Jump to content

పండ్రెండు రాజుల కథలు/విక్రమసేనమహారాజు కథ

వికీసోర్స్ నుండి

తనచేతనున్న కటారి తోడనే యాత్మహత్య గావించుకొని మరణించెను. ఈచిత్రమేమో యెఱుంగక భ్రాంతినందియున్న చారుదత్తుని రాజు క్షమింపఁ బ్రార్థించెను. అంత మాండవ్యుడు ప్రచండుని రాజునకుఁ బరిచితునిగావించి, జగన్మోహిని చారుదత్తుని పుత్రికయని యాకధనంతను దెలిపి, విపుల కంఠమునంగల ముక్తాహారముంగొని చని రాజకుమారుని బ్రదికించెను. అనంతరము జగన్మోహినీ జీమూతవాహనులకుఁ గల్యాణ మయ్యెను. చారుదత్తు మయూరవాహనులు వియ్యంకులైరి——మయూరవాహనుఁడు రాజ్యభారవహన విరక్తుఁడై పుత్రునకుఁ బట్టముగట్టి తాను పుణ్యకధా గోష్తి దినంబులు గడుపుచుండెను. అని శ్రీకృష్ణుం డర్జునున కెఱింగించెను.


తొమ్మిదవ నాటి రాత్రి కథ.

యథాప్రకారముగా కుంతీనందన యశోదానందను లిరువురును మఱుసటిదినమున, పెందలకడ భోజనాది నిత్యవిధుల యధోక్తముగ నిర్వర్తించి, యమునాసైకతభూముల కరుదెంచి మందమారుతసౌఖ్యము ననుభవించుతరి, గాండీవి గరుడధ్వజు నవలోకంచి——"యో పురుషోత్తమా! నీ దయారసంబున నిప్పటి కెనిమిది వేదాంతరహస్యంబులను కథారూపంబున నాకర్ణించి ధన్యుఁడనై తిని. తొమ్మిదవదియగు “అమనస్క” ప్రభావంబును నేడెఱిఁగింపవే! "యని ప్రార్థింప, నా గోపబాలుఁడు "సవ్యసాచీ! ఇందులకు విక్రమసేనమహా రాజు చరిత్రము నెఱిఁగింతు నాకర్ణింపు" మని పలికి యాతచ్చరిత్రము నిట్లు నిర్వచింపఁ దొడంగెను.

విక్రమ సేన మహా రాజు కథ.

పూర్వకాలంబున అవంతీనగరముం బరిపాలించుచుండిన కీర్తిసేన మహారాజునకు విక్రమసేను డనుకుమారుఁడు గలిగెను. ఆ విక్రమసేనుఁడు సమవయస్కుడును, సచివనందనుఁడును నగుగుణసాగరునితో గలసి సకలవిద్యారహస్యంబుల నెఱింగి దినదిన ప్రవర్ధమానుండగుచు క్రమంబుగ సంప్రాప్తయౌవనుం డయ్యెను. అట్టియెడ నోకనాడు దైవికంబుగ నబ్బాలకునకు దేశ సందర్శనా పేక్ష వొడమ, నాతఁడు సహచరుండగు, గుణసాగరునితో. నాలోచించి తల్లిదండ్రులకుం జెప్పకయే నాటిరేయి మంత్రికుమారునితోఁగలసి దేశాంతర గతుండయ్యెను. అట్లా రాజకుమార మంత్రికుమారు లిరువురును, పాదచారులై చనిచని, తెల్లవారు నప్పటి కొకమహారణ్యమునందలి విశ్రాంతవటమూలమునకుం జేరిరి. ఆమహోన్నత వటభూజమునకు అంతము గానరాని దీర్ఘ శాఖలు రెండుమాత్రమే యుడెను. అందొకటి దక్షిణమునకును, రెండవది యుత్తరమునకునుఁ బోవుచుండెను. ఈశ్వర సృష్టియం దెన్నడుం గనివినని యా చిత్రముంగని, యాశాఖ లెంతదవ్వున కరుగునో గ్రహింపవలయునను బుద్ధివొడమ, నారాజకుమారుఁడు, గుణసాగరుంగని " తమ్ముడా! ఈ వటం బెంతయు విచిత్రముగ నున్నయది. దక్షిణశాఖను నేనును ఉత్తర శాఖను నీవును నారోహించి శాఖల యంతము గనుంగొనివత్తము. నాకత్తిని దాని