నారాయణరావు (నవల)/చతుర్థ భాగము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

చ తు ర్థ భా గ ము

౧ ( 1 )

భ ర్త యే గు రు వు

క్రిస్టమసు సెలవులలో నారాయణరావు తన భార్యతో చెన్నపురికి వచ్చెను.

అతడు మైలాపూరులో వెనుకటి చిన్న మేడవదలి, నెలకు నూరురూపాయ లిచ్చి పెద్దమేడ నద్దెకు పుచ్చుకొనెను. ఆ మేడచుట్టు తోటయున్నది. విశాలమైన భవనము.

పరమేశ్వరుని భార్యకు బురుడు చెన్నపురిలో బోయుట కాత డేర్పాటు చేసెను. చెన్నపురిలో కాపురము బెట్టినప్పుడే యాతడొక నియ్యోగి వంటలక్కను గుంటూరు జిల్లానుండి రప్పించుకొనెను. ఆమె యిదివరకే తూర్పుగోదావరిజిల్లాలో నధికారులకు వంటచేసినది. మంచి మనసుది. నెలకు బదునైదు రూపాయలు జీతమును, యేడాదికి నాలుగుపంచెలు నిచ్చుట కేర్పాటు చేసికొని యాత డామెను గుదిర్చెను.

శారదను క్రిస్టమసు సెలవులలో మంచిరోజుచూచి యత్తవారింటికి తీసికొనివచ్చుటకు సూర్యకాంతమును, సుబ్బారాయుడుగారును వెళ్లినారు. ఆమెకు జమీందారుగారు వెలపొడవు చీరలు, పసుపు, కుంకుమ, రెవికలు, నగలు, వెండిబిందెలు, వెండిగంగాళము, వెండిచెంబులు, వెండిగిన్నెలు, వెండిబొమ్మ సామానులు, వ్రాత బల్లలు, కుర్చీలు, సోఫాలు, పందిరిమంచము, చిన్నమంచము, పెద్ద ఉయ్యెల, యింకను నెన్నియో సామానులు సారె యిచ్చినారు. కొన్ని చెన్నపురికి గొనిపోవుటకు రాజమహేంద్రవరములోనే యుంచినారు.

లాంచిమిద, మోటారుకారులమీద వారు కొత్తపేట చేరిరి. భార్యవచ్చినప్పడు నారాయణుని హృదయము దడదడ కొట్టుకొన్నది. రాత్రి గదిలోనికి వచ్చినప్పుడాతడు కదలు హృదయముతో, కంఠాన తీపులతో, కన్నులలో వెలుగులతో భార్యవంక జూచినాడు. కాని యా బాలిక మాట్లాడలేదు.

నారాయణరావు ఉదారహృదయుడై నొసలు ముడిచి, పెదవులు బిగించి, ముక్కుపుటములు విస్ఫారితములుకాగా, తన పందిరిమంచముపై యట్లనే పరుండియుండిపోయెను.

భార్యాభర్తలు చెన్నపురి కాపురమునకు వచ్చినప్పటినుండియు ఆ బాలికను బలుకరించుట యెట్లు, ఆమెకు చదువుజెప్పుట యెట్లని యాలోచింపదొడగెను. వారమురోజులు గడచిపోయినవి. తాను చెప్పుటమాట యటుండనిచ్చి, శారద పరీక్షలో గృతార్థురాలు గావలెననియు, జెల్లెలు సూర్యకాంతము ప్రవేశపరీక్షలో గృతార్థురాలు కావలెననియు సంకల్పించి, భాస్కరమూర్తి శాస్త్రులగారివంటి యొక విద్యాశేఖరుని, హిందూ ఉన్నత పాఠశాలలో పనిచేసి పింఛను బుచ్చుకొనుచున్న బి. ఏ., ఎల్. టి. ని, నెలకు ఏబది రూపాయలు వేతనమిచ్చి చదువుచెప్పుటకు కుదిర్చినాడు.

శ్యామసుందరీదేవియు, నామె చెల్లెళ్లును నారాయణరా వింటికి జూడ వచ్చినారు. వారందరు సీమరేగు, ద్రాక్ష, దానిమ్మ, అంజూరా మొదలగు ఫలములు; జీడి, పిస్త, బాదం మొదలగు పప్పులును; పటిక బెల్లమును, పసుపు కుంకుమమును, పట్టుచీరయు, రవికయు దీసికొనివచ్చినారు.

సూర్యకాంత మదివరకే శ్యామసుందరీదేవి యింటికి వెళ్లుచు వారితో బరమస్నేహమున మెలగుచుండెను. ‘శ్యామక్కా’ యని యొకసారి ‘డాక్టరక్కా’ యని మరియొకసారి సూర్యకాంత మామెను బిలుచుచుండును. ‘అందరము యెనమం డ్రక్కచెల్లెండ్ర’ మని యామె యనుచుండును. శ్యామసుందరి తల్లిని ‘పిన్నీ పిన్నీ’ యని పిలుచుచు ప్రాణమిచ్చు చుండునది.

నారాయణరావా నలుగు రక్కచెల్లెండ్రకు పుట్టినదినమని, పండుగలని పేరులు చెప్పి బొమ్మలు, చీరలు, రవికగుడ్డలు, వెండిసామానులు బహుమానముగ నిచ్చుచుండెను.

శారద వీరంద రెట్టిచుట్టములో యనుకొని సిగ్గుచేతను, గర్వముచేతను చాల ముభావముగ సంచరించినది. శ్యామసుందరి యది యంతయు సిగ్గనుకొని యామెతో సౌహార్థమున మాట్లాడినది. వారందరు ‘శారదవదినా! వదినా! చిట్టి వదినా! యని వివిధరీతుల బల్కరించిరి. ‘మా అత్తగారు కులాసాగా ఉన్నారమ్మా, వదినగారూ?’ అని నళిని యన్నది. ‘ఉన్నా’ రని శారద యుత్తర మిచ్చినది.

వారంద రామెను నెయ్యముమై వీడుకొని వెడలిపోయిరి.

శారదకు చెన్నపట్టణమున భర్తజీవితము విచిత్రముగ గనుపించినది. ఆతడు తెల్లవారుగట్ల దండెములు, బస్కీలు తీసి ముద్రలు తిప్పుచు శరీరవ్యాయామము చేయును. వ్యాయామము చేసిన గంట కాతడు చన్నీళ్లలో స్నానమాచరించి రెండు యిడ్లి పుచ్చుకొని, పాలు త్రాగి, సిగరెట్టు కాల్చుకొని, ఖద్దరు దుస్తులు ధరించి కచ్చేరిహాలులోనికి బోయి యచ్చట తన యప్పీళ్ళు మొదలగునవి చదువుకొనును. మామగారు షాహుకార్ల ఖాతాలుకొన్ని యిప్పించినారు. అన్నగారు పంపించిన యప్పీళ్ళు, శ్రీనివాసరావుగారు పంపినయప్పీళ్ళు, తండ్రిగారు వచ్చునట్లుచేసిన యప్పీళ్ళు, నారాయణరావుకు పుష్కలముగ పనియున్నది. అప్పీళ్ల విషయమైవచ్చిన పార్టీలతో సంప్రదించి, యచ్చట నుండి మోటారు మీద తన గురువగు వకీలు ఇంటికి బోవును. పదింటికి ఇంటికి తిరిగివచ్చి భోజనము చేసి దుస్తుల ధరించి తిన్నగ ఉన్నత న్యాయస్థానమునకు బోవుచుండును. నారాయణరావుకీ కొలది మాసములలో నెలకు రెండువందలు వచ్చు పనులు స్వయమైన కాతాలవలన నేర్పడినవి. గురువుగా రీతనిపని చూచి మెచ్చుకొని పెద్ద వ్యాపారములలో సహాయన్యాయవాదిగా పని చేసినందుకు నూరు, నూటయేబది యిప్పించుచుండిరి.

కోర్టుపని యగుటతోడనే యింటికివచ్చి, సూర్యకాంతమున కొకగంట చదువు చెప్పును. తరువాత స్నానముచేసి దుస్తులు ధరించుటతోడనే, యెవరో యొకరు స్నేహితులు వచ్చెదరు. వారిని తీసికొనియో, తానొంటిగనో కారులో విహారమునకుబోవును. వచ్చినప్పు డాతని స్నేహితుడగు పరమేశ్వరమూర్తి కూడ నుండువాడు. ఒక్కొక్కప్పుడు సూర్యకాంతమును, శారదను విహారమునకు కారుమీద బొమ్మని తాను నడచి సముద్రపుటొడ్డునకు బోవువాడు. నడచివెళ్ళి నప్పడుమాత్ర మతడు తిరిగివచ్చిన వెనుక మూడవసారి స్నానమాచరించువాడు.

శారద చెన్నపురికివచ్చిన పదిరోజులకు జమీందారుగారు కొమరితను జూచుటకు వచ్చిరి. శారద యత్తవారింటికి వెళ్ళునపుడు భర్త మేధాసంపన్నులగువారిలో మేధావి యనియు, నాతడే యామెకు జదువు చెప్పుననియు బోధించి పంపినాడు. కావున ‘నుపాధ్యాయుని బెట్టినా వెందుకు, నీవు చెప్పిన సరిపోవునుగదా’ అని జమీందారుగా రల్లుని బ్రశ్నించిరి.

‘నాకు సరిగా తీరుబడిలేదు. ఉన్నప్పుడల్లా చెపుతూ ఉంటానండి.’ ఆ ముక్కలనుట కాతని హృదయము తల్లడిల్లిపోయినది.

నారాయణరా వొకనాడు సూర్యకాంతముతో ‘మీ వదిననుకూడ చదువుకునేందుకు రమ్మని చెప్పమ్మా’ యని వచించెను. నూర్యకాంతముపోయి శారదను దీసికొనివచ్చినది.

శారద కత్తవారింటికి వచ్చుటకే యిష్టము లేక పోయినది. ఆమెకు భరింపరాని దుఃఖము వచ్చినది. తండ్రిమాట కెదురాడి యెరుగదు. తమ్ముడు కేశవచంద్రుడు ‘చిన్నక్కా! నువ్వన్నా వెళ్ళి బావను దీసుకురా’ యని కోరినప్ప డామెకు ఏవియో యాలోచనలు జనించి కన్నుల నీరు పొరలివచ్చినది, తల్లి కంటనీరు పెట్టుకొన్నది. మేనత్త విచారించినది. జమీందారుగారు తనయను చెంతజేర్చికొని ‘తల్లీ! స్త్రీలు జన్మము నెత్తినప్పుడే భర్తయింటికై నిర్దేశింప బడ్డారుకదా! నువ్వు చదువుకొన్నదానవు. నీ కొరులు చెప్పవలెనా! వెళ్ళమ్మా, నువ్వు చెన్నపట్టణములో ఉందువుకాని. మీ మామగారితో చెప్పాను. నేను ఎప్పడూ వస్తూ ఉంటాను. నువ్వు మార్చి ఆఖరువారంలో ఎలాగు ఇంటికి వస్తూనే ఉన్నావు. అక్కడ వాళ్ళ సూర్యకాంతము ఉండనే ఉండును. బావ సుందరరావు, అతని భార్య, పిల్లలూ వాళ్ళూ ఉంటారాయెను. అక్కయ్యను వచ్చి చూడమని వ్రాస్తున్నాను’ అని బుజ్జగించినారు.

ఏనాటికయిన అత్తవారింటికి, భర్తకడకు వెళ్ళక వలనుపడదని యామెకు తెలియును. భర్తతో గాపురము తప్పుటెట్లని యామె యాలోచించుకొనలేదు. భర్త తనకడకు రాకుండ తప్పిన జాలుననియే యామె కోరిక. భర్తకడకు తాను వెళ్ళినచో నాతడు తన్ను బ్రేమించుట మొదలిడినచో దానెట్లు బ్రతుకుట? వెల్సుకవి రచించిన ‘సౌహార్ద్రమగు స్నేహము’ అను నవల తాను చదివినది. అందులో నాయిక తన జీవితమును ప్రేమార్పితము చేసినది. పోనీ, తా నెవరినైన అట్లు ప్రేమించుచున్నదా? జగన్మోహనరావు బావను తాను ప్రేమించుట లేదు. అది నిశ్చయము. జగన్మోహనరావు బావ తన్నతిగాఢముగ బ్రేమించు చున్నాడని తనకు దెలియును. ప్రేమయన నేమి? పురుషుని జూచినను, తలచినను అతనిలో నైక్యమైపోవ గోరుటయేకదా! తానట్లెవరినైన ప్రేమించినదా? జగన్మోహనరావు బావపట్ల మంచి స్నేహమున్నది. అతనితో గంటల కొలది మాట్లాడ మనసగును. అతడు చెంతనున్నప్పుడు తన్ను సంతోషమున ముంచివేయును. తన తల్లిదండ్రులపట్ల తమ్మునిపట్ల మాత్రము తన కట్టి భావము లేదా? అంతకు మిక్కిలి తా నేపురుషుని ప్రేమించుట లేదు.

భర్త చదువుకొనినవాడు. మోటుమనిషి కాడు. తాను జూచినంతవరకు నొరులజోలికి బోవని కరుణార్ద్రహృదయుడు. అతని జూచినవారెల్ల మెచ్చు కొనుచున్నారు. అటువంటియప్పుడు తన కిష్టముగాని ప్రేమను అతడు గోరునా?

చిన్నతనమునుండియు దన్ను పెంచిన పుష్పవనము, గోదావరిగాలి తన కింక దూరమైపోవును. తన చిన్నతమ్ముడు ఇంక తన్ను విచిత్రములగు ప్రశ్నలు వేయడు. ఈ పరిచారికలు చుట్టములు వెనుకనే యుండిపోవుదురు. ఏమిటిది! చదువుకొన్నవా రిట్టుల బెంగ పెట్టుకొననగునా?

శారద అత్తవారింటికి వెళ్ళి పదిరోజులుమాత్రమే యున్నది. ఇంతలో చెన్నపురి వెళ్ళిపోవలసివచ్చినది. భర్త మొదటితరగతి జంటసీటుల పెట్టెలో తనతో ప్రయాణము చేసెను. వారన్న నందరకు ప్రేమయే! ప్రయాణములో ఎన్నో సౌకర్యములు! తన మనస్సేమియు నొవ్వని విధాన పువ్వులలో ప్రయాణము జరిగినది.

భర్త తన్ను జదువునకు బిలిచినాడని ఆడుబిడ్డ కబురు తెచ్చుటతోడనే, యామె హృదయము కలతనొందినది. ఆశ్చర్యమందినది. ఆమె నారాయణరావు కడకు సూర్యకాంతముతో వచ్చి మేడమీదగదిలో సూర్యకాంతము కుర్చీ ప్రక్కకుర్చీలో గూర్చుండిపోయినది. తన గంభీరమగు గొంతుకతో నారాయణరావు సర్వసౌందర్యసంపన్నయగు శారదకు పాఠములు ప్రారంభించినాడు.

ఎట్లుగడిచినదో యొక గంట, శారద పరవశురాలయిపోయినది. తన మధురకంఠముతో జ్ఞానము తేనెవాకలు కట్టునట్లు భర్త బోధించినప్పుడు శారద విభ్రాంతయైపోయి విన్నది. అంతయు జెప్పినవెనుక నాత డామెను ప్రశ్నలు వేసినాడు. మొదట చెప్పలేక డగ్గుత్తిక పడినది. కాని నెమ్మది నెమ్మదిగ భయముతీరి యన్ని ప్రశ్నలకు జవాబు చెప్పినది. ‘ఇక వెళ్ళవచ్చు’ నని నారాయణరావు లేచి క్రిందకు దిగి వెళ్ళిపోయినాడు. శారద యిట్టి బోధన మెన్నడువినలేదు. దూదివలె విడబరచి వెనుకకు బోవుచు ముందుకు సాగుచు పాఠమంతయూ హృదయమున హత్తిపోవునట్లు చెప్పినాడు. ఇదివరకెవ్వరును ఇంత బాగుగా చెప్పలేదు.

‘చూశావా వదినా! మా అన్నయ్య ఎంత బాగా చెప్పాడో! నేను తప్పక ఈయేడు పరీక్ష నెగ్గి తీరుతాను. మీ పరీక్షలు మా పరీక్షలు ఒకమాటే.’

‘ఇవాళ చాలాబాగా అర్థమయింది సూరీడూ.’

ఆరోజున శారద కేలనో హృదయము సంతోషమున పూర్ణమై, ఆమెను వివశత్వమున కదిల్చివేసినది.

నారాయణరావు తాను భార్యను ప్రేమించు చున్నట్లు కనబడకూడదు. ఇదియంతయు మామూలుతంతుగ జరిగిపోవుచున్నట్లామెకు దెలియవలెను. తన హృదయము, జీవితము ఆ బాలికపై ప్రణయముచే నిండి, జగమెల్ల నుబికి, సృష్టి నంతయు నాక్రమించుకొన్నదని యామె కెట్లుతెలియును? తెలియుటయు వలదు.

ఈ ప్రేమమహానిర్ఝరి గోచరించి భయపడినదా యీ బాలిక? ఆమెలో నేమియున్నది తన్నిట్లాకర్షించుటకు? అందమైన రూపరేఖావిలాసము లుండవచ్చును. అట్లందమయినవా రితరులు లేరో? శ్యామసుందరి సౌందర్యమున శారదకు జోడు కాగలదు. శారదకన్న సరళహృదయ, గంభీరమానస, విజ్ఞాన సంపన్నురాలు. ఆమె ప్రేమలో ముంచి వేయదలచుకొన్నచో నెవ్వరు నిలబడగలరు? అయిన నాబాల తనలో నిట్టి ప్రణయభావము జనింపజేయలేకపోయినది. ఈ శారదలో నేమున్నదో! ఆమె ఆత్మసంస్కార మెంత యున్నతమో!

శారద చెన్నపురి వచ్చిన వెనుక శ్యామసుందరిలో దీప్తి యెక్కువ అయింది. ఆ యిరువురకు దనకు నేమి సంబంధము! శారద భార్యయేమి? ఏ యదృష్టమున శారద భార్య యయినది? ఏ పూర్వపుణ్యాన శ్యామసుందరి మిత్రురాలేనది?

శ్యామసుందరి వైద్యకళాశాలనుండి వచ్చి యింటిలో నొక పడకకుర్చీపై చదికిలబడినది. ఆమెకు బరీక్షాదినములు సమీపించుచున్నవి. రేయింబవళ్లు నిద్ర హారములు మాని యామె విద్యాదీక్షితయైనది. చదువు, చదువుమధ్య నిద్ర, నిద్రమధ్య నారాయణరావుమాత్ర మామెకు సతతము గోచరించును.

నారాయణ యన్నచో దనకింత మైత్రి యేలనో యామె కర్థముకాలేదు. నారాయణరావును దాను ప్రేమించుట లేదుకద! అయిననేమి? అట్టి మహాపురుషుని, పూర్ణవ్యక్తిని బ్రేమించుటకన్న తన జన్మమునకు సార్థకత యేమున్నది? అతడు పరాధీనుడు; అయిన నాతని తన యంతరాంతముల బ్రేమించి యానంద పరవశయై కరిగి యాతని యాత్మాంతఃపదంబుల బ్రవహించిపోవుటకన్న తరణోపాయము లేదు. అని అనుకొనుచు ధ్యానముద్రయైనది. శ్యామసుందరి చిన్నతనమునుండియు గంభీరహృదయ. ఈశ్వరోన్ముఖ. మానవసేవ చేయవలెననియే యామె వైద్యశాలయందు చేరినది. దేశసేవచేయు శ్రీ సరోజినీదేవి, శ్రీ కస్తూరిబాయి మొదలగు వనితామతల్లులవలె దనజన్మము సేవకై యర్పణమని సంకల్పించుకొన్నది. వీలయినప్పుడెల్ల రాట్నము వడకును, చెల్లెండ్రచేత వడకించును.

ఆమె నిమీలితనేత్రయై, హృదయమున దక్షిణహస్తతల మదుముకొని, ధ్యానించుకొనుచు యా పడక కుర్చీపై నట్లే పండుకొనియున్నది.

శారదకు భర్తయే గురువైనాడు. ఆయన పాఠము చెప్పిన విధానము స్మరించుకొనుచు తన పడకగదిలో సోఫాపై మేనువాల్చి కన్ను లరమూతలుగా, ఏమేమో పుల్కరింపులు, ఏవియో మధురతరంగాలు తన్నెచ్చటికో తేల్చిపోవ, ఒంటిగా ఆమె ఆరీతీగానే పవళించియున్నది.


౨ ( 2 )

వెఱ్ఱి తల్లి

ఇంతలో రుక్మిణికి బురుడువచ్చినది. నెలలు నిండినవని తోచుట తోడనే నారాయణరావు పరమేశ్వరమూర్తు లాలోచించుకొని రాజారావును రప్పించుకొనిరి. రాజారావు తానెరిగియున్న విద్యావంతురాలును నిపుణురాలు నగు యూరేషియను దాయి నేర్పరచినాడు. వారు చేయవలసిన విధులన్నియు నొనర్చి, శ్యామసుందరీదేవితో నవసరమయినపుడువచ్చి కనుగొనుచుండుడని చెప్పి తాను వెడలిపోయినాడు.

రుక్మిణి సుఖముగ నాడపిల్లను గన్నది. పరమేశ్వరుని మో మానంద ప్రఫులమైనది. ఈ బాలికయైన బ్రతికి బట్టకట్టిన తాను ధన్యుడే. తనకు శిశువు అన్న నెంత యానందమో యంత విషాదమును గూర్చినాడు విధి. ఈ బాలిక యైన బదికాలములు సుఖముగ బ్రతికినచో తన కంతియే చాలును.

‘ననూ పాలింపా, నడచి వచ్చితివో

నా తల్లి _ ఉమా శిశూ _ ననూ...

వనజనయన, హిమ _ గిరి తనయ జననీ

నీలశరీరద్యుతి నిండించీ విశ్వమెల్ల
ననూ పాలింప...........’

అని పాడుకొన్నాడు. బాలిక యొడలు తొనలుకట్టి యున్నదట.

‘పరమేశ్వరం, నీకూతురు మలయమారుత రాగాన్ని ఏడుస్తూ ఉన్నదిరా! మంచి సంగీతపాటకురా లయ్యేటట్లున్నది. అచ్చంగా నీ పోలికే. వెళ్ళిచూడు, నక్షత్రం మంచిది, ఏమి దోషాలు లేవు’ అని నారాయణుడన్నాడు.

శారద బాలికను జూచి కిలకిలలాడినది. ‘ఏమి బుగ్గలమ్మా నీ కూతురుకు రుక్మిణమ్మగారూ’ అని మేలమాడినది.

‘నా మేనకోడలు బుగ్గలబూరెమ్మ’ అని సూరీ డన్నది.

‘ముష్టిపిల్ల! మంత్రసానికి డబ్బిచ్చి కొనుక్కోండి’ అని వంటలక్క రామమ్మ అన్నది.

‘ఒరే అబ్బాయి! దీనికి ఏం పేరు పెడతారో చాలా పెంకిపిల్లలా ఉందిరా’ అని నారాయణరావును జూచి యాతని పెత్తల్లి కొమార్తె బంగారమ్మ అన్నది.

‘వెఱ్ఱితల్లి’ అని పేరు పెట్టండి అని రుక్మిణి అన్నది, అలసట పొందిన నవ్వుతో.

పదిరోజులు సుఖముగా గడచి పురిటినీళ్ళు పోసినారు. బాలసారెలేదు. శిశువు దినదిన ప్రవర్థమానయై ఒళ్లు చేయుచున్నది. రోహిణీదేవి యా బాలికకు చిట్టిచొక్కాలు కుట్టుకువచ్చినది. వెండిచెంచా, పాలు పోసికొనుట కొక వెండి కొమ్ముచెంబును బహుమతి పట్టుకొనివచ్చినది.

రోహిణీదేవి వచ్చినప్పుడెల్ల రుక్మిణి హృదయమున గలత జనించునది. భర్త యా బాలికను బ్రేమించుచున్నాడని యెచ్చటనో యామెలో మారుమూల ప్రతిధ్వనించినది. రోహిణీదేవి తనకన్న యందకత్తె. రోహిణియు తన భర్తయు సర్వదా మాట్లాడుకొనుచుందురని యామెకు గర్ణాకర్ణిగ తెలిసినది. శ్యామసుందరియు నారాయణరావునుగూడ స్నేహితులని విన్నను, వారలను ఇసుమంతయు నామె యనుమానించలేదు. భర్త తన ప్రాణమును దనకు ధారపోయునని యామెకు దెలియును. అయినను భర్తహృదయమున ప్రేమ సముద్రము నిండియున్నదనియు, నయ్యది యెవ్వరిపైన నైన సులభముగ ప్రవహించి పోవుననియు నామె గ్రహించినది.

తానంత యందకత్తియ గాననియు భర్తృసంపూర్ణ ప్రేమను దాను జూరగొనజాలననియు నామెకు విదితమే. భర్త యొకటి రెండుసార్లు లెవరి తోడనో మైమరచి ప్రవర్తించినాడనియు నామె గ్రహించినది. కాని ఇదమిత్థమని తెలుపలేదు. లోలోన నొకటి రెండు వారములు కుళ్ళిపోయినది. అది పరమేశ్వరుడు చూచినాడు. తాను భార్యతో నగ్నిదేవుని యెదుట జేసిన వాగ్దానమునకు భిన్నముగ రెండుమూడుసారులు వివశుడై చరించినను ఆ వెనుక ఘోర నరకబాధ ననుభవించినాడు. అతనికి దలగొట్టినట్లయినది. ప్రపంచము నల్లబడి పోయినది. భార్య ఘోరనరక మనుభవించుచున్నదని యాతడు గ్రహించి సర్వము మరచిపోయి యా బాలిక పదములకడ బ్రణయపూజామతియై మోకరిల్లినాడు.

అయినను వారట్టుల రెండు వారములు బాధనందినారు. పరమేశ్వరమూర్తి పరితప్తచరిత్ర మాతని భోజనములో, నిద్రలేమిలో, భార్యకు దోచినది. ఎట్టకేలకు పతిప్రాణయగు ఆమె నావరించిన దుఃఖమేఘములు తొలగిపోయినవి. అప్పుడొకనాడు భర్తను జేరి యామె ‘ఇక నెప్పుడు నాయెడ దోషం చేయనని ప్రతిజ్ఞ చేయండి’ యని కోరినది. పరమేశ్వరుడు సర్వభూతముల సాక్షిగ నా ప్రమాణ మొనరించినాడు.

‘రుక్కూ! నా హృదయము పంకిలమయినమాట నిజము. కాని నేను దుర్బలుడను. ఎప్పుడైనా ఈలాంటి గాఢనైచ్యమై వచింపరాని పాపంలో పడిపోయింది రెండుసారులే. నన్ను క్షమించమని నేను కోరను. కాని నువ్వు పవిత్రమైన చరిత్ర కలదానవు. నీకు నన్ను భర్తగా సమకూర్చిన విధే దూరవలసినవాడు. ఏమి చేయను దేవీ! నాబోటి తుచ్ఛులు ఈ ప్రపంచంలో జన్మించి తమచుట్టూ ఉన్న నిర్మలత్వానికి కళంకం తెస్తారు. స్వచ్ఛమైన నీ జీవితానికి నలుపుమచ్చను నేను.’ అని కన్నుల నీరు నించుకొన్నాడు.

రుక్మిణి భర్తగారి బాధను జూచి భరించలేకపోయినది. కరుణార్ద్రహృదయయైన యామె వెల్లువయై ప్రవహించి, భర్తను చుట్టివేయుచు తన పాదాలపై మోమువంచి వాపోవు భర్తను లేవనెత్తి తన హృదయానికి జేర్చుకొన్నది. నాటినుండియు జిన్న బిడ్డలరీతి నెప్పటియ ట్లత్యంత ప్రేమతో వారు మెలగినారు.

రుక్మిణి కివియన్నియు నొకసారి సినిమాలో కథవలె గోచరించినవి. అప్పుడు మనస్సు కుదటబడ, నిట్టూర్పునించి సహజమగు మర్యాదతో భీతితో రోహిణీ, సరళా, నళినీదేవులతో మాటలాడి కొమార్తను గూర్చిన వారి మేలములకు హాసవదనయై జవాబులిచ్చినది. సూర్యకాంతము సతతము నా బాల నెత్తు కొనుటయే. ‘వదినా, నా కాళ్ళమీద పడుకోబెట్టమ్మా! నువ్వు నీళ్లుపోస్తే నేను తుడుస్తాను వదినా. కోడలు నవ్వుతుందిసుమా’ అని ఆమె ఆనందమున మునిగిపోవును.

రుక్మిణి: కాదమ్మా! మామయ్య ఎప్పుడు వస్తాడో? అని అత్తయ్య కనిపెట్టుకు ఉన్నదిగదా అని నవ్వినది.

సూరీ: అబ్బా! అసాధ్యురాలే నా కోడలు వదినా? తల్లిపోలికే!

రుక్మిణి: వేశావు బాణమూ?

అందరు నవ్విరి. శారద యా మాట విని యాగిపోయినది. ఆమె హృదయమునం దొక్కసారి గుబుక్కుమన్నది. తన చిన్న ఆడుబిడ్డ సూరీడునకు భర్తయన నింత ప్రేమయా! దూరముననున్న భర్తకై ఎదురుచూచుటయా? నిజమే! అప్పుడప్పుడామె యుత్తరములు వ్రాయుచుండును. సూరీడు గదిలో నామె భర్తగారి ఛాయాచిత్రమున్నది. ఆమె మెడలోని బంగారు గొలుసులో చిన్న చిత్రమున్నది. భర్తయామెకు వ్రాసిన యుత్తరములన్నియు విశాఖపట్టణపు మంచిగంధపు పెట్టెలో నుంచుకొన్నది. అవి యన్నియు మరల మరల తీసి చదువుకొనుట శారద కనిపెట్టినది.

తన యింటిలో గాపురమున్న యీ రుక్మిణీ పరమేశ్వరమూర్తులు ప్రేమచే నిండియుండుట, పరమేశ్వరమూర్తి తన భార్యతో సల్లాపములాడుచు నమిత సంతోషమున బ్రతుకుదారిని నృత్యముచేయుట ఆమె చూచినది. జమీందారుల లోనే భార్యాభర్తలు ప్రేమచే నిండియుందురనుకొను శారదకు, జమీందారుల కుటుంబములలోకన్న నితర కుటుంబములలోనే యెక్కువ ప్రేమ యుండు ననియు, జమీందారుల కుటుంబములలో ప్రేమయే లేదేమో యనియు గోచరించెను.

శారద చెన్నపురి వచ్చిన మరునాడు ఆనందరావుగారును, ఆయన భార్య ప్రమీలాదేవి గారును మోటారుపై నారాయణరావుగారి యింటికివచ్చి శారదను గుశల ప్రశ్న జేసినారు. శారదకు ప్రాణము లేచివచ్చినది. ప్రమీలాదేవి నామె బిగ్గ కౌగిలించుకొని కన్నుల నీరునించినది. శారదను దగ్గరకు దీసికొని, ‘తల్లీ! నీ తండ్రిగారు చేసిన యీ దోషానికి నువ్వు అనుభవించవలసినదే’ యన్నది.

చటుక్కున శారదమనస్సులో ‘ఏమి యనుభవించుచున్నాను’ అను ప్రశ్న స్పష్టమై పొడసూప ‘అనుభవ మేమిటి’ అని మందహాసమున బలికినది.

నారాయణరావు పెళ్ళియైన వెనుక నీ రెండు సంవత్సరములనుండియు నొక్కసారియైన ఆనందరావుగారి ఇంటికి భోజనమునకు వెడలలేదు. తెలుగు వారలలో బాగుగ ధనము వచ్చు న్యాయవాదులలో నానందరావుగారు ప్రథములు. అయినను నారాయణరావును దన కచ్చేరీకి రమ్మనిగాని, భోజనమునకు రమ్మనిగాని అతడు పిలువలేదు. నారాయణరా వాయనకు గర్వమని గ్రహించినాడు. కీలుపాకులో మామగారియింటనున్నప్పుడు జమీందారుగారువచ్చినప్పుడెల్ల ఆనందరావుగారు నారాయణుని కలిసికొనుచునే యుండిరి. మేనమామను భోజనమునకు రమ్మని పిలిచినాడు గాని నారాయణుని పిలువలేదు.

జమీందారుగా రల్లునిగూడ తన మేనల్లుడు పిలుచున్నాడనే నమ్మిరి. నారాయణరా వానందరావుగారి యుదంత మిసుమంతయు మామగారికి తెలియనీయక చరించెను.

నారాయణరావు చెన్నపురికి కాపురమువచ్చినప్పుడును ఆనందరావుగారు నారాయణరావుగారి యింటికి రాలేదు. హైకోర్టులో న్యాయవాదుల సంఘ మందిరములో గలిసికొన్నప్పుడును నారాయణరావు నాతడు పల్కరించువాడు కాడు. చెన్నపురి యాంధ్ర న్యాయవాదులు, తమిళ, కన్నడ, మళయాళ న్యాయవాదులలో బెద్దవారుకూడ అతడు లక్ష్మీసుందర ప్రసాదరావుగారి యల్లుడనియు, బి. ఎల్. పరీక్షలో ప్రథముడుగా గృతార్థుడైన యువకుడనియు, భాగ్యవంతుడనియు, దెలివిగల బాలుడనియు, భారతి మున్నగు తెలుగు పత్రికలలో, త్రివేణి మొదలగు ఇంగ్లీషు మాసపత్రికలలో వ్యాసముల వ్రాయుచుండుననియు, సంగీతమున నిధియనియు, బొమ్మలు అద్భుతముగ జిత్రించుననియు దెలియగనే వారంద రాతనితో స్నేహము చేసినారు. న్యాయవాదులసంఘములో నేవిష యము చర్చకు వచ్చినను నారాయణరా వక్కడ నున్నచో నతనిని వారు సందేహము లడుగుచుండుటయు, నాతడు నిర్దుష్టముగ వానిని గూర్చి తెలియ జెప్పుటయు గలదు. వాని మేధ న్యాయవాది మందిరములో సామెతయైనది.

ఇది యంతయు నానందరావుగారు గమనించినారు. ఆయన యాశ్చర్యమునకు మేరలేదు. ఎంత గొప్ప న్యాయవాదియైనను దన చుట్టు కోటగోడల కట్టుకొన్న వాని నెవ్వరు చేరగలరు! కావుననే నారాయణరావును తోడి న్యాయవాదులు గౌరవించుట గాంచి యాయన అక్కజపడెను.

నేడు నారాయణరా వింటికి వచ్చుచున్నానని యాయనకు మొదటిసారి హృదయమున జ్ఞానమేర్పడినది. తన మేనమామ కొమరిత శారద మగని యింటిలో నున్నది. ఆమెను దాను, దన భార్యయు వెళ్ళి చూడవలెను. ‘లా’ తప్పనేమియు నెరుగని యాతని మెదడునకు దోచిన దంతియ. ‘లా’ ప్రపంచమావల నేమున్నదో, యేమో?

ప్రకృతి - పురుషులు

రామచంద్రరావు హార్వర్డు విశ్వవిద్యాలయములో 1926 వ జూలైలో బి. ఎస్ సి. ఆనర్సులో ప్రవేశించినాడు. బి. ఎస్ సి. మూడు సంవత్సరముల పరీక్ష. బి. ఎస్ సి. ఆనర్సులో విశ్వవిద్యాలయమున రెండవవాడుగా జయమందెను. బి. ఎస్ సి. ఆనర్సు జయమందిన ఆరునెలలకు ఎమ్. ఎస్ సి. పత్రమును విశ్వవిద్యాలయమువా రిత్తురు. అందులకొక పరీక్షయు జరుగునట. ఆ పరీక్ష వ్యాసములు వ్రాయించి వానిని బరీక్షించుటయట. ఎమ్. ఎస్ సి. పరీక్షకై చాలా పట్టుదలతో జదివి 1929 ఫిబ్రవరి నెలలో నా పరీక్షకయి వ్యాసము వ్రాయుట కారంభించినాడు.

ఈలోన నా మూడేడులు హార్వర్డులోను, మశ్శాచియెట్సు రాష్ట్రప్రభుత్వమువా రేర్పరచిన, విద్యుచ్ఛక్తి విద్యాలయములోగూడ చదువుచుండెను. అమెరికా దేశమున నట్టివీళ్ల నెన్నిటినో విద్యాలయములు కల్పించెను. విద్యుచ్ఛక్తి ప్రపంచములో నా విద్యాలయపుబరీక్ష చాలా గణనీయమైనది. లియొనారాకన్యకయు నటులనే చదువుచున్నది. ఆ విద్యాలయము మహానుభావుడగు ఎడిసను పండితునిచే నిర్మింపబడినది.

రామచంద్రరావు తెలివితేటలు గ్రహించి యా విద్యాలయమువా రాతనికి వలయు సౌకర్యములు సమకూర్చుచుండిరి. ఆ విద్యలో బారంగత్వము నందవలెనన్న నైదేడులు చదువవలెను. బి. ఏ. లెక్కలు గాని, పదార్థవిజ్ఞాన శాస్త్రము గాని చదివిన వారిని మూడవ సంవత్సరపు తరగతిలో జేరనిచ్చెదరు. పరీక్షలో విజయమందిన వారికి డి. ఇ. ఇ. అను బిరుదపత్రము నిచ్చెదరు. రామచంద్రరావు రెండు సంవత్సరముల పరీక్షలో మొదటివాడుగా గృతార్థుడైనాడు.

లియొనారా కన్యకును నది తుది సంవత్సరపు బరీక్ష.

