నా జీవిత యాత్ర-4/మరల ఎన్నికలు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

23

మరల ఎన్నికలు


విశ్వాసరాహిత్య తీర్మానం 6-11-54 న పాసయింది సంవిధానం 356వ అనుచ్ఛేదం క్రింద రాష్ట్రపతి గారు ఉద్ఘోషణ(ప్రొక్లమేషన్) చేసి, శాసన సభను రద్దుచేస్తున్నామనీ, తిరిగి సాధారణ ఎన్నికలయ్యే వరకు ప్రభుత్వం తమ చేతిమీదుగా నడిపింపబడుతుందని ప్రకటించారు.

ప్రభుత్వ పతనానంతరం కొందరు కాంగ్రెస్ మిత్రులు నాదగ్గరికి వచ్చి"భవిష్యత్తులో- జరిగిన భంగపాటుకు ఏలాగు ప్రతీకారం జరగాలి?" అని అడిగారు.

వారికి నేనిలా చెప్పాను:"ప్రభుత్వ పక్షాన ప్రస్తుతం కాంగ్రెసు, ప్రజా పార్టీ,స్వతంత్రులు కలిసి ఉన్నాం కదా!అంతేకాక ప్రభుత్వం పడిపోయినందుకు విచారించే మరికొందరు సభ్యులు ప్రతిపక్షంలోనే ఉన్నారు. మనం కలిసినట్లయితే, ఎన్నికలలో తప్పకుండా జయప్రదంగా బయటపడవచ్చు. ఈ కలియడంలో నియోజక వర్గాలలో పార్టీలుగా ఒకరి నొకరు సంప్రదించుకునే ఏర్పాట్లు చేసే పద్ధతిలో మనమీద ప్రజలకు అభిమానమున్నా, 5ఏళ్లుకలిసి రాజ్యం చేస్తామన్నా విశ్వాసం గట్టిగా కుదరదు.మన పక్షాన ఉన్న వారందరము కలిసి ఒకే ఎన్నిక ప్రణాళిక క్రింద సంతకం పెట్టాలి.అభ్యర్ధులను నిర్ణయించేందుకు ఒకటే సెలక్షన్ కమిటీ ఏర్పాటు కావాలి. ఈ సూత్రం కాంగ్రెసుపార్టీ అంగీకరిస్తే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే, ఎవరికి వారే యమునా తీరే' అన్నట్టు, అందరూ చీకాకు పడవలసిన అవస్థ వస్తుంది."

నాకు తోచిన పై విషయాలు వారితో చెప్పగా, వారు వెంటనే అంగీకరించారు. పత్రికలు కూడా సుముఖతను చూపించాయి. అయినా రాష్ట్రపతి ఉద్ఘోషణ 6 నెలలు అమలు జరగడానికి ఏర్పాటు కావడంచేత, 4, 5 నెలల వరకు అన్నీ పార్టీలవారు తమ తమ ఎన్నికల సన్నాహాలు చేసుకొనే అవకాశం వచ్చింది.

ఎన్నికల కాలం వచ్చేసరికి, కాంగ్రెసు పార్టీవారు తమ యత్నం తాము చేసుకుంటూ ఉన్నారు. నేను చెప్పిన సూత్రం - ఆ తేదీ నాటికి, రాష్ట్ర కాంగ్రెసు సంస్థలో అధికారంలో ఉన్నవారు పాటించడానికి ఇష్టులుగా లేరు. అయితే, మరో ప్రక్కనుంచి ప్రకాశంగారిని కాంగ్రెసులో కలిసిపోవలసిందని, ఆయనమీద అభిమాన మున్నవారు వత్తిడి చేయడం మొదలు పెట్టారు.

ఇలా ఉండగా, గుంటూరులో కాంగ్రెసుపార్టీ సమావేశం జరిపారు. ప్రజాపార్టీ సమావేశాన్ని అదే సమయంలో గుంటూరులో ఏర్పాటు చేశాను. మా సమావేశం జరుగుతూండగా, కాంగ్రెసు పార్టీవారి ఆదేశ ప్రకారం ముగ్గురు నలుగురు కాంగ్రెసు సభ్యులు మా సమావేశ వేదికకు ఏదో సందేశం ఇవ్వడానికి వస్తామని కబురు పెట్టారు. వారిని నేను ఆహ్వానించాను.

ఆ వచ్చిన వారిలో - శ్రీమతి అమ్మన్నరాజా, శ్రీమతి కడప రామసుబ్బమ్మగారు ఉన్నారు. వారు చెప్పిన సందేశ సారాంశం ఇది: "ప్రజాపార్టీవారు, కాంగ్రెసువారు కలిసి 13 నెలలు రాజ్యం నడిపించారు. హెచ్చయిన భేదాభిప్రాయాలు ఇద్దరి మధ్యనూ కనిపించ లేదు ప్రజాపార్టీలో ఉన్నవారు 90 శాతం పూర్వ కాంగ్రెసువాదులే. కనుక, మొత్తంమీద, ప్రజాపార్టీ అంతా కాంగ్రెసులో పున: ప్రవేశించవలసింది."

లోగడ జరిగిన కొన్ని విషయాలవల్ల, ప్రజాపార్టీలో ఎవరూ కాంగ్రెసులో కలియడానికి అప్పుడు అంగీకరించలేదు. అందుచేత, రాయబారులు వారి సభకు వెళ్ళిపోయారు.

ఆ రాత్రి, ప్రకాశంగారిని చూడడానికి, ఆయన బసకు వెళ్ళిన పార్టీ సభ్యులు కొందరు, ఆయనను, 'కాంగ్రెసులో కలిసిపోతున్నారన్న వార్త వాస్తవమేనా?' అని ప్రశ్నించారు. ఆయన 'చేరితే ఏం ప్రమాదమా?' అని మారుప్రశ్న వేశారు.

ఆయన నన్ను, "ఏమి! కాంగ్రెసులో చేరకూడదా నువ్వు?" అని అడిగారు. పార్టీలో ఎవరికీ ఇష్టం లేదని, జవాబిచ్చాను. "సరే, అలాగయితే మీరు అనుకున్నట్టే చేసుకోండి," అన్నారు ఆయన

తర్వాత కొంతకాలానికి ఆయన ఢిల్లీ వెళ్ళడం తటస్థించింది. అది డిసెంబరు నెల. ఆయన ఢిల్లీనుంచి నా కొక తంతి యిచ్చారు. అందులో "తనను కలుసుకోమని నెహ్రూగారినుంచి ఆహ్వానం వస్తే, నువ్వు తిరస్కరించబోకు సుమా!" అని ఉంది.

మరి రెండుమూడు రోజుల్లో అలాగే నెహ్రూగారి నుంచి, అందులో వ్రాసిన తేదీకి వచ్చి, తనను కటకంలో కలుసుకోవలసిందని ఆహ్వానం వచ్చింది. నేను ఆయన అన్న తేదీకి కటకం చేరుకున్నాను.

మధ్యాహ్నం - నెహ్రూగారు, నేను ఒకరి నొకరు పలకరించుకోవడం , గవర్నరుగారి బసలో జరిగింది. నెహ్రూగారు, నన్ను మొదట బలవంతరాయ్ మెహతా [1]తో మాట్లాడవలసిందనీ, రాత్రి భోజనానంతరం కలిసి కూర్చుందామనీ చెప్పి, మెహతాగారిని, నన్ను ఒక గదిలో కూచోపెట్టి వెళ్ళిపోయారు.

మెహతాగారు చెప్పిందే చెప్పుతూ, రెండు గంటల సేపు, నన్ను కాంగ్రెసులో చేరమని మనోక్షాళనం చేయసాగారు. కాని, అటువంటిదానికి లొంగే లక్షణం నాలో లేదని ఆ రెండు గంటలతర్వాత ఆయన గ్రహించారు. అప్పుడు ఎన్నికల విషయమై చర్చ ఆరంభించగా, నేను - ఒకే ఎలక్షన్ ప్రణాళిక (మానిపెస్టో), ఒకే సెలక్షన్ కమిటీ అన్న నా సూత్రాన్ని చెప్పగా, ఆయన తొందరగానే దానిలోని బలం గ్రహించి, అంగీకరించారు.

రాత్రి భోజనానంతరం నెహ్రూగారు, బలవంతరాయ్ మెహతాగారు, నేను - గవర్నరుగారి డ్రాయింగ్ రూములో కూచోడానికి వెళ్ళాము

ఒక కుర్చీపైని రంగు రంగుల శాలువ వంటిది కనిపించగా, నెహ్రూగారు దానిలో కూచోబోయేసరికి, చటుక్కున క్రిందికి దిగజారారు. ఆయన, ఆ రోజుల్లో బలంగా ఉన్నవారే గనుక, ఆ ప్రక్కనున్న మేము వెంటనే ఆయనకు సాయపడి నిల్చోబెట్టడంలో కష్టమేమి లేకపోయింది. అప్పుడు, బాగా ఉన్న సోఫాచూసుకొని ఆయన కూచున్నారు.

ఆయనకు - నన్ను పేరుపెట్టి పిలిచేటప్పుడల్లా, నా పేరు చివర ఉన్న 'థం' అన్న అక్షరాన్ని బలంగా, గట్టిగా ఉచ్చరించడం పూర్వపు అలవాటు. నేను కాంగ్రెసు వదిలిన తర్వాత మేము తరచుగా కలుసుకోకపోయినా, నన్ను ఆ విధంగా పిలవాడాన్ని ఆయన మరిచిపోలేదు. పేరుపెట్టి పిలిచి, ఆయనే సంభాషణ ప్రారంభించారు: "నీకేమో కాంగ్రెసులో పున:ప్రవేశం చేయడానికి మానసికమైన అభ్యంతరాలున్నాయని బలవంతరాయ్ మెహతా అంటున్నాడు. అది ఎంతవరకు సరి అయిన అభిప్రాయం?"

దానిపై నేను, "మనం కలుసుకున్నది, ఎన్నికల వ్యూహం పన్నడం కోసం కదా? పార్టీ విడిచిపెట్టి, మీ పార్టీలో చేరాలన్నట్లయితే - అది ఏదో సహజమైన, చారిత్రక ప్రవాహంలో జరగవలసిన పని. కాని, ఎన్ని కలకోసం పార్టీ మారడంవల్ల ప్రజలకు అంతకుముందు మాలో ఉన్న విశ్వాసం తగ్గికూడా పోవచ్చు. అందుచేత, కాంగ్రెసులో కలియడం అన్న చర్చ వదిలిపెట్టి, ఎన్నికలలో మనం చేయవలసిన కార్యక్రమం గూర్చి నిర్ణయానికి వస్తే మంచిది. విడి పార్టీలుగా మనం పరస్పరం నియోజక వర్గాలు పంపకం చేసుకొంటే, ప్రజలలో నైతికంగా హెచ్చు విశ్వాసం కలగడానికి అవకాశం లేదు. అందుచేత, నేను బలవంతరాయ్ మెహతాగారితో సూచించిన సూత్రం మీకు వివరిస్తాను. ఏయే పార్టీలు ఈ 13 నెలలు ఆంధ్రలో కలిసి రాజ్యం చేశాయో, అవి - ఏకమైన ఎన్నిక ప్రణాళికతో, ఏకమైన సెలెక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని, ప్రజల ముందుకు ఏకగ్రీవంగా వెళ్ళినట్టయితే మనకు విజయం తప్పదు," అన్నాను.

