నిర్వచనోత్తరరామాయణము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

నిర్వచనోత్తరరామాయణము

ద్వితీయాశ్వాసము



మద్భగీరథాన్వయ
తామరసాకరసహస్రధాముఁడు సూరి
స్తోమారామవసంతుఁడు
భూమండనయశుఁడు మన్మభూమీశుఁ డొగిన్.

1

రామునికొల్వుకూటమునకు జనకాదులు వచ్చుట

క.

శ్రీరామచంద్రుఁ డిట్లు మ, హారాజపదస్థుఁ డైన నభినందింపన్
గౌరవమున జనకాది, క్ష్మారమణులు వచ్చి కాంచి సంప్రీతిమెయిన్.

2


క.

అన్నరపతివినయాదిగు, ణోన్నతి కెద లలర మంజులోక్తుల సమయో
త్పన్నవిష యోపలాలన, నున్నయెడన్ హర్షరససముత్కర్షముతోన్.

3


సీ.

కౌశికబకదాల్భ్యకణ్వప్రభృతు లైనదురితవిదూరు లౌ తూర్పువారు
నాత్రేయకుత్సదృఢాయురగస్త్యు లాదిగఁ గలదక్షిణదిక్కువారు
ఋషభరైభ్యకయక్షవృషముఖ్యు లౌతపోమహనీయు లగుపశ్చిమంబువారు
గశ్యపజమదగ్నిగౌతమాత్రులులోనుగా నుత్తరమునఁ గల్గువారు


తే.

శిష్యసంఘంబుతో రాముపోష్యవర్గ, మగుట మునికుల మెల్లను నరుగుదెంచె
నతనివిజయోత్సవముఁ గొనియాడువేడ్కఁ, బ్రీతి మొగముల నెలకొనఁ బిండుగట్టి

4


ఉ.

అందఱుఁ గూడి మోసలకు నర్థిమెయిం జనుదెంచి యెంతయుం
గ్రందుకొనంగ నున్నెడ నగస్త్యుఁడు వాకిటివానిఁ జూచి మా
యిందఱరాక దాశరథి కీ వెఱిఁగింపుము వేగ మన్న వాఁ
డుం దగఁ బోయి యల్లన నడుంకుచు భూవిభుఁ జేరి నమ్రుఁ డై.

5


ఉ.

దేవ మునీశ్వరుల్ సకలదిఙ్ముఖవాసు లగస్త్యముఖ్యు లా
శ్రావితనామధేయులు విశాలతపోవిభవు ల్సముజ్జ్వల
త్పావకమూర్తు లయ్యును గృపారసపూరితశీతలాకృతుల్
దేవరఁ గాన వేడ్కఁ జనుదెంచినవా రని విన్నవించినన్.

6


క.

విని యెంతయు సమ్మదమున, జనపతి తోడ్తెమ్ము వారిఁ జయ్యన ననుడుం
జనెఁ బణిహారియుఁ దోడన, మును లత్యంతప్రమోదమున వచ్చుటయున్.

7

చ.

పతి యెదురేగి నమ్రుఁ డయి భక్తిమెయిం గొని వచ్చి యుజ్జ్వలో
న్నతకనకాసనంబుల మనఃప్రమదంబుగ నందఱన్ యథో
చితగతి నుంచి మోమరల సేమమె నావుడు బాధ లెల్లఁ దీ
ర్చితి భువనంబు లన్నిటికి సేమమ యింకిట మాకు సేమమే.

8

మునులు రాముని నుతించుట

చ.

అరిఁ బరిమార్చి ప్రీతి జనకాత్మజఁ దోకొని యేగుదెంచి రా
జ్యరమఁ బరిగ్రహించి యిటు లద్భుతసంపద నొప్పి యున్ననిన్
గర మనురక్తి మై వినియుఁ గన్నులు చల్లగఁ జూచియు న్ముదం
బరుదుగఁ గంటి మెంతయుఁ గృతార్థుల మైతిమి రాఘవేశ్వరా.

9


ఆ.

అలుక వొడమి చాప మందికొనిననుం ద్రి, జగము లైనఁ గడఁక సమయుననిన
సమరమందు రాక్షసశ్రేణి నోర్చుట, నీకు నెంత పెద్ద నృపవరేణ్య.

10


క.

ఐనను రావణుఁ డఁట రిపుఁ, డానెలకువ చొచ్చి పొదివి తఁట పోరను నీ
చే నెత్తురు గాకుండఁగ, వానిం జంపి తఁట తగదె వర్ణన సేయన్.

11


మ.

అనిఁ గుంభుండు నికుంభుఁడుం బడినఁ గ్రోధావిష్టుఁ డై దర్పమున్
దనుజస్నేహముఁ బక్షయుగ్మకము గా ధాత్రీధరాకారతం
జనుదేరం గని కుంభకర్ణుఁ బటువజ్రస్ఫారబాణాహతిం
దునుమం జాలుట నీడు లే దరయ నీదోర్విక్రమక్రీడకున్.

