నారాయణీయము/దశమ స్కంధము/74వ దశకము
||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము
74- వ దశకము - మధురాపురిలో ష్రీకృష్ణుని లీలావిలాసములు
74-1
సంప్రాప్తో మథురాం దినార్ధవిగమే తత్రాంతరస్మిన్ వసన్
ఆరామే విహితాశనస్సఖిజనైర్యాతః పురీమీక్షితుమ్।
ప్రాపో రాజపథం చిరశ్రుతిధృతవ్యాలోకకౌతూహల-
స్త్రీపుంసోద్యదగణ్యపుణ్యనిగళైరాకృష్యమాణో ను కిమ్॥
1వ భావము :-
భగవాన్! ప్రాతఃకాలమున బృందావనమునుండి బయలుదేరిన మీరు - మధ్యాహ్న సమయమునకు మధురానగరమును చేరిరి; సమీపమునగల ఉద్యానవనములో విడిదిచేసి - భోజనాది - కార్యక్రమములను ముగించుకొనిరి. పిదప, నీవు నీ మిత్రులతో కలిసి నగరదర్శనమునకు బయలుదేరితివి. నీగురించి వినియుండిన ఆనగర స్త్రీపురుషులు - చిరకాలముగా నీరాకకై ఎదురుచూచుచుండిరి. వారి పుణ్యఫలమనెడి సంకెల - నిన్ను వారివైపు బరబరా లాగుకొనిపోవుచున్నదా! అనునట్లు , ప్రభూ! నీవు ఆ రాజమార్గమును ప్రవేశించితివి.
74-2
త్వత్పాదద్యుతివత్సరాగసుభగాస్త్వన్మూర్తివద్యోషితః
సంప్రాప్తా విలసత్పయోధరరుచో లోలాభవద్దృష్టివత్।
హారిణ్యస్త్వదురః స్థలీవ దయితే మందస్మిత ప్రౌఢివ-
న్నైర్మల్యోల్లసితాః కచౌఘరుచివద్రాజత్కలాపాశ్రితాః॥
2వ భావము :-
భగవాన్! నీవు ఆ రాజవీధిలో నడిచివెళ్ళు చుండగా - నీ రాకకై ఎదురు చూచుచున్న మధురానగరములోని స్త్రీలు - వారిగృహములు, భవంతుల మిద్దెలపైచేరి నిన్నుచూచుటకు ఆతృతతో వేచియుండిరి. ప్రభూ! అప్పుడు వారి సౌందర్యము నీ సౌందర్యమును పోలియున్నది. ఎట్లనగా: నీ పాదములు ఎఱ్ఱనికాంతితో మెరయుచున్నవి - వారి ముఖములూ అనురాగముతో (కెంపువర్ణముతో) ప్రకాశించుచున్నవి; నీ నేత్రములు ఆ నగరవీక్షణలో చంచలములు - నిన్నువీక్షించు (ఆసక్తితో) వారినయనములూ చంచలములు; నీవు నీలమేఘ శరీర కాంతితో , వక్షస్థలమున బంగారు హారముతో సుందరముగా ఉంటివి - వారునూ వారి వక్షస్థలమున బంగారము ధరించి పయోధర సౌందర్యవతులుగానుండిరి; నీవు నీ కేశములు ముడివేసుకొని నెమలిపింఛి ధరించి ఉంటివి- వారునూ కేశాలంకరాభరణములతో నీకు సమఉజ్జీలుగానుండిరి; ప్రభూ! నీవు నిర్మల దరహాసముతో ఉంటివి - వారునూ నిర్మలాంతఃకరణతోనుండిరి.
74-3
తాసామాకలయన్నపాంగవలనైర్మోదం ప్రహర్షాద్భుత।
వ్యాలోలేషు జనేషు తత్ర రజకం కంచిత్ పటీం ప్రార్ధయన్।
కస్తేదాస్యతి రాజకీయవసనం యాహీతి తేనోదితః
సదస్తస్యకరేణ శీర్షమహృథాస్సో౾ప్యాప పుణ్యాం గతిమ్॥
3వ భావము :-
భగవాన్! నీవు మధురానగర రాజవీధులలో తిరగుచూ - నిన్ను ఆసక్తితో చూచుచున్న ఆపురకాంతలపై నీదృష్టిని ప్రసరింపజేయుచూ - వారిహృదయములను రంజింపజేసితివి. ఆ నగరప్రజలు మిమ్ములను చూచి - అత్యంత ఆనందమును, ఆశ్చర్యమును, ఉద్వేగమును పొందిరి. అట్లు పోవుచు - పోవుచు (రంగురంగుల వస్త్రములను కొనిపోవుచున్న) ఒక రజకుని చూచితివి. అతని వద్దనున్న వస్త్రములలో కొన్నింటిని ఇమ్మని నీవా రజకుని కోరగా - ఆరజకుడు "ఇవి రాజు వస్త్రములు -నీకెవరిచ్చెదరు? (అని చులకనగా) పలికెను. ప్రభూ! నీవా రజకుని తలను (ఏమయ్యెనోఏమో!) తక్షణమే ఖండించి వానికి పుణ్యగతిప్రాప్తిని కలిగించితివి.
