీ గయాది పుణ్య క్షేత్రంబులను దర్శించి వచ్చినవాఁడను. నాసంచార కాలంబున నందం దనేక చిత్రంబుల బొడగాంచితిని. అన్నిటిమాటకేమిగాని, కాళీపురాధిపతి కొక తనూభవగలదు, ఆమె కనకాంగియగు నస్వర్ధ నామంబున నొప్పారు. ఆ మందయాన యందంబువర్ణింప వేనోళ్ల చిలువరాయనికిఁగూడ నసాధ్యంబగు ననిన, నిఁక ననుబోటి చాందసుం డెందులకుఁజాలును? ఆసతీరత్నము సౌందర్యమునెదుట రతీయు, భారతియు, శ్రీసతియు, హైమవతియు దిగదుడుపునకైనఁ బనికిరారనిన నిఁక భూలోక కాంతలమాట చెప్పనేల? ఇట్టిసంపూర్ణ సౌందర్యరాశిని సృజించిన విరించి మతిమాలి, యానాతికొక తీరని కళంకముం దెచ్చి పెట్టినాఁడు. పవలుపండ్రెండు గంటల కాలమును నా రాజకుమార్తె దుర్భరదురంతమగు నుదరబోధచే బీడింపఁబడుచు, నున్మత్తగతిం బ్రలాపించుచు, నిలాతలంబునఁబడి గిలగిలఁగొట్టుకొని పెద్ద పెట్టున నెలుంగెత్తి దిశలుమారుమ్రోగ శోకించుచుండును. తత్సమయంబున నామె శోకమునుగాంచిన రాతిగుండెలైన నవనీతంబులగతి మృదుత్వ ముందాల్చును. రాత్రులం దాబాల గాఢంబుగనిద్రించి వేకువజామున శోకారావంబులతో మేల్కొనును. రాత్రులందాబాలిక శయనించు మందిరంబున నెందఱు శయనింతురో వారందఱు తెల్లవాఱునప్పటికి మృతశరీరులై యుందురు, ఈ మహాదారుణ కార్యము నెఱింగి యొంటరిగ నాబాలిక నోకగదియం దిడి కవాటమును బంధించుచున్నారు. ఉదరబాధవలన నాబాలిక యన్న పానీయంబులను మఱచి శుష్కాం గియై పోయినది. తొంటి సౌందర్య మెల్ల క్షీణించి శవప్రాయయై యున్నయది. జనకుండగు కాశీరాజు, పుత్రిక బాధను నివారించినవారి కామె నిచ్చి పాణిగ్రహణంబు సల్పుటయేగాక యర్ధ రాజ్యంబు నొసంగెదనని,ప్రకటించి యాబాలిక రూపపటంబులం బంచి పెట్టుచున్నాడు. ఇయ్యదియే తత్ప్రతిరూపంబగు పటము. కామినీతృష్ణయు రాజ్యతృష్ణయు ప్రోత్సహింప ననేకు లీప్రయత్నంబునొనరించి మృత్యువువా తంబిక్కిరి. సుధాకరా! ఈకన్యక నీ కెంతయుం గూర్చునది. దేశికుల యాశీర్వచనంబు నంది నీవరిగినచో——నసాధ్యంబుగానేర"దని ప్రోత్సహింవ, సుధాకరుండా కాశీ రాజపుత్రిక రూపపటముం దిలకించి, మన్మధ బాణాహతుండై——నిట్టూర్పులునిగుడ్చి యెట్లైన నాయెలనాగపాణిని గ్రహింప సిద్ధసంకల్పుడై శరభృంగ మహర్షి పాదములంబడి యాయుదంతంబు నెఱింగించి పెద్దతడవు ప్రార్థించెను. మునినృభుండా రాజకుమారుని మనఃపూర్వకంబుగ నాశీర్వదించి "కుమారా! పోయిరమ్ము నీకు జయంబగు”నని దీవించి చేయదగిన విధానంబెల్ల నుపదేశించి పంపెను.