లాతిదేశములలో ఏకదేశస్థులు కలిసికొన్నప్పు డాత్మీయ సహోదరుల జూచినట్లు ప్రేమ జనించును. ప్రాణము లేచివచ్చును. ఆంధ్రు లే బెంగాలు దేశముననో కలిసికొన్నచో, నంతకుమున్ను వారిరువురకు పరిచయము లేకపోయి నను సరియే వారిలో నొకరిది బళ్ళారి, రెండవవారిది బరంపురము నైనను సరియే, ఒక్కచోట పుట్టి పెరిగినవారికన్న నెక్కువ స్నేహముగ మెలగుదురు. అటులనే హిందూ దేశస్థు లిరువు రే యాస్ట్రేలియా ఖండములోనో, జర్మనీలోనో కలిసిననాడు స్నేహితులై సంచరించెదరు.

రామచంద్రరావు మొదలగు హైందవ విద్యార్థు లనేకులు హార్వర్డు విద్యాలయమున, బెర్‌కిలే, న్యూయార్కు, కాలిఫోర్నియా మొదలగు విద్యాలయముల జదువుచున్నారు. వర్తకము చేసికొను గుజరాతీ దేశస్థు లున్నారు. రాజకీయ వ్యవహారములకై యున్నవా రున్నారు. వీరిలో నెవరెవరు కలిసి కొన్నను బ్రాణము లర్పింతురు.

రామచంద్రరా వట్లె పెక్కుమంది విద్యార్థులతో స్నేహ మొనర్చెను. రాజకీయ వ్యవహారములు చూచుకొనువారిలో కొందరు అమెరికా హిందూదేశముల కొండొంటికి గాఢమైత్రి నొనగూర్చ ప్రయత్నించువారున్నారు. అందు కొందఱిభావము లెట్టివో యేరికిని తెలియదు. అట్టివారిలో గండార్ సింగు, ప్రాణకాంతబోసు అను నిరువురు విద్యార్థు లున్నారు.

వారిరువురు చదువులు పూర్తి జేసికొనిన వెనుక కొన్ని నెలలాగి ఫిబ్రవరి నెలలో హిందూదేశమునకు వచ్చినారు. వారువచ్చిన కొద్దిరోజుల కా యువకులపై ప్రభుత్వము వారభియోగమును జరిపినారు. వారికి చెరియొక మూడేళ్లు ఖైదును న్యాయాధికారి విధించెను.

మార్చినెల మొదటివారములో నారాయణరావునకు రామచంద్రరావు వ్రాసిన యొక కమ్మ అందినది.

హార్వర్డు విశ్వవిద్యాలయం,

ఫిబ్రవరి, 1929.

ప్రియమైన బావా,

నీవు వ్రాసిన ఉత్తరం అందింది. నీది యెంత చక్కని హృదయమోయి! ఈ మూడేళ్లు నాకు సరియైన ధైర్యం కొలిపింది నువ్వేసుమా! వారం వారం నీ ఉత్తరానికి ఎదురుచూడ్డం నాకు రెండవభోజనం అయిపోయింది. నేనే నీకు జవాబులు ఆలస్యం చేసేవాణ్ణి. ఎప్పడు డబ్బు కావాలంటే అప్పుడు పంపించావు. కోటీశ్వరుడగు అమెరికా దేశస్థుని కొమరు డెట్లు సంచరించగలిగినాడో ఆలాగు నేనిక్కడ సంచరించానంటే దానికి కారణం నువ్వు. ఎమ్. ఎస్ సి. తప్పక వస్తుంది. కాని డి. ఇ. ఇ. తప్పదు. ఇంకనూ ఉన్న కొలదీ నేర్చుకో వలసింది చాలా ఉంది. కాని మన దేశంలో విశ్వవిద్యాలయాలు చాలా ఉన్నవి. ఏ విద్యాలయంలో నైనా నాకు ఉద్యోగం సంపాదించి పెట్టగలవని నా నమ్మకం. ఆంధ్ర విశ్వవిద్యాలయం క్రొత్తగా పెట్టారుకదా! అందులో నాతో ఆచార్య పదవి సంపాదించగలవను నా నమ్మిక కు నువ్వు వ్యతిరేకం చెయ్యవద్దు. నేను డబ్బు సంపాదించాలనీ, లేక పోతే కూడుదొరకదనీ కాదుగదా ప్రవేశించుటకు కోరేది. ఏదైనా విశ్వవిద్యాలయంలో ఉండి, విద్యుచ్ఛక్తి విషయమై కొత్త సంగతులు చాలా పరిశోధించవలెనని ఆశయము ఉంది. విశ్వవిద్యాలయములో నాకు ప్రవేశం దొరకకపోతే, ఏ బెంగుళూరు శాస్త్ర పరిశోధనాలయములో నైనను సరే ప్రవేశము నా కిప్పించకోరుతూ ఉన్నాను.

చి. సౌ. సూరీడుకు చదువు చెప్పించి, ఈ యేడు ప్రవేశ పరీక్షకు పంపిద్దామన్న ఉద్దేశం నీకు కలగడం చాలా ప్రశంసనీయం. పరీక్షలో నెగ్గితే అమెరికా నుండి మంచి బహుమతీ తెస్తున్నా నని చెప్పు. ఆవిడకూ నేను ఉత్తరం రాస్తున్నాను. నా సహోదరి శారదాదేవిని నే నింతవరకు చూడలేదు. ఆమెయు, మా చెల్లెలును కలిసి చదువుచున్నారని వినుటకున్ను చాలా సంతోషమయినది. చి. సౌ, నూరీడు సంగీత ముకూడా బాగా నేర్చుకున్నదని పాశ్చాత్య సంగీతముకూడా నేర్చుకుంటూన్నదని నీ ఉత్తరంలో చదివినప్పుడు నా కపరిమితానందం కలిగింది.

నేను జులై నెలలో బయలు దేరి ఇంగ్లండుమీదుగా వస్తున్నాను. బొంబాయి వచ్చి అచ్చటి నుంచి కొలంబోవచ్చి రైలుమీదవస్తాను. ఇంటికి నేను చేరుకునేందుకు రెండు నెలలు పట్టును. ఈలోన ఇంగ్లండు, ఫ్రాన్సు, జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లండు, ఇటలీ చూచుకొని మరీ వస్తున్నాను. నీ కేమి కావలసినా తంతి నీయవలయును.

ఇట్లు నీ ప్రియమైన రామచంద్ర

విద్యుచ్ఛక్తి విద్యాలయములో బరీక్షలు సంపూర్ణము లయ్యెను. రామచంద్రరావు విజయము గాంచి జయపత్రమును భారత దేశమున కంపుట కేర్పాటు చేసికొని, మరల నొకపరి దేశములోని చిత్రములు చూచెదను గాక యని నయగరా పతనమునకు బోయినాడు.

రామచంద్రు డిక నమెరికా వదలి వెళ్లిపోవుచున్నాడని లియొనారా కన్య విచారగ్రస్థయయినది. ఇన్నాళ్లు రామచంద్రు నొక ని మేష మేనియు నెడబాసి యుండలేదు. అతని నా బాలిక నయగారా తన కారుమీద కొనిపోయినది.

దారిలో నొక నిర్జనప్రదేళము కడ ప్రకృతి లీలావినోదిని యొసగు చోట కారు నాపినది. ‘రామచంద్ర! మళ్ళీ మన మెప్పుడు కలుసుకొనుట? నీవు మరల అమెరికాకు వచ్చుటో లేక నేను హిందూదేశమునకు వచ్చుటో, లేనియెడల నీరూపము నా దృష్టి పథమునుంచి మాయ మైపోవును.’

‘అదేమిటీ నారా! అంత విచారముగా ఉన్నావు? నీవంటి ధైర్యమైన పిల్లను మా దేశంలో చూడనే చూడము. కథల్లోమాత్రము వింటాము.’

‘నీ వెందుకు నా జీవిత నాటకంలో నొక ప్రాత అయినావు?’ ‘అది ఉత్తమ సంఘటనం కాదా. అది నా అదృష్టంకాదూ?’

నీ వున్న మూడేళ్లు నాకు నీవు సమకూర్చిన ఆనందము నా వ్యక్తిత్వమును ఉన్నతపథాల కెత్తివేసినది.’

‘లీ! ఈలాగున ఏమిటి వణికిపోతున్నావు!’

‘రామ్! నా ప్రియతముడైన స్నేహితుడా! భారత దేశము మహాత్ముని నాయకత్వాన సలుపు ప్రేమమహాసంగ్రామమువలన నే ప్రపంచమునకు ధర్మ సందేశ మొసగగలదని నీవు సల్పిన జ్ఞానబోధ నన్నొక నూతన వ్యక్తిని చేసింది. ఆలోచించినకొద్దీ ప్రపంచాన్ని తరింప చేయుటకు అమెరికా హిందూదేశములు రెండూ కలియాలి. భరత దేశము పురుషుడు, మా దేశము స్త్రీ. ఈ రెంటికీ సంపూర్ణ సంయోగము కలగాలి. ఆ నాడు ప్రపంచబోధ ప్రారంభమవుతుంది.’

‘నా ప్రాణప్రియ స్నేహితురాలవగు లియోన్! నీ వివాళ భగవంతుని సాన్నిధ్యమునుండి యవతరించిన దేవతలా ఉన్నావు. నీ మోమున దివ్య తేజస్సు తాండవమాడుతూ ఉంది. ‘నీ శిరస్సు వెనుక తేజోమండలము వంగపండు చాయతో గన్పట్టుతూ ఉంది.’

లియొనారా నవ్వుచు రామచంద్రుని ఒడిలోకివచ్చి కూర్చున్నది. సత్యప్రదర్శకములగు నామె కన్నులు పారలౌకికమగు నవ్వు నవ్వుచున్నవి. రామచంద్రు నామె కవుగిలించుకొన్నది. రామచంద్రుని మూర్తి పులకరించిపోయినది.

మా క్రైస్తవమతస్థు లెందరో శ్రీ యేసుక్రీస్తు దివ్యబోధ గ్రహించలేక పోయినారు. హోల్మ్సు మహాఋషి చెప్పినట్లు శ్రీ గాంధి, క్రైస్త అపరావతారమే! భగవద్గీత లోని బోధయే యేసు కొండమీదయిచ్చిన ఉపన్యాసం’

‘నా లియోన్! నే నిదివరకు మా దేశాననున్న దివ్యమణులగు గ్రంథరాజా లేమి చదువలేదు. నా లెక్కల్లో నేను పడివున్నా . ఏనాడు నిన్ను ప్రథమాన్ని ఓడపైన దర్శించానో, ఆ శుభముహూర్తా న్నే అమెరికా హిందూ దేశము లేకమై ప్రపంచానికి మార్గదర్శకము లవ్వాలని నాకు మెరుపు వలె హృదయమున గోచరించినది. ఇన్ని వందల సంవత్సరాలుగా ఇంగ్లండు భారత దేశమును పాలిస్తూ, భరతదేశ సందేశాన్ని గ్రహింపలేకపోయింది. ఇంగ్లీషువారు రాజ్యము చేయుట మాకు మరియు ఉపకార మైనది. భగవంతుడు వారి ఆక్రమణముచే మమ్మందరినీ యేకం చేసినట్లయింది సుమా.’

‘నా హృదయానికీ, ఆత్మకూ ప్రియమిత్రుడవైన రామచంద్ర! సర్వ దోషరహితమైన జీవితము గడపుటే సత్యము. అట్టి సత్యవ్రతము చేసిననేకాని సత్య స్వరూపుడగు భగవంతునితో నైక్యమందలేము. అట్టి సత్యవ్రత మొనర్చుటకు బ్రేమ ముఖ్యసూత్రమన్నావు. నాచే రాధాకృష్ణ గారి గ్రంథములు, వివేకానందుని యుపన్యాసములు, గాంధీ జీవితచరిత్రమూ చదివించావు. నాహృదయంలో మానవసేవ చేయుట పరమపవిత్ర మైనదనిన్నీ, మోక్షదాయకమైన దనిన్నీ తోచింది...’

ఆమె కంఠము రుద్దమైనది. ఆమె నేత్రాంచలములు తడియైనవి. ఆమె మోమున ప్రేమశాంతులు తళుకుమనుచున్నవి. అపు డా బాలిక __యా యమెరికను ప్రసిద్ధ వైద్యుని కొమార్తె, యా సౌందర్యనిధి లియొనారా రామచంద్రుని బిగ్గ కవుగిలించుకొని యాతని హృదయములో మోమునుంచి,

‘నీవు నా గురువువు. నే నింతటినుంచి బ్రహ్మచారిణినై మానవసేవ చేయుటకు సంకల్పించుకొన్నాను. అమెరికాకు నేను చిహ్నాన్ని, కాని నన్ను దగ్ధము చేయు నా యీ ప్రేమను వదలి వేయాలి. ప్రియతమా! నా ప్రభూ! నన్నొకసారి పాలించుకో. మొదలూ తుదీ ఏకమైన ఆనందము నాకియ్యి. నన్నీ ఒక్క ముహూర్త కాలమూ భార్య నొనరించుకో. ఈ యొక్క నిమేషము నీలో ఐక్యమైపోవనీ’ అన్నది. ఆమె మాట లస్పష్టములై, కాకలీకూజితములై, యా సంధ్య వెలుగులలో గలిసిపోయినవి.

రామచంద్రుడు నిశ్చేష్టుడై, చైతన్యరహితుడైనాడు. ఆతని మోము వెల వెలబోయినది. లియొనారాను చుట్టిన యాతని చేతులు వాలిపోయినవి.

‘ప్రభూ, నా కోర్కె పాలింపవా?’

‘ఆమె మోము హృదయముతరుగునట్టి బాధతో నిండినది. ఆమె కన్నుల సంతతజల ధారలు నయాగరాలైనవి.

‘తీరని యీ కోర్కెతో నా మనస్సు శాంతి లేక దహించుకొనిపోవలసినదేనా? నాకు సేవకై యనుజ్ఞ నీ వీయదలచుకొనలేదా? అందమగు నాయీబ్రతుకును విషాదాంతము చేయదలచినావా, నా ప్రాణప్రియా! నీ వేల నా జీవిత చరిత్రలో నొక పాత్ర వయ్యావు! అహో!’

రామచంద్రుడు కరిగిపోయినాడు. అతని లోకాలు సురిగిపోయినవి. ఈమె కింత ప్రేమ యున్నదా! తాను పాపమాచరించుట లేదా?

లియోనారా ఇంకను గట్టిగా నదిమికొన్నది. ఆమె మోమెత్తి, అతని హృదయమున తన హృదయ మదిమి పెదవులు ముద్దిడుటకు అతని మోమొ వంచినది.

ఇరువురు పుల్కరించిపోయినారు.

ఆ సంధ్యాకాంతులలో, పక్షులు కలస్వనములలో, తారకలు స్పష్టకాంతుల వర్షించు శుభ ముహూర్తాన ప్రకృతి గంభీర సౌందర్యాన నృత్యము చేయునాచోట, ఒక్క విచిత్ర ప్రేమ సంశ్లేషావేశము సంఘటించి పోయినది.

స్నేహపవిత్రత

శారదను జమీందారుగారువచ్చి పరీక్షకు రాజమహేంద్రవరము తీసికొనిపోయినారు.

శారద చెన్నపురిలో నున్నంత కాలము భర్తతో జదువునప్పడుతప్ప, తదితర కాలమం దేమియు మాటలాడలేదు. నారాయణరావు శారదతో మాట్లాడలేదు. చదువు చెప్పునప్పుడు బడిలో నుపాధ్యాయులందరు విద్యార్థుల కేరీతి చెప్పుదురో యంతకన్న నిచ్చట నధిక మేమున్నదని నారాయణరావు తలపోసికొన్నాడు.

శారదయు, దానును బ్రేమతో తమ జీవితనౌక నానందఝురీతరంగములలో వదలినచో ఆ నావ యనంతమగు నే తీరము సేరియుండునో?

నారాయణరావును ప్రజలందరు గౌరవించి ప్రేమించుట శారద చూచినది. నారాయణరావు సౌందర్యవంతుడని, విద్యార్థినులగు బాలికలు, విద్యావంతులగు యువతులు అవిసెచెట్టును నాగవల్లు లలమికొనునట్లు చేరుట గమనించింది. తానీ పురుష శ్రేష్ఠు నేల ప్రేమింప లేకపోవుచున్నానని ఒక్కొక్కప్పు డామె యాశ్చర్యపడును. దినదినము నూతన పాఠముల కెదురుచూచును. ఆతని కంఠగతమధురస్వర ప్రవాహములో నామె తేలిపోవును.

సూర్యకాంతమునకు శారదకు నాతడు వీలయినప్పుడెల్ల సర్వప్రపంచమునకు సంబంధించిన విషయములను వారి కర్థమగునటుల వారువ్విళ్ళూరుచు వినునంత తీపిగ బోధించుచుండెను.

ఫిబ్రవరి నెలాఖరునకు వారికి బాఠములన్నియు హృదయగతములైనవి. పరీక్షలో ప్రశ్నలకు జవాబువ్రాయు నేర్పంతయు నుపన్యసించినాడు. వారిచేత వందలకొలది జవాబులు వ్రాయించినాడు.

ఒక నాడతడు శారదకు బాఠము చెప్పుచుండెను. సూర్యకాంతము తన పాఠము లవగతము చేసికొనుట కింకొక గదిలోనికి బోయెను. నారాయణరావు కాంభోజి రాగయుక్తమగు తన గొంతుకతో ఇంగ్లీషులో నిట్లు వచించినాడు. ‘షేక్సుపియరుకవి దేహమనఃప్రాణప్రపంచముల మహానాటకములు రచించినాడు. ఉత్తమదశోన్ముఖులుకానివారి జీవితముల నీ ప్రపంచసంబంధములగు గుణములు విషాదమున ముంచి వేయును__అను ఉత్కృష్ట విషయమునే యాతడు వెల్లడించినాడు. గుణములు నీచములు, ఉన్నతములు అని రెండురకములు. నీచ గుణములు గల వాడు నశించును__అనే సర్వసాధారణ నీతి నవి మనకు దోపింప జేయును. పురుషకారహీనమగు మంచితనము మనల నడంచి వేయును__అను విషయమే అతడు మహావిషాదాంతమగు హామ్లెటు నాటకములో చూపించి నాడు. హామ్లెట్టు సజ్జనుడు. తన తండ్రిని తన పినతండ్రి చంపెనా లేదా యను సంగతి పూర్ణముగ దెలిసికొనకుండ నెటులాతని శిక్షించుట అని యాతడు సందేహించినాడు. ఆ సందేహమే యాతని నడంచినది. ఒథెల్లో సర్వ మానవులను బూర్ణముగ నమ్మినాడు. ఆ నమ్మకమే భార్యవిషయమున అపనమ్మకమైనప్పుడు క్యాసియాపై నసూయ, భార్యపై కోపము, చివరకు తాను తన భార్యయు నశించిపోవుట తటస్థించినది. కావున సద్గుణములైనను అహంకారమున జనించిన ట్లయిన వినాశ హేతువులు. ఇంత గొప్పవియైనను షేక్సుపియరు నాటకములకు సంపూర్ణత్వము రాలేదు. మహాకళలైనను సంపూర్ణత్వమునందనిచో ఉత్కృష్టానంద మెట్లీయగలవు? భారతీయ నాటక శిల్పులకు సంపూర్ణత్వమున్నది. కాళిదాసు రచించిన శకుంతల గమనించినచో నా మహానాటకము రెండు భాగములుగా విభజింపబడినది. ప్రథమ భాగమున దేహమనఃప్రాణలోకముల ప్రదర్శించినాడు.

‘దుష్యంతుడు మహారాజు, శకుంతల వనకన్య. మహారా జితర దేవేరులలో శకుంతలను జ్ఞాపక ముంచుకొనవలయును. శకుంతలను మరచినాడు. ప్రాపంచికమగు నానందము కొలదిమాత్ర మనుభవించి యా భౌతిక సుఖములో మైమరుచుట నీ యాత్మకు భంగకరము. ఓ ఋషికన్యా, నీ ఆర్ష సంప్రదాయము మరువకుము’ అని దుర్వాసుడు ఆమెను శపించినాడు. ఆర్యబాల విషయ సుఖములకోసం జనింపలేదు. సేవకే. తన ఆత్మ తాను తెలిసికొనుటకే. కావున మేనక శకుంతల నెత్తికొనిపోయి కశ్యపాశ్రమమున వదలినది. ఆర్యసంప్రదాయమున పుత్రుల గనుట పున్నామనరక బాధ నివర్తించుకొనుటకు, బితౄణము దీర్చుటకు. అందు కొక పుత్రుడు చాలు. శకుంతల మాతయైనది. రెండవ భాగమున శకుంతలా దుష్యంతులకు స్వర్గలోక పరిసరముల పునస్సంధానము కలిగినది. అప్పటికి దుష్యంతుడు రాజర్షి, శకుంతల యోగిని, ఇంక పవిత్రమగు వానప్రస్థాశ్రమము, సచ్చిదానంద జ్యోతిర్ముఖమగు జీవితద్వంద్వము.

‘ఇయ్యది భారతీయుల ఉత్కృష్టాశయము. కవిత్వపాకములో, కథా సరళిలో, అలంకారములలో జీవిత ప్రదర్శనములో ఒకరికొకరు తీసిపోరు కాళిదాసు, షేక్సపియరులు. కాని కాళిదాసులోని లాలిత్య మాధుర్య గంభీరతలకు షేక్సుపియరు కొంచెము తగ్గినాడు. కాళిదాసు గౌరీశంకర శిఖరము (ఎవరెష్టు), షేక్సపియరు ధవళగిరి’

ఈరీతి నింగ్లీషులో నుపన్యసించు భర్తయొక్క భాషగాని, భావములు గాని సంపూర్ణముగ గ్రాహ్యము గాకపోయినను శారద విస్ఫారిత నేత్రములతో నందమగు మోహముతో ఆకర్షింపబడి పరవశమైన హృదయముతో నట్లే కూర్చుండి భర్త వంక అనిమిషయై చూచుచున్నది.

చీకట్లు దిశల ప్రసరించుచున్నవి. సాయంకాలపు వెలుగు లా గదిలోనికి తొంగి చూచుచున్నవి, తోటలోని పూవుల సువాసన జగత్తును పరిమళ వివశత్వ మున మూర్ఛముంచినది. పశ్చిమారుణచ్ఛాయ యొండు గవాక్షమున లోన బ్రవేశించి శారదమోమును వెలిగించినది. ప్రణయతపస్సిద్ధికై తన ప్రణయాధి దేవియే ప్రత్యక్షమైన ట్లాతని కామె గోచరించినది.

ఇంతలో ఉల్క యొకటి మెరసిన ట్లా మోములో మార్పులు జనించినవి. ఆ మోము శ్యామసుందరీ దేవి మోమైనది. శ్యామసుందరి తన్నతి ప్రేమతో దిలకించిన ట్లాతనికి దోచినది. శ్యామసుందరి చిరునవ్వు నవ్వి, లేచి, చేతులు చాచి తనకడకు వచ్చి తనపై వంగినది. ఆమె యూపిరి పరిమళములు తన్నలమినట్లయినది. అతడు రక్తము వేడియై దేహమెల్ల ప్రవహింప, హృదయము హోరులెత్త, ఆమె మెత్తని చిగురాకు పెదవులు తన పెదవులపై తగిలినట్లు భావించినాడు. ఇంతలో నామె, తన్ను గౌగిలించిన ట్లయినది.

ఆమె తమిదీర తన్నతిమోహావేశమున చుంబనమొనరించిన ట్లాతడు తన భావపథమం దూహించి చటుక్కున లేచి తన పడకగదిలోనికి రెండడుగులలో చేరినాడు.

ఆతడు చకితుడై బాణహతిచే సుడివడిపోయి రెక్కలు టపటప కొట్టుకొను గువ్వపిట్టవలె హృదయము చలించిపోవ నిట్టూర్పు నించుచు పర్యంకము జేరినాడు. ఆతని కన్ను లెఱ్ఱవారిపోయినవి. కణతల చిరు చెమ్మటలు నిర్మలాకాశాన నల్లని మేఘశకలములవలె పొడసూపినవి.

ఏమిది? మనస్సులోనైన నా బాలిక శీలము చెరుపవచ్చునా? అది పాపము! పవిత్రమగు నాత్మకూడ పంకిలమ్మగు ననునంత పాపకార్యమది. ఎంత గర్హ్యము!...

ఎట్టఎదుట తన ఇల్లాలుండ, బరకాంతపై దనకీ యసమయావేశ మేల జనింపవలెను? భార్యను తాను ప్రేమింపకూడదా? అయినచో నామెయే తన్ను చేరవచ్చినట్లు తన యింద్రియములకు మించిన శక్తి తన్నట్లు కదల్చివేసినదా?

శ్యామసుందరి యను భ్రాంతికి కారణము తనలోనున్న కల్మషమే, అయినను తాను ద్రోహము చేయుటా?

శ్యామసుందరీదేవి పవిత్రచరిత్ర కావుననే యాత డామెతో స్నేహము చేసినాడు. వ్యక్తికి స్నేహము పాపమా? గర్హ్యమా? పురుషుడు వనితలతో నేల స్నేహము చేయరాదు? పురుషుని పురుషుని ప్రేమలతల పెనవైచు స్నేహము పవిత్రమైనచో, మగవానిని వనితను సువాసనాబంధముల జేర్చి వైచు స్నేహము మాత్ర మేల పవిత్రముకారాదు?

పురుషుల పరస్పర ప్రేమగూడ ధనలాభాది వ్యాజమూలకమై నీచమగును. స్త్రీ, పురుష స్నేహములో నంతకంటె నీచమగు కారణముండుటకు వీలున్నది. స్నేహము పవిత్రమంటారు. స్నేహము లేని పురుషుని మొరడనియు, శ్మశానములోని చెట్లనియునందురు. మిత్రకోటిలో మైమరచువాని బంధుసముద్రుడంటారు. అట్టియెడ, పురుషునకును వనితకును స్నేహ మేల పనికిరాదు? ఎట్టి సత్పురుషుడైనను ఒక బాలికతో నెంత నిర్మలస్నేహాన మెలగినను గుసగుసలు, తేరిపార చూపులు, పెదవి విరుపులు. ఒహో!

యౌవనమందున్న స్త్రీ పురుషులకు మాత్రము పవిత్ర స్నేహము సాధ్యమేల కారాదు?

శ్యామసుందరితో దన స్నేహము పవిత్రమైనదా? ఏ మూలమూలలనైన పవిత్రతకు దూరమగు నర్థ మేమైన గలదా?

మోహావేశము

రాజేశ్వరరావు, పుష్పశీలయు నీ ఆరునెలలు మోహావేశపరవశులయి తిరిగినారు. రాజమహేంద్రవరమునుండి హైదరాబాదు, హైదరాబాదునుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి కలకత్తా, కలకత్తా నుండి బొంబాయి. రెండవతరగతిలో నిరువురకుమాత్రముండు పెట్టెపుచ్చుకొనువాడు. స్టేషనుమాష్టరు చేతిలో రెండు, గార్డు చేతిలో రెండు లంచము. అంతే! అతడే మహారాజు!

అజంతా మొదలగు ప్రదేశములకు గూడ నాతడు వెళ్లెను. అంతటను బంగాళాలు మకాము. ఎప్పుడు పుష్పశీలయే యెదుట నుండవలెను. ఎప్పుడు మోహావేశమే. పుష్పశీల కా యారునెలల కాలము తృటిలో వెళ్లిపోయినది. రాజేశ్వరు డామెను పూవువలె చూచుకొన్నాడు. మహారాణివలె నాదరించినాడు. ఆమె యేది కోరిన నది ఇచ్చినాడు. ఆరు నెలలు తిరిగి తిరిగి వారిరువురు హైదరాబాదు వచ్చినారు. అచ్చట నాతడు ఉద్యోగమునకై ప్రయత్నింప నారంభించెను.

రాజేశ్వరునకు దూరపుచుట్టమగు బందరు నాయుడుగా రొక రచట పెద్ద ఇంజనీయరు. ఆయన రాజేశ్వరు నాదరించి నెలకు నూటయేబది మొగలాయి రూకల జీతముతో నారంభించి సంవత్సరమునకు పది చొప్పున రెండువందల యేబదివరకు హెచ్చు పద్ధతిని, సహాయ ఇంజనీయరుగా నవాబు గారు కట్టించు నైజాము సాగర్ అను పెద్ద చెరువున బనిచేయుట కేర్పరచెను.

పుష్పశీలపై నెయ్యమున రాజేశ్వరుడుగూడ మాంసాదుల వర్షించెను. ఆమెయు భార్యవలె సంచరింపదొడంగెను. తాను కాపుపిల్లనైతినని యామె భావించుకొన్నది. వారిద్ద రా చెరువులో బనిచేయు నింజనీర్లకై యుద్దేశింపబడిన యొక బంగాళాలో కాపురముండిరి.

సుబ్బయ్యశాస్త్రిగారికి మతిపోయినది. స్వతంత్ర ప్రేమ సంఘము నాయన నొవ్వ తిట్టినాడు; అగ్నియైనాడు. ప్రపంచము మ్రింగివేయుద మన్నంత కోపము వచ్చినది. రాజేశ్వరరా వింటికిబోయి యాతని వృద్దమాతపై మండిపడి దుర్భాష లాడుటచే వారు సేవకునిచే నాతని గెంటించివైచిరి. ఇంటికి వచ్చి భార్య వస్తువులు చూచి యేడ్చినాడు. ప్రపంచమున నెవ్వని నిక నమ్ముట! ఛీ! ఛీ! పురుషుడన్న వాడు పెళ్లి చేసుకోవాలి. పరభార్యల నపేక్షించుట ఎంత హీనము! తా నిదివరకు చేసిన పొరపాట్లున్నవి. అవి తాత్కాలికములు. కాని ఈ దారుణ మేమి? దీనికి శిక్షాస్మృతి ననుసరించి పరభార్యాపహరణము క్రింద నభియోగము గొనివచ్చి ఈ పిశాచిని, ఈ చండాలుని రక్తము పీల్చవలెను.

కాని, అభియోగము దాఖలు చేసినచో నిదివరకే తలవంపులు రానున్న తనకు మరియు తలవంపు లగును. ఆడవారివల్ల లోకాలు పాడవుచున్నవికదా!

అతడు వీధివెంట జనుచున్నప్పు డందరు తన్ను చూచి హేళనచేయుచున్నట్లు భావించుకొన్నాడు. అభియోగము చేసినచో వేలుతో చూపించి మరియు హేళనము చేయుదురేమో! మరియు దుర్భరపు బ్రతుక గును.

రాజేశ్వరరావుకు జమీందారుగారి యల్లుడగు నారాయణరావు గారు స్నేహితుడని యాతనికి దెలియును. చెన్నపట్టణము పోయి ఆయన సహాయ మడిగినచో నుపయోగించునేమో?

ఆ యాలోచన జనించిన రాత్రియే చెన్నపట్టణము వచ్చినాడు సుబ్బయ్య శాస్త్రి. తిన్నగా నారాయణరావు గారి యింటికివచ్చి నారాయణరా వింటికడ లేకపోవుటచే నొక హోటలునకు బోయి సామానచ్చట బెట్టి, స్నానమాచరించి, భోజనము చేసి నారాయణరావు గారి మేడకు వచ్చెను. అప్పుడే వచ్చి నారాయణరావు భోజనముకడ కూర్చున్నాడు.

నారాయణరావు భోజనము చేసి యీవలకు వచ్చుటతోడనే, సుబ్బయ్య శాస్త్రి గారు లేచి నమస్కరించెను. నారాయణరావు సుబ్బయ్యశాస్త్రి గారి నెరుంగును. ఆయన వచ్చినపని నిమేషమున నాతని కవగతమైపోయినది.

‘సుబ్బయ్య శాస్త్రి గారూ! నమస్కారము. దయచేయండి’ అని యాతడన్నాడు.

సుబ్బయ్యశాస్త్రి గారికి కన్నుల నీరుతిరిగినది. నారాయణరావు తెల్లబోయినాడు.

‘అదేమిటండీ శాస్త్రులుగారూ! మీరు వచ్చినపని తెలుస్తూనేవుంది. వాళ్ళు తిరిగి హైదరాబాదు వెళ్ళినారట. అచ్చట అతని కేదియో యుద్యోగము దొరికినదట. నన్ను వెళ్ళి ప్రయత్నము చేయమని మా యుద్దేశమైతే నేనీ రాత్రి బయలుదేరి వెళ్తాను. ఇదివరకే అనుకుంటున్నాను. కాని అతను దేశాలు తిరుగుతున్నాడు. మీరు కూడా వచ్చి హైదరాబాదులో ఉండండి. భగవంతుడు మన ప్రయత్నం నెరవేర్చకమానడు.’

‘చిత్తం. నేను నాశనం అయిపోయానండి. ఈ ఆరు నెలలు నేను పడిన బాధ నా విరోధికైనా వద్దండి. మర్యాదగా బ్రతికినవాణ్ణి. ప్రజలు అన్ని విధాల నన్ను హేళన చేస్తున్నారు. ఎన్నిసార్లో గోదావరిలో పడిపోదామనిన్నీ, విషం పుచ్చుకుందామనిన్నీ తోచింది.’

‘ఆలాగా!’

లోకపు మెప్పుగోరి మంచి చేయుటయు, నిందకోడి చెడుచేయకుండుటయు గొప్ప కాదు. లోకమే మనశీలమును గాపాడుచున్నదా? హరిశ్చంద్రాది నాటశాలలో నీ భావములు వెల్లడించి ఈ నాటక గ్రంథకర్త లెట్టి ద్రోహమాచరించుచున్నారు! మనము మంచి చేయుట మంచికొరకు గాని, లోకము కొరకా? ఓ భరతమాతా, నీ కెట్టికళంకము తెచ్చుచున్నామమ్మా! మేము చేయు మంచి చెడ్డలు సంఘమనుకొనుదాని పై నాధారపడియున్నవికదా! మంచి కదాయని మంచిచేయుటకాదు. చెడుకదాయని మానివేయుట కాదు. హరిశ్చంద్రుడు నిజమాడిన, ప్రజలు హరిశ్చంద్రుడు సత్యమాచరించినాడని చెప్పుకొనవలెననియా? అందులకా అత డా వ్రతము పట్టుట? అని నారాయణరా వనుకొనెను.

ఆరాత్రి వారిరువురు బెజవాడమీదుగా హైదరాబాదు ప్రయాణమై పోయిరి.

హైదరాబాదునుండి నైజాముసాగరు వెళ్ళిరి. దూరమున నొక యాత్రికుల బంగాళాలో సుబ్బయ్యశాస్త్రిగా రాగినారు. నారాయణరావు రాజేశ్వరరావును కలిసికొనుటకు వెడలిపోయినాడు.

రాజేశ్వరున కుద్యోగమై పదునైదు దినములైనది. అత డందరితో, దోడి యధికారులతో, పై యధికారులతో, తాబేదారులతో మంచిగా సంచరించు చుండెను. ఆ పదునైదు దినములలోనే యాతడన్న నందరు గౌరవము జూపుచుండిరి. రాజేశ్వరరావు తోడియధికారి యొక మహ్మదీయ యువకుడున్నాడు. ఇత డొక నవాబు గారి కొడుకు. ఆ నవాబు గారికి నైజాము ప్రభుత్వములో జాల పలుకుబడి యున్నది. ఆ యువకుడు హైదరాబాదులో ఇంజనీరింగు చదువు కొన్నాడు. పలుకుబడిచే నాతని కా యుద్యోగమిప్పించి నారు.

ఆ యువకునకు, రాజేశ్వర రావునకు మిక్కుటమగు స్నేహము కలిగినది.

రాజేశ్వరరావు స్వతంత్ర ప్రేమ సంఘంలో నిజమగు సభ్యుడు గాని, స్వలాభమునకై యందు జేరలేదు. తనయం దిష్టము లేని స్త్రీ నెప్పుడు నాతడు బలవంతము చేయలేదు. తాను మోహించిన యువతి యొక నెల తరువాత నైన తన యిష్టము వేరొకనిమీద ప్రసరింపజేసినప్పు డా యువకుడు హృదయమున నిసుమంతయు నసూయపడక, ఆ యువతిని వదలి వేయువాడు; జుగుప్స నొంద లేదు. అతని హృదయ మిసుమంతయు బాధ ననుభవించలేదు. తాను పెళ్లిచేసుకొన్న భార్య పరుని గోరినచో నామె కోర్కె దీర్చుట కాతడు సంసిద్ధుడనని హృదంతరమున సంకల్పించుకొనియే యున్నాడు. పుష్పశీలయు దానును రాజమహేంద్రవరమునుండి బయలు దేరినప్పుడే యాతడు సుబ్బయ్య శాస్త్రి గారి కిట్టి యుత్తరము వ్రాసి తపాలులో వేసినాడు.

‘ఆర్యా! మనం ఒక విచిత్ర సంఘంలో చేరిన సభ్యులం. ఆ సంఘంలో ఉన్న నియమాలు జరుపుటకు మీరు ప్రమాణం చేశారు. ఇంక ఆ యుద్దేశాలేమిటి:

1. ఆడవాళ్ళు ఇన్ని యుగాలనించీ మగవాళ్ళకు బానిసలై యుండుట చేత, వారి బానిసత్వం తొలగ చేయుట, వారికి పురుషునకున్న సర్వ స్వతంత్రాలు ఇచ్చుట.

2. వివాహము అన్నది వ్యక్తిత్వాన్ని చంపి మానవుల్ని సంఘానికి బానిసల్ని చేస్తూవున్నది కాబట్టిన్నీ, ఈ వివాహం అనే సంస్థ పురుషుడు స్త్రీని తనకు బానిస చేసుకోడానికే యేర్పాటు చేసుకున్నది కాబట్టిన్నీ, సదరు వివాహం అనే సంస్థను రూపుమాపి దాని స్థానే స్త్రీ పురుషులకు సమానహక్కుల్ని యిచ్చే సంస్థను యేర్పాటు చేయడానికిన్నీ.

