Jump to content

నా జీవిత యాత్ర-4/వేలూరు జైలు ముచ్చటలు

వికీసోర్స్ నుండి

9

వేలూరు జైలు ముచ్చటలు

వ్యక్తి సత్యాగ్రహం చేయడానికి ప్రథమంగా నాకు అవకాశం ఇవ్వవలసిందని ప్రకాశంగారిని కోరాను. బహుశా ఆయనకు కూడా రాష్ట్రంలో తామే ప్రప్రథమంగా సత్యాగ్రహం చేయాలనే సంకల్పంతో ఉండడంచేత కాబోలు తామే సత్యాగ్రహం చేశారు. నాకు మొట్టమొదట కాకున్నా, ముందుగానే అవకాశం ఇచ్చారు. 26-11-40 నాడు నేను జిల్లా కోర్టు గుమ్మం దగ్గర, గాంధీగారు చెప్పిన వాక్యాలు చదివి శాసనోల్లంఘనం చేశాను. వెంటనే నన్ను అరెస్టు చేసి దూరంగా దువ్వాడ దగ్గరున్న ఫారెస్టు బంగళాలో అంతకు ముందే నా కోసం వచ్చి కూచున్న డిప్యూటి కలెక్టరు ముందు హాజరు పెట్టగా, ఆయన నాకు ఆయన పద్దెనిమిది నెలల కఠినశిక్ష విధించాడు. అలా నేను అరెస్టయి వేలూరు జెయిలుకు వెళ్ళేసరికే, ప్రకాశం గారు అక్కడికి వచ్చి ఉన్నారు. త్వరలోనే ఒకరి తర్వాత ఒకరుగా మంత్రులు, శాసన సభ్యులు జైలుకు రావడం ప్రారంభించారు. తనకు వ్యక్తి సత్యాగ్రహంపైన నమ్మకం లేదన్న రాజాజీ కూడా వచ్చేశారు. మేము వెళ్ళేముందు, అక్కడ పదిమంది దాకా కమ్యూనిస్టులు ఖైదీలుగా ఉండేవారు. లోగడ వారిలో చాలామంది కాంగ్రెసులో ఉన్నవారే. రోజూ సాయంకాలం ఆరు గంటలయేసరికి మమ్మల్ని ప్రత్యేకమైన గదులలో పెట్టి తాళం వేసేసేవారు. "కోరి జైలుకు వచ్చిన మా యెడల యెందు కీ అపనమ్మక?" మని ప్రశ్నించగా, జైలు సూపరింటెండెంటు మా సెల్లులకు దగ్గరగా ఉన్న జైలు ఆవరణ గోడను చూపించి, అందులో ఒక భాగం కొత్తగా మరమ్మత్తు చేసిన దానిని చూపించారు. ఆ భాగంలో కన్నం త్రవ్వి కొంతకాలం క్రింద నలుగురు కమ్యూనిస్టు ఖైదీలు పారిపోవడంచేత ప్రభుత్వంవారు ఇటువంటి జాగ్రత్త తీసుకోమని ఆదేశించినట్టు చెప్పారు. అయితే, మాతోబాటు అక్కడ మిగిలి ఉన్న కమ్యూనిస్టులు అలా పారిపోయే వారిలాగా తోచలేదు. అది వేరే మాట.

ఇంతలో, వ్యక్తి సత్యాగ్రహంచేసి జైలులోకి వచ్చేవారి సంఖ్య దినదినానికి పెరగడం ప్రారంభించింది. కాలక్షేపంకోసం ప్రొద్దుట వేళ కొందరు రాజాజీ చుట్టూ చేరేవారు. అలాగే, కొందరు ప్రకాశంగారి చుట్టూ చేరేవారు. అయితే రాజాజీ, ప్రకాశంగారు అట్టే కలుసు కోవడంగానీ, మాట్లాడుకోవడంగానీ జరిగేదికాదు. విరామకాలం చాలా ఉండడంచేత సహజంగా గ్రంథపఠనం సాగేది. రామాయణము, భారతము, భాగవతము మొదలైనవి ఎక్కువగా చదివేవాళ్ళు. అంతకన్న హెచ్చుగా, దాదాపు అందరి చేతుల్లోనూ భగవద్గీత కనిపించేది. సరే! మిగిలిన రాజకీయ గ్రంథాల పైనా, రాజకీయాలపైనా వాదోపవాదాలు చెట్లనీడలలో గుంపులు గుంపులుగా చేరిన సత్యాగ్రహుల మధ్య బహుళంగా, ఒక్కొక్కప్పుడు తీవ్రంగా జరిగేవి. అందులో అందరి దృష్టిలోను పడేటట్లుగా రాజాజీ కూచున్న గుంపు, ప్రకాశంగారు కూచున్న గుంపు విడివిడిగా ఏర్పడినాయి. అందుచేతే.

                         "ఒకచోట రామాయణ కధా శ్రవణ పుణ్య
                                  పదములు - వాల్మీకి అదరిపడగ;
                          ఒకచోట భాగవ తోదంత వ్యాఖ్యాన
                                  తీవ్రత - పోతన్న దిగులుపడగ;
                          ఒకచోట భారతీయ కవితా వాహినీ
                                  స్నాతులై కవులెల్ల సంచలింప;

                         ఒకచోట సామ్యవాద కలకలార్బటి
                                   రవములు - లెనినును లజ్జపరుప,

                         రాజితాచార్య శాసన రక్షితమ్ము
                         ధీప్రకాశ విభాషిత తీవ్రఫణితి
                         విశ్వవేదాంత పీఠికా విలసితమ్ము
                         రాయవేలూరి నగర కారాగృహమ్ము."

అని 16-12-40 న నేను వ్రాయడానికి అవకాశం కలిగింది. ఇంతలో ప్రభుత్వం వారు తిరుచినాపల్లి జైలులో వ్యక్తి సత్యాగ్రహం చేసిన వారికని ప్రత్యేకమైన ఏర్పాట్లుచేసి, మమ్మల్ని దాదాపు మూడు వందల మందిని అక్కడికి రవాణా చేశారు. మొదట్లో ఏర్పాట్లు సరిగా లేకపోయినా, రాను రాను కొంత వసతి కల్పించి, వేళపట్టున భోజనాలు, స్నాన సౌకర్యాలు మొదలైనవి ఏర్పాటు చేశారు. ఆవరణలోంచి ఎవరూ పారిపోవడానికి వీలులేకుండా చుట్టూ బార్‌బ్డ్‌వైర్ (ఇనుప ముళ్ళ తీగె) తో కంచెలా కట్టి, రాత్రివేళ ముఖ్యంగా దాన్ని విద్యుద్భరితం చేసేవారు. ఖైదీ లెవరూ దాన్ని దాటి పారిపోలేదు కానీ, సూపరింటెండెంటుగారి చూడచక్కని కుక్కమాత్రం ఆ కంచెలోని విద్యుదాఘాతం చేత హత మయింది.