12


చ.

ఇవి యరయంగ నెంతపను లింద్రజిచావుఁ దలంప వాని నా
హవమున శూలి కైనఁ జెనయ న్భర మాతఁడు పిల్కు మారినన్
భువనము లెల్ల నిర్భయతఁ బొంది మహాద్భుత మంది లక్ష్మణ
స్తవనకథావిధాచరణతాపరతంత్రము లయ్యె రాఘవా.

13


చ.

అని మును లెల్లఁ బంక్తిముఖు నాతనితమ్మునిఁ గుంభకర్ణునిం
దనయుని మేఘనాదుని నుదగ్రబలాఢ్యులఁ గాఁ గడంగి పే
ర్కొన విని కౌతుకం బడరఁ గుంభసముద్భవుమోముఁ జూచి యి
ట్లను ధరణీశ్వరుండు వినయంబు నిజాస్య మలంకరింపఁగన్.

14


క.

కడిఁది మగ లని దశాస్యుం, గొడుకుం దమ్మునిఁ గరంబు గురువుగ మీ చె
ప్పెడుభంగిఁ జూడ వారల, నడుగంగా వలసియున్నయది మునినాథా.

15


క.

అమ్మనుజభోజనులజ, న్మమ్ములునుం దపము చేసినతెఱంగును శౌ
ర్యములును జెప్పు మనవుడు, నమ్ముని రఘుపతికి నిట్టు లనియెం బ్రీతిన్.

16

విశ్రవసు జన్మప్రకారము

ఆ.

తొల్లి కృతయుగమునఁ దోయజసంభవ, నందనుఁడు పులస్త్యశనామధేయుఁ
డైనమునివరుఁడు మహానుభావంబునఁ దండ్రి యట్ల యెన్నదగినవాఁడు.

17


చ.

అమరనగంబుచేరువ నియంత్రితనిర్మలచిత్తవృత్తి యై

శమదమసత్యశాలి యనఁ జాలి తపం బొనరించుచుండి కాం
చె మనుజదేవకింపురుషసిద్ధయచ్చరకన్యకానికా
యముఁ దనయాశ్రమస్థలియుపాంతమున న్విహరింప వచ్చినన్.

18


క.

పలుమఱుఁ గని కని యొకమఱి, మెలఁతలతో నిట్టు లనియె మీ రిచటికి రా
వల దిం కిట ననుఁ జూచినఁ, గలుగుంజుఁడి తత్క్షణంబ గర్భము మీకున్.

19


క.

అని నియతి సేయుటయు న, మ్మునిపలుకులు కన్యకాసమూహం బెల్లన్
విని యాయిరువునఁ జేరక, చన నం దొక్కర్తు విధివశంబున వినమిన్.

20


ఉ.

ముందటియట్ల నెచ్చెలుల మొత్తములోపలఁ గూడి యాడువే
డ్కం దరలాక్షి వోయి యచట న్మునియాకృతితోడ దృగ్రుచుల్
వొందినమాత్ర మై నెలఁత పొక్కిటితో విరియ న్వళు ల్గరం
బందము గాఁగ నారును గుచాగ్రములు న్నునుఁగప్పుసొంపు నై.

21


ఉ.

గర్భముఁ దాల్చి మై గలయఁ గన్గొని వెక్కసపాటు మున్నుగా
దుర్భర మైనసంభ్రమముతోడ విషాదభయానుతాపముల్
నిర్భరభంగిఁ బుట్టి తను నెమ్మది దీఁటుకొనంగ జోటి యా
విర్భవదార్తి యై చనియె వేగమ యాత్మనివాసభూమికిన్.

22


క.

అరుగుటయుఁ జూచి మది న, చ్చెరువడి తృణబిందుఁ డల్లఁ జేరఁ బిలిచి ని
ర్భరగర్భచిహ్నములుగా, నిరూపణము చేసి యవ్వనిత కి ట్లనియెన్.

23


ఉ.

అక్కట కన్యకాత్వ మిటు లాఱడివోవ నకారణంబ నీ
కెక్కడిచూలు వచ్చె నిది? యెయ్యెడ నెమ్మెయిఁ బుట్టె నన్ననున్
వెక్కుచు మాట దొట్రుపడ వెల్వెలఁ బాఱుచుఁ గ్రమ్ముకన్ను నీ
రక్కుపయిన్ వెసం దొరఁగ నామృగలోచన తండ్రి కి ట్లనున్.

24


క.

చెలులకడ నాడు వేడుకఁ, బులస్యమునియాశ్రమంబుపొంతకుఁ జని య
ప్పొలఁతులఁ గానక యయ్యెడఁ, గలయం బరికించుచుండ గర్భము దోఁచెన్.

25


ఉ.

