పండ్రెండు రాజుల కథలు/జీమూతవాహనమహారాజు కథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఎనిమిదవ నాటి రాత్రి కథ.

నరనారాయణావతారధారులగు కృష్ణార్జును లిరువురును వెనుకటివలెనే——యెనిమిదవనాటి సాయం సమయమున సయితము, మృష్టాన్న భోజనం బొనరించి యమునా సైకతస్థలంబుల విహరింప నరియి——యందొక్క మనోహరస్థలంబున సుఖాసీనులై తాంబూల చర్వణంబొనరించు నవసరంబున, పార్థుఁడు పద్మనాభు నవలోకించి, “యో జగన్నాథా! గతరాత్రమున, నీవు దయతో నెఱిఁగించిన నీలకేతనుని చరితము పరమాశ్చర్యభరితము. ఎనిమిదవదియగు నిరాకార తత్త్వంబు నుపదేశించి కృతార్థు నొనరింపు" మని పలుకుటయు, నయ్యదునందనుఁడు మందస్మితవదనారవిందుఁడై “కిరీటీ! జీమూతవాహనమహారాజు చరిత్రముం జెప్పెడ, నాకర్ణింతువేని నీ సంశయము, వాయు" నని పలికి——తచ్చరిత్రము నిట్లు వచింప దొరకొనియెను.

జీమూతవాహనమహారాజు కథ.

విజయా! తొల్లి కాశ్మీర దేశంబును పరిపాలించుచుండిన మయూర వాహనమహారాజు మహాపతివ్రతయనందగు "అపర్ణాదేవిని" భార్యగా వడసియు నామెవలన చిర కాలము సంతతింగానక విసిగి——వృద్ధాప్యంబున “విపుల" యను నొకకన్యకం బరిణయమాడెను. విపుల నవయౌవనవతియగుటం జేసి—— వృద్ధనాధుని మనంబుననొల్లక మిగుల నేవగించుకొనుచుండెను. ఇదియిట్లుండ నప్పటి రాజసచివుఁడు వృద్ధుఁడై మృతినంద, నాతనికుమారుఁడగు చారుదత్తుఁడు మంత్రియయ్యెను. చారుదత్తుఁ డనన్య సౌందర్య ప్రభావిభాసితుండగుట, విపులా దేని యాతని యం దనుకర్త యయ్యెను. కొండొక దినమున మాండవ్యుఁడను నొక యోగిసత్తముఁడు రాజాస్థానంబునకువచ్చుటయు రాజసచివు లిరువురు నా యతీంద్రుని విధ్యుక్త విధానంబునఁ బూజించి సంతాన ప్రాప్తికిఁ గొం డొక వెఱవెఱిఁగింపవేడిరి. అయ్యతి వారినను గ్రహించి వారి భార్యల నటకురప్పింపఁగోర——పట్టమహిషియగు నపర్ణా దేవియు, మంత్రి భార్యయగు వీర బాలయు సత్వరం బరు బెంచిరిగాని, విపులా దేవి శృంగారపరిపూర్తిఁగావించుకొని యేతెంచుటకు జాగయ్యెను. ఈలోన నాయతి, యపర్ణావీర బాలల నిరువుర నాశీర్వదించి వెడలిపోయెను.అనంతర మటకరు దెంచిన విపుల కార్యముమించినందులకు వగచుచు, నపర్ణాదేవికి పుత్రప్రాప్తీగలునై యుండుటకు మానసంబున నీర్ష్యపూరితయై యుండెను. అనతిదినంబులకే రాజమంత్రులదారలు గర్భవతుల పతులతో పాటుగ సర్వరాష్ట్రవాసులకునుఁ బ్రమోదముఁగల్గించిరి. మంత్రి యగు చారుదతుని వలచిన విపుల రాజాజ్జగా వార్తనంపి యొకదినంబున, చారుదత్తుని దనయేకాంతాగారమునకు రప్పించుకొని, తనవలపుం ప్రకటింప నాతఁడప్పాపకార్యంబున కియ్యకొనడయ్యె—— ఇంతలో విధివశంబున నటకు ధరాధిపుం డరుదెంచుటయు——కార్యము తప్పి వచ్చెనని గ్రహించి విపుల చిత్రాంగివోలె——హఠంబువహియించి, తానొనర్ప నెంచిన పాపకార్యంబును మంత్రియే యెనరింపనెంచి యటకు వచ్చెనని రాజుతో గొండెములు