నా జీవిత యాత్ర-4/1946 లో రాష్ట్ర రాజకీయములు

వికీసోర్స్ నుండి

11

1946 లో రాష్ట్ర రాజకీయములు

ఆంధ్రప్రాంతంలో రాజకీయాల మాట కొంచెం ఆపి, అదే సమయంలోని తమిళ ప్రాంత రాజకీయాలను కొంచెం వివరిస్తాను. క్విట్‌ఇండియా ఉద్యమంలో యావన్మంది కాంగ్రెసు వాదులు జైళ్ళలోకి పోవడం, వారిలో కొందరు ఆస్తిపాస్తులను పోగొట్టుకోవడం జరిగిన సమయంలో - రాజాజీ పాకిస్థాన్ ప్రచారం చేయడంవల్ల, ఆయన పలుకుబడి సంపూర్ణంగా నశించింది.

1942లో ఆయన ఆ ప్రచారం ఆరంభించినపుడు, సత్యమూర్తిగారు కాంగ్రెస్ అధ్యక్షులయిన అజాద్‌గారికి, "రాజాజీపైన మీరు క్రమశిక్షణ చర్య ఎందుకు తీసుకోరు?" అని ఒక ఉత్తరం వ్రాశారు.

దానికి అజాద్‌గారు "ఆయనను వర్కింగ్‌కమిటీలోంచి బల వంతంగా తొలగించేశాను," [1] అని జవాబువ్రాశారు. ఇది అయినతర్వాత ఆయన కాంగ్రెసు సభ్యత్వం పూర్తిగా వదలుకోవడంకూడా జరిగింది. ఆయన 'సన్‌డే అబ్జర్వర్‌' అనే పత్రిక సంపాదకునిమీద పరువునష్టం దావా తేవడం, అందులో - టి. అవినాశలింగంగారి డైరీలో రాజాజీ వ్యక్తిసత్యాగ్రహానికి వ్యతిరేకంగా ఇచ్చిన ఉపన్యాసాలప్రసక్తి సాక్ష్యంగా బయలుపడడం మొదలైన విషయాలు జరిగినవి. ఆ కారణంచేతా, అంతకుముందే సత్యమూర్తిగారు కారాగృహంలోఉన్న కాలంలోనే స్వర్గస్థులు కావడంచేతా, తమిళప్రాంతంలో సహజంగానే కాంగ్రెసు నాయకత్వం అంతరించింది. తరువాత కోవలోఉన్న ఉపనాయకవర్గంలో ముఖ్యుడు కామరాజ నాడారుగారు. కాంగ్రెస్ సంస్థ ఆయన చేతిలోకి వెళ్ళింది. అయితే, చెన్నరాష్ట్రాని కంతటికీ నాయకత్వం సహించడానికి తన శక్తి పరిమితమైనదని తెలుసుకొని, ఆయన - ప్రకాశంగారికి నాయకత్వం అప్పజెప్పడానికి నిర్ణయించుకొన్నాడు. అయితే, ఇది జనరల్ ఎన్నికల తరువాత జరుగవలసిన విషయము.