వేలూరి జైలులో - రాజాజీ, ప్రకాశంగారలు తలవరులుగా ఏర్పడిన ప్రత్యేక బృందాలు ఇక్కడ స్థిరపడినాయి.

తిరుచినాపల్లి జైలు ఆవరణలో పెద్ద పెద్ద చింతచెట్లు మెండుగా ఉండేవి. వాటి క్రింద, ఈ ప్రత్యేక సత్యాగ్రహ బృందాలు చేరి ముచ్చటించు కొనడానికీ, వాదించుకొనడానికీ, పఠనాసక్తిని సంతృప్తిపరచుకొనడానికీ, ఇతరములైన మంతనాలకూ అవకాశాలు హెచ్చుగా ఉండేవి.

                      "గీతార్థసార విఖ్యాత ప్రచాతృ వి
                                 ద్యాలయ ఘోషంబు లలము కొనగ,

                 లోకాభి రామయణాకలనంబున
                            చీకటి దర్బార్లు చెలగుచుండ,
                 నెమ్మి ప్రేక్షక వాహినీ చిత్రవర్ణాల
                            సంద్యాసురాగమ్ము సంతసిల్ల,
                 పాఠాక జన బృంద పాండిత్య సేచనన్
                            తింత్రిణీ వనరాశి తీపి గనగ,

                 విశ్వవేదాంత పీఠికా విస్తరంబు
                 తెలుగు తమిళ కర్ణాట కేరళ వినేత
                 లలవి నలరారు పరమ లీలాగృహమ్ము
                 తిరుచినాపల్లి కేంద్ర ఖైదీల గృహమ్ము." [ 10-1-1941 ]

నాయక, ఉపనాయక, రాజకీయ రణరంగ వీరుల సమూహ జీవనం నడిచే వేళలలో ప్రకాశంగారి బృందంలోని దాదాపు యాభైమంది దాకా ప్రతి దినం ఉదయంపూట, వారుండే గదికి ఎదురుగా ఉన్న పెద్ద చెట్టు దగ్గర సమావేశం కావడం ప్రారంభమైంది. ఆ బృందంలో చేరిన వారిలో గిరిగారు, అనంతశయనం అయ్యంగారు మొదలైన పెద్దలుకూడా ఉన్నారు. అలా సమావేశం కావడంచేత ప్రక్కన సంస్కృత గ్రంథాలను ఉంచుకుని, తెలుగు భారత భాగవతాలు ఒక పంక్తికూడా మిగల్చకుండా చదవగలిగినాము. వాల్మీకి రామాయణము చదివి అర్థం చెప్పడానికి అనంతశయనం అయ్యంగారు, నగరి కె. వరదాచారి, విద్వాన్ విశ్వం, మాడభూషి వెంకటాచారి మొదలైన వారు ఉండేవారు. మధ్యాహ్నాలలో బైబిలు పాత, క్రొత్త టెస్టమెంటులు మొదటినుంచి చివరిదాకా పూర్తిగా చదివాము. మహమ్మదలీ ఇంగ్లీషులోకి అనువదించిన ఖురానును గూడా పూర్తిగా చదివాము. ఇలా చదివేవారు చదువుతుండగా, అర్థ వ్యాఖ్యానాలు చేసేవారు చేస్తుండగా - ముప్పై, నలబై మందికి ఎప్పుడూ తక్కువగాని ఈ పాఠక బృందానికి అధ్యక్షులైన ప్రకాశంగారు ఒక ఎక్సర్‌సైజు పుస్తకంలో నోట్సు వ్రాసుకునేవారు. రెండు నెలలయ్యేసరికి, ఆ కారాగృహావరణం రెండోభాగంలో రాజాజీ పీఠంకూడా గట్టిగా ఏర్పడింది. ఆయన అదివరకే గీత, ఉపనిషత్తులు మొదలైనవి అనువాదములు తడివి చూసినవారు. ఇక్కడ సంస్కృత పాండిత్యంగల సంతానం, ఎస్. ఎస్. వరదాచారి మొదలైనవారు ఆయన బృందంలో చేరి - గీతార్థ ప్రబోధాలకు, ఉపనిషత్తుల భాష్యాలకు, విశిష్టాద్వైత పరంగా అర్థాలు చెప్పుకుంటూ ఉండేవారు. మరొకమూల టి. నాగిరెడ్డి మొదలయినవారి యువ కమ్యూనిష్టు బృందం (ఏడు, ఎనిమిది మంది) కమ్యూనిజం, సోషలిజాలకు సంబంధించిన గ్రంథపఠనం మతావేశంతో చేసుకునేవారు.

పరస్పర సంభాషణలు, భాష్యార్థములు కాలక్షేపం కోసం చేసుకునేవారే కాని, ఒకరి మతం ఒకరు ఎన్నడూ అవలంబించలేదు. అద్వైతులు విశిష్టాద్వైతం విన్నా, విశిష్టాద్వైతులు అద్వైత భాష్యాలు విన్నా, కాంగ్రెస్‌వాదులు కమ్యూనిస్టుల మాటలు విన్నా ఎవరిమతం వారిదే. శక్తిపూజ విషయంలో మాత్రం - అంటే రాజకీయంగా జెయిళ్ల అనంతరం ఎవరికి పదవీ స్వీకార శక్తి హెచ్చుగా కలుగుతుందో అన్న విషయంలో మాత్రం - అట్టి శక్తికి మూల పురుషులను కొనబడేవారియెడల మతం మార్చుకునే సంఘటనలు జరుగుతూండేవి.

"ఈ వ్యక్తి సత్యాగ్రహ మనేది పనికిరాని బెడద" అని రాజాజీ స్తుతి నిందాపరంగా చెప్పుకుండడంతోబాటు శిష్యకోటిని చేకూర్చుకొనేందుకు యత్నం కూడా జరిపేవారు. వ్యక్తి సత్యాగ్రహం విప్లవ మార్గంలో మొదటి మెట్టని ప్రకాశంగారు, ఆయన చుట్టూ చేరినవారు నిశ్చితంగా అభిప్రాయపడడం జరిగింది. ఇందులో, ఒక వ్యతిరేకాలంకార చమత్కృతి అందరికీ కనిపించేది. గాంధీగారికి అత్యంత సన్నిహితుడయిన రాజాజీ, తీవ్రమైన గాంధీ విమర్శకులయ్యారు. గాంధీజీకి అత్యంతదూరులయిన ప్రకాశంగారు గాంధీని తీవ్రంగా ప్రశంసించే వారయ్యారు.

