నా జీవిత యాత్ర-4/1946 ఎన్నికలు - రాష్ట్రనాయకత్వ వివాదము
12
1946 ఎన్నికలు -
రాష్ట్రనాయకత్వ వివాదము
1946 లో అనుకున్న ప్రకారమే ప్రపంచ మహా యుద్ధం అంతం కావడంవల్ల దేశంలోగల రాష్ట్రాలన్నిటిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1935 ఆక్టు ననుసరించి ఎన్నికలు జరిగాయి. తెలుగు ప్రాంతంలో హెచ్చయిన తగాదాలేవీ లేకుండా అభ్యర్థులను నిర్ణయించగలిగాము. తమిళ ప్రాంతంలో - ఇదివరలో చెప్పినట్టు, అసఫ్ అలీ వగైరాలు చేసిన ఏర్పాటు మేరకు రాజాజీ వర్గంవారు, తక్కినచోట్ల కామరాజ్‌వర్గంవారు అభ్యర్థులుగా నిలుచున్నారు. చెన్నరాష్ట్రంలో గల నాలుగు భాషల ప్రాంతాలలోను, ఏవో రెండు ప్రత్యేక నియోజకవర్గాలలో తప్ప, తక్కిన అన్నిచోట్లా కాంగ్రెసు అభ్యర్థులే సంపూర్ణంగా విజయం సాధించారు. ముస్లిమ్‌లీగుకు ఏర్పాటయిన స్ఠలాలను వారే గెలుచుకున్నారు. నూట నలభైయారు నియోజక వర్గాలలో పై చెప్పినట్టు కాంగ్రెసువారే గెలుచుకున్నారు.
ఆంధ్రా ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులయిన ప్రకాశంగారూ, తమిళ ప్రాంత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కామరాజ్‌నాడారు గారూ, కేరళ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కె, మాధవమేనోన్‌గారూ అప్పటికి కలసి మెలసి ఏకంగా ఉండేవారు.
ఎన్నికల తరువాత కాంగ్రెసు శాసన సభ్యులు తమ నాయకుని, అనగా కాబోయే ముఖ్యమంత్రిని ఎన్నుకోవలసిన ఘట్టం వచ్చింది. లోగడ 1939 లో కాంగ్రెసు మంత్రివర్గాలు రాజీనామా చేసినపుడు, అవసరమైతే శాసన సభ్యులను సమావేశ పరచడానికి కన్వీనరుగా నియమింపబడిన మాజీ పార్లమెంటరీ కార్యదర్శి భక్తవత్సలం గారు, పై ముగ్గురు కాంగ్రెస్ కమిటీల అధ్యక్షుల అనుమతితో, ఏప్రిల్ 7 న హిందీ ప్రచార సభ హాలులో కాంగ్రెసు శాసన సభ్యుల సమావేశం జరుగుతుందని నోటీ సిచ్చారు.
ఈ లోపున, నలుగురు కాంగ్రెసువాదులు చెన్నరాష్ట్ర శాసన సభా నాయకత్వ విషయమై సర్దార్ వల్లభాయి పటేల్‌గారితో చెప్పుకోడానికి బొంబాయి బయలుదేరారు. ఆ నలుగురూ ఆంధ్రులే. ఈ వార్త పత్రికలలో చూసి, నేను ఒక ప్రకటన చేశాను. అందులో "పై విధంగా నలుగురు ఆంధ్రులు పటేలుగారి దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళి ఉండాలి. ఆంధ్ర ప్రాంత శాసన సభ్యులకు వారెంత మాత్రమూ ప్రతినిధులు కానేరరు. చెన్నరాష్ట్ర శాసన సభ్యులకు స్వేచ్చగా తమ నాయకుని ఎన్నుకొనే హక్కుంది. పరోక్షంగాగాని, అపరోక్షంగాగాని ఎవరైనా వారిని నిర్బంధిస్తే, వారి హక్కులకు భంగం కలుగుతుంది," అని పేర్కొన్నాను. ఇలా ప్రకటించినట్టు నేను ప్రకాశంగారికి చెప్పలేదు.
