నా జీవిత యాత్ర-4/క్విట్ ఇండియా ఉద్యమము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

10

క్విట్ ఇండియా ఉద్యమము

వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమం అనంతరం ఆగస్టు నెలవరకు కొంత విరామం కలిగింది. వ్యక్తి సత్యాగ్రహంలో కాంగ్రెస్ వాదులు చూపించిన క్రమశిక్షణ, కార్యదీక్ష దేశంలో నూతనోత్సాహాన్ని కల్పించాయి. జైలునుంచి విడుదలయిన తర్వాత రాజాజీ చేసిన పాకిస్తాన్ పక్ష ప్రచారానికి వ్యతిరేకంగా సమగ్ర జాతీయవాదం - కేవలం కాంగ్రెసు వాదులలోనేగాక, ఎలాగో ఒకలాగు నిత్య జీవితాలను వెళ్ళబుచ్చే సామాన్య ప్రజలలోకూడా ప్రబలమైంది. ఇంతలో, 1941 డిసెంబరులో విడుదల కాకుండా మిగిలిన సత్యాగ్రహు లందరినీ జైళ్ళనుంచి విడుదల చేశారు. ఆ నెల ఆఖరున బార్డోలీలో, కాంగ్రెస్ కమిటీవారు మరొకసారి గాంధీగారితో భిన్నాభిప్రాయులై, కొత్త ఆలోచనకు దిగడం జరిగింది. అయితే, దేశ రక్షణకోసం ప్రభుత్వంతో సంబంధం లేకుండా రక్షణ సంబంధాలు ఏర్పాటుచేసే ఊహలుకూడా కలిగాయి. 1942 మార్చిలో ప్రకాశంగారి అధ్యక్షతన బెజవాడలో ఆంధ్రరాష్ట్ర కార్యసంఘం సమావేశమయింది. బ్రిటిషువారు మన దేశాన్ని రక్షించగల స్థితిలో లేరన్న భావం ఒకటి ఏర్పడి, ఆంధ్ర దేశాన్ని నాలుగు భాగాలుగా ఏర్పాటు చేసుకుని, ఒక్కొక్క భాగానికి ఒక ప్రాంతీయ రక్షణ సంఘం ఏర్పాటు కావాలని తీర్మానించడం జరిగింది. అదే సమయంలో బ్రిటిషు ప్రభుత్వం తరపున సర్ స్ట్రాఫర్డు క్రిప్స్ మార్చి 28 నాడు మన దేశానికి వచ్చారు. ఆయన రాక ఉద్దేశం: రాజ్యాంగంలో కొన్ని మార్పులుచేసి, భారతీయ నాయకులకు ప్రభుత్వంలో కొంత చోటివ్వడం వల్లనో, ఇంకొకలాగునో బ్రిటిషు ప్రభుత్వాన్ని ఇక్కడ శాశ్వతంగా ఉండేటట్లు చేయడమే. ఆయన ఇక్కడ ఉండగానే, ఏప్రిల్ 6 న జపాన్ వైమానికులు పది, పన్నెండు విమానాలలో వచ్చి, విశాఖపట్నం పైనా, కాకినాడపైనా బాంబులువేసి, కొంత ప్రాణనష్టాన్ని, వస్తు నష్టాన్ని కలగజేశారు.

ఇది ఇలా ఉండగా, ప్రకాశంగారు ఎప్పటికప్పుడే, రాజాజీ చెప్పినట్లుగా దేశాన్ని ఖండించ రాదని, ఆయన వాదాన్ని ఖండిస్తూ చెన్నపట్నంలోనూ, మిగిలినచోట్లనూ ప్రచారం చేస్తూండే వారు. ఇంతలో ఏప్రిల్ 29 నుంచి, మే 22 దాకా అలహాబాదులో ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సమావేశ మయింది. అప్పుడు గాంధీజీ ఒక సూచన చేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం ఇస్తే. స్వతంత్ర భారతదేశ ప్రభుత్వము వారు మిత్రరాజ్య సైన్యాలు యుద్ధం కొనసాగించడానికి అనుమతించ గలరని ఆ సూచనలోని భావం. 2-6-42 న చెన్నపట్నంలోని ఆర్యసమాజ భవనంలో రాజాజీ చేసిన పాకిస్తాన్ ప్రతిపాదన కొద్ది కాలంలోనే దానంతట అదే నశిస్తుందని ఆశించారు. 26-2-42 న ప్రకాశంగారు తిరిగి కాంగ్రెస్ వాదులలో ఐకమత్యం, మనో దృఢత్వం కలగడానికి - అఖిల భారత కాంగ్రెస్ కమిటీవారు ఇచ్చే ఆదేశాలను తూచా తప్పకుండా అనుసరించ వలసిందని ఆదేశించారు. వ్యక్తిగతమైన వాదనలు, విజృంభణలు చేయకుండా ఏకైక నాయకుడైన గాంధీగారి ఆదేశం ప్రకారం కాంగ్రెస్‌వారు యావన్మందీ నడచుకోవాలే కాని, స్థిర బుద్ధిలేని ఉపనాయకుల ఊపులకు లొంగకూడదని కూడా ఆయన గట్టిగా హెచ్చరిస్తూ వచ్చారు. 27-6-42 న చెన్నపట్నంలో - పాకిస్తాన్ ఇవ్వాలనే అభిప్రాయాన్ని సమూలంగా మన మనసుల్లోంచి నిర్మూలించాలని ఒక బహిరంగ సభలో చెప్పారు. జూలై 25న, పాకిస్తాన్ కావాలని వాదించే కాంగ్రెసువారిని, కాంగ్రెసు నుంచి తొలగించవలసిన సమయంవచ్చిందని కాంగ్రెస్ అధిష్ఠాన వర్గానికి హెచ్చరిక చేశారు. అంతకు ముందు, జూలై 14 న వర్కింగ్ కమిటీవారు వార్ధాలో సమావేశమై, బ్రిటిషువారిని ఇండియాలోంచి వెళ్ళగొట్టడానికి జయం లభించేంతవరకు యత్నం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ ఏప్రిల్ చివర అలహాబాదులో జరిగిన ఎ.ఐ.సి.సి. సమావేశంలో పాకిస్తాన్ వాదియైన రాజాజీ ఐదునిముషాలు మాట్లాడడానికి కూడా సభ్యులు అనుమతించలేదు. అంతకు పూర్వమే, కాంగ్రెసు అధ్యక్షులు కాంగ్రెస్ కమిటీ లోంచి ఆయన పేరు తొలగించారు. చెన్నరాష్ట్రంలో అన్ని చోట్లా ప్రజలను ముందుకు నడిపే శక్తి ఒక్క ప్రకాశంగారిలోనే ఉన్నట్టు - అన్ని పక్షాల కాంగ్రెస్ నాయకులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తూండేవారు. కాంగ్రెస్ నాయకులలో పరస్పర భిన్నాభిప్రాయాల మాట అటుంచగా, 1941 జూన్ లో హిట్లర్ రష్యాపై దాడి చేసిన నాటినుంచి, రష్యావారిని సంతృప్తి పరచడం కోసమని, మన దేశంలో కమ్యూనిస్టులపైగల ఆంక్షలన్నీ ప్రభుత్వం వారు తొలగించడంతో - కాంగ్రెస్ నాయకత్వానికి వారు ఎదురు పక్షమయి, ప్రభుత్వాన్ని బలపరిచేందుకు సిద్ధపడ్డారు. కాని, ఏది యేమైనా దేశస్వాతంత్ర్యంకోసం, ప్రాణాలు బిగబట్టి, ముందుకు దూకవలసిన సమయం వచ్చింది. ఒక మారు దూకిన తరువాత, అందరూ స్వాతంత్ర్య పక్షవాదులు కాకతీరదనీ, అప్పుడు, అందరూ స్వాతంత్ర్య సమరానికి దోహదం చేయగలరనీ గాంధీగారి దృష్టి పథంలో గోచరించగా, ఆయన ఆగస్టు నెలలో 'క్విట్ ఇండియా' నినాదం చేశారు. దానికి కార్యరూపం ఇవ్వడానికి ఆగస్టు 6 నుంచి బొంబాయిలో ఎ.ఐ.సి.సి. సమావేశాలు ఏర్పాటయినవి. చిన్నచిన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తిగతంగా ఉన్నా, కాంగ్రెస్ వాదులందరికీ గాంధీగారు చెప్పిన కార్యక్రమంలో సంపూర్ణ విశ్వాసం ఉండేది. అందుచేత, ఆంధ్ర కాంగ్రెస్ అధ్యక్షులైన ప్రకాశంగారి కార్యక్రమం సాఫీగానే సాగేది. వ్యక్తి సత్యాగ్రహ సమయంలో డాక్టర్ పట్టాభిగారు మా అందరితోబాటు తిరుచినాపల్లి జైలులోగాక, వేలూరు జైలులో ఉండడం జరిగిందని మరొక చోట కూడా పేర్కొనడం జరిగింది. అప్పుడు అక్కడ ఆయనతో బాటు మరి కొందరు తెలుగు నాయకులుకూడా ఉండేవారు. వారిలో కళా వెంకటరావుగారు కూడా ఉండేవారు. ప్రకాశంగారిపై రాజాజీకున్న వ్యతిరేక భావంతోబాటు ఆయనపై పట్టాభి గారికి గల ప్రతికూల భావం కూడా ప్రకాశంగారి కార్యక్రమాలకు అడ్డం వచ్చేది. అందువల్లనే, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి వారు అధ్యక్షులయినా - పట్టాభిగారు తమ చెప్పు చేతల్లోకి కళా వెంకటరావు గారిని తీసుకోనారంభించారు. ప్రకాశంగారికి తెలియకుండానే, తాను కార్యదర్శ కావడంవల్ల ఆయన ఏవేవో పనులు చేయడం కూడా ఆరంభించారు. దీని పరిణామాలు రాబోయే మరొక అధ్యాయంలో వివరిస్తాను.

