పంచతంత్రి/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము

క.

శ్రీరమణీరమణపదాం
భోరుహవిన్యస్తహృదయ! భూరికృపావి
స్తారదృగంచల! లక్ష్మీ
నారాయణ! భోగవిజితనాకపమూర్తీ!

1


వ.

సుహృల్లాభంబను ద్వితీయతంత్రం బాకర్ణింపుము.

2


క.

అనినఁ గుమారులు హృదయం
బునఁ బొంగుచు విష్ణుశర్మ ముఖపంకజమున్
గనుగొని యాకథ దెలియన్
వినిపింపుము మాకు మిగులవేడుక యయ్యెన్.

3


వ.

అనిన నమ్మహాత్ముం డిట్లను, మున్ను మీకు నేనెఱింగించిన
మహిళారూప్యంబను పురసమీపమ్మున నొక్కశాల్మలీభూరుహమ్ము
గలదు. అది కుసుమవిసరద్యుతిచేత నకాలసంధ్యారాగవిభ్రమంబును
బహుళతరసాంద్రవర్ణనిబిడచ్ఛాయవలన బహుళపక్షతమస్సదృశ
ప్రభావంబునుం జేయుచు నఖిలపతంగరుతంబుల బధిరీభూతరోదోంత
రాళంబై యంతరిక్షంబున కాధారంబుగా నంబుజసంభవుండు నిలిపిన దీర్ఘ
స్తంభంబనం బొలుపొందు [నా]వృక్షంబున..............లఘుపతనకుండను
వాయసప్రభుండు వసియించియుండు నంత.

4


క.

ఒకనాఁటిఱేపకడ లు
బ్ధకుఁ డొకఁ డట కేఁగుదెంచి పక్షులఁ గడును
త్సుకతన్ జూడఁగ లఘుపత
నకుఁడును సాధ్వసము దనమనమ్మునఁ బొడమన్.

5


మ.

పలుమాఱుం దనుజూడ లుబ్ధకుఁడు శుంభద్ధంభసంరంభతన్
వల యచ్చోటన యొడ్డి, యంద మఱి నానాధాన్యముల్ చల్లి య
వ్వలఁ బక్షిధ్వను లాచరించుచు మనోవాంఛారతి న్నిల్వ నం
త లసద్వేగమునన్ గపోతపతి చిత్రగ్రీవుఁ డుత్సాహియై.

6

క.

కులజులగు పక్షిముఖ్యులు
గొలువఁగ జాలాంతరమునకుం జని ధాన్యం
బులు గొఱుక హృదయవాంఛా
కలితుండై చిక్కువడియెఁ గర్మవశమునన్.

7


వ.

ఇట్లు దగులంబడిన నాలుబ్ధకుఁడు విహంగవధపూరితస్వాంతుండై
సంభ్రమంబున జూలమ్ము జేరం జనుదెంచునప్పు డాచిత్రగ్రీవుండను కపోత
వల్లభుండు తమవిహంగసంఘమ్ము రక్షింపనెంచి యధికతరప్రజ్ఞావిశే
షంబున నిట్లనియె.

8


క.

ఒక్కటిగా నుడువీథికిఁ
గ్రక్కున నెగయుదము లుబ్ధకప్రారంభం
బెక్కడి కెక్కును మన కీ
చిక్కములోఁ జిక్క నేల! శేముషి గలుగన్.

9


క.

అని జాలముతో నింగికిఁ
జనియె శకుంతములతోఁడ జవమున, నుష్ణం
బును దీర్ఘ మైన యూర్పులుఁ
దనమదిఁ గలపంగ నిలిచెఁ దద్వ్యాధుండున్.

10


వ.

ఇట్టివృత్తాంతంబంతయు శాల్మలీతరుశాఖాగ్రమ్మునం దున్న
లఘుపతనక నామధేయుండగు కాకమ్ము సర్వమ్మును వీక్షింపుచుండఁ జిత్ర
గ్రీవుండు సహచరులగు కపోతవరుల కిట్లనియె.

11


మత్తకోకిల.

రండు నాసఖుడైన మూషికరాజు చారుహిరణ్యకా
ఖ్యుం డిటన్ వసియించియుండు జవోన్నతి న్నన, నంత యా
తండ యీవల చిక్కు బాపి ముదంబు చేయు నటంచు న
య్యండజావలితోఁడఁ దత్కుహరాగ్రసీమకు నేఁగినన్.

12


చ.

తనచెలికానిరాక విని, తద్దయుఁ బొంగి హిరణ్యుఁ డాబిలం
బున వడి నేఁగుదెంచి, వలఁబొందిన పక్షులతోఁడి చుట్టమున్
గనుగొని శోకబాష్పములు గన్నులఁ గ్రమ్మగఁ గౌఁగిలించి నీ
కును నిటువంటిబాధ సమకూడెనె! దైవవశమ్మునన్ భువిన్.

13

వ.

అని వివర్ణవదనుండై నిట్టూర్పులు నిగిడించుచు వెండియు
నిట్లనియె.

14


క.

తనపూర్వజన్మకర్మము
లనుదినము శుభాశుభమ్ము నందించు, జగ
జ్జను లాదిజీవులగు దై
వనియోగమువలనఁ గడవవచ్చునె తలఁపన్!

15


గీ.