బలుక, సత్యాసత్యములను విమర్శింపక రాజు సచివుని కారాగృహమున ద్రోయించెను. అప్పటికి గర్భవతియై యున్న సచినభార్యయగు వీరబాల మహాశోకంబున మతిచెడి, యడవులంబడి యెందేనింజని యొక నికుంజంబున జలహీనతచేఁ బడియుండెను. ఆయరణ్యవాసుల కధినాధుఁడగు ప్రచండుడనువాడు మృగయావినోద తత్పరుఁడై యటఁజరించుచుండ తత్పరిచరులలో నొక్కఁడు నికుంజంబు నంబడియున్న వీరబాలను కొండొకమృగముగా భ్రమించి, శరంబువదలనది యాతరుణివక్షంబునఁ దగిలెను. శరబాధచే వీరబాల యాక్రోశించుట నాలకించి, ప్రచండుడు తనవారి ప్రమాదంబును గుఱ్తించి యామెను భద్రంబుగ దనయాశ్రమముం జేర్చి యుపచర్యలొనరింపదొడఁగెను. వీరబాల తనచరిత్రమునెల్ల ప్రచండున కెఱిఁగించి యొకదినంబున, నత్యంత సుందరమూర్తియగు నొక స్త్రీ శిశువుఁ బ్రసవించి, వక్షమునందగిలిన శరబాధవలన వెంటనే మృతినందెను. ప్రచండుడామె మృతికి విచారించి సంస్కారాదులను గావించి, యాముద్దుబిడ్డకు జగన్మోహినియను నామంబునిడి యల్లారుముద్దుగఁ బెంచుచుండెను.

అరణ్యంబున నేశుభముహూర్తంబున జగన్మోహినిజన్మించెనో యంతకు నాల్గుదినంబులకు పూర్వమున కాశ్మీరరాజేంద్రుని పట్టపు దేవి యొక దుర్ముహూర్తంబున నొకమగశిశువుం బ్రసవించెను. భూపాలుఁడు సుపుత్రప్రాప్త వార్త నాలకించి మహదానంద భరితుండై వానికి జీమూతవాహన నామంబిడి, దైవజ్జులంబిలువనంపి, జాతకపరీక్ష సేయింప, వారు పెదవివిఱిచి——"రాజా ! ఈపుత్రుఁడు తనపదునాఱవయేఁట జీవితములంబాయను. ఆయుర్దాయ హీనుం" డని పలికిరి, ఆవార్తనాలకించి రాజేంద్రుఁడు, మిగులదుఃఖించెను. అప్పట్టున మాండవ్య మహర్షి యటకరుదెంచి, “ రాజా ! నీవు దుఃఖింపకుము; సాగరంబున నొక మత్స్యము యొక్క గర్భంబున నొకముక్తాహారముగలదు. ఆహారమును నీవు సేకరింపగల్గుదువేని, దాని నీ బాలుఁడు ధరించినచో మృత్యువును జయింపఁగలడు. కాని దాని, నితరులు ధరించిరేని యీతఁడు మృతినొందును. చతురులగు జాలరుల నంపి యశేషంబులగు సాగరమత్స్యంబులంబట్టి తెప్పింపుము. వానిలో నొకానొక జలచర గర్భంబున నది లభియించు "నని యుపదేశించి చనియెను, ఈవార్తపురమెల్ల వ్యాపించెను. అట్టిచేపం గొనివచ్చినవాని కపారంబగు బహూకృతి గావింపఁబడునని ప్రకటితం బయ్యెను. రాష్ట్రవాసులగు జాలరు లెల్లరుం దమతమ యదృష్టగణనం బొనరించుకొనుచు సాగరాభిముఖులై చనిరి. చిన్న రాణియగు విపుల తోలుత రాజకుమారుఁ డర్ధాయుష్కుఁడని విని యానందించెనే కానీ ముక్తాహారవార్తచే నామె యాశాభంగమునొంది. చేపలంగోసి పరీక్షింప నియమింపఁబడిన, వంటవానినిలోఁబరచుకొని, “యోరీ! ఆ ముక్తాహారము మత్స్యగర్భంబున లభించునేని దానిందొలుత రాజున కొసంగక నాకిమ్ము——అందులకుమాఱుగ నేను మఱియొకహారంబును నీకిచ్చెదను. దానిని రాజున కిమ్ము—— నీవీ యుపకృతిగావింతువేని నీకు సంతృప్తికరంబగు బహుమానం బొనరింతు” ననిపలుక వాఁడందుల కనుమతించెను.