నాయొడ లేన కన్గొని మనంబున బెగ్గల మంది యత్తఱిం
జేయునుపాయ మెయ్యదియుఁ జిత్తమునం దలపోయలేక నా
కీయకృతంబు వాటిలుట? యేర్పడ నీ కెఱిఁగింపఁ గోరి వే
వే యిటు పాఱుతెంచితి వివేకనిధీ ననుఁ గావు నావుడున్.

26


క.

ఆరాజర్షియు దీనికిఁ, గారణ మమ్మునియకాఁ బ్రకాశజ్ఞానో
దారమతి నెఱిఁగి కన్నియ, గౌరవమునఁ గొని పులస్త్యుకడకుం జనియెన్.

27


చ.

చని మునినాథ యిత్తరుణి సాధ్వి గుణాన్విత నాదుకూర్మినం
దని నిగృహీతచిత్తుఁడఁ గదా యని త్రోవక దీని నాదరం
బునఁ బరిచర్యఁ గొ మ్మనినఁ బొల్తుక నర్థిఁ బరిగ్రహించి యా
తనిఁ జరితార్థుఁ జేసె నుచితమ్మున నమ్ముని ధర్మవేది యై.

28

చ.

అది మొద లాలతాంగి వినయంబున వల్లభుచిత్తవృత్తి స
మ్మదము దలిర్ప భక్తిగరిమంబునఁ బెంపు వహించి యుండఁ గొ
న్నిదినము లంతఁ బోయిన మునిప్రవరుండు ప్రసన్నుఁ డై దయా
స్పదసదపాంగవీక్షణము భామినిపైఁ బోలయంగ ని ట్లనున్.

29


క.

తరుణీ భక్తికి మెచ్చితి, వర మిచ్చెద నీకు విను భవద్ధర్భము భా
స్కరతేజుం డగుకొడు కై, వెరవరి యయ్యెడును సకలవిద్యలయందున్.

30


క.

ప్రశ్రయవతి వగునీచే, విశ్రుత మై గుణసమృద్ధి వెలయుట వాఁడున్
విశ్రవసుం డనఁగా భువ, నశ్రావ్యం భైనభవ్యనామము వడయున్.

31


క.

మన రెండువంశములుఁ బే, ర్కొనఁ గను నీకొడుకువలనఁ గోమలి యనినన్
విని సంతసిల్లి యట్టుల, తనయుని జనకోపమానుఁ దడయక కాంచెన్.

32


శా.

పౌలస్త్యుం డుదయించి నిర్మలకళారస్ఫారీభవన్మూర్తి యై
బాలేందుం బ్రహసించుచుం బెరిఁగి యల్పం బైన కాలంబునం
జాలం గీర్తన కెక్కి యుజ్జ్వలతపస్సంపత్తిఁ బెంపారి ధ
ర్మాలోకంబున లోకము ల్వెలుఁగ నార్యశ్లాఘ్యుఁడై యున్నెడన్.

33


క.

తేజోధనుఁ డగునమ్ముని, రాజితగుణజాలములకు రాగిల్లి సుతం
బూజాపూర్వముగ భర, ద్వాజుం డాతనికి దేవవర్ణిని నిచ్చెన్.

34


ఉ.

విశ్రవసుండు నమ్ముదిత వేడుకతోడ వివాహ మై గృహ
స్థాశ్రమధర్మ మొప్పెసఁగ యజ్ఞసమృద్ధి వహించుచుం గృపా
విశ్రుతబుద్ధిసంపద వివేకవిశుద్ధి ప్రసిద్ధి కెక్క భ
వ్యశ్రుతిచోదితాచరణ మాభరణంబుగ నిత్యపుణ్యుఁ డై.

35

వైశ్రవణుని వృత్తాంతము

క.

ఆరమణియందుఁ గులవి, స్తారకుఁ డగుతనయుఁ బడసి తత్సంతాన
శ్రీరమ్యతఁ గోరెడుసర, సీరుహసంభవుని సంతసిల్లఁగఁ జేసెన్.

36


ఉ.

తత్సమయంబున న్మునివితానము గొల్వఁగ వచ్చి యెంతయున్
వత్సలతం గుమారునకు వైశ్రవణుం డనుపేరు పెట్టి య
త్యుత్సుకవృత్తి నెత్తికొనియుం గొనియాడియు నట్లు పుత్త్రపౌ
త్త్రోత్సవ మాచరించెఁ గమలోద్భవుఁ డుత్కటహర్షమూర్తియై.

37


క.

ఆవైశ్రవణుఁ డఖిలవి, ద్యావిదుఁ డై యౌవనమునఁ దప మొనరించెన్
దేవాసురసిద్ధమునీం, ద్రావళి తనధర్మనియతి కచ్చెరువందన్.

38


క.

నీరాహారసమీరా, హారంబులఁ జేసి చేసి యది గాక కడున్
ఘోరం బగుతపము నిరా, హారుం డై చేసి బహుసహస్రాబ్దంబుల్.

39


క.

