నా జీవిత యాత్ర-4/విశ్వాసరాహిత్య తీర్మానము

వికీసోర్స్ నుండి

22

విశ్వాసరాహిత్య తీర్మానము

అన్ని రంగాలలోను చురుకుగా ముందడుగు వేస్తున్నప్పటికి కూడా, ప్రతిపక్షంవారికి - రాష్ట్రాభివృద్ధి పైని ఆసక్తికన్న, ప్రకాశం ప్రభుత్వంపై తాము తేగలిగిన విశ్వాసరాహిత్య తీర్మాన వ్యామోహము బలీయమైనది.

చివరికి, 1954 అక్టోబరు చివరలో రెండు విశ్వాస రాహిత్య తీర్మానాలు ప్రతిపాదిస్తామని నోటీసిచ్చారు.

ఆ తీర్మానాలలో ఒకటి యిలా ఉన్నది: "ఈ ప్రభుత్వంలో విధాన సభకు విశ్వాసం లేదు." రెండవ తీర్మానం ఇలా ఉన్నది: "మద్య నిషేధంగూర్చి, రామమూర్తి సంఘం చేసిన సిఫార్సులను అమలు జరపకపోవడంచేత, ఈ ప్రభుత్వంలో విధాన సభకు విశ్వాసం లేదు."

ఇదివరకు ఒక సందర్భంలో, విధాన సభ చర్చలో ఏదైనా ఒక విషయం ఉన్నప్పుడు, ఆ విషయం ఆమోదింపబడడమో, తిరస్కరింపబడడమో, వాయిదా వేయబడడమో - ఈ మూడింట్లో ఏదో ఒకటి జరిగితేకాని, మరొక విషయం ప్రతిపాదించడానికి వీలు లేదని వ్రాశాను.

చర్చించే విషయానికి సంబంధించిన మరేదైనా అది దానికి సవరణగా చర్చకు తేవచ్చును. కాని, ప్రత్యేక విషయంగా సభ ముందుకు తేవడానికి వీలులేదు. ఈ నిబంధనలు చాలా అనుభవంపైన ఏర్పాటు చేసినవి.

అ రోజున, స్పీకరుగారు - ముందు వెనుకగా నిర్ణయాలు చేసే వారన్న విషయం ప్రతిపక్షంవారు గ్రహించి, మీద చెప్పిన రెండు తీర్మానాలూ ప్రతిపాదిస్తా మని పట్టుబట్టారు.

రెండూ - ఒకే పర్యాయం, ఒకదానికి రెండోది సవరణగా తప్ప, రెండు ప్రత్యేక ప్రతిపాదనలుగా చేయకూడదన్న అభ్యంతరం నేను ఎంత గట్టిగా చెప్పినా, స్పీకరు మామూలు పద్ధతిని, "ఏదో సంసార పక్షాన పోదాము. వోటింగు సమయంలో ఈ విషయం చూసుకొందాము లెండి" అని రెండింటిమీద ప్రత్యేక తీర్మానాలుగా చర్చ చేసుకోవచ్చు అని తన నిర్ణయం తెలిపారు. చర్చ చాలాసేపు జరిగింది. ప్రతిపక్షంవారు, ప్రభుత్వంపైన చేసే విమర్శలు అలవాటైన పద్ధతిలోనే ఆరంభమయ్యాయి. వోటింగు సమయం వచ్చేసరికి మళ్ళీ పాత చర్చ రెండు తీర్మానాలు ప్రత్యేకంగా వోటుకి పెట్టాలని ప్రతిపక్షంవారు, అలాగు వీలులేదని నేను వాదించుకోవడంలో కాలం వృథా అయిపోయింది.

"ఏ తీర్మానం ముందు వోటుకి పెట్టాలి?" అని స్పీకరుగారు నన్నడగగా - అది ప్రతిపక్షంవారికే మేము వదిలి పెట్టేశా మని, ప్రభుత్వ పక్షాన నేను చెప్పాను.

రెండు తీర్మానాలనూ ప్రతిపాదించినవారు, పైన పేర్కొన్న వాటిలో మొదటి దానిని వోటుకి పెట్టాలని అడిగారు.

