పండ్రెండు రాజుల కథలు/ధర్మపాలమహారాజు కథ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పదియవనాటి రాత్రి కథ.

పదియవనాటి సాయంసమయమున, కేశవార్జునులు యథాప్రకారముగా, పెందలకడ మృష్టాన్న భోజనంబు లొనరించి, యమునా సైకతస్థలంబున కరుదెంచి, మందవాతపోతంబు లానందముం గలిగింప, తాంబూలచర్వణం బొనరించుచున్న యవసరంబున నరుఁడు నారాయణుంగాంచి యిట్లనియె, “వసు దేవనందనా! యుష్మత్కృపావశంబున, ననితర లభ్యంబులగు తొమ్మిది ముక్తిమార్గంబులఁ గధారూపంబున నెఱుంగఁగల్గితి; ధన్యాత్ముఁడనైతిని——నేటిరాత్రి పదియవదియగు దర్పణము నెఱింగింపవే! యని ప్రార్థింప నా వాసుదేవుండియ్యకొని, యిట్లు వచింపజొచ్చెను. "కుంతీనందనా ! ధర్మపాలుండను మహారాజు చరిత్రంబు నాకర్ణించితివేని, దర్పణమహాత్మ్యంబు దెలియనగు"నని పలికి యేతచ్చరిత్రము నిట్లు వినిపింపదొడఁగెను.

ధర్మపాలమహా రాజు కథ.

పూర్వకాలమున, కీర్తిపాలుఁడనురాజు మహారాష్ట్ర దేశముం బరిపాలించుచుండెను. ఆ రాజునకు బహుకాలంబు పుత్ర సంతతి లేమిం జేసి, ధర్మపత్ని యగు నూర్మిళాదేవి యనుమతంబున, కాంతిమతియను బాలికను పరిణయంబాడెను. ఆవివాహలగ్నం బెట్టిదియోకానీ, యనతి కాలముననే, యూర్మిళాదేవికి, ధర్మపాలుండను సుతుండును, కాంతిమతికి, వీరపాలుండను సుతుండునుం గలిగిరి. లేక లేక కలిగిన సంతతి యగుటం జేసి, యా భూమీశుం డమితానందము నంది—— బీదలకు సాధువులకు నశేషదానంబులుసలిపి. పుత్రుల నల్లారుముద్దుగా బెంచుచుండెను. అంత విధి వశంబున బాలుర యభివృద్ధితోపాటు, సవతికుమారుఁడగు ధర్మపాలునిపై కాంతిమతికి మాత్సర్యంబు సయిత మభివృద్ధి నందజోచ్చెను. అంత నొక్కనాడు, భూకాంతుఁడు, తనతో మంతన ములాడు నదనెఱింగి, యాకాంతిమతి, "నాధా! మనకుమారులకు షోడశవర్షంబులు రేపటితో నిండును. తద్దివసంబున భక్ష్యభోజ్య పూజా పరికరాదులంగొని, దుర్గరక్షణియగు దుర్గామహాదేవిని బాలుఁడు పూజించివచ్చుట నా పుట్టినింటి యాచారము. ఆయాచారముప్రకారము, వీరపాలుని నేను పంపఁదలంచి యున్న దానను వానితో పాటు ధర్మపాలుం డునునరిగినవచ్చు ప్రత్య వాయమేమి? " అనిపలికెను. దేవీ పూజగావించుట,సర్వజన శ్రేయోదాయకంబే కావున రాజేంద్రుం డందుల కనుమతించెను. పూజా మిషంబున, ధర్మపాలు నెట్లయిన గతాసునిగా నొనరింప సంకల్పించిన, కాంతిమతి తన కుమారునితో రహస్యముగ, “తనయా! ఱేపటి దినబున, నీవు నీయన్న తోగలిసి, దుర్గాపూజ కరుగవలసి యున్నది. మీరొంటరిగ నట కేగుదురు గావున, గుడిలోనికిఁ బోయినంతనే నీఖడ్గంబున ధర్మపాలుని వధియింపుము! లోకు లనుమానింపకుండ నీచేతికి రక్తపుగుడ్డను కట్టు గట్టుకొని, రాజద్రోహు లేవ్వరోవచ్చి యువరాజు పై గవసిరనియు, నేనును పోరాడితిననియు, చేతికి దెబ్బతగిలెననియు చెప్పవలయును. ఈ విధంబునఁగాని, నీకు రాజ్యము లభింపఁజాలదు. మెలకువ గలిగి వర్తింపు"మని బోధించెను. గుణశాలియగు వీరపాలుఁడు, తల్లి బోధనలకు మనంబున నెంతయు నేవగించుకొనియు, నప్పటి కామె కేమియు మాఱుపలుక జూలక సమ్మతించినట్లునటించి, తనతల్లికి సోదరునిపైఁ గల యీర్ష్యకును రాజ్య కాంక్షకును విస్మయాసహ్యములఁ బూనియుండెను. మఱునాడు తగు పరికరంబులంగొని, సందెచీఁకటివేళ నొంటరిగ రాజకుమారులిరువురును, దేవీ పూజార్ధమై చనిరి.