నిష్ఠ మెయి నిట్లు వ్రతము ల, నుష్ఠింపఁగ సౌమ్యదర్శనుం డయి యమర
శ్రేష్ఠనివహమ్ముతోఁ బర, మేష్ఠి యరుగుదెంచెఁ దత్సమీహిత మొసఁగన్.

40

చ.

ముదమున నేగుదెంచి తనముందట నిల్చినశంభుఁ గాంచి త
త్పదసరసీరుహంబులయుపాంతమునన్ ధరఁ జాఁగి మ్రొక్కి నె
న్నుదుటను మోడ్పుఁగేలును దనుద్యుతియుం బులకాంకురంబులున్
హృదయము భక్తిపెంపుఁ బెరయించుచు వైశ్రవణుండు నిల్చినన్.

41


ఉ.

వత్స, భవత్తపోనవదివాకరుఁ గాంచి వికాస మొందె నా
హృత్సరసీరుహంబు వర మిచ్చెద నిష్టము గోరు నావుడున్
వత్సలుఁ డైనపద్మభవు వైశ్రవణుండు సముజ్జ్వలార్థసం
పత్సముదాయనిత్యసుఖభవ్యదిగీశత వేఁడె వేఁడినన్.

42


ఉ.

అక్కమలాసనుండు వరుణాంతకజిష్ణులఁ జూచి మీకుఁ దో
డొక్కని దిక్పతిత్వపదయోగ్యుని నే సృజియింప నున్నచో
గ్రక్కున నీతఁడుం దదభికాంక్షయ చేసెఁ దగంగ నింక మీ
రొక్కటి యై జగం బరయుచుండుఁడు నాలవవానిఁ జేసితిన్.

43


చ.

అని వర మిచ్చి వైశ్రవణు నాదరవిస్తృతనేత్రపద్ముఁ డై
కనుఁగొని నిర్జరత్వపదగౌరవనిత్యుఁడ వైతి గాన నీ
కనుగుణ మైన యీరుచిరయానముఁ గొ మ్మని యిచ్చెఁ బుష్పకం
బనఁగఁ బ్రసిద్ధ మై మణిమయాకృతి నొప్పు విమానరత్నమున్.

44


ఆ.

ఇవ్విధమున నిచ్చి యింద్రాదిసురులతో, నజుఁడు వోవుటయు ధనాధిపతియుఁ
దండ్రికడకు వచ్చి తత్పదాబ్జములకు, నెరఁగి భక్తియుక్తి నెదుర నిలిచి.

45


క.

కోరినవరము విమానము, గారవమున నాకుఁ గమలఁగర్భుఁ డొసంగెన్
మీరలు నివాసదేశముఁ, గారుణ్యము సేయుఁ డనినఁ గడువేడుకతోన్.

46


క.

ఆవిశ్రవసుఁడు తనదుప్ర, భావంబున నెల్లయెడలుఁ బరికించి తదీ
యావాసయోగ్యముగ మది, భావించి ముదమున నర్థపతి కి ట్లనియెన్.

47


సీ.

కమనీయముగ విశ్వకర్మ నిర్మించిన మున్ను దైత్యశ్రేష్ఠు లున్నపురము
జలనిధి పరిఖగాఁ గలిగినయది లంక యనఁగ లోకములఁ బేర్కొనిన నెలవు
దనుజు లెల్లను జనార్దనుచేత మర్దితు లయి పోకఁ జేసి పా డయ్యె నయ్యు
రమ్యనికేతనారామాభిరామ మై యుల్లసిల్లెడు సుఖ ముండు మచట


ఆ.

ననిన నట్ల కాక యని తండ్రి వీడ్కొని, బహువిధానురూపపరిజనములు
పొదివి కొలువ నతఁడు పుష్పకంబునఁ జని యందు దివ్యసుఖము లనుభవించె.

48


క.

జనకునకు మ్రొక్కఁ బోవుచు ననిమిషవల్లభునికడకు నరుగుచుఁ గమలా
సనుఁ గొలువఁ జనుచు విహరిం, చె నిజేచ్ఛం బుష్పకమున సిద్ధపదమునన్.

49


చ.

అన విని కుంభసంభవమహామునితో రఘువంశనాథుఁ డి
ట్లనియె మునీంద్ర మున్ను నసురాధిపు లేలెడివీడె లంక త

జ్జననతపోవిభూతిబలసత్త్వచరిత్రవిశేషము ల్జనా
ర్దనుదెస హాని పుట్టిన విధంబు వినం గడువేడు కయ్యెడున్.

50


క.

ఆతనికి మనయెఱింగిన, యీతనికిని దారతమ్య మెట్టిదియో మీ
చేత నెఱుంగవలయు నఱ, చేత నిడినయట్లు దెలియఁ జెప్పు మునీంద్రా.

51


క.