3. ఉద్దేశాల్ని ఆచరణలో పెట్టడానికి మన సంఘాచార్యులగు తిరుపతిరావుగారు మనకు దినచర్య సూత్రాలు కొన్ని నియమించారుకదా: (ఎ) ఎప్పటి కప్పుడు కనబడినవారి కెల్ల మన సంఘోద్దేశాలు చెప్పి సభ్యులను చేర్చుకోవడం. (బి) వివాహము చేసికొనని పురుషుడు వనితతో, వనిత పురుషునితో స్నేహమున కలిసియుండవలెను. వారు ప్రేమకొరకై యట్లున్న మరియు నుత్తమము. (సి) వివాహము చేసికొన్న సభ్యులు తమ భార్యలకు స్వాతంత్య్రమిచ్చి వారి యిష్టానుసారము సంచరించుటకు సమ్మతింపవలెను.

ఈ మూడు ముఖ్య సూత్రాలను తమరు గమనించవలెనని ప్రార్థిస్తున్నాను. నేను మీ భార్యయైన పుష్పశీలాదేవిని ప్రేమించాను. ఆమె నన్ను ప్రేమించినది. కాబట్టి యీ ప్రేమ సాఫల్యం చేసుకోటానికి మేము దేశాలు తిరుగుతున్నాము. మీ ప్రమాణం జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడు పుష్పశీల నాపై ప్రేమను మరుస్తుందో ఆనాడు తిరిగి మీయింటికి వస్తుంది. పుష్పశీలకూడా నా ఉద్దేశమే బలపరుస్తున్నది. అందుకనే ఆమెకూడా ఈ ఉత్తరంలో సంతకం చేస్తూ ఉన్నది.

మీ ప్రియమిత్రుడు రాజేశ్వర రావు.

పై ఉత్తరం అంతా నా యిష్టం పైన కూడా వ్రాయబడింది.

మీ మిత్రురాలు పుష్పశీల.

ఈ ఉత్తరం చూచి తల బ్రద్దలుకొట్టుకున్నాడు సుబ్బయ్య శాస్త్రి. ఆ ఉత్తరం సంగతి ఆలోచించుకొనుచు సుబ్బయ్యశాస్త్రిగారు నిట్టూర్పు నించుచుండ నారాయణరావు రాజేశ్వరు డింటలేడనియు, బనికై బోయి నాడనియు తెలుసుకొన్నాడు. నారాయణరావు గబగబ నడచుచు కూలీల, గుమాస్తాల, చిన్న యుద్యోగుల నడుగుచు రాజేశ్వరరావు పని చేయు స్థలమునకు బోయెను. రాజేశ్వరరావు నారాయణరావును కనుగొనగానే తెల్లబోయినాడు. అతనికి జిరుచెమ్మటలు పట్టినవి. ఒక్క పరుగునవచ్చి నారాయణుని కవుగలించు కొన్నాడు. ‘నారాయణా, నువ్వేనట్రా వచ్చింది! నువ్వేనట్రా! ఏమిటిది, ఎందుకు వచ్చావు, ఎల్లావచ్చావు? ఎప్పుడువచ్చావు? రా! రా! మా యింటికి వెళ్లావా? ఎవరున్నారు?’

‘వెళ్లాను. అక్కడున్న ఒక మహమ్మదీయ యువకుడు చాలా డాబుగా ఉన్నాడు. అతడూ, ఒక చక్కనిపిల్ల, పుష్పశీల కాబోలు, తేయాకుబల్ల ప్రక్క కుర్చీలలో కూర్చుని ఉన్నారు. నన్ను చూచి మహమ్మదీయ యువకుడు ఈవలికివచ్చి నువ్విక్కడున్నావని చెప్పాడు. నీ బంగళాకూ ఇక్కడకూ రెండు మైళ్లుందిరా, అబ్బా!’

వ్యాధికి మందు; ఆయువుకు మందు లేదు

సాధుశీల, సత్యహృదయ, సూరమ్మకు నెంతయో జబ్బు చేసినది. ఆమెకు పురిటిలో జేసిన జబ్బు నిశ్శేషము కాలేదు. చిక్కి శల్యమైనది. తిండి సహించుట లేదు. ఎప్పడు తలనొప్పులు, చిన్న చిన్న జ్వరములు.

రాజారావు తన భార్య పుట్టినింటికడ అలతి రోగములచే కృశించుచున్న దని, తనకడకు గొనివచ్చి, యామెకు వైద్యముచేయ నారంభించెను. బలమునకై మందులిచ్చెను. దేహములో నెచ్చటనైన రోగపదార్థమున్న దేమో యన్న భయాన స్ట్రెప్టోకాకయి మందు నరముల ద్వారమున లోనికిచ్చెను. క్షయ యేమో అని భయము పుట్టి జాగ్రత్తగ పరీక్ష చేసినాడు, ఎక్కడను ఆ జాడయైన లేదు. అంతకంతకు రోగము శ్రుతిమించి రాగమున బడినది.

మలేరియా జ్వరమేమోనని యాలోచన కలిగినది. సబ్ టెర్షియన్ మలేరియా యే జబ్బునైన అనుకరించును. అతడు క్వినయిను లోపలికి వాడినాడు, సూదివెంట నెక్కించినాడు. జ్వరము రోజుకు నూరుదగ్గర మొదలిడి నూటమూడు డిగ్రీల వరకు నెక్కుచున్నది. ఆమె జిక్కిపోకుండ ద్రాక్ష, పంచదార, కోడిగ్రుడ్డుసొన, బార్లీ నీరు, పాలు విరుగుడునీరు ఇవియన్నియు నామె కిప్పించు చుండెను. అత్తవారు వచ్చినారు. తన చుట్టములు వచ్చినారు. సూరమ్మకు జబ్బు విజృంభించింది. రాజారావు తన మిత్రులగు నిరువురు పేరుపొందిన వైద్యులకు తంతులనిచ్చి రప్పించుకొన్నాడు. వారువచ్చి యెడతెగక వైద్యము చేసినారు. ముగ్గురు జాగ్రత్తగ గ్రంథములు పరిశీలించి యాలోచించి వైద్యము చేసిరి. సన్నిపాత (టైఫాయిడు) జ్వరము కాదని నిర్ధారణ చేసినారు. రక్తము, మలము, ఉమ్మి గిండీకి పంపి పరీక్ష కూడ చేయించినారు.

ఊపిరితిత్తులు శ్లేష్మముచే నిండ, అయొడిను ఏఫిడ్రిను ఇచ్చినారు. తగ్గిపోయినది. గుండె అతి నెమ్మదిగా కొట్టుకొన్నది, నెమ్మదిగ ఏడ్రినాలిన్ మొదలగు మందుల నిచ్చి యా గడ్డు దాటినారు. తడిగుడ్డలు పొత్తికడుపుపై వైచి వైద్యము చేసినారు. పైలక్షణము లన్నియు తగ్గినవి

గుండె బలముగా నుండుటకు డిజటాలిస్ అను మందు, లోన పేగులలో విషములు లేకుండుటకు డైమాలు, మూత్రకోశము శుభ్రముగ నుండుటకు ఎక్సమీను మొదలగునవి యిచ్చుచు నతి జాగ్రత్తగ వైద్యము చేయుచునేయుండిరి. చోప్రా మొదలగు మహానుభావులు పాశ్చాత్య వైద్యములోనికి గొనివచ్చిన ఆయుర్వేదౌషధముల నాసవముల నుపయోగించినారు.

ఇతర జబ్బులువచ్చి తగ్గుటయే కాని అసలు జ్వరము తగ్గలేదు.

రాజారావు చుట్టములలో నొకడు గొప్ప ఆయుర్వేద వైద్యుడు వచ్చి చేయిచూచి పెదవి విరిచి రాజారావుకడకు పోయి ‘ఏమి చేయదలచుకొన్నావురా, అబ్బాయి?’ అని అడిగెను.

రాజారావు ‘ఏమి చెప్పను మామయ్యా! ఈ రోజో రేపో అనుకుంటున్నాము. వ్యాధికి మందున్నది; ఆయుస్సుకు లేదు అని నా కీనాటికి దెలిసి వచ్చింది’ అనుచు నిట్టూర్పు విడిచెను.

భర్తయగు రాజారావును, తన బిడ్డలను, నితర చుట్టములను వదలి, సూరమాదేవి దివంగతురాలైనది.

భార్య బ్రతుకదని రాజారావుకు దోచినప్పుడే నారాయణరావునకు తంతినిచ్చినాడు. నారాయణరావు హైదరాబాదు వెడలి ఇంకను రాలేదు. పరమేశ్వరుడు తిరిగి హైదరాబాదుకు తంతినిచ్చి తానుతక్షణం బయలుదేరి, అమలాపురం వెడలిపోయెను. పరమేశ్వరుడు వెళ్ళిన నాలుగుగంటలకు సూరమాంబ దేహము చాలించినది.

ఆ బాలిక తలిదండ్రులు, అన్నదమ్ములు, రాజారావు తల్లిదండ్రులు వచ్చినారు. ఇల్లంతయు చుట్టాలతో నిండి గొల్లుమనిపోయినది. రాజారావు స్తబ్ధుడైపోయినాడు.

కొత్తపేట నుండి సుబ్బారాయుడు గారు, జానకమ్మగారు వచ్చినారు. శ్రీరామమూర్తి రాజారావింటికి రాని నిముషము లేదు.

ప్రాణము పోవుముందు సూరమ్మ భర్తను బిలిచి యాతనికి రెండు చేతుల నెమ్మదిగ దరికిచేర్చి నమస్కరించి, ‘పిల్లలు_ మీకు_ చెప్పనక్కర లేదు. మళ్ళీ_వివాహం _ చేసుకోండి’ అని కన్నుల మూసికొని మరల తెరచినది. అప్పుడామె మోమున పారలౌకిక కాంతి ప్రజ్వరిల్లినది. ఆమె చిరునవ్వు నవ్వుచు, ప్రక్కనే భగవద్గీత చదువుచుండిన మామగారిని చూచి, మామగారికి నమస్కరించి ‘కృష్ణా! కృష్ణా !’ యని ప్రాణము వదలినది.

ఆయమ్మ తలిదండ్రు లా శవముపై వ్రాలి రోదించిపోయినారు. ‘తల్లీ! నువ్వు భూదేవతవు. మాకెప్పుడూ చాకిరీ చేసేదానవు. నా కొడుకువల్ల కాకపోయినా నీవల్ల ముక్తి పొందుదామనే అనుకున్నాను. అందరికీ తల్లోని నాలికలా ఉండేదానవు.

‘నాతల్లీ ! నాబోటి నిర్భాగ్యురాలికి నీవంటి కోడలు ఎలా దక్కుతుంది సూరమ్మతల్లీ!’ యని రాజారావుతల్లి గుండెలవియ విలపించినది.

రాజారావుకు నిరువు రాడుపిల్లలు. పెద్దపిల్ల ఆరేండ్ల బాలిక, రెండవది మొన్న పుట్టిన చంటిబిడ్డ. వీరిరువురకు మధ్య నొక యాడుపిల్ల పుట్టిపోయినది.

రాజారావు ధీరత్వముతో తన దుఃఖమంతయు దిగమ్రింగి తిరిగినాడు.

ఇంతలో నారాయణ రావు రెండవరోజుకు వచ్చిపడినాడు.

రాజారావును తన హృదయమునకు జేర్చుకొన్నాడు. అక్కడ నారాయణుడు, రాజారావు, పరమేశ్వరమూర్తి మాత్రమే యున్నారు. రాజారావు వైద్యస్నేహితు లదివరకే వెడలిపోయినారు.

రాజారావు కంటివెంబడి అశ్రుధారలు ప్రవహించినవి. నారాయణు డోదార్చినాడు.

‘నా బ్రతుకులో, నా జన్మంలో ఉత్కృష్ట భాగం మాయమైంది నారాయణా!’

‘ఓయి తెలివితక్కువా! ఎక్కడికి మాయిమైందంటావు? దేహంవదలి పోయిందంటావు. అయితే ఏం? ఆమె ఉత్తమవ్రత కావున మళ్లీ యెత్తే జన్మ, జన్మరాహిత్యం చేసుకునేందుకనే ఎత్తుతుందిరా!’

‘ఎంత సమాధానపరచుకున్నా మనసు కుదుటపడడం లేదురా.’

‘అవును. ఎంతనుకున్నా మానవమాత్రులం. ఈ మానవ జన్మలో ఎన్నో మనం చెప్పుకోగలుగుతున్నాము. అనుభవించగలుగుతున్నాం. ఈ జన్మ లోంచే మనం తరించేదికూడాను. అంతజబ్బు ఎలా చేసిందిరా, డాక్టరు ఆంజనేయులు, డాక్టరు నాగరాజుకూడా వచ్చారన్నావు. అబ్బా! అదేమిటోయి, మీరెవరూ ఏమిటో చెప్పుకోలేని జబ్బుకూడా ఉందాంట? ఇంతకు మనకు దురదృష్టం రాసిఉన్నదిలే, లేకపోతే అటువంటి విచిత్రరోగం రాదు. అదేమిటిరా పరం! కళ్ళనీళ్ళు తుడుచుకో! వట్టి బేలహృదయం నువ్వూనూ! రాజారావూ! నీ కళ్ళనీళ్ళు చూసి పరమం కూడా గంగానదిలో యమునను సంగమం చేస్తున్నాడు. మొన్ననే చూసినట్లు ఉందిరా! అప్పుడు బతికించుకున్నావు. ఆ రోజుల్లో నువ్వు చూపించిన ప్రజ్ఞ ధన్వంతరిని తలపించింది. అట్టి సుశీల, పరమసాధ్విని చూట్టం అరుదురా. దేవుడు ఎవరికీ ఉపకారం చేయడేమో! ఆ పని మనుష్యులగోల ఏమిటి? ‘మా తల్లి! మా తల్లి!’ అని ఒకటే యేడుపు.’

‘నారాయణ! అదిగో ఆ పనిచేసే మనిషి, అక్కడ కూర్చున్న వారిలో గుమ్మం దగ్గిర రెండోది, అది మా అమ్మాయి బంగారుబిళ్ళ తెంపుకొనిపోతూ ఉండగా, మా నౌకరు పట్టుకొన్నాడు. పోలీసువాళ్ళకు అప్పగించాలనుకున్నా; నా భార్య కన్నులు విప్పి తెల్లబోయి,

‘అదేమిటండీ! మీ హృదయం గాంధీగారి బోధలు మరిచిందా! పోనీలెండి, దాన్ని వదిలేయండి. తప్పని గట్టిగా చెప్పి వదిలివేద్దాం. దాన్ని మానిపించవద్దు’ అని సన్న సన్నగా చీవాట్లు పెట్టింది. నేను వైద్యంచేసి బతికించిన అమ్మాయిభర్త ఇక్కడ పోలీసు జవాను. మా యింటిలోని దొంగతనము సంగతి తెలిసికొని, చరచర మా యింటికొచ్చి, కేసుపెడతాననీ, అనుమతి యివ్వండనీ అడిగాడు. మా ఆవిడ ఒప్పుకోలేదు. ఆనాటినుంచి ఆ పనిమనిషి నమ్మకంముద్ద అయిపోయిందోయి!’

‘అవునోయి, సూరమ్మను గూర్చి నువ్వు నాకు చెప్పడమా! నా చెల్లికన్న ఎక్కువ ప్రేమ, నా తల్లికన్న ఎక్కువ ఆదరణ చూపించేది.’

రాజారావు తన హృదయమంతయు స్నేహితు లిరువురికడ వెళ్లబోసి కొన్నాడు.

తాను వేదాంతము చదువుటయందు సర్వమూ మరచిపోవువాడు. వైద్యమునందు మునిగియుండువాడు. ఇంటిలో నేమియున్నదో ఏమిలేదో యను విచారణముతో నాతని కవసరముండునదికాదు. ఎంతమందియో చుట్టాలు వచ్చువారు. సూరమ్మ తన హృదయ మెఱిగి చరించు సుశీల. గృహలక్ష్మి. వృద్ధులగు నత్తమామలకు భక్తిమెయి పరిచర్య జరుపునది. తన భార్యయన్న హృదయమున నెంత ప్రేమయున్నను ఒక్క నాడైన తాను నిండారు ప్రేమను భార్యతో మాటలాడుకొనలేదు. ఆయమకు దన భర్తమనస్సేమి కష్టపడునో యన్న భయమే.

‘ఆమెను నా బిడ్డలకు తల్లి అయ్యేందుకు ఉపయోగించానే గాని నా హృదయము నిండారుగా ఆమెతో మాట్లాడలేదు. ఇంకోచిత్రం ఏమిటంటే; చుట్టపక్కాలకు ఎప్పుడూ పతిభక్తి బోధిస్తూ ఉండేది. భాగవతము కంఠతా! అందులోని వేదాంతార్థాలు చెప్పేదిట. నాకు తెలియదు. ఆమె చక్కని గొంతుకతో పద్యములు చదవగలదు అన్న సంగతే తెలియదు నాకు’ అని రాజారావు తలపోసి విలపించెను.

అంతకన్న అంతకన్న వారి చర్చలు వేదాంతపథముల విహరించినవి. జీవపరమాత్మల సంబంధము, జీవావతారము, పరమాత్మావతారము, జీవాత్మ పరమాత్మ సంధానము, సాంఖ్యజ్ఞానసిద్ధాంతము, యోగకర్మసిద్ధాంతము, కర్మ జ్ఞానమార్గముల సమీకరణము, పురుష ప్రకృతి, వాద బ్రహ్మవాద సమీకరణము, గీత ఎట్లుచేసెనో, గీతావాక్కు ప్రపంచములో మహాత్తమగ్రంథ మెట్లాయెనో, శ్రీకృష్ణుడెట్లు సంపూర్ణావతారమో అన్నియు చర్చించుకొన్నారు.

వేదము లిరువురు పురుషులే యన్నవి. సాంఖ్యము అనంతమగు పురుషులు, ఒక్క ప్రకృతి యన్నది. ఉపనిషత్తులొక్క బ్రహ్మమునే తెలిపినవి. గీతలో శ్రీకృష్ణుడు వాటినన్నిటిని సమన్వయము చేసినాడు. భగవంతుడే లేడనువారు, అనేక లక్షల భగవంతులున్నారనువారు, ఒక్కడే భగవంతుడున్నాడను వారు, మూడువిధములుగ జనులున్నారు. ఈ మూడు వాదనలను సనున్వయము చేసినాడు శ్రీకృష్ణుడు. సాంఖ్యము ద్వైతవాదమునుకూడ మించిపోయినది. సాంఖ్యులు విశ్వకారణము నేమందురు? విశ్వము నావరించిన రెండు మూలసూత్రములు పురుషుడు, ప్రకృతి, పురుషుడు సాక్షి. ప్రకృతిశక్తి .

సాంఖ్యము వెనుక యోగము చర్చించినారు. గీతలోని యోగమార్గము పతంజలి చెప్పినదికాదు. పతంజలి గీతకు కొన్ని వేల వర్షము లిటీవలి వాడు. యోగమునుగూర్చి అనుశ్రుతముగా, పరంపరగా వచ్చిన దానిని పతంజలి ప్రోగు చేసి, సూత్రరూపముల వెల్లడించినాడు. గీతలో చెప్పుయోగము పతంజలి కెన్నో సంవత్సరముల పూర్వకాలము నాటి ఋషిసాంప్రదాయమగు యోగము.

ఆ వెనుక ఉపనిషన్మతమును గూర్చి చర్చించినారు. భగవద్గీత ఈ మూడింటిని ఎట్లు సమన్వయించినది చర్చించి నారు.

సాంఖ్యులు పురుషుడు, ప్రకృతి, త్రిగుణములు, త్రిగుణ జనితములగు ఇరువది నాలుగు తత్త్వములు అను వానితో మొదలు పెట్టి, వెనుక నుపనిషత్తులు చెప్పిన క్షర, అక్షర బ్రహ్మములను జెప్పి ఈ రెంటికిని సమన్వయము చేయు పురుషోత్తముడు అని పరబ్రహ్మవాదమును సిద్ధాంతీకరించును, క్షరబ్రహ్మయు ప్రకృతియే. అక్షరబ్రహ్మయు సాక్షి. క్షరముతో సంబంధము లేక తనలో జనించిన క్షరమునుజూచుచు నుండును. క్షరబ్రహ్మయు అక్షరబ్రహ్మ స్వరూపమే. ప్రకృతిని లయించి ప్రకృతిని ఆటంక ప్రకృతిలో చేరియును తన స్వరూపమగు క్షరబ్రహ్మమును జూచుచుండును. ఆ క్షరపురుషుడు ప్రకృతిలో జేరక ప్రకృతి స్వరూపమగు క్షరబ్రహ్మమునకు సాక్షి. అక్షరబ్రహ్మమునకు పైన పరబ్రహ్మము పురుషోత్తముడున్నాడు. క్షరాక్షరబ్రహ్మ లిరువురు పరబ్రహ్మ స్వరూపములే. పరబ్రహ్మమే తన ప్రకృతివలన జీవాత్మయగును. ఆ ప్రకృతియే మూలప్రకృతి. ఆ మూల ప్రకృతిలో నుంచి జనించినది సాధారణ ప్రకృతి.

ప్రేమాశయము

సూర్యకాంతం పరీక్షలో బాగుగా వ్రాసినది. తప్పక విజయమందితీరునని నారాయణరావు నిశ్చయించినాడు. రాజారావును వీడి నారాయణరావును బరమేశ్వరుడును చెన్నపురి చేరినారు. శారద పరీక్షలో బాగుగ వ్రాసినట్లు జమిందారుగా రల్లునికి వ్రాసినారు.

దారిలో బరమేశ్వరునికి నారాయణరావు రాజేశ్వరుని చరిత్రయంతయు జెప్పినాడు. ‘రాజేశ్వరరావుతో ఒక దినమంతయు ధర్మజిజ్ఞాస చేశానురా! వాడి దృష్ట్యా చూస్తే న్యాయపథంగానే ఉంటుంది వాడి నడత. వాడెంత సేపు చెప్పినా ‘నాకు మా వివాహధర్మములందు నమ్మకము లేదు. పుష్పశీల నన్ను ప్రేమించింది, నేనామెను ప్రేమిస్తున్నాను. ఆవిడకు నామీద ఇష్టంపోతే ఆవిడ యిష్టంవచ్చినచోటికి వెళ్లవచ్చును. నేనెప్పుడూ ఏవిధమైన అభ్యంతరం పెట్టను. నీ వేదాంతం నా కవసరం లేదు. నీ ధర్మం, నీ అహింస, నీ సత్యమార్గం నాకు పథ్యం కాదు. నాకు అర్థం కాదు. నువ్వు నీ బోధ పుష్పశీలకు చేసుకో. ఆ అమ్మాయి మనస్సు మళ్లుతుందీ, తీసుకుని వెళ్లి ఆ భర్తకే అంటగట్టవోయి. ఇది మాత్రం నేను నిర్ధారణగా చెప్పగలను. పుష్పశీల సంపూర్ణంగా నన్ను ప్రేమిస్తోంది. సర్వకాలం ఆమెకు నామీదే ఉంటుందని చెప్పను. ప్రేమకూడా నువ్వు చెప్పే బ్రహ్మపదార్థంలా నిత్యమని చెప్పటం మామతమేకాదు!’ అన్నాడు. నేను, ఆ అమ్మాయితో ఒంటిగా ధర్మమార్గం అంతా చెప్పినాను. ఆ అమ్మాయి విన్నదంతా విని నవ్వుతూ ‘నారాయణరావు అన్నగారూ! మీరంటే చాలా గొప్పగా చెబుతారు నాయుడుగారు. కాని చూస్తే మీరు వట్టి ముసలమ్మ కబుర్లు చెబుతున్నారు’ అన్నది. నేను మాత్రం తెల్ల బోయినాను’

‘ఏమి చెప్పావురా రాజేశ్వరుడితో?’

‘ఏముందిరా! నీ వృత్తిలో సర్వసృష్టిన్ని పరబ్రహ్మైక్యం చేయడమే మహాత్ముల దృష్ట్యా ఉన్నతాశయం అన్నాను. కాబట్టి అందరూ ఒక్కసారే మోక్షం పొందినా ఇబ్బందిలేదురా అన్నాను. మనం చేసే పనులు రెండువిధాల ఆలోచించాలి. నివృత్తికోసం, ప్రవృత్తికోసం. అంటే మోక్షమార్గం క్రిందా, ప్రపంచంలో ఆనందం పొందడం క్రిందా. నువ్వు చేసినపని ఎందులోకి వస్తుందన్నాను.

‘నాకు ఇప్పుడు ఆనందం ఇస్తోందిగా!’ అన్నాడు.

‘అదేనా నువ్వుచేసే ప్రతికార్యం ఆలోచించుకోవలసిన పద్ధతి? ఏ కార్యం చేసినా దాని మంచి చెడుగులు నీ జీవితం అంతా ఎలా ఉపకరిస్తాయి, ఎలా అపకారం చేస్తాయి అని ఆలోచించుకోవుట్రా’ అన్నాను.

‘ఇప్పు డీ అమ్మాయి నువ్వూ ఉన్నారుకదా, ఆ భర్త నీపై శిక్షాస్మృతి క్రింద కేసు తెస్తాడనుకో. నువ్వు ఏ రెండేళ్లో జైలుకు వెళ్లవచ్చుకదా?’ అన్నాను.

‘అవును. నువ్వు నీ అహింసమార్గం అవలంబిస్తూ జైలుకు యెందుకు వెళ్లావు? నా ఆశయంకోసం జైలుకు వెళ్లితే తప్పా?’ అన్నాడు.

‘మనం చేసే ప్రతికార్యం దోషరహితంగా ఉండదు. ‘సాధ్యమైనంత వరకు’ అనే మాట ఒకటుందికదా. అలాగే నువ్వు ఆచరించే కార్యాలలో సాధ్యమైనంత వరకు ఇతరులకు కష్టంగా ఉండకూడదు అని కూడా చూడాలి కదా’ అని నేనంటే, ‘చూడాలి కాని సంఘం ఒక దోషం చేస్తూంటే అది మార్చడానికి ప్రయత్నం చేసేటప్పుడు కొందరికి అపకారాలు జరుగుతాయి. నీ అహింసావ్రతంవల్ల ఎంతమందికో నష్టం కలుగవచ్చును. అంతమాత్రాన మానుతావా?’ అని నన్ను ప్రశ్నించాడు.

‘సరే, అంతవరకు వచ్చావు గనుక నేను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్ప. ప్రపంచంలో ఉత్కృష్ట ఆశయం ఏది?’ అంటే , ‘సంతోషమే ఉత్కృష్ట ఆశయ’ మన్నాడు.

‘సంపూర్ణమైన, సర్వతోముఖమైన సంతోషం ఏరకమైన స్త్రీ, పురుష సంబంధములో లభిస్తుంది? అనే ప్రశ్నకు, ‘ఇంతవరకు లేదు. ముందుముందు మా పద్ధతివల్ల లభించగల’ దని చెప్పాడు.

‘జడ్జి లిండిసే గారి వ్రాతలు, సర్ హావిలాక్ ఎల్లిస్ మొదలగు వైద్య విశారదుల వ్రాతలు చదివావా?’ అన్నాను.

‘అవన్నీ గమనించి వివాహశాసనం ఉన్న మనదేశంలో స్త్రీ, పురుషులకు అంతకంటె ప్రాపంచినందం ఎక్కువగా కలగటం లేదని చెప్పగలవా?’ అన్నాను. ‘అమెరికాలోని పద్ధతులు ఎంత నికృష్టంగా ఉన్నా లిండిసే కనబరచిన దోషాలకు అతడు చూపినది నివారణోపాయంకాదు’ అన్నాడు. షెల్లీ మొదలగువారు మీ పద్ధతులు అవలంబించి భగ్నమనోరథులై కృశించి కృంగిపోయారు. ఇంక ప్రకృతిశాస్త్రజ్ఞులు శాస్త్ర పరిశోధన చేస్తూ చేస్తూ ప్రకృత్యతీతమగు పరబ్రహ్మకు మార్గము చూపు దారికి వచ్చి యచ్చట ఆగిపోయినారు. ప్రకృతి సంబంధమగు పరీక్ష చేయడానికి పనికివచ్చే పరికరాలు పరబ్రహ్మమును కనిపెట్టలేవు. ప్రకృతిమార్గం చేత పరానికి దారి దొరకదు. దానికి పార లౌకికంగా ఆలోచించాలికదా. పారలౌకికంగా ఆలోచిస్తేనే మీదనున్న దారి కనపడుతుంది అంటూ ఈలాగున చెప్పాను. వాడు తల వాల్చుకొని ఉన్నాడురా. ఆ పిల్ల కూడా చెంతనే ఉన్నది. ఇంతా విని ఆ అమ్మాయి అన్నదికదా, ‘నారాయణరావు అన్న గారూ! నా జన్మలో నేను మనుష్యస్త్రీగా సంచరించింది ఈరోజులే. మీరెంత చెప్పినా లాభంలేదు’ అన్నది. సరే, బాగా ఆలోచించుకోండి, అని బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నాను. రాజేశ్వరునితో ఆ అమ్మాయి భర్త వచ్చినాడని చెప్పినాను. అత ‘డల్లాగా’ అని అతన్ని కూడా వచ్చి భార్య హృదయం మార్చడానికి ప్రయత్నించమనరా’ అన్నాడు. నాకు నవ్వువచ్చింది. ఇంతలో నువ్వు పంపించిన భయంకరమైన టెలిగ్రాము చక్కా వచ్చింది.’

చెన్నపట్నం వచ్చుటతోడ నే నారాయణరావుగారి ఇంటిలో సూరీడు, శ్యామసుందరి, ఆమె ముగ్గురు చెల్లెళ్లు అందరూ కూర్చొనిఉండగా నారాయణరావు, రాజారావు భార్య పోయిన సంగతి చెప్పి, సూరమాంబ గుణగణములను వర్ణించి చెప్పినాడు. శ్యామసుందరి వివర్ణవదనయై విన్నది.

‘అన్నా! మంచి వాళ్లు బ్రతుకరుగదా!’ ‘అవునమ్మా! లోకంలో ఉండే చెడుగు మంచిని తరిమేస్తుందంటావు. మామూలుదృష్టికి అల్లాగే కనబడుతుంది. కాని ఈ ప్రపంచంలో చెడుగు ఇంకా హద్దుమీరకుండా ఉన్నదంటే, మంచియొక్క ప్రాబల్యం చేతనే. చెడుగు ప్రాబల్యంగా ఉంటే యీపాటికి జగత్తుకు ప్రళయం రాదటమ్మా. మనకు ఈ ప్రకృతే అంతా బోధిస్తూఉన్నది. రాక్షసశక్తి కిరసనాయిలులో ఉన్నది. ఆవిరిలో ఉన్నది. విద్యుచ్ఛక్తిలో ఉన్నది. ఇవన్నీ కట్టుతప్పితే కాలాన్ని దగ్ధం చెయ్యగలవు. అలాగే మనుష్యునిలో ఉండే రాక్షసశక్తి కట్టుతప్పకుండా చేస్తూఉన్నది అతనిలోని మంచే సుమా! కాబట్టి చెడుగు మంచిని తరిమి వేస్తోందని ఎల్లా చెప్పగలవమ్మా?’

‘నిజమే అన్నా!’

పర: ఒరే నారాయుడూ! ఒక సంగతి ఆలోచించు. చెడుగు, మంచి ఒక్క ప్రకృతిలో నుంచేకదా వస్తాయి, అప్ప చెల్లెళ్ళవలె. ఎందుకు మంచి మన మోక్షానికి మార్గం అయింది; ‘చెడుగు’ ఎందుకు కారాదు?’

నారా: నీకు తెలియదా, నన్నడుగుతావు! పురుషుడు ప్రకృతి మాయచే దేహాత్మ భ్రమలో పడుతున్నాడు. అహంకారంలో ఉన్నన్నాళ్ళు పురుషుడు సాక్షీభూతుడగు అక్షరుని, అక్షరస్థానమందుండి పురుషోత్తముని తెలిసికోలేడు కదా! ఆ పురుషుడు, ఆ ప్రకృతి పరబ్రహ్మ స్వరూపులేకదా. కాబట్టి ప్రకృతి యొక్క గుణములలోంచి జన్మించిన మంచి చెడ్డలతో మంచి పురుషుడు తానే అక్షరబ్రహ్మమను జ్ఞానం సంపాదించుకొనుటకు మార్గం అయ్యాడు.’

రుక్మిణియు, చిన్న బాలయు క్షేమముగ నున్నారు. పరమేశ్వరునకు గొమరితయందు వెఱ్ఱిప్రేమ. ఆమెపై నెన్నియో పాటలు వ్రాసినాడు. రోహిణి దేవి వానిని చదువుమని మరియు మరియు గోరునది. పరమేశ్వరుని భావములన్నియు చిత్రములు. అనాదినుండియు ఒక సంపూర్ణ ఆత్మ ఉద్భవిస్తుందట. అది ఆ ఆదికాలంలోనే స్త్రీ పురుష మూర్తులనే రెండు ఆత్మలుగ విడివడునట. వారి జీవిత యాత్రలో నెప్పుడో యొకప్పుడు భార్యాభర్తలే కలియుదురట. ఒక్కొక్కప్పుడు ప్రాణమిత్రులైన స్త్రీ పురుషులై కలియుదురట. అట్టి జన్మలో ఒక నాడు స్త్రీ పురుషునకు మోక్షముపొందుమార్గ ముపదేశించునట. అప్పుడా జంట ఒకటై తారకమార్గము నందునట. ఇదియంతయు నిజము కాకపోయినను ఒక్కటిమాత్రము నిజమని పరమేశ్వరుడు వాదించును.

‘ఒరే నారాయుడు! పురుషుని కొక యాశయస్వరూపమయిన వనితయును, స్త్రీకి ఆశయస్వరూపుడైన పురుషుడున్ను ఉండితీరాలి. వారాచరించు దీక్షకు ఉత్సాహము, ఉత్తేజము ఇస్తూఉంటారని నేను పూర్ణంగా నమ్ముతాను. డాంటీకి బియట్రిసు ఉన్నట్లు, కీట్సుకు ఫానా ఉన్నది. నెపోలియనుకు జోసెఫైను, సంపూర్ణావతారస్వరూపమగు శ్రీకృష్ణునికి రాధ, పాండవులకు ద్రౌపది, రామునకు సీత, వివేకానందునకు నివేదిత, కాళిదాసు కాయన భార్య, లీలాశుకునకు చింతామణి, క్రైస్తునకు మాగ్డలీను, మీరాబాయికి తాన్ సేను, అనిబిసెంటుకు కృష్ణాజీ. అవునా?’ అనినాడు ఒకనాడు పరమేశ్వరుడు.

‘నువ్వు చెప్పినది చాలాభాగము నిజమే. ఎందుకు నీ కా ఆలోచన కలిగింది?’.

‘నాకూ, రోహిణీబాలకు స్నేహము కలిగినప్పటినుంచీ ఎన్ని పాటలో వ్రాశాను. బొమ్మలుకూడా, చూశావా? ఆమధ్య ఆగాను. మరల నాకు ఎక్కడ లేని శక్తివచ్చినట్లు వేయుట ప్రారంభించాను.’

‘అవును! నేనూ ఆశ్చర్యపడుతూ ఉన్నాను. అదా నువ్వూ, రోహిణీ ఎప్పడూ కలిసి మెలిసి మాట్లాడుకోవడం?’

‘రోహిణీ దేవికి ఈ యేణ్ణర్ధం నుంచి చిత్రలేఖనం బాగా నేర్పుతున్నాను, నీకు చూపించమంటే పూర్తిగా తానువేసిన బొమ్మలు తయారుగానే చూపిస్తానంది. అంటే నేను దిద్దడం తక్కువగా ఉండడం అన్నమాట. నాలుగు బొమ్మలు వేసింది. మొదటి మూడు నేను బాగా దిద్దాను. ఆ బొమ్మలలో నా ప్రజ్ఞే ఎక్కువపా లున్నది. ఇప్పడు వేసింది అంతా ఆమె. నేను ఒక గీతగీసినానో లేదో అన్నీ తనే వేసుకున్నది. బొమ్మలు వేయుటలో మమ్ముల నందరినీ మించేటట్టు ఉన్నదిరా!’

‘దుర్మార్గుడా! నాకు చూపించకుండా నువ్వు ఇన్నాళ్ళు దాచావు?’

‘అరే! నీతో నేను వాళ్ళకి బొమ్మలు వేయటం నేర్పుతున్నానని చెప్పలేదుట్రా?’

‘కాని ఇంత బాగా వేస్తుందని సూచించి ఉంటే నేను చూచి సంతోషించేవాణ్ణి. ఏదీ ఈవాళ సాయంత్రం వాళ్ళయింటికి వెళ్ళి చూద్దాము, శ్యామసుందరి బొమ్మలు వేయలేదు కాబోలు.’

‘వేయలేదుకాని శ్యామసుందరి తెలుగులో కవిత్వం రాయడం మొదలుపెట్టినది. తెలుగు చదువను, వ్రాయను బాగా తెలియకపోయినా వినికిడివల్ల, ఎక్కడినుంచి పట్టుకున్నదో తెలుగునుడి, ఏమి తియ్యగా వ్రాస్తుందిరా! పాటలలోని రహస్య మామెకు బోధించినాను. ఈమధ్య సంస్కృతం బాగా చదువుకుంది. నీ కీ రోజునో రేపో పాడి వినిపిస్తానంది.’