ఇక్కడి నాయకత్వానికి భంగం కలిగించేందుకు నలుగురు ఆంధ్రులు పటేలుగారి దగ్గరికి వెళ్ళినట్టు వార్త తెలిసేసరికి, వాతావరణంలో ఒక ఉద్రిక్తత ఉద్భవించింది. రాష్ట్రం నాలుగు మూలలనుంచి ప్రకాశంగారిని నాయకుడుగా ఎన్నుకోవలెననే తీర్మానాలతో, జిల్లా కాంగ్రెసు సంఘాలు తమ ఆమోదాన్ని ప్రకటించాయి, ఆలాగునే కొన్ని కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రకాశంగారికి శాసన సభ నాయకత్వం అప్పజెప్పాలన్న తీర్మానాలు చేసి ప్రకటించాయి.
అడుగడుగునా అడ్డంకులు
ఇలా ఉంటుండగా, ఏప్రిల్ 6 న కాంగ్రెసు అధ్యక్షులయిన మౌలానా అబుల్ కలాం అజాద్‌గారినుంచి, ఏప్రిల్ 7 నాటి సభ ఆపుదల చేయమనీ; ఆంధ్ర తమిళ కేరళ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు ఢిల్లీలో తమ్ము కలుసుకోవలసిందనీ - తంతివార్త వచ్చింది. ప్రజా రాజ్యానికి మొట్టమొదటి మెట్టులోనే హంసపాదు వచ్చింది. ప్రజా రాజ్యం కావాలనే సంస్థ ఈ విధంగా నూతన కార్యపద్ధతిని ప్రారంభించింది. "ఇది చాలా తప్పు. మనం ఢిల్లీ వెళ్ళగూడ"దని నేను ప్రకటించాను. కాని, చెన్నరాష్ట్రంలో ఇతర భాషా ప్రాంతీయులైన కాంగ్రెసు వాదు లుండడంచేతా; వారు మంచి అయినా, చెడు అయినా కూడా కాంగ్రెసు అధిష్ఠాన వర్గాన్ని ఎదుర్కొనే లక్షణం లేనివారు కావడంచేతా; వారితో కలయిక అవసరమూ, కార్యసిద్ధికి మార్గమూ కావడంచేతా ప్రకాశంగారు కూడా మెత్తబడ్డారు.
ఏప్రిల్ 7 న ఆంధ్ర ప్రాంత కాంగ్రెసు శాసన సభ్యులందరు త్యాగరాయనగరులో సమావేశమయ్యారు. ప్రకాశంగారు - ఆజాద్‌గారి నుంచి వచ్చిన తంతి విషయం ముచ్చటించి, ఆ తంతిలోని ఆదేశాన్ని పటేల్‌గారు కూడా అంగీకరించి ఉన్నారని చెప్పి, ఇంకా ఇలా అన్నారు.
"ఉత్తర ప్రత్యుత్తరాల మూలంగా కన్నా, ముఖాముఖి ఇటువంటి విషయాలు తేల్చుకోవడం మంచిది. భేదాభిప్రాయాలన్నవి ప్రపంచంలో గల అన్ని సంస్థలలోను వస్తూంటాయి. అలాగే, మన చెన్నరాష్టంలో కూడా వచ్చాయి. మానవ సంఘంలో ఇలాంటివి తప్పవు. అయితే, వాటిని సర్దుబాటు చేసుకోవడమన్నది ప్రాజ్ఞుల లక్షణము. ఆంధ్రుల మధ్య, ఇదివరలో పరస్పర భేదాభిప్రాయాలు అనేకసారులు వచ్చాయి. అవి సర్దుకుంటూ వచ్చాము. ఇప్పుడు కూడా మనము ఏకమై ఉండాలి. ఈ తంతి పంపినది. ఆజాదుగారయినా, నిజానికి ఈ పిలుపు మహాత్మాజీ దగ్గరనుంచి వచ్చిందని భావించాలి. అందుచేత, మన మీ కార్యాన్ని సర్దుకొనేందుకు కొంత గడువు తీసుకొని, తిరిగి 15 వ తేదీన సమావేశ మౌదాము."