జనపతి త న్న ట్లడిగిన, మునినాథుం డధికహర్షమునఁ బలికె దశా
ననదర్పదళన యేర్పడ, విను చెప్పెద నంతయును సవిస్తారముగాన్.

52

సుకేశునివృత్తాంతము

క.

హేతిప్రహేతు లనఁ బ్ర, ఖ్యాతు లుదయ మైరి రాక్షసాన్వయమున నా
హేతి గృహస్థుం డయ్యెఁ బ్ర, హేతి తపంబునకుఁ జనియె నెంతయు శాంతిన్.

53


ఆ.

అంబుజాక్షి కాలుఁ డనువానిచెలియలు, హేతిరమణి యైననాతి యొక్క
తనయుఁ గాంచె వీతవినయు విద్యుత్కేశు, నతులబలపరాక్రమైకరసికు.

54


చ.

అతఁ డభిరాముఁ డై పెరిగి, యౌవనసంపద నుల్లసిల్లుచుం
బ్రతి యిడరానిరూపమునఁ బ్రస్తుతి కెక్కి వివాహ మయ్యె వి
శ్రుతముగ సంధ్య నాఁ బరఁగు సుందరి కూరిమిపుత్రి మన్మథా
స్త్రతులిత గాత్రయష్టి యగు సాలకటంకట సమ్మదమ్మునన్.

55


క.

ఆలలన యౌవనంబునఁ, జూలాలై వగచి తుదిఁ బ్రసూతిక్రియకుం
గాలం బగుటయు మందర, శైలతటంబునకు నొంటి సని యచ్చోటన్.

56


ఆ.

వరతనూజుఁ గాంచి కరుణావిహీన యై, విడిచి వైచి వచ్చి విభునితోడ
వివిధకేలిఁ దేలి విహరించుచుండె మ, న్మథవికారపూరమగ్న యగుచు.

57


క.

అంత నఁట నక్కు, మారుం, డెంతయుఁ గరుణమ్ము దోఁప నేడ్చుచు నుండం
గొంతవడికి భూతేశుఁడు, కాంతాసహితంబు వృషభగమనుం డగుచున్.

58


క.

ఆచక్కటిఁ గ్రీడార్థం, బై చని యాయేడ్పు విని దయార్ద్రత బాలుం
జూచి యకటకట యని గౌ, రీచారుముఖాంబుజము నిరీక్షించు చొగిన్.

59


మ.

అతివా వీనికిఁ దండ్రితోడి సరిప్రాయం బాసురత్వంబు ను
ద్ధతబాహాబలగర్వనిర్వహణమున్ దైతేయవంశక్రమా
గతరాజ్యంబు నభశ్చరంపుఁబురముం గ్రామప్రచారంబు నీ
చ్చితి నీచిత్త మెఱింగి నావుడుఁ గృపాశ్రీ పారవశ్యంబునన్.

60


క.

అప్పుడ గర్భం బగుటయు, నప్పుడ జన్మించుటయును నప్పుడ ప్రాయం
బొప్పెడిజవ్వన మగుటయు, నప్పుడు దనుజాన్వయమున కంబిక యిచ్చెన్.

61


క.

కేశములు లెస్స యిప్పిశి, తాశనునకు ననుచుఁ గౌతుకాన్వితమతి యై
యీశానుఁడు గావించె సు, కేశుం డనుపేరు వానికిం బ్రకటముగన్.

62


చ.

అతఁడు వరప్రసాదమహిమాతిశయంబునఁ జేసి విష్టప
త్రితయము గీడ్వడం చనదుతేజము చెల్లుచునుండ లీల న

ప్రతిహతవృత్తి నెల్లెడ నభశ్చర మైనపురంబుతోడ నం
చితగతులం జరించె విలసిల్లుచు నీశ్వరలాలనీయుఁ డై.

63


క.

ఉన్నయెడ నాసుకేశుమ, హోన్నతి కెద నోటువడి వయోరూపగుణో
త్పన్నానురూపమతిఁ దన, కన్నియ దేవమణి నిచ్చె గ్రామణి ప్రీతిన్.

64

మాల్యవంతాదులు తపంబుచే బ్రహ్మవలన వరంబులు పడయుట

తే.

ఇట్లు గంధర్వవల్లభుఁ డెలమి గూఁతుఁ
దనకు నిచ్చిన వరియించి దానివలన
మాల్యవంతుఁ డనంగ సుమాలి యనఁగ
మాలి యనఁ గాంచెఁ గొడుకుల మహితయశుల.

65


ఉ.

ఇవ్విధిఁ బుట్టి తండ్రి పరమేశువరంబున నద్భుతస్థితిన్
జవ్వన మాదిగా నఖిలసంపదలుం గను టెల్ల విన్కి నా
మువ్వురు నుత్సహించి తపముం బరమేష్ఠి గుఱించి చేయఁగా
నవ్విబుధాచలంబునకు నర్థి మెయిం జని సువ్రతస్థు లై.

66


ఉ.

