Jump to content

పంచతంత్రి/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

తృతీయాశ్వాసము

శ్రీనాథచరణకమల
ధ్యానపరాయణ! బలారిదంతావళశు
భ్రానమితకీర్తివర! ల
క్ష్మీనారాయణ! కళావిశేషవిధిజ్ఞా!

1


వ.

సంధి విగ్రహంబను తృతీయతంత్రం బాకర్ణింపుము,—

2


చ.

మొదల విరోధియైన యతిమూఢుసఖిత్వము విశ్వసించినన్
దుదిఁ జెడిపోవు భూవిభుఁడు, దొల్లి గృహాంతరఘూకపంక్తి యొ
ప్పిదముగ వాయసప్రభుఁడు పేర్చిన భీకరవహ్నికీలలన్
మదమఱి కూలదే! యన కుమారు లదెట్లని తన్ను వేఁడినన్.

3


క.

ఆవిష్ణుశర్మ దృఢమతి
జీవప్రతిమానుఁ డపుడు సెప్పెన్ దెలియన్
భావజనిభరూపుల కా
భూవరపుత్రులకు వేడ్క భూరిప్రీతిన్.

4


సీ.

తనశాఖ లేర్చి మార్తండునితేరిప
                    ద్ధతికి మిక్కిలి విరోధం బొనర్ప
తననీడ ధారుణీధవళాయతాక్షికి
                    నాతపత్రక్రియ నతిశయిల్ల
తనకోటరములు పతంగపుంగవులకు
                    నెంతయుఁ జెలువొందునిండ్లు గాఁగ
తనఘనమూలసంతాన మశ్రాంతము
                    శేషుతోఁ బాయనిచెలిమి సేయ


ఆ.

ప్రళయవేళ నైన పత్రమాత్రనె విష్ణుఁ
బ్రోవఁ ౙాలుననుచు బుధులు దలఁప
నొక్కయడవి నడుమనుండుఁదావలముగ
పటము భవనవినుతజటము నగుచు.

5

క.

ఆతరుశాఖను బలిభు
గ్రాతము సేవింప నొక్కవాయస ముండున్,
జాతి దనుఁ గొల్వ నతిప్ర
ఖ్యాతిగ నుండును దివాంధ మశ్రాంతమ్మున్.

6


వ.

ఇట్లుండి యొకనాఁ డతిక్రోధారుణీకృతలోచనుం డగుచు విమ
తాభిధానుండగు దివాంధవల్లభుండు ఘూకసహస్రపరివృతుండై విభావరీ
సమయంబునఁ బ్రభంజనజవంబునం జనుదెంచి నిద్రావశంబు నొందియున్న
వాయసవిసరంబుపైఁ బడి చరణనఖకమ్ములన్ జంచుపుటమ్ముల భేదింపఁ
దొడంగిన, నందు పరిదేవనారుతమ్ముల గగనమ్మున కెగసియు, నన్యభూజ
మ్ములన్ జేరియు, దిగ్భ్రమం బొందియుఁ, గృతాంతనిలయమ్ము డాసియు,
ని ట్లనేకప్రకారమ్ములఁ బలాయనత్వంబు నందినఁ గాకిమూఁకలకు దొరయగు
మేఘవర్ణుండనువాఁ డప్పుడు,—

7


క.

పరుల కభేద్యంబగు త
త్తరుకోటరమునను డాఁగి తనజీవంబున్
వెరవొంద నిలుపుకొని భా
స్కరోదయమ్మైన శోకసంయుతుఁ డగుచున్.

8


వ.

ఉండు నవసరమ్మున, నతనిమంత్రులు, నుద్దీపి సందీపి ప్రదీప్యాదీపి
చిరంజీవులను నేవురు దివాంధవల్లభుబారికిం దప్పి యొక్కటం గూడికొని
తమయేలిక యగు మేఘవర్ణుం డున్నచోటికిం జని దండప్రణామం బాచరిం
చిన బలిభుగ్వల్లభుం డిట్లనియె,—

9


గీ.

బ్రతికితిరె! మీరు కౌశికప్రతతిచేత
నిట్టియాపద సనుదెంచె నేమి సేయ
వచ్చు, దైవవశంబని వారితోఁడఁ
బలికి చింతావశీకృతభావుఁ డగుచు,—

10


వ.

అయిన నేమి కాఁగలకార్యంబులు కాక మానునె! మన కిప్పుడు
సేయవలయుకృత్యం బెయ్యది యెఱింగింపుఁ డనిన నందు నుద్దీపి యిట్లనియె.

11


క.

తనసదృశుఁడైన సామం
బును, నల్పుండైన దండమును, మత్తుండై
నను భేద, మధికుఁడైనను
బనివడి దానమ్ము సేయఁ బరగు ధరిత్రిన్.

12

క.

శూరతయును గపటం బె
వ్వారలకేనియును గలుగు, వారిసమీపం,
బారయ విడిచి రయంబున
దూరస్థానంబు నొందుదురు ధీమంతుల్.

13


వ.

అని పలుక నవ్వాక్యమ్ము లాకర్ణించి, సందీపియాననం బాలోకించి
మన కెయ్యది కర్తవ్యం బని మేఘవర్ణుం డడిగిన, నతం డిట్లనియె,—

14


ఉ.

స్థానము వాయునంత నిజసైన్యసమూహము వాయు, వైరి సం
తానముమీఁది కార్యములు దా నొనరింపఁగ నోపఁ, డాత్మ ర
క్షానిభృతార్థితార్థి యగు గావున, బుద్ధిఁ దలంచి చూచినన్
స్థానబలమ్మె కావలయు ధారుణి, విఠ్ఠయలక్ష్మధీమణీ!

15


గీ.

నెలవు బాసి మున్ను నలహరిశ్చంద్రకౌం
తేయు లంతవారు దీనవృత్తి
నొదిగియుంట వినమె! మదిఁ దలపోసిన
బాయఁదగదు నేల ప్రాజ్ఞులకును.

16


వ.

అనిన విని యతండు ప్రదీపిం గనుంగొని యెయ్యది యాచరింపవల
యుననిన, నతం డిట్లనియె,—

17


చ.

అతిబలవంతుఁడైన విషయమ్మున వారలతోఁడి మైత్రి సం
తతమును నిశ్చలంబగు మనమ్మునఁ జేసి, నిజప్రదేశసం
గతుఁడయి పొల్చు టొప్పు, నది గాదని యొండొకదేశ మేఁగినన్
ధృతిమెయి పోరినన్, వినుము ధీయుత! నొచ్చు నతండు నేరమిన్.

18


వ.

అట్లు గావున వారలతో సామం బాచరించి యిచ్చట నుండుద మనిన,
నవ్వాయసవిభుండు, ఆదీపిం గనుంగొని భవన్మతం బెఱింగింపుమన, నతని కతం
డిట్లనియె,—

19


క.

పరు లొకకాలము చేకొని
పరిమార్చిరి మనబలంబుఁ బ్రస్ఫుటకీర్తిన్
బరిమార్ప మనము నాక్రియఁ
బొరిగొందము, కపటబుద్ధి పొగడిత కెక్కన్.

20

క.

వారు దివాంధులు మనము, వి
చారింప నిశాంధులము, నిశావేళ బలం
బారూఢమ్ముగ నొంచిరి
వారలు, దివమునను నొంపవలయును మనకున్.

21


క.