ఇటువంటి వాతావరణంలో హిందూ పత్రిక సంపాదకులైన కె. శ్రీనివాసన్ గారు ఒక రోజున రాజాజీని ప్రత్యేకంగా చూడడానికి వచ్చారు. వచ్చి, మరికొందరిని కూడా చూశారు. రాజాజీతో ఆయన ఏమి మాట్లాడారో తెలియదు కాని, తర్వాత హిందూ పత్రికలోను, తక్కిన పత్రికలలోను - జెయిలులో ఉన్న పెద్ద నాయకులకు వ్యక్తి సత్యాగ్రహం నిష్ఫలమయినదన్న భావం కలిగినట్టూ, బ్రిటిషువారు జాతీయప్రభుత్వం ఏర్పాటుచేస్తే, తాము పాల్గొని యుద్ధం జయప్రదంగా సాగించడానికి సాయం చేస్తామని ఆ నాయకులు చెప్పినట్టూ, ఈ అభిప్రాయాలు లిబరల్ లీడరయిన తేజ్‌బహదూర్ సప్రూగారికి తెలియ జేసినట్టూ వార్తలు వెలువడ్డాయి. బ్రిటిషుపార్ల మెంటులో, ఈ కాంగ్రెసు నాయకుల అభిప్రాయాన్నిబట్టి ఏమైనా రాజీ జరుగుతుందా అని ఒక ప్రశ్న అడిగితే, ఇటువంటి మాటలలో తమ ప్రసక్తి లేదని ప్రభుత్వ ప్రతినిధి చెప్పాడు. ఇంతట్లో గాంధీగారు వ్యక్తి సత్యాగ్రహం చేసి జెయిలుకువెళ్ళిన తన అనుయాయులు కొందరికి అందులో నమ్మకం లేదని అన్నట్టు, హిందూ మొదలైన పత్రికలలో పడిన వార్తలనుబట్టి గ్రహించి, ఎవరి పేర్లూ చెప్పకుండా సలహా పూర్వకంగా ఒక ప్రకటన చేశారు. దాని సారాంశం ఇది: "ఎవరికైతే వ్యక్తిసత్యాగ్రహంలో నమ్మకం లేదో, వారు ఆ విషయం వారితో వీరితో అనడంకన్నా, తామున్న జెయిలు సూపరింటెండెంటుకు వ్రాసివేసి నట్టయితే ఆయన వారిని వెంటనే విడుదల చేసే ఏర్పాట్లు చేస్తాడు. కావలసినవారు తమ సమస్యను ఆ విధంగా పరిష్కరించుకొనవచ్చును."

అయితే, కట్టుబాటుకు వ్యతిరేకంగా ఎవరూ అటువంటి అపాలజీ (క్షమాపణ) తో సమానమైన లేఖలు వ్రాసి బయటకు వచ్చినట్టు నాకు జ్ఞాపకం లేదు.

ఇలా ఉంటూండగా, కొంతకాలానికి ప్రకాశంగారు తమ నాయకత్వధోరణేకాని, తన తర్వాత వారిని ముందుకు తీసుకురారన్న ఒకమాట చెవినుంచి చెవికి ప్రచారమయింది. ముందుకు రాదగ్గ తెలుగు సభ్యులలోకూడా ఈ నిశ్శబ్దప్రచారం కొనసాగింది. సాయంకాలాల వేళ ఆరోగ్యదృష్ట్యా సత్యాగ్రహులు ఆవరణలో నడిచే సమయాలలో తెలుగు సత్యాగ్రహల భుజాలపై తట్టి, "నీవంటి తెలివైనవాడు, ఉత్తమ త్యాగీ ప్రకాశం దృష్టికి ఎందుకు రాలేదు?" అన్నమాట మెల్లగా అనడం, మరికొందరు తెలుగువాళ్ళతోకూడా ఒకరి విషయం ఒకరితో చెప్పడం - రెండు, మూడు పర్యాయాలు రాజాజీ కొందరి విషయాలలో చేయడంతో తెలుగు బృందంలో ఒక సంచలనం కలగడం ఆరంబించింది. దీనికితోడు, తాము ఉన్న హాలులోనే బసచేసిఉన్న, ఉపనాయక శ్రేణిలోఉన్న తెలుగు సత్యాగ్రహులతో ఆయన ఒక రోజున, "చూశారా! మీ ఆంధ్రరాష్ట్ర కమిటీకి నాగేశ్వరరావు గారు, వెంకటప్పయ్యగారు, ప్రకాశంగారు - వీరినే స్థిరబుద్ధితో ఆరాధించి అధ్యక్షులుగా ఉంచుతున్నారు, తమిళరాష్ట్రంలో మార్పులు ఎప్పటికప్పుడు జరుగుతాయి. స్థిరత్వం లేదు," అన్నారు రాజాజీ. ఈ మాట ఒకరిద్దరి తెలుగువారియెడ రాజాజీకున్న ప్రశంసాభావమని అనుకున్నారు. అయితే, నాయక పదవిని మనసులో ఆశించే ఒకరిద్దరు, వీరు తప్ప మీకు నాయకులు లేరు అన్న ఎత్తిపొడుపు క్రింద గ్రహించారు. జెయిలు నుంచి విడుదలయి తిరిగివెళ్ళిన తరువాత, ఆంధ్రదేశ నాయకత్వంలో మార్పు తేవాలన్న గాడవాంఛ వీరిలో కొంతమందికి అంకురించింది,

ఇలా ఉంటూండగా, ఈ సపర్ణుల నాయకత్వమే ఎందుకు శాశ్వతంగా ఉండాలని ఏ పెద్దవారో అనడంచేత హరిజన సభ్యులుకూడా ప్రత్యేకంగా సమావేశాలు ఆరంభించారు. వీటి ప్రభావం రానురాను చెన్నరాష్ట్ర రాజకీయాలపై బాగా కనిపించిన విషయం చారిత్రకంగా నిర్దారణ అయింది. దీనికితోడు, జాన్ గంతర్ అనే ఆయన వ్రాసిన "ఇన్‌సైడ్ ఏషియా" అనే గ్రంథంలో రాజాజీని గూర్చి వ్రాసిన నిందా వాక్యాన్ని రాజాజీ విముఖులకొక ఆంధ్రమిత్రుడు చదివి వినిపించ నారంభించారు. దాంతో, తెలుగువారికి తమిళులకు మధ్యనున్న సామరస్యము, ఇదివరకు చెడిపోక మిగిలినదికూడా చెడ నారంభించింది. ఒకే కాంగ్రెసులో ఒకే గాంధీగారి నాయకత్వం క్రింద ప్రకాశంగారు, రాజాజీ పనిచేస్తూన్నప్పటికీ; మంత్రివర్గాలు ఏర్పాటు కాకముందు, మంత్రి వర్గంలో కార్యకలాపాలు నడిపిస్తున్న సమయంలోనూ, చివరికి కారాగృహవాసం చేస్తున్న సమయంలోనూ ఇద్దరి జీవిత ప్రవాహాలు కలిసి ఉన్నప్పటికీ, ప్రయాగలో గంగా యమునలు సంగమయిన తర్వాత కూడా కొంతదూరంవరకు తెలుపు తెలుపుగా, నలుపు నలుపుగా ఉండే విధంగా వీరి చరిత్రలు ఉండడంవల్ల రాష్ట్రరాజకీయాలు వీరి వ్యక్తిగత భేదాలకు అతీతం కాలేకపోయాయి. దీనికితోడు అపుడు వేలూరు జెయిలులో ఉన్న డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారికీ, ప్రకాశంగారికీ మధ్యఉన్న విభేదాలు కూడా ఈ పరిస్థితులను, ప్రజలను మరింత చీకటి త్రోవలవెంట పెడుతూండేవి. ఇటువంటి పరిణామమే రాకపోయిఉంటే, వారి విభేదాల విషయమై ఇక్కడ వ్రాయవలసిన అవసరమే లేకపోయి సంతోషజనకమైన స్థితి కలిగి ఉండేది.

