నారాయణీయము/దశమ స్కంధము/70వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
దశమ స్కంధము

70వ- దశకము - సుదర్శన గంధర్వుడికి శాపవిముక్తి – శంఖచూడ వృషభాసురుల సంహారము


70-1
ఇతిత్వయి రసాకులం రమితవల్లభే వల్లవాః
కదా౾పి పురమంబికాకమితురంబికాకాననే।
సమేత్య భవతా నిశి నిషేవ్య దివ్యోత్సవం
సుఖం సుషుపురగ్రసీద్ వ్రజపముగ్రనాగస్తదా॥
1వ భావము:-
భగవాన్! పున్నమి రాత్రులలో - వ్రజాంగనలతో కలిసి నీవు ఆనందముగా విహరించుచున్నప్పుడు - ఒకనాడు, వ్రజములోని గోపజనులు - దాపుననేగల అంబికాధిపతియగు పరమశివుని దర్శనమునకు వెళ్ళరి; స్వామిని అర్చించి - రాత్రిసమయమగుటచే వారు అచ్చటనే ఆదమరిచి నిదురించిరి. ఆసమయమున భయంకరమగు ఒక నాగుపాము వచ్చి, ప్రభూ! నీ తండ్రి - వ్రజనాయకుడు అగు నందుని మ్రింగివేయసాగెను.
 
70-2
సమున్ముఖమథోల్ముకైరభిహతే౾పి తస్మిన్ బలాత్
అముంచతి భవత్పదే న్యపతి పాహి పాహీతి తైః।
తదా ఖలు పదా భవాన్ సముపగమ్య పస్పర్శ తం
బభౌ స చ నిజాం తనుం సముపసాద్య వైద్యాధరీమ్॥
2వ భావము:-
భగవాన్! అదిచూచిన గోపజనులు ఆ సర్పమును మండుచున్న కట్టెలతో కొట్టసాగిరి. అయిననూ ఆ సర్పము నందునుని విడువలేదు. భీతితో అప్పుడు ఆ గోపజనులు "రక్షింపుము కృష్ణా! రక్షింపుము" అని ఆర్తనాదములు చేయసాగిరి. వారి మొర ఆలకించి క్షణములో ప్రత్యక్షమై నీవా సర్పమును సమీపించితివి. ప్రభూ! ఆర్తత్రాణపరాయణా! నీ పాదస్పర్శతో ఆ సర్పము శాపవిముక్తిని పొంది తన నిజ (విధ్యాధర) రూపమును పొందెను.
 
70-3
సుదర్శనధర। ప్రభో। నను సుదర్శనాఖ్యో౾స్మ్యహం
మునీన్ క్వచిదపాహసం త ఇహ మాం వ్యధుర్వాహసమ్।
భవత్పదసమర్పణాదమలతాం గతో౾స్మీత్యసౌ
స్తువన్ నిజపదం యయౌ వ్రజపదం చ గోపా ముదా॥
3వ భావము:-
ప్రభూ! ఆవిధ్యాధరుడు నీతో ఇట్లనెను. - "హే! సుదర్శన చక్రధారీ! నేను సుదర్శనుడు అను నామముగల ఒక విధ్యాధరుడను. నేనొకనాడు (అజ్ఞానినై) మునిశ్రేష్టులను అవహేళనచేయుటచే - వారు నన్ను సర్పరూపమును పొందమని శపించిరి. నీ పాదస్పర్శతో నాకు శాపవిముక్తి కలిగినది," అని పలికి ఆ విధ్యాధరుడు తనలోకమునకు తిరిగి వెళ్ళెను; గోపజనులు ఆనందముగా వ్రజమునకు బయలుదేరిరి.
 
70-4
కదా-పి ఖలు సీరిణా విహారతి త్వయి స్త్రీజనైః।
జహార ధనదానుగస్స కిల శంఖచూడో౾బలాః।
అతిద్రుతమనుద్రుతస్తమథ ముక్తనారీజనం
రురోజిథ శిరోమణిం హాలభృతే చ తస్యాదదాః॥
4వ భావము:-
భగవాన్! ఒకనాడు బలరామునితోను గోపికలతోను కలిసి నీవు యమునానదీ తీరమున విహరించుచుంటివి. అప్పుడు కుబేరుని అనుచరుడగు 'శంఖచూడుడు' అనువాడు నీతో విహరించుచున్న గోపికలను అపహరించుకొని పోయెను. శంఖమునుపోలిన మణిని ధరించుటచే అతనికి శంఖచూడుడు అను పేరు కలిగెను. ప్రభూ! నీవా శంఖచూడునిని వధించి గోపికలను విడిపించితివి; ఆ శంఖమును పోలిన మణిని అతని శిరస్సునుండి తొలగించి బలరామునికిచ్చితివి.
 