యొరతో పాటుగ నీ చెట్టు తొరటలో నుంచెదను. ఒరకు త్రుప్పుపట్టిన నీకును, కత్తికిఁ ద్రుప్పుపట్టిన నాకును నపాయముగల్గినట్టూహింప నగును. తొలుతవచ్చినవారు. రెండవవారికై యీవ్రుక్షమూలమున వేచియుండునది "యని సాంకేతికం బేర్పరచి వెంటనే మంత్రికు మారు నుత్తరశాఖకంపి తాను దక్మిణశాఖం బట్టెను. రాజకుమారుఁ డా శాఖపై నెంతదూరము నడచినను,దానికొక యంతము గాన్పింపదయ్యెను. అందుల కాతఁడు మఱింత విస్మయమునొందుచు నెట్లయిన దానియంతు కనుగొనవలయునను పట్టుదల రెట్టింప దానిం బట్టుకొని నడవసాగెను. అట్లాతఁడు పోవంబోవ నెట్టకేల కాశాఖ సముద్ర మధ్యస్థంబగు నొక ద్వీపమునందలి దివ్య సౌధాగ్రమునకు వ్రాలెను. విక్రమసేనుఁడా సౌధముంగని వెఱఁగుపడియు, సాహసంబున శాఖావతరణం బొనరించి, సౌధముం బ్రవేశించెను. ఆసౌధము నిర్మానుష్యమై నిశ్శబ్దమై కాన్పింపనిది యేమిచిత్రమని తలంచుచు, నా రాజనందనుఁడు కక్షాంతరములు గడచిచన నందొక హంసతూలికా తల్పంబున సాక్షాత్కరించిన, జగన్మోహిని నానొప్పారు నొకయొప్పులకుప్ప నేత్రపర్వం బొనరించెను. రాజకుమారుంగని యా రాకాచంద్రవదన సంభ్రమాందోళిత స్వాంతయై——దిగ్గున లేచి—— "యోహో ! పురుషవరేణ్యా ! నీ వెక్కడివాడవు? ఎందుండి యిందువచ్చితివి? దేవమానవ దానవాదుల కగోచరం బగు నీ సౌధంబు నెట్లు ప్రవేశింపగల్గితివి? మాయమ నిను గాంచెనేని యొక్క కబళంబుగా మ్రింగివైచునుసుమా! "యని" పలుక, నాతఁడు తన చరిత్రంబు నెల్ల నాబాలిక కెఱిఁగించి, బాలా! నీ చరిత్రం బేమి? ఏకాంతముగ నీ దీవిపై గల సౌధమున నీవు వసింపఁ గారణమేమి? నీతల్లి యెవ్వరు? అది నన్ను మ్రింగునంతటి దౌర్జన్యమున కేమి హేతు" వని యడుగ, నాకోమలాంగి పూర్వస్మృతిచే గల్గిన దుఃఖంబున వెక్కి వెక్కి యేడ్చుచు, “మహాత్మా! నా చరిత్ర మతిదయనీయమైనది. నేను విహార దేశాధీశ్వరుని పుత్రికను; నన్ను మణిమాల యందురు. నాకైఁదేండ్లు నిండకమున్నే యీద్వీపమున కధికారిణియగు, నేకాక్షి యను దానవి నన్ను తస్కరించి యిందుంచినది. దాని ఫాలభాగంబున నొక్కటియే నేత్రముండుటవలస నేకాక్షి యనఁ బరగుచున్న యది; అతిభయంకర స్వభావము గల్గినది. అది మానవులను భక్షించు స్వభావముగలరాక్షిసి యయ్యును, నన్ను దయతోఁ జూచుచున్నది. కాని నాతలిదండ్రుల కెడబాపి నన్ను దుఃఖమున ముంచినది. నాటినుండియు నేను నరముఖ దర్శనం బెఱుంగక యీ నిర్బంధమున నున్న దానను. నిన్నుఁగాంచినంతనే నాప్రా ణములు లేచి వచ్చినట్లయ్యెను. కాని, యోసుకుమారా! జగదేక సౌందర్యశాలివగు నినుం జూడ నాకు జాలి గల్లుచున్నది. నీవిప్పుడు భీకర శార్దూలకరాళంబున నిఱుకు కొంటివి. ఈ యేకాక్షి సామాన్యురాలు గాదు, నిన్ను గాంచి నంతనే మ్రింగి వేయకమానదు. ఇందులకేది యుపాయం" బని