బొంబాయి ఏ.ఐ.సి.సి సమావేశము

బొంబాయిలో ఏ.ఐ.సి.సి. సమావేశం కాక పూర్వము ఒక రాత్రి నేను గుంటూరునుంచి విశాఖపట్నం వెళ్ళే త్రోవలో, విజయవాడ రైల్వే ప్లాట్‌ఫారం మీద సగం రాత్రప్పుడు కళా వెంకటరావు గారిని చూడడం జరిగింది. ఆయన నెల్లూరు నుంచి బందరు వెడుతూ, అక్కడ బందరు రైలుకోసం కనిపెట్టుకుని ఉన్నట్టు చెప్పాడు. బందరు కెందుకని నే నడిగాను. అక్కడ పట్టాభిగారి యింట్లో కాంగ్రెసు నాయకుల సమావేశం జరుగనున్నదని చెప్పాడు. "నాకు నోటీసు అందలేదే," అని నే నంటే, అది ఇన్‌ఫార్మల్ మీటింగు గనుక అందరికీ నోటీస్ ఇవ్వలేదనీ, అయినా నన్ను రమ్మనీ ఆహ్వానించాడు. "ఏమిటి విషయ?" మని నే నడిగాను. జేబులోంచి ఒక రోనియో టైపు చేసిన కార్యక్రమ సూచికను తీసి చూపించాడు. అది నేను చదివి, "ఇలాంటి దెక్కడిది? ఎవరిచ్చిం"దని అడగ్గా, అది డాక్టర్ పట్టాభిగారు గాంధీగారు ఇచ్చిన సూచనల మేరకు తయారుచేసిన కార్యక్రమం అని చెప్పాడు. అందులో టెలిగ్రాపు తీగలు టెలిఫోను తీగలు కత్తి రించి వేయవలసిందనే సూచనను వెంకటరావుకు చూపించి, "గాంధీజీ దీనికి ఎన్నడూ ఒప్పుకోడయ్యా!! నేను ఇలాంటి సూచనను గాంధీగారికి వ్రాస్తే, ఆయన 'నా మనస్సు ఆ మార్గంద్వారా నడవదు' అని నాకు జవాబు వ్రాశారు. అది నా దగ్గరుంది. " అని అంటే, దాని మీదట, "బందరుకునీవు కూడా రా! ఇవన్నీ చర్చించవచ్చు," అన్నాడు ఆయన. నేను "అట్లా రావడానికి అవకాశం లేదని, విశాఖపట్నం వెళ్ళి సామానులు సర్దుకుని నేరుగా బొంబాయికి వస్తా"ననీ అన్నాను. తర్వాత ఎవరి రైళ్ళు వారు ఎక్కాము.

బందరులో కొంతమంది కాంగ్రెసు మిత్రులు సమావేశమయారు. ఆ సమావేశం అధ్యక్షులయిన ప్రకాశంగారితో చెప్పి ఏర్పాటు చేసిందికాదు. అది వెంకట్రావు, పట్టాభిగార్లు తమలో తామే అనుకుని, ఇరవై, ముప్పై మంది కాంగ్రెసు మిత్రులకు మాత్రం తెలిపి ఏర్పాటు చేసింది. వారి వలెనే ప్రకాశంగారికి తెలియజేయగా, వారూ హాజరయ్యారు. వెంకట్రావు నాకు చూపించిన కార్యక్రమం కాగితాన్ని గాంధీగా రిచ్చిన ప్రోగ్రా మని చదివాడట. దానిపైన ప్రకాశంగారు, దాని వైఖరి చూసి అది గాంధీరిచ్చిన ప్రోగ్రాం కానేరదని వాదిస్తే, వాదోప వాదాలు బయలుదేరాయట. కొంత సేపయిన తర్వాత వేరే కాగితంపైన ఆ మీటింగులో జరిగిన ప్రొసీడింగ్స్ (కార్యక్రమ చర్చ) వ్రాసి, ప్రకాశంగారిని సభాధ్యక్షునిగా సంతకం పెట్టమన్నారట. కాని అందులో నిర్ణయా లేవీ లేవట. క్రమబద్దంగా ఏర్పాటు అయిన సమావేశం కానపుడు సంతకం ఎందుకని ప్రకాశంగారు మొదట అడ్డు చెప్పారట. దానిపై అక్కడ ఆ రోజు జరిగిన చర్చలు గల కాగితం కాబట్టి, సంతకం చేస్తే అది రికార్డవుతుంది గదా, అంటే ఆయన సంతకం పెట్టారట.

ఈ సమావేశం తర్వాత ఏ.ఐ.సి.సి. సభ్యులైన కాంగ్రెస్ మిత్రు లందరూ బొంబాయి చేరుకున్నారు. డాక్టర్ పట్టాభిగారు యథా ప్రకారం చావలి నాగేశ్వరరావుగారి యింట బస చేశారు. నేనూ విశాఖపట్నంనుంచి 6 వ తేది ఉదయానికి బొంబాయి చేరి, అలవాటు ప్రకారం అక్కడే బసచేశాను. ఒంటిగంటకు, వర్కింగు కమిటీ సమావేశం నుంచి భోజన విశ్రాంతి వేళకు పట్టాభిగారు తిరిగి వచ్చారు. నేను వెంటనే, "విజయవాడలో నేను చూసిన ప్రోగ్రాం విషయమై వర్కింగు కమిటీలో చర్చ జరిగిందా?" అని అడగ్గా, ఆయన, "లేదయ్యా! ఇదంతా ఎవరు పట్టించుకొంటా రక్కడ? ఎవరి గొప్పలు వారు చెప్పుకోవడంతోనే కాలమంతా వ్యర్థమైంది" అన్నారు.

ఆ రాత్రి 9, 10 గంటల వేళప్పుడు భరతన్ అనే ఒక ప్రఖ్యాత వార్తాహరుడు పట్టాభిగారికి టెలిపోన్లో, ఆ తెల్లవారుజామున వర్కింగు కమిటీ మెంబర్లను అరెస్టు చేయడానికి ఏర్పా టయినట్టు చెప్పారు. దానిపైన, పట్టాభిగారు వల్లభభాయిపటేలు గారింటికి పోను చేస్తే, పటేలు కుమారుడు ఫోన్ అందుకున్నాడు. అతనితో పట్టాభిగారు తెల్లవారేలోపుగా జరగబోయే వర్కింగ్ కమిటీ మెంబర్ల అరెస్టు సంగతి చెప్పి, పటేలుగారి చొక్కా జేబులో నుంచి తామిచ్చిన రోనియో కాపిని తీసి చింపివేయమని కోరారు. దానికి పటేలు కుమారుడు - అరెస్టులు జరగవనీ, ఏ.ఐ.సి.సి. క్విట్ ఇండియా తీర్మానాన్ని ఆమోదించే వరకు ఎవరినీ అరెస్టు చేయరాదని ప్రభుత్వంవారు నిశ్చయించారనీ చెప్పాడు.

అగ్ర నాయకుల అరెస్టులు

ఆ రాత్రి కానీ, తెల్లవారుజామున కానీ అరెస్టులు జరుగలేదు. 7,8, తేదీల వర్కింగ్ కమిటీ సమావేశాలలో కూడా తమ రోనియో కాపీ ప్రోగ్రాంపై చర్చ జరగలేదని పట్టాభిగారు నాకు మధ్యాహ్నం, రాత్రి కూడ చెప్పారు. 8 వ తేదీ రాత్రి ఏడెనిమిది గంటల వేళ, గాంధీగారు చేసిన చరిత్రాత్మకమైన ఉపన్యాసం తరువాత, "క్విట్ ఇండియా" తీర్మానాన్ని ఏ.ఐ.సి.సి. ఆమోదించింది.

ఆ తెల్లవారుజామున మూడున్నర గంటల వేళ నాగేశ్వరరావు గారి యింటికిద్దరు పోలీసు అధికారులు వచ్చి తలుపు తట్టగా, వారు అరెస్టు చేయడానికి వచ్చారని గుర్తించి, వారిని లోపలికి రమ్మని కూర్చోబెట్టాను. వారు పట్టాభిగారిని మాత్రమే అరెస్టు చేయడానికి వచ్చి నట్టు చెప్పి, కాలకృత్యాలకు, స్నానపానాదులకు ఆయనకు ముప్పావు గంట వ్యవధి ఇచ్చామని చెప్పారు. పట్టాభిగారిని ఎక్కడికి తీసుకుపోతారో చెప్పడానికి వారు నిరాకరించారు. అయితే కొంతసేపటికి, ఆయనను విక్టోరియా టెర్మినెస్ రైల్వేస్టేషనుకు తీసుకు వెళతారని గ్రహించగలిగాను. వారు వెళ్ళేకారులోనే పట్టాభిగారితో బాటుగా నన్నూ విక్టోరియా టెర్మినస్ స్టేషను వరకైనా తీసుకు వెళ్ళవలసిందని ఆ పోలీసు ఉద్యోగిని అడిగితే, క్రింద సి.ఐ.డి. ఉన్నాడనీ, అందువల్ల అలా చేసే వీలులేదనీ అతడు చెప్పాడు. నేను క్రిందికి దిగి, ఆ సి.ఐ.డి. ని ఎలాగో ఒకలాగున ఒప్పించి, పట్టాభిగారు ఎక్కిన కారులోనే ముందుసీట్లో ఆ ఉద్యోగి ప్రక్కనే కూచుని, జయ జయ శబ్దసూచకమైన పక్షుల కలకలా రావాలతో తెలతెల వారుతూండగా విక్టోరియా టెర్మినస్ స్టేషను చేరుకున్నాను. ప్రత్యేకమైన ఒక ఫ్లాట్‌ఫారం మీద అప్పటికే అరెస్టయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొందరు తమకోసం ఏర్పాటైన ప్రత్యేకమైన రైలు ముందు నిలబడి ఉండడాన్ని దూరం నుంచి చూడగలిగాను.