సుజనులకు లేమి, గ్రహపీడ సోమసూర్యు
లకు, భుజంగేంద్ర, మాతంగశకున, సంచ
యమున, కరయంగ బంధన మాచరించు
నలఘుతరమైన, విధిశక్తిఁ దెలియ వశమె!

16


శా.

తారామార్గమునం జరించు ఖగసంతానమ్ము వారాశిలో
నారూఢస్థితినున్న మీనతతి దైవాధీనతన్ భూజనో
గ్రారంభంబున గాదె! చిక్కుపడుఁ, గాలాతిక్రమక్రీడ, నె
వ్వారల్ నేర్తు రుపాయధైర్యబలగర్వఖ్యాతిఁ బెంపొందినన్.

17


వ.

అని యివ్విధంబున హిరణ్యకుడు హృదయతాపనివారకంబు
లఁగు వాక్యమ్ములు పలికి యాచిత్రగ్రీవపాశవిచ్ఛేదనారంభుండై నిలిచిన నతం
డిట్లనియె.

18


క.

ఓయన్న! యీవిహంగని
కాయమునకు మున్నె చనఁగఁ గౌతుకమగునే!
యీయనఘులబంధమ్ములు
పాయమ్మునఁ బాయఁజేయు పరమప్రీతిన్.

19


గీ.

అనిన మూషికపతి విహంగాగ్రగణ్యు
జూఁచి కీర్తింపఁదగు నీవిశుద్ధచరిత
మనుచు బంధనవిచ్ఛేద మొనరఁజేసి
యతిథిపూజల నన్నింటి నాదరించె.

20


వ.

వెండియు నుపగూహనం బాచరించి పతత్రిసమేతుండగు చిత్ర
గ్రీవు వీడ్కొని నిజగృహంబునకుం జని సుఖంబుననున్న సమయమ్మున,

నఖిలవృత్తాంతదర్శియగు లఘుపతనకుండు నాహ్లాదపల్లవితహృదయుండై
చనుదెంచి హిరణ్యకున కిట్లనియె.

21


సీ.

చెలిమి నీతోడుతఁ జేసెదఁ గడు[మహ]
                    నీయపాత్రుండవు నీవు దలఁప
ననిన హిరణ్యకుం డపుడు నీ వెవ్వండ
                    వనినఁ గాకంబు నే ననియె, మూషి
కంబు, నీతో మైత్రి గావింపఁబోలునే!
                    యే నీకు నాహారమైనదాన
ననవుడు, నాకు ని న్నాహార మొనరింప
                    నాఁకలి దీరునే! యరసి చూడఁ,


గీ

బ్రతుకుదును నీవు జీవింపఁ బతగవిభుని
భాతి, నామాట విశ్వసింపంగ వచ్చు
వదరుఁ బలుకులు నీడోద్భవములయందుఁ
గలవె! యిందుకు నీచెలికాఁడె సాక్షి.

22


వ.

అట్లు గావున మద్భాషణమ్ములు భవద్భావంబునం గైతవమ్ము
లుగా దలంచెదవేని యెఱింగించెద వినుము.

23


క.

ఖలుదంభము సుజనులపైఁ
గొలుపదు తృణవహ్నిశిఖల, కూపారజలం
బులఁబోలె, మది దలంపఁగ
బలభిన్నిభభోగ! నూత్న భరతాచార్యా!

24


వ.

అనిన విని హిరణ్యకుం డాలఘుపతనకున కిట్లనియె.

25


క.

ధరఁ జపలుఁ డఖిలకార్యాం
తరములఁ దమకించి పొలియు, ధర్మపరుఁడు బం
ధురమతి వివేకయుతుఁడై
కరము సుఖస్థితిఁ దనర్చుఁ గరణిక లక్ష్మా!

26


మ.

అనినన్, వాయస మిష్టమైనది గజస్యా[శ్వాన్వ]యోత్తంస! పెం
పున నీతోఁడి సఖత్వమన్న, విని యా పుణ్యాత్ముఁడేఁ జెల్మి యె

ట్లొనరింతున్! బరికింప నీవు బలవేగోపాయవిభ్రాజి వ
బ్బిన నుగ్రారివి విశ్వసింపఁ, బలుకన్ బెక్కేల! దంభోన్నతిన్.

27


గీ.

రసము [ల]గ్నివలనఁ గ్రాఁగి తదుష్ణంబు
దాల్చియైనఁ గలసి దాని నణచు
నల్పుఁ డధికునొద్ద ననఘభావము దాల్చి
యైనఁ గూడి చెఱుచు నాక్షణంబ.

28


క.

తనమిత్రుఁడైన రిపుఁడై
నను, దుర్జను నమ్మఁజనదు, నాగేంద్రము పెం
పునఁ గపటవిషము దాల్చును
ఘనమగు గూఢప్రవృత్తిఁ, గరణిక లక్ష్మా!

29


గీ.

మున్ను సాధ్యంబసాధ్యమ్ము నెన్నకున్న
నెఱిదలంపులు [నేగతి] నిబ్బరించు
నావ లవనీతలమ్మున నడచు టెట్లు
తద్విపర్యాయమైన చందమ్ము నొంది!

30


వ.