ఈలోపున విధి బలీయమైనదని మరొకమారు ఋజువయినది. పైనచెప్పిన విషయాలవల్ల, రాజాజీకి తిరిగి కాంగ్రెసులో ఎటువంటి స్థానముగాని లభిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఆయన, కాంగ్రెసులో తిరిగీ సభ్యుడుగా చేరుదామంటే తమిళప్రాంత కాంగ్రెస్ కమిటీ వారెవ్వరూ అందుకు అంగీకరించలేదు. అంతవరకు, మానవప్రకృతి ప్రకారంగా జరిగింది. గాంధీ గారి ప్రకృతి వేరు. రాజాజీతో ఆయనకున్న సంబంధమే వేరు. అందుచేత, ఆయన ప్రోద్బలంవల్ల కాంగ్రెసు సాలుసరి చందా నాలుగు అణాలు - ఢిల్లీలో, కాంగ్రెసు అధ్యక్షులయిన అజాద్‌గారు (1942 లో బలవంతంగా రాజాజీని కాంగ్రెసునుంచి తొలగించిన అజాద్‌గారే) పుచ్చుకొని, రాజాజీని కాంగ్రెసు సభ్యునిగా చేర్చుకున్నారు. 1946 లో జనరల్ ఎన్నికలు రానున్నవి. అందుచేత రాజాజీ పైన చెప్పిన సభ్యత్వాన్ని పురస్కరించుకొని తమిళప్రాంతంలో తన వర్గాన్ని బలపరచుకొనడానికి గట్టియత్నం చేశారు. ఇంతకు కొంచెం ముందు, ఎన్నికల తర్వాతి విషయాలకు సంబంధించిన విషయం ఒకటి జరిగింది. కాంగ్రెస్‌వారు తిరిగీ ప్రభుత్వాలు చేపడితే పాత ముఖ్యమంత్రులే తిరిగి ముఖ్య మంత్రులు కాగలరనీ, చెన్నరాష్ట్రంలోకూడా ఆ సూత్రమే వర్తించగలదనీ గాంధీగారంటూ వచ్చారట. ఇదికూడా రాజాజీకి కొంత బలమిచ్చింది. కాని, అందుచేతనే ఆయన యెడల కామరాజ్ నాడారుగారి వ్యతిరేకతకూడా హెచ్చయింది. కనుక రాజాజీకి, నాడారుగారికి - ఈ విషయంలో ఒక రాజీమార్గం కుదిర్చి, రాజాజీకి అగ్రస్థానం కల్పించాలన్న గాంధీగారి సంకల్పాన్ననుసరించి కాంగ్రెసు అధిష్ఠానవర్గంవారు యత్నించసాగారు.

ఆ సమయంలో అంతవరకు జరిగిన పరిస్థితుల కనుగుణంగా ప్రకాశంగారు, కామరాజ్ నాడారుగారికి తమ సంపూర్ణమయిన మద్దతు ఇచ్చారు. తాను రెవిన్యూమంత్రిగా - జమీందారీ ఎంక్వయరీ కమిటీ నివేదిక రచించిన ఉత్తమ పురుషునిగా సంపాదించిన పేరు ప్రతిష్ఠల బలంతో దక్షిణ జిల్లాలలో పర్యటించి, నాడారుగారికి చెప్పుకోదగ్గ సహాయం చేశారు.

కాంగ్రెస్ అధిష్ఠానవర్గంవారు, తమలో ఒకరైన అసఫ్ అలీ గారిని[2] చెన్నపట్నం పంపించారు. రాబోయే ఎన్నికలలో రాజాజీకి గౌరవస్థానం కల్పించడం ఆయన సంకల్పము. చివరకు ఏలాగుననో నాలుగోవంతుకు పైగా, మూడోవంతుకు కొంత తక్కువగా స్థానాలు మాత్రమే - ఆయన వర్గంవారికి ఇవ్వడానికి ఏర్పాటయింది.

రాజాజీని తగ్గించిన ఈ ఏర్పాట్లు, గాంధీగారి మనసుకు ఏమీ సంతృప్తి నిచ్చినట్టు కనిపించదు. కామరాజ్, ప్రకాశంగార్ల మధ్య స్నేహం కుదరడం రాజాజీ భవిషత్తుకు భంగకరం కాబట్టి ఆయనకు అది కూడా నచ్చలేదు. రాజాజీపైన ప్రేమ ఉండడాన్ని సమర్థించవచ్చు. కాని, అది - రాజకీయంగా ప్రకాశంగారిపైన కోపంగా మారి, ఆయన అద్వితీయమైన త్యాగచరిత్రను గూడా మరపుకు తెచ్చేంత గాఢంగా ప్రబలింది.

విధి బలీయమై రాజాజీని ముందుకు తీసుకువెళ్ళింది. ఆ విధియే అంతకన్న బలీయమై, ప్రకాశంగారిని వెనక్కుత్రోసుకు వెళ్ళింది.