అని యిట్లు మంత్రులు హితం
బునఁ జెప్పిన నీతిమార్గము న్విని ధీమం
తుని ననఘు నాచిరంజీ
వినిఁ [గనుగొని] ప్రీతిఁ గాకవిభుఁ డిట్లనియెన్.

22


వ.

త్వద్బుద్ధిబలంబుపెంపునఁ గదా యివ్విభవం బనుభవింపఁగలిగె
నిప్పు డస్మత్కులోపభోగ్యంబగు రాజ్యం బరివశంబు గాకుండ నిలుపుమనిన,
నతం డిట్లనియె,—

23


గీ.

పరులకైతవంబు[వలన] నారంభమ్ము
లుడిగెనేనిఁ దలఁప్ర నొకటి కలదె!
[వివిధ]జీవరాశి విశ్వాసమున నమ్ము
కష్టవర్తనంబు గానలేదు.

24


చ.

అరయగ, మంత్రరక్షతగు, నాతతకైతవగూఢభావుఁడై
పరులకు నాప్తుఁ బోలి యనపాయ[గతిన్ హిత] మాచరింపుచున్,
బరుఁడుగ నొక్కవేళఁ దనవైర మణంచి [మెలంగ], బుద్ధి భా
స్వరుఁడయి యుంచు టొప్పు, గుణవార్నిధి! విఠ్ఠయలక్ష్మధీనిధీ!

25


వ.

అని యిట్లు చెప్పి యాచిరంజీవి యిట్లనియె దేవా! సామదాన
భేదదండమ్ములను నుపాయచతుష్టయమ్ముననుఁ, బ్రభుమంత్రోత్సాహం
బులను శక్తిత్రయంబువలనను, సంధివిగ్రహమానాసనద్వైధీసమాశ్రయం
బులను షడ్గుణంబులం దనరి, జ్ఞానశక్తిబలైశ్వర్యవీర్యతేజమ్ములను షడ్గు
ణైశ్వర్యంబుల సంపన్నుండై, భూతభవిష్యద్వర్తమానంబులను నెఱింగి
[న భూపాలుండు] పరుల కభేద్యుండని వెండియు నిట్లనియె,—

26


క.

తనశక్తియుఁ బరుశక్తియు
మనమునఁ దలపోసి శిష్టమంత్రుల బుద్ధుల్

విని యొనరించిన కార్యము,
ఘనకీర్తికి నెక్కు నవనిఁ, గరణిక లక్ష్మా!

27


క.

బకము క్రియ, వేళ యౌ నం
తకు, మౌనమ్మునఁ జరింపఁదగు, నటమీఁదన్,
బ్రకటమ్ముగ సింహము పో
లిక మెలఁగఁగవలయు, సూక్ష్మ లిఖితాచార్యా!

28


గీ.

ఇన్నిగుణములలోపల నేదియైనఁ
దనకు ననువగునట్టి చందమ్ముఁ జూచి,
దేశకాలముల్ మదిలోనఁ దెలిసి మెలఁగు
నతని బొందును సంపద లతిశయముగ.

29


వ.

మున్ను శౌర్యసంపన్నుండై దేశకాలమ్ము లెఱింగి చరించు నతని
గుణదోషమ్ము లెఱింగి విశ్వసింప జన.. భునిచేత.... రదు. మహో
ద్యోగిని నిందిర యాశ్రయించు, మంత్రప్రభావమ్మున దుష్టమృగభుజంగ
మశక్తుల నణంచునట్లు చోరులఁ, గామాతురుల, దోషస్వభావుల, నతిలుబ్ధుల,
దుర్మదాంధుల, సమరభీరులఁ, దద్దండనీతిచేత దండింపదగు. దైవమానుష
మ్ములు గల్గిన సహాయులగు నియామకులవలనఁగాని, పరవాహినీసందో
హమ్ముఁ దరియింప నలవి గాదని, యతం డిట్లనియె—

30


ఉ.

ఆరయ మంత్రమూలము జయ మ్మటుగావున, నీక్షణమ్మునన్
వారల జేరి నూత్నమృదువాగ్విసరమ్మునఁ దేల్చి, మైత్రి పెం
పారగఁజేసి కార్యఫల మందుట మేలన, నాలకించి ప్ర
జ్ఞారమణీయుఁ, దత్సచివసత్తము, నాతఁడు సూచి యిట్లనున్,—

31


క.

ఏరీతినైనఁ గౌశిక
వారముతో సంధిఁ జేయవచ్చునె! మనకున్
వారికి దలపోయం గడు
వైరంబని పల్కఁ, గాకవల్లభుతోఁడన్.

32


సీ.

ఆచిరంజీవి యిట్లను, విరోధంబున
                    కగు, కటువగుపల్కు గారణమ్ము

[కార్యమ్ము విహతంబు] గాదె! మున్వాగ్దోష
                    మున నన్న, నతనియాననము గాంచి
యెట్లన, వి[భునకు] నెఱిఁగించెఁ గల దొక్క
                    రజకు భారము వాపు రాసభి యం
వేసవి మేఁతకై వెస ద్వీపిచర్మావృ
                    తంబగు దేహమ్ము దాల్చి, రాత్రి
యైన, సస్యవితాన మరసి మేయుచునుండఁ
                    జేనికాపరి కాచి, చివికి చివికి
యలసి, యొకనాఁడు విల్లును నంపగములుఁ
బూని మసరకంబళమును ముసుఁగువెట్టి
పొంచికొనియుండ, [రాసభి] పూనిమేయ
వచ్చి, ధూసరకంబళి వానిఁ గనియె.

33


క.

ధూసరకంబళ మటు గని
రాసభమని కూయ, సస్యరక్షకుఁడు మదిన్
రా సభమని తలపోసి, శ
రాసనబాణమునఁ దన్ను నంతకుఁ గూర్చెన్.

34


వ.

అట్లు గావున వారలకును మనకును వైరంబు పెద్దకాలంబున
నుండి వాగ్దోషంబునం బొడమె, నది యెట్లనినఁ దొల్లి దివాంధవిభుని నొక్కని,
నఖిలపక్షులు పక్షిరాజ్యంబునకుఁ బట్టంబు గట్టుదమని చనుదెంచిన, నందు
మంత్రికర్ణుండను వృద్ధకాకవిభుండు చనుదెంచి పక్షుల కిట్లనియె.

35


గీ.

ఇతని నభిషేక మొనరింప నెట్లు వచ్చు!
దర్పసంయుతుఁ, డప్రియదర్శనుండు
పక్షులను నెల్ల భక్షించి బలిసికొనును
నల్పుఁ జేపట్టఁ గార్యమ్ము లగునె! దలఁప.

36


సీ.

అధికునిఁ బేర్కొని యల్పులైనను సంత
                    సము నొందుదురు, మును శశకవితతి
యేపునఁ దారకేశోపదేశమ్మున
                    బ్రతుకవే యని పల్కఁ బక్షు లవ్వి

ధంబంత నెఱిఁగింపఁదగునన్న నాతఁ డి
                    ట్లని చెప్పె, ము న్నొక్కవనమునందు
దంతులు ద్వాదశాబ్దంబు లనావృష్టి
                    యైనను, జలము లే కాత్మఁ గలఁగి,


గీ.

ద్విరదవిభుఁ జూచి పల్కె నో దేవ! చండ
కిరణుతాపమ్ము మేనును గ్లేశపరుప
...............................................
................................................

37


క.

కరివల్లభుఁ డంబుసరో
వరముల హ్రదములను వెదుక, వడిగల మత్త
ద్విరదమ్ములఁ బంచె దిగం
తరముల నవి చూచి వచ్చి, తమపతి యెదుటన్.