నా ఈ మాటలు విన్నతర్వాత, ఆయన సూక్ష్మగ్రాహి గనుక, వెంటనే - అంగీకరించా నన్నమాట ప్రత్యేకంగా అనక, "మీ కలయికలో ప్రొఫెసర్ రంగాగారి పార్టీని కలిపితే బాగుంటుందా?" అని యథాలాపంగా అడిగారు.

నేను వెంటనే, "ఆయన ఈ పార్టీలతో కలియడం దేశానికే, మన ఎన్నికలకూ కూడా చాలా మంచిది. ఆయనను తప్పకుండా కలియవలసిందని ఎలాగూ కోరదలుచుకొన్నాను," అన్నాను.

దానిపై నెహ్రూగారు "నేను త్వరలో ఇండోనేషియా ప్రాంతాలకు వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళేముందు, మీరుఢిల్లీవచ్చి కలుసుకొంటే - లాల్ బహదూర్‌శాస్త్రినీ, మౌలానా సాహేబునీ, మిమ్మల్ని కలిపివేస్తాను. నీవు చెప్పినట్టు మిగిలిన కార్యక్రమం వారితో నడిపించవచ్చును. నేను విదేశ పర్యటననుంచి తిరిగి వచ్చేసరికి, కొంత కార్యక్రమం సాగనివ్వండి," అన్నారు.

తర్వాత మామూలుగా కరచలనాలు మొదలైన వీడ్కోలు లాంఛనాల అనంతరం, సగం రాత్రివేళ, ఎవరి త్రోవన వారు వెళ్ళిపోయాము.

తెల్లవారే సరికి - నెహ్రూగారికి, నాకు మధ్య జరిగిన ఏర్పాట్లు పెద్ద అక్షరాలతో పత్రికలలో పడ్డాయి. చెన్నపట్నం పత్రికలలోనూ పడే ఉంటాయి.

అప్పటికి, ఏలూరులో రాష్ట్రకాంగ్రెసు కమిటీవారు సమావేశం కావడానికి ఏర్పాటు జరిగింది. ఇక్కడ వీరు, "ఈ విశ్వనాథం ఎవరు? ఈయనతో, మాకు ఒడంబడిక ఏమిటి? పత్రికలలోపడ్డ వార్తలు నమ్మడం ఎలా? మాకు స్వయంగా నెహ్రూగారినుంచి కబురువస్తే తప్ప, మా ఏర్పాట్లు మావే," అని పత్రికలవారి ముందు చెప్పగా, మర్నాడు పత్రికలలో ఆ వార్తలన్నీ పడ్డాయి.

పరిస్థితి చెడిపోకముందే, బలవంతరాయ్ మెహతాగారు - కళా వెంకటరావు ప్రభృతులకు కటకం ఏర్పాట్లు వివరించడానికి ఒక కాంగ్రెసు పెద్దను పంపడం జరిగింది.

ఆ పైని కాంగ్రెసు పార్టీవారు సజావుగా నాతో మాట్లాడి, మిగిలిన కార్యక్రమం సాఫీగా జరపడానికి అంగీకరించారు.

నే నీలోపునే ఆచార్య రంగాగారికి జరిగినదంతా చెప్పగా, భవిష్యత్ దృష్ట్యా, ఆయన ఈ కలయికలో భాగస్వామి కావడానికి వెంటనే అంగీకరించారు.

సోషలిస్టు నాయకులైన పి. వి. జి. రాజుగారినికూడా ఈ కలయికలో చేరవలసిందని నేను ఆహ్వానించినా, ఆయన నిరాకరించారు.

ఢిల్లీలో నెహ్రూగారితో సమావేశము

నెహ్రూగారు చెప్పిన తేదీకి మేము ఢిల్లీ వెళ్లాము. అక్కడ, రంగాగారు కూడా హాజరయి ఉన్నారు. సమావేశంలో లాల్‌బహదూర్ శాస్త్రిగారు కూడా కూచున్నారు.

కర్నూలులో ప్రభుత్వం జరుగుతున్నప్పుడు - కాంగ్రెస్ పార్టీకి చెంది, విశ్వాసరాహిత్య తీర్మానం వోటింగులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వోటు చేసినవారిని తప్ప, మిగిలిన వారందరిలో ఎవరు చేరినా చేర్చుకోవచ్చునన్నారు నెహ్రూగారు.

దానిపై రంగాగారు అటువంటి ఒక పేరు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెంది, విశ్వాసరాహిత్య తీర్మానానికి వ్యతిరేకంగా వోటు చేసిన ఒకరి పేరు చెప్పి, ఆ వ్యక్తిని ఈ ఏర్పాటులోంచి తప్పించగూడ గూడదన్నారు.

ఆ పేరు చెప్పేసరికి, నెహ్రూగారు మండిపడి, "ఆ.... పేరు మీరు ఎత్తకండి" అని కోపంగా, మరి మారుమాట చెప్పడానికి వీలు లేదన్నట్టు అన్నారు.

నెహ్రూగారు అంత కోపంగా ఏ వ్యక్తి గురించి అయినా అప్పుడు అన్నమాట మరే సందర్భంలోనూ నేను ఆయన నోటి వెంట వినలేదు.