అని పలికి, యమ్మూషికాగ్రణి వాయసవల్లభు నమ్మఁజాలక,
గహ్వరాంతర్గతుండై దీర్ఘకృతకంథరుం డగుచు నవలోకింపుచు, నిట్లను.
నాకు నీవలని విశ్వాసద్రోహంబు లెఱుఁగఁబడవు. డోలాందోళితహృద
యుండనై యున్నవాఁడ, మతిమంతులకు నృశంసభయం బవ్విధంబ కదా!
యని చెప్ప విని లఘుపతనకుం డిట్లనియె.

31


క.

అవమతిభావము, మృత్కుం
భవిధిం జూపట్టు, సుజనుభావం బైనన్
బ్రవిమలహేమఘటముక్రియ,
వివరింపుము వారివలన, విఠ్ఠయ లక్ష్మా!

32


వ.

అదియునుంగాక, బహునగశిలోచ్చయాకూపారభారధురంధర
యగు నివ్వసుంధరకు విశ్వాసఘాతుకుండొక్కఁడ బరువగుట యెఱుంగవే!
నన్ను నకల్మషహృదయుంగా నెఱుంగుమనినఁ, దన్మధురవాక్యంబులకుఁ
బరమప్రీతుండై, యోలఘుపతనకా! నీకోర్కె సఫలం బయ్యెనని ప్రమాణ
పూర్వకంబుగా సఖ్య మ్మొనరించె, నప్పుడు,——

33

క.

ధర సజ్జనులకు ద్రవ్యము
పరికింపఁగఁ జెల్మి, శుద్ధభావంబున నొం
డొరుల ధనమెల్లఁ జూతురు
ఖరమాంసములట్ల, నెపుడు కరణిక లక్ష్మా!

34


వ.

అని తదుత్సవసమయంబున.

35


గీ.

స్వగృహసంగతుఁడయ్యు మూషకవిభుండు
వాయసమ్మును వీడ్కొనె వఱలు వేడ్క
నదియుఁ దనటెంకి కరిగి వనాంతరముల,
నఖిలమృగమాంసఖండమ్ము లరసి తెచ్చి.

36


చ.

తనచెలికాఁడు దానుఁ బ్రమదమ్మున మెక్కుచు సంతతోత్సవం
బునఁ జెలువంది యంత బలిభుక్ప్రవరుండును నాహిరణ్యకుం
గనుగొని, యీ ప్రదేశమునఁ గ్రవ్యములేదు శరీరపోషణం
బున కనఘాత్మ! కావలయుఁ బోయెద నెచ్చటికైన నిత్తఱిన్.

37


వ.

అని, యేతత్ప్రదేశంబు గడచి గవ్యూతిమాత్రంబు చనిన
నం దొక్కసరోవరంబు గల దందు మత్రియసఖుండు మంథరాభిధానుండగు
జరఠకమఠేంద్రుండు జలచరాహారమ్ముల నన్ను రక్షించు నే నచ్చటికిం
బోయెద, ననిన విని హిరణ్యకుం డిట్లనియె.

38


ఉ.

పాయఁగ లేను నిన్ను నను భద్ర! సరోవరమందుఁ గూర్పుమో
వాయస! యన్న చంచువుల వాని గ్రహించి చలమ్ము మీఱ, వై
హాయసవీథి నేఁగి కమలాకరమున్ బొడగాంచి వేడుకన్
వాయుచలత్తరంగచయవారికణమ్ముల, సేద దేఱఁగన్.

39


క.

అంతఁ బ్రియమ్మున మంథరుఁ
డెంతయు సంభ్రమముతోఁడ నేతెంచి, సరః
ప్రాంతమున నున్నవారల్,
సంతస మందించె నధికసత్కారములన్.

40


గీ.

అంత నీమూషికాగ్రణి, నాదరమునఁ
జంచువులఁ బూని విజనసంస్థానమైన

యివ్వనంబున కేతెంచి, తిప్పు డీతఁ
డెవ్వఁ డెఱిగింపుమనఁ, గాక మిట్టులనియె.

41


క.

అనఘా! వినుము హిరణ్యకుఁ
డను మత్తేభ[ముఖ]వాహనాన్వయముఖ్యుం
డనుపమమతి, నమరగురుం
డనఁబరగును నఖిలగుణసమంచితుఁ డరయన్.

42


వ.

అని చిత్రగ్రీవోపాఖ్యానం బతని కెఱింగించి యితండు పరమోప
కారి యగుట దెలిసి సకౌతుకంబుగ మిత్రత్వం బొనరించితి నన, నా కచ్ఛపేం
ద్రుండు విస్మితహృదయుండై హిరణ్యకుం గనుగొని,—

43


క.

అనఘా! విజనారణ్యం
బున కరుదెంచినవిధమ్ముఁ బొలుపొందఁగ నే
వినవలతుఁ జెప్పవే యని
తను నడిగినఁ జెప్పఁదొడఁగెఁ దన్మూషికమున్.

44


వ.

