పండ్రెండు రాజుల కథలు/రాజశేఖరమహారాజు కథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పదునొకండవ నాటి రాత్రికథ.

అనుదినాభ్యాస ప్రకారంబున, పదునొకండవనాటి సాయంసమయమునఁగూడ యమునాతీరమున నాసీనుడై నరుఁడు నారాయణుం దిలకించి, పదునొకండవ వేదాంతమార్గమగు ఎఱుక నెఱుకఁ జేయుమని వేడ మాధవుం డిట్లువక్కాణించెను.

రాజ శేఖరమహారాజు కథ

పాండు రాజకుమార! సనాతన కాలంబున, కాశ్మీర దేశంబున, దిలీపభూపతికి రాజశేఖరుండను కుమారుఁడును, రాజముఖియను పుత్రికయు నుండిరి. దిలీపభూపతి, పుత్రునకు చతుషష్టి కళలను, చతుర్వేదములను, అష్టాదశవిద్యలను, సాముగరిడీలను మున్నగు వానినెల్ల చతురులగు నుపాధ్యాయులచేఁ జెప్పించి ప్రవీణుం జేసెను. సకలవిద్యా రహస్య వేది యయ్యును రాజశేఖరుండు తన మదికి నచ్చిన కన్య లభింపమింజేసి, యవివాహితుఁడై నిరంతర గ్రంధపారాయణ పరాయణత్వమునఁ గాలముఁ బుచ్చుచుండెను.

ఇదియిట్లుండ భూలోక సంచారముం జేసి స్వర్గమునకుఁబోవుచున్న నారద తుంబురు లిరువురును గగనమార్గమునఁ గలసికొనిరి. అన్యోన్య కుశల ప్రశ్నానంతరము నారదుఁడు తుంబురునిఁ దిలకించి, "భూలోక వార్తలే "మని ప్రశ్నింప నాతఁడు “మిత్రమా! ఏమని చెప్పుదును? కాశ్మీర దేశాధిపతికి, రాజశేఖరుఁడను నొక కుమారుఁడు గలఁడు, వానిని సౌందర్యమున కంతు వసంత జయంతాదులైన గెలువఁజాలరు. ఇంతకన్న విశేషముగలదా?" యని పలుక, నారదుఁడు పెదవి విఱచి “ఆసౌందర్యమునే ఘనముగాఁ బొగడుచుంటివి. నేపాళ దేశాధిపతియగు ననంగసేనునకు, అనంగ సేన యను పుత్రికగలదు. దాని సౌందర్యముం జూచిన నీ వింక నెంతగా స్తుతించుచుంటివో——దానికి సతియు రతియు భారతియు నీడుగారని" పలుక, నావిషయంబున నారద తుంబురులకు పెద్దవాదము జఱిగెను. తుదకు వారా యనంగసేనా రాజశేఖరుల నొక్కచోఁజేర్చి యందమున నధికులెవ్వరో నిర్ణయింతమని యట్లుస్థిర పఱచుకొనిరి. ఆరాత్రి రాజశేఖరుఁడు నిద్రించుచుండ మచ్చుమందు జల్లి యాతని నభోతలంబునఁ గొనిపోయి—— నిద్రాముద్రితయైయున్న యనంగసేన శయ్యపైఁ బరుండఁ బెట్టిరి. కొంతరాత్రి కయ్యనంగసేన, నిద్రమేల్కని తనప్రక్క నొక మన్మధ ప్రతిమానుఁడగు రాజపుత్రుఁ డుంటకక్కజమంది, తన వ్రేలియుంగరము నతనికిడి, యతని వ్రేలి యుంగరముం దనచేత ధరించి యంతలో నారద తుంబురులు కల్పించిన నిద్రచే మైమఱచెను. తరువాత, రాజశేఖరుఁడు మేల్కని, యాసతి యెవ్వరో యెఱుంగక మోహపరవశుఁడై ముద్దిడుకొనుచుండగనే నారద తుంబురులాతనికి నిద్రంగల్పించి కాశ్మీర రాజాంతఃపురమున నతని శయ్యంజేర్చి రాజపుత్రిక యధిక సౌందర్యవతియని నారదుఁడును రాజపుత్రుఁడధిక సౌందర్యవంతుఁడని తుంబురుఁడుసు వాదించుకొనుచుఁ దమతమ మార్గములం బోయిరి. ఉదయమున లేచి రాజకుమారుఁడు గతరాత్రి తాను గాంచిన దెల్ల నొక కలయని భావించి వ్రేలికిం దన ముద్రాంగుళీయము లేకుండుటయు, నా రాజపుత్రిక నామాక్షరములుగల రత్నాంగుళీయక ముండుటయుం గాంచి పరమవిస్మయ పరీతస్వాంతుఁడై యావృత్తాంత మెల్లఁ దన సోదరియగు రాజముఖికింజెప్ప, తొలుత నామెయువిశ్వసింపక,యంగుళీయముం గాంచి తుదకు నమ్మెను.