ఆర్జవశాంతిదాంతినియమాదిగరిష్ఠగుణైకనిష్ఠ మై
నిర్జితచిత్తవృత్తు లయి నిర్మలధర్మపరంపరాప్రభా
వార్జన మెల్లలోకములు నద్భుత మందుచు సంస్తుతింప నా
వర్జితబుద్ధిఁ జేసి రసవద్యతపంబునఁ బద్మసంభవున్.

67


శా.

ప్రత్యక్షం బయి దేవబృందములతోఁ బద్మాసనుం డర్థి నా
దిత్యాద్రిస్థలి నిల్చి పొల్చుటయు దైతేయాత్మజు ల్సంభ్రమ
ప్రీత్యుత్కర్షము లంతరంగముల ఘూర్ణిల్లంగ సర్వాంగసాం
గత్యస్వీకృతభూతలం బగునమస్కారంబునం బుణ్యు లై.

68


క.

కరకమలయుగళపుట శే, ఖరులును భక్తిభరనమ్రతగాత్రులు నై ని
ల్చిరి వరదానౌత్సుక్య, స్ఫురితాధరుఁ డైనపద్మజునికట్టెదురన్.

69


ఉ.

అత్తఱి వారిఁ జూచి కరుణార్ద్రత ని ట్లనియె న్విరించి దై
త్యోత్తములార మీతపము నుగ్రత కచ్చెరు వంది వచ్చితిం
జిత్తములందు మీ రభిలషించినయట్టివరంబు లెల్ల నే
నిత్తుఁ గడంగి కోరికొనుఁ డిప్పుడు దేవమునీంద్రసన్నిధిన్.

70


ఉ.

నావుడుఁ బొంగి యద్దనుజనందను లి ట్లని రేకవాక్యులై
దైవతయక్షకింపురుషదానవమానవకిన్నరాదినా
నావిధభూతకోటుల రణంబున గెల్పుఁ బరస్పరప్రమో
దావహ మైన నెయ్యముఁ జిరాయురవాప్తియు మా కభీష్టముల్.

71


తే.

ఇవ్విధంబునఁ గోరిన నెలమిఁ బొంది
యట్ల కావుత మని కమలాసనుండు

వాసవాదులు వెఱఁ గంద వరము లొసఁగి
మునులు గొలువ నిజావాసమునకుఁ జనియె.

72

మాల్యవంతుఁడు లంకయందు నివసించుట

చ.

వరములు గాంచి బాహుబలవంతుఁ డనం దగుమాల్యవంతుఁ డ
చ్చెరు వగువిక్రమంబునఁ బ్రసిద్ధి వహించి నిజానుజన్ములం
గర మనురక్తి మన్ననఁ దగం గొనియాడుచు సర్వలోకభీ
కరుఁ డయి దేవతామునినికాయము దల్లడ మందుచుండఁగన్.

73


క.

దానవలక్ష్మీవిభవ మ,నూనంబై నెగడ నసదృశోద్ధతగతి నెం
దేనిం జని విహరించుచుఁ, దా నొక్కెడ విశ్వకర్మఁ దద్దయుఁ బ్రీతిన్.

74


క.

రావించి యిట్టు లనియెను, దేవతలకు నెల్ల నీ వతిస్థిరమతి వై
కావింతు నివాసము లొక, యావాసము మా కొనర్పు మభిరామముగాన్.

75


తే.

అదియు రజతాద్రి నొండె హిమాచలమున
నొండె మందరనగమున నొండె బాగు
చూచి నీశిల్ప మేర్పడ సుభగరత్న
సంపదుజ్జ్వలముగ రచియింపవలయు.

76


క.

అని తనతోఁ జెప్పినయ, ద్దనుజపతికి విశ్వకర్మ తాఁ దొల్లి సురేం
ద్రునియనుమతమున దక్షిణ, వననిధిలో నొక్కపురము వర్ణన కెక్కన్.

77


క.

ఒనరించుటయుఁ ద్రికూటం, బనునున్నతభూధరంబునం దది శతయో
జనవిస్తీర్ణం బగుటయుఁ, గనకప్రాకారసప్తకము గల్గుటయున్.

78


సీ.

అఖిలదిక్కులును సన్ముఖముల యగుటయు మందిరమ్ములు రత్నమయము లగుట
గోపురావళి నభోవ్యాపిని యగుటయు మార్గముల్ మృదుకుట్టిమమ్ము లగుట
తోరణోత్కరము రత్నారూఢ మగుటయు నంగణంబులు మనోహరము లగుట
దేవాలయంబులు దివ్యంబు లగుటయు నాపణవ్రాతంబు హైమ మగుట


ఆ.

పేరు లంక యగుట యారామకేదార, కమలషండదీర్ఘకావిభూతి
పాత్ర మగుట ప్రబలశత్రుపరాక్రమా, గమ్య మగుట చాలరమ్య మగుట.

79


క.

