నా జీవిత యాత్ర-4/శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయము
21
శ్రీ వేంకటేశ్వర విశ్వ విద్యాలయము
1946 లో, ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తిరుపతి దేవస్థానం సాయంతో తిరుపతిలో విశ్వవిద్యాలయం స్థాపించడానికి ఒక బిల్లు తయారు చేశారు. అప్పట్లో కె. కోటిరెడ్డిగారు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండేవారు. తిరుపతి దేవస్థానం వారు 10 లక్షల మూలధనం ఇవ్వడానికి అంగీకరించారు. కాని, బిల్లు తయారయేసరికి, మంత్రివర్గం పతనమయే స్థితిలో ఉంది. శాసన ముసాయిదా, ప్రకాశంగారి మంత్రివర్గంమీద విశ్వాసరాహిత్య తీర్మానం వచ్చిన తర్వాత అందింది.
1953 లో ముఖ్యమంత్రికాగానే, ప్రకాశంగారే దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు. అప్పటి మంత్రివర్గంలోని ఏడుగురు మంత్రులలోను, నలుగురు రాయలసీమకు చెందినవారే. అందుచేత, వారు దీన్ని సంతోషంగా అంగీకరించారు. ఇక మిగిలినవారిలో విద్యాశాఖ మంత్రి పట్టాభిరామారావుగారు ఒకరు. ఆయన రాజాజీ మంత్రివర్గంలో కూడా మంత్రిగా ఉండేవారు. అందుచేత, కొంత నిదానం అలవాటు చేసుకొన్నవారు.
ఆయన - అప్పటి కప్పుడే - రాధాకృష్ణన్ కమిటీ, క్రొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించడానికి తొందరపడగూడదని చేసిన సిఫారసును, ఒక అభ్యంతరంగా చూపూరు.
నా వాదం ఇది: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆనర్సు తరగతులలో, విజ్ఞాన శాఖలలో 11, 12 స్థలాలు (సీట్లు) తప్ప హెచ్చుగా లేవు. హెచ్చు చేయమంటే, యూనివర్శిటీ అధికారులు ఒప్పుకోరు. పోనీ, రాయలసీమ ప్రాంతంలో ఒక కాలేజీలో ఆనర్సు తరగతులు ప్రారంభించమంటే, విశ్వ విద్యాలయకేంద్రంలో తప్ప, ఆనర్సు తరగతులు పెట్టడానికి వీలులేదన్నారు. అందుచేత - దక్షిణ, పశ్చిమ జిల్లాలలోనుంచి వచ్చే విద్యార్థులకు, అందులో ధనాభావంగల విద్యార్థులకు - అవకాశాలు తక్కువ అనే విషయం గుర్తించి తిరుపతిలో విశ్వవిద్యాలయం స్థాపించడమే మార్గ మనుకున్నాము.
అయితే, లోగడ 10 లక్ష లిస్తామన్న తిరుపతి దేవస్థానం వారు, అప్పట్లో ఆరు లక్షలు మాత్రమే ఇవ్వగల మన్నారు. ఏమయినా, విశ్వవిద్యాలయం స్థాపించక తీరదనుకున్నాము. ఇందుకొక నివేదిక తయారుచేయడానికి, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కళాశాల ప్రిన్సిపాలు అయిన కె. రంగధామరావుగారిని నియమించడం జరిగింది. విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ వి. ఎస్. కృష్ణగారి సలహా సంపత్తితో, వారొక నివేదిక సమర్పించారు. దానికి రెండుకోట్లు ఖర్చు చూపించారు.
చెప్పకేమి! ఈ ఖర్చుకు భయపడి అయినా, ఈ క్తొత్త విశ్వ విద్యాలయాన్ని వదులుకుంటామని పట్టాభిరామారావుగారు సంతోషించారు.
కాని, డబ్బు విషయమై బాధపడనక్కరలేదనీ, రెండు, మూడేండ్లలో ఈ రెండుకోట్లు సంపాదించగలమనీ, ధైర్యంతో శాసన ముసాయిదా తయారుచేయించాలని కాబినెట్‌లో తీర్మానించాము.
ముసాయిదా సరిచూడడానికి - వి. ఎస్. కృష్ణ, కె. రంగధామరావుగారలతో నేనే కూచోవలసి వచ్చింది. విద్యాశాఖ మంత్రి అయినా, పట్టాభిరామారావుగారు - అది ఎలాగూ జరగని పని అని, నన్నే చూసుకోమని, కార్యభారం నాపైన వేశారు.
తిరుపతిలో విశ్వవిద్యాలయ కేంద్రం పెట్టడంలో మా కొక ప్రత్యేక ఆశయముండేది. దక్షిణ ఆసియా దేశాలన్నిటిలోనుగల ప్రాచ్య కళాకేంద్రాలకు, ఇక్కడ స్థాపించబోయే విశ్వవిద్యాలయం మహా కేంద్రంగా ఉండే విధంగా దానిని ఏర్పాటు చేయాలని నిశ్చయించాము.
కాని, నివేదిక తయారుచేసిన యిద్దరూ, ఆంధ్ర విశ్వవిద్యాలయ శాసనాన్ని నమూనాగా తీసుకొని ముసాయిదా తయారుచేయడం వల్ల, పై ప్రాచ్యకళా మహాకేంద్రపు ఏర్పాట్లకు తగినంత అవకాశం లేకపోయింది.
ఎలాగయితే నేమి, మొదటి ఆశయంలో మాత్రం సంస్కృత సాహిత్యము - తత్సంస్కృతుల ప్రబోధ విస్తారములని వ్రాయడం జరిగింది.
తిరుపతి దేవస్థానంవారు ఏటేటా (అప్పుడున్న కొద్దిపాటి రాబడినిబట్టి బహుశ: 15 వ వంతు అయిఉంటుంది) 2 లక్షల 50 వేలు విశ్వవిద్యాలయానికి కేటాయింపు చేయవలసిందని యిందులో వ్రాశాము. తిరుపతి దేవస్థానం శాసనాన్ని ఆ విధంగా సవరించడానికికూడా యిందులోనే ఏర్పాటు జరిగింది. శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టడానికి, విద్యాశాఖమంత్రి ఒప్పుకొన్నారు.
వేసవికాలంలో, వాల్తేరు విశ్వ విద్యాలయంలో శాసన సభ జరుగుతున్నప్పుడు, చల్లని సముద్రపుగాలి తగులుతూ ఉండగా, తిక్క వరపువారి పేరున ఉన్న సభామందిరం (మీటింగ్ హాలు) లో - ఈ బిల్లు చర్చ, శాంతంగా జరిగింది. 12-5-54 న పట్టాభిరామారావుగారు ఈ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు. 15-5-54 న, శాసన సభ్యుల పరిశీలనా సంఘం (సెలక్టు కమిటీ) పరిశీలన నిమిత్తమై వెళ్ళింది. 26-5-54 న, పరిశీలనా నివేదిక శాసన సభలో ప్రవేశపెట్ట బడింది.
ఈ బిల్లులో -- విశ్వవిద్యాలయానికి, రాష్ట్రగవర్నరు ఉద్యోగరీత్యా 'ఛాన్సలర్' గా ఉంటారని వ్రాయడం జరిగింది. కొన్ని విశ్వవిద్యాలయాలలో ఆ రాష్ట్రపు ముఖ్య న్యాయమూర్తి ఛాన్సలర్‌గా ఉండడం కూడా కద్దు.
అనేక సందర్భాలలో - విశ్వవిద్యాలయ వ్యవహారములు, న్యాయస్థానాలలో వాదోపవాదాలకు వస్తువులుగా పరిణమిస్తున్న కాలంలో, అటువంటి వివాదాలలో వాదులు, ప్రతివాదులు ముఖ్యన్యాయమూర్తిపేరు లాగకుండా ఉండడంకోసమని, మేము గవర్నరు ఛాన్సలరుగా ఉంటే బాగుంటుందనుకున్నాము.