వాపోయిన నారాజకుమారుఁడు నవ్వి "యో బేలా! విచారింపకుము. నా కీరాక్షసి యొక భయకారణంబని తలంపకుము, ఇట్టిరక్కసులను వేవురనైన సఱ నిమేషంబునఁ బోకార్పంగల"నని పలికెను. అతని సాహసదైర్యవచనసరణికి మెచ్చియు నా కోమలాంగి “రాజకుమారా! ఏకాక్షి రాక్షసియనిన నీవు సామాన్య దానవి యని భావించితివి, కాని యది సురాసురమానవాదుల కలవిగానిది. దాని ప్రాణము లొకానొక దీవియందలి తాళవృక్షముపై గల యొక చిలుక నోటియందలి బరిణలోన భ్రమరాకృతిం దాల్చియుండును. ఈ కీలెఱింగి దానిని సంహరింపవలయు"నని పలుక, విక్రమసేనుఁడు కొండొకవడి చింతించి——"బాలా! అట్లయిన దీని నుపాయంబున సంహరించి నిన్ను రక్షింతును—— ఇప్పటికి నీవు నన్నే దేనియుపాయంబున నిందేదాచియుంచి యాదానవి జీవితరహస్యము నెల్లపాంగముగా నెఱింగి నాకుఁ జెప్పు” మనవుఁడు మణిమాల యా రాజసుతు నొక బల్లినిగా మార్చి యేప్పటియట్లుండెను. అంతలో దెల్లవాఱుటయు, నాహారార్ధ మరిగిన యా నిశాచరి——భూమ్యాకాశములు బ్రద్దలగు తెఱంగున, "నరవాసన! నరవాసన!" యని బొబ్బలు పెట్టుచు నటకు వచ్చెను. అంత మణిమాల నగు మొగముతో దాని కెదురుగాఁ జని "తల్లీ! ఎక్కడి నర వాసన వచ్చెనీకు? నేను నరజన్మమునందిన దానను గానా? నా వాసనయే వచ్చియుండును! ఇట్లేల బెంగటిల్లెద”వని పలుక నా యేకాక్షి సంతృప్తమానసయై మణిమాలం దనయంకమునఁ గూరుచుండఁ బెట్టుకొని, యతి ప్రేమంబున ముద్దాడఁ దొడంగెను. ఆదే తరుణమని యా మదమరాళగమన—— భీతినందినగతి నటించుచు—— తల్లీ! నేటి యుదయంబున నిరువురు యక్షదంపతు లాకాశమార్గంబునఁ బోవుచు, దేవలోకమున రాక్షస సంహారమునకై యతితీవ్రయత్నములు జఱుగుచున్నట్లు తమలో సంభాషించుకొనిరి. ఆ ప్రసంగమునంతను మన శుక రాజమగు శుచిముఖి యాకర్ణించి నాతోఁ జెప్పినది. ఆ మాట వినిన గడియ మొదలుగా నాచిత్తము నీ విషయంబున తత్తరించుచున్నయది. నీవు నన్నొంటిగ నిందువదలి రేలం దిరుగఁబోవుచుందువు. అట్టియెడ నీ కపాయముగల్గిన నాకేదిగతి!" యని వగవఁ దొడంగెను. ఆ పలుకులు విని యా రాత్రించరి పెద్ద పెట్టున నవ్వి——"యోసి వెఱ్ఱి పిల్లా! ఇదియా నీ విచారము! నా ప్రాణముల కేమియు భయము లేదు. వగవకుము; ఇచ్చటికి నూఱుయోజనముల దూరమునందు. దధిసముద్ర మధ్యంబున నున్న ప్రవాళద్వీప మధ్యమున బహుతరోన్న తంబగు నొక తాళవృక్షము గలదు. దానిపై "జ్వాలాముఖి" యను నగు నోక శ్వేత కీరము వసించుచుండు. తత్కీరము నోటనున్న బరిణయందు నాపంచ ప్రాణములును, ఐఁదు తుమ్మెద లై యున్నవి. వానిం జంపినఁగాని, నేను మరణింపను. అవి యన్యులకు సాధ్యమగుట స్వప్న వృత్తాంతము కావున పగవం బనిలే" దని పలికి మణిమాలతో గొంతతడవువినోదముగఁ బ్రసంగించి యధాప్రకారంబుగ నిదురింప నరిగెను. ఆనాటి నిశాసమయంబున నేకాక్షి, మరల సంచారంబున కరుగగనే మణిమాల బల్లిని రాజపుత్రునిగా మార్చి యాతనితో నిఫ్ట్వేచ్చమదనవ్యాపారక్రియం దవిలి గంటలు నిమిషములుగా గడిపెను. ఆమహానందమునఁ బొద్దుగ్రుంక వచ్చుటయు వారు మఱచిరి.