ఢిల్లీలో గాంధీగారివద్ద...
కథా రంగం చెన్నపట్నం హిందీ ప్రచార సభా మందిరంనుంచి ఢిల్లీలో భంగీకాలనీకి మారింది. ఇక్కడి కాంగ్రెసు అధ్యక్షులు ముగ్గురూ గాంధీగారిని సందర్శించడానికి భంగీకాలనీకి వెళ్ళారు. వెళ్ళిన క్షణం నుంచి వారు గాంధీగారి నోటివెంట విన్నది ఒక్కటే మాట. అది -
"మీరు రాజాజీని నాయకునిగా ఎన్నుకోవలసింది. ఎన్నుకోండి!"
లోగడ, దక్షిణ భారత హిందీ ప్రచార సభ రజతోత్సవ సభలో, ఆయన రాజాజీ ప్రసక్తి తీసుకురాగా, సభలో ఎవరో లేచి - "మీరు రాజాజీని ముఖ్యమంత్రి చేయడం కోసమే ఇప్పుడిక్కడికి వచ్చి ఉన్నారా?" అని గట్టిగా అడిగారు. దానికి జవాబుగా గాంధీగారు, "ఆ పనికైతే నే నింత దూరం రావలెనా? తలచుకొంటే ఢిల్లీలోనే ఒక క్షణంలో ఆ పని చేయగలను," అని అన్నారు. ప్రశ్న, జవాబూ అప్పటి పత్రికలలో పెద్ద అక్షరాలలో పడినాయి. భంగీకాలనీలో ఆయన రాజాజీని ఎన్నుకోమని చెప్పిన మాటను, హిందీ ప్రచార సభలో చెప్పిన మాటను మనము సమన్వయించుకోవచ్చు.
కాంగ్రెసు అధ్యక్షులు ముగ్గురితోనూ రాజాజీని ఎన్నుకోమని గాంధీజీ చెప్పగా, కామరాజ్‌గారు 'అది కుదర'దని వెంటనే తమిళంలో చెప్పారు. మాధవ మేనోన్‌గారు దాన్ని ఇంగ్లీషులోకి అనువదించారు. అయినా, మహాత్మాజీ అంతటితో ఊరుకోలేదు. చెన్నపట్నం వెళ్ళి, శాసన సభ్యుల సమావేశంలో రాజాజీ పేరు ఒక్కటే ప్రతిపాదించి, అందుకు అనుకూల, ప్రతికూల సభ్యుల సంఖ్యలను తమకు తెలియ జేయవలసిందనీ; మిగిలిన కార్యక్రమం తరువాత నిశ్చయింపవచ్చనీ ఆయన ఆదేశించారు. ప్రజారాజ్యపు అధిష్ఠాన దేవత ఒక్క చిరునవ్వు నవ్వింది.
శాసన సభ్యుల సమావేశము
ఏప్రిల్ 18 న తిరిగి శాసన సభ్యులందరు గిరిగారి అధ్యక్షతన హిందీ ప్రచార సభా మందిరంలో సమావేశం కావడం జరిగింది. అంతలో కాంగ్రెసు అధ్యక్షులయిన ఆజాద్‌గారినుంచి ఒక తంతి వచ్చింది. అందులో ఉన్న విషయాలివి:
"18 వ తేదీన జరిగే పార్టీసభకు వచ్చే శాసన సభ్యులకు ఈ సందేశం అందజేయవలసింది -
"పరిస్థితులన్నీ చక్కగా ఆలోచించి, సి. రాజగోపాలాచారిగారిని మీ నాయకునిగా ఎన్నుకోవలసిందని ఇందు మూలంగా నేను సలహా ఇస్తున్నాను. ఈ సలహా ఇవ్వడంలో మహాత్మాగాంధీగారు, వల్లభాయి పటేలుగారు నాతో ఏకీభవిస్తున్నారు. ఈ సలహా మీ నెత్తిపైన రుద్దుతున్నామని భావించవద్దు. మీలో బహుసంఖ్యాకు లయిన సభ్యులకూ మా సలహా పాటించడానికి ఇష్టం లేకపోతే, అట్టివారు తోచినవిధాన తీర్మానించుకోవచ్చు. అయితే, ఆ భాధ్యత వారిదే అయిఉంటుంది."