ఇది అయిన తర్వాత, నెహ్రూగారు మమ్మల్ని లాల్‌బహదూర్ గారికి అప్పజెప్పారు.

అప్పు డింకా పార్లమెంటు జరుగుతున్న రోజులు. పార్లమెంటు భవనంలో గల శాస్త్రిగారి గదిలో మిగిలిన కార్యక్రమం ఆరంభమయింది. మేనిఫెస్టో (ప్రణాళిక)లో ఏయే అంశాలు చేర్చుకోవాలనే విషయంపై పది నిమిషాలు చర్చించాము. అది నిశ్చయం కాగానే, మర్నాడు కలుసుకుందామని అప్పటికి విడిపోయాము.

మర్నాడు శాస్త్రిగారి గదిలోకి నేను వెళ్ళేసరికి, ఆయన ఒక ప్రణాళిక ముసాయిదా తయారుచేసి ఉన్నారు. అది దీర్ఘమైనది కాదు. మూడు పార్టీలకు అంగీకారమైన భాషలో వ్రాసి ఉంది.

అయితే, ఈ మూడు పార్టీలకూ కలిపి ఆయన "సంయుక్త కాంగ్రెసు విథానమండలి పార్టీ," అని పేరు పెట్టారు. నేను ఆ పేరువద్దన్నాను. మేము కాంగ్రెసులో విలీనం కానపుడు, మా పార్టీ సభ్యులు, దానికి అంగీకరించరని నేను చెప్పాను. ఈ సమస్య చాలాసేపు తేలలేదు. శాస్త్రిగారు - ఒక మనిషి నిచ్చి, మౌలానా ఆజాద్‌గారి గదికి పంపించారు.

ఆజాద్‌గారితో నాకు చను వెక్కువ లేకున్నా నన్ను, ఆయన - 1928 నుంచి ఆలిండియా కాంగ్రెస్ కమిటీ సమావేశాలలోను, తర్వాత 1946 లో ప్రకాశంగారి మంత్రివర్గ నిర్మాణ సంబంధమయిన తగాదాలోను తరచుగా చూస్తూండడంవల్ల, నా విషయం తెలిసినవారే. ఆయన కొంత చనువు తీసుకొని నాతో అన్నారు: "మీ రెండు పార్టీలు - అంటే, ప్రజాపార్టీ, కృషికార్ లోక్‌పార్టీ కాంగ్రెసు పార్టీకన్నా తక్కువ సంఖ్యాబలం గలవి. అందుచేత, కాంగ్రెస్‌పార్టీ పేరు శాస్త్రిగారు ఉంచారు. మీతో కలియడంవల్ల 'సంయుక్త' అన్నమాట చేర్చారు. మీ పార్టీల వ్యక్తిత్వం ఇందులో పోలేదు, కాంగ్రెసు పార్టీ - మీ శాసన సభలలో ఉన్న పార్టీ అన్నిటికన్నా పెద్దది. దాని పేరే లేకుండా చేయడం మీ ఉద్దేశమా? ఈ సమయంలో అందరూ కొంత ఉదారంగా వ్యవహరించాలి."

కె. ఎల్. పి. ప్రతినిధి ఈ పేరు విషయం అంతగా పట్టించుకోలేదు. ఆ పరిస్థితిలో - అంతవరకు వచ్చిన కలయిక 'పేరు' కోసం నా ప్రతిపాదనవల్ల పాడు చేయడం మంచిదికాదని నా మనసులో ఊహించుకొని నేను కూడా అంగీకరించాను. దీంతో మూడు పార్టీల కలయిక, ఒకే ఎలక్షన్ మేనిపెస్టో అన్న నా ఎన్నికల వ్యూహం - అంతవరకు జయప్రదమైంది. ఇక మిగిలినవి అభ్యర్థులను ఎన్నుకొనే సంఘం ఏర్పాటు చేయడము; కూచుని కార్యక్రమం ఆరంభించడమూ,

సెలక్షన్ సంఘము - కార్యక్రమము

సెలక్షన్ సంఘంలో కాంగ్రెసు తరపున పార్టీ అధ్యక్షులయిన గోపాలరెడ్డిగారు, ప్రజాపార్టీ తరపున నేను, కె. ఎల్. పి. తరపున రంగాగారు పంపిన కందుల ఓబుల్‌రెడ్డిగారు సభ్యులము. మా కార్యక్రమం జరుపుకోడానికి విజయవాడలో జి. ఎస్. రాజుగారి భవనాన్ని రంగస్థలంగా ఎన్నుకున్నాము.

జి. ఎస్. రాజుగారు సంపన్న గృహస్థు. ఔషధాల ఉత్పత్తి పరిశ్రమ ఒకటి అప్పుడే స్థాపించి, అభివృద్ధి చెందుతూన్నవారు. తర్వాతి రోజులలో కాంగ్రెసులో చేరి, శాసన మండలికి ఉపాధ్యక్షుడుగా కూడా కార్యభారం వహించిన ప్రముఖులు. ఆయన తన భవనం మా సమావేశానికి ఇవ్వడమేగాక, అక్కడి సమావేశానికి వచ్చిన మాలో చాలామందికి, ఆతిథ్యం కూడా ఇచ్చేవారు.

మా ఉపసంఘంలో మొదట ఒక తీర్మానం చేసుకున్నాము. మాలో ఎవరు ఏ పేరు చెప్పినా ముగ్గురి అంగీకారంపైననే ఆ పేరు గల వ్యక్తిని అభ్యర్థిగా నిర్ణయించాలి. ఏ పేరు విషయంలోనైనా మాలో భేదాభిప్రాయాలు వస్తే, దాని విషయం ఢిల్లీలో లాల్ బహదూర్ శాస్త్రిగారి సముఖాన చర్చించాలనీ, అక్కడా నిర్ణయం కాకుంటే, ఆ విషయం శాస్త్రిగారి తీర్పుకు వదిలిపెట్టాలని తీర్మానించాము.