ఆక్షణము మొదలు రాజకుమారుఁడతి బేలతనంబున వాపోవుచు, నాయనంగసేన సంగతిం గననినాడు—— ముక్తజీవి నయ్యెదనని పలుకఁ జొచ్చెను. ఆయనంగసేన యేదేశపు రాజపుత్రికయో ఎందుండునో యెఱుంగక రాజముఖి——యీవార్త రాజేంద్రున కెఱిcగించెను. దిలీప భూపతియు——బహుకాలమునకు, నిజనందనుని మానసము, కల్యాణ సుముఖమగుటకానందమునంది, అనంగసేనయను నాస్వప్న గత రాజకుమారి యేభూదారుని కుమారియో తెలియమింజేసి, భూమండలమండితులగు సకల మహీరమణుల పుత్రికా ప్రతిబింబ చిత్రముల సేకరింప, చారుల నలుదిశలకును బంపెను——

ఇట——రాజశేఖరుఁడు బలెనే, యట——ననంగసేనయు, మఱుసటి దినంబునఁ దన వ్యధను, చెలుల కెఱింగించుచు, రాజశేఖరుని యంగుళీయముం జూపి, యతనిందక్క వేఱుపురుషుం జేపట్టనోపనని దృఢతర ప్రతిజ్ఞా బద్ధయైయుండెను. దిలీపునట్లే——నేపాళ భూపాలుఁడగు ననంగసేనుఁడును, నిజకుమారికాభిప్రాయంబు నెఱింగి, సకల భూనాధకుమార ప్రతిబింబములం గొనితేర, సమర్ధులగు చారులనంపెను——కొన్ని దినంబుల కావల, సంపాదిత సర్వరాట్పుత్రికావటంబులను దిలకించి, యందుగల——యనంగసేన పటంబు నేరి, యిదియే నాహృదయేశ్వరియని నిరూపించి, రాజశేఖరుండద్దానిం దన మ్రోలకంపెను. దిలీవభూపతి యాపటముం దిలకించి, యద్దాని రెండవ వైపున వ్రాయబడిన వృత్తాంతమువలన, నాసుందరి, తనకు గర్భవిరోధియగు నేపాళ భూపాలునందనగా నెఱింగి, మహాగ్రహపరవశుండై——తనయుని జీరి, కాశ్మీర నేపాల భూపతులకు తర తరంబు లాదిగాఁగల్గు బలవద్విరోధ వృత్తాంతమును విశదీకరించి, యాసుందరిపైఁ గల డెందంబును మరలించుకొని వేఱోకరాకుమారిం గోరుకొమ్మని బోధించెను. రాజశేఖరుఁడు, తండ్రి మాట కెదురాడఁ జాలకయు, అనంగసేనను మఱువఁజాలకయు, ఆందోళిత స్వాంతుఁడై యుండెను.