వీడ్కొలుపులు - విందులు

కష్టాలలో ఉన్నప్పటికీ సర్దుకొనడానికి అలవాటు పడి, కష్టాల మధ్యనే సుఖ జీవనం చేయడానికి యత్నించడం మానవులకు సహజము. అందులో భారతీయుల కది ఉగ్గుపాలతో పెట్టిన మనస్తత్త్వము. ఆశాపాశములతో సతమత మవుతూ, బంధాలు కల్పించుకొని, ద్వేషరోష వహ్నుల వేడిని రాజనీతి పరిజ్ఞానమని భావించుకొని, భావికాలంలో రాగల పదవులందు గల వ్యామోహమే ప్రాణశక్తిని ఇస్తూండగా కారాగృహ మందున్న సత్యాగ్రహు లందరూ కలసి సోదర సత్యాగ్రహులు ఎవరైనా శిక్షాకాల పరిమితి ముగిసి విడుదల పొందేటప్పుడు కారాగృహ నివాస స్థితిగత సదుపాయాల ననుసరించి, "తేనీటి విందు" ఏర్పాటు చేయడం మామూలయిపోయింది. అలాంటి సమయాలలో విడుదలైన వారిపై ఇష్టమున్న మిత్రులు, పెద్దలు వీడ్కోలు సూచకంగా కొన్ని వాక్యాలు చెప్పడం మామూలయింది. కారాగృహంలోనికి వెళ్ళిన ఆరునెలల తర్వాత ఇటువంటి ఉత్సవాలు ఆరంభమయ్యాయి. ప్రకాశంగారు మాత్రం ఈ ఉత్సవాలలో పాల్గొనేవారు కారు. అటువంటి ఒకానొక సమయంలో విడుదలయిన కేరళ మిత్రుడొకడు [1] అన్నమాట ఇది: "నేను జైలులోకి రావడమిదే మొదటి సారి. కాని, నా కిక్కడ చాలా మంచి అనుభవం కలిగింది. లోకజ్ఞానం వచ్చింది. పెద్దవారికి గల చిన్న మనసులను, చిన్నవారికి గల పెద్ద మనసులను ఇక్కడ చూడగలిగాను."

అంతటిలో, రాజాజీ విడుదల అయే సమయం ఆసన్నమయింది. ఆయన పెద్దవారు గనుక, ఆయన కిచ్చే టీ పార్టీల సంఖ్యకూడా పెరిగింది. అలా ఒక తేనీటి విందులో ఆయన ఉపదేశ వాక్యాల మధ్య "హిందూ ముస్లిమ్ సమస్య అన్నది నా చేతులలో వదలి పెట్టినట్లయితే, ఐదు నిమిషాలలో పరిష్కారం చేస్తాను" అన్నారు. ఈ మాటలు వినేసరికి, మాలో చాలా మందికి పరిష్కారంపై ఆశ, పరిష్కారం ఇంత సులభమా అన్న ఆశ్చర్యమూ కలిగినవి. నేను "ఆ రహస్య మేదో మాకు చెబితే, మీకు మేము సహాయం చేస్తాము గదా, చెప్పండి" అన్నాను.

దాని కాయన, "నువ్విప్పు డిలా అంటావు. రేపు గాంధీగారు వస్తే 'గాంధీగారు, గాంధీగా'రని ఆయన వెంట పడతావు. నీతో చెప్పి ఏమి లాభము?" అన్నారు.

ఉన్నత స్థాయిలో - ఆయనకూ, గాంధీగారికీ మౌలికంగా ఉన్న విభేదాలు తెలిసిన వారికి మాత్రం ఈ మాటలోని రహస్యం కొంచెం అర్థమయింది, మిగిలిన వారి కది రాజాజీ సహజ చమత్కార వాక్య సరళిగా మాత్రమే కనిపించింది.

చాలామందికి శిక్ష తొమ్మిది నెలల పరిమితి లోపలే ఉండడంచేత ప్రతిరోజూ ముగ్గురో, నలుగురో 1941 సెప్టంబరునుంచి విడుదల అయిపోతూ ఉండేవారు. ఏడాది శిక్షగలవారు ముప్పై నలభై మందికి ఎక్కువ లేరు. పద్దెనిమిది నెలల శిక్ష పొందిన వాడిని నేనొక్కడినే. ఇంతలో ప్రకాశంగారు విడుదలయ్యారు. (కొంత స్పెషల్ రెమిషన్ కారణంగా రాజాజీ, ప్రకాశంగారూ ఒకే రోజు విడుదలయి, తిరుచినాపల్లిలో మాజీ మంత్రి అయిన డాక్టర్ రాజన్ గారికి అతిథులైనారు) వీడ్కొలుపులకు, విందులకు ప్రకాశంగారు పూర్తిగా విముఖులు. అందుచేత ఆయన జైలునుంచి వెళుతున్న రోజున ఏ ఆర్భాటమూ లేకుండానే వెళ్ళారు. మేము కొద్దిమందిమే మిగిలి ఉన్నాము.

వర్షాకాలం అంతమై, చెట్లకూ మైదానానికీ ఒక కొత్త పచ్చదనం వచ్చి కంటికీ, మనసుకూ ఆహ్లాదం కలుగుతూండేది. దాదాపు రెండు వందల మంది ఉండిన స్థలంలో మేము ముప్పై, నలభై మందిమి మాత్రం మిగిలేసరికి ఆ స్థల వైశాల్యం చూస్తే ప్రపంచమంతా అకస్మాత్తుగా విశాలత్వం పొందినట్టనిపించింది. నిత్యవాదోపవాద శబ్ద వైఖరి తగ్గడంచేత, మనసులో కొంత శాంతి కూడా సమకూరినట్లయింది. అయితే, ఈ శాంత స్థితి అకస్మాత్తుగా ఒక రోజున వ్యత్యస్తమయింది. అందుకు కారణం పత్రికలలోవచ్చిన ఒక వార్త. రాజాజీ ఏదో కాన్వొకేషన్ (స్నాతక) ఉపన్యాసంలో - హిందూ ముస్లిం సమస్యను ఐదు నిమిషాల్లో పరిష్కరించ వచ్చనీ, అందుకు జిన్నా కోరినట్లు పాకిస్తాన్‌ను భారత దేశం నుంచి విడదీయడమే మార్గమనీ పేర్కొన్నట్టు ఆ వార్త సారాంశము. నిశ్చలమైన జలాశయంలో పెద్ద ఎత్తునుంచి బండరాయి పడవేస్తే ఏ విధంగా అది అల్లకల్లోలమవుతుందో, ఆ విధంగానే జైళ్ళలో ఉన్న మా మనసులనే శాంత జలాశయంలో రాజాజీ చెప్పిన పరిష్కారం బండరాయిలా పడి, అశాంతిని రేపింది. ఇరవై సంవత్సరాలకు పైగా గాంధీగారు చేసిన హిందూ ముస్లిం ఐక్యమన్న ప్రచారానికి ఫలం ఇదేనా? తన మార్గానికి వ్యతిరేకంగా, భారత దేశాన్ని బద్దలుకొట్టే ఉద్దేశం ఉన్నవారిని గాంధీగారు ఏలాగు తమ ప్రత్యేక శిష్యులుగా భావించుకుంటున్నారు? అని పరిపరి విధాలైన మనోవేదనా తరంగాలు అందరి హృదయ సరసులందును ఉప్పొంగ సాగాయి. ఏమైనా సరే, జైలులోంచి వెంటనే ఎలాగో విడుదలయి రాజాజీని ప్రతిఘటించాలన్న భావోద్రేకం కలిగింది. అంతటిలో రాజాజీ భావాలను ప్రకాశంగారు బహిరంగంగా ఖండించినట్టు పత్రికలలో వార్తలు పడేసరికి కొంత ఉపశాంతి కలిగింది.