ఆ మొదటి తీర్మానం సూటిగా ఉంది; అన్ని కారణాలు అందులోనే లీనమై ఉన్నవి.

వోట్లు లెక్కించగా ప్రభుత్వానికి 7 వోట్లు మెజరిటీ వచ్చింది. విశ్వాసరాహిత్య తీర్మానం ఓటమి చెందింది.

స్పీకరుగారు ఎజెండాలో ఉన్న తర్వాత అంశానికి వెళ్ళడమో, లేక సభ వాయిదా వేయడమో చేయవలసి ఉంది. ప్రతిపక్షంవారు, స్పీకరు వైఖరి తెలిసినవారు కాబట్టి రెండవ తీర్మానం వోటుకు పెట్టాలని కేకలు వేశారు - అది ఎంతమాత్రం చెల్లదని మేము ప్రభుత్వపక్షాన వాదించాము. ఓడిపోయినది - రెండవ తీర్మానంకన్నా బలమైనది; హెచ్చు విస్తారత కలది అన్నది న్యాయశాస్త్ర ప్రతిపాదితమైన సూత్రము.

అ కారణమే వారికి బలీయమని తోచిన యెడల - వారు, మొదటిదానికి రెండవదానిలో ఉన్న మాటలు సవరణగా ప్రతిపాదించి ఉండవలసింది కాని వారలా చేయలేదు. ఇంతేకాక, ఈ సమావేశం (సెషన్)లోనే - ఈ కారణం చెప్పి, గవర్నరు సంబోధనోపన్యాసానికి చేసే కృతజ్ఞతా తీర్మానంలో, 'రామమూర్తి కమిటీ సిఫార్సులు అమలుపరచలేదు కనుక చింతిస్తున్నా' మన్నమాట చేర్చాలని వారు సవరణ సూచించడము, అది ఓడిపోవడము కూడా జరిగినవి. అందుచేత, ఈ రెండవ తీర్మానాన్ని వోటుకు పెట్టడానికి వీలులేదు అన్న అభ్యంతరంకూడా మరొక శాసన సభ్యులు సహేతుకంగా చెప్పి వాదించారు.

ఏ శాసన సభా చరిత్రలోను లేని విషయం అపుడు జరిగింది. 45 నిమిషాలు మా స్పీకరుగారు అక్కడ కూచునే ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ లోపున ఎవరికి తోచింది వారు, రెండువైపులా మాట్లాడడం మొదలుపెట్టారు.

ఈ ఆలస్యం అదను చూసుకొని ప్రతిపక్ష నాయకులు, మా పక్షంలో ఉన్న నలుగురు సభ్యులను ఒకరి తర్వాత ఒకరిని చీడిలోకి తీసుకువెళ్ళి, చతురోపాయములని చెప్పిన వాటిలో రెండు, మూడు ఉపాయాలను అవలంభిస్తూన్నట్టు మాలో కొందరు కనిపెట్టారు. కాని, ఆ పరిస్థితులలో ఎవరూ ఏమీ చేయగలిగింది లేదు.

కాంగ్రెసు పార్టీలో ఉన్న ఒకరు లేచి, "మాకు ప్రభుత్వంమీద ఏమీ కోపంలేదు. కాని, సంజీవరెడ్డిగారి అహంభావానికి మా తిరస్కారం తెలియజేయడానికి విశ్వాస రాహిత్య తీర్మానానికి అనుకూలంగా తాను వోటు చేస్తున్నట్టు ప్రకటించాడు.[1]

మరి ముగ్గురు సభ్యులు, మొదటి తీర్మానానికి ప్రభుత్వ పక్షన వోటు చేసిన వారు, అయినా, ఈ రెండవ తీర్మానానికి ప్రతిపక్షానికి అనుకూలంగా వోటు చేశారు.

ఏడు వోట్లతో మొదటి తీర్మానంలో గెల్చిన ప్రభుత్వం, ఈ రెండవ తీర్మానంలో ఒక వోటుతో ఓటమి చెందింది.

ఆంధ్రరాష్ట్ర ప్రథమ ప్రభుత్వం పతనమైంది.

