నారాయణరావు (నవల)/తృతీయ భాగము

వికీసోర్స్ నుండి

తృ తీ య భా గ ము

పు న స్సం ధా న ము

నారాయణరావు బి. ఎల్. పరీక్షలో బ్రథముడుగా నెగ్గిన వెనుక హైకోర్టులో నొక సుప్రసిద్ధ న్యాయవాదికడ ఎప్రెంటీసు శుశ్రూష నడపి యా పరీక్షలోను మొదటివాడుగా 1928 సంవత్సరపు వేసవికాలములో కృతార్థుడైనాడు. శారదయు బ్రవేశ పరీక్షలో విజయము గాంచినది. జమీందారుగా రామెను నింటరుపరీక్షకు జదివించుచున్నారు.

ఆ వేసవికాలములో భార్యాభర్తలకు పునస్సంధానమహోత్సవం సంకల్పించి చుట్టముల నందరిని రప్పించినారు. నారాయణరావు స్నేహితులు చుట్టములుగూడ బెండ్లికి వచ్చినట్లే వచ్చినారు.

పునస్సంధానమున కొంతమంది విచ్చేయుట నారాయణున కిష్టము లేకున్నను తండ్రిగారి యిష్టమున కాత డెదురుచెప్పలేక పూర్వాచారము ప్రకారము చుట్టపక్కములతో జమీందారుగారి గృహమునకు దరలి వెళ్ళెను.

ఉదయముననే భార్యాభర్తలు పీటలమీద కూర్చుండవలయును. గ్రామ గ్రామములనుండి బ్రాహ్మణోత్తము లెందరో విచ్చేసిరి. జమీందారుగారి సభా మంటపమంతయు లోచనమోహనముగ నలంకరింపబడినది. చుట్టములు, స్నేహితులు, పండితశ్రేష్ఠులు, పరివారజనము క్రిక్కిరిసియుండిరి.

పూర్ణయౌవనముచే నారాయణరావు దేహము మిసమిసలాడుచుండెను. చిరుమీసములు తుమ్మెద రెక్కలవలె నల్లనై మోమున కొక వింతయందము గూర్చెను. కుమారస్వామివలె, మంజుశ్రీవలె, శ్రీకృష్ణునివలె నున్న యాతని మూర్తి తెల్లగంధపు బొమ్మవలె సభ్యుల కన్నులకు జల్లనై హృదయములు మోహింపజేసినది. సంధ్యావందన మొనర్చి, తడిపి యారవేసిన క్షీరాబ్ధిదుకూలముల ధరించి, యున్నతమూర్తియు గోమూర్ధకటియునగు నా యువకుడు, మత్త గజగమనముతో వత్సరాజువలె నరుదెంచి పీఠముకడ నిలుచుండెను.

శారద సర్వాభరణభూషితురాలై సరిగ బుటేదారియంచుల హోంబట్టు చీర ధరించి, తెల్లని మేల్పట్టు బనారసు (జంపరు) కంచుకము ధరించి, పూలు ముడిచిన వాలుజడతో వచ్చి భర్తప్రక్కనే నిలుచుండినది.

మంగళవాద్యములు బోరుమనినవి. దంపతులను పీటలపై నధివసింప జేసిరి వసిష్ఠులవారు.

‘ఓం కేశవాయస్వాహా ఓం నారాయణాయస్వాహా ఓం మాధవాయ స్వాహా’ అని వసిష్ఠు డాతనిచే నాచమనాదులు చేయించెను. అప్పుడు వాలుజూపులతో నారాయణరావు భార్యను జూచినాడు. ఉన్మి.................గు నామె వివిధాంగములు స్ఫుటత్వము దాల్చుచుండ వసంతమునాటి మల్లికాలతవలె మిలమిలలాడినది. ఆమె కన్నులు నిశ్చల నిర్మల యామినీతారకలవోలె మెఱిసినవి. ఆమె చెక్కులలో నుషస్సుందరీ హాసములు ప్రసరించిపోయినవి. ఆమె బంగారు దేహము మేల్మియెక్కి పాలసంద్రాన సంధ్యారుణహేమము లలమినట్లయినది. నిత్యౌపాసనాగ్నిని ఆ దంపతులు జరిపిరి.

ఆమె నడకలో నొక యొయారము, చూపుల కొక వెన్నెల, శరీరమున కొక దీప్తి, యాలోచనలకొక యనంతనీలత్వము, ఆమెలోనే యొక దివ్యశ్రుతి ప్రత్యక్షమైనవి యని నారాయణరావు ప్రణయయోగమున గన్నులు మూసి ధ్యానించెను. మనసులో నామెను కౌగలించుకొన్నాడు. ఆమె తన ప్రాణములోని ప్రాణము, ఆత్మలోనియాత్మ యనుకొన్నాడు.

తనచేతిలో నామె యుదకము పోసినప్పు డామె యంగుళులు చంద్రకిరణములై యాతనికి దోచినవి.

పురోహితు డేమేమి తంతు చేయించెనో, యెప్పుడు మామగారు తనకు స్వయముగను తన భార్యకు నత్తగారిచేతను శుభవస్త్రముల నిప్పించెనో, ఎట్లు తానా శుభవస్త్రముల ధరించెనో, యేవిధమున నాశీర్వచనముచేసిరో, హారతు లెత్తిరో యవి యన్నియు నారాయణరావు గమనించలేదు.

పీటల పైనుండి లేచినపిమ్మట నారాయణరావుతో పరమేశ్వరుడు, ‘ఒరే నారాయణా! నీ మోము దివ్యమై కనిపించిందిరా, ఇందాక పీటలమీద. ఏమిటి ఆలోచిస్తున్నావు? మీ రిద్దరూ కూర్చునిఉంటే, ఇంతకన్న పరమోత్కృష్టమైన దాంపత్యము ఎక్కడనైనా దొరుకుతుందా అనుకున్నా, ‘అనిరుద్ధుడూ, ఉషాబాలలా కనబడ్డారురా మీరిద్దరూ!’ అన్నాడు.

‘ఓహో, మొదలెట్టావు, మాగధస్తుతి?’

‘అరే పోవోయి స్తుతి యేమిటీ? నీ భార్యలాంటి అందమైనపిల్ల, నీవంటి మారసుందరుడు ఉన్నారట్రా! మీరిద్దరూ సినిమాలో చేరి ప్రపంచానికి ఆదర్శరంగనక్షత్రా లెందుకు అవరాదూ?’

‘డగ్లాసు ఫైర్‌బాంక్సు, మేరీ ఫీక్‌ఫోర్డు లంటావా మేము?’

‘ఆ అదే!’

‘మన దేశంలోని నవీన తారలతో పోల్చావుకాదు నీ పుణ్యమా?’ అని లక్ష్మీపతి అందుకొని, ‘మనదేశంలో నాటకాలు ఎందుకూ పనికిరాకుండా తయారవుతున్నాయి, నానాటికి’ అన్నాడు.

నారా: పరమేశ్వరుడు చక్కనిపిల్లలా ఉండేవాడు. ఎప్పుడూ ఆడ వేషమే వేస్తూ ఉండేవాడు. పర: నువ్వో? నువ్వు కృష్ణుడు, అర్జునుడు, హరిశ్చంద్రుడు వెయ్యలేదట్రా కాలేజీలో?’

నారా: నా వేషాల కేమిగాని, నువ్వు కూల్డ్రేగారి తరిఫీదున ఇంగ్లీషు నాటకాల్లోకూడా ఆడవేషం వేసిన వాడవాయెను.

పర: లక్ష్మీపతికూడా ఆ రోజుల్లో బూడిద పూసుకున్న వాడేరా!

లక్ష్మీ: ఆ! ఏవో బంట్రోతువేషాలేగా మనపాలిటికి!

నారా: నేను వచ్చేటప్పటికే ఆ మహానుభావుడు వెళ్లిపోయాడురా!

పర: నువ్వుంటే నిన్ను వదలియుండునా? నీ ఆటలు, నీ తెలివితేటలు, నీగొంతులో పాటలు చూచి నిన్ను సర్వవిధాలా గౌరవంచేసియుండును.

లక్ష్మీ: నాటకాలు, పాశ్చాత్యదేశంలో ఉన్నట్టున్నాయిరా మన దేశంలో పరమేశ్వరం?

నారా: ఎట్లావుంటాయి బావా! వాళ్ళకి డబ్బువుంది. వాస్తవమా అనే భ్రమ కల్పించడానికి తగిన పరికరాలు లక్షలు ఖర్చు చేసి సమకూర్చుకొంటారు. నిజమైన గుఱ్ఱం ఎక్కివస్తారు. రంగంమీద ఉత్తరధ్రువం కల్పిస్తారు. తెరలు రంగస్థలంలా కనబడతాయా? అసలు ప్రకృతి అయిపోతాయి. నిజమైన గుళ్ళూ, గోపురాలు, మేడలు, మిద్దెలు అయిపోతుంది రంగస్థలం.

పర: డబ్బుగలవాళ్ళు కాబట్టే పదిహేనురూపాయలు టిక్కెట్టు పెట్టినా పెడతారు. లక్షలకొలదీ డబ్బువస్తే వేలకొలది జీతాలుయిస్తే దేశంలో ఉన్న తెలివైనవాళ్ళు ఇతర ఉద్యోగాలకి తిరగరు. అదీ ఒక గొప్ప వృత్తే. ప్రభుత్వంకూడ ‘సర్’ మొదలైన బిరుదావళులు యిస్తుంది. ఇంతకూ మనదేశం బీదది.

లక్ష్మీ: నారాయణుడు అనడమూ, నువ్వు తందాన తానా! ఆ బాగుంది. అదంతా నేను ఎరగనిదికాదోయి. నా ఉద్దేశం మన వీథినాటకాలకన్నా వాళ్ళ నాటకాలు, ఎక్కువ అందంగా ఉంటాయని.

పర: ఆగు, ఆగు! మన వీథినాటకాలికిమల్లే వాళ్లకి వీథినాటకాలు ఉండేవి. వాళ్ల నాటకాలకిమల్లే మన సంస్కృతనాటకాలు లేవురా మరి!

నారా: తెలుగుదేశంలో ఉన్నాయిరా పరం, సంస్కృతనాటకాలంటివి?

పర: లేవు. కాని యక్షగానాలూ, భామకలాపం, గొల్లకలాపం, వీథినాటకాలూ ఉన్నై. సంస్కృతనాటకాలూ ఆడేవారు.

లక్ష్మీ: తెలుగులో యిప్పుడు వచ్చాయి కాని పూర్వంలేనట్లు ఒప్పుకున్నారా?

నారా, పర : ఆ!

లక్ష్మీ: సంస్కృతనాటకం, ఇంగ్లీషునాటకం వంటిదేనా? నారా: అవును. కాని మన సంప్రదాయం వేరు, వాళ్ళ సంప్రదాయం వేరు. అంతే! తక్కిన ‘ఫక్కీ’ అంతటా ఒకటే. లోపల భావాలు వేరన్నమాట.

పర: వాళ్ల ఆశయం ప్రాపంచికం, మన ఆశయం ఆధ్యాత్మికం అంతే తేడా.

లక్ష్మీ: మన వీథినాటకాలు వాళ్ళకున్నాయా?

నారా: ‘ఓపెరా’ లేదు బావా? అది మన వీధినాటకానికి ఒక మోస్తరుగా సరిపోతుంది. ఆ ఓపెరా, సాధారణనాటకం రెండూ కలిపితే మన వీథినాటకం అవుతుంది.

లక్ష్మీ: కాని ఎల్లా భరించగలవురా ఆతందానతాన ధిమికిట ధిమికిట! రాజుభార్య కూడా గంతులు వెయ్యడమే, సంభాషణా మాట్లాడడం ఉండదు. అందరూ కలిసి గంతులూ! ‘నువ్వు ఎవడవురా? నువ్వు యెవడవురా?’ అని పల్లవిని పట్టుకొని ‘నువ్వూ! యెవడవురా?’ అని తణికితతోం అని యిటు గంతు, అటు గంతులో కథానాయికయైన చంద్రమతి తన్మయం అయిపోవడం. ఏమిటిది? నాకంతా ప్రహసనంలో ఉంటుంది. అదీకాకుండా ఒక్కొక్కప్పుడు ఈ పాత్రధారులు ఏ రాజువేషమో వేసికొని ‘రాజు వచ్చే సభకూ పురప్రముఖులందరూ కొలువ’ అని అంటూ వస్తారు. అదేమి అభినయమోయి వెఱ్ఱికాయా?

నారా: బావా! నువ్వు చెప్పిన దోషాలు దోషాలు కావోయి; అసలు దోషాలు వేరు. ‘మూలచ్ఛేదీ తవ పాండిత్య ప్రకర్షః’ అన్నట్లు వీథినాటకానికి ఏవి నిజమయిన అందం సమకూరుస్తున్నాయో అవే బాగా లేవంటావు ఏమిటి?

పర: లక్ష్మీపతీ! వినరా వెఱ్ఱివాడా! శాస్త్రం చెప్పినట్లుగా అభినయం చేసేటప్పుడుందే, నువ్వు ఏపాత్ర అభినయిస్తున్నావో ఆ పాత్రే అయిపోవాలి. అదికాకుండా రెండో ముఖ్యమయిన సంగతి ఏమిటంటే, నువ్వు ఎప్పుడూ సంపూర్ణంగా ఆపాత్రవు కావు కాబట్టి నువ్వు ఆపాత్రను కాను, ఆపాత్రను అభినయిస్తున్నాను అని తెలపాలి. అభినయము ఒక కళ. దానివల్ల చిత్రలేఖనంలో వలే మానవుణ్ణి ఆనందంలో ముంచివెయ్యాలి. భ్రమను కొల్పడమే ముఖ్యసాధనంగా ఎంచుకుంటే, ఈ కళ ప్రాపంచికంలోకి దిగిపోతుంది.

లక్ష్మీ: ఒరే నువ్వు మాట్లాడింది కవిత్వంగాని వాదనకాదు. వాడి ఉద్దేశ్యం నువ్వు చెప్పు, బావా!

నారా: విను. భరతదేశంలో కళలన్నీ కూడా కళాస్రష్ట యొక్క ఆశయము వ్యక్తీకరిస్తాయి. ఇదే నిజము అయివుంటుంది అని భ్రమకొల్పడానికి ప్రయత్నించవు. అది అభినయంలో చూపించాలంటే, వీడేసుమా హరిశ్చంద్రుడు అని భ్రమింపజేయడానికి ప్రయత్నించక, నాహృదయానికి హరిశ్చంద్రుడిట్టివాడు సుమా అని చెప్పుతూ నేను హరిశ్చంద్రుడి వేషం వేస్తున్నాను అన్నట్లు తెలియజేస్తూ, హరిశ్చంద్రుడు ఇట్లనవచ్చును, అని వ్యక్తీకరిస్తాడు. తర్వాత తానే హరిశ్చంద్రుడవుతాడు. అంటే తన ఆశయంలో హరిశ్చంద్రు డిట్టివాడు, ఆ హరిశ్చంద్రుడే నేను అన్నట్లు అభినయం చెయ్యాలి.

లక్ష్మీ: మీరిద్దరూ ఒకేరకంగా చెప్పారు. ఇంకా విపులం చెయ్యాలి.


శో భ న మం ది ర ము

ఎప్పటికిని సాయంకాలము కాదు. పేక ఆడినాడు నారాయణరావు; బ్రిడ్జి, బేస్తు, లిటరేచరు ఎన్ని ఆడినా తోచినదికాదు. హిందూదేశం అంతట, క్లబ్బులలో, గ్రంథాలయములలో, ఇండ్లదగ్గర పాశ్చాత్యదేశమునుండి పందొమ్మిదవ శతాబ్దిలో దిగిన దీ పేకాట. బ్రిడ్జి, ఆ ఆటలలో మహారాజు వంటిది. ఆ యాటలో మన ఆంధ్రులు శక్తి సామర్థ్యములు సముపార్జించుకొన్నారు. నెమ్మదిగా ననేక భేదములతో బ్రిడ్జి యాట దేశమంతటను పల్లెటూళ్ళకును గూడ బ్రాకినది.

‘బేస్తాట’ ప్రత్యేక మాంధ్రుల సొత్తు. కాని డబ్బు మేజుపెట్టి యాడినచో నంత నష్టముండదు. అర్థణా, అణా, బేడ మేజుపెట్టి సంసారములు ధ్వంసము చేసికొనువారు కొందరు, కొంద రదేవృత్తిగా ధనము సంపాదించుకొనువారు. జూదమే అని చెప్పదగిన ‘రన్‌మోరు’ అను నాట కొందరు రహస్యముగా నాడుచుందురు.

ఈ ఆలోచనలతో నారాయణరావు బేస్తాటలో రెండురూప్యము లోడు వడి, ఎపుడు ప్రొద్దుకుంకునాయని ఎదురుచూచుచు, హృదయములోని భావములు పరమేశ్వరునికి దక్క నేరికిని తెలియనీయక గడియ లెట్టెట్లో వెడలబుచ్చెను.

రాత్రి శుభముహూర్తము సమీపించినది. నారాయణరావు వంగపండు చాయ పట్టుతాపితాలతో వచ్చి పీఠముచెంత నిలిచినాడు. శారద వెలవెలబోవు మోముతో వెండిపళ్ళెరాన గుమ్మడిపండు, నారికేళబొండము, అరటిపళ్ళు, ఖర్జూరఫలములు, పసుపుకుంకుమ, మంత్రాక్షతలు మొదలగు వస్తువులతో బ్రక్కనే నిలిచియుండ, భూదేవత ననుజ్ఞ నొసంగ మంగళపీఠములపై కూర్చుండ నియమించిరి. శ్రీ గణేశ్వరుని దంపతు లర్చించిరి.

కర్మణః పుణ్యాహవాచనము పురోహితులు జరిపించిరి. భార్యాభర్తలకు జమీందారుదంపతులు కట్నాల నొసంగిరి. దంపతులకు బ్రహ్మముడిని రచించినారు వసిష్ఠులు. దేవరులు ప్రత్యక్షమై దివ్యమంత్రములు పఠించినట్లయినది. మంత్రములు మిన్నుముట్టి దిక్కుల గలసిపోయినవి. శుభముహూర్త మరుగుదేర మంగళ వాద్యములు మ్రోగించినారు. ‘ఆరోహోరు ముపబర్హ స్వబాహుం పరిష్వజస్వ’ అని వధూవరసంశ్లేష సంయోగమంత్రము వసిష్ఠాది భూదేవతలు ప్రారంభించిరి. ఆహో! ఈ సంగమ ధర్మమును మహోత్తమ స్థితికి గొనిపోయిన దా ఆర్యధర్మము! నారాయణుడు దివ్యుడే అయినాడు.

భార్య కెడమవైపున గూర్చుండి, కుడిచేత నామె తనువల్లిని చుట్టి, ఫలములతోనున్న పళ్ళెరమునుబట్టుకొన్న దివ్యక్షణము లాతని నానంద తన్మయుని జేసినవి.

‘తం మే వాయో సమర్థయ’ ఆశీర్వాదములైనవి.

భార్యాభర్తలను లోనికి గొనిపోయి పాయసము ద్రావించినారు. వారి నిరువుర శోభనమందిరములో, శోభనతల్పాన కూర్చుండ బెట్టినారు.

శోభనమందిరము దివ్యకళామయముగ నమర్చబడినది. గోడలు పాలరాతి వలె స్నిగ్ధములు. నందలాలు, ప్రమోదకుమార, అవనీంద్ర, దేవీప్రసాదరాయ, ఆసిత కుమారాది చిత్రకారకుల చిత్రములు; దామెర్ల రామరాయలు, పరమేశ్వరమూర్తి మొదలగు నాంధ్ర చిత్రకారకుల చిత్రములు అందందు మనోహరముగ వ్రేలాడదీయబడినవి. విశాలమగు నా మందిరమంతయు రంగు రంగుల దీపముల శబలకాంతులచే దీప్తిమంతమైపోవ, పట్టుజాలరులు, కలంకారీ తెరల యందములు విరిగిపోవ, నిలువుటద్దములు తమ హృదయములలో మందిరాంతరములు వేనకువేలు సూప, దంతపుబల్లపై చందనపు వెండి రాగి విగ్రహములు; కొండపల్లి, నక్కపల్లి కఱ్ఱబొమ్మలు; ఆగ్రా స్ఫటికశిలాప్రతిమలు; లక్నో లోహ సామగ్రులు, మెరుగులీన నాగది నలకూబరుని కేళీమందిరమై విలసిల్లిపోయినది. దంతపుకోళ్ళ పెద్ద పందిరిమంచము చిత్రమగు తెరలతో, పాలసముద్రమువంటి దుప్పటితో, పట్టు ఉపధానములతో, నలంకారములతో చిత్రవిమానమువలె నున్నది. పరుపు హంసతూలికలతో కూర్చినది. ఒకచో రంగుదుప్పట్లు పరచిన బల్లపై, చెన్నపురిలో ఆంధ్రదేశములో దొరుకు చక్రకేళులు, బత్తాయిలు, సాతుకుడులు, అనాసలు, అంజూరలు, దానిమ్మలు, కాబూలిద్రాక్షలు, కిసిమిసులు, నాగపూరు సంత్రాలు, కర్బూజలు, మామిడిపళ్లు, పచ్చవాలప్పణి, సేంద్రజాలప్పణి, మలైవాలప్పణీ మొదలగు నరటులు, సీమరేగులు ఇంకను వివిధఫలములు; వేరొక బల్లపై మినపసున్ని, అరిసెలు, లడ్డు, బర్ఫీ, దూద్‌పేడా, పాదుషా, జాంగ్రి, మైసూరుపాకు, రసగుల్లా, సందేష్, పకోడీ, కారపుపూస, జీడిపప్పు, బూంది మొదలగు పెక్కు తినుబండారములు నున్నవి. బల్లలకడ సోఫాలున్నవి. అగరువత్తులు సుగంధపు బొగల నెగపోయుచుండెను.

జమీందారుగా రీమందిర మలంకరించుటకై చెన్నపట్టణమునుండి నూరు రూకలు రానుబోను కర్చుల నిచ్చి యొక శిల్పిని తీసికొనివచ్చినారట. కొన్ని లక్షల మల్లెమొగ్గలతో, కనకాంబరాలతో, గులాబులతో శోభనమందిరము మధ్య తూగుటుయ్యల నమర్చినారు. అప్సరస్సమూహమువలె అలంకరించుకొని వనితాబృందమంతయు నా మందిరము చేరవచ్చెను. భార్యాభర్తలచే దంపతులకు తాంబూలమును రవికల గుడ్డలు పళ్లు దక్షిణలు నిప్పించిరి.

నారాయణరావు హాసప్రఫుల్లవదనముతో, మెరుపు లీను కన్నులతో భార్యకు నత్తరువు నలందినాడు, గంధము పూసినాడు, తాంబూలము కొనపంట గొరికి యిచ్చినాడు. మదనసుందరుడగు నారాయణరా వప్పుడు ప్రణయమున మరియు సుందరసుభగత్వపూర్ణుడై ప్రకాశింప, వదిన గారు శకుంతలా దేవి చెల్లెలి భర్తను జూచి యిత డింత యందగాడా యనుకొన్నది. ఆమెకు తన పునస్సంధానము జ్ఞప్తికి వచ్చినది. నారాయణరావు చూపుల హావభావవిలాసములు తనభర్త జూపలేదు. ఏమిది! ఈతనివంటి వాడు తనవారిలో నెక్కడ, నెవ్వరు లేడుగదాయని మురియుచు నామె తనమరిది నేదేని వ్యాజమున ముట్టు కొనుచు, నాతనిచే తన చెల్లెలికి నత్తరు వలందచేసినది. చెల్లెలిచే నతని కలందించినది. తాంబూలము లిప్పించినది. సూర్యకాంతము జానకమ్మగారు మొదలగువా రానందమున నోలలాడినారు. జమీందారుగారి చుట్టపు సుందరీమణులు, నారాయణరావు చుట్టు మూగిపోయినా రావేళ.

శారదకు చైతన్యము లేదు. ఆమె వదనాన నలముకొన్న విచారతమస్సును నారాయణుని తను మనఃప్రభాజ్యోత్స్నలుకూడ పారద్రోలలేదు.

బాలికలు కిన్నరీ కంఠముల పాటలు పాడినారు. శారదమాత్ర మెంత వేడినను పాటపాడినదిగాదు. వియ్యాలవారి పాటలు, శ్రీరాధికాకృష్ణగీతములు పాడినారు కొందరు బాలలు. రాత్రి రెండవయామము దాటునప్పటికి తలుపులుమూసి, అందరును వెడలిపోయినారు. శకుంతల శారద నావలి కొకసారి తీసికొనివెళ్ళినది.

నారాయణరా వరగంటవరకు హృదయము గబగబ కొట్టుకొనుచుండ మంచమునుండి దిగి యొక సోఫాపై కనుపెట్టికొని యున్నాడు. తన చిన్నారి భార్యకు మనస్సెటులున్నదో యని యూహించుకొన్నాడు. అతనిని తేనెతీపు లావరించుకొని పోవుచున్నవి.

ముప్పాతిక గంటయైనది. ఇంకను వధువు లోనికి రాలేదు.

నారాయణరావు లేచినాడు. గదిలోని యలంకారములు తిరిగి చూచినాడు. కాని యాతని దృక్కులకు శారదావిగ్రహముతప్ప నేమియు గాను పించలేదు. శారద సర్వాభరణభూషితురాలై యున్నది. ఆ బాలకు నా దివ్య మోహనమూర్తికీ నలంకారములేల! సాయంసమయముననే కోసిన గులాబీ పూవులతో నామె శిరోజములు కప్పివైచిరి. కట్టిన చీర ఎంత విలువగలదైన శారదాసౌందర్యముమ్రోల నగలతో బాటు వెలవెలలాడిపోయినది అనుకొన్నాడు. ఆమెను ముట్టినప్పుడెల్ల పులకరింపులు, మలయమారుతమునకు పుష్పభరితమాలతీలత జలదరించినట్టు అతని నావరించుకొన్నవి. ఒంటిగంటయైనది. ఇంకను శారదను లోనికిబంపలేదు. గడియారము వంకజూచి, నారాయణుడది యంతయుదంతులోని భాగమా యని సందేహించినాడు. అతని దేహము మధురాతిమధురమగు నొక మత్తుచే నావరింపబడినట్లయినది. తా నిదివరకు జూచిన పునస్సంధానముల కిట్లాలస్యము చేసినారా?

లేచి యాతడు తల్పముపై పరుండినాడు. ఈ తల్పము పురాతన తల్పమువలె నున్నది. ఇయ్యది తన మామగారి పూర్వీకులదేమో?

ఒక దేశమున కొక యాచారముండును గాబోలు. ప్రథమ సమాగమ సమయములందు ముగ్ధలగు బాలికలెట్లు చరింతురో?

స్త్రీ పురుష సమాగమ మింత మాయామోహితమా? మానవుల మూల మట్టముగ కదలించి వేయునుగదా స్త్రీ, పురుష సమాగమము! తన సర్వస్వము ధారపోయగలడు మనుజుడు స్త్రీకై. స్త్రీ పురుషుల ఈ మోహముచే ప్రపంచ చరిత్రమే మారిపోవునట!

తానెట్లు సంచరించవలయునో?

గడియారము మృదుస్వనమున రెండుకొట్టినది.

చటుక్కున శారదను లోనికంపి శకుంతలయు, వారి మేనత్తయు పైకి వెడలి తలుపు పైనగొళ్ళెము వేసినారు.

అంతయు నిశ్శబ్దము.

ఆ నిశ్శబ్దములో వెక్కి వెక్కి లోలోదుఃఖించు శబ్దము నారాయణరావునకు కర్ణగోచరమైనది. ఆత డులికిపడినాడు. శారదయే యేడ్చుచున్నది. ఏమిటి? సిగ్గుకాబోలు! భయమా? అది కొంతసేపటికి తగ్గునేమో? ఏమి చేయవలె? అతనికి సిగ్గు వేసినది.

అతడు నెమ్మదిగాలేచి శారదకడకు బోయి ‘శారదా! ఇక్కడ నిలుచున్నావేం?’ అని యడిగినాడు. శారద మాట్లాడలేదు. ఆమె యింకను భుజములు కదల్చుచు లోలోన నేడ్చుచున్నది.

అతని హృదయమున అనుకంప వెల్లివిరిసి యుబికి దిశల నాక్రమించుకొని పోయినది. ఆమెను దరికి జేరదీసికొన్నాడు. శారద కుంచుకొనిపోయినది. ముకుళించుకొనిపోవు పుష్పమైనది.

‘ఎందుకు నువ్వు ఏడుస్తావు పిచ్చిదానా! నిన్ను ప్రేమించి నిన్ను నాలో చేర్చుకొను ప్రేమమూర్తినిసుమా! నీ వంటి దివ్య సౌందర్యమూర్తి నాకు ప్రణయిని అయిందంటే నా అదృష్టంకాదా శారదా? ఈ నన్నావరించిఉన్న యీ పురుషత్వ సౌభాగ్యం, నా తెలివితేటలు, నా సమస్తం నీ పాదాలకడ అర్పిస్తున్నా. నేనింతవరకూ ఎవరినీ ప్రేమించలేదు శారదా? ఏనాడు నిన్ను చూశానో ఆ క్షణంలోనే, నా హృదయేశ్వరి, నా జీవితేశ్వరి ఈమే యనుకొన్నాను’ అన్నాడు. శారద గుండె చెదరున ట్లేడువదొడంగెను. నారాయణరావు చకితు డయ్యెను. అతని హృదయము కుంచుకొనిపోయినది. అతడు తెల్లపోయినాడు. ఆ బాలిక నచ్చటనే వదలివచ్చి యొక దిండ్లకుర్చీపై కూర్చుండెను. అరచేతిలో మోము నాన్చి శూన్యమనస్కుడై శూన్యమగుదెసలజూచినాడు నారాయణరావు.

అరగంట అయినది. శారదయేడుపు తగ్గినది. నారాయణరావు శారదవైపు చూచుచు, నామెయందము తనివితీర గ్రోలుచు, హృదయమును సమాధానపరచుకొనుచు నట్లే యుండెను. శారద తలుపుమూలనే నిలుచుండి యున్నది. పదునైదేండ్లు నిండిన నవయౌవన సౌందర్యపూర్ణ! ఏమి యీ చిత్రము! లోకములో సిగ్గులున్నవి. కోపములున్నవి. కాని చదువుకొన్న బాల, ప్రవేశ పరీక్షలో విజయము గాంచినది. కళాహృదయ. ఏమిటీ విచిత్రము! నారాయణరా వా బాలిక నాయాలోచనలతో నట్లే తేరిపార జూచుచుండెను.

కొంతవడికి నారాయణరావు లేచి ‘శారదా, నువ్వు మంచముమీద పడుకో, ఇక్కడ ఇల్లా నిలుచుంటా వెందుకు’ అని యామెను పుష్పమువలె నవలీలగ నెత్తి తన హృదయమున కదుముకొని ముద్దునిడబోవ నా బాలిక చటుక్కున మోము వెనుకకు ద్రిప్పుకొన్నది. నారాయణరావు సిగ్గుపడి యామెను గొనిపోయి పల్యంకమున బన్నుండబెట్టను. ఆమె మరుక్షణమున లేచి, మంచము దిగి, మరల గదిగుమ్మము కడకేగి నిలుచున్నది.

అది యంతయు నభినయము కాదుగద? స్త్రీలు కేళీమందిరమున ప్రథమ మున నిట్లే చరింతురుకాబోలు. అట్టియప్పుడు తానేమి చేయవలెను? రాజారావుకాని, పరమేశ్వరుడుకాని వారి ప్రథమ సమాగమదినము వర్ణించి చెప్పినప్పు డిట్టిరీతి చెప్పలేదు! రాజారావును భార్యయు కొంచెము సిగ్గుపడిరోలేదో, తలుపువైచిన యరగడియకే వారిరువు రొకరి కౌగిలింతల నొకరు మరిగిపోయిరట. పరమేశ్వరుని భార్య ఇంకను కొంచెమాలస్యము చేసినది. కాని, రెండు గంటలలో సంపూర్ణముగా ప్రాణకాంతు హృదయమున ద్రవించిపోయినదట. ఇంకను పెక్కురు స్నేహితులు చెప్పివారు. కాని ఈ వైపరీత్యమేమి!

‘శారదా, నువ్వు చదువుకున్నదానవు, తెలివైనదానవు. ఏమిటి సంగతీ?’ యని భర్త శారదను బ్రతిమాలినాడు. శారద యంత మొండియైనదేమి?

శారద తన్ను ప్రేమించుటలేదేమో యని యొక్క యశరీరవాణి అతని హృదయమునకు మెరుమువలె ప్రత్యక్షమైనట్లయినది. తాను కురూపియా? మూఢుడా?

అనురక్తి విరక్తులకు మనుష్యుని రూపముగాని, గుణగణముగాని, యాతని తెలివితేటలుగాని కారణములుగావు. పూర్వకర్మయే కారణము కాబోలు. ఈ మానవ హృదయ గ్రంథాంతరార్ధములు కనిపెట్టగలిగినవాడు మహానుభావుడు.

శారదకడకు మరల నారాయణరావు పోయినాడు. ఆ బాలిక నిలుచుండ లేక యచటనే యాగదియంతయు బరచియున్న రత్నకంబళిపై కూలబడినది.

రి క్త కాం క్ష లు

అప్పటికి గడియారము మూడున్నర కొట్టినది. శారదకడకు బోయి యచ్చట కూర్చుండి ‘ప్రాణేశ్వరి శారదా! ఈ శుభముహూర్తం ఇల్లా గొడ్డు వేళ కాకూడదేమో? నువ్విట్లా పడుకోవడం బాగుండదు. వచ్చి ఆ మంచము పైన పడుకో, నీకు ఇష్టం లేకపోతే నేనా సోఫాపైన పడుకుంటాను. మనం వృధాగా మేలుకొని ఉండడం ఎందుకు...?’

ఆమె తలవంచి యట్లేకూర్చున్నది. ‘ఒకటి మాత్రం మరువకు సుమా! నేను నీకు భర్తనయ్యాను కదా అని, నా అధికారాలుగాని, నాకున్న హక్కులుగాని నేను కోరను. నీకు యిష్టం లేదంటావా, నా మొగం నీకు మళ్ళీ చూపను. నీ మనస్సు కష్టపెట్టుకొనకు. మనము చదువుకున్న వాళ్ళము. నువ్వూ పరీక్షలు నెగ్గుతున్నావు. నాగరికురాలవు.’

శారద మాట్లాడలేదు.

నారాయణరావు తిన్నగా పోయి, యొకసోఫాపై చదికిలబడి నిట్టూర్పు నించి, హృదయపుటమున పావకజ్వాలలు సెలరేగ, జేతితో మొగము గప్పుకొని యా సోఫాపై వాలిపోయినాడు.

శారద పరీక్షలో నెగ్గిననాటినుండి తాను విద్యావతి ననియు నాగరిక వనితననియు విఱ్ఱవీగినది. నవలలో జదివినయట్లు చదువుకొన్న ‘విద్యావంతురాలు’ ప్రేమయొక్క తత్వము దెలిసికొనవలె. ప్రేమాస్పదుడుగాని పురుషుడు పరపురుషుడే. ప్రేమబంధనమే విధివిహిత మగు వివాహబంధనము.

ప్రేమాస్పదుడుగాని పురుషుని స్పృశించుటెట్లు? అమెరికా ‘దొరసాని’ యామె యుపాధ్యాయురాలు ప్రేమతత్వ మామెకు బోధించినది. పాశ్చాత్యదేశముల ముఖ్యముగా నమెరికాఖండములో పొరబడివివాహము చేసి కొన్న స్త్రీ, పురుషులు ప్రేమలేదని గ్రహించిన నిమిషమున నా వివాహము రద్దుచేసికొనెదరట. ఒకరిమీద నొకరికి, బ్రేమలేదని తెలిసిన మరుక్షణము ఒకరి నొకరు ముట్టుకొనరట.

ఆమె ఇంటరు పరీక్షకు దీక్షతో జదువుచున్నది. ఇంటికడనే యుండి చదువుచున్నది. చదువుకొను నితరబాలికలతో స్నేహము కుదిరినది. చదువు కొను బాలలు వివాహము చేసికొనుటకన్న వేఱు పొరపాటు లేదట. పాశ్చాత్య విద్య చదువుకొను బాలలకు హృదయమున మంచుతెరలు విడిపోవునట. మొరకులగు స్త్రీలకు బ్రేమస్వరూపమే తెలియదు. వారు పశువులవలె నత్త వారిండ్లకు వెళ్ళెదరు. వారు భర్తకు సొత్తయి యాత డేమిచేసినను భరించి జీవితాదర్శ ముల నెరుంగక నశించిపోవుచుందురట. కాని చదువుకొను బాలలకు బ్రేమయన నేమియో తెలియును. వారి హృదయమున బ్రేమోదయము కాని యప్పడు వారెట్లు వివాహము చేసికొందురు? ప్రేమ కుదిరినచో నా పురుషునకు వారు సర్వస్వము ధారవోయుదురట.

ఈ విషయములన్నియు నా బాలికలు చర్చించుకొన్నారు. తనకు వివాహమైనది. తాను భర్తను బ్రేమించుటలేదే! తన కుటుంబము వేరు. తన భర్తకుటుంబము తన తండ్రిగారికడ సేవకావృత్తి చేసికొనవలసిన పల్లెటూరి కుటుంబము. చదువున్ననేమి? వారికి దర్జాలేదు. క్రిస్టియనులు మొదలగువారు చదువుకొనుట లేదా! ఇక బలమగు దేహమా! అది కూలివాండ్ర కందరకు నుండును. ఆ సంగతే తన మేనబావయగు రాజా జగన్మోహనరావు తనతో వేసారులు చెప్పియున్నాడు.

జగన్మోహనుని గౌరవము, అతనిదర్జా, ఠీవి తన యత్తవారి కెట్లువచ్చును? తాను జగన్మోహనుని ప్రేమించుచున్నదా? తాను చెప్పలేదు. తన్ను జగన్మోహనరావుబావ ప్రేమించుచున్నాడు. అతనికి ప్రేమించుట తెలియును. తక్కువజాతి వారికి ప్రేమించుట యెట్లుతెలియును? తాను జగన్మోహనుని ప్రేమించినది, లేనిది ప్రస్తుతము తనకు తెలియకపోయినను, తన భర్తను ప్రేమించుట లేదన్న మాట మాత్రము నిశ్చయము.

నెలలు గడిచినవి. ఇంటరు పరీక్షాగ్రంథములు చదివించు నమెరికా వనితామణి తనకు బాఠములు చెప్పు సందర్భమున జమీందారులు, ప్రభువులు నమెరికా దేశములలో లేరనియు, ఈ దినమున బాకీపనిచేయు పురుషుడు రేపు అమెరికా దేశాధ్యక్షుడు కావచ్చుననియు, గావుననే జమీందారులన్న పదమే తన దేశములో నుపయోగింపరనియు జెప్పినది.

అప్పుడు శారద కా ఉపాధ్యాయినియెడ కోపమువచ్చినది. కానీ భర్తయన్న నసహ్యము పోలేదు. తనకు పునస్సంధాన మహోత్సవన్నమాట వినబడినతోడనే యామె గజగజ వణకిపోయినది. తన కక్కరలేదని తల్లి దగ్గర కంటనీరు పెట్టుకొన్నది. తల్లి జమీందారు గారి కడకుబోయి ‘అమ్మాయి కిప్పుడు కార్యముచేయుట నాకిష్టము లేదండి’ యని యన్నది.

‘ఎందుచేత?’

‘అదియింకా చిన్న పిల్ల.’

‘పదహారో ఏడు జరుగుతూంది. పద్దెనిమిదేళ్ళవరకు ఉంచడం బాగానే ఉంటుంది. కాని దాని యత్తవారు పూర్వకాలపురకం. వియ్యంకుడుగారు కోరుతూ ఉత్తరము వ్రాశారు. వారిమాట కాదనలేక సరే అంటూ ఉత్తరం వ్రాశా.’

‘అల్లాంటి చాదస్తపు పూర్వకాలపు సంబంధం యెందుకు చేశారు?’ ‘వాళ్లు పూర్వకాలపు మనుష్యులయితే నేమి? వాళ్ళంత మర్యాదస్తులు ఉదారహృదయం కలవాళ్లు మన నియోగుల్లో ఇంకోళ్లులేరు. పిల్లవాడు మహారాజులకు అల్లుడు కాదగిన మహానుభావుడు. నిజంగా అటువంటి అల్లుడు నాకు లభించడంవల్ల నా జన్మ పావనమయిందని నా ఊహ!’

‘మీకు మీ అల్లుడంటే మహాపక్షపాతం. ఏది ఎట్లాగయినా మీరీ కార్యంమాట ప్రస్తుతం ఆపుచెయ్యండి. అది నా ప్రార్థన.’

‘మాట యిచ్చాను. బహుశా వేసవికాలందాక గడుపుతాను. అమ్మాయి పెద్దమనిషి అయి ఏణ్ణార్థం అవుతుంది. క్రిస్టమసు నెలరోజులలో వస్తుంది. అప్పుడీ శుభకార్యం చేయిస్తే బాగుంటుంది అని వ్రాశారు సుబ్బారాయుడు గారు. నిన్న సరేనని వ్రాశాను. ఇవ్వాళ వేసంగి సెలవులదాకా వీలులేదు ఆని వ్రాస్తాను.’

అప్పటికి తాత్కాలికముగా శారద కా యాపద గడచినది.

కాని సుబ్బారాయుడుగారు మరల చైత్రమాసములో జమీందారుగారి కిట్లుత్తరము వ్రాసినాడు.

ది 5 ఏప్రిల్ 1928 సం. మకాం కొత్తపేట.

మహారాజరాజశ్రీ శ్రీమంతపరరాజగండ, మహాభట్టారక శ్రీ శ్రీ రాజా తల్లాప్రగడ లక్ష్మీసుందర ప్రసాదరావు బహద్దరు జమీందారు బావగారి సముఖమునకు.

ఉభయకుశలోపరి

ఇక్కడ అందరూ క్షేమం, అక్కడ శ్రీ శ్రీ మహలక్ష్మీ సమానురాలగు అక్కగారి క్షేమమున్ను శ్రీ శ్రీ గం. స. వదినగారి క్షేమమున్ను శ్రీరస్తు చిరంజీవి సౌభాగ్యవతులగు మాకోడళ్లు శకుంతలమ్మ, శారదల క్షేమమున్ను శ్రీ శ్రీ మా అల్లుళ్ళు కుమారరాజా కేశవచంద్రరావు క్షేమమున్ను బంధుమిత్రాదుల క్షేమమున్ను వ్రాయించకోరుచున్నాను.

తర్వాత, చి. మా అబ్బాయికార్యము తాము వెనుక తమఉత్తరములో సెలవిచ్చిన ప్రకారము ఈ వైశాఖమాసంలో శుభముహూర్తములున్నవి. తారాచంద్రబలాలు మొదలు సమస్తవిషయాలతో గొప్ప ముహూర్తం కుదిరింది. కాబట్టి తా మా ముహూర్తము పరిశీలించి యనుమతించవలయునని పార్థించుచున్నాను.

చిత్తగించవలెను.

విధేయుడు

త. సుబ్బారాయుడువ్రాలు



కుమారుని పునస్సంధాన మహోత్సవము త్వరలో జరుగవలయుననియు, కోడలు తన యింటికి త్వరలో గాపురమునకు రావలయుననియు మురియుచున్న నారాయణునితల్లి భర్తను తొందరపెట్టి యుత్తరము వ్రాయించినది.