70-5
దినేషు చ సుహృజ్జనైస్సహ వనేషు లీలాపరం
మనోభవమనోహరం రసితవేణునాదామృతమ్।
భవంతమమరీదృశామమృతపారణాదాయినం
విచింత్య కిము నాలపన్ విరహతాపితా గోపికాః॥
5వ భావము:-
భగవాన్! పగటి సమయములలో నీవు నీమిత్రబృందముతో కలిసి ఆటపాటలతో విహరించుచూ వేణుగానమును చేయుచుంటివి. ప్రభూ! "నీ నాదామృతమును విని, వినువీధిలో విహరించుచున్న దేవాంగనలు అమృతమును గ్రోలుచున్న భావనను పొందియుందురు", అని బృందావనములోని గోపికలు ఊహించుకొనుచూ (తాము నీ దగ్గర లేకపోయితిమి అని) చెప్పలేని విరహతాపమును పొందుచుండిరి.
 
70-6
భోజరాజభృతకస్త్వథ కశ్చిత్ కష్టదుష్టపథదృష్టిరరిష్టః।
నిష్ఠురాకృతిరపష్ఠునినాదస్తిష్ఠతే స్మ భవతే వృషరూపీ॥
6వ భావము:-
భగవాన్! ఆసమయములో ఒకరోజున, భోజరాజగు కంసుని అనుచరుడు - క్రూర స్వభావుడు - దుష్టమార్గమున సంచరించువాడు - అరిష్టుడు అను నామము కలవాడొకడు - వృషభరూపముతో భీకరముగా రంకెలు వేసుకొనుచూ - భయంకరరూపముతో, ప్రభూ! నీ ముందుకు వచ్చి నిలచెను.
 
70-7
శాక్వరో౾థ జగతీధృతిహారీ మూర్తిమేష బృహతీం ప్రదధానః।
పంక్తిమాశు పరిఘార్ణ్వ పశూనాం ఛందసాం నిధిమవాప భవంతమ్॥
7వ భావము:-
భగవాన్! ఆ వృషభము అతిపెద్ద ఆకారముతో - లోకుల ధైర్యమును హరించుచు - గోసమూహములకు భీతికలిగించుచు- ఛందోనిధివగు నిన్ను సమీపించెను. (అరిష్టుడు - జగతి, పంక్తి, బృహతి, ధృతి అను చందస్సులకు మాత్రమే పరిమితుడు. కాని భగవాన్! నీవు సకలచందస్సులకు నిధివి.)
 
70-8
తుంగశృంగముఖమాశ్వభియంతం సంగృహయ్య రభసాదభియంతమ్।
భద్రరూపమపి దైత్యమభద్రం మర్దయన్నమదయః సురలోకమ్॥
8వ భావము:-
ఆ అరిష్టుడు ఉన్నతమయిన - కొమ్ములు కలిగిన ముఖముతో - అతివేగముగా పరిగెత్తుకొని వచ్చి - నిర్భయముగా నీముందు నిలచెను. అప్పుడు - ఆ అరిష్టుని నీవు నీ హస్తములతో గట్టిగా పట్టుకొంటివి; అశుభకరుడయిన ఆ అరిష్టుని వధించితివి; దేవతలకు ఆనందము కలిగించితివి. ప్రభూ! ఎంతటి గొప్ప రూపము కలిగినవాడైననూ నీ ఎడ భక్తిలేనివాడయినచో వాడు అభద్రుడే కదా!
 
70-9
చిత్రమద్య భగవన్। వృషఘాతాత్ సుస్థిరా౾జని వృషస్థితిరుర్వ్యామ్।
వర్ధతే చ వృషచేతసి భూయన్మోద ఇత్యభినుతో౾సి సురైస్త్వమ్॥
9వ భావము:-
భగవాన్! చిత్రముగా నీవావృషభమును వధించి - ధర్మమునుద్దరించితివి; భూమిపై స్థిరపరచితివి. దేవేంద్రుడు మొదలగు దర్మానువర్తుల హృదయములలో ఆనందమును పెంపొందించితివి.
 
70-10
ఔక్షకాణి పరిధావత దూరం వీక్ష్యతామయమిహోక్షవిభేదీ।
ఇత్థమాత్తహసితైస్సహ గోపైర్గేహగస్త్వమవ వాతపురేశ।
10వ భావము:-
భగవాన్! "గోవులారా ! పారిపొండు - పారిపొండు, చూడుడు -వృషభాసురిని చంపిన ఉక్షవిభేది (ఉక్ష అనగా వృషభము) అమ్మో! - ఇచ్చటే ఉన్నాడు! ఇక్కడనే ఉన్నాడు!" - అని గోవులను అదిలించుచు – వినోదముగా పలుకుచున్న - గోపాలురతో కలిసి, ప్రభూ! నీవు నీ గృహమునకేగితివి. అట్టి పవన పురాధీశా! నన్ను నారోగమునుండి రక్షించి - కాపాడుము.
 
దశమ స్కంధము
70వ దశకము సమాప్తము
-x-