Jump to content

నా జీవిత యాత్ర-4/విశ్రాంతి ఎరుగని కర్మవీరునికి సుదీర్ఘ విశ్రాంతి

వికీసోర్స్ నుండి

24

విశ్రాంతి ఎరుగని కర్మవీరునికి సుదీర్ఘ విశ్రాంతి

అప్పటికే ప్రకాశంగారు వృద్ధులైపోయారు. ఆయన 1954 లో బెంగుళూరు ప్రైవేటు హాస్పిటలులో కేటరాక్టు (కంటితిమిరం)కు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్నారు. దృష్టి కొంచెం తగ్గినట్టుగా ఇతరులకు అనిపించేదిగాని, ఆయన కన్ను నిండా తెరవకుండానే దూరంగా ఉన్నవారిని బాగా పోల్చుకోగలిగేవారు. ఇతరులు చెప్పింది అవగాహన చేసుకోవడంలో ఎటువంటి మాంద్యమూ ఉండేది కాదు. చదువుకోడానికి కాగితం కంటికి బాగా దగ్గరగా పెట్టుకోవలసిన అవసరం మాత్రం వచ్చింది. అయినప్పటికీ, కాగితంలో ఏ బాగంలో ఏ విషయం ఉందో ఆయనకు బాగా జ్ఞాపకముండేది.

ఒక రోజున కాబినెట్ మీటింగులో, నెహ్రూగారి దగ్గరినుంచి వచ్చిన ఒక ఉత్తరం చదివి వినిపిద్దామనుకొన్నాము. మాతో - తాను స్వయంగా చదవలేనందుకు ఏమీ అనుకోవద్దని, పర్సనల్ అసిస్టెంటును పిలిచి చదవమన్నారు.

ఆ చదవమనడంలో, మా కోరిక ప్రత్యేక విషయం చెబుదామని ఆయన ఉద్దేశం పెర్సనల్ అసిస్టెంటు ఆ కాగితం చదువుతూ, ఆ విషయానికి రాలేదు. "నువ్వు ఇంతసేపూ మొదటి పేజీలోనే ఉన్నావు. నాకు కావలసింది రెండవ పేజీలో చివర, ఒక క్రొత్త పేరాగ్రాపు ఆరంభంలో ఉన్నది. అది చదువు," అన్నారు.

ఆయన కాగితాలు స్వయంగా చదువుకోలేరని ఆయనపై జవహర్‌లాల్ నెహ్రూగారికి గవర్నరు 'ఉత్తరాలు వ్రాసిన రోజులవి.

ఆ ఉదంతం జరిగి ఏడాది అయిపోయింది.

పూర్వం రోజుకు రెండుగంటలు నడిచే ప్రకాశంగారు, ఇప్పుడు ప్రొద్దునవేళ, సాయంకాలంవేళ పది నిమిషాల నడకతో సంతృప్తి చెందవలసి వచ్చింది.

అయినా, హైదరాబాదు, విజయవాడ, చెన్నపట్నాల మధ్య పర్యటించడం, పాత మిత్రులను కలుసుకోవడానికి యత్నించడం ఆయన మానలేదు.

అన్ని కార్యాలలోను మనిషి సాయం కావలసిన రోజులు వచ్చాయి. కాని, అటువంటి పరిస్థితిలోనే, నేను ఢిల్లీలో ఉండగా, ఆయన - కొడుకూ అతని పిల్లలూ, ఉప్పులూరి వెంకటకృష్ణయ్యగారూ, మొదలైనవారితో కలిసి వచ్చారు.

నేను ఎంత కోరినా మా యింటి దగ్గర బస చేయక, కొడుకు ప్రోద్బలంవల్ల, నాకు అనవసరంగా కష్టం కల్పించడం ఇష్టం లేదనే నెపంమీద, 'ఇంపీరియల్‌' హోటలులో దిగారు. 3, 4 రోజులుండి, గోవిందవల్లభ పంత్‌గారితో మాట్లాడి విజయవాడ తిరిగి వెళ్ళారు.