1948, 49, 50 లలో ఏయే తెలుగు మంత్రులపై, ప్రకాశంగారు - అధికార దుర్వినియోగం చేశారని ఆరోపించారో, వారిని అభ్యర్థులుగా ఉంచరాదని నేను ప్రతిపాదించాను.

ఆ సంబంధించిన మంత్రులు 1952 ఎన్నికలలో, ఆ ఆరోపణలవల్ల ఓడిపోయి, మూడేండ్లకు పైగా శాసన సభ్యత్వం పోగొట్టుకున్నారు కనుక - ఆ ప్రసక్తి తిరిగి ఇప్పుడు తేవడం కూడదని, కమిటీ సభ్యులేగాక, ఇతర పెద్దలు నలుగురూ ఏకమై అనడంవల్ల నా ప్రతిపాదన వీగిపోయింది.

వారికి ఈ ఎన్నికలలో ప్రయోగించిన క్రొత్త వ్యూహం, దాని పలుకుబడీ ఉపయోగపడి, వారందరూ జయంపొందడమేగాక, యధాతధంగా పెద్ద పెద్ద పదవులు పొందగలిగారు.

జిల్లావారీగా తీసుకొని మేము 60, 70 శాతం అభ్యర్థులను బెజవాడలోనే నిర్ణయించగలిగాము. వివాదాస్పదమైన అభ్యర్థుల విషయం నిర్ణయించడానికి అనుకున్నట్టుగానే ఢిల్లీ వెళ్ళాము. అది విపరీతమైన చలికాలము. ఢిల్లీలో శాస్త్రిగారి భవనంలో పగలు కొంతసేపు, రాత్రి కొంతసేపు చర్చలు జరిపాము.

అక్కడ చర్చలు జరుగుతుండగా, కాంగ్రెసు పక్షం పేర్లు రెండు విధాలుగా ఉన్నట్టుగా మాకు కనిపించాయి. వారిలో కొందరు గోపాలరెడ్డిగారి పలుకుబడివల్ల, కొందరు సంజీవరెడ్డిగారి పలుకుబడివల్ల ముందుకు త్రోసుకు వస్తున్నట్టు మాకు కనిపించింది.

రంగాగారి పార్టీవారు తమ అభ్యర్థుల పేర్లను చెపుతున్నప్పుడు, గోపాలరెడ్డిగారు తమ అభ్యర్థుల పేర్లను చెపుతున్నప్పుడు ఒకరి నొకరు హెచ్చుగా మద్దతు చేసుకుంటున్నట్టు పైకి కనిపించేది. వివాదస్పదమైన కొన్ని పేర్లు శాస్త్రిగారికి వదిలినప్పుడు, ఆయన వ్రాతపూర్వకంగా తన తీర్పు చేసేవారు. అందులో చాలా తీర్పులు నా వాదాన్ని త్రోసిపుచ్చేవిగానే ఉండేవి.

ఎలాగయితేనేమి 196 సీట్లకు (స్థలాలకు) 167 నియోజక వర్గాలలో అభ్యర్థులను నియమించాము. ఈ 167 నియోజక వర్గాలలో, 133 ఏక సభ్య నియోజక వర్గాలు.

ఎన్నికల్లో, నావల్ల ప్రతిపాదింపబడ్డ ఎన్నికల వ్యూహం చాలా బాగా పనిచేసింది. 196 సీట్లలోనూ, 147 యునైటెడ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీకి సంప్రాప్తించినవి. పాత శాసన సభలో దాదాపు 40 సీట్ల దాకా ఉన్న కమ్యూనిస్టు పార్టీకి, ఈ మారు 14 సీట్లే దక్కాయి.

నేనుమాత్రం నా ఎన్నికలో ఓడిపోయానని ఇదివరలోనే వ్రాశాను.

తొందరపడి మా మీద విశ్వాసరాహిత్య తీర్మానం తేకపోయి ఉంటే, ఇంకా ప్రతిపక్షంవారు తమ మాట జరిపించుకుంటూ ఉండగలిగేవారు. ప్రగతిపథాన పయనించే ప్రకాశంగారి మంత్రివర్గం జరుగుతూండడానికి అవకాశం ఉండేది. ఆ విధంగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే విశాలాంధ్ర ఏర్పాటయి, ప్రాంతీయఖండాలు లేనట్టి విశాలాంధ్ర పరిపాలన సామరస్య సౌష్ఠవాలు కలిగిఉండేది.

అయితే, జరగవలసిన చరిత్రను ఎవరు మార్చగలరు?

నాయకుని ఎన్నిక విషయము

ఢిల్లీలో ఉన్న కాంగ్రెసు అధిష్ఠాన వర్గం వారికి, తమ బలవత్తరమైన ప్రమేయం లేకుండా, పార్టీ శాసన సభ్యులు నాయకుని ఎన్నుకోవడం ఇష్టంలేదు. అందుచేత, లాల్‌బహదూర్‌శాస్త్రి, కాంగ్రెసు అధ్యక్షులు దేబర్ గారలు విజయవాడకు వచ్చారు. వారు - చర్చలు సలహాలు వారితో వీరితో చేశారే కనీ, ప్రకాశంగారితో ఏమీ చర్చించలేదు.