ఎఱిఁగించి మీకు నునికికి, నొఱపు సకలదైత్యకోటియును మీరలు నే
డ్తెఱఁ జని యం దుండుఁడు గడు, నుఱవని నెయ్యంపుసముచితోక్తులఁ దెలుపన్.

80


క.

దనుజపతి లంకకందువ, గని నిధి నిఱుపేదవాఁడు గన్నట్లు మనం
బునఁ బొంగి యనుజసహితము, చని యప్పురి దైత్యవంశసామ్రాజ్యముగాన్.

81

మాల్యవదాదులు పెండిలియై పుత్రులం గాంచుట

ఆ.

నెగడి యున్నయెడ ననింద్యచరిత్ర గం, ధర్వి నర్మదాభిధాన ప్రీతిఁ
గోరి యిచ్చెఁ దనదుకూఁతుల మువ్వుర, దానవేశ్వరునకుఁ దమ్ములకును.

82

క.

క్రమమున సుందరియును గే, తుమతియు వరదయు నన న్వధూటీత్రయముం
దమమువ్వురుఁ బూర్వజపూ, ర్వముగఁ బ్రమోదములతో వివాహం బైనన్.

83


సీ.

అందు సుందరి యను నరవిందనయన యున్మత్తు సుప్తఘ్ను నిమత్తు యజ్ఞ
కోపు దుర్ముఖుని విరూపాక్షు వజ్రముష్టిని గని పుత్రిక ననలఁ గనియె
నాకేతుమతియు ధూమ్రాక్షుఁ బ్రహస్తుఁ గంపనుఁ గాలకార్ముకు భద్రదత్తు
భాసకర్ణాంకు సుపార్శ్వు సంహ్రాదిని గాంచెను వరదయుఁ గైకసియును


తే.

నోలిఁ గుంభీనసయును బుష్పోత్కటయును
ననఁగ నలువురు వామలోచనలఁ గనియె
ననలు నీలుని సంపాతిహరునిఁ బడసె
వరద పదపడి దానవాన్వయము వెలిఁగె.

84

మాల్యవంతుఁడు లోకంబులు బాధించుట

శా.

సంతానం బభివృద్ధి నొందిన బలోత్సాహం బెలర్పం బలా
క్రాంతాశేషదిగంతుఁ డై బలువిడిన్ రక్షోగణేశుండు దు
ర్దాంతుం డై శ్రుతిబాధ సేయుచుఁ గ్రతుధ్వంసంబుఁ గావించుచుం
గాంతారాంతరవాసు లైనమునులం గారించుచుం గ్రూరుఁ డై.

85


మ.

పరనారీహరణం బొసర్చు వివిధోపాయంబుల న్మేదినీ
సురవర్గంబుల నొంచు దేవగృహసంశోభాభిఘాతంబు సే
యు రవీందుద్యుతిజాలము ల్మలుపు మాయోపాయకేలీకృతా
దరుఁ డై నిర్జరకోటిఁ గష్టపఱుచున్ ధర్మంబు నష్టంబుగాన్.

86

ఇంద్రాదులు హరుననుజ్ఞచే విష్ణువును వేఁడుట

చ.

ఋషులును దేవతాగణము లెంతయు బెగ్గల మంది యార్తు లై
వృషగమనుండు దీర్చు మనవేదన యంచు మహేశుఁ గాంచి దు
ర్విషహము లైనయాపరిభవించుట లెల్ల నెఱుంగఁ జెప్పి ని
స్తుషముగ దైత్యవర్గములఁ ద్రుంపఁగఁ గోరిరి దైన్య మేర్పడన్.

87


చ.

హరుఁడు సుకేశుమీఁదికృప నాతనిసంతతి కల్గ కుండియున్
సురమునివృత్తభంగములు చూడఁగఁ జాలక యేను నేర నా
హరికడ కేగుఁ డాతఁ డరయం బొసఁగున్ దయ మీకు నన్నఁ జె
చ్చెరఁ జని శౌరి కంతయును జెప్పి రరాతులజన్మ మాదిగాన్.

88


శా.

గోవిందుండు దయామతిం బలికె నాకుం జెప్పఁగా నేల రు
ద్రావిర్భావితశక్తి నే నెఱుఁగనే యాదైత్యుఁ దత్పుత్రకుల్
భావారూఢులు గారె పద్మజవరప్రాప్తానుభావు ల్తదీ
యావాసం బగులంక వింతయె త్రిలోకాక్రోశ మాలింపనే.

89

ఉ.

ఐనను మీమతం బెఱుఁగునంతకు నేమియుఁ జేయనైతి న
ద్దానవులన్ సముజ్జ్వలసుదర్శననిర్దళితాఖిలాంగులం
గా నొనరించి లోకములు కల్మష మంతయుఁ బాచి యుత్సవ
శ్రీ నినుపారఁ జేసెద విరించిమహేశులు సమ్మతింపఁగన్.

