పండ్రెండు రాజుల కథలు/వీరబాహుమహారాజు కథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తాను రాజ్యమును చాలించి, కుమారుఁడగు చిరకారికిఁ బట్టాభిషేక మొనఱించి వానప్రస్థుఁడై శేషంబగు జీవితంబును ప్రమోదంబున గడిపెను.


నాల్గవనాటి రాత్రి కథ.

పదంపడి, యథాపూర్వకంబుగం దురీయ దివసయామినీ సమయంబునఁ గృష్ణార్జునులు, యమునా సైకత ప్రదేశంబున సుఖాసీనులై——యున్న తరి పార్థుండు నారాయణుం దిలకించి, పంచముద్రల రహస్యంబు నెఱిఁగించు వినోదకథ నోండెఱింగింపుమని వేడుటయు, నాతఁడు బావమఱఁదిం జూచి, వీరబాహుమహారాజు చరిత్రంబు నాకర్ణింపుమని యిట్లు నివేదింప నారంభించెను,

వీర బాహుమహారాజు కథ.

ఫల్గుణా! తొల్లి యుత్కళ దేశంబును పరిపాలించిన శూరబాహు మహారాజునకుఁ మహాబాహువను సహోదరుం డొక్కఁడుండెను. శూరబాహువునకు వీరబాహువను పుత్రుండను, మహాబాహువునకు క్రూరబాహువను కుమారుఁడునుఁ గల్గియుండిరి——ధర్మప్రభువై చిరకాలము రాజ్యపాలనం బొనరించి, వృద్ధాప్యంబు పైకొన, సుశీలయను భార్యను, ఏక పుత్రుఁడగు వీరబాహువును వదలి పరలోకంబున కరిగెను. సోదర మరణానంతరమున రాజ్యాపహరణ దుర్భుద్ధి జనింప, మహాబాహువు, యువరాజు నెట్లెనఁ బోకార్పనెంచి, యర్ధరాత్రంబునఁ గొందఱు కిరాతులకు యువరాజు నపహరించి నడుకాన నఱికి వేయున ట్లానతిచ్చెను. మహాబాహువువలన ధనలాభమునొందిన తత్తిరాతు లంతఃపురమునం దూరి, సుశీల మొఱ్ఱోయని యేడ్చుచుండ బలవంతమున యువరాజుం గొని చనిరి. ఈ క్రూరకృత్యం బెల్ల తన మఱఁదియగు మహాబాహుని రాజ్యపహరణ దురాశామూలకంబని గ్రహించిన యా వీరవనిత,యందులకుఁ బ్రతీకారం బొనరింప సముద్యోగించినదియై యా రాత్రియే రహస్యంబుగ మహాబాహుని యంతి పురముం బ్రవేశించి, యాతని పుత్రుండగు క్రూరబాహువు పరుండు డోలికను సమీపించెను. ఆడోలికయందు సుఖనిద్రాముద్రితులగు నిరువురు పసిపాప లామెకుఁ గాన్పించిరి. అందొకఁడు క్రూరబాహువనియు, రెండవది తన వధూనికాపుత్రికయగు, శైలవతియనియు నెఱింగియు, నాతురంబున విమర్శింప వ్యవధి చాలమింజేసి సుశీల క్రూరసేనునకు మారుగా, శైలవతి నపహరించి రయంబున రాజసౌధంబును నిర్గమించి, స్త్రీ సహజంబగు , కృపారసంబు పెంపున నబ్బాలుని వధింపజేయాడక, తత్పుర వాసినియు సంతానహీనయు, నిరుపేదయునగు లీలావతియను కాంత, తద్వసంత కాలయామినియందు, నడువీధిలో నిద్రించుచుండ తత్పార్శ్వంబున నాబాలికంబరుండఁ బెట్టి యెందేనింజనియె. లీలావతియు వేకువనే నిద్దుర లేచి, అత్యంత సౌందర్యశాలినియగు బాలిక యొకతె తన శయ్యయందుండుటంగాంచి తనకు పరమేశ్వరుఁడు ప్రసాదించిన వరప్రసాదిని యని భావించి మహానందంబునఁ దనభర్తయగు తారాపతికిఁ జూపి యాబాలకు చిత్రయను నామకరణంబొనరించి, యల్లారు ముద్దుగాఁ బెంచుకొనఁదొడంగెను. ఆపురంబున, నతిగౌరవనీయ క్షత్రియ వంశోద్భవుఁడును దరిద్రుఁడునునగు, చిత్రరథుండను వాఁడు నిజోదర పోషణార్ధమై రాత్రివేళల నదవికింజని కట్టెలంగొట్టి తద్విక్రయధనమూలంబున జీవించుచుండువాడు, ఆనాటి రాత్రియు నాతఁడొక వృక్షము నారోహించి చంద్రికా ప్రసారంబున కట్టెలుగొట్టనుంకించుచుండ, వీరబాహువునపహరించిన కిరాతుఁడు విధివశంబున తద్వృక్షమూలంబునకే