పండ్రెండు రాజుల కథలు/కామవర్ధనమహారాజు కథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ఆఱవనాటిరాత్రికథ,

ఆఱవనాటి రాత్రియుం బూర్వోక్తప్రకారంగా విజయాచ్యుతులు యమునానదీతటంబునం దాసీనులైన తరి నర్జునుఁడు “బావా! నీదయా రసంబున నిప్పటికీ, ముముక్షమార్గబోథకంబులగు ధర్మంబుల నైదింటిని నాకర్ణించితిని. "నేటి రాత్రి యాఱవది యగు, సచ్చిదానందంబు నెఱిఁగింపుము నావుడు భగవంతుఁడు బావమఱఁదికిట్లనియె. “ధనంజయా! సచ్చిదానంద తత్త్వదోధకంబగు, కామవర్ధన మహారాజు పుణ్య చరిత్రంబు గల దద్దానిని నాకర్ణింపు"మని యాచరిత్రంబు నిట్లని చెప్ప దొడంగెను.

కామవర్ధన మహారాజుకథ.

మున్ను కాంభోజ దేశముం బరిపాలించు కీర్తివర్ధన మహారాజునకు కామవర్ధనుం డను నాలిగేండ్ల కుమారుఁడుగల్లి, ధర్మపత్ని యగు విపులాదేవి గర్భవతియై యున్న శుభకాలంబున విధి చాలమింజేసి, శత్రురాజులు దండెత్తివచ్చుటయు నారాజన్యుఁడోపినంతపట్టు వారితో రణంబొనరించి, తుదకు పోరంజాలక గర్భవతియగు విపులా దేవితోడను, కుమారుఁడగు కామవర్ధనునితోడను, శాంతయను నొక దాసితోడను దుర్గాంతర్భాగ నిర్మితంబగు గూఢమార్గంబునంబడి, పాదచారియై విదేశముల "కుంబారి పోవ శాత్రవులు నిరభ్యంతరముగ దుర్గంబునాక్రమించిరి. అట్లు గాఢాంధకార సాంద్రంబగు నాగుహలోన, మున్ముందు రాజును, ఆవెనుక, కామవర్ధను నెత్తికొనిన శాంతయు, నందఱికన్న వెనుక గర్భభరాలనయగు విపులయు నడచుచుండ, చిమ్మచీఁకటిలో మార్గముంగానక, విధివశంబున నాగుహలోనంగల మూడుదారులంబట్టి మువ్వురును జనిరి. కామవర్ధను నెత్తుకొని చనుచున్న శాంత పెద్ద పెట్టున నెలుంగెత్తి రాజును రాణినిం బిలిచిపిలిచి వేసారుచుండ నాగుహ ప్రతిధ్వనులనిచ్చుటదప్ప కార్యంబు గలుగదయ్యెను. అంత నాదాసి యాశోపహతయై యాహార నిద్రాదులు లేమి సొమ్మసిలి యొక వృక్షచ్ఛాయను బాలునితో నిద్రింపసాగెను. ఇంతలో నరుణోదయంబగుటయు నాకుమారుఁడు మేల్కాంచి, "యమ్మా యమ్మా" యని పిలిచి యేడ్చి, దాదివినా యితరులం గానక బెంగటిల్లి తప్పుడడుగుల నిడుచు మెల్లన దాదిని వదలి యా యడవిని కొండొకదూరము నడువ నొకచో నాచిఱుతని కోమలచరణంబున నొక నిశితకంటకము నాటుకొని రక్తధారలుగారఁ దొడంగెను. బాలుని శోకారావంబు నొక హనుమద్వానరం బాకర్ణించి, పరుగు పరుగున నరుదెంచి బాలుని పదకంటకంబు నూడ బెఱికి యొక ననౌషధిందెచ్చి గాయంబుపై రుద్ది బాలునితో నాడు కొనుచుండెను. తత్సమీపంబుననేయున్న యొక గొల్లపల్లియ కధికారి యగు నానందుండను వాఁడు బాలుని, బాలునితో నాడుకొనువానరముం గాంచి యా కోతిని భీతనుగావించి పోద్రోలి, దిక్కులేక , ముద్దులుగుల్కు మోముతోనున్న కామవర్ధను నెత్తి