అంతకు ఏడేండ్ల ముందు గాంధిగారికి ఇష్టంలేకుండా సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్ అధ్యక్షుడయినప్పుడు - ఈ విధంగానే బోసు తన స్వంత బాధ్యతపైనే కార్యవర్గం ఏర్పాటు చేసుకోవాలని చెప్పడమూ, ఆయన అధ్యక్షపదవి వదిలిపెట్టడమూ జరిగినవి. ఈ విషయంలో ప్రకాశంగారు, నాడారు మొదలైనవారికి ఈ బాధ్యత తగిలింది తర్వాత - ప్రకాశంగారు, నాడారుగారు, మాధవ మేనోన్‌గారు, భక్తవత్సలంగారు గ్రాండ్‌ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి ప్రయాణమై వెళ్ళారు. తెలుగు జిల్లాలలో - ఆ బండి ఆగిన ప్రతిస్టేషనువద్ద వేలకొద్ది ప్రజలు గుమిగూడి ప్రకాశంగారికి, నాడారుగారికి జయజయ ధ్వానాలు పలికారు.
చెన్నరాష్ట్రంలో శాసన సభా నాయకత్వాన్ని గూర్చి ఉయ్యాలలు అటూ ఇటూ ఊపుతూంటే, ఇంగ్లండులో హవుస్ ఆఫ్ కామన్స్‌లో ఒక సభ్యుడు ఈ విషయం ప్రస్తావిస్తూ, మన దేశాన్ని ఈ విధంగా హేళన చేశాడు:
"ఇండియా దేశము: స్వరాజ్యం కావాలని కోరుకున్న ఈ సమయంలో - చెన్నరాష్ట్రంలోని కాంగ్రెసువారు తమ నాయకుని ఎన్నుకోలేకుండా నాయకత్వవిషయమై దెబ్బలాడు కుంటున్నారనీ, సంవిధానాత్మకమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకో లేకుండా ఉన్నారనీ మన ప్రభుత్వంవారు ఇక్కడ చెప్పుతున్నారు."
ఈ మాటలు తెలిసి భారతీయులు సిగ్గుపడ్డారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీవారు మొదట ఇచ్చిన తంతితో సంతృప్తిపడలేదు. ఇచ్చిన తంతి అర్థం స్పష్టంగా లేదని సభాధ్యక్షులయిన గిరిగారు, స్పష్టీకరించమని కోరగా, వారు స్పష్టీకరిస్తూ, మరొక వాక్యం కలిపారు - "మీరు రాజగోపాలాచారిని మీ నాయకునిగా ఎన్నుకున్నట్టయితే, మంత్రివర్గంలో తనకు కావలసిన వారిని మంత్రులుగా తీసుకుని, తక్కినవారిని వదలిపెట్టే స్వేచ్ఛ ఆయనకుంటుంది" అని.
ఏప్రిల్ 17 న దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు ఒక పత్రికా ప్రకటనలో --
"శాసన సభలో తమ నాయకుని ఎన్నుకునే అధికారం అధిష్ఠానవర్గంవారు శాసన సభ్యులకే వదిలి పెట్టేశారు. పూర్వాపరములైన పరిస్థితులను ఆలోచించిన పిమ్మట మనము ప్రకాశంగారినే నాయకునిగా ఎన్నుకొనడం మంచిది. ప్రజానురాగం బహుళంగా పొందిన నాయకుడాయన," అని ఆయన ఉద్ఘాటించారు.