దుర్గాదేవికి, పూజానై వేద్యాదులను, నిర్వర్తించినయనంతరమున, వీరపాలుఁడు తల్లి మాటలను స్మృతికిఁ దెచ్చుకొని, భాతృవాత్సల్యంబున, ధర్మపాలుని పాదంబులంబడి, తనతల్లివచించిన దెల్ల సాకల్యంబుగా నాతని కెఱింగించి, కన్నీరుగార్చుచు, ప్రియసోదరా! నాతల్లి నీపై నతి తరంబగు వైరముంబూనియున్నది. ఇప్పట్టున, నీవు నగరముననుంట, శ్రేయస్కరముకాదు కొన్ని దినము లెందైన కాలముం గడిపితివేని,మఱల తగుసమయంబున రాదగును. నాహితంబు విను"మనిపలుక, నాతఁడు దూరమాలోచించి, యందుల కనుమతించి, యట్లే పురంబు వాసి యెందేనిం జనియెను. అంతట వీరపాలుఁడు ఖడ్గంబునఁ దన చేతిని గోసికొని, దానిపై కట్టు గట్టుకొని, తత్తరపడుచు పురంబునకరిగి, రాజ ద్రోహులు యువరాజును చంపి, కందకమున బారవై చిరనియు, తానెదురింప చేతికి గాయమయ్యే ననియుఁ గల్పించి చెప్పెను. ఆఘోరవార్త నాలకించి, యూర్మిళాకీర్తిపాలురు మొదలునరికిన కదళీ తరువులగతి, సోకనిమగ్నులై పోయిరి——మంత్రి యీవార్తను నమ్మఁజాలక , కందకమున వెదకించెఁగాని యువరాజు కళేబరమెందునుఁ గానరాదయ్యెను. కాంతిమతీ దేవికిఁ గన్నులు చల్లనయ్యె——

ఇచ్చటి వృత్తాంతంబిటులుండ, నట్లు పురంబు వెల్వడి చనిన ధర్మపాలుండా రాత్రియెల్ల వీరపాలుఁడు తనకిచ్చి చినిన కరవాలసహాయమున, మహారణ్యమద్యమునం బడి యారాత్రియెల్ల దీర్ఘ ప్రయాణంబోనరించి, 'తెల్లవారునప్పటికీ, ఘూర్జర రాజ్యముం జొచ్చి, తద్రాజధానిం బ్రవేశించి, యొక ధర్మసత్రంబున విడిసియుండెను. ఆకాలమున, ఘూర్జర దేశమును, విక్రమాంకుఁ డనురాజు పరిపాలించుచుండెను. ఘూర్జర దేశాధిపతులకును, మహారాష్ట్ర రాజులకును, చిరకాల వైరములు రవుల్కోను చుండెను. విక్రమాంకునకు, చిత్రాంగద యను, నవ వయస్కయగు పుత్రికారత్నము గలదు. విక్రమాంకుఁడు మానవాసాధ్యమగు, మత్స్యయంత్రము నొకదానిని, నిర్మించి, దానిని భేదించిన వీరునకు చిత్రాంగద నిచ్చి వివాహం బొనరించెదనని వాగ్దానము చేసెను. భూమండలమునంగల రాజ లోకంబెల్ల బీరంబులాడుచు, నటకరు దెంచి, యసాధ్యమగు నాయంత్ర మీనమును దర్శించి, “యోహో! దీనిని భేదింప మనుష్య మాత్రుల కలవి యగునా? ఈ రాజు మనలనందఱ నవమానింపఁదలంచి, యీ తంత్రముం బన్నె "వివిధగతుల, నాక్షేపించుచు