వియ్యంకుని యుత్తరము జమీందారుగారు భార్యకు జదివి వినిపించి యీపట్టు తప్పదన్నారు. శారద కాసంగతి తల్లి చెప్పటతోడనే యొకటి రెండుసంవత్సరములవఱకు దప్పిపోయినదని సంతోషించిన యా బాలిక విచార గ్రస్తురాలయి, తల్లితో నెట్లయిన నింకొక సంవత్సరమువఱకు నిట్టివి తలపెట్టకుండ జేయవలెనని మరియు మరియు గోరినది. తల్లి భర్తకడకు పోయి శారద యింకను జిన్న పిల్లయనియు నిప్పడింత తొందర యేమివచ్చినదనియు బాలికలకు బదునెనిమిదవయేటివరకు వివాహము చేయించ వలనుపడదని వాదించిన వారిలో మీరొకరుకాదా యనియు నామె భర్తతో వాదించినది. జమీందారుగారి కామె చెప్పు మాటలన్నియు సత్యపూరితములని తెలియును. ఈ పల్లెటూరివా రిట్టి తెలివితక్కువ లేల జేతురో యని యాయన విసుగుకొన్నాడు.

భర్త వ్యతిరేకముగ నున్నాడనుకొని ఇప్పుడీ శుభకార్యము శారదకే యెంతమాత్రము ఇష్టములేదని జమీందారిణి చెప్పినది. జమీందారుగారు ‘ఆఁ! శారద కిష్టములేదూ? అవును. చిన్నపిల్ల. ఇంకను చదువుకొనుపిల్ల. ఆటల సరదాఅయినా వదల్లేదు. సంగీతము అది పూర్తికాలేదు. నిజమే, గట్టిగా ‘వీల్లేదు’ అని రాస్తాను.’

‘శారద కళ్ళనీళ్లు పెట్టుకొని యేడ్చిందికూడాను!’

‘శారదకంటిలో నీరే! అదేమిటి? నా వెఱ్ఱితల్లి, శారదకు కంటి నీరెందుకు? సిగ్గు చేతనేమొ? చదువు చెడిపోవునని భయమా? చదువుకున్న బాలికలు త్వరలో భర్తలయిండ్లకు బోవుట కిష్టపడరు. అయిన నెంత యాలోచించినను శారద కళ్ళనీరు పెట్టుకొనునంతటి భయమేమియు గనబడదే?

భార్యయు, నితర చుట్టములు, తన వియ్యాలవారిని అల్లుని హేళన జేయుట జమీందారుగారు గ్రహించినారు. అట్టి సందర్భముల నెంత యాలోచించిన, నాయనకు పునస్సంధాన మహోత్సవ మాపుచేయుట కిష్టములేదు. కార్యమొనరించిన మరునాడే కాపురమునకుబోవ నవసరములేదుకదా. కాబట్టి శారద యే కారణమునను భయపడ నక్కరలేదు.

శుభకార్యము తప్పలేదు. శారద మరియు గారాముచేసి పట్టుపట్టినచో జమీందారు డేదేని వంకబెట్టి కార్యము మాన్పించునేమో. కాని శారదయు అది బాగుండదని యాలోచించినది. తప్పక కార్యమైన నేమిచేయవలె? భగవంతు డెట్టి కష్టము దెచ్చిపెట్టినాడు. పేరునకు భర్తయైనను ప్రేమలేమి, పరపురుషుడేకదా! పరపురుషుడెట్లు తన్నంటుట?

౪ ( 4 )

నామీద ప్రేమ లేదా?

నాలుగున్నరగంటల కులికిపడి నారాయణరావు లేచిచూడ శారద తలుపుదగ్గరనే తివాసీపై పరుండి నిద్రపోవుచున్నది. ఆమె కన్నులచుట్టు నీరు ప్రవహించి యెండియున్నది. పూవులప్రోవు వెదజల్లినట్లు, చెదరిన పైట, చీర, జడతో జడలోని పూవులతో, విడి విడి రాలిన గులాబి రేకులతో ఆ సుందరీమణి తన యిల్లా లటుల పరుండవలసిన గతియేమి? ఆమెకు దనయెడల ఎంతటి అసహ్యతయో? తా నొక రాక్షసునివలె నామెకు కన్పట్టినాడు కాబోలు. పాప మా బాలికను వృథగా తనకు గట్టిపెట్టిరిగదా.

ఇంతకు దన్నాబాల ప్రేమింపకపోవుటకు దనయెడల నేమిలోపము కనిపెట్టినదో? ప్రేమవిషయమున లోపములు, తాపములు గణనకు వచ్చునా? నిజమునకు మన భావనయే కాని ప్రేమయను వస్తువున్నదా! అటులనుటకు వీలులేదు. తా నీ బాలికను జూచినప్పటినుండియు బ్రేమించుచున్నానని యను కొనుటలేదా? అనుకొనుటయేకాదు నిజముగా ప్రేమించుచున్నాడుకదా! ఆమెకొఱకు పరితపించుచున్నాడు. ఆమెకు దన హృదయమున బట్టము గట్టినాడు.

ఈ బాలికకు దానన్న ప్రేమ లేమియే నిజమయినచో దానేమి చేయవలెను? ప్రేమలేని బాలికతో గాపుర మెట్లు? తమ కుటుంబములో స్త్రీ పురుషులకు బ్రేమోదయమైనపిమ్మట వివాహములు జరుగుచున్నవా? వివాహములై కార్యములైనవెనుక, నూటికి తొంబది దంపతులు సంతోషమున గాపురములు సేయుచున్నారే! వారు ప్రేమించుకొనుట యెరుగుదురా? యువకునకు యువతి గావలెను. యువతికి యువకుడు గావలెను. మన వివాహములలో మీ రిరువురు నొకరి నొకరు కోరుట కలవాటుపడండి. ఒకరికొకరు స్నేహితులుకండి యని మనకు నేర్పినారు. ప్రేమకూడ కుదిరినచో వారి దాంపత్యప్రవాహము గంగా నదియే. లేనిచో స్నేహితులుగానైనా సంసారయాత్ర సాగించుకొందురు.

కాని యీ బాలిక తన్ను గోరుటలేదా! ఇంక నెప్పుడు తన్ను గోరదా!

మరల తుదిప్రయత్నము చేయవలెనని యాత డూహించుకొని పరమ కరుణామూర్తియై భార్యకడకేగి నిదురబోవు నా బాలికను, వాయువు సౌరభము నెత్తికొనిపోవురీత గొనిపోయి మంచముపై బరుండబెట్టి తనివితీర ముద్దుగొనెను. శారదకు చటుక్కున మెలకువవచ్చి లేచి ‘అమ్మయ్యో’ యని దిగ బోయినది.

‘ఎవరైనా వింటే నవ్విపోతారు. మంచముపై పండుకున్నట్లయినా కన్పించడం మంచిది. తెల్లవారవచ్చింది. లేచి వెళ్ళిపోవచ్చులే... ఆఖరిసారి అడుగు తున్నాను. నీకు నామీద ప్రేమలేకపోవచ్చును. కాని అనేకమంది సంగతి చూడు. మీ నాన్నగారి పెళ్ళి అయినప్పుడు మీ అమ్మగారిమీద ప్రేమచేత పెళ్ళిచేసుకొన్నారా? అయినా ఎంత ప్రేమగా ఉన్నారు! మీ అక్కయ్య మీ బావని ప్రేమచేత పెళ్ళి చేసుకుందా? అయినా దంపతులిద్దరూ ఎంత ప్రేమగా ఉన్నారో! పనసతొనల్లాంటి బిడ్డల్ని కన్నారు. అలాగే మీ కుటుంబంలోనూ, మా కుటుంబంలోనూ, మనదేశం అంతలో జరుగుతున్నాయి. నువ్వు చేసే విడ్డూరం ఎక్కడాలేదు శారదా! నేను మామూలు తుచ్ఛులగు భర్తలవంటివాడను కానే? నా భర్తత్వం నీకు హేయం అయితే పోనీ, నా స్నేహమున లోపమేమున్నది? నేను కలుసుకొన్న ప్రతివాళ్లూ నేనంటే స్నేహంగా ఉంటారే?

శారద తలవాల్చికొని యట్లే మంచముమీద కూర్చుండియున్నది. నారాయణరావామె మనస్సు కరుగుచున్నదేమో యనుకొన్నాడు. ధైర్యము చేసి యామెపై చేయివైచి చెంతకు లాగికొనబోవ నామె గింజుకొని ‘అబ్బా నా_కి_దే_మి_టి_బాబూ’ అన్నది.

నారాయణరావు చిన్నబోయి యామెను జుట్టియుంచిన చేతులు విడదీసి దీర్ఘముగా నిశ్వసించి,

‘నువ్వు నెమ్మదిగా తలుపుతీసికొని వెళ్ళిపో. నేను తెల్లవారువరకూ ఇక్కడుంటాను’ అని మంచముపై పరుండెను. శారద గదిగుమ్మముదగ్గరకు వెళ్ళి తన యక్కగారు పైన గొళ్లెము వేసిన సంగతి జ్ఞాపకము రానట్లే యచ్చట నిలుచుండిపోయెను. నారాయణరా వదిచూచి యచ్చటకు బోయి తలుపులాగి చూచుటయు నది తీసియేయుండెను. తానప్పుడువచ్చి మంచముపై పరుండి నిద్రపోయినట్లు నటింపసాగెను.

ప్రేమకు దివ్యచక్షువులున్నవి. కావుననే ప్రేమాస్పదులగువారి హృదయమును మనమిట్టె గ్రహింతుము. నాటి రేయి తన మఱిదియు జెల్లెలు నత్తరువు లలదుకొన్నప్పుడు తనచెల్లెలు భర్తయగు నారాయణరావును బ్రేమించుట లేదని శకుంతలాదేవికి మెరపువలెదట్టినది. ఆమె హృదయము చలించినది. నారాయణరావునం దామెకు బ్రేమ వెల్లువవలె బొర్లిపోయినది. అతడు తనభర్త అయినచో దనజన్మ సార్థకమయియుండునుగదాయని యనుకొన్నది. అందమయినవాడు. నిజమైన పురుషుడు. ఉత్కృష్టమగు తెలివితేటలుగలవాడు. అంతకన్న బ్రేమింపదగిన భర్త దొరుకుట కలలోనివార్త. శారద వెఱ్ఱిపిల్ల. తన భర్తకన్న శారదమగడు సర్వవిధాల పూజింపదగినవాడు. తా నదృష్ట వంతురాలని సంతోషించవలసిన శారదకు భర్తపై నింత హేయభావము కలుగుటకు కారణము దాని పెంకితనమే. తామందరు ఈ బాలిక హృదయాన్ని పాడుచేయలేదా! ఈ కన్నతల్లి యెదుట తాను, తనతల్లి, అందరూ తన మఱిదిని, దేవతామూర్తియైన తన మఱిదిని, ఆడిపోసుకొనలేదా? శకుంతలాదేవి చెల్లెలి హృదయమును మార్చబూని యామెకు బుద్ధులు గరపుటకు యీవలకు దీసికొని వచ్చినప్పుడు చెల్లెలితో ‘శారదా! అదేమిటి అల్లావున్నావు?’ అని పల్కరించినది. శారద మాట్లాడినదికాదు. ‘తల్లీ, నీభర్త చాలామంచివాడమ్మా. అతనంతసరదాగా అత్తరూ అదీ పూస్తూ ఉంటే పెంకిదానిలా మూతిముడుచుకొని కూచుంటారటే! తప్పుకాదూ! అల్లాంటిభర్తే నాకు దొరికిఉంటే ఈ జన్మలో నాకింకేమికావాలి? నీ అంత అదృష్టవంతురాలు లేదు. మగవాళ్ళ మనసు చాలా సున్నితం సుమీ! నువ్వు పెంకిచేష్టలు చేసేవు! జాగ్రత్త! ప్రేమతో నీ చుట్టూ కోటకట్టగల శక్తిగల వాడు. ఎంత అందమయినవాడు. ఎంత తెలివైనవాడు. చచ్చు జమీందారి సంబంధాలు మహామంచివి అనుకున్నావు కాబోలు. నాబాధలు చెవులారా వినటం లేదూ నువ్వు, శారదా!’ శకుంతల యామె చెవులో నెన్నేని చెప్పినది. శారద రోషమున ‘ఇదివరదాకా నువ్వుకూడా వాళ్ళను నానామాటలు అన లేదూ’ అని వెక్కి వెక్కి యేడువదొడంగినది. అంతలో శారద మేనత్త యటకు వచ్చినది.

శారద లోనికి వెళ్ళనని పట్టుపట్టినది. జమీందారిణి కొమరితకు భర్తపై నయిష్టమని తెలిసి సంతోషించినది. కాని గర్భాదానమునాటిరాత్రి కొమార్తె గదిలోనికి వెళ్ళదనుట నలుగురుకు దెలిసినచో నేమనుకొందురో యని భయపడి ‘లోపలికి వెళ్ళు తల్లీ’ యనిమాత్ర మన్నది.

మేనత్తయు నక్కగారును రెండుగంటలు బతిమాలి, కోపపడి, వాదింపనప్పటి కాబాల విధిలేక హృదయ ముచ్చిపోవునట్లు వెక్కి వెక్కి యేడ్చుచు లోనికిబోవ సంసిద్ధయైనది. ముద్దులకూతును గాంచి జమీందారిణియు గండ్ల నీరుక్రుక్కుకొనుచు, బిడ్డను కవుగిలించుకొనెను. శకుంతల ఆడుపులియై, కోపమున కన్నులు కెంపెక్క ‘అమ్మా! నీకేమైన మతిపోయినదటే? ముత్తయిదువు లంతా వెళ్ళిపోయి రెండున్నరగంటలు కావచ్చినది. తెల్లవారబోతోంది’ యని కేకలువేసినది.

‘ఏమి కామేశ్వరమ్మా! బాగావుంది. నేర్పుతున్నావు కూతురుకు బుద్ధులు. చాలుచాలు. ఎవరన్నా వింటే నవ్వుతారు. తమ్ముడికి తెలిసిందంటే మన గౌరవాలు దక్కవు. ఇల్లాంటివి ఎక్కడా వినలేదు, చూళ్ళేదు. శారదా! ఇల్లారా’ యని యా బాలికచుట్టు చేయిచుట్టి తలుపు తెరచినది. శకుంతల యొకవైపు ‘ఊరుకో అమ్మా, అతను చూస్తాడు’ అని చెవిలోనూది లోనికి ప్రవేశింపజేసినది. అప్పుడు వారిరువురు తలుపులు మూసి బైట గొళ్ళెము పెట్టినారు.

చెల్లెలి విపరీతావస్థకు బెంగగొనియున్న శకుంతలాదేవి కా రాత్రి యంతయు నిదురపట్టలేదు.

శకుంతలాదేవికి నిరువదియొకటవ సంవత్సరము. ఇరువురు బిడ్డల తల్లి. ఆమె శారదవలె నందకత్తియ. కాని రెండు కాన్పు లైన వెనుక బొద్దయి, కొంచెము స్థూలమైన దామె దేహము. అయినను మేలిమి బంగారు దేహము. చెల్లెలికివలె, దల్లికివలె దీర్ఘమై నొక్కులున్న జుట్టు, విశాలములగు కన్నులు, చిన్న నోరు, శకుంతలాదేవి నందకత్తియగా, నుత్తమజాతి లోలాక్షిగా జాటుచున్నవి.

ప్రక్కనున్న గదిలో బరుండి యప్పడప్పుడు వచ్చి, తలుపుకడ చెవి యొగ్గి విని మరల వెళ్ళి పరుండినది. తలుపు గొళ్ళెము తీసివచ్చినది.

తెల్లవారగనే శారద వచ్చి తన ప్రక్క పరుండుటయు, శకుంతల యులికిపడి లేచి, విద్యుద్దీపము వెలిగించి శారదను దేరిపారచూచి, యా దీపము మరల నార్పివేసి, శారదను కౌగిలించుకొని పండుకొన్నది.

రెండవనాటి రాత్రి ముచ్చటలు జరుపుటలో నారాయణరా వత్యంతోత్సాహము సూపినాడు. శారద మామూలుగ నొకరీతిగా నున్నది. శకుంతలాదేవి నే డంతయు జక్కపడునని యనుకొన్నది.

నారాయణరావు తనకు, దన భార్యకు జరిగిన ప్రథమదినోదంతము పరుల కెరుక పరుపకూడదనియు, పరు లూహింపనైన నూహింపకుండ చరింపవలయు ననియు సంకల్పించుకొనుటచే మరునాడు వసంతునివలె నలంకరించుకొని, మొదటి నాటికంటె మరియు నుత్సాహముగ చరింప మొదలుపెట్టెను.

శారదకుమాత్ర మిదియంతయు నాశ్చర్యము కలిగించినది.

ముచ్చట లన్నియు నైన వెనుక, ముత్తయిదువు లందరును వెళ్ళిన వెనుక శారద వెంటనే గదిలోనికి వచ్చి తలవంచుకొని, తలుపుమాటున జతికిలపడి పోయినది. నారాయణరావు తాను దెచ్చి పెట్టుకొనిన యుత్సాహమంతయు మరిగిపోవ నిరాశావశుడై మోమువాల్చి, యొక దిండులకుర్చీపై నాసీనుడయి యాలోచనాపరుడైనాడు. తన జీవితమంతయు నెడారియైపోవునని యాతనికి దోచినది.

తన నిర్మల చరిత్రమున నేమి కళంకములు రానున్నవో?

తన హృదయదేవత యనుకొన్న శారద తనకు గాకపోయినదా?

ఎట్లు? తన యింటికడ మూడు రోజులును నున్నవికదా. అవి వేగించుటెట్లు? నారాయణుడు లేచి తన్ను ముంచివేయు నిరాశామేఘములను దరిమివేసి, భార్య పడియున్న తావునకు జిరునవ్వుతో జేరబోయి ‘ఆనందమయీ అని పిలవనా, లేక ముగ్ధలలనా! అని పిలవనా అని ఆలోచిస్తున్నాను. ఏమని పిలవను చెప్పు శారదా?’ యని ప్రశ్నించినాడు.

శారద ముకుళించుకొనిపోయినది.

‘మన జన్మం ఇలా వృథా అయిపోవాలనా నీ ఉద్దేశం? అయితే సరే. నాకు ఇతరుల మనస్సులు కష్టపెట్టడం గిట్టదు. అది నా చేతకాదు. ఈలాంటి అందకత్తె నా భార్య అవుతుంది. ఆమెకు చదువు సంగీతం దివ్యంగా వస్తాయి. శ్రీవిష్ణువులా హృదయంలో ధరించుకొంటాను, శివునిలా అర్ధనారీశ్వరుణ్ణి అవు తాను, బ్రహ్మలా నా వాక్కులో ధరిస్తాను అని కలలుకన్నా. నా కలలే రూపం పొందినట్లుగా నువ్వు నాకు హృదయేశ్వరివి అవడం నా జన్మం పావనం అయిందనుకున్నా! నవ్వితే నక్షత్రాలు నర్తిస్తాయి అని వర్ణించుకున్న బాలికవునువ్వు. నువ్వు వీణా, నేను ఫిడేలు వాయించుకొంటూ కిన్నర మిథునంలా ఉందామనుకున్నాను. ప్రతిపరీక్షలోనూ ప్రథముడుగా నెగ్గుతూ, అనేక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించుకొన్నందుకు అనురూపయైన విద్యావతివి నాకు లభించావని మురిసిపోయాను.

‘నాకు అలవడిన కవిత్వం, చిత్రలేఖనం నీవల్ల చరితార్థమవుత వనుకొన్నా. నా రాణిని నానా భాషల్లో పాడుకొందామనీ, నా దేవిని నానా వర్ణాల, నానాభంగుల చిత్రించుకొందామనీ, నా ఆత్మేశ్వరితో నానాపరమార్థ ప్రణయలీలల దివ్యుణ్ణౌదామనీ పొంగిపోయాను. జన్మజన్మాలకూ నన్ను ప్రేమించడానికి, నీకు తక్కువైన ప్రేమను కూడా సర్దడానికి తగినంత ప్రేమ నాలో కట్టలు తెంచుకొని పొర్లుతూంది. ఈ ప్రవాహంలో నిన్ను తేల్చి వేస్తాను. క్రమంగా నా దాన్ని చేసుకుంటాను. దివ్య ప్రేయసివి నువ్వల్లా కొంచెం సుముఖంగా ఉండు. ఉపేక్షతోనైనా సరే నా ఆరాధనను అంగీకరించు. అంతేకాని నువ్వింతటి వైముఖ్యం తాల్చి మన యిద్దరి బ్రతుకులు మరు భూముల్లో ఇంకి నశించే మహానదిలా చేయకు.’

నాకు ప్రేమ లేదు

భర్త ప్రేమతో దివ్యశాంతమూర్తియై తన్నట్లు నిర్దేశించి చెప్పినంత కాలము శారద మాట్లాడలేదు. ఒకసారి రెండుసారులు భర్త చెప్పినమాటలు నచ్చి కొంచెము మెత్తపడినది. కాని జగన్మోహనునిమాటి లామె కాసమయమున నే స్పష్టముగా బొడగట్టినవి. ‘ప్రేమలేని మనుష్యుని ముట్టుకొనుట కూడా తప్పుసుమా శారదా!’ యని యాతడు పదేపదే యన్నముక్క పిడుగు వలె జెవిలో వినబడినది.

నారాయణరావు స్త్రీలతో నొకవిధమున చనువుగా నుండును. నే డెటుల శారదతో మాట్లాడగలిగెనో యతనికే తెలియదు. మరల నాతని నోట మాట రాలేదు. ఉస్సురని వెడలిపోవజూచుచు ‘మాట్లాడవేమి శారదా!’ యని జాలిగ ప్రశ్నించెను.

శారద భయమునిండిన హృదయముతో నిజముచెప్పిన ఈయన వదలు నను ఆశతో కంపితస్వరమున ‘నాకు ప్రేమ లేదు’ అని గబుక్కున కన్నుల నీరునిండ వేడ్చినది.

నారాయణరావును కొరడాతో మొగమున గొట్టినట్లయి చివుక్కున వెనుకకు జరిగి మెదడు రక్తహీనమైపోవ తూలి, లేచి, అచ్చటనుండి వచ్చి వచ్చి, సోఫాపై కూలబడినాడు. ఇక నేమున్నది? సర్వము ముగిసినది. అంతయు నల్లబడిపోయినది. ఆ ముక్కలే తనకు జన్మాంతరము దుఃఖితుడవు కమ్ము అని విధించిన శాపము. తాను కట్టుకొన్న దివ్యభవనము కూలిపోయినది. తన బ్రతుకు నిరర్ధక మైపోయినది.

• • •

నారాయణరావు రాపడిన గుండెతో లోతులేని నవ్వుతో గపటనాటక మాడుచు నత్తవారింటికడ, కొత్తపేటలో దనయింటికడ, తక్కిన యామిను లెట్టులో వేగించినాడు. మిత్రులకైన దెలియనీయలేదు. పునస్సంధాన మహోత్సవ మిట్లు ముగిసినది.

తనయింటికడ తండ్రి సత్యనారాయణవ్రతము సంకల్పించినారు. ఎటుల జరిగినదో, ఏమి జరిగినదో!

శారద పుట్టిల్లువచ్చి చేరినది. ఆమెకు దాను భర్త యెడజేసిన మహాపరాధము అవగతమైనది. తన తండ్రికిని, తన భర్తకును దోష మొనరించినాను అన్న భావము వ్యక్తావ్యక్తమై యామెకు దోచినది.

బాలకుడగు కేశవచంద్రుని హృదయమున నేదియో అనిష్టము జరిగినదన్న యాందోళన కలిగి పెద్దక్కగారికడకేగి ‘చిన్నబావ మంచివాడు పెద్దక్కా?’ యనెను. శకుంతల తమ్ము నెత్తుకొని, ముద్దుపెట్టుకొన, కేశవచంద్రుడు పెదవులు తుడుచుకొనుచు ‘పెద్దక్కా చిన్నబావ మంచివాడు కాడా’ యని ప్రశ్నించెను.

‘అయితే మీ పెద్దబావగారు మంచివారు కారన్న మాటేనా?’

‘కారు.’

‘ఎందుచేత?’

‘ఏమో!’

అతడు శారదకడకేగి చిన్నక్కగారి మోము తీక్ష్ణముగ నాలోకింపుచు,

‘చిన్నక్కా! మా చిన్నబావ దేవుడి అవతారముకాదూ! నిజంగా నేను నమ్ముతా’ నని యనెను.

శారద అతనిమాటల కులికిపడెను.

శకుంతల తన చెల్లెలిని జేరి ‘శారదా! మీ ఆయన చెన్నపట్టణం వచ్చేటప్పుడు మనఊరు వస్తారటే?’ యని యడిగినది. శారద తనకు తెలియదని నూచించినట్లు తలతిప్పినది.

శకుంతలకు మరదిపై ఆపేక్ష యినుమడించినది. నిర్మలహృదయముతో దల్లికడ, చెల్లెలికడ, మేనత్తకడ, తండ్రికడ నాతని పరిపరివిధముల బొగడ జొచ్చినది. శారదకు దన సహోదరి మాటలు కష్టములై యామెను జేరుటకు సందేహించుచు, వీలైన దప్పించుకొనుచు మెలగచొచ్చినది. రానున్న భయంకరమగు విపత్తు తప్పినట్లయినది. భర్త బలవంతము చేయునేమో యని యామె భయపడినది. కాని యాత డంత నెమ్మదిగ సంచరించుట చే నామెకు హృదయము నుండి పెద్ద బరువు తీసివేసినట్లయినది.

చదువు విషయమై ఎక్కుడు శ్రద్ధవహింప నారంభించినది. పూర్ణకంఠమున సంగీతము దివ్యకిన్నరస్వరముతో నర్తనసేయ, దనలోనే మోహమావరించి పోవ త్యాగరాజు భక్తిగీతములు మరియు నానందముగ బాడుకొనజొచ్చినది.

శకుంతల శారదను జూచి ఈసును, మెప్పునుట్టిపడ, ‘నీ వదృష్టవంతు రాలవే చెల్లీ! నీకు మహారాజ కొమార్తెలు కోరితే దొరకని మగడు దొరికాడే తల్లీ. పాడుకో! నాకంఠం ముక్కలయిపోయింది. మీ బావకూ నాకూ ఎప్పడూవచ్చే వాగ్వివాదంతో గొంతుకలో అపశ్రుతి వచ్చిందే. వీణ వాయించుకోవడమే లేదు. పిల్లలిద్దరూ ఎప్పుడూ అల్లరే.’

‘శారద తన యక్కగారి పిల్లలను సంతతము నాడించునది. ఈరోజులలో నా బంగారుతొనల బాలిక లిద్దరిని ఒక్కనిమిషము వదల లేదు.

•••

జమీందారుల యిండ్లలోని ఆడువారిట్టులే సంచరింతురా? లేక తనకు మాత్రమిట్లు జరిగినదా? సంగీతముపై మనస్సుపోలేదు. తమ తోటలోనికిబోయి చెట్లతో దనహృదయము విప్పుకొన్నాడు. చెట్టు చేమలను జేరబోయి ‘చూచినారా నా చెలిని’ అని యడిగిన కావ్యనాయకుల చేష్ట లాతనికి జ్ఞప్తికి దగిలి నవ్వువచ్చినది. గులాబులు, మల్లెలు, సంపెంగలు, లెజిస్ట్రోమియనులు, బోగెన్ విల్లాలు తన్ను జూచి కరుణ ఒలికించుచున్నట్లు తోచినది నారాయణరావుకు.

తండ్రిగారికి, మామగారికి, అన్నగారికి నారాయణరావు రాణ్మహేంద్రవరములో న్యాయవాదవృత్తి ప్రారంభింపవలెనని కోర్కె యున్నది. తాను అందుకు వల్లెయనవలెనని కుతూహలము నందినాడు. ఇప్పుడెట్లు? న్యాయవాద వృత్తి యెందులకు? శ్రీ గాంధీమహాత్ముడు మరల కాంగ్రెసును నడుపుచు ఖైదులకు బొండని యా దేశమిచ్చినను బాగుండును. సమస్తము విడిచి సన్యసించిన బాగుండునేమో? శ్మశానవైరాగ్యమా? తనలో వాంఛపోయినదా? ‘తలలు బోడులైన తలపులు బోడులా!’ ఏరీతినైన దేశసేవ చేయవలెను. ఏమియున్నది? గ్రంథాలయములా? ఇప్పుడు వానిరుచి పోయినది. ఖద్దరు ఉత్పత్తియా? ఓ ఫ్యాక్టరీ పెట్టుటయగును. ఆస్పత్రి పెట్టుదమన్న వైద్యవిద్యకు దూరమై పోయెను. రాజు అదృష్టవంతుడు. వాడు పరీక్షలన్నిట గృతార్థుడై మదరాసులో పెద్ద ఆసుపత్రిలో వృత్తి నేర్చుకొనుచున్నాడు.

పరమేశ్వరుని హృదయము మెత్తనిది. అతడు సంతోషజీవి. కష్టములున్నవని గుర్తింపలేడు. అంతము లేని యెడారివలె కన్పించు తన జీవిత మింక గడతేరుట యెట్లు? తన జీవితములోని కళ నశించిపోయిననేమి? సంగీత, సాహిత్య, చిత్రలేఖనలతో తనకేమి పని?

ఒకరోజున చటుక్కునలేచి ‘నాన్నా! నేను దేశయాత్ర చేసివద్దామని ఉంది’ యని నారాయణరావు తండ్రికి విన్నవించెను. తండ్రి యాశ్చర్యమంది ‘చదువుకుంటూ దక్షిణాదంతా చూసివచ్చావుకాదుట్రా?’ అని ప్రశ్నించెను.

‘ఈపట్టు ఉత్తరాది చూస్తాను నాన్నా.’

‘ఉత్తరాది అంటే?’ ఉత్తరాది యన్న సుబ్బారాయుడుగారికి తెలియక కాదు. పుత్రు డడుగుటయే యాయన కాశ్చర్యమైనది.

‘కాశీ, ప్రయాగా అన్నీ తిరిగివస్తాను.’

‘ఒక్కడవూనా?’

‘పరమేశ్వరుడూ నేనూ వెళ్తాము.’

‘ఎన్నాళ్ళు?’

‘నెలా రెండునెలలో.’

‘ఆలోచిద్దాములే.’

‘అదికాదు నాన్నా! తర్వాత నేను పట్టాపుచ్చుకొని వృత్తి ప్రారంభిస్తే దేశం చూచుటకు వీలుండదు.’

‘చూద్దామన్నాను కాదుట్రా, బాబూ.’

ఆ సాయంకాలము సుబ్బారాయుడుగారు భార్య నొంటరిగాజూచి చిన్నబాబు కాశీ అదీ వెళ్ళివస్తాడుట, తర్వాత వాడికి వీలుండదు. దేశాలన్నీ తిరిగివచ్చి వృత్తి ప్రారంభిస్తే బాగానే ఉంటుంది? అని తెలియజేసెను. జానకమ్మగారికి గుండెలో రాయిపడినది. ప్రయాణాలంటే మాటలా? మరునాడు పురోహితునకు గబురంపి సుబ్బారాయుడుగారు శుభముహూర్తము పెట్టించెను. సుబ్బారాయుడుగారు, భార్యయు, వదినెగారును ఇదివరకె కాశీ వెళ్ళివచ్చినారు. అందుచేతనే జానకమ్మగారు ఎట్టులో కుమారుడు వెళ్ళివచ్చుటకు నియ్యకొన్నది.

నారాయణరావు పెట్టెలు, పరుపు మొదలగునవి సర్దుకొని తండ్రి యిచ్చిన నాల్గువందలరూపాయలు పుచ్చుకొని, లెక్క కావలసినప్పడు తనకు తంతివార్త నిమ్మను తండ్రిగారికి దలయూపుచు తల్లికడకు వెళ్ళినాడు. కుమారుని దరికి జేరదీసికొని శిరస్సు మూర్కొని ‘నాయనా! రామలక్ష్మణులులా నా కిద్దరు వరప్రసాదులు పుట్టారు. జాగ్రత్తగా వెళ్ళిరా. మీమీదే ప్రాణాలు పెట్టుకొని ఉన్నాను. నువ్వు దుందుడుకు మనిషివి. రైలు కదులుతోంటే ఎక్కుతావు. వాడికీ వీడికీ ఆపత్తు వచ్చిందని పరుగెత్తుతావు. జాగ్రత్తరా తండ్రీ’ యని యామె యాశీర్వదించి కుమారుని పంపెను.

శుభకార్యమునకై వచ్చిన బందుగులు, అక్కగార్లు, చెల్లెళ్లు, ఎవరియిళ్లకు వారు అప్పుడే వెళ్ళిపోయినారు. సూర్యకాంతమున కేమియు దోచుటలేదు. ఆ బాలిక యన్న గారికడకు వచ్చి ‘నువ్వూ వెళ్లిపోతున్నావా అన్నయ్యా! నా కసలే తోచదు’ అన్నది. నారాయణరావు చెల్లెలిని దగ్గరకు దీసికొని ‘సూరీడూ! నీ కేమిటి తెచ్చిపెట్టనే?’ అని యడిగినాడు.

‘నీకే తెలుసును అన్నయ్యా! అన్నిటికన్నా నువ్వు దబ్బునరావడం కావాలి చిన్నన్నయ్యా!’

‘అలాగా, తల్లీ.’

ప్రేమపదార్థము దాగదు. ఈ బాలిక, తన చిట్టిచెల్లెలు, ప్రేమంపుముద్ద. ఆమె హృదయము నవనీతము. ఈ బాలికను వివాహముచేసికొన్న రామచంద్రుడే పూర్ణముగ నదృష్టవంతుడు. వీరిరువురి జీవితము చూడ ముచ్చట యగునుకదా?’

క్వినైను భైసల్ఫేటు మాత్రలు, క్వినైను సాలిసిలీసు, టించరు అయిడీను, టించరు బెంజాయిను, లైజాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ , ఆనందభైరవి, శీతాంకుశరసము, సన్నిపాతభైరవి, పైత్యాంతకరసము, సుఖవిరేచనమాత్రలు, పెర్‌మాంగనేటు మాత్రలు, కాలోమెల్ మాత్రలు, అమృతాంజనము, ప్రోడయేరియా మందు మొదలగు నౌషధములు, అరువది యడుగుల గట్టిత్రాడు, వంటగిన్నెలసెట్టు, నెయ్యి వీశెడు, వీశెడు పప్పునూనె, కొంత బియ్యము, పచ్చికారపుపొడి, ఎండుమిర్చి, చింతపండు, కొన్నికూరలు, ఆవకాయ, మాగాయ, పాతచింతకాయ, నిమ్మకాయ, గోంగూరపచ్చడి, చారుపొడి, కారప్పొడి, చాకు పెద్దది యొకటి, చిన్నది యొకటి, గాలితుపాకి, కఱ్ఱకత్తి, రెండునెలలకు సరిపోయిన బట్టలు, రెండు దోమ తెరలు, ప్రయాణపు మడతమంచములు, చిన్న పరుపులు రెండు, రెండు తోలు పెట్టెలు, రెండు దేవదారు పెట్టెలు సర్ది సిద్ధమైనాడు నారాయణరావు.

ఈలోన నారాయణరావు పరమేశ్వరమూర్తికి దనతో దేశయాత్రకు రమ్మనియు, ఖర్చులన్నియు దానే పెట్టెదననియు, భార్య నామె బుట్టింటిలోన గాని, యాతని తల్లిదండ్రులకడగాని దిగబెట్టి రావలయుననియు, నీ సమయము దాటినచో మరల పరమేశ్వరునకు దేశయాత్ర చేయుటకు వీలు దొరకదనియు వ్రాసినాడు. పరమేశ్వరమూర్తి వెంటనే దేశోద్ధారక నాగేశ్వరరాయనికడకు బోయి, సెలవుపుచ్చుకొని, భార్యను దీసికొని, యామె పుట్టినగ్రామమగు బెజవాడలో వదలిపెట్టి, నారాయణరావును రాజమహేంద్రవరములో గలిసికొనెను.

వారశూలలు, రాహుకాలము, గుళికకాలము, వర్జము లేకుండగను, నక్షత్రము, వారము, తిథి, రాశిరహితముచేసి తారాబలము చూచుకొని, పుష్కర సమయ ముహూర్తమున తల్లిదండ్రులు, పెదతల్లి మొదలగు పెద్దల పాదములకు నమస్కరించి, చెల్లెలిని ముద్దుగొని మోటారుపై బయలుదేరినాడు నారాయణరావు. ప్రయాణమగుచుండ ముత్తైదు వెదురుగ వచ్చినది. ఆ సాయంకాలము ప్యాసెంజరుబండికి పరమేశ్వరమూర్తి రాజమండ్రి స్టేషనుకురా, నారాయణరా వాతని దన బావమరది లక్ష్మీపతి యింటికి దీసి కొనిపోయెను.

ముగ్గురు స్నేహితు లా రాత్రియంతయు నిష్టాగోష్టి కాలముపుచ్చిరి. లక్ష్మీపతి దానును రావలయునని ముచ్చటపడెను గాని సెలవు దొరకుటకు వీలులేనందున ఆగిపోవలసివచ్చెను.

మరునా డుదయము రమణమ్మ తెల్లవారగట్లనే వేపుడుకూర, ఉల్లిపాయ పోపుతో కాల్చిన వంకాయ పచ్చడి, ఆవకాయ, పెరుగు వేడియన్నముతో భోజనము పెట్టినది అన్నగారికి, బరమేశ్వరునకును. మేనత్తకు నమస్కృతులిడి యామె యాశీస్సులంది, రమణమ్మను తనదగ్గరకు జేరదీసికొని ‘రమణా! నీకు, బాచిగాడికి చిత్రాలు పట్టుకొస్తానేవ్’ అని యామెతో జెప్పి లక్ష్మీపతి వెంటరా నారాయణరావు పరమేశ్వరునితో ఇన్నీసుపేట నుండి పెద్దస్టేషనుకు రెండు జట్కాలమీద బయలుదేరెను. ఇంటరులో వారిద్దరు ఖురదారోడ్డు స్టేషనుమీదుగా పూరి (జగన్నాథం)కి టిక్కెట్లు పుచ్చుకొన్నారు. పది గోల్డుఫ్లేకు సిగరెట్టుడబ్బాలు, పది త్రీకాజిల్సు డబ్బాలు పుచ్చుకొని, ఇన్ని గ్రంథములుకొని, మెయిలునెక్కి, లక్ష్మీపతిచేతిని ఝాడించి మెయిలుబండి సాగగా దానితో వారును సాగినారు.


౬ ( 6 )

ఉత్తరహిందూదేశ యాత్ర

భరతదేశము ఆదియుగమునుండియు బ్రపంచమునకు నాగరికత, మానవ ధర్మము, ఆధ్యాత్మికతత్త్వవిచారము నేర్పుచునేయున్నది. సేతుహిమాచల పూర్వ పశ్చిమ సముద్రపరివృతమగు భరతదేశమున నెన్నిజాతులు, నెన్ని రాజ్యములు నవతరించి, వృద్దియై యుత్కృష్ట సంప్రదాయముల సృజించి, నశించి పోయినవో? ఒక జాతిలోనుండి వేరొక జాతి జనించినది. నూతనజాతుల దనలో జేర్చుకొన్నది. పూర్వసంప్రదాయముల విజృంభింపజేసినది.

భిన్నత్వమున నేకత్వము, నేకత్వమున భిన్నత్వము సూచింపుచు భగవంతుని విశ్వరూపసందర్శన మన్నట్లు విజాతీయునకు భిన్నతాదూషితమై తోచుచు, మహానదివలె నెటనుండి యెటకు బోవుచున్నదో భారతీయమహా చరిత్ర! నారాయణరాయ పరమేశ్వరులకు పూరీమహాపట్టణమున, కోణార్కలో, భువనేశ్వరములో గనుపించిన కేసరి గాంగకళాచమత్కృతియు ఉత్తమనాగరికతయు వారి నాలోచనాపూరితుల, నానందవికసితులను జేసినది.

భరతదేశములో సూర్యునకు ప్రత్యేకము గుడులు రెండు మూడు చోటులనేయున్నవి. ఒకటి యోఢ్రదేశములోని కోణార్క. కాని కోణార్క దేవా లయమునను బ్రతిష్ఠ జరుగలేదు. మహారాజు సూర్యదేవునకు దేవాలయము సంకల్పించి తన యాస్థానమహాశిల్పి నా కార్యమున నియోగించెనట.

ఆస్థానశిల్పికొక పుత్రుడున్నాడు. ఆతడు తండ్రికడ శుశ్రూష సలిపి జనకుని యుత్కృష్ట శిల్ప చమత్కృతియు, శక్తియు నభ్యసించి, దేశ దేశములకు బోయి అందందుగల శిల్పసాంప్రదాయముల గమనించివచ్చెదనని తండ్రి యనుమతి కోరినాడట. తండ్రి యితరదేశముల శిల్పులలో భావనయందు, బనితనమునందు తన్ను మించినవారు లేరని పుత్రుని యాత్రాకౌతుకము మాన్ప జూచెనట. కుమారున కది తండ్రియందు దోష మనిపించినది. కాన తండ్రికి నమస్కరించి, ‘తండ్రీ! మనకెప్పుడును గర్వము హానికర’ మని చెప్పి చలమున విదేశయాత్ర సాగించినాడట.

ఇచట తండ్రి దేవాలయము నతి విచిత్రముగ నిర్మించి శ్రీవిమానమున శిఖరమువరకు గట్టినాడట. ముఖమండపములు, భక్తిమందిరము, వివాహ మండపము, క్షేత్రపాలకాలయము, పరిసేవిత దేవతాలయములు నిర్మింపబడినవి. సింహగజాశ్వాది మృగములు, నద్భుత సుందరవనితా విగ్రహములు, దేవతా శిల్పములు మున్నగునవియెల్ల నా శిల్పచక్రవర్తియు నాతని శిష్యులును జెక్కి యమర్చినారు. దేవళము నద్భుతమై విరాజిల్లినది. కాని కూపస్థమండూకమువలె నున్న యా శిల్పికి శ్రీవిమానశిఖర పద్మశిల నమర్చు నుపాయము తెలియలేదట. అత డంతట మహారాజుతో నిజము వచింపక తనకొక ముఖ్యావసరమగు కార్యమున్నదని చెప్పి, యితరదేశ శిల్పుల నారహస్యమడిగి తెలిసికొనుటకు బయలుదేరి పోయినాడట.

ఇంతలో దైవజ్ఞులు పదునయిదు దినములలో మంచి ముహూర్తమున్న దనియు, కొన్ని సంవత్సరములవరకు నట్టి ముహూర్తము మరల దొరకదనియు మహారాజునకు విన్నవించినారట. మహారాజు సమయమునకు శిల్పి దేశాంతర గమనుడగుటకు వగచి, యాతని శిష్యులలో శిఖర మమర్చగలనారుండిరా యని పృచ్ఛచేసి యేరును లేకుండుటకు జింతాకులుడై, తన శిల్పికై చారుల బంపినాడు.

ఇంతలో నాస్థానశిల్పి కుమారుడు తన యాత్ర ముగించుకొని నిజపురికి తిరిగివచ్చి యీ సంగతులన్నియు విన్నాడు. తండ్రిగారికి నపఖ్యాతి వచ్చునట్లున్నదని భయపడి యా కార్యమునకు దానియ్యకొని, వలయు సన్నాహము లన్నియు నొనర్చుచుండెను. జనకున కలవికాని యీ కార్యము తాను సాధించినచో నభిమానియగు నాతనికి కోపమురాగలదని సంశయించి, ఆ కుమార శిల్పి ప్రచ్ఛన్నుడైయుండి తనవారి కెవ్వరికి నిజస్థితి తెలుపకయే కార్యమునకు బూనుకొనెను. పదిపండ్రెండు బారువుల బరువుగల శిఖరశిలను, విమానమూలమున ప్రక్కగానొక యిసుక దిబ్బపై పెట్టించి, మహారాజుతో రోజునకు వేనకు వేలు బండ్లు సముద్రమునుండి యిసుక తెప్పించి యాదిబ్బ యెత్తుచేయించ కోరెనట, బండ్లువచ్చి యిసుకదిబ్బ నెత్తుజేయుచుకొన్నకొలది యాబాలశిల్పి, యా శిఖర పద్మశిల యా దిబ్బమూపుపైననే యుండునట్లు చూచుకొనుచుండెను. మూడుదినములలో బర్వతమువలె నాయిసుక దిబ్బ శిఖరముకన్న నెత్తుగ నూట యిరువది నాలుగడుగులు సువ్వునలేచినది. విమానశిఖరశిలయు నాదిబ్బమూపుననే యున్నది. అప్పుడా విమానశిల కడుగున నుండి విమానశిఖరమునకు గట్టి దూలపు కమ్మిలు చేర్పించినా డా బాలశిల్పి. రాతికి ఇటు నటు తాళ్ళుకట్టి కమ్మిలపై జరిపించి శిఖరముపై నాశిఖరశిల నమర్చి కమ్మీలు లాగించివేసినాడు.