అంతలో భళ్ళున తెల్లవారినది. నేను, గాంధీగారు మొదలైనవారు అరెస్టయిన వార్త - అక్కడికి దగ్గరగానే ఉన్న అమృతాంజనము భవనంలోనికి వెళ్ళి, అక్కడున్న ఆంధ్ర డెలిగేట్ల (ప్రతినిధుల) తోను, ఆ ప్రక్కనే ఉన్న హోటలులో ఉన్న పంజాబీ బంగాళ ప్రతినిధులతోను చెప్పి, తిరిగి గీర్గాంలో ఉన్న నాగేశ్వరరావుగారి బసకు మెల్లిగా బయలుదేరాను. విక్టోరియా టెర్మినసునుంచి గీర్గాంకు పోయేత్రోవ దోభీతలావు ద్వారా పోతుంది. నేను దోభీతలావుకు నడచి వెళ్ళేసరికి, వందల కొద్ది ప్రజలు అక్కడి ట్రాఫిక్ సర్కిల్ (అంటే - వెళ్ళే బండ్లు, వచ్చే బండ్లు విడివిడిగా పోవడానికి వీలుగా, చుట్టూ సిమెంట్ స్తంభాలకు ఇనుప గొలుసులు వేసి, వలయాకారంగా ఏర్పాటు చేసిన స్థలము) వద్ద ఆ స్తంభాలు, గొలుసులు ఊడబెరికి, ఏవేవో పాత పెట్టెలు, బల్లలు మొదలైన వాటిని గీర్గాం పోయే రహదారి ముందు అడ్డంగా పెట్టేసి, దాన్ని బందు చేసేశారు. వారు మను ష్యుల రాకపోకలను కూడా అడ్డుతున్నారు. అడ్డే వారెవరో, ఎందుకు అడ్డుతున్నారో తెలియదు. కాని నేను అక్కడికి వెల్లేసరికి, నా దుస్తులూ, వేషం చూసి, "నువ్వు కాంగ్రెసువాడివా?" అని హిందీలో అడిగారు. నేను అవునని, నా బస ఆ రోడ్డులో ఉన్నదనే సరికి, నన్ను వెళ్ళనిచ్చారు. అంతలో అక్కడికి వచ్చిన ఒక పోలీసు వాన్ వాళ్ళు అడ్డగించే సరికి తిరిగి వెళ్ళిపోయింది. విప్లవం ఆరంభమయింది.

బొంబాయిలో అన్ని వీథులలోకి ప్రజలు ఈ విధంగా వచ్చేసి రహదారులను బందు చేసేస్తున్నారు. అంతకు ముందు రోజున, శివాజీ పార్కులో జండా వందనం జరుగుతుందని ప్రకటించారు. అక్కడ ముప్పై, నలభై వేల మంది ప్రజలు గుమిగూడారు. హిందువులు బ్రిటిషు దొరల లాగున ధరించిన టోపీలు, నెక్‌టైలు, కాలర్లు; దొరకినంత మట్టుకు విదేశపు బట్టలు; బ్రిటిషు గవర్నమెంటు రాజు, మంత్రుల పేరిట, తయారుచేసిన గడ్డి బొమ్మలు - పెద్ద పెద్ద నాలుకలతో వెలుగుతున్న అగ్నిహోత్రుడికి ఆహుతి చేయబడినాయి. అయినా, ఇంగ్లీషు వారిని ఎవరూ హింసించలేదు. గీర్గాంలో నేను బసచేసి ఉన్న నాగేశ్వరరావు గారింటి ప్రాంతంలో, పది గంటలయ్యేసరికి మెల్ల మెల్లగా రెండువందల అడుగుల కొక పోలీసు కానిస్టేబుల్‌ని నిల్చోబెట్టారు. బొంబాయి పోలీసుల చేతి కర్రలు మనవైపు పల్లెటూరి ప్రజల చేపాటి కర్రలలాగా ఉండేవి. వాటిపైన వారు గడ్డాలు మోపి నిలుచున్నారు. అంతలో మరొక పోలీస్‌వాన్ వచ్చింది. ఎక్కడినుంచో రాళ్ళువచ్చి దానిమీద పడ్డాయి. ఎక్కడినుంచి పడ్డాయి. ఎవరిమీద పడ్డాయి అని ఈ పోలీసువారు పట్టించుకున్నట్టే కనబడలేదు. కొంతసేపటికి ఒక వార్త ఆ ప్రాంతానికి వచ్చింది. - ఒక సార్జెంటు దుర్మార్గం చేసి, ఖద్దరు టోపీతో ఉన్న దుకాణదారుని కొట్టాడని, వందలకొద్ది ప్రజలు మూగి పోయారు. అంతట్లో ఆ కొట్టిన సార్జెంటు ఒంటినిండా కిరసనాయిలు పోసి కాల్చేశారని మరొక వార్త వచ్చింది. ఈ పోలీసువారు మాత్రం కదలక, ఎక్కడి వా రక్కడే నిలబడి ఉన్నారు.

ఆ మహా పట్నంలో ఇంకా ఏం జరుగుతున్నదో చూద్దామనే కుతూహలం కలిగింది. నేనూ, అక్కడే ఏ.సి.సి, కంపెనీలో పనిచేస్తూ ఉన్న ముసలగంటి భీమారావు అనే మిత్రుడు, అలా బయలుదేరి మొదట వల్లభాయి పటేలు గారింటికి వెళ్ళాము. తలుపు తీస్తూనే పటేలు గారి కుమారుడు ఏదో రహస్యంగా జరుగుతున్నట్టు సూచించి, మమ్మల్ని గదిలో కూచోపెట్టి, లోపలినుంచి ఒక పెద్ద కాగితాల లట్ట తెచ్చి, అదంతా ఏక్షన్ కమిటీ ఆదేశమనీ, అందులో ఉన్నట్టు నడిపించమనీ మాతో చెప్పాడు. అందులో శుద్ధ శాబటేజ్ ప్రోగ్రామ్ వ్రాసి ఉంది. 'ఆంధ్రా సర్క్యులర్‌' అన్న పేరిట తర్వాత ఆంధ్రుల కమిటీపైన నేరాలుగా మోపిన విషయాలన్నీ అందులో ప్రోగ్రాం పేరిట వ్రాసి ఉన్నాయి. ఎవరీ ఏక్షన్ కమిటీ? అంతా మా మిత్రులే గనుక, "అబ్బాయ్! ఇదంతా గాంధీగారి ప్రోగ్రాముకు వ్యతిరేకం కాదా?" అని అడిగితే, "గాంధీగారు అరెస్టయిన తర్వాత ప్రోగ్రాం మనదే. ఆయనకేం సంబంధం?" అన్న మోస్తరుగా ఒకరితో ఒకరు అనుకున్నారు. ఏమయితే నేమి ప్రాణ హింసా రహితమైన శాబటేజ్ ప్రోగ్రాం దానంతట అదే పట్నంలో ప్రారంభమయింది. ఆ కాగితాల కట్ట తీసుకుని నేను, భీమారావు మేడదిగి, కొంచెం వెనక రోడ్డుకు వెళ్ళి ట్రామ్ ఎక్కాము. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం దాటేసరికి, ట్రాములు, బస్సులు అన్నీ ఆగిపోయి ఉన్నయ్యక్కడ. అది చూసి, ఏదో డబుల్ డెక్ బస్సు ఒకటి దాదరువైపు వెళుతూంటే అందులో పైకి ఎక్కాము. అందులో ముగ్గురు, నలుగురు తెల్లవాళ్ళున్నారు. ఇక బస్సు కదులుతుందనగా కండెక్టరు పైకి వచ్చి తెల్లవారిని దిగి పొమ్మన్నాడు. విప్లవం గట్టి పడుతోందని మాలో మేము సంతోషించాము. కాని, రెండు నిమిషాల తర్వాత ఆ తెల్లవాళ్ళు మళ్ళీ మీదికి వచ్చి కూచున్నారు. ఈ దిగడం, ఎక్కడం ఏమిటని వారిని మేము కుశల ప్రశ్న లడిగాము. అంతకు ముందు కొందరు తెల్ల వాళ్ళు ప్రజల మూకలు తమపై పడతాయేమో నన్న భయంతో దిగి పోవడంచేత, కండక్టరు తాము కూడా అట్లా చేస్తారేమో అని అడగ్గా, ఒకరు తప్ప తక్కిన వారు భయంలేదని తిరిగి వచ్చినట్టు చెప్పారు. అంత టిలో బస్సు కదిలి ఒక ఫర్లాంగుదూరం వెళ్ళేసరికి, యాభై అరవై అడుగుల వెడల్పున్న రాజవీథి కూడా కనుచూపు మేరవరకు ప్రజలతో నిండిఉండడంవల్ల మేమందరం తెల్లవారు, నల్లవాళ్ళం కూడా దిగవలసి వచ్చింది. అక్కడ నడుస్తూన్న ప్రజలు లక్షకు తక్కువ ఉండరు. అలా ఎందుకు నడుస్తున్నారో, ఎక్కడికి నడుస్తున్నారో ఎవరికీ తెలియదు. కాని, అందరి ముఖాల మీద, అందరి కళ్ళల్లోను ఏదో ఒక ఆశ; ఏదో ఒకటి సాధించామన్న భావం మూర్తీభవించి నట్టు కన్పించింది. బస్సునుంచి దిగిన తెల్లవాళ్ళు మా ప్రక్కనే నడుస్తున్నారు. ఎవరూ వారిని పల్లెత్తు మాట అనలేదు. కాని, అంతటిలో ఆ ప్రక్కనే నెక్‌టై, కాలర్, హేటు ధరించిన భారతీయుడు కనిపించే సరికి, అతనిని ముట్టడించి, వాటి నిమ్మని అడిగారు. ఇవ్వకుంటే లాక్కునే లాగున కనిపించే సరికి అతడు అవి తీసి ఇచ్చాడు. వాటి గమ్యస్థానం శివాజీ పార్కులో ఏర్పాటైన విదేశ ప్రభుత్వం చితి. మేము చూస్తుండగా వందల కొద్ది హేట్లు, నెక్‌టైలు, కాలర్లు అక్కడికి వచ్చాయి. ఆ ప్రాంతంలో ఏదో ఒక మూల మాత్రం షూటింగు జరిగినట్టు వార్త. కల్పాదేవి రోడ్డులోని భాగ్యవంతులైన వెండి, బంగారం, రత్నాల వర్తకులు ప్రజా సమూహం తమపైన వచ్చి పడకుండా తామే రహదారులు బందు చేసుకున్నారు. సాయంకాలం నాలుగు గంటలయ్యేసరికి పట్నంలో అనేక స్థలాలలో కాల్పులు జరిగినట్టు నాలుగు వైపుల నుంచీ వార్తలు రాసాగినాయి.