మున్ను మహిళారూప్యంబను పురసమీపంబునఁ జూడాకర్ణుం
డను భిక్షుకుండు మఠస్థుండై యుండు నతనిం జూచు వేడుక [బృహస్వి]
నామధేయుండగు భిక్షుకుండు సేరవచ్చిన నతని నెదుర్కొని యభ్యా
గతపూజలం బరితృప్తునిఁ జేసి, యతం డానతిచ్చు హరికథలు విను
సమయంబున, నాచూడాకర్ణుండు భిక్షమ్ము దెచ్చుకొని భుజియించి శ్లేషిం
చిన యన్నం బొకపాత్రను సంఘటించి తత్సమీపమ్మున మనుచుకొనియున్న
సమయంబున నేను నామఠమ్ము బిలంబులో నివాసమ్ముఁ జేసికొని
యుండి బహుపదార్థసంగ్రహుండ [నయ్యును], లోభంబున క్షుత్పిపాసా
పరవశుండనై బిలంబు వెళ్లి వచ్చి తచ్ఛేషాన్నంబు భుజియించుచుండఁ
జూడాకర్ణుండు నన్నుం గనుగొని కథ వినుట మాని యొకవంశదండంబున
న న్నడిచిన నే నది తప్పించుక బిలమ్ము లోపలికిం బోయితి, నాసమ
యంబున.

45


సీ.

మూషికమ్మును గొట్టె మూర్ఖు చూడాకర్ణుఁ
                    డని బృహస్వియుఁ గోపమడరఁ జూచి

కథలు నే వర్ణింపఁగాఁ బరభ్రాంతిచే
                    నవ్యచిత్తుఁడ వైతి వాగ్రహమున
నెలుకఁ గొట్టఁగఁబోతి చలశేముషీ! యన
                    నతఁ డిట్టులను, భిక్షమెల్లఁ దినిన,
దండించితిని నాఁగ దానికి బలఁగమ్ము
                    గలదొ! యొక్కటొ! చెప్పు ఘనుఁడ యొక్క


గీ.

యెలుకమాత్రంబునకు నింత యలుగనేల
యతిపతీ నీకు! కల దొక్కయమితకథయు,
మున్ను వారణమూషికములకు ననిన
నానతిమ్మని స్థలభిక్షుఁ డడుగుటయును.

46


వ.

మహాత్మా! తొల్లి గోదావరీతీరంబునఁ బ్రభంజనమ్మను పట్ట
ణంబు గల, దాపురిసమీపంబున శోణితయను నది ప్రవహించుచుండు,
యేటిచెంగటి నేలబొఱియలలో విఘ్నకుండను మూషికంబు నివా
సంబు జేసికొనియుండి, సమీపక్షేత్రంబుం బండిన ధాన్యం బాహారంబు
జేసికొని, యొక్కనాఁడు ప్రమాదవశంబున నేటిలోనంబడి ప్రవాహమ్ము
వెంబడి వఱదంబోవు నవసరమ్మున,—

47


క.

వారణపతి భీముండను
ధీరుఁడు జలకేళి సల్ప, దేవియు దానున్
ఆరూఢిగ నయ్యేటికిఁ
గోరిక నేతెంచి నీటఁ గ్రుంకుచునుండన్.

48


వ.

ఆవిఘ్నకుండును జలంబులం బడిపోవుచు శుండాలమిథు
నంబు గని, డగ్గఱంబోయి కరిరాజా! దిక్కులేక వఱదం బోవుచున్నవాఁడ
నన్ను వెడలింపుము నీకు నొకయవసరంబునకు వచ్చువాఁడ, నన్ను గొంచెం
బని చూడకుమని విన్నవించిన గజపతియును గృపాసముద్రుండు గావున
నాగజముఖాశ్వంబు దనకరంబునం బట్టి యేటిదరినిం బెట్టె, నదియును నతని
దీవించి నీకు నాపద వచ్చువేళఁ దన్నుం దలంపుమని చెప్పి తన్నిలయంబున
కరిగె. నంత గజేంద్రుండును జలకేళి సాలించి తనసతియుం దానును దత్సమీ
పారణ్యంబున నిష్టచర్యల వసియించియుండె,— అంత నేసుఁగు వేఁటకాండ్రు
తద్విపినంబు ప్రవేశించి యోదంబులు ద్రవ్వి చిల్లరత్రోవలు గట్టి కరినాథుఁడు

వదినిఁ జేరుట కొకత్రోవఁ జేసి, యచ్చటచ్చట పచ్చికయు నిక్షుదండంబులు
నెరపి చుట్టును ముల్లడచి తమతమగృహమ్ములకుం జనినసమయమ్మున.

49


క.

గజపతి సతియును దానును
గజిబిజి లే నట్టియడవిఁ గాలూదకఁ వే
గఁ జనియు మేపులు మేయుచు
నిజముగ నోదంబులోన నెరిఁబడి [రంతన్].

50


క.

సతిపతులు గ్రంతఁబడి యా
తతమతి వెడలంగ లేక దైవమ! యనుచున్
మతిఁ గలఁగుచుండి, మూషిక
పతిఁ దలచుఁడు, నతఁడు వచ్చె బంధుయుతుండై.

51


గీ.

వచ్చి వంగిడిఁ బడియున్న వారణములఁ
గాంచి దుఃఖితుఁడై బలఁగంబుఁ జూచి
దరుల నొరలంగ ద్రవ్వి యీదంతియుగము
వెడలఁ దివియంగవలయు వివేకులార!

52


వ.

అని తనకులపతులకుం జెప్పి యసంఖ్యాతంబులగు నెలుకలంగూర్చి
యాక్షణంబున వంగిడిం బూడ్చి గజద్వయంబును వెడలించిన,—

53


గీ.

గుంత వెడలివచ్చి కుంజరయుగళమ్ము
మూషికమున కెలమి మ్రొక్కి మ్రొక్కి
నీవు గలుగఁబట్టి నేఁ బ్రతికితి నీకు
బిడ్డ పేరు పెట్టి పెంపుగందు.