రాజు ఈ మహాకార్యకౌశలము దినదినము వచ్చి చూచుచు, కార్య సాఫల్యమునకు సంతోషించుచుండెను. విమానశిఖరశిల నమర్చురోజున దేశ దేశముల నుండి జనమువచ్చి ఆ చిత్రము చూచి ఆనందించిరి. ఆ వచ్చిన వారిలో నాస్థానశిల్పియు నున్నాడు. అతడు వచ్చిన వార్త నేరు నెరుగకుండ నాశిల్పి విన్నబోయిన మోముతో ఆ జనమహాసముద్రమున జేరి విచిత్రమును జూచు చుండెను.

శిఖరశిల నమర్చుటయు మహారాజు మెడలో హారమువేయు ఆ బాలశిల్పి వంగి నమస్కరించి మరునాడు శుభముహూర్తమునకు సర్వము దేవాలయమున సిద్ధముజేయ నాత డా గుడిలోనే పండుకొన్నాడు.

కుమారుని గుర్తించలే దా తండ్రి. చిన్న నా డిల్లువదలిపోయిన ఆ బాలున కిప్పుడు మీసములు పెరిగినవి. పురుషుడైనాడు. దేహమంతయు గట్టిబారినది. అట్టి కుమారుని గుర్తించక తన్నిట్లవమాన బరచిన యా ద్రోహిని హత్య నొనరింపవలయునని దుర్బుద్ధిజనించి, యారాత్రి గుడిలో నొంటిమై నిద్రించు దన కుమారుని బాకుతో పొడిచినాడు. బాలకుడు హృదయమునుండి రక్తము స్రవింప హాయని నిదురలేచి యా దీపపు వెలుతురున దండ్రిని గుర్తించి ‘తండ్రీ నన్నేల బొడిచినావు? నన్నానవాలుపట్టలేదా! అయ్యో! ప్రాణములు పోవుచున్నవి. స్వామికార్యమునకై యా శిఖరము నేనెక్కించవలసివచ్చినది. జనకా! రేపటిదినము సర్వోచ్ఛమగు ముహూర్తమట. అబ్బా బాధ! ఈ బాకు పీకివేయుము. నా తండ్రీ! గురుదేవా! నీ చేతిలోనే మరణించినందులకు సంతసమే. నీకివే నాచరమప్రణామము’ లనుచు ప్రాణములు విడచినాడట.

తండ్రి కుమారు నానవాలుపట్టి గుండె తరుగుకొనిపోవ, తాను చేసిన మహానేరమును, కుమారుని చంపుకొన్న క్రూరకర్మమును నిందించుకొనుచు తన ఘోరకృత్యమునకు గుండెపగిలి యచ్చటనే చనిపోయెను.

మరునాడు శుభముహూర్తమున ప్రతిష్ట జరగలేదు. మరి యెప్పుడును జరగలేదు.

ఆకథ విని పరమేశ్వరునకు గన్నుల నీరుతిరిగినది. నారాయణరా వట్లనాయని నిట్టూర్పునించినాడు. కోణార్కలో, జగన్నాథములో, భువనేశ్వరములో దేవాలయములకు శ్రీవిమానము లెత్తైయుండును. అంతకన్న మధ్యమండపము, అద్దానికన్న ముఖమండపము చిన్నవి. గోపురములు చిన్నవి. గుడియంతయు మొక్కజొన్నపొత్తివలె నుండును. మూలమునుండి శిఖరమువరకు రాళ్ళ తోడనే కట్టెదరు, ఎఱ్ఱయిసుకశిల, సుందరశిల్పలాలిత్య మా రాతిలో రూపించునట్లు వేరొకరాతిలో రూపింపలేదు. గాంగశిల్పులు స్త్రీరూపరచనమున దన్మయులైనారు. బ్రహ్మ పూవులతో, లతలతో, లేతయాకులతో, తేనెలతో, లేడికన్నులతో, చుక్కతళుకులతో, వెన్నెలవెలుగులతో స్త్రీమూర్తిని సృజించినాడన్న మాటను ఆ శిల్పులు నిక్కువముచేసినారు. గాంగులు ఆంధ్రులు. ఉత్తరాంధ్ర శిల్పులు గాంగశిల్పులు.

భువనేశ్వరములో రాజారాణి, పరమేశ్వర, మార్కండేయేశ్వర, లింగేశ్వరుల దేవాలయములలోను, కోణార్కలోను, ముఖలింగములో, సాక్షిగోపాలములో గాంగశిల్పుల శిల్పలాలిత్యము ప్రత్యక్షమగుచుండును. గుడియంతయు లతలు చెక్కియుండును. మధ్య మధ్య విగ్రహములు పొదిగింపబడును. దాక్షిణాత్య దేవాలయముల రీతి వేఱు. చోళ, పాండ్య, చాళుక్య దేవాలయములలో గర్భగుడిపైనుండి శిఖరమువరకు గట్టిగా రాతికట్టడమో, యిటుకకట్టడమో కట్టుకొనిపోదురు. కాని గాంగదేవాలయములకు దేవాలయపాదము నుండి శిఖరమువరకు లోన గుల్లగా కట్టుకొనిపోదురు. తెలుగుచోడుల దేవాలయములలోనూ గర్భాలయము గుల్లగానే యుండును.

భువనేశ్వరములో రెండువందల దేవాలయములున్నవి. ప్రతి దేవాలయమునకు మిక్కిలి లోతుగల కోనేరులున్నవి. ఎచ్చటనుండియో జలము వచ్చునట్లు చేసి, యా జలము పొలముల కుపయోగించునట్లా శిల్పు లమర్చిరి. జగన్నాథమునందు మొండిజగ్గని యందము దిలకించి, సాక్షిగోపాలము, శ్రీకూర్మము దర్శించి, నారాయణరావు పరమేశ్వరమూర్తులు కలకత్తా చేరుకొన్నారు. కలకత్తాలో మ్యూజియము, దక్షిణేశ్వరము, కాళీఘట్టము, సర్వవృక్షవనము, జంతుశాల, విక్టోరియా మందిరము, జైనమహాభవనము, బోసుగారి వృక్షశాస్త్ర పరిశోధక భవనము మొదలైనవి చూచినారు.

శ్రీ రామకృష్ణపరమహంస నిర్వికల్పసమాధి నందిన పంచవటి, మాత దేవాలయము, ఆ భక్తమూర్తి, యవతారపురుషుడు మెలంగిన యా పవిత్రస్థానము చూచునప్పటికి నారాయణ పరమేశ్వరులు పులకరించిపోయిరి.

ఈ మహాపురుషుడు సర్వమతములు హిందూమతములోనివే యని లోకమునకు దెల్పుటకు, సర్వమతముల వారికి ఆత్మవిద్యాభిక్ష మా మతమే పెట్టినదని తెల్పుటకు అవతరించెనని, నారాయణరావు పరమేశ్వరునకు తెలిపెను. రామకృష్ణునకు చదువురాదు. ఈశ్వరచంద్ర విద్యాసాగరులవంటి పండితు లా పరమహంసకు జోహారులన్నారు. కేశవచంద్రసేనువంటి మహానుభావు లాతని పాదములకడ నాత్మజ్ఞానము సముపార్జించుకొన్నారు.

‘శ్రీ రామకృష్ణపరమహంసకు వివేకానందస్వామి అర్జునుడంటివాడురా. నరనారాయణులే వారిరువురున్నూ. ప్రతిమతంలోనూ కొన్నికొన్ని ఆచారాలు బయలుదేరుతవి. ఆ ఆచారాలనూ, చిహ్నములనూ అనుసరిస్తేగాని మోక్షం లేదు అనుకోవడమంత మూర్ఖత ఇంకోటి లేదు. నామాలుపెట్టి, గండభేరుండంచుల పంచెలుకట్టి, విష్ణ్వాలయాలలోనికి వెళ్ళి, విష్ణునిమాత్రం కొలిచేవాడు వైష్ణవుడనిన్నీ; తలంతా గొరిగించుకొని గడ్డం పెంచుకొని మహమద్ వారుమాత్రమే దైవము యొక్క మతము బోధించేవారనిన్నీ, ఖురానుమాత్రమే మతగ్రంథ మనిన్నీ, ఒక దైవమే యున్నాడనిన్నీ, రెండు దేవుళ్లు లేరనిన్నీ నమ్మేవాడు మాత్రమే మహమ్మదీయుడనిన్నీ; బాప్టిజం పుచ్చుకొని, యేసుక్రీస్తు దేవుని కుమారుడనీ, ఆతనిద్వారానే మోక్షం వస్తుందనీ, ఏసును నమ్మకుండా ఉన్న వాడికి నరకం అనిన్నీ, నమ్మేవాడే క్రైస్తవమతస్థుడనీ వాదించడంకంటే పరమ ఛాందసం లేదురా పరం.’

‘మన మహర్షులు మాత్రమే చెప్పగలిగారురా సర్వమతాలు దైవాన్ని చేరుకుంటాయి’ అని.

‘అలా అనకు. క్రీస్తుగాని మహమ్మదుగానీ అలా చెప్పలేదనా నీ ఉద్దేశము? కాదు. ప్రతి అవతారపురుషుడు అలాగే చెప్పాడు.’

‘నువ్వనేది, సరియైన జ్ఞానముతో సంచరించేవాడు, సత్యాన్ని కొలిచేవాడు, ఏ మతంవాడైనా సరే మోక్షము చెందుతాడు అని రామకృష్ణ పరమహంస ప్రపంచానికి బోధించిందే నిజమంటావు. అంతేనా?’

‘అవును మరి. ఆయన మహమ్మదీయుడై అల్లాను ప్రార్థించి భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసికొన్నాడు. క్రైస్తవుడై జెహోవాను స్వాధీనము జేసుకొన్నాడు. రాధ అయి శ్రీకృష్ణునీ, హనుమంతుడై రాముని సాన్నిధ్యము పొందాడు. అందరూ ఒక్క పరమాత్ముని మహాభావమే కాదుట్రా?’

బేలూరు మఠం చూచి, చందా యిచ్చి, కలకత్తానుండి బయలుదేరి, మన యాత్రికులు గయ వెడలినారు. ఫల్గునీనదిలో స్నానమాడినారు. శ్రీరామగిరి దర్శించి శ్రీరాముడు ప్రతిష్ఠించిన మరకత రత్న ఘటిత స్ఫటికలింగమును దర్శించినారు. బుద్ధగయ కేగి యచ్చట సిద్ధార్థుడు బుద్ధుడైన ప్రదేశములో గూర్చుండి, యా పరమపురుషుని ధ్యానించి, యా దేవాలయ రచనాచమత్కృతికి సంతసించినారు. ఇదే ఔత్తరాహమగు ప్రథమ దేవాలయము. బుద్ధభగవానుడు నిర్యాణమొందినవెనుక నాతని దేహమునకు దహనసంస్కారము లైనవి. అప్పుడా తథాగతుని వపువులోని బొమికలు, దంతములు మొదలగునవి బరిణెలలోనుంచి దానిని వివిధ దేశములకు నాయనశిష్యులు పంపించినారట. ఆ బరిణెలనందిన మహారాజులు వానిని పవిత్ర స్థలములందు స్థాపించి వానిపైన రాతితో, నిటుకతో, మట్టితో దిబ్బలుకట్టిరి. వానిపై శిల్పములుంచిరి. అయ్యవి స్థూపము లన్నారు. ఆ స్థూపములు పవిత్ర ప్రదేశములు. భక్తులు వానిపై వారి కళా ప్రజ్ఞయంతయు జూపించినారు. దానికి తోరణములు, చుట్టును శిల్పములు చెక్కిన కంచెలు నేర్పరచిన మహారాజులు వానికై కోట్లు వెచ్చము చేయించినారు. తర్వాత బుద్ధునికై దేవాలయమును నిర్మించినారు. అట్టి దేవాలయములలో బుద్ధగయ యొకటి. అచ్చటను శిల్పములు తీర్చిన రాతి కంచె యున్నది. స్థూపముల జూచియే, దేవాలయము లేర్పరచినారని కొందరి మతము. కాని పరమేశ్వరుడు బుద్ధునికి బూర్వమే దేవాలయము లున్నవని వాదించును.

గయనుండి మొగలిసరాయి మీదుగా శ్రీ కాశీపట్టణము చేరినారు. గంగానదిలో స్నానమాచరించి, విశ్వేశ్వరుని, బిందుమాధవుని, ఢుండిగణేశ్వరుని, యన్నపూర్ణ విశాలాక్షిని, గవ్వలక్కను, వారణనదిని, ఆసినదిని దర్శించి కేదార ఘట్టములో శ్రీ విజయనగరం మహారాజావారి భవనములో బసజేసినారు. స్నేహితులిరువురు కాశీ విశ్వవిద్యాలయము దర్శించినారు. ‘ఒక్క మహానుభావుడు బిచ్చగాడయి కోటులు సముపార్జించి యీ మహోత్కృష్టమైన విద్యాలయం కట్టించినాడు; పవిత్రుడు మదనమోహనుడు. ఈ విద్యాలయానికి బిసెంటమ్మ అసలు పునాది వేసింది. అహో! ఏమి చిత్రంరా మానవుని ప్రకృతి!’ యనినాడు పరమేశ్వరుడు.

‘ఈ మహాక్షేత్రము ఎన్నివేల సంవత్సరాల నుండి సర్వమానవలోకాన్ని పవిత్రం జేస్తోందీ! శ్రీ రామచంద్రుడీ పుణ్యక్షేత్రాన్ని దర్శించినాడా! ఒరే పరమేశా! మన దేశంలో ఉన్న ఇతర పుణ్యక్షేత్రాలు తర్వాత తర్వాత వచ్చినవేమో కాని ఈ మహాక్షేత్రంమాత్రం మహాపురాతనంరా!’ అని అనినాడు నారాయణరావు.

భారతీయుల ప్రాచీన నాగరికత


‘ఈ విద్యాలయానికి లక్షలు ఖరీదుచేసే యీ భవనాలు ఎందుకు నిర్మించాడో పూర్వ సంపద్రాయాభిమానియగు మదనమోహన పండితుడు?’

‘ఒరే నారాయణా! ఒకటిమాత్రం ఉందిరా. పాశ్చాత్యవిద్యే పరమావధి అనే ఈ రోజులలో, ప్రభుత్వమువారి కోపానికి గురికాకుండా జాతీయతను పోషించడానికి వీలైనంతవరకు పోషించే ఈ విద్యాలయం ఒకటి సృష్టించాడురా మహానుభావుడు.’

‘నువ్వు చెప్పింది నిజమే. వెనక ఆనాటి కాశీ విద్యాపీఠము, నలందా, తక్షశిల, అజంతా, నాగార్జున పర్వతము, ధాన్యకటకము, నవద్వీపము మొదలగు పరిషత్తులవంటి విద్యాపీఠాలు ప్రస్తుతం మనం పెట్టలేమురా. 1921 ఆప్రాంతాల్ని పుట్టిన గుజరాతు, కలకత్తా, ఆంధ్ర జాతీయ విద్యాలయాలు పేరుకుమాత్రం ఉన్నాయి. మహానుభావుడు శివప్రసాదగుప్తగారు నిలిపిన విద్యాలయం, గుజరాతు విద్యాపీఠంమాత్రం ఇంకా నిలిచాయి. ఎప్పుడో మళ్ళీ నిజమైన విద్యాపీఠాల దర్శనం? ఆంధ్రవిశ్వవిద్యాలయం బెజవాడ నుండి వెళ్ళి పోయేటట్టు ఉంది. విశాఖపట్టణం వెళ్ళిపోతే రాయలసీమవారు తప్పుకుంటారట. బెజవాడ ఆంధ్రదేశానికి మధ్యపట్టణం. అన్ని దేశాల నుంచి వచ్చే రైలుమార్గాలున్నై. పవిత్రమైన కృష్ణవేణినది ప్రవహిస్తూ ఉన్నది.

‘అబ్బాయి, ఈసబబులన్నీ విచారించేవాళ్ళు ఎక్కువమంది ఉండరురా బాబూ! రేపో యెప్పుడో శాసనసభలో విశాఖపట్టణం విశ్వవిద్యాలయ ప్రధానస్థానం కావాలి అని బిల్లు పెట్తున్నారు. ఆమోదిస్తారు. సరే, దానికి కాదు. వీరు ఇంతా చేసి మద్రాసు విశ్వవిద్యాలయంకన్న ఇందులో ఏమి కొత్తదనం వెలగబెట్టారు అనే నా విచారం.’

కాశీనుండి సారనాథు వెళ్ళి యచ్చట పురాశిల్ప రక్షణశాఖవారు స్థూపమును త్రవ్వి బయలుపరచిన సంఘారామకట్టడములు చూచినారు. శృంగ ఆంధ్రరాజ్యకాలముల విజృంభించి, గుప్తరాజ్యకాలమున బేరొందిన యా స్థూపమును మహాబోధి సంఘమువారు వృద్ధిపరచుచు నూతన సంఘారామము నిర్మించుచున్నారు. బుద్ధుని విగ్రహములు, మంజుశ్రీ తారావిగ్రహము లచ్చట శిల్పకళాచమత్కృతి వెదజల్లుచున్నవి. అశోకుడు బౌద్ధమతావలంబియై, భక్తుడై, సర్వ సర్వంసహామండలములో హింసకు చోటులేకుండ చేయుటకు, తథాగతుని బోధ లోకమెల్ల ప్రజ్వలింపజేయుటకు దీక్షవహించిన దినములలో నా స్థూపము ప్రారంభింపబడినది. అశోకుని శిలా స్తంభమచ్చట నొకటియున్నది. రానురానా సంఘారావము వృద్ధినొందినది. ఆ స్థలము వేణువనము. బుద్ధుడై యా లోకపావనుడు దేశములనెల్ల సత్యమార్గమును బోధించి యా వేణువనాన ఆశ్రమ మేర్పరచుకొని లోకమెల్ల మార్తాండుడు వెలుగు వెదజల్లురీతి తన బోధను ప్రకాశింపజేయుచుండెను.

పరమేశ్వరు డా ప్రదేశమంతయు దిరుగుచుండెను. నారాయణరావా స్థూపమున కెదురుగ పద్మాసనోపవిష్టుడై యర్ధనిమీలిత నేత్రుడై, యా బుద్ధపరమాత్మను ధ్యానించుకొనుచుండెను. అతని వాక్కుల అమృత ధారలు నారాయణరావు కర్ణముల ప్రతిధ్వనించినట్లయినది. పరమేశ్వరు డా పవిత్రమూర్తి పద్మాసనధారియై జ్ఞానముద్రతో ‘ఓం మణి పద్మిహమ్’ అని జ్ఞానోపదేశము చేయుచున్నట్లు భావించినాడు.

కాశీనుండి ప్రయాగ వెళ్ళి, త్రివేణీ సంగమములో మన స్నేహితులు కృతావగాహులైనారు. త్రివేణీ సంగమములో రెండువేణులే కలియుచున్నవి. మూడవ వేణి యంతర్వాహినియట. యమున నీలగాత్ర, గంగాదేవి ధవళశరీర, సరస్వతి సువర్లచ్చాయావర్తన, యమున కూర్మవాహన, గంగ మకరవాహన, సరస్వతి పద్మవాహన.

ఆ సూర్యతనయ కూర్మవాహన మంగీకరించి యెన్ని వేలేండ్లు గడచెనో, నేటికిని యమునాకచ్ఛపము లా నీలంపు లోతులలోకి నీదులాడుచు,తేలికొనుచు, మునుగుచు సంచరించును. యమునకంటే గంగ లోతుతక్కువ. సరస్వతి లోతు నకు కాలమే ప్రమాణము. గంగ మహావేగమున ప్రవహించును. యమున గంభీరముగా నెమ్మదిగా చరించును. లోతులేని గంగయు, లోతుగల యమునయు సంగమించినచోట నా యువకులిరువురు స్నానమాడి, ఊరు జూడబోయిరి. పండిత మోతీలాలుని భవనము, విశ్వవిద్యాలయములు, కోట, పురాతనాశ్వత్థ నారాయణము దర్శించినారు. కోటలోని యశోకుని స్థంభము గమనించినారు.

వారిరువురు ప్రయాగలో గంగను పెద్దబిందెలలో బట్టి రైలుమార్గమున రాజమహేంద్రవరము లక్ష్మీపతికి పంపినారు.

అలహాబాదు నుండి లక్నో, హరిద్వారము, హృషీకేశము దర్శించినారు. వియత్పథము వదలి గంగాదేవి హృషీకేశముకడ నార్యావర్తములోనికి కుడియడుగు పెట్టినది. అచటి ఋషుల యాశ్రమముల దర్శించినారు. రామతీర్థస్వామి గంగలో గలసిపోయిన ప్రదేశము చూచినారు. ఆ మహాభాగుని దలపోసికొని నారాయణరావు పరమేశ్వరుని జూచి ‘ఈ పరమఋషి, హిమాలయములో దిగంబరుడై సుమేరువు నధిగమించినాడురా! ఆ మహానుభావుడు రచించిన ఎన్నో గ్రంథాలు పోయాయి. దేశాలు తల్లడిల్లజేసి వివేకానందుని యాత్రను సంపూర్ణము చేసి యవతారం చాలించాడురా. ఏమి మేధావి! లెక్కల ఎం. ఎ. చిన్నతనంలో పది లెక్కలిచ్చి, ఎనిమిది చెయ్యమంటే, పదీ చేసేవాడు సగం కాలంలో.

‘సత్యస్వరూపుడగు పరమాత్మను కనుగొన్న ఆ మహానుభావునకు లెక్కలు గిక్కలూ ఒక లెక్కటరా నారాయణం?’

కతిపయ దినాలలో ఢిల్లీ చేరుకున్నారు. కుతుబుమినారు, అశోక చక్రవర్తి నాటిన ఇనుపకంబము, జుమ్మామసీదు చూచినారు. మహమ్మదీయ శిల్పచమత్కృతి గమనించినారు. క్రొత్తఢిల్లీలో తయారగు భవనములు చూచి ‘జీవములేని యీ కళాచమత్కృతి యీ కాలమునకు దగినట్లే యున్నది’ యను కొన్నారు. మ్లేచ్ఛచక్రవర్తులు ఢిల్లీ చుట్టున నున్న వివిధస్థలముల గట్టిన కోటలు, మహాభవనములు చూచినారు. అక్బరు కట్టిన ఫతేపూరుసిక్రీయును, ఫైజాబాదును, హుమయూను గోరీని మొదలగునవన్నియు జూచినారు. ఫతేపూరుసిక్రీలో రెండురోజులున్నారు. అక్బరు చక్రవర్తి, చరిత్రయంతయు దలపోసికొనినారు.

‘ఓరే నారాయుడూ! ఈ భవనములో దిరిగిన అనార్కలీ చరిత్ర మంతయు దలపుకు వచ్చుచున్నది. వివిధదేశాల నుండి వచ్చిన యప్సరస్సమానలగు సుందరీమణు లెందరీ మందిరాల తిరిగినారో? అస్పష్టమధురములయి వారి మాటలు పాటలు ప్రతిధ్వనిస్తున్నవిరా.’

‘కవిత్వం! కవిత్వం! నారాయణా! నువ్వొక సర్దారువు. నువ్వు దర్బారునకు వెళ్తూవుంటే జనానా మేడలమీద ఒక కిటికీలో నుంచి రెండు లేడికన్నులు నీవైపు చూశాయి. నువ్వూతలెత్తావు ఆలోచనాలు నవ్వినై...’ ‘ఆ ఏమిటి! తర్వాత తర్వాత.’

‘తర్వాత నీ కొర కొక సిద్దీ కబురు తెచ్చాడు. రహస్యమార్గాల వెంట నువ్వు కోటలోకి వెళ్ళావు. ఒక సిద్దీ బానిసబాలిక నిన్నో మందిరంలోకి తీసుకు వెడితే, అక్కడ ఒక చక్కనిచుక్క పరిశియాబాలిక, అందం ఒలికిపోతూ ఉన్న దేహాన్ని పట్టియిచ్చేడక్కా వస్త్రాన్ని కట్టుకొని, ఒరగిలి, ఒయారంగా పడుకొనిఉంటే, నువ్వు చూసి ఆనందమూర్తివై ఆమె పాదాలకడ వాలావుట. ఆమె తన దానిమ్మపువ్వులాంటి పెదవుల్ని విరుచుకొని, గబుక్కున లేచి, ఎవరు నువ్వు, ఇక్కడకు ఎందుకువచ్చావు అని చప్పట్లు చరిచిందిరా.’

‘కథలు చెప్పటంలో మా నాన్నగారి తర్వాత నువ్వేరా! నన్ను గురించిన కథ వినడానికి నాకే ముచ్చటగా ఉంది. తర్వాత చెప్పమరి, మొండి తేలు కుట్టుకుండా ఉండాలంటే.’

‘చప్పట్లు కొట్టిందో లేదో, ఎక్కణ్ణుంచి వచ్చారో యమభటుల్లాంటి వాళ్ళిద్దరు సిద్దీలు–నాలుగు బెత్తల వెడల్పు ఉన్న కరవాలాలు పుచ్చుకొని. నువ్వు గజగజలాడావు.’

‘అమ్మయ్యా!’

‘వీణ్ణి లాక్కెళ్ళి పాతాళగృహంలో ఇనపకొట్టులో వెయ్యండి అందామె. నిన్ను తీసుకొనిపోయి అల్లాగే ఇనపకొట్టులో పడేశారు.’

‘ఆ అవతారములో కూడ ఖైదే మనకు?’

‘ఆ! ఇంకా ఎన్ని అవతారాలలో ఖైదో. ఇనపకొట్టులో వేసి నీళ్ళు, రొట్టీమాత్రం ఇస్తూఉండేవారు. నాలుగోరోజున రాత్రి పన్నెండు గంటలకు నవాబుయొక్క నాలుగువందల ఒకటోరాణి కావడానికి చూస్తూఉన్న ఆబాల, కటకటాల తలుపులు తీసి, లోపలికివచ్చి, నిన్ను కౌగలించుకొని ముద్దు పెట్టుకొంది. నువ్వు తెల్లపోయి సంతోషంతో ఒళ్ళు మరిచావు. భోజనం అదీ దిట్టంగా పెట్తూఉండేది, రాత్రిళ్లు నీ కొట్టులోకి వచ్చేది, లేదా తన శయన మందిరానికే తీసుకొనిపొయ్యేది. ఒకరోజున నవాబుకు ఈ సంగతి తెలిసింది. మహానుభావుడు కాబట్టి తన కక్కర లేదని ఇద్దర్నీ...’

‘నరికించేశాడా!’

‘అంతేనా మరి? ఏనుగులచేత తొక్కించడానికి ఆజ్ఞ యిచ్చాడు. తర్వాత నవాబుకు పాంచాలంలో రాజులు తిరగబడ్డారని వార్త వచ్చింది. మీ ఇద్దరి గొడవా మరచిపోయి సైన్యాలతో వెళ్ళాడు. కాపలాఉన్న వాళ్ళకు లంచాలిచ్చి మీ రిద్దరూ దక్షిణదేశాలకు పారిపోయి కృష్ణదేవరాయల కొలువులో చేరారుట.’

‘మంచి కథరా!’

‘ఢిల్లీ నుండి బయలుదేరి మధుర, బృందావనము, ఇంద్రప్రస్థము, కురుక్షేత్రము, హస్థినాపురము మొదలగు దివ్యక్షేత్రములన్నియు జూచినారు. ఈపవిత్ర ప్రదేశముల భగవంతుడు శ్రీకృష్ణుడు చరించినాడు. పాండవులు, కౌరవులు రాజ్యమునకై పెనంగినారు. మహాభారత మంతయు వారి మనోనేత్రములకు గోచరించినది. కురుక్షేత్రమున అభిమన్యు యుద్ధమును స్మరించి మన యాత్రికులు కన్నుల దడిపికొనిరి.

బృందావనములో వారికి మీరాకథ స్మరణకు వచ్చినది.

‘పురుషు డెవ్వం డిచట?
పురుషు డాత డొకండె పురుషోత్తముండు.
పురుషు డాత డొకండె
పొలతులము మనమంత,
దివ్యపురుషుని ప్రేమ
తేజఃప్రదీప్తులము,
పురుషు డెవ్వం డిచట?
నాథు పాదాలపై
నా బ్రతుకుపువు నుంతు
పూజ గైకోవేర
పొలతులను బ్రోవరా!
పురుషు డెవం డిచట?

అని పరమేశ్వరుడు పాడినాడు.


౮ ( 8 )

బృందావనము

స్నేహితుల కిరువురకు మీరాబాయి దివ్యచరిత్రము కనుల గట్టినది. మీరాబాయి శ్రీకృష్ణుని కొనియాడుచు బృందావనము వచ్చినది. అప్పుడు బృందావనమున కొక మహాత్ముడు వచ్చియుండెను. ఆ స్వామి తానున్నంత కాలము బృందావనములోనికి స్త్రీలను రానియ్యవలదని యాజ్ఞనిడుటయు, ప్రజ్ఞావంతుడగు నా సన్యాసియాజ్ఞ పూర్ణముగా నిర్వర్తింపబడుచున్నది. ఇంతలో మీరాదేవి బృందావనము ప్రవేశింపబోవుచుండ ‘నిలు నిలు’ మని అడ్డగించినారు.

‘ఎందుకు నాయనా ఆపుజేశారు?’

‘తల్లీ! నువ్వు స్త్రీవి. బృందావనములో ప్రవేశించ వలనుపడదని మా గురువు గారి ఆజ్ఞ.’

‘మీ గురు వెవరూ?’ ‘హిమాలయములలో తపస్సు చేసి మహత్తులు సంపాదించిన మహాఋషి మా గురువు, శ్రీ శ్రీ రూపగోస్వామి!’

‘అలాగా! అయితే ఈ పాట వినిపించండి ఆయనకు’ అని శ్రీ మీరా ‘పురుషు డెవ్వడు? శ్రీకృష్ణు డొక్కడే పురుషుడు, భక్తులందరు స్త్రీలు, పురుషునిలో లయమగుటకే తపస్సులు భక్తియున్ను’ అని పాట పాడినదట. శిష్యు లా పాటను గురువుగారికడకు బోయి వినిపించుటయు, నా స్వామి నిర్విణ్ణుడై యర్థము గ్రహించి ‘యేది నా తల్లి’ యని పరువులిడివచ్చి యామె పాదాలపడి ‘తల్లీ, సత్యసూత్రము నా కనుగ్రహించి నా గురువైనావు. మూర్ఖుడను. క్షమించు. స్త్రీలు మోక్షం భంగం చేసేవాళ్లు, ప్రకృతిస్వరూపిణులు అనుకొని, వీళ్ళను చూస్తే పురుషుని హృదయం మోసపడిపోయి దగ్ధమగునని తప్పుదారిని పడ్డాను’ అన్నాడు.

ఆ కథ స్మరించుకొనుచు నా పాట పాడుకొనుచు, తులసీవనము, యమునాఘట్టము, --ళీయహ్రదము, గోవర్థనము మొదలగునవి దర్శించినారు.

‘కృష్ణా కృష్ణా! గోపకుమారా!
బృందావన సంచారా!
మురళీమోహన, మృదుపదనర్తన
మోహనలీలాకారా!
సుందరనందకుమారా!
కృష్ణా కృష్ణా!’

యని పరమేశ్వరుడు పాడుచు ‘నారాయణా! యీ వెన్నెలగడియల్లో యమునాతీరాన్ని, రాసక్రీడాలోలుడైన శ్రీ వేణుగోపాలుని చూద్దామురా’ అన్నాడు.

నారాయణరా వా మాట వినుపించుకోలేదు. శ్రీ గోపాలకృష్ణ పరమేశ్వరుడు దివ్యబాలుడై యీ ప్రదేశముల నాడుకొన్నాడా? మోహార్తలగు వ్రజసుందరులకు సర్వసమర్పణ నేర్పినాడా? ప్రేమయనగా స్త్రీ పురుషుల పరస్పర వాంఛయేనా? మోహావేశమున తాను ప్రేమించు బాలికనే దేవస్వరూపమున నెంచి పూజించెదరా? ఎంతమౌఢ్యము! ప్రేమికులకు ప్రేమ భక్తియే కాదా! నిజమైన ప్రేమ ప్రతిఫలము కోరదు. నాథు డితరులను బ్రేమించుచున్నాడని కించపడదు, ఐక్యమే పరమావధిగా గోరును. ఆ ఐక్యభావము సార్థకమగుట ఒక భగవంతుని పాదముల మ్రోలనే కదా.

చిన్నతనాన ప్రేమయే భక్తియని భక్తియోగము గరిపిన నందబాలుడు, వెన్నముద్దలదొంగ, రాధికాహృదయనాథుడు, గోపికామనశ్చోరుడు, కురుక్షేత్రాన మహావేదసారము, ఉపనిషత్తుల నవనీతము, సాంఖ్యామృతము కలియబోసి, నిగ్గుతేల్చి సర్వమతాభిప్రాయాలు సమన్వయించి నరస్వరూపుడయిన వివ్వచ్చునకు బోధించి, లోకానికి యుగయుగాలకు సందేశమిచ్చినాడుగదా. ఈ మహాభావము నిలువెల్ల దివ్యామృతముచే నింపుటలేదా? ఆపుకోలేని మధురావేశము పవిత్రాంబువులై నయనాంచల బిందుధారలై జన్మము పూతమొనర్చుచున్నది.

‘ఒరే పరమేశ్వరం! సాంఖ్యవిచారం ఉత్కృష్ఠమైనదే! కాని సాంఖ్యము ఏమి చెప్పింది? ప్రతియాత్మయు పురుషుడు, అతడే సాక్షీభూతమగు పరమాత్మ, వ్యక్తిలోని మనస్సు, అహంకారము, బుద్ధి, ఇంద్రియములు అన్నియు ప్రకృతి. తెలియని వ్యక్తికి సాక్షిభూతుడగు పురుషుడు మరుగుపడి ప్రకృతిచేత గప్పబడి తనబిడ్డలు, తనయిల్లు వాకిలి అని మోసపోయి, గిట్టుతూ పుట్టుతూ ఉండును. కాని జ్ఞానము చేతనూ, యోగము చేతనూ నువ్వు నిన్ను తెలిసికొంటే అప్పుడు పురుషునికినీ ప్రకృతికినీ సమ్యక్‌స్థితి కలిగి అంటే నిశ్చల సమాధి కలిగి జన్మరాహిత్యము సంభవిస్తుంది. సాక్షీభూతుడగు పురుషుడు ఏమిన్నీ మార్పులు చెందడు. ప్రకృతియే మార్పులు చెందుతూ ఉంటుంది. పురుషుడు కుంటిమగనివంటివాడు. ప్రకృతి గుడ్డిభార్య. ప్రకృతికి పురుషుడు దారిచూపిస్తూఉంటే ప్రకృతి పురుషుని మోస్తూ ఉంటుంది.’

‘ఈ సాంఖ్యధర్మంలో ఉండే లోటేమిటి? శ్రీకృష్ణు డెల్లా ఆ లోటు తీర్చాడు?’

‘కపిలమహర్షి యింతవరకును బోధించి, ఆ బోధ సంపూర్ణము చేయలేదు. కాని ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క పురుషుడుగదా. అంటే విశ్వంలో కోటానుకోట్లు పురుషులు వివిధ వ్యక్తిత్వాలతో ఉంటే ఈ పురుషుల శక్తి యేమిటి? ఆద్యంతరహితులై సర్వ బ్రహ్మాండ స్వరూపులే అయితే, వీళ్ళందరినీ నడిపే నాయకుడొకడుండాలి. వీళ్ళందరినీ సృష్టించిన వాడొకడుండాలికదా! అల్లాకాకపోతే ఇన్నికోట్ల ఆత్మలు ఇన్ని బ్రహ్మాండాలు అవుతారా? కాబట్టి శ్రీకృష్ణుడు ఉపనిషత్తులకు పొయ్యాడు. ఉపనిషత్తులు ఏమన్నాయి? ఆద్యంత రహితమై అనిర్వచనీయమైన బ్రహ్మమున్నది. ఆ బ్రహ్మముస్థితి ఎంతటి జ్ఞాన వంతులున్నూ ఊహించలేరు. ఆ బ్రహ్మపదార్థములోనుంచి మూల ప్రకృతి జన్మించింది. ఆ మూల ప్రకృతివలన ఈ సృష్టంతా ఉద్భవిల్లింది. సృష్టిలోని ప్రతి వ్యక్తియు, ప్రతి ప్రాణిన్నీ బ్రహ్మమే. నక్షత్రాలు, ఆకాశం, భూమి, పురుషులు, స్త్రీలు, కుక్కలు, గుఱ్ఱాలు అన్నీ అన్ని ప్రకృతి ఉండడంవల్ల ఈ సృష్టిలో వ్యక్తిత్వం. అది రహితం చేసుకుంటే బ్రహ్మలో లయం.

‘శ్రీకృష్ణపరమాత్మ ఏమన్నాడు? అన్నీ ఒకటే చెపుతున్నాయి. కానీ సంపూర్ణంగా ఏదీ వ్యక్తీకరించడం లేదు. సృష్టికలిగిన కారణం నీకువలదు. అది చిదానందము. కాని సృష్టిఉంది. సృష్టిలో పురుషుడు ప్రకృతి సాంఖ్యలో చెప్పినట్లే. కాని ఈ పురుషుడు, ఈ ప్రకృతిన్నీ ఒక్క పురుషోత్తముని స్వరూపాలే. అన్నీ ఒకటే. సాక్షీభూతుడగు పురుషుడు, ప్రకృతిస్వరూపం. అన్నీ పురుషోత్తముని అవతారాలు. నిజమైన లయం వచ్చినప్పుడు ప్రకృతి పురుషునిలో లయమై పురుషుడు పురుషోత్తమునిలో లయం అవుతాడు అని చెప్పాడు.

‘ఒరే నారాయుడూ! మనం భగవద్గీత ఇంకా విపులంగా చదవాలిరా మరి.’

ఆగ్రా వచ్చారు ఇరువురు యాత్రికులునూ. ప్రియవధూమణిపై ప్రణయము మూర్తించినట్టి, ప్రణయినీవిరహము ముద్దకట్టినట్టి, కన్నీటిబిందువులు ఘనీభవించినయట్టి, నిర్మల హృదయము నీడై ప్రతిఫలించినయట్టి తాజమహలు ప్రథమదర్శనము వెన్నెలలో నొనరించెదముగాక యని యమునాతీరమున కారాత్రి వెడలినారు.

ప్రపంచమున మానవుడు సృజించిన సప్తాద్భుతములలో నిది యొకటియట. సమస్తరేఖలు, వంపులు, ఎత్తులు, సమాలంకారములు, సంపూర్ణస్వరూపము ఒక్క శ్రుతిలో మేళవించిన మహారాగమువలె తాజమహలు కాళిందితీరమున సౌందర్యము మొలకెత్తినది.

ఉదయారుణరాగము తాజమహలుశిఖరములపై ప్రసరించినప్పుడు చూచినారు. మధ్యాహ్న నిశ్చలతలో గమనించినారు. నక్షత్రకాంతిలో బరికించినారు. చూచినకొలది నొక వింతయానందము, తీరనితృష్ణ వారికి నుద్భవించినది.

నాల్గవనాటి రాత్రి స్నేహితులిరువురు బయలుదేరినారు. పరమేశ్వరుడు తాజమహలును పదునేను చిత్రములుగా చిత్రించినాడు. ఆరాత్రి నారాయణరావు తాజమహలు గీతము పాడుటకు సంకల్పించుకొనెను. పరమేశ్వరుడు తల నాకసముదెస కెత్తి నక్షత్రముల గమనింపుచు గూడ బోయెను. ఇరువురు యమునాతీరమునకు బోయినారు.

నారాయణరావు ఫిడేలు మేళవించి కమాను తీగలపై నానించి కదిపినాడు.

ససారీ

యమునా కల్యాణి, కల్యాణిరాగము, యమునారాగము, కల్యాణి పరమాత్ముని శక్తి: శిల్పశక్తీ ప్రత్యక్షము. యమునాఝరీవేగము ప్రేమప్రవాహము. రెండింటికిని సంయోగము. అదియే యమునాకల్యాణి. నారాయణరావు యమునా కల్యాణి రాగ మాలపించి, రూపకతాళమున తానము ప్రారంభించినాడు.

క్షీరశిల కరిగిపోయినది. యమునానది ప్రవహించుట మానినది. తాజమహలు మాయమై యచ్చట షహజహాను, ముంతాజరాణి పద్మాసనాసీనులై తోచినారు. అంతయు మధురమైనది. పరమేశ్వరు డా యానందములో లీలా నంతస్వరమై యాడుకొన్నాడు .......

దయాలుబాగు సత్సంగులకు మక్కా. ఇచ్చట వారి సద్గురుమహారాజు నివసించుచుందురు. ఇప్పటివా రైదవగురువుగారు, సాయెబ్జీ మహారాజావారు. నాల్గవ గురువుగారి కాలములో నీ యాశ్రమము ప్రారంభింపబడి నేడు సర్వతోముఖముగ విజృంభించియున్నది. సత్సంగమతము ముఖ్యముగా మూడు విషయములు బోధించుచున్నది. మతము, సంఘము, పారిశ్రామిక విషయములు. పరమాత్మ శబ్దస్వరూపమై యున్నాడు. ‘రాధాస్వామి’ అని ఆయనశబ్దము, ఆశబ్దమైనను మన ముచ్చరింపజాలని, మనము వినజాలని అతీంద్రియశక్తికే గోచరించునట. కాని ఆస్వరూపమున భక్తులకొరకు పిండాండములో అనగా ఈ ప్రపంచములో నట్టిరూపమున దర్శనమైనదట. రాధాస్వామిదయాళునకు రూపము లేదు. ఆయన శబ్దమాత్రము. ఈ విశ్వమంతయు మూడు భాగములుగ విభజింపబడి యున్నదట. పిండాండము, బ్రహ్మాండము, శుద్ధచైతన్యము. పిండాండము భౌతికసంబంధము. బ్రహ్మాండము మనస్సంబంధమైనది. ఈ మూడు విభాగములు ప్రతిజీవిలో నున్నవి. పిండాండ విభాగము లందరకు దెలియును. బ్రహ్మాండములో ప్రథమము జ్ఞానచక్రము భ్రూమధ్యమున నుండును. అందుండి ఆత్మధార సహస్రారము, జ్యోతిర్నారాయణము, సున్న, మహాసున్న, వంకనాళములకు బోవునట. ఆపై శుద్ధచైతన్యము. అందు ప్రథమము భ్రమరగుహ, దానిపై సత్యలోకము, ఆగమ అలకలోకములు. అన్నిటికన్న పైన రాధాస్వామిధామము. అరిషడ్వర్గముల బారద్రోలి, రాధాస్వామిదయాళుని కృపవల్ల సులభముగ పిండాండము బ్రహ్మాండము దాటి శుద్ధచైత్యము జేరు యోగమార్గము సద్గురువు దెలిపెదరట. మన మా రాధాస్వామిదయాళుని పాదముల నమ్మియుండి, శబ్దములు పాడుచు, యోగమాచరించుచు, సంతులతో సత్సంగమాచరించుచు విశుద్ధజీవనము చేయుచుండినచో, ఈ మూడు ముఖ్యవిభాగప్రదేశములలో నున్న వివిధోపలోకములను దాటుచుబోయి సంతులు పరివేష్టించియుండు సంత సద్గురువువారి ధామము చేరుదుము. అచ్చటినుండి సంతసద్గురువే నిన్ను రాధాస్వామి ధామము చేర్చగల శక్తి గలవాడు. వివిధ ధామముల జేరునప్పు డచ్చట నుండి సంతదివ్యులు వివిధ ధ్వనులతో వివిధవర్ణ తేజస్సులై కన్పించెదరట. ఇది దయాలుబాగు సద్గురు మహారాజువారు బోధించు ఆధ్యాత్మిక తత్త్వము.