వచ్చి బాలునిచంపనెంచి కత్తినిపై కెత్తుటయు, బాలుఁడు రోదనం బొనరించుటయుగాంచి, చిత్రరథుండు తనకును సంతానము లేనందున హృదయము దయామయంబగుడు, గుభాలున నాతరు శాఖనుడి భూమికుఱికి, స్వపాణిత లస్థంబగు పరశువుచే నాకిరాతునివధించి, బాలునిఁ గొనిపోయి వీరుడని పేరిడి, పోషించుచుండెను. తారపతి యొక్కయు, చిత్రరథుని యొక్కయు గృహంబు లతీసన్నిహితంబు లగుటం చేసి, దినదిన ప్రవర్ధమానులగుచున్న చిత్రావీరులకు, మైత్రి యతిదృఢతరంబయ్యె ఆమఱునాడు డోలికయందు బాలిక లేమిం జేసీ, మహాబాహువు మహత్తరంబగు నాందోళనంబునంది, పదచిహ్నంబులవలన, నాశిశు చౌర్య కార్యము, సుశీల వలన జఱిగెనని గ్రహించి సుశీలా శైలవతుల కొఱకై యనేక ప్రదేశంబుల నన్వేషింపఁ జేసెనుగాని, వారిపోబడి యెందునుఁ గానరాదయ్యె. అంతనారేడా శోపహతుండై తన పుత్రుఁడు కుశలియైయుండుటయే మహాభాగ్యమని తలంచి సంతృప్తుండై నిరాటంకముగ రాజ్యపాలనం బొనరించుచు పిదప పదునేను వర్షంబులకు శరీరము చాలించాను. అంతఁగ్రూర బాహువు రాజ్యారోహణంబొనరించి, యన్వర్ధ నామధేయుఁడై సదాక్రూరకార్యంబుల నొనరించుచు,దినంబులు గడుపసాగెను. ఆ క్రూర బాహువునకు సమస్తసద్గుణ సంపన్న యగుధారుణీ నామక భార్యారత్నంబమరి, యత్యంత భక్తితో భర్తృసేవల నొనరించుచున్నను, క్రూరాత్ముఁడగు క్రూరబాహువు పరదారా లోలుఁడై యాసాధ్వినాల్లకయుండెను. ఇది ఇట్లుండ నిచ్చట చిత్రయు వీరుఁడును యుక్తవయస్కులై యన్యోన్య ప్రేమపాస, బద్ధులైయుండిరి. చిత్ర యను దినంబును సుగంధ పుష్పావచయ మొనరించి, వానితో నందంబులగు మాలికలను, చెండ్లను నిర్మించి, పౌరులకు విక్రయించుచుండునది. ఒకానొక దివసంబున నాబాలిక పుష్పవిక్రయం బొనరింప రాజప్రాసాదంబున కరిగిన తరుణంబున నాబాల క్రూరబాహుని కంటఁబడియెను. అంతనా క్రూరుఁడా బాలను బలాత్కరింప నుద్యమించుటయు, నామె భీతకురంగమువలె వాని బారింబడక వీధులం బరువిడుటయు, లజ్జా గౌరవ విసర్జితుఁడగు క్రూరబాహు వామెను వెంబడించుటయు వీరుని కంటఁబడ, నాతఁడాకొన్న శార్దూలము కరణి గర్జించుచు రయంబున నరుదెంచి, యారాజు పైఁబడి ప్రాణావశిష్టునిగాఁ బ్రహరించి చిత్రను రక్షించెను.పురమధ్యంబునఁ దనకుఁ గల్గిన మహావమానంబును సహింపనోపక క్రూరబాహువు వీరుని పట్టి బంధింప శాసించి యనేక యోధులనంపెను. అత్యంత పరాక్రమబాహువగు వీరుడు తద్యోధులంద నేకులను హతమార్చి తక్కుంగలవారికిఁ జిక్కక, పటురయంబున శ్రీజగన్నాధస్వామి యాలయమునం బ్రవేశించెను. రాజభటులు దేవాలయ ప్రవేశంబునకు వెఱచి వెనుకకుమఱలి రాజుతో సర్వవిషయంబులను. నివేదించిరి. అట్లు జగన్నాధ దేవాలయముంబ్రవేశించిన వీరుఁడు తదాలయంబునఁ బూజ్యుఁడై యనేక శిష్యగణంబుతో వసించి యున్న, సచ్చిదానంద మహర్షి పాదంబులనాశ్రయించెను. పుణ్యాత్ముండగు, నమ్మహర్షి, యాకుమారు నాశీర్వదించి, “వత్సా! భీతిల్లకుము. పవిత్రంబగు నీపుణ్యభూమిం జేరఁగలిగిన నీకు క్రూరబాహుని భటులవలన నపాయముఘటిల్లదు. నీవు మాశిష్యకోటియం దొకండవై తరింపుము నీకు——తరుణోపాయముగా——పంచముద్రల తెఱంగెఱింగించెదము. సావధానుఁడవై యాళర్ణింపు"మని పలికి వెండియు పంచముద్రల రహస్యంబు నెఱిఁగించెను.