శాసన సభ్యుల నిర్ణయం
ఏప్రిల్ 18 న తిరిగి కాంగ్రెసు శాసన సభ్యులు సమావేశమై రెండుగంట లాలోచించి, అధిష్ఠాన వర్గంవారి సలహా అంగీకరించడమా, వద్దా అన్న ప్రశ్నను వోటుకు పెట్టగా - నిరాకరించడానికి 148 వోట్లు, అంగీకరించడానికి 38 వోట్లు వచ్చినవి. అనగా, రాజగోపాలాచారి గారికి అనుకూలంగా 38 వోట్లు, వ్యతిరేకంగా 148 వోట్లు వచ్చాయన్నమాట. ఈ విషయం ఆజాద్‌గారికి, గాంధీగారికి తంతిమూలంగా తెలియజేయడమైనది. ఆ తంతిలో తరువాతి కార్యక్రమం ఏమని సలహా ఇవ్వవలసిందని కూడా ఉంది. మరునాడు తాము తిరిగి సమావేశం అవుతున్నామనీ, ఆ లోపున అధిష్ఠాన వర్గంవారు తమ సలహాను అందచేయవలసిందనీ, ఆ సమావేశ సమయానికి ఏ సలహా అందకుంటే - తమకు తోచిన రీతిని నిర్ణయం తీసుకుంటామని గిరిగారు ఆ తంతిలో వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 20 న మూడవ పర్యాయం తిరిగీ కాంగ్రెసు సభ్యుల సమావేశం జరిగింది. రోజు రోజుకూ సమావేశం పొడిగిస్తున్నందుకు గిరిగారు విచారం వెలిబుచ్చారు. 'అయితే కాంగ్రెస్ అధిష్ఠానవర్గాన్ని గౌరవించవలె గదా!' అని అన్నారాయన.
అంతటిలో, ఆజాద్‌గారి దగ్గరినుంచి మొదటిదానికన్న వింత అయిన మరి ఒక తంతివార్త వచ్చింది. అందులో, "మీ రిచ్చిన తంతి అందింది. నాయకులుగా ఉండడానికి ఒకరి పేరే సూచించవలెననే నిర్భంధం లేదు. ఎక్కువ పేర్లు సూచించి, మాకు పంపితే, ఏదో ఒక పేరు మే మిక్కడ ఖాయం చేస్తాము," అని ఉంది. ఆ విధంగా చేయడానికి, సంవిధాన సంబంధమైన అభ్యంతరాలు పార్టీలో లేచాయని గిరిగారు ఆజాద్‌గారికి తంతి యిచ్చి, సమావేశాన్ని మళ్ళీ వాయిదా వేశారు. ఏప్రిల్ 21 న నాల్గవ పర్యాయం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోవడంచేత సమావేశం మళ్ళీ వాయిదా పడింది.
ఈ పరిస్థితుల నిలా ఉండనిచ్చి, డిల్లీలో భంగీకాలనీలో ప్రకాశంగారు, నాడారుగారు, మాధవ మేనోన్‌గారు గాంధీగారిని కలుసుకొన్నప్పుడు జరిగిన మరొకటి రెండు విషయాలు ఇక్కడ చెప్పాలి.