ఇంతేకాక, ప్రకాశంగారి అధ్యక్షతను విశాఖపట్నంలో డిసెం బరు నెలలో ఆంధ్ర మహాసభ జరిగింది. అప్పటికి నేను తిరుచినాపల్లి కారాగృహంలోని విశాలమైన ఆవరణలో పెద్ద పెద్ద చెట్ల నీడలలో ఏడు, ఎనిమిది మందితో ఉండేవాడిని. ప్రకాశంగారు ఆంధ్ర మహాసభలో అవకాశం తీసుకుని, 'హిందూదేశ విభజన సూత్రం పెద్ద లెవరూ ఆమోదించలేదనీ, గాంధీజీ దానికి సంపూర్ణ వ్యతిరేకులనీ, ప్రజలు అనవసరంగా వైరాశ్యమనే అంధకారంలో పడకూడదు' అనిన్నీ అన్నమాటలు పత్రికలలో పడినాయి. దానివల్ల మాకు కొంత ఉపశమనం కలిగింది.

ఆంధ్రరాష్ట్ర సమస్య

ప్రప్రథమంలో చెన్నపట్నం మొదలైన కొన్ని గ్రామాలను ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి, వెంకటాద్రి నాయకుడు పట్టాగా ఇచ్చాడు. చెన్నపట్న మనేది కూవం నదికి ఉత్తరంగా ఉన్న భాగము. ఉత్తర ప్రాంతాలలో ఏవో రెండు వీధులలో తప్ప మిగిలిన ప్రాంతం సంపూర్ణంగా తెలుగు ఖండంగా ఉండేది. 17 వ శతాబ్దంలో ఈ చెన్న పట్నంలో మునిసిపల్ ప్రభుత్వం ఏర్పాటు చేసేటపుడు 212 వీధులుండేవనీ, అవి పూర్తిగా తెలుగు వారితో నిండి ఉండేవనీ అప్పటి రికార్డుల మూలంగా మనకు తెలుస్తున్నది. అయితే, ఈస్టిండియా కంపెనీ వారు సెయింట్ థామస్ మవుంటులో సైన్యస్థావరం ఏర్పరచుకోవడం వల్ల, కోటనుంచి సెయింట్ థామస్ మవుంట్‌దాకా ఇరుప్రక్కలఉండే గ్రామాలను క్రమేణా చెన్నపట్నానికి కలుపుతూ రావడంవల్ల ట్రిప్లికేన్, మైలాపూరు మొదలైన గ్రామాలు ఈ పట్నంలో కలసిపోయినాయి. ఆ గ్రామాలలోని దాక్షిణాత్యులు చెన్నపట్నపు జనాభాలో కలసిపోవడం చేత క్రమేణా తమిళ జనాభావంతు హెచ్చవుతూ వచ్చింది. దానికి తోడు, చెన్నపట్నంనుంచి దక్షిణ జిల్లాలకే మొదట రైలుమార్గం పడింది. అందుచేత దక్షిణజిల్లాల వారికి - చెన్నపట్నానికి రావడానికి, వసతులు తొందరగా కల్పించుకోవడానికి అవకాశాలు కలగడంవల్ల, వారి జనాభా వేగంగా పెరిగింది. ప్రయాణ సౌకర్యాలు హెచ్చడంవల్ల దక్షిణ జిల్లాలలో గవర్నమెంటు కళాశాలలలోనుంచి పాసయిన విద్యార్థులు చాలా మంది ఉద్యోగాలకోసం చెన్నపట్నంవచ్చి స్థిరపడడం జరిగింది. ఇది ఇలాఉండగా, మౌంటు రోడ్డుకు ఇరుప్రక్కల ఉన్న తెలుగు భూస్వాములు, జమీందారులు తమ భవనాలను, ఆవరణలను అమ్మివేసుకొనడం మొదలు పెట్టారు. ఈ విధంగా జరిగి జరిగి, 1937 నాటికి పట్నంలో తెలుగువారి జనాభా తగ్గనారంభించింది.