ఇది యిట్లుండ, నిచ్చట——పరాభూతుండైన క్రూర బాహువు తానేవిధంబునంగాని యాచిత్రను పరిణయమాడంగోరి, యామె తలిదండ్రుల కమితధనంబునొసంగి నిజేప్సితంబు నెఱిఁగింప నానిరుపేదలు రాజబాంధవ్యంబునకన్న నధికంబగు భాగ్యము వేరొండుగలుగదని, యుబ్బి తబ్బిబ్బయి, వల్లేయని నరపాలునకు వాగ్దానంబొనరించిరి. అంత నారాజు బలాత్కార వివాహంబునకై సర్వసన్నాహంబుల నొనరించు చుండెను. ఈవార్త క్రమక్రమంబుగ, వీరుని చెవిసోకనాతఁడు తామరాకులోని నీటివలె తత్తరమునందు చిత్తముతో, సచ్చిదానందుని పాదమలంబడి యాచిత్రను రక్షింపనరుగ నానతి యొసంగుమని ప్రార్థించెను. అంతనాముని భవితవ్యమునుగుణించి, చూచి, “వత్సా! ఇప్పుడు నీకరిష్ట కాలమువచ్చియున్నది. ముందు వెనుకలాలోచింపక యౌవ్వనగర్వంబున, నరిగితివేని పరాభూతుండవగుదువు. కొన్ని దినంబులు శాంతింపు ”మని పలుకనాబాలవీరుండు కన్నీటిఁగరతలంబునఁదుడుచుకొనుచు “మహాత్మా! చేతులు కాలిన పిధవ నాకులతో పనియేమి? కొన్ని దినంబులు మీరానతిచ్చి, నట్లు శాంతింతునేని చిత్ర నాక్రూరుఁడు బలాత్కృతిఁ బరిణయం బాడును. కావున నన్నాటంక పరుపకుఁడని మరిమరి ప్రార్థింప, నాయతి, చేయునది లేక యాతని, నిండుమనంబున దీవించి యొక రక్షఁగట్టి, “బాలకా! ఈరక్ష యీజగన్నాధాలయ భక్తులచిహ్నము కావున నీకు రాజువలన ప్రాణభీతిగలుగదు. పోయిర 'మ్మని సెలవొసంగెను. ఈలోన క్రూరబాహువు చిత్రం దనయంతఃపురంబునకుఁ బిలిపించుకొని, యనర్ఘ్యమణి భూషణములతోడను, చీనిచీనాంబరములతోడను నామెను భ్రాంతనుగావించి వశపరుచుకొనఁదలంచుచుండెను. వీరుఁడు నిశీధికాలంబున ప్రబల రజ్జుసహాయంబున కుడ్యంబున కెగఁ బ్రాకి, చిత్రయుంపబడిన మందిరమునదూరి, యామెకు ధైర్యముంగఱపి, రహస్యముగ. రాజమందిరమునతిక్రమించి యరుగు వెఱవు నాలోచించుచుండు తరుణంబున నామందిరమును రక్షించు దాసీజనంబులు మేల్కాంచి, వీరునింగాంచి కల్లోలముగావింప రాజును నితరభటవర్గంబును తెలివినంది యావీరుని నిరోధింప నాతండు కయ్యంబునకుపక్రమించి యనేక భటులఁబిల్కు మార్చి, రాజమందిరము నందు రక్తపుటేరులం బ్రవహింపఁ జేసి విధిబలంబుతప్పుటచే నిర్బంధింపఁ బడియె. అంతఁగ్రూర బాహువాతని వధింప భటుల కాజ్ఞనొసంగ వివేకశాలియగు నాతనిమంత్రి తదుద్యమంబు నాటంకపఱచి రహస్యముగ రాజుంజీరి——నరేంద్రా! ఇతఁడు, జగన్నాథాలయ భక్తకోటిలోని వాఁడగుట నాతనిచేతంగలరక్ష సూచించుచున్నయది. కావున నీతఁడువధార్హుఁడుకాఁడు. కొండొరయుక్తింబన్ని, చిత్రావీరుల