అయితే, ప్రతిపక్షులు మా భావాలకు ప్రతికూలభావం కలవారు కాబట్టి - ఉద్యోగాలు మొదలయిన విషయాలలో మంత్రుల సాన్నిద్యాన్నీ, పలుకుబడిన అనుసరించి గవర్నరులు మంత్రుల తాలూకు మనుషులనే ప్రోత్సహిస్తారనే సాధారణ జనాకర్షణీయమమైన వాదం లేవదీసి, 31-5-54 న ఆ శాసనం 10 వ విధిలో 'గవర్నరు' అన్న పదానికి బదులు, 'ముఖ్య న్యాయమూర్తి' అనే పదం సవరణగా ప్రతిపాదించి, నెగ్గారు.
ఆ సవరణతోబాటు 1-6-54 న శాసనం ఆమోదమయింది.
నేను, బిల్లును రాష్ట్రపతి ఆమోదానికై 'రిజర్వు' (రాష్ట్రపతి విచారణార్థము రక్షితము) చేసినట్టు గవర్నరుగారి సంతకం అయిన వెంటనే, ప్రత్యేకమైన ఉత్తరంతో సహా - వేసవికాలపు సెలవులు పూర్తికావడానికి ముందుగా రాష్ట్రపతి అనుమతి యిప్పించవలసిందని, కేంద్ర హోమ్ మంత్రి కట్జూగారికి పంపించాను.
ఆయన దగ్గరినుంచి వారం, పది రోజులదాకా ఏ వార్తా రాలేదు. విద్యాశాఖ మంత్రిగారిని, ఢిల్లీవెళ్ళి, సరిచేసుకొని అనుమతి తేవలసిందని చెప్పగా, ఆయన "ఇలాంటి బిల్లుకు కేంద్రం ఒప్పుకోదని నేను ఇదివరకే చెప్పాను. మీరు నా మాట వినలేదు. ఆ బాధ ఏదో మీరే వెళ్ళిపడండి," అన్నారు.
అప్పుడు కట్జూగారికి బిల్లుకాపీ మరొకటి చేర్చి, ప్రత్యేకంగా మరొక ఉత్తరంవ్రాసి, వారికి బిల్లు పరిశీలన చేయడానికి వ్యవధియిచ్చి, పలానా రోజున వస్తున్నానని తంతియిచ్చి, అ రోజుకు ఢిల్లీ వెళ్ళి, అ ఉదయమే వారి సందర్శనానికి వెళ్ళాను.
ఆయన ప్రత్యుత్థానముచేసి, తేనీరు వగయిరాలన్నీ ఆరగింపు చేయించి, నన్ను "ఏమైనా పనిమీద వచ్చారా?" అని అడిగారు.
నాలుగురోజులక్రింద విశ్వవిద్యాలయ శాసనం కాపీ ఆయనకు పంపినదీ, ఆ ఉదయం ఆయన సందర్శనానికి వస్తున్నట్టు తంతియిచ్చినదీ చెప్పగా, ఆయన ఆ తంతివార్తగాని, బిల్లుగానీ అందలేదన్నారు.
"మీ పెర్సనల్ అసిస్టెంటును పిలిచి కనుక్కోవలసింది," అని నేను అడిగినమీదట, ఆయన తన పెర్సనల్ అసిస్టెంటును పిలిచి, నాపేరు ఆయనకు చెప్పి, నా దగ్గరినుంచి తమకేదైనా తంతివార్త, బిల్లు వచ్చాయా అని ప్రశ్నించారు. ఆయన 'వచ్చిం'దన్నాడు.
నేను "ఎప్పుడు మీకు అందాయి?" అని అడగగా, ఆయన "మూడురోజులయింది," అన్నాడు.
కట్జూగారూ, నేనూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాము. ఆయన పెర్సనల్ అసిస్టెంటును వెళ్ళమన్నారు. అంతకుమించి ఆ విషయం తమకెందుకు చెప్పలేదన్నమాట నోటితో అడగలేదు సరికదా, కంటిచూపులతోనయినా సూచించలేదు!
నేను మరొక్కసారి 'ఇది కదా డిల్లీ పంథా!' అనుకున్నాను.[1]
ఈ ముచ్చట అయినతర్వాత, ఆయనకు ఆ బిల్లు వివరాలు చెప్పాను. ఆయన నన్ను హుమయూన్ కబీర్‌గారితో మాట్లాడవలసిందని చెప్పారు.
అప్పట్లో హుమయూన్ కబీర్‌గారు కేంద్ర విద్యామంత్రి అయిన అజాద్‌గారికి విద్యాశాఖలో కార్యదర్శిగా ఉండేవారు.[2]
కట్జూగారితో, "నేను, ప్రకాశంగారు అంతకుముందు అజాద్‌గారితో ఈ విశ్వవిద్యాలయ విషయమై మాట్లాడినప్పుడు ఆయన అనుమతించారు. మ రిప్పుడాయన విదేశాలలో పర్యటిస్తున్నారు కదా! ఎలాగా?" అన్నాను.
అందుకు, కట్జూగారు మళ్ళీ ఇలా అన్నారు: "అజాద్‌గారి అనుమతి ఒక అనుమతి కాదయ్యా! కబీరుగారిని ఒకసారి చూడు."
కబీరుగారు 1930 ప్రాంతాలలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరుగా పనిచేసివున్నారు. కాని, అప్పటికి ఆయనతో నాకు ప్రత్యేకంగా పరిచయం లేదు. అందుచేత, అప్పుడు మంత్రిగావున్న గిరిగారితో, "కబీరుని కలుసుకోవాలి. ఆయనకు నేను వస్తున్నానని ఒక మారు చెప్పండి," అన్నాను.
ఆయన "కబీరు మనకు బాగా తెలిసినవాడే. నేనే స్వయంగా తీసుకువెళతాను," అని, నాతోబాటు కబీరుదగ్గరికి వచ్చారు.
కబీరు, బ్రహ్మాండంగా సంతోషించి, "డాక్టర్ భట్నగర్‌గారు చాలా అభ్యంతరం చెప్తున్నారు - అవి పరిశీలిస్తున్నాను," అన్నారు.
నే నప్పుడు - ప్రకాశంగారికీ, భట్నగర్‌గారికీ ఈ బిల్లు విషయంలో అంతకు వారంరోజులక్రింద జరిగిన చర్చ సంగతి చెప్పాను. ఆ చర్చ జరిగినపుడు నేనుకూడా వున్నాను. ప్రకాశంగారు, నేను - భట్నగర్‌గారి యింటికివెళ్ళి, ఈ బిల్లు విషయం ఎత్తేసరికి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎందుకూ పనికిరానిదని, అనేక చిల్లరమల్లర దోషారోపణలు చేశారు.
అపుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆయన సూచించిన దోషాలు సవరిస్తాము కాని, మేము వచ్చింది క్రొత్త విశ్వవిద్యాలయ విషయంగానని చెప్పాము.
దానిమీద, ఆయన చెప్పిందే మళ్ళీ చెప్పడం మొదలుపెట్టారు. విశ్వవిద్యాలయంలో సైన్సు లేబరేటరీలు ఏ విధంగా ఏర్పాటు చేయాలో వర్ణించసాగాడు.
విశ్వవిద్యాలయం స్థాపించడానికి అనుమతిస్తేనే కదా కట్టడముల విషయం వస్తుందని మే మన్నాము. కాని, ఆయన - కట్టడాల విషయమై నిశ్చయం కానిదే, తాను విజ్ఞాన సలహాదారుగా ఉన్నంతకాలం అనుమతించడం ఎలా గని వాదించారు.
అది అప్పుడప్పుడే చీకటిపడుతున్న సమయము. ఆయన ధోరణి ఆయనదే. కాని, మాకు ఒక ధ్వనిమాత్రం కనిపించింది. [3] ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు తన్ను గుర్తించలేదని ఆయన మనసులో ఒక బాధ వున్నట్టు గుర్తించాము. భట్నగర్‌గారితో, ఆయన చెప్పినదంతా చేస్తామని చెప్పి వచ్చేశాము.