8

అగాధము

నారాయణరాయని జీవితాంతర్గతమగు ప్రేమప్రవాహము మహావేగమున ప్రవహించి మాయమగుచున్నది. విద్యుచ్ఛక్తి రెండు స్వరూపములట. అవి ఒకదాని కొకటి వ్యతిరేకములట. రెండును కలిసిన గాని విద్యుచ్ఛక్తి కాదట. అట్లే మానవుని ప్రేమయు ఎదిరిప్రేమ లేనిచో వ్యర్థమై జీర్ణించిపోవును. ఒకప్పు డా జీవిని మూలమునంట కదల్చివేయును. ఎన్ని యుగములకో శారదకు మెలకువ వచ్చుటయని యెదురు చూచుచున్నాడు. ఇంగ్లీషుకథలో చెప్పిన నిదురసుందరిని మేల్కొలుపగల ముద్దు తన బ్రతుకులో లేదా? తా నా రాజకుమారుడును గాదా యని యాత డనుకొన్నాడు. ఎన్ని సారులో దననిశ్చయమును మరచి యా బాలికను దరి చేర్చుకొని తనలో నైక్యమొనరింపదలచుకొన్నాడు. ఆ బాల వట్టి విగ్రహము వలె చైతన్య రహితమా యన్నట్లున్నది.

ఇట్లు శ్యామసుందరి ఉత్తమ మేధాసంపన్నురాలు. కర్మయోగిని. వైద్యవృత్తిచే రోగి నారాయణసేవ జేయ సంకల్పించినది. వైద్యవృత్తిచే వచ్చు ధనము దేశసేవకై వినియోగించెదని యామె దీక్ష. ఆ బాలిక తన సహోదరి. ఆమె సంగీతము నేర్చుకొన్నది. పరమేశ్వరునికడ పాటలువ్రాయ నేర్చుకొన్నదట. ఏమి పట్టుదల! ఆమె హృదయమెంత సున్నితము. ఎంత ప్రేమమయము. ఆమె వైద్యురాలై యెట్లు మనగలదు? నీవు శస్త్రచికిత్స చేయ గలవా యని తాను ప్రశ్నింప__

‘వజ్రాదపి కఠోరాణి, మృదూని కుసుమాదపి’ యని చదివినది. ఇట్టి యుత్తమాంగనలు దేశమాతకు భూషలుగదా!

ఈ యాలోచనలతో దానును బరమేశ్వరుడు కారునెక్కి శ్యామసుందరీ దేవి యింటి కా రాత్రి వెళ్ళినారు. అప్పుడు శ్యామసుందరి దీక్షగా పరీక్షకై చదువుకొనుచున్నది. మనవారిని చూచి మోము ప్రఫుల్లమైపోవ తన సహజమగు నొయారపు నడకతో వచ్చి డాబామీద నున్న కుర్చీలుసర్ది, రండని వారితో నచ్చట కూర్చున్నది. పరమేశ్వరుడు రోహిణి యేదని యామెను వెదకుచు లోనికి బోయినాడు.

పదియేను నిముషములు వారేమియు మాటలులేక కూర్చుండినారు. ఆమె నలముకొన్న భక్తి యాతని చుట్టివేసినది. ఆమె తలవంచుకొని యేమి యాలోచించుకొనుచున్నదో. సముద్రపవనములు శీతలములై హాయిగ వీచుచున్నవి. తారకలు తమ కాంతిరకముల నెమ్మదిగ పన్నీరు చల్లుచున్నవి.

చటుక్కున నారాయణ రావు తలయెత్తి ‘చెల్లీ! నువ్వు పాటలు రాయుచున్నావని పరమేశ్వరుడు చెప్పాడు. ఒక పాట పాడ్తావా?’

‘అదేమిటన్నా! పరమేశ్వరం అన్న, కొంటె అన్న, ఏమిటి నాపాటలు!’

‘పాడమ్మా! నా దగ్గరకూడానా నీకు సిగ్గు?’

‘పాడుతాను. మరి నువ్వేమీ అనుకోకుండా ఉండాలి. నీవంటివారి దగ్గర పాడుటకు చాలా ధైర్యం ఉండాలి అన్నయ్యా!’

‘నేను కొట్టనుగద!’

‘ఏమో ఎవరికి తెలుసును?’

‘పాడు మరి. శ్రుతివద్దు. నీ కంఠంలోనే ఉంది శ్రుతి.’ ‘వదినగారి కంఠంలో ఉన్న శ్రుతి, ఎవరి కంఠంలో ఉంది?’

‘ఏమిలాభం?’

‘అదేమిటన్నా!’

‘ఏమీలేదు తల్లీ, ఏమీలేదు. శ్యామా! పాడు.’ అతని కంఠమున మారినది.

చటుక్కున శ్యామసుందరి లేచి ‘అన్నయ్యా! నీ ఆత్మ పరమ పవిత్రమైనది’ అని అన్నది. ఆమె కూర్చుండినది. శారద నారాయణరావుయొక్క ఉత్కృష్ట జీవితరాగానికి శ్రుతి కాలేకపోయినది కాబోలు. ఈ యువకుడు తన గంభీరహృదయంతో, మొక్కవోని మనస్సుతో తలవాల్చి ముందుకే నడుచుచున్నాడు. శారద ఈ పుణ్యచరిత్రుని బ్రేమించుట లేదా? అవును, అవును. ఆమెకు ఒక్కసారి మబ్బుచాటుననుండి వెన్నెల ప్రసరించినట్లయినది. శారద చరిత్ర ఇప్పుడొక్కసారిగా అవగతమైపోయినది. శారద నారాయణరావును బ్రేమించుటలేదు.

ఎందుకు ప్రేమించుటలేదు? అయ్యో, శారద ఎంత మూర్ఖహృదయ! ఎక్కడను ఈతడు తన రహస్య మిసుమంతయు నితరులకు దోపించక సంచరించుచున్నాడే. శారద! నీ వెంత దురదృష్టవంతురాలవు! నీ హృదయమున కర్కశత్వమున్నదా? నీ రూపమంతయు విగ్రహరూపమా? నీలోన నేమాత్రము ప్రేమలేకుండ నుండవలె. నీవు మరుభూమివా? ఏమి యీ విషాదము; ఈ విచిత్ర నాటిక. ఆమె భావములు వెలుగువలె ప్రసరించినవి. ఆపరాని దయ ఆవరించిపోయినది, అశ్రువులు తిరిగినవి. ఆమె మైమరచిపోయినది. తిన్నగ నారాయణరావుకడకు బోయినది.

ఆమె అతని తలను దనహృదయమున నదుముకొన్నది.

ఒక్కసారిగా ఇరువురకు దేహములు కంపించినవి. వార లిరువురి రక్తములు వేడియైపోయినవి. అప్రయత్నముగ నారాయణరావు శ్యామసుందరిని గవుగిలించుకొన్నాడు. వారిరువురు దృఢాలింగనాపరవశులైరి. శ్యామసుందరి నారాయణరావు మోమును దన వైపునకు ద్రిప్పి భక్తితో నాతని ఫాలమును ముద్దుగొన్నది. నారాయణుడు సర్వము మరచినాడు.

ఆమె శారదయైనట్లు గాఢలాలసుడగు నారాయణరావునకు దోచినది.

తక్షణ మా కౌగిలి సడలించి నారాయణుడు నిద్రమేల్కొన్న వాని భంగి, నిట్టూర్పు నించి ‘అయ్యో’ అనుకున్నాడు. గబగబ అచ్చటనుంచి రెండంగలలో క్రిందికి దిగిపోయినాడు. తిన్నగా తాను వెళ్లు దారితెలియక, చెమ్మటలు తుడిచికొనుచు సర్వమును మరచిన జడునిభంగి సముద్రతీరమును జేరుకొన్నాడు.

అప్రయత్నముగ ఆతనికి హాహాకారమగు శోకము కంఠమునుండి వెలువడినది. ఆతడు తలను బట్టికొని ఇసుకలో జదికిలబడినాడు. ఏమది! ఇట్టి ఘోరపాప మాచరించినాడేమి? అట్లు తా నాచరించుటకు గారణమేమి? ఆమెను బ్రేమించుచున్నాడా? అవును; తన చెల్లెలుగా చూచుకొన్నాడు. తన కైదవచెల్లె లనుకున్నాడు. పెద్దసూరీడనుకొన్నాడు. అంతే! నిర్మల ప్రేమ రక్తసంబంధము లేనప్పుడు కొంచెము వెనుదిరిగినచో కామదోషిత మగునేమో?

తనకు వివాహము కానప్పుడు, ఒకరిద్దరు బాలికలజూచి తాను సంభోగాపేక్ష పొందినాడు. ఆ భావము ముహూర్తమాత్రము. అటువెనుక నా తుచ్ఛ భావము రాలేదు.

సంభోగ భావము తుచ్ఛభావమా! అయినచో ఋషుల కెట్లు సంతతులు గలిగినవి? లోన పుల్కరము కదలించు మోహావేశమున్న గాని సంభోగేచ్ఛ జనింపదే. ఆ యిచ్ఛ పాపమా? అది పాపమైన భార్యయందును అట్టి కోర్కె జనింపగూడదే? కాని యిదేమి యాలోచన! శ్యామసుందరి తన్ను ప్రేమించినట్లే యెరుగడు; తన్ను ముద్దుపెట్టుకొనుట సంపూర్ణముగా పాశ్చాత్యుల సోదరీ భావముననే కాదా! ఈ దేశమున అట్టి ఆచారములు లేకపోయినను ఆమె పెట్టిన ముద్దులలో దీప్తసాంత్వన మున్నది. అగుచో తనకంత వేడి యేల జనించినది? తన కట్టి ఆవేశము కలుగ ఏది కారణము? రాజేశ్వరుని మతము నిజము కాదుగద! ఛీ! అది యెట్లు?

ఆతని మత మింద్రియ సంబంధమైనది. అటువంటి యప్పుడు ఆతని మతము దోషభూయిష్టము. పురుషునిలో విటత్వము గర్భితమైయున్నదా, కర్రలోని నిప్పువలె? ఎప్పుడో యప్పడు ప్రతిమానవుని నుండి యిది బయట కురుకునా? పవిత్రమయిన ప్రేమ ఆనందదాయక మందురే. అదియు ఖేద భూయిష్టమా?

అతడు బాధపడిపోవుచున్నాడు. సముద్ర కెరటములవంక జూచుచున్నను అవి కనబడలేదు. అటు తాను ప్రేమించిన తన భార్య తనకు ప్రేమ నీయదు. ప్రేమనిచ్చుటకు సంసిద్ధయగు నొకయుత్తమాంగన తలంప వీలుకానిది. ఎందుకో, మనుష్యుని జీవితములో నింతభాగ మీ ప్రేమ యాక్రమించుకొనుట? యని యాత డాడిపోసికొన్నాడు.

ఏలాగున ఆమె మోము జూచుట. చూడకపోయిన తాను వట్టి పందయై పోడా! పిరికితనము కాదా అది? ఏది గత్యంతరము? అతని కణత లుబ్బుచునే యున్నవి. రక్తము వేగముగ ప్రవహించుచునే యున్నది. వేడియై, హిమశీతలములైన తన యంగములు పట్టుతప్పిపోయినవి. ఆతని హృదయరోదనము సముద్రఘోషలో మిళితమైనది. సముద్రము ఒడ్డుననే యా యువకుడు నిశ్చేష్టుడై యట్లే పడియున్నాడు. సర్వప్రపంచము ఆతనికి లేనిదై, మాయమైనది. నారాయణరా వెప్పుడు సంభ్రమమున లేచి, నిమిషమున తనకడనుండి మాయమైనాడో, ఆ క్షణములో శ్యామసుందరికి జగత్తు తలక్రిందులైనట్లు మెలకువ వచ్చినది. ఆమె గజగజ వణకిపోయినది. ఆమె ఆలోచించుకొనుటకుగూడ భయపడిపోయినది. ఆమె కప్రయత్నముగ నేత్రాంబువులు దొరలినవి. దడదడ మని యుబికిపోవు గుండియ నామె నణచుకొన హృదయముపై రెండు చేతులు వేసికొని నొక్కికొన్నది. తానిట్టి తెలివితక్కువపనిచేసి, యాతని కలంచిన దేమి? అట్టిది ఎప్పడైన కలనైన తలంచినదా యని వాపోయినది. అంత సమాశ్వసించుకొన్నది. తానింత యబలయైన దేమి? అత డంత కంగారుపడినా డేమి? తానేమి దోష మాచరించినది? కరుణావేశయై యాతని ననునయింప బోయినది. ఇంతలో శీలమున కేమైన భంగము కలిగించినదా? అతనిని కౌగిలించినప్పు డేమియో తీపులు తన్నలమిన ట్లయినది. అతనిని దాను ముద్దుపెట్టు కొన్నది. అదియేల? ఆ ముద్దునీయుట భారత నారీమణులు చేయు పనియా? చంటిబిడ్డను ముద్దుగొన మధురముగా నుండదా? అంతకన్న వేరు రుచి తానాతనికి సమర్పించిన ముద్దులో గోచరింప లేదు. ఎంత గట్టిగ కౌగిలించినాడు! భయపడిన బాలు డటులనే యాలింగనము చేయును.

త్రికరణములచే తాను దోష మాచరించినట్లే తనకు దోచుట లేదు. పురుషునితో స్త్రీ, సంచరించునట్లు చరించినదా? తన స్త్రీత్వమే పోయినది. తాను వైద్యకళాశాలలో నెప్పుడు చేరినదో యప్పుడే స్త్రీత్వమును వదలివేసినది. తన్నిదివర కే పురుషుడు నింత కదలింపలేదు. నారాయణరావు పవిత్రహృదయుడు. అతనిపై పవిత్రమగు ప్రేమ చూపించుచున్నది. ఆ ప్రేమలో నపశ్రుతి యేమున్నది? తన ప్రేమలో దేహానందమున్న నుండవచ్చు గాక. అది తాను దోషభూయిష్టహృదయముతో నాచరింపలేదే. కాని ఆతని హృదయములో నేమున్నదో, ఆతని కౌగిలింతలో గంభీరమధురములు తోచినవి. తన ప్రేమలో నేమున్నదో? ఆ క్షణికములో తా నెవరైనదో ?

అట్టి యుత్తమపురుషు డొక్కసారి తన దేహము గోరిన దాను వెనుదీయవలెనా? అంతమాత్రమున తనలో కళంకము జేరునా? అది ఎట్లు? మహర్షి రుచిగల పదార్థము నొకసారి వాంఛించిన యాతనిలోని పవిత్రత ఎట్లు నశించును?

ఏమో! ఏమో!

తా నాతని పవిత్రత భంగము చేయుటకు కారణమయ్యెనా? అట్లుకాదు. మహాసత్వుడగు నాతడు ప్రేమకై తపించినాడు. తనకు బరమ కరుణ గలిగినది. కరుణలో స్త్రీ ప్రేమ జనించినది. ఇరువు రొక పరమనిమేషమున నేదియో యానందమున నోలలాడినారు. అంతమాత్రమున దోష మేమియు లేదు. 

మోహధర్మము

నారాయణరావు తనకడకు రాకమునుపే రాజేశ్వరుడు పుష్పశీల హృదయము మారినదేమో యని సందియమందసాగెను. అతని తోటియుద్యోగి యగు నా మహమ్మదీయ యువకుడు రాజేశ్వరరావింటికి బదింబదిగ రానారంభించెను. రాజేశ్వరరావుమాత్రము పుష్పశీలకు సంపూర్ణ స్వాతంత్ర్యమిచ్చి, యామె యిచ్ఛానుసారము మెలగనిచ్చెను. తమ ప్రేమస్వాతంత్ర్య సంఘాదేశములు, ఆశయములు విజయమందుట కాచరించవలయు మార్గములు అన్నియు పుష్పశీల కుపదేశించినాడు. ‘నువ్వు నీప్రేమ ననుసరించి మెలగవచ్చును. నీకు నామీద ప్రేమ యెంతకాలము ఉంటుందో అంతకాలం నాదగ్గిర ఉండవచ్చును. నీకు ప్రేమ సంపూర్ణముగ నాయెడల నశించిపోయి, వేరొకని నీవు వలచినచో నీవు నిస్సంశయముగ ఆ పురుషునికడకు వెళ్ళిపోవచ్చు’ ననియు రాజేశ్వరరావా సుందరితో వచించినాడు.


పుష్పశీల చపలచిత్త, ఆమెహృదయము సీతాకోక చిలుకయే. రాజేశ్వరునిపై మమకార మప్పుడే నశించిపోసాగినది. ఇంతలో నీ మహమ్మదీయ యువకుడు రాజేశ్వరుని యింటికి రా నారంభించినాడు. రాజేశ్వరరావు పుష్పశీలకు నా మహమ్మదీయ యువకునితో పరిచయము గలిగించెను.

పుష్పశీలకు ఇంగ్లీషున మిడిమిడిజ్ఞానము కలదు. కాన ఆ భాషలో నా మహమ్మదీయ బాలకునితో నేదేని మాటలాడుచు వినోదించుచుండెను. ఆ బాలకుడు రాజేశ్వరరావు లేని కాలములోకూడ రాజేశ్వరునింటికి వచ్చుచుండెను.

ఒక నా డాత డా యువతి చేయి పట్టుకొన్నాడు. పుష్పశీల మాటాడలేదు. చిరునవ్వు నవ్వినది. రెండురోజులు పోయిన వెనుక నా మహమ్మదీయ యువకు డామెను వెనుక నుండివచ్చి కవుగిలించుకొన్నాడు. పుష్పశీల ఆతని బాహువులలో బులకరించినది. వారిరువు రంత శయ్యాగృహమున కేగినారు.

రాజేశ్వరున కప్పుడే పుష్పశీలకు నా మహమ్మదీయ యువకునకు గల సంబంధము కరతలామలకమై తోచినది. ఆనాటి నుండి రాజేశ్వరుని హృదయమున నెచ్చటనో కనబడని కంటకమువలె నీర్ష్య బాధింపజొచ్చెను. రాజేశ్వరుడిది ప్రథమమున నీర్ష్య యనుకొన లేదు. ఏదో బాధ యనుకొన్నాడు.

అప్పుడే నారాయణరావు వచ్చినాడు. నారాయణుడువచ్చి యేమేమియో చెప్పినాడు. గాంధీతత్వము బోధించినాడు. తన భార్యను నితరులకు సంతానార్థ మిచ్చిన ఆర్యకాలము నాటి గృహమేధి తప్పొనరించినాడా? లేదు. తప్పు అనునది కాలమునుబట్టి మారుచుండునుగదా. తప్పు అని కనుగొనుటకు ముఖ్య నూత్రము మనము హింస నాచరింపుచున్నామా యని నిర్ణయించుకొనుటయే. పరదారను, పరధనమును ఆశించుట పరుల హింసించుటయే యగును. కావున పాపకృత్యమని వాదించినాడు. అహింసాసూత్రము నాధారము చేసికొని నీవు నీకర్మ నడుపవలెను. సంఘము ముక్తి మార్గము నన్వేషించుటలో నెన్నియో పద్ధతుల నలవడచేసికొనును. అవి యన్నియు అహింసకు, సత్యమునకు వ్యతిరేకము గాకూడదు. కావుననే సంఘమున ధనమంతయు నందరకు సమముగా బంచవలెనని నిబంధన పెట్టుకొని దానికై పలువుర జంపుట పాపమగును. నీవు స్వచ్ఛ కర్మయోగివై, నీ ప్రేమచే సంఘప్రజ నంతను సంస్కరింపవలెను. ఆలాగుననే స్త్రీ విషయమునను. స్త్రీలకు పురుష వాంఛయు, బురుషులకు స్త్రీ వాంఛయు హద్దుమీరుట మోక్షమునకు దూరము. అది ఇంద్రియలోలత్వములో ముంచును. గాన దానికై వివాహసంస్థ నెలకొల్పి యావాంఛను జాలవరకు తగ్గించినారు. వివాహమన ప్రేమ లేకుండుట కాదుసుమా! అందు దోషము లేవైననున్న యెడల మార్పుచేయుము. అంతియకాని నీ యిష్టము వచ్చినట్లు పోరాదు. మానవునకు స్వాతంత్ర్యము మంచిచేయుట కున్నదిగాని, చెడుగొనరించు టకులేదు.

ఈరీతిగా నారాయణరావు తనకు బోధయొనరించినాడు. అది నిజమా? ఆధ్యాత్మిక పథ మొకటి యున్నదని తనకు నమ్మకము లేదు. ఈజన్మము ముగిసిన వెనుక ఆత్మలు మరల జన్మించునా? ఆ ఆత్మలు__త్రాసునకు, జూపునకును అందని ఈ ఆత్మలు__ ఆద్యంతరహితములన్న మాట కేవలము కల్పితము అని నిశ్చయము జనించును.

కాని ఆ నిశ్చయము బూర్వమెప్పుడు చలనము లేక స్థిరమై యుండునది. ఇదివర కెంద రెన్నిరీతుల వాదించినను, వానిని ఛూ ఛూ యని తోసిపుచ్చు వాడు. నే డాతనికి అనేక సందేహములు జనించినవి. తన భావములు, గురువుగారి సందేశము తప్పేమో? ఇదివరకు తన గురువు గారి మతమువంటిదే చార్వాకమతము ఉండెడిదట. రోమను కాలమున, గ్రీకు మహాసామ్రాజ్యము విచ్ఛిన్న కాలమున ప్రజల కిట్టి విపరీతబుద్ధు లుండెడివట అని నారాయణుడన్నాడు. అది నిజమా? ఇది నిజమా?

ఈ యాలోచనలతో నొకనాడు రాజేశ్వరుడు తన యింటికడకు వచ్చినాడు. ఆ మహమ్మదీయ బాలుడును, పుష్పశీలయు లోననున్నారని సేవకుడు చెప్పినాడు. ఇంటిలోనికి వెళ్ళక మండిపోవు హృదయము నుపశమింప జేసికొనుచు రాజేశ్వరుడు తన పాదము లెచటికి గొంపోవుచున్నవో యెఱుంగని యవస్థలో నిల్లువిడిచి యేగెను.

తనలో నీర్ష్య జనించినదని యాతనికి స్పష్టమై తోచినది. దృఢవ్రతుడనని తా నెంత గర్వపడుచుండెనో యంతకు తగినశాస్తియైనది. నాకళ్ళయెదుటనే స్త్రీలు చంచలచిత్త లనుమాటను పుష్పశీల నాకు ఇంత చక్కగ బోధించునని యెఱుగ నైతిని. తన హృదయము దహించుచున్నది. తాను క్రొత్తగా స్వతంత్ర ప్రేమ సంఘములో జేరినప్పుడు, కొందరు కొందరు యువతులతో దాను వినోదించినప్పడు, వారు తన్ను వదలి యితరులతో జరించునప్పుడు తా నెట్టి యీర్ష్యయు నందలేదే! అట్టి తనకు నే డీ యీర్ష్య యెక్కడ నుండి జనించినది?

రాజేశ్వరుడు పుష్పశీలకడ కొకదినమున బోయినాడు.

‘పుష్పం! నాపై ప్రేమ అంతా మారిపోయిందా?’

‘ఛా! ఛా! అదేమిటి రాజా! అల్లా అంటావు? నీవు నా ఆత్మనాథుడవు. నిన్ను తప్ప నేను ఇంకో పురుషుణ్ణి తలంపలేను. నేను నీ దానను.’

‘నువ్వు మాట్లాడేది నాలిక చివరినుంచా, హృదయములోనుంచా? పుష్పశీలా! నీకు ప్రేమమారితే మారి ఉండవచ్చు. అది తప్పు అనే ఉద్దేశముతో నిన్నీ ప్రశ్నలు అడుగుట లేదు. నిజము చెప్పవలసింది అని. ఎందుకీ గ్రుద్దులాట? మన యిద్దరిస్థితి యేదో ఒక నిశ్చయానికి, ఒక మార్గానికి వస్తుందని, అంతే. నీపై నా ప్రేమమాత్రము ఇసుమంతైనా తరగలేదు, అదేమి చిత్రమో!’

‘ఇదివరకు మీ ప్రేమకూడ అస్తమానము మారుతూ ఉండేదిగా?’

‘అప్పటికి నా ప్రేమకు తగిన స్త్రీమూర్తి కనబడ లేదు కాబట్టి.’

‘అల్లాగే నాకు ఇప్పటికి నా ప్రేమకు తగిన పురుషమూర్తి కనబడలేదేమో అనుకోరాదా?’

‘అవును. అందుకనే నేను నిన్ను అడిగేది ఏమిటంటే, నీ హృదయము ప్రస్తుతము మారిందా? అని.’

‘అది నేను ఎలా చెప్పగలనండీ!’

‘అదేమిటి పుష్పం! నువ్వు చెప్పలేవా! ఇదివరకు లేనిది నన్ను కొత్తగా అండీ అని అంటున్నావు. నీ హృదయం మారినటులే తోస్తూంది.’

‘అండీ అనకూడదా! మీరు నాకు భర్తవంటివారు గనుక అన్నాను.’

‘అబ్బా! నన్ను నీ భర్తవంటి వాణ్ణి అన్నావు, సరే, నేనున్నూ మిమ్ము గౌరవంచేసి మాట్లాడనా?’

‘అదేమిటి నామీద ప్రేమ తప్పిందా?’

పుష్పశీల సుడిగాలి వేగమున వచ్చి రాజేశ్వరుని కౌగిలించుకొన్నది. అతని నదిమిపట్టి పెనవేసికొనిపోయినది. ‘నీకు వట్టి అనుమానం నాథా! లేని పోనివి పెట్టుకోకు’ అని యామె యాతని చెవిలో సన్నని యెలుగున పలికినది. అతడును, ఆమెయు మోహావేశమున మైమరచినారు.

నాలుగురోజులైన వెనుక రాజేశ్వరుడు తోటలో చెట్లకు మళ్ళు త్రవ్వుచుండెను. ఆ రోజు శుక్ర వారము. నెలవు చీకట్లుపడినవి. అంతయు నిశ్శబముగా నున్నది. బంగాళాచుట్టు చెట్లపై పక్షులు గూళ్ళుచేరి పాటలు పాడుచున్నవి. వేసవికాలము వచ్చుచున్నదని చూపిన వెర్రి వేడియెండ పూర్ణముగా పోయినను దేశమింకను జల్లబడలేదు.

రాజేశ్వరుడు తోటలో పని చేసికొనుచున్న సంగతిని పుష్పశీల మరచి విహారమునకై చెరువుగట్టుకు పోయినాడని యనుకొన్నది. కావుననే యందకాడగు నా మహమ్మదీయ యువకుడు రాజేశ్వరుని యింటికివచ్చి, వరండా వెనుకను మధ్యగదిలో కుర్చీపై కూర్చుని, కలలుకనుచున్న పుష్పశీలను దన హృదయానికి జేర్చుకొన్నాడు. పుష్పశీల సర్వము మరచి యా మహమ్మదీయ బాలుని అదిమి పట్టుకొని యాతని నక్కడున్న సోఫాపైకి ద్రోసి, యాతనిపై వ్రాలి యాతని నావరించినది. మేఘబాల అచలకుమారుని చుట్టినది. ఆ సమయముననే రాజేశ్వరుడు తోటలోనుండి లోనికి దొడ్డత్రోవను వచ్చినాడు.

ఎట్టయెదుట దృశ్యము తిలకించి నిశ్చేష్టుడయి యచ్చటనే నిలబడిపోయినాడు, పుష్పశీలయు, నా మహమ్మదీయ యువకుడును చటుక్కున లేచి నిలుచుండిపోయినారు. రాజేశ్వరుడు రౌద్రమూర్తియైనాడు. హుమ్మని చేయినెత్తి యా మహమ్మదీయ బాలుని శక్తి కొలది చెంపపై నొక పెట్టు పెట్టెను. ఆ యువకుడా దెబ్బ కొకకుర్చీపై పడిపోయినాడు. లేచి చొక్కాచేతులు వెనుకకులాగి, రాజేశ్వరుని మోముపై ముష్టి ఘాతము నీయబోయినాడు. రాజేశ్వరు డెక్కుడు బలవంతుడగుటచే నాతని చేయిపట్టుకొని యాపి, కోపము దిగమ్రింగి ‘క్షమించండి హుస్సేను గారూ! నేను తొందరపడ్డాను. తొందరపడుటకు కారణం ఉందని మీరే గ్రహించగలరు. ఇప్పుడు మీరింటికి వెళ్ళిపోండి’ అన్నాడు.

పుష్పశీల తెల్లబోయింది. గజగజలాడుచు భయాకులయై యచ్చట నొదిగి నిలుచున్నది.

ఆ మహమ్మదీయ యువకుడు కందిపోయిన తన యెడమ చెంపను ఎడమ చేత నొక్కి పట్టుకొని,

‘నేను వెడితే, ఆ బాలికను చంపివేస్తావేమో?’

‘రామా! నీకంత భయము ఉంటే ఆ అమ్మాయిని తీసుకువెళ్లు.’

పుష్ప: మీరు వెళ్ళండి సాహెబు గారూ.

ఆ యువకుడు రాజేశ్వరు నొకసారి, పుష్పశీల నొక సారి తీక్ష్ణముగ జూచి ‘నీ భార్య కాదుగా? ఈ మనోహరిని నా కిచ్చివేయి, నేను తీసుకుపోతాను. నేను నిక్కా కట్టుకుంటాను.’

రాజేశ్వరుడు: ‘ఏమిటి పుష్పశీలా నీ కిష్టమా?’ అని గంభీర స్వరమున నడిగెను.

‘అయితే అవుతుంది’ అని యామె యన్నది.

రాజే: అలాగా! అయితే నా అభ్యంతరంమాత్ర మేమిటి?

పుష్ప: నేను రాను. మీరు వెళ్ళండి సాహెబు గారూ. ఆ యువకుడు వెనుతిరిగి యింటిగుమ్మములు దిగి వెడలిపోయినాడు.

రాజేశ్వరు డా వనిత ను జూచి ‘పుష్పం, నాకు జ్ఞానోపదేశం చేశావు. కృతజ్ఞుణ్ణి’ అని గబగబ, యా చీకటులలో కలిసిపోయినాడు. పుష్పశీల కుర్చీపై చదికిలబడినది.

అంత అనుమానరహితమనుకొన్న నిశ్చయములు ఇంత యనుమానపూరితములైనవి. తా నిం కేయాశయములపై సంఘముపై గత్తి కట్టుట? పూర్వకాలము నుండి స్త్రీ, తన ప్రకృతిలోపమువల్ల నొక పురుషునిజేరి ఆతని నాధారపరచుకొని యున్నది. అంతియ కాని తాను బానిసయై పురుషునికి లోబడియుండలేదు. అని నారాయణుడు చెప్పిన ముక్కయే నిజము కాబోలు.

రాజేశ్వరుడు అంతకంతకు దీర్ఘ విచారమున బడెను. ఆతడు ఇతికర్తవ్యతా మూఢుడై, కంటక వృక్షముల నడుమ బడిన నరునివలె బాధ నందుచుండెను. ఇది వర కాతనికున్న నిశ్చయబుద్ధి మూలమట్టముగ గదలిపోయినది. నిర్మలహృదయము మేఘావృతమైనది.

స్త్రీకి స్వాతంత్ర్యము, పురుషునకు నీర్ష్య లేకుండుట యను తమ యాశయములు తనయెడ మృగ్యమైనవి. తాను పుష్పశీల భర్తకు దృఢబుద్ధితో వ్రాసిన దెల్ల బడాయియైనది. తనకును, బుష్పశీల భర్తకును భేద మేమున్నది? పశువువలె నా మహమ్మదీయ బాలకు నట్లు కొట్టినాడేమి?

ఎట్లు భగవంతుడా! భగవంతుని నమ్మడే, యేల జ్ఞాపకమునకు వచ్చినాడు? నారాయణు డేల దాపురించి తన కా యత్కృష్టత బోధ చేసినాడు? ఒక వేళ తమ సంఘాశయములన్నియు అజ్ఞానవిలసితములా?

తనకు నీర్ష్య జనించినది.

‘అబ్బా! నా కీ గుండెల్లో బరువు. నా కేమి దారి కనబడుట లేదు. ఆలాగు పుష్పశీల నా దగ్గర నుండి వెళ్ళిపోతే ఉండగలనా? నా పుష్పశీలా! నిన్నెంత ప్రేమించాను. ఆ మహమ్మదీయుణ్ణి చంపేద్దామనే అనుకున్నాను. నారాయణుడు చెప్పినట్లు నిజముగ పుష్పశీల బ్రతుకు నేనే తగలేశానా?

‘ఓ పుష్పశీలా! పుష్పశీలా! నీ కష్టములకు నేనా కారణము? నీవు నావలన అధోగతిలో పడినావా?’ కాదు, కాదు. తాను చేసిన దంతయు మంచిదే.

ఆతని మనస్సున కేదియో నిశ్చయము కలిగినది. మోము రాతితో చెక్కినట్లయినది. దేహము బిర్రబిగిసిపోయినది. అబ్బా! యని యా నిశ్చయమును దూరమునకు ద్రోసినాడు. తొందరపడుచున్నాడేమో, ఇంకొక మార్గము లేదు. ఇదే, ఇదే! ‘నీ బ్రతుకు వృధా. నీ బతుకు వృధా!’ నారాయణుడు, పరమేశ్వరుడు, రాజారావు వాళ్ళు దేవతలు. ‘ఛా! నారాయణుని దగ్గరకు పోనా సాయంత్రము?’ అతడు రాత్రి పన్నెండు గంటలకు కూర్చుండి ఉత్తరము లెన్నియో వ్రాసెను.

తెల్లవారగట్ల మూడగుచున్నది.

నెమ్మదిగ అడుగులిడుచు పుష్పశీల నిద్రించు గదిలోనికి బోయినాడు. ఆమె వాడిన పుష్పమువలె పందిరిమంచముపై పండుకొనియున్నది.

పుష్పశీల నొక్కసారి కౌగిలించుకున్నాడు. ఆమె నిద్దురలో రాజేశ్వరరావును తనకడకు లాగికొన్నది.

అతని కన్నుల రెండు చుక్కలు నీరు తిరిగినవి. ఆమె కౌగిలి సడలించుకొని ‘ఎప్పటికైనా ఆడవాళ్ళ బాధలకు పురుషులే కారకులు’ అని గొణుగుచు తన వ్రాతగదిలోనికి బోయి సోఫాపై పండుకొని ఒక పొట్లము నోటిలో వేసికొని మంచినీరు త్రాగుచుండగనే యాతని చేతిలో నుండి గ్లాసు క్రిందకు పడి బద్దలైనది. ఆతని చేయి వాలిపోయినది.

౧౦

శస్త్రచికిత్స

కొత్తపేట

10 గం. 20-4-29

తటవర్తి నారాయణరావు

అడ్వకేట్

హైకోర్టు, మద్రాసు.

మీ నాయన గారు - దుష్టవ్రణము - (మాలిగ్నెంటు ట్యూమరు) - వ్రేలి మీద - రేపు ఉదయం - మెయిలు - తీసుకొని వచ్చుచున్నాము - శస్త్రచికిత్స - రంగాచారి - ఏర్పాటు చేయి - స్టేషను - మోటారు - భయము లేదు.

రాజారావు’

అని తంతి నారాయణరావునకు చెన్నపురిలో హైకోర్టులో నున్నప్పుడందినది. నారాయణరావునకు హృదయం చలించి తల యొక్కసారి తిరిగినది. ఈ దుష్టవ్రణ మేమిటి? దీనివలన భయము లేదని తంతిలో వ్రాసియున్నది. అతడు తత్ క్షణమే రంగాచార్యులగారి యింటికిబోయి వారితో మాట్లాడెను. ఆయన యా తంతిని చూచి ‘రేపు తిన్నగా మా వైద్యశాలకు తీసుకొనిరండి. అన్నీ సిద్ధం చేయించి ఉంటాను’ అని చెప్పినాడు. విషవ్రణములలో భయపడ వలసినవి యున్నవి. ఏమి భయములేనివి యున్నవి. ‘భయము లేదా’ యని ప్రశ్నింప రంగాచారి గారు ధైర్యము చెప్పి నారాయణ రావును బంపించినారు. శస్త్రవైద్య మయిన వెనుక యొకటి రెండురోజు లుంచవలసినచో వైద్యశాల లోనే సుబ్బారాయుడుగారి నుంచి, నారాయణరావుగారి యింటికి వెడలిపోవచ్చునని రంగాచారి గారు చెప్పినారు.

మరునాటి ఉదయము మెయిలుకు సూర్యకాంతము, నారాయణరావు కారుమీద సెంట్రలు స్టేషనుకడకు వచ్చినారు. రెండుమూడు కిరాయి మోటారులనుగూడ కుదిర్చియుంచినాడు. మెయిలువచ్చి యాగినది. ఒక రెండవతరగతి బండియంతయు నద్దెకు బుచ్చుకొని శ్రీరామమూర్తి, రాజారావు, యజ్ఞనారాయణశాస్త్రి, వెంకాయమ్మ, రమణమ్మ, జానకమ్మ గారును, లక్ష్మీపతితల్లి శేషమ్మ గారు, లక్ష్మీనరసమ్మగారు మెయిలులో సుబ్బారాయుడు గారితో దిగిరి.

సుబ్బారాయుడుగారి కుడిచేయి కట్టబడియున్నది. ఆయన బాధ నణచుకొనుచు మధ్యమధ్య బొమలు ముడుచుకొనుచు, బెద్ద కుమారుని బాసట గొని రైలుదిగి బాధతో నిండియున్న చిరునవ్వు చిన్నకుమారునిపై ప్రసరించెను. అతడు దెచ్చికోలు ధైర్యము మోమునదోప, తండ్రికడకువచ్చి, ‘ఎల్లాఉంది నాన్నగారూ?’ అని ప్రశ్నించెను. ‘బాధగా ఉంది. ఫరవాలేదులే. ఇదిగో సూరీడు వచ్చింది! ఏమీ లేదు తల్లీ. ఏదో చిన్నకురుపు, కణుపుజెష్టో లేక ఏదైన మాదో!’ అని సుబ్బారాయుడుగా రనిరి.