ఆ రోజుల్లోనే ఉప్పుటూరి వెంకటకృష్ణయ్యగారు తాను కోర్టు వేలంలో కొనుక్కునా స్వరాజ్య ఆఫీసు భవనాలు అమ్మి, అందులో తాను ఖర్చు పెట్టిందిగాక అదనంగా వచ్చిన డబ్బు, ప్రకాశంగారి కొడుకు హనుమంతరావుకు అంతో, ఇంతో ఇస్తానని వ్రాసిన కాగితం నాకు చూపించారు. నేను అది బాగానే ఉన్నదని ఆయనను ప్రశంసించాను. కాని, తరువాత మాత్రం అలా జరిగినట్టు కనిపించలేదు.

ప్రకాశంగారు - సహజంగానే, సభావేదికమీద మాట్లాడవలసి వచ్చినప్పుడు, కొంతసేపటివరకు మాట్లాడ నారంభించక పోవడం అందరికీ తెలిసిందే. అప్పుడు కూడా కొన్ని వాక్యాలు మాట్లాడిన తర్వాత, మధ్య మధ్య ఆగడం కూడా జరుగుతూండేది. అయినప్పటికీ, ఉపన్యాస వస్తువుకూ, క్రమానికీ ఏమీ భంగం ఉండేది కాదు.

వయసులో ఉన్నప్పటిలాగే ఎండల్లో కారు ప్రయాణాలు చేయడం ఆయన మానలేదు.

ఇంతలో విశాలాంధ్ర ఏర్పడింది. సంజీవరెడ్డిగారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధ్రుల ప్రతిభ ప్రకాశవంతమైనదనే సంతృప్తితో ప్రకాశంగారు దేశం నలుమూలలకూ పర్యటిస్తూండేవారు.

1957 మే లో ఆ విధంగా అతి తీవ్రమైన ఎండలలో ఒంగోలు ప్రాంతంలో పర్యటించి, వడదెబ్బ తిని కారులోనే హైదరాబాదు చేరుకున్నారు. కొందరు మిత్రులు, ఆయన పడుతున్న బాధ చూసి హాస్పిటలులో చేర్చితే మంచిదని తీసుకుపోయి ఉస్మానియా హాస్పిటలులో చేర్చారు.

అంత్య దృశ్యము

ఆ విధంగా, ప్రకాశంగారు 18 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. 19 వ రోజున చికిత్స చేయడానికి, అక్కడున్న వైద్యులు ఆయనకు ప్రాణవాయువు ఇవ్వడానికి, ప్రయత్నించారు. ప్రకాశంగారు లోగడ ప్రకృతి చికిత్సలోను, విద్యుత్ చికిత్సలోను మాత్రం నమ్మకమున్నవారు గనుక, ప్రాణవాయువు తీసుకోడానికి నిరాకరించారు.

కాని, 20 వ తేది ఉదయం ఆయనని చూడడానికి అక్కడికి వచ్చిన మంత్రి వి. బి. రాజు ప్రోద్బలంవల్ల ఆక్సిజన్ ఇవ్వడానికి తిరిగి ప్రయత్నించారు. అప్పటికే ప్రకాశంగారికి ఆ చికిత్సను నిరాకరించే శక్తి తగ్గిపోయింది. ఆ ప్రాణవాయువు ఆ రోజు ప్రకాశంగారికి ప్రయోజనకారి కాలేకపోయింది.

ఆయన నాడి అతి బలహీనమై పోయింది. కఫం కమ్ముకొని రా సాగింది. ఊపిరి తిత్తులు వ్యాధిపూరితము లయ్యాయి.

సాయంకాల మయింది. అక్కడ ప్రక్కన వైద్యనిపుణులయిన కె. ఎస్. రావు, వెంకటస్వామి, దయాళ్‌దాసు, తాహి, చారి, బహదూర్‌ఖాన్, సయ్యద్, శ్రీమతి భారతి, శ్రీమతి లక్ష్మీగారలు మొదలైన ప్రఖ్యాతులంతా చుట్టూ ఉన్నారు.

ప్రకాశంగారి కొడుకు హనుమంతరావు - భార్య, పిల్లలతో మంచం ప్రక్కన నిల్చున్నాడు.

7-35 అయేసరికి - సామూహికంగా, దు:ఖసూచకంగా పెద్ద కేకలు అనుకోకుండా అందరి గొంతుకలలోంచి వినబడ్డవి.

అంతవరకు దేహస్థంగా ఉన్న ప్రకాశంగారి ఆత్మజ్యోతి, ఈశ్వర జ్యోతిలో కలిసిపోయింది.