ప్రేమను భంగము చేయుదము. అంతటితో నీతుంటరి మనకడ్డమురాఁడు. తమనిజ సతీతిలకంబగు ధారుణీ దేవికి చిత్రధరించు పరిచ్ఛదంబుల ధరింపఁజేసి, యాసతిని దేవరవారు ముద్దిడుకొను సమయంబునకు 'మేము వీరునకు తద్దృశ్యమును దూరమునుండి చూపుదుము. అంత నావెకలి వికలమతియై చిత్రయందు విరక్తి నందు"నని యుపదేశింప రాజు వల్లేయనియేతత్ప్ర యత్నముననుండె. ఈలోపల, కారాగృహబంధితుఁడై యున్న వీరునికడ కరు దెంచిన రాజసచివుఁడు "వీరా! నీవూరక చిత్ర కోఱకేలదుఃఖించి, విపత్తులకు లోనయ్యేదవు? స్త్రీలమనంబు లతిచంచలంబులనుట యెఱుంగవా? నీవు దరిద్రుఁడవనియు రాజు దేవేంద్రతుల్య భోగియనియు నెఱింగి చిత్ర యిదివఱకే యాతనిమఱిగియున్న "దని పలుక నాతఁడాపలుకుల నెంతమాత్రమును విశ్వసింపఁడయ్యె. అంతనామంత్రి వీరునకు నిదర్శన పూర్వకముగఁ జూపఁదలంచి యాతనింగొని రాజమందిరమున కరుగ పూర్వోదాహృత ప్రకారంబుగ 'రాజు, ధారుణిని ముద్దిడుకొనుట గాన్పించేను. అంత నాతఁడది నిజంబని, విశ్వసించి చిత్రయెకలగల విశ్వాసముం గోల్పడి విరక్తుఁడై పురంబును వదలి, యెందేనిం జనియెను. అట్లు బహుకాలంబునకు తనభర్త తనయందనురక్తి గల్గియుండుటకు ధారుణి యానందించుచుండ తన తంత్రము ముగియుటతోడనే క్రూరబాహు వాసాధ్వినావలంద్రోసి, తాను పన్నిన కపట నాటక కథ నెఱింగించి పరిహసించెను. అంత నా నెలంత యాశోపహతయై——తదీ యావమానంబును భరింపజాలక, స్వసుఖమార్ధ కంటక ప్రాయమగు చిత్రను దునిమి పగదీర్చుకొనఁ దలంచి కరవాలమును చేఁబూని, చిత్రా మందిరంబునకరుగ, నాటి రేయి విధివశంబున చిత్రకు మారుగ నాశయ్యపై నొక పరిచారిక శయనించి యుండెను. దాని నెఱుంగక రాణిక్రోధోద్రేకంబున నాపరిచారికను చిత్రగా భ్రమించి సంహరించెను.తత్కరవాలధ్వని నాలించి యనేక పరిచారికలు 'మేల్కని కేకలు వేయ నరపాలుఁ డటకరు దెంచి యట్టి దారుణ కార్యంబు నొనరించిన రాణి నొక యినుపబోనునందుంచి శార్దూల సంచార భీకరంబగు మహారణ్యంబున నొక వృక్ష శాఖకు వ్రేలాడదీసి వదలి రా, భటుల కాజ్ఞాపింప వారట్ల కావించిరి. మహారణ్యంబునందు బోనులో నాహారపానీయ నిద్రాదులు లేక యేడుదినంబులు గడపి మరణాసన్న యైయున్న ధారుణి తన్మార్గంబుననే విరక్తిచే నరుగుచున్న వీరుఁడు పొడగాంచి యామెను రక్షించి వెలికిఁదీయ నామె రాజు తన కొనరించిన యపరాధమును చిత్రపై నాతని కవిశ్వాసముఁ గల్గుటకై తన్నాధారముగాఁ జేసికొని కావించిన తంత్రమునుఁ దెలిపి ప్రాణంబులు బాసెను. అంతట