రెండవది సంఘసంస్కరణ. ఏమతమువారైనను సత్సంగులుకావచ్చును వారికి జాతి మత వర్ణ వివక్ష లుండరాదు. భోజన ప్రతిభోజనములకు వివాహములకు వర్ణము లడ్డమురావు. యువవివాహములు చేయవలయునుగాని, బాల్య వివాహములు పనికిరావు. అర్థములేని యీ నాటి ఆచారము లన్నియు త్రోసివేసి, శుభ్రతయే యాచారములకు ముఖ్యసూత్రముగా బరిగణింపవలయును.

ఎప్పుడు జాతి మత వర్ణ వివక్ష లుండవో, కలిమిలేముల తేడాలు నుండరాదు. సంఘమంతయు సంఘముకొరకు బాటుపడవలయును. ఆస్తియంతయు సంఘముది. సంపాదనయంతయు సంఘముదే. కావున సంఘమే వ్యక్తుల కుటుంబముల బోషించును. ఈ మహాసూత్రము నాచరించుటకై, దయాలుబాగులో వస్త్రములు, ఊటకలములు, కత్తులు, గ్రామఫోనులు, రంగులు, సీసాలు, గరిటెలు, గడియారములు, వెన్న, జోళ్ళు, పెట్టెలు మొదలగు నన్ని రకములగు సామానులు పాశ్చాత్యదేశములతో సమానముగ నొనర్చుచున్నారు. ఏదేశమునకు వలయు వస్తువుల నాదేశమే చేసికొనవలయునను ధర్మమును దయాలుబాగు వారు మనకట్టెదుట కనబరచుచున్నారు. ‘అహో దయాలుబాగా! నీకు నమస్కారములమ్మా, సద్గురూ! నీకు జయమగు గాక!’ అన్నారు వారు. నారాయణరావును, బరమేశ్వరుడును దయాల్‌బాగులో నివసించి సద్గురువుగారి బోధనలు విని సంతసించి, వారి యాధ్యాత్మిక తత్వము భగవద్గీతాబోధతో సమానము మాత్రము కాదని నిశ్చయించుకొనిరి.


౯ ( 9 )

స్నేహితుల కాహ్వానము

రాజేశ్వరరావు బి. ఇ. పరీక్షలో నెట్లో కృతార్థుడై పని నేర్చుకొనుచున్నాడు. అతని ప్రాణమంతయు రాజమహేంద్రవరములో సుబ్బయ్యశాస్త్రి గారి యింటిలో నున్నది. ఒకసారి దక్షిణాదికి బోవలసివచ్చినది. ఒకసారి మలబారు తీరమునకు వెళ్ళినాడు. మొదటి సంఖ్యలో గృతార్థుడు కావలసిన యా యువకుడు, పరీక్షలో నెగ్గుటయే కష్టమైనది. ప్రభుత్వపు నౌకరీదొరకుట దుర్లభము. కావున హైదరాబాదు సంస్థానములోనో లేక జిల్లాబోర్డులోనో యుద్యోగము సముపార్జింప నాతని కోరిక.

ఆలం, రాజారావు మున్నగు మిత్రులు రాజేశ్వరుడు మకాము చేసిన వై. ఎం. సి. ఎ. లో జేరినారు. ఆలం బి. ఎల్. పరీక్ష నెగ్గినాడు, అప్రెంటిస్ పరీక్షలో జేరి అడ్వకేటయి చెన్నపురిలో గృతార్థుడగుటకు నారాయణరావు ఆలంను తనదగ్గర నుంచుకొని, కృషి చేయించినాడు. ఆలంకు నారాయణరా వన్న ప్రాణమే. అతనికి ‘బ్రాహ్మణతురక’ యని స్నేహితులందరు పేరిడిరి.

ఆలం బి. ఎల్. తరగతిలో జదువుచున్నప్పుడు ట్రిప్లికేనులో వర్తకము చేయు నెల్లూరు మహమ్మదీయ వర్తకుని కొమార్తెనిచ్చి వివాహము చేసినారు; వివాహము నెల్లూరులో జరిగినది. నిక్కా ఉత్సవమునకు మన మిత్ర బృందమంతయు విచ్చేసినారు. ఆంధ్ర తమిళ దేశములలో హిందూ మహమ్మదీయ సమస్య లేనేలేదు. మహమ్మదీయులు, హిందువులు సోదరులవలె మెలంగుదురు. మహమ్మదీయుల హృదయములలో వీర్యాగ్ని ప్రభుత్వమువారు అనేక రీతుల రగుల్కొల్పిరి గాని యది రాజినదికాదు. మహమ్మదీయులు హిందూ దేవాలయములను గౌరవించుచున్నారు. హిందువులు, మసీదులకడ వాయిద్యము వాయించరు. తెలుగుదేశముల మహమ్మదీయుల సోడాషాపులలో బ్రాహ్మణులుకూడ షర్బతులు త్రాగుదురు. కిళ్ళీలు కొందురు. మహమ్మదీయ యోగుల గోరీలకు బోయి హిందువులు పూజలు చేయించుచుందురు. ఆలం స్వస్థలమగు నేలూరి కెన్నిసారులో పోయి, నారాయణరావు మొదలగు మిత్రు లాలంగారి యింటిలో మకామువేసి, భోజనమునకు మాత్రము హోటలునకు బోయి, తక్కిన ఫలహారాదు లాతని యింటనే భుజించుచుండిరి.

ఆలం మంచి వస్తాదు. కుస్తీలో నేర్పరి. కాలిబంతిలో, హాకీలో వెనుకటి యిద్దరి యాటగాళ్ళలో నొకడు. వెనుకనుండి యాతడు బంతిని కొట్టినచో అది ఆవలి కక్షవారి గోలు (బంతి దాటిపోకుండ కాపాడవలసిన రెండు కఱ్ఱల మధ్య స్థలము) వరకు పోయెడిది. అందుకని ఆలంకు ‘ఫుట్‌బాల్ పులి’ యని పేరు వచ్చినది. ఈ కాలిబంతియాటవలననే ఆలం నారాయణరావులకు స్నేహము వృద్ధియైనది.

ఆంధ్రదేశ మేయాటలయందును బేరువహింపలేదు. కాలిబంతికి కలకత్తా, క్రికెట్టునకు బొంబాయి, చెన్నపట్టణము, లాహోరు మొదలగునవి, హాకీకి పంజాబు, టెన్నిసునకు మదరాసు, కలకత్తా, పంజాబు, అలహాబాదు మొదలగునవి ప్రసిద్ధి. ఆంధ్రులలో నేడు కొంచెము టెన్నిసు, కాలిబంతి, హాకీ, క్రికెట్టులు వృద్దినందినవి.

కాని యాంధ్రులలో గొందరువీరులు వివిధ క్రీడలలో బేరుగాంచినారు. క్రికెట్టునందు సి. కె. నాయుడు, సి. ఎస్. నాయుడు, రామస్వామి, బాలయ్య మొదలగువారు; టెన్నిసుఆటలో రామస్వామి, నారాయణమూర్తి, కృష్ణస్వామి మొదలగువారలు. ఏది ఎటులయిన నాంధ్రులు నిద్రమత్తువారు. సహజమగు క్రీడాకౌశల మున్నను అది వృద్ధిచేసికొనరు. పరదేశములకుబోయి పేరు సముపార్జింపరు.

ఆలంకు ఆటలన్న ప్రాణము. అతనికి రాజ్యాంగ వ్యాపారము లవసరము లేదు. మతవిషయములమాట మనసు చొరదు. ఆర్థికవ్యవహారము లాతనినంటవు. ఆటలు! ఆటలు! హిందూపత్రిక నాటల వార్తలకే చదువును. తక్కినపుటలు చదువడు. సినిమా కేగుటయైన నాతడు మానును గాని ఎమ్. యు. సి. లో గాని, ఎం. సి. సి. లో గాని, ఎస్. ఐ. ఎ. లో గాని బంతియాట ఆడుచున్నచో వెళ్లుట తప్పదు. ఇంగ్లండు దేశమునుండి గిర్లీగాను గారి నాయకత్వమున టేట్, మెర్‌సర్, పాండాం మొదలయిన క్రికెట్టు ఆటగాండ్రు వచ్చినప్పు డాలం చెన్నపట్టణములో చూచుటకు ముందు బొంబాయివెళ్ళి చూచివచ్చెను.

రాజే: ఒరే ఆలం! నారాయణా, పరమేశ్వరం ఎక్కణ్ణుంచిరా నీకు ఉత్తరం రాస్తా?

ఆలం: నాకు సాంచీనుంచి ఉత్తరం రాశారు. అందులో పరమేశ్వరం కవిత్వమే రాశాడు. నిన్ను తిట్టారురా యిద్దరూ! నేనూ, నటన్, రాజారావూ అజంతా వచ్చి కలుసుకుంటే, అజంతా, ఎల్లోరా, నాసిక, ఔరంగాబాదు, ప్రతిష్ఠానము, కార్లే, కన్హేరి, ఎల్ఫాంటా, పూనా, వాతాపి, బీజపురం, పండరీపురం, హైదరాబాదు, ఒరంగల్లు, పాలంపేట అవన్నీ చూచి అక్కడినుండి బెజవాడమీదుగా ఇళ్ళకు చేరుకోవడంట. ఈ యాత్రలన్నీ రెండు నెలలు పట్టుతవట. మనం అంతవరకూ ఉండలేకపోతే అజంతా ఎల్లోరాలన్నా చూచి వెళ్ళిపోవచ్చునట.

నటరాజన్: నన్నర్జంటుగా రమ్మనిదా తంతి యిస్తుడు ఆలం! ఎందుకుదా అని వస్తును. తీరా చూస్తే దీనికిదా. రాజేశ్వర్! నువ్వుకూడా బయల్దేరు మరి.

రాజే: నేను నిజం చెప్పాలి. మా యిల్లువదలి చాలారోజులయింది. మా అమ్మగారు బెంగ పెట్టుకుందనీ, నువ్వు వేగిరం రావాలి అనీ మా వాళ్ళు ఉత్తరాలు, టెలిగ్రాములు పంపారు. కాబట్టి మీరంతా వెళ్ళండి.

రాజా: ఏమోయ్ రాజీ! నాకుమాత్రం ఇంటికి వెళ్ళాలని లేదుటోయి! మావాళ్ళని పిల్లలను చూసి చాలా రోజులయింది. మా అమ్మ బెంగపెట్టుకుంది. పైగా నేను అమలాపురంలో దుకాణం పెట్టాలని నిశ్చయించుకున్నాను. అశ్రద్ధ చేసేందుకు వీలులేదు. నాకుమాత్రం వచ్చేందుకు వీలుందా? అయినా బయలుదేరుతున్నానా లేదా?

నట: నాకూ తీరుబడిదాలేదు. ఇప్పుడుదా మా హాస్పత్రులు నిండాపనిలో ఉండును.

ఆలం: ఏ రైటరుకో లంచమిస్తే సరి...

రాజా: అంతమంది డాక్టర్లున్నారు. నీవే అవసరమా?

ఆలం: అబ్బాయిలు! ఎవ్వరూ ఏమీ అభ్యంతరం పెట్టేందుకు వీలులేదు. ఇంక మూడురోజుల్లో బొంబాయి మెయిలుమీదో, ఎక్సుప్రెస్ బండి మీదో ప్రయాణం. రాజేశ్వరుని బడాయిమాటలు ఎవరెరుగరురా? రాజమండ్రిలో గులాబిపుష్పాల సువాసన ఇక్కడికి కొట్టి వీడికి వెఱ్ఱెత్తుతోంది.

రాజే: నాకు కోపం తెప్పించకోయ్!

ఆలం: నవాబులు ఒకళ్ళ బెదిరింపులకు బెదరరు. పుష్పం మనదైతే ఎప్పుడైనా దొరుకుతుందికాదుట్రా రాజీ.

రాజే: ఒరే ఆలం! జాగ్రత్తరోయ్. నీపని శ్రుతిమించి రాగాన్ని పడుతోంది.

ఆలం: గ్రామఫోనువాళ్లను పిలిపించరా మరి!

నట: రాజీ అపశ్రుతిదా అవుతాడేమో.

రాజా: మీకంతా వెఱ్ఱియెక్కినట్లుంది. మీకందరికీ మెదడుశస్త్రం చేయించాలిరా. ఆ నాచుపట్టిన మెదళ్ళన్నీ కాస్త బాగు చేసి మళ్ళీ పెట్టేస్తాను. ఏవంటారోయి!

రాజీ: డాక్టర్లు కురుపులు కడుక్కుంటూ, మాత్రలు నూరుకుంటూ కూచోక, వేళాకోళాలుకూడానూ! రాజా: ఇటుకలు పోతపోసే ఇంజనీర్లకన్న వైద్యులు నయమోయ్.

ఆలం: రెండూ రెండే. ఒకడు నాచేతిమాత్ర వైకుంఠయాత్ర అంటాడు. రెండోవాడు నేకట్టిన వంతెనా అదిబద్దలయి నీళ్ళలో గంతెనా!

రాజా: కొంపలు మాపే తమ లాయరుద్యోగం చాలా గొప్పది కాబోలు. ఏమి ఎరగనివాళ్ళకు తలలుమార్చడాలు నేర్పి, సంసారాలు దిబ్బచేసే దెవరో?

నట: మీరంతా ఒకటేదా. మా రైతుల రక్తం పీల్చటానికిదా పుట్టారు. మీరు మాదేశంలో ప్రవేశించిన చీడపురుగులువంటివాళ్లుదా.

రాజా: ఈ అసలైన రైతుబిడ్డ ఈ నటరాజన్ ఏమి బాగా మాట్లాడుతున్నాడు. ఒరే రైతూ! నీ తెలివితక్కువతనాన, నీశక్తి లేకపోవడం మూలాన పరరాజ్యాలవాళ్లు వచ్చి మనదేశం ప్రవేశించడం, మనలందరినీ రక్తం పీల్చడం జరిగింది. ఓరీ అరవరైతూ.

ఆలం: అచ్ఛా అచ్ఛా, బహుత్ అచ్ఛాహై! సుల్తాన్‌వారి ఆజ్ఞ హేమిటి చెప్తారఱ్ఱా!

రాజే: నేనురావడం సుతరామూ వీలులేదు.

ఆలం: అయితే ఒక సంగతి చెప్తాను వినండి. మనవాళ్ళకి నేను ఉత్తర ప్రత్యుత్తరాలు రాస్తూ ఉంటాను. వాళ్లు ఎప్పుడు హైదరాబాదు వస్తారో అప్పుడంతా హైదరాబాదు వెళ్ళి కలుసుకుందాము. అక్కడ చూడవలసినవి చూసి, ఒరంగల్లు, పాలంపేట చూసి అందరం బెజవాడ వద్దాము. ఏమంటారు?

రాజే: తురకాడు తురకాడేరా! హైదరాబాదులో మనవాళ్లని కలుసుకోవాలేం? షరం నహీహై?

ఆలం: హహ్హహ! ఎక్కడ నేర్చుకున్నావురోయి తురకం?

రాజే: నాకు వచ్చిందోయి, రాజేశ్వరులవారికి ఇబ్బంది లేదు, ఎటువచ్చీ నటరాజన్ గారిని మనం యిబ్బంది పెడ్తాం

నట: నువ్వు రావడందా, హాజరుదా?

రాజేశ్వరరావు మేఘాలమీద రాజమండ్రిలో వ్రాలినాడు. వచ్చినప్పటి నుండియు పుష్పశీలయే కలవరింత! ఆమె నెట్లు కలుసుకొనుటా యను విరహ వేదనయే.

రాజేశ్వరుడు చదువుకొనురోజులలో పుష్పశీలకడనుండి యుత్తరములు చిత్రముగా తెప్పించుకొనువాడు. తానొక స్నేహితునికి వ్రాసి యచ్చటనుండి యొక బాలకునిచే నామెకా ఉత్తరము ఆందునట్లు చేయువాడు. ఆమె తన ఫొటోలు రెండు అతనికి బంపినది, వానిని దాస్ బ్రదర్సు వారికడ నలభై రూపాయలిచ్చి పెద్దవి చేయించినాడు. తన గది యలంకరించుకొన్నాడు. ఆమె చిన్న చిత్రమొకటి తీయించి, తన యుంగరములో నిమిడించుకొన్నాడు. ఇంకొకటి వాచిగోలుసులో బెట్టుకొన్నాడు. ఇక నేమి! లోపల బయట నంతట పుష్పశీలయే, విశ్వమెల్ల బుష్పశీలామయమే.

వీరిరువురి సంబంధము నెమ్మదిగా లోకమెల్ల బ్రాకుచు ప్రవహించుచున్నది.

పుష్పశీలకు రాజేశ్వరుడన్న వెఱ్ఱియెత్తిపోవుచున్నది. భర్తకుగాని ఇంటిలోని ముసలమ్మకు గాని తెలియునన్న భయముచే అతి జాగ్రత్తగా మసలినది. భర్తపై అనురాగము చూపించ ప్రారంభించినది. తన లీలావిలాసములలో నాతని ముంచెత్తునది. తనభర్తలో రాజేశ్వరుని యూహించుకొనునది. ఈ కౌగిలింత, ఈ ముద్దాతని కిచ్చిననేకదా జన్మము సార్థకము. ఈ ముసలికోతికి తన యీ విలువగల కౌగిలింత, ముద్దు ధారపోయవలసివచ్చుచున్నది. భగవంతు డింత నిర్దయుడేమి యనుకొన్నది.

ఛీ! ఛీ! మనము చేయు నీ పాపకార్యమునకు భగవంతుని తలచుటేల యనుకొన్నది. ఇందు పాప మేమున్నది? నిజమైన ప్రేమే వివాహమని భర్త రహస్యముగా తెచ్చుకొన్న నవలలో నున్నదిగా! ఆ నవల ‘స్వతంత్ర ప్రేమ’ సంఘాధ్యక్షునిచే వ్రాయబడినది.


౧౦ ( 10 )

దేశయాత్రా విశేషములు

శారదకు మనస్సేమియో బోధించుచునేయున్నది. మొదటి మూడుదినములు భర్త తన్ను బ్రతిమాలినాడు గాని తరువాత తాను గదిలో నున్నదియు లేనిదియు గమనించకుండ నిదురించినాడు. ‘అమ్మయ్యా వదిలినా’ డని సంతోషించినది. పిమ్మట కాలముగడచి వారములు బ్రవహించిపోయినకొలది శారదకు మనస్సు పరిపరివిధముల బోయినది.

భర్త దేశయాత్రకు బోయినాడు. ఏ దేశముల దిరుగుచున్నాడో యని తన తండ్రి ప్రొద్దస్తమానము దిగులుపడుచుండుటవలన, నామెకు భర్తపై కోపము కలిగినది. కాని ఆటలలో, సంగీతములో, చదువులో భర్తమాటే మరచిపోవుచుండును.

ఇంతలో నక్టోబరు నెలాఖరున భర్త కొత్తపేట వచ్చినాడనియు, గాశీ సంతర్పణ తల పెట్టినారనియు నుత్తరములు వచ్చినవి.

చెన్నపట్టణమునుండి యప్పుడే వచ్చిన జమీందారుగారు భార్యను జూచి ‘అల్లుడు రాజమందిరము వచ్చినప్పుడు మన యింటికి వచ్చినాడా?’ యని ప్రశ్నించెను. ‘రాలేదండి. ఈ ఊరు వచ్చినట్లే మాకు తెలియదండీ.’

‘ప్రొద్దున మెయిలులోవచ్చి యిక్కడ గంగపూజ చేసికొని, బావమరిది యింటిలో భోజనములుచేసి స్నేహితులతో గొత్తపేట వెళ్ళినాడట.’

‘మనయింటికి ఎందుకు రాలేదో?’

‘ఎందుకు రాలేదని అనుకునేది? అతని యిష్టం.’

‘మూడు నెలలైనది. ఇల్లు వదలి, ఇచటికి వచ్చికూడా మనయింటికి ఒకసారైనా రాకపోవడం ఆశ్చర్యమే! ఎప్పుడూ అలా సంచరించేవాడు కాదే!’ అని సుందరవర్థనమ్మగా రనినది.

ఒక వేళ కొత్తచేత సిగ్గుపడినాడేమో? అల్లుడు రాకుండుట కేదియో కారణముండియుండునని యనుకొనవలె. ఏమి కారణమైయుండును? తన భార్యకు అల్లుడన్న బొత్తుగ నిష్టములేదన్న సంగతి గ్రహించినాడు. అనేక పర్యాయము లామె కల్లునిగుణగణములు వర్ణించినాడు. అతనిని గౌరవించనిచో దనను గౌరవించనట్లే యని నొక్కి చెప్పినాడు. ఆమెమాత్రము ప్రసక్తి వచ్చినప్పుడెల్ల నల్లునియందు నిరసనము చూపుచునే యున్నది. ఉదారహృదయుడైన యల్లుడు ఇట్టి క్షుద్రభావములకు జోటిచ్చువాడు కాడు. భార్యగాని, యితరులుగాని అల్లుడు తన యింటికి వచ్చుటకు సిగ్గుపడునంతటి యగౌరవము సలిపియున్నచో నట్టివారికిని దనకు నా నిముషముతోసరి, యని యనుకొని భార్యను జూచి, ‘అతని మనస్సు పరమోత్కృష్టమైనది. అతడు చిన్నచిన్న దానికి మనస్సు కష్టపెట్టుకోడు. ఇంతవరకు ఈ ఊరు వచ్చినప్పుడు మన యింటికి రాకుండా ఉండలేదు. నువ్వెప్పుడైనా అతనికి మనస్సు నొచ్చు కార్యము లేమియు జేయలేదుకదా?’ అనెను జమీందారు.

‘అబ్బే, లేదండి.’

‘అతని హృదయం మనవాళ్ళలో ఎవరివల్లనైన కష్టపడినదంటే వారు నాకు కానివారు. ఈ జన్మలో వాళ్ళకూ నాకూ ఏ సంబంధమూ ఉండదు.’

‘అంత విచిత్రంగా మాట్లాడతారేమిటి? అతన్ని అగౌరవపరచేవాళ్ళెవరండీ?’ వరదకామేశ్వరీదేవి లోన కంపించినది. తానేమియు పొరపాటున యల్లుని బాధించలేదుగదా?

కాశీసంతర్పణకు జమీందారుగారు భార్యను, సోదరిని, గుమారుని, శారదను వెంటదీసుకొని కొత్తపేట వెళ్ళినారు.

ఎప్పుడు రాని వియ్యపురాలు వచ్చినదని కామేశ్వరీదేవి యడుగులకు మడుగులొత్తించిరి వియ్యాలవారు. శారదా నారాయణరావులు బీటలపై కూర్చుండవలసి వచ్చినది. దంపతు లిరువురు గంగాపూజ సలిపినారు, పీటల మీద కూర్చున్న బావగారికి కేశవచంద్రుడు ఖద్దరువస్త్రముల నిచ్చినాడు. కుమార్తెకు, తల్లి సూర్యకాంతముచే పసుపు, కుంకుమ, చీర, రవికయు నిప్పించెను. హారతి నిచ్చిరి. బ్రాహ్మణ సమారాధన జరిగినది. సంభావన లిచ్చిరి. వచ్చిన చుట్టము లందరకు గంగచెంబు లీయబడినవి. జానకమ్మగారి యక్క గారును బ్రతికియున్నంతవరకు సరిపోయినంత గంగ పట్టుకొని వచ్చినాడు కుమారుడని సంతసించినది.

భోజనములైన వెనుక సుబ్బారాయుడుగారి రెండవ భవనమగు మేడలో జమీందారుగారు, శ్రీరామమూర్తిగారు, సుబ్బారాయుడుగారు, నారాయణరావు, నతని స్నేహితులు, తదితరులు నింకను బెద్దలు తాంబూలము వేసికొనుచు కూర్చుండినారు. ఆలమును, రాజారావును, జమీందారుగారు తన యల్లుని యాత్ర విషయమై అడిగినారు. కాశీ సంతర్పణకై బెజవాడనుండి వచ్చునపుడు పరమేశ్వరుడు తన భార్యను కొత్తపేట తీసికొనివచ్చినాడు. అతడును విశాఖపట్టణములో కాశీసంతర్పణమును సంకల్పించినాడు.

విశాఖపట్టణమునుండి ఆహూతులై పరమేశ్వరుని తలిదండ్రులును, అతని అనుజులు, చిన్న చెల్లెండ్రు వచ్చినారు. రాజారావు తలిదండ్రులు, భార్య సూరమ్మయు, బిడ్డలును వచ్చిరి.

ఢిల్లీ ఫతేపూరు సిక్రీ, ఆగ్రా మున్నగు ప్రదేశములందలి వింతలు చెప్పి, దయాలుబాగు చరిత్రయంతయు జెప్పి యచ్చట నుండి జబ్బలుపురమునకు బోయినారమని నారాయణరావు చెప్పనారంభించెను.

‘జబ్బలపురము దగ్గరనుండి నర్మదానదిలోయ చూద్దామని వెళ్ళాము. ఆ పాలరాతి కొండల్ని తొలిచి ఆ నది ప్రవహించే సొంపు, మన గోదావరి పాపికొండల్ని దొలిచి ప్రవహించు ప్రదేశముయొక్క అందముతో సరిపోతూ ఉన్నదండి. ఆ గుబుర్లు, అడవులు, కొండలు, జలప్రవాహము, నీలాకాశం మమ్మల్ని సమ్మోహింపచేశాయి.

‘అక్కణ్ణుంచి భోపాలు వెళ్ళాము, భోపాలు తర్వాత స్టేషను భిల్సా. అక్కడ సాంచిస్థూపము హిందూదేశములో అందమైన స్థూపాలలో ఒకటి, ఆ స్థూపము చుట్టూవున్న మహాద్వారములందున్న విచిత్ర శిల్పసంపద ఇంకో చోట లేదండి. ఆ మహాద్వారాల్లో ఒకటి ఆంధ్రచక్రవర్తుల ఆస్థానపు శిల్పిధాన్యకటకమునుండి వెళ్ళి, నిర్మించి, చెక్కివచ్చెనట.

‘సాంచీనుంచి ఉజ్జయిని వెళ్ళాము. శ్రీ కాళిదాసాది మహాకవుల పొగడ్తలనందిన ఉజ్జయిని అద్భుతం అయిందండి. దశకుమారుల చరిత్రము, వాసవదత్త, మేఘసందేశము, కథాసరిత్సాగరము వర్ణించిన మహాకాళేశ్వరుని గుడి, మొదలయిన వన్నియు జూచి యచ్చటనుండి అహమ్మదాబాదు వెళ్లాము. శ్రీ గాంధీమహాత్ముని సబర్మతీ ఆశ్రమము చూచాము. శ్రీ మహాత్ములవారిని దర్శనము చేసుకున్నాము. ఎక్కి కదిలిస్తే కదిలే మినారెట్ చూసినామండి. అట్లాంటివి రెండుండేవిట. ఒకటి ఒక ఇంజనీయరు విప్పి మళ్ళాకట్టినాడట. అందువల్ల కదలుట మానినది. రెండవది పైకెక్కి ఇటు నటు కదల్చినచో కదలిపోవును. నీరు గిన్నె నిండుగా పోసి మినారట్ కదిల్చినచో నీరొలికిపోవును.

‘అహమ్మదాబాదు నుండి కథియవారు వెళ్ళి శ్రీ గాంధీమహాత్ముని జన్మస్థానమగు పోర్‌బందరుపురము, శ్రీ గాంధిమహాత్ముడు పుట్టిన గృహమును గనుగొని యానందపూర్ణుల మయ్యాము. అక్కడ నుంచి ద్వారక వెళ్ళాము. ద్వారక నుండి తిరిగి అహమ్మదాబాదువచ్చి, అచ్చటనుండి ఆబూపర్వతం వెళ్ళాము.

‘ఆబూస్టేషను నుండి ఆబూపర్వతానికి మోటారుబస్సున్నది. మోటారు మీద నాలుగు వేల అడుగుల ఎత్తున్న ఆబూపట్టణానికి వెళ్ళాము. అచ్చటినుంచి తిన్నగా దిలావర జైనదేవాలయములు చూశాము. అహో! ఏమి యాదేవాలయ శిల్ప సౌభాగ్యము! ఎంత చూచినను తనివితీరదండి. అంతా పాలరాయి చెక్కడమే. ఆప్రదేశం అంతా రూపాయలుపరచి జైన భక్తుడు కొన్నాట్ట. ఎన్ని కోట్లు ఖర్చు చేయించి ఆ గుడి కట్టించాడో!

‘దిలావరాన్నుంచి అచలేశ్వరం వెళ్ళి అచ్చట పూజారి బ్రాహ్మణుని యింటిలో మకాంచేసి, రొట్టెలు, పాలు ఫలహారంచేసి పడుకున్నాం. మరునాడు ప్రొద్దున్నే దత్తాత్రేయశిఖరానికి వెళ్ళాము. అయిదువేల అడుగుల ఎత్తు ఆ శిఖరం. పైన ఒక పెద్దరాయి, ఆ రాతి పైన ఒక గుడి ఉంది.

‘ఆబూపట్టణం నుంచి చిత్తూరు వెళ్ళాం. చిత్తూరు మార్వార్ మహారాణాలు సంగరాణా, భీమసింగు, లక్ష్మణసింగు, హమీరు మొదలగువారు మహాప్రతాపవంతులు పరిపాలించిన ఆ మహాపట్టణము చూచినప్పుడు కన్నుల నీరు తిరిగినది. అక్కడనుంచి తిన్నగా బరోడా వచ్చాము. బరోడాలో ఆగి, గైక్వారుగారి భవనములు, తోటలు మొదలగునవి యన్నియు జూచి సూరతు వచ్చి యచ్చటనుండి బార్డోలీ వెళ్ళాము. బార్డోలీ ప్రజల వీరత్వమంతయు మొదటి నుండి వినియున్నందున, ఆ దేశం చూసి, ఆ ఊళ్ళో నాయకులను కలసుకొని, అచ్చట ఒక రోజాగి, తిన్నగా బయలుదేరి జాల్‌గాను వచ్చి చేరాము.

‘జాల్‌గాను దగ్గర బొంబాయినుండి ఢిల్లీకి బోవు జి. ఐ. పి. రైలు ముఖ్య మార్గమున్నది. జాల్‌గాన్ నుండి మోటారు చేసికొని తిన్నగా అజంతాకు పోయాము.

‘అజంతా చూచి మా పరమేశ్వరుడు మూర్ఛపోయాడు. ఆతని ఆనందానికి మేరలేకపోయింది. చిత్రకారుల కది కాశీపట్టణం. ఇప్పటికి రెండువేల సంవత్సరాలకు పూర్వంనుంచి పధ్నాలుగువందల సంవత్సరాల క్రితంవరకూ ఆరువందల సంవత్సరాలు వృద్ధిపొందింది.

‘భోగిరానది సాత్పురా కొండలలో పుట్టి ఆ కొండలను రెండుమూడు మైళ్ళు తొలుచుచు ప్రవహించింది. ఆ లోయలో ఒక్క అరచందాకృతిని ఉన్న వంకరలో యిరువది యెనిమిది గుహలు తొలిచినారు. ‘ఆ గుహలన్నీ ఒక తరాన తొలిచినవికావు. అవికొన్ని చైత్యాలక్రింద, కొన్ని విహారాలక్రింద నున్నవి. చైత్యం అంటే గుడివంటి గుహ. విహారము బౌద్ధభిక్షువులుండే గుహ. కొన్ని కొన్ని విహారాలలో వేయిమంది సౌఖ్యముగా కూర్చుండవచ్చును. ప్రతి గుహయందూ బుద్ధదేవుని విగ్రహమున్న గర్భమందిరముంది. అట్టి గుహల్లో చాలావాటిలో గోడలకు లోకప్పుకు, స్తంభాలకు మట్టి మొదలైనవి కలిపిన ముద్దపూసి, దానిపై దివ్యమైన చిత్రలేఖనం చిత్రించినారు. ఆ రంగులు నేడు పూసినట్లుగా ఉన్నవి. బుద్ధజాతకకథ లెన్నియో అందు చిత్రించి ఉన్నాయి. బోధిసత్వుని మూర్తులు, బుద్ధుని మారుడు పరీక్ష చేయుటయున్నూ చిత్రించి ఉన్నవి. ఇవికాక అలంకార చిత్రవిన్యాససంపద ఇంతా అంతా కాదండి. ఏనుగులు, పక్షులు, జింకలు, మనుష్యులు, పళ్లు, కమలములు మొదలగు పూవులు అన్నియు అలంకారవిన్యాసములోనికి తీసికొనివచ్చి ఒక అద్భుత చిత్రప్రపంచం అల్లారండి.

‘అజంతాలో వారంరోజులున్నాము. అక్కడ నుంచి మన్‌మాడు మీదుగా ఎల్లోరా గుహలకు వెళ్ళాము. ఎల్లోరా గుహలలో ముఖ్యమైన పదహారవ గుహను రాష్ట్రకూటులరాజగు మొదటి కృష్ణరాజు దొలిపించినాడు. ఎల్లోరాలో జైనగుహలు, బౌద్ధగుహలు, హిందూగుహలు ఉన్నవి. అన్నింటి కన్న విచిత్రమైనవి హిందూగుహలే.

‘కృష్ణరాజుకు కుష్టురోగము అంకురించినదట. యెట్టి ఘనవైద్యులున్నూ ఆరోగ్యము కుదర్చలేక పోయినారుటండి. ఇంతలో ఒక ముసలిబ్రాహ్మణుడు ఒకరోజున వచ్చి, ‘ప్రభూ ఎల్లోరాగుహలోని శివప్రీతికరమగు నొక చిన్న కందరములో ఒక జల వెలిసింది. అద్దాని సేవించి నీలకంఠుని ప్రార్థించినచో మీకు రోగం నివృత్తి అవుతుందని చెప్పి యెక్కడికో వెళ్ళిపోయాడుటండి.

‘తన రాజధాని మాన్యకేతనం వదలి, రాష్ట్రకూటరాజు తిన్నగా ఎల్లోరావెళ్ళి అచ్చట మకామువేసి, శివుని ప్రార్థిస్తూ ఆ శిలల్లోంచి పుట్టిన నీరు త్రాగాడుటండి. అతనికి కుష్టు సంపూర్ణంగా పోయిందట. అప్పుడు శ్రీ పరమేశ్వర ప్రీతికరంగా కైలాసమే ఆ కొండలో నిర్మించాలని ఆ ప్రభువునకు నిశ్చయం కలిగి శిల్పులలో పేరుపొందిన యొక మహానుభావుణ్ణి రప్పించి, కైలాసంవంటి దేవళం ఈ కొండలో దొలిపించాలి అని అన్నాట్ట. ఆ శిల్పి కైలాసగిరికి ప్రయాణం చేసి, ఒక ఏడాదిలో తిరిగివచ్చి, అనేక శిల్పులను పోగుచేసికొని, ఆ దేవాలయం నిర్మించాట్టండి కొన్ని సంవత్సరాలకి.

‘సుమారు నూరడుగులపైన ఆ కొండప్రక్కగా దొలిచి అందులో గుడి, మండపం, గోపురం, రెండు ధ్వజస్తంభాలు, రెండు ఏనుగులు, యాత్రికుల మందిరాలు, విహారమండపం అన్నీ చేశారు. ఒకేరాయి గుడిఅంతా. సింహాల మీద, ఏనుగులమీద, శరభాలమీద గుడి నిలిచియున్నట్లు చెక్కారు.

౧౧ ( 11 )

ఆంధ్రమహారాజ్య చిహ్నములు

నారాయణరావు తన యాత్రలనుగూర్చి చెప్పుచున్నకొలది జమీందారుగారు, సుబ్బారాయుడుగారు మొదలగు చుట్టపక్కములత్యంత సంతోషముతో వినుచుండిరి. ఇంతలో గ్రామస్థులును, నారాయణరావు నెలకొల్పిన గ్రంథాలయ కార్యదర్శియు, నధ్యక్షుడును వచ్చి యందరకు నమస్కృతులిడి కూర్చుండిరి. వారు నారాయణరావును, బరమేశ్వరుని తమ యాత్రలగూర్చి యుపన్యాసముల నిమ్మని కోరుటకు వచ్చిరి. జమీందారుగా రల్లుని తప్పక యొప్పుకొమ్మని చెప్పినారు. నారాయణరావు వల్లెయనెను.

‘ఒకేరాయి, పైనుంచి యింకొకశిల తీసికొనిరాలేదు. ఇది సరిగదా, ఇక ఆ శిల్పంయొక్క అందం ఇంతని వర్ణించడానికి వీలు లేదండి.’

అక్కడకు వచ్చినవారిలో నొకరు ‘ఎంత కష్టం అండి చెక్కడం, ఆ రాతిలోనే అంతా. ఒకేరాయి లోపలా పైనాకూడా చెక్కాలంటే ఎంత కష్టం, మా గొప్ప శిల్పం అండీ’ యనినాడు.

‘గుహలన్నీ ముప్పై ఉంటాయి. ముందు బౌద్ధగుహలు, తర్వాత హిందూ గుహలు, తర్వాత జైనగుహలు బయలుదేరాయి. హిందూగుహలలో దశావతారం అన్న గుహలో చాలా గొప్పశిల్పం ఉందండి!’

ఆ సాయంకాలం సభలో పరమేశ్వరుడు మాట్లాడినాడు. నారాయణరావు కంఠముకన్న బరమేశ్వరుని కంఠము ఉపన్యాసము లిచ్చుటలో నెక్కువ గంభీరత దాల్చును. అతడు వేలకొలది జనమును దన వాగ్ధారలో ముంచియెత్తుకొనిపోగలడు. నారాయణరావు గొంతుక యుపన్యాసములో మధురముగా నుండును. ధారాశుద్ధిగలది. ప్రతివిషయమునుగూర్చి లెక్కలు మున్నగు వివరములు చెప్పుచు శ్రోతల హృదయము చూరగొనును.

బరమేశ్వరుడు లేచి ‘మానవుని హృదయం విశాలం అవ్వాలంటే దేశాలు తిరగడం ఒకమార్గం. ప్రతి విద్యార్థినీ, ప్రతి రైతు కుఱ్ఱవాణ్ణి చివరకు ఆంధ్రదేశమైనా పూర్తిగా తిరిగిరమ్మనాలి. ఆంధ్రదేశంమాత్రం తక్కువ ఉందా! ఋషికుల్యానదికడనుండి కంచివరకు, సముద్రం ఇటు, అటు ముచికుంద నది, భీమనది మొదలైనవి ఎల్లలు. మనదేశం ఏలినవాళ్ళు ఆంధ్రులు. మొదట మనకు చరిత్రలో తెలిసివున్నంతమట్టుకు ఆంధ్రులు ఆఖరి కాణ్వాయణచక్రవర్తిని చంపి, తాము చక్రవర్తులై రాజ్యం చేశారు ఆరువందల సంవత్సరాలు. తర్వాత ఇక్ష్వాకులు, సాలంకాయనులు బృహత్పాలాయనులు, పల్లవులు రాజ్యం చేశారు. విజయవాడలో, వేంగిలో, కాంచిలోను. తర్వాత గాంగులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డులు, వెలమలు, క్షత్రియులు, తెలగాలు, కమ్మవారు, గొల్లలు, కోమట్లు, బ్రాహ్మణులు రాజ్యాలు చేశారు.

‘ఆంధ్రమహారాజ్యము యొక్క చిహ్నాలలో అమరావతి, జగ్గయ్యపేట, భట్టిప్రోలు, గోలి, ఘంటశాల, నాగార్జునమెట్ట ముఖ్యమైనవి. ఆంధ్రశిల్ప మత్యంత ప్రాభవము పొందినది. అంత ఉత్తమశిల్పము నాటికి నేటికి లేదని వక్కాణింపవచ్చును. అంతయు పల్నాటి పాలరాతిలో చెక్కారు.

‘ఆంధ్రశిల్పంయొక్క గొప్పంతా చెన్నపురి, లండను, బెర్లిను వస్తు ప్రదర్శనశాలలలో ఉన్నది.

‘పల్లవులున్నూ తమయొక్క చిహ్నాలు కాంచీపురంలో, మహాబలిపురంలో అక్కడక్కడా నిలిపారు. విజయవాడలో వారు నిర్మించినట్టి దేవాలయం కృష్ణఒడ్డునే కొండమీద ఉన్నది.’

అతని ఉపన్యాసం వరదలనాటి గోదావరినదివలె ప్రవహించుచున్నది.

‘మహాబలిపురశిల్పంలోని గంభీరత అతి విచిత్రమైనది. అర్జునుని తపస్సు, కోతులగుంపు, యేనుగుల శిల్ప విన్యాసం మాధుర్యం వెదజల్లుచుండును. అచ్చట రాతిరథములు, ఒకేరాతిలో దొలిచినవి. ఆ గుడులు పరమాద్భుతములు. పంచపాండవుల రథములు, ద్రౌపదిరథము నున్నవి. ఆ పట్టణమంతయు సముద్రమున మునిగిపోవుచున్నది.

‘చాళుక్యుల శిల్పము, దేశమంతయు వెదజల్లబడియున్నది. బాదామిలో, కళ్యాణిలో, ద్రాక్షారామములో, రాణ్మహేంద్రవరములో, సింహాచలములో ఇంకా అనేక స్థలములలోనున్న దేవాలయములలో విగ్రహములలో చాళుక్యుల శిల్పచమత్కృతి కనబడుతుంది. చాళుక్య దేవాలయములు దాక్షిణాత్య దేవాలయములంత పెద్దవికావు.

‘కాకతీయుల శిల్పకళాప్రాభవము ఓరుగల్లులో, పాలంపేటలో, అమ్మకొండలో దర్శనమిస్తుంది. కాకతీయులు శ్రీనటేశ్వరుని నాట్యమహదానందము చూపించుకొన్నారు వారి శిల్పములో.

‘విజయనగర సామ్రాజ్యము హంపీ, తాడిపత్రి, పెనుగొండ, గుత్తి, మాచెర్ల, లేపాక్షులలో జూడగలము. హంపీదృశ్యములు జూచిన యేమానవుని గుండెలు తరుగుకొనిపోవు?

‘మన హృదయములు విశాలతనొంది సర్వమానవ ప్రేమవిలసితాలు కావలెనంటే కళాపూజకన్న ఇంకోటిలేదు. ఇంతమందిలో భద్రాచలము ఎంతమంది వెళ్లారు? భద్రాచలము వెళ్లుటే ఒక చక్కని యాత్ర. గోదావరిలో పడవలలో ఒక వారమురోజులు ప్రయాణము. ముందు ముందు మోటారు లాంచీలు వస్తాయి అనుకోండి. ఆ పాపికొండల్లో పడవమీద ప్రయాణం చేస్తూ తిప్పలమిద వండుకుంటూ, వెన్నెల్లో తిప్పలమీద పవళిస్తూ కొండలు, అడవులు, గోదావరీ నీలపులోతులు తన జీవితములోనికి ఆకర్షిస్తూ ప్రయాణము చెయ్యడము ఎంత ఆనందమో ఆలోచించండి.

‘అజంతాలోయలో జలజల ప్రవహించే భోగీరానది ఒడ్డున నిలుచుండి, ఆ జలప్రవాహము పాడు పాటలు వింటూ గోడల్లా పైకెగసిఉన్న ఆ కొండల మధ్య కనబడే ఆకాశము చూస్తూ అర్ధచంద్రాకృతిగా ఉన్న ఆ విచిత్ర కందరముల గమనిస్తూ, సంధ్యారుణకాంతులు ఆకాశాన ప్రసరిస్తూ కొండ శిఖరాన్ని ఎరుపుచేస్తూంటే, ఆ దివ్యప్రపంచంలో పురాతన శిల్పి చెక్కిన విగ్రహాలకుమల్లే అలా నిలుచుండిపోయాము.