తిన్నగా పరీక్షచేసి ఇది శస్త్రము చేయవలెనని రంగాచారి గారు నిర్ణయించినారు. చిటికెనవ్రేలిపై ఒక చిన్న పుట్టుమచ్చయు, మచ్చపైన కాయయు నుండెడిదట. అది చటుక్కున పదిరోజుల క్రిందట పెద్దదికానారంభించి పోటును, బాధయు మొదలుపెట్టినది. చేయి వాచినది. సుబ్బారాయుడు గారికి తిండి సహించుటలేదన్నారు. సుబ్బారాయుడుగా రిది యేమియని, అమలాపురము పెద్ద కుమారునికి కబురంపిరి. శ్రీరామమూర్తి రాజారావును తీసికొనివచ్చెను. రాజారావుమాత్రము పరీక్షించి మధువు లేదనియు, మూత్రములో నితరమగు జబ్బేమియు లేదనియు, ఆ వ్రణము దుష్టవ్రణజాతీయనియు నిశ్చయించెను. కండరములలో పెరుగు సార్ కోమా యను వ్రణమట. అది పెరుగుటవలన వ్రణము పుట్టినచోటనేగాక రక్తములోనుంచి విషము ప్రవహించి వ్రణము కండరములు, నరములు, రక్తధమనులు, చెడురక్తపు నాళములు పాడుచేసికొనుచు విజృంభించి ప్రాణమునకు మొప్పముకూడ తెచ్చునని రాజారావు శ్రీరామమూర్తితో జెప్పి, అందుకు వ్రేలు కొట్టి వేయవలసియుండు నేమో యనియు, చెన్నపట్టణము డాక్టరు రంగాచార్యులుగారి కడకు వెళ్లుట యుత్తమమనియు సలహా చెప్పెను. తాను కొంత మందు లోనికిచ్చి, కట్లు గట్టి చెన్నపట్టణమున కారాత్రి మెయిలులో బయలు దేరుటకు నిశ్చయించి నారాయణరావునకు తంతినిచ్చెను.

రంగాచార్యులు గారు రాజారావు చెప్పినట్లుగానే యెంచి చిటికెన వ్రేలు మొదలంట కొట్టివేయవలెనని నిర్ధారణ చేసెను. సుబ్బారాయుడు గారు మత్తుమం దక్కర లేదన్నారు. కాని రంగాచార్యులు గారు చాల జాగ్రత్తగల వైద్యుడు. చేతినెల్ల నిజముగా రాతివలె మొద్దుచేయుటకు తగినట్లు కండలలోనికి పిచ్చికారీ మందిచ్చి చేయిని బండచేసి కత్తులు మొదలయినవి సిద్ధము చేసికొని శస్త్రచికిత్స చేసినాడు. చిటికెనవ్రేలంతయు దీసివేయబడినది. సార్ కోమా సంబంధమగు వ్రణచిహ్నము లేమియు లేకుండచేసి యంతయు శుభ్రము చేసి రక్తము నష్టముగాకుండ రక్తనాళములుకుట్టి రంగాచార్యులు గారు చర్మముకూడ కుట్టివేసినారు.

ఆరోజంతయు సుబ్బారాయుడుగా రక్కడనే యుండిరి. మరునాడు సాయంకాలము మోటారుకారుమీద నారాయణరావు గారి యింటికి తీసికొని వచ్చినారు వారిని.

ప్రతిదినము వచ్చి రంగాచారి గారు కట్టు కట్టుచుండిరి. నాలుగురోజులైన వెనుక, ఆయనకడనున్న సహాయ వైద్యయువకుడు కట్టు కట్టుచుండెను. రంగాచారిగారు లోపలికి మంచిమందు లిచ్చుచుండిరి. సుబ్బారాయుడుగా రొక పదునైదు దినము లుండినవెనుక కొత్తపేట గ్రామము వెళ్లవచ్చునని రంగాచారి గారన్నారు.

సుబ్బారాయుడుగారిని జూచుటకు జమిందారుగారును, శారదయు చెన్నపట్టణము వచ్చినారు. సుబ్బారాయుడు గారు, వియ్యంకుడు నవ్వుకొనుచు వేళాకోళములు సలుపుకొనిరి.

జమీ: ఏమండీ బావగారూ! మేరుపర్వతానికి పిడుగు తగిలిందట?

సుబ్బా: ఒక వేలు కొట్టేసిపోయింది వజ్రాయుధం.

జమీ: అమృతం ఎత్తుకుపోయే గరుడుణ్ణి ఆపుచేద్దామని ఇంద్రుడు వజ్రాయుధం వేస్తే ఒక రెక్కయీక ఊడిపోయిందట గరుడుడికి. మీరేమన్నా అమృతం ఎత్తుకురాలేదుగదా బావ గారూ!

సుబ్బా: ఎల్లాచూసినా ఇంద్రుడే కనబడ్డాడు. బావగారికి పుక్కిటి పురాణాలు అన్నీ తెలుసునే!

జమీ: అదేమిటండోయి దెబ్బకొడ్తున్నారు! నాకు పురాణాలు రావని వ్యంగ్యము ఏమి లేదుకద?

సుబ్బా: జమీందారులు, శాసనసభలో సభ్యులు పుక్కిటి పురాణాలకు తీరుబడి ఉంటుందా అని అన్నాను బావగారూ!

జమీ: బావగారిబోటి పెద్దలు వెళ్ళండి అంటే వెళ్లాను. మీబోటి వారి తరఫున ప్రతినిధినేగా? మేము జమీందారులము, మీరు జమీందారులకు ప్రభువులు.

సుబ్బా: ఎల్లాగయినా బావగారిమాట పైనే.

జమీ: ఎప్పుడూ మీ చెయ్యే పైన. సుబ్బా: కాని మీ అల్లుడిచేయిపైన మీ చేయి అయింది కాదండీ!

జమీ: బావగారు డెబ్బదిఏళ్లు వస్తూన్నా తమ అబ్బాయి అన్నగారిలా ఉన్నారు. ఇరవైఏళ్లు నాకన్న చిన్నవారుగా కనపడుతున్నారు.

సుబ్బా: జ్ఞానవంతులకు దబ్బున ముసలితనం వస్తుందట.

జమీ: యోగులకు పడుచుదనం వచ్చునట్లు.

వియ్యంకు లిద్దరు సరససల్లాపముల కాలము బుచ్చిరి.

• • • •

రాజారావు అమలాపురము వెళ్ళెదనని తెల్ప నారాయణరావు వలదని వారించెను. ఆరోజున పరమేశ్వరుడు, లక్ష్మీపతి, రాజారావు, ఆలం, రాఘవరాజను నొక క్షత్రియమిత్రుడు, నారాయణరావు కలసి సముద్రపుటొడ్డునకు వాహ్యాళికి పోయినారు. రాఘవరాజు ఆలంతో ‘ఏమిరా, బలం అంటే మన పూర్వకాలపు వాళ్ళదిరా. నువ్వూ నేనూ ఉన్నాం. నారాయణరావు తండ్రిని చూడు. ఆయన మత్తుమందు అక్కర లేకుండా చేతివేలు కొట్టెయ్యమన్నారు. నువ్వూ నేను అలా అనగలమా? మన కా బలం ఉందా? ఆ ధైర్యం ఉందా?’ అని పలుకరించెను.

ఆలం: అరే! ఏమిటోయి పెద్ద చత్రివుడవు! కత్తి లేదు. కలంపోట్లకి ఎందుకూ వచ్చావు?

పర: నవాబులు, చెట్లక్రింద వకీళ్ళయినపుడు, రాజులు చెవుల్లో కలాలు దోపుకునేవాళ్ళయితే తప్పు వచ్చిందేమిటిరా తుర్క అబ్బాయి!

ఆలం: అల్లా, అల్లా! వీడ్కి కవీకూడా! దద్దమ్మ. నేనే నవాబును అయితే మా దర్బారుఖానానుంచి పది కొర్డాదెబ్బలతో దేవిడీమన్నా ఆజ్ఞ వేస్తానురోయి.

పర: నవాబుల దర్బారులకే రావాలి? మా మహారాజులు లేరుట్రా. అప్పడు మూరురాయరగండ పరగండ భైరవ సకల మూర్ఖన్యాభిశేఖర శ్రీమన్మహారాజాధిరాజరాజేశ్వర రాఘవరాయలుంగారి కొలువుకూటంలో ఉంటాను గాని.

రాఘ: అక్షరలక్షలు! ఒరే నారాయణ మంత్రీ! మన ఖజానానుంచి పదిపైసలు ఈ కవికి దానమీయి.

ఆలం: ఒరే రాజారావూ దివాన్, ఈకవిని గాడిదమీద ఊరేగించూ! తియ్యరా త్రీకాజిల్సు. నారా: హుక్కా గుడగుడ అక్కరలేదూ? ఇదిగో నాదగ్గర స్టేటు ఎక్స్ ప్రెస్ ఉన్నది.

రాఘ: అహింసావాదులు సిగరెట్లు కాల్చవచ్చునురా, నారాయణా! నీ అహింసావాదం నీవూ! వకీలుపనికి సిగరెట్లకూ మంచి శ్రుతి. పర: ఏమోలే! సంగీతపాటకుడివి నీకు తెలియాలి; మాకేం తెలుస్తుంది? పొగ కొట్టకుండా ఉండడానికి స - అ - రీ - ఆ!

లక్ష్మీ: అదేమిటి రా?

ఆలం: వీడు పద్యం మాట్లాడుతున్నాడా డాబుదొరా?

నారా: డాబుదొర కాదురా! డాగుదొర!

రాఘ: కుక్కలదొరా!

లక్ష్మీ: అల్లా అయితే పశువుల వైద్యుడవ్వాలి.

అందరూ ఇసుకతిన్నెలపై వసియించియుండిరి. రాజారావుమాత్రము తల వాల్చుకొని యేదియో ఆలోచనలలో మునిగి, స్నేహితులతో మాటలాడక కూర్చుండియున్నాడు. ఆలం రాజారావు ప్రక్క జేరి యాతనిచుట్టి ‘రాజా! నీ స్నేహితు లందరి హృదయాలు నిన్ను ఆవరించి ఉన్నాయోయి! నువ్వు దహించుకుపోతోంటే ఈ తురకబిడ్డ మోటుమనస్సు కూడా నీరయిపోతోంది. మా అందరిలోకి గట్టిమనన్సు నీది’ అన్నాడు.

రాజారావు బొటబొట కన్నీటి కాలువలైనాడు.

౧౧

పరివర్తనము

నారాయణుని తండ్రికి శస్త్రచికిత్స చేయునప్పుడు శ్యామసుందరీదేవి చెంతనేయున్న ది. తరువాత నారాయణుని దగ్గరకు వెళ్ళి ‘అన్నా! మీతండ్రి గారు భీష్ములవారులా ఉన్నారు. ఏమి బలం, ఏమి ధైర్యము! ఆ విగ్రహం ఏమిటి! మీ యిద్దరు కవలపిల్లలులా ఉన్నారు. నీకంటె ఇంక కొంచెం మాంచి కండలుగట్టిన మనిషి. ఆయన ముఖానకూడా కొంచెమయినా బాధ కనబరచకుండా ఉండడం నాకు ఎంతైనా ఆశ్చర్యమయిపోయింది. ఆయన పాదాలదగ్గిర కూర్చుండి ఆయనను ప్రతిరోజూ పూజ చేస్తే నాజన్మ తరిస్తుంది. ఆయన నాతండ్రికూడాను, అన్నా! నీ హృదయం నొవ్వలేదుకదా, నాన్నగారి బాధచూసి?’ అన్నది.

ఆమె కన్నులు కరుణార్ద్రములై ప్రేమపూరితములై యాతని దిలకించినవి.

నారాయణరా వామెకు అనంత కృతజ్ఞతతో నమస్కరించి ‘తల్లీ, నీ వింత ప్రేమమయి వేమిటమ్మా?’ యని తన కారుమీద నెక్కించి పంపెను.

శ్యామసుందరీ దేవి పరీక్షలకు జదువునప్పుడు రాజారా వెంతయో సహాయము జేయ నారంభించెను.

కాలేజి వదలి, యేడాదిపాటు వివిధ వైద్యాలయములలో విద్య సంపూర్ణము చేసికొని అమలాపురంపోయి వృత్తినారంభించిన వెనుక రాజారావు పట్టినది బంగారమయ్యెను. రాజారావు రోగదశ, రోగజాతి (నిదానము) నిముషమున గుర్తెరుగుచుండెను. వైద్యముతోపాటు, రాజారావు మొదటినుండియు నుద్గ్రంథముల జదువుకొనుచు, నుత్తమ భావములలో బులకించుచు నుత్తమాశయముల కూర్చుకొనుచుండెను. తన పూర్వులు తరతరములనుండియు సముపార్జించి యిచ్చిన బ్రహ్మవిద్యామూలముచే నేమి, యాతని పూర్వకర్మచే నేమి రాజారావునకు అతీంద్రియశక్తి (ఇంట్యూషన్) యున్నది. కావుననే రోగ లక్షణము లవలీలగా గ్రహించువాడు. పడవలసిన కాలమునకు సరియైనమందు పడుచుండెను. ‘ఏమాత్ర మాయుర్ధాయమున్నా ఆయన చేతిలో రోగి బ్రతుక వలసినదేనండి. ఏమి వైద్యుడండి. ఏమి హస్తవిశేషమండి’ యని రాజారావును బొగడని కుటుంబి లే డమలాపురములోను, చుట్టుప్రక్కల గ్రామములలోను.

రాజారావు తండ్రి గారి సహాయమున, నారాయణరావు సహాయమున మూడువేల రూపాయలు పెట్టుబడి పెట్టి తన వైద్యశాల నారంభించెను. అమలాపురములో మంచియిల్లద్దెకు పుచ్చుకొని అది యంతయు శుభ్రమైన వెల్ల వేయించి మందుల బీరువాలకు, మందులు, బల్లలకు నొక గది; నిలువమందులకు, సామానులకు నొక గది; తాను రోగుల పరిశీలించుట కొకగది; తాను వ్రాసికొనుటకు, నడుము వాల్చుటకు, వైద్యసంబంధమున గాక స్నేహితులతో మాటలాడుట కొక గది; మూత్రాదుల పరీక్ష చేయుట కొకగది; శస్త్రచికిత్స కొకగది యేర్పాటు చేసెను.

నారాయణరావు దేశ యాత్రలు చేసి వచ్చినప్ప డమలాపురముపోయి వైద్యశాల యంతయు మరియు బాగుగ నమర్చెను. మందులు కలిపియిచ్చు గదిలో, రోగుల బరీక్షించు గదిలో, రోగులు కూర్చుండుగదిలో, ఆరోగ్య వంతుల బొమ్మలు–ఇంగ్లండునుండి వచ్చు ఆరోగ్యపత్రికలనుండి కత్తిరించిన వానిని - పటములు కట్టించి వ్రేలాడదీసెను.

రాజారావు కూర్చుండు గదిలో అభినవ భారతీయ చిత్రముల గొన్ని యలంకరించినాడు నారాయణరావు.

రాజారావు ఉపనిషత్తులనుంచియు, యోగసూత్రముల నుండియు, భగవద్గీతనుండియు ఉత్తేజకములు, భక్తిమధురములు నగు వాక్యములు మనోహ్లాదకరముగ వ్రాయించి, దానికి బట్టములుగట్టి వ్రేలాడదీయించినాడు తన వైద్యశాలయం దక్కడక్కడ.

కొన్ని సాధారణారోగ్యవిషయములు ముఖ్యముగా బ్రజలు గమనింప వలసిన సూత్రము లొక పెద్ద గుడ్డపై పటమువలె వ్రాయించి రోగులు మొదలగు వారు కూర్చుండుచోట గట్టించెను. మైసూరులో గంధపుజెక్కతో, విన్నాణముగ శిల్ప ముట్టిపడునట్లు చెక్కిన శ్రీకృష్ణుని వివిధ శైశవ క్రీడలు జూపు విగ్రహములు, నీకు దోచినవి అయిదారు గొనిరమ్మని నారాయణ రావునకు చెన్నపురికి వ్రాసి, నారాయణరావు వానిని బంపినవెనుక ఆతడు తన వైద్య శాలలో నక్కడక్కడ వాని నలంకరించినాడు. ‘దేహవైద్యము, హృదయవైద్యము, ఆత్మవైద్యము అన్నియు నొకేసారి జరగాలని ఇల్లాపెట్టాను- ముఖ్యముగా చివరి రెండువైద్యాలు నాకోసం లెండి’ అని రాజారావు తన స్నేహితులతో ననుచుండును.

వైద్యమునకు వలయు మందులన్నియు సంపూర్ణముగా దెప్పించి యుంచికొన్నాడు. ఏకాలమునకోగాని యవసరమురాని ఖరీదుగల మందైనను సరియే, అప్పుడు చెన్నపురికి తంతినిచ్చి తెప్పించుటకు బ్రయత్నించు వైద్యుడు ద్రోహియని యాతని వాదము. కావుననే ‘డాక్టరు రాజారావుగారి ఆస్పత్రిలోనండి, కాకినాడ గవర్నమెంటు ఆస్పత్రిలోగూడా లేని మందులున్నాయండి’ అని యాతని గూర్చి పల్లెటూళ్ల వెంబడి పేరు మ్రోగినది.

అతడు గ్రామములు సులభముగా బోవుటకై మోటారుసైకిలు (ప్రక్క బండితోసహా యున్న) బండి తెప్పించుకొన్నాడు. ఎచ్చటకుబోయిన నచ్చటకు వెంటబెట్టుకొని తిరుగుటకు ఆతనికడ రెండు పెట్టెలు, ఒక ఖద్దరుసంచియు నున్నవి. ఖద్దరు సంచి చాలా చిన్నది. ఎనిమిదంగుళములు చదరము; అందు రెండరలు. పట్టుకొనుటకుగూడా త్రాడు; మొదటి అరలో గుండెపరీక్ష జేయు యంత్రము, ఆయుర్వేదౌషధపు బొట్లములున్న యొక చిన్న దంతపుపెట్టె (పరమేశ్వరమూర్తి బహుమతి) రెండవయరలో శరీరమున మందు పొడుచుటకు సూది పిచికారి పెట్టెయు, ఒక చిన్న ఇత్తడిపెట్టెలో సూదిమందులు, ఎడ్రినాలిన్, పిట్రాటిన్ , స్టికినైను, డిజిటాలిను మందుల గాజుగొట్టములు నుండును.

పెద్దపెట్టెలలో నొక చిన్న వైద్యశాలయే. ముఖ్యములగు మందులన్నియు, తాత్కాలిక శస్త్రచికిత్సకు వలయు పరికరములు నందుండును. రెండవ పెట్టెలో పొడుపు మందులరకములన్నియు, అన్ని రకముల సూదిపిచికారీలు మొదలగు సామానంతయు నుండును.

రాజారావునకు మొదటి నెల రెండువందలు వచ్చినవి. రెండవ నెల నాలుగువందలు, మూడవ నెల నుంచి మాసమాస మయిదువందలరూకలు వచ్చుచున్నవి. నారాయణరావిచ్చిన వేయిరూకలు నాతడు తిరిగి యిచ్చివేసెను.

ఆతని పేరు కోనసీమయంతట ప్రాకిపోయినది. నెమ్మదిగ గోదావరి అద్దరిని, యిద్దరిని రాజారావును వైద్యములకై గొనిపోవ నారంభించినారు.

అంతలో ఎచ్చట నుండి వచ్చినదో మాయ మృత్యుదేవత! ఇరువురు బిడ్డలును తల్లిలేనివారైనారు.

మోహావేశమేగాని ప్రేమ యన నెట్టిదో యెఱుగని చిననాటి దినములలో భార్య కాపురమునకు వచ్చినది. ఎన్నిసార్లు వివేకానందుని చదివిన నేమి? ఎన్నిసార్లు జ్ఞానానందుని విన్న నేమి? ఆ వేదాంతము మనస్సు నుండి అంతఃకరణమున కైన నంటినదా?

రామమోహనరాయలు బోధించిననేమి, వీరేశలింగముగారు పాఠములు చెప్పిననేమి సాంఘిక ధర్మ మర్థమయినదా? తన భార్యను జిన్నతనములో గలసికొనకయున్నచో, నామె ఆరోగ్యవంతురాలై యుండెడిదేమో? పుష్పవతి యగుట తరువాయిగ భారతీయుడు బాలికను గలియుటయేగదా!

భార్య బ్రతికినంత కాలము గోపురంధ్రీమతల్లి, ప్రేమజీవి! ఆమె నెరిగెనా తాను? ఆమె తన బిడ్డలకు దల్లియనుమాటయేకదా తనకు తెలిసినది. ‘పరమేశ్వరా! నా కర్తవ్యమేమి? తండ్రీ! ఈ పరీక్ష నీదా? నా వేదాంతము పరీక్ష చేయదలచుకొన్నావా? డబ్బుగణిస్తూ యింటిలో మూటలుకట్టే యీ విచిత్ర రోగినారాయణసేవ నీకు నచ్చినదా? నా హృదయం కల్మషం అయ్యే ఉంది చిన్నతనాన్నుంచిన్నీ. కాబట్టే నన్ను తరింప చెయ్యాలని వచ్చిన నా అన్నపూర్ణని నేను బ్రతికించుకోలేకపోయాను. నా బిడ్డలను తల్లిలేనివారిగా చేశాను’ అని రాజారావు క్రుంగిపోవుచుండెను.

చుట్టుప్రక్కల చుట్టాలు, సంబంధములు తీసికొనివచ్చి రాజారావుకు వివాహము చెయ్యవలెనని ప్రయత్నించిరి. రాజారావు ‘ఆమాట తల పెట్టకండి’ అని చెప్పినాడు.

రాజారావు పైకి ధైర్యముగ తిరుగుచునేయున్నాడు. ఇదివరకు నాటకములన్న నిష్టము లేదు. సంగీతములన్న కడుపులో త్రిప్పు. కవిత్వమన్న కనులు తిరుగును. కళయన్న నసహ్యము.

అయ్యో ఎంతకష్టము అని ఎవరైన అనినచో ‘ఏమిటి కష్టము? ఎవరికీ, ఆత్మకా?’ అని ప్రశ్నించేవాడు.

‘ఇతడు వట్టి పొడివేదాంతి? అని హేళన చేసేవాడు పరమేశ్వరుడు రాజారావును. సినిమాలకు వెళ్ళితే, ఎప్పుడైనా తన స్నేహితులతో వెళ్ళుట వారికొరకే. సంగీతపు కచ్చేరీలు మొదలగు నితర ఖుషీలకు వెళ్ళినను అందులకే.

అట్టి రాజారావు నేడు అబలయైనాడు. చంటిబిడ్డ ఏడ్చిన, అతని కన్నుల నీరు తిరుగును. కరుణార్ద్రములగు కథలువిన్న భరించలేడు. పురాణములన్నియు జదువ ప్రారంభించినాడు. చదువుచు జదువుచు దన్మయుడైపోవును. ఏమి యీ కవిత్వము అనును. రోగులు వారంతట వారిచ్చినచో ఫీజులు పుచ్చుకొనును, లేనిచో లేదు. చెవుల నుండి బిరడాతీసినట్లు సంగీతము వినును. కన్నులనుండి తెర తొలగినట్లు నాటకములు, సినిమాలు చూచును.

ఆత డిప్పడు తన హృదయమును గనుగొన్నాడు. నేడు తన వైద్యశాలలో నమర్చిన బాలకృష్ణుని లీలలు దనకర్థము సాగినవి. భగవద్గీతలో పురుషోత్తమ భావముయొక్క అర్థము గోచరింపసాగెను.

‘కృష్ణా! కృష్ణా! భక్తి లేని యీ హృదయమునకు భక్తి పరిమళము నిచ్చినావా, నా భార్యను గొనిపోయి?’ యని హృదయములో ననుకొనుచు కంటికి పెట్టిన జోడు తీసికొని కన్నులు నులుముకొని తలవంచి నమస్కరించినాడు. 

౧౨ఆత్మహత్య

‘నా హృదయము నారాయణ రావు నావరించి వదలి రాకున్న దేల?’ అను ప్రశ్న శ్యామసుందరిని వీడలేదు. నారాయణునిపై తనకున్న ప్రేమతత్త్వ మెట్టిదోయని యాలోచించుకొన్నది. ఆ ప్రేమ వాంఛాప్రేరితము మాత్రము కాదు. అది ఒక్కసారే కలిగినది. నే డాతడు ప్రేమార్థియైవచ్చి తన్ను కోరినను, దాను కుంచించుకొనిపోవలసినదే. ఆ దినమున తన శరీరాంగములన్నియు నుప్పొంగిపోయినవి. మూర్తీభవించిన ఆతని పురుషత్వము తలచుకొన్నను నేడు పుల్కయైన జనింపకుండుట కాశ్చర్య మొందినది శ్యామసుందరీ దేవి.

ఆ దివ్యముహూర్తము, తా నాతని కౌగిలిలో కరిగిపోయిన పరమప్రసన్నత, తన జీవితములో ముందునకు దారిజూపు దివ్య తేజస్సువంటిది యని యామె నిర్ధారణ చేసికొన్నది. అప్పటి నుండియు నామెకు సకలలోకములు తన్ను జుట్టు కొన్నట్లు భావము తోచినది. ‘నే నందరిని బ్రేమించుచున్నాను, నన్నందరు ప్రేమించుచున్నారు. నేను ప్రేమమూర్తిని. ప్రేమచే నందరు నాలో నున్నా’ రన్న దివ్యవాణి తనలో ప్రతిధ్వనించుచున్నదని యామె భావించుకొన్న ది. ఆనాటి నుండి ఆమె ప్రతిజీవియందును ప్రేమానుభావము జూచినది.

ఇంతలో రాజారావు వచ్చినాడు సుబ్బారాయుడు గారి జబ్బుకొరకు. రాజారావునకు భార్యపోయినదా? ఆయన జన్మము తరించు సంసార నౌక విచ్ఛిన్నమైపోయినదా? ఆయనతో జేయిచేయి కలుపుకొని బ్రతుకు తెరువు నడచు బాటసారి భగ్నమైపోయినదా? ఆమె కిరువురు బిడ్డలట. ఆ బిడ్డల నాదరించి పెంచువా రెవరు? మూడు కాళ్ళ ముదుసలియగు మాతామహియా?

రాజారావు వివాహ మేల యాడకూడదు? ఛీ! అదేమి యాలోచన. ఆయన వేదాంతియనియు, అందువలన ఆయన హృదయము కర్కశమైనదనియు దనతో నొకనాడు నారాయణరావు చెప్పినాడు. అట్టి పుణ్యపురుషుడు మరల వివాహము చేసికొనునా? ఆయన బాలికల యదృష్ట మెట్టిదియో? తనతో నారాయణరావు అన్న గారు సూరమాంబ పావనచరిత్రయని చెప్పినాడు. గంభీరహృదయుడగు నారాయణరావే ఆమె పేరు తలచుకొని కన్నీరు పెట్టుకొన్నాడు. ఆ వార్త విని సూరీడు చెల్లి తనఒడిలో జేరి, వెక్కి వెక్కి వాపోయినది. ఆ సూరమాంబ ఎంత సాధ్వియో?’

ఇట్టి యాలోచనలు తన్నావరించుకొన వదలించుకొనుచు వైద్యపరీక్షకై సంపూర్ణ దీక్షవహించి చదువుకొనుచున్నది శ్యామసుందరి.

ఇంతలో రాజేశ్వరరావు విషముపుచ్చుకొని చనిపోయినాడని రోహిణి వార్త తెచ్చినది. ‘’అదేమిటే? ఆ నాయుళ్ళబ్బాయి ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు! అల్లాంటివాడు, ప్రపంచం అంతా పాడుచేద్దామని తిరిగే పాపపు మనిషి విషం పుచ్చుకోవడ మేమిటి?

అప్పుడే నారాయణరావు, రాజారావు, లక్ష్మీపతి, పరమేశ్వరమూర్తు లక్కడకు వచ్చినారు.

నారా: రాజేశ్వరరావు విషము పుచ్చుకొని చచ్చిపోయినాడని నాకు టెలిగ్రాం వచ్చినది చెల్లీ! నీ చదువు అడ్డంకొడ్తున్నాను. నాకు రెండుత్తరాలు యివాళ వచ్చినాయి. టెలిగ్రాం హైదరాబాదు పోలీసు వారు పంపించినారు. ఉత్తరాలు రాజేశ్వరుడు ఇంకో నిమిషానికి విషం పుచ్చుకోబోతూ వ్రాసినవి. అందులో నీకోటి ఉన్నది. అది నేను విప్పలేదు. నా పేరున నీకు వ్రాసినాడు, ఇదిగో.

శ్యామసుందరి ఆ యుత్తరమును నారాయణరావు చేతి నుండి కంపిత హస్తములతో తీసికొని బల్లపై పెట్టి, యిట్లు చెప్ప నారంభించినది:

‘నా స్నేహితులు, నాకు సహోదరులవంటివారగు మీదగ్గర చెప్పుతున్నాను.

‘మూడేళ్ళక్రిందట రాజేశ్వరరావు మాయింటికి స్నేహితుడుగా వచ్చేవాడు. అతన్ని వేరే స్నేహితుడు తీసికొనివచ్చి పరిచయం చేసినాడు. సరదాగా మాటలంటూ నవ్వుపుట్టించే హాస్యం చేస్తూ, సంగీతాన్ని, చిత్రలేఖనాన్ని హేళన చేస్తూ మాయింటికి యెప్పుడూ వచ్చేవాడు. ఒక నాడు స్వతంత్ర ప్రేమ అని ఒక ఉపన్యాసం ప్రారంభించాడు. అంతా చెప్పి ‘నీమీద నాకు చాలా ప్రేమ ఉన్నది. నీకూ అలాగే నామీద ప్రేమ ఉంటే నన్ను పాలించుకో’ అన్నాడు అన్నా! నేను మాటలాడలేకపోయాను. మూర్ఛవచ్చినట్లయినది, ఒక్కసారిగా లేచి, మహాకోపంతో ‘వెళ్ళి సముద్రంలో ఉరుకు దుర్మార్గుడా! రాక్షసుడా!’ అని ఒళ్లు తెలియకుండా కేకలు వేశాను. నాటికి నేటికి అతన్ని చూడలేదు. అప్పుడప్పుడు మా సంభాషణలలో అతడు మీ స్నేహితుడని విన్నాను. అంతే. ఆ ఉత్తరం మీరే అందరికీ చదివి వినిపించండి అన్నగారూ!’ అనినది. ఆమె ఆడుసింహమువలె క్రోధరూపయైనది. మోము జేవురించినది. సహజమగు నామె సౌందర్యమునకు కోపముచే విపరీత శోభ వచ్చినది. నారాయణ రావు ఆ కవరు చింపి. లోన ఉత్తరము తీసి మడతవిప్పి ఇట్లు చదవ నారంభించినాడు:

‘శ్రీ శ్యామసుందరీ దేవికి–

అమ్మా, నమస్కారములు. ఈ పాపిని నువ్వు ఈపాటికి మరచిపోయి ఉండవచ్చును. ఆ రోజున నువ్వు ప్రళయశక్తి వలె లేచి నాపై కేకలు వేస్తే భయపడి పారిపోయాను. నేను నా అభిప్రాయాల్ని సత్యమైనవానిగా నమ్మాను. అవే మీకూ చెప్పాను. చెప్పి నా హృదయంలో ఉన్న కోర్కె మీకు తెలియ పర్చాను. ఇంతే. ఏ వనితామణినీ నేను హీనముగా గాని, హేళనగా గాని చూడలేదు. భగవంతుడనేవాడు ఉంటే ఆడవాళ్ళే ఆయన అవతారాలని, సైతాను అనే దెయ్యం ఉంటే మగవాళ్లే ఆతని అవతారాలని నా ఉద్దేశం.

‘నేను ఆరోజున అన్న ముక్కలకు నాపైని చాలా తప్పు అభిప్రాయం పడ్డారని నాకు మన స్నేహితుడు చెప్పాడు. అప్పుడే మీకు ఉత్తరం వ్రాయాలని అనుకున్నాను, తల్లీ! నా ఉద్దేశం, నా అభిప్రాయాలలో సత్యమున్నదని. నేను తుచ్ఛుడనే. మీరు పరపురుషుల్ని చేరేటటువంటి మనుష్యులని ఉద్దేశింపబడి అన్నది కాదు. నేను మనసులో ఒక ఉద్దేశం, పైకి ఒక ఉద్దేశం ఉంచుకునే వాణ్ణిగాను. కాబట్టి అప్పుడు నాకు ప్రేమ కలిగినప్పుడు (వాంఛ అనండి) ఆ సంగతి దాచుకోకుండా మీతో అన్నాను. అంతే. మిమ్ము అప్పటినుంచి క్షమాపణ కోరవలెనని అనుకొన్నాను. కాని వీలులేకపోయింది. నేడు నా ఉద్దేశాలు మారాయో లేదో చెప్పలేని విషమసంధిలోకి వచ్చి నారాయణుని ఉత్తరంలో రాసిన కారణాలవల్ల ఈ ప్రపంచం వదలివేస్తున్నాను. మీరు క్షమిస్తే, నాకు ఆత్మ అనేది ఉంటే అది సంతోషిస్తుంది. తల్లీ, నమస్కారాలు.

–రాజేశ్వరుడు’

అందరూ స్తంభించిపోయినారు. నారాయణరావు శ్యామసుందరి వైపు తిరిగి ‘అమ్మా! అతని ఆత్మతరఫున క్షమించమని నిన్ను కోరుతున్నాను’ అని అడిగినాడు. శ్యామసుందరి కన్నుల నీరు తిరుగ ‘అన్నా! అతన్ని గురించి నేను తప్పు అభిప్రాయము పడినందుకు ఆతని ఆత్మను క్షమాపణ అడుగవలసి ఉన్నది. భగవంతుడు ఆతని ఆత్మకు శాంతినిచ్చు గాక’ అని అన్నది.

మాటలాడక స్నేహితులందరూ ఈవలకు వచ్చి నారు. రోహిణీ దేవి వారికడకు వచ్చి ‘నారాయణరావు అన్నా! రాజేశ్వరుడు విషం పుచ్చుకొని చనిపోయినాడా?’ అని అడిగింది.

‘అవునమ్మా.’

‘ఏమిటీ కారణం?’

‘ఈ ఉత్తరం చదువుకో. తర్వాత నేను చెప్తాను.’

రోహిణి ఆ యుత్తరము దీసికొని చదివికొన నారంభించినది.

‘నా ప్రియసోదరుడగు నారాయణా! నీ చేయి యేది? నేను సెలవుతీసు కుంటున్నారా! నాకు చాలా పెద్ద ప్రయాణం ఉందో, లేదో, ఇంతటితో ఆఖరో తెలియదు. కొని యింతవరకు దివ్యంగా బ్రతికాను. యుద్ధంలో అభిమన్య కుమారుడిలా ఆయుధంతో జన్మ విసర్జిస్తున్నాను. జన్మ విసర్జించటం కాదు ఆఖరు చేయటం! ఏమోరా, ఏదయినా యిబ్బంది లేదు.

‘పుష్పశీల ప్రతి మధుపానికి తన మధువును ఇస్తోంది? మంచి పేరుపెట్టాడు. కాని ఆమె ఏమిచేస్తుంది? పాపం నేనే ఆవిడ బ్రతుకు ఒక లంగరుకు కట్టిఉంటే, లంగరుత్రాడు కోసేశాను, ‘ఇంతకూ ఆవిడ పుష్పం అయినందుకు నాకు మనస్సులో ఈర్ష్య పుట్టింది. కాదనుకొని ఎంత సమాధానం చెప్పుకొన్నా లాభం లేకపోయింది. నామతం మా మతానికి విరుద్ధం అయింది. మా ఆశయాలు గంగలో కలిసినవి.

‘అయితే అయింది. నువ్వు చెప్పినబోధ అంతా ఆలోచించి చూశా. ఎక్కడా సమాధానం కుదరదు. కాని అవునేమో అన్న అనుమానం పట్టుకుంది. అనుమానాన్ని దూరంగా తోలివేద్దాము అనుకుంటే లాభం లేకపోయింది.

‘ఈర్ష్య ఎక్కువైతే, పుష్పశీలాదేవి నామీద ప్రేమ పూర్తిగా వదలి, ఇంకోళ్ళను ప్రేమించి నాదగ్గర నుంచి వెళ్ళితే, ఈ యీర్ష్య వదలక నన్ను బాధిస్తే ఎల్లాగ?’

అది కాకుండా పుష్పశీలమీద ప్రేమపోదే, ఎంత ప్రయత్నించినా! ఆమె నన్ను విడిచి వెళ్ళిపోతే బ్రతకడం ఎల్లాగు? ఆమె మనస్సు చల్లబడిపోయింది. చల్లగా జారిపోయినది. పోనీ ఎల్లాగో నేను ఆ దేవిని విడిచిఉంటాననుకో. ఉంటే మాత్రం ఈ జన్మకేమిసార్థక్యం? ఇంకో జన్మ ఉందీ? సరే! మళ్ళీ పుట్తాను. అప్పుడైనా ఈ హృదయంలో ఉన్న ఈ తుఫాను, ఈమంట, ఈ అగ్ని పర్వతం చల్లారిపోయి, నాకు నిజము గోచరిస్తుందేమో?

‘లేదు. ఇంతటితో ఈ జీవితం ఆఖరు అయితే అపరిమితానందంతో బ్రతికిన నేను దుఃఖం ఎల్లా భరించనురా!

‘సెలవు. నువ్వూ, పరమేశ్వరుడు, రాజా, ఆలం, సత్యం, రాఘవుడు నన్ను ఎంతో ప్రేమించారు. మీఅందరి దగ్గిరా సెలవు. చాలా ధైర్యంతోనూ, భయం లేకుండాను నా జన్మం ముగిస్తున్నా.

‘ఈ ఉత్తరం అందరికీ చూపించు. మీ అందర్నీ కౌగలిస్తున్నా.

నమస్తే

రాజేశ్వరుడు

‘తా౹౹ క౹౹ మా తల్లిగార్ని వెళ్ళి ఊరార్చు. వృద్ధు! రాజే.’