54


వ.

అని కరిపతి మూషికపతినిఁ బెక్కువిధమ్ముల స్తుతియించి నేఁ
బోయివచ్చెద నన్ను మఱువకుమీ! యని చెప్పి యెలుకకులమ్ముచేత నా
మంత్రితుండై థేనరిగె. ఎలుకరాజును గజపతికిఁ దనకు వచ్చిన
పూర్వబద్ధసఖ్యమ్ముఁ దనకులంబువారలకుఁ జెప్పుచుఁ దనయింటి కరిగెనని
బృహస్వి చూడాకర్ణున కెఱిఁగించి వెండియు నిట్లనియె.

55


క.

శాండిలి యనఁదగు బ్రాహ్మణి
దండిగఁ దననాథువలనఁ దగ వినిన కథల్

వెండియుఁ గలవని చెప్పిన
యండను, నవి తెలియఁజెప్పుమని యడుగుటయున్.

56


వ.

ఇట్లు చూడాకర్ణుం డడిగిన బృహస్వి యిట్లనియె, మున్ను వేదాగ్రేసరుం
డను బ్రాహ్మణుండు తనగృహంబున వసించియుండి యొక్కనాఁడు.

57


చ.

తనసతిఁ జూచి పర్వ మిటఁ దామరసానన! డాసె, విప్రభో
జన మొనరింపవే! యనుచు సామవచస్స్థితిఁ బల్కె, లేదు పొ
మ్మనిన, నమర్షదారుణతరాననుఁడై మును జంబుకంబు, గూ
ర్చిన పటలంబు, వాపి తుదిఁ జేరదె! కాలుపురంబు వింటిచేన్.

58


క.

అనిన నదెట్లని, విప్రుఁడు
తనునడిగినఁ బ్రాణసతికిఁ, దత్కథఁ జెప్పెన్
మును లుబ్ధకుఁ డొకపురమున
ననవరతము మాంసవిక్రయస్ధితి నుండున్.

59


వ.

ఉండి యొక్కనాఁ డతండు మృగయాభిరతి నరణ్యంబునకుఁ జని
యొక్కకణితిమృగమ్ము నేసి, దానిం గావడించుకొని చనుచుండ, నొక్క
వరాహం బెదిరినఁ దనమనంబున.

60


ఉ.

దైవముచేతఁ గూర్పఁబడె తథ్యము మాంసమటంచు నుర్విపై
జీవము లేని తన్మృగముఁ జేర్చి వరాహముఁ జంప, దానిచే
నావలఁ గూలెఁ గోశయుగళాంతర[1]గాహితఘోరదంష్ట్రుఁడై
యావిధ మెల్లఁ జూచి ముదమందుచు నొక్కసృగాల మత్తఱిన్.

61


వ.

అధికక్షుత్పరవశుండై యామిషాభిరతిం జనుదెంచి యిది దైవోప
పాదితంబని తలయూఁచి ధ్రువనామధేయుండగు జంబుకంబు తనమనంబున
నిట్లని వితర్కించె.

62


క.

ఒకదినము గడచు నీలు
బ్ధకమాంసము, కణితిమెగము దంష్ట్రియు రెణ్ణా

ళ్ళకుఁ జాలుఁ జాప మౌర్వీ
ప్రకటములగు నరము లివుడు పారణ సేతున్.

63


గీ.

అనుచు లుబ్ధకమృగవరాహములఁ దత్ప్ర
దేశములఁ బెట్టి డాసి దురాశఁ జేసి
యల్లెఁ గొఱికినఁ దెగి హృదయమునఁ బడిన
నంతకునిఁ జేరె జంబుక మాక్షణమున.

64


క.

అని యివ్విధంబు దెలియన్
వినిపించి యతండు దేవవిప్రులకుం గా
క, నరులు తమకై కూర్చిన
ధనమంతయు నిలువదనుచుఁ దరుణికిఁ జెప్పెన్.

65


వ.

అని యివ్విధంబునఁ జూడాకర్ణునకు నాబృహస్వి యెఱింగించి
యమ్మూషికధనంబు, దేవభూదేవయోగ్యంబు గాదు. ద్రవ్యంబు కలిగియు
దురాశవలన భిక్షాన్నంబు భక్షించి యనవరతంబు నీ కపరాధం బొనరింపు
చున్నది నే యతిఁ గావున దీనియర్ధంబు నఖిలంబు గ్రహించితినని సంభ్రమంబున
లేచి మన్నిలయంబు జేరి.

66


ఉ.

కేల ఖనిత్ర మొప్పఁ బరికింపుచు మద్బిలభూమిఁ జేరి యా
భీలతఁ ద్రవ్వి నాధనము భీముఁడు గైకొనె నాఁటనుండి, దుః
ఖాలసమార్తినై, యిడుమ లందుచుఁ గుందుచు నివ్విధంబునన్
బేలక్రియన్ జరింపుదు నభేద్యగుణోన్నత! విభ్రమంబునన్.

67


వ.

అని చెప్పి మఱియు నిట్లనియె.

68


క.

ధనముగలవాఁడె పండితుఁ,
డనఘుఁడు, ఘనకీర్తిమంతుఁ, డన్వయపూజ్యుం,
డనవరతదానశీలుఁడు,
విను మవనీతలమునందు విఠ్ఠయలక్ష్మా!