38


వ.

నిలిచి, యిట్లని విన్నవించె,—

39


చ.

కరిపతి! నీవు పంపఁ జని కంటిమి చంద్రసరోవరమ్ముఁ, బ్ర
స్ఫురదురుశంఖచక్రములఁ బొల్చి పయోరుహలక్ష్మి నెంతయున్
సురుచిరమై జనార్దనుతనుక్రియ నెప్పుడు మీఱుదానిఁ బు
ష్కరయుతమైనదాని, జలజంతుతతిన్ దగుదాని, నొక్కచోన్.

40


వ.

అని చెప్పిన విని, యతులితంబగు సంభ్రమంబునఁ దత్ప్రదేశమ్ము వాసి.

41


శా.

ఆనాగేంద్రుఁడు సంతస మ్మొదవ నుద్యత్కాలమేఘాకృతిన్
దానాంభఃకణసంచయమ్ము వడియన్, దంతావళశ్రేణితో
నానాభూజములెల్ల వ్రాల, శశసంతానమ్ము వైవస్వత
స్థానం బుద్ధతిఁ జేరబో, నడచెఁ జంచద్వేగసంరంభియై.

42


వ.

అయ్యవసరమ్మున శిలీముఖనామధేయుం డగు శశకవల్లభుండు
నిజప్రధానవర్గమ్ము నవలోకించి, వారణసందోహం బనవరతమ్మును జలాభి
లాష నన్యసరోవరమ్ములకు నడువ మనబలఁగంబెల్లఁ బొలియందొడంగె,
మనకుం జేయునది యెఱింగింపుఁడన, నందు బహువృత్తాంతవిదుండగు వృద్ధ
మంత్రి విజయుం డనువాఁ డిట్లనియె,—

43

ఆ.

దేవ! దంతిఘటల నీవనవీథుల
నడువకుండఁజేయ నాకు నేర్పు
గలదటన్న, నపుడు కౌతూహలస్వాంతుఁ
డగుచుఁ బలికె విజయు నవ్విభుండు.

44


క.

తడయక సేయుము విను, మె
క్కడ నీతివిదుండు దేశకాలవిభాగం
బడరఁగఁ దెలియును, నాతం
డిడుమలఁ గూడండు సిరియు నెంతయుఁ బొందున్.

45


క.

అని పల్క నాశిలీముఖు
పనుపునఁ ౙని విజయుఁ డపుడు భద్రేభములన్
గనుగొని చింతాకులుఁడై
తనహృదయములోన నపుడు దలపోసి తగన్.

46


క.

కాయం బల్పము, దంతిని
కాయము దానోత్కటంబు గావున, వినయో
పాయముననైన డాయ న
పాయము సేకుఱు నటంచుఁ బ్రజ్ఞాన్వితుఁడై.

47


వ.

విచారించి యొక్కభూధరశృంగం బెక్కి యోగజేంద్రా!
నీకు భద్రం బగు ననిన, నతండు నీ వెవ్వండవు! నీరాకకు గతం బెయ్యది నా కెఱిం
గింపు మన, నవ్విజయుం డిట్లనియె. గజపతీ! నేఁ జంద్రదూతను దన్మండల
మధ్యంబున విహరించుచుండు శశకవిభుండ, నాపేరఁ జంద్రుండు
శశాంకు డనిపించుకొనియె. నానాథుండగు చంద్రుఁడు నీతోఁడి సఖ్యం బపే
క్షించి, నన్ను నీసమ్ముఖమ్మున కనిపినవాఁడని వెండియు నిట్లనియె,—

48


క.

తలపోయ నిష్ఠురోక్తులు
పలికినఁ, దిట్టినను, భూమిపాలురకును వ
ధ్యులుగారు దూత లెందును,
బలభిన్నభభోగ! నూత్న భరతాచార్యా!

49


వ.

అట్లు గావున నే హిమకరునానతిం బలికెద, స్వపరశక్తి నెఱుం
గక యెవ్వండేని యజ్ఞానంబునఁ గార్యం బొనర్చు, నతం డాపదలం బొందు.

చంద్రాధీనంబైన యాసరోవరరక్షకుల నీవలఁచితివి. ఆశశకంబులం
జంద్రుండు నిజశరీరమ్ముగాఁ దలంచు, నదియునుంగాక పవలెల్ల నమ్మహా
త్ముం డాకసమ్మున వర్తించు, నిశాసమయంబున నాచంద్రసరోవర
మ్మున వసియించి యుండు, నీవును నీపరిజనమ్మును నిదాఘకాలమ్మున
కోర్వలేక యాచంద్రసరోవరంబు ప్రవేశించుటకై పోవుచున్నవారు.
అచ్చటికిం బోయిన నీకును నీ పరివారమ్మునకు నాపద వచ్చు. చంద్రచిత్తం
బెఱింగి నే నీకుం జెప్పితి, నాహ్రదప్రవేశంబును, శశకమర్దనంబును, బరిహ
రింపుమని చెప్పిన విని, గజేంద్రు డతిభయమ్మున నిట్లనియె,—

50


సీ.

అజ్ఞానకృతమున నయ్యెఁ దత్కమలాక
                    రంబు పద్ధతి, యిట రామటన్న,
గజవల్లభునిఁ జూచి విజయుండు పల్కె, నీ
                    వరుదెంచి యందలి యమృతకరునిం
జూచి పొమ్మని, రాత్రి సొంపారఁ దన్ను దో
                    డ్కొని చని యా కొలఁకునకు డాసి
పానీయములలోనఁ బ్రతిబింబితుండగు
                    చంద్రునిఁ జూపఁ, దత్సమయమందు
వందన మ్మొనరించి యో వారిజారి!
తప్పులెల్లను లోఁగొను దయదలిర్ప,
నెన్నఁ డీవంక రామని యేఁగఁ, గాంచి
శశకసంచయ మాత్మ నుత్సాహ మొందె.

51


వ.

ఇ ట్లుపాయమ్మున విజయుండు గజమ్ములం దొలంగించి తనభర్త
యగు శిలీముఖున కవ్విధం బెఱింగించి సుఖంబుండిరి. అట్లు గావున నీ
దివాంధుం బేర్కొన నాపద లణంగవు. హీనాత్ముండు ప్రజాపరిపాలనంబున
కొప్పునే! యని వెండియు నిట్లనియె,—

52


చ.

చెనఁటి నబుద్ధిఁ జేసి గుఱిఁజేసినవారలు, నొత్తు రెంతయున్
బెనుపరి కూలవే! శశకపింజలముల్ మును పిల్లిచే ననన్
విని పతగమ్ము లెట్లనిన, వేడుకఁ జెప్పెను దొల్లి భూరుహం
బున వసియించి యుండుదు బ్రభూతకుతూహలమానసుండనై.

53

గీ.

అందుఁ దరుకోటరమ్మున ననఘమతి క
పింజలమ్ముండు నాతోఁడఁ బ్రియము కలిగి,
అస్తమానా?వసరమున నరిగె నొక్క
నాఁడు నెందేని, మేతకై పోడిమిగను.

54


వ.

తదవసరంబున,—

55


సీ.