ఈ ఉత్తరం చదువలేక చదివినది రోహిణీ దేవి. నిశ్శబ్దము.

‘పిరికివాడురా’ అన్నాడు పరమేశ్వరుడు.

నారా: పిరికివాడేమిటి? వాడికి సరియైన మార్గం గోచరించలేదు. నా మాటలు కూడా వాడి చావుకు కారణమయ్యాయా, అని నాకు చాలా దిగులుగా ఉన్నది. ఏమి హృదయం!

రాజా: అదేమిటి నారాయుడూ? వెఱ్ఱిగా మాట్లాడుతున్నావు?

పర: ఏమి చెప్పగలంరా? మనుష్యుని హృదయం ఎప్పడెల్లా వెడుతుందో ? 

౧౩వేదాంతబోధ

శారదకు గ్రమముగా అత్తవారింటను, మదరాసులో భర్త నెలకొల్పిన కాపుర పుట్టింటిలోను చనువుగా మెలంగుట అలవాటయినది. సూరీడు తన వదిన గారితో బ్రేమ యుట్టిపడునట్లు మాట్లాడును. వదినె గారి నెల్లప్పుడు పలుకరించును, మాట్లాడించును. శారద యొంటిగా గూర్చుండ, నచట నామెకు దోడుగ నుండుటకు బోవును.

శారద యత్తవారింట నున్నప్పు డేరితోడను అంత మాట్లాడునదికాదు. ఒక సూరీడుతోమాత్రము మాట్లాడునది. సూరీడును, శారదయు జెన్నపట్టణములో గలిసియున్నప్పుడు వా రిరువురకు బ్రాణ స్నేహము కలిగినది.

ఇప్పుడు శారద యత్తగారితో మాట్లాడుచున్నది. ఆడుబిడ్డలందరితోడను మాట్లాడును. మామగారు తనకేదైన కావలయునని సూరీడును బిలిచినప్పుడు, శారద తాను వెళ్ళి ‘యేమి కావాలండి’ యని యడుగును. సుబ్బారాయుడు గారు ‘నీకెందుకులే అమ్మా’ అనుటయు, సిగ్గుపడి వెళ్ళి సూరీడు నచటి కంపును.

తనలో ఎందుకీ మార్పుగలిగినదో, అత్తగారితో, ఆడుబిడ్డలతో, మామగారితో తా నీమాత్రమైన నేల మాట్లాడుట మొదలు పెట్టెనో యామెకు దెలియదు. రెండు మూడుసారు లామె ఆలోచించుకొని మాట్లాడక యుండ వలయునని యనుకొన్నది. కాని యంతకు రెట్టింపుసారులు అప్రయత్నముగ వారితో మాట్లాడినది. ఆమె హృదయము ప్రేమమయము. తండ్రిపోలిక. అత్తవారియింట చనువేర్పడగనే యా మహాప్రవాహములో బడిపోయినది.

సూరీడుకు తలదువ్వుట నేర్చుకొన్నది. పిల్లల జనవుగా నాడించుట మొదలిడినది.

ఇంతలో శకుంతల, చెల్లెలు తన మరిది గారి యింటికి వచ్చినదనియు మరిది గారి తండ్రికి వైద్యము చేయించుటకు జెన్నపట్టణము తీసికొనివచ్చినా రనియు దెలిసి, యనంతపురమునుండి, చెన్నపట్టణము తన మేనత్త కుమారుని యింటి కిరువురు బిడ్డలతోడను వచ్చినది.

నారాయణరావునందు గౌరవము కుదిరినప్పటినుండియు శకుంతలకు తన భర్తయెడ దొంటి వైఖరి మారిపోయినది.

జగన్మోహనుని వివాహానంతరము తిరిగి భర్తకడకు వెళ్ళినప్పుడు, భర్త తనపై కేకలువేసినప్పుడు మరల జవాబు చెప్పెడిదికాదు. ఆరోజునుండి భర్తకు వలయు దుస్తులందించుట, స్నానమునకు నీరు తోడించుట మొదలగు పరిచర్య లన్నియు సేవకులచే జేయించుటమాని, తానే చేయ దొరకొన్నది. విశ్వేశ్వరరావు గారికి భార్య పరివర్తన మాశ్చర్యము కలిగించినది.

ఇంటివిషయమై యన్నియు కనుగొనుట కారంభించినది. భర్తపక్కపై పరుపులు సరియైనవి లేవని, రాయలసీమలో దొరకు మంచి దూదితో చక్కని పరుపులు కుట్టించినది. రంగు రంగుల ఖద్దరు దుప్పట్లుకొన్నది. భర్తమంచముపై పెద్ద దోమతెర కట్టించినది. స్వయముగా తాంబూలము చుట్టి యిచ్చినది. విశ్వేశ్వరరావు ఇది యంతయుజూచి ఆశ్చర్యమునంది ‘ఏమిటిది, ఇంత శ్రద్ధ ఎప్పటినుంచి వచ్చింది? ఏదైనా ఉద్దేశంతో చేస్తున్నావా?’ అని యడిగెను. భర్తను గద్దించి మాఱుపలుకుచుండు శకుంతల నేడు మాట్లాడక చిరునవ్వున తనదారిని పోయినది. ఆమె కిప్పుడు గర్భము.

ఆనందరావుగారి కారులో దనబిడ్డల దీసికొని శకుంతల తిన్నగా నారాయణరావుగారి ఇంటికి వచ్చినది. శారద మోము ప్రఫుల్లమయ్యెను. శకుంతల సుబ్బారాయుడు గారిని చూచుటకు వచ్చినదని తెలియగనే జానకమ్మగారు సంతోషాశ్చర్యముల నందిరి. శకుంతల యందరిని బలుకరించి ఉన్న దన చెల్లెలితో సుబ్బారాయుడుగారు పండుకొన్న గదిలోనికి వెళ్ళి ‘మామయ్యగారూ! వంట్లో కులాసాగా ఉన్నదాండి?’ అని పలుకరించెను. సుబ్బారాయుడుగారు శకుంతల నానవాలుపట్టి చిరునవ్వుతో గది నెల్ల వెలిగించుచు, ‘అమ్మా కూర్చో, శారదా! కూర్చో’ యనియెను. శారదయు, శకుంతలయు నచ్చటనే యొక సోఫాపై నధివసించిరి.

‘మీకు జబ్బు చేసిందనీ, యిక్కడ శస్త్రం చేయించుటకు వెళ్లుచున్నారనీ మా బాబయ్య గారు ఉత్తరం రాశారు. మా చెల్లాయికూడా యీ ఊరినుంచి శస్త్రవైద్యం అయిందని, మీకు చాలా కులాసాగాఉన్నదనిన్నీ వ్రాసింది. ఉత్తరాలు రాగానే మీ అబ్బాయి గారినడిగి, వచ్చానండి. పుండు మానిందాండి?’

‘వేలు కొట్టేశారమ్మా.’

‘అదేమిటి, మామయ్యగారూ!’

‘వేలిమీద ఏదో వ్రణంట. ఆ వేలు కొంచెం ఎచ్చుతగ్గు అంతాపాడయిందట. అందుకని తీసివేశారు.’

‘ఏ వేలండి?!’

‘చిటికిన వేలే. కుడిచెయ్యికి కూడాను. మా అబ్బాయిగారు, బిడ్డలు అందరూ కులాసాగా ఉంటున్నారా, అమ్మా? వీళ్ళిద్దరూ నీ బిడ్డలామ్మా? యని ఆ బిడ్డల తనకడకు రమ్మని నవ్వుచు సుబ్బారాయుడుగారు పిలిచినారు. పెద్దకుఱ్ఱవాడు మాత్రమే సుబ్బారాయుడు గారికడకు వచ్చినాడు. సుబ్బారాయుడుగా రాబాలుని తల నిమిరి, ‘నాయనా ఆడుకో వెళ్ళి’ అని అన్నారు.

భోజనములైన వెనుక నాడువారందరు కూర్చున్నారు. వెంకాయమ్మ అప్పుడే అమ్మమ్మకూడ నైనది. ఆమె ఎప్పుడూ మాట్లాడుచుండును. ఆమెకు గ్రొత్తలేదు. తన పెత్తల్లికి శిష్యురాలయి పంచీకరణపు పట్టువేయుట, అచలబ్రహ్మను గురించి మాటలాడుచు, శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువులు పాడుకొనుట మొదలగునవి యన్నియు నేర్చుకొన్నది. చుట్టము లందరినీ పలుకరించి వారిని కూడగట్టుకొని యుండుట యామెకు ప్రీతి. భర్తగారు పద్ధతినియోగి, పట్టుదల మానిసియు నగుట తానును భర్తకనుగుణముగ నాచారమున పూర్ణముగ బట్టుదల చూపును.

యజ్ఞనారాయణశాస్త్రి వివాహోపనయనాది విధులు చేయించగలరు. వేదములు ఎనభైనాలుగు పన్నాలు నేర్చుకొన్నాడు. ఉర్లాము వెళ్ళి బహుమతినొందుసామర్థ్యము సంపాదించుకొన్నాడు. వారి గ్రామమంతయు బద్ధతినియోగులే. యజ్ఞనారాయణశాస్త్రి వసతిగల పెద్దసంసారి. స్వంతకమతము ఎనభై యకరాల పల్లపుమాగాణియున్నది. వారింట వంటలక్కలు పనికిరారు. కాబట్టి కోడండ్రందరు పనిచేయవలసినదే. పుట్టింటికడ పని ముట్టుకొనుట యెరుగని వెంకాయమ్మ అత్తింటికడ ‘ఏమి పనివంతురాలమ్మా’ యనిపించుకొనినది.

శారదను దగ్గరకు జేర్చుకొని ‘ఏమో, మరదలా! మీ అక్కయ్య గారికి అన్నీ శ్రద్ధగా కనుక్కుంటున్నావా, అమ్మా?’ యని ప్రశ్నించినది.

శకుం: అదేమిటండీ వదినగారూ, మా అమ్మాయి మమ్మల్ని కనుక్కుంటే ఏమి గొప్పండీ!

వెంకా: అమ్మో బ్రహ్మాస్త్రము పంపించారు. మాయింటికి కోడలయినప్పుడు మీ అమ్మాయి ఎలా అవుతుందండీ వదిన గారూ? మీకు, మాకు కనుక్కోవలసిందే శారద.

శకుం: ఎల్లాగయినా తటవర్తి వారికి జవాబులు చెప్పలేము. మీ పెద్దన్నగారు వకీలు, మీతమ్ముడు వకీలు, మీరుకూడా న్యాయంగా వకీలు గారన్న మాట. మీ వాదనకు మేము జవాబు చెప్పలేమండోయి.

జాన: అదేమిటమ్మా కోడలా, మీ ఆయన కలెక్టరు. ప్లీడర్లువచ్చి ఆయన దగ్గర వాదించవలసిందేగా. భర్త కలెక్టరయితే భార్య కలెక్టరుకాదూ? ప్లీడరెంత వాదించినా కలెక్టరుగారు కొట్టివేస్తారు.

శకుం: అత్తయ్యగారు హైకోర్టు వకీలై, వదిన గారితో కలిస్తే కలెక్టర్లు కూడా ఆర్డర్లు వేయడానికి వీలు లేదు.

అందరు ఘొల్లున నవ్వుకొన్నారు. ఇంతలో వంటయింటి పనియంతయు ముగించుకొని లక్ష్మీనరసమ్మగారుకూడ నచ్చటికివచ్చి కూర్చున్నారు. ‘ఏమిటీ మా కోడలు అంటూంది? మా చెల్లెలు హైకోర్టు వకీలా? మా అన్నగారు గవన్నేరు దగ్గర నెంబరీగా! ఆయన గవన్నేరన్న మాట. అయితే శకుంతలా గవన్నేరే. వకీలు గవన్నేరు ముందర ఏమిమాట్లాడగలడమ్మా కోడలుపిల్లా?’ శకుంతల విరగబడి నవ్వింది. ఇక్కడ మా పక్షంవా ళ్ళెవరూ లేరు. మా వాదం ఓడిపోయింది’ అని అన్నది. శారద చిరునవ్వు నవ్వుచు, సూర్యకాంతముతోబాటు అత్తగార్లకీ వదినగార్లకి తమలపాకులు చుట్టలు చుట్టుచున్నది.

ఇంతలో రోహిణి, సరళ, నళిని, వారి తల్లియు లోనికి వచ్చినారు.

శ్యామసుందరికి పరీక్ష లగుచున్నవి.

లక్ష్మీనరసమ్మగారికి కులములేని యీ బ్రహ్మసమాజం పిల్లలు తనయింటికి వచ్చుట యిష్టములేదు. ఇంతవరకు ఎదిగి పెళ్ళికాకుండా ఆ పిల్లలు చదువుకొనుచున్నారనియు, ముత్తయిదువవలె కనబడు వారితల్లి రెండుసార్లు వైధవ్య మనుభవించినదనియు తెలియగనే, యీ ప్రపంచమంతయు నెచ్చటకు పోవుచున్నదోయని యామె హృదయము గడగడలాడినది. నారాయణు డిట్టివారితో సహవాసము చేయుట, కులము పోగొట్టుకొనుటకే. ఈ పట్టణవాసాలలో ఇంతేకదా, యనుకొన్నది.

పెత్తల్లి హృదయములోని ఆలోచన గ్రహించి, వెంకాయమ్మ ‘అక్కయ్యా! రెండు కందర్థాలు పాడవే’ యనెను.

లక్ష్మీనరసమ్మగారు సరేయనుచు, శ్రావ్యమగు గొంతుకనెత్తి,

అన్నపు సూక్ష్మాంశము మన సెన్నగ
నీరంబు ప్రాణ మెఱుగుము,
రెండెన్నడు కలియవో, నాడే సున్న
సుమీ యెఱుక మా సుగుణసంపన్నా
కలియుట యెఱుకసుమీ యింతకన్నా
ఉన్న దెఱుక మూలమన్నదె వినలేదు.
ఎప్పడు నీ భ్రాంతి నిన్నంటనియ్యకు సుగుణసంపన్నా
కలియుటే యెఱుకసుమి యింతకన్నా౹౹

‘గురువు శిష్యుణ్ణిచూచి అంటున్నాడు. అన్నముయొక్క సూక్ష్మాంశమే మనస్సు, నీళ్లయొక్క సూక్ష్మాంశము ప్రాణము. ఈ రెండూ కూడితే యెఱుక. ఈ రెండూ కూడకపోతే అప్పుడే యెఱుకలేదన్నమాట అని.’

వెంకా: అన్నము యెలా మనస్సవుతుంది?

లక్ష్మీ: ఆరగించిన అన్నం ఏడుదినాల్లో రసమున్ను, అది క్రమంగా రుధిరము, మాంసము, మెదడు, అస్థి, మజ్జ, శుక్ల, శోణితములు అగును. వాటి కలయిక వల్ల పిండం అవుతుంది. పిండంలో మనస్సు చేరుతుంది. అంత ప్రాణము చేరుతుంది. అన్నములో ఉన్న ఎనిమిదోవంతు ఆకాశము, ఎనిమిదోవంతు వాయువు కలిసి మనస్సు ఏర్పడుతుంది.

‘ఇక ప్రాణం ఎనిమిదోవంతు, వాయువు ఎనిమిదోవంతు. మనం త్రాగే జలంలో వాయువు కూడా ఉంది. ‘ఎల్లాగా అసలునిర్గుణంలోంచి మూలప్రకృతీ, అందులోనుండి త్రిగుణాలు పుట్టినవి. అందునుండి మహత్తత్వము, మహత్తత్త్వాన్నుంచి అహంకారము, అహంకారములోనుంచి శబ్ద స్పర్శ రూప రస గంధాదులనే పంచభూతాలు, ఆ పంచభూతాల అన్యోన్య సమ్మేళనంవల్ల సమస్త జగత్తేర్పడింది.

౧౪

ఒపెరా

లక్ష్మీపతియు, నారాయణరావును ఆరాత్రి సూరీడును, శారదను తీసికొని ఎల్ఫిన్ స్టన్ కంపెనీకి ఇంగ్లీషునాట్యము చూడవెళ్ళిరి. పరమేశ్వరుడు, ఆలం, రాఘవరాజు, రాజారావులు నాటకమందిరముకడ గలిసికొనిరి. నారాయణరావు పదిరూపాయల తరగతి టిక్కెట్లు ఇదివరకే కొనియుంచెను. పరుపుల కుర్చీలపై లక్మీపతిని తర్వాత సూరీడును, శారదను కూర్చుండబెట్టిరి. మిత్రులు తా మాసీను లగుటలో నారాయణరావుకు శారద ప్రక్కకుర్చీ మిగులునట్లు చేసిరి.

నారాయణరావునకు శారదకుగూడ హృదయములు ఝల్లుమన్నవి. ఆమె మోము ప్రఫుల్లమగుట నా చీకటిలో నెవరు కనుగొనగలరు?

నాట్యము మొదలుపెట్టినారు. ఆ నాట్య మొక నాటకమువలె నున్నది. కథానాయిక నాట్యము చేయుచు బ్రవేశించెను. కథానాయకుడు నాట్యము చేసెను. కథానాయికతో నిరువదిమంది, కథానాయకునితో పదిమంది నాట్యముచేయు వనితలు బ్రవేశించిరి.

‘గమ్మత్తుగమ్మత్తు దుస్తులురా, ఏమి చిత్రంగా ఉన్నారురా మనుష్యులు!’ అని లక్ష్మీపతి అన్నాడు.

దిసమొల అయినట్లుగా వేషాలు. అందరు ఒకటే దుస్తులు, ఒకటేరీతి నాట్యం. కథానాయిక మాత్రం ముందునుండి, వెనుక హంగుచేయు సకియలకన్న నెక్కువగ నృత్యము చేయును. ముందునకువచ్చి పాటపాడును.

అంకము మొదలు చివరవరకు ఒకటే నాట్యము, పాటలు.

అలంకారములు అద్భుతములు. దుస్తులు నిరుపమానములు. ఆ నటీమణుల యందము హృదయసంచలన కారణము.

కథాభాగము తక్కువ, నాట్య మెక్కువ. మగవారిలో పాట పాడెడు వారి గొంతుకలు సముద్రఘోషానురూపములు. ఎంత స్థాయికైనను పోగలవు. ఆడవారి గొంతుకలు కిన్నరీసదృశములు.

నాటకము జరుగునప్పుడు శారద తన చేతిని పొరపాటున భర్త చేతిపై వైచినది. భర్తచేయి యని తెలిసెను. ఆ స్పర్శసుఖాన చేయి మరల తీసికొనలేక పోయినది. భర్త గమనించలేదని యనుకొన్నంతకాల మట్లనేయుంచినది. మధుర ప్రవాహాలు ప్రసరించినవి. ప్రేమావేశముననో ఏమో ఆమె వణకిపోయినది. సిగ్గుతో చేయి వెనుకకు నెమ్మదిగా లాగికొన్నది.

విశ్రాంతి సమయమున నారాయణరావు మొదలగువారు బయటకు పోయి సిగరెట్లు కాల్చుకొనివచ్చినారు. నారాయణరావు వెలగల చాకొలెట్లు (ఒక విధమగు మిఠాయిల) గొని అవి సూరీడు కందిచ్చుటలో తూలి శారదపై వ్రాలినాడు. అరనిమేషములో సర్దుకొన్నాడు.

భార్యాభర్త లిరువురకు దేహమున మెరుపుతీగెలు అలముకొన్నవి. శారదకు నాట్యమున తక్కిన భాగమంతయు దానే నాట్యమాడుచున్నట్లు తోచినది. ఆమె యా యానందములో లీనమై తేలిపోయినది. ఆ ప్రేక్షకులు, ఎదుట దృశ్యము, సర్వమును మరచినది. ఓరజూపుతో భర్తను చూచినది. ఆ చిరుచీకటిలో సమున్నతాంగుడు, సుందరుడగు భర్త దివ్యునివలె యామెకు దోచినాడు. ఆమె కన్నుల మధురిమములు తిరిగినవి. హృదయాన పరిమళము లలమినవి. లోకమంతయు సంగీతముతో నిండిపోయినది.

నాట్యము (ఒపెరా) పూర్తియగుటయు మనవారందరు బయటకువచ్చి తమ తమ బసలకు జేరినారు, మరునాడు సాయంకాలము నారాయణరా వింటికడ వారందరు చేరినారు. రాఘవరాజు, రాజారావు వెళ్ళిపోవలసిన దినములు వచ్చినవి. కావున స్నేహితులందరిని, రోహిణిని, సరళను, నళినీదేవిని ఉపాహారముల విందునకు, రాత్రి విందునకును బిలిచినాడు. తండ్రిగారికి జబ్బు పూర్ణముగ నివారణ మొనర్చిన డాక్టరు రంగాచారిగారికీ, ఆయన సహాయవైద్యులకు తేయాకునీటి విందును, రాత్రి సంపూర్ణమగు విందును, ఆనందరావుగారును, నారాయణరావు గురువుగారును, నటరాజన్ మొదలగువారందరును వచ్చిరి. హైకోర్టు న్యాయవాదు లంద రరుదెంచిరి.

శ్యామసుందరీదేవి వచ్చుట కామెకు పరీక్షలు. ఉపాహారములు, తేయాకునీరు మొదలగునవి యన్నియు, కోమలవిలాసమువారు సరఫరా చేసినారు. వారి బ్రాహ్మణయువకు లిరువదిమంది తెల్లని గాంధీటోపీలు, లాల్చీలు ధరించి తినుబండారము లందరకు వడ్డించుటకు సిద్ధముగానున్నారు. హైకోర్టు న్యాయాధిపతులను, చెన్నపురిలోని నాగేశ్వరరాయాద్యాంధ్ర ప్రముఖులను, పెద్దషాహుకార్లను విందునకు బిలిచినాడు నారాయణరావు. నారాయణరావు, రాజారావు, పరమేశ్వరుడు, లక్ష్మీపతి అన్ని సరంజాములు చేయించినారు. అద్దెకు పాలరాయి బల్లలు, చక్కని కుర్చీలు తీసికొనిరాబడినవి.

నారాయణరావు భవనము వెనుకనున్న విశాలవనములో విందు. తోటమాలి యని పేరుపొందిన నారాయణరావు తోటయంతయు గులాబీలతో, రంగు రంగుల మెట్టతామరపూవులతో వివిధరకాల చామంతులతో, బోగైనువిల్లాలతో చిత్ర చిత్రపు క్రోటన్సు మొక్కలతో నలంకరింపబడి కన్నులవైకుంఠముగ నున్నది. చెట్లలో, ఆకులలో, జొంపములలో పూవుల నడుమ రంగు రంగు విద్యు ద్దీపము లమర్చినారు. నారాయణరావు మామగారికి ముందురోజుననే తంతి యిచ్చుటచే జమీందారుగారును ఆ రోజు ఉదయముననే విచ్చేసిరి.

విందు ఏ లోటును లేకుండ జరిగినది. సంగీతపు కచ్చేరీ జరుగుటకు ముందు నారాయణరావు లేచి ఇట్లు మాట్లాడెను.

‘సోదరీమణులారా! ఆర్యులారా! సహోదరులారా! మా తండ్రిగారికి చాలా జబ్బుచేసినది. అది శస్త్రవైద్యము. డాక్టరు రంగాచార్యుల వారు తమ సహజ సామర్థ్యము, నైపుణ్యము కనబరచుచు మా తండ్రిగారికి చికిత్సజేసి కుదిర్చినారు. రంగాచారిగారి ప్రేమకు, వారి ప్రతిభకు నేనును, మా తండ్రిగారును, మా చుట్టములందరు కృతజ్ఞులము. మేము యేమిచేసినను వారి ఋణము తీర్పలేము. వారి సహాయవైద్యులను, నా మిత్రుడగు వైద్యుడు రాజారావును నేను పొగడుటకు చాలను. భగవంతుడు వారిని, మిమ్ములనందరిని ఆరోగ్యము ఐశ్వర్యము నొసగి సంరక్షించుగాక’ యని ప్రార్థించుచున్నాను. (కరతాళములు)

వెంటనే రంగాచార్యులుగారు లేచి ‘నారాయణరావుగారు, తమ తండ్రిగారు ఆరోగ్యముగా నున్నారన్న సంతోషముతో, నన్ను పొగడినారు. నాలో ఏమున్నది? ఏ వైద్యుడైన ఆ పని చేయగల్గును. మాకు మా కూలియిస్తే మా శక్తికి తగినట్లు సహాయం చేస్తాము. తర్వాత దైవము. ఇంతమాత్రమునకు నేను వారి పొగడ్తకు దగను’ అని కూర్చుండెను. (కరతాళములు)

సంగీతపు కచ్చేరి అయినది. శ్రీరామయ్యగారు తమ సంగీతముచే అతిథుల నుప్పొంగజేసి ఆంధ్రదేశమున నింతటి ప్రజ్ఞావంతులున్నారా! యనిపించినారు.

నళినీదేవి తన ఆంగ్లభాషాపాండిత్య మెల్లర హృదయముల నాటజేసినది. ఆమెకు బాశ్చాత్యవిద్య నభ్యసించుచున్నానను గర్వము మెండు. ఆమె ఎప్పుడు ఇంగ్లీషుభాషయే మాటలాడును. చక చక తిరుగుటలో, రకరకముగ మాట్లాడుటలో, పక పక నగుటలో దాను గళాశాలలో జదువు బాలనని అందరకు దెల్లమగునట్లు సంచరించును.

అల్పాహారపు విందులో విసవిస పెద్దల మధ్యనుండి నడచి వెళ్ళి నారాయణుని ‘అన్నయ్యా! యెవరు సంగీతము పాడునది? శ్రీరామయ్యగారి గానకచేరి యని వ్రాసినావు, ఆయన గొప్ప పాటకుడా’ యని యడిగినది. నారాయణరావు చిరునవ్వుతో సమాధానము చెప్పి పంపించినాడు.

సరళ మితభాషిణి. ఆమె లజ్జాశీల. రోహిణి గడుసరి. ఆమె యెట్టి వారి హృదయములనైన నాకర్షించు హొయలు చూపించగలదు. పదిమంది తన్ను మెచ్చుకొనుట యామె కానందము. నళినికి బ్రేమయే తెలియదు. అందకత్తెనన్న భావముమాత్రము తన మాటలలో, ఆటలలో వ్యంజనమున దెలియజేయుచు, చిరుబాలికవలె సంచరించును. వారు మువ్వురు విందులో వనితల మధ్య కూర్చుండినారు. నారాయణరావు వారి నమితగౌరవ మొనరించి, యాదరించినాడు. పరమేశ్వరుడు వీలయినప్పుడెల్ల రోహిణితో నేదేని మంతనమాడును. వారితోబాటు పెక్కురు వనిత లాహ్వానింపబడినారు. చాలామందివచ్చి వారితోపాటే గూర్చుండిరి.

అల్పాహారవిందు పూర్తియైన వెనుక భోజనమునకు గూడ నళినీ, సరళా, రోహిణులు నారాయణరావింట నాగిపోయిరి.

శ్రీరామమూర్తికి వీరిని జూచినకొలదియు నాశ్చర్యముగ నుండెను. అయినను రాజమహేంద్రవరములో జదువునప్పుడు శ్రీ వీరేశలింగాఖ్యుని బోధనలు వినియున్నవాడగుటచే మనస్సు సమాధానము చేసికొనెను. అతనికి సరదాపుట్టి వారితో సంభాషణ నారంభించెను.

శ్రీరా: మీ అక్కయ్యగారి పరీక్ష లవుతున్నాయట కాదాండి?

నళిని: అదేవిటి పెద్దన్న గారూ! మమ్ము ‘మీరు’ అని గౌరవం చెయ్యాలా?

రోహి: మా పెద్దవదినగారిని దీసుకొని రాలేదే?

శ్రీరా: సంసారం పెద్దది. మా యింటిదగ్గిర ఎవ్వరూ ఉండకపోతే ఎలాగు? నేను కొత్తపేట రెండుసారులు వెళ్ళివచ్చాను. అమలాపురం పెద్ద కేసులు ఉంటే చూచుకోడానికిన్నీ వెళ్లానండీ?

నళిని: అదేమిటండీ అన్నగారూ, మీరు మళ్ళీ ‘అండీ అండీ’ అంటున్నారు? అల్లా అయితే మీతో మాట్లాడం.

శ్రీరా: క్షమించండి, కాదు క్షమించమ్మా, నువ్వు పరీక్షలో బాగా వ్రాశావా?

నళిని: తప్పకుండా నెగ్గుతానని ధైర్యం ఉంది. అమలాపురంలో బాలికలకు ఉన్నత పాఠశాల ఉన్నదా అన్నగారూ?

శ్రీరా: లేదమ్మా. అక్కడ ఎవరు చదువుకుంటారు?

నళిని: ఎవ్వరూ లేరండి? ఆశ్చర్యం!

రోహిణి: బాగా ఉంది నళిని, చెన్నపట్టణంలో మాత్రం ఏమాత్రం ఉన్నారేమిటి?

ఇంతలో పరమేశ్వరు డచ్చటికివచ్చి రోహిణీ దేవిని జూచి ‘చెల్లీ! మీరు ఇంగ్లీషు నాట్యమండలి నాట్యం చూచుటకు ఎల్ఫిన్ స్టన్ వెళ్ళినారా’ యని యడిగినాడు.

రోహి: లేదన్నయ్యా! బాగా ఉన్నదా? నిన్న మీరు వెళ్ళినారట కాదూ. శారద వదిన చెప్పింది.

పర: వెళ్ళాం. ఇదివరకు నేను సినీమాలలో చూచాను. వాటికన్న బాగుందమ్మా. నళిని: మన బోగమువాళ్ళ నాట్యంకన్న బాగుందా?

ఇంతలో రాజారావు, నారాయణరావు, యజ్ఞనారాయణశాస్త్రి యచ్చటికి వచ్చిరి. లక్ష్మీపతి దొడ్డి మరల ఎప్పటియట్లు సర్దించుచు మోటారుబస్సుల మీద సామాను పంపించి వేయుచుండెను. జమీందారుగారును భోజనమున కక్కడనే యున్నారు. ఆయనయు వచ్చి యా హాలులో గూర్చుండెను.

పర: ఏవమ్మో, మనవాళ్ళ నాట్యం అంటే వేళాకోళం కాదుసుమా!

ఆరాత్రి డాక్టరు రంగాచార్యుల గారికిని, తదితర వైద్యులకును, అనేకుల మిత్రులకును విందును, విందు పూర్తియైన వెనుక శ్రీ వేదవల్లి నాట్యమును నారాయణు డేర్పాటుచేసినాడు.

నళిని: ఏమిటి మరి! దక్షిణాది గణికలు వేసే వేషం విపరీతం. మొన్న కవితాసభలో చూచిన భాగవతం విపరీతం. మనదేశం నేను చూడలేదా, మన వేశ్యల తెయితెక్కలు నేను చూడలేదా? (అని విరగబడి నవ్వును.)

పర: అదేమిటి నళినీ! నీకు లలితకళ లంటే తెలియదన్నమాట.

నారా: చెప్పరా వాళ్ళకి! వెనకకూడా నేను ఒక చిన్న ఉపన్యాసం ఇస్తే, తల ఊపింది నళిని. శ్యామ, రోహిణీ అర్థం చేసుకున్నారు.

నళిని: అది నీ లోటుకాదు అన్నయ్యా! నాలుగు నిమిషాలలో ఏమిటో ఏమిటో గుప్పేస్తే అర్థంకాలేదు.

జమీం: నాకు చిన్నతనాన్నుండీ వీరేశలింగంపంతులుగారి శుశ్రూష వల్ల భాగవతం అంటే, నాట్యమంటే విపరీతమైన అసహ్యం. ఏదయ్యా పరమేశ్వరమూర్తిగారూ! దానినిగురించి మీ అభిప్రాయం చెప్పండి.

ఇంతలో సుబ్బారాయుడుగా రచ్చటకు వచ్చుటయు, వారికి నారాయణరావు మంచి దిండుల కుర్చీ నిచ్చి తాను కూర్చుండెను.

సుబ్బా: ఏమిటి బావగారూ, నాట్యం అంటున్నారు?

జమీం: (నవ్వుచు) పరమేశ్వరమూర్తి గారు నాట్యంలో ఉండే అందాలు చెపుతానంటే చెప్పమంటున్నాను.

సుబ్బా: మా చిన్నతనంలో మాకు భరత శాస్త్రంలో ఉండే అందాలు కూడా నేర్పేవారు బావగారూ! బోగంమేళంలో మేము కూర్చుంటే గణికలకు హడలు. సమస్తమైన కళలు మానాన్నగారికి తెలుసును. మా చిన్నవాడు మా నాన్నగారి పోలికేకదండీ. మా నాన్నగారంటే హడలు మాకు. ఆయన సంగీతాలు పాడితే లోకాలు మూర్ఛిల్లేవి. తొంబదిఅయిదేళ్ళ వృద్ధుడై పొలంలో పనిచేసుకొని ఇంటికివచ్చి, స్నానంచేసి, భోజనం చేసుకుని, రాత్రి రెండో ఝామువరకు త్యాగయ్య కృతులు పాడుతూ ఉంటే ఊరుజనం అంతా ఆక్కడే ఉండేవారు. త్యాగరాయగారిని ఎరుగును. ఆయన ప్రియశిష్యుడే మా నాన్నగారు, ఆ సంప్రదాయం సరిగా ఉన్నదీ లేనిదీ నాకు తెలుసును, మావాడు పాడుతుంటే అచ్చంగా మా నాన్నగారి గొంతుకేగాని అంత అందం పూర్తిగాలేదు.

నారా: అది ఇంగ్లీషు చదువు నాన్నగారూ!

పర: నాట్యాన్ని గురించి రెండుముక్కలు పెద్దనాన్నగారు చెప్పితే చాలా బాగా ఉంటుందని మనవి.

జమీం: అవును, బావ గారూ!

సుబ్బా: ఏముందీ నాట్యం రెండురకాలు – నృత్యం, నృత్తం. నృత్యం, భావంకలిగిన నాట్యము. నృత్తం, అలంకారస్వరూప నాట్యం. స్వరకల్పన వంటిది. నృత్యం మళ్ళీ రెండురకాలు. ఉద్ధృతమైన భావాలుకలది తాండవం; కోమలభావాలు కలది లాస్యం.

౧౫

రెండే మార్గాలు

జమీం: మాకు విపులపరచి చెప్పండి, బావగారూ.

సుబ్బా: వస్తున్నా.

భక్తిచేత ఒడలు తెలియకుండా, కోపంచేత, రౌద్రంచేత, వీరత్వంచేత ఆవేశం పూనినభావాన్నీ తెలియచేసేది తాండవం అండీ. శివుని లయతాండవం, కాళికాదేవి సంహారతాండవం, శ్రీకృష్ణుడు భీష్ముని చంపడానికి చక్రంపుచ్చుకొని ఉరికిన వీరతాండవం, రావణాసురుడు యుద్ధానికివస్తూ చేసిన రౌద్రతాండవం, చైతన్యనివర్తి దేవాది మహాభక్తులు చేసిన పారవశ్యతాండవం.

ఇక రెండోది లాస్యం అన్నా. ప్రేమచేత రాధ, సత్యభామ, శ్రీకృష్ణుడు మొదలగువారి శృంగారాది కోమలభావాలు తెలియజేసేది లాస్యం.

ఈ విద్య మహోత్తమమయినది. బావగారు! కవిత్వానికి భాష సాధన వస్తువు. చిత్రలేఖనానికి రంగు, శిల్పానికి శిలా మొదలైనవి. సంగీతానికి ధ్వని. ఆలాగా నాట్యానికి ముఖ్య సాధనవస్తువు మనుష్యుని దేహం. మనుష్యుడే ముఖ్యవస్తువు, అతనిలో ఉన్న సర్వశక్తులున్నూ. అందుకనే నాట్యవిద్యను తపస్సుచేసుకొని అర్పించేవాడు మహోత్తముడు అన్నారు పెద్దలు.

జమీ: చిత్తం.

సుబ్బా: భావాన్ని వ్యక్తీకరించడం అభినయం. ఆ భావం అంగాభినయంతో, వాచ్యాభినయంతో, ఆహార్యాభినయంతో, సాత్వికాభినయంతో చూపిస్తాడు నటుడు.

జమీం: నాట్యానికి అభినయం ప్రధానమాండి, నృత్యం చేయడం ప్రధానమాండి? సుబ్బా: భావం లేకపోతే కళ కానేకాదుగదాండి. అంచేత భరతము అంటే భావ రాగ తాళయుక్తమైంది అని భరతశాస్త్రం చెబుతుంది.

జమీం: చిత్తం.

సుబ్బా: అభినయం సంగీతంగా ఉండాలి. అంటే రాగయుక్తంగా, తాళయుక్తంగా ఉండాలి. తాళం పదముల గతివల్ల, రాగము పాడడంవల్ల చూపిస్తారు. నాట్యంచేస్తూ, ఒక పదం పాడుతూ ఒక భావాన్ని ప్రదర్శించేది కరణం. ఆ కరణానికి ముఖ్యభావ సూచనను బట్టి పేరుపెట్టారు. అలాగు లెక్కచూస్తే నూటయెనిమిది కరణాలు ఉదహరించాడు భరతుడు. కొన్ని కరణాలు కలిస్తే అంగహారము అంటారు.

జమీం: విశదంగా చెప్పాలండి.

సుబ్బా: త్యాగరాయకృతిని తీసుకుందాం. కృతి సంపూర్ణకావ్యము. అందులో పల్లవి ఒక కరణంవంటిది. అనుపల్లవి ఇంకోకరణం. చరణాలు ఇతర కరణాలు. అన్నీ కలసి అంగహారం అన్నమాట. ఎన్నో కృతులు ఒక మహాకావ్యం. ప్రతి అష్టపది ఒక అంగహారం అనుకోండి – అన్ని అష్టపదులు కలసి మహాకావ్యం. అల్లాగే ఒక సంపూర్ణకావ్యం నర్తించడం, ప్రదర్శించడం ‘నాట్యం’ అంటారు.

