Jump to content

నేటి కాలపు కవిత్వం/భావకావ్యాధికరణం

వికీసోర్స్ నుండి

శ్రీగణేశాయనమః

వాఙ్మయపరిశిష్టభాష్యం.

భావకావ్యాధికరణం.

యిట్లాటి దోషా లెన్నివున్నా యిప్పటికవుల "చిన్నకావ్యాలు పాశ్చాత్యుల లిరిక్కులవంటివని అవిభావకావ్యాలని. వీటిలోది భావకవిత్వ మని అది కొత్తే నని యాదోషాలన్నీ యీకొత్తలో అణిగిపోతవని చెప్పిన పూర్వపక్షానికి భావకావ్యాలు చిరకాలనుండి వున్నవని కొత్తగాదని చెప్పినాను. ఆసంగతి వివరిస్తాను.

సర్గబంధం లేని కావ్యాలు, చిరకాలంనుండి మనవాఙ్మయంలో వుంటున్నవి. ఘటకర్పరకావ్యం, సూర్యశతకం, బిల్హణకావ్యం, సౌందర్యలహరి, కాళహస్తీశ్వరశతకం, ఇవన్నీ యీకోటిలోనివి. వీటికే మనపూర్వులు ఉపకావ్యాలని ఖండకావ్యాలని పేరుపెట్టినారు.

"అసర్గబంధమపియదుపకావ్య ముదీర్యతే" "అసర్గబంధం సూర్యశతకాది". (ప్రతాప)

అని విద్యానాథుఁ డన్నాడు

"ఏకార్థప్రవణైః పద్యైః సంధిసామగ్ర్యవర్జితం
 ఖండకావ్యం భవేత్ కావ్యస్యైకదేశానుసారి చ" (సాహి)

(ఏకార్థ ప్రవణమై సంధిసామగ్ర్యరహితమైన పద్యాలసము దాయానికి కొన్ని లక్షణాలు తగ్గినకావ్యానికి ఖండకావ్య మని పేరు.)

"యథా భిక్షాటనం ఆర్యావిలాసశ్చ" (సాహి) అని విశ్వనాథు డన్నాడు. యీతీరుగా చిన్నకావ్యాలు విభాగరహితమైనవి, మనవాఙ్మయంలో చిరకాలంనుండి వున్నవి. కనుక ఆకారంచేత యిప్పటి చిన్నకావ్యాలు కొత్తవికావు.

పూర్వపక్షం.

అవునయ్యా, ఆకారంచేత కొత్తవికాకుంటె పోనియ్యండి. వనకుమారి, యెంకిపాటలు మొదలైనవి భావకవిత్వం. ఇది కొత్తది. యిది వరకు లేదు. ఇంగిలీషులో లిరిక్సునుచూచికొత్తగా యిప్పటివారు నిర్మించినది. భావకవిత్వం.

తటస్థాక్షేపం.

భావకవిత్వ మనడమె అసంగతం. శ్రీకాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రివారు వ్రాసినట్లు భావంలేనిది కవిత్వమే లేదు. కవిత్వ మెక్కడ వుంటుందో భావ మక్కడ వుండనే వుంటుంది."

సర్గబంధంలేని చిన్నకావ్యాలు చిరకాలంనుండి మనవాఙ్మయంలో వుంటున్నవి. ఘటకర్పరకావ్యం. సూర్యశతకం, బిల్హణకావ్యం, సౌందర్యలహరి, కాళహస్తీశ్వరశతగం ఇవన్నీ యీకోటిలోవి. వీటికే మనపూర్వులు ఉపకావ్యాలని, ఖండకావ్యాలని పేరు పెట్టినారు.

"అసర్గబంధమపి యదుపకావ్యముదీర్యతే" (ప్రతా.)

అసర్గబంధం సూర్యశతకాది అని విద్యానాధుడన్నాడు.

"ఏకార్థప్రవణైః పద్యైః' సంధిసామగ్ర్యవర్జితం,
 ఖండకావ్యం భవేత్ కావ్యస్యైకదేశానుసారీచ" (సాహి.)

(ఏకార్థప్రవణమై సంధిసామగ్ర్యరహితమైన పద్యాలసముదాయానికి కొన్ని లక్షణాలు తగ్గినకావ్యానికి ఖండకావ్యమని పేరు.)