ప్రక్క గదిలో నున్న అల్లూరి సత్యనారాయణరాజు, తనకున్న జబ్బుతోనే ప్రకాశంగారి మంచం దగ్గరికి ఒక్క గెంతులో వచ్చి, "అమ్మో" అని కేక వేశాడు.

అంతక్రితం, ఒక పది నిమిషాల ముందు వచ్చిన గోపాలరెడ్డిగారు అక్కడే ఉన్నారు. గోపాలరెడ్డిగారు వచ్చారని హనుమంతరావు తండ్రి చెవిలో చెప్పగా, ఆయన కళ్ళు సగం తెరిచి మాట్లాడడానికి యత్నించారు. కాని, యత్నించిన మాట రాకుండానే కన్నులు అలాగుననే మూతపడ్డాయి.

అప్పటికప్పుడే హాస్పిటలు ఆవరణలోకి ఈ మరణ వార్త విని వందలకొద్ది ప్రజలు ప్రవాహంగా వచ్చేస్తున్నారు.

మేడమీదనుంచి, శరీరాన్ని క్రిందికి తెచ్చి, మంచుగడ్డల పేర్పు మధ్య పెట్టారు.

అంతలో, ఆంధ్రప్రదేశ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎమ్. పి. పాయ్‌గారు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో చిత్తూరులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి సంజీవరెడ్డిగారు, ఈ వార్త విని - పర్యటన కార్యక్రమం రద్దు చేసుకొని, తెల్లవారేసరికి వస్తున్నట్టు తంతివార్త ఇచ్చారు.

ప్రకాశంగారిపై గౌరవ సూచకంగా, ప్రభుత్వ కార్యాలయాలకు ఆ రోజు సెలవు ప్రకటించారు. ఉదయం రేడియోలో - ప్రకాశంగారు స్వర్గస్థు లైనారన్న వార్త విని, ఉస్మానియా హాస్పిటలు ఆవరణలో వేలకొద్ది ప్రజలు క్రిక్కిరిసి పోయారు. ఒక్క అరగంటలో ఆ పరిసరాలలో గల రస్తాలన్నీ బహుజన సంకీర్ణములై నాయి.

జీవితకాలంలో, విశ్రాంతి అన్న మాట వినడానికి సహించని నాయకమణి, ఇపుడు దీర్ఘ విశ్రాంతి తీసుకుంటున్నట్టు - ప్రకాశంగారి ముఖము కనిపించింది. వడదెబ్బకు తట్టుకోలేక ఆసుపత్రికి చేరిన ఆ శరీరము, అతి శీతలమైన మంచు పలకల మధ్య ఆ వడదెబ్బను పోగొట్టుకుంది.

అప్పటికి 56 సవత్సరాలక్రిందట, స్వాతంత్ర్యోద్యమంలో చేరినవాడు, ఆయనను విడిపోయిన చందనాది పరిమళ ద్రవ్యాలు, సుగంధ కదంబ పుష్ప మాలికలు - ఇప్పుడు ఆయన ముఖం తప్ప మిగిలిన శరీర భాగాలన్నిటినీ ప్రీతితో తమలో ఇముడ్చుకున్నవి.

అంతలోనే - గోదావరి, కృష్ణా, గుంటూరు, ఖమ్మం మొదలైన జిల్లాలనుంచి దొరికిన రైళ్ళలో, బస్సులలో, కార్లలో వచ్చిన వేలకు వేలు ప్రజలు హైదరాబాదు నగరంలో నిండిపోయారు.

ఉదయం 8 గంటలయింది. ప్రకాశంగారి భౌతికదేహాన్ని వహించే భాగ్యం పొందిన అంబులెన్సు బండి ఆ దేహంతో గాంధీ భవనం, చేరుకుంది. గాంధీ భవనం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు సంఘ భవనము.

సాయుధ పోలీసు దళాలు అంబులెన్సు ముందుగా నడిచాయి. వారి వెంట మంత్రులు, కార్యదర్శులు, ఉద్యోగులు నడిచారు. వారిని ప్రజా తరంగాలు అనుగమించాయి. అప్జల్‌గంజి, సిద్ధి అంబర్ బజారు, ఉస్మాన్ గంజి, ముజమ్‌షాహి రాజపధము మొదలైన రస్తాల గుండా ప్రకాశంగారిని తీసుకువెళ్ళే అంబులెన్సు బండీ వెళ్తున్నప్పుడు రెండు ప్రక్కల ప్రజలు దట్టమైన వరుసలలో నిల్చున్నారు. వారి ముఖాలలో, కళ్ళల్లో - చెప్పలేని ఆర్తి, స్పష్టంగా వ్యక్తమయే భక్తి కనిపించాయి.