‘వాతాపినగరములో పశ్చిమచాళుక్యుల శిల్పచమత్కృతి ఉన్నది. కన్హేరీగుహలు గ్రీకుల లేబ్రినులవలె ఉంటవి. కార్లేగుహలు అతి పురాతనమగు ఆంధ్ర బౌద్ధగుహలు. రెండువేల రెండువందల సంవత్సరాలక్రిత మా గుహలలో నిర్మించిన దారుఫలకములు నేటికినీ చెక్కు చెదరకుండా ఉన్నవి. నాసికలోని గుహలలో ఆంధ్రరాజుల శాసనములు చెక్కించినారు. ఔరంగాబాదు గుహలలోగూడ మంచి విగ్రహములు, చిత్రలేఖనము లున్నవి. నానాఘట్టములలో ఆంధ్రశాతవాహన ప్రభువుల శిల్పాలున్నవి.

‘బీజపురములో బోలుగుంబాజ్ అనేది ప్రపంచములోనున్న పెద్ద గుమ్మటములలో నొకటి. ఆ గుమ్మటములో పైకెక్కి గుమ్మటమున కావల నీవల నిద్దరు మనుష్యులుండి ఎంతకేక వేసినా వినపడదు. గుమ్మటము గోడపై పెదవి యొకరూ, చెవి యొకరూ ఆన్చి రహస్యములు, గుసగుసలు సల్పినచో గూడ స్పష్టముగా వినబడును.

‘దౌలతాబాదుతోట అజేయము. తినుబండారములు చేరనీయక మాడ్చవలసినదే గాని మానవమాత్రు డా దుర్గమును శౌర్యముచే చేరలేడు. ధాన్యపు రాశివలె అయిదువందల అడుగుల ఎత్తున ఉన్న కొండను, వరికుప్పవలె చెక్కినారు. కొండచుట్టూ సమతలానికి నూరడుగుల లోతు కందకం, నూరడుగుల వెడల్పు ఉంటుంది. సమతలానికి పైన గోడలా చెక్కిన కొండభాగం ఎత్తు నూటఏభై అడుగులు. కొండంతా కోటగోడలు. కొండశిఖరంపై చిన్నకోట, కోటమధ్య రాజభవనం, భవనం శిఖరంమీద ఫిరంగి.

‘త్ర్యంబకంలో గోదావరి పుట్టింది. కోట్లకొలది సంవత్సరాల యీడున్న ఆ కొండలు నాలుగువేలు, అయిదువేలు అడుగుల ఎత్తు, సగం ఎత్తువరకు కంకరా, అడవులూ ఆవరించిఉంటాయి. తక్కినభాగం అంతా నల్లటిరాయి. అల్లాంటి ఒక కొండ వెయ్యి, పదిహేనువందల అడుగులఎత్తు ఎక్కాము. ఆ పైన ఒక చిన్నగుహ, కోనేరున్ను. కోనేటి ప్రక్కను ఒక గోముఖవిగ్రహం ఉన్నది. ఆ గోముఖంలోంచి చుక్కచుక్కలా గోదావరినది పడుతోంది. అసలు అక్కడ అన్నీ కొండలలోంచి ప్రవహించే జలప్రవాహాలే. అవి అన్నీ గోదావరి అన్న పేరుతో ఉన్న చిన్నయేటిలో కలుస్తాయి. అక్కడినుంచి ఇరు వదిఐదు మైళ్ళ దూరంలో ఉన్న నాసిక వచ్చేటప్పటికి గోదావరి రెండువందల అడుగుల వెడల్పున గొప్ప నదియైనది. ప్రతిష్ఠానంలో నాలుగువందల అడుగుల వెడల్పు, నిజామాబాదులో ఆరువందల అడుగుల వెడల్పు, భద్రాచలముదగ్గర మైలు, రాజమహేంద్రవరముకడ రెండుమైళ్ళు, ధవళేశ్వరముకడ నాలుగుమైళ్ళు, డెల్టాముఖమున ముప్పదిమైళ్ళు వెడల్పున్నది.’

పిమ్మట పండరీపురము, హైదరాబాదు, గోలుకొండ, ఒరంగల్లు మొదలగు ప్రదేశముల వింతలన్నియు కనులకు గట్టునట్లు పరమేశ్వరమూర్తి వర్ణించి చెప్పెను.

నారాయణరావు వివిధ దేశ ప్రజల యాచార వ్యవహారములు, వివిధ దేశములలో ఒంటలు, ప్రజల కట్టుబొట్టులు, వర్తకసరళి మొదలైన విషయముల గూర్చి యుపన్యాసము నిచ్చినాడు. ఉత్తరదేశ ప్రజలు సిక్కులు, కాశ్మీర దేశస్థులు, పంజాబీయులు, పఠానులు, సరిహద్దు పరగణాలవారు చాల బలమైనవారు. సంయుక్తపరగణాలవారు, మధ్యపరగణాలవారు, బిహారీయులు, రాజపుత్రులు, మహారాష్ట్రులు, ఆంధ్రులు రెండవరకమువారు. ఆఖరిరకము వంగము, అరవ, మళయాళములవారు. కన్నడులు రెండవరకమునకు, ఆఖరిరకమునకు మధ్య నుందురు.

అందమున మొదటివారు కాశ్మీరదేశ స్త్రీలు. మంగుళూరువారు, మైసూరు వైష్ణవులు తరువాత. తర్వాత మళయాళివారు, రాజపుత్రస్త్రీలు, కొంకణీయులు, గుజరాతీ, మహారాష్ట్ర. ఆంధ్ర, వంగ మొదలైన తక్కిన దేశముల వారు తర్వాత, దాక్షిణాత్య స్త్రీ లాఖరున వచ్చెదరు.

కట్టులలో ఆంధ్రస్త్రీల నేటి కట్టు చాల అందమైనది. తర్వాత మహారాష్ట్రపు కట్టు. అయ్యంగారికట్టు తర్వాత. కథైవారీలు, రాజపుత్రస్థానస్త్రీలు పరికిణీలు కట్టెదరు. సిక్కులు, కాశ్మీరదేశస్థ వనితామణులు లాగులు తొడుగుకొనెదరు. గుజరాతీ, ఉత్తరహిందూస్థానం, వంగదేశముల లలనలు చిన్నచీరలు కట్టెదరు. ఒక శాలువ పైన కప్పకొనెదరు. అందరికట్టుకన్న అసహ్యమగు కట్టు ఒరియా దేశ స్త్రీలు కట్టెదరు.

శుచిలో మలయాళిలు మొదట, ఆంధ్రులు రెండవవారు. తర్వాత తమిళ బ్రాహ్మణులు. తర్వాత కన్నడులు. తర్వాత మహారాష్ట్రులను వంగదేశపువారిని చెప్పవలెను. రాజపుత్రస్థానీయులు, పంజాబు, కాశ్మీరదేశస్థులు నాలుగవవారుగ వచ్చెదరు. ఒరియా దేశపువారు ఆఖరువారు. మురికిగుడ్డల ధరించి, పసుపునూనె కారుచుందురు.

ఆంధ్రులు, కన్నడులు భోజనమైనవెనుకమాత్రం తమలపాకులు ఉపయోగించెదరు. తక్కినవారందరు కాలనియమరహితముగా పొగాకుతో నుపయోగించెదరు. పొగాకు మసాళాల రూపమున వాడుదురు. వంటలలో ఎక్కువ ఖరీదుగల భోజనము గుజరాతీ భోజనము. పంజాబీయులు తరువాత. ఔత్తరాహు లావెనుక వచ్చెదరు. వంగ, మహారాష్ట్ర, ఆంధ్ర, కన్నడ దేశముల వారిని తర్వాత చెప్పవలె. అరవదేశం, మళయాళదేశం వారు తర్వాత, ఒరియావా రాఖరున వచ్చెదరు. పిండివంటలలో దక్షిణాదివారు, గుజరాత్‌వారు, కన్నడులు మొదట. తర్వాత వంగదేశస్థులు, ఔత్తరాహులు. తర్వాత మళయాళీలు, తెలుగువారు. ఆఖరున ఒరియావారు. వంటకములలో ఆంధ్రులు ప్రథములు.

ఆచారము తెలుగువారి కెక్కువ. స్నానము చేయవలె, ఆరోజున ఆర వేసినబట్టి యుండవలెను. ఒకసారి మయిలపడిన మరల స్నానము చేయవలెను. మరల ఆరవేసినబట్ట కట్టవలెను. విడిచిన వస్త్రము మయిలపడును. తక్కిన అన్ని దేశములలో నిన్న ఆరవేసినబట్ట నేడు పనికివచ్చును. ఒకసారి స్నానము చేసి మడిబట్ట కట్టుకున్న యెడల మరల మరల మయిలపడుట యుండదు.

దాక్షిణాత్యులకు, మళయాళులకు, ఆంధ్రులకు, కన్నడులకు, ఔత్తరాహులకు దృష్టిదోషమున్నది. మహారాష్ట్ర, ఘూర్జర, కాశ్మీర దేశస్థులకు పంక్తిదోషముమాత్రమే.

ఆంధ్రులు, దాక్షిణాత్య, మళయాళ, మహారాష్ట్ర, కన్నడ, ఔత్తరాహ ఘూర్జర బ్రాహ్మణులు మాంసాదులు తినరు. వంగ, ఓడ్ర, కాశ్మీర, సారస్వత బ్రాహ్మణులు మత్స్యములు భక్షించెదరు. మాంసమును ఒక్కొక్కప్పుడు భక్షింతురు.

ఆయా విశేషము లుపన్యసించుట పూర్తి యగుటతోడనే యధ్యక్షులు, నారాయణరావు, పరమేశ్వరమూర్తి మొదలగువారు దేశయాత్రలకు బోయి, జ్ఞానము సముపార్జించి, ప్రజలకు తెలియజెప్పుట యత్యుత్కృష్టమగు కార్యమని వచించి సభ ముగించెను. అందరకు కృతజ్ఞతాపూర్వక నమస్కృతులు కార్యదర్శి సమర్పించినాడు.


౧౨ ( 12 )

నారాయణరావు సాహసకృత్యములు

రాజేశ్వరరావు, సుబ్బయ్యశాస్త్రిగారి భార్యతో నెచటికేని పోయెనను వార్తయు, నమలాపురములో రాజారావుభార్యకు చాల జబ్బుగానున్నదను వార్తయు రెండు నొకేసారి నారాయణరావుకు గొత్తపేట చేరినవి. స్నేహితులందరు వెడలిపోయిరి. చుట్టము లందరు వెడలిపోయిరి. నారాయణరావు చెన్నపట్టణమున గాపురముపెట్టుటకు నిశ్చయించెను.

సుబ్బారాయుడుగారు కుమారునిమాట కడ్డముపెట్టరు. ఇరువురుపుత్రులు నింటికడనుండకుండ వెడలిపోవుట ఆయనకుగాని, జానకమ్మగారికిగాని యెంత మాత్ర మిష్టములేదు. అయినను దామాబాలుని యిష్టమునకు వ్యతిరేకము చెప్పలేక నిట్టూర్చి యూరకుండిరి. నారాయణరావు తన పెత్తల్లి కూతురు, చిన్న తనంలో భర్తనుకోల్పోయిన యొక నిర్భాగ్యవనితను దనతో జెన్నపట్టణమునకు దీసికొనిబోవ నిశ్చయించినాడు. ఆమె ఉండి గ్రామములో నున్నది. సూర్యకాంతముగూడ చెన్నపట్టణము వచ్చెదనన్నది.

సూర్యకాంతమున కే కారణముననో శారదా నారాయణరావుల సంసార ప్రవాహము పుట్టకమునుపే నశించినసంగతి గోచరించినది. ఆమె కన్నగారి యెడగల ప్రేమబలమే యామె కా సంగతి గోచరింపజేసినది.

కావున శారద కాశీసంతర్పణకై కొత్తపేట వచ్చినప్పు డామెతో యథాలాపముగా జెప్పిన ట్లన్నగారి యద్భుతచర్యలు కొన్ని చెప్పినది. రాజమహేంద్రవరములో గోదావరిలో నిరువురు కాలేజీ విద్యార్థు లీతకు వెళ్ళినారట. నారాయణరావు గజీతగాడు. ఆ పరిసరములనే ఆత డీదులాడుచుండెను. ఇంతలో కాలేజీ విద్యార్థులలో నొకరు ఈదలేక మునిగిపోవుచు నొక్క కేక వేసెనట. నారాయణరావా కేక విని రెండు బారులలో నచ్చటకు నీదుకొనిపోయి, మునిగి యాబాలుని పట్టి, పైకితేల్చి నిముషంలో నొడ్డునకు తెచ్చి చేర్చెనట. ఆబాలుని పొట్టనొక్కి నీరుసడల్చి, యూపిరియాడునట్లు వైద్యము సల్పి, చలి మంట వేయించి, యా బాలుని నెత్తుకొని, రెండునిముషములలో నిన్నీసుపేటలో వైద్యముచేయు నొక వైద్యునియింటికి గొనివచ్చెనట. ఆ బాలుడు బ్రతికినాడు.

వేరొక పర్యాయము చెన్నపట్టణములో నొక పిల్లవాడు, ‘రైలు వచ్చుచున్నది పోవల’దని యందరు మందలించుచున్నను వినక పట్టాలు దాటు చుండ రైలువచ్చిపడినది. ఆ బాలుడు రైలు కింద పడిపోవువాడే కాని, ఆ చెంతనేయున్న నారాయణరా వొక్క అడుగున నురికి, ఆ బాలుని ఎత్తి యావలకు హనుమంతునివలె నొక్కగంతువేసెనట. లేనిచో నిద్దరును రైలుకింద పడి ముక్కలు ముక్కలయిపోయియుండువారే!

కొత్తపేటలో నొక నూతిలో ఒక యావు పడిపోయినదట. దాని నేవిధముగ దీసినను నడుము విరిగిపోవలసినదే, అది పోట్లావగుటవలన నెవ్వరు నూతిలో దిగుటకు సాహసించలేదు. నారాయణరావు చొరవచేసి దిగి, యడుగునుంచి తాళ్ళుపోనిచ్చి ముందుకాళ్ళదగ్గర వెనుక కాళ్లదగ్గర నడుముకు బగ్గములుకట్టి, పైకి తాళ్ళందిచ్చి యడుగునుండి సహాయము చేయుచు, ఆవును లాగివేసినాడట.

అన్నగారి సాహసకృత్యము లిట్టివెన్నియో శారదకు సూర్యకాంతము చెప్పినది.

‘వదినా! మా అన్నయ్య పూర్వం మనంవినే కథల్లో ఉండే రాజకుమారుడివంటివాడు. ఎంతమందికి సహాయం చేశాడు! మా నాన్నగారికి ఉంది ఎంతో బలం. మా నాన్న పోలికే మా అన్న. ఒకమాటు గోదావరి పొంగి ఒక ఊరు కొట్టుకుపోతే అందులో ఒక ముసలమ్మమాత్రం ఒక గుడిసెలో చిక్కడింది. పడవలు లేవు. గుడిసె మునిగేటట్లు ఉంది. మా నాన్న ఈదుకు పోయి ఆ ముసలమ్మనిబట్టి, నాలుగుమైళ్ళ దిగువకు గట్టుకు చేర్చాడట.’ ఆ రాత్రి తానును తన చిన్నక్కగారును గది నలంకరించినారు. శిల్పహృదయముకల నారాయణరావు చెల్లెళ్ళ మనిపించుకొన్నారు.

మనస్సులో గుబగుబమను భయముతో శారద యాడుబిడ్డలచే దల దువ్వించుకొని, తోటలోని పూవుల ముడిపించుకొన్నది. ఆ రాత్రి గదిలోకి బోవుట కామెకు గుండె దడదడమనుచునేయున్నది. కాని భర్తపై నంతరాంతరముల నెచ్చటనో కొంచెము కరుణ జనించినది. నారాయణరావు పదునొకండు గంటలకు వచ్చి పక్కపై పండుకొన్నాడు. శారదవచ్చి యక్కడున్న సోఫా నానుకుని నిలుచుండి భర్తను వాలుచూపులతో చూచినది. సూర్యకాంతము వర్ణించిన మహాభాగుడు, వీరోత్తముడు ఎదుట మంచముపై కరుణార్ద్రమూర్తియై వాలిపోవుట చూచి విచారముతో నా బాలిక కంపించినది. స్త్రీ పురుషసంపర్కము లేనిచో యేదైన కబురులు చెప్పుచు కూర్చుండిన సంతోషమగునేమో?

దేశయాత్రా విశేషముల నుపన్యసించు నా సభలో తనభర్త మహాప్రవాహము వరదలు కట్టించి, వాగ్ధార నామెను విచిత్రానందపూర్ణను జేసినది. భర్త స్నేహితుడగు పరమేశ్వరమూర్తిగారు ఎంత మధురముగ, గంభీరముగ మాట్లాడినారు! మనదేశమున నిన్ని వింతలుండునా? అవి ఎరింగి, అట్టి దివ్య ప్రదేశములకు బోవుటయు ఉత్తమ ప్రజ్ఞయే!

ఉపన్యసించునపుడు దివ్యమూర్తివలె, ఆయా కాలముల దేశమున చరించిన మహోత్తమ పురుషునివలె శారదకు నారాయణరావు దర్శన మిచ్చినట్లయింది.

ఆ సోఫాలో పడుకొని యాలోచించుకొనుచు నామె యట్లనే నిదుర కూరినది.

మరునాడు శారదయు, జమీందారుగారును, జమీందారిణియు, జమీందారుగారి యప్పగారును రాణ్మహేంద్రవరము వెడలిపోయిరి.

నారాయణరావు, రాజారావు భార్య పుట్టింటి గ్రామమగు రామచంద్రపురము బోయినాడు.

రాజారావునకు నిరువురు సంతానము. ఒక కొమరితయు, నొక కుమారుడును జనించినారు. రాజారావు భార్య సూరమ్మ మంచి సౌందర్యవతి. నెమ్మదిగల యువతి. అందరకు తలలోని నాలుక. అత్తమామల ప్రాణము, భర్తహృదయము సంపూర్ణముగ గుర్తెరిగి, అద్దానిని చూరగొనిన పతివ్రతా శిరోమణి.

రాజారా వమలాపురము నుండి రామచంద్రపురం వెళ్ళినాడు, నారాయణరావు రామచంద్రపురములో మిత్రుని గలిసినాడు.

సూరమ్మ నీళ్లాడిన తర్వాత రెండవరోజునుండి జ్వరము వచ్చుచున్నదట. మలేరియాకు, బాలింతజ్వరమునకు, రాజారావు ఇంజక్షను లిచ్చినాడు. చంటిపిల్లవాడు క్షేమముగ నున్నాడు. జ్వరము నూటఅయిదువరకు వచ్చుచుండుటచే రాజారావు తడిగుడ్డలు పొత్తికడుపుమీద వేయించెను. అత్తగారు వాతముచేయునేమో యని భయపడుచుండెను.

నాలుగురోజులలో జ్వరం నెమ్మదించినది. నెమ్మదించిన వెనుక రెండు రోజులుండి రాజారావు పథ్యము పెట్టించినాడు. నారాయణరావా ఆరు రోజులు మిత్రునిదగ్గరనే యుండి, అతనితో గ్రంథకాలక్షేపము చేయుచు, నాతనికి రెండవ ప్రాణమువలె నుండి తర్వాత కొత్తపేట వచ్చి చేరెను. పరమేశ్వరాదులు వెడలిపోయిరి.

కొత్తపేట వచ్చునప్పటికి హైదరాబాదునుండి రాజేశ్వరరావు వ్రాసిన యుత్తరము వచ్చినది.

‘నేనేమి చేసేది, నారాయణా! నాకూ మతిపోయింది. ప్రపంచంలో ప్రేమ లేదనుకున్నాను. స్త్రీ కీ, పురుషుడికీ ఒకరి దేహంమీద ఒకళ్ళకు కోర్కె కలగడమే ప్రేమ అనుకున్నా, ఇప్పడు నా సంగతి చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తూంది. నేను ఇదివరకు చక్కని బాలికలతో స్నేహంచేసి వారి మనస్సులు చూరగొన్నానుగాని, ఇదేమిటో నాకర్థం కాలేదురా.

‘అల్లా ఉంటూ ఉండగా, ఇక పుష్పశీలాదేవికి నేనంటే పిచ్చే! నిన్ను వదిలి ఒక్క నిముషం అన్నా ఉండలేను, నాకీ భర్త వద్దు’ అని మొదలు పెట్టింది. మొదట భర్తకావాలి, నేనూ కావాలి అన్నది. శ్రుతి మించి రాగాన్ని పడింది. ఇద్దరము ఇక విడిగా ఉండడం పడలేదు. కాబట్టి బయలు దేరివచ్చి ఈ హైదరాబాదులో మమ్మెవరూ పట్టుకోలేని మేడలో ఉన్నాము. మేమే నిజమయిన భార్యాభర్తలము. నీ స్నేహము వదలుకోలేను. నా యీ భార్యనూ వదలుకోలేను. నీ సదభిప్రాయం నాకు ఉండాలి. నీ కొక్కడికే నా అడ్రసు ఇస్తున్నాను. నాకు అవసరం వచ్చినప్పుడు వేయి రూపాయలవరకు నువ్వు ధనం సప్లయి చేయవలసి ఉంటుంది.

‘మా ఆనందం ఎవరికి కలుగుతుంది? నువ్వు నా మాట విను. శ్యామసుందరి నువ్వంటే ప్రాణం ఇస్తుంది. నువ్వు దేశాలు తిరిగినన్నాళ్లు నిన్ను గూర్చి నీ స్నేహితుల్ని ఎంత వాకబుచేసింది! ఇంక ఊరుకోకు.

‘పుష్పశీలా, నేనూ కలలోగూడ ననుభవించని మహదానందంలో ఓల లాడుతున్నాము. నేను హైదరాబాదు వచ్చేటప్పడు పదివేలరూపాయలు వసూలుచేసి తెచ్చుకున్నాను.

‘రెండు, మూడు సంవత్సరాలు యీ ఆనందంలో మునిగి తన్మయుడనైతేనే గాని నాకు తృప్తిఅవుతుందని తోచదు. అంతవరకూ ఇంక యేమి తల పెట్టను. ఆవల! తృప్తి అప్పటికీ తీరదూ, యెంతకాలమో అంతే. ‘ఆ సుబ్బయ్యశాస్త్రిని చూస్తే నాకు జాలి. అతను ఏంజేస్తాడు? అతన్ని పెంచిన సంఘాన్ని అనాలి. కాని, ఏదీ తెలియకుండా మా సమాజం చేరకూడదు. అది చాలా అపాయం.

‘ఇదివరకు సుబ్బయ్యశాస్త్రిని దగ్గరకు రానిచ్చేది కాదు. నా కొరకే వాడికి పై పై మోజులు చూపి మురిపించింది. అందుకు నన్ను క్షమార్పణ అడిగింది.

‘అహో నారాయణరావు! పుష్పశీల పువ్వుల కుప్పోయి. పుష్పాలలోని లాలిత్యమురా! నారాయణా! నన్ను నువ్వు అభినందించాలి. నేనంటే మీరందరూ ఉడుకుబోతుదనంగా ఉండాలి.

‘పరమేశ్వరుడి జన్మం, ఒక పెద్ద రాజీనామాసుమా. వాడిహృదయమూ వాడి జన్మమూ సౌందర్యం కోసం తపస్సు చేస్తూన్నవి. భార్యవల్ల వాడి కవి లభ్యంకాలేదు. వాడివరసచూస్తే శ్యామసుందరి పెద్దచెల్లెలితో ప్రాణ స్నేహము చేస్తున్నట్లున్నాడు.’

‘నే నెందుకు ఈలా రాస్తున్నాను? నాతోపాటు మీరందరూ ఈ మహోత్కృష్టమైన ప్రేమానందంలో మునిగిపోయి ప్రేమనిర్యాణం పొందాలి అని.’

ఇట్లు,

అభినవంద్యుడయిన ప్రేమదక్షుడు,

రాజీ


ఈ ఉత్తరం రాజీ ఒడలు తెలిసియే వ్రాసినాడా? నిజమైన ప్రేమతత్వం ఏమిటి? అది మానవునకు అనుభూతమగుటయెట్లు? తనకు దన శారదయన్న పరమ ప్రణయ మనుకొన్నాడు. ఆమె తన ఉపాస్యదేవత అనుకొన్నాడు, కాని, నక్కకు ద్రాక్షపండ్లవలె, ఆమె తనకైనది. ప్రపంచము తనకు మిథ్యయైపోయినది. తన్ను దేశయాత్రకు బనిపిన దా బాలికావిముఖతయేనా? ఆ పరమ సౌందర్యరాశి భర్తహృదయము నిట్లెంత కాలము ఱంపపుగోత పెట్టునో? ఒక వేళ నామె తన్నెప్పటికిని ప్రేమించనిచో తానేమి చేయవలయును?

సంఘముయొక్క దౌర్భాగ్యస్థితి యట్లున్నది. వివాహములు నిజముగా ఇనుపముళ్ళ బోనులా? ఒకసారి వివాహమయినచో, నది రద్దగుటకు వీలులేదు. పుష్పశీల ఏమిచేయవలెను? మనదేశమున వివాహములన్నియు పుష్పశీలా వివాహములేనా?

౧౩ ( 13 )

మదరాసు కాపురము

నారాయణరావు చెన్నపట్టణమున గాపురము పెట్టినాడు. మైలాపురిలో మంచియిల్లద్దెకు దీసికొని, రెండువేల రూప్యములుపెట్టి న్యాయశాస్త్ర గ్రంథములు, హైకోర్టుతీర్పులు నాతడు కొనెను. ఇల్లంతయు బరమేశ్వరుని సహాయముతో నలంకరించెను. మామగారి యింటిలో నుండనని యాతడు దెలిపినాడు. సూర్యకాంతమును, పెత్తల్లి కుమార్తె బంగారమ్మను గూడ గొనివచ్చెను.

అడ్వకేటు నారాయణరావుగారు న్యాయవాదవృత్తి ప్రారంభించినారు. ఇంటిలో ముందు నారాయణుని కార్యాలయము. నాలుగు బీరువాలలో న్యాయశాస్త్ర గ్రంథము లున్నవి. ఖద్దరు రంగుదుప్పట్లు పరచిన బల్లలు, సోఫాలు, కుర్చీలు నున్నవి. మందిరమంతయు నీలధూసర వర్ణములచే నలంకరింపబడినది.

ప్రక్క గుమాస్తాగదియు, వెనుక రహస్యాలోచనపు గదియు నలంకరించినారు. ఆ వెనుక ఆడవారుండు స్థలమున్నది. దాని వెనుక విడిగా వంటయిల్లున్నది. వంటయింటిలోనికి బోవు మార్గమునకు, బైన గప్పును అమర్చినారు. నారాయణరావు న్యాయవాదవృత్తియందలి మెలకువలు నేర్చుకొనుటకు, వృత్తియందనుభవము సముపార్జించుటకు, నొక పెద్దవకీలుకడ జేరినాడు. నారాయణరావు బి. ఎల్. పరీక్షలో మొదటివాడుగా కృతార్థుడైన సంగతియు, తక్కిన పరీక్షలన్నిట మొదటివాడుగా జయమందిన సంగతియు నా వకీలునకు దెలియును. రెండుమూడు అప్పీళ్ళలో బనిచేయుమని చెప్పినప్పడు నారాయణరావు జయరామయ్యగారి హృదయమున నద్భుతము నిండునట్లు పనిచేసి, యాయన చేతికిచ్చినాడు. ఒక అప్పీలులో నాయనగూడ తెలిసికొనజాలని యొక విషయము పట్టుకొని అప్పీలు వాదమునకు బలము చేకూర్చినాడట. జయరామయ్య, ముందు ముందీ బాలుడు హైకోర్టులో ముఖ్య న్యాయవాదియై, న్యాయ సింహాసనముకూడ నధిష్ఠింపగలడని యనుకొనెను.

అన్నగారు శ్రీరామమూర్తి పంపిన చిన్న అప్పీళ్ళు రెండు తయారుచేసి దాఖలు చేసినాడు. న్యాయవాద ప్రముఖుడగు జయరామయ్యగారు తాను దగ్గర నుండి నారాయణరావు నొక చిన్న అప్పీలు వాదించుమన్నారు. నారాయణరావు బాగుగా నా యప్పీలు వాదించుటకు సిద్ధపడియే వచ్చియుండెను.

న్యాయమూర్తియు నీ బాలకుని వాదన యెట్లుండునో చూచెదముగాకయని, నారాయణరావునకు ననుమతి యొసంగెను. పదినిముషములలో నాచిన్న యప్పీలు, విషయనిర్ధారణచేసి. పరస్పర సంబంధము చూపి, విషయములను బలపరచు న్యాయశాస్త్రమున బూర్వపు దీర్పులనుజూపి, వాదము ముగించి కూర్చుండెను. న్యాయప్రభువును ఆ బాలుని చమత్కృతికి, భాషకు, విషయ నిర్ధారణప్రజ్ఞకు జాల మెచ్చుకొన్నాడు. ఇతర న్యాయవాదులయినచో నరగంటలో దేల్పజాలని యాయప్పీలు పదినిముషములలో ముగించినాడు. ఎదిరి వకీలు వాదమునకు నలుబదియయిదు నిముషములు పట్టినది. ఆతని వాదన పేలవమై తోచెను. నారాయణరావు గొంతుక గంభీరమయినది. దానికి తగినట్లు దివ్యోత్తమాంగుడు. ఎక్కడెక్కడి విషయములు కరతలామలకముగ గ్రహించగల మహామేధావి. ఎదిరి న్యాయవాది చేసిన అడ్డువాదనను అయిదు నిముషములలో ఖండించి కూర్చున్నాడు నారాయణరావు.

తత్‌క్షణమే న్యాయమూర్తి నారాయణరావు పక్షమున దీర్పు జెప్పినాడు. గురువుగారగు జయరామయ్యయు నితర న్యాయవాదులును నారాయణరావు నభినందించిరి.

న్యాయశాస్త్రములో, న్యాయవాదములో నెంత మునుగుదమన్నను మనస్సేమియు నెక్కుటలేదు. తాను బాగుగా పని చేయుచున్నట్లు కనబడుటకుగాను జయరామయ్యగారి యింటికడ నపరిమితావేశముతో, మంచినిపుణతతో, ఓర్పుతో బనిచేయును. ఇంటికడ కలతనొందుచు, కలలలో మునిగిపోవును.

కలలు! కలలు! ఏ కలగన్న నాకలలో నెచ్చటనో శారద ప్రత్యక్షమగును. ఇదివరకు బండుకొనుట తడవుగ నిద్రపట్టునది నారాయణునకు. ఇపుడు గంటయు, రెండుగంటలు స్వప్నప్రపంచములో నివసింపవలసివచ్చు చుండెను, నాతిగల బ్రహ్మచర్యము! శారదకు బ్రేమకుదురునో కుదురదో? కుదురనిచో దన కర్తవ్యమేమి? ఒకవేళ భార్య అన్యాసక్త కాదుగదా! నిజమైన కర్మయోగి పవిత్రకాలమున నొక పుత్రుని, పుత్రికను గనవలెను. భార్యనైనను మోహమున దాకగూడదు. అది మహాదోషము. తా నా విధమున నుండలేనప్పుడు దోషమగునుకదా! తన భార్యయే అట్టిదోష మాచరించుచుండ దాను సహించవలసినదేనా?

ఇది చిన్నతనములో వివాహము చేయుటవలన నైన దోషమా? వైద్యశాస్త్రము బాలికకు పదునారవయేట బెండ్లి యుక్తమేనన్నది. కొందరి కా యీడున హృదయము వికసించకపోవచ్చును. ఇంతకు భార్య పరపురుషు నాశించినచో దన కర్తవ్యమేమి? తన హృదయాంతరమున నామె యట్లాశించుట దోషమనియే తోచుచున్నది. ఇతరులు దోషమాచరించుచుండ వారి నా మార్గమునుండి త్రిప్పగలవా రుపేక్షింపరాదు. ఒకరిమోక్షమున కొకరు కారణమగుట కలదేని, యొక్క గురువునకుమాత్రమే యట్టిపని శక్యమగును. తాను శారదకు గురువా? ధర్మశాస్త్రము భర్తకు గురుస్థానము చెప్పినది. నిజమే. తన భార్యయెడల దనకట్టి యర్హతకలదా?

తెలిసీ తెలియని ధర్మవిచార మొకప్రక్క, భార్యపై తనకున్న పూర్ణ కాంక్ష యొకప్రక్క ‘నాతో కాపురం చేయడం ఆమెకు కష్టం, కంటకం, దుర్భరం. ఆమె నాయింటిలోనుండ నా ప్రేమ విజృంభించిపోతూవుంటే నా మనస్సుతో యుద్ధంచేస్తూ, ఆ బాలికను ముట్టకుండ అసిధారావ్రతం చేయడం మరీ కష్టము.’ ఏది ఎట్లయినను శారద తనయింటికి రాకుండుట యుత్తమము. అట్లయినచో నా బాలికను రక్షింపవలసిన తన కర్తవ్యము నెరవేర్చుకొనుట యెట్లు? తనతో కాపురము చేయుచుండ గ్రమముగా భార్యకు దానన్న ప్రేమ కలుగదా?

వనిత యొక పురుషునిగాని, పురుషుడొక వనితను గాని ఒకసారి ప్రేమించినచో జన్మాంత మయ్యది యట్లుండవలసినదేకదా? అట్టిచో పర పురుషానురక్తయగు శారద కా ప్రేమ నశించి తనపై మరల ప్రేమ కలుగుట యెట్లు? ఒకవేళ తనపట్ల అయిష్టమే కాని, యితరునిపై నామెకు ప్రేమ లేదేమో? అట్లగుచో నా బాలికను ప్రసన్న నొనర్చుట తగునుగాని, నీ దారి నీవు చూచికొమ్మని వదలి వేయుట తనకును నామెకును హానియే. కావున తన కడ కామెను తీసికొనివచ్చుటయే కర్తవ్యమగును.

ఈ యాలోచనలతో నిదురపట్టక విద్యుద్దీపము వెలిగించుకొని, పుస్తక మేదియో చేతనుంచుకొని, ఎదుటిగోడపై పరమేశ్వరుడు చిత్రించిన యొక చిత్రఫలకముపై జూపులు నిలిపి, అన్యమనస్కుడైయున్న యన్న గారికడకు, సూర్యకాంతమువచ్చి, ‘అన్నయ్యా! ఏమిటి ఆలోచిస్తున్నావు? నాకొక్క దానికీ ఏమి తోచడంలేదు. అవును గాని, అన్నా! దబ్బున వదిన్ని తీసుకురావూ? ఇద్దరం ఎంతో స్నేహంగా ఉంటాం, అన్నయ్యా’ అన్నది. ఆ ముద్దరాలి పలుకు శ్రుతిగా గ్రహించి నారాయణరావు చెల్లెలిని దగ్గరకు దీసికొని, యామె కన్నుల కనుంగొని ‘సూరీడూ! నీ కడుపంతా ప్రేమమ్మాతల్లీ! రామచంద్రరా వదృష్టవంతుడు’ అనెను. సూర్యకాంతం నవ్వుకొనుచు ప్రక్కగ నిలుచున్నది. ఇంతలో నామె నగుమోమునందు విచార మేఘములవరించినవి. కళ్ళనీరు తిరిగినది.

‘తల్లీ! రామచంద్రరా వెప్పటికప్పుడు జాబు రాస్తున్నాడా లేదా? మా అందరికన్నా విద్యావంతుడూ, ప్రయోజకుడూ అయి ఇంకో ఆరు నెలలకివచ్చి వాలుతాడమ్మా!’ అని ముద్దుచెల్లెలి నూరార్చెను.

నారాయణుడు సూర్యకాంతమున కెప్పటికప్పుడు రామచంద్రుని కబుర్లు చెప్పుచు, నాతని కామెచే నుత్తరములు వ్రాయించుచు, నామెకు ధైర్యము గొలుపుచుండెను. నారాయణరావు కోర్కెవలన రామచంద్రరావు తన ఛాయాచిత్రములు, నాలుగునెలల కొకటి తీయించుకొని పంపుచుండెను. సూరీడు అనేకవిధముల దీయించుకొన్న తన ఛాయాచిత్రము లాతనికి బంపుచుండును.

పాశ్చాత్యవిద్యాపండితుడై, పడమటిదేశములనుండి వచ్చినవాని భార్య పాశ్చాత్య విద్యలలో బ్రవీణురాలు కావలయునని, కొత్తపేటలో నొకగురువు నేర్పరచి సూరీడుకు విద్య చెప్పించినాడు చిన్నన్నగారు. తాను వెళ్ళినప్పుడెల్ల నామెకు నాంగ్లభాష గరపుచుండెను. ఆమె యేగ్రంథమైన ధారాళముగ చదువ నేర్చుకొన్నది. రామచంద్రరావు వచ్చునప్పటికి సూర్యకాంతమును బ్రవేశపరీక్షకు బంపవలెనని నారాయణరావు యత్నించుచుండెను.

శారదకన్న సూరీ డొకయేడు చిన్న. రామచంద్రరావు నారాయణరావు కన్న చిన్న. సూరీడు యౌవనవతియైన నాటినుండియు నేపుగా నెదుగుచున్నది. సూరీడు మోము రాజపుత్రబాలిక మోమువలె నుండును. ఆమెకళ్ళు కాటుక కండ్లు. గంభీరమైన మోము. మోమున రేఖలు లాలిత్యమును, అంతకన్న స్ఫుటత్వమును, సుందరతను దాల్చినవి. సూరీడు మోము చూచినచో రాజ్యము లేలగల వీరాంగనలు స్ఫురించెదరు. రుద్రమదేవి, విమల, అహల్య, ఝాన్సీ లక్ష్మీబాయి, చాందిబీబీ మొదలగు వా రామె వదనాన బ్రత్యక్షమయ్యెదరు, అయినను ఆమె హృదయము, జీవితము ప్రేమచే, గరుణచే నిండి మధిత నవనీత స్నిగ్ధమై సౌందర్యార్ద్రమై యుండును.

ఆమె పెండ్లినాటినుండి రామచంద్రరావును దన జీవితమునకు కథానాయకుని జేసికొన్నది. ఆమె ప్రేమించినను, గోపించినను, సంతోషించినను, అసహ్యపడినను అన్నియు గంభీరప్రవాహమువలె ప్రవహించవలసినదే! ఆమె భావములకు లఘుత్వము లేదు. చిన్నతనమునుండి తండ్రి చెప్పిన కథలన్నియు, నామె మనమున హత్తుకొనిపోయినవి. శ్రీమతి భండారు అచ్చమాంబ గారు రచించిన ‘అబలా సచ్చరిత్రరత్నమాల’ చదువుకొన్నది. ‘భారతీ’, ‘శారద’ మొదలగు మాసపత్రికలు చదువునది. ఆమె లేతభావములలో, బాలికాహృదయములో, రూపొందిన యాశయములలో యన్న గారియందువలె దేశసేవాసక్తి తలయెత్తినది. భరతమాత పే రామెకు పుల్కరింపు. ప్రతిసభకు తల్లిదండ్రుల యనుమతిని తల్లితోడనో, యక్కగారితోడనో జనునది.

ఇంటిదగ్గర చేయనవసరము లేకున్నను పై పనుల నన్నింటిని నిముషమున జేయుచు, పుస్తకముల జదువుకొనుట యామె కిష్టము. కష్టపడి వీణ వాయించుట నేర్చుకొన్నది. దానియందు తగుమాత్రము కౌశల్య మేర్పడినది. అయినను పట్టుదలతో నేర్చుకొన్నది. ఇరువది త్యాగరాయకృతులు, హిందీ పాటలు, నండూరి సుబ్బారావు గారి యెంకిపాటలు, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి పాటలు, అభినవాంధ్రకవిత్వ జనకుడగు గురజాడ అప్పారాయ విరచితములగు పాటలు, విశ్వనాథ సత్యనారాయణ మహాకవి పాటలు నేర్చుకొన్నది. గొంతుకలో సమమైన ఒదుగు, అత్యంతమాధుర్యమును కలదు. రెండును ఏకమై అపారమై, తేనె వాకలు కట్టును.

తన జీవితము భర్తృప్రీతిపాత్రముగ మార్చుకొనవలయుననియు, నతని హృదయ మానందమున నోలలాడించవలయుననియు దనకే తెలియని దీక్ష బూనినది. బొమ్మలు వేయుట పరమేశ్వరునికడ నేర్చుకొన్నది. పార్శీబాలిక బోలి, గుజరాతీ వనితవలె, మహారాష్ట్ర యువతివలె నలంకరించుకొనుట నేర్చుకున్నది.

అన్నగారితో దనకు పియానోవాద్యము నేర్పించమని యన్నది. అమెరికానుండి వచ్చు భర్తకు కొన్ని ఇంగ్లీషుపాటలు పాడి వినిపించినచో, నెంతయో యానంద మొనగూడునని సిగ్గున నామె యాలోచించుకొన్నది.


౧౪ ( 14 )

రామచంద్రుని విద్యార్థిదశ

హార్వర్డు విశ్వవిద్యాలయములో భారతీయ విద్యార్థు లొక వసతిగృహ మేర్పరచుకున్నారు. అందు రామచంద్రరావును జేరినాడు. అమెరికాలో నిరుపేద, హిందూదేశమున భాగ్యవంతుడు. భారతీయు లమెరికాలో జదువవలెనన్న మిక్కిలి భాగ్యవంతులు కావలెను. కాబట్టి భారతీయ విద్యార్థులు తమ దేశపు సన్యాసులవలె మితాహారమాత్రతృప్తులై అమెరికాలో జీవించుచుందురు. వారందరిలో రామచంద్రరావెక్కువ ధనము వెచ్చించుచుండెను.

అమెరికాలో భారతీయులను హీనముగ జూచువా రున్నారు. విచిత్ర జంతువులుగ జూచువారున్నారు. ఆధ్యాత్మికదృష్టి ప్రపంచమునకు నేర్పునట్టి శక్తిగల దివ్యదేశమునకు జెందిన యుత్తమపురుషులుగ జూచువారున్నారు.

రామచంద్రరావు సెలవుదినములలో నమెరికా దేశమంతయు జూచుటకు బోవువాడు. అచటి విహారవనములు, నదీపాతములు, లోయలు జూచివచ్చెను. పెక్కు కర్మాగారములు, పరిశ్రమ మహాప్రపంచములు సంచారమొనర్చెను.

ఎఫ్. ఏ. ఇంగ్లీషులో కృతార్థుడు గాకున్నను, లెక్కలలో ఆంధ్రవిశ్వవిద్యాలయమునందు ప్రథముడుగ గడతేరినాడు. అమెరికా వచ్చినవెనుక హార్వర్డు విశ్వవిద్యాలయమునందు లెక్కలలో నాతని మేధాసంపన్నతకు మెచ్చి ఇంగ్లీషు భాషాపరీక్షకు జదువవచ్చునని బ్రత్యేకముగ ననుమతి యొసంగిరి. ఇంగ్లీషుభాషలో నెగ్గుట కారునెలలు పట్టినది. రామచంద్రరావు ఈలోన బి. ఎస్ సి ఆనర్సులో జేరి చదువుటకు అధికారులు ప్రత్యేకానుమతి నొసంగిరి. లెక్కలలో, పదార్థవిజ్ఞానశాస్త్రములో నమెరికా విద్యార్థి ప్రపంచమున నాతనికి సమానులు డి. ఎస్‌సి. క్లాసులోకూడ లేరట.