అట——నేపాళ దేశాధీశ్వరుండును, చారులచే సేకరింపబడిన సమస్తరాజపుత్రుల చిత్రపటంబులను తన పుత్రిక యగు ననంగసేనకడ కంప——నాయెలనాగయు, నందలి రాజశేఖరుని చిత్రంబునేరి నిరూపించి, యాతఁడే తన వరుండనియు, నతనింగాక యన్యునివరింపజాలననియును, నొక్కి వక్కాణించెను. అనంగసేను డాపటము తన శత్రురాజన్యుని కుమారునిదిగా నెఱింగి, యాగ్రహించి, వాఁడుదక్క మణియొకని నెవ్వనినేని వరింపక తప్పదని, కూతున కసమ్మతంబుగా స్వయంవరమును సాటింపఁబంచి, రాజశేఖరు నవమానింప నెంచి, యాతని యాకృతి ననుకరించు నొక కృత్రిమ విగ్రహమును నిర్మించి, రాజకుమారుల యాసనంబులకు చివర భాగంబున ద్వారపాలకునిగా నేర్పరచియుంచెను. అనంగసేనా స్వయంవర వార్త కర్ణాకర్ణిని, రాజశేఖరుని చెవిసోకిన నతండు ప్రచ్ఛన్న వేషంబున, నేపాళ రాజ్యమున కరుదెంచుచు, మార్గమధ్యంబున నొక్కచో బహు విశాల శాఖాయుతంబగు నోక వటవృక్ష ఛాయా తలంబునఁ బరుండెను. మార్గశ్రమంబున నాతఁడు గాఢనిద్రావశుండై యున్న తరి——నర్ధరాత్రంబున, నా కాశతలమునుండి, యొక యచ్చరకన్య, భువిని విహరింప డిగ్గి——యాసుకుమారుని రూపలావణ్యాతిశయములం గని యాశ్చర్యపడి, మదనవికారంబునఁ బారవశ్యతనంది, యాతని కంచుకాంతరంబునఁ గల యనంగసేనాచిత్రపటంబునుగాంచి, యందలి రూపము మూఁడుమూర్తులఁ దన్ననుకరించి యున్నందులకు మఱింత యాశ్చర్యపడి, యనంగసేనా స్వయంవరాహ్వాన పత్రికను గని, యాతఁడటకుఁజన నున్నాఁడని గ్రహించి, యెటులైన నాతని పాణిగ్రహించు వెఱ వాలోచించుచు, నంతలో తెల్లవాఱుటం దిలకించి తన మార్గంబున, నరిగెను. రాజకుమారుఁడును తదనంతరము నిద్రమేల్కని గత నిశీధంబున జఱిగిన విషయంబుల నెఱుంగక, మరలఁదన పయనము సాగించి కాశ్మీర దేశాభి ముఖుండయ్యె.

స్వాభిలాషమునకు వ్యతిరిక్తముగ, తన తండ్రి స్వయంవరమును సాటఁ బంచుటం దలంచి స్వయంవర పూర్వరాత్రంబున, ననంగసేన, నిద్దుర లేక పరితపించుచు, ఆత్మహత్యా ప్రయత్నమునకు సయితము తెగించి యుండెను. మఱునాటి స్వయంవరో శుభకార్యంబునకు భూమండలంబునఁ గల యశేష రాజకుమారశేఖరులచేతను, నేలయీనిన చందమున నిండి పోయిన ప్రేక్షక సమూహములతోడను, స్వయంవరమంటపము క్రిక్కిఱిసి యుండెను, శుభలగ్న సమయంబున చేటికాద్వితీయయై భువి నవతరించిన, రతీసతివలెను——నిష్కళంక శశిబింబంబు వడువునను, అచంచల విద్యుద్వల్లికరీతిని, రాజపుత్రుల కన్నులు మిఱుమిట్లు గమ్మ——ననంగసేన సభామధ్యంబున కరుదెంచి, తన సఖివర్ణించుచుండిన, తత్తద్రాజపుత్ర కుల చరిత్రంబుల నాలకించియు——నసమ్మతిం జూపుచు, తన మనోహరుండటం గాన్పింపమి, దిగులు చెంది——విగ్రహరూపంబున నున్న రాజశేఖరరూపముం దిలకించి, మహాప్రమోద పులకితాంగయై—— తద్విగ్రహ కంఠ భాగముం బుష్పమాలికచే నలంకరించెను. ఆ విపరీత కార్యముంగని, యనంగసేనుఁ డాగ్రహించె——రాజపుత్రకు లెల్లరుం దమ్ము నేపాళ, భూపాలుఁ డవమానించెనని కత్తులు దూసిరి. ఎట్టకేలకా రాజు సమస్త రాజులఁ బ్రార్థించి శాంతచిత్తులం జేసి, తన పుత్రిక యొనరించిన యవివేక కార్యంబున కేమిసేయుటకుం దోపక, ఆ యబలను ప్రబల నిర్బంధమున నుంచెను. ఇట వ్రుత్తాంత మిట్లుండ, నటరాజశేఖరుఁడు మార్గశ్రాంతిచే, స్వయంవర దినమునకు చేరఁబాలక, జఱిగిన విషాద వార్తాదికములను మార్గమధ్యమునందే యాకర్ణించి, విరక్తుఁడై మరల నొక యరణ్యంబునఁ బడి, యెట్టకేలకు, వసిష్ఠమహాముని యాశ్రమమునం బ్రవేశించి యా ఋషి పుంగవునకు నమస్కరించి, తన వృత్తాంత మాసాంతముగ విన్నవించి తన కొద్దియేని తరణోపాయము నెఱిఁగింపుమని, ప్రార్థించెను. అంత నా ఋషిచంద్రఁ డాతని నాదరించి ప్రీతితో నాసీనుం జేసి, "రాజపుత్రా! మహాయోగిసత్తముల కలభ్యమగు ఎఱుక ప్రభావంబున నీవు తరింపఁగలవు! దాని నాకర్ణింపుమని, తత్ప్రభావం బెల్ల నెఱిఁగించెను.