అంత సూర్యాస్తమయం బగు మణిమాల తెలివి దెచ్చుకొని" మనోరమణా! దానవి తనజీవన రహస్యంబెల్ల నా కెఱిఁగించినది. రేపటిదినమున నా ప్రియశుక రాజమగు శుచిముఖిని ప్రవాళ ద్వీపమునకంపి, యాబరీణం దెచ్చు ప్రయత్నం బొనరింతు"నని రాక్షసిని సమయంచునుపాయంబులఁ గొన్నిటినాలోచించుకొని, మరల నాతని బల్లినిగా మార్చి వెనుకటి రీతి నారాక్షసివచ్చినంత నమ్మకంబునఁజరించెను. మఱునాడు, శుచిముఖి, మణిమాలకడ సెల

పంది రయంబున నంతరిక్ష మార్గంబున వాయువేగమనో వేగములంబురు డించుజవంబున మూఁడుజాముల కాలంబులోన, నాప్రవాళ ద్వీపముం జేరి, యెట్ట కేలకు తత్తాళమహీజమును వ్రుక్షాగ్రమున చూళికాసహితయై యున్న కీరమునుంబొడఁగాంచి, హృదయోత్సాహంబు రెట్టింప, ఱివ్వున దానిపై కెగసి, యంతకుమున్నే తన వెంట గొనిచనినబరీణ నందునిచి, బాంధవ్యానురాగం బుట్టిపడు తెఱంగున, “నోయల్లుఁడా! చిన్నతనంబున నెన్నడో నినుఁజూచుటయేగాని, మఱల నినుగాంచు భాగ్యం బబ్బదయ్యె! ఎన్ని నాళ్లకు నినుగంటిని! పారతంత్య్రజీవనం బొనగించు నిర్భాగ్యుల గతులిట్టివియేకదా! ఆహా! నేడు నాకన్నులకఱవుదీరె"నని బిగ్గ నాలింగనం బొనరించె! __ శుచిముఖిమాటల కాశుకంబు విస్మయము దోఁప, తెల తెలంబోవుచు తననోటియందలి బరిణను శుచిముఖయుంచిన బరిణకడనుంచి, “అయ్యా! నీ వెవ్వఁడివో నే నెఱుంగమికి లజ్జించు చున్నాను! మన బాంధవ్యం బెట్టిదియో వచించి నా కానందముం గూర్పుము” నావుడు శుచిముఖి, “అల్లుఁడా! నీవు నా చెలియలగు మధురస్వన కుమారుండవుగావె! నిన్ను చిన్న నాటనే యీదానని యిందుగోని వచ్చియుంచినది ? నీవలెనే నీతల్లియు దండ్రియు, నేనునుంగూడ, యీ దానవీ సహోదరుల ప్రాణరక్షణ మాళికల ముక్కులంగఱచుకోని వేఱ్వేఱు ప్రదేశములం దున్నారము. నేను, ఏకాక్షీ సహోదరియగు, రక్తాక్షి ప్రాణరక్షణ చూళికంగొని శింశుమారద్వీపమునందలి తాళంబున వసించువాడను. నేను నీ మేనమామను,నన్ను రక్తకంఠుడందురు. నిన్నుఁ జూచు పేరాశతో, చూళికను నోటఁగఱచుకొనియే వచ్చితి"నని పలికెను. అంత నాశుకము శుచిముఖితో ప్రియంబునఁ గొంత కాలము భాపింప, నప్పటికితడవగుటయు, శుచిముఖియుపాయంబున, దాఁ దెచ్చిన బరిణనటవిడచి యేకాక్షి జీవంబులుగల బరిణను నోటంగఱచుకొని, అల్లుడా! తడవయ్యె! పోయివచ్చెద! ఇట్లే తీఱికయైనపుడెల్ల నిన్ను జూచిపోవువాఁడ! దయయుంచు” మనవుడు నాశుకంబు తన మామ వెడలిపోవుచున్నందులకు విచారించుచు శుచిముఖి దృక్పథము నతిక్రమించి చనిన వెనుక యధాప్రకారంబున నాబరిణం గఱచుకొనియందే యుండెను.