ఇదంతా కబీరుగారికి చెప్పి, నేను ఇంకా మరొకటి చేశాను.
మన సంవిధానం ప్రకారంగా విశ్వవిద్యాలయాల సంస్థాపన రాష్ట్రప్రభుత్వాల హక్కు కాగా, విశ్వవిద్యాలయాలలో జరిపించే వైజ్ఞానిక, సాంకేతిక పరిశోధనా విషయాలను, ఉన్నతవిద్యల ప్రమాణాలను నిర్ణయించడం మాత్రం కేంద్రప్రభుత్వం హక్కు అని, సంవిధానం 7 వ షెడ్యూలు, యూనియన్ లిస్టులో గల 66 వ ఖండమూ, స్టేట్ లిస్టులో గల 11, 32 ఖండాలూ ఆయనకు చూపించి బోధపరచగా, "అవును. శాసనం ఆమోదించే సందర్భంలో మా ప్రమేయమేమీ లేదు. ఒప్పుకున్నాను," అన్నారు.
దానిమీద నేను ఆయనకు ఫైలు చూపిస్తూ, "ఇంత ఫైలు ఎందుకు పెంచారు?" అని అడిగాను.
ఆయన "ఫైలు నా టేబిల్‌మీదికి వచ్చింది. అందుచేత నేను వ్రాస్తున్నాను," అన్నారు.
"అయితే అనుమతించడానికి మీ అభ్యంతరం లేదని వెంటనే వ్రాయండి," అన్నాను.
ఆయన ఆ విధంగా వ్రాసుకోగా, హోమ్ సెక్రటరీకి ఆ విషయం కొంత తెలియజేయమన్నాను. ఆయన వెంటనే ఆ పని చేశారు.
తరువాత కట్జూగారి దగ్గరికి వెళ్ళితే, ఆయన సెక్రటరీని పిలిచి అడిగారు. ఆయన వచ్చి, లా డిపార్ట్‌మెంట్‌వారి అడ్డు ఇంకా ఉందని చెప్పారు.
వారు చూపిన అడ్డు ఇది: "దేవస్థానం డబ్బు హిందూమతానికి సంబంధించని విద్యపై ఖర్చుపెట్టవచ్చునా?" దానిపై వారు ఆలోచిస్తున్నారట.
'లా' సెక్రటరీతో చర్చిస్తే, ఈ విషయంలో ఆయన గట్టిగా పట్టు పట్టాడు. ఆయనతో నేను చెప్పినదాని సారాంశ మిది: "ఈ శాసనం ప్రకారం, ఇదివరకు అనేక సంవత్సరాలుగా అదే దేవస్థానం వారు తమ డబ్బుతో నడిపిస్తూన్న కాలేజీలను, విశ్వవిద్యాలయంగా విస్తృతపరుస్తున్నాము. ఆ విషయం అందులో స్ఫుటంగా వ్రాయబడివుంది. ఆ కాలేజీలలో, ఇతర కాలేజీలలో జరుగుతున్నట్టుగానే విద్యాబోధన జరుగుతున్నది
విద్యార్థులకు అన్ని విషయాలూ బోధిస్తున్నారు. ఏ నిషేధమూ లేదు. ఈ కాలేజీలమీద వ్యయం కాకూడదని ఏ భక్తుడూ అనలేదు. అడ్డుపెట్టలేదు.
సంవిధానం వచ్చి ఆరేండ్లయినా ఎవరూ వ్యాజ్యం వేయలేదు. అందుచేత, ఇప్పుడు పురిటిలో మీరు అడ్డుపెట్టడం ఎందుకు? ఎవరయినా అడ్డుపెట్టదలచుకుంటే దాని మంచిచెడ్డలు ఆలోచించే బాధ్యతను సుప్రీంకోర్టుకు ఎందుకు వదలరు మీరు?" అని నేను చెప్పినా, ఆయన తనకే న్యాయశాస్త్ర ప్రావీణ్యమున్నట్టు మాట్లాడసాగాడు.
అప్పట్లో కేంద్ర న్యాయశాఖామంత్రి - కలకత్తా హైకోర్టులో జడ్జీగా పనిచేసి, పదవీ విరమణ చేసిన చక్రవర్తిగారు.
ఆయనతో నే నీ విషయాలు చెప్పేసరికి, అవలీలగా గ్రహించి, కార్యదర్శి దగ్గర వున్న ఫైలు తాను తీసుకొని, ఆయనను పంపించేశారు.
ఆ తరువాత ఆయనా నేను ఒక కారులో బయలుదేరాము.దారిలో చక్రవర్తిగారు, "న్యాయశాఖకు కార్యదర్శులైనవాళ్లు ఒకప్పుడు న్యాయవాదులే అయినా, సచివాలయంలోకి వచ్చి, కొంతకాలం ఉండేసరికి పాలకవర్గ మనస్తత్వంలోకి పడిపోతారు," అంటూ కారులోనే ఆ ఫైలుమీద, అనుమతి ఈయవ'చ్చని వ్రాసేశారు.
ఈ రెండు గండాలు దాటిన తరువాత, ఏడుకొండల వేంకటేశ్వరుని పేరిట స్థాపించిన విశ్వవిద్యాలయ శిశువు దినదిన ప్రవర్థమానమై, నేడు అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలలో ఒకటిగా విరాజిల్లుతూంది.
ప్రకాశం మంత్రివర్గం చేసిన ఇతర సౌకర్యములు
మంత్రివర్గం అధికారం స్వీకరించిన కొద్ది నెలలలోనే, నేత మగ్గాలపై వేసిన పన్ను, రెండెడ్లబండ్లపై వేసిన పన్ను రద్దు చేశాము. ఆ తర్వాత రానున్న ఫసలీనుంచి అమలులోకి వచ్చేటట్టుగా పది రూపాయలకన్న తక్కువ భూమిసిస్తు చెల్లించేవారి సిస్తు రద్దు చేశాము. ఆంధ్రా యూనివర్శిటీకి, వారు ప్రత్యేకంగా కోరకుండానే ఏటేటా ఇవ్వవలసిన గ్రాంటు అప్పటికున్నదానికన్న లక్షరూపాయలు పెంచాము.
కర్నూలులో ఆంధ్రప్రభుత్వం రాజ్యంచేస్తున్న కాలంలో - కేంద్రప్రభుత్వం ఇస్తున్న ఉత్పాదన సుంకాల వంతూ, అలాగే ఆదాయపు పన్ను (ఎస్టేటు డ్యూటీ) లో వంతూ, సంపత్తి శుల్కంలో ఇచ్చే భాగంలో కలిపి మొత్తం రాబడి ఇరవైకోట్లకన్నా తక్కువగా ఉండేది.
విదేశాలనుంచి ఋణాలప్రవాహం అప్పటికి పెల్లుబికి రావడం ప్రారంభించలేదు. భూమి సిస్తుకూడా అప్పుడు 5 కోట్లకన్నా తక్కువగా వుండేది. ఇటువంటి పరిస్థితులలో పెద్ద పెద్ద మొత్తాలు అవసరమయ్యే పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించడానికి అవకాశం తక్కువగా వుండేది.
చెన్నరాష్ట్రంవారు - గోదావరి, కృష్ణా, పెన్నారు ప్రాజెక్టులు కట్టడానికి ఉమ్మడిరాష్ట్రంవారు చేసిన ఋణం మొత్తం, ఆ ప్రాజెక్టుల వల్ల వచ్చిన డబ్బులోంచి చెల్లించక, ఆ ఋణం మొత్తాలు ఆంధ్రదేశం చెల్లించవలసిన పబ్లిక్ డెట్ (లోక ఋణం) గా చూపించారు. ఆ ప్రాజెక్టులవల్ల వచ్చిన రాబడి - ఖర్చులు, వడ్డీలు పోను మిగులు 30 కోట్ల రూపాయలున్న, అది మన రాష్ట్రానికి ఆస్తిక్రింద ఇవ్వము అని తీర్మానించారు.