జమీం: చిత్తం.

నళిని: పెదనాన్నగారూ! అభినయం నాలుగురకాలన్నారు. అవి చేతులు తిప్పడం మొదలైనవేనా అండీ?

సుబ్బా: అవునమ్మా, అంగాభినయంలో దేహం అంతా వస్తువు అవుతుంది. అందులో ముఖ్యాంశాలు, ప్రత్యంగాలు, ఉపాంగాలు అని ఉన్నాయి. చేతులు, తల, కళ్లు, కంఠము, పార్శ్వము, నడుము, కాళ్ళు ముఖ్యాం గాలు. చేతికి మోచేయి ప్రత్యంగము, వ్రేళ్లు ఉపాంగాలు. కంటికి కనుబొమ ప్రత్యంగము, కనురెప్పలు, గ్రుడ్లు ఉపాంగాలు. అలా అన్నిటికి. వీని కదలికతో భావం చెప్పడం అంగాభినయము. భరతుడు, నందికేశ్వరుడు ఈ అభినయాలు విధించారు. అవి కాలాన్ని బట్టి మారాయి లెండి.

పర: లేకపోతే వివిధ రాష్ట్రాల్లో వివిధ విధానాలు ఎల్లా వచ్చాయండి?

యజ్ఞ: ఏమిటయ్యా పరమేశ్వరమూర్తీ, ఆ విధానాలు?

పర: కథకళి సంప్రదాయం మళయాళ దేశంలో, కథక సాంప్రదాయము ఉత్తరదేశాల్లో, మణిపూరులో ఆ పేరిటి సంప్రదాయం – కూచిపూడి సంప్రదాయం, తంజావూరి సంప్రదాయం ఇల్లా ఉన్నాయి బావగారూ!

సుబ్బా: నేను ఆ వివిధరకాల నాట్యాలుచూడలేదు గాని, పూర్వం విదుషీమణులు, సుందరశరీరం కలవాళ్లు అయిన భోగంవాళ్ళు తెలుగుదేశంనిండా ఉండేవాళ్ళు. అద్భుతంగా నాట్యంచేసేవాళ్లు. వారి నాట్యాలెన్నో చూశాను. జమీం: ఇపు డా విద్య నశించిపోయి, చాలా హీనస్థితిలో ఉంది కదాండి?

సుబ్బా: చిత్తం. మళ్ళీ ఆ విద్య పునరుద్ధరించడం చాలా ముఖ్యమండి. అందుకనే మా నారాయణునితో చెప్పి ఇవాళ వేదవల్లి నాట్యం ఏర్పాటు చేయించాను బావగారూ.

ఆరాత్రి షడ్రసోపేతమేకాక బహుళరసోపేతమగు విందు నర్పించినాడు నారాయణుడు. భోజనములైన వెనుక హాలులో అందరును ఉచితాసనముల నుపవిష్టులైరి. వేదవల్లియు నాట్యోచితవేషమున వచ్చి సభ్యులందరికి నమస్కరించి నిలువబడినది. ఆమె వెనుక వాద్యవిశారదులైన మార్దంగికుడు, వాయులీనకుడు, తాళధారియు, గాయకుడును నిలుచుండిరి.

వేదవల్లి అందకత్తియ. దాక్షిణాత్య భోగమువారిలో నుత్తమురాలు. నృత్యప్రజ్ఞాప్రతిష్ఠ చరిత్రగల కుటుంబమున జనించినది. ఆమె నృత్యకళాశక్తి దక్షిణ దేశములో నెంతయు పొగడ్తనందినది. ఆమె పట్టులాగు తొడుగుకొని, బనారసుచీర కాళ్ళకు వెనుకకు విరిచికట్టి, వెనుకనుండి ముందుకు వల్లెవేసుకొని, వెడల్పు సరిగఅంచు చీరకొంగు, కుచ్చెళ్లు ముందుకు విడిచి, వెలగల హోంబట్టు సరిగరవిక తొడిగికొన్నది. రవ్వలయొడ్డాణము నడుమునకు మేఖలయైనది. రవ్వల బేసరియు, రవ్వల అడ్డబాసయు, రవ్వల పతకమును, రవ్వలదుద్దులును, ముత్యపు బాసట బొట్టును ఆమె మోము నలంకరించినవి. పొడుగుగ వాలుజడ రచించి, ఒత్తుగ పూలు ముడుచుకొన్నది. వివిధరత్నములు కూర్చిన శిరోభూషలు రాగిణి, చంద్రవంక , తమలపాకు, మొగలిరేకు, చేమంతిపూవు మొదలైనవి ధరించినదామె. చెంపసరులు, చెంపకళ్ళలు దాల్చినది. కాళ్లకు గజ్జియలు ధరించినది.

ఆమె మద్దెలకు నమస్కరించి, భగవంతుని, సభ్యులను ప్రార్థించి, ‘ఆలారిప్పు’ (అలరింపు) ప్రారంభించెను. స్వరజతులు చూపినది. తిల్లాణా నృత్యము చేసినది. భైరవీ వర్ణము ప్రారంభించినది.

మలయమారుతమై ఇటునటు ప్రసరించినది. సెలయేటి పతనాలవలె ఉరికినది. వాగై పరవళ్ళైనది. మండలములు, చంక్రమణము, గతులు సుడులై, తరంగాలై, వడులైపోయినది.

ఆమె పరిభ్రమణము నాగుబాము నడకలైనది.

ఒక గంటసే పామె ఆ వర్ణము నృత్యమొనర్చినది. ఆ వెనుక శ్రీ నారాయణతీర్థుల ఆదితాళయుక్తమైన తరంగము పాడ నారంభించెను. ఆమె ముఖారి రాగాన గోపికయై బాలకృష్ణుని ధ్యానించినది. ఆమెయే బాలకృష్ణుడై బాల్యక్రీడల వినోదించినది. మారాము పెట్టినది. 

కృష్ణం కలయసఖి సుందరం-
బాలకృష్ణం కలయసఖి
కృష్ణం గతవిషయ తృష్ణం - జగత్ర్పభ
విష్ణుం సురారిగణజిష్ణుం, సదాబాల


అతని బంగారుగజ్జెలమ్రోత లోక సమ్మోహనస్వరపూరితమై, వేణునినాదసంశ్లిష్టమై దిశల నావరించినది. నీలమేఘశకల మొకండు ఆకాశయానము చేయువడి, తళతళలాడినవి విద్యుల్లతలు. తారాగణములు జ్వలించినవి. వెన్నెల వెలుగులు లోకాలోకాలను కాంతింపజేసినవి.

ఆ వెనుక నామె క్షేత్రజ్ఞుని పదమును అభినయించినది. భైరవీజన్యమై, త్రిశ్రజాతి త్రిపుటతాళయుక్తమెన దాపాట.

‘మంచిదినము నేడే–
మహరాజుగా రమ్మనవే!’


ఆమె రాధ, విరహిణియై, అర్ధఖండితయై, తన గంభీరభావము వదలక, దివ్యలీలావినోదుడై పరమదక్షిణనాయకుడైన, నీలగోపాలుని రమ్మని చెలికత్తెకు చెప్పుచున్నది. ఆతని తప్పుల సైరించెద నన్నది. ఆతని ఇతర ప్రేయసుల మాటలైన తలపనన్నది.

పరమేశ్వరు డా బాలిక నృత్యము నాలోకించుచు, ఉప్పొంగిపోవుచు, ప్రతీహస్తప్రాణమునందును, అభినయమునందును లయించిపోవుచు పరవశుడైనాడు. ఆ బాలిక ఉచ్చారణ బాగుండకపోయిననేమి? ఆంధ్రులకు తక్క నొరులకు వాచ్యాభినయము లేకపోయిన నేమి? ఏమీ ఈ అద్భుత నృత్యము!

ఆ బాల ధవళపన్నగాంగనవలె నాడినదట. ఆ బాలరూప మా అభినయమున లీనమై యామెయే నృత్యదేవి యైనదట. ధూపకరండమునుండి పై కెగయు పరీమళార్ద్ర ధూమ వక్రగతి భంగములను దాల్చినదట. విచిత్ర మనోహరవర్ణ భాసిత కుసుమలతవలె లోలాంగియైనదట.

ఆ బాలిక యవయవములు ప్రత్యభినయమునకు, సర్వకరణాంగహారాలకు మరియు సౌందర్యము చేకూర్చినవట. కదలికలో దాక్షిణాత్యమగు యత్కించిత్ కర్కశత్వమున్నను ఆ నృత్య ప్రజ్ఞాకౌశల్యములలో నదియు శోభించినదట.

వచ్చిన అతిథులు, స్నేహితులు ఎవరి ఇండ్లకు వారు వెడలినారు.

సుబ్బారాయుడు గారికి పూర్తిగా స్వస్థత కలిగినది. అందరును గొత్తపేట బయలుదేరిరి. నారాయణరావు కొత్తపేట వెడల నిశ్చయించెను.

రాజారావు కొద్దిరోజులుండి, యమలాపురమునకు వెళ్లిపోయినాడు.

శ్యామసుందరికి పరీక్షలైనవి. తాను తప్పక విజయమందుదునని యామె ధైర్యముతో జెప్పగలిగెను. హైకోర్టునకు సెలవు లిచ్చుటచే నారాయణరావు చెన్నపురి కాపురమును గట్టిపెట్టి భార్యాది బంధుసహితుడై తండ్రితో వెళ్ళిపోయినాడు.

శకుంతల చెన్నపట్టణములో నాల్గుదినములుండి తిరిగి వెళ్ళిపోయినది. ఆమె చెన్నపట్టణములో నున్నంతకాలము నారాయణరావుతో నన్ని విషయములు మాట్లాడుచు, నాతనితో నమిత స్నేహమున సంచరించుచు, జెల్లెలిచే నాతని బలవంతమున బరిచర్యల జేయించుచుండెను. శారద కింత సిగ్గేమియని యామె తలపోసికొన్నది. భార్యాభర్త లెప్పుడు మాట్లాడుకొనరు. శారద యేమియు నారాయణున కందిచ్చుటగాని, యాతనికి వలయు సేవల నొరు లొనరించునట్లు చూచుటగాని యామెకు గనబడలేదు. వీరిరువురి హృదయపరిస్థితు లెట్లున్నవో యామెకు బూర్తిగా దెలియలేదు.

ఒకనాడు నారాయణుని యాతనిగదిలో నుండుమని కోరినది. తన చెల్లెలు శారద నచ్చటకు గొనిపోయెను. శారదయు, నారాయణరావును గూడ తెలబోయిరి.

‘మా అమ్మాయిచేత మీకు తలదువ్వించాలని సరదా అండీ’ యని శకుంతల యన్నది. ఆశ్చర్యపడి, చిరునవ్వుతో నారాయణరావు ‘నాకు కొంచెము పనిఉంది వదినగారూ’ అనెను.

శకుం: మీ పని సరేలెండి, నేను ప్రార్థించే ఈ కాస్తపనీ నాకోసం చేయరాదా మరిదిగారు?

నారా: మీ యిష్టం.

శారద భయము, సంతోషము, ఆశ్చర్యము తన్ను ముంచివేయ వణకుచు నారాయణునికి తలదువ్వెను.

కొత్తపేట వచ్చిన కొన్ని దినాలకు పెద్దాపురమునుండి నారాయణరావు స్నేహితుడొకడు తంతి నిచ్చాడు. ‘మీ అక్కగారిని మీ బావగారు కొట్టి వీధిలోనికి దరిమి తలుపు వేసినాడు. మీ అక్క మూర్ఛపోయింది’ యని యందున్నది.

నారాయణరావు తత్ క్షణం పెద్దాపురము వెళ్ళిపోయినాడు. ఎందుకు పెద్దాపురము వెళ్ళినది యేరికి తెలియనీయలేదు.

పెద్దాపురమునకు నారాయణరావు వెళ్ళునప్పటి కన్నియు భీభత్సముగ నున్నవి. భార్యాభర్తలుగాని, తన మేనకోడలుగాని భోజనమే చేయలేదు. తన చిన్నక్క గారికి మూర్ఛ వచ్చుచునేయున్నది. నారాయణరావు హృదయమంతయు గోపముతోను, విచారముతోను నిండిపోయినది.

మగవా రీ రీతి నెట్లు సంచరించగలరు? ఆడువారు పశువులని భావించి చరించు పురుషు లింక నీనాటి కున్నారా? సంపూర్ణ మానవత్వము లేని వీరికి మోక్షార్హత ఎప్పుడు వచ్చునో! పంచమ సహోదరులయెడ, బీదజనులయెడల, స్త్రీలయెడల, పరజాతులయెడ తమ పశుత్వ మింకను జూపు మానవులు కోట్లకొలది యున్న ఈ యుగము నిజముగ కలియుగమే! భగవంతు డున్నాడని గాని, తాను శుద్ధ సత్యమూర్తియగు భగవంతుని యవతారమనిగాని మనుష్యు డెటుల మరచిపోవునో? తన అక్క సత్త్వగుణ సంపన్నురాలు. భర్తయనిన భగవంతుని యవతారమని భావించు పూర్వయుగాలనాటిది. అట్టి శుభచరితలకే కష్టములన్నియు సమకూడును గాబోలు. గడుసుదనమున వర్తించుచు భర్తను తమకు దాసానుదాసులుగా జేయు భార్యల బ్రతుకు పూవులలో బ్రయాణమే కదా?

నారాయణరావు బావ గారికడకు బోయి, ‘బావా నీకు బుద్ధిలేదోయి. నీవు మనుష్యుడవనుకున్నాను గాని, కేవలము పశువుతో సమానుడవని అనుకోలేదోయి. ఇదేమిటి నీకింత కోపము? కోపాని కంతుఉండాలి. ఎంతవరకూ ఈ కోపం వెళ్ళడము? పోనీ నీకేమి చిక్కురాకుండా ఏదైనా పదునైన ఒక కత్తిచూసి, దాన్ని నరికివెయ్యరాదూ? లేదూ విషం తెచ్చిపెడతాను, నీ కసితీరగా దానినోట్లో వెయ్యి. ఆ విషం మనుష్యుల్ని నరకబాధ అనుభవింప జేసి మరీ చంపేదిగాచూచి తెస్తాను. అల్లా చంపు. అప్పటికి నీకోపం అంతానికి వస్తుందేమో? మొదట కోపం తెప్పించుకోడం, తర్వాత విచారించడం, రెండూ ఒకేజాతికి చెందినవి. అదిగో సత్యవతికి మూర్ఛపట్టుకొన్నది. ఇంక దాని జన్మ అల్లా పీల్చి పిప్పిచేస్తుంది. అది చచ్చినదాంతో జమ. నీకు తృప్తితీరిందా?

‘ఒక వేళ మా అక్కయ్యయందు దోషం ఉందంటావా చెప్పు. అది పెద్దరకం దోషం అయితే నువ్వు చేసినపనికి సంతోషిస్తాను.’

నారాయణరావు కన్నుల నీరుతిరిగినది. ‘బావా క్షమించు. ఈ నా కటిక జన్మానికి కనుల నీరుతిరగడం ఇదే మొదటిసారి. ఏదో కోపంకొద్దీ అన్న మాటలు. కాని కోపం చంపుకొని చెపుతున్నాను, నువ్వు చేసిన పాపానికి నివృత్తి నీలోనే ఉన్నది. నీ హృదయం కరిగేటందుకు, నాలోని కల్మషం అంతా పోయేటందుకు నేను నాలుగురోజులు మీయింటనే ఉపవాసవ్రతం చెయ్యవలెనని ఉంది’ యని నారాయణరా వూరకొన్నాడు. వీరభద్రరావు బావమరది. వచ్చినప్పటినుంచి యవనతవదనుడై, పాలిపోయిన మోముతో నున్నాడు.

ఆనాడంతయు వైద్యుల బిలిచి యక్కగారికి వైద్యము చేయించినాడు నారాయణుడు. ప్రక్కయింటివారు మేనగోడలికి దిండి పెట్టెదమని తీసికొనిపోయి భోజనము పెట్టినారు. నారాయణరావు ఎందరు భోజనమునకు రమ్మన్నను వెళ్ళినాడు కాడు. సాయంకాలము మూడుగంటలకు సత్యవతికి మెలకువ వచ్చినది.

మెలకువ వచ్చునప్పటికి సోదరుడగు నారాయణరావును జూచి కలయనుకొన్నది. సత్యవతి కొంతవడికి నొడలెఱిగి కనుల నీరునించినది, రెండేండ్లనుండి తన బావగారు సాధుమూర్తియై సంచరించినారు. తన చిన్నక్కగారు రెండేండ్ల క్రిందట గర్భవతియైనప్పుడు ఆమె నిట్లే బాధించి పెట్టిన కష్టము ఆమె దేహము మూలమంట కదల్చివైచినందున, ఒక నెల ముందుగ బురుడువచ్చి సత్యవతి చచ్చిబ్రతికినది. బిడ్డయు బోయినది.

అది అంతయు వీరభద్రరావు గ్రహించినాడు. నాటినుండియు భార్యను పువ్వులలోనుంచి పూజించుచుండెను.

మరల నే డైదవమాసము గర్భమట సత్యవతికి. సత్యవతి చక్కని మొగము పాలిపోయి, చిక్కి కృశించి, యామె పెద్దకన్నులు మరింత పెద్దవియై భయంకరముగ నుండెను. తగుమాత్రము బొద్దుగనుండి సౌందర్యనిధియైన యామె దేహము చిక్కి, క్షయరోగపీడిత శరీరమువలె నున్నది.

నారాయణరావు చిన్నక్కగారి ప్రక్కల గూర్చున్నప్పుడు, సత్యవతి నీరసముగ నున్నను నెమ్మదిగ లేచి, జరిగి, యాతని యొడిలో దలనుంచుకొని, ‘తమ్ముడూ!’ అని అతని ఒడలు నిమిరినది. నారాయణరావు హృదయము ద్రవించిపోయినది. ఎప్పుడు దుఃఖమెరుగడు. కన్నుల నీరురాదు. లోన తరిగివేయుచున్నది. ‘అక్కయ్యా, ఈ పద్ధతి మారేటందుకు రెండు మార్గాలున్నాయి: ఒకటి నేను కైరాలో, బొంబాయిలో, ఢిల్లీలో గాంధీగారు ఉపవాసం చేసినట్లు మీ యింటిలో ఈ దెబ్బదెబ్బా ఉపవాసవ్రతం చేయడం. లేదా, నిన్ను మా యింటికి తీసుకుపోయి, బావ కాళ్ళబేరానికి వచ్చిందాకా ఉంచివేయడం. కాని యీ రెండు నీకిష్టం ఉండవు. నీకేది ఇష్టంఅయితే అది చేస్తాను. నేను నెలరోజులైనా నిరాఘాటంగా ఉపోష్యంఉంటాను. నీయిష్టం లేకుండా చేస్తే నాహృదయంలో సరియైన పవిత్రత ఉండదు; పైగా నీకు వెఱ్ఱి దుఃఖమువచ్చి యీ అపరిమిత నీరసంలో ప్రాణంపోతే ఏమి చెయ్యను? కనక నీ యిష్టం లేకుండా చెయ్యను అక్కయ్యా.’

‘ఒరే తమ్ముడూ! నువ్వు ఉపోష్యం చెయ్యవద్దు, నన్ను తీసుకొని వెళ్లావద్దు. ఆయనకు సేవచేస్తూ ఉంటాను. ప్రాణం పోతేపోతుంది. లేకపోతే ఎల్లాగురా, నేను ఇప్పుడు ఆయన్ని వదలి రావడం?’

‘ఒహో! ఏమి పతివ్రతండీ! సెబాసు! మళ్ళీ అరుంధతీ వాళ్ళూ పుట్టివచ్చారు; నాకు కోపం రావాలి అని ప్రార్థిస్తూన్నాను!’ అని యాతడు మనస్సు లో ననుకొన్నాడు.

అక్కగారికి నారింజరస మింతయిచ్చి, బలవంతాన త్రాగించి, రాజారావునకు తంతినిచ్చి నారాయణరావు బజారునకు వెళ్ళి వచ్చుచుండగా బావగారు వీరభద్రరావు హోటలులో భోజనముచేసి వచ్చుట కనుగొనెను. కరుణార్ద్రమగు చిరునవ్వాతని మోమున ఉల్కవలె మెరసిపోయినది. 

౧౬

ఆకుమళ్ళు

రెండవనాటి సాయంసమయమునకు నారాయణరావు, సత్యవతి, యామె కుమార్తె నాగరత్నం రాజారావుతో కొత్తపేట చేరినారు. సత్యవతిని జూచి జానకమ్మ గారు దిగులుపడి యామెను ఒడిలోకి చేర్చి కౌగలించుకొని ‘నాతల్లీ! ఎంత చిక్కినావమ్మా! నా అదృష్టం మండిపోయింది గనుక నిన్ను తీసుకెళ్ళి ఆ బ్రహ్మరాక్షసినోట్లో పారేశాము తల్లీ!’ యని వాపోవజొచ్చెను. సూరీడు, వెంకాయమ్మ, లక్ష్మీనరసమ్మగారు అందరు కన్నుల నీరు నించుకొన్నారు.

రాజా: పిన్నిగారూ చూశారా! సత్యవతి అక్కయ్యకు మూర్ఛవచ్చింది. అల్లాగ రాకూడదండి. ఉండండి, ఓహో చేతులుకూడా కొంకర్లుపోతున్నాయి. నారాయణరావూ, అక్కయ్యను ఎత్తుకు లోపలకు తీసుకురా. సూరీడు! చెంబెడు చన్నీళ్ళు, ఆర్జెంటు.

నారాయణరావు అంగలో అందరికి ముందు చల్లనినీరు పట్టుకొనివచ్చి, అక్కగారికి మోముమీద నెమ్మదిగా కొట్టుచుండెను. రాజారావు తన మందుల పెట్టెలోనుండి యొక సీసాతీసి యామె ముక్కుకడ బెట్టినాడు. సత్యవతికి మెలకువ వచ్చినది. లోనికి గ్లూకోజు ఇంజెక్షను ఇచ్చినాడు.

సుబ్బారాయుడుగా రక్కడకువచ్చి యామెను చంటిబిడ్డవలె నెత్తుకొని లోన మంచముపై పరుండ బెట్టినారు. సత్యవతి తండ్రి మెడ కౌగిలించుకొన్నది.

పెద్దాపురములో జరిగిన సంగతి నాగరత్నం అమ్మమ్మతో, తాత గారితో నిట్లు చెప్పినది.

‘రెండోరోజున మా నాన్న హోటలులోతినడం చూశాట్ట మామయ్య, ఇంటికివచ్చి మాతో చెప్పాడు. కచ్చేరీనుంచి రాత్రి ఎనిమిదిగంటలకు గాని రాలేదు మానాన్న. మామయ్య నాన్నతో ఎంతో సేపు బోధించి చెప్పాడు. నాన్నని మామయ్య చాలామాటలు అన్నాడు. మానాన్నకు ఏదో కోపంవచ్చి తిరిగి మామయ్యను నాలుగుతిట్లు తిట్టాడు. ఇంతలో మామయ్య ఉగ్రుడై లేచాడు. మానాన్నని ఇటూ అటూ రెండు లెంపకాయలు ఫెళ్లుమని కొట్టాడు. చొక్కా చేతులు పైకితీసి ‘కాసుకో నిన్ను ఈరోజున హతమార్చేస్తాను’ అన్నాడు. మామయ్యను చూసేటప్పటికి నాకే వణుకుపుట్టింది అమ్మమ్మా! మామయ్య ఎంతో పొడుగు ఎదిగిపోయినట్లే అయింది. తాతయ్యా! నువ్వు నా చిన్నతనంలో చూడిదూడను కొట్టిన పాలేరు వాణ్ణి, రాక్షసిలా ఉన్నవాణ్ణి, ఒళ్లు హూనం అయ్యేటట్లు కొట్టినప్పుడు ఉన్నావే, అల్లాగే ఉన్నాడు మామయ్య!’ నారాయణరావు పకపక నవ్వుచుండెను. అందరు అతనిని జూచి తెల్లబోయిరి. రాజారావు మోమున మందహాసములు ప్రసరించినవి.

సుబ్బా: ఏమిటిరా బాబు?

నారా: ఏమిలేదు నాన్న! కోపం అంతా నటించాను. అతనికి కోపం తెప్పించి మాటలు వాగించి, భయపెట్టాలని ఎత్తువేశాను. ఆ ఎత్తులో పడ్డాడు.

‘ఏమండో బావగారు నిండుగా ఉన్నారు. ఇంట్లో పెళ్ళాంబిడ్డలు గంగలో కలిస్తే ఏమి? మనకారోగ్యం, మనకాయుస్సు అనుకోవడం, హోటళ్ళకు వెళ్ళి భోజనం చెయ్యడం, వహ్వ!’ అని అన్నాను. అతని మొహం జేవురించింది అప్పుడే. ఇదే సందు అని,

‘భార్యను చూలా లనైనా తలపక చెయ్యి చేసుగోడం చేతవును! ఏమి చక్కనివాడవు. ఎన్ని ఏళ్లు వస్తేయేమి? కొంచెము దయాదాక్షిణ్యం ఉండాలి. ఈవల జబ్బుతో, తిండి లేక మాడుతున్న భార్య విషయం అక్కరలేకుండా ఏం మొహం పెట్టుకొని హోటలులో తిండితిని వచ్చావు?’ అని అన్నా. అతనికి నిజంగా కోపం వచ్చింది, రుద్రుడయ్యాడు.

‘నీ మొహం చూడకూడదు. భార్యాభర్తల్ని ఎడబాపే పాపివి’ అన్నాడు. అంత వరకు తెల్లబోయినట్టు నటించాను.

‘రంకుముండ అప్పగారిని వెనకకూడా వేసుకువచ్చావు...’ అని అంటూఉంటే, మహాకోపం వచ్చినట్లు నటించి వెళ్ళి ‘కాసుకో పశువా! నేను నీకు బుద్ధి చెప్పుతా ఉండు’ అని నసాళం అంటేటట్లు రెండు లెంపకాయలు కొట్టాను. నాగరత్నం ఘొల్లుమంది. అక్కయ్య వింటూ ఉన్నది గదిలో. దానికి నాయెత్తు చెప్పలేదు కాదూ, కెవ్వున కేకవేసి వచ్చి మా యిద్దరిమధ్య పడి, నన్ను వెనక్కు లాగి, భర్తను కౌగిలించుకొని, ‘ఛీ ఛీ! నువ్వు నా తమ్ముడివికావు. నా మంగళ సూత్రానికి మాలిన్యం తెస్తావా? వెళ్ళిపో! నీకు కక్ష ఉంటే నన్ను చంపు’ అన్నది. అక్కయ్యని ఆ రోజున చూడాలి. కాళికాదేవి మహామాతే, నాకు అక్కగారే, సుబ్బారాయుడు గారి కూతురే. తత్ క్షణం ఆవిడ కాళ్లమీద బడ్డా! ‘అక్కయ్యా క్షమించు. నేను పాపిని. ఎప్పుడూ నాకు కోపం రాదు. బావ నిన్నంటే వచ్చింది’ అని అన్నాను.

‘బావ గజగజలాడుతూ ఉన్నాడు. అప్పుడు బావదగ్గరకు వెళ్ళి ఆతని చేయి పట్టుకొని ‘క్షమించు బావా! నేను ఏదో తొందరపడ్డాను. నీ భార్యను నువ్వు రండా అనడంవల్ల, నాకు ఒళ్ళు తెలియ లేదు’ అన్నాను.

‘ఆ రాత్రికే రాజారావూ వచ్చాడు. నెమ్మదిగా అందరికీ తాపాలు, కోపాలు తగ్గాయి. బావమరది తన్ను కొట్టకుండా కాపాడింది తనభార్య ఆనుకున్నాడో, మరేమో తెలియదు. రాత్రి భార్యను బ్రతిమాలుకున్నాడు. భార్య వద్దంటున్నా లెంపకాయలు కొట్టుకున్నాడు. ‘రాజారావు అక్కయ్యని పరీక్ష చేసి, ‘ఈమె మనసు పాడయిపోయింది. మూర్ఛపట్టుకొని పిప్పిచేసి పిచ్చిలోకి దింపుతూంది. అప్పుడే గుండెజబ్బు, క్షయకు వచ్చేస్థితీ ఏర్పడ్డాయి. అందువల్ల ఈమె మనస్సు బాగుపడాలి. పనిచేయకుండా ఉండాలి. మంచి మందులు పుచ్చుకోవాలి’ అని చెప్పాడు.

‘అదంతా బావ వింటూనే ఉన్నాడే అమ్మా. ఆ మధ్యాహ్నం బావను రాజారావు చాటుకు తీసుకువెళ్ళి చెప్పాట్ట. ‘ఏమండీ వీరభద్రరావుగారు! నాకు తెలుసును. మీకు తెలియదు. నాభార్య పరమ పతివ్రత. ఏడాది ఏడాది కాన్పు. పశువులా సంచరించి బంగారంవంటి భార్యను చంపుకున్నాను. అటువంటి దివ్యభామినిని ఎవరివ్వగలరు. మీభార్య పతివ్రత. మీరు యిలాగే సంచరిస్తే ఆమె ఒక ఏడాదికూడ బ్రతుకదు. నేను వైద్యుణ్ణి గనుక చెపుతున్నాను.

‘రెండు, మీకు మీ భార్యపైన కోపం విపరీతంగా వస్తోంది. అంత కోపం తెప్పించుకోవడంవలన మెదడూ, గుండె పాడై పిచ్చో, గుండెజబ్బో తయారవుతుంది. మీ రకంవాళ్ళ గతులు ఆ వైద్యశాలల్లో మేము చూస్తూ ఉంటాముగనుక చెపుతున్నాను. ఆలోచించుకోండి’ అన్నాడు.

‘బావమరిది కొడతాడన్న భయం, భార్యకు పిచ్చో, ప్రాణభయమో వస్తుందన్న భయము, తన కేదో ఆపత్తు కలుగుతుందన్న భయము – యీ మూడు హడలుకొట్టినాయి కాబోలు. బావ రెండునెలలు సెలవుపెట్టి తన ఊరు వెడతానంటే మన యింటికివచ్చి ఉండమనీ, అతను గూడా మందు తీసుకోవాలని రాజారావు చెప్పాడు. సరేనన్నాడు. ఓ వారము రోజులలో వస్తాడు.’

• • • •

రాజారావు, నారాయణరావు, లక్ష్మీపతి పొలమువైపు ఉదయము వ్యాహ్యాళికి వెళ్ళినారు.

కోనసీమ సొబగు వేసవికాలములో వనలక్ష్మియే. ఆంధ్రదేశానికి కోనసీమ నాయకమణి. ఉభయ గోదావరీ మధ్యదేశము రత్నాలే పండుతుంది. ఆముక్తమాల్యదలో శ్రీకృష్ణరాయుడు దక్షిణాదిసీమ యందాలు తనివోవ వర్ణించినాడు. కోనసీమ సొబగున కొక మహాగ్రంథమైన ఆంధ్రాన జనింపలేదేమో? కోనసీమయందు సర్వశాస్త్ర పారంగతులైన యుత్తములు ఎన్ని వేల సంవత్సరములనుండి నివాసము చేయుచుండిరో?

కోనసీమ ఆ తరువుల మంజూష, మందమలయపవనములు, పనసపండులు, కాడమల్లె, బొడ్డుమల్లెలు, నారింజపూవులు, అరటితోటలు, కొబ్బరిపూవులు, పోకయాకులు, మామిడిపూతలు, మధురాతిమధుర సౌరభముల సర్వత్ర కలయంపి చల్లుచుండును. రంగురంగుల శర్కరకేళులు, పనసపండులు, జామ, బత్తాయి, నారింజ, మామిడిఫలములు కోనసీమయంతయు మధురరసపూర్ణమును జేసినవి. అచట సూర్యరశ్మి చొరదు. వేడిగాలులు వీచవు. కొబ్బరియాకు చాపలు, పోకదొన్నెలు, పోకతోటలచలువ, పున్నాగముల సుగంధము, పచ్చనితోటలు, నీలపుంగోదావరి, నీలాకాశము, వివిధపుష్పాలు, ఫలరాజములు, బంగారమే పండు పసిమి కోనసీమ.

సీతాఫలములు, రామాఫలములు నోరూర చేయును. నీలపిల్లిగోవా, కొత్తపల్లి కొబ్బరి, పెద్దరసం, చెరుకురసం, బంగారుకలసి, సువర్ణ రేఖ, జహంగీర్, తీపిగుటక్, జొన్నలబారు మొదలగు మామిడి ఫలములు ఘుమ్ముఘుమ్మనును.

కొబ్బరితోటలు వేనకువేలు. ప్రతీతోటలో నీటిబొండాలు, గంగా ఫలాలు; కోనసీమ కొబ్బరిసీమ, గొనమలసీమ, క్రొన్ననసీమ.

మనవారు తిన్నగా నారాయణరావు తోటకడకు పోయిరి. మోములు కడిగికొని, స్నానము లాచరించి, పాలేరు కూడబట్టుకొనివచ్చిన బట్టలు ధరించి, యనతిదూరమున గూలివారు ఆకుమళ్ళకు నీరుపోయు వరిపొలముల వైపుకు బోయిరి.

ఆకుమళ్ల చెరువులోనుండి ఆకుమళ్ల పంపులలోనికి, కొన్ని కారెములు, కొన్ని గూడజంటలు నీరు తోడుచున్నవి. అందులో నొక బాలిక గొంతెత్తి పాటబాడ, నందరు పల్లవి నందుకొనుచుండిరి.


ఆకుమళ్ళాకు, నీ
రాకుమళ్ళాకు పోయి
          లచ్చుమయ్యా, నీమచ్చమాయా!

సోగా మీసాలయందం
సొంపూ తలపాగయందం
వూగేటీ వళ్ళుఅందం
రాగాల గొంతు కందం
         లచ్చుమయ్యా, నీ మచ్చమాయా!

దండాకడియాలు వెలుగు
కండాలు ముడిసుట్టు
సల్లాని నీయెదలో
ఒళ్ళూ ఝల్లనిపిస్తది.
         లచ్చుమయ్యా, నీ మచ్చమాయా!

జోడూజోడూ కలిసి
గూడెత్తి నీరేద్దం
నువ్వూ కొండలరాజ
నేనే గోదావరినదిని
         లచ్చుమయ్యా, నీ మచ్చమాయా!’

అందరూ గొల్లున నవ్వికొనిరి. ఆ బాలికతో జంటగా గూడవేయు బాలకుని, ‘దానికి ఎదురుపద మాడరా! ఆడూ! లేకపోతే ఓడిపోయినట్టేరో’ అన్నారు.

ఆ యువకుడు తలయూపి,

‘ఎయ్యవే గూడా, నా పిల్లా!
తియ్యని పాటలు పాడేమే

పాటా పాటలో కలిపేస్తే
పరుగిడు నీరూ మళ్ళల్లో!
ఎయ్యవె గూడా నా పిల్లా’

అని పాడినాడు. ‘బాగుందిరా నాగా! బంగారూ! నువ్వురా’ అన్నారు.

బంగారు:

సెపుకుంట మనవీ యినవే
నా సొగసుపిల్ల, నాగోరువంక
సెపుకుంట మనవీ యినవే.

నాకోసం ఎదురుచూచి
నాగుండె తలుసుకోని
పిల్లా నేనొచ్చేయేళ
ఘల్లూమన్నయి మెళ్లోకాసులు
సెపుకుంట మనవీ యినవే...

నీరులేక దాగమేసి
నారు వాడిపోతోఉంది
నారాక, నామాట
నారుమడికీ నీరౌతది
సెపుకుంట మనవీ యినవే...

నారు మొక్క నల్లనే
నాపిల్ల తెల్లనే
నీరొస్తే, నేనొస్తే
మొక్క పచ్చనౌతాది పిల్ల నల్లనౌతాది
సెపుకుంట మనవి యినవే,౧౭

పరశురామప్రీతి

ఏమి వీరి ఆనందము! గంజికదా వారి తిండి, గడ్డిగదా వారి పడక, పూరిగుడిసెగదా వారి భవనము. ఆనంద మెక్కడ నున్నదీ? ఇచ్చటా, మనలోనా? పారలౌకికానందము పరమహంసలకు; లౌకికానందమో, ఈ భూమాత శిశువులకేనా! వీరు కవులు, గాయకులు, నర్తకులు. వారు పుట్టినది ప్రకృతి సౌందర్యములో, బ్రతుకునది ప్రకృతి మాధుర్యములో, లయించునది ప్రకృత్యానందములో.

తనబోటివారి నాగరికత, జ్ఞానసముపార్జన ఇవియెల్ల నెందులకు? తన చరిత్ర వారిలో నొక సామాన్యుని చరిత్రతో పోల్చి చూచినచో నపహాస్య భాజనమై కన్పట్టును అనుకొనుచు నారాయణరావు తన స్నేహితులతో నడచుచుండెను.

లక్ష్మీపతి తలయెత్తి ‘వీళ్ళ కవిత్వం ఎంత అందముగా ఉందిరా! ఇదివరకు ఇది వినలేదు. ఒక్కొక్క యుగానికి, ఒక్కొక్కరి కవిత్వము పైకి రావాలిరా! మహారాజులపై కవిత్వము, పై జాతులపై కవిత్వమూ అయింది. ఇక జానపదుల కవిత్వము’ అన్నాడు. ఎవరి భావాలల్లో వాళ్లు ఉన్నారు.

భోజనాలవేళ కింటికి చేరబోవుచు మనవారు ముగ్గురు దొడ్డిదారి వైపు వచ్చుచుండిరి.