చెన్నరాష్ట్రంలో, చెన్నపట్నంలో నూటికి 25 వంతులైనా, అంటే మూడు, నాలుగు లక్షలమందైనా ఆంధ్రులు ఉండేవారు. అలాగునే మిగిలిన దక్షిణజిల్లాలలో నూటికి 15 వంతులు ఆంధ్రులే ఉండేవారు. అందుచేత కోస్తా జిల్లాలలోను, రాయలసీమ జల్లాలలోను ఉన్న ఆంధ్రులే వీరి మద్దతుతో చెన్నరాష్ట్రం పరిపాలన తమ చేతులలో ఎప్పుడూ ఉంచు కోవలసింది. కాని, ఏ కారణంచేతనో ఆంధ్రులు వే రయితేనే అభివృద్ధిపొందే అవకాశం ఉందిగాని, ఉమ్మడి రాష్ట్రంలో మనం సగంపాలు ఉన్నా మనకు తగు అవకాశాలు లేవు; మన ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధికావడానికీ అవకాశాలు లేవు - అన్నభావం మన తెలుగు నాయకులలో గట్టిగా ఏర్పడింది. బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు ప్రత్యేకంగా విభజించగానే ఈ భావం గట్టిపడింది. మనకు ఉత్తరంగాఉన్న ఒరిస్సావారు బీహారునుంచి విడిగా తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆందోళన చేసేవారు. బొంబాయిలో, సింధు చిన్న భాగంగా ఉండేది. అందుచేత ఆ ప్రజలు తమకు విడి రాష్ట్రం కావాలని ఆందోళన మొదలుపెట్టారు. ఆంధ్రరాష్ట్రం కావాలా వద్దా అన్న ప్రశ్న తెలుగునాయకులను అయిదారేండ్లపాటు వేధించింది. మండలా భివృద్ధికై కొన్ని మండల సభ లేర్పరచడం, తర్వాత అన్ని మండలాల సభలు కలిసి ఏకంగానే పెద్ద ఆంధ్రసభ కావాలనే వాంఛ వెలిబుచ్చేసరికి, మొదట అఖిలాంధ్ర సభ ఒకటి 1912 లో ఏర్పాటయింది. అందులో మొదటి ఎజెండాలో ఆంధ్రరాష్ట్రం ప్రత్యేకపరచాలన్న విషయం లేదు. కాని, దేశబాహుళ్యంలో ప్రత్యేకాంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయక తప్పదన్న వాతావరణం బలపడింది. ప్రకాశంగారు మొదట ఈ విషయమై సందిగ్ధంగా ఉన్నా, 1913 లో బాపట్లలో సమావేశమయిన మొదటి ఆంధ్రమహాసభలో మాత్రం అభిరుచి హెచ్చుగా చూపించారు. అప్పట్లో ఆయన పెద్ద న్యాయవాదిగా ఉండేవారు. అప్పటినుంచి ఆయన ప్రతి ఆంధ్ర మహాసభలోను ప్రముఖ పాత్ర వహించేవారు. ఇంతలో 1917 ఏప్రిల్‌లో తెలుగుజిల్లా లన్నింటికి రాష్ట్రకాంగ్రెస్ కమిటీ ప్రత్యేకంగా ఉండాలని ఏర్పాటయింది, ఆ ఏడే మరొక ఆరు నెలల తర్వాత సింధుకు కూడా ప్రత్యేక రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఉండాలని తీర్మానమయింది. ఈ ఏర్పాట్లతో ప్రత్యేకంగా ఆంధ్రరాష్ట్రం కావాలా, వద్దా అన్న సందేహాలన్నీ నశించాయి. తర్వాత గాంధీగారి నాయకత్వం క్రిందికి దేశమంతా రావడమూ, కాంగ్రెస్ సందేశం దేశం మూలమూలలకు తొందరగా వ్యాపించడమూ, జరిగి జాతీయభావం పెంపొందింది. భాషలను అనుసరించి, వివిధ రాష్ట్రాలుగా దేశమంతా విభజన చేయడం జాతీయ భావము పెంపుదలకు, స్వాతంత్ర్య సమరం శాస్త్రీయంగా నడపడానికి దోహదం చేసింది. ఒక భాషాప్రాంతంవారికి మరొక భాషా ప్రాంతీయులపై విద్వేషం కాని, ఒక రాష్ట్రంవారు రెండో రాష్ట్రంలో ఉద్యోగ వర్తక వ్యాపారాలు చేసుకోకూడదన్న భావాలు ఆనాటి ఉద్యమంలో భాగాలుగా లేవు. ప్రాంతీయులకు ఉద్యోగాలు ఇవ్వవలసిన దన్నది పునాది సూత్రమే. అయినా, ఆ రోజులలో భాషావిద్వేషం లేదు. అందుచేత కాంగ్రెస్ ప్రచారం కోసం దేశాన్ని భాషారాష్ట్రాలుగా విభజించి, ఆ సూత్రంపైనే దేశ స్వాతంత్ర్యం లభిస్తే దేశంలో రాష్ట్రాల పునర్విభజన జరుగుతుందని - కాంగ్రెస్ అనేకసార్లు వాగ్దానం చేసింది.

1938 లో మొదటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30-3-1938 న లెజిస్లేటివ్ అసెంబ్లీలోను, 31-3-38 న కౌన్సిల్‌లోను ఒక తీర్మానం పాసు అయింది. దాని సారాంశము ఇది. చెన్న రాష్ట్రంలో గల తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ ప్రాంతాలు ప్రత్యేక పరిపాలనా రాష్ట్రాలుగా ఏర్పాటుచేయడానికి బ్రిటిషు ప్రభుత్వం వారిని కోరవలసిందని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సిఫారసు చేయడానికి తీర్మానించ బడింది. ఇంగ్లండులో ఉన్న ఇండియా కార్యదర్శికి యీ తీర్మానం అంద జేయవలసిందిగా కోరుతూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఈ తీర్మానం పంపబడింది. ఆ సమయంలో చెన్నరాష్ట్ర ప్రభుత్వంవారు వ్రాసిన ఉత్తరంలో - అన్ని పరిస్థితులు అవగాహన లోనికి తెచ్చుకుని గవర్నమెంటువారు చెన్నరాష్ట్రాన్ని భాషాప్రాంతాలనే ప్రత్యేక పరిపాలనా రాష్ట్రాల క్రింద విభజించవలెనన్న సూత్రం ప్రభుత్వం అంగీకరిస్తున్నదని వ్రాశారు. అయితే ఇంగ్లండులో హౌస్ ఆఫ్ కామన్స్ సభలో కేరి అనే సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఇండియా కార్యదర్శి, ఇలా చెప్పాడు: "ఇండియాలో రాష్ట్రాలన్నీ భాషాప్రయుక్తంగా నిర్మాణం కావాలన్న కోరిక ఇండియాలో కలదని బ్రిటిషు గవర్నమెంటుకు తెలుసు." దానిపైన ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానంగా కొత్తరాష్ట్రం ఏర్పాటుచేసే అధికారం చక్రవర్తిదని చెప్పారు. అంతేకాక, ఇండియా కార్యదర్శియైన జెట్‌రెండ్ అప్పట్లో నూతనంగా రాష్ట్ర విభజన, పునర్నిర్మాణం జరగడం ఇండియాకు మంచిది కాదని బ్రిటిషువారి అభిప్రాయం అని చెప్పారు. కామన్స్ సభలో యిచ్చిన యీ జవాబులు డిల్లీ గవర్నమెంటుకు చేరి, అక్కడినుంచి చెన్న రాష్ట్రపు గవర్నమెంటుకు అందగా, ఆ ఫైలుపైన 21-5-1938 నాడు రాజాజీ, "ప్రస్తుతం దీనిపై మనం చేయగల్గినదేమైనా ఉందా? ఇండియా కార్యదర్శి యిచ్చిన ప్రకటన వల్ల మనం వెనుకకు తగ్గవలసిన అవసరం లేదు. నాకు ముందడుగు వేయాలని ఉన్నది," అని వ్రాశారు. దానిపై 26-5-38 న గవర్నరు ఎర్‌స్కిన్ తన అభిప్రాయం వ్రాస్తూ, "ఏప్రిల్ 21 నాటి పదవ నెంబరుగల ఉత్తరం ద్వారా ఇండియా కార్యదర్శికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మన శాసన సభా, శాసన మండలి తీర్మానాలను పంపారు. ఇండియా కార్యదర్శి ప్రత్యుత్తరం వచ్చే వరకు వేరేపని చేయడం నిలుపుల చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇండియా కార్యదర్శిని ఈ క్షణంలో జాబులతో బాంబు చేయడంవల్ల ప్రయోజనం లేదు," అని వ్రాశారు.