ప్రజాపార్టీనుంచి వచ్చిన సభ్యులమంతా రామమోహనరాయ్ హాలులో సమావేశ మయ్యాము. మంచి ఎండవేళ. ప్రకాశంగారు ఆ హాలు దగ్గరికి వచ్చి, లోపల ఉన్న నాకు కబురు చేశారు. నేను దిగి వచ్చేసరికి ఆయన - కారులో, తడి తువ్వాలు ఒకటి నెత్తిపైన వేసుకుని, దగ్గరగా ఉన్న ఒక పల్లెటూరికి వెళ్ళుతున్నట్టు చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో మేమంతా ఉన్నప్పుడు, ఒక తెలుగు మంత్రిపై, ఒక డెటిన్యూ సంబంధంలో ఆయన చేసిన అధికార దుర్వినియోగం గూర్చి, ప్రకాశంగారికి ఎఫిడవిట్ (వ్రాసిన విషయాలు సత్యమనే ప్రమాణ) పూర్వకంగా ఆ గ్రామంలో ఒకరు ఫిర్యాదు చేశారు.

అయితే - ఆరేడేండ్ల క్రింద జరిగిన వ్యవహారం గనుక అప్పుడు ఆ విషయాలను గూర్చి దోషారోపణ చేసినవారు యిప్పుడు అవసరమైతే సమర్థిస్తారో లేదో నిర్ధారించుకొనేందుకు, ఆ మండుటెండలో, అట్టే వ్యవధిలేని ఆ రోజున, అత్యవసరంగా ఆయన బయలుదేరారు.

83 సంవత్సరాల వయసులో ఆయన కున్న పట్టుదల, రాజ్యం పెద్దరికంలోకి రావలసినవారు, అధికార దుర్వినియోగం చేయనివారు కావాలనే దీక్ష అక్కడ ఉన్న మా కందరికీ ఆశ్చర్యం కలిగించాయి.

ఆ ఎండలోనే తిరిగి వచ్చి, ఆయన తాము బసచేసిన పి. డబ్ల్యూ. డి. వసతి గృహంలో నిద్రపోయారు.

ఆ సమయంలో నేను అక్కడికి ఫర్లాంగు కన్న తక్కువ దూరంలో ఉన్న ప్రభుత్వ అతిథి గృహానికి (స్టేట్ గెస్ట్ హౌస్) దేబరుగారిని, శాస్త్రిగారిని చూడ్డాని కని వెళ్ళాను.

ప్రకాశంగారు బసచేసిన గదికి ప్రక్కగదిలోనే తానూ బస చేసినా - సంజీవరెడ్డిగారు, ఆయనతో అట్టే దోస్తీగా మాట్లాడుతున్నట్టు కనిపించలేదు. సంజీవరెడ్డిగారు తన మటుకు తాను, తానే నాయకుడుగా ఎన్నిక కావాలనే యత్నంలో ఉన్నట్టు కనిపించింది.

కాని, కాంగ్రెసు పక్షంవాడు గనుక, ఆయన - దేబర్, శాస్త్రిగారలతో మంచిగా ఉండడానికి యత్నించడం సహజము. నేను - దేబర్, శాస్త్రిగారలను చూడ్డానికి స్టేట్ గెస్ట్ హౌస్‌కి వెళ్ళగా, వారు ఈ విషయంలో నా అభిప్రాయం తెలియజేయ వలసిందని కోరారు.

అందుకు, ప్రకాశంగారితో మీరు మాటాడినట్టు కనిపించదే, అన్నాను.

"లేదు, ఇంకా మాట్లాడలేదు. ఆయన పెద్దవారయిపోయారు గదా!" అని, ప్రకాశంగారిని త్రోసిపారేశామని ధ్వనించేటట్టు వారు మాట్లాడారు.

అప్పుడు నేను ఇలా చెప్పాను: "మీ మాట ఆశ్చర్యకరంగా ఉంది. ఈ విషయాలు మనం చర్చించడంకన్న మీ ఎవరి పలుకుబడీ అనవసరంగా వినియోగించ నక్కరలేకుండా - శాసన సభ్యులకే వారు యధేష్టంగా వ్యవహరించుకొనే అవకాశం వదిలివేయడం అత్యున్నతమైన పద్దతి."

దానికి వారు, "మీరు చెప్పినమాట వాస్తవమే. కాని, మా పార్టీ పెద్దది గనుక మేము ఎవరిదో ఒక పేరు మా సభ్యులకు సూచించాలి గదా!" అన్నారు.

దాని కిలా జవా బిచ్చాను: "ఒక విశ్వాస రాహిత్య తీర్మానం సభలో ఆమోదింపబడినమీదట ప్రకాశంగారి ప్రభుత్వం పతనమయింది. పతనానంతరం, ఈ ఎన్నికలలో ప్రకాశంగారు, సంజీవరెడ్డిగారు, వారితో ఉన్నవారందరూ - నేను ఒక్కణ్ణి తప్ప, తిరిగి ఎన్నికయ్యారు. నాయకత్వం సహజంగా ప్రకాశంగారికి సంక్రమించాలి గదా!"