"యథా భిక్షాటనం ఆర్యావిలాసశ్చ" (సాహి.) అని విశ్వనాథు డన్నాడు.

"న భావహీనోస్తి రసో న భావో రసవర్జితః,
 పరస్పరకృతాసిద్ది రసయో రసభావయోః" (సాహి)

అని సాహిత్యదర్పణకారుడు విశదంచేశాడు. ఇంగిలీషులో లిరికల్ కవిత్వాన్ని గురించి కూడా యిట్లానే సాహిత్యవేత్త లభిప్రాయపడ్డారు.

"Jonffroy was perhaps the first aesthetician to see quite clearly that lyrical poetry is really nothing more than another name for poetry itself, that it includes all the personal and enthusiastic part of what lives and breaths in the art of verse so that the divisions of pedantic criticism are of no avail to us in its consideration. We recognize a narrative or epic poetry; we recognize a drama; in both of these when individual inspiration is strong, there is much that trembles on the verge of the lyrical.But outside what is pure epic and pure drama, all or almost all is lyrical. (Encyclopedia Britannica.)

(లిరికల్ కవిత్వమనేది కవిత్వానికే మరియొక పేరని స్పష్టముగా కనుగొన్న ప్రథమసాహిత్య వేత్త "జాన్ఫ్రాయి" అని చెప్పవచ్చును. పద్యకళయందు ప్రాణభూతమైన లక్షణాలు లిరికల్ కవిత్వ మని అతడు విశదీకరించాడు. కనుక ఇది లిరికల్ కవిత్వ మని ఇది కాదని విభాగంచేయడం నిష్ప్రయోజనం. ఇది నాటకకవిత్వమని నిర్ణయించవచ్చును. ఇది థాకవిత్వమని నిర్ణయించవచ్చును. యీరెంటిలోను కవియొక్క స్వీయభావం ఉద్వేగం చెందినప్పుడు లిరికల్ కవిత్వాన్నే సమీపిస్తున్నది. యెపిక్కు, నాటకం, తప్ప తక్కిన కవిత్వమంతా దాదాపుగా అంతాలిరికల్ కవిత్వమేను) అని ఉక్తమవుతున్నది. కనుక సాధారణంగా కవిత్వమంతా భావకవిత్వమే. అందువల్ల యీభావకవిత్వం కొత్తదనే మాట అయుక్తమని తోసివేస్తున్నాము.

పూర్వపక్షం.

అవునయ్యా; కవిత్వమెక్కడవుంటుందో భావమక్కడవుండడం వాస్తవమైతే కానియ్యండి. యెవరేమన్నా లిరికల్ కవిత్వమని వొకశాఖపాశ్చాత్యవాఙ్మయంలో ప్రత్యేకంగా యేర్పడివున్నది. దానిలో భావోద్రేకం ప్రధానం. అవి చిన్నవి. వీటిననుసరించి మేమిప్పుడు భావకవిత్వమనే వొకశాఖను ప్రత్యేకించాము. ఇట్లా భావకావ్యాలనే పృథక్శాఖయిదివరకు మన వాఙ్మయంలోలేదు. భావకావ్యమనే పేరే యిదివరకు లేదు. ఇదే నూతనత్వం అని అంటారా.

సిద్ధాంతం.

చెప్పుతున్నాను. పూర్వపక్ష తటస్థాక్షే పాలకు కలిపి సమాధానం వివరిస్తాను. కవిత్వ మెక్కడవుంటుందోభావ మక్కడవుంటుందనే మాట వాస్తవమేను. భావకవిత్వం భావకావ్యం అనడం అసంగతంకాదు. మనవాఙ్మయంలో భావకావ్యం అనే పృథక్శాఖలేదని, అందువల్ల నూతనమని అనడం మిక్కిలి అసంబద్ధం. భావకావ్యం అనేది చాలా ప్రాచీనమయినది. అది మనవాఙ్మయంలో చిరకాలంనుండి వుంటున్నది. శిశుదేవజడప్రకృతివిషయమైన ప్రేమ విషాదాదులు సాహిత్య శాస్త్రంలో భావసంజ్ఞను పొందుతున్నవి. భావమంటే ముందు వివరిస్తాను. ఇట్లాటిభావం యెక్కడ ప్రధానంగా వ్యంగ్యమైవుంటుందో దానికి భావధ్వని అనిపేరు.

