పంచతంత్రము (దూబగుంట నారాయణ)/చతుర్థాశ్వాసము

వికీసోర్స్ నుండి

పంచతంత్రము

లబ్ధనాశము

క.

శ్రీసమధికగుణమందిర, వాసవవిభవాభిరామ వర్ధితదానా
భ్యాసకరకమల నిర్మల, భాసురసత్కీర్తిహార బసువకుమారా.

1


వ.

అవధరింపుము సుదర్శనక్షితీశనందనులు విష్ణుశర్మకుం బ్రణామం బాచరించి లబ్ధనాశం
బనుచతుర్థతంత్రం బెఱింగింపు మనిన నతం డిట్లనియె.

2


క.

చెందినయర్థం బితరుల, యందపుమాటలకు విడుచునతిమూఢుఁ డిలన్
డెందంబు గలసి కపితోఁ, బొందై యొకమొసలి మోసపోయినభంగిన్.

3


వ.

అనినఁ దత్కథాక్రమం బెట్టి దని నృపకుమారు లడిగిన నతం డిట్లనియె.

4


సీ.

రంగదుత్తుంగతరంగసంఘంబులు, సరసాభినయకరాబ్జములు గాఁగ
బహువిధప్రచలనపాఠీనపఙ్క్తులు, ధవళవిలోలక్షేత్రములు గాఁగ'
సురచిరస్నిగ్ధపాండురఫేనపటలంబు, చారుతరాట్టహాసంబు గాఁగ
లాలితభూరిబాలప్రవాళంబులు, విరిసినఘనజటాభరము గాఁగ


గీ.

ఘుమఘుమధ్వని వాద్యఘోషములు గాఁగఁ, జండతాండవాడంబరశంభుమూర్తి
బోలు నని తన్ను జనములు పొగడునట్టి, వర్ణనకు నెక్కి యొప్పు మహార్ణవంబు.

5


ఉ.

ఆలవణాంబురాశిదరి నర్జునతాలతమాలసాలహిం
తాలరసాలభూరుహవితానము సొంపు వహింప నచ్చటన్
వేలతరంబు లైనకపివీరులతో బలివర్ధనాముఁ డి
చ్ఛాలఘువర్తనంబుల నజస్రముఁ గ్రుమ్మరుచుండు నత్తఱిన్.

6


వ.

మఱియును దత్సమీపంబున నొండొకయూథనాథుం డైనకపీశ్వరుండు బలివర్ధను
నుద్దేశించి.

7


ఉ.

ఈముదిమర్కటంబునకు నేటికి నీకపిరాజ్య మంచు ను
ద్దామపటుప్రతాపబలదర్పమునన్ వెడలంగఁ దోలినన్

సీమకుఁ బాసి యొక్కరుఁడు సి గ్గెసఁగన్ బలివర్ధుఁ డేఁగె నా
రామవిహారముల్ విడిచి రాజసవృత్తిఁ దొఱంగి యయ్యెడన్.

8


వ.

చనిచని యొక్కనదీతీరంబున మధుగర్భం బనునౌదుంబరంబు ఫలభరితం బైనదాని
నాలోకించి బలివర్ధనుండు దనమనంబున.

9


క.

కామితఫలముల నొసఁగం, గా ముందటఁ గల్పకంబు గానంబడిన
ట్లామేడి కడు ఫలించెను, నాముందటిభాగ్యవాసనకు దృష్టము గాన్.

10


వ.

అని తలంచి డాయం బోయి.

11


క.

తరు వెక్కి దీర్ఘశాఖలఁ, బరిపక్వఫలంబు లరసి భక్షించుతఱిన్
గరమునకుఁ దప్పి యొకఫల, మరుదుగఁ బడె నీటిలో మహాధ్వనితోడన్.

12


క.

ఆచప్పుడు తనచెవులకు, నేచినకౌతుకముఁ బెనుప నెడనెడ ఫలముల్
వైచుచును సహజచాపల, మై చనుమర్కటముచప్పు డాలించుతఱిన్.

13


వ.