రాజశేఖరుఁ డెణుక ప్రభావమున దివ్యజ్ఞానముం దెలిసినవాఁడై యా మునీంద్రు నుపచరించుచుఁ గొన్ని దినంబులందే యుండెను. ఒక దినమున రాజశేఖరుండు నదీతీరంబునకరిగి జపతప సంధాద్యనుష్ఠానాదులం దీర్చుకొని గురు దర్శనంబునకు పర్ణశాలకు వచ్చుసరికి, జపపర తంత్రుఁడై యున్న గురుని సమీపంబున పదునాఱేండ్ల ప్రాయముగల, మీసమురాని యొక నూతన బాలయతి, వినయముతో నాసీనుఁడై, యుంట గాన్పించెను. ఆబాలుఁడు త్రిలోక మోహన సౌందర్యశాలియై——చక్రవర్తి కుమారునిబోలె నొప్పారుచుండియు, జలధరాచ్ఛాదితంబగు శశిబింబము కైవడి కాషాయ చేలంబులఁ దాల్చియుండుటం గాంచి రాజశేఖరుఁడు పరమాశ్చర్య భరితుఁడై, ఱెప్పవ్రాల్పక, తనివిదీర వానినే చూచుచు నిలువఁబడు నంతలో వసిష్ఠ మహర్షి జపంబు చాలించి, రాజశేఖరుంగాంచి, పుత్రకా! ఈబాలయతి, మన్మిత్రుఁ డగు నొక మహర్షికి ప్రియశిష్యుఁడు. కొండొక కార్యార్థమై నాకడ కంపఁ బడినందున, నిందు కొన్నినాళ్లు వసింపఁగలవాఁడు. నీకితఁడు ప్రియ సహచరుఁడై మెలంగు" ననిపలికి యాబాలు నప్పగించెను. ఏమి కతంబుననో కాని, రాజశేఖరున కాబాలకుం గాంచినది మొదలొక యవ్యాజ ప్రేమ యుద్భవించి యాతని నొక యఱనిముసమైన నెడబాయక మిగుల సౌహార్దంబున మెలంగుచుండెను. ఇదియిట్లుండ, నట——కాశ్మీర దేశంబున దిలీపభూపతి యామఱునాడు, తన కుమారుంగానక విచారాక్రాంత స్వాంతుఁడై చతురులగు దూతల చతుర్దిశలకును వెదుకఁ బుత్తేంచెను. కాని, యంతం దృప్తిగాంచక రాజశేఖరు సోదరి యగు రాజముఖియు సోదరు నన్వేషింపఁ బురుషాకృతిందాల్చి, తండ్రి సెలవునంది బయలువెడలెను.