అంత నాసుధాకరుండు, మర్త్యాకృతినిఁ దాల్చి యిలకుడిగ్గిన సుధాకరుండోయన, గాశికాపురంబునకరిగి, యారాజోత్తముఁడగు బింబసారునిదిలకించి నమస్కరించి తానరు దెంచిన కార్యంబు నెఱిఁగించెను. అదివిని, యారాజుహసించి, “బాలకా! నీవుమిక్కిలిపసివాఁడవు. నీసౌందర్యమును తలంచినదారుణసంకల్పమును నూహించిన, నాకుమిగుల విచారంబగుచున్నది. వల దుడుగుము. నీకన్న నతిసాహసంబునవచ్చినవా రెందఱో మృతినందిరి. ఈయత్నంబునుమాని గృహంబునకరిగి సుఖిం పుము." అని పలికెను. ఐనను, సుధాకరుఁడు తనపంతంబుమానక యుంట నాయిల రేడు చేయునది లేక, సమ్మతింప నారాజకుమారుఁడు పవలెల్ల నాబాలిక యనుభవించిన దురవస్థగని తద్దయుంజింతించి, రాత్రి కాలంబున నాబాలిక నొంటరిగనుంచిన మందిరంబునఁదానును రాజాను మతంబునం బ్రవేశించి, కంటిపై ఱెప్పవ్రాల్పక నిశితఖడ్గపాణియై నిలచి తారకమంత్రజపం బొనరించుచుండెను. రాత్రియంతయు నాబాలిక గుఱ్ఱుమనుధ్వనులు దిశలంజెలరేగ గాఢముగ నిద్రించుచుండ సుధాకరుం డామందయాన యండంబు ననిమిష లోచనములఁగాంచుచు విధివిపరీతంబునకు విచారించు చుండెను. అర్ధనిశీధం బతిక్రమించిన పిదప నాబాలిక నాశికారంధ్ర యుగళమునుండి రెండు క్రూరవిషసర్పంబులు బయలు వెడలి యగ్ని జ్వాలాయమానంబులగు విషజ్వలలంగ్రక్కుచు నాతనిపై పయింగవసీనంత, నాధీరుఁడు పరాక్రమించి యొక్క పెట్టున నావిషసర్పంబులం బరిమార్చి, యాబాలికను సంరక్షించిన మహానందంబునందియు, మరలనింకే యపాయంబు మూడునోయను సంశయంబున శేషయామినింగూడ నిద్రా వివర్జితుండై కాలము బుచ్చెను. ఇంతలోఁ బ్రభాతంబగుటయు నాబాలిక "దాహముదాహ” మని నిద్రలేచి పలువరింప నాతఁడు స్వహస్తంబులతోఁ బానీయంబునొసంగ నాకన్యారత్నము స్వీకరించియు దేదీప్యమానసౌందర్యముతో భాసిల్లు పరపురుషుని సన్నిధిని తానొంటరిగా నుంట 'నెఱింగి లజ్జాభరంబున మేలిముసుంగు సవరించుకొన దొడంగెను. ఇంతలో నారాజపుత్రుడు మృతినంది యుండునని తలంచుచు రాజదంపతులును రాజు సేవకులును పౌరజనంబులును నటకరుదెంచి, రాజపుత్రుఁడు సజీవియై యుండుటయు, రాజపుత్రిక నిరామయు యగుటయుం గాంచి విస్మితులగుచుండ సుధాకరుండు జఱిగిన సంగతిం దెలిపి, యా సర్పఖండములం జూపెను. అంత నాకాశీవురాధిపతి మహానందంబున వారిరువురకును బరిణయంబొనరించి, యర్ధరాజ్యంబు నొసంగి కతిపయ సేనా సమూహంబుల తోడను సమూల్యంబులగు నరణంబులతోడను కూతు నత్తింటి కంపెను.

నిజభార్యాసమేతుఁడై నిజరాజధానికరుగు సుధాకరుండు మార్గ మధ్యంబున శరభృంగాశ్రమంబున కరుదెంచి,యామునికి నమస్క రింప నాతఁ డాదంపతులను దీవించేను. అంత నాభూపతి నందనుం డట కొన్ని నాళ్లువసించి యొకనా డేకాంతంబున మునీంద్రునిగాంచి "ముని తిలకా! తావకాశీర్వచన ప్రభావంబున నాకింతవఱకు శుభంబుగలిగే; కాని——నేనువచ్చినకార్యంబును నెరవేర్చుకొనక యే మొగంబున నింటి కరిగి నాతలిదండ్రుల మొగంబులు చూతు" ననిపలుక, నాముని నవ్వి “రాకుమారా! నీకిది యేమి వెఱ్ఱి! ఎవ్వరైనఁ బులిపాలు తేగలరని నమ్ముచుంటివా? ఇది నీపై విరోధంబున నీ సవతితల్లి యొనరించిన కపటము. కావున నీ వాయత్నంబు మానుకొని స్వభార్యతో నిజరాజధాని కరిగి పట్టాభిషిక్తుండవు గ"మ్మనిన నాసుధాకరుం డందుల కామోదింపక——"మునీంద్రా! తమ యాశీర్వచన బలంబున పులిపాలను నిమిషమాత్రంబున సాధింపఁ గలనను ధైర్యము నాకుఁగలదు. నన్నేల నిరుత్సాహ పఱచెదరు. రిక్త హస్తంబులతో, నే నింటికరుగఁజాల" నని పలుక నాతని మనోనిశ్చయంబున కాముని మిగుల నానందించి “కుమారా! నీవు ధైర్యశాలివి; విజయమందఁగలవు. ఈ యత్నంబునఁ గూడ 'తారకమంత్రమే నీకు శరణ్యము; తారకమంత్ర పఠనం బొనరించుచుండు నీకు సమస్త క్రూరజంతువులును వశ్యంబులగును. దానం జేసి సులభముగా నీవు పులిపాలను సేకరింపఁగలవు, పోయిర"మ్మని దీవించి పంపెను.

అంత నారాజనందనుఁడు నిజదారా పరివార సమేతంబుగ నొక భయదాటవిం బ్రవేశించి యీనిన శార్దూలముల యెదుట నిలచి తారకమంత్ర జపంబొనరింప నవి మంత్రబద్ధ భుజంగములట్లు వశీకృతంబులై పోవ వలసినన్ని క్షీరముంగొని నిజరాజధాని కరిగి సుధాకరుఁడు పులిపాలకై చని మృతినొందెనని శోకించుచున్న నిజ జననీజనకులకు మనఃప్రమోదముం గలిగించెను. విలాసవతియు పశ్చాత్తప్తయై తొంటి వైరమును మఱచి యాదంపతుల నాదరించెను. అనంతరము బహు కాలము వజకును సుధాకరుఁడు కనకాంగితో సుఖించుచు రెండు రాజ్యంబులను సోదర సహాయంబున 'నేకచ్ఛత్రంబుగ బరిపాలించి పుత్ర పౌత్రాభివృద్ధింగల్లి వర్ధిల్లెను.