క్రకచనామధేయం బగుశింశుమారం బమ్మేడిక్రింది జలంబులలోనఁ గ్రుమ్మరుచుండి
మత్సమీపంబున నెన్నండును నిట్టియపూర్వధ్వని విన్నది లేదని తల యెత్తి చూచి
నప్పు డౌదుంబరతరుశాఖాసమారూఢశాఖామృగకరవిముక్తఫలపతనం బమ్మహాగ్రా
హంబు దెలిసి తాను నమ్మధురఫలంబు లుపయోగించి యావృద్ధవానరంబుతోడఁ
జెలిమి చేసి తన్మిత్త్రత్వానందంబున నమ్మధురఫలాస్వాదనలాభంబున నచ్చోటు
గదలం జాలక కొన్నిదినంబులు మఱచి యున్న మొసలిం దలంచుకొని యమ్మొసలి
భార్య దనసఖిం బిలిచి దానితో నిట్లనియె.

14


ఉ.

ఇంతకుమున్ను నాదుహృదయేశ్వరుఁ డెయ్యెడ కైన నేగినన్
సంతస మొప్ప వచ్చు నిమిషంబున నిన్నిదినంబు లయ్యెఁ దాఁ
జెంతలఁ జేరఁ డేమిటికిఁ జిక్కెనొ కాక పరాంగనారతి
భ్రాంతి నిజాలయంబునకు రా కచటం బ్రియ మంది నిల్చెనో.

15


క.

తెలియంగవలయుఁ బొ మ్మని, పలికిన నది పోయి వచ్చి ప్రాణసఖికి నే
ర్పలవడఁగఁ జెప్పఁ దొడఁగెన్, గలవియు లేనివియుఁ గూర్చి కలఁకం బొందన్.

16


సీ.

నెలఁత నీవిభుఁ జూడ నీవు న న్నంపినఁ, జయ్యన నేను బ్రచ్ఛన్నవృత్తిఁ
గదిసి చూచితి నొక్కకపిభామ రూపలా, వణ్యవిలాసభావములఁ బెద్ద
మధుగర్భమను నుదుంబరముపై నుండఁగఁ, బొడఁగని దానితోఁ బొందు చేసి
యాపొందు మక్కువ సంతకంతకుఁ బెంప, నీయింటితెరువును నిన్ను మఱచె


గీ.

చేర్చుమతిఁ బూరుషులు నవప్రియులు గాన, వారి మానంగ నేరికి వశము గాదు
చెలియ నీమిఁదిభక్తిమైఁ జెప్పవలసెఁ, గాక వివరింప నా కేమికారణంబు.

17

క.

అమ్మాట మొసలిలేమకు, నమ్మయి తాఁకుటయు నిశ్చయం బని మదిలోఁ
గ్రమ్మెడువిరహానలమునఁ, సమ్మోహనమూర్ఛ పరవశత్వముఁ జేయన్.

18


వ.

అమ్మకరవధూటి ప్రియసఖీసంభాషణంబులఁ బెద్దయుం బ్రొద్దునకుఁ దెలివి నొంది.

19


గీ.

మగఁడు చేసినట్టి నెగులునఁ గడు నొచ్చి, విరహవహ్ని చేత వేఁగి వేగి
పొరలుచుండునంతఁ బొలఁతిపై మక్కువఁ, గొన్నిమేడిపండ్లు గొనుచు వచ్చి.

20


వ.

ఆక్రకచుం డట్లున్న తనప్రాణవల్లభం జూచి యిట్లనియె.

21


ఉ.

పంకజనేత్ర నీయొడలిభారము చూచి భయంబు పుట్టెడున్
గింకకుఁ గారణంబు పరికించి యొకించుక నాకుఁ జెప్పినన్
గొంకక తీర్తునన్న విని కోమలి నెచ్చెలిమోము చూచినన్
శంక యొకింత లే కది నిజంబుగఁ బుట్టెడునట్టిభఁగి గాన్.

22


వ.

ఆశింశుమారంబున కిట్లనియె.

23


ఉ.

అక్కట నీవు పోయినది యాదిగ నీకలగంఠి రుగ్ణతం
జిక్కినఁ జావకుండఁగ బ్రసిద్ధుఁడు సిద్ధుఁడు వచ్చి యౌషధం
బొక్కటి చెప్పి పోయె నది యుక్తమ నీ కెఱిఁగించువారమై
యిక్కమలాయతాక్షియును నేనును నీపొడఁ గాన మెన్నఁడున్.

24


వ.

అనిన నమ్మహాగ్రాహంబు.

25


క.