ముద్దాడి, యనపత్యుండగు తనకీశ్వరుండిచ్చిన బాలునిగా దలంచి వానికి హరిదత్తుండను నామంబునిడి, వాని మణిబంధమునంగల రక్షనుగాంచి దాని యాధారంబున బాలుని చరిత్రము నెఱుఁగ వచ్చునను నాశతో పల్లెకుం గొనిపోయి వృద్ధురాలగు తన యవ్వ కిచ్చెను. ఆ యవ్వయు బాలు నతిగోమునఁ బెంచుచు, కాలక్రమంబున విజ్ఞానశీలుఁడగుచున్న యా కుఱ్ఱని కఖిల రాజన్యుల చరిత్రంబులను దెలుపుచుండెను. ఆ పల్లెయందేయున్న యొక బ్రాహ్మణుఁడు హరిదత్తునకు తాఁ గఱచినంత పట్టు విద్యలను నేర్పినంత, హరిదత్తుం డంతట దృప్తినందక, సమీప పట్టణములనుండి, సద్గంథములను, దెప్పించుకొని, క్రమంబున స్వయంకృషిచే నఖిలవిద్యలందునుఁ బాండితిం గాంచి యా పల్లెయందలి గొల్లపిల్లలకు రేడై పశుపాల నోద్యోగంబున నడవికంపఁబడినపుడు, వారిని పరిపాలింపుచు, "పెద్ద లెఱుంగకుండ నాయడవిలో హరిదత్త సామ్రాజ్యము నొండు సంస్థాపించెను. కొన్ని దినంబులిట్లు జఱుగ, నావిపినంబునకు నేపాళ దేశాధిపతి మృగయార్థ మరుదెంచి, యొక వారము దినములందుండెను. ఆ తరుణంబున హరిదత్తుఁ డవ్వకడకరిగి నేపాళాధీశుని బిరుదంబు లెట్టివియో కనుంగొని, తన భృత్యులం గొందఱి——నపురూపాటవిక వస్తునిచయంబులతోడ నారాజుకడ కంపుచు నొక లేఖ నీక్రింది విధంబున రచించెను.

“సమదారాతి విజయ విజృంభమాణభుజపరాక్రమక్రములును, నేపాలభూపాలోత్తములును నగు, ధనంజయరాజచంద్రులకు——హరిదత్త చక్రవర్తి స్నేహపూర్వకముగ వ్రాయు లేఖార్థములు.——రాణ్మణీ!—— ఇంతవఱకు మాయాజ్ఞ నందక మాభూములకు మృగయార్థమరు దెంచిన వారు గానరారు. మీసాహసకార్యంబునకు మేమాశ్చర్యమునందినను, మీరు నూతనముగ రాజ్యమునకు వచ్చిన బాలురగుటచే మేము మీ స్నేహమునుగోరి, మీ కార్యము నోకతప్పుగా గణింపమైతిమి. ఇందువెంట మీకు గొన్ని యపురూపవస్తువులను బహుమానముగఁబంపితిమి. స్వీకరించి చిరకాలము మాకుహితులై యుందురుగాక! —— ఇట్లు, హరిదత్త చక్రవర్తి.

ధనంజయరా జీలేఖనుజూచి గుండెగొట్టుకొనియెను. అతఁడు నూతనముగ రాజ్యమునకు వచ్చినందుననే యేరాజు లెదెందు పరిపాలించుచుండిరో యెణుంగనివాఁడగుటను, హరిదత్త చక్రవర్తియను సంతకంబుండుట చేతను, తాను సామాన్య రాజమాత్రుఁడై తనకన్న నదికుఁడగు నొకచక్రవర్తి కలుక గల్పించితిని కాబోలునని తలంచి, యాబహుమానంబుల స్వీకరించి వానింగొనిచనిన, యాదవబాలుని గొప్పగా బహూకరించి, యనర్ఘ్యమణిభూషణ చీనిచీనాంబరాదులను, అనేక పారశీకాశ్వములను పదియేనుగులనుబంపి క్షమార్పణపత్రికను వ్రాసికొనియెను. మణికొన్ని నాళ్లకు కళింగ దేశపు రాజు వేటకురాగా నాతనికిని వెనుకటియట్లె లేఖనురచించి, నేపాళ రాజుచేఁ బంపఁబడిన వానినన్నిటి నాతనికంప నాతండును వెఱగుపడి