ఆకోటరమ్మున నప్పుడు దీర్ఘక
                    ర్ణుండను శశకవిభుండు నిల్చి
కొంతకాలం బుండ, నంత కపింజలుం
                    డేతెంచి నానెల వెవ్వఁ డిపుడు
గైకొన్నవాఁ డనఁ, గైకొన కాతఁ డి
                    ట్లను, నున్నవారిదే యరయ నెలవు.
ఎవ్వఁడు మున్నుండె నివ్వటిలంగను
                    వానిదే నెలవని, వాదులాడఁ
గని నేను వారలఁ గడకుఁ బోఁద్రొబ్బియుఁ
                    దగవుకు బొండని ద్వయము గూర్చి


గీ.

ప్రీతి నేఁగితి నపు డాకపింజలుండు
న్యాయ్య మిరువురకును దెలియంగఁ జెప్పు
నతని నెఱుఁగవె! నీ వని యడుగుటయును,
బరమసంతోషుఁడై వాఁడు పలికెఁ దెలియ.

56


వ.

యమునాతీరమ్మున నతిధార్మికుండను నొక్కవృద్ధమార్జాల
విభుండు గలం, డతండు మనకు ధర్మమార్గం బెఱింగించునని దీర్ఘకర్ణుండు పలి
కినం, గపింజలుం డిట్లనియె. వాఁ డల్పజాతి మనకు విశ్వసింపవచ్చునే! యన
వాఁడిట్లనియె.

57


గీ.

అతని మనకేల డాయంగ మతిఁదలంప
న్యాయమార్గమ్ము దెలిసి సన్మాన మొప్ప
మగుడి చనుదెంత మనినఁ దన్మానసమున
నాతఁ డిరువురకును సమం బని యెఱింగి,—

58

గీ.

అప్పు డిరువురు జవమున నరిగి వాని
కంతయును జెప్పఁ, గడువృద్ధ నైతి, నాకుఁ
జెవులు వినరావు డగ్గఱి చెప్పు మనుచుఁ,
బరమధర్మము విశ్వసింపంగఁ బలికె.

59


క.

సంసారము లస్థిరము, ల
హింసకు సమమైన [ధర్మ] మేదియొ, సుజనో
త్తంసునకుఁ దెలియఁదగు నది,
కంసారిపదాబ్జభృంగ! కరణిక లక్ష్మా!

60


క.

పరకాంతలఁ దల్లులక్రియఁ
బరవిత్తము పెచ్చుమాడ్కి భావించి మదిన్
బరులశరీరమ్ములఁ దన
కరణినిఁ జూడంగవలయుఁ గరణిక లక్ష్మా!

61


వ.

అని యివ్విధమ్మున నాదధికర్ణుండు పరమధర్మశాస్త్రంబు లుపన్య
సించిన, విని మనంబున విశ్వసించి [శశ]కకపింజలులు డగ్గఱిన, నమ్మార్జాలం
బయ్యిరువు భక్షించి తనశరీరంబు పోషణంబుఁ జేసికొనెఁ, గావున నిట్టి యల్ప
ఘూకంబు గుఱిచేసి సమస్తపక్షిరాజ్యంబునకు నభిషేకం బొనరించుట
యకర్తవ్యం బనిన నయ్యవసరంబున,—

62


చ.

పతగములెల్ల వాయసము పల్కులు తథ్యములంచు నేఁగినన్
మతిఁ [దలపోసి] రోషమున మండి దివాంధుఁడు కాకిఁ జూచి కు
త్సితమున కేమి కారణము [మిసీ] విభవమ్మున [కెల్లఁ బా]యఁ జే
సితి, మును నీకు నెగ్గొకటఁ జేసితినే యని పల్కె నల్కతోన్.

63


అది మొదలుగాఁ గాకోలూకమ్ములకు వైరానుబంధ మ్మయ్యె,
నన విని మేఘవర్ణుం డాకర్ణించి జయోపాయం బెఱింగింపుమనినఁ జిరంజీవి
యిట్లనియె, సంధివిగ్రహయానాసనద్వైధీభావమ్ముల నతఁ డసాధ్యుండు.
ఆశ్రయంబుననైనను, చిరప్రయాసంబుననైనను, బగతున కపాయంబు నొందింప
వలయునని వెండియు నిట్లనియె,—

64


గీ.

పరులు పెక్కండ్రు గూడి సర్వజ్ఞునైన
మోసపుచ్చంగవచ్చు మున్ భూసురుండు

ఛాగ మచ్చట విడువడె! శఠులవలన,
ననినఁ గాకేంద్రుఁ డెట్లని యడుగ, నతఁడు.

65


మ.

అవనీదేవుఁ డొకండు మున్న జముఁ గ్రత్వర్ధమ్ము గొంపోవ, ధూ
ర్తవితానం బది సూచి యాతనిపిఱుందం బోయి యోమూఢ! నీ
వవమాన్యుండవు మాకుఁ, గుర్కురము నాహ్లాదంబు పెంపారఁ గ
ష్టవిచారమ్మునఁ బట్టినాఁడవని హాస్యం బెంతయుం జేసినన్.

66


వ.

అమ్మహీదేవుండుసు వృథాపరిశంకితహృదయుండై యెద్ది
యైనను నింద్యంబగు వస్తువు నశుభావహంబగునని తనచేతి ఛాగమ్ము
[నట విడిచి] స్నానమ్ము సేయ నేటికిం జనిన, నద్ధూర్తులచే నది భక్షింపఁబడియె.
అట్లు గావున బహుజనోపాయంబువలన నొక్కండు మోసం బందునని, సకలో
పాయమ్ములు మేఘవర్ణున కెఱింగించి, యెవ్విధంబుననైన ఘూకప్రభుం బొరి
గొందునని నిజశరీరమ్మునీఁకలు బెఱికికొని, మున్ను మృతిఁబొందిన వాయ
సమ్ముల రుధిరంబు లవయవంబులం బూసికొని, యవ్వల సమీపమ్మున నుండె,
నయ్యవసరమ్మున,—

67


గీ.

అపరగిరి ధాతుశిల జారెనన్నకరణి
ద్యుమణి గ్రుంకంగ నెఱసంజ [ద్రుత] మ [హీని]
పాతమున [నైన] బహు[తరోద్ధూ]తధూళి
పటలమో! యన వర్ణింపఁ బరగె మింట.

68


గీ.

అపుడు ఘూకమ్ములెల్లఁ ద న్నాశ్రయింప
వటముపైనుండి విమతుండు వాయసముల
వెదకి పొడగానకున్న నవ్వేళజి......
..........తలపోసి మది చిరంజీవి యచట.

69


క.

ఆరంభరహితులకునున్
గారణమురు బుద్ధియనెడి ఘననాదము, దు
ర్వారముగ జేయఁ గౌశిక
వారము విని వచ్చి కడుజవమ్మున నటకున్.

70


సీ.

అపుడు దన్నంటుక యాగూబలెల్లను
                    ధృతిఁ బతివద్దికిఁ దెచ్చుటయును

నతఁడు నీ వెవ్వండ వని పల్క, నే చిరం
                    జీవి నన్నను గృపచేత నిట్టి
దశ నిన్ను బొందగతం బేమి మేఘవ
                    .............................ననిన
విని యిట్టి.........కిని నేను కొన్ని బు
                    ద్ధులు చెప్ప.... ..ములుగుచుండ


గీ.

నిన్ను సేవించి మనుమన్న, [న]న్ను నిన్ను
గూడెనంచు, విరూపిగాఁ [గొంచె]పఱచె.
నాకు [దొర వీవ యని పల్కి] జోకపుట్ట
నుండె కైతవ మేర్పడకుండనట్లు.

71


వ.