సంజీవని మొదలుగ నే, నంజక కొనివత్తు నెట్టియౌషధ మైనన్
రంజకపుమాట గా దిది, కంజాతదళాయతాక్షి గ్రక్కునఁ జెపుమా.

26


వ.

అనిన నది యిట్లనియె.

27


క.

వానరహృదయముతోఁ దగ, మానినయౌషధము పెట్ట నువిదకు మానున్
మేనఁ గలరోగ మనుచును, దా నెంతయుఁ గరుణ జెప్పి తాపసుఁ డరిగెన్.

28


గీ.

కానఁ గోఁతిగుండెకాయ నీ విప్పుడు, తెచ్చి యిచ్చితేని తెఱవ బ్రతుకు
తేక యుండితేని నీకులభామిని, తనువు విడుచు గడియతడవులోన.

29


వ.

అనినఁ దద్వచనంబు లాకర్ణించి యతం డట్టిద కాక యనుచుఁ గొంతద వ్వరిగి యరిగి
తనమనంబున నిట్లని వితర్కించె.

30


క.

తరుచరహృదయము నాకుం, దరమే దొరకింపఁ గష్టదశ వచ్చెఁ గపీ
శ్వరుఁడు బలివర్ధుఁ డొక్కఁడు, పురుషార్థపరుండు వానిఁ బొరిగొనఁ దగునే.

31


చ.

అతని వధించు టెంతయు మహాదురితంబు సమస్తధర్మసం
తతికి నిధాన మీసతి వృథా మృతిఁ బొందినఁ బాప మీయెడన్

మతిఁ దలపోయ నిద్దఱును మాన్యులె యైనను భార్యరక్ష దా
నతిశయధర్మ మంచుఁ దగ నార్యులు చెప్పఁగ విందు నెట్లనన్.

32


ఉ.

ఎక్కువ చెప్పఁ జూపఁ గలయింట జనించుకులాంగనాళిలోఁ
జక్కఁదనంబు గల్గి గుణసంపద మించి యలౌకికస్థితిన్
నిక్కక యేమృగాక్షి పతి నిర్మలచిత్తము పట్టు భక్తిమై
నక్కమలాక్షి యెవ్వనికి నా లగు వాఁడు కృతార్థుఁ డిమ్మహిన్.

33


వ.

కావునఁ గులకాంతను రక్షించుటయ యుత్తమధర్మంబు మిత్త్రుం డైనబలివర్ధనుఁ బరి
త్యజింతు నని కృతనిశ్చయుండై యాశింశుమారప్రవరుం డనుమానించుచు మంద
గమనంబున నయ్యుదుంబరంబు చేరం జనుదెంచినం జూచి మిత్త్రుం డైనబలివర్ధనుం
డతని కిట్లనియె.

34


గీ.

ఎంత వేగిర మింటికి నేఁగి తిప్పు, డింతలోననె మరలి రా నెద్దికతము
మందగమనంబుతోఁ జింత మెుందె దేమి, కారణం బన్న నమ్మహాగ్రాహ మనియె.

35


క.

చిరకాలమైత్త్రి నీయెడ, జరగంగా నింటి కరుగఁజాలక నేఁ డ
ట్లరిగిన నచ్చటినాయి, ల్లెరవై మదిఁ దోఁదె నిలువ నెట్లగుఁ జెపుమా.

36


క.

ఉపకారవాంఛ సఖ్యము, నిపుణతఁ జేయుదురు గాక నీ వేమియుఁ బ్ర
త్యుపకార మపేక్షింపని, సుపురుషుఁడవు కావె యెపుడు సుస్థిరచరితా.

37


వ.

అనుటయు బలివర్ధనుఁ డిట్లనియె.

38


గీ.

డాసి యువకార మే నేమి చేసినాఁడఁ, బూని నీతోడఁ జేసినపొందువలన
రాజ్యవిరహితదుఃఖభారంబుఁ ద్రోచి, తాల్మి నున్నాఁడ నదియు యుక్తంబు గాదె.

39


గీ.

శోకశాత్రవభయములచొప్పు మాన్పు, ప్రీతివిశ్వాసగుణహేతుభూత మైన
మిత్త్ర మనునక్షరద్వయమిశ్ర మైన, రత్న మేవేల్పు సృజియింపఁ బ్రబలెనొక్కొ.

40


వ.

అని పలికిన విని క్రకచుం డిట్లనియె.