వెడలిపోయిరి. ధర్మపాలుఁడు సయిత, మా మత్స్యయంత్రవాత౯ నాకర్ణించి, దానిని భేదింప నుత్సహించి, రాజప్రాసాదమున కరిగి, యందు సాంకేదికముగానున్న గంట వాయించెను. ఘంటా నినాదమును విని, ఘూర్జర దేశ మంత్రి యటకరుదెంచి, తాను దగ్గరనుండి, ధర్మపాలున కామత్స్యయంత్రముం జూపెను. ఘంటాధ్వని వినంబడినంతనే, పురజను లనేకులందు గుములుగూడిరి. ధర్మపాలుఁ డామత్స్యయంత్రమును సర్వజన సమక్షంబున, సునాయాసముగా 'భేదింప, పురవాసు లందఱును, జయజయధ్వనులు నభోతలంబంట, నీతడు సురయక్షగరుడ గంధర్వాదులలో నెవ్వఁడో కాని, మానవ మాత్రుండు గాఁడని ప్రశంసింపఁజొచ్చిరి. సచివుఁడా రాజపుత్రుని మహావైభవంబున, విక్రమాంకుని సన్నిధికిం గొని పోవుచుండ, నాభూపాలుఁడే సన్మానపురస్సరంబుగ నెదురుగా వచ్చి, యాతని యిష్టమాలికాదులచే బహూకరించెను. చిత్రాంగదయు, సాలంకృతయై సౌధాగ్రమున నిలిచి, భూమి నవతరించిన, కంతుఁడో జయంతుఁడో యనుమాడ్కి, యసమానతనుద్యుతులతో వెలిగిపోవుచున్న ధర్మపొలుందిలకించి, మన్మధశరాహత మానసయై యాపుణ్యాత్మునిఁ బ్రాణపతిగాఁ గాంచఁగల్గిన తన యదృష్టం బసామాన్యమని యుప్పొంగుచుండెను ఘూర్జరాధిపతి, ధర్మపాలుని నిజాస్థాన మంటపంబునకుం గొనిచని యాతని సన్మానించి, పుణ్యాత్మా! నీకాపుర మేపురము? నీతల్లిదండ్రులై ధన్యులైన పుణ్య దంపతు లెవ్వరు? యష్మన్నామధేయంబునం బవిత్రతఁగన్న పుణ్యాక్షరంబు లెయ్యవి?" యని ప్రశ్నింప, నాతఁడు తమ కారాజు పూర్వవైరి యగుట నెఱుంగమిం జేసి, దాచక తన యుదంతం బెల్ల నెఱింగించెను. అంత నాయిలాపతి, తమ పూర్వ విరోధంబులను స్మృతికిఁ దెచ్చుకొని, దండ తాడిత మహారగంబుగతి మండిపడి, "యోరీ! నీవు నా విరోధి కుమారుఁడవు మోసగించి, నాపుత్రికం బరిణయమాడ నిందువచ్చితివా? ఇప్పుడొంటరిగ నాచేతఁజిక్కితి విఁకనెందు బోవఁగలవు?—— భటులారా! వీనిని బంధించి కారాగృహ నిబద్ధునిఁ గావింపుఁ"డని పలుక, వెంటనే, కొందఱు భటులు సాయుధులై యాతనిఁ జుట్టుముట్టిరి. దుస్సహం బగు నా యవమానమును సహింపఁజాలక, ధర్మపాలుఁడు కాలరుద్రునిగతిఁ గరవాలమును కేల గీలించి, తన పరాక్రమంపు పెంపున తన్ను గవియ వచ్చిన వారి నెల్లర జీకాకుపఱచి, యెవ్వరికిం దొఱుకక నాపురంబు నిర్గమించి నేమంబుగ నవలంబడెను.