యంతకు నాల్గు రెట్లుగా నాతఁడు బంపెను. ఈ విధంబున నటకు వేటకువచ్చిన ప్రతి రాజునకు ఒకరుపంపినవాని నొకరికి పంపుచు నపారధనసంచయంబును సేకరించి, దానితో ప్రతిపట్టణమునందును, హరిదత్తచక్రవర్తి పేర సత్రములగట్టించి యశేషకీర్తివిస్తారుండయ్యెను. హరిదత్త చక్రవర్తి నెవ్వఱు, నెఱుంగకున్నను, లోకమంతయు నాతని నెఱింగియుండెను. ప్రతి రాజునకు నాతఁడు మిత్రుఁడై యుండెను. రాజు లెల్లఱు నాతనిగాంచ నభిలషించుచుండిరి. అంత నొకనాడు హరిదత్తునకు లోక సంచారంబొనరింప గోరిక వొడమ, తన బాల్యమిత్రుండగు వసంతునితో నాలోచించి, పెద్దల యానతినంది, యొక శుభ ముహూర్తంబున బయలు వెడలెను. కతిపయదినంబులగా మిత్రద్వయంబును, విదర్భ దేశంబున కరుదెంచి యందు హరిదత్తుని సత్రంబున వసింప నా సత్రాధికారి వారికి తైలాభ్యంజనస్నానమొనరించి, పంచభక్షపరమాన్న సహితంబగు భోజనంబునిడి హంసతూలికా తల్పంబున శయనింపఁ జేసి, పాద మర్దనంబునకు సేవకులను నియమింప నాతడాశ్చర్యమునందియు——తన్నువారు గుఱ్తించియుందురా యని సందేహించియు, గల్లోలపడుచుండ వసంతుడది యెఱింగి పకపక నవ్వి——"మిత్రమా! ఈ సపర్యలు మనకే కాదు. అతిధులకందఱకును జఱుగుచున్న యవి. ఇట్లు మనము శాసించితిమి, నీవు మఱచి తబ్బిబ్బగుచుంటి" వని పల్కి యటఁగల హరిదత్త లిఖతంబులగు శాసనపత్రికలం జూపి సందేహవర్జితుం జేసెను. అట కరుదెంచిన యతిధులు తదీయ సత్కృతులకలరి, "భళీ హరిదత్తచక్రవర్తీ !" యని కీర్తించువారును, ఆతనిపై పద్యములను కీర్తనలను గోడలపై వ్రాసి చనువారును, ప్రత్యక్షముగ నాచక్రవర్తి దర్శింపఁగలవాఁడు కుబేరసమానుండుగాడేయని తలంచువారునై యుండ, హరిదత్తుం డిది యెల్లగాంచి మహానందపరవశుండై వసంతునితోగలసి యా దినంబున వాహ్యాళికరిగెను. విధిసంకల్పంబున నా యుద్యానవనంబునకే, యా విదర్భరాజనందిని యగు జగదేక సుందరియు—— కూరిమి చెలియగు విలాసినితోఁగలసి విహరింపవచ్చెను. ఆకాంత యందందువిహరించుచు, సంకల్ప రహితంబుగ నాహరిదత్తుంగాంచి మించిన మారువిరాళికి లోనయ్యె, హరిదత్తుండును నాకన్యనుగాంచి, “యయ్యారే! ఇది మనుహ్యంగన యగునా? ఐనచో విధాతచాతుర్యము ప్రస్తుతిపాత్రముగదాయని తలంచుచు మైమఱచి, యుండునంతలో సఖీప్రోద్బలంబున నాయెలనాగ యచ్చోటువాసిచనియె. హరిదత్తుండంత చేయునది లేక వసంతునితో మఱిమఱి యాబాలసోయగంబునే వర్ణించి చెప్పుచు సత్రఁబునకరిగి మదనజరార్తుండై యారేయియెల్ల వేగించెను. ఇట జగ దేక సుందరియు హరిదత్తుని రూపలావణ్యాదులనే విలాసినికి వర్ణించి చెప్పుచు "నో చెలియా! కంతుజయంత వసంతాదులను మీఱిన జగన్మోహనరూపంబుతో నొప్పారు నాయందగాఁ డెవ్వడే? ఆతఁడు నామనంబు నపహరించుకొని పోయెఁగదే! అతని