విశ్రాంతి ఎరుగని కర్మవీరునికి సుదీర్ఘ విశ్రాంతి
(Courtey: Director of Inf/ & Pub.Relations, Govt. of Andhra Pradesh.)

గాంధీ భవనం దగ్గర ఒక ఎత్తయిన వేదిక కట్టారు. దానిమీద మంచుదిమ్మలు పరిచారు. వేదికకు నాలుగువైపుల రంగు రంగుల ముగ్గులు పెట్టి, నాలుగు మూలలా నాలుగు దీపస్తంభములు నిలిపారు. చుట్టూ పువ్వులు వరుసల్లో పేర్చారు. వలయాలుగా చుట్టుకుంటూ, వేదిక చుట్టూ ఉన్న అగరువత్తిధూపములు, అఖండంగా సుగంధాన్ని వ్యాప్తం చేశాయి. తుపాకులు తలక్రిందులుగా తిప్పి పట్టిన సాయుధపోలీసులు నలువైపుల నిలుచున్నారు.

మరణము దు:ఖకరమైనదే. కాని, పూర్వ వైరాలను మరపిస్తుంది. జన్మాంతర సౌహృదాలను పునరుద్భవింప జేస్తుంది.

కళా వెంకటరావుగారు - ప్రకాశంగారి భౌతిక దేహాన్ని అంబులెన్సు బండినుంచి దించి వేదికపై పెట్టడానికి చేయిసాయం చేశారు.

కస్తూరిబాయి విద్యాలయంనుంచి వచ్చిన ఆడపిల్లలు 'రామ భజన' చేశారు. మరికొందరు పెద్దలు 'గీతాపఠనం' చేశారు. వేద పండితులు 'వేద పఠనం' చేశారు.

పండిత జవహర్‌లాల్ నెహ్రూగారి పేరిట ఒక పెద్ద పువ్వుల దండను నీలం సంజీవరెడ్డిగారు మొట్ట మొదట ప్రకాశంగారి భౌతిక దేహంపై పెట్టారు. తరువాత గవర్నరుగారి పేరిట, ఆయన కార్యదర్శి రెండవ పువ్వులదండ పెట్టారు. మూడవది పండిట్ గోవింద వల్లభ పంత్‌గారి పేరిట కళా వెంకటరావుగారు పెట్టారు. ఆ తర్వాత - ఇ. సి. ఎస్. ఉద్యోగులందరి పేరునా ముఖ్య కార్యదర్శి ఎమ్. పి. పాయ్‌గారు; పోలీసుదళాల పక్షాన ఇన్స్పెక్టర్ జనరల్ నంబియారుగారు, ఆంధ్రాకాంగ్రెసు పక్షాన అల్లూరి సత్యనారాయణ రాజుగారు; తెలంగాణా కాంగ్రెసు పక్షాన నూకల సరోత్తమరెడ్డిగారు; హైదరాబాదు కాంగ్రెసు పక్షాన వాసుదేవ నాయక్‌గారు; కార్మిక సంఘాల పక్షాన రావి నారాయణరెడ్డిగారు; శాసన, శాసన విధాన, శాసన మండలుల సభ్యుల తరపున బద్దం ఎల్లారెడ్డి, మద్దం మొహిదీన్, అంజయ్య గారలు ప్రకాశంగారి దేహంపై పూలమాలలు ఉంచారు.

ఆ విధంగా సాయంకాలం నాలుగు గంటలదాకా పౌర జన ప్రవాహం నిరంతరంగా ప్రవహించసాగింది.

ఉదయమే, ప్రకాశంగారి తమ్ముడు శ్రీరాములుగారి కూతురు ప్రఖ్యాత గాయనీమణి కుమారి సూర్యకుమారి అన్నదమ్ములతోబాటు వెక్కివెక్కి ఏడుస్తూ, అడుగులు తడబడుతూ మంచుపలకలతో పేర్చిన ఆ మహావేదిక నెక్కి, పెదతండ్రి ప్రకాశంగారి భౌతిక దేహదర్శనం చేసింది.

