Jump to content

పండ్రెండు రాజుల కథలు/నీలకేతనమహారాజు కథ

వికీసోర్స్ నుండి

ఏడవనాటి రాత్రి కథ.

సప్తమదినంబునఁ గృష్ణార్జునులు యధాప్రకారంబుగ, యమునా తీరమున సుఖాసీనులై చల్లగావీతెంచు మెల్లనిపిల్ల తెమ్మెరల సౌఖ్యంబున కలరుచున్నతరి, నర్జునుఁ డచ్యుతుంగాంచి “యోపురుషో త్తమా! నిన్నటి దినంబున నీవు చెప్పిన, కామవర్ధనుని చరిత్రం బతివిచిత్రంబు; పరమానందభరితుండనైతిని. సప్తమంబగు, సాకారమహాత్మ్యంబు నెఱిఁగించి ధన్యునిగా వింపు"మని పలికిన, “పార్థా! సాకార ప్రబోధకంబగు నీలకేతన మహారాజు చరిత్రంబుగల దద్దాని నాకర్ణింపుమని యిట్లువచింప దొడంగెను.


నీలకేతన మహారాజు కథ.

తొల్లి పాంచాల దేశముం బరిపాలించుచుండిన సూర్యకేతనమహారాజునకు నీలకేతనుం డనునొక సుపుత్రుం డుద్భవిల్లెను. అంత నారాజు పుత్రోదయంబునకలరి దైవజ్ఞుల కాతనయుని జన్మపత్రికంజూప, నాయార్యులు గ్రహంబులను లెక్కించి “రాజా ఈ బాలుఁడు మిగుల దుష్ట కాలంబునం బ్రభవించె. వీనికి పదునాలుగేండ్లుమీరులోపల సూర్యరశ్మిసోకె నేని యనేక కష్టములంగాంచు"నని పలికిరి. సూర్య కేతనుఁడు దైవజ్ఞవచనానుసారంబుగ నాబాలుని నొక సూర్యరశ్మిసోకని పాతాళమందిరంబున నుంచి భద్రముగ గాపాడుచుండెను. ఆయనంతరంబున నారాజేంద్రునకు పాంచాలయను నొక తనయయు నుద్భవించే——ఇదియిట్లుండ దినక్రమంబున నా నీలకేతనునకు ద్వాదశ వర్షంబులునిండ నాకుమారుండు బాల్య చాపలంబున నొక రేయి యామందిరంబు వెల్వడి పురముంబాసి యొక మహారణ్యంబునంబడి చనుచు నిద్రావశంబున నొకశిలాతలంబున శయనించెను. దిన దినంబును భూతలంబునకు విహారార్థ మరుదెంచు యక్షపుత్రికయగు, కళానిలయ యనుసుందరి యాదినంబున నచటి కరుదెంచి, నీల కేతనుఁగాంచి మోహపరవశయై యాతని నెత్తుకొని యాకాశమార్గంబున యక్షలోకంబునకరిగి, నిజమందిరంబున నొక హంసతూలికాతల్పంబున శయనింపఁ జేసి, నిద్దుర లేపి తన యిష్టంబు నెఱిఁగించెను. ఆ పలుకులు విని, యా సుకుమారుం డాశ్చర్యభయచేతస్కుండై—— “యయ్యారే! ఎక్కడి భూలోకము? ఎక్కడి యక్షలోకము? దైవజ్ఞులయానతిమీరివచ్చిన నా కిదియే కష్టారంభ సూచకము కాఁబోలు" నని వాపోవుచుండ నా కళానిలయ యాతనికి ధైర్యంబు గఱపి వానితో సురత క్రీడాసుఖంబు నందుచుండెను. ఇట్లు కొన్ని నాళ్లు రహస్యంబుగ నీ వ్యాపారంబు జఱుగుచుండఁ దొలుత నామె సఖులయందు గుసగుస లారంభమై తుద కానోట నానోటంబడి, యక్షేశ్వరునకు దెలియ నాతం డాగ్రహోదగ్రుఁడై——యిరువురు భటులచే నాతని నిలాతలంబునకుఁ ద్రోయించెను. అట్లు త్రోయంబడిన నీలకేతనుం డొక యుద్యానంబునంగల