41


ఉ.

మింటికి నిక్కునీతరువుమీఁదను నీవును నేను నీటిలో
నొంటిఁ జరింప నోపుటకు నోర్తునె వీఁపున మోచి నిన్ను మా
యింటికిఁ గొంచుఁబోయెదఁ గపీశ్వర రమ్మన నాక్షణంబ ని
ష్కంటకబుద్ధి బెల్లుఱికి గ్రక్కున వీఁపున వచ్చి నిల్చినన్.

42


క.

నిలిచినకపివరుఁ దోడ్కొని, నిలుపోపక మొసలి పలికె నేఁ డీమిత్త్రుం
జలముకొని చంపవలసెను, కలఁడే నావంటిపాపకర్ముఁడు జగతిన్.

43


క.

స్త్రీకార్యము బలవంతము, నా కింతటి సాధుమిత్త్రు వనచరు మృతుఁగాఁ
జేకుఱఁగఁ జేయుకతమున, లోకంబున నింద కేను లోనైతిఁ గదా.

44

వ.

అని విచారించి మఱియును దనమనంబున.

45


సీ.

హేమంబు మేలుగీ డెఱుఁగంగఁ దలఁచిన, మానుగా నొరిసినఁ గానవచ్చుఁ
బురుషులగుణములు పరికించి చూచిన, నెందైన నడవడి నెఱుఁగవచ్చు
లలితగోవృషములఁ దెలియ భావించిన, భారముల్ గాంచి యేర్పఱుపవచ్చు
స్త్రీస్వభావంబులు దెలియుద మన్నచో, నెంతధీయుతులకు నెఱుఁగరాదు


గీ.

మాయలకు నిక్క మందులమనికిపట్టు, సకలదోషంబులకు నెల్ల జన్మభూమి
మగువ గావున నిపుడు న న్నగడుచేసి, యేమి పన్నెనో నాసతి యెఱుఁగరాదు.

46


వ.

అని తలపోసి వెండియుఁ దనమనంబున.

47


గీ.

ఆఁడదానికొఱకు నకట నాప్రియమిత్త్రు, వృద్ధుఁ జంప నెట్లు బుద్ధి పుట్టె
ననుచు వినఁగ నాడునమ్మాట లాలించి, వానరుండు పలికె వానితోడ.

48


క.

ఏమంటి విపుడు నీలో, నేమిటి కీచింత నాకు నెఱిఁగింపు మనం
గా మొసలియు నిట్లను నే, నేమియు ననఁ దప్ప వింటి వే నేమంటిన్.

49


క.

అనుమాట కాత్మలోపల, ననుమానము నొంది వానరాధిపుఁ డీతం
డనుమానించుచు వగచుచు, ననుఁ గొనిపోవుటకుఁ గారణం బెయ్యదియో.

50


గీ.

అడిగి చూచెదఁ గా కంచు నగచరుండు, కలఁక నొందినమదితోడ జలచరేంద్ర
నాకుఁ దోఁబుట్టువైన నీనాతి కిపుడు, సేమమే యన్న నామాట చెవులు సోఁక.

51


ఉ.

అల్లన శింశుమారవిభుఁ డాకపినాథునిఁ బల్కె మన్మనో
వల్లభ రోగపడ్డయది వైద్యు లసాధ్య మనంగ దాని కే
నుల్లమునం దలంకెదఁ బ్రయోగము చెప్పినఁ దీర్చువారు లే
రెల్లెడ నీటిలోనిపని యింతీయ నాపని మిత్త్రవత్సలా.

52


వ.

అనుటయు నాబలివర్ధనుం డిట్లనియె.

53


చ.

జలములు గాని వెల్పలికిఁ జాల నటంచు విచార మేటికిన్
బలికినమందు దెత్తు ననుఁ బంపు మరెన్నఁటి కేను బోయి భూ
వలయము నెల్లఁ గ్రుమ్మరి దివాకరుఁ డయ్యపరాంబురాశిలో
పల దిగిపోకమున్న వడిఁ బాఱి రయంబున వత్తుఁ బోయెదన్.

54


క.

పొ మ్మనవు పోయి మందులు, దె మ్మనవు చికిత్స చాలఁ దెలిసినవైద్యున్
ర మ్మనవు భార్య నిజ మగు, సొ మ్మనపు దలంక వేమిచోద్యము చెపుమా.