అట్లు వెడలిన రాజముఖి——తన సోదరున కనంగసేన పై కామంబు గల్లి యుండుటం జేసి, నేపాల రాజ్యంబునకే యరిగి యుండునను విశ్వాసంబున నటకరిగి పురోద్యానంబున నాసీనయయ్యె. ఆమె పురుష వేషమున నుండుటం జేసియు——అచ్చంబుగా రాజశేఖరుంబోలి యుండుటం జేసియు, రాజభటులామెంగాంచి, తమ శత్రురాజు కుమారుండగు రాజ శేఖరుఁడు గాఁ దలంచి, యామెను బంధించి, యవ్వార్తను రాజున కెఱిఁగించిరి. అనంగసేనుఁడు, స్వయంవరంబున కుమార్తెను నిర్బంధించిన యనంతరమున, ఆమె తన కేకపుత్రికయగుటచేత——బాధింపనొల్లక పశ్చాత్తప్తుఁడై——యనంగసేనను చేరంజీరి, “బిడ్డా! నీవు నా కేక పుత్రికవు. నాకా పురుషసంతతి లేదు. నీవా శత్రురాజు కుమారుంగోరితివి. కావున నాగ్రహించి నిన్ను కష్టపెట్టితిని ఇప్పు డారాజశేఖరుండెందైన లభించునేని నిన్నిచ్చి వివాహముచేసి, యాతని కీరాజ్యము నిచ్చి యిల్లటముగా నిందేయుంచుకొన సంకల్పించి యున్నవాడ "నని పలుక నామె సంతోషించెను. రాజశేఖరుఁడే మనచేతఁ జిక్కెనని భటులు వచింప రాజతని గౌరవించి, తన సంకల్పము నెఱిఁగించి, నాకుమార్తెం బెండ్లియాడి, యిందేయుండుమని కోర, రాజముఖి వారు తన్ను తన సోదరునిగా భ్రమించుచుండిరని యాత్మ నెఱింగి గుట్టు బట్టబయలు సేయక, వల్లేయని యప్పటికి రాజునకు దన సమ్మతి నెఱిఁగించి, రహస్యముగ దన సంగతి సనంగసేనకు మాత్రమెఱిఁగించి, వివాహముహూర్తము దూరముగఁ బెట్టించి యీలోన గూఢచారులనంపి రాజశేఖరు నుదంత మరయుచుండెను. ఒక దినంబున యక్షలోకాధీశ్వరుఁడగు చిత్రరథుని పేరోలగంబునకు నారదుండరిగి యతనిచే బూజితుండై "రాజా! నీవేల విచారముతోనున్నావు? నీకు కుశలమా?"యని ప్రశ్నింప, నతఁడు—— "మునితిలకా! ఏమని చెప్పుదును. నాతనయ యగు చిత్రసేన, కొన్ని దినంబులనుండియుఁ గాన్పింపకున్న యది. ఏరక్కసుల బారిఁబడెనో యెఱుంగ, ఇదియే నావిచారమునకు హేతు"వనిపలుక , త్రిలోక సంచారియగు నాజడదారి చిఱునవ్వు నవ్వి——"యక్ష రాజా! విచారింపకుము. నీతనయ, యొకనాడు భూలోకమున కరిగి యందు రాజశేఖరుఁడను రాజకుమారుని వరించెను. అంతకు మున్నా రాజశేఖరుని నేపాళ భూపాలుని తనయ యగు అనంగసేన వలచియు, తన జనకుఁ డనుమతింపమిం జేసి సన్యాసివేషముం దాల్చి యడవులంబడి పోయెను. విధి చిత్రము వలన ఆ యనంగసేనయు——మీ చిత్రసేనయు నేకాకృతిఁగలవారగుటం జేసి, రాజశేఖర పాణిగ్రహణాభిలాషంబున నీ పుత్రిక యితరు లెఱుంగ కుండ, నేపాళభూపతి యంతఃపురముం జేరెను. నిజమగు ననంగ సేన దేశత్యాగిని యైనవార్త రహస్యంబగుటయు, అనంగసేనం బోలిన నీ పుత్రిక యందుండుటయుం గని, యచటివారు చిత్రసేననే యనంగసేననుగా దలంచుచున్నారు!——స్వయంవరమున చిత్రసేన రాజశేఖర ప్రతిమను వరింప తొలుత నాగ్రహించియు నేపాళ భూపతి, యిపుడు పశ్చాత్తప్లుఁడై రాజశేఖరునకే నిన్ని చ్చెదనని అనంగసేనగా భావించి, చిత్రసేనతోఁ జెప్పెను. ఈలోన, రాజశేఖరు నన్వేషింప నాతని సోదరియగు రాజముఖి యను చిన్నది, పురుషాకృతితో నేపాళ దేశమునకు రాగా,ఆమెను రాజశేఖరునిగా నెంచి రాజు అనంగసేనగా భావింపఁబడిన చిత్రసేన నాతని కిచ్చి పరిణయంబొనరింప నిశ్చయించియున్నాఁడు! రాజశేఖరుఁడు వసిష్టాశ్రమమున కరిగి యాతనికిఁ బ్రియశిష్యుఁడై ఎఱుక, మంత్రోపదేశముం బొంది మహా మహిమను సేకరించుకొని యున్నాఁడు. విరక్తిచే నిల్లు వెడలిన అనంగసేన బాలతపసి వేషమున వసిష్ఠమహర్షి కంటఁబడగా——అతఁ డామెవృత్తాంతముం దెలిసికొని, ఆమె నెట్లయిన రాజ శేఖరునకు బరిణయ మొనరింప నిశ్చయించి పురుషాకృతితోడనే యనంగసేనను, రాజశేఖరునకుఁ బ్రియమితునిగా నేర్పరచి తన యాశ్రమంబుననే యుంచెను. యక్షేశ్వరా! ఇప్పుడు నీ తనయ అనంగసేన యను పేరం బరగుచు——నేపాళాధీశుని శుద్ధాంతమున నున్నయది ” అని వ్రుత్తాంత మెల్ల నెఱింగించి తనదారి నరిగెను.