గాంధీగారి చెన్నరాష్ట్ర పర్యటనము

ఒరిస్సా ప్రాంతంలో పర్యటించిన గాంధీగారు ఆంధ్ర జిల్లాల మీదుగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవ సందర్భంగా చెన్నపట్నానికి వెళ్ళారు. అలా వెళుతూండగా జరిగిన చరిత్ర, ఆంధ్రదేశ చరిత్ర స్వరూపాన్ని నూతనంగా రూపొందించింది, క్విట్ ఇండియా ఉద్యమం తర్వాత, ఆంధ్రా కాంగ్రెస్ కమిటీకి క్రొత్త ఎన్నికలు జరగలేదు. పూర్వంలోవలెనే కళా వెంకటరావుగారే కార్యదర్శులుగా ఉండిరి. గాంధీగారు ప్రయాణం చేసే రైలుబండి ఆంధ్రదేశంలోకి వచ్చేసరికి ఆయనకు స్వాగతం ఇవ్వడానికి వెంకటరావుగారు బరంపురంవరకూ వెళ్ళి, ఆయన ఉన్న స్పెషల్ కంపార్ట్‌మెంటులో ఎక్కారు.

ఇదివరలో వ్రాసినదానిని బట్టి, ఆంధ్ర ప్రాంత కాంగ్రెస్ కమిటీలో, పట్టాభిగారి నాయకత్వాన్ని పురస్కరించుకొని ఒక చిన్న వర్గం, ఒక చిన్న పాయగా నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి, చేత బల్లెము పట్టుకొని ముందుకు నడచే దళ నాయకుడిగా వెంకటరావు గారు ఉండడాన్ని చదువరులు గ్రహించియే ఉంటారు.

విశాఖపట్నం స్టేషనులో నేను గాంధీగారిని ఆహ్వానించాను. ఆయన రైల్వేస్టేషన్ ఆవరణలోనే ఉపన్యసించి, తమ కంపార్ట్‌మెంటులోకి వెళ్ళిపోయారు. ఆ మధ్యాహ్నం మరొక మెయిలు బండికి కలపడానికి దానిని వాల్తేరు స్టేషనునుంచి ఐదారు మైళ్ళ దూరంగా, జన సంబంధంలేని స్థలంలో నిలబెట్టారు. ఆయన స్నానపానభోజనాదులు ఆ కంపార్ట్‌మెంటులోనే ఏర్పాటయి ఉండెను. (అది ఒక మూడవ తరగతి కంపార్ట్‌మెంటు.) అంతవరకు వెంకటరావుగారు, గాంధీగారితో ఏమి మాట్లాడారో మాకు తెలియదు.

ఆంధ్రదేశంలో తుఫాను

ఇక్కడ మరొక విషయం వివరించాలి. ప్రకాశంగారూ, మిగిలిన కాంగ్రెసువారమూ క్విట్‌ ఇండియా ఉద్యమ ఫలితమైన కారాగృహ నిర్భంధంనుండి విముక్తులమయిన తర్వాత, ఆంధ్రదేశంలో - శ్రీకాకుళం జిల్లా మొదలుకొని బందరు వరకు ఒక బ్రహ్మాండమయిన తుఫాను, ప్రచండమైన వాయువుతో కూడి చెలరేగడంవల్ల ఆ ప్రాంతాలలో పర్యటించడం అవసరమయింది.

ఆ తుఫానులో తోటలు గట్టిగా దెబ్బ తిన్నవి. శ్రీకాకుళంజిల్లా ఉద్దానంలోను, తూర్పు గోదావరిజిల్లా మధ్య డెల్టా భాగంలోను, ఈ రెండింటి మధ్యగల ప్రాంతంలోను కొబ్బరి చెట్లు భారత యుద్ధంలో హతులైన సైనికులవలె ఎక్కడివక్కడ నిర్మూలములయి, భూదేవతకు సాష్టాంగంగా నమస్కరిస్తున్నట్టు పడిపోయాయి. వేలాది అరటిచెట్లు దాదాపు అన్ని జిల్లాల లోను గెలలతో సహా ఒకదానిమీద ఒకటిగా నేల వాలినాయి. అదేవిధంగా, ముఖ్యంగా పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలలో నారింజ, నిమ్మ, బత్తాయి తోటలు పడిపోయినాయి. డెల్టా చివరి భాగాలలో ఎక్కడి నీరు అక్కడ నిలిచిపోయి, పెరుగుదలకు వస్తున్న పంటలు మునిగిపోయాయి. ఈ తుఫానువల్ల కలిగిన జలప్రళయానికి పశువులు కొన్ని, మనుష్యులు కొందరూ బలి కావడంకూడా జరిగింది. కొన్ని కొన్ని చిన్న గ్రామాలు - ద్వీపాలుగా మారి, అక్కడ ప్రజలు రెండు మూడు దినాలు ఏ విధమైన సహాయము అందక, ఆకాశం వైపు చూస్తూ నిరాహారులై ఉండవలసిన పరిస్థితులు కూడా కలిగాయి.