అని యిట్ల ................ కాకిమాటలు విని, ఘూకప్రభుండు తన
ప్రధానవర్గమ్ము పిలిపించి, యందు రక్తాక్షుం డనువానిం జూచి పగతుండైన
మేఘవర్ణుభృత్యుండు మనల నాశ్రయింపవచ్చినవాడు. ఏమి సేయవలయు ననిన,
వాఁ డిట్లనియె,—

72


మ.

పగవానిన్ మది విశ్వసింపఁజన దాప్తప్రక్రియన్ భర్తృకా
ర్యగుఁడై లోనరయంగ వచ్చెఁ గపటవ్యాపారపారంగతుం
దెగ జూడందగు; బ్రోవ నేమిటికి వీనిం ద్రుంచి నిష్కంటకం
బుగ రాజ్యం బొనరింపు మీవు కులమున్ బోషింపు మత్యున్నతిన్.

73


గీ.

పొసఁగ రోగమ్ము వైరమ్ము పుట్టినపుడు
నణఁపకున్నను బేలగు నతఁడు ధాత్రి,
కాలగతులను నవియ దుష్కరము లగుచుఁ
దనకు నాపద గూర్చు, నిట్లను చుఁ బలుక,—

74


క.

[విని] విమతుఁ డపుడు క్రూరా
క్షునిఁ జెప్పుమటన్న [వైరి] సొంపరి శరణం
బన, [ఁజంప నొప్పదనుచున్]
వినిపించె నతండు ధర్మనిరతుం డగుచున్.

75


గీ.

అతఁడు దీప్తాక్షు నడిగిన నతఁడు మృగయు
...మముచేత నాహారమయ్యె నాక

[పోత] మని చెప్పవినమె సంజాతభీతి
యహితుఁడైనను రక్షింప నర్హుఁ డధిప!

76


క.

మును...........
...... ........................ డాతని కృప పెం
పునఁ గాచె ననఁగ వినమే
ఘనునకు ధా. ... జయమ్ము కరణిక లక్ష్మా!

77


గీ.

చెనఁటియైనను బ్రియ మొప్పఁ జేసెనేని
నతఁడు దనకెంతయును హిత వాచరించు,
మున్ను మృదువాక్యమునఁ గాదె! మ్రుచ్చు, దిగిచి
కొనినవిత్తమ్ము తద్గృహస్థునకు నొసఁగె.

78


వ.

అదెట్లని ఘూకప్రభుం డడిగిన నతం డిట్లనియె. ము న్నొకపురమ్మున
సార్ధవాహుండను వృద్ధవణిక్కు గలం డతనిభార్య నవయౌవనాంగి కల
దా, జంత యెన్నండును బతిని గైకొనక .............పరిరంభణమ్మునకుం జొరక
యుండునంత నొక్కనాఁడు,—

79


క.

చోరుఁ డొకఁడు సురంగ
ద్వారమ్మున నిల్లు సొచ్చి వచ్చుట గని, త
న్నారి భయమంది యప్పుడు
గారవ మొప్పార విభునిఁ గౌఁగిఁటఁ జేర్చెన్.

80


వ.

అప్పుడు సార్ధవాహుండును బరితుష్టుండై గృహముననున్న
చోరుం గనుంగొని యిట్లనియె.

81


క.

కలనైనఁ గౌఁగిలింపని
కలకంఠినిఁ గూర్చితివి సుఖం బొప్ప ననుం,
దలఁప నినుబోలు చుట్టము
గలఁడే! విత్తమ్ము నీవు గైకొను మనినన్.

82


వ.

చోరుండును గరుణాపరుండై నీకు సుఖమ్ము సిద్ధించినంజాలు, నా
చేత నపహరింపఁబడిన విత్తమ్మెల్ల నీవే కైకొనమని యతని కొసంగి యతని
సాధ్వికి పతి నెఱింగి సేవ జేసుక బ్రతుకుమని బుద్ధి చెప్పి యతికుతూహలమునఁ

దననిలయమ్మునకుం జనియె, నట్లు గావున నితనికి హిత వాచరించుట కర్తవ్యం
బను నవసరమ్మునఁ బింగళాక్షుండనువాఁ డదరిపడి డాసి యారాజుతో
నిట్లనియె,—

83


క.

పగతునిఁ [గైకొన]ఁబోలునె
తెగటార్పక యున్న, వాఁడె తెగటార్చుఁ జుమీ
...గి ...యైన ....వు
...గి ....కాల ....నట్లుగాదె ధృతి పగవాఁడున్.

84


సీ.

దేవ నాపల్కు సందేహమ్ము లే, దభి
                    యాతి యైనను మాటలాడినపుడు
పరమహితుండగు బ్రహ్మరాక్షసుచేత
                    ధేనుద్వయము, కన్నగానిచేత
నాయువు, నీఁబడె నవనీసురుని కన్న,
                    నాకథ యెఱిఁగింపు మనినఁ, దొల్లి
కలఁడు విప్రుఁడు ప్రతి[కల్యంబు నతఁడు] గో
                    యుగమును మేపుచు నుండుగాన
నట్టియావుల నొకచోరుఁ డపహరింపఁ
దలఁచి నిశివేళఁ బోవ నాతనిశరీర
మన్యగాత్రమ్ము సోఁకిన నరుదు నొంది
యెవ్వఁడవు సెప్పుమన్న వాఁ డిట్లు పలికె.

85


గీ.

సాహసుండను బ్రహ్మరాక్షసుఁడ నీవు
నెవ్వఁడవు నాకు నెఱిఁగింపు మిప్పు డనిన
నేను జోరుండ నన, నతం డేమి గోరి
యేఁగుచున్నాఁడ వని తన్ను నెలమి నడుగ.

86


వ.

ఏఁ దస్కరుండ సమీపగ్రామనివాసియగు విప్రుని గోయుగం
బపహరింప నేఁగుచున్నవాఁడ ననిన, నారాక్షసుండును మద్గమనం బతనినిఁ
బట్టుటకని చెప్పి యాయిరువురును నాభూసురుమందిరమ్ము ప్రవేశించి
రయ్యవసరమ్మున,—

87

సీ.

ఆబ్రహ్మరాక్షసుం డవనీసురోత్తము
                    మును గ్రహింపఁగ లేచెననుచుఁ, జోరుఁ
డావుల రెంటిని నవహరించెదఁ దొల్త
                    ననిన, నట్లగునే! తద్ధ్వనుల నతఁడు
నిద్రఁ దేఱునటన్న, నీవు పట్టిన మేలు
                    కొని ప్రేల నాకును గోయుగంబు
దొరక నేర్చునె యని యిరువురు వాదింప
                    నాతఁడు లేచి యిట్లనియె, మీర
లెవ్వరన బ్రహ్మరాక్షసుం డితఁడు నిన్ను
బట్ట వచ్చె నటంచుఁ జెప్పంగబడిన
యతఁడు, పల్కెను నీయావు లపహరింపఁ
జేరియున్నాఁ డెఱుంగుము చోరుఁ డితఁడు.

88


వ.

అని యి ట్లొండురువు లతనితో భాషింపంబడి హితం బొనర్చిరి
గావున, నితండును వధార్హుండు గాఁడని వెండియు నిట్లనియె.—

89


చ.

