పండ్రెండు రాజుల కథలు/ఖాండవదహన చరిత్రము

వికీసోర్స్ నుండి

మోక్షదాయకమో యోగినీవ్రుత్తియే పరలోక సాధకమో, తోపక నాడెందం బాందోళనమందుచున్నయది. గిరి శిఖరంబున వెలసిన ఋషి వార్త తండ్రిగారు చెప్పఁగా, నీవును వింటివిగదా! ఆయన సమర్థుడని తోఁచుచున్నది. అటకరిగి మన సందియముందీర్చుకోందమా?" యని యడుగ, నామెయు వల్లేయని యామఱునాడు వేకువజామున నటకు బయనించి సావిత్రింగొనిపోయెను. గిరికందరమునఁ దొలుత వారికి యోగిని దర్శనంబిచ్చి—— వారు వచ్చిన కార్యంబు నాకర్ణించి, యోగీం ద్రులలో మనవి చేసివత్తునని బయటి మందిరమున వారినునిచి, తాను లోనికరిగి, కొండొకవడికి బయటకువచ్చి “రాజపుత్రీ! నీభాగ్యమసమానమైనది సుమా! స్వాములవారు, సహజముగా, స్త్రీలనిన విరక్తులగు స్వభావముగలవారు. నాచిత్తశుద్ధి నెటీంగినవారగుట నన్నొక్కతెను మాత్రమే, శిష్యురాలిగా, నంగీకరించినారు. నన్నైనను విశేషకాలము దరినుండనీయరు. నూఱు ప్రశ్నలకొక్క యుత్తరమిచ్చుట యసాధ్యము, నీ పురాకృత పుణ్యం బెట్టిదియో కాని, నీ పేరు చెప్పినంతనే, వికశిత ముఖారవిందులై——నీ సద్గుణ సహస్రంబును, చూచినట్లే, పెద్దగాస్తుతించిరి! నీ భాగ్యముపండినది నాతో రమ్మని పలికి, యప్పుడే సావిత్రి నాయతి సన్నిధికిఁ గొనిపోయెను.—— ఆయతి యతిమాత్ర తేజశ్శాలియై—— భూమి నవతరించిన మన్మధుండోయన నొప్పారుచు—— పురుషుల పేరు చెప్పిననేవగించుకొను సావిత్రికి లజ్జావిభ్రమములం గలిగించెను. యోగి యాబాలిక ప్రణామంబులను స్వీకరించి, మెల్లన నామెచేయినెత్తి ముద్దిడి, "రాజకుమారీ! నీజనకుని రత్నహారమును మాతపశ్శక్తిచే దెప్పించితిమి. ఇదే హారము! మఱియొకనాడు నీకొసంగుదముగాక!" యని యాహారము నామెకుఁజూపి, మఱలగైకొని యానాటికా బాలకు సెలవొసంగెను. రత్నహారవక్షణమున, సావిత్రీ మంజరులకా మహాత్ముని యందు, దృఢ విశ్వాసము నాటుకొనెను. మఱునాడు తప్పక తమ సంశయములం, దీర్చుకొనవలయునని, వేఁగుజాముననే సావిత్రియు మంజరియు మఱల గిరిశిఖరంబునకరగి, యోగినికిఁ దమహృదయాభి లాషము నెఱిఁగించిరి. ఆమాటలువిని యోగిని యిట్లనియెను.——“అమ్మాయీ! నాకుగల్గినసందేహమే, నీకునుఁ గల్గియున్నది. ఇటులే నేనును కామమును త్యజించి వివాహమునొల్లక, యావిషయమై గురు నితో వాదింపగా ఆమహాత్ముఁడు నాతో “సోదరీ! కామ మేకాంత రూపమై జనించియున్నది. కాంతా కామముల కభేద ప్రత్తిపత్తియైయుండ, కాంత కామమును ద్యజించుననుట తననీడను తాను తప్పించుకొనఁగోరునట్లే యగును. కాంత యర్హుండగు పతిని వరించి, గృహస్థాశ్రమమున నుండియే, ఇహపరములను రెంటిని సాధింపఁదగునని ధర్మశాస్త్రంబులు నుడువు చున్నయవి. సంసార త్యాగినియగు కాంత సద్బుద్ధిగలదయ్యును, లోకనిందఁ జెందును. కావున సంసారిణివగు" మని బోధించెను, అంతట, నేను, “స్వామీ! కామము లేని కాంత, అతి కామి యగు పురుషునితో నెట్లు సంసారసౌఖ్యముఁ జెందఁగల”దని ప్రశ్నించితిని. అందులకు గురుఁడు యుక్తి యుక్తముగా, “అందులకే యర్హుండగు పతిని గ్రహింపుమని యుపదేశించితిని. కామము లేనికాంత కామరహితుఁడగు కాంతునే, వరింపఁ దగినది. లోకోపకారార్థము ననుబోటి యతులు కామరహితులగు సత్కాంతల ననుగ్రహించుచుందురు. తొల్లి యరుంధతీ వసిష్ఠులును——అనసూయాత్రిమహర్షులును, ఇట్టి యనుకూల దాంపత్యమునే కాంచి" రని పలికెను. అందుపై— నాకు వివాహమాడు కోరిక జనించియున్నది. గురుఁడు నాకు పితృతుల్యుఁ డగుటచే నీయనం జేపట్టుట దోషమని యర్హుండగు పతికొఱకై యన్వేషించు చున్న దానను. నీపై నీమహాత్మునకు సదభిప్రాయ మిదివరకేకలదు. నీకును ఈయనకు నావలె—— గురుశిష్య సంబంధము లేదుగావున, లోకోపకారార్థము, నిన్ను వరింప నిరాకరింపఁడు, నేనెట్లో యోప్పింతును . నీయభిలాషముం దెలుపుమనిన, సావిత్రి యొక్క మాఱుగఁదన, హృదయమును మరల్చుకొని యేదియుం జెప్పనేరక డోలాందోళిత హృదయయైయుండ, మంజరియు యోగినియు బలవంతపరచి యామె నొప్పించిరి.మూఁడవనాఁడు లోకోపకారార్థమై ఆయతి, సావిత్రిని గాంధర్వవిధిం బరిణయమాడి, యారత్నహారమును మెడలో వేసెను. వివాహానంతరమున మూఁడురాత్రము లందు గడుపవలయునని యోగిని నిర్బంధింపగా, మంజరి సావిత్రి నందే వదలి తానొంటిగ నింటి కరిగి, రాజపుత్రిక శరీరమున నస్వస్థతగ నుండుటచే నతఃపురముననే యున్నదని బొంకి యారహస్యమును గప్పిపుచ్చెను. లోకమునందెంతటి దృఢచిత్తముఁ గల కాంతయైనను పురుషసాంగత్యముచేత, అగ్ని స్పర్శతగిలిన లక్కవలె కరగకపోవదుగదా! ఆమూఁడురాత్రుల సాంగత్యమునను, సావిత్రీ యతినాధులవ్రతము లుద్యాపన చెప్పఁ బడినవి. పరిపూర్ణ మదనలీలావినోదంబులం దేలుచు వారా మూఁడురాత్రులును మూఁడుగడియలుగా వెడలఁబుచ్చిరి. త్రిరాత్రానంతరమున, సావిత్రిని మంజరి యధాప్రకారంబుగ, నొరుల కెఱుక పడనిరీతి సౌధాంతరమునఁ బ్రవేశింపఁ జేసెను. భూనాధునకు యతినాధుఁడు చెప్పిన——జోస్యము యదార్థంబయ్యె ననియును, రత్నహార మెట్లువచ్చేనో కానీ, రాజపుత్రి కంఠముం జేరుకొనె ననియును, రాజ్య మునకిఁక వేశ్యాక్రాంత భీతి గల్లదనియును, పౌరు లెల్లయెడలఁ జెప్పుకొనుచుండిరి. ఇంతలో, కళింగ దేశాధీశ్వరుఁడు తన కుమారుఁడగు విష్ణువర్ధనునకు నీకుమార్తెయగు సావిత్రిం జేసికొన నభిలషించుచున్నారము మీయభిప్రాయమే "మని ధర్మపాలునకు వ్రాసెను. పుత్రిక యభిప్రాయంబునకులోనై యామె నవివాహితనుగా నుంచుట లోకాపవాదకు కారణముగ నున్న దనియును కళింగరాజు సంబంధము విడువఁదగినదిగాదనియుఁ దలంచి ధర్మపాలుడు సావిత్రినడుగకయే