ప్రకాశంగారు ఈ అల్లరులలో అరెస్టు కాలేదు. ఆ రోజున అక్కడున్న ఆర్డర్లప్రకారం కాంగ్రెసు నాయకులను వారి వారి రాష్ట్రాలలో అరెస్టు చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశించినట్టు ఆ తర్వాత తెలిసింది. నాకు హైదరాబాదు, విజయవాడ వెళ్ళే రైలులో చోటు దొరక్క; బొంబాయి నుంచి రాయపూర్ మీదుగా విశాఖపట్నం బయలుదేరాను. నా చేతినిండా, పటేలుగారింట ఏక్షన్ కమిటీ ఇచ్చిన శాబటేజ్ ప్రోగ్రాం కాగితాల కట్టలున్నాయి. నేను ప్రతి ప్లాట్‌ఫారం మీద అవి పంచుతూ, పార్వతీపురము స్టేషన్లో తాళ్ళపూడి కృష్ణమూర్తి అనే ఆయనకు అవి ఒక నూరు దాకా ఇచ్చాను. ఆయన 1930లో నా సత్యాగ్రహ దళంలో జైలుకు వచ్చిన స్వాతంత్ర్య యోధుడు. బొంబాయిలో వర్కింగ్‌కమిటీ మెంబర్లను అరెస్టుచేయడంవల్ల ప్రకాశంగారికి గాని, నాకుగాని అందులో ఎవరితోనూ ఏవిధమైన సంప్రతింపులూ చేసుకునే వీలు చిక్కలేదు. ఇలా ప్రయాణంచేసి నేను ఆగస్టు 13 న విశాఖపట్నం చేరుకున్నాను. ఇంటికి వెళ్ళేసరికి, డిప్యూటి సూపరింటెండెంటు హాజరయి ఉన్నాడు. మీరు చెన్నపట్నం మెయిలుకు వెళ్ళేందుకు సిద్దంగా ఉండండని చెప్పి, ఒకటిన్నరగంట వ్యవధియిచ్చి వెళ్ళిపోయాడు.

క్విట్ ఇండియా ఉద్యమసమయ జైలు జీవితము

'క్విట్ ఇండియా' ఉద్యమం ఆరంభమైన రెండు, మూడు రోజులలోనే దేశం నాలుగు మాలలా కొంత హింసాత్మకమైన విప్లవ కార్యకాండ జరిగింది. గాంధీగారు అరెస్టయిన రోజున బొంబాయిలో జరిగిన సంఘటనలను గురించి ఇదివరలో వ్రాశాను. ఇక మనప్రాంతంలో జరిగిన విషయాలు నాకు స్వయంగ తెలిసినంతవరకు వ్రాస్తాను.