అందుకు వారు, "ఆయన చాలా పెద్దవారయిపోయారు" అన్నారు. నేను అందుకు ప్రత్యుత్తరంగా, "ఆయన పెద్దవారైతే, పనిచేయడానికి ఆయనతోబాటు చిన్నవారంతా ఉన్నారు కదా! ఒక వేళ, ఆయన పేరు మీరు కాదనదలచుకొంటే, ఆయనతోపాటే ఉప ముఖ్య మంత్రిగా పని చేసిన సంజీవరెడ్డిగారున్నారు గదా! మీరు, నేను ఈ భాగం చర్చించే ముందు, ప్రకాశంగారితో మాట్లాడకుండా మీరు ఏమీ చేయడం మంచిది కాదు," అన్నాను. నేను, దేబరుగారు, శాస్త్రిగారు మాట్లాడుతున్న సమయంలో రంగాగారు మా మాటలు వింటున్నారో లేదో తెలియదు. ఆయన మరేదో ఆలోచిస్తూ కూచున్నట్టుగా, కొంచెం ఎడంగా ఉన్నారు. ఆయన, గోపాలరెడ్డి విషయం చెప్పడానికి వచ్చినట్టుగా నాకు తెలుసు. ఆ వసతి గృహంలో ఆతిథ్యపు ఏర్పాట్లు కూడా, గోపాలరెడ్డిగారి నాయకత్వాన్ని బలపరచడానికి యత్నిస్తున్న వి. రామకృష్ణగారే చేశారు.

నేను అన్నదానిపైన దేబరుగారు నాతో, "పోనీ, ప్రకాశంగారితో మీరు మాట్లాడిరండి," అన్నారు.

"మీరూ వస్తే బాగుంటుంది గదా," అని నే నంటే, "అక్కరలేదు. మీరు వెళితె చాలును," అన్నారు.

ఆయనతోను, శాస్త్రిగారితోను - "నేను ప్రకాశంగారితో మాట్లాడివచ్చి, ఆయన చెప్పినది మీతో చెప్పే వరకు, మీరు ఏ పేరూ సూచించకుండా ఉండాలి సుమండి!" అంటే, దేబరుగారు "అలాగే, మీరు వచ్చేవరకు ఏ పేరూ పైకి చెప్పబోము," అని అసందిగ్ధంగా చెప్పారు.

నేను రోడ్డు అవతల ఉన్న విశ్రాంతి భవనానికి, ప్రకాశం గారితో మాట్లాడడానికి వెళ్ళాను.

ఎండలో తిరిగి తిరిగి రావడంవల్ల, ఆయన నిద్రపోతున్నారు. ఆయనను లేపడానికి యత్నించాను. ఆయన లేవలేదు. ప్రక్కగదిలోకి వెళ్ళి, సంజీవరెడ్డి గారితో, "దేబర్‌గారు ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది. మీరు మాత్రం మెత్తపడకండి," అని అ ఒక్క ముక్క మాత్రం చెప్పి, తిరిగివచ్చి ప్రకాశంగారిని లేపాను.

ఆయన మెల్లిగా కళ్ళు విప్పి, "ఏమి జరుగుతున్నదయ్యా?" అని నన్నడిగారు. ఆయనతో నేను దేబర్‌గారితో మాట్లాడిన విషయం గురించి రెండు మూడు వాక్యాలు చెప్పేసరికి, లాల్ బహదూర్‌శాస్త్రి గారు గది గుమ్మందగ్గరికి వచ్చేశారు. నేను ఆయనను చూసి, "ఏమిటి శాస్త్రిగారూ! అపుడే మీరిక్కడికి వచ్చేశారేమిటి?" అని ప్రశ్నించాను. ఆయన, "దేబర్‌జీ - గోపాలరెడ్డిగారి పేరు వెల్లడించారు," అన్నారు. నేను, ఆశ్చర్యంతో --- "నేను, ప్రకాశంగారితో మాట్లాడి, మీ దగ్గరికి తిరిగి వచ్చేవరకు ఏ పేరు సూచించబోము అని మాట ఇచ్చారుగదా!" అని అడిగాను.

శాస్త్రిగారు, "నిజమే! కాని, దేబర్‌జీ పేరు ప్రకటించేశారు," అని చెప్పి, ప్రకాశంగారి మంచం దగ్గరికి నడవ నారంభించేసరికి, దేబర్‌ గారుకూడా ఆ గదిలోకి వచ్చేశారు. వీ రిద్దరూ రావడంచూసి, ప్రకాశంగారు మంచంమీదనుంచి లేవబోతూంటే, దేబర్‌గారు, "మేము గోపాలరెడ్డిగారిని నాయకుడుగా, మీ పార్టీవారు ఎన్నుకోవాలని ప్రకటించేశాము. మీరు ఆయనకు మీ ఆశీర్వాదాలు ఇవ్వాలి," అని కొంత వినయంగానే అడిగారు.

ప్రకాశంగారు కనుబొమలు కొంచెం పై కెత్తి, తమకు స్వాభావికమైన మంద్రస్వరంలో, "మీరు గోపాలరెడ్డిగారి పేరు ప్రకటిస్తే, ఆయన ఎన్నికవుతాడు. నా ఆశీర్వాదాలు ఎందుకు?" అన్నారు.

దేబర్‌గారు గతుక్కు మన్నారు. నేను ఆయనను ఒక అడుగు అవతలికి తీసుకువెళ్ళి, "నేను వచ్చేవరకు ఏ పేరు చెప్పకుండా ఆగుతామన్న మీరు ఎందుకింత తొందరపడ్డారు?" అని అడిగాను.

ఆయన, "ప్రకటిస్తే ఏం ప్రమాదం?" అన్నారు.

నేను, "ప్రకాశంగారు ఎదురు తిరిగితే చాలా ఇబ్బందులు వస్తాయికదా!" అన్నాను.