69


క.

పరదేశమె నిజదేశము
పరులే బాంధవులు ద్రవ్యపరిపాలునకున్
ధరణి నసాధ్యం బెయ్యది!
పరమార్థం బిదియె నూత్న భరతాచార్యా!

70

క.

కులసతి రోయును జుట్ట
మ్ములు వాయుదు రొరులు కష్టపుంబలుకుల ని
మ్ముల నాడఁదొడఁగుచుందురు
కలియుగమున ద్రవ్యహీనుఁ గరణిక లక్ష్మా!

71


క.

మృతిఁ బొందిన జనునైనను
హితులెల్లను డాయుదురు మహీస్థలిలోనన్
మతిఁ దలఁపఁ బేదఁ జేరరు
బ్రతిమాలిన, నొరులు నూత్న భరతాచార్యా!

72


క.

ఇలలోపల ధీయుతునకు
వలయును దృఢమనము బంధువర్గము పొగడన్
దలపోసి చూడ, లేమియుఁ,
గలిమియు, పోవచ్చు గానఁ గరణిక లక్ష్మా!

73


క.

పామరుల వేడఁజేయును
ధీమద మణఁగించి బుద్ధి తేకువ చెఱుచున్
ప్రేమ[వ]తులఁ [నెడఁ]బాపును
లేమియుఁ గష్టమ్ము సూక్ష్మలిఖితాచార్యా!

74


క.

తలఁప దశవాజిమేధ
మ్ములనైన ఫలమ్ము చలనబుద్ధిరహితుఁడై
చెలిమి యొనరించు, సద్గుణ
కలితుండగు నరునిఁ బొందుఁ గరణిక లక్ష్మా!

75


గీ.

ధనము పోయిన దృఢలక్ష్మిఁ దఱుగనీక
మంచిమనమున సద్ధర్మ మహితపదము
దప్పి నడవక, పరులసంతాప ముడుప
వైద్యుఁడన సంచరింతు భూవలయమందు.

76


వ.

అని యివ్విధంబున నాహిరణ్యకుండను వెలుక నిజకథావృత్తాం
తంబును నీతిప్రకారంబును నెఱింగింప నాకర్ణింపుచున్న జరఠకచ్ఛపేంద్రుం
గనుంగొని లఘుపతనకుం డిట్లనియె.

77

క.

కరి బురదబొందఁ బడినను
గరియే వెడలించుఁగాక! కాకులతరమే
నిరుపమపుణ్యుం డీతని
నరయంగను నీక కాక యన్యులవశమే!

78


మ.

అనిన న్మంథరుఁ డట్ల కాకయని మీనాహారసంతుష్టచి
త్తునిఁ గావింపుచుఁ గాకమూషికసమేతుండై గుణగ్రాహ్యుఁడై
చనుమానంబున నుండగా నెదుట నాశ్చర్యంబుగాఁ దన్మహా
వనమధ్యంబున నాడు బంతికరణి న్వచ్చెన్ మృగం బుధ్ధతిన్.

79


వ.

అయ్యవసరంబున విహ్వలీకృతహృదయుండై మంథరుండు
కాకంబు నీక్షించుచుండంబంచి మూషికంబును నేనును నిచ్చటనే యుండు
దుము లేడి వచ్చినవిధంబు శీఘ్రంబున నెఱింగి రమ్మనిన, వల్లెయని యదియు
నుం జని యొక్కమహీరుహంబుపై వ్రాలి, యామృగంబున కిట్లనియె.

80


గీ.

ఎవ్వఁడవు నీవు బెదకంరంగ నేమి కార
ణంబు నీపూర్వకథయెల్ల నాకుఁ జెప్పు
మనిన వెరగంది మృగము తిర్యఙ్ముఖంబు
చేసి కాకంబుతోడుతఁ జెప్పఁదొడఁగె.

81


వ.

[ఏను చిత్రాంగుండనువాఁడ ము న్నొక్క]యటవీప్రదేశమ్మున
నాజననీజనకులు నివాసమ్ము చేసికొని మాయమ్మ నన్ను గర్భమ్ముతో
నుండి సుఖప్రసవంబు చేసిన దివసంబున.

82


గీ.

శబరుఁ డొక్కఁడు వేడుకఁ జపలుఁ డగుచు
నడవిలోపలఁ దిరుగాడి యమ్మ నన్ను
గన్నచోటికి నేతెంచి కాంక్షతోఁడ
నేయఁగడఁగిన నాతల్లి పోయె పారి.

83


క.

తడియారకుండ నేనును
దడబడుచుండంగ బోయ దగ్గఱి సనన్నున్
వడిఁబట్టి యెత్తుకొని తాఁ
గొడుకని భూమిపతి కమ్ముకొనియెన్ బ్రీతిన్!

84

గీ.

బోయచేతఁ గొనుక భూపతియును దన
పుత్రున కిడె నతఁడు ప్రోది చేసి
నన్ను బెంచి వేడ్క నా[పదములఁ] బైఁడి
యందె లిడియె నాకు నంద మొంద.

85


వ.