నారదుని పలుకుల నాకర్ణించి, యక్షేశ్వరుడు, మితి లేని యక్ష సైన్యములం గూర్చుకొని మహాటోపంబుమీర నరుదెంచి——నేపాళ రాజధానిని ముట్టడించెను. రాజశేఖరాన్వేషణార్థము, దిలీపభూపతి చేఁ బంపఁబడిన చారులును, రాజముఖిచేఁ బంపఁబడిన చారులును, వసిష్ణాశ్రమ పరిసరములం గలసికొని, తమతమ వృత్తాంతము నోకరికొక, రెఱిఁగించుకొని, తదాశ్రమాంతరమునందే, తమ రాజకుమారుని సయితము గుఱ్తించి——నేపాళ రాజ్యంబున రాజముఖి పురుషాకృతితో నున్న తెఱంగును, యక్షరాజు నేపాళ రాజధానిని ముట్టడించిన విధంబునుం దెలిపి, నేపాళ రాజ్యముం గాపాడి, యనంగసేనం బాణిగ్రహణ మాడి, రాజముఖి యజ్ఞాతవాసదీక్ష దీర్పుమని ప్రార్థించిరి. రాజ శేఖరుం డందుల కనుమతించి, వసిష్ఠమహర్షికడ సెలవు వేడుకొన నామునిసాధుఁడు రాజశేఖరుని దీవించి, ఆతనికి సమంత్రకంబులగు వివిధాస్త్ర శస్త్రంబులనొసంగి, పురుషాకృతితో నున్న అనంగసేననుగూడ తోడుగా నొసంగి నేపాళ దేశంబున కంపెను. రాజశేఖరుఁడు మునిదత్తంబులగు నాయుధంబుల బలంబువలన, యక్షసైన్యంబుల దైన్యంబునొందించి, ప్రచండ సంగ్రామం బాచరింప, యక్షనాధుఁడు, దీనుఁడై సంధి కిచ్చగించెను. తత్సమయంబునకు వసిష్ఠ నారడు లటకువచ్చి——యక్షేశ్వర రాజశేఖరులకు సంధి యొనరించి, నిజ వృత్తాంతముల నెల్లం దెలిపి, నిజమగు ననంగసేనను, చిత్రసేనను రాజశేఖరునకిచ్చి వివాహం బొనరించుటేకాక, రాజముఖిని యక్షేశ్వర పుత్రుఁడగు చిత్రగ్రీవునకిచ్చి——పెండ్లి చేయించి, యాదినంబు మొదలు, నేపాళ, కాశ్మీర దేశాధీశ్వరులకు మైత్రిగల్గునట్లు సమ్మతింపఁ జేసిరి. రాజశేఖరుం డిరువురు భార్యలతోడను, కాశ్మీర నేపాళ భూములం బాలించుకొనుచు, నప్పుడప్పుడు యక్షలోకంబునకరిగి చెల్లెలిని బావమఱందినిఁ జూచివచ్చుచు, పుత్రపుత్రికా లాభముం గాంచి, బహువర్షంబులు భూతలంబున మహేంద్ర వైభవంబుల ననుభవించెను.