నన్ను ఆగస్టు 13న అరెస్టు చేసినట్టు లోగడ వ్రాశాను. ఆ రోజున సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నన్ను ఒక సార్జెంటు చేతి కప్పజెప్పారు. అతనితోబాటు ఇద్దరు సాయుధులైన పోలీసులను సహాయంగా ఇచ్చారు. తలుపులన్నీ వేసిఉన్న రైలుపెట్టివరకు నన్నొక పోలీసువేనులో తీసుకువెళ్ళారు. నేను వెళ్ళిన పోలీసువాను కిటికీలుగూడా తెరలతో మూసి వేయబడ్డాయి. అందుచేత, నేను పోలీసువానునుంచి కంపార్ట్‌మెంటుకు ఎక్కడం ఎవరో ఒకరిద్దరు మాత్రమే చూసిఉంటారు. నేను ఎక్కిన రైలు - కలకత్తానుంచి చెన్నపట్నం వెళ్ళే మెయిల్ ట్రైను. నాకు అవసరమైన కాఫీ, భోజనం పోలీసు సార్జంటే తెచ్చి పెట్టేవాడు. ట్రెయిను నడపడం ఆరంభమైన తర్వాత నాపై జాలితో కిటికీ తలుపులు తెరిచాడు. కాని, అనకాపల్లి స్టేషన్ సమీపిస్తున్నదనగా తిరిగీ కిటికీలను మూసేశాడు. ఈ విధంగా సాయంకాలం చీకటిపడే వేళకు బెజవాడ చేరాము. విజయవాడలో భోజనం సార్జంటే తెచ్చాడు. భోజనం చేసి నిద్రపోయాను. తెల్లవారుజామున లేచి, సార్జెంటును లేపి, "అయ్యా! సూళ్ళూరుపేట వచ్చిందేమో! ఇడ్లీలు, కాఫీ తెప్పించం"డన్నాను. అంటే, ఆయన, "ఇది సూళ్ళూరుపేట కాదండీ! విజయవాడ స్టేషనే," అన్నాడు. "రాత్రి నన్ను ఇక్కడే అట్టిపెట్టేశారా? ఎందుచేత?' అని అడగ్గా "మిమ్మల్ని అట్టిపెట్టడంకాదు. రాత్రినుంచి రైలు కదలక ఇక్కడే ఉండిపోయింది," అన్నాడు. "అదేమి?" అని నేను ప్రశ్నించగా, "చెప్పడానికి వీలులేదండి," అన్నాడు. ఆశ్చర్యం వేసింది. "అయితే, ఎన్నిగంటలకు బయలుదేరుతా" మని అడిగాను. "అదికూడా చెప్పలేమండి," అన్నాడు. "కిటికీ తలుపులు తెరుస్తారా? ఒకమారు ప్లాట్‌ఫారంవైపు చూస్తా" నన్నాను. అతడు కొంచెం ఆలోచించి, కిటికీ తలుపెత్తి, "రెండు నిమిషాలు మాత్రమే చూడవచ్చు. మళ్ళీ వేసేయాలి, లేకుంటే నాకు మాట వస్తుం," దన్నాడు. అలా, ప్లాట్‌ఫారం మీద చూసేసరికి ఎక్కడో ఒకరిద్దరు మనుష్యులు తప్ప అంతా నిర్మానుష్యంగా ఉంది. నా కంపార్టుమెంటు ఆగినచోటికి ఎదురుగా అల్పాహారాలు, కాఫీ లభించే గది ఉంది. (ఇప్పుడున్న పెద్ద కట్టడంగాని, ప్లాట్‌ఫారం పైన కప్పుగాని అప్పుడు లేదు.) అందులోనూ అట్టేమంది మనుష్యులు కనిపించలేదు. అక్కడికి వచ్చినవారు తిని పారేసిన విస్తరాకులు అన్ని వైపులా ఎగురుతున్నాయి. అవి తీసి, తుడిచే మనుష్యులెవరూ లేరు. సార్జెంటును "రైల్ ఇంజను ఇబ్బందివల్ల ఆగిపోయామా?" అని అడిగాను. చెప్పడానికి వీలు లేదన్నాడు. ఇంతలో బ్రహ్మాండమైన చప్పుడుతో రెండు విమానాలు మా నెత్తి మీదగా పైన వలయాకారంగా రెండు సార్లు తిరిగి, వెళ్ళిపోయాయి. "ఇవేమిటో కనుక్కోండి" అని సార్జెంటుకు చెబితే, సి.ఐ.డీ.లు ఉన్నందున, తాను కదలడానికి వీలులేదన్నాడు. "అయ్యా! ఆకలవుతున్నది. ఇడ్లీ, కాఫీ సంపాదించగలరా?" అని అడిగాను. ఆయన కొంత ప్రయాస పడి తెచ్చి ఇచ్చాడు. బాగా ఎండ ఎక్కనారంభించినట్టు కిటికీ కన్నాలలోంచి కనిపించింది. ఇదంతా చూచి, బొంబాయిలో నేను చూసిన విప్లవ సూచనలు విజయవాడ ప్రాంతంలో ఫలించాయని గ్రహించాను. ఆ తొలినాటి రాత్రి విజయవాడ చెన్నపట్నాల మధ్య ఉన్న పదిపన్నెండు రైలు స్టేషన్లను సామానులతో సహా కాల్చివేశారనీ, ఒకటి రెండు చోట్ల నగదుపెట్టెలు (Cash Boxes) కూడా వందలకొద్ది ప్రజలు స్టేషనులోకి దూరి పట్టుకుపోయారనీ, అనేకచోట్ల రైలు పట్టాలను తప్పించారనీ, కొన్నిచోట్ల సిగ్నల్ స్టంభాలను పడగొట్టారనీ వార్తలు తెలిసినవి. మధ్యాహ్నం కావస్తూంది. ఆ సార్జెంటు ఎలాగో నాకు భోజనం తెప్పించి పెట్టించాడు. అన్ని గంటలసేపూ ఆ సెకండుక్లాసు కంపార్టుమెంటు కిటికీలు మాత్రం తెరవనేలేదు. తర్వాత రైలు తిరిగీ నడవడం ఆరంభించింది. గుంతకల్లు మీదుగా చెన్నపట్నానికి ఆ మర్నాడు సాయంకాలానికి చేరుకున్నాము. ప్రయాణ సమయంలో కొంచెం కిటికీలు తీయడం, రైలుస్టేషను సమీపించేసరికి మూసివేయడం యథాప్రకారంగా జరుగుతూనే ఉంది. చెన్నపట్నంనుంచి వెంటనే కాట్పాడికి పోయే మరొక ట్రైనులో నన్ను ఎక్కించి తీసుకుపోయారు. సగంరాత్రి దాటిన తర్వాత కాట్పాడి స్టేషనునుంచి బస్సులో వేలూరు తీసుకువెళ్ళారు. 1940 నవంబరులో వ్యక్తి సత్యాగ్రహంలో నేను అరెస్టు అయినపుడుకూడా అదే పోలీసువానులో, ఆ డ్రైవరే నన్ను స్టేషనునుంచి జైలుకు తీసుకు వెళ్ళాడు. ఒకరి నొకరం జ్ఞాపకం చేసుకున్నాము. వేలూరికి తీసుకువెళ్ళిన తరువాత ఇంకా బాగా తెల్లవారక పోవడంవల్ల నన్నక్కడ ఒక పోలీసు లాకప్‌లోకి తీసుకువెళ్ళాడు. అక్కడున్న సబ్ ఇన్స్‌పెక్టరుతో నేనవర్నో కొంచెం చెప్పుకుని, పైన ఆఫీసు రూములో పడుకోనివ్వమన్నాను. అతడు నా వేషభాషలు చూసి, ఎక్కడికీ పారిపోయేవాణ్ణి కానని గ్రహించి, రెండు ఆఫీసు బల్లలు చేర్చి నాకు చోటు చూపించాడు. అక్కడ నా ప్రక్కవేసుకుని ఆయన దయవల్ల హాయిగా నిద్రపోయాను. ఆ తెల్లవారు జామున, ఇదివరలో నాకు బాగా పరిచయమైన జైలులోకి మూడోమారు ప్రవేశించాను. నేను వెళ్ళేసరికే కొంతమంది మిత్రులు - తెలుగువారు, దాక్షిణాత్యులు, కేరళీయులు అక్కడికి చేరిఉన్నారు. మొత్తం సంఖ్య ముప్పై మందికి కొంచెం మించినది. ఇందులో ప్రకాశంగారు, వి.వి. గిరిగారు, అనంతశయనం అయ్యంగారు, కళా వెంకటరావు, ఎం. పళ్ళంరాజు, ఎన్. సంజీవరెడ్డి, నేను మొదలైన తెలుగు వాళ్ళము; సత్యమూర్తి, కామరాజనాడార్, ముత్తురంగముదలియార్, భక్తవత్సలం మొదలైన దాక్షిణాత్యులు; కె. మాధవమేనోన్, ఆర్. రాఘవ మేనోన్ మొదలైన కేరళీయులు; కే.ఆర్. కరంత్ మొదలగు కన్నడిగులూ ఉండేవాళ్ళము; మేము ఆ రోజులలో డెటిన్యూల మయినప్పటికి, మొదట్లో మాకు న్యూస్ పేపర్లు ఇచ్చేవారు కారు. పై నుండి వచ్చిన ఇతర రాజకీయ ఖైదీలతో మాకు సంబంధం లేకుండా చేశారు. దేశంలో ఏం జరుగుతున్నదీ తెలిసేది కాదు. మొదట అనుకున్న విప్లవం జరిగిందో, లేదో ఎవరి ఊహాగానాలు వారు చేసుకునేవాళ్ళము. ఒక రోజున, వడ్రంగి పని ఏదో చేస్తూండగా, కొన్ని పెద్ద చప్పుళ్ళు మాకు వినిపించాయి. ఒకమారు గోడలు త్రవ్వుతున్నట్టు శబ్దం వినిపించింది. ఒకమారు పెద్దపెద్ద తలుపులు బ్రద్దలు కొట్టు తున్నట్టు అనిపించింది. మరొకమారు జెయిలు గుమ్మం త్రోసుకువచ్చే ప్రజా సమూహంపైన పేలుస్తున్న తుపాకీల చప్పుళ్ళలాగా వినిపించాయి. దానికితోడు, ఎలాగో జెయిలు అధికారుల కంట బడకుండా ఏ పొట్లానికో కట్టిన వార్తాపత్రికాభాగం ఒకటి లోపలికి సామానుతో వచ్చింది. అందులో రెండు మూడు పెద్ద అక్షరాలు చిరిగిపోయినా, గాంధీగారిని ఆఫ్రికా తీసుకు పోతున్నారన్న వార్తను అక్షరాలు కూడబలుక్కుని గ్రహించాము. విప్లవమేదో జయ మయిందని, జెయిళ్ళ గేట్లను ప్రజలు బ్రద్దలుకొట్టి మమ్మల్ని పైకి తీసుకు పోతారని కొందరు ఊహించారు. కొందరు ఎందుకైనా మంచిది సిద్ధంగా ఉండాలని ఉన్న బట్టలు, సామానులు ఏ క్షణంలో పైకి వెళ్ళిపోతామో అని సర్దుకుని ఉంచుకునే వాళ్ళు.

ఇలా ఉంటూండగా, ఒక డిప్యూటి జెయిలరు పదకొండు గంటల వేళప్పుడు వచ్చి, మమ్మల్ని జెయిలునుంచి అవతలకు వెళ్ళడానికి సామాన్లి సర్దుకోమని, ఒక గంట వ్యవధి యిచ్చి పోయాడు. మాలో కొందరు, మమ్మల్ని ఎక్కడికో బదిలీ చేస్తారని గ్రహించారు. "ప్రజలు మనల్ని విడిపించేట్టయితే, ఈ జెయిలరు ఇంత సావకాశంగా మన దగ్గరికి ఎలా వస్తా?" డని అనుభవం పొందిన కొందరు పెద్దలనేసరికి - అది సరిగానే ఉందనిపించింది. కాని, ఏ విప్లవమూ రాలేదన్న ఆశాభంగం మాత్రం మాలో అటువంటిదానిని ఆశించిన వారందరికీ కలిగింది. ఏది ఏమైనా పన్నెండు గంటలయ్యేసరికి - మా సామానులు మోయడానికి ఇరవై మందిదాకా ఖైదీలు, ముగ్గురు నలుగురు వార్డర్లు హాజరయ్యారు. అంతటిలో ఎవరి మూలంగానో, మమ్మల్ని మరొక జెయిలుకు పంపి, మా స్థలంలోకి పై రాష్ట్రనుంచి డెటిన్యూలను తెస్తున్నారనే వార్త బయట పడింది.