రామచంద్రరావువచ్చి రెండేండ్లపై నాఱునెలలు అయినది. రెండేళ్లలో నా యువకుడు లెక్కలలోజూపిన తెలివితేటలు మిక్కుటము. అతనికి దెలిసిన కొన్ని లెక్కలవిజ్ఞానము ప్రపంచములో గొందరికిమాత్రమే తెలియును. ఈతడు జవాబుగోరి ప్రచురించిన గణిత ప్రశ్నలకు జవాబిచ్చువారు కనబడక పోయినారు. గణితాచార్యు డాత డన్న మంచి గౌరవము చేయును. ప్రేమమున నాతని ముంచెత్తును. అతనికి ఎం. ఎస్‌సి. బిరుదము నిచ్చుట కింకను ఆరు నెలలు వ్యవధియున్నది.

ఈ రెండేళ్ళలో రామచంద్రరావు, రౌనాల్డుసన్ దంపతులను దర్శించుటకు స్నేహితురాలగు లియొనారాతోగలిసి వెళ్ళుచుండును. రామచంద్రరావును లియొనారాయు హార్వర్డు విశ్వవిద్యాలయములోనే చదువుచుండుటచే వారమున కొకసారియైన గలసికొనుచుందురు. లియొనారా రామచంద్రరావుల స్నేహము నానాటికి వృద్ధినందినది.

లియొనారాకన్యక నెమ్మదిగా రామచంద్రునిపై సోదరునికన్న నెక్కువ ప్రేమము జూప నారంభించెను. అది పురుషుని వాంఛించు ప్రేమయని యామె గ్రహింపలేకపోయినది. రామచంద్రరావెన్ని విశేషములనో జెప్పువాడు. భరతదేశమును బొగడువాడు. వేదాంత సారమునుగూర్చి యేదియో మాట్లాడువాడు. ఆమె తన స్నేహితురాండ్రను గొనివచ్చి రామచంద్రరావునకు వారితో బరిచయము కలుగజేయుచుండునది. రామచంద్రరావునకు నాట్యము నేర్పుచు నాతనితో నత్యంత స్నేహమై వదలకుండునది.

‘రామ్, మా అమెరికను బాలకులవలె, మీ భారతీయు లాటలాడ రేమిటి?’

‘నారా! మీరు సంపూర్ణస్వతంత్రులు. అడుగడుగున మీ రగౌరవము పొంద నవసరములేదు. మీస్వాతంత్య్రము, మీ అభివృద్ధి, మీకున్న గౌరవము ప్రపంచముననే దేశమున కున్నది? స్వతంత్రములేనప్ప డమెరికాకున్న స్థితి యేమిటి? నేటికి నాటికి హస్తిమశకాంతరము భేదమున్నది. నేడు కెనడావలె నుండవలసిన దేశము, దేశము లన్నిటికన్న మిన్నయై, ప్రపంచమునకు షాహుకారై, యుద్ధపరిశ్రమలో ముందంజయై విజృంభించి, ముఖ్యమైన పరిశ్రమలకు వ్యవసాయములకు ప్రథమదేశమై యొప్పారుచున్నది. మీవలె మాకు ఇట్టి సంతోషకారణము లేదు. ఇది ఒకటి. రెండు, మా దేశములో ప్రబలిన మెట్ట వేదాంతము మమ్ము పురుషకారహీనులైనజడులను చేసివైచినది. మేము వెనుకటి వారమూ కాము, ఈ కాలములోనూ లేము.’

‘నువ్వు మాట్లాడినదంతా అధీరత సూచిస్తూ ఉన్నది. ఆంగ్లేయులు మీ దేశము ఆక్రమించడం ఉత్తమం అని నా అభిప్రాయం.’

‘అది నిజమే చెల్లీ! ఏ మహాచక్రవర్తి కాలంలోనో దేశం అంతా ఏకచ్ఛత్రాధిపత్యం క్రింద వచ్చినా, ఆ రాజు పోవడంతో, మళ్ళీ దేశం ముక్క లయ్యేది. అంటే దేశంలో సంయోగశక్తి కన్న వియోగశక్తి ఎక్కువ ఆవరించి యుండు స్థితికి వచ్చింది. కాని బలవంతులగు ఆంగ్లేయులు మా దేశం ఆక్రమించుకొనడంచే అన్ని ఉపజాతులవారము, అందరము ఒకటిఅయ్యాము, ఇంకా కావాలి. అంతవరకూ ఆంగ్లదేశస్థులు మా దేశంవదలి వెళ్ళరు.’ ‘అవును, నువ్వు చెప్పింది నిజమే అన్నా! చూశావూ! అమెరికా మొదట చిన్నచిన్న రాజ్యాలుగా ఉంది; ఫ్రెంచివారు, ఇంగ్లీషువారు వారిలో వారు యుద్ధం చేసుకున్నారు చాలాకాలం. అలాంటిది అమెరికా ఇంగ్లండుతో విరోధించి తిరగబడినప్పుడు అందరూ ఏకమయ్యారు. కెనడా ఇంగ్లీషువారి కింద ఏకమయింది. ఫ్రెంచివారూ ఇంగ్లీషువారూ ఏకమయ్యారు. అల్లాగే దక్షిణఆఫ్రికాలో ఆంగ్లేయులకూ డచ్చివారికీ సంయోగం కలిగింది.’

లియోనారా రామచంద్రరావుల స్నేహము నానాట గాఢమాయెను. లియొనారాబాల వచ్చి సోదరప్రేమ వెల్లిగొన రామచంద్రుని యొడిలో గూర్చుండి యాతనికి ముద్దులిచ్చును. మొదట నామె యట్లుచేయుట రామచంద్రునికి చాల సిగ్గజనింపజేసెడిది. కాని యందు కలవాటుబడినాడు. రానురాను రామచంద్రునకు లియొనారా తనచెంత నున్నంతసేపును పరమ హర్షముగ నుండెను. ఆమె సంభాషణ యాతని మనఃపథము వికసింపజేసెను. నానాదేశముల వార్తలు వారు చర్చించుకొనువారు. ఒక్కొక్కప్ప డామె తండ్రియు వారితో జేరువాడు.

రామచంద్ర రా వమెరికా వచ్చిన కొన్ని నెలలవరకు లియొనారాకుగాని, యామె తలిదండ్రులకుగాని, తనకు వివాహమైనదని చెప్పుటకు సందేహించుచుండెను. తర్వాత నొకనాడు తన కంతకుముందే మూడేళ్ల క్రింద వివాహమైన దనియు, తన భార్య ఛాయాచిత్రము తన బావమరది యగు నారాయణరావు పంపినాడనియు దెల్పెను. వారంద రాశ్చర్యపూరితులైరి.

అప్పడు వారందరు సూర్యకాంతము చిత్రము చూచినారు. నారాయణరావు మంచి ఛాయాచిత్రకారునిచే దీయించి పంపిన ఆ చిత్రఫలకములో సూర్యకాంతము చక్కని భంగిమములో ప్రత్యక్షమైయున్నది. రౌనాల్డుసన్ రామచంద్రుని చూచి ‘రామచంద్ర! మిస్ మేయో చెప్పినట్లు అతిబాల్య వివాహములు మీలో నున్నవన్నమాట!’ అని యనెను.

రామ: ఆ! ఉన్నవి. మేయో చెప్పినవి ఇంకా చాలా నిజమైనవి ఉన్నవి.

రామచంద్రునికి తన దేశము నెవరైన కొంచెము నిరసించినట్టు తోచినచో జివ్వున కోపము, విషాదము సంభవించును. పరదేశమున నుండుటచే వానిని జంపుకొని మాట్లాడును. అప్పు డాత డెంతయు విచారమునబడితప్తుడైపోవును.

రౌనాల్డుసన్: మూడునెలల బాలలకు, మూడు నెలల బాలురక వివాహములు జరుగుచున్నమాట నిజమేనా?

రామ: అవును. అక్కడక్కడ కొన్ని అలాంటివి జరుగుచుండును, కాని చాల సకృతు.

రౌనా: అది చాలా విచారకరమైనది కాదూ? రామ: మీ దేశంలో అంతకంటే విచారకరమైనవి జరగడం లేదంటారా?

రౌనా: అనను. కాని చూడు, మా ఉద్దేశంలో ప్రపంచానికి నాగరికత నేర్పింది భారతదేశము. అటువంటి దేశము నేడిట్లు అథోగతిపాలైంది అంటే మా కెంత విచారంగా ఉంటుందో ఆలోచించు.

రామ: నిజమే, హీనస్థితిలో మానవుడికి అన్నీ దుర్బుద్ధులు పుట్టుతూ ఉంటాయి. కాని ఈ నాటికీ మా వివాహములు మంచివా, మీ వివాహములు మంచివా యన్న సంగతి నిర్ధారణ కాలేదు. జడ్జి లిండ్‌సేగారు వ్రాసిన వ్రాతల్ని చూశారు గాదా?

రౌనా: అతడూ మేయోవంటివాడే!

రామ: గాంధీమహాత్ముడు చెప్పినట్లు ఇద్దరూ పాయికానా పనిచేసినారు అనుకోండి. అది అవసరమే కాని లిండ్‌సే వ్రాతయంతయు యధార్థ కథనమైనను, అతడు తేల్చిన పర్యవసానంమాత్రం తప్పు అయిఉండవచ్చును. మేయో వ్రాసిన వ్రాతలు ఒకటి రెండు అంశాలు తప్ప తక్కినవన్నీ శుద్ధ అసత్యాలు. నీచమైన భావాలతో కూడివున్న ఆ చెడువ్రాత మా దేశానికి విరోధులు వ్రాయించారు ఆమెచేత.

లియొనారా యీ సంభాషణ యేమియు వినుటలేదు. ఆమె రామచంద్రుని చుట్టూ కల్పించుకున్న కథ కొంతవరకు కూలినది. ఎందుకు దానిట్లు మనస్సున కుంగిపోవుచున్నదో యామెకు తెలియదు. ఈ హైందవ యువకునకు, దనకు సంబంధమేమి? దేశము కాని దేశము విద్యకై వచ్చినాడు. తాను, తన కుటుంబము ఆ బాలుని చేరదీసినారు. సద్గుణములు కలవాడు, ఉత్తమ భారతీయ కుటుంబమునకు జెందినవాడు అని కదా?

అప్పుడా బాలికకు దా నీ బ్రాహ్మణ యువకుని ప్రేమించుచున్నానా యని లీలగా ననుమానము తగిలినది. లోన నణగియున్న రహస్య భావములన్నియు పైకిదేలి, యామె మనోనేత్రమునకు గోచరించినవి. ఈ యువకునకు వివాహము కాకయుండినచో, దా నాతని వివాహమాడి, యాతనితో భారతదేశమునకు బోయి, ఆ దేశమునకు ప్రేమనిధానపు కోడలై, యా దివ్యభూమిలో పెరుగుచు, ఆ మాత పరమపవిత్ర రహస్యాలలో భాగము పంచుకొనగోరినది. ఆ బాలికయు నా దేశమున సౌందర్యవతియే. పరిపూర్ణయౌవన, పరిమళార్ద్రమధురగాత్రి. ఏది యెట్లయినను రామచంద్రరావు తనవాడు. ఆ బాలకుని ప్రేమ యెట్లుండునో? భారతీయుల ప్రేమ యుద్వేగమయినదట. అతివిచిత్రమైనదని స్నేహితురాండ్రనుకొను మాటల యర్థము తెలియలేదు. తనచుట్టు జుమ్మని తేనెటీగల రీతి దిరుగు నమెరికను యువకులంద రొకవిధముగనే కనుపింతురు. రామచంద్రుడు తనయెడ సంచరించు విధమే వేరు.

వారందరు తనతో నాటపాటలనుగూర్చి ఎక్కువగను, శాస్త్రములను గూర్చి తక్కువగను ప్రసంగింతురు. వారు పరదోషాన్వేషణపరులు, కవిత్వ చిత్రలేఖనములను గూర్చి వారు మాటలాడునపుడు బేలవముగానుండును. రామచంద్రుడు మాటలాడినపు డెంత సాధారణవిషయమైనను ఏదో యద్భుతమగు లోతులు కలిగియుండును. ఏదో విచిత్రపుదృక్పథము నాతడు చూపును. ఇది యంతయు నా బాలకునిపై దనకుగల ప్రేమప్రభావమా? లేక భారతీయులలో నది సహజమా? తన శీలము చెడకుండ నీ బాలుని వలచి, వలపించి, ప్రేమ ప్రవాహ రహస్యములు గ్రహించవలయునని లియొనారా తలంచెను. రామచంద్రుని ముఖము దీక్షగా గమనించుచు నట్లనే యాలోచనానిమగ్న యగుచుండును.

రౌనా సతి: రామచంద్రా! మా దేశస్థులు హిందూదేశం అంటే పులకరింపులు పొందుతారు. ఇంగ్లీషువారి చేతుల్లోంచి మీరు తప్పించుకు వెళ్ళకూడదు అని అనుకుంటారు. కొందరికి హిందూదేశం పాడైపోతుందని భయం. కొందరికి ఇంగ్లీషువారికి నష్టం వస్తుందని భయం. చాలామంది అమెరికనులకు హిందూదేశము స్వతంత్రత సముపార్జించుకోవాలనిన్నీ, ఇప్పుడు గాంధీమహాత్ముడు మొదలిడిన యుద్యమం క్రైస్తవధర్మయుతమైనదనిన్నీ, ఆంగ్లహృదయమును జూరగొని వారికి తమ చర్యలు తప్పని తోపింపజేసి, ఆంగ్ల సామ్రాజ్యములోనో, వెలుపలనో వారితో స్నేహముగా ఉండడం ఉత్తమమని అనుకుంటున్నారు. గాంధిగారి బోధలే యీ మార్పుకు కారణం.

రౌనా: ప్రియా! ఎంత చక్కగా విపులపరచి చెప్పినావు! మా అందరి ఉద్దేశం అదే. రామచందర్! గాంధీగారి మార్గమే ఉత్తమమైనది. ఆంగ్ల పరిపాలకుల నేమాత్రము ద్వేషించక వారి ప్రాణమే మనప్రాణ మనుకొని వారి హృదయము మార్చుటకు తలచిననాడే మీరు నెగ్గిపోయెదరు.

౧౫ ( 15 )

'గురువు వెదుక్కుంటూ వస్తాడు'

నారాయణరావుకును, శ్యామసుందరీదేవికిని రానురాను స్నేహము గాఢమైనది. వీలయినప్పుడెల్ల నాత డా బాలిక గృహమునకు బోయి సంగీతముగూర్చి మాట్లాడుటయో, సంగీతము వినుటయో, వినిపించుటయో చేయుచుండును. శ్యామసుందరీదేవితో మాట్లాడినప్పుడు చెల్లెళ్ళు ముగ్గురు నెమ్మదిగా నచ్చట నుండి మాయమగువారు.

‘చెల్లీ! సంగీతములో నెన్ని స్వరములనైన కల్పించవచ్చును. కాని పాశ్చాత్యులును, మనమున్ను గూడ పన్నెండు స్వరాల్ని మాత్రం గ్రహించాము. పన్నెండింటికి మించినవి కొద్ది తేడాలుమాత్ర ముండును. కాబట్టి సర్వస్వరములు పన్నెండు స్వరాల్లోనే యిముడుతున్నాయి. తక్కినవి సూక్ష్మములు.’ ‘ఒక్కొక్క స్వరానికి మూడు నాలుగు శ్రుతులుంటాయికదా అన్నగారూ?’

‘అవునమ్మా. కాని శ్రుతియొక్క ధ్వని అతిసూక్ష్మము. శాస్త్రవిధానాన రచితమైన యంత్రసహాయాన్ని ఆయా శ్రుతుల్ని వినగలం. అంతే. మూడు నాలుగు శ్రుతులు కలిసి వినబడిన మొత్తపుధ్వని ఒక స్వరం అవుతుంది.’

‘అయితే అన్నగారూ! మన సంగీతానికి పాశ్చాత్య సంగీతానికి ఏమిటీ తేడా అంటారు?’

‘ఏమున్నదమ్మాతల్లీ! కాకలినిషాదం ప్రతిమధ్యమము చతుశ్రుతి ధైవతములు అపశ్రుతులట. అయినా పాశ్చాత్యులు రెంటినీ ఉపయోగిస్తారు. మన వాళ్ళు ఏదో ఒకటేరాగంలో వాడ్తారు. అంటే అసలు ముఖ్యమైన కిటుకు పాశ్చాత్య సంప్రదాయంలో శ్రుతికి, అపశ్రుతి కలిగించి, ఆ అపశ్రుతికి, శ్రుతికి, సమీకరణం చేసే స్వరాలు మధ్యమధ్య రానిస్తూ రెంటికీ శ్రుతి కలిపిస్తుంటారు. అందుచేతనే వట్టి స్వరకల్పనలో భావనిర్థారణ చేస్తామంటారు.’

‘పదార్థవిజ్ఞానశాస్త్రం ప్రకారం స్వరస్వరూపం, శ్రుతిస్వరూపం మీరు బాగా చదివినారుకదా, స్వరం నుంచి స్వరం చటుక్కున గంతువేసి వెళ్ళుతుందా? లేక ప్రవహించి వెళ్ళుతుందా?’

‘పెద్దప్రశ్న అడిగినావు చెల్లీ! ఇప్పటికి ప్రసిద్ధ శాస్త్రజ్ఞులుకూడా ఆ అనుమానం నివర్తించలేకుండా ఉన్నారు. స, రి, గ, మ అని మనం స్వరములు పలుకుతాము. ‘స’ కీ ‘రి’ కీ ఉండే సంబంధం యేమిటి? ‘స’ లో నుంచి ‘రి’ వస్తూందా? ఈలాంటి అనుమానాలు. కాని నెమ్మదిగా గవాయిపద్ధతిగా పాడితే ‘స’ నుంచి ‘రి’ కి గంతువేసినట్టుగా ఉండదు. ఇంతకూ నా అభిప్రాయంలో స్వరాలకు ఒకదాని కొకటి సంబంధంలేదని, కాని సినిమాలో బొమ్మలు విడివిడిగా ఉన్నప్పటికీ, చటుక్కున తిరుగుటమూలాన్ని వెనుకటి బొమ్మయొక్క ఛాయ మనస్సులోంచి పూర్ణంగా మాయంకాకుండానే, కొత్త బొమ్మ వస్తోంది. మన దృష్టి ఒకదానిమీదనుంచి ఒకదానిమీదకు గంతువేస్తూ ఉన్నా అంతా ఒక్క బొమ్మే అయినట్లు కనబడుతుంది.

‘ఇంకా స్వరంలో ఉండే గమ్మత్తు ఏమిటంటే, ఒక స్వరంపలికి, మన గొంతుక మరొక స్వరంలోకి వచ్చేటప్పటికి, ఈ రెండు స్వరాలమధ్య కొన్ని కొన్ని అవ్యక్తస్వరాలు గర్భితమై ఉంటాయి. ఇంద్రధనుస్సు చూడు: ఊదా, నీలం, ఆకుపచ్చన, పసిమి, వంగపండుచాయ, ఎరుపు, మళ్ళీ ఊదా. అసలు రంగులు మూడు. కాని ఎరుపులోంచి నీలం పుట్టుతుందా? కాని ఎరుపునుంచి నీలానికి వచ్చేటప్పటికి ఊదా, నీలి మధ్యను ఉన్నై. నీలిలోనుంచి పసిమికి వచ్చేటప్పటికి రెంటి కలయిక ఆకుపచ్చన ఉంది. ఆ మధ్యరంగులు ముఖ్య వర్ణాల కలయికే.’ ‘కాని, ఒక తెలుపులోంచి అన్ని రంగులు వచ్చినట్లు, ఒక మహాస్వరం లోంచి అన్ని స్వరాలు రావడం లేదా అన్నా!’

‘అదిమాత్రం నిజం. అదే అఖండ శ్రుతిస్వరూపం సుమా!’

‘శ్రుతి చాలా చిత్రంకాదు అన్నా? మొన్న శ్రుతిలోనే అపశ్రుతి యిమిడిఉందన్నావు ఏమిటి?’

‘నాఅర్థం ఏమిటంటే, ఈ సృష్టిలో అవ్యక్తమై, అనిర్వచనీయమైన పరబ్రహ్మ స్వరూపము తప్ప తక్కినవన్నీ ద్వంద్వాలేకాదూ! వెలుగు నీడ, మంచి చెడ్డ అలాగు. శ్రుతి అపశ్రుతికూడా అట్టి ద్వంద్వమే. శ్రుతిలో అపశ్రుతి సతతము గర్భితమయ్యే ఉన్నది. శ్రుతి ఉంచుకు వెడుతూఉంటే ఎక్కడ పడితే అక్కడ అపశ్రుతి రావచ్చు కాదూ చెల్లీ. సైకిలుఎక్కి పోయేవాడున్నాడు. వాడికి సమ్యక్‌స్థితి (బేలన్సు) ఉన్నది. ఎక్కడపడితే అక్కడ బేలన్సు తప్పిపోవడానికి వీలుందా లేదా! ఎక్కడనుంచివస్తున్నది ఆ అపశ్రుతి? శ్రుతిలోనుంచే! అలాగు వెలుగులోనుంచే నీడ!’

శ్యామసుందరీదేవి నారాయణరావుతో నిటుల గంటలతరబడి సంభాషించుచు, నాతని వదలజాలకుండును.

శ్యామసుందరీదేవి యింతవరకు నేరిని బ్రేమింపలేదు. ఆమె సుగుణఖని. ఆమె ప్రతి జాతీయోద్యమమునందు బాల్గొనుచుండును. ఆమె శ్రీమతి కమలా చటోపాధ్యాయికి స్నేహితురాలు. జాతీయవారములందు, గాంధీవారములందు ఖద్దరు, వాడవాడకు దిరిగి యమ్ముచుండును. స్వదేశవస్తువుల నమ్ముచుండును. గ్రామ గ్రామములకు శ్రీమతి ఆచంట రుక్మిణీదేవి మొదలగు దేశనాయికల యాజమాన్యమున దిరిగి, కల్లు త్రాగవద్దనియు, హిందూ మహమ్మదీయ సమ్మేళనమున్న గాని దేశమునకు స్వరాజ్యము రాదనియు బోధించుచుండెను.

శ్యామసుందరీదేవి తెలుగు బాగా మాట్లాడగలదు. తెలుగే యామె మాతృభాషయా యనిపించునట్లు మాట్లాడగలదు. ఆమె సగము కర్ణాటాంగన యయ్యు భారతీయ భాషలలో తెలుగే యత్తమమని వాదించును.

శ్యామసుందరి హృదయము పవిత్రమైనది. ఆమెకు పురుషు లనేకులతో స్నేహమున్నను మనస్సులో నిసుమంతయు వికారముకలుగదు. అంతరాంతరములనైన గోర్కి జనించనులేదు, తీగెలు సాగనులేదు.

అట్టి శ్యామసుందరి నారాయణరావన్న వెఱ్ఱిప్రేమలో మునిగినది. పవిత్రహృదయ యగుటచే నారాయణరావన్న నింత భ్రాతృప్రేమ కలుగుటకు కారణమేమని చర్చించుకున్నది. అతడు తన సోదరుడని దృఢనిశ్చయము చేసికొన్నది.

ఇదివర కే యువకుడూ ఆమెతో నొంటరిగానుండి మాట్లాడలేదు. అందులో పరుడగు యువకునితో నొంటిగా గంటలకొలది సంభాషించుట ఇంతవర కామె జన్మలో జరుగలేదు. శ్యామసుందరినిగూర్చి లోకముమాత్రము గుసగుసలు సల్పుచునే యున్నది. ‘అనేకమంది విద్యార్థినులున్నారు. కాని యీ విచిత్ర మెచ్చటను జూడలే’దనువారు, ‘ఆ బాలకు బరపురుష వాంఛ యుండకతీర’ దనువారు, నిట్లు పలువిధములుగ చెప్పుకొనుచుందురు. అట్లనుకొనుచున్నారని శ్యామసుందరికిని తెలియును. ఎంతమంది యేవిధమున ననుకొన్న నేమి, తన పవిత్రత తనకున్న జాలునని యామె చిరునవ్వు నవ్వుకొన్నది. దేశమునకై తాను సలుపు సేవ కేమియు నాటంకము రాకూడదని యామె దృఢప్రతిజ్ఞ పూనినది.

అట్టి శ్యామసుందరి నేడు నారాయణరావు పేరుచెప్పిన పుల్కరించి పోవును. అతని గొంతుక వినుచు గంటలకొలది యట్లుండిపోగలదు. అతని మోము చూచుచు పారవశ్యము ననుభవించును. ఆ సమయములో నొరుల కామె యదృశ్య. నారాయణరావుతో బరమేశ్వరుడు వచ్చినప్పుడెల్ల పరమేశ్వరునికి దన చెల్లెళ్ళను, దమ్ముని ఒప్పగించునది. తానును, నారాయణరావును నెమ్మదిగ నామె చదువుకొను గదిలోజేరి, యనేక విషయముల జర్చించుకొనుచుండువారు. ఒక్కొక్కప్పుడు నారాయణరావు పేము సోఫాపై కూర్చుండి యుండ, తానాతని ప్రక్కనే కూర్చుండి మాట్లాడుచుండును. ఆమె నారాయణరావును ముట్టినను అతడు చలింపక, ఆమెకు దనపైనున్న సోదర ప్రేమకు సంతసించుచుండును.

ఒకనాడు నారాయణు డామెను జూచి ‘చెల్లీ, నీ ఆశయాలు, నీ చరిత్ర చిన్నతనాన్నుంచి నాకు చెప్పు’ మని యడిగెను.

‘ఏముంది అన్నా! చిన్నతనం నుంచి గొప్ప సంగీతపాటకురాలిని అవుదామనిన్నీ, గొప్ప కవిత్వం వ్రాయగలదానిని అవుదామనిన్నీ, దేశంకోసం సర్వస్వము ధారపోయాలనిన్నీ కలలుకంటూ ఉండేదాన్ని. మా అమ్మగారు నాన్నగారుకూడ నన్ను ‘స్వప్నబాల’ అంటూ ఉండేవారు.

‘మా నాయనగా రుద్యోగం విషయంలో మారినప్పుడల్లా చిన్నబిడ్డనై ఉన్నప్పుడు దారీ, చెట్లు చేమలు, ఆకాశం అన్నీ నన్ను ఆనందంలో ముంచేస్తుండేవి. నేను ఆటకు బొమ్మలు తెమ్మనిగాని, ఆడుకునేందుకు వెళ్ళాలనిగాని మారాం పెట్టేదాన్ని కాదట. ఇతర పిల్లలతో ఆటకు వెళ్ళేదాన్ని కాదట. అస్తమానము చెట్లు చేమలు చూడడం, గ్రామఫోనులో పాటలు వినడం మహాఇష్టంట. త్యాగరాజు గారి ‘రామాభిరామా’ నన్ను చిన్నతనాన్నుంచి పుల్కరింపచేస్తూండేది అన్నా.’

నారా: చెల్లీ! రామాభిరామా కృతి నాకు వెఱ్ఱే ఎత్తిస్తుంది. అది ఒకటీ, ‘ఆరగింపవా పాలు’ ఒకటి, ‘నను పాలింప నడచివచ్చితివా’ ఒకటి, వీటికి నేను తన్మయత్వంలో మునిగిపోతా చెల్లీ!

‘మనము పూర్వమునుంచిన్నీ అన్నా చెల్లెళ్ళమేమో తెలియదు. ఇన్నాళ్ళనుంచి కలియకుండగా తిరుగుట ఏమో? ఎన్ని సంవత్సరాలు వృథా అయిపోయినాయో?’ ‘అమ్మా! అన్నిటికీ కారణము లేకుండా ఉండదు. కర్మయొక్క విచిత్రము అదే!’

‘కర్మ అనేది విధి (ఫేట్) అనేది కాదుకదా?’

‘కాదమ్మా కాదు! కర్మకూడా ఆత్మతోపాటు అనాదిసిద్ధమైందే; అది మూడు భాగాలుగా విభజించారు. ప్రారబ్ధ, సంచిత, ఆగాములని. ప్రారబ్ధం పాతకర్మలు కారణంగా వచ్చినది. అది ఎవ్వడికీ తప్పదు. మహాత్ములకున్నూ, రామకృష్ణపరమహంసవంటి జీవన్ముక్తులకున్నూ తప్పదు. రామకృష్ణపరమహంసకు కంఠములో వ్రణము వేయడము విన్నావుకదూ?’

‘ఆ విన్నాను.’

‘ఇక సంచితము ప్రస్తుత కర్మ. దీని యొక్క ఫలితము ఇప్పడున్నూ, ముందున్నూ సంభవిస్తూ ఉంటుంది. ఆగామి అనేది ముందువచ్చేది. ఇప్పటి కోర్కెలు, ఇప్పటి భావాలయొక్క ఫలితము. నువ్వు జ్ఞానివై కర్మయోగివైతే ప్రారబ్ధము అనుభవిస్తూ, సంచితము, ఆగామి కర్మలను నశింపుచేసుకుంటే జీవన్ముక్తురాల వౌతావన్నమాట.'

‘ఆ రెంటిని నశింపుచేసుకొనుట ఎల్లాగో? నేను రామకృష్ణపరమహంస సుభాషితాలు, గ్రంథాలు చాలా చదివాను. నాకు స్పష్టంగా తెలియలేదు.’

‘నాకుమాత్రం తెలుస్తుందా చెల్లీ! ప్రాపంచికమైన యీ మిడిమిడి జ్ఞానంతో ఎంత చదివినా మన జ్ఞానం ఊహామాత్రం. అసలు జ్ఞానం కించిత్తియినా సముపార్జించా లంటే మొదట మహాత్ముడొకడు గురువు కావాలి.’

‘గురువు వచ్చిందాకా మనకేమి లాభంలేదన్న మాటేనా?’

‘అలాకాదు. నీకు ఆ తహతహ, ఆ జిజ్ఞాస ఎప్పుడు ఉంటుందో, ఏ సాధువాక్యాలో వినికాని, చదివికాని, కర్మమార్గంలోకాని, యోగమార్గంలోకాని ప్రవేశించాలని వెర్రిపుట్టుతుంది. అప్పుడే నీలో నీవే ఏదో పద్ధతి పెట్టుకొని గురువుకు ఎదురుచూస్తూ ఉంటావు. ఆ యెదురుచూట్టంలో జ్ఞానులన్న వాళ్ళని వెళ్ళి ఆశ్రయిస్తూన్నా ఉంటావు. ఆ యెదురుచూచే గురువు నిన్ను వెదుక్కుంటూనే వస్తాడు.’

‘కళావిషయంలో మీకోసం నేను ఎదురు చూచినట్లు!’

‘నే నెంతవాడిని! పాపిని. ఏ విషయంలోనూ నేనుగురువుగా ఉండలేను.’


౧౬ ( 16 )

జగన్మోహనుని పెండ్లి

కర్నూలు వాస్తవ్యులు రామరాజు సుబ్బరామయ్యగారి కుమార్తెనిచ్చి వివాహము చేయుదుమని జగన్మోహనరావు జమీందారుగారికడకు రాయబారులు వచ్చిరి. సుబ్బరామయ్యగారు లక్షాధికారి. వారి అమ్మాయికి జమీందారీసంబంధం చేయవలెనని కుతూహలముకలిగి యాంధ్రదేశమంతయు గాలించుచుండ బాలిక రజస్వలయైనది. ఇంతలో జగన్మోహనుని సంబంధము వారికి దెలియవచ్చినది. బాలిక చెన్నపట్టణమున మిషనరీల పాఠశాలలో నాల్గవఫారము చదువుచున్నది. అందమైన పిల్ల. అధునాతన నవనాగరితాభిప్రాయములు పూర్తిగా నలవరచుకున్న బాలిక.

జగన్మోహనరా వా బాలికను జూచి, యామెతో మాట్లాడినాడు. ఇరువురకు పరస్పరము నిష్టము కుదిరినది.

సంబంధము నిశ్చయమై, ఆ సంవత్సరము మాఘమాసములో ముహూర్త మేర్పరచినారు. ముహూర్తము దగ్గరకు వచ్చినది.

‘వీరేశలింగం పంతులుగారు ఆంధ్రదేశ నాయకమణిగా ప్రఖ్యాతి వహించినారు. ప్రసిద్ధమైన కార్యాలు చేశారు. అయితే ఇప్పుడేమన్నా పని జరుగుతోందాండి? ఆయన ఏవి తప్పులని గొడ్డలిపుచ్చుకు కొట్టారో, అవన్నీ మొలకలెత్తాయి. పదిరెట్లు విజృంభించాయి. ఆయన మొదలు పెట్టినవి ఆయనతోటే నశించాయి. కట్నాలు మానిపించే మహానుభావు లెవరన్నా ఉన్నారా?’

‘రామమోహనరాయి, కేశవచంద్రసేను, దయానంద సరస్వతి, రామకృష్ణపరమహంస, వివేకానంద, విద్యాసాగరులు ఇటువంటి మహానుభావులూ, నేడు గాంధీగారూ ఇవి తప్పుతప్పు అని ఖండిస్తూవుండడము, ఒకళ్ళ ఇద్దరో అలా నడుచుకోవడము అంతే. అవన్నీ పుబ్బలోపుట్టి మఖలో మాడడము, చూడండి, మా జమీందారు బాబుగారు నేను బ్రహ్మసమాజకుణ్ణి, నేను విధవా వివాహం చేసుకుంటాను, నేను కట్నాలు పుచ్చుకోను అన్నాడు నిన్నటి వరకూ. ఇవ్వాళ్ళ? ఎదిగిన పిల్లనే అనుకోండి, చేసుకుంటున్నా ఆరువేల రూపాయలు కట్నము ఏమిటి? వెధవ కబురులు ఎన్నైనా చెప్పవచ్చు, చెయ్యడమేది?’

‘ఓరబ్బో! గోడలకు చెవులుంటాయి. గట్టిగా మాట్లాడకు. తద్దినాలు మానేశాడు. ధర్మకార్యాలు తగలెట్టాడు. యజ్ఞోపవీతము తీసేశాడు. కాని అంతే! ఈ పెళ్ళికిచూడు, ఎన్నివేలు ఖర్చవుతాయో! బ్రహ్మసమాజమువాడైతే, వెధవపిల్లని చేసికోవాలి. కట్నము పుచ్చుకోకూడదు. ఒక రోజులో ఏ వెంకటరత్నమునాయుడుగారి యాజమాన్యాన్నో వివాహం చేసుకోవాలి మగవాడైతే! ఏమంటావు?’

అని జమీందారీ ఠాణేదారులిద్దరు మాట్లాడుకొనుచు కూర్చుండినారు విశాఖపట్టణం హుజూరు ఠాణాఆఫీసులో.

జమీందారి ఉద్యోగులందరు పొట్టు పొట్టయిపోవుచున్నారు __ డబ్బు పోగుచేయుటలో, సరంజాములు చేయుటలో, శుభలేఖలు వ్రాయుటలో, అలంకారములు సమకూర్చుటలో, అటువంటి యింక నెన్నియో పనులలో, జగన్మోహనుడు అడిగినచోట నడుగకుండ 50 వే లప్పుచేసినాడు. పది గ్రామములలో రెండు గ్రామములు తనఖా పెట్టినాడు. కట్నాలని, నజరానాలని ఇరువది వేల రూపాయలు రైతులనే గానుగాడి ప్రోగుచేసినాడు.

కర్నూలు పోవుటకు ప్రత్యేక ధూమశకటము. చుట్టములు, స్నేహితులు గొప్పకుటుంబములవారే పిలువబడిరి. విదేశీయబ్యాండు తెప్పించినారు. పాట కచ్చేరీలు పనికిరావట. ఒకరోజే వివాహము. విశాఖపట్టణములోను, చెన్నపురిలోను ఉన్న జగన్మోహనరావుగారి స్నేహితులగు యూరేషియను కుటుంబాలవా రాహ్వానింపబడిరి. వారికై పటకుటీరము లేర్పరుపబడెను. ఒక పెద్ద సినిమా హాలులో వారి భోజనములకు, నాట్యమునకు నేర్పాటు చేయబడెను.

శారదయు, నామె తల్లియు వివాహమునకు వచ్చిరి. బళ్ళారిలోనున్న శకుంతలాదేవియు వివాహమునకు విచ్చేసినది.

తోడల్లునకు శుభలేఖవచ్చినను, నారాయణరావునకు గబురే లేదు.

వివాహవిధి నిముషములో జరుగవలెను. అనవసరములగు తంతులన్నియు మాన్పింపబడినవి. సంబంధమునకై దేశదేశములు వెదకిన సుబ్బరామయ్యగారు జగన్మోహనుడు కోరిన షరతులన్నిటికీ ఒప్పుకొనెను.

పెండ్లికూతునకు జగన్మోహనుడన్నియు పాశ్చాత్యాభరణముల నిచ్చెను.

సుబ్బరామయ్యగారు రప్పించిన చెన్నపట్నపు సన్నాయిమేళము విడిది కడ గానము చేయరాదు. కొందరికి బల్లలమీద భోజనములు.

ఊరేగింపు టుత్సవమునకు ముందు ఐరోపీయబ్యాండు (వాయించువారు నల్లవారే). తరువాత పెండ్లికుమారుడు, కొమరితయు గూర్చున్న రెండు గుర్రములబండి, వెనుక బదునైదు గుర్రపుబండ్లు.

పెండ్లికుమారు డప్పుడే ఇంగ్లండునుండి వచ్చిన ఇంగ్లీషు యువకుని దుస్తులు ధరించి టోపీ చేతనుంచుకొని కూర్చుండెను. పెండ్లికుమార్తెకు నింగ్లీషుబాలిక వివాహమునాడు ధరించుదుస్తులు ధరింపించినాడు వరుడు. ఆ దుస్తులు స్నేహితులగు యూరోషియనులు తెప్పించినారు. వారి ఆడవారు వధువు నలంకరించినారు.

ఊరేగింపులో యూరేషియనులు బండికొక స్త్రీయు పురుషుడు చొప్పున పదమూడు బండ్లలో నున్నారు. వెనుక రెండుబండ్లలో పెండ్లికుమారుని చుట్టములు, జమీందారిణి, శారద, శకుంతలాదేవి, శకుంతలాదేవి సంతానము, పెండ్లికుమారుని తల్లివంకవారు తండ్రివంకవారు పదునైదుగురు.

కర్నూలులో నిది బాశ్చాత్య వివాహమాయని ఱిచ్చపడిరి.

జమీందారిణి మేనల్లుని వివాహపు బద్ధతుల నన్నింటిని మెచ్చుకొన్నది.

జగన్మోహనుని తల్లి శివకామసుందరీదేవి జమీందారిణి: ‘అందుకనే మావాడంటే అందరికీ గౌరవం వదినా.’ ఆమె అన్నగారి భార్య శేషమాంబ: ఎంత చక్కగా ఉన్నదండీ. వెధవ పల్లెటూరి పెళ్ళిళ్ళూ చేసారు.

వరదకామేశ్వరీదేవి: శారదా! చూశావా నీ పెళ్ళికిన్నీ, బావపెళ్ళికిన్నీ తేడా? ఇదీ నిజంగా జమీందారీ వివాహమంటే.

శారద: చాలా బాగావున్నది. ఎంతో శాంతంగా ఉన్నది. ఇంగ్లీషు వారి వివాహమల్లేనేఉంది. కాదుటే అక్కయ్యా?

శకుంతల: వెఱ్ఱి నలుగులు అవీలేవు. కాని ఏమిటో మొత్తంమీద నాకు అన్నీ కలిసి వికారంగా కనబడుతోంది.

శారద: బావకు ఇంగ్లీషువాళ్ళ పద్ధతులన్నీ తెలుసు.

శకుంతల: ఎందుకే నువ్వూ మీ బావా ఇంగ్లీషువాళ్ళో ఇంగ్లీషువాళ్ళో అని యిదవడం?

శారద: నువ్వు గాంధీగారి మతంలో చేరావుటే అక్కయ్యా?

శకుంతల: నువ్వదృష్టవంతురాలవు కాబట్టి నీకు నాన్‌కోఆపరేషన్ భర్త దొరికాడు. నువ్వు నిముషంలో జేరడానికి వీలుంది.

శారద మౌనము.

వరద: అదేమిటే శకుంతలా! వెర్రిమాటలు. ఎక్కడ నేర్చావు? శారదను నువ్వు దెప్పటం బాగాలేదు. దాని మనస్సు ఇదివరకే పాడైపోయినది. గోరుచుట్టుమీద రోకటిపోటువంటి మాటంటావు. ఊరుకోతల్లీ!

శకుం: ఊరుకో అమ్మా! నీ సంగతి నాకేమి అర్థంకావటం లేదు. నేనూ చూస్తూ ఉన్నాను. నల్లేరుమీద బండివెళ్ళినట్లు మా మరిది గారిమీద ఒకటే చాడీలు. వాళ్ళిల్లూ, వాకిళ్లు, వాళ్ళకుటుంబాలు, మర్యాదలు తలక్రిందులా తపస్సు చేసినా మనకి రావు. ఇంటికి వచ్చినవాళ్ళని మనం చూడనేచూడము. మొన్న మనం వెళ్ళినప్పుడు వాళ్లు చేసిన మర్యాద మహామహావాళ్ళుకూడా చేయరు. వాళ్లందరి హృదయం ప్రేమతో నిండిఉంటుంది.

శివకామ: ఎవరికోసం చేస్తారమ్మా కోడలా!

శకుం: ఎందుకు చెయ్యాలి అత్తా? వాళ్ళకు మీరు చేసిన ఉపకారం ఏమిటి? మీ కుటుంబాలన్నింటిని ఏళ్లతరబడి ఉంచి పోషించగల భాగ్యం ఉంది, సిరీ ఉంది, సంపదా ఉంది. వాళ్ళింటినిండా బిడ్డలు. ఒక్క మా మరిది గారి కుటుంబంలోనే ఉన్నారు ఇరవైమంది చంటిబిడ్డలు. నాకు ముచ్చటవేసి పోయింది. ఏదీ మన జమీందారీ కుటుంబాల్లో చూపించు పదిమంది ఉన్న కుటుంబాన్ని?

శారద: (కొంచెము కోపమున) పేడనీళ్ళతో అన్నంకడుక్కుంటావా మీ ఇంటిలో?

శకుం: (మూతి ముడుచుకొని కనుబొమలు దరిదీసి) పేడనీళ్లతో కడు క్కొంటున్నారో లేదో ముందు నీకు తెలుస్తుంది. పేడనీళ్ళతో కడిగిన అన్నం తినడానికి ఇష్టంలేక ఆత్తవారింటికి వెళ్ళవు కాబోలు. మన అత్తయ్య ఆచారం తక్కువా, అంతమాత్రాన్న ఆవిడ పల్లెటూరి మొద్దుఅయిందా?

వరద: ఏమిటి శకుంతలా అది? ఊరుకోఅమ్మా శారదా! ఎందుకూ ఈ గడబిడ నువ్వు, పెద్దమ్మాయీ!

శకుం: ఎందుకా? పొద్దున్నుంచి నారాయణరావు నారాయణరావు అని అతన్ని ఆడిపోసుకోవడమే. మన యింటికి వచ్చినప్పుడల్లా యిదేవరస. విని విని చెవులు తడకలుకట్టి అన్నాను. నారాయణరావువంటి అల్లుడు తపస్సు చేసినా దొరకడు. విన్నావా అమ్మా? బాబయ్య గారు ఎందుకు కోరి తెచ్చుకున్నారు? మన సంబంధంకోసం శారద మామగారిని హేమాహేమీలు వెళ్ళి ఒప్పించారు. నీకు ఇష్టం లేకపోతే బాబయ్యగారితో నిజంచెప్పు. ఇలాంటి తెలివితక్కువలు చేస్తే జరిగే నష్టం నాకు తెలుసును. జరిగిన సంగతులు తెలిశాయి. తర్వాత విచారిస్తావు.

అందరూ తెల్లబోయినారు. వరదకామేశ్వరీదేవి కొమరిత గంభీర వాక్యముల కదరిపడి శారదవంక చూచినది.

శారద యచ్చట లేదు.