అందుచేత, రాష్ట్ర విభజన నాటికి మన రాష్ట్రానికి 33 కోట్ల పబ్లిక్ ఋణం తగులుకుంది
ఇటువంటి ఆర్థిక స్థితిలో మనరాష్ట్రం ఆరంభమైంది. అయినప్పటికీ, అందులోనుంచే సంవత్సరానికి 60 లక్షల రూపాయల చొప్పున కేటాయించి, క్షామ నివారణ నిధి పెంపుదలకు ఏర్పాటు చేశాము.
దురదృష్టంకొద్దీ, ప్రారంభించిన సంవత్సరంలోనే, విశాఖ పట్నం, తూర్పు - పశ్చిమ గోదావరులు, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో వరదలు వచ్చి అపార నష్టం కలగజేయడంవల్ల, అనుకోకుండానే అందుకు 4 కోట్ల 60 లక్షలకు పైగా అవాంతరపు ఖర్చు వచ్చిపడింది.
భూమిసంస్కరణ ఆలోచనకి వచ్చి, ఆ విషయమై 1954 ఆగస్టులో డాక్టర్ లక్నోగారి అధ్యక్షతన ఒక లాండ్ రిఫార్మ్ కమిటీని నియమించడం జరిగింది. అయితే, ఇప్పుడు వున్న 'సీలీంగు' అనే భావాలు, ఆనాడు విస్ఫుటంగా లేవు. కాని, అందులో - కమతం ప్రమాణం ఎంత ఉండాలి? ప్రమాణానికి మించివున్న భూమిని ఏ విధంగా పంపకం చేయాలి? అన్న సూచనలుమాత్రం వ్రాయబడి వున్నాయి.
తుంగభద్రా నీటిపారుదల ప్రాజెక్టు క్రింద, తొందరగా సాగు విస్తరణ చేయడానికి ప్రభుత్వం చురుకైన ఏర్పాట్లు చేయడం ఆరంభించింది. ఇంతేకాక, ఆ ప్రాంతాలలోవున్న భూములలో ఎత్తుపల్లాలు తగ్గించి, సమతలంగా చేయించడానికిగూడా ప్రభుత్వం యత్నించ నారంభించింది.
మద్యనిషేధం ఉండవలెనా - వద్దా? అనే ప్రశ్న ఆ రోజులలో సభ్యులను చాలా బాధించింది. ఇదివరకేదో సందర్భంలో, ఎప్పుడో ఒకప్పుడు మద్యనిషేధ శాసనం రద్దుచేయాలని చెప్పినవారి సంఖ్య శాసన సభలో హెచ్చుగా వుంది. అయితే, ప్రభుత్వవర్గంలో వున్న పార్టీలలో - కాంగ్రెసు పెద్ద పార్టీ. వారికి శాసనం రద్దు చేయడంలో ఏకాభిప్రాయం లేదు. అందుచేత, ఏమి చేయడానికీ తోచని సందేహస్థితిలో శొంఠి రామమూర్తిగారి అధ్యక్షతను ఈ మద్యనిషేధ శాసన పరిపాలన ఏ విధంగా చక్కదిద్దాలో సూచించడానికి, ఒక ఉప సంఘం ఏర్పాటయింది.
"సంశయాత్మా వినశ్యతి!" చివరికి ఈ సంఘం నివేదికలో గల సిఫారసులు అమలు చేయలేదన్న కారణం చూపెట్టి, ప్రతిపక్షం వారు ప్రభుత్వంపైన విశ్వాసరాహిత్య తీర్మానం తేవడము, ప్రభుత్వ పక్షంలో వున్న నలుగురు ఎదురుతిరిగి ఆ తీర్మానానికి అనుకూలంగా వోటు చేయడము, తన్మూలంగా చకచక ముందుకు నడుస్తూన్న ప్రకాశం ప్రభుత్వం పడిపోవడము - చరిత్రాత్మక విషయాలు. అవన్నీ తర్వాత వ్రాస్తాను.
ఈ ఇబ్బందులకుతోడు, ఆంధ్రరాష్ట్రం - మొదటి పంచవర్ష ప్రణాళిక సగం జరుగుతూండగా స్థాపించబడడంవల్ల, ఆంధ్రప్రభుత్వం తన అభిప్రాయాలనుబట్టి తయారుచేసుకొన్న ప్రణాళిక లేదు. ఉమ్మడి రాష్ట్రంలోంచి విడిపోయిన భాగాల జనాభానుబట్టి కేటాయింపులన్నీ విభజించడం జరిగింది. క్రొత్తరాష్ట్రం కదా అనే కరుణచేత, ఈ కేటాయింపులకు అదనంగా, 3 కోట్ల 84 లక్షల రూపాయలు మొత్తంగా ఇచ్చారు.
ఆ రోజులలో ఆరంభదశలో వున్న సమాజ వికాస కేంద్ర ఉద్యమాన్ని తొందరగా విస్తృతపరచడం జరిగింది.
ఇంతేకాకా, రెండవ పంచవర్ష ప్రణాళికకు అంచనా తయారు చేయడానికి ప్రభుత్వం చురుగ్గా యత్నాలు జరిపింది. ఉద్యోగ అవకాశాలు పెంచడానికి, వ్యవసాయ విస్తృతికి అవసరమైన నీటిపారుదల ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి గట్టి ఆలోచనలు ఆరంభింప బడ్డాయి.
ఈ ప్రణాళికలను, ప్రజా ప్రణాళికలుగా మార్చడంకోసం ప్రభుత్వం గ్రామ ప్రణాళికా సంఘాలను, ప్రాంతీయ ప్రణాళికా సంఘాలను ఏర్పాటు చేసింది. హరిజన, గిరిజన సంక్షేమం కోసం పెద్ద యత్నాలు చేసింది.
మహిళాభ్యుదయ ఉద్యమం విస్తృతం చేయడంకోసమని, మహిళా ఉద్యమ సంక్షేమ ఉద్యోగిని ప్రత్యేకంగా నియమించింది.
ఖాదీ అభివృద్ధి
1946 లో, ప్రకాశంగారు ఉమ్మడిరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తయారుచేసిన ఖాదీ స్కీములు ఆ మధ్యకాలంలో పూర్తిగా నశించలేదు. అయినా, ఈ స్కీములు పెట్టిన స్థలాలలో, మిల్లుగుడ్డల వ్యాపారంకూడా జరుగుతూండడంవల్ల వీటి ప్రాధాన్యం నశించింది.
ప్రకాశంగారు - ఈ ప్రత్యేక ఖద్దరు కేంద్రాలను ఏర్పాటు చేసిన సమయాలలో, మిల్లుబట్ట నశించాలని చేసిన ఏర్పాట్లను సమర్థిస్తూ గాంధీగారు ఇలా అన్నారు: "మరకదుళ్ళు - ప్రకాశంగారు తిరస్కరించక తప్పదు. ముల్లుబట్టల నిషేధం తప్పదు. ఈ పని చేస్తేనే, ఏదో క్రొత్త ఉద్యమం వడుస్తున్నట్టు ప్రజలు గ్రహించ గలరు."
అయితే, తర్వాత వచ్చిన ప్రభుత్వంవారు - గాంధీజీ సమర్థించి, ప్రకాశంగారు నడిపించిన కార్యక్రమాన్ని, తాము 'గాంధేయులు' అయినప్పటికీ రద్దు చేశారు. అందుచేతనే ఈ ఖాదీ ఉద్యమం కుంటుపడింది.
అందరూ ఖాదీకట్టి, బట్టల విషయంలో ఆ గ్రామాలు స్వయంపోషకంగా వుండాలనే ఆశయం కాగితాలమీద మాత్రం రద్దు పరచకుండా వుంచారు.
చవకగా రాట్నాలు, దూది మొదలైనవి వారికిచ్చేవారు. వారు వడికిన నూలు మొట్టమొదట ప్రభుత్వంవారే కొనుక్కుని. దాంతో బట్టలు నేయించి, ఆ బట్టలు గ్రామస్థులకు అమ్మడానికి ఏర్పాటు చేశారు.