పొదరింటంబడి, బహుతరోన్నతినుండి పతితుండైనకతంబునఁ బ్రాణంబులన్ను బట్టి మృతునిగతిం గదల మెదలక యుండెను. ఆ రాత్రి కాలంబున చల్లగాలి సుఖంబునకై తదుద్యానవనంబున శయనించిన, యుక రాజపుత్రికయు నామె సఖియు నాధ్వని నాలించి మేల్కాంచి, విస్మితులై——మన్మధుని ధిక్క రించు సౌందర్యంబునఁ విరాజిల్లుచు జచ్చినట్లు పడియున్న నీలకేతునుంగని జాలినంది యోక తల్పంబున్ఁ బరుఁడఁ జేసి సపర్యల మేల్కొలిపిరి. రాజు పుత్రుఁడు లబ్ధప్రాణుఁడై దిశలంబరికించి తొలుత నాకామినింగని, కళానిలయగా భ్రమనంది, మరలఁ గాదని గ్రహించి భయాశ్చర్యములతో——"నో కాంతలారా! ఇది యే దేశము మీరెవ్వరు? నేనొక పర్వతమునుండి క్రిందబడినట్లు కలఁగంటిని. ఇది యింకను కలయేనా? కానిచో నేనిట కేట్లు వచ్చితిని? నా కళానిలయ యేమయ్యె” నని వెఱ్ఱివానివలె నడుగ, నా కాంతలలో నొకతె—— “యార్యా! ఇది కుంతల దేశము.ఈ బాల యీ దేశాధీశుండగు మణిమంతునిపుత్రిక——మణిమంజరి యనంబరగు. నేనీమెసఖినగు సునందను.ఇందుమేము చల్లగాలికి శయనించి యుండ నీ వాకాశమునుండి యిందు బడినట్లనిపించెను. నీవృత్తాంతమేమి?" యని ప్రశ్నింప, నాతడు వెఱఁగుపడుచు, “నోహో ! ఇది భూలోకమా! అట్లయిన నేను యక్షలోకము నుండి, భూమికిద్రోయఁ బడితిని కాఁబోలును. ఇంక నాకళానిలయ పై నాశవదలుకొనవలయునా?" యని వగవదొడంగెను. సునంద యాతని భీతిని బోద్రోలి యనునయించి, ఆతని యుదంతం బెల్ల నాతనినోటనేయాకర్ణించి, యొరు లేఱుంగరాకుండ నాతని కాఁడు వేసమువేసి, యంతిపురముననే యారేయి నిదురింపఁజేసెను. ప్రారంభమునఁ గొంత భీతిల్లినను, నీలకేతనుండు క్రమక్రమంబున భయవివర్జితుండై——తన్ను మనసార ప్రేమించిన నవలావణ్యవతియగు నామణిమంజరింగూడి, సురత క్రీడల మెలంగఁదొడంగె. ఆమఱుసటిదినంబున నూతనకాంత యొకతె యంతఃపురంబున నుండుటంగాంచి పలువురు పలు తెఱగులఁ బ్రశ్నింప సునంద ముందునకువచ్చి యాకాంత తనపినతల్లికూఁతురనియును గ్రామాంతరము నుండి వచ్చెననియు నదిమంచి విదుషీమణియనియు, నీలయను నామంబు గల్గినదనియు, రాజపుత్రిక కొన్ని దినంబులు దాని చెంగట విద్యాభ్యాస మొనరింపఁ గోరుచున్నదనియు వచించి యొక్కరును నోరెత్తి యాక్షేపించుట కెడము లేకుండ నొనరించెను. నీల కేతనుండును స్త్రీ రూపంబున నత్యంత మోహనా కారుఁడై స్త్రీ పురుషులను సమానగతుల సమ్మో హింపఁ జేయుచుండెను. సుగంద పల్కిన చతురవచనములవలన భయము వీడి యా రాజపుత్రికా రాజపుత్తకులు, పనలెల్ల హాస్యోక్తులతోడను, విద్యావ్యాసంగములతోడను కాలముగడుపుచు రాత్రులందు హాయిగానేక శయ్యతలంబున శయనించి మదనవిలాసంబులచే నెలలు