పొత్తుగూడని యాడుదానిజన్మమేలనే? యని జాలి గదుర బలుక, విలాసిని తన నేర్పున హరిదత్తునియునికి నెఱింగి, యాతనితోఁ బరిచయముచేసికొని చమత్కారముగ నాతని హృదయంబును జగదేక సుందరిపై హత్తియుండుటనుగ్రహించి, “యోరాజకుమారా! నీవు కరుణింపకుఁడిన నా చెలి బ్రతుకు వట్టిదగును. ఇందులకొక వెఱ వూహించితిని, ఇది గౌరవహీనంబనితలంపక నీవొకయాఁడు వేసంబునఁ దొలుత నాయింటనుండుము. అటకు, శకటారూఢయై నా చెలి యరు దెంచ, మనమిణువురము జెలులభాతి నాశకటము పై నెక్కి, యూరి వెలుపలంగల, లీలోద్యానమందిరంబున కరుగుదము. సాయంకాలము దనుక నందుసుఖలీలలం దేలనగు పిదప మనము గృహంబునకు రాగా రాకుమారి దివాణంబునకు జను"నని యుపదేశించి యదేవిధానంబున జగదేక సుందరీ హరిదత్తుల కనుదినమును సమావేశముం గల్గించుచుండెను. వసంతుఁడు తనమిత్రుని కార్యంబు నెఱింగి, యిది ప్రమాద కరంబనియు, శీఘ్రముగ విరమింపుమనియు నెంతయో బోధించెఁగాని రాజపుత్రికా ప్రేమ బంధంబులం దవుల్కొనిన హరీదత్తుని చెవి నామాటలు నాటవయ్యే. ఇట్లు కొన్ని దినంబులు గడువ నెవ్వరో—— విదర్భ రాజుపేర——"నో గుడ్డి రాజా! దినదినంబున నీతనయ, యొక వైదేశికుని తోడ నీలీలో ద్యానమందిరమున మదనసుఖంబులఁ గాంచుచు సాయంకాలమున కింటికి వచ్చుచున్నయది. ఇది నీవు గుఱ్తింప కున్నావు, తెలివిగలవాఁడవేని తోడనే చని వానిని బంధింపు" మని సంతకము లేని యొక లేఖను వ్రాసి పంపిరి. విదర్భాధిపతి యా లేఖం జదువుకొని తోఁక ద్రోక్కిన కాలాహిగతి నాగ్రహించి, యంతఃపురంబున కప్పుడే చని కుమార్తెజాడనారసి యామె నిజముగా లీలోద్యానమందిరంబున కరు గుట నెఱింగి మరింత యాగ్రహముతో నటకరుగ రాజు రాకను దూరము నుండియే గ్రహించిన విలాసిని, రయంబున నరుదెంచి ప్రమాదంబువచ్చెనని రాజపుత్రు నోక నిగూడనికుంజాంతరంబున దాచి యేమియు నెఱుంగని భాతి రాజపుత్రికతో పాచికలాడుచుండెను. ఆగ్రహముతో నటకువచ్చిన రాజు పరపురుషునెవ్వని నందుగానక, యప్పటికి చీఁకటులు దిశల నాక్రమించుటచే, నాయుద్యానవనమునుండి యెవ్వరిని బయటికిగాని బయటివారిని లోనికి గాని యుదయమువఱకుఁ బోనీయవలదని రక్షకభటులకు దీవ్రమైన యాజ్ఞ నొసంగి యుదయంబున నా యంతః పుర ద్రోహిని వెదుకవచ్చు, నెందు బోవునని తలంచి నిజకుమారీ సహితుఁడై నగరి కరిగెను. జగదేక సుందరి యా రేయి భోజనంబు నొల్లక, తన మనోహరున కెట్టి కీడుమూడునోయని యాక్రందించుచుండ విలాసిని యామె కొక యుక్తి నుపదేశించి, “రాజపుత్రికను పాముకఱచినదని " పెద్ద యల్లఱి చేసెను. ఆ కోలాహలంబు నాలకించి రాజును రాణియు నశేష జనంబును నందుగుమిగూడి వాపోవదొడంగిరి. ఆస్థానమునందు పేరందిన వైద్యులందఱు మంత్ర తంత్రౌషధుల