కడసారి భూతలయాత్ర

సాయంకాలం నాలుగు గంటలయింది. చండభానుని ఉగ్రత తగ్గ నారంభించింది. ప్రకాశంగారి దేహాన్ని మంచుపలక వేదికపై నుంచి దించి, పోలీసు దళానికి చెందిన ఒక మోటారు వాహనంలో ఉంచారు. ఆ వాహనానికి ముందుగా చాలా పెద్ద పూవుల దండ అమర్చారు.

ప్రకాశంగారి భౌతికదేహం భూతలంపై కడసారి యాత్రకు తరలింది.

ముందుగా ముఖ్యమంత్రి సంజీవరెడ్డిగారు, మంత్రులైన కళా వెంకటరావు, బసవరాజు గారలు, వెంట ముఖ్యకార్యదర్శి పాయ్‌గారు, ఆ ప్రక్కనే అల్లూరి సత్యనారాయణ రాజుగారు, సచివాలయంలోగల పెద్ద ఉద్యోగులు, పౌర ముఖ్యులు - ఆ వాహనం ముందుగా నడిచారు.

వారి వెంట మోటారు సైకిళ్ళపై పోలీసు ఉద్యోగులు, వారి వెనుక పోలీసు బాజా బజంత్రీలు (బేండ్), వారి వెనుక పదాతులైన పోలీసు దళాలు, వారి వెనుక శాసన సభ్యులు, పొర ముఖ్యబృందములు, వారి ననుసరించి వేలాది ప్రజాసామాన్యము అబిడ్స్ రాజమార్గం, బేంకురస్తాల గుండా కాచిగూడా రస్తాలమీదుగా నడిచి అంబర్‌పేట శ్మశానవాటిక చేరారు.

"ఎంత మనిషి పోయాడండీ!" "ఇంతటి అతను మరొకరు మళ్ళీ మనమధ్య పుడతాడా?" అనే మాటలుతప్ప ఇతరమైన మాటలు రాలేదు.

ప్రకాశంగారి భౌతికదేహాన్ని చివరిసారిగా చూడడానికి వచ్చిన లక్షల ప్రజల నోళ్ళనుండి అనుకోకుండానే ఈ మాటలు వెలువడడం జరిగింది. సాయుధ పోలీసుదళములు మూడుసార్లు సామూహికంగా తుపాకులు పేల్చారు. స్వర్గస్థులయిన ప్రకాశంగారికి కడపటి వందన మది. అ సమయంలో అంత్యనాద వాద్య (Last bugle) బృందం, ప్రకాశంయుగం అంతమైందని భారత ప్రజలంతా వినేటట్టుగా, దశ దిశలు మారుమ్రోగేట్టు ప్రకటించారు.

రాజాజీ - భారతదేశ స్వాతంత్ర్య సమరంలో ప్రక్కప్రక్కగా నిలబడి, ప్రకాశంగారూ తానూ నడిపించిన కార్యాలకు స్మృతిచిహ్నంగా, ప్రకాశంగారి చితిపై ఉంచడానికని ప్రత్యేకంగా, మంచి గంధపు చెక్కను, పిడికెడు బియ్యాన్ని పంపారు. చితి అంటించేముందు బంధుమిత్రులు స్వర్గస్థులైన వారినోట బియ్యంవేయడం దక్షిణ హిందూదేశ ఆచారము.

శ్మశానవాటికలో 'భుగ, భుగ' మండే అగ్నిజ్వాలలు స్వర్గస్థులైనవారి చితిని దహించే వేళ, ఉపన్యాసా లిచ్చేవేళ కాదు.

అయినా, పాశ్చాత్య పద్ధతుల ననుసరించి - సహచర రాజకీయ నాయకులు స్వర్గస్థులైనవారి భౌతిక దేహదహన సమయమున, ప్రశంసాపూర్వకమైన ఉపన్యాసాలు ఇవ్వడాన్ని, స్వాతంత్ర్యానంతరం మననాయకులు అదొక బలవత్తరమైన అలవాటుగా చేసుకున్నారు.

గవర్నరు త్రివేదిగారు పంపిన సందేశం ముఖ్య కార్యదర్శి పాయ్‌గారు చదివారు. సంజీవరెడ్డి, కళా వెంకటరావు, అల్లూరి సత్యనారాయణరాజు గారలు భౌతికదేహాన్ని స్వర్గవాహకమైన చితిపై అమర్చారు. అప్పటి వేదోక్త కార్యక్రమాన్ని మైలవరపు లక్ష్మీనారాయణగారు నడిపించారు.