క్షణంబులుగా గడుపుచుండిరి. మణిమంజరికి మాణిభద్రుం డను నొక సహోదరుఁ డుండెను. ఆబాలుఁడు సంప్రాప్తయౌవనుండయ్యును, సహోదరి వివాహంబుగాక మున్ను తాను పెండ్లాడఁగోరక కొంతయు, తనచిత్తంబునకు నచ్చిన బాలిక లభింపమిఁ గొంతయు నప్పటివఱ కవివాహితుండై యుండెను. సహజముగా నమ్మాణి భద్రుండు, తనరాకను మున్ముం దుగా నెఱింగింపకయే తన సోదరియగు మణిమంజరి ముదిరంబున కరుదెంచు నభ్యాసము గలవాఁడగుటచే నతఁ డొక్క దినంబున, మణిమంజరీ నీలలు సుఖోపవిష్టులై కొండొక శాస్త్ర ప్రసంగం బొనరించుకొను నవసరంబుస, నకస్మాత్తుగ నటకరుదెంచెను. పరపురుషాగమన కారణంబున లజ్ఞా భయంబు లుల్లంబున మల్లడిగొన నీలతటాలున నభ్యంతరప్రదేశ మున కరిగెను. వినయంబు పెంపున గొంతయు, స్త్రీ రూపంబున నున్నను సహజముగ పురుషుండగుఁ దనప్రియుండు సోదరుని కంటఁబడెనుగదా యను వెఱపున కొంతయు తన రహస్యము బహిర్గత మయ్యెనోయను సందేహభయంబులఁ గొంతయు, మణిమంజరి యనసతముఖియై మెల్లన లేచి నిలువంబడెను. స్త్రీ రూపమును ధరించి యతిలోక లావణ్యంబున వెలయుచున్న యా నీల కేతను సౌందర్యముం గాంచి ప్రధమవీక్షణంబుననే,మదనశరాఘాత బాధితుండై—— వెంటనే స్వకీయ మనోగతాభిప్రాయంబును బయల్పడనీయక, కొండొకతడవు స్వసహజాతతోఁ బ్రసగించి, ప్రసంగాంతరంబున——" చెలీ!! నీ యంతః పురంబున కొక విదుషీమణి వచ్చెననియు, నామె పాండిత్యంబున నసామాన్య యనియు వినియుంటిని. నేడు మన యాస్థానంబున కొకపండితోత్తముఁడు వచ్చి యాస్థానపండితుల నశేషంబుగ తన మేధాలులవిశేషంబునకు విద్యావివేకంబు నను పరాజితులనుగా నొనరించి మఱియెవ్వరును లేరాయని ప్రశ్నించుచున్నవాడు; ఇప్పట్టున మన మోటమినందితిమేని సంస్థాన గౌరవంబున కెంతేని కళంకము గలుగఁగలదు. తద్గౌరవంబును నిలువఁబెట్టగల భారము నీయందున్న యది. ఆపండిత శిరోమణి నోడింపగల శక్తి నీ చెలికిం గలదని భావించి తండ్రి గారియనుజ్ఞపై నే నిటకువచ్చితిని. కావున సంస్థాన గౌరవమును నిలుపుకొఱకు నీ వామెను వాదంబునకు బ్రేరేపించి పంప తప్ప"దని పలికెను. సహోదరునిపలుకుల నాకర్ణించి మణిమంజరి యాత్మగతంబునఁ బెద్దయుం దడవు యోచించి, “యాతరుణితోడ నాలోచించి తెలియజేసెద" నని యాతని నప్పటి కెట్లో సమాధానపఱచి పంపి వేసెను. యవనికాభ్యంతరమునుండి భర్తృదారికా భర్తృదారకుల ప్రసంగమెల్ల నాకర్ణించుచుండిన కాల కేతనుఁడు, దీనవదనయై తనకడ కరుదెంచిన, యా మణిమంజరింగాంచి, "మంజువాణీ! నీ సోదరుం డాడిన పలుకుల నెల్ల నాకర్ణించితిని. ఇప్పట్టున మన మెద్దియేని యభ్యంతరంబును వచించి నీ సోదరునిమనంబును చిన్న బుచ్చితిమేని