నుపయోగించి చూచిరిగాని యవియెల్ల బూదింజల్లిన పన్నీటివలె వ్యర్థంబులయ్యె. అంతవిలాసిని రాణితో “అమ్మా! నే నొకపాముమందు నెఱుంగుదును. కాని యది మన విలాసోద్యానంబునంగలదు. సాయంకాలంబున ప్రభువువారేలనో, తెల్లవాఱుదనుక బయటివారినిలోనికిని లోని వారిని బయటికిని బోనీయవలదని యచటి భటులకాజ్ఞయిచ్చిరి. నన్ను మాత్రము వదలుటకు ప్రభువువారాజ్ఞాపత్రిక నొసంగినచో నీక్షణంబున నాయోషథింగొనివచ్చి నాచెలిని బ్రతికింపఁగల"నని పలుక, రాణి “యోసీ! ఇంత సేపటి నుండియుఁ జెప్పనై తివేలనే? ఎట్లైన నాబిడ్డను బ్రదికింపవే! ఆజ్ఞాపత్రమెంత? నిమిషంబున నిప్పింతు" నని పలికి, రాజుచే నట్టిపత్రిక నిప్పించి విలాసినినంపెను. అంత నావిలాసిని వనపాలకుల కాశాననముంజూపి, యధేచ్ఛగా లోనికరిగి రాజకుమారుంగలసికొని జఱిగిన సంగతింజెప్పి, యాతనికి తన వేషము వేసి బయటి కంపెను. 'రాజభటులావ్యక్తిని విలాసినిగా భావించి పోనిచ్చినంతం గొంతవడికి విలాసినియే వచ్చి వారికొకమూలికంజూపి "పోయెద" నని పలుక వారు విలాసినిని గుఱ్తించి, “యౌరా! మోసపోయితిమని భావించి కన్నములోనిదొంగకు తెలుగుట్టినట్లు వాయెత్త వెఱచిరి. విలాసిని రాజపుత్రికకు మంత్రించు నెపంబునఁ జెవిలో రహస్యంబుగ “రాజపుత్రుఁడు క్షేమముగ వెడలిపోయె" నని తెలుప నామే యారోగ్యశాలినియై యందఱు కానందముం గలిగించెను. హరిదత్తుఁడు వసంతునితో జఱిగినవిషయములం దెలిపి, “మిత్రమా! ఈయూర నింక నేనుండుట ప్రమాదకరము. కావున నే నందందు సంచరించి యొకమాసంబున కిందువచ్చెదను. అంతదనుక నీవిందుండి విలాసినివలన విషయంబులం దెలిసికొనుచుండు"మని పలికి యాతని నొప్పించి యెం దేనింజనియె. అట్లు బహుదూరఁ బరిగి హరిదత్తుం డొకనాటి రేయి యొక యరణ్యంబునంగల కాళికాలయంబున నిద్దురరాగా నట శయనించెను. ఆరాత్రి నడుజాముమీరినపిదప, నటకైదుగురుదొంగలు విశేషంబగు ధనసంచయంబుతో నరుదెంచి, తమలోఁదమకు పాళ్లు దెగక, కలహించుచు, నింతలో హరిదత్తుంగాంచి యాతని పై గవయ నెంచ, హరిదత్తుం డాగ్రహంబున విజృంభించి యాయేవురిని కాళికకు బలియిచ్చెను. అంతఁ గాళికాదేవి, యారాజపుత్రునకు బ్రత్యక్షమై—— “యోరాజకుమారా! నీవు చాలనదృష్టశాలివి. ఈయేవురును ఏకగర్భ జనితులగు బ్రాహ్మణసోదరులు; విధివశంబుననిట్లు చౌర్యపరతం దవిలి, మహాధనసంచయంబులగూర్చి యిందునిక్షేపించిరి. ఈయమావాస్య నాడు ఏకగర్భజనితులగు నేవురు బ్రాహ్మణులను నాకుబలియిచ్చిన పుణ్యాత్మునకుఁ బ్రసన్నమగుట నా కొకదీక్షగలదుగాన నిన్ననుగ్రహించితి. మఱియు, తద్ధనసంచయం బెల్ల నీకొసంగుటయేగాక, దేవమునులకైన నలవిగాని సచ్చిదానందమహాత్మ్యము నెఱిఁగింతు నాలకింపుమని సాంగముగవంచించె.