నేను భూపతికుమారున కల్లారుముద్దు సేయుచు వేడుకవేళ
వెంటవెంటం దిరుగుచు గంతు లిడుచు పరువులు వారుచు సందుల దూరుచు
బాలుల మీఱుచు నుండియుండి యొక్కనాఁడు బాలుతోఁడం గూడి పురో
పవనమ్మునకుం జని వంగివంగి పచ్చిక మేయుచుండ.

86


ఆ.

బాలుఁడొకఁడు వచ్చి పట్టినన్ గొట్టిన
నిరపరాధి నన్ను నీవు గొట్ట
నేల యనుచు నేను బాలునిఁ దిట్టితి
నలి మనుష్యభాషణముల వేగ.

87


వ.

నే తిర్యక్కనైయుండియు మానవభాషణమ్ములఁ బలికిన పలు
కులు రాజకుమారుం డాలించి,—

88


శా.

నావాక్యమ్ములు మర్త్యభాషణము లైనన్ రాజపుత్రుండు మో
హావేశమ్మును బొంది తేఱి యపు డాద్యంతం బెఱింగించె రా
డ్దేవస్వామి కతండు రేపకడ భూదేవోత్తమశ్రేణిలో
నావృత్తాంత మెఱుంగఁ జెప్పె మదిలో నాశ్చర్య ముప్పొంగఁగన్.

89


గీ.

అమ్మహాత్ములు గ్రహశాంతి యపుడు చేసి
బాలు దీవించి యమ్మహీపాలువలన
ద్రవ్యసంపదఁ బొంది నితాంతసమ్మ
దమున నృపు గాంచి పలికి రాసమయమందు.

90


వ.

దేవా! యిది యొక్కకారణంబున మృగశరీరంబు నొందినది
గాని మృగమ్ముగాదు. దైవభాతి భవన్మందిరంబున నిలుపవలదు. మున్ను
దీనిం గొని తెచ్చిన లుబ్ధకుచేతనే యథాస్థానంబున విడిపింపవలయు నన నభ్భూ
వల్లభుం డ్రాహ్లాదపల్లవితహృదయుండై యట్ల చేయించె నవ్విధంబున—

91

క.

ఏనును నాతల్లిం గని
దీనతఁ గలిసికొని యడవిఁ దిరుగుచు నంతన్
మానుగఁ జన్నులు గుడుచుచు
నానాఁటికి దేహపోషణంబును గంటిన్.

92


ఆ.

అందుఁ బెద్దకాల మఖిలబంధువులతోఁ
గూడియుండఁగలిగెఁ గొమరు మిగుల,—
పిదప నొక్కబోయ ప్రేరేపఁగనుబాయ
వలసె నిపుడు దైవవశమువలన.

93


వ.

ఇది మత్పూర్వవృత్తాంతంబు జవసత్త్వసంపన్నుండ నయ్యును
బోయవానియురులు నాచరణమ్ములం దగులుటం జేసి కుంటువడియున్న
వాఁడ, ననినఁ గాకంబు సకౌతుకంబుగా నిట్లనియె. హరిణపతీ! భవద్బం
ధమ్ము వాయు నుపాయం బే సంఘటించెదనని చెప్పి మంథరహిరణ్యకు
లున్నకడకు వచ్చి వేఁటవృత్తాంతం బెఱింగించి క్రమ్మఱ ౘని మృగపుంగవుం
దోడ్కొని చనుదెంచిన,

94


క.

ఆమంథరుండు ప్రియమున
సేమమె చిత్రాంగ! బోయచేఁ బడి సుకృత
శ్రీ మహిమ మగుడఁ బ్రతికితె
నామందిరమందు నిలుము [నానెయ్యమవై].

95


గీ.

అనుచుఁ బాశమ్ము లాహిరణ్యకునివలనఁ
బాయఁజేయించి కారుణ్యభావ మొప్ప
నతిథిసత్కారపూజల నాదరించి
చెలిమి యొనరించె నిశ్చలచిత్తుఁ డగుచు.

96


ఉ.

పంబిన వేడ్కతోడుత నుపాయచతుష్టయమో యనంగఁ బు
ణ్యంబులకెల్ల నెల్లలగు నల్వురు గూడి లసత్కథాప్రసం
గంబులఁ బ్రొద్దు పుచ్చుచు సుఖస్థితి నుండగ నంతఁ గొంతకా
లంబున కొక్కలుబ్ధకుఁ డలాతభయంకరుఁ డేఁగుదెంచినన్.

97


ఆ.

ఎగసి చనియెఁ గాక, మెలుక గర్తంబున
కేఁగె, నడవిమృగము డాఁగె మృగయుఁ

డాశ విడిచి వచ్చి యమలజలాంతర
గతునిఁ గమఠవిభునిఁ గాంచె నపుడు.

98


క.

ఇది నాకు సంభవించెన్
బదివేలని మూఁటివెంట బారక యతఁ డ
మ్ముదికమఠము చిక్కమ్మునఁ
బదిలమ్ముగ నిలిపి చల్ది భక్షింపంగన్.

99


వ.

అయ్యవసరమ్మునఁ గాకహరిణమూషికంబులు ముగ్గురుం గూడి
యుద్యోగవంతులు బుద్ధిశాలు లగుటం జేసి తత్సవిూపంబునకుం జనుదెంచి
జలప్రాంతంబున నున్న కృతాంతనిభుడగు లుబ్ధకుని, నతనిచెంతం బట్టువడిన
నెచ్చెలిం గనుగొని శోకవ్యాకులితచిత్తులై పురపురంబొక్కుచు నలుదిక్కులు
సూచుచు మనము మువ్వురము నతనియండ వసియించి బ్రతికితి మింక
నితండు విడివడునుపాయం బెయ్యదియొకో యని తలంచుచున్నసమయంబు
నందు హిరణ్యకుం డిట్లనియె,—

100


క.

