నేటి కాలపు కవిత్వం/జానపదపాత్రాధికరణం

వికీసోర్స్ నుండి

శ్రీగణేశాయనమః

వాఙ్మయపరిశిష్టభాష్యం.

జానపదపాత్రాధికరణం.

పూర్వపక్షం

అవునయ్యా, శబ్దార్థాలను బట్టిగాని వస్తువునుబట్టిగాని, భావాన్నిబట్టిగాని, యికాలపు చిన్నకావ్యాలు కొత్తవిగాకుంటే కాకపోనియ్యండి. పాత్రలనుబట్టి కొత్తవి. యెందుకంటే యీచిన్న కావ్యాల్లో యెంకి, వనకన్య, యీతీరుగా పాత్రలున్నారు. పూర్వకావ్యాల్లో దుష్యంతుడు, యక్షుడు, పార్వతి, సీత, మాలతి యిట్లాటివాండ్లున్నారు. ఈకాలపువాటిలోసాధారణప్రజలలోనుండి పాత్రలను స్వీకరిస్తున్నారు. ఇదే వీటి కొత్తఅంటారా?

సమాధానం.

ఇక్కడ వినిపిస్తున్నాను. కొత్తది అయితే అవునుగాక. కొత్తదయినమాత్రాన మంచి దెట్లా అవుతుంది? స్వస్థతకంటె రోగంకొత్తది, నిర్మలంగా వుండడంకంటే పైన దుమ్ముపడడం కొత్త , ఇవన్నీ కొత్తఅయినా మంచివిగావని సాధారణబుద్దికే తెలుస్తుంది. కాళిదాసువంటి కవివుంటే యీకాలంలో

"నవీనమిత్యేవ న సాధు సర్వం".

అని చెప్పివుంటాడు. అనాగరకదశనుండి నాగరకదశకు వస్తున్న పాశ్చాత్యులకు నవీనం అనేది మంచిదిగా వుంటే వుండవచ్చునుగాని ఆధ్యాత్మిక తేజస్సు తపస్సుధర్మం వీటితోపాటు విజ్ఞానం కావ్యప్రస్థానం మొదలైన మానసజిజ్ఞాసలు వీటిలో ఉచ్చోచ్చదశనందిక్రమంగా క్షీణిస్తున్న మనకు అందులో ఆంధ్రులకువచ్చేది అనేక సందర్భాల్లో ఇప్పటివరకు క్షయంగానే వుంటున్నది. ఇంతకూ చెప్పదలంచిం దేమంటే కొత్తదంతా మంచిదిగాదని కొత్త కొత్త అని మురియడం అవివేకమని తెలుపుతున్నాను. భారతవర్ష క్షయాన్ని గురించి దుఃఖపడ్డ విబుధులు సత్యాన్ని ప్రకటించినట్లే కనబడుతున్నది.

అవునయ్యా. వీటిని యింగిలీషులో. (Pastoral Poetry) పాస్టరలు పొయెట్రీ అని అంటారు కనుక ఇది మంచిది అని అంటారా? అది అసంబద్ధం. ఇంగిలీషులో దాన్నే పేరుతో పిలిస్తే నేమి? ఆ పేరువుంటే అది మంచిదని యేమి ప్రమాణం? దానీలో విషయం చర్చించి మంచి చెడ్డలు నిర్ణయించుకోవలసివుంటుంది. ఇక విచారణచేస్తాను.

పాత్రలు.

అయినా సాధారణప్రజల్లోనుంచి పాత్రలను స్వీకరించడం యికాలపువారు చేసే కొత్తపనేమో విచారిస్తాను. రామాయణంలో శబరిని వాల్మీకి స్వీకరించాడు. రఘువంశంలో

"హైయంగవీనమాదాయ ఘోషవృద్దానుపస్థితాన్" (రఘు.)
          