అనంతరం బాహరిదత్తుండు కాళికావరప్రసాదలబ్ధుడే తద్దత్త ధన నిక్షేపంబుల నందే, నిక్షిప్తపఱచి, కాళిక పాదంబులకు మ్రొక్కి సెలవంది, భోజదేశంబునకరుగ, నట నారాజపుత్రికయగు చారుదత్త కళ్యాణార్ధమారాజోక మత్స్యయంత్రంబును నిర్మించి, దానిని భేదింపఁగల శూరునకు చారుదత్త నిత్తునని ప్రకటించెను. హరిదత్తుం డావింతను చూచి పోవలయునని, యాయూరనొక ఫూటకూళ్ల పెద్దమ్మనింటనిలువ, మార్గంబున నెం దేనింజను నొక దివాణపుదాసి, హరిదత్తుని నిదానించి చూచి, యానందముతో, "ఆర్యా ! బహుకాలమునకు దర్శనంబిచ్చితిరి? ఎందేగితిరి? మీరు చెప్పకుండ వెడలిపోవుటఁజూచి, మా చెలి యగుచారుదత్త బెంగ పెట్టుకొనియున్నది. మత్స్యయంత్రమును భేదించి మీరు పరిణయంబగుదురని మాచెలి గంపెడాశతోనున్నది. అట్లు నావంక తెల్లపోయిచూచెదరేమి? నేను మిదాసినగుచతురనుగానా? సాయంకాలమున మా చెలి యుద్యానంబునకు వచ్చును. దర్శనంబిచ్చెదరా? ” యని యడుగుచుండ, హరిదత్తుండాశ్చర్యపడి, తన్నుఁబోలిన వానినెవ్వనిగనో యది భ్రమించుచున్నదని తలంచి, తద్భావంబును బహిర్గతపరుపక , యప్పటికిం దగుసమాధానంబుల నొసంగి దానిని తృప్తిపఱచి పంపి, కాళికాకృపారసంబున నామత్స్యయంత్రముంగొట్టి, భోజరాజు నాతఁడే హరిత్తచక్రవర్తియని యెఱింగి మహానందమందిన చారుమతిం బరిణయంబాడుమనిపలుక తనలో, "అరరే ! దాసిమాటలంబట్టిచూడ నన్ను బోలినవాని నొక్కని నింతకు మున్నీ యెలనాగ కామిం చెనని తేలుచున్నది. అన్యాపహృతమానసియగు నీబాలను నేనెట్లు చేపట్టుదును? ఆపురుషుని నిక్కు వంబరసి వానికే యీ బాలికనిచ్చుట కర్జం" బని తలంచి "యోరాజేంద్రా ! నేనిప్పుడోక దీక్ష యందున్నాను. మీతనయను సపరివారంబుగ నావెటంగొనిచని, మాయింట వివాహంబాడెద, సెలవొసంగుఁ" డని పలుక నారాజు వల్లేయని అతని వెంట ప్రబల సేనను దాసదాసీజనులను, యమూల్యంబులగు కట్నంబులను నిచ్చి చారుమతితో బంపెను. అట్లు మహాట్టహాసంబున బయలు వెడలిన హరిదత్తుండు కతిపయదినంబులకు విదర్భకరు దెంచి యూరిబయట బసల నేర్పఱచి, సత్రంబుననున్న వసంతునకు వార్తనంప నాతఁడరు దెంచి జఱిగిన వృత్తాంతం బెల్ల నాకర్ణించి, “ మిత్రమా! నీవిట నుండి చనిన కొన్ని మాసములకు జగదేక సుందరి కొక దేదీప్యమానుండగు కుమారుండుగలిగెను. అంత నీయల రేడు లోకాపవాదంబునకు వెఱచి, నీపోబడినరయుతలంపున, నన్ను బిలువనంపి ప్రశ్నింప నీవేహరిదత్తచక్రవర్తి వనియు, నీ వెచటనుండినదియు నే నేఱుంగననియు వాస్తవంబుఁ జెప్పితిని. అంత నారాజు నీవంటివాడు తన కల్లుం డయ్యె కదాయని తన భాగ ధేయముం గొనియాడుకోనుచు నీకై సమస్త దేశంబులకు వార్తలనంపెను. పురజనులందఱును నీరాకకానందముతో వేచియున్న వారు. యాచకులు, బ్రాహ్మణులు, కవులు, దినదినంబుకు నాకడకు వచ్చి నీ చరిత్రంబునడిగినదే యడుగుచు, విసుగు బుట్టించు చున్నారు. ఇది యిట్లుండ గొన్ని దినంబులకు పూర్వము, అచ్చముగ నీరూపు రేఖలం గల్గినవాఁడును నీకన్న నొక్కింత చిన్న వాఁడును నగుయువకుం డొకడీపురంబునకు రాగా, విలాసిని యాతనింజూచి నీవని భ్రమించి