మనల ననుమానింపఁగలరు. అందువలన బ్రమాదము వాటిల్లఁగలదు. అదియునుంగాక, విశేషించి, మనకు సంస్థానమర్యాద నిల్పుటయుఁ గర్తవ్యము. నే నాపండితుని యుక్తవిధంబున నోడించి, నామర్యాదకు భంగముకలుగ కుండ, మనగుట్టు బయల్పడ కుండ రాగలను. నీవిందుల కెంతమాత్రమును సంశయింపక నాసమ్మతి నెఱిఁగింపుమనిపలికెను. అంత నా మణిమంజరియు వల్లేయని యట్లయోనరింప నియమిత కాలంబునందు కపట కాంతా వేషదారియగు కాలకేతనుఁ డప్పండితునితో చతుషష్టి కళలయందును, ఛందోతర్క వ్యాకరణ మీమాంసాలంకారాది శాస్త్రములయందును, అమోఘంబగు వాదం బొనరించి, యామమాత్ర కాలంబునఁ బరాజితునిగా నొనరించెను. తద్వాదకాలంబున, నప్పుండితుని సమక్షంబున రాజకుమారుండగు, మాణిభద్రుండును నాసీనుఁ డై యుండెను. కాల కేతనుఁడు స్త్రీ రూపంబున, త్రిలోక మోహనుండై కాన్పించుచున్నందున, నతఁడు నిక్కముగ కాంతయే యను భ్రమంబున, నాకపట కాంతయందు లయంబయిన చిత్తంబుతో నొడలు మఱచియుండెను. నాటి రాత్రి కాలంబున, మాణిభద్రుడు నిద్దుర పట్టక నిజశయ్యా తలంబునఁబడి దొరలుచు, తీవ్రతర మదన జ్వరపీడితుండై ప్రలాపించుచు నా కాంతాలలామంగూడు వెఱ వెద్దియని వితర్కించి, తుదకు మణిమంజరిసఖియగు, సునందను జేరం జీరి, తనవిరహావస్థ నామె కెఱిఁగించి, యే యుపాయంబుననేని యానతిం దనకుఁ గూర్చినయెడల గొప్పబహుమానం బొనరింతుననిపల్కి యామెచే నట్లనిపించుకొనియెను——సునందయు వ్యాకుల చిత్తంబున మణిమంజరి కడకరు దెంచి, "సఖీ ! మన మొకటితలంప దైవమిం కొకటి తలంచెను. నీప్రియుని స్త్రీ రూపంబునంగాంచి, నీసోదరుఁడు మదన శరాహతుండై తల్లడిల్లుచున్న వాఁడు, ఎట్లయిన తనకుంగూర్పుమని నన్ను వేడుకొనియె. అదియునుంగాక, నీయందు గర్భచిహ్నంబులు పొడసూపుచున్నయవి. కాల కేతనుఁడిక నిచ్చోట విశేష కాలముండిన ప్రమాదంబుగలుగఁగలదు. అతనిఁ గొంతకాలమెటకైనఁ బంపుట సర్వ శ్రేయ ” మని పలుక, నాబిబ్బోక నతి నిజప్రియ విశ్లేషంబున కోర్వనోపక పెల్లుగతల్లడిల్లి శోకింపసాగెను. తుదకు గత్యంతరముగానక, కాల కేతనుఁ డామె నెట్లో సమాధానపఱచి, వలయు ధనంబును, ఒకయుత్తమాశ్వంబును గైకొని యొకనాటి రాత్రి రహస్య మార్గంబున పురంబు వెలువడి యెందేనింజనియె.మఱునాడు మాణి భద్రునికడ కరిగి మాలతి” భర్తృదారకా ! తమ యభిప్రాయంబును నే నాకాంత కెఱిఁగించితిని. అప్పటి కనుమతించినట్లే కాన్పించెను. కాని తెల్లవాఱునప్పటి కేందో చనినది. మాయూరికి గూక వార్తనంపితిని. అటకును జనినట్లు లేదు. ఎందుజనెనో తెలియ ” దనిపలుక నారాజపుత్రుడు శోభహతుండై యక్కాంతనారయ నలువంకలకును దూతలనంపెను.