——సాయంకాలమగునప్పటికి శుచిముఖి యిల్లు సేరి యానందముతో నాబరిణను మణిమాల కొసంగి, తానొనరించిన చిత్ర ప్రకారంబుల నెఱింగించి ప్రమోదసాగరంబునముంచెను. ఆ రేయి యధాప్రకారంబుగ, నేకాక్షి విహారంబునకరుగ, రాజకుమారుం డొకమహాగ్నిజ్వాలను నిర్మించి, యాబరిణయం భస్మంబుగావించెను, ఎందేని విహరించుచున్న యేకాక్షి శరీరం బెల్ల నగ్ని జ్వాలాపరితప్తమైపోవ, తనువున బొబ్బ లెక్క——"మోసముమోస” మని చతుర్దశ భువనంబులు బ్రతిధ్వనించు చాడ్పునఁ గేకలు పెట్టుచు, మార్గమధ్యంబునబడి నడగొండచాడ్పున విగత ప్రాణియయ్యె ను. అనంతర మామణిమంజరీ విక్రమసేనులు నిజవురాభిముఖులై శుచిముఖితోడను రాత్రించరి సేకరించి యుంచిన నవరత్న రాసులతోడనుంగదలి శాఖాగ్ర మాధారముం జేసికొని కొంత కాలంబునకు వృక్షమూలముం జేరి కరవాలముంబరీక్షింప దానియొఱకు త్రుప్పుపట్టియుండెను ఆసంకేతనమును గ్రహించి తన ప్రియమిత్రుండగు, గుణసాగరున కపాయంబుగల్గినట్లు నిశ్చయించి పెద్దతడవు వాపోవసాగెను. అనంతర మావిక్రమసేనుడు తన మిత్రునిజాడనరయ, నారెండవకొమ్మపైఁ బయనంబొనరింపఁదలంచియు, మాణిమాలాశుచిముఖుల నేమి చేసిపోవుటకునుందోఁపనివాఁడై ——యప్పటికి విశేషంబగుచున్న కుద్బాధం దీర్చుకొని పదంపడి కర్తవ్యం బాలోచింపఁదలంచి, యం దెందేనిజనపదంబు గలదేమోయని కొంతదూరం బరుగునంత దూరంబున నొక్క దేవాలయశిఖరంబు లోచన గోచరంబయ్యెను. అంత నాతండ త్యాశతో తదాలయాభిముం ఖుండై చనుచుండ నొక జటావల్కలధారియగు మునీంద్రుం డాతనికి గాన్పించి, యత్యాదరంబున నెదుర్కొని “ బాలకా! నీవెవ్వండ విందు కాంతాసహితుండవై తిరుగ గారణమే”మని ప్రశ్నించె, విక్రమసేనుఁడామునికిం బ్రణమిల్లి తనయుదంతం బామూలాగ్రముగం దెలిపి, క్షుద్బాధం దీర్చి తనకుం గర్తవ్యంబు నెఱిఁగింపుఁడని వేడుకొనెను. నాజడదారి యాదంపతులం దనయాశ్రమంబునకు గోనిచని యొక్కచో విడియంజేసి, కందమూలాదులం బరితృప్తి జేసి—— "రాజా! నీవిందు సేమముగానుండుము. రేపటిదినం బమావాస్య కావున మహా పర్వంబు; మనమరుపురమును సరోవరంబున స్నానం బాడి యల్లదే యట్ట యెదుటఁ గాన్పించు కాలభైరవాలయంబునకరిగి యద్దేవుని బూజించి వత్త"మనిపలుక నాతండును వల్లేయని యారాత్రి తదాశ్రమంబున సౌఖ్య లీలం గాలముఁబుచ్చెను. మఱునాటి వేకువజాముననే శుచిముఖ యారాకుమానికడ వ్రాలి, రహస్యంబుగ నాతనితో "ఆర్యా! ఈముని యొక కపట వేషధారియని తోఁచెడు; నీకొక చిత్రముం జూపెదర"మ్మని యాశ్రమంబున కనతిదూరంబుననున్న యొకవట ప్రాంతంబున కాతనిం గొనిచనియెను. ఆప్రదేశమంతయు మానవాస్తి కళేబరములతోడను, కపాలములతోడను, కరడుగట్టిన నెత్తుటితోడనునిండి భయానకంబై యుండెను. ఆవటవృక్షశాఖలకుఁ గట్టఁబడిన మానవక పాలములు కొన్ని యావిక్రమసేనుంగాంచి