శారద చురచుర కోపముతో వెడలిపోయి, విడిదిమేడలో దమ కిచ్చిన గదిలో పందిరమంచముపై బరుండి, కంట నీరుదిరుగ వాపోయెను. ఆ దారిని పోవు జగన్మోహనున కది వినబడి గది తలుపు త్రోసికొని లోనికివచ్చి మేనమరదలిని జూచి, పట్టరాని తమకమున నొక్కగంతున నా మంచముదగ్గరకు బోయి, యామెను బిగ్గ గవుగిలించుకొని మోహావేశమున వణకు కంఠముతో ‘శారదా! ఎం ...దు ...కు ... ఏ... డు... స్తు ... న్నా ... వు’ అని యడిగెను.

శారద యేడ్పుమాని మాటలాడక యాతని బారినుండి తప్పించుకొని, గోడవైపుకు దొర్లి ‘యేమిలేదు బావా’ అన్నది. జగన్మోహను డా దివ్యసుందర విగ్రహము ఏడ్పుమోమున మరియు సుందరతరముగ గన్పట్ట, తమి నాపలేక, మంచముపైకి బ్రాకి, యామెను తనవైపుకు లాగికొని, యామె బుగ్గలను, కంఠమును, చెవులను, జడముడిని ముద్దాడుకొని మోము తనవంకకు ద్రిప్పికొని, పెదవుల ముద్దిడబోవుచుండ శారద చటుక్కున విదల్చుకొని ‘ఏమీలేదు బావా’ అన్నది. ఇంతలో శకుంతల చెల్లెలిని వెదకుచు నచ్చటికి వచ్చినది.


౧౭ ( 17 )

‘పి ల్ల లం టే ప్రా ణం’

శ్యామసుందరీదేవి తండ్రి పీమర్తి గోపాలకృష్ణయ్యగారు, మైసూరు వాస్తవ్యుడు. తెలుగు వెలనాటి బ్రాహ్మణుడు. ప్రసిద్ధ బ్రాహ్మసమాజికుడు. చెన్నపురి ప్రభుత్వపు పెద్ద వైద్యశాలలో ముఖ్యవైద్యులలో నొకడు. ఆయన దక్షిణదేశమున జిల్లా వైద్యశాలలో నుపవైద్యులుగా నున్నప్పుడు, మైసూరు దేశపు వైష్ణవ వితంతు బాలికను బ్రహ్మసమాజ పద్ధతిని వివాహమాడెను. ఉద్యోగము విరమించి తన భార్య గ్రామమగు మంగుళూరులో నామెకు సంక్రమించిన మేడలో నుండినాడు. ఆయనకు నలుగురు కొమరితలు, నలుగురు కుమారులు జనించినారు. కుమారులలో బెద్దవాండ్రు ముగ్గురు విదేశములకు బోయినారు. పెద్దకుమారుడు ఇంజనీరింగులో నుత్తమవిద్య బడసి కాశీ హిందూ విశ్వవిద్యాలయములో నాచార్యుడుగ నున్నాడు. రెండవ కుమారుడు ఇంగ్లండులో వైద్యవిద్య నభ్యసించి ఇప్పుడు దక్షిణార్కాటుజిల్లాలో జిల్లా వైద్యుడుగా బనిచేయుచున్నాడు.

మూడవ కుమారుడు జర్మనీలో కర్మాగారవిద్య బడయుచున్నాడు. నాలుగవ కుమారుడు చెన్నపురిలోనే చదువుకొనుచున్నాడు.

ఆంధ్రులు పూర్వకాలమున వివిధదేశములకు వలసబోయినారు. విదేశములతో ఓడబేరము సలిపినారు. దేశముల జయించినారు. క్రీస్తుపుట్టినపిమ్మట నయిదారు శతాబ్దులలో కొందఱాంధ్ర బ్రాహ్మణులు మళయాళదేశమునకు బోయి నంబూద్రీలయినారు. తంజావూరు, మధుర నాయకుల కాలములో దక్షిణాపథమునకు తెలుగు బ్రాహ్మణులు, నాయకులు, కమ్మవారు వలసబోయినారు. హైదరాబాదు పరిసరముల నుండి కొందఱు బొంబాయి కరిగి యచ్చట వృద్ధినొంది, కామాఠీలని పిలువబడుచున్నారు. తరువాత నాగపురము, కళ్యాణి, అహమ్మదాబాదు, జబ్బలుపురము, కలకత్తా, కాశీ, ప్రయాగాది ప్రదేశముల నాంధ్రు లుద్యోగవర్తకాదులకైపోయి యచ్చటనే నిలిచిపోయినారు. ఇంటిలో దెలుగు మాట్లాడుకొందురు. పైకి వచ్చినప్పుడే ఆ దేశభాష మాట్లాడుకొందురు.

అటులనే గోపాలకృష్ణయ్యగారి పూర్వీకు లెప్పుడు మైనూరువచ్చినారో తెలియదు. గోపాలకృష్ణయ్యగారి భార్య అయ్యంగారి యువతియైనను నామెకు దెలుగు బాగుగా వచ్చుటచే భర్త యిష్టము ప్రకారము బిడ్డలందరకు దెలుగు నేర్పినది. కావుననే శ్యామసుందరీదేవి కుటుంబమువారందరికి తెలుగు, అరవము, కన్నడము బాగుగవచ్చును. హిందూదేశమున మైసూరు వైష్ణవులు సౌందర్యములో రెండవవారని ప్రసిద్దినందినారు. నాజూకుతనము, జ్ఞానము, సౌందర్యము కలిగియు త్రివేణీసంగమములో వారే యఖిలభారతదేశమునకు బ్రథమ పీఠము వహింపగలవారు. అట్టి తల్లికిని, తెలుగు తండ్రికిని జనించిన శ్యామసుందరి మొదలగు నాబాలికలందరు నందమున భారతీయ రాణు లనదగినవారు.

ఆంధ్రదేశ మొకనాడు బెంగాలు పంజాబు దేశములవలె సంఘసంస్కరణోద్యమములో నిలబడి పేరువహించినది.

ఒకనాడు పరమేశ్వరమూర్తి, ఆలం, రాజారావు, వారి యరవస్నేహితుడగు నటరాజన్ శ్యామసుందరి యింట జేరినారు. నారాయణరావింక నచ్చటికి రాలేదు. ఆనాడు జమీందారుగారు వచ్చుటచే నారాయణరావు మామగారితో మాట్లాడుటకు వెళ్ళుచు స్నేహితులను తరువాత వచ్చి కలిసికొందునని చెప్పి, కీలుపాక్ లో మామగారి యింటికి మోటారుమీద బోయినాడు.

అనేక విషయములగూర్చి సంభాషించినవెనుక, శ్యామసుందరీదేవి తన తండ్రినిగూర్చి మాటలువచ్చి ఇట్లు పలికినది.

‘మా తండ్రిగారున్ను వీరేశలింగకవిగారి శిష్యుడండీ పరమేశ్వరమూర్తిగారు! చిన్నతనములోనే భర్తను గోల్పోయిన మా తల్లి యామెతల్లిదండ్రులకు దెలియకుండ, చెన్నపురిలో శ్రీ వీరేశలింగము పంతులుగారి యాజమాన్యమున విధవా వివాహసంఘమువారు నెలకొల్పిన వితంతు బాలికాశ్రమమునకు బారిపోయివచ్చి యచ్చట చదువుకొనుచు ప్రవేశపరీక్షలో ప్రథమతరగతిలో నుత్తీర్ణురాలైనది. మా తల్లి అయిన ఆండాళ్‌దేవిగారి తెలివితేటలూ, చక్కదనమూ చూచి మా తండ్రి ఆమెను వివాహమాడినాడు.’ అంత రోహిణీదేవి తన యింట జేరిన స్నేహితుల కందరకు టీ పానీయ మిచ్చెను.

శ్యామసుందరీదేవి యందము నానాట బెరుగుచున్నను కొంచెము చదు వెక్కువగుటచే జిక్కిపోసాగినది. రోహిణీదేవి సంపూర్ణ యౌవనము దాల్చినది. సరళాదేవికి వయసు పరిమళించుచున్నది. నళినికి బ్రాయము తొలకరించినది. ఆ మిసిమి మిటారిబాల కన్నుల సహజమగు నవ్వుల కాంతులు మరియు వెలుగు చుండ వదనాంచలముల హాసములు ప్రసరింపుచుండ నల్లరిమాటల నందరిని మేలమాడసాగినది.

సరళ యేరితోడను సాధారణముగ మాట్లాడదు. మితభాషియగు రాజారావును, ఆమెయు వైద్యవృత్తిని గూర్చియు, వేదాంతమునుగూర్చియు మాట్లాడువారు. రాజారావు అమలాపురములో వైద్యవృత్తి నారంభింప వెడలిపోయిన వెనుక, నేటికి పరమేశ్వరమూర్తి భార్యకు గర్భస్రావమగునంత గడబిడయగుటయు, రాజారావుకు తంతినంప నాతడు చెన్నపురి కరుదెంచెను. రాజారావు వృత్తి నవలంబించిన తర్వాత నా బాలిక లాతని చూచుటకదే మొదలుగావున నాతడు రాగానే,

‘నమస్కారమండి రాజారావు గారూ! ఎప్పుడు వచ్చారు?’ అని ఒక్కసారిగా నడిగినారు.

‘రెండురోజు లైనదండీ.’

‘ఇప్పుడాండి మాకు కనబడుట డాక్టరుగారూ’ అని శ్యామసుందరీదేవి ప్రశ్నించినది.

రాజా: పరమేశ్వరమూర్తి భార్యకు జబ్బుచేసినది, కొంచెం కంగారుపడ్డారు. నారాయణరావూ, అతనూను నాకు తంతినిచ్చారు. నిన్న ఉదయం వచ్చాను. నిన్న సాయంత్రానికే కొంచెం సుగుణమిచ్చింది. శ్యామ: జబ్బు చేస్తే నాకు తెలియపరచారు కాదే నారాయణరావుగారు కాని, పరమేశ్వరమూర్తిగారు కాని? పోనీ లెండి.

పర: క్షమించాలమ్మా దేవిగారు! మొన్న నేనూ, నారాయణరావు మూడుసారులు కాలేజీకి ఫోనులో మాట్లాడినాం. మీరింకా పెద్ద ఆస్పత్రినుండి రాలేదట. తర్వాత ఇంటికి కారు పంపాము. మీరు షికారుకు వెళ్ళారట. నిన్న రాజారావు రావడంవల్ల ఆ గడబిడలో ఉన్నాము.

శ్యామ: ఏమిటండీ జబ్బు?

రాజా: గర్భస్రావము అయినంత పని అయింది. ఇదివరకు మూడుసార్లు ఇంతే. ముందు రాకుండా ఉండడానికి వైబర్నం, అశోక, సిడాన్సు మొదలైనవి వాడుతున్నాను. మీరు కొంచెం చూస్తూఉంటారుగనుక భయం ఏమీ లేదు.

శ్యామసుందరీదేవి అయిదవసంవత్సరం ఎం. బి., బి. ఎస్. పరీక్ష చదువుచున్న దాయేడు. ‘పని ఆట్టే చేయించకుండా ఆమెకు కావలసినంత విశ్రాంతి ఇస్తూ, నే చెప్పిన మందును ఇస్తూఉంటే ఏమీ ఇబ్బంది లేదన్నాను. ఏమంటారు మీరు?’ అని రాజారా వనెను.

శ్యామ: అవునులెండి. తప్పకుండా చూస్తూ ఉంటాను. నా కిదివరకు ఎప్పుడూ చెప్పినారుకాదే పరమేశ్వరమూర్తి అన్నగారు?

రాజా: అతను సిగ్గుపడాడేమో?

శ్యామ: కాబోలు.

రోహిణీదేవి రెప్పవాల్చక పరమేశ్వరునివైపు జాలిచూపుల జూచుచు ‘అన్నగారికి చాలామంది పిల్లలు పోయారని విన్నాను. పాపం!’ అన్నది.

రాజా: ఇదివరకు ముగ్గురు కుమాళ్లు పుట్టి పోయినారు, ఇతనికి పిల్లలంటే ప్రాణం. మా నారాయణరావన్నా ఇతడన్నా పిల్లల్ని వదలరు! చంటిపిల్లా డయిపోతాడు పరమేశ్వరమూర్తి వాళ్ళతోపాటు.

రోహి: ఆయన హృదయం వెన్నవంటిదని మేమంతా అప్పుడే గ్రహించాము.

పర: నారాయణ హృదయం పన్నీరే!

రాజా: కాని అవసరం వస్తే ‘వజ్రా దపి కఠోరాణి’ అయిపోదటోయి? అతనూ నువ్వూ ఒకటే!

పర: అదా నాయనా, నువ్వు గ్రహించింది?

నట: అదిదా అడగండిమీ. ఏవిటిదా డాక్టరు చెప్పుదురూ! అవసరము వచ్చినప్పుడుదా మంచి గట్టిదని. అంతదా! ఏమిరా పరమేశ్వరమూర్తిగారూ అవళదానేనా? పర: అవళదా! నల్ల సొల్లారుదా మీరు.

నళినీదేవి: ఏమండీ! ఆయన హృదయం రాయివంటిదని చూపించండి.

రాజా: మావాడు నారాయణరావుకు బాస్వెల్ లెండి.

పర: ఆ విధంగా కూడా కీర్తికాంత వరిస్తుంది. కాదటోయి డాక్టరూ?

రాజా: తప్పక.

నళిని: చెప్పండి కవిగారూ!

సరళ: మధ్య మధ్య చిత్రలేఖన కూడా చెప్పండి.

నట: వహ్వా!

పర: మేము మొన్న యాత్రలు చేసినపుడు రైలుక్రిందబడిన ఒక బొంబాయి ఉద్యోగస్తుణ్ణి రక్షించాడు నారాయణం.

నళిని: ఏవిటదీ?

పర: వినవమ్మా చిట్టిచెల్లి! కంగారు పెట్టక ఊకొట్టు. నారాయణరా వంత పెద్దకథానాయకుణ్ణి కాకపోయినా నేనూ కథలు రాస్తూవున్నా.

నళిని: ఊ.

నట: అచ్చా!

పర: మన్మాడుస్టేషనులో ఆ రోజున వందలకొలది జనం ఉన్నారు బొంబాయి మెయిలు కోసం.

నళిని: ఊ.

పర: (చిరునవ్వు నవ్వుచు) అల్లరి అమ్మాయీ! మేము నాసిక వెడుతున్నాము. ఇంతలో రైలు వచ్చింది. ఇంకా పూర్తిగా ఆగలేదు. వేగంగా ఉన్నది. మనబొంబాయి పెద్దమనిషి ఒక్క గంతువేసి బండి పట్టుకొనబోయినాడు. పట్టుతప్పి రైలుకూ, ఫ్లాట్‌ఫారం అరుగికీ మధ్య పడ్డాడు.

నళిని: రామ రామా! ఊ! తర్వాత.

పర: కాస్తయితే నలిగిపోవలిసిందే కాని, నారాయణరావు గబుక్కున వంగి గోడ ప్రక్కనే కదలకుండా పడుకో అని కేక పెట్టాడు. ఆ మనిషి అది వినిపించుకోకుండా రైలుక్రింద దూరిపోయాడు. ఆ దూరడంలో ఒక్క కాలు తీసుకోలేక పోయాడు. చక్రం ఆ పాదం మీదనుంచి పోయింది. పాదం పచ్చడి. రైలు వెళ్ళిపోయినది. స్పృహతప్పి ఆ మనిషి పడిపోయాడు. జనం వందలకొలది దూకి ఆ మనిషి చుట్టూ చేరారు. ఒక్కళ్ళూ సహాయానికి వంగరు.

నళిని: అబ్బా! (ఒడలు జలదరించును)

పర: నారాయుడు చటుక్కున వంగి, ఆరడుగుల పైచిలుకున మంచి లావూ, భారీవున్నవాణ్ణి చంటిపిల్లవాడిలా ఎత్తి ఒక్క గంతులో ఫ్లాటుఫారం ఎక్కాడు , గబగబ రెండవ తరగతివారి విశ్రాంతిగదిదగ్గరకు తీసుకొని వెళ్ళాడు. రాయివేసి రక్తం స్రవించకుండా రక్తనాళాన్ని గట్టిగా కట్టాడు. నేను వెనకాలే పరుగెత్తుకొని లైజల్‌బుడ్డి, పళ్ళెము, నీళ్ళకూజా, దూది, గుడ్డలు మాదగ్గర ఉన్నవి పట్టుకువెళ్ళాను. అవి వాడికిస్తే...

నళిని: (చిరునవ్వు నవ్వి) మధ్య మిమ్మల్ని వీరుణ్ణి చేసుకున్నారే!

పర: (నవ్వుచూ) తప్పదు. ‘మంచిపని చేశావురా’ అని ‘నీళ్ళు’ అని పొలికేక పెట్టి, కాలుకడిగి నేను తెచ్చిన లైజాలు నీళ్ళలోవేసి, పాదం అంతా కడిగి తనజేబులో ఉన్న చాకుతో కాలికి ఉన్న బూటుకోసి తీసివేశాడు. టించరు అయోడిన్ వేసి గుడ్డ చుట్టాడు. ఇంతలో డాక్టరు వచ్చాడు.


౧౮ ( 18 )

ఆం ధ్రు లు డాం బి కు లు

నళిని: మా అక్కకన్న బాగా ఫస్టుయైడు (మొదటి వైద్యసహాయం) చేశారే! చాలా సంతోషంగా ఉంది. తర్వాత?

పర: తర్వాత ఏముంది అమ్మా! మేం వచ్చేశాం. మా అడ్రసు ఇచ్చి వచ్చాము కాదూ? మొన్ననే ఉత్తరం రాశాడా బొంబాయి పెద్దమనిషి.

రాజా: ఇంకా మీ నారాయణరావు వీరకృత్యాలుంటే వర్ణించవోయ్ కవీ!

శ్యామ: డాక్టరు అన్నగారూ! నారాయణరావు గారికి బాగా యీత వచ్చునట కాదూ?

రాజా: పరమేశ్వరుడికీ వచ్చును.

పర: మా నారాయుడి యీత గజీతలెండి. ఒకమాటు రాజోలుదగ్గర పడవ రేవు దాటివస్తూఉంది, గాలి బాగా వీస్తూంది. గోదావరి కెరటాలో ఉబికిపోతూ ఉన్నది. నారాయణరాపూ, నేనూ నర్సాపురం నుంచి స్టీమరు మీద వచ్చి రేవులో దిగుతున్నాము. ఘొల్లుమన్నారు. ఏమిటా అని చూసే ఎల్లా మునిగిందో ఆ పడవ మునిగింది. నారాయుడు ఎట్లా ఉరికాడో, ఎల్లా బారలమీద వాయువేగంతో వెళ్ళాడో యిరవైగజాలదూరంలో ఒకరితర్వాత ఒకళ్ళను నలుగురిని పట్టుకోడం, వెనకాలే వచ్చిన పడవకు అందివ్వడం చేశాడండి. ఇద్దరు మనుష్యులు స్పృహతప్పితే ఒడ్డునపడేసి పొట్టనొక్కి ఊపిరితిత్తు లాడించి వాళ్ళను బ్రతికించాడు డాక్టరుగారు వచ్చేలోపుగా.

రాజా: అప్పుడే కాదటోయి ప్రభుత్వంవారు బహుమతి యిచ్చారు?

పర: ఇస్తే, ఆ పడవవాడికి పంపించాడది. ఇంకా ఉన్నాయి వాడి వీరకృత్యాలు.

నళిని: మరి కానీండి! పర: కలకత్తాలో మేము నడిచి వెడుతూఉంటే, ఒక సార్జెంటు సైకిలు మీద వస్తూ నారాయుడికి తగిలి క్రిందపడ్డాడు. పడి ‘ఛండాలుడా’ అంటూ లేచి ‘నీబుర్ర బద్దలుకొడ్తాను’ అని మీదకు వచ్చాడు. నారాయుడు నవ్వుతూ నుంచొని మనిషి ఎప్పుడువచ్చి చేయెత్తి కొట్టబొయ్యాడో మెరుపువేగంలా ఆ చెయ్యి పట్టుకొని వాణ్ణి వెనక్కు తిప్పి చెయ్యిమెలిపెట్టి వదిలేసి ‘అనవసరంగా మీదకు రాకు. తప్పు దగ్గర ఉంచుకొని ఎగిరితే ఎవరూ భయపడరు పో’ అని తోవచూపాడు. దెయ్యంలా ఉన్న మనిషి పిల్లి అయ్యాడు. మాట్లాడక సైకిలు ఎక్కిపొయ్యాడు. అది చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. ఒక్కసారి వచ్చి నారాయుడు చుట్టూ మూగారు.

రాజా: ఇదిగో వచ్చాడు నారాయణం, వెయ్యేళ్ళాయువు.

పర: అయితే త్రిదశవర్యుడవైపోరా నారాయుడూ!

నారా: (లోపలికి వచ్చుచు) ఆలస్యమయింది, క్షమించాలి. నళినీ, సరళా కన్యలలో ఎవరైనాసరే, యీ అన్నకు ఒక ఔన్సుడు మంచినీళ్లు ఇస్తే చాలా సంతోషిస్తాడు.

రాజా: మీ మామగారేమన్నారోయి?

నారా: ఉండు ఈదాహం తీర్చుకోనియ్యవయ్యా.

నళినీదేవి లోనికి పోయి మంచినీరు దీసికొనివచ్చి యిచ్చినది. నారాయణరావు దాహము దీర్చుకొని కూర్చుండెను. మంగపతిరావు నారాయణరావును జూచి ‘రేపు మాయన్న వచ్చుచున్నాడు’ అనెను. ‘ఏ అన్న?’ యని నారాయణరావు పృచ్ఛజేసెను.

‘మా రెండవ అన్నయ్య.’

పర, నారా: చాలా సంతోషము.

రాజా: మాకు శల్యవిద్యలో ద్వితీయోపాధ్యాయుడుగా ఉండేవారు.

శ్యామ: (నారాయణరావును జూచి) అన్నగారూ! నటరాజన్ మీ ఆంధ్రులు వట్టి ఢాంబికులు అని వాదించాడు. నాకు జ్ఞానం వచ్చినతర్వాతనే చెన్నపట్టణం వచ్చాము. కనుక నాకు ఆంధ్రుల చరిత్రా, వారి స్వభావాలూ యేమి తెలియవు. చిన్నతనంలో తెలుగుదేశంలోగూడ ఉన్నామట.

నారా: ఒకసారి మీరంతా మా దేశంవస్తే బాగుంటుందని నా ఉద్దేశం. మా ఇంటికి కొత్తపేట అతిథులుగారండి. దేశం, దేశంలోని ఆచార వ్యవహారాలు, దేశం యొక్క వర్తమాన చరిత్ర అన్నీ జాగ్రత్తగా గ్రహించగలరు.

నళిని: మన ఆంధ్రుల్ని నటరాజన్ గారు చెక్కివదిలారు. మీరు దానికి సమాధానము చెప్పరేమండీ అన్నయ్యా!

పర: మన ఆంధ్రులకు ఉత్సాహం యెక్కువ. సమయం వచ్చిందంటే ఉత్సాహంతో వేలకువేలు జనము సిద్ధము. ఉత్సాహం తగ్గటంతోనే కనుచూపుమేర దూరాన్ని మళ్ళీ ఎవరూ కనబడరు. రాజా: ఆ ఉత్సాహం కూడా ఎక్కువకాలం ఉండదండి.

పర: దేశం అంతా గ్రంథాలయాలు అన్నారు. ఎక్కడచూస్తే అక్కడ గ్రంథాలయాలు కృష్ణదేవరాయ, వసురాయ, గౌతమి, రామమోహన, మోహనదాసు, తిలకు మొదలగు పేర్లతో దేశం అంతా గ్రంథాలయాలు. గ్రంథాలయ మహాసభలు, గ్రంథాలయ పత్రికలు. ఇప్పుడుచూస్తే ఏవో నాలుగో అయిదో బాగా పనిచేస్తున్నవి. తక్కినవి నామమాత్రా వశిష్టముగా కొన్ని, కొట్లాటలతో చప్పగా నశించిపోయినవి కొన్ని.

నారా: పత్రికలు రోజుకు రెండు బయలుదేరి నాలుగు నశిస్తున్నవి. ఎపుడో ఒకనాడు భీమాకంపెనీలు అలాగే బయలుదేరి నశించిపోయినవట.

పర: బందరులో పంచదార యంత్రాలయము, రాజనరేంద్రనగరిలో కాగితాల యంత్రాలయం, గుంటూరులో ఇనుపకర్మాగారం, ఏలూరులో గోనెగుడ్డల కర్మాగారము అలాగే అనేక కంపెనీలు బయలుదేరి, మాయమై పోయినవి కొన్ని, మరిగిపోతున్నవి కొన్ని.

రాజా: 1920 సంవత్సరములో ఊరికి ఒక జాతీయకళాశాల బయలుదేరినది. ఇప్పడు కొనఊపిరితో శారదానికేతనం ఒకటి ఉన్నది. బందరు జాతీయ కళాశాల ఎల్లాగో కాలం గడుపుతూ ఉన్నది, కాదురా నారాయణరావూ?

నారా: ఆశ్రమాల్లో పల్లెపాడు ఆశ్రమం ఏమయింది? ఆ మహానుభావుడు దిగుమర్తి హనుమంతరాయుడు పోవడంతోనే, ఆశ్రమం నశించింది.

శ్యామ: ఇది ఏమిటి ! అన్నగార్లు అంతా మనదేశాన్ని పట్టుకొని దూషిస్తున్నారే.

నారా: దూషణ పూర్తికావాలి శ్యామసుందరీదేవీ! కానీ పరం!

పర: తిట్టులు నువ్వే పూర్తి చెయ్యలేకపోయినావట్రా? సరే! ఒకసారి గబుక్కున దేశంఅంతా పరపతి సంఘాలు. ఎన్నో నశించాయి, కొన్ని సంఘాలు దివాళాతీశాయి. పోనీ, మూడురూపాయల వడ్డీకి మారువాడీ దగ్గర అప్పు తీసుకరావడం మానేరా అంటే అదీలేదు.

శ్యామ: దీనికంతకూ కారణం?

నళి: ఫీజు యిచ్చి ప్లీడర్ని పెడితేపిచ్చెత్తి యెదిరిపార్టీ తరఫున వాదించి ఎక్కడికో లేచిపోయిన వకీలులా ఉన్నారు మీరంతా.

నారా: హృదయదౌర్బల్యం. వెన్నెముక బలం లేకపోవడం. పట్టుదల హుళక్కి. నమ్మకము సున్న. అహంభావము అతిజాస్తి. ఒక్క నాయకుడు లేడు. అంతా నాయకులే. పెద్దలయెడ మర్యాదలేదు. పర: అందుకనే జ్యోతిషంలో మన దేశానికి రెండువందల సంవత్సరాల నుంచి కుజుడు రాజయ్యాడు. మనదేశం నుండి ఇతరదేశాలకి వెళ్ళితేనేగాని మనవాళ్ళకు పేరురాదు. బంగాళీవాళ్ళు, మహారాష్ట్రులు, పాంచాలురు, ఉత్తర హిందూస్థానంవారు వాళ్ళ దేశాల్లోనే గౌరవం పొందుతున్నారు.

నారా: ఇంకో పెద్దకారణం ఉన్నది. పూర్వం మహారాజుల ఆదరణ ఎక్కువ ఉండేది; ఇప్పుడు లేదు. ఆంధ్రదేశంలో కొన్ని పెద్దజమీందారీలు ఉన్నవి. వారు మరీ పెద్దవారు. వారి పూర్వీకుల పేరు నిలబెట్టక ధనం ఎన్ని విధాలో నశింపుచేయుట ఉద్దేశంగల కొందరు మహానుభావులు ఉన్నారు. వివిధ ఉద్యమాలకు సహాయం చేసే మాన్యులూ ఉన్నారు. తక్కినవారు ‘నన్ను ముట్టుకోకు నామాలకాకి’ అని అంతఃపురాల్లో కూర్చుంటారు. ఆంధ్రా పేపరుమిల్లు విషయంలో ఒక్క మహారాజు పూనుకుంటే ఈపాటికది ఎంత లాభకారి అయిఉండును? దేశానికి ఎంత ఉపకారం! అలాగే బందరు పంచదార ఫ్యాక్టరిన్నీ. ఈ పెద్ద జమీలులేని ప్రదేశం రైతువారిదేశం. అందరూ చిన్నరైతులు. వారు తమకు మించిన బ్రతుకు బ్రతుకుతూ మారువాడీలదగ్గిర, షాహుకార్లదగ్గిర అప్పు తెచ్చుటలోనే దేశోపకారం చేస్తూఉన్నారు.

పర: ఇదుగోనమ్మా సోదరీ! రేపు డిశంబరు 15వ తారీఖున చెన్నపురిలో ఆంధ్ర నవ వాఙ్మయసభ జరుగుతూఉన్నది. అప్పుడు చూద్దుకాని, ఆంధ్రుల ఉత్సాహం, కార్యశూరత్వమున్నూ.

సరళ: ఇంక వారంరోజులే ఉంటా!

రోహిణి: మా మంగపతి ఇంగ్లీషులో కవిత్వం వ్రాస్తాడు. అతడు రావచ్చునా?

పర: తప్పకుండా రావచ్చును.

శ్యామ: ఏమిటీ కవులసభ?

పర: ఇప్పుడు ప్రస్తుతం రెండు ఉద్యమాలు భాషావిషయంలో ఉన్నాయి తెలుగుదేశంలో. ఒకటి గ్రాంథికభాషా, పూర్వసాంప్రదాయ కవిత్వం. రెండు వ్యావహారిక భాషా, నూతనసాంప్రదాయ కవిత్వం. దీన్నే భావకవిత్వం అనికూడా అంటారు.

నట: నా బదులు పరమేశ్వరమూర్తి నిండా బాగుగా వాదించినాడుదా.

పర: ఉండవయ్యా ! అరవవాళ్లపని తర్వాత చెప్తాను. సంతోషించకు. అరవము అని అరుస్తారుదా మీరు. మమ్మల్ని మేము నిందించుకొంటూంటే సంతోషిస్తున్నాడు నటరాజన్ ఇందాకటి నుంచిన్నీ.

రోహిణి: భాషనుగూర్చిన వాదం ఏమిటది?

పర: ఏముందమ్మా? గ్రాంథికవాదం, వ్యావహారికవాదం. ఇప్పుడు దేశంలోఉన్న పరిస్థితులు చెప్తా. పూర్వం నుంచీ వచ్చిన గొప్ప గ్రంథాలన్నీ పద్యాలలో ఉన్నాయి. భారతం, భాగవతం, ప్రబంధాలు అవి ఏమిటో తర్వాత చెబుతా. ఆ పద్యాలతోపాటు గద్యమూ ఉన్నది. నన్నయభట్టు భారతం వ్రాసిన కవులలో మొదటికవి. తెలిసివున్నంతవరకు ఆంధ్రభాషలో గ్రంథము వ్రాసిన మొదటికవి. ‘వాగనుశాసనుడు’ అని పేరు ఆయనకు. ఆయన సంస్కృతంలో తెలుగుభాషను విధిస్తూ వ్యాకరణం వ్రాశారు. తర్వాత చాలమంది వ్యాకరణాలు వ్రాశారు అప్పకవి మొదలైనవాళ్ళు. ఆ మొదటి వ్యాకరణాన్ని అనుసరిస్తూ ఏదో కవిస్వతంత్రాలు అక్కడక్కడ చూపిస్తూ తర్వాత కవులంతా ఆ వ్యాకరణాన్ని అనుసరించారు. కాని 1850 దాటేవరకు తెలుగులో వచనగ్రంథం సరియైంది ఒకటి పుట్టలేదు. చిన్నయసూరి, వచన నన్నయ అయ్యాడు. బాలవ్యాకరణం వ్రాశాడు. ఆయన నీతిచంద్రిక అని పంచతంత్రాన్ని తెలుగువచనంలో భాషాంతరీకరణంచేస్తూ పూర్వగ్రంథాలలో ఉండే గద్యభాషే వ్రాశాడు. వీరేశలింగకవి, చిలకమర్తి లక్ష్మీనృసింహకవి ఇంకా అనేకు లా భాషను అనుసరించారు. దానికి గ్రాంథికభాష లేక వ్యాకరణయుక్తమైన భాష అని అంటారు.

రాజా: అబ్బ! గుక్కతిప్పకుండా ఒక్కబిగిని ఉపన్యాసం ఇచ్చాడు!

పర: కాని 1914 ఆప్రాంతాల్ని ఒక ఉద్యమం బయలు దేరింది. గురజాడ అప్పరాయకవి, సెట్టి లక్ష్మీనరసింహకవి మొదలైనవారు దానికి మొదటివారు. గిడుగురామమూర్తిగారు ఆ వాదానికి అర్జునుడు. వాళ్ళనేది ఏమిటి? పద్యాలమాట అటుంచండి. కాని పూర్వం నుంచి ఉత్తమతరగతులవాళ్ళు ఉపయోగించిన భాష మనకు ఆదర్శం అవ్వాలి వచనరచనకు, ఇంగ్లీషు భాష వచనం ఎప్పటికప్పటికి రాజసభలో మాటాలాడుటబట్టి మారుతూ ఉంటుంది. మనదేశంలో ఉత్తమకులాల భాషనుబట్టి మార్చుకోవాలి. లేకపోతే భాష ఎదగడం మానుతుంది. ఎదుగుట మానితే చచ్చిపోతుంది. భాషను రైలుపట్టాల మీద నడువమనకూడదు. భాష ఒక వ్యక్తి , ఒక ఆత్మ. అది యుగాలు బ్రతకాలి. అనేక యుగాలు బ్రతికి ప్రాణము వదిలిందికాబట్టే సంస్కృతం మహానిధి అయింది. వేదభాష వేరు, పురాణభాష వేరు, నాటకభాష వేరు. ఊరికే ఎదిగి హిమాలయాన్నికూడా మించాలి భాష. వ్యావహారికంలో ఉండే భాషే అలాగ ఎదుగుతూంది. ఆ భాషే మన వచనభాష చెయ్యాలి అని వాదిస్తున్నారు.

రాజా: రెండవ ఉపన్యాసం అయింది. ఇంకా!

పర: పూర్వకవులు మహారాజులను నాయకుల్నిచేసి, మహారాణులను నాయికలను జేసి గ్రంథాలను సృష్టించారు. కాలాన్ని బట్టి శృంగారం ముఖ్యరసం చేశారు. వారు వ్రాసిన పురాణాలు, మహాగ్రంథాలు, ప్రబంధాలు బాగానే ఉన్నవి. ఇంకా అవే అనుకరిస్తే పేలవమైపోతాయి అని యువకులు క్రొత్త మార్గాలు తీశారు. ఇంగ్లీషుభాష ఒకటి చాలా ఉద్బోధం కలిగించింది. ఈ క్రొత్తకవిత్వానికి మార్గదర్శకులు గురజాడ అప్పారావుకవి. బొబ్బిలిపాట అదీ చూడండి. ఎంత మాధుర్యంగా ఉంటాయో! కాబట్టి క్రొత్తమార్గాలు తీయండయ్యా అన్నారు. తమ భావాల్ని, తమ ప్రేమనీ ఆశ్రయించి వ్రాసేవారు, జానపదుల జీవితాల్ని దర్శింపచేసేవారు, పురాతన ఆంధ్రుల మహాచరిత్రలు స్మరింపచేసి పుల్కరింపులు కలుగజేసేవారు__ఈరకాలుగా ఉన్నా రీనాటి కవులు.


౧౯ ( 19 )

ఆంధ్ర నవకవి సమితి

‘ఆంధ్ర నవకవుల కూటమి’ అని పెద్దఅక్షరములతో పచ్చయప్ప కళాశాల సింహద్వారముపై పెద్దఅట్ట కట్టినారు. మధ్య సభామందిరమును, వేదికయు మనోహరముగ నలంకరింపబడినవి. అలంకారాది సమస్త యాజమాన్యము నారాయణరావు నెత్తిపైన బడినది. వరదరాజస్వామివారు అధ్యక్షులు. ఆహ్వాన సంఘాధ్యక్షులు ఆంజనేయకవి, ఆహ్వాన కార్యదర్శి నారాయణరావు, పరమేశ్వరమూర్తి, రోహిణీదేవి మొదలగువారు ఆహ్వానసంఘ సభ్యులు. అనేక మంది కళాశాలా విద్యార్థులను బ్రోగుచేసి, వారలకు ఉత్సాహము గఱపి నారాయణరావు కార్యక్రమమంతయు విచిత్రముగ నొనగూర్చెను.

కూటమి మూడురోజులు. సమస్తమగుఖర్చులకు నారాయణరావు మున్నూరు రూపాయలు చందావేసెను. జమీందారుగారు నూరురూపాయలిచ్చిరి. నాగేశ్వరరాయలు నూరు, అల్లాడి కృష్ణస్వామయ్య గారు నూరురూపాయలు, ఇంకను వకీళ్ళు, షాహుకార్లు మొదలైనవారందరు చందాలు వేసినారు. సుమారు రెండువేల రూపాయలు ప్రోగుచేసి నారాయణరావు ఆహ్వానసంఘము వారికిచ్చి, సరళను, యువకవియు భారతీ పత్రికాస్థానములో వ్రాయసకాడునగు రామలింగరావును గోశాధిపతులజేసి, జాగ్రత్తయని వారికప్పగించినాడు.

సమయములో సమయమని చిత్రకళా ప్రదర్శనము, కవుల ఛాయాచిత్ర ప్రదర్శనము, నవీనకవుల ముద్రితా౽ముద్రిత గ్రంథముల ప్రదర్శనము నేర్పాటు చేసెను. చిత్రకళాది ప్రదర్శనములకు గళాహృదయుడగు కజిన్సుపండితుని నేతగా నాహ్వానించెను.

ధనాభావముచే సభలకు రాజాలరని యెంచిన కవులకు రానుపోను ఖర్చు లీయబడునని తెలియజేయుచు తానే తన స్వంతములోనుంచి ధనమును బంపినాడు.

ఆహ్వానము లచ్చువేయించినారు. కార్యక్రమములు ముద్రించినారు. ధనము లోటగునేమో, తనకు మించిన ఖర్చు తగులుబాటగునేమో యని యువకుల గొందరిని నాటకమాడ నేర్పరచినాడు. చిత్రకళా ప్రదర్శనమునకు దేశదేశ చిత్రకారుల కాహ్వానము లంపినారు. శాంతినికేతనమునుండి నందలాలుగారు, కలకత్తా నుండి అవనీంద్రనాథఠాకూరుగారు, లక్నో నుండి అసితకుమార హవల్దారుగారు, పంజాబ్ నుండి అబ్దుల్ రహమాన్ చౌకుతాయిగారు, బరోడానుండి ప్రమోదకుమార చటోపాధ్యాయులు, మైసూరునుండి వెంకటప్పగారు, బొంబాయినుండి సాలొమానుగారు, అహమ్మదాబాదునుండి కనూదేశాయిగారు, మణిభూషణగుప్తగారు, ముజుందారు, సుధాంశుచౌదరి, దేవీప్రసాదరాయి చౌదరిగారలు మొదలగువారును; ఆంధ్రదేశములో రాణ్మహేంద్రవరమునుండి వరదా వెంకటరత్నంగారు, శ్రీమతి దిగుమర్తి బుచ్చికృష్ణమ్మగారు, చామకూర భాష్యకార్లుగారు, భీమవరమునుండి అంకాల సుబ్బారావుగారు, గ్రంధి శేషారావుగారు, తంగెళ్లమూడి వేంకటసుబ్బారావుగారు, గుంటూరునుండి గుఱ్ఱం మల్లయ్యగారు, అనిశెట్టి సుబ్బారావుగారు, చెన్నపురిలోని కవుతా రామమోహనశాస్త్రిగారు, కేశవరావుగార్లు, గుజరాతునుండి కవుతా ఆనందమోహనశాస్త్రిగారు, విశాఖపట్టణమునుండి తలిశెట్టి రామారావుగారు, కాకినాడ నుండి చామకూర సత్యనారాయణగారు, నరసాపురముమండి వెన్నా శేషగిరిరావుగారు, ఏలూరునుండి చండ్రుపట్ల బాపిరాజు, రామారావుగారలు, పెనుగొండ నుండి వెంకట్రావుగారు యింకను బాలచిత్రకారులు తమ తమ చిత్రములను ప్రదర్శనమునకు బంపిరి.

ఆహ్వానము లంగీరించి ఆంధ్రదేశ వివిధ మండలాల నుండి రాయప్రోలువారు, విశ్వనాథవారు, తల్లావఝులవారు, కురుగంటివారు, దేవులపల్లివారు, వేదులవారు, నండూరివారు, కాటూరివారు, మాధవపెద్దివారు, దువ్వూరివారు, పింగళివారు, మునిమాణిక్యులు, కవిరాజులు, మొక్కపాటివారు, నోరివారు, నాగేంద్రరాయలు, చింతావారు, పంచాగ్నులవారు, కరణంవారు, కోలవెన్నువారు, మల్లంపల్లివారు, తుమ్మలవారు, భావరాజువారు, కవికొండలవారు, మల్లాదివారు, పువ్వాడవారు, త్రిపురారిభట్లవారు అనేకులు సభల నలంకరించినారు.

పచ్చయప్ప కళాశాలాభవనములో కవుల సభలుజరిగినవి. నానాప్రాంతాగతులయిన సుప్రసిద్ధ కవులు తాము క్రొత్తగా రచించిన పద్యములు, పాటలు మనోహరముగ జదివి వినిపించినారు. సాయంకాలముల గోఖలేభవనమున గొప్ప ఉపన్యాసముల నిచ్చినారు. ఉత్తమ గాయకులు సంగీతము పాడి వినిపించిరి. ఒకనాడు కూచిపూడివారి భాగవత ప్రదర్శనము, ఒకనాడు జంగంకథ, దేశీనాట్యములు మున్నగు వినోదములు ప్రదర్శింపబడినవి. రసజ్ఞులు, విమర్శకులు కవితావిషయములగూర్చి చక్కని ఉపన్యాసములు చేసిరి. ఒకనాడు శ్యామసుందరీదేవి చెల్లెండ్రతో పాటకచేరి చేసి, సభ్యుల నానందమున నోలలాడించినది. ఆ సమయమున నారాయణరావు ఫిడేలుతో వారి ననుసరించెను. పరమేశ్వరుడు తాను రచించిన ఏలపాటలు సహజ మధురతాపూర్ణస్వనమున సాభినయముగ బాడి వినిపించెను. అతిథులందఱకు హిందూ యువజన సమాజ భవనమున ముప్పొద్దుల షడ్రసోపేత భోజనములు, ఫలహారములు నమర్చిరి.

అధ్యక్షులవారు మధురముగ, గంభీరముగ ఉపన్యాసము గావించినారు. కవిత్వము జీవితమూలము కదిపిరావలెను. పైనుంచి తెచ్చిన అలంకారము కారాదు. కవి బ్రతుకులో భాగమై అది మొలకెత్తవలెను. ఈరీతి వారు గంగాప్రవాహమువోలె, సముద్ర కెరటములరీతి నుపన్యాసము లిచ్చినారు.

భావకవిత్వము అనుమాట పనికిరాదన్నారు గొందరు. భావములేని కవిత్వం ఏది? ఆ పదము తప్పక తీసివేయుడని ఉపదేశించిరి. కాని భావమన అర్థముకాదు. రసస్వరూపమైన భావమే సరిఅయిన పదమనియు, భావమన హృదయము, మనస్సు అనియు, భావజ్ఞు డా యర్థమును గోచరింప జేయుననియు, కవిజీవితమును ప్రతిఫలింపజేసికొన్న కావ్యము భావకవిత్వమని కొందరు వాదించిరి. అందరు భావకవిత్వమన్న (సబ్జెక్టివ్) కవియే నాయకుడైన కవిత్వమనిరి.

ఇరువురు భారత భాగవతములు పూర్ణకవిత్వం కాదన్నారు. సంస్కృతమునుండి ఆంధ్రీకరణము చేసినంత మాత్రమున అది కవిత్వమా యనిరి.

కాని ఆ యిరువురను ఖండించి మనల మన మెంతమెచ్చుకొనుచున్నను భారత భాగవతాది మహాగ్రంథకర్త లవతారమూర్తులని పూజింపవలెనన్నారందరు.