జీమూతవాహనుండీలోన, శుక్ల పక్ష క్షపాకరుని చందమున ప్రతిదిన ప్రవర్థమానుఁడగుచు, చతురులగు నుపాధ్యాయుల మూలంబున సమస్త విద్యారహస్యంబుల నెఱుంగుచు కన్న వారికిం గన్న వారికిం గూడ గన్నులపండువ సేయుచుండెను. అంత నొక్క దినంబున, మాండవ్య మహర్షి యటకరు దెంచి రాజుచేఁ బూజితుఁడై, కుమారుని గుణరూప శీల సంపదల కెంతయు నాశ్చర్యపడి, యాబాలు నే కాంతమునంజీరి చిరంజీవి వగుమని యాశీర్వదించి——"వత్సా! ఇట్టిసద్గుణాలంకారుని నిన్ను సృజించిన పరమేశ్వరుఁడు ని న్నా యుర్దాయహీనునిగా నెన్నడుం గావింపఁడు. ఆమత్స్యము లభించును. తద్గర్భాంతర్గ తారహారమున నీవు చిరంజీవి వగుదువు. నీకు మహాసురమునీంద్రుల కలభ్యంబగు నిరాకార తత్త్వరహస్యంబు నెఱిఁగింతు నాకర్ణింపు” మని యుపదేశించెను.

అనియెఱిఁగింప నింద్రనందనుం డాశ్చర్యపడి, “బావా! ఆయనంతరము జీమూతవాహనుని చరిత్రం బేమయ్యె నెఱింగింపు" మనవుడు ముకుందుఁడిట్లనియె——"విజయా! ఆకర్ణింపుము. అట్లు జీమూతవాహనునకు నిరాకారప్రభావంబు నెఱింగించి మాండవ్యుఁడు నిజాశ్రమంబున కరిగె——నీకథ యిటులుండ, నటరాజేంద్ర కనిష్టదారయగు విపులాదేవి, మంత్రియగు చారుదత్తునిపైఁ గల, నిర్భర మోహంబు పెంపున నాతఁడు నిర్బంధింపఁ బడియుండిన కారాగారమునుండి—— తనశయనాగారంబున కొక రహస్య భూబిలం బేర్పఱచుకొని, ప్రతిదినంబును రాత్రివేళలఁ దత్కారాగృహంబున కరుదెంచి, చారుదత్తునివశపఱచుకొన విశ్వ ప్రయత్నంబు లొనరించియు విఫలమనోరథ యగుచుండెను. మాండవ్యుఁడీ రహస్యం బును, యోగదృష్టినెఱింగి, విపులగుట్టు బట్టబయలుసేయు నుపా యం బాలోచించి, ఆటవిక నాయకుండగు ప్రచండునికడ కరిగి యాతనిచేఁ బూజింపఁబడి, కాశ్మీరరాజ్యమునందలి వృత్తాంతములను విపులయొనర్చుచుండిన నిగూడ దుష్కృత్యంబులనుఁ దెలిపి, “ప్రచండా! రేపటి రాత్రి నీవు నీ పరిజనులతో నొరు లెరుంగనిరీతి చారుదత్తుని కారాగృహంబున వేచి యుండి, యటకు విఫులవచ్చిసంతనే యాకులటనుబట్టి బంధింపుము. ఇంతలో నే నన్యమార్గంబున రాజు నటకుగొనివచ్చి రహస్యప్రకాశంబొనరింతు”నని పలికి యాతనిచే నట్లనిపించుకొని చనియెను. ప్రచండుఁడును దన ప్రయత్నము నందుండెను. నిరంతరాటవీ నివాసంబునకు రోసిన జగన్మోహిని యాదినంబుననే నాగరికలోక సందర్శనకుతూ హలాయత్తచిత్తయై——కాశ్మీర దేశ రాజధానియగు శ్రీనగరంబునకరిగి, యందందుగల చిత్రంబులం గాంచుచు, నప్రయత్నంబుగ, రాజోద్యానంబున కరిగెను. అంతకుఁ కొంత కాలమునకుఁ బూర్వ మటకు వాహ్యాళికై యరుదెంచిన జీమూతవాహనుం డబ్బాలికాతిలకమును, జగన్మోహిని యారాజకుమారుని నన్యోన్యముం జూచుకొనినంతనే——అపుడపుడే యౌవనచిహ్నాఁబులు పొడసూపుచున్న యాబాలబాలికల హృదయంబుల ప్రేమాంకురము లావిర్భవించెను. అంత వారిరువురుం దమతమ మానసాభిప్రాయంబుల నోండోరులఱింగించుకోనుచుండిరి. ఆదినంబుతో నారాజకుమారునకు పదునాఱు వత్సరంబులును