అని గొల్లవాండ్లను;
               
"వనేచరాణాం వనితాసఖానాం
 దరీగృహోత్సంగ నిషక్తభాసః" (కుమార)
          
అని వనకన్యలను, స్వీకరించాడు
               
"వియోగదుఃఖానుభవానభిజైః
       కాలే నృపాశం విహితం దదద్భిః,
 ఆహార్యశోభారహితైరమాయై
       రైక్లిష్ట పుంభిః ప్రచితాన్‌స గోష్ఠాన్.
 స్త్రీభూషణం చెష్ఠితమప్రగల్భం

     
        చారూణ్యవక్రాణ్యపివీక్షితాని,
ఋజూంశ్చ విశ్వాస కృతః స్వభావాన్
        గోపాంగనానాం ముముదే విలోక్య
ఆమంద్రమన్దధ్వనిదత్తతాలం
        గోపాంగనానృత్యమనందయత్ తం" (భట్టి)
        
అని భట్టి తన కావ్యంలో జానపదస్త్రీలను వర్ణించాడు.

"కోశాతకీపుష్పగుళుచ్ఛకాంతిభి
 ర్ముఖైర్వినిద్రో ల్బణబాణచక్షుషః,
 గ్రామీణ వధ్వస్త మలక్షితాజనై
 శ్శిరంవృతీనా ముపరి వ్యలోకయన్,
  గోష్ఠేషు గోష్ఠీకృతమండలాసనాన్
  సనాదముత్థాయ ముహుస్సవల్గతః,
  గ్రామ్యానపశ్యత్ కపిశం పిపాసతః
  స్వగోత్రసంకీర్తనభావితాత్మనః
 
పశ్యన్ కృతార్థైర పివల్లవీజన్
         జనాధినాథం నయయౌవితృష్ణతాం
ఏకాంతమౌగ్ధ్యానవబుద్ధవిభ్రమం
         ప్రసిద్ధ విస్తార గుణైర్విలోచనైః,
ప్రీత్యా నియుక్తాన్ లిహతీస్త్సనంధయాన్
         నిగృహ్య పారీ ముభయేనజానునోః,
వర్ధిష్ణుధారా ధ్వనిరోహిణీః పయ
         శ్చిరన్నిదధ్యౌ దుహతః స గోదుహః,
సవ్రీహిణాం యావదుపాసితుం గతాః
         శుకాన్ మృగైస్తావదుపద్రుతశ్రియాం,

కైదారికాణామభితః సమాకులాః
        సహాసమాలోకయతి స్మ గోపికాః" (మాఘ)
      
అని మాఘుడు గ్రామస్త్రీలను, గొల్లలను గొల్లవనితలను ప్రశంసించాడు.

"విలాసా నాగరస్త్రీణాం న తథా రమయన్తి నః,
 యథా స్వభావసిద్ధాని వృత్తాని వనయోషితాం"

అనిఒకకవి వనకన్యకల చేష్టల ముగ్ధరమణీయత్వాన్ని ప్రశంసించాడు.

మనదేశంలో.

"జొన్నచేలో మంచి సొగసుకత్తెను జూచి
"నిన్నటాలనుంచి నిద్రలేదు" అని.
"యెట్లా పోనిస్తేవోయి మట్లావోరి చిన్నదాన్ని"

అని మొదలైన యాలపాటల్లోను బ్రాహ్మణేతరజానపదపాత్రలు ప్రాచీన కాలంనుండి గోచరిస్తున్నారు. కనుక వీటిలో నూతనత్వంయేమీలేదు.

అవునయ్యా, వీరిని పూర్వులు అప్రధానంగా స్వీకరించారు. వీరు ప్రధాన పాత్రలుగా ఇప్పటి కావ్యాలల్లో వున్నారు. కనుక ఇదికొత్త అని అంటారా? అది సరిగాదు.

"ఓరోరిబండోడ వొయ్యారిబండోడ"

అనే కృతుల్లో వారే ప్రధానం. అవునుగాని అవి చిన్నకృతులు. యెంకిపాటలు మొదలైనవి పెద్దవి అనిఅంటారా? అపుడు చిన్నవి పెద్దవి అనే అనవలెనుగాని కొత్త అని అనడం అసంగతం. కొత్త అని ఒప్పుకున్నా, కొత్త అన్నమాత్రాన మంచిదనే నిశ్చయంలేదని యిదివరకేచెప్పినాను.

అని శ్రీ... ఉమాకాన్త విద్యాశేఖరకృతిలో వాఙ్మయసూత్ర

పరిశిష్టంలో జానపదపాత్రాధికరణం సమాప్తం.