శరణని యొక్కపక్షి మును సాధ్వసకంపితసర్వగాత్రమై
మఱుఁగు జొరం గడంక నిజమాంస మొడంగెను నింగి నొక్కటన్
సురలు నుతింపగా, శిబి, వసుంధర నార్తులఁ బ్రోచు వారలన్
జిరతరకీర్తి పొందు నిది సిద్ధము విఠ్ఠయ లక్ష్మధీమణీ!

90


వ.

అని పలుక విని ఘూకప్రభుండు ప్రాకారకర్ణుం డనువాని నడి
గిన, నతం డీబలిభుక్కు వధార్హుండు గాఁడని చెప్పిన విని లేచి యధికరోష
మ్మునఁ గటమ్ము లడక వెండియు రక్తాక్షుం డిట్లనియె,—

91


ఉ.

దేవ! యెఱుంగ రిద్దఱును ధీయుతచిత్తులుగారు, వీఁడు దు
ర్భావుఁడు పింగళాక్షుఁడు సభ న్వినుపింపడె నీకు నీఖలున్
జీవముతోఁడ నిల్పిన నశేషదివాంధకులమ్ము ద్రుంగెడున్
నావచనమ్ము సత్యమని నమ్ముము, నీకు హితమ్ముఁ జెప్పితిన్.

92


సీ.

ప్రత్యక్షదోషమ్ము భావింప రాత్మ సు
                    బుద్ధులు సాంత్వనపూర్వమైన

పలుకులఁ బ్రీతి సంపదఁ దేలుదురు రథ
                    కారుఁడు [రమణిని] జారుతోడఁ
దల మోచికొనుచు నృత్యం బాచరింపఁడె
                    యన విభుఁ డెఱిగింపుమనినఁ దొల్లి
కలఁ డొకపురి రథకారుఁ డతండు దు
                    శ్చరిత యౌ తనభార్య జాడ తెలిసి


గీ

రాజు కూటమి గలిగుండ, రాజుతోడఁ
గర్జమున్నది వే నరుగంగవలయు
ననినఁ ద్రోవకు సంబళం బప్పు డొసఁగి
యనిపి తనమది సంతసం బందియుండ,
నెలమి రథకారుఁ డెవ్వరు నెఱుఁగకుండ.

93


వ.

తనభార్యకుం జెప్పె బంధుదర్శనార్ధం బొకపురంబున కేగవలయు,
రాజుచేత నామంత్రితుండనైతి, నేనుం బోయివచ్చెద నని వీడ్కొని కొంత
ద వ్వరిగి యెవ్వరు నెఱుంగకుండం, గ్రమ్మఱ విభావరీసమయమ్మున నిజ
గృహమ్మున కేతెంచి తనభార్య యెఱుంగకుండఁ బర్యంకమ్ముక్రింద నణంగి
యున్న సమయమ్మున,—

94


గీ.

శంక యొక్కింత లేక యా[ఱంకుటా]లు
దూతికాముఖవార్తచేఁ బ్రీతినంది
చేరవచ్చిన జారుని గారవించె
తేజరిల్లు కటాక్షనీరాజనమున.

95


క.

ఆకులట జలకమాడఁగ
నేకాంతస్థలముగూర్చి యేగిన, మదనో
ద్రేకమున జారపురుషుఁడు
చీకాకునఁ బొరలె కొంతసేపటిలోనన్.

96


గీ.

ఎప్పుడేనియు దిఙ్మదేభేంద్రకుంభ
సన్నిభములైన పాలిండ్లు జారకాంత
నాయురస్స్థలిఁజేర్చు మన్నన దలిర్ప,
నపుడు మదనాగ్ని యణఁగు నటంచు నుండ.

97

క.

ఆసమయమ్మునఁ బుష్పశ
రాసనసామ్రాజ్యలక్ష్మియన, శృంగారో
ద్భాసితమై, యది పర్యం
కాసనమునఁ బొల్చు దొరను [నాదటఁ] జేరెన్.

98


ఉ.

చన్నులమీఁది కొంగు దిగజారి వళిత్రయనాభు లేర్పడన్
గన్నులఁజూడ్కి [దొంతి] తొలికారు మెఱుంగుల నీనుచుండఁగన్
క్రొన్ననవింటిజోదు మదకుంజరమో యన డాసియున్న య
య్యన్నుఁ గడంకఁజూచె సురతాభిరతన్ రతిరూపశోభితన్.

99


వ.

అప్పు డయ్యిరువురు ననంగి పెనంగి కుసుమభల్లమల్లయుద్ధమ్ము
నకు సన్నద్ధులై గళరవహుంకారమ్ముల నిశాతబాణమ్ముల రదచ్ఛద
మ్ముల వషట్కారసంచయమ్ముల, దశాంగుళార్ధప్రయోగంబులం దలపడి
మదోద్రేకమ్మున, వీడె ముబ్బున నొడ లెఱుంగక, చందనకర్పూరకుంకుమ
పంకమ్ముల శరీరములు జొబ్బిల్ల, గంపవొడి యెడనెడ పైఁజల్లుకొనుచుఁ
బర్యంకతలం బుయ్యలలూఁగ, సకినలు రవళి సేయఁ, బాన్పుపైఁ బడి మదనకద
నంబుఁ జేసి పరిశ్రమంబున నిట్టూర్పు నిగడించుచు, ఘర్మకణమ్ములు గవాక్ష
రంధ్రనిర్గతమందపవనంబువలనఁ బాయుచు నంతకంతకు మహోత్సాహం
బులం జెలువొందియున్న సమయమ్మున, —

100


గీ.

జారభామిని పాదమ్ము జారి మంచ
తలముక్రింద నణంగిన ధవునిఁ దాఁక,
నపుడు రథకారుఁడని హృదయమున నెఱిఁగి,
చేటు వాటిల్లెనని చింత సేయఁదొడఁగె!

101


క.

ఆలోపల జారుఁడు నీ
లాలక! నాయందొ, ధవునియందో, నీకున్
మే లెపుడుఁ జెప్పుమన్ననుఁ,
గాలోచిత మెఱిఁగి పలికెఁ గడునే ర్పమరన్.

102


చ.

పతి పరికింప దైవ, మతిపాపము లొక్కటఁ బొందు జారసం
గతినని ధైర్యసంపదలఁ గాదె! తృణక్రియ ప్రాణముల్ తుదిన్
జతురతతోడ నంగనలు నాథులఁ గూర్తురు, సర్వలోకసం
గతముగ, నంచుఁ జెప్పి మఱి మానిని యిట్లను వానితోడుతన్.

103

క.

ఇది యేటి సుఖము, నాథునిఁ
గదిసిన సుఖమునకు సాటిగలదే! యనినన్
మదిలోనఁ దత్ప్రియుండును
ముద మొదవ వధూటివాక్యముల కవ్వేళన్.

104


వ.

పర్యంకమ్ము క్రిందనుండి వెడలివచ్చి కంకటిపై భుజంగసమే
తమై యున్న యయ్యంగనం దోడుకొని రాజమార్గంబునఁ బతివ్రతాభరణం
బిదియని కొనియాడం దొడంగె. ఆట్లు గాకుండ బ్రత్యక్షదోషం బెఱుంగ
వలయుననిన, రోషారుణీకృతాక్షుండై ఘూకవల్లభుం డతనివాక్యంబు ల
నాదరంబు చేసి, చిరంజీవినిఁ జేపట్టి కోటరంబునకుం దోడ్కొని చని సుఖం
బున్న సమయమ్మున, నక్కాకం బవ్విభున కిట్లనియె.

105


సీ.