నిర్బంధంబున రాజనగరికిం గొనిపోయి రాజునకు రాజకుమార్తెకును జూపగా వారెన్ని విధంబులనో ప్రార్థించిరిగాని వాఁడు తాను హరిదత్తుఁడం గానని వాదించెను. అంత నేనాతనింగని, "రూపంబున నట్లేయున్నను ఇతఁడు నామిత్రుఁడు కాఁ"డని పల్కితిని. ఇప్పు డాతఁడు రాజప్రాసాదమునందే యున్నాడు. నీవు చెప్పిన భోజదేశ వార్తలను బట్టి చూడ, చారుదత్త వలచిన నీ రూపుగలవాఁడే యితండని తోచెడును. ఆబాలకు నెన్ని విధంబుల దఱచి యడిగినను తన చరిత్రముం జెప్పక నిరంతర మెద్దియో విచారించుచుండును. ఇక్కడి వృత్తాంతమిది" యని తెలిపెను, అంత, హరిదత్తుఁడు స్వపరివారము నందే యుంచి, వసంతద్వితీయుఁడై వెనుకటి సత్రంబునకరిగి, యందు వెనుకటి వలెనే ప్రచ్ఛన్నంబుగ నుండ యధావిధంబున తైలాభ్యంజనం బొనరించు నెడ తలయంటుచున్న దాసి, హరిదత్తుని మణి బంధమునంగల, రక్షం గాంచి పెద్దగా నొక్క కేక వేసి, “హా! కామవర్థనా! కామవర్థనా! నాతండ్రీ! ఎన్ని నాళ్ళకు గనఁబడితివిరా నాయనా!" యని పలుకుచు వెఱ్ఱిదానివలె గంతులు వేయుచు, నానందాశ్రువులు వరదలై ప్రవహింప, మాటిమాటికి నాతని ముద్దిడుకొనఁ దొడంగెను——ఆదాసి విపరీతచర్యలు తనకర్థముగాక హరిదత్తుఁ" డవ్వా! నీకు వెఱ్ఱియెత్తినదా యేమి? ఇట్లేల పల్కెద"వని యడుగ, నాదాసి, తాను శాంతయగుటయు, వెనుక నష్టవిభవులై యాతని మాతాపితలును తానును గుహలోనుండి పారిపోవుచు వేరగుటయు నెఱింగించి——"నాయనా! ఆనాడు నేను నీతలిదండ్రులంగానక నీతో నొక వృక్షచ్ఛాయకువచ్చి శనివలె నన్నావహించిన నిద్రావేశంబున బడలినిద్రించితి. కొండొకవడికి లేచి చూడ నీవెందునుం గానరాకున్నంత నీ వేయడవి మృగంబుల వాతంజిక్కి తివోయని దుఃఖించుచు, సకలపుణ్యక్షేత్రములం దిఱుగుచుంటిని. నేటికి వింశతిదినంబులకు బూర్వము జగన్నాధ క్షేత్రమున నొకచోభిక్ష మెత్తుకొనుచున్న నీతలిదఁడ్రులంగాంచి నీదుర్గతి నెఱింగింప వారుదుఃఖించి, మార్గమధ్యంబున నీజనని కొక పుత్రుండు గల్లెననియును వానిని పోషింపలేక, కాళీపురంబున విష్ణు పాదుఁడను నొక విప్రునకు పెంచుకొన నిచ్చితిమనియుం జెప్పిరి. ఇప్పుడు నీతలిదండ్రులీసత్రంబుననే యున్నారు. రమ్మని——యాతనింగొనిపోయి వారలంజూప——బహుకాలానంతరంబున సమావేశంబైన యాజననీ జనకుల యొక్కయు పుత్రుని యొక్కయు, నందఱకన్న దాసియొక్కయు నానందము వర్ణనా తీతంబై యుండెను. ఈలోన వసంతుఁడిక దాపనేలనని రయంబున రాజమందిరంబునకరిగి “మియల్లుం డరుదెంచె" నని వారల కెఱిగించెను. హరిదత్తచక్రవర్తివచ్చె ననువార్త క్షణంబున నగరం బెల్లవ్యాపింప, నా బాలగోపాలం బాసత్రంబున నిసుక వేసినరాలనట్లు నిండి పోయెను. విదర్భరాజు సాలంకృతంబులగు పట్టపు టేనుంగులపై మహావిభవంబున నల్లుని వసంతుని వియ్యంకుని, వియ్యంపురాలిని, నగరికింగొనిచని మహానందపరవశుం డయ్యెను. హరిదత్తుఁ డచ్చముగ తన ప్రతిచ్ఛాయంబోలి జనించిన కుమారునెత్తి ముద్దాడుచు నిజసతీమణికిని, విలాసినికిం బ్రియంబు చేకూర్చి, పిదప, తనవలెనే యున్న యాయువకుని రహస్యంబుగఁ బిలిచి, "నాయనా! నీవు నావలె