నా జీవిత యాత్ర-4/ప్రకాశంగారి శతజయంతి

వికీసోర్స్ నుండి

25

ప్రకాశంగారి శతజయంతి

1971 సెప్టెంబరు 10 న, ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారు ప్రకాశంగారి శతజయంతి ఉత్సవం జరపడానికి నిశ్చయించి, అప్పటిమటుకు లక్షరూపాయలు మంజూరుచేసి, ప్రారంభ సమావేశంగా, హైదరాబాదులోగల జూబిలీ మందిరంలో మంత్రులు, శాసన సభ్యులు, పౌరముఖ్యులు, కార్మిక పక్ష నాయకులు, రాజకీయ నాయకులతోకూడిన ఒక మహా సభను ఏర్పాటు చేశారు.

"అతిదూరదృష్టిగల మహామానవుడు"

ఆ సభకు ప్రారంభోత్సవం చేసిన రాష్ట్రపతి వి. వి. గారు తమ ప్రారంభోపన్యాసంలో ఇలా అన్నారు:

"ప్రకాశంగారు ప్రజా సంరక్షకులు. ఉజ్వలమైన శక్తి గల వ్యక్తి. బ్రతికి ఉన్నంత కాలం మనుష్యులమధ్య అతి ప్రమాణమైన మహామానవుడుగా సంచరించేవారు. ప్రజా సమూహమును కూడగట్టుకొని, కదిలించి, నడిపించే శక్తి ఆయనలో హెచ్చుగా ఉండేది. వేలాది ప్రజలను అన్ని వేళలా ఆకర్షించగలిగిన గుణవైశిష్ట్యము ఆయనలో ఉండేది. నిరుపమానమైన త్యాగశీలత ఆయన ముఖ్యగుణం.......

"1916 లో నేను ఇంగ్లండునుంచి బారిష్టరుగా తిరిగి వచ్చినప్పుడు కార్యకారి, ముఖ్య న్యాయమూర్తి, శేషగిరి అయ్యర్‌గారల ఎదుట నన్ను న్యాయవాదిగా, బారిష్టరు పట్టీలో చేర్పించవలసిందని ప్రకాశంగారు ప్రతిపాదించారు.....

"ఆయన జ్ఞానం, అనుభవం నన్ను ఉత్తేజపరిచినవి. ప్రజారంగ మందు ప్రవేశించి, ఆయనతోబాటు పని చేయగలిగిన లాభం నాకు సమకూరింది. ఆయనా, నేనుకూడా మహాత్మా గాంధీగారి నిర్మాణ కార్యక్రమంలో ఉత్సాహం కలిగిన వారమే.

హరిజనాభ్యుదయం చర్ఖా పరిశ్రమను విస్తరణ, ఉత్పత్తి వినియోగదారీ సంఘోద్యమం, ఫిర్కా అభ్యుదయ ఉద్యమములు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా స్థాపించబడ్డాయి.

"ప్రకాశంగారికి దూరదృష్టి హెచ్చుగా ఉండేది. కొన్ని సంవత్సరాల ముందుగా భవిష్యత్ కార్యక్రమం సాధించవలసిన లక్ష్యాలు ఆయన గ్రహించ గలిగేవారు.

"మన నాయకులలో పెద్దవారికి ఆ దూరదృష్టి ఉండేది కాదు."

రాష్ట్రపతి చెప్పిన మాటలు ముమ్మాటికీ సత్యం.

నవ్యాంధ్ర జనకుడు

భారత ప్రధాని ఇందిరాగాంధీగారు -

"స్వాతంత్ర్య జ్యోతిని సాహసంతో వెలిగించిన దేశ భక్తాగ్రశ్రేణికి చెందినవారు ప్రకాశంగారు. ముందు వెనుకలు చూడని ధైర్యము, దాతృత్వములవల్ల ఆయన ఒక పురాణ పురుషులయ్యారు. ఆయన ప్రవర్తనవల్ల వందలాది అనుయాయులు, దేశ స్వాతంత్ర్యంకొరకు త్యాగాలు చేశారు. నవ్య ఆంధ్రప్రదేశ జనకుడు ఆయన. భారత జాతీయోద్యమ నాయకుల శ్రేణిలో అగ్రశ్రేణికి చెందిన నాయకుడు" అని ఆ సందర్భంలో ఆమె వ్రాశారు.

నేను ఇంతవరకు చెప్పడానికి యత్నించిన బహుళ గ్రంథమును, ఆమె సంక్షిప్త సూత్రంగా చెప్పారు.

ప్రకాశంగారు ఆంధ్రప్రాంతాలలో పుట్టిన భారత జాతిరత్నం.

సత్యమేవజయతే