నిండుచుండెను. అప్పటికి సరిగా నొకజాలరి గొనివచ్చిన మత్స్యంపుటు దరంబున దివ్య కాంతిభాసురమగు నొక తారహారము లభింప దానింగోయుట కేర్పరుపఁబడిన పరిచారకుఁడు పూర్వోక్త వాగ్దాన ప్రకారముగ నాహారము నతిరహన్యముగఁ గొనిపోయి విపులాదేవి కరంబుల నిడియెను. విపుల విపులానందభరిత మానసంబున దానినిధరించి, యందులకు మారుగ మఱియొక ముక్తామాలికను సబహుమానంబుగ నాపరిజనునకిచ్చిపంపెను. ఏక్షణంబున విపుల యా హారమును ధరించెనో యప్పుడే ——జగన్మోహినితో సరస ప్రసంగమొనరించుచున్న జీమూతవాహనుం డటులే విగతజీవియై ధరా తలి నొరగెను. తద్వైపరీత్యముంగని జగన్మోహిని శోకింప నారంభిచెను. ఇంతలో చారుడుగొనివచ్చిన ముక్తాహారము గని రాజేంద్రుఁడు మహానందమున కుమారునిచే నద్దానిధరింపఁ జేయు నభిలాషంబున వెదకుచు సపరివారుఁడై తత్ప్రమదోద్యానంబున, కరుదెంచెను. అప్పటికా బాలునకు పోడశవర్ష పరిసమాప్తి యైనకతంబున దన్మృతికంతగా విస్మ యమందక రాజును పరివారంబును ముక్తాహారంబు నాతని మెడనిడిరి. ఐనను బాలుఁడు లబ్ధజీవితుఁడు గాఁడయ్యెను. ఆవైపరీత్యమునకు రాజదంపతు లడలి దుఃఖింపసాగిరి, రాజపరివారము మృతరాజపుత్రుని సమీపంబున శోకించుచున్న జగన్మోహినింగని సంశయించి——" రాజేంద్రా ! ఈ యాటవిక బాలిక యొక మాంత్రికురాలని తోఁచుచున్నది. దీనివలన నెద్దియో మోసము ఘటిల్లెను. కాకయుండిన రాజకుమారుఁడు జీవింపమి కేమి కారణము? దీనింబ్రహరించిన నిజము తెలియు"నని పలికిరి. జగన్మోహిని నిజవ్రుత్తాంతముం దెలిపినను వారు విశ్వసింపక ప్రహరింప నుద్యుక్తులైయున్న తరి నయ్యెడకు—— భగవానుండగు, మాండవ్యుం డరు దెంచి వారి వారించి, “ రాజేంద్రా ! ఈ బాలిక నిరపరాధిని; ఈవిపరీతంబునకు మూలకారణం బగువ్యక్తి వేఱుగానున్నది. బాలునిభద్రముగ నొకచో నుంచి, నేటి రాత్రి నీవు సశస్త్ర పరివారంబుగ నా వెంట నేఁ జూపుచోటికి రావలయును. అట నతిచిత్ర దృశ్యముం గాంచఁగలవు; బాలునకు భీతిలే" దని పలికెను. చిరకాలప్రవర్ణితంబగు విపులాదేవి పాప మానాటితో పండిపోయెను. మాండవ్యమునీంద్రాదేశానుసారముగ చోరమార్గంబున, సశస్త్రపరివారుఁడగు ప్రచండుఁడు మున్ముందుగ కారాగృహముం జేరి యందందు పరిజనుల నిగూఢంబుగ నిలిపి తానొకచో దాగి, యుండెను. అనంతరము మాండవ్య సహచరులై రాజును పరివారమును శస్త్ర సహితంబుగ నొకచోనుండిరి. అందఱును విపులరాకకై వేచియుండ నట్ట నడు రేయి, నాజారిణి భూబిలమార్గంబున, భక్ష్యభోజనాదులంగొని యటకరుదెంచి మెల్లననిద్రించు చారుదత్తుని తట్టి లేపెను. నిద్రలో నులికి పాటున మేల్కాంచిన చారుదత్తుఁ డాకామినీరూపరాక్షసిం గాంచి, యసహ్యమును భీతియుముఖంబునందోప, విపుల తనకందించు భోజ్యపదార్ధంబుల పళ్లెరంబును కాలందన్ని—— దూరంబుగనరిగి—— యోసీ! కులటా! నేటికి పదునారు వత్సరములకు పూర్వము నన్ను కామించి నీదోషమును క్రమ్ముకొనుటకై తదపరాధంబును