అట్లు పలాయితుండై చనిన, ధర్మపాలుఁడు, మహా భయంకర మగు నొక యరణ్యంబు నంబడి పోవుచు, రతీరమణి కెనయగు రూపలావణ్యములతో నొప్పారు చిత్రాంగదాపాణిగ్రహణ భాగ్యముతనకొక్క ఱెప్పపాటు కాలంబున దప్పిపోయేఁ గదాయని వగచుచు, క్షుత్పిపాసలపై భ్రాంతిసయితము మాని, యొక వృక్షమూలంబున కానుకొని మహావిచారంబు సేయుచున్నంత నాతనికట్టెదుట, సాక్షాత్కరించిన యపరరుద్రుం డోయన నొప్పు నొక మునీంద్రుఁడు ప్రసన్నుండయ్యె. అతనింగాంచి సంభ్రమవినయంబులుదోప నానృపసూతి యాతనికి నమస్కరింపనాతఁడా బాలుని దీవించి, దివ్యజ్ఞానమున, నాతని పూర్వవృత్తాంతము నెల్ల నెఱింగి, “రాజనందనా! పాపనిరయమగు నంగనాసంగమ లౌల్యంబున నిట్లు విచార పరీతస్వాంతుఁడనై యా మష్మికోత్తమపదంబును, జెఱుచుకొన దగునా! ఊరడిల్లుము నన్ను పతంజలి యందురు. నీవు సజ్జనుండ వని నామదికిం దోఁచెగావున నీకు మానవదుర్లభంబగు, దర్పణమహాత్యంబు నెఱింగించెదరు. తన్మూలమున తరింపఁగల"వని తనయాశ్రమంబునకుఁగొనిచని, యుపదేశించెను.

అనిపలుక పార్థుఁ డాశ్చర్యపడి, "గోవిందా! అనంతర మాధర్మపాలుని చరిత్రం బేమయ్యె నెఱిఁగింపు"మని పలుక 'ననంతర కధావిధానంబును ముకుందుఁ డిట్లెఱిఁగించెను.

అర్జునా! వినుము—— దర్పణ ప్రభావము నెఱింగి ధర్మపాలుండాముని యందు మహావినయంబు గలుగ నితర ప్రపంచ సంబంధములను బరిత్య జించి యాతని పాదసేవం చేయుచు నా యాశ్రమంబుననే యుండెను. ఇక్కడిస్థితి యిట్లుండ ఘూర్జర దేశమున మత్స్య యంత్రముం గొట్టిన ధర్మపాలుని చరిత్రము సమస్త దేశములందును వ్యాపించేను, ఆవార్త నొకదాసి యాలకంచి, రహస్యంబుగఁ గాంతిమతి కెఱిఁగింప, నామె పెద్దతడవు యోచించి, ధర్మపాలుఁడు మరణింప లేదనియు నిందేదియో మోసము జఱిగెననియు విశ్వసించి, తన కాంతరంగికుఁడగు నొక మంత్రవేత్త కీ వృత్తాంతమెల్లఁ దెల్పి ధర్మపాలునిజంపి యాశిరస్సును నాకుఁజూపినచో, నీ కశేషంబు ధనంబు నర్పింతునని యాశ పెట్టి పంపెను. ఆమాంత్రికుఁడును, బహుదేశంబులు దిఱిగి, తిఱిగి తుదకు, పతంజల్యాశ్రమంబునకువచ్చి, ధర్మపాలుం గనుంగొని యానందించి, యాతనితో కపట స్నేహంబు నటించి, సంహారోపాయము నాలోచించు చుండెను. ఇది యిట్లుండ నచట ఘూర్జర దేశంబున, రాజపుత్రిక యగు చిత్రాంగద ధర్మపాలునిపైఁ గల మోహంబున వ్యాధి గ్రస్తయై మరణాసన్న యయ్యెను. ఏక పుత్రికా జీవనుఁడగ, నావిక్రమాఁకుఁడు చేయునది లేక పుత్రికా ప్రాణ సంరక్షణార్ధమై— పూర్వ వైరఁబును మజచి, మహారాష్ట్ర భూమీశుఁడగు, కీర్తిపాలునితో సమాధానపడి, "నాపుత్రికను నీకుమారుఁడగు ధర్మపాలున కిచ్చి వివాహమొనరింతును. తరలిరావలయు" నని కబురంపెను. అప్పటికి