ఇది సంభవించినపుడు ప్రకాశంగారు, ఇచ్ఛాపురం మొదలు బందరు వరకు - కారుమీద, కాలినడకను, రెండెడ్ల బండిమీద - ఎక్కడ ఏలాగు అవసరమైతే ఆలాగు ప్రయాణం చేశారు. వీరి పర్యటనలో తుఫాను బాధితుల సహాయార్థం డబ్బు వసూలు చేశారు; పంచిపెట్టారు. మిగిలిన కొంత ఆంధ్రా సైక్లోన్ రిలీఫ్ నిధి అనే అకౌంటున ఆంధ్రా బ్యాంకులో జమ కట్టారు. అందులోనుంచి డబ్బు తీయడానికి కోశాధికారి అయిన గుంటూరు నరసింహారావుగారికి అధికారం ఇవ్వడం జరిగింది.

ఇది ఇలా ఉంటుండగా, విడుదలయిన వెంటనే ప్రకాశంగారు రాష్ట్రం అంతటా పర్యటించారు. ఆ పర్యటనలో ఏవో ఒకటి రెండు జిల్లాలు తప్ప, తక్కిన జిల్లా లన్నిటి పర్యటనలోను నేను ఆయనవెంట ఉన్నాను. శ్రీకాకుళం జిల్లాకు మేము వెళ్ళినపుడు - జైలులోంచి విముక్తు లయిన స్వాతంత్ర్య యోధులను, వారి కుటుంబాలను; ఉద్యమ సమయంలో అండర్‌ గ్రౌండు అయిపోయి, అజ్ఞాతంగా ఉండి ఉద్యమం నడిపించిన వారిని సందర్శించడం మా ముఖ్యోద్దేశము.

అయినా సభల్లో కొందరు చిన్న చిన్న కవర్లలో డబ్బు తెచ్చి మా చేతుల్లో పెట్టడం మొదలు పెట్టారు. మాటల సందర్భంలో, "ప్రకాశంగారు తనుకున్న లక్షలన్నీ స్వాతంత్ర్య ఉద్యమ యజ్ఞంలో ఆహుతి చేసేశారు. వారికి, నిత్య జీవితయాత్ర నడపడానికి ధనం అవసరం కాబట్టి, ఇది దానికి వినియోగించండి," అని నాతో చెప్పేవారు. కొందరు ఏమీ చెప్పకుండానే చేతిలో డబ్బు పెట్టేసేవారు. ఈ పర్యటన సమయంలో, కొందరు కారాగృహ విముక్తులు, అజ్ఞాత ప్రచారకులు వచ్చి, ప్రకాశంగారితో తమ బాధ చెప్పుకోవడం తటస్థించేది. వెంటనే ప్రకాశంగారితో - డబ్బు, వారి చేతిలో ఉన్నా, నా చేతిలో ఉన్నా తీసి వారి కిచ్చేసేవారు. ఈ ఇచ్చినదానిలో ఆయన వ్యక్తిగతమైన ఉపయోగాలకని చెప్పి ఇచ్చిన ధనమూ ఉండేది. ఏదీ నిర్దేశించకుండా ఇచ్చిన డబ్బూ ఉండేది. మేము శ్రీకాకుళంజిల్లా, విశాఖాజిల్లా ఉత్తర భాగాలలోను పర్యటించి విశాఖపట్నం తిరిగి వచ్చి, రైలులో అనకాపల్లికి బయలుదేరుదామనే సరికి, ప్రకాశంగారికి ఇచ్చినదంతా పైన చెప్పిన విధంగా సంపూర్ణంగా ఖర్చయిపోయింది.