74-4
భూయో వాయకమేకమాయతమతిం తోషేణ వేషోచితం
దాశ్వాంసం స్వపదం నినేథ సుకృతం కో వేద జీవాత్మనామ్।
మాలాభిఃస్తబకైః స్తవైరపి పునర్మాలాకృతా మానితో
భక్తిం తేన వృతాం దిదేశిథ పరాం లక్ష్మీం చ లక్ష్మీపతే।॥
4వ భావము :-
భగవాన్! జీవాత్ములయిన జీవుల సుకృతములు నీకుతప్పవేరెవరికి తెలియును? ఇదిజరిగిన తరువాత ఒక చేనేతగాడు (సాలెవాడు) నీకు ఎదుటపడి చక్కని వస్త్రములను నీకు బహూకరించెను. పూలదండలు కట్టువాడొకడు - నీకొక రమ్యమగు పూలహారమునిచ్చెను; నిన్ను స్తుతించెను. ప్రభూ! లక్మీపతివగు నీవు, నీ భక్తులగు వీరికి సిరిసంపదలు ప్రసాదించితివి; అంత్యమున సాలోక్యముక్తిని (నీ స్థానమును) ప్రసాదించితివి.
74-5
కుబ్జామబ్జవిలోచనాం పథి పునర్దృష్ట్వాంగరాగే తయా
దత్తే సాధు కిలాంగరాగమదదాస్తస్యా మహాంతం హృది।
చిత్తస్థామృజుతామథ ప్రథయితుం గాత్రే౾పి తస్యాః స్ఫుటం
గృహ్ణాన్ మంజుకరేణ తాముదనయస్తావజ్జగత్సుందరీమ్॥
5వ భావము :-
భగవాన్! పద్మములవంటి కన్నులుగలది, గూనితో నడుము వంగినది, చిత్తమున ఏవక్రము లేనిది అగు - ఒక రాజాంతఃపుర పరిచారిక - సుగంధలేపనములు తీసుకొనిపోవుచు - దారిలో నీకు తారసపడెను. నిన్ను చూడగనే ప్రభూ! ఆమె అభిమానముతో ఆ అంగారమును (సుగంధి లేపనమును) నీకు ఇచ్చెను. ఆమె ఔన్నత్యమునకు సంతసించి - ప్రసన్నుడవై, చిత్తమందు వక్రము లేని ఆమె శరీరమును సక్రమముచేయతలచితివి; క్షణములో ఆమె చుబుకమున చేయ ఆన్చి సుందరమగు నీహస్తములతో ఆమెను పొదివి పట్టుకొని చటుక్కున నిటారుగా నిలబెట్టితివి; ఆ సుందరిని పరమసౌందర్యవతిగామార్చితివి.
74-6
తావన్నిశ్చితవైభవాస్తవ విభో।నాత్యంతపాపా జనాః
యత్కించిద్దదతే స్మ శక్త్యనుగుణం తాంబూలమాల్యాదికమ్।
గృహ్ణానః కుసుమాది కించన తదా మార్గే నిబద్ధాంజలిః
నాతిష్టం బత హా యతో౾ద్య విపులామార్తిం వ్రజామి ప్రభో।
6వ భావము :-
భగవాన్! నీవట్లు వెళ్ళుచుండగా - నీ మహిమలను ఎరిగినవారు, అధిక పాపములు చేయనివారు, పుణ్యాత్ములు అగు వారు - పూలహారమో, తాంబూలమో ఏదో ఒక కానుకను తమ శక్త్యానుసారము నీకు సమర్పించుచుండిరి. " ఆ సమయములో - ఆ మార్గములలో - ఆ ప్రజలలో - నేనును ఒకడిగా నా దోసిట పువ్వులు పట్టుకొని -నీ కొఱకు నేను వారిలో ఒకనివలె వేచి నిలబడలోకపోతినికదా! ప్రభూ! " -అని చెప్పలేని క్షోబను అనుభవించుచుంటిని.