ఇదియిట్లుండనట—— కాల కేతనుని జనకుఁడగు సూర్య కేతనమహారాజు, మఱునాడు పాతాళమందిరంబున, కాల కేతనుంగానక, పరితపించు చుండ, పుత్రిక యగు పాంచాల, జసకునియనుమతింగొని, విశ్వాసపాత్రురాలగు తరళ యనుచేటిని వెంటగొని, యిరువురును పురుషరూపంబులను దాల్చి——కాలకేతను నన్వేషింప దేశాంతరగతులైరి.

కాలకేతనుండట్లు——కుంతల రాజ్యంబు విడచి యొక మహారణ్యముం బ్రవేశించి, మణిమంజరీ విశ్లేషంబున నన్యాధీనమనసుఁడై——నారదమహర్షియాశ్రమము బ్రవేశించి యాముని పాదకమలముల బట్టుకొని ప్రార్థించి, తనయుదంత మెల్ల నెఱిఁగింప నాతఁడునవ్వి " కుమారా ! ఎంత వెఱ్ఱివాఁడవైతివి? అనశ్వరంబగు ముముక్షు మార్గంబు నెఱుంగక, హేయంబగు నీయైహికచింతలందవిలి యెన్ని నాళ్లిట్లు కూపస్థ మండూకంబువోలె మెలంగి పతితుండవయ్యెదవు? నీకు మహాజన దుర్లభంబగు సాకార ప్రభావంబు నెఱిఁగించెదను. అందువలన నీవు తరింపఁగల" వని యుపదేశించె.

ఆనాడట్లు నీలకేతను నిలాతలంబునకుఁ ద్రోయించినపిదప యక్షేశ్వరుండు, తన తనయ గర్భవతియయ్యెనని యెఱింగి, పతికొఱకై సుత జెందు దుఃఖముంగాంచి, భరింపఁజూలక తుదకెట్లైన నాతనినే యన్వేషించి యల్లునిగా నొనరించుకొన నభిలషించి, యాతఁడు మానవుండని తన తనయవలన నెఱింగి, యామె వ్రాసియిచ్చిన నీల కేతననుని ప్రతిరూపంబులను చారులకిచ్చి భూతలంబున కంపెను.ఈలోపల సహోదరునన్వేషింప దేశయాత్రగావించుచుండిన, పాంచాల పురుషాకృతితో, క్రమంబున, కుంతల రాజధాని కరుదెంచి పురుషరూపముతో నున్న సఖితో నొక సత్రంబున విడిసియుండెను. ఆ పురి రాజపుత్రికకు తలిదండ్రుల కెఱుక లేకుండ గర్భోత్పన్న మయ్యెననియు నీల కేతనుఁ డనునొక రాజపుత్రుం డామెంగలసినట్లా రాజపుత్రిక పచించుచుండెననియు రాజేంద్రుఁ డాతనికై వెదకించుచుండెననియు, సత్రాగత పౌరజనంబులవలన నాలకించి, యరాజపుత్రికతో మాటలాడ దలంచి యుండెను, అనంతర మెందేని మార్గాంతరంబునం జనుసునంద యాసత్రంబున కరుదెంచి, తటాలునఁ బురుషాకృతితో నందున్న పాంచాలనుగాంచి నీలకేతనునిగా భ్రమించి వినయసంభ్రమములతో నాతం డగ్గఱి——నమస్కరించి—— “రాజపుత్రా! ఇట కెప్పుడు వచ్చితివి? ఇన్ని నాట్లు నెందుంటివి? నా చెలి నీకై బెగఁగొనియున్నది; రాజేంద్రుఁడు నీచరిత్రంబునంతను నాకర్ణించి నిన్ను జామాతనుగా స్వీకరింప నుద్యుక్తుఁడై యున్నాఁడు. ఈ సత్రంబున నుండనేల? రమ్ము——నా చెలికి నేత్రపర్వం బొనరించి రాజానుమతంబున పెండ్లికుమారుఁడవు గమ్ము——” అని త్వర పెట్టుచున్న సునంద పొరపాటు నెఱింగి పాంచాల నవ్వి—— “సుదతీ! నీవెవ్వతెవో నేనెఱుంగను; బహుళః నీవు నాసోదరుఁడగు నీల కేతనుని వృత్తాంతము వక్కాణించుచుందును. నేనును నాసోదరు నన్వేషించుచు నిందు సంచరించుచున్నా” నని పలికి తాను కాంతయగుటయుఁ దన సర్వవృత్తాంతమును నెఱిఁగించి రాజపుత్రికను సందర్శించి సంభాషించుటకై——పురుషాకృతిని విడనాడి నిజరూపముతో సునంద వెంట రాజాంతఃపురమున కరిగెను.