అప్పుడు నాకు, మరి కొందరు మిత్రులకు - ఇలా జరిగినట్లయితే ప్రకాశంగారికి స్వంత వినియోగంకోసం అభిమానులు ఇచ్చిన డబ్బు కూడా మిగలదనీ, తిరిగి వారు చెన్నపట్నం చేరిన తర్వాత, ఏ రోజు వ్యవహారం ఆ రోజున ఎలాగో నడిపించుకోవలసి వస్తుందనీ గుర్తుకు వచ్చి, ఒక ఏర్పాటు చేశాము. ధన మిచ్చేవారు ప్రత్యేకంగా ప్రకాశంగారి వ్యక్తిగత ఉపయోగ నిమిత్తమని ఇవ్వదలచితే, ఆ విధంగా వ్రాసి ఒక కవరులో పెట్టి, వేరేగా ఇవ్వవలసిందని ఏర్పాటు చేశాము. ఆ విధంగా ఎక్కడో మేము చెప్పడం మరచిపోయినచోట తప్ప, మిగతా అన్నిచోట్లా ప్రజలు - సభలలో ఆ విధంగానే వ్రాతమూలకంగానో, వ్రాయడానికి వీలులేని సమయాలలో నోటిమాటగానో చెప్పి డబ్బు ఇచ్చేవారు. ఆ విధంగా ప్రత్యేకించి చెప్పకుండా డబ్బు మాత్రం ప్రత్యేకంగా ఉంచేవారు. అది చాలా కొంచెం మొత్తంగా ఉండేది. కాని మేము ఎక్కడా డబ్బు ఇవ్వ వలసిందని - బహిరంగంగాగాని, రహస్యంగాగాని విజ్ఞప్తి చేయలేదు. అయితే, ప్రకాశంగారు మాత్రం తన జీవితం, బాధపడే ప్రచారకుల జీవితంకంటే వేరుకాదని, తనకు ఏర్పాటయిన డబ్బుకూడా తీసి, ప్రచారకులో, వారి కుటుంబంవారో ఎదురైనపుడు లెక్కా జమా లేకుండానే ఇచ్చేసేవారు.

ఇచ్చినదంతా ఇచ్చివేయగా, ఆయనకు ఇచ్చినదానిలో యాభై వేల రూపాయలు మిగలడం జరిగింది. మేము మొదట ఆ డబ్బు బాంకులో వేసి, ఆయనకు నియామకంగా ప్రతినెలా వేయిరూపాయల చొప్పున అందేటట్టు ఏర్పాటు చేద్దామనుకున్నాము. అయితే, స్వరాజ్య కంపెనీ తీర్చవలసిన బాకీ ఇంకా ఉంటూండగా ఈ డబ్బు ప్రత్యేకంగా బాంకులో వేయడం భావ్యం కాదనీ, తమ నిత్య జీవనంకోసం మేమంతా ఎటువంటి ప్రయాసా పడవద్దనీ, ఆ బాధ్యత ప్రజలు చూసు కుంటారనీ ఆయన చెప్పడంతో మేము చేయదలచుకున్న యత్నం వదులుకున్నాము.

గాంధీగారి ప్రమేయము

తరువాత అరిగిన విషయాలనుబట్టి - కళా వెంకటరావుగారు, గాంధీగారితో రైలులో కలిసి ప్రయాణం చేసిన సమయంలో ఈ యాభైవేల రూపాయల విషయమై ఒక విపరీతార్థం కలిగేటట్టు ఆయ నతో చెప్పినట్టు, అది సాకుగా చేసుకుని ఆయన ప్రకాశంగారిని నాయకత్వం వహించనీయకుండా చేయాలని యత్నించ సాగినట్టు అర్థమైంది. అది వివరించే ముందు మరొక విషయం చెప్పాలి.