రాజాజీ పేరు ఒప్పుకోము అని నాడారుగారు చెప్పగా, పట్టాభిగారి విషయమేమని గాంధీగారు అడిగారట. అందుకు నాడారుగారు, "మీరు స్వయముగా వచ్చి, మనిషి మనిషినీ వోటు అడిగినా ఫలం సందేహాస్పద"మని జవాబిచ్చారట. ఈ సందర్శనమయిన తరువాత రాత్రి గాంధీగారు ప్రకాశంగారికి ఒక ఉత్తరం పంపించారు. ఆ ఉత్తరం సారాంశ మిది:
"కోర్టులో న్యాయవాద వృత్తి జరుపుతూ, ప్రకాశంగారు ప్రజాసేవ (పబ్లిక్‌వర్క్) ఎలా చేస్తున్నారని, నేను - ఒరిస్సా నుంచి చెన్నపట్నం హిందీ ప్రచార సభ రజతోత్సవానికి వస్తూండగా, రైలుబండి ఆంధ్రదేశం ప్రవేశించేముందే నాకు స్వాగతం ఇవ్వడానికి వచ్చి నాతోబాటు ప్రయాణం చేసిన రాష్ట్ర కాంగ్రెసు సంఘకార్యదర్శి కళా వెంకటరావుగారిని అడిగాను. మీరు ప్రాక్టీసు మానేశారనీ, ప్రజల సొమ్ము తిని జీవిస్తున్నారనీ ఆయన నాకు చెప్పాడు. [1] మీరు జైలులోంచి విముక్తులయిన తరువాత, బహిరంగ సభలలో ప్రజలు మీకు చందాలిస్తే, ఆ ధనం కాంగ్రెసుకు జమ కట్టక మీరు స్వయంగా వాడుకున్నారట. ఇది చాలా అవినీతికరమైన పని, అందుచేత, మీరు శాసన సభలో ఉండడానికిగాని, నాయకత్వం వహించడానికిగాని వీలులేదు. కాబట్టి, మీరు మీ యత్నం మానుకోవలసినది."
దానిపైన ప్రకాశంగారు ఇచ్చిన ప్రత్యుత్తరపు సారాంశ మిది:
"ఈ దేశంలో ప్రజాసేవ చేసేవారు జీవించడానికి రెండు పద్దతులున్నాయి. ఒకటి - ఎవరైనా గొప్పవారు అభిమానించి ఒక నిధి ఏర్పాటు చేస్తే, ఆ నిధినుంచి వెచ్చాలకు డబ్బు వాడుకునే పద్ధతి. రెండవది - ప్రజాసేవకుడికి ఎప్పటికప్పుడు ఏమి అవసరం వస్తే, దానికి సరిపోయేంత డబ్బు ప్రజలే ఖర్చు పెట్టడమో - లేక నెలకో, సంవత్సరానికో ప్రజలు అభిమానించి ఇచ్చిన డబ్బును ఖర్చు పెట్టే పద్ధతి. నాకు మొన్న వచ్చిన యాభై వేలు ప్రజలు ఈ రెండవ పద్ధతి ప్రకారం ఇచ్చినదే. "నేను రోజుకు వేయి రూపాయలు ఫీజు పుచ్చుకొని న్యాయస్థానాలలో న్యాయవాద వృత్తిసాగించి సంపాదించినపుడు కూడా, ఆ డబ్బు ప్రజాధనమనే అనుకొనేవాడిని. ఏ పద్ధతి అయినా, ప్రజాసేవకుడు వాడిన ధనము ప్రజల ధనమే."
ఈ ఉత్తరం అందేసరికి గాంధీగారికి కోపం మరింత హెచ్చినది. ఆయన శాసన సభలో ఎంతమాత్రమూ నిలుచోవద్దని ప్రకాశంగారికి ఆజ్ఞాపూర్వకంగా ఉత్తరం వ్రాసి, తమ్ము చూడవలసిందని కామరాజుగారికి కబురు పంపించారు.
ఆ సాయంకాలం నాడారుగారు ప్రకాశంగారి దగ్గరికి వచ్చి, గాంధీగారు ప్రత్యేకంగా రమ్మని కబురు పంపడం గురించి చెప్పి, "వెళ్ళవచ్చునా?' అని సలహా అడిగారు. ప్రకాశంగారు, "పెద్దవారు పిలిచినపుడు వెళ్ళవలసినదే గదా! వెళ్ళిరండి," అన్నారు. తర్వాత ఇద్దరి మధ్య వేరే సంభాషణ ఏదీ జరగలేదు.