స్వతంత్రించి, వివాహమున కనుమతించితిమని ప్రత్యుత్తరమిచ్చెను. ఈలోపల సావిత్రికి గర్భచిహ్నంబులు పొడసూపుటయు, రాజదంపతులాశ్చర్య విషాదములతో నిజముఁ జెప్పుమని కూతుంగ్రుచ్చి యడిగిరి. అంతట——మంజరి, తన చెలిగాం ధర్వవిధిని యతీశ్వరుం బరిణయమాడినవార్త నెఱింగించెను. పూజనీయుఁడును మహిమాన్వితుండును నగు యతి తమకల్లుఁడయినందుల కానందమొకవంకను, ఏకపుత్రిక యగు సావిత్రి వైభవశూన్యుండగు సన్యాసింగూడెఁగదా యను విచార మొకవంకను బాధింప, నారాజదంప తులు, ఎట్టకేలకు హృదయములను స్థిమితపరచుకొని, తమ దుహితకు శరీరము నందస్వస్థతగలిగియున్నది గాన వివాహమప్పటికీ నిలిపితి మని కళింగరాజునకు లేఖ వ్రాయించి యతినాధునికొఱకు దేశములందు వెదుక, చారులనంపెను. కాఁబోవు కోడలిశరీరమున నస్వస్థతగానున్నదని విని, కళింగరాజా బాలికంజూచి మాటాడిరమ్మని యిరువురు బ్రాహ్మణులను, ఉజ్జయినీ నగరంబునకంప, వారు వచ్చి ధర్మపాలునిచేఁ పూజితులై—— సావిత్రీ వృత్తాంతంబు నెల్ల నతని ముఖంబున విని, "అయ్యా! మారాజకుమారుఁడగు, విష్ణువర్ధనుండీనడుమ, వివాహంబునొల్లక, విరాగియై దేశంబులం దిరిగి తపస్సిద్ధినంది యొకపురంబున విధివశంబున ఘటితంబైన యోగంబున నొక విరాగిణి యగు రాజపుత్రికను, గాంధర్వంబునఁ బరిణయం బాజెనట! మీతనయ కథకును, మారాజపుత్రుని కథకును సంబంధము గనఁబడుచున్నయది. ఒక వేళ మారాజసుతుఁడు పరిణయమైనబాల మీబాలయేయైనచో, వెదుకఁబోయిన లత కాలికిఁదగిలినట్లే యగుఁగదా!" యని పలుక, విష్ణువర్ధనుం డాశ్చర్యపడి, మీరాజకుమారు నిందురప్పింపుఁడు; ఆయతి యాతండగునో కాఁడో మేమును పోల్పంగలవారమని పలికెను. బ్రాహ్మణులందుల కనుమతించి, తామందే యుండి విష్ణువర్ధను నటకు రమ్మని వ్రాసిరి. ఈలోన, రాజభటులు బంధించి వీణావతి నటకుఁ గొనిరాగా నది, తనకడ రత్న హారము లేదనియు, దాని నిదివఱకే, కళింగ రాజ పుత్రుఁడగు విష్ణువర్ధనునకు విక్రయించితిననియు నుదువ—— యతియే విష్ణువర్ధనుండగుట మణింత దృఢమయ్యెను. అనంతరము విష్ణువర్ధనుండటకు వచ్చుటతోడనే వారోండోరుల గుఱ్తీంచుకొని, సావిత్రీ విష్ణువర్ధనులకు సర్వజనప్రమోదకరముగా మరల వివాహంబొనరించి యానందించిరి. అనతి కాలమునకే, సావిత్రీ గర్భంబున, విష్ణువర్ధనుని ప్రతిబింబ మోయన నొప్పారు చక్కని కుమారుఁడుదయించి వంశము నుధ్ధరించెను. పిదప విష్ణువర్ధనుఁడు బహువర్షములు మాళవ కళింగ రాజ్యములం బాలించి, 'కీర్తిగాంచె" నని యర్జునునకు శ్రీకృష్ణుడెఱిఁగించి, “ సవ్యసాచీ! ——ద్వాదశ యోగ మహాత్మ్యంబుల నెఱుంగుటచే నీజన్మము కృతార్థత నొందె"నని పలికెను.——

పండ్రెండు రాజుల కథలు.

సంపూర్ణము.

శ్రీకృష్ణార్జునులు ఖాండవమును దహింపఁ జేసినకథ.