55


వ.

అనిన నమ్మకరకులాధీశ్వరుం డిట్లనియె.

56


ఉ.

అడిగినవాఁడఁ బండితుని నాయన చెప్పగ మందు నీకడం
దడవఁగఁ జాల కేను బరితాపముఁ బొందుచు నున్నవాఁడ ని

ప్పుడు నెఱిఁగింపకున్న నది పోవదు నామదిలోన దుఃఖమున్
గడవఁగ నీవ కారణ మకారణబాంధవ యెన్నిభంగులన్.

57


వ.

అనినఁ దరుచరనాథుం డిట్లనియె.

58


గీ.

మనసు గలసినచో నొకమాట యైనఁ, గపటమునఁ జెప్పకుండుట కలుష మండ్రు
ప్రాణసఖుఁ డగునాకు డాపంగ నగునె, చెప్పఁదగనిది యైనను జెప్పు మనిన.

59


వ.

అమ్మాటకుఁ బుయిలోట దక్కి మొసలి యిట్లనియె.

60


క.

వానరహృదయముతోఁ దగ, మానినయౌషధముఁ దెచ్చి యువిదకుఁ బెట్టన్
మేనఁ గలరోగ మంతయు, మాను ననుచు నొక్కవెజ్జు మగువకుఁ జెప్పెన్.

61


ఉ.

చెప్పిన నన్నుఁ దె మ్మనియెఁ జెప్పెడి దేమీ మఱెందు నేరికిం
చెప్పక నీకునుం దెలియఁజెప్పఁగఁజాలక యాత్మ నాకు నేఁ
జెప్పఁగ నీవు న న్నడుగఁ జెప్పితిఁ గాని భయంబు పుట్టఁగాఁ
జెప్పుట గాదు కార్యగతి చెప్పితి వానరయూథనాయకా.

62


క.

తనసతికి రోగ మైనం, గనుఁగొని యది చక్కఁబెట్టఁగా నేరఁ డితం
డని నన్ను బంధుజనములు, మనుపీనుఁగుఁగాఁ దలంప మను టేమిటికిన్.

63


వ.

అని చెప్పినఁ గపీశ్వరుండు.

64


గీ.

సగము చచ్చినమేనితోఁ జకితుఁ డగుచుఁ, గంప మొందుచు వృద్ధమర్కటము మూర్ఛ
మునిఁగి కన్నులు గానక ముణిగి గొంత, వడికిఁ దెప్పిఱి యాత్మ దైవంబుఁ దూఱి.

65


వ.

తనలో నిట్లని వితర్కించె.

66


గీ.

ప్రేమ నటియించి యింటికిఁ బిలువఁ దడవ, మొసలిమాటకు నా కేల మోసగలిగె
నెంతముదిసిన నేను జితేంద్రియుండఁ, గామి నాపదఁ బడితి యుక్తంబు గాదె.

67


వ.

అని మఱియును.

68


సీ.

రాగసంయుక్తుఁ డరణ్యవాసంబునఁ బహుకాల మున్నను ఫలము లేదు
నెఱయఁ బంచేంద్రియనిగ్రహంబున నిల్లు, గదలకున్నను వాని కదియ ఫలము
వీతరాగుండును విజయశీలుండును, వివిధధర్మాధర్మవిదుఁడు నగుచు
సత్యదయాదానశౌచంబు లెవ్వఁడు, గలిగి వర్తించు నిష్కపటవృత్తి


గీ.

వానినిలయంబు ఘనతపోవనము గాని, దండకాషాయవస్త్రకమండలువులు
ముండితయును భిక్షాటనముం జదువును, నాటకమ్ము లివి ప్రయోజనములు గావు.

69


వ.

అని తలంచి బలివర్ధనుండు దైవానుకూల్యంబున నాయుశ్శేషంబుకతంబునం దనకు
నప్పటి కొక్కయుపాయంబు తోచిన నాశింశుమారంబునకు నిట్లనియె.

70

క.

ఓయన్న కల్ల చేసితి, వీయర్థము మున్ను నాకు నెఱిఁగించిన నే
నాయంతరమునఁ గలిగిన, యాయౌషధ మపుడ కొంచు నరుదెంతుఁ గదే.

71


ఉ.