ఇలా ఉండగా, ప్రకాశంగారు బందరు వెళ్ళినప్పుడు అక్కడి మునిసిపాలటీవారు ఆయనకొక స్వాగత పత్రం ఇచ్చారు. అందులో ఆంధ్రరాష్ట్ర ప్రసక్తి ఉంది. దానిపై 5-8-38 న ప్రకాశంగారు "రాబోయే కాబినెట్ మీటింగులో ఏమి చేయగలమో ఆలోచించాలి. ప్రజల మనసులో ప్రత్యేకాంధ్రరాష్ట్ర వాంఛ బలంగా ఉంది," అని వ్రాశారు. దానిపైన రాజాజీ "ఇంకా ఏం చేయాలి?" అన్న మాట కలిపారు. అంటే చేసేదేమీ లేదని ఆయన భావము. 14-7-38 న ఇండియా కార్యదర్శి నుంచి చెన్నరాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం వచ్చింది. 11/F, 18/53/38-జీ.పి. - 7 మే, 7 జూలై తేదీలలో వీరు వ్రాసిన ఉత్తరాలు, వాటితో పొందుపరచిన మార్చి 30, 31 తేదీల శాసన సభా మండలి తీర్మానాలు పంపిస్తూ, చెన్నరాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాలు అందినట్టూ, అయితే వీరు వ్రాసిన మొదటి ఉత్తరం అందిన తర్వాత హవుస్ ఆఫ్ కామన్స్‌లో ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చే సందర్భంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు విషయమై బ్రిటిషువారి అభిప్రాయం వివరించడం జరిగిందనీ, ఆ జవాబు దీంతోబాటు పంపుతున్నామనీ, కొత్త రాష్ట్రాల ఏర్పాటు భారత దేశానికి మంచిది అన్న వీరి అభిప్రాయంతో ఏకీభవించ లేనందుకు చింతిస్తున్నట్టూ వ్రాశారు. ఇది జరిగిన పిదప, చెన్నరాష్ట్రం కాబినెట్‌లో మరొక విషయం జరిగింది. తెలుగు జిల్లాలకు ప్రత్యేక పరిపాలనా యంత్రం, మిగిలిన జిల్లాలకు వేరే పరిపాలనా యంత్రం ఏర్పాటుచేసి, ఈ రెండింటికి తానే గవర్నరుగా ఉండి కార్యకలాపాలు నడిపిస్తాననే ఎర్‌స్కిన్‌గారి అభిప్రాయం చర్చింప బడడమూ, అలా కావాలనే కాబినెట్ ఒక తీర్మానం వ్రాసిందనే విషయమూ, అది ఇండియా కార్యదర్శికి పంపబడిన విషయమూ దేశంలో అందరికీ తెలిసింది.

1941 డిసెంబరులో జైలునుంచి వచ్చిన ప్రకాశంగారు విశాఖ ఆంధ్ర మహాసభలో బాంబువంటి ఒక మాట బయలుపెట్టారు. అప్పుడు అలా పంపిన ఆ విషయానికి చెన్నరాష్ట్రంలో అధికారం గల పెద్దలు కొందరే వ్యతిరేకులై, ఇండియా కార్యదర్శికి అధికార రీత్యా ఉత్తరం వ్రాయడంచేతే ఆ కార్యదర్శి ఏ పనీ చేయలేదని వెల్లడించారు. ప్రకాశంగారు ఎవరి పేరూ చెప్పకున్నా, అలా చేసింది రాజాజీ అని అర్థం చేసు కుని ప్రకాశంగారు ఆయనను నిందించినట్లు పత్రికలు వార్తలు ప్రకటించాయి. దానిపై రాజాజీ యిది అబద్దమని ప్రకాశంగారిపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు. తాము ఎవరి పేరూ చెప్పలేదు గనుక, తమకా బాధ్యత లేదని ప్రకాశంగారు జవా బిచ్చారు. కొంత కాలానికి డాక్టర్ పట్టాభి సీతారామయ్యగారు రాజాజీ వ్రాసిన ఉత్తరాలను తాము చదివినట్టు ప్రకటించగా, ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా తామలా వ్రాయలేదని రాజాజీ ప్రకటించారు.

ఇంగ్లండు వెళ్ళి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫీసులో, రాఘవేంద్రరావు (కౌన్సిల్ మెంబరు) వ్యతిరేకంగా ఉన్న ఉత్తరం చూపగా, ప్రకాశంగారికి ఆ విషయం అందజేసిన వ్యక్తి, దాన్ని పురస్కరించుకుని ప్రకాశంగారు మాట్లాడి తగవులో పడ్డప్పుడు - అవును, కాదు అని ఏమీ అనకుండా మౌనంగా ఉండిపోవడంవల్ల, ఆ ఉత్తరంయొక్క గ్రంథకర్తృత్వము, ఉద్దేశము మొదలైనవి యిప్పటి వరకు, లోకానికి తెలియవు.[2]పట్టాభి సీతారామయ్యగారు కూడా ఆ ఉత్తరంలో ఉన్న వివరాలుగాని, దాని కర్త పేరుగాని - తన ప్రకటనలో బయట పెట్టలేదు.

'క్విట్ ఇండియా' ఉద్యమం వచ్చిన తరువాత జరిగిన జనరల్ ఎన్నికల పిదప ప్రకాశంగారు చెన్నరాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, సంవిధాన సభ (Constituent Assembly) లో సభ్యులుగా ఉండడం జరిగింది. ఆ సందర్భంలో వారూ, దుర్గాబాయిగారు, అనంతశయనం అయ్యంగారుగారు, రంగాగారు కలిసి, ఆంధ్రరాష్ట్రం పేరు సంవిధానం ముసాయిదాలో రాష్ట్రాల జాబితాలో చేర్చవలసిందని కోరగా, ఆ ముసాయిదాలో మొదట ఆ పేరు చేర్చడ మయింది. అయినప్పటికీ, సంవిధాన సభవారు నివేదిక ప్రకటించి నపుడు, ఆ పేరు మినహాయింప బడింది. రాష్ట్రాల నిర్మాణంలో కావలసిన పూర్వరంగ కార్యక్రమంగా ఏ యే జిల్లాలు ఒక రాష్ట్రంలో చేరవలెనో నిర్ణయమై ప్రకటింపబడాలి. అలా జరగకుండానే ఆంధ్రరాష్ట్రం పేరు జాబితాలో కలిపితే - అది మిగిలిన రాష్ట్రాలవలె రాష్ట్రంగా నడుచుకొనే అవకాశం లేనందువల్ల ఆ పేరు తీసివేయడమైందని ఆ నివేదిక పేర్కొనింది. తరువాత యీ ఆంధ్ర రాష్ట్రం విషయమై 1952 లో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ప్రాయోపవేశం చేశారు. ఈ స్థితి కలగడానికి కారణం - మొదట కాంగ్రెస్ వర్కింగ్ కమిటీవారు భాషారాష్ట్రాలు స్వాతంత్ర్యానంతరం ఏర్పాటు చేస్తామని చేసిన తీర్మాన, వాగ్దానాలకు ప్రధానమంత్రి నెహ్రూ వ్యతిరేకంగా ఉండడం వల్ల, అటువంటి ఏర్పాట్లకు ఎటువంటి పూర్వ కార్యక్రమం జరగకపోవడమే, భాషారాష్ట్రాలకు ప్రధానమంత్రి వ్యతిరేకు లన్న సంగతి తెలిసే సరికి, రాష్ట్ర విభజన ఉద్యమం కుంటుపడింది. విభజనకు గల అభ్యంతరాలు బలపడ్డాయి. భాషా విద్వేషాలు పెరగ నారంభించాయి. ఈ ప్రభావం, 1946 లో ప్రకాశంగారు ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడుకూడా బాగా తల యెత్తింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే, ఆయన మంత్రివర్గంలోని పి. డబ్ల్యూ. డి. మంత్రిగారు - చెన్నపట్నం మొదలుకొని ఉత్తరంగా తడ వరకు, నూటికి 75 నుంచి 95 శాతందాకా తెలుగు ప్రజలున్న గ్రామాల పేర్లను అరవ అక్షరాలతో వ్రాయించడం మొదలు పెట్టారు. మైలు రాళ్ళమీద అరవ అంకెలు చెక్కించ నారంభించారు.