అప్పుడు వెళ్ళిన నాడారుగారు మరి రాలేదు. ఆ మర్నాడూ రాలేదు. అంతేకాదు, చెన్నపట్నం చేరి, నాయకుని ఎన్నికలో ప్రకాశంగారికి ప్రత్యర్థిగా ఇంకొకరి పేరు ప్రతిపాదించి, ఆ ప్రతిపాదన వీగిపోయిన తరువాతవరకు ఆయన ప్రకాశంగారిని మళ్ళీ చూడలేదు.
గాంధీగారు, నాడారుల మధ్య జరిగిన విషయం తర్వాత తెలిసింది. నాడారుగారితో గాంధీగారు అన్న మాటల సారాంశ మిది:
"ప్రకాశంగారిని నాయకత్వానికి పోటీ చేయవద్దని నే నాదేశించాను, ఆయన నిల్చునేందుకు సాహసింపజాలడు.[2] ఒకవేళ ఆయన అలా సాహసించితే, మీరు మరెవరి పేరో ప్రతిపాదించి ఆయనను ఓడించవలెను."
ఇది ఇలా ఉంటూండగా, పట్టాభిగారి తరపున యత్నం జరగడం మానలేదు. గాంధీగారికి - కళా వెంకటరావు, గోపాలరెడ్డిగారు కలసి ఒక తంతి వార్త ఇచ్చారు. అందులో "మా చెన్నరాష్ట్రంలో ఉన్న పరిస్థితులనుబట్టి, పట్టాభి సీతారామయ్యగారిని నాయకునిగా ఎన్ను కొనేందుకు మీరు సలహా ఇవ్వవలసినది. పట్టాభి సీతారామయ్యగారికి కూడా చెప్పవలసినది," అని ఉంది.
గాంధీగారు, పట్టాభిగారికి ఈ విషయమై ఇచ్చిన సలహా సారాంశము:
"నువ్వు యత్నించే ముందు రాజగోపాలాచారిగారి సలహా తీసుకోవలసినది. ఆయన చిత్త స్థైర్యమందు నాకు నమ్మక మున్నది.[3] మీరు మాత్రం ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కావాలన్న భావం వదులుకోండి."
ఈ విషయాలు సూచావాచాగా పత్రికలలో పడడమేగాని, సంపూర్ణంగా సభ్యులందరికీ తెలియవు.
ఇక్కడ జరుగుతున్న గందరగోళంలో, మంత్రివర్గం సమయానికి ఏర్పాటవుతుందో, కాదో అన్న అనుమానంచేత, గవర్నమెంట్ ఆఫ్ ఇండియావారి 1935 నాటి ఆక్టు - 93 సెక్షన్‌క్రింద గవర్నరుకు రాజ్యాధికారమప్పగిస్తూ, 1939లో చేసిన ఉద్ఘోషణ (Proclamation) ను పొడిగిస్తూ 1946 ఏప్రిల్ 16 న ఒక తీర్మానం హవుస్ ఆఫ్ కామన్సులో ఆమోదమయింది.
చెన్నరాష్ట్ర నాయకుడుగా ప్రకాశంగారి ఎన్నిక
ఏప్రిల్ 23 న హిందీ ప్రచార సభా మందిరంలో, శాసన సభ్యుల సభ జరిగింది. ప్రజలిచ్చిన యాభైవేల రూపాయలు ప్రకాశంగారు ఖర్చు చేసుకోకూడదని గాంధీగారు ఆంక్ష విధించినట్టు తెలియగానే, సుప్రసిద్ధ నాయకులయిన దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు, నడింపల్లి లక్ష్మీనరసింహారావుగారు మొదలైనవారు "ఆంక్ష తొలగించకపోతే, ప్రకాశంగారికి ప్రత్యేకంగా లక్ష రూపాయలు తాము వసూలు చేసి యిస్తా"మని, పత్రికా ప్రకటనలోనూ, గాంధీగారికి ప్రత్యక్షంగా ఉత్తరంలోనూ తెలియజేశారు. అప్పటితో ఆ ప్రసక్తి ఆగింది. కాని, ప్రకాశంగారు నాయకుడుగా నిలబడగూడదన్న పట్టుదల మాత్రం గాంధీగారికి హెచ్చయింది.