గుండియ పుచ్చి పెట్టుకొని కొమ్మపయిం బదిలంబు చేసి నే
నుండుదు నట్టిభారమున కోర్వక యెప్పుడు నేఁడు నే నభా
గ్యుండను నీకు నక్కఱకుఁ గూర్చినసొ మ్మని ము న్నెఱింగి తే
కుండుటఁ జేసి యే మని ప్రియోక్తులు పల్కుదు నేమి సేయుదున్.

72


వ.

అయినను ద్వరితగమనంబున నయ్యుదుంబరంబు కడకుం జని యస్మదీయహృదయం
బు గొని చనుదెంత మని పలికి వెండియు.

73


గీ.

మొనసి ధర్మార్థకామముల్ మూఁటివలన, ఫలము లెవ్వాఁడు దా నాసపడియెనేని
వాఁడు రిక్తహస్తములఁ బోవంగఁ దగదు, భూమిసురరాజకాంతలపొంత కెందు.

74


క.

మానుగ హృదయం బచ్చటి, మ్రానం దగిలించి యుంటి మన మట మగుడం
గా నరిగి వేగ నది గొని, మానిని యున్నెడకు నిపుడ మరలఁగవలయున్.

75


వ.

అనిన.

76


క.

అమ్మాటల జలచరమును, సమ్మతితో నమ్మి వృక్షచరమును గొనుచుం
గ్రమ్మఱ ము న్నున్నతరువు, కొమ్మం గదియింపఁ గపియుఁ గుప్పించి వడిన్.

77


గీ.

అంతకంతకుఁ బొడవుగా నరిగి యరిగి, వృక్షశాఖాగ్రమున నున్న వృక్షచరముఁ
గాంచి చెలికాఁడ రమ్ము వేగంబ మనకుఁ, బోవవలె నన్న జలచరంబునకు ననియె.

78


గీ.

పొందు చేసిచేసి పొసఁగక మతి పోయి, తిరిగి వచ్చునతఁడు తిరుగఁ జెడును
గార్దభంబు నక్కకఱపుల హరిఁ జేరి, పోయి తిరిగి వచ్చి పొలిసినట్లు.

79


వ.

అనినఁ దత్కథాక్రమంబుతెఱంగు జలచరపతి యడిగినఁ దరుచరపతి యిట్లనియె.

80


సీ.

కలఁ డుగ్రవనములోపల నొక్కమృగరాజు, గోమాయు వతనికిఁ గూర్చుభృత్యుఁ
డై పంపు చేయంగ నమ్మృగేంద్రుఁడు జంబు, కముఁ జూచి పలికె దైన్యము దలిల్ప
ననఘ మహోదరవ్యాధి నాతనువున, నొదవి యంతంతకు ముదురఁ జొచ్చె
ననుగుణం బగుమందు లరసి సేవింపక, యూరకుండిన మీఁద నొప్పకుండు


గీ.

గార్దభముకర్ణ మొక్కటి గలిగెనేని, యౌషధంబున నది గూర్చి యారగించి
మచ్ఛరీరంబురోగంబు మాన్పుకొందుఁ గానఁ గొనిరమ్ము ఖరము నాకడకు వేగ.

81


చ.

అనిన మహాప్రసాద ముని యామృగధూర్తము పోయి రోయుచున్
జని నగరోపకంఠమునఁ జాకలివానికృశాంగగార్దభం
బును బొడగాంచి సద్వినయపూర్వముగా మృదుభాషణంబులన్
గనికర మొప్పఁ బల్కె నధికం బగునేర్పున నాక్షణంబునన్.

82

ఎలయించి తెచ్చి యిచ్చినఁ, బొలియింప మృగేంద్రుఁ డడరఁ బొడమినభీతిన్
నిలువక వడిఁ జని మున్నిటి, నెలవున గార్దభము పోయి నిలిచినపిదపన్.

83


వ.

ఆమృగపతి గోమాయువుం గనుంగొని మనయత్నంబు విఫలం బయ్యె నింకను బ్రయ
త్నంబున నను సంధింపవలయు ననిన నాసృగాలం బిట్లనియె.

84


గీ.

మునుపు గార్యంబు దెలియనిమూఢచిత్తుఁ, బొసఁగ నిది సేయు మన మోసపోవుఁ గాని
దృష్టముగఁ జూచి కపటంబు దెలిసెనేని, పూని క్రమ్మఱ మఱి మోసపుచ్చరాదు.