సంజీవరెడ్డి, పద్మభూషణ్ మాడపాటి హనుమంతరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, కొండా వెంకటరెడ్డి, కళా వెంకటరావు, నూకల సరోత్తమరెడ్డి, అల్లూరి సత్యనారాయణరాజు, వి. వి. రాజుగారలు - ప్రకాశంగారి నాయకత్వ లక్షణాలను, ఆయన జీవితంలోగల కృతార్థతను 'నభూతో, న భవిష్యతి' అని, పలువిధములుగా భాషాపటిమతో ప్రశంసించారు. వారి ప్రశంసా వాక్య సందేశాన్ని స్వర్గసీమకు తీసుకు పోతున్నాయా అన్నట్టు, చితిపై అగ్ని జ్వాలలు, ఆకాశమార్గానికి ఎగిసి వెళ్లాయి.

ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశంగారి ఆత్మజ్యోతి, విశ్వజ్యోతిలో కలిసిపోయింది.

ఆంధ్ర హృదయాలలో చీకటి సుడులు తిరిగింది

లోక్‌సభలో జోహర్లు

21 వ తేదీనాడు లోక్‌సభలో గోవింద వల్లభపంత్‌గారు ఇలా అన్నారు.

"నూతనాంధ్ర నిర్మాత"

" ఈ ఉదయం పత్రికల్లో ప్రకాశంగారి మరణవార్త పడింది. ఇది అతి విషాదకరమైన వార్త. ప్రకాశంగారి జీవితం, దేశసేవకే అంకితమైన జీవితం. స్వాతంత్ర్య సమరంలో, ఆయన ప్రముఖమైన పాత్ర వహించారు. త్యాగాలు చేశారు. కష్టాలు పడినారు. ఎప్పుడూ సమరవాహినిలో ముందుగానే నడిచేవారు. ఆంధ్రదేశానికి ఆయనయందుగల అభిమానం, గౌరవం అపారములు.

ఆయన నూతన ఆంధ్రదేశానికి నిర్మాత. ధైర్యసాహసాలకు పెట్టింది పేరు. నిర్మాణ కార్యప్రతిపాద నాత్మకమైన అభిజ్ఞత ఆయనకుండేది. జీవితంలో ప్రతిక్షణం - ఆయన మేధస్సులోని ఊహా వై శిష్ట్యం, దేహమందుగల శక్తి భారత దేశసేవకూ, ముఖ్యంగా ఆంధ్ర ప్రజాభ్యుదయానికీ వినియోగించారు.

ఆయన కుటుంబనికి లోక్‌సభ సానుభూతి అందజేస్తున్నాను."

"త్యాగదీక్ష, కార్తదక్షత గల మహావ్యక్తి"

ఆయన తర్వాత, భారత ప్రధాని పండిత జవహర్‌లాల్ నెహ్రూగారు ఇలా అన్నారు: "హోమ్ మంత్రిగారు చేసిన ప్రశంసకు అదనంగా నేను చెప్పగలిగింది లేదు. నాకు జ్ఞాపకమున్నంతవరకు 1920 ప్రాంతాలనుంచి 35 సంవత్సరాలుగా ప్రకాశంగారితో నాకు సాహచర్యం ఉన్నది. ఒక్కొక్కప్పుడు సంపూర్ణంగా మేమిద్దరం ఏకీభవించకపోయినా, ఆయన గుణసంపత్తిని నేను ఎప్పుడూ ప్రశంసాభావంతోనే గ్రహించేవాడిని.

నిత్య జాగరకమైన ఒక శక్తి, నిస్సందేహంగా ఆయనలో ఉండేది. వయోవృద్ధులైన తర్వాత, మానవులకు సహజంగానే కొంత శక్తి తగ్గడం చూస్తూంటాము. అయినప్పటికీ ప్రకాశంగారు కార్యాచరణలో చూపించే జాగృతి, శక్తి, త్యాగదీక్ష, కార్యదక్షత మన స్మృతిపథంలో స్ఫుటంగానే ఉన్నాయి.