పావకార్చులనైనఁ బడి దేవరకు హితం
                    బాచరించెదను దథ్యంబటన్నఁ
గెరలి రక్తాక్షుండు మరణహేతువు సెప్పు
                    మనినఁ జిరంజీవి యపుడు సెప్పెఁ
గౌశికత్వము నొంది కాకకులమ్ము సం
                    హారమ్ము సేయుదుననిన, నవ్వి
తనజాతికాక తక్కినజాతిః బొందంగ
                    [వలచి] భాస్కరమేఘవాయుభూధ


గీ.

రములచేఁ బాసి [మూషిక తమ]కులంబు
విభుని వరియింప[దే! యన]న విని యతండు
తనునదెట్లని యడిగిన, మును మహాత్ముఁ
డైన ముని, జాహ్నవీతీరమందు నిలిచి.

106


వ.

తపమ్ము సేయుచుండ నొకనాఁడు గగనమార్గమ్మునుండి శ్యేన
ముఖమ్మువలన, విడివడి తనకరమ్మునందు మూషికశిశువు పడిన నతండు,—

107


గీ.

తనతపశ్శక్తి పెంపార, దాని నొక్క
కన్యకామణిగాఁ జేసి కౌతుకమున

భార్య కొసఁగిన, నదియును బ్రతిదినంబు
మైత్రిఁ బోషించెఁ దనకన్నపుత్రికరణి.

103


అబ్జరేఖవోలె ననుదినమ్మును వర్ధ
[మాన] యగుచునుండె మౌని [యపుడు]
తగినవరుఁడు వలయుఁ దనకన్యకని చండ
కిరణుఁ దలఁప నాతఁ డరుగుదెంచె.

109


సీ.

అప్పుడు ఋషి పంకజాప్తునిఁబొడ గని
                    కన్యకఁ బరిగ్రహింపుమనఁగ,
బలియుఁడు నాకంటెఁ బర్జన్యుఁడన విని
                    తలఁచిన నాతఁడు నిలిచె నెదుట,
నతనిఁ జేకొమ్మన్న, నధికుండు పవమానుఁ
                    డనిన నాతనిఁ బిల్చి యడుగుటయును,
నద్రులు కడునెక్కుడని చెప్ప, [నద్రులఁ
                    బిలిచి] గైకొనుడన్నఁ బ్రీతి నవియు,


ఆ.

మూషికప్రభుండు మొదలి శూరుండన,
వాని కెఱుకసేయ వాఁడు మర్త్య
కన్య నెట్లు పొందఁగా వచ్చునన, ముని
యెలుకఁ జేసె దానిఁ దొలుతయట్ల.

110


వ.

ఇ ట్లాఘనుండు మూషికంగా జేసి మూషికవిభున కొసంగె నట్లు
గావున నెవ్వరేనియుఁ దమతమజాతిం బొందుదు, రింతియ కాని యన్య
జాతిం బొందుట దుర్లభంబు. ఈవెఱ్ఱికాకి యాడిన నెట్లని! చెప్పిన విని,
యెన్నెన్నిభంగులనైన నీఘూకపతికి హితం బాచరించెదనని పల్కుచిరం
జీవిం జూచి దివాంధవల్లభుం డిట్లనియె,—

111


క.

వలసినతఱి నాహారం
బుల నొందుచు, నీగృహంబుపోలిక నతిని
ర్మలబుద్ధి నుండుమని తనుఁ
బలికిన, ముదమంది కాకపతిసచివుండున్.

112

అవ్విధమ్మునఁ గడిపోతు నట్లు గొంత
కాల మందుండి నిజపతి కార్యఘటన
కనువు గోరుచునుండి యన్యాభిలాష
లాత్మ దలఁపక, యొక్కనాఁ డతఁడు దలఁచె.

113


చ.

అనువగునప్పు డేచి యభియాతులఁ గూల్చుట నీతిమార్గ మె
వ్వనికిని, ఘూకసంతతి దినంబున నిద్దురనొందె, నీగుహన్
ఘనతరవహ్నిచే నిపుడు గాల్పఁగవచ్చు నటంచు మేఘవ
ర్ణునికడ కేగ, నాతఁడు దనుం బ్రియమారఁగఁ జేసి కౌఁగిఁటన్.

114


వ.

అప్పు డతికుతూహలమ్మున నతనితో సంభాషించి చిరంజీవీ!
నీవుపోయినకార్యం బేమయ్యె! నచటివృత్తాంతం బెఱింగింపుమనిన నతం
డిట్లనియె. నాపోయినకార్యమ్ము నీకుఁ జెప్పెద. తడవు సేయ నిది సమ
యంబు గాదు తర్వాత నెఱింగించెద, నరి సమయుటకు నెడరుగని వచ్చిన
వాఁడఁ దామసింపం జెల్లదు. మీరందఱు గూడుకొని బహుకాష్ఠసంచ
యంబులు గైకొని జవంబునం జనుదెంచుట కర్తవ్యం, బేనును ననలమ్ము
గొని చనుదెంచెద నని సకలకాకంబులఁ జేకూర్చుకొని యింధనాగ్నులు సంగ్ర
హించి ఘూకమ్ములమూఁకయున్న గుహాముఖంబు డాయంజని వేగం
బకదిసి,—

115


క.

పెట్టిరి కాష్ఠమ్ముల, పైఁ
బెట్టిరి యనలమ్ము, నపుడు భీకరకీలల్
దట్టంబై తముఁ జుట్టినఁ
బట్టగలు గూబలెల్ల భస్మంబయ్యెన్.

116


ఆ.

అపుడు మేఘవర్ణుఁ డతిమోదమునఁ జిరం
జీవి సూచి, యెట్లు సెపుమ! శత్రు
సంచయమ్మునడుమ సౌహృద మొప్పారఁ
బరగనుంటివనినఁ బలికె నతఁడు.

117


సీ.

కంకుడై [యుండఁడే] కార్యార్ధియై ధర్మ
                    జుఁడు భీము డుండఁడె సూపకారుఁ

డగుచు నర్జునుఁడుబృహన్నల.........
                    ...................డై నకులుఁ డశ్వ
శిక్ష సేయుచును వసింపఁడె సహదేవుఁ
                    డావుల గాయుచు నజ్ఞుభంగి
నుండఁడే, ద్రౌపది యొప్పుగ సైరంధ్రి
                    యన ............నుండదే యనుసరించి


గీ.

యావిరాటునినగరమ్మునందు [మున్ను]
..................................................
నట్లు గావింప సంపద లతనిఁ బొందు
లలితగుణధుర్య! విఠ్ఠయ లక్ష్మణార్య!

118


వ.

కావున నేను పాండవేయులవిధంబునం బరులచేత మోసంబు
........................................... రక్తాక్షుండను ఘూకప్రభుమంత్రి నీతి
విశాలుండు బుద్ధిమంతుండు గావున రాజునకు మీఁదవచ్చు కార్యంబు
తెఱం గెఱిఁగించె నతనిచే నీమర ..........యువన్య..........................
బడితినని యతండు వెండియు నిట్లనియె.

119


క.

యానాసనసుఖనిద్రా
పానాన్నంబులను వలయుఁ బ్రభునకు మిగులన్
మానైనరక్ష, తేజో
భానుప్రతిమాన! నూత్న భరతాచార్యా!

120


గీ.

..........రంబుల ...............................
నపుడు వైశ్వానరుఁడు వాని నణఁచుభంగి
యరుల మధ్యస్థుఁడై పాయునపుడు గూల్ప
వలయు ధారుణి నీతిమంతులకు నరయ.