85


వ.

అయినను నాబుద్ధిబలంబుననుఁ బలుకులనేర్పునను నాగార్దభంబుమనంబునం గల
భయం బుడిపి దేవరదివ్యశ్రీపాదపద్మంబులసన్నిధిం బెట్ట నవధరించెదం గాక యని
క్రమ్మఱం జని గార్దభంబుఁ గాంచి యిట్లనియె.

86


మ.

మృగరాజుం గని కొల్చి యాయనకడన్ మేఁ తెల్ల నీసొమ్ముగాఁ
దగ భృత్యప్రకరంబు లెల్ల నినుఁ దాత్పర్యంబునం జూడఁగా
జగతిం బెద్దఱికంబు గట్టుకొన కీజాడన్ భయభ్రాంతి నొ
ప్పగునే క్రమ్మఱి పాఱ సాహసవిహీనాత్ముండు పెం పొందునే.

87


వ.

అని మఱియును.

88


ఉ.

మానుగ నంటరానికొఱమాలిన మైలలమోపు వీపునం
బూని ధరించి తిట్టియును మొత్తియు నీరజకుండు నొంపఁగా
వీనిగృహంబునందుఁ దగవే నడపీనుఁగవై చరింప ని
చ్ఛానుగుణంబుగా నభిమతార్థము లానఁగ లేక యక్కటా.

89


వ.

అనుటయు నాగార్ధభం బిట్లనియె.

90


క.

నమ్మించి యేను నీవును నిమ్ముల బ్రదుకుద మటంచు నెలయించి ననున్
రమ్మని కొనిచని మృగపతి, సమ్ముఖమునఁ బెట్టి చంపఁ జనునే నీకున్.

91


గీ.

శితనఖంబులు మెఱయంగ జేగురించు, ఘనతరానన మతిభయంకరము గాఁగ
నుఱుక నుంకించున ట్లున్నయుగ్రహరికి, బెదరి పాఱక నిలువ నే బిరుదనయ్య.

92


వ.

అనిన నమ్మాటకు జంబుకం బిట్లనియె.

93


మ.

మొదలం జూడనివాఁడ వైనకతన న్ముంచెన్ భయం బెంతయున్
గదియం బోయి ననుస్కరింప నతఁడున్ గారుణ్యపూర్ణాంగుఁడై
చెదరం బాఱఁగనీక ప్రోచు నధికశ్రీయుక్తుఁగా భృత్యు నీ
వది గాన న్వెర వేది వచ్చితివి పంచాస్యంబుపొం దొప్పదే.

94


వ.

అని మఱియును.

95

చ.

వలసిన భక్ష్యభోజ్యము లవారణఁ బారణ చేయవచ్చు ని
చ్చలు హరిమూలభృత్యవనజంతునికాయములోన నెక్కుడై
మెలఁగఁగ వచ్చుఁ జల్లనిసమీరము వీవఁగ నిచ్చవచ్చుశ
య్యల శయనింపవచ్చును మహామహిమాఢ్యుని బంటుగా మదిన్
దలఁపనిపేదకున్ బ్రతుకు దాఁ గలదే తలపోయ నెమ్మెయిన్.

96


శా.

నాయత్నంబు ఫలింప దయ్యె నకటా నాస్నేహభావంబునన్
బాయంజాలక కూడియుండుటకునై ప్రార్థించినట్టే కదా
ధీయుక్తుండు త్రివర్గముం బడయ నర్థిం గోరఁగా నెయ్యెడన్
శ్రేయప్రాప్తికిఁ బెక్కువిఘ్నము లగున్ జింతింప నింతేటికిన్.

97


వ.

అని మఱియునుం బ్రియాలాపంబులు పలుకునగ్గోమాయువుమృదుమధురభాషణంబులకు
నోటుపడి గార్దభం బిట్లనియె.

98


క.

కందువచుట్టమువై మది, కం దంతయుఁ బాపి మీఁదఁ గలభాగ్యము నా
కందించి మనుపఁదలఁచితి, కందళితస్నేహభావగౌరవ మెసఁగన్.

99


క.

కడుపున కందియు నందని, కుడుపుల ననుదినముఁ గుదిలఁ గుడుచుటకంటెన్
గడుదొడ్డరాజుసేవకు, నొడఁబడి యొకనిమిషమైన నుండఁగ రాదే.