ఆ స్కీముక్రింద విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు కలిపి తుని కేంద్రం, గుంటూరుజిల్లాలో కొన్నిగ్రామాలు కలిపి సంతనూతలపాడు కేంద్రం, ఇలాగే మరికొన్ని గ్రామాలు చేర్చి, ఎఱ్ఱగొండపాలెం, కోయిలకుంట్ల కేంద్రాలు - మొత్తంపైన నాలుగు కేంద్రాలు నడుస్తూండేవి.
ఆంధ్రప్రభుత్వం మళ్ళీ ఏర్పడడంవల్ల ఈ కేంద్రాలలో చురుగ్గా ఖద్దరు ఉత్పత్తి, గ్రామాలలో ఖద్దరు ధారణ తిరిగి హెచ్చాయి.
నూలు వడికేవారికీ, నేసేవారికీ కూలీకూడా కొంత పెంచడమయింది. ఖద్దరు విస్తృతపర్చడంకోసమని, ఈ కేంద్రాలలోనే గాక, అనేక కేంద్రాలలో - రాట్నాలు, దూది చవక ధరలకు ఇవ్వడం జరిగింది. మొత్తంపైన - నూలు వడికే 23 వేలమంది, ఖద్దరు నేసే 1180 మంది, వీరితో సంబంధించిన దూది ఏకేవారు, బట్టలు తెలుపుచేసే చాకళ్ళు, బట్టలపైన రంగులు అద్దే కళాకారులు లాభం పొందారు.
ఆంధ్ర సరిహద్దుల విషయము
రాష్ట్రం ఏర్పాటు చేసినపుడు సరిహద్దులలో ఇంకా కొన్ని సర్దుబాట్లు చేయవలసి ఉంది. ఇంతేకాక, కేంద్రప్రభుత్వం ఫజలాలీ అనే న్యాయమూర్తి అధ్యక్షతన సెప్టెంబరులో రాష్ట్ర పునర్విభజన సంఘాన్ని నియమించింది. ఆ సంఘంలో హృదయనాథ్ కుంజ్రూ, ఫణిక్కర్ అనే మరి ఇద్దరుకూడా ఉండేవారు.
వారు కర్నూలు వచ్చినప్పుడు, ఒరిస్సా, ఆంధ్ర సరిహద్దుల విషయము; బళ్ళారి విషయము; చెన్నపట్నం, మైసూరు రాష్ట్రంలోని కోలారు విషయములు - వీటినిగూర్చి ఆంధ్రప్రభుత్వం అనేక వివరాలతో విజ్ఞప్తి దాఖలు చేసింది. ప్రకాశంగారు భాషారాష్త్రాల చరిత్ర యావత్తూ, సమగ్రంగా ఆ సంఘ సభ్యులకు బోధపరిచారు.
ఈ భాషారాష్ట్రాల తత్వ మేమిటోగానీ, పెద్దపెద్ద మహనీయులనుకూడా వక్రమార్గంలోకి దించేస్తాయి.
మరొకప్పుడు, బళ్ళారి విషయమై మిశ్రా అనే న్యాయమూర్తిని స్పెషల్ ఆఫీసరుగా నియమించి, ఆయన బళ్ళారి వెళ్ళే సమయంలో - ప్రకాశంగారు గానీ, ఇతర ఆంధ్ర మంత్రులుగానీ బళ్లారికి వెళ్ల గూడదని నెహ్రూగారు ప్రార్థనాపూర్వకభాషలో ఆంక్ష విధించారు.
ఫ్రెంచి యానాములో ప్రజారాజ్యం
పోర్చుగీసువారు, గోవా ప్రాంతాలలో చేస్తున్న దురంతాలు, మార్గదర్శకంగా తీసుకొని ప్రెంచివారుకూడా దక్షిణాదిన పుదుచ్చేరిలోను, ఆంధ్రలో తూర్పుగోదావరి జిల్లాకు ఆనుకొనిఉన్న యానాములోను - స్వాతంత్ర్యాభిలాషులైన భారతీయులను హింసించ సాగారు.
యానాము చాలా చిన్న భూబాగము. యానాము, గోదావరి భాభాగంనుంచి ఒక కాలువ అంత ప్రమాణంగల నదిచేత వేరు చేయబడి ఉన్నది. కాకినాడనుంచి అక్కడికి దక్షిణంగా ఉన్న యానాం పోవడానికి గంట మోటారు ప్రయాణంకన్నా ఉండదు.
అక్కడి ప్రెంచి ఉద్యోగికి గవర్నరుహోదా ఉండేది. అక్కడి ఫ్రెంచివారు, యానాము భూభాగంలో ఉన్న ప్రజలను, పౌరహక్కులు లేకుండా అణిచివేసే ప్రయత్నంలో, నదికి ఇవతలఉన్న ఆంధ్రరాష్ట్ర ప్రజలపైనకూడా తుపాకులు కాల్చి, గాయపరచసాగారు.
ఆ ప్రజల సంరక్షణకోసం ఆంధ్రప్రభుత్వం సాయుధ పోలీసు దళాన్ని సరిహద్దు రక్షణకు నియమించింది.
ఈ విషయం ఎవరి మూలంగా తెలిసో నెహ్రూగా రొక ఐ. పి. ఎస్. ఉద్యోగిని ప్రత్యేకంగా కర్నూలుకు పంపించారు. ఆయన ప్రకాశంగారితో, తనను నెహ్రూగారు పంపడానికి కారణం మేము యానాముకు ఎదురుగుండా సాయుధ పోలీసు దళం ఉంచడమే నని తేల్చారు.
అందువల్ల, అంతర్జాతీయ సమస్యలు లేస్తాయి గనుక, మేము ప్రెంచివారితో ఏ తగవూ తెచ్చుకో కూడదని ఆయన మాటగా చెప్పారు.
ఆంధ్ర ప్రజలను ప్రెంచివారు తుపాకులతో కాలుస్తూంటే ప్రజలకు ఆ ఇబ్బంది లేకుండా చేయడానికి సాయుధ పోలీసును పంపాము కాని, ప్రెంచివారితో తగవు తెచ్చుకొనే ఉద్దేశం మాకులేదని మాట ఇచ్చాము.
ఆ సమయంలోనే ప్రెంచి పోలీసులు ఒత్తిడి హెచ్చుచేయడం మొదలుపెట్టారు. మేము రిజర్వు పోలీసులు దళాన్ని బలపరచి, వారి ఖర్చుల నిమిత్తం మరొక పదివేల రూపాయలు మంజూరు చేశాము.
నేను యానాముదాటి అవతలకు వెళ్ళేలాగు టూరు ప్రోగ్రాం వేసుకొని, యానాములో ఉన్న ప్రెంచి పెద్ద ఉద్యోగికి మర్యాద ప్రకారంగా ఆ ప్రోగ్రాం ప్రకారం యానాము దాటి వెళుతున్నానని ఉత్తరం పంపించాను. ఆ ప్రకారంగా, నేను యానాము దాటుతున్న సమయానికి ముందురాత్రే ఆ ఉద్యోగీ, ఆయనతో ఉన్న ప్రెంచి జాతికి చెందిన పౌరులు యానాము వదిలి, స్టీమరులో పుదుచ్చేరివైపు వెళ్ళిపోయారట.
నేను యానాము దాటే సమయంలో అక్కడ ఐదారుగురు ప్రెంచి పోలీసులు గార్డ్ ఆప్ ఆనరు వంటిది ఇచ్చారు. నేను యానాముదాటి అవతల వెళ్ళి, అసలు ప్రత్యేకమైన పనిలేకపోవడంవల్ల, అటువైపున ఉన్న మన గ్రామస్థులను కలుసుకొని, రెండు, మూడు గంటలలో తిరిగి వచ్చి, మన సాయుధ పోలీసులకు ఉత్సాహవాక్యాలు కొన్ని చెప్పి, కాకినాడ వచ్చి, ఒక మిత్రునియింట స్నేహితుల నందరినీ చేరదీసి వారికి ఒక కార్యక్రమం సూచించాను.