కుంతల రాజకుమారుఁ డగుమాణిభద్రుఁ డానాడు స్త్రీ రూపమున నున్న నీలకేతనుఁ గాంచినది మొదలు, మదన బాణహతుఁడై పరితపించుచు, ననుదినంబును సుసందతోఁ దనసంక్షోభముం జెప్పుకొనుచు సక్కంజాక్షి మఱల నీపురి కెవుడువచ్చుననియడుగుచు దిన మొక యుగముగా గడుపుచుండెను. ఆదినమున మణిమంజరియు పాంచాలయు సంభాషించు నదనున, మాణిభద్రుం డటకరుదెంచి, పాంచాలంగని తావలచిన కాంత యదియేయని భ్రమించె——పాంచాలయు నామోహనాంగునిగని కామ వశయయ్యెను. ఆయువతీయువకుల హృదయగతాభిప్రాయంబుల నెఱింగి, మణిమంజరీ సునందలు వారిరువురకును అన్యోన్య సంభాషణాను కూల్యముం గలిగించిరి. అప్పుడా రాజపుత్రుఁ డాపుత్తడి బొమ్మ ననేక విధంబుల బ్రతిమాలి తన్ను బరిణయమాడుమని వేడుకొస, నాకాంత "ఆర్యా! నాసోదరునియునికి నెఱుంగునందాక నే నీశుభకార్యంబున కనుమతింపఁబోను. నేనాతని నన్వేషించి తెచ్చిన పిదప, రెండు వివాహములు నేకకాలంబునఁ గాదగునని పలికి యాతనిననుమతింపఁ జేసి, మరల నీలకేతను నన్వేషింప ఋరుషాకృతితో, సఖీద్వితీయమై మఱియొక పురంబున కరిగెను. అట్లుచనిన పొంచాల యొకచో శయనించియుండ——యక్షేశ్వరునిచే నీలకేతన ప్రతిరూప పటసహితంబుగఁ బంపఁబడిన, చారులు పురుషాకృతితోనున్న పాంచాలంగని, నీలకేతనుఁడని భ్రమించి, స్వకీయ మాయాబలంబున నిజలోకమునకుఁగొని చని, కళానిలయ శయ్యాతలంబున శయనింపఁ జేసిరి. కళానిలయయు నాకాంతను గుఱ్తింపనేరక నిజనాధుఁడేయని భ్రమించి నిద్దురలో ముద్దాడుకొని, పాంచాల నిద్రాభంగమునంది యాకళానిలయ. సంగతినంతనువిని, తాను నీలకేతనుఁడగానని పలికి నిజచరిత్రము నెఱింగించెను. ఆచరిత్రము నానుపూర్వకముగ నాకర్ణించి — యక్ష రాజపుత్రికయగు కళానిలయ, తద్వ్యక్తి తన హృదయాధినాధుఁ డుగానందులకు విచారించియు, వధూనికాపరిచయ మయాచితముగగల్గుట కానందించి, సందర్భముల నెల్ల యోచించి, “ పాంచాల దేవీ ! ఇందుగల యక్షయువకులు నీ సౌందర్యముగాంచిరేని, మోహపరవశులై నిన్ను కడునిడుమలపాల్సేయక విడువరు; కావున నీవు స్త్రీరూపధారివిగాకుండ నీ పురుషాకృతితోడనే భవత్సోదరు డిందువచ్చుదనుక వేచియుండుము; నాతండ్రిపనుపున మఱికొందఱు చారులు నీసోదరు నన్వేషింప నరిగిరి. వారెట్లైన ననతి కాలంబుననే వారి నిందుగోని రాఁగల"రని హితంబువలుక, నామెవల్లేయని పలికి యక్షేశ్వరునిచే సన్మానింపఁబడి జామాతంబోలె సర్వసౌఖ్యములం గాంచుచుండెను.