90

మాల్యవదాదు లమరావతిపై దండెత్తుట

క.

అని వీడ్కొల్పిన మోదం, బునఁ బొందుచు నిజనివాసములకు శతమఖా
ద్యనిమిషులు ఋషులుఁ బోయిన, యనంతరము మాల్యవంతు డంతయు వినియెన్.

91


క.

విని యొక్కింత వగచి య, ద్దనుజేంద్రుఁడు విక్రమైకతత్పరుఁ డగుచున్
మనమున గర్వము గదురఁగ, ననుజుల రావించి యిట్టు లనియెఁ గుపితుఁ డై.

92


మ.

మనలన్ ధూర్జటితోడ గోసడిచి కామధ్వంసి పట్టీక పొం
డని చక్రాంకునిఁ జూపి పోవిడ సురేంద్రాదు ల్సరోజాక్షునిం
గని యెగ్గు ల్ప్రకటించినం గినిసి లోకంబు ల్వినంగా నతం
డనుమానింపక పూనె దైత్యకులసంహారంబుఁ గావింపఁగాన్.

93


ఉ.

పూర్వమున హిరణ్యకశిపుప్రభృతుల్ దనచేతఁ జచ్చినన్
గర్వము మీఱి యున్కి మురుఘస్మరుఁ డెట్లుఁ గడంగు నాతనిన్
సర్వజగంబులున్ బెదర సంగరరంగమునన్ జయించి హృ
త్పర్వ మొనర్పఁగావలయు దైత్యులకు న్మన మెల్లభంగులన్.

94


క.

అనిన సుమాలియు మాలియు, సని రతఁ డిట వచ్చెనేని నదె యయ్యెడు న
య్యనిమిషు లెగ్గులు మనపైఁ, బొనరించినదాన నింత పుట్టెను గంటే.

95


క.

కావున నమరావతిపైఁ, బోవలయుం జుట్టుముట్టి పొరిగొని పిదపన్
దేవతలపక్ష మై యని, కేవీరుఁడుఁ గడఁగె నేని నెఱుఁగుద మతనిన్.

96


ఆ.

అనిన మాల్యవంతుఁ డగుఁ బోలు నిది యని, పయన మపుడ చాటఁ బంచి కదలి
యమితవివిధవాహనారూఢయోధవీ, రోద్ధతముగ నడిచె నుద్దవిడిని.

97


ఉ.

అత్తఱిఁ గెంపు మీఱినఘనావళి యాకస మెల్లఁ గప్పి క్రొ
న్నెత్తురు నెమ్ములుం గురిసె నీరధి యెంతయు ఘూర్ణమాన మై
యుత్తల మొందెఁ బర్వతము లొక్కమొగిం గదలె న్మహోల్కముల్
మొత్తము గట్టి రాలె బలము ల్వెఱఁగందఁగ జేటు దెల్పుచున్.

98


ఉ.

అంతయుఁ జూచియున్ దితిసుతాధిపుఁ డఫ్డు మనంబులోన నా
వంతయుఁ గొంకు లేక దివిజావళికిన్ మనచేయుహానికై
యెంతలు పుట్టెఁ జూడుఁ డని యేడ్తెఱఁ జూపుచుఁ దమ్ములన్ బలం
బంతటికిం బురస్సరుల రైచనుఁ డంచుఁ బరాక్రమోన్నతిన్.

99


క.

చెలఁగుచు నమరావతి కిం, పలరంగ నడచు టెఱిఁగి భయభ్రాంతి మెయిం
గలఁగఁగఁ బాఱి మహేంద్రాదులు పుచ్చి రుపేంద్రుకడకు దూతం గడఁకన్.

100

ఆశ్వాసాంతము

ఉ.

కాయికవాచికాత్మికవికారవిసర్జనవిస్ఫురత్తనూ
దాయకు నానతారివసుధావరహర్షరసప్రకర్షసం
ధాయకు సూరిశోభనవిధాయకు నుద్భటరాజదుర్దశా
దాయకుఁ గీర్తివస్త్రపరిధాయకు దీనజనార్థదాయకున్.

101


క.

పాండిత్యసుభగుఁ ద్రిభువన, పెండేరు నరాతిభూపభీషణబాహా
దండాభిరాము రామా, మండలచిత్తాపహారమకరపతాకున్.

102


మాలినీవృత్తము.

సకలజనమనోజ్ఞుం జండభాషానభిజ్ఞుం
బ్రకృతిఘటిుంరాగం బ్రస్ఫురత్త్యాగభోగుం
జకితనృపశరణ్యుం జారులావణ్యగణ్యుం
బ్రకటసుగుణసంగున్ రాయవేశ్యాభుజంగున్.

103


గద్యము.

ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధనవిధేయ
తిక్కననామధేయప్రణీతం బయినయుత్తరరామాయణం బనుమహాకావ్యంబు
నందు ద్వితీయాశ్వాసము.


————