మహా వ్యక్తి మన మధ్యనుంచి వెళ్ళిపోయారు. ఆయన మహత్వం ఆంధ్రదేశ నిర్మాతగా మాత్రమే కాదు. భారత రాజకీయ రంగమందంతటా ఆయన ప్రభావ ముండేది. ఆయన కీ రోజు మనం, ఈ విధమైన ప్రశంసాపూర్వకమైన అంజలి చేయడం చాలా ఉచితమైన పని."

"బ్రిటిష్ తుపాకులకు గుండె చూపిన సాహసి"

ఆయన తర్వాత లోక్ సభ అధ్యక్షుడు (స్పీకరు) శ్రీమాన్ మాడభూషి అనంతశయనం అయ్యంగారు ఇలా అన్నారు:

"ప్రధాన మంత్రిగారు హోమ్ మంత్రిగారూ చెప్పిన మాటలతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను. వ్యక్తిగతంగా కూడా నాకు చాలా దు:ఖంగా ఉన్నది. ప్రకాశంగారితో కలిసి, ఆయన నాయకత్వాన పని చేసే అవకాశాలు నాకు చాలా కలిగాయి. ఆయన సంపన్నమైన పరిస్థితులలో తన జీవితం ప్రారంభించకపోయినా, రానురాను అత్యున్నతంగా పెరిగి, ఆంధ్రదేశానికి అగ్రనాయక స్థానం పొందారు. ఆయనకు గల దృఢ నిశ్చయం కార్యదీక్ష అనుపమాన మైనవి.

మనం సైమన్ బాయ్కాట్ (1928) చేసిన సమ యంలో, చెన్నపట్నంలో గల ఇతర నాయకులు సైమన్ రాకను ఎదిరించలేక చెన్నపట్నం వదిలి వెళ్ళిపోయారు. ప్రకాశంగారు ముందుకు వచ్చారు.

మిలటరీ పోలీసులు ప్రజావాహినిని అడ్డబోయినపుడు, చొక్కా విప్పి, తనపై తుపాకి గుండును వారు పేల్చుకోవచ్చని గుండె చూపించిన సాహసి ప్రకాశంగారు. ఆయన తన సర్వస్వం (దేశస్వాతంత్ర్య సమరంలో) త్యాగంచేసిన మహావ్యక్తి. ఆయన బారిష్టరు. ప్రముఖ న్యాయవాదిగా వృత్తిచేసి గొప్ప ఆస్తి సంపాదించారు. నిన్న ఆయన మరణించిన నాటికి ఒక రాగి పాత్ర అయినా మిగలలేదు.

ఆంధ్రరాష్ట్ర నిర్మాణానికై ఆయన నిరంతర యత్నం చేశారు. ప్రజాసేవకు, త్యాగనిరతికి ఆయన పెట్టినది పేరు.

ఆయన ముఖ్య మంత్రిత్వము ఆయిన తర్వాతకూడా, ఆంధ్రప్రభుత్వం ఆయన సలహా సంపత్తిని ఆశిస్తూనే ఉండేది.

సక లాంధ్ర దేశం ఈ రోజున దు:ఖంలో నిమగ్బమయింది.

ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిగారలు మంచి ఔచిత్యం ప్రదర్శించారు.

సభ్యులు యావన్మంది ఒక్క నిమిషం నిశ్శబ్దంగా లేచి నిలవ వలసిందని కోరుతున్నాను."

లోక్ సభ సభ్యులందరు లేచి తమ స్థానాలలో నిశ్శబ్దంగా నిలుచున్నారు.

ఆంధ్రదేశం నిశ్శబ్దమైంది.

సానుభూతి సభలు, విగ్రహ ప్రతిష్ఠాపనలు

సానుభూతి సభలు, తీర్మానాలు అసంఖ్యాకంగా జరగడంలో ఆశ్చర్యంలేదు. ఆయన పేరిట యువజన సభలు స్థాపన కావడంలోనూ వింతలేదు.

కొంతకాలం తర్వాత, రాజమహేంద్రవరం పౌరులు, ఆ పట్టణం కోట గుమ్మందగ్గర ఆయన కాంస్య విగ్రహాన్ని స్థాపించారు. ఆ విగ్రహాన్ని ఆవిష్కరించిన అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారు, ప్రభుత్వపక్షాన హైదరాబాదులో శాసన సభా భవనానికి ఎదురుగా ప్రకాశంగారి మరొక కాంస్య విగ్రహాన్ని స్థాపించారు.

ఆయనకు ప్రకాశంగారి యెడల గురుభావముంది.