చెన్నపట్నంలో 'పాపయ్య వీధి' అని ఒక వీధి ఉండేది. ఆ పాపయ్య తూర్పు ఇండియా కంపెనీవారి పరిపాలనా కాలంలో - తెలుగు, ఇంగ్లీషు దుబాసి (ద్విబాషి) గా ఉండేవాడు. ఆయన ఇంటిపేరు 'అవధానం వారు'. ఆ వీధి పేరు ఇంగ్లీషులో పాపయ్య స్ట్రీట్ అని వ్రాసి ఉండగా, ఈ తగాదాలు బలమైనపుడు పాపయ్య అన్న మాటకు చివర "ర్" అన్న అక్షరం ఒకటి చేర్చి, 'పాపయ్యర్ వీధి'గా మార్చారు, రెండువందల సంవత్సరాలపాటు తెలుగు నేర్పూతూ ఉన్న ఎన్నో స్కూళ్ళలో తెలుగు క్లాసులు మూసివేయబడ్డాయి. అయితే, ప్రకాశంగారికి తెలుగు నాయకులే వ్యతిరేకంగా ఉండడంచేత ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటికీ, ఇటువంటి అవకతవకలను బలంగా అడ్డడానికి సత్తువలేకపోయింది. ఇటువంటి పరిస్థితులలో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు, ఆంధ్రరాష్ట్రం ప్రత్యేకంగా కావాలనీ, అందులో చెన్నపట్నమూ చేర్చబడాలనీ ప్రాయోపవేశం చేశారన్న మాట అందరికి తెలిసిందే. ఆయన శానిటరీ ఇన్స్పెక్టరుగా ఉండి, సహాయ నిరాకరణోద్యమంలో ఆ పదవికి రాజీనామా ఇచ్చి, గాంధీగారి ఆశ్రమంలో చేరిన గాంధీవాది. ఆయన, ప్రభుత్వ కార్యాలయాలున్న కోటగుమ్మంవద్ద ప్రాయోపవేశం ఆరంభించగా, బులుసు సాంబమూర్తిగారు ఆ స్థలం మంచిది కాదని, ఆయనను తమ యింటికి తీసుకుపోయి, ఆ దీక్షాభంగం జరగకుండా తగిన ఏర్పాట్లు చేశారు. ప్రాయోపవేశం మాన్పించడానికి మారుగా - ప్రకాశంగారు, సాంబమూర్తిగారు ఆయన మంచంమీద కూచుని, ఆయన దీక్షను, పట్టుదలను హెచ్చుచేసి, ఆయన మరణానికి కారకులవుతున్నారని ఆంధ్ర వ్యతిరేకులు, మంత్రులు పలు విమర్శలు ప్రారంభించారు. ఏమైనా, అప్పటి ముఖ్యమంత్రి రాజాజీ మాత్రం ఉపవాస దీక్షలో ఉన్న శుద్ధ గాంధీవాది శ్రీరాములుగారిని ఒక్క మారైనా వచ్చి చూడలేదు. చివరకి ఆయన ప్రాణంపోయిన తరువాత కూడా - దహనానికి ముందుగాని, దహన సమయంలోగాని రాజాజీ రాలేదు; చూడలేదు; 'అయ్యో పాప' మని మాటయినా అనలేదు. బహుశా, అది రాజనీతి సంబంధమైన మౌనమేమో? యాభై రోజులు అలా ఉపవాసం జరిగేసరికి దేశంలో పెద్ద అలజడి ప్రారంభమయింది. యాభై ఎనిమిదో రోజున ఆయన దేహ త్యాగం చేసి, స్వర్గస్థులైనారు. దాంతో - తెలుగు జిల్లాలలో అనేక చోట్ల రైళ్ళను ఆపివేయడం, రైలు పట్టాలు తెగగొట్టడం, స్టేషన్లు కాల్చడం మొదలయిన అల్లర్లు కాల్పులు చాలా హెచ్చయినాయి. అయినా, అల్లరికి జడిసి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయనని ప్రధానమంత్రి కఠినంగా చెబుతూ వచ్చారు. చివరకు, 1953 వేసవికాలం తరువాత చెన్నపట్నం, బళ్ళారి మినహాయించి, మిగిలిన తెలుగు ప్రదేశాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి నెహ్రూగారు అంగీకరించడం, సెప్టంబరు నెలలో ఈ విషయమై ఒక ప్రత్యేక సంఘం ఏర్పాటు కావడం, అక్టోబరు 1 నాడు నూతనాంధ్ర రాష్ట్రానికి కర్నూలులో నెహ్రూగారే ప్రారంభోత్సవం జరిపించడం మొదలైన విషయాలు ముందు వివరిస్తాను. ఇక్కడ, ఆంధ్రరాష్ట్ర అవతరణ విషయం క్లుప్తంగా చెప్పడమైనది.

  1. ఈ కేరళ మిత్రు డిప్పుడు కేరళ శాసన సభకు అధ్యక్షుడుగా ఉన్నారు.
  2. నేను ఆ వ్యక్తిని - ప్రకాశంగారి జీవిత చరిత్ర వ్రాసే సందర్భంలో, ఆ ఉత్తరం విషయం తెలియజేయ గలరా అని ప్రార్థించగా, ఆయన ఇంతకాలమైనాక రాజాజీ మనసుకు ఎందుకు నొప్పి కలుగ జేయాలంటూ, తన పేరును ఈ వివాదంలోకి తీసుకు రావద్దని చెప్పడంవల్ల, వారికి నేనూ, నాకు వారూ వ్రాసిన ఉత్తరాలు ఇందులో పొందుపరచడంలేదు. అవి ప్రచురించ వలసిందిగా పాఠకు లెవరూ నన్ను నిర్భంధించరని ఆశిస్తున్నాను.