ముందు కొంత నిశ్శబ్దమయిన ప్రచారంచేసి, యానాము మూడువైపుల నుంచి ఒక వెయ్యిమంది చొప్పున యానాము కాందిశీకులు యానాములోకి ప్రవేశించాలి. వారికి ఇబ్బంది లేకుండా మన సాయుధ పోలీసుదళం అవసరమైతే సాయపడగలదని ఏర్పాటుచేసి కర్నూలు తిరిగి వచ్చేశాను.
ఒక వారం రోజులలో నేను ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది. ఒక రోజు ఉదయం నేను ప్రధాని నెహ్రూగారిని చూడవలసి ఉన్నది.
ఆ తెల్లవారుజామున మూడు గంటల వేళ కర్నూలు ప్రభుత్వ కార్యదర్శి నుంచి వైర్‌లెస్ సందేశం వచ్చింది.
పౌరులు వందలకొద్దిగా వెళ్ళి శాంతంగా యానాములో - మునిసిపల్ ఆఫీసు, మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు ఆక్రమించుకొన్నారనీ, అక్కడున్న ప్రెంచి పోలీసులు మాటవరసకు ప్రజలను అడ్డేభావంతో పేల్చి, వెంటనే శరణు వేడుకున్నారనీ, అక్కడ ప్రజాప్రభుత్వం [4] ఏర్పాటు చేయడానికి అప్పుడే సన్నాహాలు జరుగుతున్నాయనీ ఆ సందేశంలో ఉంది.
నేను అనుకొన్నట్టు పని 15 రోజులవరకు అక్కర లేకుండా, వారం రోజులలోనే ప్రజలు సఫలీకృతము చేసి, భారతదేశంలో మిగిలి ఉన్న ప్రెంచి, పోర్చుగీసువారి చేతులలో ఉన్న భూ భాగాలను పునరాక్రమణ చేసుకోడానికి మార్గదర్శకు లయ్యామని నేను ఉప్పొంగిపోయాను.
తెల్లవారేసరికి, పత్రికలలో - చూపుడువేలు ప్రమాణంగల అక్షరాలతో - ప్రజలు యానాము ఆక్రమించుకున్నారనీ, ఫ్రెంచి ప్రభుత్వంవారు పారిపోయారనీ వార్తలు పడ్డాయి.
నేను 10, 11 గంటల వేళప్పుడు నెహ్రూగారిని చూడడానికి వెళ్ళాను.
వెళ్ళగానే, యానాము ఆక్రమణ ప్రసంగం వచ్చింది. "మీ ప్రభుత్వం ఇలాంటి పనులు చేస్తే, అనవసరమైన అంతర్జాతీయ సమస్యలు బయలుదేరితే ఎవరు బాధ్యత వహిస్తారు?" అని కొంచెం చీకాకు చూపించే ముఖంతో అన్నారు. [5]
అది విని నేను, "ప్రభుత్వ సిబ్బందిలో ఒక్కమనిషయినా అంతర్జాతీయ సరిహద్దు దాటి యానాములోకి వెళ్ళలేదు. యానాము కాందిశీకులు తమ పట్టణం తాము పునరాక్రమణ చేసుకొంటే మన మేలాగు అడ్డగలము" అన్నాను.
అయినా, ఆయన ఇలా అన్నారు: "ఏమైనాసరే, యానాం మీ రాష్ట్రంలో కలుపుకోకూడదు. ఫ్రెంచి తత్వం, ఫ్రెంచి సంస్కృతి మనం రక్షించాలి." "సరే, అలాగే కానివ్వండి" అని నేను వచ్చిన పనేదో సవ్యంగానే చేసుకున్నాను. [6]
గవర్నరు త్రివేది
బ్రిటిష్ ప్రభుత్వం ఉద్ధృతంగా జరిగే రోజులలో త్రివేదిగారు ఐ. సి. ఎస్. పరీక్షలో ఉత్తీర్ణుడై, అందరు ఐ. సి.ఎస్. ఉద్యోగులలాగే - అసిస్టెంట్ కలెక్టరు, డివిజనల్ మేజిస్ట్రేటు మొదలైన చిల్లర ఉద్యోగాలతో ప్రారంభించి, సోపానక్రమంగా వెళ్తూ, 1939 లో ఆరంభించిన ప్రపంచ సంగ్రామ కాలంలో ఇండియా కేంద్రప్రభుత్వ కార్యదర్శి వర్గంవరకు పై మెట్లు ఎక్కాడు.
స్వాతంత్ర్యానంతరం, ఎలాగో ప్రభుత్వం సద్భావాన్ని సంపాదించుకొన్నాడు. ఆంధ్రరాష్ట్ర గవర్నరు కావడానికి ముందు పంజాబు గవర్నరుగా ఉండేవాడు. గవర్నరు పదవిలో ఉన్నా, కార్యదర్శి తత్వం ఆయనను వదిలిపెట్టలేదు. దానికితోడు, అధికార వాంఛాపరుడు కూడా.
అందుచేత, పంజాబులో గవర్నరుగా ఉన్నప్పుడు మంత్రులకు మంత్రులకూమధ్య పరస్పర భేదాభిప్రాయాలు పెంచడంలో కొంత ముఖ్య పాత్ర వహించాడు. ఆయన, ఆంధ్రరాష్ట్ర గవర్నరు కాగానే పంజాబు మంత్రి మిత్రుడు ఒకాయన మాతో అన్నాడు: "ఈ త్రివేది అసాధ్యుడు. మంత్రులమధ్య సామరస్యం ఉండ నివ్వడు. మీరు జాగ్రత్తగా ఉండాలి సుమండీ!"
ఆయన అన్నది ముమ్మాటికీ నిజం అయింది. విభజన సంఘంలో కూచున్నపుడే, రోజుకు ఒకటి రెండు పర్యాయాలైనా చర్వితచర్వణంగా, తాను పంజాబులో గవర్నరుగా ఉండగా, మంత్రులందరూ తన సలహాపైనే కార్యకలాపాలు నడిపేవారని మాకు చెప్పేవాడు.
గవర్నరు అయిన తర్వాత, ఏవో విషయాలు చర్చించాలన్న నెపంపైన మంత్రులను తన యింటికి ఆహ్వానించడం, పరిపాలనా అనుభవంగల గవర్నరు ఉన్నప్పుడు, వారి సలహాపై నడచుకోవడం మంత్రులకు మంచిదని పదే పదే చెప్పడం చేసేవాడు. ఒక పెద్ద పుస్తకంలో ఏయే మంత్రికి ఏయే పాఠాలు చెప్పాలో ముందుగా విషయసూచిక వ్రాసుకొనేవాడు. అ క్రమ ప్రకారంగా మాట్లాడ సాగేవాడు. ఒక పదిహేను రోజులు అయ్యేసరికి ప్రతి మంత్రికీ ఆయనంటే గట్టి విముఖత ఏర్పడింది.
ఆయన ప్రకాశంగారిని మాత్రం పిలవడానికి భయపడేవాడు. తాను చెప్పే ప్రకారం వినే తత్వం ప్రకాశంగారికి లేదని ముందే తెలుసుకున్నాడు.
అందుచేత, ప్రకాశంగారిపై ప్రతి 15 రోజులకు ఒకసారి - ప్రధానమంత్రికి గవర్నరులు వ్రాసే రహస్యపు ఉత్తరాలలో ఏవేవో వ్రాసేవాడు. [7] ప్రకాశంగారికి, ప్రధానిగారు వ్రాసే ఉత్తరాలు చదువుకొన్నప్పుడు, మాకు - గవర్నరుగారు వహించే పాత్ర అర్థమైంది. ఆ తర్వాత ఆయన, ప్రకాశంగారిని వదిలిపెట్టి, సంజీవరెడ్డిగారిని చేరదీయడానికి యత్నించాడు. కాని ఆయనా ఒక కొరకరాని కొయ్య అని రెండు నెలలు అయ్యేసరికి అర్థం చేసుకున్నాడు.