హిందీ ప్రచారసభ రజతోత్సవము

గాంధీగారు చెన్నపట్నం చేరుకున్నారు. ఆయన చెన్నపట్నం రావడానికి పైన పేర్కొన్న ఉత్సవం కారణమని ఇదివరలో చెప్పడమయింది.

1921 లో ఆయన సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించినపుడు, దేశంలో ఇంగ్లీషుకు బదులు హిందీ అంతర్రాష్ట్రీయ భాషగా పరిణమించాలని ఉద్దేశించారు. దాని ప్రకారం, చెన్నపట్నంలో దాక్షిణాత్యులందరికి ఉపయోగపడేటట్టు మోటూరి సత్యనారాయణగారు ఈ ప్రచార సభను 1921 లో, మరి కొందరు పెద్దల సాయంతో ప్రారంభించారు. 1946 నాటికి వందలకొద్ది విద్యార్థులు హిందీలో శిరోమణి పరీక్షవరకు కూడా ఉత్తీర్ణులయ్యారు. ఆ సభ అప్పటికి పెద్ద భవనాలు కట్టుకోగలిగింది. ప్రచార సభలో ఆచార్యులుగా ఉండేవారికి వసతి భవనాలు కూడా కట్టుకోగలిగింది. చెన్నపట్నంలో త్యాగరాయనగర భాగంలో ప్రాముఖ్యం సంపాదించుకొన్నది.

ఈ కార్యకలాపాల మూలంగా సత్యనారాయణగారు - రాజాజీకి, గాంధీజీకి సన్నిహితులలో ఒకరుగా ఉండేవారు. ఆ కారణం చేతనే గాంధీగారు ఈ రజతోత్సవానికి తప్పకుండా హాజరయ్యారు. కొన్ని వేలమంది ఆ సభకు హాజరయ్యారు. గాంధీగారు కొంచెం అప్రస్తుతంగా - రాజాజీకి, దానికీ సంబంధం ఉండడంవల్లనే అన్ని వేలమంది సభకు హాజరయ్యారని ఆయన అన్నారు. అనంగీకార సూచకంగా సభలో నవ్వులు, గుసగుసలు బయలుదేరాయి.

గాంధీగారు అంతటితో ఊరుకోక, చెన్నపట్నంలో ఒక ముఠా [3] బయలుదేరి, రాజాజీకి వ్యతిరేకంగా అల్లరి చేస్తున్నారని అన్నారు. బాంధవ్య ప్రభావం కలిగినపుడు ప్రస్తుతాప్రస్తుతములు పాటింపుకురావు గదా! సభలోని వ్యతిరేకత మరింత స్ఫుటమయింది. ఒకరిద్దరు, "ఇది రజతోత్సవ సభా? లేక రాజాజీపక్ష ప్రచార సభా?" అని కేకలు వేయడం మొదలుపెట్టారు. ప్రత్యేకంగా, అల్లరులు ఏవీ కాలేదుగాని, మహాత్మాగాంధీని ఆ విధంగా ఎదిరించేందుకు అదే ప్రథమ అనుభవము. బహుశా, అదే చివరిదీ అనుకుంటాను.

వయసులోను, అనుభవంలోను తమకన్న చిన్నవారైన నాడార్ గారిని 'క్లిక్‌' నాయకుని క్రింద గాంధీగారు సూచించిన దానిని ఖండించే బాధ్యత తమపై వేసుకొన్న ప్రకాశంగారు గాంధీగారిని రెండు మూడుచోట్ల విమర్శించారు. ఇటువంటి ఖండన న్యాయమైనా, గాంధీగారిని బాధించే ఉంటుంది. ఈ కారణాలనే సమిధలతో గాంధీగారి కోపం రగుల్కొని, మూడు నెలల తర్వాత ప్రకాశంగారి పైన తమ ప్రభావాన్ని, తీక్ష్ణతను చూపించాయి.

అంతకు ముందు జరిగిన చరిత్ర ముందుగా వివరించాలి.

  1. " I forced him out of the Working committee."
  2. ఈయన తరువాత ఒరిస్సాకు గవర్నరుగా పనిచేశారు.
  3. గాంధీగారు ఇంగ్లీషులో వాడినది - 'క్లిక్‌' (Clique) అనే పదము.