"రసభావతదాభాస భావశాంత్యాదిరక్రమః" (కావ్య.)

అని మమ్మటుడు.

"అక్రమః " అంటేఅసంలక్ష్యక్రమవ్యంగ్యధ్వని అని అర్థం, రసం ప్రధానంగావుంటే రసధ్వని అని, భావం ప్రధానంగావుంటే భావధ్వని అని యీతీరున కావ్యవ్యపదేశాలు. 

"ఇత్యుక్తదిశోద్రేకం ప్రాప్య రసస్య ప్రాధాన్యేపి ఆపాతతో యత్ర ప్రాధాన్యేన అభివ్యక్తో వ్యభిచారిణః స భావః"

—-, (సాహి)

(రసం ప్రధానమయినా ఉద్రేకంపొంది రసంకంటెయెక్కువప్రధానంగా విషాదాదులు అభివ్యక్తమయితే దానికి భావమని పేరు.)

అని సాహిత్యదర్పణకారుడు తెలుపుతున్నాడు --ఇతడే

"వాక్యం రసాత్మకం కావ్యం"

—-, (సాహి)

ఆని చెప్పి

"రస్యత ఇతి రస ఇతి వ్యుత్పత్తి యోగాతో భావతదాభాసాద యోపి గృహ్యంతే"

—-, (సాహి)

అని విశదపరచాడు. రసాత్మకకావ్యం భావాత్మకకావ్యం అనియీ తీరున భేదాలను విశ్వనాధుడు తెలుపుతున్నాడు. భగవంతుడి మీద గురువులమీద -తండ్రిమీద మిత్రుడిమీదావుండే ప్రేమకు భావమని పేరు. "ఆది. వ్యక్తమయ్యేకావ్యం భావాత్మకకావ్యం, భావకావ్యం, భావధ్వని,అని వ్యపదేశం పొందుతున్నది.

పూర్వపక్షం.

అవునయ్యా, మీరు సంస్కృతం నుండి భావకావ్యం ఉదాహరించారు. మే మనేది తెలుగులో భావకావ్యం కొత్తదని. సంస్కృతంతో మనకు పనేమిటీ? సంస్కృతం బంగాళీలు మహారాష్ట్రులు మొదలైనవారిది. దానితో మనకు పనిలేదు. మావి తెలుగువాట్లో కొత్తరకం అని అంటారా?

సమాధానం.

చెప్పుతున్నాను. మనము.. భారతీయులం.. సంస్కృతంమమీద బంగాళీలకు మహారాష్ట్రులకు యెంతహక్కువున్నదో మనకూ అంతే హక్కువున్నది అది. సర్వ భారతజాతులకు పితృపైతామహమయిన ధనం. ఆది ,బంగాళీలది మహారాష్ట్రులది, వారిది వీరిది, నాదిగాదు, అని దానికి దూరమైతిమా, భారతీయసంస్కారవిహీనులమై భారతీయులలో అధమాధములం కాగలము. ఈ అధమాధమదతే నేడు ఆంధ్రులకు ప్రాప్తించింది. భారతీయుల మని అను కుంటాముగాని భారతీయ సంస్కారానికి అత్యంతం అంధులమైనాము. మన కిప్పుడు వున్న కొద్ది తెలుగుపుస్తకాల్లో వున్నదే భారతీయసంస్కార మనుకొని వంచితులమైనాము.

భారతీయసంస్కారం భారతీయసాహిత్య జిజ్ఞాసలు యీ అధమదశలో మన విశ్వవిద్యాలయస్థానాల్లో నశించినవి గనుకనే కుళ్లినప్పుడు పుట్టే పురుగులవలె పులుముడు, అయోమయం. చిల్లరశృంగారం మొదలైన వాటితోకూడిన కృతులుపుట్టి ఆ పురుగులవలె సంచరిస్తున్నవి వేదమంత్రాలవద్ద నుండి. వేమన సూక్తులవరకు. కురుక్షేత్రంవద్దనుండి కోరబొబ్బిలివరకు ఆంధ్రులజీవనస్రవంతి ఆనుస్యూతంగా ప్రవహిస్తున్నది పోనియ్యండి యీచర్చ అట్లావుంచి చూచినా వెనకటి తెలుగు-కృతుల కంటె యిప్పటి వేమాత్రం-ముంచిదశలో లేవు మను, వసుచరిత్రలు అధమకావ్యాలయితే ఈవులుముడు అయోమయం శబ్దవాచ్యత మొదలైన దోషాలతో, అంతకంటే అధమాలై చిల్లరశృంగారంతో కూడివున్నవి గనుక యిప్పటికృతు , లేవిధంగాను మంచిదశలో లేవు.. భావం వ్యక్తమయ్యే కావ్యం భావధ్వని ఆని, భావకావ్య మనీ వ్యపదేశం పొందుతున్నదని, విశదీకరించాను.