పదమూఁడవనాడు కృష్ణుఁడర్జునుంజూచి——“యర్జునా! మనమీ యమునాతీరప్రాంతములందు, పండ్రెండుదినంబులు సుఖలీలలఁ బ్రోద్దులు పుచ్చితిమి! ఇందు, నేనింత కాలము కాలముగడుపుటం జేసి, నాతల్లిదండ్రులు బెంగఁ గొందురు. గోపికలు పలువిధంబుల ననుమానింతురు, ఇచటి కనతిదూరమున, దేవేంద్రుని ఖాండావోద్యానముగలదు. దానిం దిలకించి, గృహాభిముఖులమగుద" మని పలికిన నతండనుమతించెను, అంత నయ్యిరువురును, ఖాండవోద్యానవనమున బ్రవేశించి యందలిరామణీయకమున కచ్చెరువందుచుండ, కంపితాంగుఁడగు నొక భూసురవృద్ధుఁడట కేతెంచి వారి పాదంబులంబడి, “మహాత్ములారా! భూమి నవతరించిన, నరనారాయణ ఋషులారా! బహుకాలమునుండి యిందు మీరాకకై వేచియుంటిని, నేటికిఁ గృతార్థుఁడనై తిని. యజ్ఞాదులయందు విప్రులు నాకమితంబుగా నర్పించిన యాజ్యంబువలన నాకు, ఉబ్బసపు వ్యాధిపట్టుకొనఁ జతుర్మునిఁ దన్ని వారణోపాయము నర్థించితిని. అప్పుడతండు నరనారాయణ మహర్షులు కృష్ణార్జున నామధేయంబుల నవని వెలయుచున్న వారు, వారిని శరణంబు వేడితివేని నీ బాధలు నివారించును. ఖాండవోద్యానవనంబున నీవ్యాధి నుపశమింపఁ జేయగల యోషధులు గలవు. అద్దానిని నీవు దహించితివేని స్వస్థుఁడవగుదువు. కృష్ణార్జునుల యాగమనంబును ప్రతీక్షించుచు నీవందే వేచియుండు” మని యానతిచ్చెను, మహాత్ములారా! మిపాలఁబడితిని. నీటముంచినను——పాల ముంచినను మీదే భార"మని ప్రార్థించెను. కృష్ణుఁ డాతనింగాంచి, సదయ శీతలవచనంబుల, “మహాత్మా! వీతిహోత్రా! నీ కారణంబునఁ గదా——సమస్త దేవతలకును హవిస్సులు లభ్యంబగుచున్నయవి! ఇట్టి నీ వ్యాధిమాన్ప నేనిలింపుఁడు నిన్నడ్డగించఁగలఁడు. యధేచ్ఛగా——నీవీ ఖాండవవనంబును దహింపు" మని ధైర్యమిచ్చెను. అంత అగ్ని హోత్రుఁడు మహానంద కందళిత హృదయుఁడై——శ్రీకృష్ణునకు శంఖు చక్రములను, అర్జునకు శ్వేతాశ్వసంకలిత దివ్యరధంబును, గాండీవమును, అక్షయ తూణీరంబులను నోసంగి మహావిశ్వరూపథారియై, యాఖాండవోద్యానమును దహింప దొరకొనెను. అంత, నాయుద్యానవనపాలకులగు భటు లాయుద్ధతికి దాళఁజాలక, బిరబిరనరిగి యవ్వార్తను దేవేంద్రున కెఱిఁగింప, నాతఁడు బిట్టలుక వహించి, యనంతంబగు నిలింప సైన్యముతోడ, పుష్కలావర్త మేఘంబులఁ దనవెంటనిడుకొని మహారభసంబున, నరు దెంచుచుండెను. సహస్ర లోచనుని సన్నాహముంగని యర్జునుఁడు వెనుకంజవేయక, తన యక్షయతూణీరములతోడ నావనంబునకు చుట్టును భద్రంబగుకోటను నిర్మించి, యద్దానికి రెండు ద్వారంబు లేర్పరచి యొక ద్వారముఖంబున ససజ్జితగాండీవియగు తానును——రెండవద్వార ముఖంబును చక్రహస్తుండగు చక్రియు నిలువ, నగ్నిహోత్రుని నిర్భయముగా దహింపుమని ధైర్యవచనంబు లాడెను. దేవేంద్ర నిర్ముక్తంబులగు నాసప్త జలధరంబులును, ప్రళయకాలాట్టహాసంబు నెరపుచు, నఖండంబుగా వర్షింపుచు, నిర్ఘాతంబులనురాల్చుచు, తమ సామర్థ్యమంతయుం జూపినను, అగ్నిహోత్రునిపై నొక జలబిందువైనఁ బడకుండుటంగని నిర్వీర్యంబులయ్యె. సప్తమేఘంబులట్లు పరాభూతంబులగుటంగని, గినియుచు, దేవేంద్రుఁడు దేవసేనాసహాయంబున, పార్థునితో నఖండసంగ్రామం బాచరించియు జయింపనేరక శ్రీకృష్ణ పార్థుల మహాత్మ్యంబు నెఱింగి, శ్రీకృష్ణుం గీర్తించి——యర్జును నాలింగనము చేసికొని దీవించి——వారికిం గోరిన వరంబుల ననుగ్రహించి నిజనివాసుబునకుఁ బని వినియెను. అనంతర మాయశోదానందన కుంతీనందనులను అగ్నిహోత్రుండు పెద్దగా వినుతింప వారపుడే యటనుండి కదలి యింద్రప్రస్థమున కరిగి జఱిగిన వృత్తాంతమును ధర్మరాజాదుల కెఱింగించి వారి నానందింపఁజేసి సుఖముగా నుండిరి.