ఆయన మాకు తెలియకుండానే కార్యదర్శులను ఏవేవో రిపోర్టులు తయారుచేయవలసిందని ఉత్తరువులు పంపేవాడు. మాకు తెలియకుండానే అటువంటి రిపోర్టులు కొన్ని సచివాలయంనుంచి గవర్నరుకు వెళ్ళాయి. దానిపై మేము సచివాలయం వారికి ఒక ఆదేశం ఇచ్చాము. గవర్నరుగారు ఏ విషయం అడిగినా, ఉన్న భోగట్టా అంతా వారు పంపించాలి. కాని ఆ పంపే భోగట్టాకానీ, నివేదికగాని అందుకు సంబంధించిన శాఖ మంత్రి ముందుపెట్టి మరీ పంపాలని ఆదేశించాము.
ఆ తర్వత, గవర్నరు దగ్గరనుంచి, తన దగ్గరకు వెళ్ళిన పైళ్ళకు సంబంధంలేని నివేదికలు కావాలనే ఉత్త్వర్వులు చాలావరకు తగ్గిపోయాయి.
ఇలా ఉంటుండగా, ఒక రోజున, విద్యాశాఖామంత్రి నన్ను ఇలా అడిగారు: "విశ్వవిద్యాలయం నామినేషన్ల విషయమై, నాకు తెలియకుండానే మీ 'లా' సెక్రటరీగారిని గవర్నరుకు హక్కులు గలవని నివేదిక వ్రాయమంటే, ఆయన అలాగే గవర్నరుకు హక్కు ఉందని ఆధారాలు చూపిస్తూ నివేదిక పంపించారు. గవర్నరు ఈ విషయం నాతో మాట్లాడలేదు. మీ సెక్రటరీగారు నాతో చెప్పలేదు. మీకేమైనా చెప్పారా?"
'లా' సెక్రటరీ నాకుకూడా ఆ విషయం చెప్పకపోవడంవల్ల, నేను ఆయనను పిలిచి ఆ సంగతి అడగగా, ఆయన - నివేదిక పంపించినట్టు ఒప్పుకున్నాడు.
అప్పుడు నేను ఇలా అన్నాను: "అయ్యా, కార్యదర్శిగారూ! మీరూ, గవర్నరుగారూ - మాకు తెలియకుండా కార్యకలాపం ఇలా నిడిపిస్తే, మన రాజ్యంలో గవర్నరుగారి దొకటి; మంత్రివర్గాని దొకటి, రెండు ప్రభుత్వాలు ఏర్పా టవుతాయి. ఒక రాజ్యంలో రెండు ప్రభుత్వాలు - సాగడం కుదురదుగదా, మన సంవిధానం ప్రకారంగా!"
నేను చెప్పింది సరయిందని గ్రహించి, కార్యదర్శిగారు జరిగినదానికి మన్నించమన్నారు.
అప్పుడు నేను - గవర్నరుగారు ఏ రిపోర్టు అడిగినా, రిపోర్టు వ్రాయవలసినదే కాని, అది నా ద్వారానే పంపించాలని ఆదేశం ఇచ్చాను. తర్వాత కార్యదర్శి ఫైలు నా ద్వారా పంపించినట్టు, గవర్నరుగారు చూసి, అప్పుడు నాతో ఈ విషయం చర్చిస్తానని ఆహ్వానించారు.
నాతో తాను యూనివర్శిటీ ఛాన్సలర్ అవడంవల్ల, మంత్రివర్గానికి తెలియకుండా, ఆ పని చేసుకొనే హక్కు తనకు గలదని వాదించాడు. మంత్రి మండలి ప్రసక్తిలేకుండా నివేదికలు వ్రాయమని సచివాలయాన్ని, తాను అడగవలసిన అగత్యం లేదు కదా! అన్నాను. ఇంతేకాక, యూనివర్శిటీ పరిపాలన విషయాలలో గవర్నరు చేసిన కార్యం ఏదైనా విశ్వవిద్యాలయ సభ్యులకు అసంతృప్తిగా ఉంటే, విశ్వవిద్యాలయం స్థాపించడం, నడిపించడం పూచీ ప్రభుత్వానిదైనప్పుడు, దానికి సంబంధించి గవర్నరు నామనిర్దేశనాలు (Nominations) చేసినా వాటి పూచీ ప్రభుత్వం భరించవలసి ఉంటుంది గనుక, ప్రజా ప్రభుత్వంలో 'గవర్నరు' అన్న పదం యొక్క వినియోగం కాన్ట్సిట్యూషనల్ గవర్నరు అనే ఉండాలని నా అభిప్రాయంగా చెప్పాను.
దానికి ఆయన - బొంబాయిలో మంత్రివర్గ ప్రమేయం లేకుండా, గవర్నరు నామినేషన్లు చేస్తున్నాడని, 'లా' సెక్రటరీ ఇచ్చిన నివేదికలో ఉన్నదని నాకు చూపించాడు. దానికి నేను "ఈ రాష్ట్రం, మద్రాసు రాష్ట్రంలోంచి విభజన అయివచ్చింది. మద్రాసు రాష్ట్రంలో, లోగడ మీ స్థానంలో ఉన్నవారు, అనగా గవర్నరుగారు పెట్టిన సంప్రదాయంకూడా చూడండి. యుద్ధసమయంలో 'హోప్' అనే గవర్నరు ఉండేవాడు. నామినేషన్ల విషయమై, ఆయనకు స్వయంగా చేసుకునే హక్కు ఉఅందా? లేక మంత్రులున్నట్లయితే, మంత్రుల సలహాపైన చేయాలా? అనే సమస్య చర్చిస్తూ, ఒక పెద్ద ఫైలు ఆయన దగ్గరికి వెళ్ళింది. ఆ నాటికి దేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. ప్రస్తుత సంవిధానం తయారు కాలేదు. అయినప్పటీకి ఆయన, 'ఈ చర్చతో నాకు సంబంధం లేదు. మంత్రులుంటే, మంత్రి చెప్పిన సలహాపైనే నేను నడచుకొంటాను,' అని వ్రాశాడు. అది మీరు చూడండి," అని ఆ విషయం గవర్నరు దృష్టికి తెచ్చాను.
ఇది - గవర్నరు ప్రతివిషయంలోనూ తనకే అధికారం కావాలి అనే భావంలో ఉండేవాడనడానికి ఉదాహరణగా వ్రాశాను.
ఆయన ఇంతకన్నా ప్రమాదకరమైన పని ఇంకోటి చేశాడు. హైకోర్టులో అదనంగా జడ్జీలను వేయవలసిన అవసరం వచ్చింది. గవర్నరు - జడ్జీ నియామకం ఫైలులో ముఖ్య న్యాయమూర్తి సూచించిన పేరుగాని, ముఖ్యమంత్రి సూచించిన పేరుగాని, తనకు అంగీకారం కాకపోతే, తాను సూచించే పేరు వ్రాయడం తప్ప, వేరే చర్చలు చేయడానికిగాని, తాను స్వయంగా వేరే ఫైలు ప్రారంభించడానికిగాని కార్య నిబంధనలు ఒప్పుకోవు.
అయినప్పటికీ, ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆ విషయమై, ఒక ప్రత్యేక ఫైలు ఆరంభించడమూ, సచివాలయంలో - అది, ముఖ్యమంత్రిగారికి వచ్చిన ఫైలుతో సంబంధంలేకుండా నడవడమూ జరింది. ఇది సచివాలయంవారు సరిగ్గా కనిపెట్టలేదు. ఒక రోజు అకస్మాత్తుగా, మధ్యాహ్నం 12 గంటల వేళప్పుడు, రాష్ట్ర ప్రభుత్వ సిఫారసు కేంద్రప్రభుత్వానికి వెళ్ళడానికి ఇంక వ్యవధి లేదని, సచివాలయంనుంచి కాగితాలు ప్రకాశంగారి దగ్గరికి, నా దగ్గరికి వచ్చేసరికి - అందులో, ఈ వ్యవహారంలో గవర్నరుగారు అనవసరంగా ప్రమేయం కల్పించుకొని ప్రారంభించిన ప్రత్యేక ఫైలు బయటపడింది.