అందుచేత, మాలో కొందరికి - రాబోయే డెటిన్యూలకు వెళ్ళి పోయిన డెటిన్యూ లెవరో తెలియడం కోసం మా పేర్లు గోడలమీద పెన్సిళ్ళతో వ్రాస్తే బాగుంటుందని తోచింది. సరేనని అలాగే చేశాము. కొందరు తమ జీవిత వివరాలుకూడా ఒకటి రెండు ఆ గోడలమీద ఎక్కించారు. ఆ విధంగా, కొంత విపులంగా వ్రాసుకున్న వారిలో నీలం సంజీవ రెడ్డిగారు ఒకరు. అలా వ్రాసుకోవలసిన అవసరం లేకుండానే తర్వాత ఈయన దేశవ్యాప్తమైన పేరు తెచ్చుకున్న విషయం అందరికీ తెలిసిందే. మేము వెళ్ళేసరికి, రెండు మూడు లారీలనిండా డెటిన్యూలు తమ సామాన్లతో జెయిలు ప్రవేశంకోసం వేచి ఉన్నట్లు పోల్చుకో గలిగాము. వారున్న బస్సుల కిటికీలు తెరలతో మూయబడి ఉన్నాయి, అయినా, ఒకమూలనుంచి రవిశంకర్ శుక్లా (మధ్య రాష్ట్రాల మాజీ ముఖ్య మంత్రి) ముఖం మాత్రం, ఆయన తెల్లని బొద్దు మీసాలవల్ల వెంటనే పోల్చుకో గలిగాము. మేము వారి బస్సులవైపు వెళ్ళడానికి పోలీసువారు ఒప్పుకోలేదు. బస్సులో వాళ్ళు తెరల సందులలోంచి మాలో ఎవరినైనా పోల్చుకో గలిగారో లేదో తెలియదు.

మమ్మల్ని అన్నీ సెకండు క్లాసు పెట్టెలున్న బండిలో చెన్నపట్నం తీసుకువెళ్ళి, ఆ రాత్రి పెనిటెన్షియరీ జెయిలులో ఉంచి, మర్నాడు ఉదయం సెంట్రల్ స్టేషన్లో గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించారు. కాని, మమ్మల్ని ఎక్కడికి తీసుకు వెళుతున్నారో మా రైలు పెట్టెలలో కూచున్న సార్జెంట్లకు కూడా తెలియదు. ఆ ట్రైనులో వస్తున్న ఒక పెద్ద పోలీసు ఉద్యోగి చెప్పిన స్టేషను వైపుకు బండి నడిపించడం తప్ప, ఆ బండి ఇంజను డ్రైవరుకుకూడా గమ్యస్థానం తెలియదు. ఈ పోలీస్ ఉద్యోగి స్టేషన్ కంట్రోల్స్ ద్వారా మేము వెళ్ళేత్రోవ, సమయం, సిగ్నల్స్ వగైరాలు ఏర్పాట్లు చేసుకునేవాడు. మధ్యాహ్నం మాట్రైను గూడూరు చేరినప్పుడు పెద్ద అల్లరి ఏదీ లేకుండానే మేము బండిదిగి రైల్వే హోటలుకు వెళ్ళి భోజనాలు చేశాము. అయితే, సాయంత్రం మేము విజయవాడ చేరేసరికి, పోలీసువారికీ, మాకూ ఉన్న సౌజన్యం కొంత చెడింది. మేమున్న కంపార్టుమెంటులోకి భోజనాలు తేవడానికి సదుపాయాలు అక్కడ కనిపించ లేదు. మమ్మల్ని రైలు పెట్టెలనుంచి దిగవద్దంటాడు పోలీసు ఉద్యోగి. ప్లాట్‌ఫారంమీద నాలుగైదు వేలమంది ప్రజలు గుమిగూడారు. పోలీసువారు, ప్రజలు ఒకరి నొకరు వెనక్కుతోసుకోవడంతో పెద్ద గలాటా బయలుదేరింది. మాలో కొందరికి భోజన సదుపాయాలు కలిగినవి. కాని, భోజనశాలకు దూరంగా ఉన్న మా కంపార్టుమెంటు, ప్రక్క కంపార్టుమెంటువారికి ఆ సౌకార్యాలు కలగలేదు. మా కంపార్టుమెంటులో సత్యమూర్తి గారున్నారు. రైలు కదిలేసరికి, ఆయన "వీడెలా ముందుకు నడుస్తాడో చూస్తా"నని అలారం గొలుసు గట్టిగా లాగారు. ట్రైను ప్లాట్‌ఫారం విడవకుండానే ఆగిపోయింది. అప్పుడు రైల్వేలో పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసరుగా ఉన్న శర్మ అనే ఆయన మేమున్న కంపార్టుమెంటును - పోలీసు ఉద్యోగి వద్దంటున్నా వినక, భోజనశాలకు ఎదురుగా ఉండేటట్టు రైలును వెనక్కు నడిపించాడు. అప్పుడు అటూ ఇటూ పోలీసు సిబ్బంది నిలబడి, కార్డన్ (అడ్డు) కట్టగా, ఆ కార్డనులోనుంచి భోజనాలశాలకు వెళ్ళి, భోజనం చేయగలిగాము. ఆ రైల్వే ఆఫీసరు శర్మాగారిని, ఇక్కడ సత్యమూర్తిగారిని - ప్రకాశంగారు అన్నదాతలని ప్రశంసించారు.

మరునాడు పది, పదకొండు గంటల వేళకు మేము నాగపూరు రైల్వేస్టేషనుకు చేరుకున్నాము. మేము నాగపూరు జెయిలులో పరి స్థితులు ఎలా ఉంటాయో, సౌకర్యాలు ఎలా ఉంటాయో అన్న చర్చలో పడ్డాము. అంతలో పెద్ద వర్షం వచ్చింది. మా సామానుల కోసం రెండు లారీలు, మేము కూచోడానికి రెండు బస్సులూ వచ్చాయి. రాదనుకొని బస్సుకప్పుపైన పెట్టిన సామానులు కొన్ని వర్షంలో బాగా తడిసిపోయినాయి. అవి తిరిగీ సర్దేవరకు మేము కదలమన్నాము. చివరకు బయలుదేరిన బస్సులు నాగపూరు జెయిలు వైపు తిరుగలేదు. అవి ఎక్కడికి పోతున్నాయో ఎవరికి తెలియలేదు. పోలీసు ఉద్యోగులు అంతా, ఎంత అడిగినా తెలియదనే ఒక్కటే జవాబు చెప్పారు. చాలనందుకు, అడపా దడపా వర్షపు చికాకు. ఎలాగైతే నేమి, రాత్రి పదకొండు, పన్నెండుగంటల వేళకు ఏదో జెయిలుగేటు చేరుకున్నాము. ఇది యే ఊరు అని అడిగితే, అంతదాకా తెలియదంటూ వచ్చిన సార్జెంటు మొదటిసారిగా ఆ మాట వదలి, 'అమరావతి" జెయిలన్నాడు. మే మక్కడికి ఏ రాత్రికైనా వస్తామన్న సంగతి అక్కడి జెయిలు అధికారులకు తప్పకుండా తెలిసే ఉండాలి కదా! అయినా, ఒక అరగంట వరకూ ఎవరూ కనిపించలేదు. వర్షపు తుంపరలలోనే మేమంతా ఉండవలసి వచ్చింది. మాలో - సత్యమూర్తిగారు వర్షంలో చేసిన ఈ ప్రయాణాన్ని తట్టుకోలేక పోయారు. దాంతో ఆయనకు తీవ్రంగా జబ్బుచేసింది. నెలా రెండు నెలలపాటు ఆ జబ్బు ఉద్ధృతమయ్యేసరికి, వారిని చెన్నపట్నం జెయిలుద్వారా అక్కడి జనరల్ ఆసుపత్రిలో చేర్చారు. పాపం, ఆయన అక్కడే స్వర్గస్థులయ్యారు. ఆ విధంగా బ్రిటిషువారి క్రౌర్యానికి ఆయన బలి అయిపోయారు.

ఈ అమరావతి జెయిలు వట్టి జిల్లా జెయిలు. అయినప్పటికీ దానికి రెండు ప్రాకారాలుండేవి. ప్రాకారపు గోడల ఎత్తు పదిహేను ఇరవై అడుగులకు తక్కువలేదు. లోపల, మా ముప్పైరెండుమందినీ ఒకచోట పెట్టడానికి విశాలమయిన భాగంకూడా లేదు. అందుచేత మాలో ఇరవై మందిని ఒక ఆవరణలోను, తక్కినవారిని మరొక ఆవరణలోను - ఎలెక్ట్రిక్ దీపాలుకూడా లేని జింకు కప్పులుగల పాకలలో పెట్టారు. మర్నాడు లేచిన తర్వాత ఉన్నంత చోటులోనూ ఎలాగో సర్దుకున్నాము.

ఈ జైలుకు రాక పూర్వం, వేలూరు జైలులో ఉండగానే - కళా వెంకటరావు, నీలం సంజీవ రెడ్డి, ఎం. పళ్ళంరాజు, ఎం. బాపినీడు మొదలైనవారు ఒక కట్టుగా ఉండి, ప్రకాశం గారికి ఏవైనా సౌకర్యాలు కలుగజేయాలనే విషయంపై ఎటువంటి ఆసక్తి చూపక పోవడమే కాకుండా, ఆయన ఏ సెల్లులో ఉంటానంటే, అది ఆయనకు ఇవ్వకుండా చేయడానికి కూడా ప్రయత్నించే వారు. అదే ద్వేషభావాన్ని వారు అమరావతి జైలుకు కూడా తమతోబాటు తీసుకువచ్చారు. గిరిగారు మాత్రం ఎలాగో జైలు ఉద్యోగస్థులతో మాట్లాడి, ప్రకాశంగారికి ఒక మూలగా, ఇతరుల బాధ లేనిచోట చోటు ఇప్పించారు. ప్రకాశంగారు వేలూరులోను, అమరావతిలోను కూడా తాను తెచ్చుకున్న మట్టి పాత్రలలో స్వయంగానే వండుకునేవారు. ఆయన ఇతరులతో సాంగత్యం అట్టే పెట్టుకోలేదు.