చెలికాఁడు రక్షకుఁడు ని
ర్మలచిత్తుఁడు కూర్మవిభుఁడు మనలను బాసెన్
దలపోయుఁ డతఁడు లుబ్ధకు
వలనం బెడవాయు నేర్పువఱలు మతమునన్.

101


క.

నిలువెల్ల ధర్మరూపము
తలఁపెల్లను దలఁపఁ బరహితం బమృతమ్ముల్
పలుకులు సువిచారత ని
ర్మలచిత్తుం డితని బాయరాదని మఱియున్.

102


క.

కాయంబు, లనిత్యంబు, ల
పాయంబులు వైభవములు ప్రాజ్ఞులకైనన్,—
పాయదు మృత్యువు, ధర్మో
పాయము దగుఁ బ్రజకు నూత్న భరతాచార్యా!

103


వ.

అని హిరణ్యకుండు నీతిమార్గం బుపదేశించి యితనికింగా మనము
శరీకంబులు విడిచిన నేమి యని నిశ్చయించిన వానిపలుకులు వినియు వినని

యట్లు బోయ కుడిచి కమఠంబును ధనువుకొప్పునఁ దగిలించికొని చనుచుండ
నమ్మూవురును లుబ్ధకప్రతిబంధంబులువోలె వెసఁదగిలి చనుచుండ నతం
డొక్కజలాశయంబు గనుంగొని యందు మధురంబులగు జలమ్ములు
ద్రావుచున్న సమయంబున,

104


చ.

త్వరితగతి న్మొగమ్ము తనుఁ దాఁకుచుఁ బారిన లేడిఁ గాలకిం
కరనిభమూర్తి లుబ్ధకుఁడు గాంచి పరాకుగ భేదితాంగదు
ష్కరతరపీడఁ జిక్కెనని సంభ్రమియై వెనువెంట నేఁగ నా
తురరుతముల్ చెలంగ నది దూరమునన్ బడియె న్మహీస్థలిన్.

105


వ.

అంతలోన.

106


శా.

కాకం బుద్ధతి నేఁగి చంచువులఁ దత్కాయంబు భేదించిన
ట్లాకాలమ్మునఁ జేసి లుబ్ధకుఁడు వాంఛాపూర్ణచేతస్కుఁడై
నాకుం జిక్కెనటంచు డగ్గఱిన యంతన్, బోయె నారెండు న
స్తోకాహ్లాదముతో నతండు మిగులం దుఃఖాంబుధిం దేలుచున్.

107


వ.

మగుడి చనుదెంచి నంత నమ్మూషికవిభుండు తనతీక్ష్ణరదనాగ్రం
బుల జాలంబు తుత్తునియలు గావించి సంభ్రమంబున నొక్కరంధ్రాంతరా
ళమ్మునకుం జనె నాసమయమ్మున,—

108


క.

రయమునఁ గచ్ఛపము జలా
శయమునకుం బోయె బోయ చనుదెంచి విషా
దయుతుండై మగిడి నిజా
లయమునకుం ౙనె వివర్ణ[ల]పనుం డగుచున్.

109


వ.

ఇట్లు శబరపుంగవు నోట్రించి కాకహరిణమూషికంబులు నిజ
సఖుండగు కచ్ఛపేశ్వరుని విడిపించుకొని సంతోషాతిశయంబునఁ గ్రమ్మఱ
లఘుపతనకహిరణ్యకమంథరహరిణపతులు గూడికొని తమతమయథా
స్ధానంబులకుం జని సుఖపరాయణులై యుండిరని విష్ణుశర్మ రాకుమారులఁ
బ్రహృష్టహృదయులం జేసె నంత,

110


శా.

పారావారగభీర! విభ్రమవతీపాంచాల! కారుణ్యవి
స్తారోదారకటాక్షవీక్షణ! సుధాంధస్సింధుతారాగస

ద్ధీరా, శాగజ, కాశ, శారద ఘనా, హీన, స్ఫురత్కీర్తి ల
క్ష్మీరాజీవదళాయతేక్షణ! బుధశ్రేణీపరీరక్షణా!

111


క.

గంభీరవాగ్వినిర్జిత
కుంభీనస! గోత్రశైలకూర్మాహిపసత్
కుంభీంద్రభారభరణవి
జృంభితదోస్స్తంభ! శౌరిసేవాభ్రమణీ!

112


తోటకవృత్తము.

హితబాంధవకల్పమహీరుహ! సం
తతభోగవినిర్జితనాకప! భూ
నుతసూనృతవాక్య! వినూత్నకళాం
చితకీర్తి! వినందితశిష్టజనా!

గద్య
ఇది శ్రీభారతీవరప్రసాదలబ్ధవిద్యావిచిత్ర, తిప్పనమంత్రి
పుత్ర, సుజనవిధేయ, భానయనామధేయ,
ప్రణీతంబైన పంచతంత్రి యను
మహాప్రబంధంబునందు
ద్వితీయాశ్వాసము

  1. భేదిత అని మూలము