పండ్రెండవనాటి రాత్రికథ

పండ్రెండవనాటి రాత్రి యధావిధంబుగా కృష్ణార్జునులు, యమునాసై'కత భూములం దాసీనులై యున్నతరి, పొర్ధుఁడు గోపాలుం దిలకించి, పండ్రెండవదియగు, నచల పరిపూర్ణతత్త్వ ప్రభావంబు నెఱిఁగింపు మని ప్రార్థించుటయు, నానంద నందనుఁడు, పరమపవిత్రంబగు, విష్ణు వర్ధనమహారాజు చరిత్రంబు నాకర్ణింపుమని యర్జునున కీ క్రిందివిధంబునఁ జెప్పదొడంగెను.

విష్ణువర్ధన మహా రాజు కథ.

ఒకానొక కాలంబునఁ దొల్లి——యుజ్జయినీ నగరంబును ధర్మపాలుం డను రాజు ధర్మపాలుండై పరిపాలించుచు, బహుకాలంబునకు సావిత్రీ వరప్రసాదంబున, సావిత్రి యను కన్యాలలామముం గాంచెను. ఆ కన్యక సమస్త విద్యావిశారద యయ్యును, వివాహంబునొల్లక, యోగినీ వృత్తి దినంబులు గడుపఁ దలఁచియుండ, అందులకు తలిదండ్రులు మిగులఁ జింతించి, యొకనాడు, వీణావతియను నొక వేశ్యను సావిత్రి కడ కంపి శృంగార రసబంధురంబగు గానముం బాడి తచ్చిత్తవృత్తిని మరల్పుమని, నియోగించిరి. వీణావతియుఁ దన చమత్కృతియంతయుఁ దేటపడ శృంగార గీతములం బాడుటయు——సావిత్రి బిట్టలుక రెట్టింప నావీణావతింబరిభవించి దానివీణను తునియలుగా దొక్కి వేసెను. అమూల్యం బును, తనకు జీవన కారణంబును నగు వీణను సావిత్రి భగ్నముచేయుటకా వీణావతి, పెద్దపెట్టున శోకించుచు రాజుతోఁ జెప్పుకొనెను. రాజు దాని నోదార్చి, యావీణకగు మూల్యంబు లిచ్చినను, అట్టివీణ తనకు లభింపదని యావెలకాంత సంతృప్తి నందదయ్యెను. అనంతరము సావిత్రి తానొనరించిన పనికి బశ్చాత్తాపముఁ జెంది——వీణావతం బిలిపించి, క్షమింపఁబ్రార్థించి, తన కంఠమునందలి వెల నిర్ణయింప నసాధ్యమగు నొక రత్నహారమును రహస్యముగా బహుమానమిచ్చి తనరాజ్యమును వదలి యెందేనిం బొమ్మనియెను. అంత నావీణావతి క్రమంబున ననేక దేశంబులు సంచరించుచు నెందైనఁ దన వీణవంటి వీణ లభించునేమో యని విమర్శించుచునే యుండెను. కళింగ దేశాధీశ్వరుని కుమారుఁడగు విష్ణువర్ధనుండనువాఁడు మహా సౌందర్యశాలియు, రసికుఁడును, గాన