'ఆంధ్రా సర్క్యులర్‌'

ఇలా ఉంటూండగా, గాంధీజీ 'క్విట్ ఇండియా' ఉద్యమం పేరున బ్రహ్మాండమైన శాబటేజ్ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని, దానికి తార్కాణంగా "ఆంధ్రా సర్క్యులర్‌" అనేదానిని - మిగిలిన విషయాలు చాలా చేర్చి ఒక నేరారోపణ గ్రంథంగా అచ్చువేసి, మా అందరికి ప్రత్యేకమైన చార్జి షీట్లను పంపారు. ఇందులోని 'ఆంధ్ర సర్క్యులర్‌' అన్నది ఇదివరలో కళా వెంకటరావు నాకు బెజవాడ ప్లాట్‌ఫారం మీద చూపించిన కార్యక్రమమే అయిఉండెను. అయితే, అది ఆంధ్రా ప్రొవిన్షియల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ యొక్క ఉత్తర శీర్షిక ఉన్న కాగితం (Letter - head) పైన రోనియోటైపు చేయబడి ఉండెను. అందుచేత, దానిని ఏ కాంగ్రెసు కమిటీ ఆదరించక పోయినా, ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ ముందు దాని ప్రసక్తే రాకపోయినా, దానికి 'ఆంధ్రా సర్క్యులర్‌' అనే ప్రఖ్యాతి మాత్రం వచ్చింది.

మా అందరికీ ఛార్జిషీట్లు వచ్చిన తర్వాత, ఎవరి యత్నంవల్లనో తెలియదుగానీ - మేమంతా వాటికి ఏ జవాబు ఇవ్వాలో నిర్ణయించుకోడానికి ఒక చోట సమావేశమయ్యాము. అప్పటికింకా సత్యమూర్తిగారు ఉన్నారు. ఆ చార్జిషీట్లలోనివి చాలా మటుకు నిస్సారమయిన విషయాలే. అయినప్పటికీ, మేము వ్రాసేది ఏదీ విడుదలకోసం చేసే యత్నంలాగా ఉండకూడదు. వ్యక్తిగతంగా చెప్పిన వివరంలో ఏదైనా తప్పుంటే అది దిద్దవచ్చు. కాని, అది తప్పుకోడానికి చెప్పే జవాబులాగా ఉండకూడదు. అందుచేత, మాలో చాలా మందిమి ఏ జవాబూ ఇవ్వక ఊరుకుందా మనుకున్నాము. అయితే, ప్రకాశంగారు మాత్రం ఆంధ్రా సర్క్యులర్ అనేది ఆంధ్రా ప్రొవిన్షియల్ వర్కంగ్ కమిటీ ఎన్నడూ ఇవ్వలేదనీ, ఇటు వంటి ప్రోగ్రాం చర్చించడానికి ఆ కమిటీ ఆస లెన్నడూ సమావేశం కాలేదనీ వ్రాయవలిసి వచ్చింది. ఈ విషయం మేము చెప్పేసరికి ప్రకాశంగారి మీద కళా వెంకటరావు విరుచుకు పడ్డాడు.


వెంకటరావు - తాను గాంధీ విధేయుడనీ, సత్యం తప్పనివాడనీ చెప్పి, 'ప్రకాశంగారు బందరు మీటింగు ప్రొసీడింగ్స్‌కి సంతకం పెట్టారా, లేదా?' అని కేకలు వేశాడు. బందరులో పట్టాభిగారింట జరిగిన సమావేశం వర్కింగ్ కమిటీ సమావేశం కాదనీ, ఏదో కొందరు మిత్రులు కలుసుకుంటారనీ తాను బెజవాడ ప్లాట్‌ఫారం మీద నాకు చెప్పిన విషయం మరిచిపోయాడు. తాను చూపించిన కాగితం గాంధీగారి అనుజ్ఞక్రింద వ్రాసిందన్నమాట అసంభవమని ప్రకాశంగారు అడ్డు చెప్పిన మాట మరచిపోయాడు. 'ప్రకాశంగారు ప్రొసీడింగ్స్‌కి సంతకం పెట్టారా, లేదా?' అని మరొక మారు అడిగాడు. "ఇన్‌ఫార్మల్ ప్రొసీడింగ్స్ వ్రాసిన కాగితం కాదుటయ్యా?" అని నే నడిగాను. "అది వర్కింగ్ కమిటీ మినిట్సు పుస్తకం" లోని కాగితం కానేకాదని జ్ఞాపకం చేశాను.

అసలు వెంకటరావు మనసులో ఈ భ్రమ కలగడానికి కారణం ఇది: బొంబాయి ఏ.ఐ.సి.సి. మీటింగు జరుగుతున్నప్పుడు తానే ఆంధ్రా ప్రొవిన్షియల్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తాలూకు లెటర్‌హెడ్లపైన ప్రోగ్రామంతా రోనియో కాఫీలు తీయించి, ఆంధ్రజిల్లాల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులకు, కార్యదర్శులకు, ఆంధ్రనుంచి వచ్చిన ఏ.ఐ.సి.సి. సభ్యులకు కవరులోపెట్టి, చిరునామాలు వ్రాసి పోస్టుచేయ నారంభించాడు. నేను అతడు చేస్తున్న పనిచూసి, "ఇదేమిటయ్యా! మన వర్కింగ్ కమిటీగానీ, ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీగానీ, పాస్ చేయని ప్రోగ్రాం ఎందుకు పంపిస్తున్నావు? డాక్టర్ పట్టాభిగారు వర్కింగ్ కమిటీలో ఈ ప్రోగ్రాం ఆలోచించలేదని మూడు నాలుగు రోజులుగా చెపుతూనే ఉన్నారు," అనగా, అందుకు వెంకటరావు, "వారెలాగా పాస్ చేస్తారు. పాస్ చేసిన తర్వాత నాకు ఉత్తరాలు పోస్టు చేయడానికి టైముండ" దన్నాడు.

ఈ విషయాలు అతనికి జైలులో జ్ఞాపకం చేసినపుడు, "ఏమో, నేను గాంధీ వాదిని," అన్నాడు. ఈ చర్చ అంతా జరుగుతూండగా - మాతో ఉన్న తమిళ, కేరళ, కన్నడిగ సత్యాగ్రహ సభ్యులు ఆశ్చర్యపోయారు. ఆ రోజున ఆ సమావేశంలో వచ్చిన వైషమ్యం వారి మధ్య ప్రాణాలు పోయేదాకా ఉండేది. ఆవేళ కళా వెంకటరావు చేసినది - ప్రకాశంగారి నాయకత్వాన్ని పడగొట్టడానికి ప్రథమ యత్నము.

ఈ ఆంధ్రా సర్క్యులర్ వ్యవహారంలో తర్వాతి ఘట్టం గాంధీగారితో సంబంధించింది. ఆగాఖాన్ భవనంలో ఆయనతోబాటు, సరోజినీ నాయుడుగారుకూడా డెటిన్యూగా ఉండేవారు. అయితే, ఆమె ఆరోగ్యం చెడిపోవడంచేత, ఆవిడను తొందరగా విడుదల చేశారు. విడుదల అవుతున్న ఆవిడకు - ఆంధ్రా సర్క్యులర్ అనేది వర్కింగ్ కమిటీవారియొక్కగాని, తనయొక్కగాని అనుజ్ఞపైన పుట్టిన కాగితం కాదని బహిరంగంగా చెప్పవలసిందని గాంధీజీ ఆదేశించారు. విడుదలకాగానే ఆమె అలా ప్రకటించారు. కాని, చాలామంది దానికి ప్రాముఖ్యమివ్వలేదు.

ప్రకాశంగారు అధ్యక్షులు గనుక, అది ఆంధ్రా కమిటీలో పుట్టలేదన్న మాట చెప్పక తప్పలేదు.

దీని తర్వాత ఘట్టం విజయవాడలో జరిగింది. 1945 లో వర్కింగ్ కమిటీ మెంబర్లందరు విడుదలయిన తరువాత, బొంబాయిలో వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొని, డాక్టర్ పట్టాభిగారు విజయవాడ వచ్చారు. నేనుకూడా ఆ సమయానికి విజయవాడ వెళ్ళి ఉన్నాను. అక్కడ సాయంకాలం బహిరంగ సభలో ఆయన ఉపన్యసించారు. ఆ ఉపన్యాసంలో ఆంధ్రా సర్క్యులర్ అన్నది గాంధీగారి అనుజ్ఞపైనే తాను ప్రకటించినట్టు చెప్పి, పెద్దలే అన్నది కాదంటే తాను ఏమి చేయాలన్న ధోరణిలో మాట్లాడారు. అది మర్నాడు ఉదయం పేపర్లలో పెద్ద అక్షరాలతో పడింది.

ప్రకాశంగారు అదిచూచి, పట్టాభిగారిని కలుసుకొనేందుకు, వెంటనే విజయవాడ వచ్చారు. నేను ఆయనను కలుసుకొని, పట్టాభిగారు బందరు వెళ్ళినట్టు చెప్పగా, ఆయన వెంటనే బందరు వెళ్ళారు. పట్టాభిగారితో మాట్లాడి, పత్రికలలో పడ్డ విషయం సరైనదికాదని ఒక సవరణ స్టేట్‌మెంటు తీసుకువచ్చారు. ఆ ఉదయమే ఆయన, నేనూ గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో వార్ధా వెళ్ళాము. మేము వార్ధా ఆశ్రమానికి వెళ్ళేసరికి చీకటి పడింది. గాంధీగారు తమ కుటీరం ముందుగా, నేలపైనే పక్కవేసుకుని పండుకొని ఉన్నారు.