100


వ.

అని నిశ్చయంబుగాఁ బలికి గార్దభం బమ్మృగధూర్తంబువెనుకం జనఁ గొనిపోయి
మృగేంద్రుముందటం బెట్టి యిట్లనియె.

101


క.

నమ్మించి తోడి తెచ్చితి, నమ్మినభృత్యుండు గాఁడు నాక యితని నీ
సొమ్ముగ నోరం గన్నుల, నిమ్ముగఁ జూడంగఁ దగు మృగేంద్రకులేంద్రా.

102


వ.

అని విన్నవించి యామృగధూర్తంబు దొలంగిన మృగనాథుండు.

103


గీ.

ఉఱికి గార్దభంబు నుగ్రదంష్ట్రలు గల, ముఖమునం దుదగ్రనఖములందు
నొత్తి పట్టఁ దడవ యుసురు పోయినదానిఁ, జూపి జంబుకంబుఁ జూచి పలికె.

104


గీ.

దినముఖోచితకర్మంబు దీర్చి వచ్చి, యనుభవించెద నందాఁక నరసియుండు
మనుచు సింగంబు నదికిని నరుగ జూచిఁ జంబుకంబుఁ దలంచె మనంబులోన.

105


సీ.

దివ్యౌషధం బని తెప్పించి మృగరాజు, నన్నుఁ గావలి పెట్టి నదికిఁ బోయె
నీమందు మృగపతి కేల పోవఁగనిత్తు, గ్రక్కున నతఁ డిందు రాకమున్న
భక్షించి నామేనఁ బరఁగురోగము లెల్ల, హరియింతు ననుచు మహాభిలాష
మొదవ గార్దభకర్ణహృదయంబు లప్పుడు, తొడిఁబడఁ దిని మూతి దుడుచుకొనుడు


గీ.

నంత హరివచ్చి యాగార్దభావయవము లెక్కడికిఁ బోయె నిపు డన్న నెఱుఁగనట్లు
మూర్ఖచిత్తున కెం దైన మొదలఁ గలవె, హృదయకర్ణంబు లవి చూడ కెఱుఁగ కంటి.

106

వ.

కావున నీగార్దభంబునకు హృదయకర్ణంబులు లే వనిన నట్లకాఁబోలు నని యామృ
గేంద్రుం డూరకుండె నేను నవ్విధంబున మోసపోవ నగ్గార్దభంబుఁ గాను విచ్చేయు
మనిన నాశింశుమారవల్లభుండు లబ్ధనాశంబునకుఁ జింతాక్రాంతుం డగురుచు సిగ్గు
పడి జలమధ్యంబునకుం బోయె నని యిట్లు విష్ణుశర్మ లబ్ధనాశం బనుచతుర్ధతంత్రం
బెఱింగించినం గుమారు లసంప్రేక్ష్యకారిత్వం బెఱిఁగింపు మనుటయు.

107


ఉ.

తెల్లదలాటరాయ సుదతీజననూత్నమనోజ మల్లికా
వల్లభ సప్తసప్తికులవర్ధన మేరునగేంద్రధీర సం
ఫుల్లసరోజనేత్ర గుణభూషణ యాహవభీమ తమ్మభూ
వల్లభుకూర్మిపుత్త్ర బసవక్షితిపాలక రాజశేఖరా.

108


ఉత్సాహ.

మందరాచలేంద్రధీర మనుచరిత్రసంతతా
నందకులపవిత్ర ధర్మనందితావనీజనా
కుందచంద్రహారహీరగురుయశఃప్రకాశ గో
విందచరణకమలయుగళవిస్ఫురన్మనోంబుజా.

109


భుజంగప్రయాతము.

రమాసూనురేఖావిరాజత్స్వరూపా
యుమానాథఫాలానలోద్యత్ప్రతాపా
సమస్తావనీచక్రసంస్తూయమానా
నమద్రాజసంరక్షణాసంవిధానా.

110

గద్యము. ఇది శ్రీమైత్రావరుణగోత్రపవిత్ర బ్రహ్మనామాత్యపుత్త్ర సుకవిజనవిధేయ నారా
యణనామధేయప్రణీతం బైనపంచతంత్రం బనుమహాకావ్యంబునందు
లబ్ధనాశం బనునది చతుర్థాశ్వాసము.


————