ప్రకాశంగారు - కొన్నాళ్ళ క్రిందట, ఎప్పుడైనా ఓడవలసి వస్తే స్పీకరుగారి తప్పుడు రూలింగు వల్లన్నే ఓడిపోతామని హాస్యధోరణిలో చెప్పిన జోష్యం నిజమైంది.

ప్రతిపక్షం వారి ముఖాలు వికసించాయి. అంతకన్న హెచ్చుగా గవర్నరు త్రివేదిగారి ముఖం వికసించిందని వెంటనే చూసినవారు చెప్పారు.

ప్రతిపక్షుల బలంవల్ల కాకపోయినా, నలుగురు స్వపక్షీయుల దొంగపోటువల్ల, అనుకోడానికి వీలులేని క్షణంలో, ప్రభుత్వం పతనమయింది.

ఈ సంఘటన జరిగిన తర్వాత, మంత్రిమండలి ప్రకాశంగారి యింట్లో సమావేశ మయింది. ఆ సమావేశంలో తీర్మాన పూర్వకంగా గవర్నరు గారికి ఒక లేఖ వ్రాశాము: "ఈ రోజున, శాసన సభలో - మా ప్రభుత్వంపైని, విశ్వాస రాహిత్య తీర్మానం ఒకటి ఆమోదింపబడింది. అందుచేత, ఇందుమూలంగా వెంటనే మా ప్రభుత్వం రాజీనామా దాఖలు చేస్తున్నది. ప్రస్తుతం శాసన సభలో వివిధ పార్టీల సంఖ్యాబలం బట్టి చూస్తే, ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడ గలిగే పరిస్థితులు లేవు. అందుచేత, శాసన సభ రద్దుచేసి, త్వరలో క్రొత్త ఎన్నికలు జరిపించవలసిందని మా సలహా. మా రాజీనామా, మా సలహా అంగీకరించవలసిందని మా కోరిక."

ప్రకాశంగారు ఈ ఉత్తరంమీద సంతకం పెట్టి, సంజీవరెడ్డిగారి చేతికిచ్చి, ఆయనను స్వయంగా వెళ్ళి గవర్నరుకు అందజేయమని కోరారు. ఆయన వెంటనే గవర్నరు దగ్గరికి వెళ్ళి, ఆ లేఖ అందజేశారు. విశ్వాస రాహిత్య తీర్మానం రెండుగంటల తర్వాత పాసయినట్టు జ్ఞాపకము. మా రాజీనామా 5 గంటల లోపునే పంపించేశాము.

నేను ఇంటికి వెళ్ళేసరికి, మాకు వ్యతిరేకంగా ఉన్నవారిలో కొందరు వచ్చి, "ఎవరూ అనుకోని దుష్ఫలితం ప్రాప్తించింది. మీరు రాజీనామా ఉపసంహరించవలసింది. మేము, మీ ప్రభుత్వాన్ని బలపరుస్తా"మని చెప్పారు.

కాని, వారి అభిమానానికి కృతజ్ఞత తెల్పి, "ఉపసంహరించే లక్షణం మంత్రివర్గంలో ఎవరికీ లేదు. ప్రకాశంగారికి అసలే అటువంటి భావం ఉండదు. మీరు మాకు నచ్చజెప్పే ప్రయత్నం మానుకోండి," అన్నాను. అలాగునే, మర్నాడు కొందరు శాసన సభ్యులు, ఊళ్లో గల కొందరు పెద్దలు ప్రకాశం గారిని అడగడం తటస్థించింది.

అటువంటి కోరిక వారి సద్భావ సూచకమే గాని, రాజనీతి లక్షణంతో కూడింది గాదని వేరే చెప్పనక్కరలేదు. అందుచేత అటువంటి యత్నాలన్నీ వారు మానుకున్నారు.

తర్వాత జరిగిన చరిత్రను బట్టి చూస్తే ప్రకాశం గారి ప్రభుత్వ పతనం ప్రజలకు ఆమోదకరంగా లేదని గ్రహించవచ్చు.

  1. ఆ 13 నెలలలోను, ఆయన - నలుగురూ వినేలాగు మాట్లాడింది అదే ప్రథమం అనుకుంటాను.