పకపక నవ్వి—— "యోనిర్భాగ్యుఁడా! నీవును మావలెనే యీకపటమునిచే కాలభైరవునకు బలియీయఁబడియెదవు! జాగ్రత్త” అనిపలికెను. విక్రమసేనుండార్చర్యములో నీ మునివృత్తం బెట్టిదని ప్రశ్నింప, నాకపాలములు "రాజపుత్రా! వీడు భైరవపూజా దురంధరుడగు నొకకపటముని, నూర్వురు రాజకుమారులనుగాని, యొక జడదారిని బలియిచ్చినచో కాలభైరవుడు ప్రసన్నుండగునని యెఱింగి, యీదుర్మార్గుఁడిప్పటికి తొంబదితొమ్మండ్రను బలియిచ్చెను. నీవు నూఱవవాఁడవు. ఈ యమవాస్యకు నీబలితో వాని యీప్సితం బీడేరు. కావున నీ వెట్లైన వానిని కాలభైరువునకు బలియిచ్చితివా నీకు ప్రసన్నుండగును హెచ్చరిక" యని పలుక—— విక్రమసేనుఁడు తదుపాయంబు నాలోచించుచు యధాప్రకారముగ నాశ్రమంబునకు వచ్చి యెఱుంగనట్లుండెను. అంతనాకపటముని, రాకుమారు నీతోఁ గలసి సరస్సున స్నానమాడి ఫలపుష్పాదులంగొని కాలభైరవాలయంబున కరిగెను. ఆకాలభైరవుం డాలయమధ్యమున మహా భయంక రాకృతితో నుండెను. ఆతని సమీపమున భీకరఖడ్గ మొకటి మెఱయుచుండెను. ముని విక్రమసేనుం జూచి—— “రాజపుత్రా! ఇప్పుడు నీ వీకాలభైరవునకు సాష్టాంగ నమస్కారం బోనర్పవలసియున్న" దని పలుక—— నాతండేమియు నెఱుంగని చాడ్పున, “యతీంద్రా! నేను రాజపుత్రుండనగుట నమస్కారం బొనర్చుట నెఱుంగను. తామొక్కమారు చూపెదరేని నేనట్లే యొనర్తు ” నని పలుక నాకపటముని కాలభైరవునకు సాష్టాంగ ప్రణామంబు సలిపెను.—— అదియే తరుణమని రాజపుత్రుండటనున్న కత్తితో వానితలద్రుంచి భైరవునకు బలియిచ్చెను—— వెంటనే కాల భైరవమూర్తి యాతనికిం బ్రసన్నుఁడై “బాలకా! నీ ధైర్యంబునకు మెచ్చితిని! ఇంక నీకిష్టార్థ పరిపూర్తిగావించెద——తొలుత నేబోధించు, "అమనస్క" ప్రభావంబును శ్రద్ధాళుడవై యాకర్ణింపు " మని పలుక, నాతఁడద్దేవునకు నమస్కరించి సర్వము, నాకర్ణించెను.

అంతట కాలభైరవుడు, “రాజపుత్రకా! నీకిష్టములగువరంబులం గోరుకొ"మ్మని పలుక, నారాజకుమారుం డమితానందము నంది. కాలభైరవునకుఁ బునః పునః ప్రణామంబులనాచరించి యోదేవా! నీదయచే దేవతల కసాధ్యమగు నమనస్క మహాత్యము నెఱింగితి. ఇక నాకేకోరికలును లేవు. ఐనను, కపటాత్ముండగు నీమునిచే దేవర వారికి బలియీయఁ బడిన రాజకుమారులనందఱం బ్రతికింపుము. ఇదియే మదీప్సితం "బని పలుక, నా దేవుండట్లే వారికి జీవ ప్రధానంబు సలుప నా రాజపుత్రులందఱును, కాలభైరవునితో పాటుగా, విక్రమసేనునకు నమస్కరించిరి. ఆఫునర్జీవితులైనవారిలో తన మిత్రుండగు, గుణసాగరుండును గాన్పింప నమితానందమున వాని గౌగిలించుకొని, యానాడే యారాజపుత్రశతకముతోడను శుచిముఖీ మణిమాలలతోడను నిజపురంబునకరిగి, తమ పోబడి నెఱుంగక కృశించుచున్న తల్లిదండ్రులకు మహానందములం గూర్చి బహుకాలము రాజ్యముం బరిపాలించెను.