74-7
ఏష్యామీతి విముక్తయాపి భగవన్నాలేపదాత్ర్యా తయా
దూరాత్ కాతరయా నిరీక్షితగతిస్త్వం ప్రావిశో గోపురమ్।
అఘోషానుమితత్వదాగమమహాహార్షోల్లలద్దేవకీ-
వక్షోజప్రగలత్పయోరసమిషాత్ త్వత్కీర్తిరంతర్గతా॥
7వ భావము :-
భగవాన్! సుగంధలేపనమిచ్చిన ఆ సుందరితో, "తిరిగి నీ వద్దకు వచ్చెదను" అని పలికి - నీవు ముందుకు సాగిపోయితివి. ఆమెను దాటి వెళ్ళుచుండగా ఆ సుందరి నీవు కనిపించునంతవరకూ అచ్చటనే నిలచి నిన్నే చూచుచుండెను. నీ ఆగమనమునకు సంతసించి ఆ మధురానగర ప్రజలు చేయుచున్న జయజయధ్వనులను విని - నీ తల్లి దేవకీదేవి నీరాకను ఊహించెను. ఆనందముతో ఆమెవక్షములనుండి స్రవించు తెల్లని క్షీరమువలె, ప్రభూ! నీ కీర్తికూడా నీతోబాటే ఆ రాజనగరమును ప్రవేశించెను.
74+8
ఆవిష్టో నగరీం మహోత్సవవతీం కోదండశాలాం వ్రజన్
మాధుర్యేణ ను తేజసా ను పురుషైర్దూరేణ దత్తాంతరః।
స్రగ్భిర్భూషితమర్చితం వరధనుర్మామేతి వాదాత్ పురః
ప్రాగృహ్ణాస్సమరోపయః కిల సమాక్రాక్షీరభాంక్షీరపి॥
8వ భావము :-
భగవాన్! నీవు ఆ నగర ప్రధానద్వారము దాటి - ధనుర్యాగము జరుగుచున్న యాగశాలను సమీపించితివి. తేజస్సుతో ప్రకాశించుచున్న నీ మనోహర వదన సౌందర్యము చూచి - ఆ మార్గమున నిలిచియున్న పురుషులు తప్పుకొనిరి; రక్షకభటులు దూరముగా జరిగి నీకు యాగశాలలో ప్రవేశించుటకు మార్గమొసగిరి. ప్రభూ! పూలహారముతో అలంకరించబడినది, పూజించబడి ఆ యజ్ఞవాటికలోనున్నది అగు ఆ యజ్ఞ ధనుస్సును - కావలి భటులు 'వలదు- వలదు" అని వారించుచున్ననూ వారిని లక్ష్యపెట్టక - ఎక్కుపెట్టి, బలముగా లాగి దానిని విరిచివేసితివి.
74-9
శ్వః కంసక్షపణోత్సవస్య పురతః ప్రారంభతూర్యోపమః
చాపధ్వంసమహాధ్వనిస్తవ విభో।దేవానరోమాంచయత్।
కంసస్యాపి చ వేపథుస్తదుదితః కోదండఖండద్వయీ-
చండాభ్యాహతరక్షిపూరుషవైరుత్కూలితో౾భూత్త్వయా॥
9వ భావము :-
భగవాన్! ఆ ధనుస్సు విరిగినప్పుడు వచ్చిన ధ్వనులు - మరునాడు జరగగల కంసవధోత్సవమునకు - ముందుగా మ్రోగించిన దుందుభి నాదమును తలపించెను. అదివిని -దేవతల హృదయములు ఆనందముతో గగుర్పాటుచెందెను; కంసుని హృదయమున కంపము పుట్టెను. ప్రభూ! ఆ ధనస్సును రెండుముక్కలుచేసి- వాటితో నీ మీదకు వచ్చిన కావలివారను కొట్టుచుండగా - వారుచేయు హాహాకారములతో ఆ కంసుని హృదయమున - గట్లునిండి ఉధృతముగా పొంగి పొరలుచున్న వరద ప్రవాహమువలె కంపము అధికమయ్యెను.
74-10
శిష్టైర్దుష్టజనైశ్చ దృష్టమహిమా ప్రీత్యా చ భీత్యా తతః
సంపశ్యన్ పురసంపదం ప్రవిచరన్ సాయంగతో వాటికామ్।
శ్రీ దామ్నా సహ రాధికావిరహజం ఖేదం వదన్ ప్రస్వపన్
ఆనందన్నవతారకార్యఘటనాద్ వాతేశ। సంరక్ష మామ్॥
10వ భావము :-
భగవాన్! నీ మహత్యమును చూచిన ధర్మానువర్తనులు ఆనందించిరి. అధర్మపరులు, దుష్టులు - భీతిచెందిరి. సిరి సంపదలతో తులతూగుతున్న ఆ మధురానగరమును వీక్షించుచూ, ప్రభూ! సాయంసమయమునకు - నీవు విడిదిచేసిన ఉద్యానవనమును చేరితివి. నీ మిత్రుడు - సుధామునితో - రాధావియోగము భాదించుచున్నదనియు, నీ ఆగమన హేతువు సఫలీకృతమగుననియు ఆనందముగా పలికి - నిద్రించితివి. అట్టి గురవాయూరు పురవాసా! ఈ రోగమును నిర్మూలించుము. రక్షింపుము.
దశమ స్కంధము
74వ దశకము సమాప్తము
-x-