ప్రకాశంగారు గాంధీగారికి సమస్కరించారు. వెంటనే గాంధీజీ ఆంధ్రా సర్కులర్ విషయమై ప్రసంగించారు. పట్టాభిగారి మాట తేగా, ఆయన ఉపన్యాసంపై వచ్చిన పత్రిక రెపోర్ఘు సరిగా లేదనీ, దానికి ఆయనే ఒక సవరణ ఇచ్చారనీ చెప్పి ప్రకాశంగారు తన జేబులోంచి పట్టాభిగారు ఇచ్చిన కాగితం గాంధీగారికి అందించబోతే, ఆయన "అసలు అన్నదానికన్న సవరణ మరింత అన్యాయంగా ఉన్న"దన్నారు. ఆ సవరణలో పట్టాభిగారు - ఆ కాగితంలో విషయాలు చర్చిస్తున్నపుడు గాంధీగారు, తక్కిన వర్కింగ్ కమిటీ మెంబర్లు ఎలా కూర్చున్నారో చెప్పడమే అందుకు కారణము. ఆయనదగ్గర మేము కూచున్న నలభై నిమిషాలు - మహాత్మాజీ ఈ విషయంతప్ప మరొకటి మాట్లాడ లేదు. అక్కడ కూచున్నంతసేపూ ప్రకాశంగారు పట్టాభిగారిని సమర్థిస్తూనే ఉన్నారు. ఎంత సమర్థించినా, గాంధీజీ విమర్శించడం మాన లేదు. ఆ మర్నాడు ఉదయం (27-7-46 న) మేము ఆయన దగ్గర సెలవు పుచ్చుకొని బొంబాయి వెళ్ళాము. రమారమి ఉదయం తొమ్మిదిన్నర గంటలకు పటేలుగారిని చూడడానికి ఆయనఇంటికి పోయాము. మేము లోపలికి వెళ్ళి కూచున్నాము. కిటికిగుండా కొంత సూర్యరశ్మి మా మీద పడుతూంది. మేము కూచోగానే, పటేలుగారు చిన్న తుఫానులా మాట్లాడడం ఆరంభించారు.

"ఏ మయింది పట్టాభికి? మతి చెడిందా?" అని పటేలుగారు ప్రశ్నించగా, ప్రకాశంగారు ఆయనతోగూడా పట్టాభిగారి ఉపన్యాసం పత్రికలలో సరిగా పడలేదని చెప్పి, పట్టాభిగారు పత్రికలకు సవరణ పంపిన సంగతి చెప్పారు. అందుకు పటేలుగారు, "మొదట బొమ్మ పగలగొట్టేశాడు. ఇపు డాయన సవరిస్తే ఏమిలాభం? మేము అహమ్మద్ నగరు కోటలో ఉండగా, మామీద ఛార్జీషీట్లు వచ్చినపుడు పట్టాభిగారిని అడిగితే - ఇది గాంధీగారితో చర్చించి, వర్కింగ్ కమిటీవారు కూడా చర్చించిన తరువాతే తాను ప్రోగ్రాం వ్రాసినట్టు వాదించాడు. దానిపైన, వర్కింగ్ కమిటీ మెంబర్లెవరూ ఇటువంటి చర్చ జరిగినట్టు తమకు జ్ఞాపకం లేదన్నారు. కాని, ఆయన అలా జరిగినదని చెప్తూ, అందరి జ్ఞాపక శక్తికన్నా తనదే మేలైనదని వాదించసాగాడు. ఆ రోజులు మమ్మలందర్ని దక్షిణాఫ్రికాకు రవాణా చేస్తారని కింవదంతులతో నిండినరోజులు, ఎన్నాళ్ళలా ఆ జెయిలులో కలిసి ఉండవలసి వస్తుందో తెలియదు. ఎందుకు పరస్పర భేదాభిప్రాయాలు పెంచుకోవాలని అప్పటి మటుకు ఆయనతో వాదించడం మానివేశాము. తరువాత జెయిళ్ళలోంచి విడుదలయిన వెంటనే బొంబాయిలో వర్కింగ్‌కమిటీ మీటింగు జరిగింది. ఆ మీటింగులో ఈ ప్రసక్తి మళ్ళీ వచ్చింది. పట్టాభిగారు తనమాట తనదేనని కూచున్నారు. పోనీ, ఎందుకయినా మంచిది గాంధీగారి అభిప్రాయం కనుక్కొందామని శంకరరావుదేవ్ గారిని ఆయన దగ్గరకు పంపడం జరిగింది.

గాంధీగారు ఆయనను 'పట్టాభే ఈ విధంగా చెప్పాడా?' అని ప్రశ్నిస్తే, ఆయన అవునని జవాబిచ్చాడట. దానిపై గాంధీగారు 'అయితే దైవమే శరణ్యం మన కందరికీ ఇటుపైన,' అన్నారట. తిరిగి వచ్చి శంకరరావు దేవ్‌గారు చెప్పిన మాటలు విని అందరమూ పట్టాభిగారు తన జ్ఞాపకశక్తిని కొంచెం సవరించుకోవలసిందని అన్నాము. "ఇంత జరిగిన తర్వాత విజయవాడలో ఆ విధమైన ఉపన్యాసం మతి ఉన్నవాడు చేయవలసిందేనా?" అని పటేలుగారు కఠోరంగా అన్నారు. అయితే, ప్రకాశంగారు పట్టాభిగారి మీది నింద తొలగించడానికి ఎంతయినా యత్నించారు. ఆ తరువాత కొంతసేపు ఇతర విషయాలు మాట్లాడి మేము బయలుదేరాము.

దీని తుది ఘట్టం - మహాత్మాగాంధీగారి 5-3-45 తేదీనాటి ప్రకటన. అందులో ఆంధ్రా సర్క్యులర్ పూర్వాపరాలు కొన్ని చర్చించి, చివర అది కాంగ్రెసు అనుమతిపైనగాని, తన అనుమతిపైనగాని ప్రకటించబడలేదని ఆయన వక్కాణించారు.

ప్రకాశంగారు ఈ విషయంలో గాంధీగారి పేరు పోకుండా ఉండవలెననే తాపత్రయంతో ఉండేవారు. పట్టాభిగారు 20-7-45 న చేసిన ఒక పత్రికా ప్రకటనను బట్టి - ఆంధ్రా వర్కింగ్ కమిటీ అనుమతి లేకుండానే ఆ కాగితం "ఆంధ్రా సర్క్యులర్" పేర పుట్టిందని తెలిసింది. పట్టాభిగారు తమ ప్రకటనలో "నేను 14-7-1942 నాడు బందరులో ఆంధ్రా ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ సమావేశపరిచాను. (ఆయన ఆంధ్రా ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాడు. బందరు ఆ కమిటీకి హెడ్డాఫీసు కాదు.) 28 మంది కాంగ్రెస్ వాదులు, ఆంధ్రదేశం నలుమూలలనుంచీ హాజరయారు. సర్క్యులరులో ఉన్న సూచనలన్నీ సమావేశం ముందు పెట్టాను. తరువాత బొంబాయిలో జరగబోయే ఆలిండియా కాంగ్రెస్‌కమిటీ సమావేశం తరువాత వాటిని అమలు చెయ్యాలని చెప్పాను," అన్నారు.

ఈ విధంగా ప్రకాశంగారిని త్రోసిరాజనడానికి వ్యక్తిసత్యాగ్రహం తర్వాత వెల్లూరు జైలులో వెంకటరావు, పట్టాభిగారు చేసుకున్న ఏర్పాటు ప్రకారంగా - అధ్యక్షులయిన ప్రకాశంగారికి తెలియకుండా కమిటీ మీటింగు అనడం, మాకు నోటీసు లేదేమని నావంటివాడు అడిగితే, అది ఇన్‌ఫార్మల్ మీటింగు అనడం, మినిట్సు పుస్తకంతో సంబంధంలేని వేరే కాగితంమీద ప్రొసీడీంగ్స్ వ్రాయడం, ఆ ప్రొసీడీంగ్స్‌లోనూ ఈ ఇన్‌స్ట్రక్షన్స్ విషయమై ఏ తీర్మానం లేకపోయినా, వాటిని కాంగ్రెస్ కమిటీ లెటర్ హెడ్డులపైన రోనియో కాఫీ చేయించి, ఆధికారరీత్యా విడుదల అయినట్టు ప్రకటించడం, గాంధీగారికి సంబంధం లేకున్నా ఆయన పేరు దీనిలో కలపడం - ఇవన్నీ ఆంధ్ర రాజకీయాలలో పదవీవ్యామోహంతో, అసత్యమనే వాహనంపైన, అత్యాశాపరులు ఎంతదూరం పోగలరో చూపించేగలిగే తార్కాణాలు.

సవ్యమైన మార్గంలో ఏ పదవినైనా పొందడానికి ప్రయత్నించడం దోషంకాదు. కానీ, మార్గాలు వక్రమయితే రాజకీయాలు కలుషితమై, రాజకీయ జీవితాలను అప్రతిష్ఠ పాలు చేస్తాయి. ఈ విధమైన మార్గం, ఆంధ్రులను ఎక్కడికి తీసుకువెళ్ళినదీ తరువాత అధ్యాయంలో వివరిస్తాను.