పాటలు వ్రాయవచ్చునన్నారు. పాటలును కవిత్వమని ఒప్పుకొన్నారు.

ఇక నెట్టిభాష ఉపయోగించవలెనన్న ప్రశ్న వచ్చినది. వ్యాకరణ యుక్తమగుభాష నుపయోగించదలచిన వారు పద్యములకు, పాటలకు నుపయోగింపవచ్చుననియు, వచనగ్రంథములకు దప్పక వ్యావహారికమే యుత్తమమనియు వచించినారు.

పరమేశ్వరు డిట్లు వాదించినాడు: ‘భాష పెరుగుతుంది. భాషకూడా ఒక వ్యక్తి. భాషకూ పుట్టుక, వృద్ధి, చావు అని మూడు స్థితులున్నాయి. ప్రపంచంలో ఎన్నోభాషలు పుట్టాయి, పెరిగాయి, నశించాయి. కొన్ని చనిపోయినచెట్టు, రాయి, లోహము మొదలయినవి శిల్పరూపముతో, నాణెములును నగలు మొదలయిన రూపాలతో జీవించిఉన్నట్లు సలహా భాషలక్రింద జీవించి ఉండవచ్చును. కాని అవి నిధులు, జీవభాషలు మాత్రముకావు. సంస్కృతం చూడండి అనేక వేల సంవత్సరాలు జీవించింది. నేడు మహానిధియైఉన్నది. అలాగే లాటిను, గ్రీకు, హేబ్రూ మొదలగు భాషలు. మీరు ఎప్పుడు భాష ఎదుగులేకుండా వ్యాకరణం ఏర్పాటుచేసి శాసిస్తారో అప్పటినుంచి వృద్ధి పొందడం మానివేస్తుందేమో. అలాగే సంస్కృతాన్ని శాసించగానే ప్రాకృతం వచ్చింది. అది శాసించగానే పాలీవచ్చింది. అది శాసించబడగానే వంగభాష, బిహారీభాష, ఒరియా, హిందీ భాష మొదలైన భాషలు వచ్చాయి. అలాగే తెనుగును శాసించకండి. అప్పుడే రెండురకాల భాషలు__గ్రాంథికం, వ్యావహారికం వచ్చాయి. ఈ రెంటికి గట్టులు దూరం అవుతున్నాయి. ఏలాగో వంతెన కట్టాము. ఇక కట్టలేనంతదూరం అయితే ఇంకో కొత్తభాష తయారవుతుంది. ఆ భాష సంస్కృతంలా నిధి కావచ్చును అనుకుంటారేమో. ఆ అదృష్టం సంస్కృతం దివ్యభాష గనుక దానికి పట్టింది. కాని ప్రతిదానికీ పట్టదు.’

ఈ రీతిగా మాట్లాడినాడు.

వ్యావహారికమును కావ్యభాష యనినారు. కాదు వచనకావ్యములు వ్యావహారికములోననే యుండవలెనని మరికొందరు వాదించిరి. కావ్యలక్షణాలు ఉండవలెను. కాని, భాష ఉపాధి. అదియును కావ్యానికి ముఖ్యాంగము కాబట్టి ఏ భాషనైనా ఉపయోగించవచ్చునని, అది కావ్యములో లీనమైపోవలెనని తీర్మానము జయమందినది. నారాయణరావు చిత్రకళను గురించి మాట్లాడినాడు చిత్రకళా మహాసభలో.

‘కళ ఆనందస్వరూపం. ఒక వ్యక్తిలో జనించిన ఆనందం కళాస్వరూపంతో వ్యక్తం అవును. ఆ వ్యక్తమైన కళ సూచనమాత్రం కాక , సంపూర్ణముగా ఆనందమును వ్యక్తీకరించాలి. ఆనందం ఎలా కలుగుతుంది? సృష్టి మనదృష్టి పథములోనికి వచ్చినప్పుడు అనగా సృష్టిలో శ్రుతిపూర్ణమగు విషయం నీ దృష్టిపథాన్ని పడినప్పుడు నీకు ఆనందం కలుగుతుంది. దివ్యమై పరబ్రహ్మ స్వరూపమైనది ఆది శ్రుతి. ఆ శ్రుతి ప్రకృతిలో అనేకరకములగు శ్రుతులుగా వ్యక్తమవుతుంది. రంగులు రంగుల కలయిక, స్వరములు వాని కలయిక, వస్తువులు వాని కలయిక, పరిమళాలు వాని కలయిక, రేఖలూ వాని కలయిక, హృదయములు, జీవితములు, మనస్సులు, చరిత్రలు వీని కలయికలు, ఆత్మలు వాని కలయిక ఇవి శ్రుతిస్వరూపాలవుతవి.

‘ప్రపంచంలో వ్యక్తుల జీవితాలు భిన్న భిన్న శ్రుతులతో ఉంటవి. ఎవని శ్రుతినిబట్టి వానికి తగిన ఆనందం కలుగుతుంది.’

‘ఆ ఆనందం వ్యక్తీకరించే శక్తి పూర్వకర్మ సముపార్జితం. అలా వ్యక్తీకరించలేనివాడు ఆ వ్యక్తీకరణము గోచరించినప్పు డానందిస్తాడు.’

‘వ్యక్తీకరించగలవాడు స్రష్ట. అట్టి కళాసృష్టిని చూచి ఆనందించువాడు కళాభిజ్ఞుడు.’

‘సంగీతహృదయంగల వ్యక్తి ఒక చిన్న సెలయేటి పతనంలో సంగీతం విన్నాడు అనుకోండి. అతని హృదయంలో ఆనందం పుట్టింది. ప్రశ్రవణగానసదృశమగు పాట రచించినాడతడు. అది విని మన మానందిస్తాము.’

‘ఒక కొండ, కొండ ప్రక్క మహానది, నీలాకాశం, సాయంత్రపు బంతి రంగు మేఘాలు ఒక చిత్రకారుడు చూసినాడనుకోండి. అతనికి ఆనందం కలుగుతుంది. ఆ ఆనందం ఒక కొండను, మహానదిని, మేఘాలను చిత్రించి వ్యక్తీకరిస్తాడు. ప్రకృతిలో అపశ్రుతిభూయిష్టములైనవానిని చెట్టులు, చేమలు ఏమన్నాసరే ఉంటే పరిహరించి ఎక్కడైన రేఖలరాగంలో సంపూర్ణత లేకపోతే, ఏ చెట్టో, పుట్టో, పడవో సరియైన స్థలములో కల్పించి చిత్రంచేస్తాడు, అది చూచి ఆనందిస్తాము.

‘కవీ అంతే.

‘మనము ప్రకృతిని చూసి అనుకరిస్తున్నామనుకున్నారేమో! కాదు. ప్రకృతిదృశ్యం చూసినప్పుడు ఆనందం పొంది, ఆ ఆనందం శ్రుతిలోఉంచి, అట్టి శ్రుతులు నాలిగింటిని కలియజేసి, ఒక చిత్రం సృజింపవచ్చును.’

‘కళావిషయం ఇది ప్రకృతియేనా అని భ్రమింపజేసేదికూడా కావచ్చును. కుక్క కూత నేను కూశాననుకోండి, మీరంతా సంతోషిస్తారు. కాని ఆ ఆనందం చాలా హీనమైనది. కుక్క కూతలోంచీ అపశ్రుతి తీసివేసి శ్రుతియుక్తం చేసి గానకళకు చేర్చవచ్చును. అపశ్రుతి తీసివేయడం, ప్రకృతిలో దొరికిన కొవ్వురాయి అగు వజ్రమును సానబెట్టి తళ తళ మెరయు రత్నమును చేయుటవంటిది.’

ఈ రీతిగా నారాయణరావు గంభీరోపన్యాసము గావించెను. ఆనందము నాలుగు రకములుగ నుండునట. భౌతికము, మానసికము, హృదయజనకము, పారలౌకికము, చక్కని బాలికను పొంకములగు నవయవములతో, దిసమొలతో రచించినచో శరీరానందము కలుగునట. లతలు, పండ్లు అలంకారములుగా చిత్రించినచో వాని యద్భుతమునకు మనస్సు సంతోషించుననియు, అట్టిదే స్వరకల్పనయనియు అతడు వచించినాడు. కరుణ, భయానకము, విషాదము మొదలగు రసము లుప్పతిల్లు చిత్రవిషయములు హృదయమును కలంచును. భగవంతుడు, మహాత్ములు, అవతారముల చరిత్రలు, ఉత్తమచరిత్రలు, గాథలు, సాంఖ్యము, కర్మయోగము, భక్తియోగము మొదలగునవి పారలౌకికములు ఆత్మానందము నిచ్చునని నారాయణరా వనెను.


౨౦ ( 20 )

క్లిష్ట సమస్య

సభలన్నియు పూర్తియైనవి. కార్యక్రమ మంతయు సర్వోచ్చముగ జరిగినదనియు, చిత్రకళాప్రదర్శనము, కవులకూటమి, బొబ్బిలికథ, భాగవతము, తోలుబొమ్మలు, నాటకము లుత్కృష్టములై యున్నవనియు ఆంధ్ర, హిందూ, స్వరాజ్య, భారతి మొదలగు పత్రిక లన్నియు వాకొన్నవి.

చిత్రపటములలో అత్యుత్తమచిత్రమునకొకటి, పౌరాణిక చిత్రములలో నుత్తమమగుదాని కొకటి, మానవజీవిత విషయములు రచించిన చిత్రములలో నుత్తమమున కొకటి, మొత్తము మూడు బహుమానములు, రెండువందలు, నూరు, నూరురూపాయల చొప్పున నిచ్చినారు. ఆంధ్రనారీమణులలో నుత్తమచిత్రము వేసినవారి కొకబహుమతి నూరు రూపాయలు, ఆంధ్ర చిత్రకారకులలో నుత్తమ చిత్రకారులకు రెండు బహుమతులు నూరురూప్యముల చొప్పన నిచ్చిరి.

ఆ యేడు ప్రచురింపబడిన నవీనగ్రంథములలోను నుత్తమ గ్రంథమునకు ఐదునూర్ల రూపాయలు బహుమతి నిచ్చినారు.

ఉత్తమ కథానికమునకు రెండువందలు, ఉత్తమ పద్యకావ్యమునకు రెండువందలు, ఉత్తమ గీతికా కావ్యమునకు రెండువందల రూపికలు బహుమతుల నిచ్చినారు. రెండవ తరగతి బహుమతులుగా వెండి పెట్టెలు, బంగారుపతకాలు, వెండిగిన్నెలు అయిదువందల రూపికల ఖరీదుగలవి అర్పించినారు.

నవీనకవుల ఛాయాచిత్రములు, వారి వారి కవిత్వములలో నొక్కొక్క పాటతోగాని పద్యముతో గాని చేర్చి ఒక గ్రంథము ప్రచురించుటకు నారాయణరా వేర్పాటుచేసెను.

నాటకమునకు పంతొమ్మిదివందల రూపాయలు వచ్చినవి. భోజనమునకు, ఫలహారములకు నారువందలైనవి. అద్దెలకు మూడువందలు. అచ్చులకు నూటయేబది, దండలు ఛాయాచిత్రములకు నూటయేబది రూపాయలు, భాగవతులకు, తోలుబొమ్మలవారికి, బొబ్బిలిపాటవారికి, రానుపోను ఖర్చులకు, బహుమతులకు నాలుగువందలైనవి. మొత్తము చిల్లర ఖర్చులతో నాలుగువేలు సమావేశమునకు ఖర్చయినది. నారాయణరావునకు కొందరికవుల రానుపోను ఖర్చులతో చేతి సొమ్ము మూడువందలైనది. ప్రదర్శనమునకు రెండువందల పాతికరూపాయలు వచ్చినవి. మొత్తముమీద సొమ్ము మిగులలేదు. కాని ఇట్టి ఉత్కృష్టమైన సభా కార్యక్రమము ఎప్పుడు నెక్కడ జరుగలేదని లోకమంతయు ననుకొన్నారు.

నారాయణరా వేదో యొకపని కల్పించుకొని తనహృదయమును గలంచుచున్న వేదన మఱచిపోవ యత్నించుచుండెను. తన మామగారు మొన్న వచ్చి క్రిస్టమసుకు శారదను కొత్తపేట పంపవలయునని సుబ్బారాయుడుగారు వ్రాసినట్లును, దానట్లు బంపుటకు నిశ్చయించుకొంటిననియు దెలిపినారు. శారదను కొత్తపేట నుండి తాను చెన్నపురి తీసికొనిరావలయునట. ఆమె పరీక్షకు వెళుచుండుటచే దా నామెకు పాఠములు బోధింపవలయునట. ఆమె మదరసులో జదివి రాజమహేంద్రవరములో జరుగు పరీక్షకు 1929 మార్చి నెలలో వెడలునట, తన మామగారు తీసికొనివెళ్లుదురట.

ఆమెతో నెట్లు తాను కలిసియుండుట? పులిమీద పుట్ర యనునట్లామెకు గురువై బోధించుటా? ఇంతకు నా బాలిక యొప్పుకొనునా? తండ్రి మాట యన్న తప్పదు గాబోలు. ఆమెయే తల్లితోడ జెప్పి యీ మార్గ మేర్పరచినదేమో? అంత యదృష్టమా! ఇది మామగారి యాలోచనయే యగును. తప్పదు. తమ యిద్దరి వైఖరియు దెలిసి యిట్లాచరించలేదుగదా? తనపై నింత ప్రేమ యేలనో మామగారికి? ఆయన అమృతమూర్తి. దివ్య సౌందర్యగాత్రయగు నా బాలిక యిట్లాచరించినదేమి? ఆమె దుష్ట హృదయ కాలేదుగద! ఛీ! తానెంత దుర్మార్గుడో! పవిత్రచరిత్ర లగు భారత నారీమణులలో నొకరితనైన తుచ్ఛుడగు పురుషు డనుమానింపదగడు. తన యంతరాత్మ యా బాలిక పవిత్రచరిత్ర యని పాటలు పాడుకొన్నదే. పోనిమ్ము, తన ప్రేమ యంత గంభీరమై, నిర్మలమై ప్రవహించుచుండ తన చిన్నారిభార్య, తన ప్రేమమందిర పూజాపీఠస్థదేవి తన్ను తిరిగి ప్రేమింపదా?

ఆ బాలికను బ్రేమచే ముంచివైచి, ఆమెకు దన హృదయకమలమున కమలాబాల నొనర్చుకొనవలయును.

ఆమె హృదయం నొవ్వకుండా సంచరింపగలనా? మేమిద్దరమూ ఇచ్చట ఈ సముద్రం ఒడ్డున ఉండిపోగలమా!

‘నీకు నాకూ జోడు అయితే
మల్లెపూల తెప్పగట్టి
తెప్పమీద తేలిపోదం పదరా’

అన్నట్లు మా దివ్య ప్రణయాన్ని తెప్పగట్టి తేలిపోలేమా?’ అతని కన్నుల నీరు తిరిగినది.

తన ప్రేమ మవ్యాజమేనా యని నారాయణరావు హృదయములో బ్రశ్నించుకొన్నాడు. ప్రేమలేని పశువుకన్న తుచ్ఛకామియగు మానవుడు మేలని వివేకానందు డనినాడే! కళంకపూర్ణమగు బ్రేమనైన నెరిగిన వ్యక్తియే, ఏనాటికైన భక్తి నెరుంగ గలడని గదా వివేకానందమహర్షి యనినది.

కావున సకామమగు ప్రేమయు యుక్తమేనని యర్థమిచ్చునుగద. తుదకివి యన్నియు నీశ్వరప్రేమగా పరిణమించి చరితార్థములగునని నారాయణుడు భావించుకొన్నాడు.

భార్య యెట్లును తనతో సంసారమున కిచ్చగించుటలేదుగదా! అవకాశము దొరికినందుకు తా నీ సమయముననే యన్నియు వదలి యే హృషీకేశము నకో, యే హిమాలయ నగశ్రేణికో పోయి, యచ్చట గురుమహారాజును వెదకి జ్ఞానవిద్య నేర్చికొని యేల తపస్సు చేయకూడదు? ఏనాటికైన ఏజన్మమునకైన నా మార్గమునే వెదుకవలయునుగదా? క్షణికమై, యనిత్యమైన యీ నీచపుం బ్రతుకు ఏల వదలలేము? రాళ్లను గాలికన్న తేలికచేసి యాకాశమున కెగుర వేయుట యెట్టిదో యీ జన్మమును దరింపజేయు ప్రయత్నమట్టిది. తానంతటి యదృష్టవంతుడా? ఛీ! తన దురదృష్టపు జీవితమునకు వెలుగు పొడచూపు మార్గము గోచరించినను దాని ననుసరించు ధైర్యము చాలకున్నదే! రామచంద్రా! భక్తపరాయణా! నీదే భారము.

ఇంతలో పరమేశ్వరమూర్తి యచ్చటకు వచ్చినాడు. వారిరువురు సముద్ర తీరమున గలిసికొనవలెనను సంకేత మేర్పరచుకొన్నప్పుడు, యువతీ కళాశాల కెదురుగ కలసికొందురు. రాజారావు అమలాపురం వెడలిపోయినాడు. పరమేశ్వరమూర్తి భార్య రుక్మిణి క్షేమముగ నున్నది. ఏది యెట్లయినను మంచిదని యామెకు సంపూర్ణారోగ్యము కలుగువరకు దనయింట నుండవలెననియు, పరమేశ్వరుడు తనయింట భోజనము చేయవలెననియు నారాయణరావు మిత్రుని బలవంతముజేసెను.

‘పర! జనవరి నుంచి శారదను గొనివచ్చి కాపురం పెడుతున్నాను.’

‘మంచిది మంచిది! చేయి యేది? నాకు సంతోషముగా ఉందిరా?’

నారాయణరావు శారదను బ్రేమించుచున్నంత గాఢముగ నారాయణు నామె ప్రేమించుట లేదనియు, తనమిత్రు డందులకై మిక్కుటముగ బాధ ననుభవించుచున్నాడనియు బరమేశ్వరుడు గ్రహించినాడు. తానుమాత్రము రుక్మిణి తన్ను ప్రేమించినంత దా నామెను ప్రేమించుచున్నాడా? పరమేశ్వరుడు తాను నిర్మలుడనని చెప్పలేడు. మనసెప్పడును బంకిలమగుచుండును. కొంచె మందమయిన వనిత కనబడినప్పుడెల్ల పరమేశ్వరుడు విచారముపొందును. ఆమెను భావనాలోకమున వివస్త్రజేసి యవయవములన్నియు మనోనేత్రముచే బరీక్షించుకొనును. ఆతడు శిల్పి.

రుక్మిణి కురూపి కానేకాదు, దివ్యసౌందర్యవతియు గాదు. ఒక్కొక్కప్పు డామె సౌందర్యము ఉత్తమముగ గన్పట్టును. భర్త కిసుమంత కోపము రానీయదు. సంసారము చేయుటలో కొద్దిలో కొండలు చూపగలదు. ఆమె పొదుపరి. కాని యనవసరమగు ఖర్చు చేయకుండుటలోనే యా పొదుపు. భర్త తెచ్చిన ధనములో షడ్రసోపేతమగు భోజనము, గృహాలంకారములు పోను ధనము మిగిల్చి, భర్త స్వంతఖర్చులకు బదిరూపాయలు నెలకిచ్చి, నెలకు బది, పదిహేను సేవింగ్సు బ్యాంకిలో ధనము నిలువచేయును.

భార్య యెదుట నున్నచో బరమేశ్వరుని కామెయే మనోజ్ఞానమూర్తి వలె గోచరించును. పరమేశ్వరు మోహము మహాలక్షుభిత సముద్రము వంటిది. అప్పు డాతని భార్య ఆనందములలో గరిగిపోయి యాతనిలో నైక్యమైపోవును.

రుక్మిణికి, సూర్యకాంతమునకు బ్రాణస్నేహము కుదిరినది.

‘వదినా! నీకు చిన్న పాపాయి పుట్టినప్పుడు నన్ను రోజూ యెత్తుకో నిస్తావా? నేనేమో నీళ్లుపోస్తా! ఉగ్గు పెట్టడం నా చేత కాదు. అక్కయ్యల పిల్లలని నేనే ఎప్పుడూ ఆడించేది. పరమేశ్వరం అన్నయ్యకీ, మా చిన్నన్నయ్యకీ చంటిబిడ్డలన్న అంత ప్రేమ యేమిటి వదినా?’

రుక్మిణికి రాబోవు ఆనందస్మృతి గన్నీరై ప్రవహింప, మోము ప్రఫుల్లమై వెలుగ, సూర్యకాంతమును దన హృదయమునకు హత్తుకొని యా బాల నుదురు ముద్దిడుకొన్నది.

పరమేశ్వరమూర్తి తన చుట్టములలో నిరువురు యువతులతో గొంచె మనుమానముపడవలసినరీతి సంచరించినట్లు తన భార్యకు తోచినది. అప్పడు రుక్మిణి పడిన బాధ వర్ణనాతీతము. పరమేశ్వరు డది గ్రహించినాడు. భార్య కడకు బోయి యామె పాదములపై దన మోమునుంచి కన్నీటిచే వానిని దడిపినాడు.

నిజముగ నొక బాలికతో నాతడు రెండు మూడుసారులు ఆవేశపూర్ణము, భయంకరము నగుకలయిక ననుభవించి యథోలోకమున బడినాడు. ఆమెభర్త మోటువాడు. ఆ బాలిక భర్తయెడ హృదయమున నసహ్యించుకొనుచుండియు, తెచ్చి పెట్టుకొనిన హాసముచే మోము వైవర్ణ్యము చెంద, నాతనితో కాపురము చేయుచున్నది. చిన్నతనమునుండియు బరమేశ్వరుని ప్రేమించినది. ఆమెయే పరమేశ్వరునిపై దనకు తమియున్నదని భావము ప్రకటనజేయుచుండినది. ఆ బాల చక్కని యవయవస్ఫుటత్వము కలిగి, యందముగ నుండును. పరమేశ్వరుడు పంకిలజీవితుడైనా డామెతో.

పరమేశ్వరుడు సంపూర్ణముగ నథోలోకవాసి కాకుండ నాతని రక్షించునది సౌందర్యపిపాసాపూర్ణమగు నాతని హృదయమే! అందమయిన వనిత కానిచో నాతనికి మనస్సు చలింపదు. ఆ వనిత చుట్టునున్న విషయములు నందమైనవి కావలెను. భావము నైన అపశ్రుతి కానరాగూడదు. కావుననేయాతడు ఒక్కబాలతో మాత్రము భౌతికానంద మనుభవించినాడు. ఆ సంతోషము పంకిలమైనదను అపశ్రుతియే ఆతని గలంచివేయ అచ్చటనుండి పరనారీసాంగత్యము సంపూర్ణముగ మానినాడు.

రోహిణీదేవితో నాతడు స్నేహము చేయుటకు వీలుకలిగినప్ప డా బాలికకు దనహృదయము సమర్పించుకొన్నాడు. రోహిణీదేవియు బరమేశ్వరు డన్న హృదయాంతరమున గలగిపోవునది. అతనిమాట లామెకు మైమరపు కలిగించును, హృదయములో మధురిమలు ప్రవహించును. అతని కోర్కెయు నామె కవగతమైనది. ఆమె భయమును జెందినది, పరవశయునైనది. ఇట్టి యశోవంతు డాతని ప్రేమనంతయు దన పాదములకడ ధారపోయుచున్నాడన్న మోద మామెను గరగించివేసినది. వీలయినప్పుడెల్ల నాతని నొంటిగా గలసికొనునది. అక్కగారు వైద్యవిద్యాలయమునకో, వైద్యశాలకో పోయినప్పుడు తన స్నేహితుడగు నారాయణరావు రాకుండ పరమేశ్వరుడొక్కడే వచ్చువాడు.

కాని రోహిణి ధర్మహృదయ. ఆతడు వివాహితుడు. భార్యతో సుఖముగ గాపురము సేయుచున్నాడు. తా నవివాహిత. కావున పరమేశ్వరుని గీతదాటి రానివ్వకూడదని దృఢనిశ్చయయై యానాటి నుండి నిర్మలమగు ధైర్యముతో నాతని ప్రేమయు పూజను గైకొని యానందించునది. అట్టి ప్రేమను పెరగనిచ్చినచో తా మిరువురుకూడ గీచుకున్న గీతలుదాటి, పరవశులై ఐక్యమే పోవలసివచ్చునేమో యన్న భయ మామెకు గలుగలేదు.

పరమేశ్వరునకు నామె యభిప్రాయము తెలిసి, యతిజాగ్రత్తగనే యుండెను, ఆశాప్రవాహములోనికి దా నతివేగమున లాగికొనిపోబడుచున్నాడనని యాతడు గ్రహింపలేదు.

౨౧ ( 21 )

ఇ ష్టా గో ష్టి

నారాయణరావు, పరమేశ్వరమూర్తి, శ్యామసుందరీదేవి, రోహిణీదేవి కవులకూటమినిగూర్చి సముద్రపుటొడ్డున మాట్లాడుకొన్నారు.

ఇప్పుడిప్పుడు వచ్చు యువకవులలో నింకను స్వాతంత్య్రము జూపువారున్నారు. మొత్తముమీద ఆంధ్రప్రదేశంలోని నేటి కవిత్వము ప్రేమతోనిండి నీరసత్వములోనికి దిగినదని యొక కళాభిజ్ఞుడు భారతిలో వరుసగా నాలుగు వ్యాసములు వ్రాసి యువకవుల నందరిని యెత్తిపొడిచినాడు. వేషములో నాడుతనము కనబడినట్టు కవిత్వములోను ఆడుతనమే కనబడుచున్నదట ఆయనకు. మొన్న జరిగిన కవుల కూటమివంటివి జరుగవలెననియే యభిప్రాయమట. కాని యీ యువకవులు తమచుట్టు వేనకువేలు విషయములుండ నీ సృష్టిలో నాడుదియు మగవాడును దక్క నింకేమియు లేనట్లు కవిత్వము వ్రాయుట ఉపజ్ఞాశూన్యతను బ్రకటించుచున్నదని యాయన వాదించినాడు.

నారాయణరావు ఆ కళాభిజ్ఞునితో నేకీభవించలేక పోయినాడు.

పరమేశ్వరు డా వాదమును ఖండించినాడు. ‘ప్రేమ యుత్కృష్టమగు విషయము. నీ ప్రియభామినిపై జూపించు ప్రేమ యీ జన్మలోనో మరికొన్ని వేల జన్మాలకో భగవంతునిపై ప్రేమగా మారుతుంది. లీలాశుకుడు చింతామణిపై ప్రేమచే మహాభక్తుడుగా మారి పరమభాగవతుడైనాడు.

నారాయణరావు శ్యామసుందరినిచూచి చిరునవ్వుతో ‘చెల్లీ! సృష్టి అంతా భగవంతుని స్వరూపం కద. అలాంటిది, కరుణాది రసాలచే మానవజీవనక్షాళన మొనరింపక ప్రేమ ప్రేమయని వెఱ్ఱిపద్యములు వ్రాయుట హృదయ దౌర్బల్యసూచకం గాదూ? నీ ప్రేమ గొప్పగా ఉండాలి. వ్రాయి! రెండు మూడు మహా ప్రేమనూక్తాలు. తక్కినవి తిండిలేక మాడు బీదవాళ్ళను గూర్చి, బానిసలకన్న అథమాథములుగ నున్న మాలవాళ్ళను గూర్చి మనుసులు కరిగేటట్లు కవిత్వం రచించు. మానవలోకాన్ని ఈశ్వరాభిముఖం చేసేదే కవిత్వం’ అని వాదించినాడు.

శ్యామసుందరి వారిరువురకు చక్కగ సమాధానము కుదిర్చినది. ‘ప్రేమ ప్రపంచములోని మహోత్తమ విషయం. అది ప్రాపంచికత్వానికి ఉత్తమ విషయం అయినట్లు కావ్యవిషయంలోనూ మహోత్తమము. తక్కినవి జీవితంలో స్త్రీ పురుష సంబంధం తర్వాత వస్తాయి. కావ్యంలోనూ అంతే. ఏ విషయం వ్రాసినా కావ్యంమాత్రం అయిఉండాలి. అవునా అన్నా, అవునా పరమేశ్వర్?’ అని నవ్వినది. నారాయణరావు మనస్సు సంకటపడునప్పుడెల్ల శ్యామసుందరిని కలసికొని యామెతో నన్నివిషయముల జర్చించుచు నానందమునొందును.

ఆడువారికి మగవారికి పవిత్రమగు స్నేహముండుట సహజమనియు, దానిని మనము అసహజమగు మన బ్రతుకులచే పంకిలమొనరించుకొనుచున్నామనియు, కావుననే నేడు పురుషులకును వనితలకును ప్రవిత్రస్నేహ ముండుటకు వీలులేకుండ నున్నదనియు నాతడు పరమేశ్వరునితో ననినాడు.

రష్యా దేశపు స్థితినిగూర్చి ప్రసంగము వచ్చినది. ‘నిజమైన ప్రజాస్వామిక ప్రభుత్వం ఏది అంటే బోల్షివిజమనే చెప్పాలి. ఆస్తి అందరికి సమము కావింపబడవలె. అంటే ఆస్తి అంతయు ప్రభుత్వముది. ప్రజలు తమతమ విధులు నిర్వర్తించాలి. వారి వారి పనులనుబట్టి జీతము టిక్కెట్ల రూపమున ఇవ్వాలి. ఆ టిక్కెట్లనుబట్టి నీకు కావలసిన వస్తువును తెచ్చుకొన వచ్చును. ఒకవేళ తిండి చాలదందువేమో, ప్రతిమానవునకు భోజనాదికముల మితి యేర్పరచవచ్చు’ నని నారాయణరా వన్నాడు.

పర: మనయంతట మనము ఉత్సాహము పుట్టి పనిచేయలేముగా! మనకు వచ్చే లబ్ధి భోజనముమాత్రమే. అంటే గొప్పగొప్ప కార్యములు చేయడానికి ప్రచోదనం ఏదీ?

నారా: ఎందుకు కలగదురా? ఏమమ్మా చెల్లీ! నువ్వు చెప్పు, ఈమధ్య బోల్షివిజము పుస్తకాలు చాలా చదివావు.

శ్యామ: ఉతృష్టకార్యాలు చేసేవాళ్ళకు ఎక్కువ టిక్కెట్లు ఇస్తారు. పైగా ధనపూర్ణమైన ఇంగ్లండు మొదలైన దేశాలలో కూడా గొప్పగొప్ప శాస్త్రజ్ఞులు అద్భుతములు కనిపెట్టారంటే డబ్బుకోసమా? ఆ ఉత్సాహం వారిలో సహజం కాబట్టిన్నీ, పేరుకోసమున్ను. ఇప్పుడు రష్యాదేశానికి ఏమన్నా లోటు ఉన్నదా?.

నారా: బాగున్నదమ్మా.

పర: కాని శ్యామచెల్లీ! ఒకటి ఆలోచించు. ఏనాటికైనా బోల్షివిజము చనిపోతుందిసుమా. ఎవడిబాగు వాడు విచారించుకోవడమే మానవస్వభావం. కాబట్టి, నెమ్మది నెమ్మదిగా ధనం రహస్యంగా పోగుచేసుకుంటాడు. ఇప్పటికి రష్యాలో ఎన్ని కేసు లల్లాంటివి చూడడం లేదు?

శ్యామ: అదికాదు; ఒక వేళ ఆ గుణం సహజం అనుకున్నా, దేశంలో ఉన్న ఆస్తిఅంతా కలేసి పంచుకోడం మంచిది.

నారా: జాయింటు కుటుంబమల్లె.

పర: అబ్బా లాయరు! ప్రపంచం అంతా జాయింటు కుటుంబం చేస్తావా! బోల్షివిజము ఏ దేశానికి ఆ దేశానికే ఉంటే చాలా? లోకమంతా ఒక్కటే రాజ్యం చేయాలా? శ్యామ: ప్రపంచం అంతా కలిసే ఉండాలనిగా లెనిను, స్టాలిను, ట్రాట్స్కీ మొదలగు వాళ్లు వాదించేది. ఉన్న ధనమంతా పోగుచేసి జనాభాని బట్టి దేశాలు పంచుకోవడం, ఏ దేశంలో ఏ పంట ఎంత పండునో లెక్కలు వేయడం, ప్రపంచానికి కావలసినంత పంటమాత్రం పండించడం, అది దేశాలన్నీ పంచుకోడం. ప్రతీపంటా అంతే! అలాగే బంగారు మొదలగు లోహాలు. ఆ లోహాలన్నీ శాస్త్రవృద్ధికోసం. నాణేలు అవసరంలేదుగా! ప్రపంచం అంతా కలిసి అంగారకుడిదగ్గరకు వెళ్ళుటకు ప్రయత్నం మొదలైనవి చేయవచ్చును. ఈలాగే సర్వశాస్త్రజ్ఞానమూ వృద్ధి చేయాలి.

నారా: లేదూ, భగవంతునిగూర్చి తెలిసికొనుట కన్నిజాతులకు సౌకర్యము కలుగజేయవచ్చును.

పర: ఓహో మీ యిద్దరి స్వప్నమూ చాలా బాగుంది. అయితే, తెల్లవాడు నల్లవాడిని దగ్గరకు రానిస్తాడా? పచ్చవాడికి పచ్చవాడిపచ్చ కిట్టదు. చీనాకు, జపానుకు యుద్ధం రాదంటారా!

శ్యామ: అన్నా, అదేమిటి మీ వాదం! వినండి. ప్రపంచమంతా బోల్షివిజం వ్యాపించడానికి కొన్ని యుగాలు కావచ్చును. ధనంఉన్న షాహుకార్లకు శక్తి ఉన్నంత కాలం రాజ్యాలు వదలరు. కాని ప్రపంచంలో ఎక్కువ సంఖ్య ఎవరు? కూలి నాలి చేసుకునేవారేకదా? బీదవాళ్ళగువారు తలచుకుంటే ఏమి చేస్తారు షాహుకార్లు?

రోహిణి: మనదేశం ముప్పదిమూడుకోట్లు ఏమి చేస్తున్నాము తుపాకీ ముందర?

శ్యామ: ప్రపంచంలో తుపాకీ పట్టుకునే వాళ్లంతా బీదవాళ్ళేగా! రష్యాలో వాళ్ళు తిరగబడితేనేగా షాహుకార్లయొక్కయు, ప్రభువులయొక్కయు రాజ్యం కూలబడింది?

పర: ధనం యొక్క ఉత్కృష్టత ఏమిటో చెపుతా విను. ధనవంతుడు తన ధనసంపాదన ప్రయత్నంలో దేశానికి అనేక లాభాలను సమకూరుస్తాడు. దానివల్ల లోకానికి కావలసిన వస్తువులన్నీ తయారవుతాయి. అమెరికాలో, ఇంగ్లండులో, జర్మనీలో, ఫ్రాంసులో అంతే! ఇనుపచక్రవర్తులు, కిరసనాయిలు సార్వభౌములు, బిస్కట్ల మహారాజులు, మోటారు రాజాధిరాజులు వగైరా వగైరా! వీరంతా ఉండడముచేత దేశదేశాలకు ఆ వస్తువులు సరఫరా అవుతున్నవి.

శ్యామ: అన్నా , నువ్వు చెప్పే వాదనలో అన్నీ దోషాలే.

నారా: 1919 సంవత్సరంలో యూరపుఖండంలో మహాయుద్ధం ఆఖరయింది. ప్రపంచం అంతా విప్లవం వచ్చేటట్లు కనబడింది. కాని అమెరికా వాళ్ళు బంగారం పట్టుకువచ్చి యూరపు అంతా వెదజల్లినారు. దానితో యుద్దంవల్ల అలిసిన ప్రజలంతా, ‘బాగుంది! మనస్థితి బాగుంది’ అని సంతో షించుకున్నారు. తాత్కాలికంగా కనబడిన ఆ పరిస్థితులకు పునాది యేది? అమెరికా అప్పుయివ్వడం మానివేసింది. కోటీశ్వరుల కోట్లు కరిగిపోయాయి. ఆ కరగడం మహావేగంతో జరుగుతోంది. వర్తకాలు హుళక్కి అవడం మొదలుపెట్టాయి. ఇంక వచ్చేది ఏముంది? ప్రపంచంలో ఉన్న షాహుకార్లందరికీ దివాలా వచ్చేటట్టు ఉంది.

‘సరే, కూలివారు పైకివచ్చి రాజ్యాలు ఆక్రమిద్దాము అనుకున్నారు, ఇటలీ, జర్మనీ, ఇంగ్లాండుదేశాలలో. కాని ఇంక ఎక్కడా కూలివారిలో కట్టులేదు. కూలీలూ, సామాన్యప్రజలూ లేవడం చూచారు. ధనవంతులు హడలిపోయారు. కోటీశ్వరుడు దగ్గరనుంచి కొద్దో గొప్పో కలవాళ్ళంతా భాయి భాయి అని ఏకమయ్యారు. ఫాసిజమ్ అని కట్టుకట్టి ఒక సర్వాధికారితో రాజ్యం ఏర్పరిచారు. దానికి జాతీయ సాంఘికవాదమన్నారు. ఇక ముందు అన్ని రాజ్యాలు అల్లాగే అవుతాయి.’

‘అసలు ప్రపంచానికి వచ్చిన చిక్కేమిటో చూడు, కావలసినంత తిండి తయారు అవుతోంది. అంతా పంచితే అందరికీ పూర్తిగా ఆకలి తీరుతుంది. కాని ఎన్నికోట్లమంది ప్రజలు మలమల మాడిపోవుటలేదు? ఏమిటి ఆలోటు? తయారైన పదార్థాలని పంచేమార్గం సరిగా లేదు. ధనికవర్గం ఆ పని యేనాటికీ చేయలేదు.’

శ్యామ: పనిలేని కూలీ లెన్నికోట్లున్నారు వివిధదేశాల్లో? ఎలాగు వీరందరికీ తిండి పెట్టడం?

రోహి: మన ఆంధ్రదేశంలో జమీందారీ రైతులపని మహా అన్యాయంగా ఉన్నది కాదూ?

పర: అవునమ్మా, ఉన్నది. అన్ని జమీందారీలు అల్లా ఉన్నవా? కొన్ని జమీలు హృదయం తరుక్కుపోయేటట్టున్నవి.

నారా: 1908 సంవత్సరమునకు పూర్వమే రైతులను బలవంతం చేసి యెక్కువ శిస్తు ఏర్పరచుకొని ముచ్చిలికాలు వ్రాయించుకొన్నారు. కొన్ని కొన్ని చోట్ల ముప్పదిరూపాయల శిస్తు నేను ఎరుగుదును. ఎన్ని వేలమంది రైతులు దివాళాలు తీశారు? మా అత్తగారి మేనల్లుడొక జమీందారు. ఆయన జమీ ఎంత కంగాళిగా ఉండాలో అంతయిదిగా ఉన్నది. ఎంతమందో రైతులు బాకీలు చెల్లించలేక జైళ్ళలో ఉన్నారు. కొందరి భూములాఖరయ్యాయి. కొందరు దివాళాలు దాఖలు చేసినారు. చెంతనే ఉన్న రైతువారీ గ్రామాలస్థితి యింతకంటే నయం. ఈ జమీందారుల పూర్వీకుల కాలంలో శిస్తులు యింత అన్యాయముగా ఉండేవికావు.

పర: కొన్ని జమీందారీలలో, ఈనాం, మొఖాసా గ్రామాలలో (అసలు మొఖాసాదార్లు, ఈనాందార్లు మాయమైపోయారు) పంటలు పండనిరోజులలో, ధనం చిక్కువచ్చిన రోజుల్లో శిస్తుతగ్గించి పుచ్చుకోరేమి? జమీందారు రైతులకు తండ్రి. కాని తన తండ్రిత్వము తిండిత్వములోకి దింపాడు.

రోహి: కొందరు జమీందారులు రైతులంటే పడిచచ్చిపోతారు, వాళ్ళబాగే తమ బాగని చూచుకుంటున్నారు. మాతండ్రిగారి స్నేహితుడొక డున్నాడు అలాంటి ఆయన.

పర: నారాయణరావు మామగారో? ఆయన జమీ చూస్తే ముచ్చటైపోయినది. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి యేబది వేలిచ్చారు. పంటపండని రైతును బాధపెట్టరు. సర్వేలు చేయించుకున్నారు. ఎప్పటికప్పుడు రైతులకు__ రైతువారీ రైతులకు ప్రభుత్వంవా రిచ్చినట్లు పట్టాలు యిచ్చారు. జమీందారీ ఉద్యోగులు లంచాలు తినకుండా నారాయణరావు మామగారు స్వయముగా ప్రజలను తనిఖీచేస్తూ ఉంటారు. ఆయనకు చేతులెత్తి మొక్కని రైతు లేడు.

శ్యామ: అవును విన్నాము. అన్నా, నారాయణరావూ! మా చిన్న వదినను ఎప్పుడూ చూపించుట? చాలా అందమైన బాలిక అని ఈ అన్నయ్య చెప్పినాడు.

పర: రేపు క్రిస్టమసుపండుగ వెళ్ళిన తర్వాత ఇక్కడికి కాపురానికి తీసుకొని వస్తున్నాడు.

రోహి: ఏమిటన్నా చెప్పావుకావు!

నారా: చెప్పుదామనుకున్నాను. సరి, పరమం చేప్పేశాడు.

ఇంతలో మంగపతిరా వచ్చటకు వచ్చినాడు. మంగపతిరావు నారాయణరావును చూచి చిరునవ్వు నవ్విలోనికి బోయినాడు.

మంగపతిరావు గాంధీగారి అహింసావ్రతము ఆడుదాని మతమని వాదించును. శక్తి హీనులమగు మనం ఈ అహింసావ్రతంలో బడి మరింత శక్తి పోగొట్టుకొని నశించిపోవుదుమని యా బాలుని వాదన. ఏమి తెలియని కుఱ్ఱవాళ్ళు, ‘సరియైన దారి చూపండి నడుస్తాం. బాంబులు తయారుచేస్తాం. రివాల్వరులు గురిచూస్తాం. యుద్ధం చేసి రాజ్యం సంపాదిస్తాం’ అని వాదించారు.

‘ఈ కుఱ్ఱవాండ్రు సరియైనమార్గం లేక తప్పుదారిని పడుతున్నారు. మీరటు కుట్రకేసు చూస్తూన్నాం కాదూ? శ్రీ మహాత్ముని తత్త్వం వీళ్ళకేమి తెలుసును చెల్లీ! ఈతని మనస్సు నెమ్మదిగా మార్చి వేయాలి. లేకపోతే ఓ రాత్రివేళ యెక్కడికో పారిపోతాడు. చివరకు ఉరికంబ మెక్కుటకు సిద్ధం అయిన తర్వాత ఎవళ్ళమూ ఏమీ చెయ్యలేము’ అన్నాడు నారాయణరావు.

అతడు తనయింటికి బోయి బోల్షివిజము ప్రత్యక్షము చేసిన మహాచిత్రకారుని చిత్ర మొండు తన చిత్రసంపుటినుండి తీసి చూచినాడు. వేలకొలది పురుషులు, స్త్రీలు ఒడలు తెలియక రాక్షసులు చేయతగిన పనులు చేయుచున్నారు. నలిగిపోవుచున్నారు బిడ్డలు, స్త్రీలు.

మహాశక్తివలె యంత్రము దిశల నావరించియున్నది. ఇట్టి ప్రచార చిత్రమునుగూడ నెంత విచిత్రముగ చిత్రించినా డీ శిల్పి!

వర్ణములు, రేఖలు, లోతులు, బరువులు లయ సామ్యసంకలితములై మహోత్కృష్ట శ్రుతిలో లీనమైపోవుచున్నవి.

శిల్పి మహాభాగుడు. ఒక్కగీతంలో, ఒక్కరంగులో ఎన్ని సమూహములు, ధీశాలి కందని లోతులు చిత్రించగలడు!

అత డా చిత్రము తదేకదృష్టితో జూచుచు, అటులనే నిలుచుండి పోయినాడు.