పుత్రశోకంబున, ధర్మపాలుని తల్లియగు, ఊర్మిళా దేవి స్వర్గస్థురాలగుటం జేసి, కాంతిమతి గీచినగీటు దాటక వృద్ధరాజు చరించు చుండెను. ఘూర్జర భూపాలుని సందేశమును విని, కాంతిమతి ప్రోత్సాహమున రాజు వీరపాలుంజూపి, వీఁడే ధర్మపాలుడని పలికి మహావైభవంబునఁ దరలివచ్చుచు మధ్య మార్గంబున నొక్కచో, విడిసెను. ఆ ప్రదేశంబు మతంజల్యాశ్రమమునకు మిక్కిలి చేరువగా నుండుటయు, నారాత్రి 'వెన్నెల పిండారఁబోసినగతి ప్రకాశించుచుండుటయు, వీరపాలుఁడు తనతల్లి దౌష్ట్యమును పూర్వచరిత్రమును అప్పటి తన పరిణయంబును తలంచుకొనుచు, తన సోదరుఁ డెందుండెనో తెలియక యా వనం బున నందందు వెఱ్ఱివానివలె పరిభ్రమించుచుండెను. ఆ నిశీధమున, ధర్మపాలుఁడు, సమాధినిష్టాగరిష్టుఁడై దర్పణ మహాత్మ్యలోలుఁడై , యా పోజ్యోతులం బరబ్రహ్మావలోకనం బొనరించుచున్న తరి నాయద నెఱింగి యాతనిం బోకార్పఁదలంచి మాంత్రికుఁడు కరవాలంబును సవరించుచుండెను. అంతలో విధివశంబున నటకువచ్చిన వీరపాలుఁడా దారుణ కార్యముం దిలకించి వెనుక పాటునం జని తన కరవాలంబున నామాంత్రికుని తల నేలబడునట్లు ఖండించెను. ఆ సవ్వడికి సమాధిభంగమైన ధర్మపాలుఁడు కన్నులువిచ్చి యెదుటనున్న మాంత్రికుని ఖండిత కళేబరంబును తన సోదరునిం గాంచి యాశ్చర్యానందములతో నాతనిం గౌగలించుకొని, తమ్ముఁడా! ఇందేలవచ్చితివి? ఈతఁడేల మరణించె" నని యడుగ, కొండొక వడికి వీరపాలుఁడు సోదరుని గుర్తించి, యానంద దు:ఖ పరవశుండై కన్నీరు మున్నీరుగాఁ గార్చుచు, నా మాంత్రికుని కపటవర్తనమును తన జనని తంత్రమును ఘూర్జర భూపతి ప్రయత్నమును తమ ప్రయాణమును, దెలిపి, తండ్రిగడకు రమ్మని త్వరపెట్టెను. ధర్మపొలుఁ డదియెల్ల నాలకించి కలయో నిక్కమో యని భ్రమించి, గురుని కడ సెలవుగైకొని, నిజజనకుని దర్శింప నాతఁడు మృతినందెనని తలంచిన కుమారుని పునరాగమనమునకు పెన్నిధి లభించిన పేదచందంబున నుబ్బి పలుమారులా బాలుని ముద్దు బెట్టుకొని యానంద పరవశుఁడై యుండెను.గతకృత్యంబులం దలచుకొని కాంతిమతి పశ్చాత్తప్తయై ధర్మపాలునిక్షమా ప్రార్థనం బొనరింప నాతఁ డామెను మన్నించెను. వారందఱును మఱునాడు పతంజలి మహర్షికి నమస్కరించి సెలవుగై కొని, ఘూర్జర రాజధానికరుగ నారాజు చిత్రాంగదా ధర్మపాలుర వివాహముతో పాటుగాఁ దన సోదరుని పుత్రికయగు నీలాంగదును వీరపాలున కిచ్చి రెండు వివాహంబులును ఏకముహూర్తంబున మహా వైభవంబున నొనగించెను. ప్రియజనని లేకపోయెనను కోఱంతదక్క మఱియే విచారంబును లేక దర్పణ ప్రభావ సంపన్నుఁడై ధర్మపాలుఁడు చిర కాలము చిత్రాంగదతో గూడి మహారాష్ట్ర రాజ్యము బాలించి సుఖంబుగా నుండెను.