నుండుట కేమికారణము నీ తలిదండ్రు లెవ్వరు? ఇట్లేలవచ్చితివి? నీచరితంబును దాచక నా కెఱిఁగింపు" మని యడుగ నాతఁడు, "రాజచంద్రమా! నేను వారణాశీపురంబు నందలి విష్ణుపాదుండను విప్రునకు దత్తపుత్రుండను. నన్నెవ్వరో రాజదంపతులు బాల్యంబుననే యాతనికొసంగి చనిరట! ఆవిప్రుఁడు నన్నతిగోపమునం బెంచి సమస్త విద్యావిశారదునిగా నోనరించినను నావిధి వక్రగతి నుండుటంజేసి యా విష్ణుపాదుని తృతీయకళత్రము, నాకు యౌవనంబు వచ్చినంతనే , నాతోడి దుస్సహవాసంబు నభిలషించి నే అను మతింపకున్నంత, చిత్రాంగివోలె రోషంబువహించి తన పతితో నాపై గొండెములు పలికి నన్ను గృహమునుండి వెడల నడిపించెను. అంత నేను నిరాధారినై యందందు దిరుగుచు, భోజరాజ్యంబున కరిగి యందోక యుద్యానవనంబున గూర్చుండియుండ నా దేశాధీశ్వరుని తనయ యగు చారుదత్తయు, సఖియగు చతురయు నటకు విహారార్థ మరుదెంచిరి. అంత నా చారుదత్త నన్ను గాంచి మోహవశయై చెలితోడ రాయబారం బొనరింపంజేసి రేపటి సాయంకాలమున కిటకు మరల రమ్మని యట్లు నాచే బాసచేయించుకొని యానాటికి నన్ను వదలి చనిరి. అయ్యది ప్రమాకరంబని నేను భీతిల్లి యాపురంబును వదలి యిటకురాగా నిట" నీవే హరిదత్తచక్రవర్తివని పల్కి నన్నీ రాజన్యుఁడు నిర్బంధించె. కాని తమ మిత్రుఁడు ననుఁగాంచి యీతఁడు హరిదత్తచక్రవర్తి కాడని పలికెను. నాటినుండియు నేనిందే యుంటిని ఇదియే నాచరిత్రం" బని పలుక హరిదత్తుఁడు (కామవర్ధనుఁడు) ప్రమోద బాష్పంబులు కన్ను లంగార సోదరాయని యాతని నాలింగనము చేసికొని సర్వవృత్తాంతము నాతని కెఱిగించెను. ఈ విధంబున నష్టపుత్రలాభంబునందిన తలిదండ్రులగు విపులా కీర్తివర్ధలు పుత్రులం గౌగిలించుకొని పరమేశ్వర ధ్యానంబు సలిపిరి. అంతట——హరిదత్తచక్రవర్తికిని జగదేక సుందరికిని, హరిదత్తసోదరుడగు కాంతివర్ధనునకును చారుదత్తకును కల్యాణంబులనువార్త సమస్తదేశంబులకుం బ్రాకిపోయెను. చిరకాలమునుండియు హరిదత్తచక్రవర్తిని దర్శింప నభిలషించుచున్న సమస్తదేశాధీశులును దేశీయజనంబులును నేలయీనిన చందంబున విదర్భాపురంబున కరుదెంచిరి? కామవర్ధనుఁడు కాళికాలయంబున దాచిన యశేషనిక్షేపంబు నర్థులకుం బరితృప్తికరంబుగ బంచి యిచ్చి, మహావైభవంబున సోదర ద్వితీయుండై కల్యాణంబొనరించు కొనుటయేకాక, విలాసిని నిచ్చి వసంతునకుఁ బెండిలిగావించి, తన్ను పెంచిన యాదవాధిపతియగు నా నందుని నవ్వను, బాల్యమిత్రులను నటకుఁ బిలువనంపి జగదానందకరుండయ్యెను. హరిదత్తుఁడే కామవర్ధనుండనియు రాజ్యం బన్యాక్రాంతంబైనదనియు నెఱిఁగిన సమస్తదేశాధీశ్వరులును, కాంభోజ దేశంబునకు దమ సైన్యంబులతో నరిగి శత్రురాజు పై దండెత్త—— నాతఁడు శరణాగతుండై రాజ్యంబునర్పించి తొలంగి చనియెను. ఈవిధంబున కామవర్ధనుండు, సోదరుఁడగు కాంతివర్ధనుని సహాయంబుననేకచ్ఛత్రంబున రాజ్యపాలనంబొనరించుచు, వృద్ధమాతాపితలకుం గన్నులచందమామయై యఖిల రాజమిత్రుఁడై——యాచక జనకల్ప భూరుహం బై పుత్ర పౌత్రాభివ్రుద్ధింగాంచి కాళికాక్రుపారసభాగ్యంబున బహుకాల మీభూతలంబున విలసిల్లెను.