వీరుఁడు మహాపశ్చాత్తాప దుఃఖితుఁడై మరల జగన్నాధాలయంబున కరిగి జఱిగిన సర్వ వృత్తాంతముల నెఱిఁగింప నమ్ముని యాదేవాలయ భూగర్భమునంగల గుప్త మార్గంబున వీరుని వెంటనిడుకొని చని యొక పర్వత ప్రాంతముం జేసి సాంకేతికము నూదినంత, తండోప తండములగు సేనలు వివిధాయుధములలో బిలబిల నటకరుదెంచి యోగికి మ్రొక్కి నిలిచిన నాతఁడా సేనల వీరునకుఁజూపి, “వత్సా! వీరందఱును క్రూరసేనుని దౌర్జ్యమున కోర్వఁజూలక పితూరి యొనరింప సిద్ధమైన రాష్ట్రీయజనులు. నేటికి క్రూరబాహుని పాపములు పండినవి. వీరందఱికిని నీవు నాయకుఁడవై ముందునడిచి రణరంగము నందాతని నిర్జింపు" మని పలుక వీరుఁడు మహానందము నంది సేనలతో దండయాత్రకు బయలుదేరెను. ఈలోన, క్రూరబాహువు చిత్రను పరిణయమాడ సర్వసన్నాహములనుఁ గావించి కల్యాణ మందిరమునందుండెను. ఇంతలో భయంకరంబగు భేరీ నినాదంబును పురంబును కొల్లగొను శాత్రవుల సవ్వడియు వినంబడుటయు, నాతఁడు భయకంపితుఁడై కల్యాణ రంగమునుండి కదనరంగము నందడుగువేసెను. ప్రచండమగు రాష్ట్రీయ ప్రజాసైన్యమునకు తాళఁజాలక రాజసైన్యము పటాపంచలై పోవ రాజు బంధింపఁబడియె——దీనవదనుఁడై యున్న క్రూరబాహుని చుట్టునుమూగి ప్రజలు పరిహసించుచు శూలములవంటి పోటుమాటలతో నొప్పించుచుండ నటకు సచ్చిదానంద యోగి యరుదెంచి ప్రజలనందఱంగాంచి "యోమహాజనులారా! క్రూరబాహువు బంధింపఁబడియెఁ గావున నికమీదట నీకుఱ్ఱడే మీకు ప్రభువు. హీనుకులజుఁడగువీఁడు మాకేటి ప్రభువను సంశయము మీకక్కఱలేదు. ఇతఁడే యీ రాజ్యమునకు నిజమైన ప్రభువు. గతించిన, శూరబాహు మహారాజపుత్రుఁడగు వీరబాహుఁడే యీ బాలుఁడు చిత్రానామధేయంబుననున్న బాలికయే యీ వీరబాహుని మేనత్తకూతురగు శైలవతి. నేను నిజముగా మహర్షినిగాను, ఈబాలుని తల్లినగు సుశీలను. " అని పల్కి కృత్రిమములగు తన మీసములను గడ్డముందీసి వేసి యంగనయై నిలచి—— తానొనరించిన కార్యముల నెఱిఁగించి, “మఱియు నో ప్రజలారా! ఈ బాలుని విషయంబున మీకు సంశయముగల దేని వీని నొసటంగల మచ్చను చూడుఁడు. బాల్యమున దీయఁబడిన వీని ఛాయాపటము గలదు. అందుసయితము మీకీమచ్కాకాన్పింపగల "దని పలుక ప్రజలందఱును జయజయ ధ్వానంబుల నొనరించి యాపడతి యొనరించిన మహా కార్యమును స్తుతించిరి. వీరబాహువు తల్లినిఁ గౌఁగిలించుకొని యానందాశ్రువులను రాల్చెను. పశ్చాతప్తుఁడైన క్రూరబాహుని క్షమించి, వీరబాహుఁడు శైలవతిని మహావైభవంబునం బరిణయమాడి యుత్కళరాజ్యమును చిరకాలము పరిపాలించెను.