తక్షణం ప్రకాశంగారు ముఖ్యకార్యదర్శిని పిలిపించి, "ఈ వ్యవహారంలో గవర్నరుగారికి, మనకు ఏమి పరిష్కారం కాగలదు?" అని అడిగారు.
అప్పటి కప్పుడే మంత్రివర్గం రెండు భాగాలు అవుతున్న పరిస్థితి ఏర్పడుతూంది. దానికితోడు గవర్నరుగారు, ఈ క్రొత్త తంటా తీసుకొస్తే ఏమి చేద్దాము అన్నారు ప్రకాశంగారు. అయితే, ఈ ఫైలుకు సంబంధించినంత మటుకు మంత్రులం నేను, ప్రకాశంగారు ఇద్దరమే కావడంవల్ల, ఇది పరిష్కరించే మార్గం సులభమయింది.
"ఫైళ్ళమీద వ్రాత వ్రాసుకోవడంకన్నా, గవర్నరుగారి దగ్గరికి మీరు వెళ్ళి, ఈ ఫైలు ఆయనే ఉపసంహరించినట్టుగా చేయగలరు. చేయండి," అని ముఖ్య కార్యదర్శిగారికి సూచించాను. ముఖ్య కార్యదర్శిగారుకూడా కార్య నిబంధనలు బాగా తెలిసిన వ్యక్తి గనుక, ఆయన గవర్నరుగారి దగ్గరికి వెళ్ళి విషయం బోధపరిచాడు.
దానిపై గవర్నరుగారు, అ ఫైలుమీద 'ఈ విషయం ఇటుపైన నడవక్కర లేదు,' అని వ్రాయడమే కాక - ముఖ్య న్యాయమూర్తి, ముఖ్యమంత్రి నిర్దేశించిన పేర్లు తనకూ అంగీకారమే అని, వాటికి సంబంధించిన ఫైలుమీద వ్రాసి, సంతకం చేసేశారు.
- ↑ అంతకు ముందు సంవత్సరం, నెహ్రూ గారికి ప్రకాశం గారు పంపిన తంతి వార్త విషయమై ఇలాగే జరిగిన సంఘటన ఇదివరలో వ్రాశాను.
- ↑ అజాద్ గారి మరణానంతరం ఈయన రాజకీయ రంగంలోకి దిగారు. 1967 లో నాతోపాటు, పార్లమెంటులో నా గ్రూపులో సహచరులుగా ఉండేవారు. అయితే, ఆనాడు పశ్చిమ బెంగాలులో కలిగిన రాజకీయపు సుడిగాలులతో త్రోవలు తప్పి, తర్వాత ఎవరూ అనుకోకుండా మరణించారు. ఈయన విద్వాంసుడు; ఆంగ్ల, బంగ్లా భాషలలో కవిత్వ రచన చేసినవారు.
- ↑ భట్నగర్ గారి సంభాషణలో మేము కనిపెట్టిన ధ్వని, విశాఖపట్నం వచ్చినప్పుడు, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కృష్ణగారికి తెలియజేశాను. ఢిల్లీలో జరిగిన ఒక కాన్ఫరెన్సులో తాను కూడా అది గుర్తించినట్టు చెప్పి, భట్నగర్ గారిని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒక మారు స్నాతకోత్సవంలో కాన్వోకేషన్ అడ్రస్ ఈయవలసిందని పిలిస్తే వ్యవహారం చక్కబడవచ్చన్నారు. ఆహ్వానించగానే, కృష్ణగారు అనుకున్నట్టుగానే భట్నగర్ గారు దృష్టి మార్చుకొన్నారు. అయితే, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆ కాన్వొకేషన్ రోజున పెద్ద వర్షం పడి, ఆహ్వానితు లందరూ, వేదికపై ఉన్నవారితో సహా తడిసేపోయారు. ఆ నాటి శైత్యం 'న్యుమోనియా' వంటి జబ్బుగా మారి, దేశంలోగల పెద్ద విజ్ఞాన శాస్త్రవేత్త అయిన ఆయన అసువులు బాశారు.
- ↑ కాకినాడ వాస్తవ్యులు, పదవీ విరమణ చేసిన జిల్లా జడ్జి, నాకు న్యాయకళాశాలలో సహాధ్యాయి అయిన కస్తూరి సుబ్బారావుగారిని, అక్కడ కార్యకలాపాధికారములుగల పురపాలక సంఘాధ్యక్షుని (మేయర్)గా ఎన్నుకొన్నట్టు తర్వాత వార్త వచ్చింది.
- ↑ స్వాతంత్ర్యం వచ్చి అప్పటికి 6 ఏండ్లయినా, మన ప్రజలు దెబ్బలు తింటున్నా, పోర్చుగీసు, ప్రెంచి ప్రభుత్వాల నుంచి మన భూభాగాలు మనము తీసుకుంటే అంతర్జాతీయ సమస్యలు వస్తాయని భావించే ;దీర్ఘ సూత్రుడు' ప్రధాని నెహ్రూగారు.
- ↑ ఈ ఉదంతానికి పూర్వం పుదుచ్చేరిదగ్గర, గోవాదగ్గర, మన ప్రజలు విదేశ ప్రభుత్వాలను వెళ్ళగొట్టడానికని సరిహద్దు ప్రాంతాలలో సత్యాగ్రహాలు మొదలు పెట్టారు. అపుడు ఆ ప్రభుత్వాల వారు, మన దళ నాయకులను హింసించడమే కాకుండా, యునైటెడ్ నేషన్స్ భద్రతా సమితికి, భారత ప్రభుత్వం తమ రాజ్య భాగాలపై దాడి చేస్తున్నదని ఫిర్యాదులు చేశారు. అందుచేతనే, యానాములో భారతీయ సత్యాగ్రహులుగాక, యానాము కాందిశీకులే పునరాక్రమణచేసే ఏర్పాటు జరిగింది. యానాము విషయమై ఫ్రెంచి ప్రభుత్వం భద్రతా సమితికి ఫిర్యాదేమీ చేయలేదు. చేసినట్టు వార్తలు రాలేదు. కాని, నేటికీ నెహ్రూగారి ఏర్పాటుక్రింద యానాము ఆంధ్ర భూభాగంలో చేర్చబడకక, సంఘక్షేత్రం (యూనియన్ టెరిటరీ) గానే ఉంది
- ↑ స్వాతంత్ర్యానంతరంకూడా గవర్నరులు, పూర్వం గవర్నర్ జనరల్ పేరిట వ్రాసే రహస్యపు ఉత్తరాల లాగా తనపేరిట 15 రోజుల కొక ఉత్తరం చొప్పున, రాజ్యపరిపాలనకు సంబంధించి వ్రాసేటట్టు నెహ్రూగారు ఒక పద్ధతి ఏర్పరిచారు. రాజ్యపాలనకు సంబంధించి ఏయే విషయాలలో రాష్ట్రాల మంత్రిమండలికి స్వాతంత్ర్యముందో, వేటిలో కేంద్రప్రభుత్వం ప్రమేయ కల్పించుకోవాలో - మన సంవిధానంలో స్ఫుటంగా ఉన్నాయి. అందులోని 355, 356 అనుచ్ఛేదాల ప్రకారం గవర్నరులు అవసరమైతే తప్ప కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాలు వ్రాయవలసిన అగత్యం లేదు. అందుచేత, ప్రధాని రహస్యపు ఉత్తరాలు వ్రాయడానికి చేసిన ఏర్పాటు సంవిధాన తత్వానికి విరుద్ధమని వేరే చెప్పనక్కరలేదు.