ఇదియిట్లుండ, నారదమహర్షి యాశ్రమమునందున్న నీలకేతనుని యక్షదూతలు చిత్రపటసహాయంబునగుఱ్తించి నారదసందర్శనం బొనరించి యక్షేశ్వరు నిద్దేశంబు నాసంయమి కెఱింగించి, యానీల కేతనుని దమ వెంటనిడుకొని యక్షలోకంబునకరిగిరి, యక్షరాజు నీల కేతనునిగాంచి యాశ్చర్యపడి చారులపై గుపితుఁడై "ఓరిమందమతులారా! వీఁడె వ్వఁడో కపటవేషధారి, మీరు వీనిమాయాజాలములందగులుకొంటిరి. నాయల్లుడు నాయింటికి వచ్చి బహుదినంబులయ్యె; ఈకపటియెవ్వఁడో వీనిని కారాగారమున బంధింపుఁ" డని పలుక, నీలకేతనుఁడు తత్పరాభవంబు నోర్వఁజూలక, ప్రళయకాలరుద్రునిగతి మండిపడి, యక్షలోకమును భస్మీపటలంబుగావింప నుద్యమించుతరి, కళానిలయ సర్వోదంతము నాకర్ణిచి, సంభ్రమంబున నటకరుచెంచి యావత్కథను తండ్రి కెఱిఁగించి మున్ను జామాతగాన్నుది నీలకేతను సోదరియని తెలియజేసి, ప్రియుని కేల్వట్ట నాయక్షపతి పశ్చాత్తప్తుఁడై యల్లుని క్షమార్పణముం గోరి కళానిల యానీలకేతనుల కతివైభవంబున గల్యాణంబొనరించెను. కతిపయదినంబులు నీలకేతనుఁ డందుండ నాతనికొక పుత్రరత్నంబుదయించె. అంతట బాలునకతి విభవంబున జాతకర్మనామకరణాది శుభకార్యంబు లొనర్పంబడియె. అంత నీలకేతనునకు మణిమంజరి స్మృతికి వచ్చుటయు నాతఁడు మామగారితో తదభిలాషముం దెలిపి నిజపుత్ర జాయాసహోదరీ కతిపయపరివారధనకనక సమేతంబుగ యక్షేశ్వరుం డొసంగిన పుష్పకంబునధిరోహించి కుంతల రాజ్యంబునం బ్రవేశింప నారాజేంద్రుఁ డాతనిరాక నెఱింగి పరమ ప్రీతి నాతనినాహ్వానించి పర్వంబుగా నానందించెను. అంతనొక శుభ దినంబునఁ మణిమంజరీ నీలకేతనులకును, పాంచాలా మాణిభద్రులకును కల్యాణంబులయ్యెను. కల్యాణానంతర మొక్క మాసంబునకే మణిమంజరి దేదీప్యమానయై వెలుంగు నొకకన్యకం బ్రసవించెను. అనంతరమానీలకేతనుఁడు, భార్యాయుగళమును, పుత్రికా పుత్రకులను వెంటనిడుకొని. సోదరితోడను, బావమఱఁదితోడను గదలి నిజరాజధానికరిగె. పుత్రవిశ్లేషంబునను జరాభారంబునను వ్యాధిశయ్యాగతుండైన సూర్యకేతనమహారాజు నిజకుమారాగమనంబుల కలరి, రాజ్య భారంబు నాతనిపై నిడి తాను వానప్రస్థాశ్రమ స్వీకారంబొనరించే, నీల కేతనుండును బహు వర్షములు రామరాజ్యముంబోలి ప్రజాపాలనం బొనరించి సత్కీర్తిగణించెను.” అని శ్రీకృష్ణుం డర్జునున కెఱిగించెను.