ఆయన, "అయితే, మీరు ప్రకాశంగారిని కొంచెం సమాధాన పరచండి. మీరు ఢిల్లీకి రండి, అన్ని సంగతులు సమగ్రంగా చర్చించు కుందాము," అని నాతో అని, ప్రకాశంగారివైపు తిరిగి, "విశ్వనాథం గారు ఢిల్లీ వస్తారు. ఆయనతో అన్ని సంగతులు మాట్లాడుతాను. ఇప్పటికి సెలవు ఇవ్వండి," అనగానే - ప్రకాశంగారు ఏ మాటా అనకముందే, 'దండము' అని చెప్పి గదిలోంచి వెళ్ళిపోయారు.

శాస్త్రిగారుకూడా "సెలవు" అని చెప్పి వెళ్ళిపోయారు.

దేబర్‌గారు కోరినట్టు నేను ఢిల్లీ వెళ్ళాను. ఇంతట్లో విజయవాడలో, ఎవరి ప్రోద్బలంవల్లనో తెలియదుగాని, ప్రకాశంగారు అప్పుడున్న పరిస్థితులపై ఒక ప్రకటన చేయబోతున్నారని పత్రికలలోపడింది. నేను ఆ విషయం దేబర్‌గారికి చెప్పి, ప్రకాశంగారికి ఒక తంతివార్త ఇప్పించాను. దాని సారాంశ మిది: "ఆంధ్ర పరిస్థితులు మేమంతా ఆలోచిస్తున్నాము మీరు తొందరపడి ఏ ప్రకటనా చేయవద్దని మా కోరిక,"

ప్రకాశంగారుకూడా కొంత సమాధాన పరచుకొని, తామిచ్చిన ప్రకటనలో, ప్రజలను రెచ్చగొట్టే వాక్యాలేవీ వ్రాయలేదు. కాని, అక్కడ ఢిల్లీలో దేబర్‌గారు, శాస్త్రిగారు వారు ఇదివరలో అన్నమాటలలో ఏ విధమైన మార్పుకీ అంగీకరించే ధోరణిలో లేరు.

గోపాలరెడ్డిగారి ముఖ్యమంత్రిత్వము

నాయకుని ఎన్నుకునే దినం ప్రకటింపబడింది. నాడు కాంగ్రెసు భవనం పరిసర ప్రాంతాలన్నీ ఒక పర్వదినపు రూపదర్శనం ఇచ్చినవి. బ్రహ్మాండమైన ఎన్నికల విజయం తర్వాత శాసనసభ్యులు సమావేశం కావడం అదే మొదలు.

దానికి రెండు రోజులుముందు సంజీవరెడ్డిగారు ఢిల్లీ వెళ్లారు. ఎన్నిక సమయానికి తిరిగివచ్చారు. ఆయన ఎన్నిక హాలులోకి ప్రవేశించక పూర్వంనుంచి, ఆయనకోసం ఎదురుచూస్తున్న నేను, ఆయనను ఎదుర్కొని, "మీరు గట్టిగా ఉండండి, మేమంతా ఉన్నాం గదా," అన్నాను.

ఆయన చెవులు ఈ మాటలువిన్నా, కళ్ళుమాత్రం పరధ్యానంగా ఉన్నట్టు నిశ్చయమయింది. ఆయన తొందరగా సభామందిరంలోకి వెళ్ళిపోయారు. కార్యక్రమం ప్రారంభించేసరికి, గోపాలరెడ్డిగారి పేరు వినబడేసరికే ఆయన అంగీకారం చూపించారు. ఆ పైన ప్రకాశంగారు, నేను చేయవలసింది ఏమీ లేకుండా పోయింది. గోపాలరెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యారు. పూర్వంలాగునే సంజీవరెడ్డిగారు ఉపముఖ్యమంత్రి అయ్యారు.

కొన్ని నెలల తర్వాత సంజీవరెడ్డిగారు విశాఖపట్నం రావడం జరిగింది. తంతి తపాలా శాఖకు సంబంధించిన ఏదో నూతన కార్యక్రమ ప్రారంభ సందర్భంలో ఆయన వచ్చారు. ఆ సభలో ఏదో సందర్బం చూసుకొని, ఉపన్యాసంలో ఇలా అన్నారు. "నేను ప్రకాశంగారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఉపముఖ్య మంత్రిగా ఉండేవాడిని. ఇప్పుడూ ఉపముఖ్యమంత్రిగానే ఉన్నాను. ఇప్పటి మాటకేమిలెండి. చేస్తే ప్రకాశంగారితో కలిసే మంత్రిపని చేయాలి. ఆ వేగం, ఆ కార్యదీక్ష, ఆ ప్రజా సంక్షేమప్రేమ - మరే ముఖ్యమంత్రి పరిపాలనలోను కలుగవు అని నా మనస్సులో నిశ్చయమైంది!"

ఆవేళ నిజంగా ఆయన మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పారు.

ఒకక్షణం ప్రకాశంగారి పరిపాలనా రథం - ప్రేక్షకులకు, శ్రోతలకు కళ్ళలు కట్టినట్టు కనిపించింది.

  1. ఆయన ఆలిండియా కాంగ్రెస్ కమిటీకి ఒక జనరల్ సెక్రటరీగా ఉండేవారు. తర్వాత, భాషా రాష్ట్రాలు ఏర్పడిన పిదప గుజరాత్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. అలా ఉన్నప్పుడే పాకిస్థాన్‌కు, మనకు ఒక చిన్న యుద్ధం ప్రారంభమయింది. రాష్ట్ర పరిపాలనాకార్యక్రమ సందర్భంలో, ఆయన వెళుతున్న విమానాన్ని పాకిస్థాన్ వారు కూల్చి వేశారు. ఆయన అసువులు బాశాడు. భారతదేశం అనుపమాన దేశభక్త రత్నాన్ని కోల్పోయింది.