నాపైఁద్రోసి, సుగుణఖనియగు మహారాజుంబ్రేరేపి నన్నీ చెఱసాలం ద్రోయించి నేటివఱకును బాధించుచుంటివి. గర్భవతియగు నాభార్య యేమయ్యెనో నే నెఱుంగను. ఇంకను నన్ను వదలక దురాశబూనియుంటివి. నాజీవితమంతయు నీచెఱసాలలో వ్యర్థమైనది. నాకుటుంబము నీమూలమున నాశమైనది. వయస్సుమీరి కారాగారమున వికారాకృతిందాల్చియున్న నాపై నింకను నీకెట్టిమోహమో తోపకున్నది. నీవు వేయేండ్లు తపంబొనరించినను నేను నిన్ను కామించి రాజద్రోహినికా"నని దృఢ స్వరంబునఁ బలికెను. అంత నావగలాడి యనేక విలాసచర్యల నొనరించుచు నాతనిడగ్గణి, “మోహనాంగ నీకొఱకై నాజీవితము నంతను ధారపోయుచున్నాను. రాజకుమారుని జీవితములను హరింప మత్స్యగర్భగతంబగు తారహారంబు నపహరించి కృత్రిమహారంబు నంపితిని. అందుచే రాజనందనుఁడు సమసెను. వృద్ధరాజు నొకలిప్తమాత్రంబున సంహరించెదను. నిన్ను రాజుం జేసి నేను రాణినయ్యెదను. నామనవి యాలింపు"మని వేడుకొన, చారుదత్తుఁడు దాని నీచయత్నంబుల కానందింపక బహుప్రకారముల దూషించెను. తద్దూషణముల కాగ్రహించి, విపుల తన కటారిందీసి వాని వక్షమునం బొడువఁబోయెను, ఇంతలో చాటునవేచియున్న ప్రచండాదుల రుగు దెంచి, చారుదత్తుని రక్షించి విపుల నెదిరించిరి. విపుల భయభ్రాంతయై భూ బిలమునంబడి పలాయితయగుట కుద్యుక్త యయ్యెను. కాని యామార్గమున రాంజేంద్రుఁడు సపరివారుఁడై కాన్పించి "కులటా! ఎందుబోయెదవు నిలువు" మని గర్భనిర్భేద్యంబుగఁబలికెను. తనరహస్యమంతయు వెల్లడియయ్యెనని గ్రహించి, విపుల తనచేతనున్న కటారి తోడనే యాత్మహత్య గావించుకొని మరణించెను. ఈచిత్రమేమో యెఱుంగక భ్రాంతినందియున్న చారుదత్తుని రాజు క్షమింపఁ బ్రార్థించెను. అంత మాండవ్యుడు ప్రచండుని రాజునకుఁ బరిచితునిగావించి, జగన్మోహిని చారుదత్తుని పుత్రికయని యాకధనంతను దెలిపి, విపుల కంఠమునంగల ముక్తాహారముంగొని చని రాజకుమారుని బ్రదికించెను. అనంతరము జగన్మోహినీ జీమూతవాహనులకుఁ గల్యాణ మయ్యెను. చారుదత్తు మయూరవాహనులు వియ్యంకులైరి——మయూరవాహనుఁడు రాజ్యభారవహన విరక్తుఁడై పుత్రునకుఁ బట్టముగట్టి తాను పుణ్యకధా గోష్తి దినంబులు గడుపుచుండెను. అని శ్రీకృష్ణుం డర్జునున కెఱింగించెను.


తొమ్మిదవ నాటి రాత్రి కథ.

యథాప్రకారముగా కుంతీనందన యశోదానందను లిరువురును మఱుసటిదినమున, పెందలకడ భోజనాది నిత్యవిధుల యధోక్తముగ నిర్వర్తించి, యమునాసైకతభూముల కరుదెంచి మందమారుతసౌఖ్యము ననుభవించుతరి, గాండీవి గరుడధ్వజు నవలోకంచి——"యో పురుషోత్తమా! నీ దయారసంబున నిప్పటి కెనిమిది వేదాంతరహస్యంబులను కథారూపంబున నాకర్ణించి ధన్యుఁడనై తిని. తొమ్మిదవదియగు “అమనస్క” ప్రభావంబును నేడెఱిఁగింపవే! "యని ప్రార్థింప, నా గోపబాలుఁడు "సవ్యసాచీ! ఇందులకు విక్రమసేనమహా రాజు చరిత్రము నెఱిఁగింతు నాకర్ణింపు" మని పలికి యాతచ్చరిత్రము నిట్లు నిర్వచింపఁ దొడంగెను.