"రతీర్దేవాదివిషయా" (కావ్యా)


అని మమ్మటుడన్నాడు


దేవమునిగురువిషయా చ రతి:" (సా.మి)

అని సాహిత్యదర్పణకారు డన్నాడు దేవాదివిషయమైన రతికి భావమని పేరని మమ్మటాదులు తెలిపినారు. శిశుప్రేమను వత్సలరసమని కొందరన్నా అదే దర్పణవ్యాఖ్యాతకు యిష్టమైనా, శిశుప్రేమను సయితం భావంలోనే మరికొందరు చేరుస్తారు.

"ఆదీపదాత్ పుత్రాదేరపి గ్రహణం ఇత్యన్యే" (సాహి)

అని వ్యాఖ్యాత ఉదాహరించాడు.ఆది పదంవల్ల ప్రకృతి: ప్రేమ సయితం భావమే అవుతున్నదనవచ్చును. సౌందర్యలహరి,ఋతుసంహారం, మహిమ్నస్తోత్రం మొదలైనవి యీభావకోటిలోనె చేరుతున్నవి. శిశుక్రందీయమని

"శిశుక్రందయమసభద్వన్ద్వేన్ద్ర జననాదిభ్యశ్చః. (పాణి)

అనేసూత్రంవద్ద పాణిని ఒక గ్రంథం పేరు ఉదాహరించాడు కాని అది యెట్లాటిదో చెప్పలేము.శిశువు యేడుపునుగురించిన అది, భావకావ్యమే అయివుంటుం దని పేరునుబట్టి చెప్పవచ్చును. ప్రియుడికి ప్రియురాలికి గలప్రేమకుమాత్రం పరిపుష్టదశలో రసమని అపరిపుష్ట దశలో భావమని పేరుపెట్టినారు. ఇప్పటివారు ఆసంప్రదాయం తెలియక తమచిన్న కావ్యాల్లో స్త్రీపురుషులప్రేమ పరిపూర్ణమైనాగూడా దాన్ని భావమేనని పిలిస్తే అది మనసాహిత్యదోషంమాత్రం గాదని భారతీయవిజ్ఞానం లేని దోషమని చెపుతున్నాను. కనుకనే

"ఈ కృతు లనేకములు భావగీతము లని ఇప్పుడు ప్రచారమునకు వచ్చిన కొత్త కవితాప్రపంచమునకు చేరినవి. సంస్కృతధాస్యమునుండి విముక్తుల మగుచున్నామని నానమ్మకం."

(తొలకరిపీఠిక. రామలింగారెడ్డి.)

"పాశ్చాత్యాదర్శముల ప్రోద్బలము దొరకునంతవరకు మన కవులు పాడినదే పాడవలసినవారైరి. నవీనమార్గరచనలలో ముఖ్య మైనది లిరిక్ అను ఆంగ్లేయరచనకు." (తృణకంకణ ప్రకాశకులు ) "నవ్యాంధ్ర కావ్యరీతులుకడచిన పదియేండ్లలో పొందియున్నవి."

(ఆంధ్ర హెరాల్డు - పురాణం. సూరిశాస్త్రి.)

"ఇంతవరకు మనకవులు సంస్కృతమునందు వివరించబడిన సంప్రదాయములను శిరసావహించి పని చేసిరి. ప్రాచీనసంప్రదాయముల యెడ గౌరవముతగ్గెను. నేడొక నూతనాధ్యాయము ఆరంభమగుచున్నది."

(నిడమర్తి సత్యనారాయణ. భారతి. సం. 3.)

అని వ్రాసినవి తెలియని అనుచితపుమాటలని విశదపరచాను.

అని శ్రీ.. ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర పరిశిష్టంలో

భావకావ్యాధికరణం సమాప్తం.