ఇటువంటి పరిస్థితులలో, సాధారణ ప్రజల మనసులు అట్టుడికి నట్టు ఉడుకుతుండగా, ఏప్రిల్ 23 నాటి సభలో ప్రకాశంగారి పేరు ప్రతిపాదింపబడింది. తర్వాత మాధవ మేనోన్‌గారు ముత్తురంగ మొదలియారుగారి పేరు ప్రతిపాదించారు. డాక్టర్ పట్టాభిగారి ప్రసక్తి రానేలేదు. అపుడు జరిగిన వోటింగులో, రాజాజీ వర్గంలో ఉన్నవారిలో హరిజనులు తప్ప మరెవరూ పాల్గొనలేదు. ప్రకాశంగారు, గాంధీగారి మాటకు వ్యతిరేకంగా నిలబడడమేగాక, గెలుపుకూడా పొందారు. ధీరోదాత్త నాయకుడని అనిపించుకున్నారు. ఆంధ్రుల హృదయాలను ప్రపుల్లంచేశారు.
మర్నాడు పత్రికలలో వోటింగు భాషానుసారంగా నడచిందని వ్రాశారు కాని, అలాగు జరగలేదు.
ప్రకాశంగారు ఎన్నికయ్యారని గిరిగారు వెల్లడించిన వెంటనే, పంతులుగారు శాసన సభా నాయకుని పీఠం ఎక్కి ఇలా అన్నారు:
"యథేచ్చగా మన ఎన్నికలను మనము జరుపుకోవడానికి అవకాశం కల్పించిన కాంగ్రెసు అధ్యక్షులు ఆజాద్‌గారి రాజకీయ పరిజ్ఞానాన్ని, మనము ప్రశంసించాలి. కాంగ్రెసు అధిష్ఠాన వర్గానికి మన కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. ఈ క్షణంవరకు మనలో మనకు కలిగిన పరస్పర భేదాలన్నిటిని మనము మరిచి పోవాలి. జయాపజయాలనే భేదపుపలుకులు ఇకమీద ఉండకుండా, మనము యావన్మందిమి ప్రజలయెడల మనకున్న బాధ్యతలను, విధులను 'మనము ప్రజలకు సేవకుల'మని గ్రహించి సక్రమంగా నిర్వహించాలి."
అధిష్ఠానవర్గ ఆగ్రహము
గిరిగారు, ఎన్నిక ఫలితం యథావిధిగా కాంగ్రెసు అధిష్ఠాన వర్గానికి తంతిమూలంగా తెలియజేశారు. వారికెంత ఆగ్రహం వచ్చిందో! దేశభక్త కొండా వెంకటప్పయ్యగారు - ప్రకాశంగారు ఎన్నికయ్యారనీ, అధిష్ఠానవర్గంవారు, మంత్రివర్గం ఏర్పాటు చేయడంలో తమ సలహాను ప్రకాశంగారికి పంపించవలసిందనీ తంతివార్త యిచ్చారు. అందుకు ఆజాదుగారు ఇచ్చిన జవాబులో, "మా సలహాను ధిక్కరించి ప్రకాశంగారిని నాయకుడుగా ఎన్నుకొన్న మీ పార్టీకి, మంత్రివర్గం ఏర్పాటు విషయమై మేము ఏ సలహాను ఇవ్వదలచుకో లేదు," అని ఉంది.
అధిష్ఠానవర్గంవారు ఎంత కోపావేశంలో మునిగిపోయారో, ఆ జవాబులోగల భాష చెప్పకే చెపుతున్నది.
నాటిమొదలు నేటివరకు - కాంగ్రెసువారి ప్రజారాజ్యం ఢిల్లీ నుండి నడిపే రాజ్యమే తప్ప మరొకటి కాదు.