121


వ.

అని చెప్పి ము న్నొక[పన్నగవిభునిచేత] నొక్కమండూకవిభుండు మృతింబొందఁడె
యనిన, నది యెట్లని మేఘవర్ణుం డడిగిన చిరంజీవి యిట్లనియె.

122


సీ.

విను మొక్కపన్నగవిభుఁడు మందవిషాభి
                    ధానుండు భేకసంతాన ముండు

.................యప్పుడు జీవహింస
                    యని [ముని]మాడ్కి నుండినను ప్రీతి
నొకకప్ప చేరి యిట్లో ఫణిరాజ! ని
                    రాహారవృత్తి నీహ్రదములోన
నేటికి నున్నాఁడ వెఱిఁగింపుమనఁ బాము
                    నిట్లనె ము న్నొక్కయిద్ధగుణుఁడు


గీ.

బ్రాహ్మణా....................................
పోవుచును నన్ను ద్రొక్కినఁ బోక నేను
కఱచి వానినిఁ ]జంపితి]ఁ గరుణ లేక
వానితండ్రియు నది విని వచ్చె వేగ.

123

వ.

వచ్చి నన్నుఁ జూచి నాచిఱుతకొమరుని నీవు మృతిఁబొందింపఁ
దగునె .................................యింత తప్పుఁ జేసితివి నాసామర్ధ్యంబున
నిన్ను భస్మీభూతమ్ము సేయంజాలుదు నైనను హింస సిద్ధించునని వెఱచి
యున్న వాఁడ. నేఁటినుండియు నీకాహరంబు .........................యపుడ
నీకు మృత్యువు సిద్ధించునని నాకు శాపం బిచ్చి యాపాఱుండు యధేచ్ఛ
నరిగె, నంత నేను నిమ్మడువునకు వచ్చి నిరాహారుండనై యుగ్రతపమ్ము
సేయుచున్నవాఁడ, మఱియును,—

124


క.

....................... ప్పరి
యీవారిధి నున్నవాఁడ యింద............
నావలనను బ్రోవుండనం
దా వేగం బరిగె కప్ప తనపతికడకున్.

125


వ.

అ ట్లతిత్వరితగతిం జని తమయేలికయగు జాలపాదుండను మండూకపతి
[కి భుజగ]పతివృత్తాంతం బంతయుఁ జెప్పిన నతం డాశ్చర్యమ్ము నొంది తనపరిజన
మ్మును దానును దందశూకం బున్నయెడకు వచ్చి యతనిం గాంచి యిట్లనియె.

126


మ.

జలపాదుండను భేకవల్లభుఁడ, నుత్సాహమ్ముతో వచ్చితిన్
ౙల మొప్పంగను నీదునిష్ఠకును నిచ్చన్ మెచ్చితి న్నంచు కుం
డలి నారోహణ మాచరింప, నది యాడంజొచ్చె, సంప్రీతి నా

స్థలభూగామికి? నొక్కనాఁడు గతి మందంబైన, మన్మానసం
బలరంజేయవు నేఁడు శీఘ్రగతిచే నన్నన్, బ్రియంబొప్పఁగన్.

127


క.

నా కాహారము లేదన,
భేకంబులఁ గొన్ని దినుము ప్రియమున నన్నన్
గాకోదరమ్ము వానిం
జేకొని భక్షించె నతఁడు సెప్పినమాడ్కిన్.

128


వ.

అప్పు డాజలపాదుం జూచి భవదనుజ్ఞఁ జేసి మద్భోగమ్ము
పోషింపంబడియె, నీవు విఖ్యాతచారిత్రుండవు నీ విడిన యాహారం బగుటం
జేసి విప్రశాపంబు నన్నేమియుం జేయలేదు, నీనిమిత్తంబునఁ గృతార్థుండ
నైతినని చెప్పి, నిజగతివిశేషంబుల నమ్మండూకపతి మూర్ధంబుమీఁదం
జిందులాడ, నతండు మెచ్చుచుండఁ గ్రమక్రమంబున నాకప్పల నన్నింటిని
మెక్కి యొక్కనాఁడు,—

129


క.

తలపోసి యబ్భుజంగము
జలపాదుని మ్రింగి యన్యసరసికి నేగన్
వలయునని, యపుడు మెల్లన
పలుకఁగ విని యాతఁ డేమి భావించి తనన్.

130


క.

పుడమిన్ విప్రునిశాపముఁ
గడచితి మండూక ముండఁగా నంచును నే
నుడుగుల నుడుగక యున్నా
నడరఁగనని, మఱియుఁ జెప్ప నాతఁడు మదిలోన్.

131


వ.

విశ్వసించియుండ నతని భక్షించి చనియెం గావున, బహూపా
యమ్ముల శత్రునిశ్శేషంబు సేయుట నీతిమార్గంబని యెఱింగించి, చిరంజీవి
యోదేవా! భాగ్యసంపన్నుండ వఖిలవిభవమ్ములు నిన్నుం బొందెనని
వెండియు నిట్లనియె.

132


సీ.

విద్వత్కవులయందు విశ్రాణంబును,
                    బ్రత్యర్ధివిభులందు బాహుబలము,
శరణాగతులయందుఁ గరుణాకటాక్షంబు,
                    నృపకార్యములయందు నీతిగరిమ,

బంధుసంతతియందుఁ బరమసంతోషమ్ము,
                    నాశ్రితులందుఁ బాయనితలంపు,
ధర్మమార్గమునందుఁ దగిలినచిత్తమ్ము,
                    సత్యవాక్యములందుఁ జతురతయును,
గలిగి యెవ్వాడు మెలఁగు జగత్త్రయమున
నతనికీర్తులు లుబ్ధమోహాంధతమస
పటల మణఁగింపఁ జంద్రికాప్రభలయట్లు
లలితగుణధుర్య! విఠ్ఠయ లక్ష్మణార్య!

133


వ.

అని యివ్విధంబునఁ జిరంజీవి తమపతియగు మేఘవర్ణునిఁ బ్రహృష్ట
చిత్తునిం జేసెనని నరేంద్రనందనులకు విష్ణుశర్మ యెఱింగించె నంత.

134


శా.

శేషాద్రీశ్వరపాదపద్మయుగళీచింతారతస్వాంత! వి
ద్వేషామాత్యజనాభివర్ణితయశోవిఖ్యాత! నానాకళా
భాషావల్లభ! నీతిశాస్త్రపఠనాప్రావీణ్య! చంచద్వయో
యోషానూతనమీనకేతన! నృపోద్యోగానవద్యప్రియా!

135


క.

చందనహరిహయహరిహర
కుందేందుసమానకీర్తిగోచర! [శిష్టా]
నందకర! రుక్మమాంబా
నందన! [శిబిఖ]చరవితరణప్రఖ్యాతా!

136


కవిజలరుహమిత్రా! కంతుసంకాశగాత్రా!
నవవితరణరాగీ! నాకపాభోగభోగీ!
ప్రవిమలతరకీర్తీ! బంధుసమ్మోదవర్తీ!
భువనహితచరిత్రా! పూరుషోద్యత్ప్రవిత్రా!

137

ఇది శ్రీభారతీవరప్రసాదలబ్ధవిద్యావిచిత్ర, తిప్పనమంత్రి
పుత్ర, సుజనవిధేయ, భానయనామధేయప్రణీతంబైన
పంచతంత్రి యను మహాప్రబంధమ్మునందుఁ
తృతీయాశ్వాసము.