సోమయ్య కూతురు, చల్లాలు ఇంటిదగ్గరకు వచ్చిరి. అక్కడ సోమయ్య కొమరుడు సత్తెయ్యయు, చల్లాలు మొగుడు సీతన్నయు హోరాహోరీగా కొట్టుకొనుచుండిరి. ఆడవాళ్ళందరు ఘొల్లుమనుచు వా రిరువురను విడదీయుటకు సర్వవిధముల బ్రయత్నము చేయుచు విఫలులగుచుండిరి.

నారాయణరావు గబగబ రెండడుగులు ముందునకువేసి, బలముగ నిరువురను విడదీసి, యీవలావలకు గెంటివేసెను. అతని కన్నులు విస్ఫులింగ పూరితములై వారిపై దీక్ష్ణములై ప్రసరించినవి. ఆతడు మేఘగర్జనమున,

‘బుద్ధిలేదుట్రా మీకు? వీధిలోని కాట్లకుక్కలా! మిమ్ముల బడిత పట్టుకొని చావకొట్టాలా?’ యనుచు మరియు రౌద్రమూర్తియై సింహ సమానుడై నిలువబడియుండ జూచి పంది, యెనుబోతులులవలె బలిసియున్న ఆ యిరువురు తలలు వాల్చుకొన్నారు.

సోమయ్య భార్య రామానుజమ్మ, ‘బాబూ! రచ్చించండి. ఈళ్లిద్దరూ ఈవాళ ఒకళ్ళ నొకళ్లు కొట్టుకొని చంపేసుకొనే వోళ్లండి బాబూ, మీరు వచ్చారు దేవుళ్లులా’ అని ఘొల్లుమని యేడువదొడంగినది. ‘ఏమిటి కారణం? మాదొడ్డి కప్రతిష్ట తెచ్చారు’ అని నారాయణరావు అడిగెను. ‘సీతన్న పెళ్లాన్ని చావగొట్తున్నాడండి. సత్తెయ్యవచ్చి అక్కగారిని ఇడదీసి బావగారితో కలబడ్డాడండి’ అని అక్కడ చేరిన తూర్పుకాపుచిన్నది పలికినది.

‘ఓరే సీతన్నా, వీళ్లందరిదగ్గరా అంటున్నాను. నువ్వు చేసేపని ఎంత ద్రోహమో తెలియునా? ఆడదానిమీద చెయ్యిచేసుకుంటావు? దున్నపోతా! ఛీ! ఛీ! వట్టి నీచుడవు. సోమన్న కల్లుడవా నువ్వు? నీ చరిత్ర అంతా అసహ్యంగా ఉంచుకొని, ఇతరాడవాళ్ళ కాపురాలు చెడగొట్టుతూ పైగా భార్యని కొడ్తావు? బుద్ధి ఉందా? నీ దుష్టబుద్ధులు మానెయ్యి, లేకపోతే నడు ఈఊరు నుంచి. నిన్ను గురించి నాకు ఒక మాట వ్యతిరేకంగా రానీ, నేను స్వయంగావచ్చి నిన్ను ఈ కొత్తపేటలోకి రాకుండా తరిమి వేస్తాను.’ అప్పటికి నారాయణరావు కోపము తగ్గినది. వైష్ణవముద్రలు చురచుర అంటినట్లు సీతన్న కుంగిపోవుట చూచి,

‘ఒరే సీతన్నా! ఫలాని వారిదొడ్డిలో ఉన్నవాళ్లనిపించుకోవాలి. ఇంతటితో నేను మన్నిస్తాను. నా మనస్సు మెత్తన. నేను ఎవరి జోలికి వెళ్లనని తెలుసుకదా నీకు. మా నాన్నగారైతే నిన్ను తోళ్ళు ఊడేటట్టు కొట్టవలసిందేకదా? మా అన్నయ్య తత్ క్షణం వెళ్ళిపొమ్మంటాడుకద. వెనక ఓమాటుచూశాను నీ భార్య కుంగిపోవటం. నీ భార్య అందం ఈ దొడ్డిలో ఎవరికైనా ఉందా? దాని ప్రేమలో మెలుగు, పో!’ అనినాడు.

‘సీతన్న సిగ్గుతో చచ్చిపోయినాడు. ‘అయ్యో చిట్టిబాబయ్యగారికి తెలిసిపోయిందే; తేలునన్నా చంపని ఆ దేవుడికి ఎంతకోపం తెప్పించాను!’ అని మనస్సులో నెంతయు విచారించినాడు.

ఆరాత్రి పడకగదిలోనికి బోయి, చల్లాలు పండుకొనియుండ, పట్టి మంచము దాపున గూర్చుండి యామె పదములనంటి ‘చెమించుపిల్లా! తెలవక చేశా! కలవపువ్వు దగ్గరుంచుకొని, కసింత పువ్వుకోసం పడరానిపాట్లు పడ్డాడంట. ఇక బుద్ధికలిగి ఉంటా, నీ పాదంఆన!’ అని ఆమె పాదాలపై తలవంచినాడు. వెక్కి వెక్కి యేడ్చుచు చల్లాలు కాళ్ళు లాగికొని లేచికూర్చున్న ది. సీతన్న మంచముపై గూర్చుండి యామెను దగ్గరకు లాగికొని ‘చందురుడుంటే చుక్కెందుకు పిల్లా!’ అనుచు అనునయించెను. పశ్చాత్తాపతప్తుడగు భర్త మోము జూచి, నిట్టూర్పునించి, ప్రేమపూరితములగు నాతని బాహులతలలో నామె యిమిడిపోయినది.

రాజారావు వెళ్లిపోయినాడు. వీరభద్రరావువచ్చి యత్తవారింటనే యున్నాడు. రాజారావు తన కారుమీద గాని, సుబ్బారాయుడు గారి కారుమీద గాని వలయునప్పడెల్ల కొత్తపేట వచ్చి సత్యవతిని జూచి వెళ్లుచుండెదనని చెప్పి మందుల విషయమై చేయవలసినదంతయు చెప్పి మందులిచ్చి వెళ్ళిపోయినాడు, వీరభద్రరావునకును, అతడు మందులు తెప్పించి యిచ్చుచున్నాడు. ఆ యేడు గాడ్పులు విపరీతముగ వీచుచున్నవి. కాన సామర్లకోటనుండి తెప్పించిన వట్టివేళ్ల తడికల గట్టించి నారాయణరావు తన యిల్లంతయు హిమగిరివలె నొనరించెను. రాజమహేంద్రవరముకన్న కొత్తపేట చాల చల్లగా నున్నది. జమీందారుగారు, వారి భార్యయు, కొమరుడును నీలగిరికి వెళ్ళినారు. శారద యత్తవారింటనే యున్నది.

ఆమె కొత్తపేట వచ్చినప్పటినుండియు భర్తకు కాళ్ళు కడుగుకొనుటకు నీ రొసగసాగెను. నాగరత్నంతో ‘తాళంచెవులు పట్టుకురా నాగరత్నం’ అంటే సూరీడు గ్రహించి చిరునవ్వుతో ‘నాగరత్నం, చిన్నమామయ్యవే!’ అన్నది. ‘నాకు తెలవదా యేమిటి పిన్నీ!’ అని నాగరత్నం సుడిగాలిలా మాయమై నారాయణరావు బట్టలబీరువా తాళములు, ‘చిన్నత్తయ్య యిమ్మంటున్న’ దని తీసికొనివచ్చినది.

నారాయణరావు కాళ్ళు కడుగుకొని లోనికి వచ్చునప్పటికి పట్టుబట్టలు పట్టుకొని నాగరత్నం నిలిచియుండెను.

‘నాగరత్నం! చిన్నత్తయ్య బీరువాతీసి నీకిచ్చిందా ఏమిటే?’ యని ప్రశ్నించినాడు. నాగరత్నం అవునన్నది.

ఆ మరునాడు మధ్యాహ్నం కొత్తపేటలో యిళ్లంటుకొన్నవి. తనయింటి కడ నిప్పు నార్పు వాయుపదార్థ మొకటి యన్న గొట్టము పట్టించుకొని లక్ష్మీపతియు, వీరభద్రరావును గూడరా, నారాయణరావు అంటుకున్న ఇళ్ళవైపునకు బరుగెత్తెను.

జనముల కేకలు వేసి, నీళ్ళబిందెలను బట్టుకరండని అందరిని, కడవలు పట్టుకురండని కొందరిని పురమాయించి, యిళ్లనెక్కు వారిని యిళ్ళనెక్కించి, విప్పించి వేయుచు, అప్పుడే అంటుకొన్న యిళ్ళలోకి దాను జొరబడుచు, సామాను దీయుచు, యువకుల నాపనికి నియోగించుచు నారాయణరావు ఆగ్నేయాస్త్రమునకు వారుణాస్త్రమైనాడు.

గాలవేయుచున్నందున నూరంతయు దగులబడిపోవలసినదే. నారాయణరావు కట్టుదిట్టములచే కొలదియిండ్లుమాత్రమే తగులబడి యారిపోయినవి.

అందులో బెద్దకాపుగారి తాటాకుల నాలుగిళ్ళభవంతి యున్నది. ఆతడు భాగ్యవంతుడు. ధనము, సామాను, బట్టలు, పెట్టెలు మున్నగువానిని చాల వరకు నారాయణరావు మొదలగువారు యీవల బడవైచి రక్షించిరి. ఇంతలో బెద్దకాపు వెఱ్ఱియెత్తిన వానివలె నేడ్చుచు ‘చిన్నబాబయ్య గారు, నా కొంప కూలిపోయింది. భోషాణం పట్టుకురాలేదు. బాబూ నా నోటులు, భూమి తనఖాపత్రాలు, క్రయములు అన్నీ అందులో ఉన్నాయి. ఇంక నాపని అయిపోయిందండయ్యో’ అని ఏడ్చుచు కూలబడిపోయినాడు. ఇల్లు మహాగ్ని జ్వాలల విరజిమ్ముచు, ఎఱ్ఱటి పూలతోనిండిన తురాయివలె మండిపోవుచున్నది. ఫెళ ఫెళ, ధణ్ ధణ్ మను ధ్వనులు, పిడుగుబోలి దెసల నావరించుచున్నవి. జ్వాలలు మిన్నంటిపోవుచుండెను. ఆ వేడి భరింప వీలులేనిది.

నారాయణరావు ఒకసారి మహావైశ్వానరతాండవము పారజూచినాడు. పెద్దకాపు నిస్సహాయతను దిలకించినాడు.

‘భోపాణం ఎక్కడుందంటావు?’

‘సావిట్లో తండ్రీ!’

‘నీళ్ళతో రెండు బిందెలఱ్ఱో’ అని కేక పెట్టినాడు నారాయణుడు.

‘నీళ్ళు కారుతూఉండే రెండు తడిగుడ్డలు నా నెత్తిమీద వెయ్యి బావా!” అని లక్ష్మీపతిని కేక వేసినా డాతడు.

లక్ష్మీపతియు, వీరభద్రరావును తడిగుడ్డలు నెత్తిమీద వేయుటయు, రెండు చేతులా రెండుబిందెలు పుచ్చుకొని నారాయణరావు లోని కురికినాడు.

అందరూ ఘొల్లుమన్నారు. ఆత డట్లు చేయునని ఎవరనుకొనినారు! ‘వద్దండో’ అని పెద్దకాపు.

‘అదేమిటోయి బావా’ అని పొలికేక వీరభద్రరావు.

‘నారాయణరావు గారో, కొంపలు ముంచకండో’ అని జనమంతయును.

వీరభద్రరావు స్తబ్ధుడై నిలువబడిపోయినాడు. లక్ష్మీపతి తన బావ వెన్నంటి వెళ్ళబోయినాడు. నారాయణు డాతనికి గుమ్మముకడ కనుపించ లేదు. మంట లాతని గుమ్మముకడనుండి తరిమివేసినవి. అందరూ ఆశ్చర్యముతో, భయముతో నిశ్చేష్టులైరి. మంటలును శబ్దముచేయుటకూడ మానినవా!

గుమ్మముకడ ఒక బిందెడు నీళ్లు తలపై ద్రిమ్మరించుకొని, ఆ బిందెను వెనుకకు విసరి వైచి, వంగి పోయినాడు మండువాలోనున్న భోషాణము దగ్గరకు ఆతని సాహ సౌదార్యాలకు మెచ్చి, వైశ్వానరుడు మిద్దెయున్న ఆసావిడి లోనికి తొంగిచూచుట మానినాడు. మండువాలోని మంటలు గుప్పుగుప్పున వచ్చుచున్నవి. అప్పుడే భోషాణము అంటుకొన్నది. రెండవబిందె నీరు నెత్తిపై కుమ్మరించుకొని, వంగి భోషాణం ముందుకాళ్ళు రెండునుబట్టి ఎత్తి దడదడ గుమ్మముకడకు లాగికొనివచ్చినాడు.

లోపల ఏమి చేయుచున్నాడో, సొమ్మసిల్లి పడిపోయినాడో యని కంఠ పూర్ణమగు దుఃఖముతో లక్ష్మీపతి నీళ్లబిందెలు దెప్పించుచు, చేటలతో గుమ్మము లోనికి బోయించుచు, దానును లోనికి దుముక సిద్ధముగా నున్నంతలో మంటలలో నుండి నారాయణుడు భోషాణము లాగికొనుచు వచ్చుట జూచినాడు. నారాయణుడు గుమ్మవరకు వెనుకకోళ్ళు వచ్చునట్లు లాగి, మహాసత్త్వమున హుంకరించి, భోషాణమును ఒక్కపెట్టు అటు అడ్డముగా తిప్పి ఆ వెనుక కాలును, ఇటు అడ్డముగా తిప్పి ఈ వెనుక కాలును ఈవలికి లాగి బరబర యీడ్చి లాగిపారవైచి, ఖాండవదహనము చేయు అర్జునునివలె, లంక దహించు ఆంజనేయునివలె నిలుచుండి, లక్ష్మీపతికడకు వచ్చి, అలసటపడి రోజుచు పడిపోయినాడు.

వేడిగాల్పులో, అగ్నిహోత్రుని వేడిలో జనమునకు గాడ్పు తగులకుండ నొనర్చుటకు వేడికాఫీ రెండు మూడు బిందెలు పంపించుమని తల్లితో నారాయణుడు ముందే చెప్పి వచ్చినాడు. ఆ వేడికాఫీ యెంతమంది ప్రాణములనో రక్షించినది. లక్ష్మీపతి గజగజ వణకుచు నారాయణరావు నదిమిపట్టుకొని తన ఒడిలో చేర్చి, కళ్లనీరు గారుచుండ, ఇంత కాఫీ బావమరది పెదవుల కందిచ్చి త్రావించినాడు. పదినిముషములలో నారాయణుడు తేరినాడు. ఇంటికి చరచర వచ్చినాడు. బండి వద్దన్నాడు, పట్టుకొనవద్దన్నాడు.

ఊరంతయు ‘నారాయణరావుగారు, నారాయణరావుగారు’ అని చెప్పుకొన్నారు. నిప్పంతయు నిశ్శేషముగ నార్పివేయుటకు జనము నియమింప వలయునని, పెద్దకాపుతో జెప్పి నారాయణరా వింటికి వచ్చెను.

వీరభద్రుని యాశ్చర్యమునకు మితి లేదు. ‘ఇతడా నా బావమరది’ యని యాత డాశ్చర్యచకితుడైనాడు. ఆతని ప్రేమంతయు నారాయణరావు నావరించిపోయినది.

జరిగినదెల్లయు బూసగ్రుచ్చినట్లు లక్ష్మీపతి యింటిల్లపాదికి చెప్పినాడు. శారదకు గుండెలు దడదడ కొట్టుకొన్నవి. ‘ఇల్లు కూలితే! నాతండ్రీ! అన్నీ యిల్లాంటిపనులే చేస్తావు నువ్వు అంటూ జానకమ్మ గారు కూర్చున్న కుమారుని తల నిమిరినది. ఇంతలో పెద్దకాపు, ఆతని కుమారులు వచ్చి సుబ్బారాయుడుగారికి నమస్కారము చేసి, నారాయణరావు పాదాలకు దండము పెట్టిరి. సుబ్బారాయుడుగారు రహస్యముగా దన కన్నుల నీరు తుడుచుకొనిరి. తక్కినవారందరు సంతోషబాష్పముల విడచిరి.

‘తండ్రీ, నన్ను రక్షించారు. ఏమి ధైర్యం, ఏమి చొరవ, ఏమి బలం, నారాయణరావు బాబుది! సుబ్బారాయుడు అన్నగారూ, మీ బాబు మా వాళ్ళందరికీ బుద్ధి చెప్పారండీ!’

౧౮

పరీక్షాఫలితములు

ఆ రాత్రి నారాయణరావు తన పందిరిమంచముపై పండుకొని మాగన్ను వైచెను. శారదయూ నారాయణరావును వేఱువేఱుగ పండుకొందురు. శారదకు నింకొక మంచము వేయించుమని రహస్యముగ సూరీడుతో చెప్పినాడాతడు. శారదయు నా మంచముమీద పండుకొనునది. లోకమున కేమి తెలియును? భార్యాభర్తలు సిగ్గుచే మాట్లాడరనుకొన్నారు. ఎంతో సరదాగల నారాయణరావు తల దువ్వించుకొనడు, భార్య నేమియు నడుగడు. శారద భర్తకు నీళ్లు తోడించుట గాని, సబ్బు నిచ్చుటగాని, తువ్వాలిచ్చుటగాని లేదు. శారదకడ నుండి భర్తకుగాని, నారాయణరావుకడ నుండి భార్యకుగాని యుత్తరములు లేవు. ఇది యంతయు నొక విచిత్రదాంపత్య మనుకొనినారు. సూరీడుకూడ నిజము పూర్తిగ గ్రహింపలేదు. శకుంతలమాత్రము సంపూర్ణముగా గ్రహించినది.

ప్రథమదినములలో నారాయణుడు ఆవేదననందెను. అతని ప్రేమ విజృంభించి ఆతని దహించివేయునది. ఆతడు ధీరోదాత్తుడగుటచే, నిశ్చల చిత్తుడై భార్యను పొరపాటుననైన ముట్టుకొనువాడు కాడు.

శారద తన్ను భర్త ఏమికోరునో యని భయపడునది. అందుకనియే కాపురమునకు వచ్చిన ప్రథమదినములలో ఎంత సేపటివరకో నిద్రపోవక, చివరి కొడలు తెలియక నిదురబోవునది. రాను రాను భర్త సద్గుణసంపన్నుడనియు దయార్ద్రహృదయుడనియు సంపూర్ణముగా నవగతమైన దామెకు. అందుచే నిర్భయముగ నామె భర్తతో నొక్క గదిలోనే నిదుర గూడునది.

తా నొక్కతియే పండుకొనుచున్నానన్న భావమే యామెకు పరీక్షలకు జదువు రోజులలో లేదు. అప్పుడామె సంపూర్ణముగ బాలికయే.

హిందూకుటుంబములలో భార్యాభర్తలకు పునస్సంధాన మహోత్సవము సలిపినప్పుడు పదుమూడు, పదునాలుగు, పదునైదేడుల యీడుండును. అప్పుడు బాలికలకు ప్రేమయుండుట యరిది. రాను రాను వారికి భర్తలయం దనురాగము వృద్ధియగును.

చెన్నపురిలో భర్తపాటలు, భర్తమాటలు విన నామె కుతూహలపడునది. ఫిడేలు వాయించుకొనుచు పరవశుడై గొంతెత్తి గంభీరమధురముగ బాటలు పాడు భర్తపాట నేపథ్యముననుండి వినుచు, శారద పారవశ్యత నందునది. రెండుమూడుసారు లామె తాను భర్తను బ్రేమించుచున్నానా యని సందియ మందినది. యేల ప్రేమింపకూడదు? భర్త సుందరుడని ప్రతివారును జెప్పెదరే? నిజముగా సుందరుడే! ఏమి తెలివితేటలు!

నేడు నారాయణ రావు చేసిన యీ మహాద్భుత కార్యము ఎవరు జరుపగలరు? మహావీరుడు తనభర్త. గ్రీకుకథలలో జదివిన వీరాగ్రగణ్యుల కీయన యేల దీసిపోవును? ఆయన రూపము బొమ్మలలో వేయు వీరుల కెంతమాత్రమును దీసిపోదు. స్నానము చేయునప్పు డాయనమూర్తి ఎంత సుందరమయి కనుపించును?

ఆమె మనోనేత్రములకు నారాయణుని కమ్మెచ్చుల దండలు, పొంకమగు కంఠనరములు, తేజస్సును సూచించుచు వచ్చునకేని యొక యపశ్రుతిరేఖ లేని సుందరమగు మోము, నల్లని ఒత్తయిన జుట్టు, విశాలమై ఎత్తయిన చాతీ, పొడు గగు నా రూపము జూచి ఈయన దేవతవలె నున్నాడని యామె భావించి సిగ్గుపడునది. తన అక్క శకుంతల మరిదిగారన్న నెంత గౌరవము చూపును! తన తండ్రికి అల్లునిపై బ్రేమ యింతంత గాదు.

కొంచెమయినచో నెంత ఆపత్తు కలిగియుండును? ఎలాగునైన కొంచెము జాగ్రత్తగ నుండవలయునని నాన్నగారితో చెప్పించవలెను. ఈయన ఎంత పరోపకారి!

ఆమె హృదయము పూర్ణమైనది. తలుపులు దరిగ వేసికొని, నిదురించు తన భర్తను జూచి పులకరించిపోయినది. సిగ్గుచే మొగము జేవురింప నెమ్మదిగ తన భర్త పర్యంకముసేరి, యాతని తనివోవ బరికించి యాతనితల నంటియంటన ట్లంటినది. ఒక్కసారి యామె హృదయము పున్నమనాటి సంద్రమై ఉత్తుంగ తరంగయుతమై పొంగినది.

ఈయన కాళ్ళకడ నేల పండుకొనరాదు? ఇతడేనా తన నాథుడు? తండ్రిగా రిదియంతయు చూచియేనా తన్నీ మహాభాగున కిచ్చినారు? ఆమె యాతనికి నమస్కరించినది. చిరునవ్వులు నాట్యములాడునా యన్నట్లు, సహజముగ వంపు రేఖలున్న యాతని పెదవుల జూచి తన పెదవుల మెత్తదనము తలచికొని ఆ పెదవుల ...? ఆమె మత్తిల్లినది. కనుల బరువు లావరించినవి.

వెలుగున్నదో లేదో యనిపించు పడకగది దీపపువెలుగులు, నిదుర నటించు భర్త నొక దివ్య పురుషునిగ గన్పింప జేయ, నామె యాతని పదములకడ నెమ్మదిగ జేరి పండుకొన్నది.

ఆతని పాదములు తనయొడలికి దగులుటచే నేదియో వర్ణింపరాని అద్భుత మాధుర్యము విద్యుల్లతవలె నామె శరీరమంతయు ప్రాకిపోయినది.

ఈ ఉత్తమ పురుషుడు, ఈ సౌందర్యనిధి, ఈ వీరసింహుడు, తనభర్త! తన్ను ప్రేమించి తన్ను వివాహమాడినాడు. తానెంతమూర్ఖురాలయి సంచరించినది. పెన్నిధిని పెంటప్రోవనుకున్నది. ఈయన తన్ను చేపట్టునా? తన్ను తీయని మాటల నాదరించునా? ఆ గంభీరదృష్టులతో తన్ను చూడనైన చూచునా? ఆ వెడదరొమ్మున బలములు తిరుగు బాహువులతో తన్నదిమి వేయునా? తా నెంత శిక్షకైన అర్హురాలు. ఆమెకు భయ మావహించినది. ఆయన పాదములంటి వేయి మ్రొక్కులు మొక్కినను, ఆయన మన్నించునా? మన్నించునా?

ఇది యంతయు నారాయణరావు జూచుచున్నాడు. ఆమె తనకడకు వచ్చినప్పడు, తన తల నామె తాకినప్పుడు ఆతనియొడలు ఝల్లుమనిపోయినది. ఆతనిహృదయ ముప్పొంగిపోయినది. వేయితీపు లాతని నలమినట్లయినది. లేచి యా బాల నేల కౌగిలిలో నదిమివేయరాదు? రూపెత్తిన లాలిత్యము తన ప్రణయకాంత సౌందర్యము. సౌందర్యమునకు వన్నెలుదిద్దు సౌందర్యము. ఇన్నాళ్ళకు ఈమె తన్న నుగ్రహింపనున్నదా! జరిగిన దంతయు కల కానున్నదా? ఆమెను తన జీవితాశయమూర్తిగ నొనర్చుకొని, ఆమెతో లోకాల నావరించి, ఆమెను పూజించి, ఆమె దివ్య గాంధర్వములో లయమై, ఆమె పవిత్ర సౌందర్యజ్యోత్స్నలో కిరణమై ఆమెయు తానును లయమై పోవుట ఎన్నడు?

ఇంకను ఆమె గాఢోత్కంఠయై ప్రేమ మహా ఝంఝానిలముల గదలిపోవలె!

అతడు కదలక యట్లే స్వప్నమధురాకాంక్షల దేలిపోవుచుండెను. రాత్రిఘడియలు గడచిపోవుచునే యున్నవి.

• • • •

మరునాడు శారదాదేవి మొదటితరగతిలో గృతార్థురాలైనట్లును, సూర్యకాంతమున కన్నియు మంచిగుణములు వచ్చినట్లును జమిందారుగారు కూనూరునుండి తంతి నంపిరి.

నారాయణరావున కన్నియు శుభవార్తలే. రెండురోజుల క్రిందటనే రామచంద్రరావు నాలుగురోజులలో సింహళమందు దిగునని తంతి వచ్చినది.

ఇదివరకే చెన్నపురిలో రవ్వలు చెక్కిన గాజులజతలు రెండు, ఒక్కొక్కటి అయిదువందలకు నారాయణరావు కొన్నాడు. అవి పరీక్షలో నెగ్గబోవు నీ బాలల బహుమతులకే! సన్నని గాజులు, వానిపై నచ్చటచ్చట చక్కని చిన్న రవ్వలు. ఆ రెండుజతలు నారాయణరావు భార్యకొకటి, చెల్లెలికొకటి బహుమానము లిచ్చెను. వారెంతయు నుప్పొంగిరి.

ఆ రోజున సుబ్బారాయుడుగారు తన దొడ్డిలోని ఆడువారందరికీ ఖద్దరు రవికలగుడ్డలు, పండ్లు, బహుమతులు పంపించిరి.

శారద సంతోషము ద్విగుణీకృతమగునట్లు ప్రతివారు సూరీడును, శారదను బొగడువారే. సూర్యకాంతము శారదను కౌగలించుకొన్నది. ‘వదినా! మా అన్నగారు అమెరికా నుంచి నాలుగురోజుల్లో వస్తున్నారట గాదూ?’ అనినది శారద.

‘ఉండమ్మా వదినా! అన్నీ వేళాకోళాలు మొదలు పెట్టావు.’

సోమయ్య భార్య, జానకమ్మ గారితో తన యల్లునికి, తనకుమారునికి జరిగిన యుద్ధము, అల్లుని చెడునడవడి, చిన్న బాబయ్యగారు చేసిన యుపకారములన్నియు చెప్పినది. ‘ఆనాటినుంచి సీతన్న మారిపోయాడండి. నారాయణరావు గారు మంచి ప్రెబువు తల్లీ’ అని చెప్పుకొన్నది. శారద యా చిత్ర చరిత్ర వినుచు కన్నుల ఆనందపు వెలుగుల జిమ్మినది.

అందుకనా చల్లాలు త న్నతి గౌరవము చేయుచున్నది! తానన్న వెఱ్ఱి యాపేక్ష జూపుచున్నది. చల్లాలు, వెంకాయమ్మ ఒక్కయీడు, చిన్నతనమునుండి నారాయణుని ఆటలు పాటలు నన్నియు చల్లాలెఱుగును. ‘మీ ఆయనగోరు చిన్నతనంలో కుట్టమూర్తిలా ఉండేవోరు. తొనలు తొనలండీవొళ్లు. వంటినిండా నగలతో గంతులేస్తూంటే దిష్టి తగిలిపోతుందనకునేవోరు అమ్మగారు. అందరికీ ఎత్తుకోవాలని ఉండేది. ఎత్తుకోనిస్తేనా? ఆర్కి ఎంతబలం! ఓమాటు మా వంగోలావు గిత్తదూడను ఊరకుక్క ఒక్కటి కరవపోతుంటే దాన్ని తోకుచ్చుకొని బరబర లాగిపారేశారు. అప్పుడు మూడోయేడు. కుక్కపోతరించిన గే ద్దూడలాంటిది. అడిలి కొంయ్యో కొంయ్యో అంటూ పారిపోయిందండి.

‘ఆయన సదుగులు పెద్దవి, బుద్దులు గొప్పవి. ఎంత గొప్పవోరండీ!

‘చిన్నతనాన్నుంచి ఎలాంటివోళ్ళమీదా ప్రేమ. మాలోళ్ళంట ఆళ్లకన్నీ యిస్తూ ఉండేవోరు. గాంధిగారిమాట రాకమునుపే ఇంటిలోవన్నీ తీసుకెళ్ళి మాలోళ్ళపిల్లలకీ మా పిల్లలకీ పెట్తుండేవోరండి. ఎంత బకితి! మావోళ్ళంతా బజన చేస్తూఉంటే ఆ అందంవొలికే కన్నుల్తో చూస్తూ ఉండేవోరు. దయ ఇంతింత కాదుండి. మేం అప్పుడే అనుకునేవోళ్ళం. ఈయన పపంచంలో కల్లా తెలివైనవోరని.’

‘చదువులు అవీ ఎల్లాగుండేవి?’ శారద ఆ ప్రశ్న అప్రయత్నముగ వేసినది. తానేనా అడిగినది యని యాశ్చర్యముపడినది.

‘అమ్మయ్యో! ఆరి చదువేమిటి? అదుబుతం కాదమ్మా! నీ అదురుష్టం అమ్మా! మీ యిద్దరికీ యీడూజోడూ. తల్లీ మికీపాటికి చిన్నతనంలో నారాయణం గారివంటి బొజ్జనాన్నగోరు పుట్టాలండి. ముందుసంవత్సరం తప్పకుండా ఫుడ్తారులెండి.’

‘ఖైదుకు వెళ్ళారా?’

‘అవునండీ, ఇంతప్పటినుంచీ నెచ్చేరులే. అంతలో గాంధిగారొచ్చారు. ఒక్కటే నెచ్చేరులు నారాయణగోరు. తచ్చణం ఆయన్ని పట్టుకొని ఆరునెల్లు ఖైదులో యేశారు. ఎంతమందొచ్చారు బాబో ఆరు ఖైదుకు ఎళ్ళేటప్పుడు! ఈ సీమోళ్ళంతా వచ్చారండి.

‘ఖైదులో ఉన్నప్పుడు నిద్దరలేదు, తిండిలేదు మా జానకమ్మగోరికి. పెద్దయ్యగోరుమాత్రం ధైర్యంగా ఉన్నారుండి. జైలునుండి రాగానే మీ అత్తగోరు ఆరతి యిచ్చారుండి. పూజలు పురస్కారాలు జరిపారుండి.’

౧౯

బంధితుడు

వారంరోజులైన వెనుక మధురనుంచి రామచంద్రరావు తన్ను విప్లవకారులలో నొకనిగా నెంచి పోలీసువారు నిర్బంధించిరనియు, నారాయణుని తత్ క్షణము రమ్మనియు తంతివార్త నంపెను. నారాయణు డా వెంటనే బయలుదేరి మెయిలందుకొని చెన్నపురి వెళ్లినాడు. ఆ సాయంకాలము మెయిలులో మధురకు బోవచ్చుననియు పోలీసు ముఖ్యాధికారితో నీ విషయమై మాట్లాడుట మంచిదనియు తలచి, తన న్యాయవాది గురువు గారికడకు బోయి యంతయు జెప్పెను. వారును నారాయణరావును గలసి రాజధాని పోలీసు ముఖ్యాధికారి కార్యాలయమునకు జని యచ్చట విచారించగా, రామచంద్రరావు విషయమై యేదియో గూఢసమాచారమును, అందునకు సంబంధించిన కాగితములును ముఖ్యాధికారికి అందినట్లును, ఆయనే రామచంద్రరావును బంధింప నుత్తర్వులిచ్చినట్లు, ఇది యంతయు ప్రాణకాంతబోసు, గండారుసింగులపై ప్రభుత్వమువారు తెచ్చిన యభియోగమునకు సంబంధించినదనియు దెలిసినది.

దానితో నారాయణరావు తిన్నగ నీలగిరికి, కూనూరు పోయినాడు. మామగారితో మాట్లాడినాడు. మామగారిని దీసికొని ఉదకమండలము వెళ్ళినాడు. జమీందారుగారు ముఖ్యమంత్రిని పట్టుకొని ఆయనతో గలసి, పోలీసు ముఖ్యాధికారికడకు వెళ్ళినారు. మంత్రియు, జమీందారును రామచంద్రరావు కేసు విషయమై వచ్చినారని వినగనే యా యుద్యోగి యాశ్చర్యమునంది_

‘మీకు చుట్టమాండి రాజాగారూ?’ అని ప్రశ్నించి, ‘ఇవిగో! ఇవి అతని కేసుకు సంబంధించిన కాగితాలు. మావాళ్లు పదిరోజులు రిమాండు పుచ్చుకొన్నారు. అనుమానాస్పదములైన కారణాలు చాలా ఉన్నవి’ అని తెలియజెప్పెను.

జమీందారుగా రా కాగితములన్నియు బరీక్షజేసిరి. అమెరికాలో రహస్యశాఖా కర్మచారుడు వ్రాసిన సముజాయిషీలవి. అమెరికాలో తిలకు జన్మదిన మహోత్సవ సందర్భమున రామచంద్రరా వుపన్యాస మిచ్చినట్లు (ఆ యుపన్యాస భాగము కత్తిరించియున్నది) ఆ యుపన్యాసము విప్లవవాదపూరితమైయున్నట్లు, ‘భారత సందేశ్’ అను పత్రికలో రామచంద్రరావు తీవ్రవాదనలతో వ్యాసము వ్రాసినట్లు (ఆ పత్రిక ప్రతియు నున్నది) ప్రాణకాంతబోసు మొదలగువారితో గలిసి భరతదేశమున విప్లవము గలుగచేయ రహస్యాలోచనలు సలిపినట్లు ఈ మొదలగు వివరము లందున్నవి. ఇవి యన్నియు అప్రూవరుగామారిన ఒక ముద్దాయివలన గ్రహించిన విషయములు.

ఇన్‌స్పెక్టరుజనరల్ గారి యనుమతితో జమిందారుగారువెళ్ళి, ప్రభుత్వ న్యాయవాది (అడ్వకేటు జనరలు) గారిని తీసికొనివచ్చిరి.

వారందరు రామచంద్రరావుగారి కేసును గూర్చి సంపూర్ణముగా తమలో తాము చర్చించుకొనిరి. అడ్వకేటు జనరలుగారితోడను, ముఖ్యమంత్రిగారి తోడను, పోలీసు ముఖ్యన్యాయాధికారితోడను రామచంద్రరావు చాలా తెలివైన యువకుడనియు, నాతడు ప్రపంచమంతట లెక్కలలో ప్రసిద్ధికెక్కిన కొద్దిమందిలో నొకడనియు, అతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయ కళాశాలలో ఆచార్యపదవి సముపార్జింప గోరికయనియు, అతడు ఎమ్. ఎస్ సి. పట్టము నొందినాడనియు, ఆంధ్రులలో నట్టివా రితరు లెవ్వరు లేరనియు జెప్పి వాదించినారు జమీందారుగారు. అడ్వకేటు జనరలు గారు కాగితములన్నియు బరిశీలించి ‘ఇందులో ఇంతవరకున్నది రెండే సాక్ష్యములు: ఒకటి అమెరికా రహస్యచారుడు, రెండు విప్లవకారులలో ప్రభుత్వపక్షానికి తిరిగినవాడు. వాళ్ళు ఏమి చెప్పగలరు? ఒకడు రామచంద్రరావు పత్రికలో వ్రాసినట్లు, ఉపన్యాసమిచ్చినట్లు చెప్పును. మరియొకడు ఒకరాత్రి వీరందరును కలిసినట్లు మోము కప్పబడియున్నట్టు చెప్పును. వార్తాపత్రికలు సాక్ష్యములుగా పనికిరావు. రాత్రివేళ ఒకరినొకరు గుర్తించుట యెట్లు?

ప్రాణకాంత బోసు, గండార్ సింగుల కేసులో సంగతివేరు. వారు హిందూదేశమువచ్చి బాంబులు తయారుచేయుట మొదలుపెట్టినారు. ఇంకను హిందూదేశములో నేవేవో చేసినారు. ఆ సాక్ష్యబలమున ఇది అంతా ప్రభుత్వముపై కుట్ర అని అర్థమయినది.

‘ఆ కేసులో రామచంద్రునకు సంబంధము లేదు’ అని ఆయన వాదించినాడు.

ముఖ్యమంత్రియు రామచంద్రుడు నిర్దోషియని చాలగట్టిగ చెప్పినాడు. సరేయని ఎట్టకేలకు పోలీసు ముఖ్యాధికారి యొప్పుకొనుచు, కేంద్రప్రభుత్వము వారికి జరిగిన విషయములు, రామచంద్రరావుపై కేసు లేదనియు, మదరాసు ప్రభుత్వము వారును తనతో నేకీభవించుచున్నారనియు మనవి చేయుచు వ్రాసెను.

శ్రీ మదరాసు గవర్నరుగారు ఇన్ స్పెక్టరుజనరలుగా రొనర్చినపని మంచిదని, అట్లు చేయవచ్చుననియు ననుమతినిచ్చిరి.

ప్రభుత్వపు తంతి రామచంద్రుని విడుదలచేయుమని రామనాడుజిల్లా పోలీసు సూపరింటెండెంటుకు పోయినది.

జమీందారు గారు సంతోషముతో ముఖ్యమంత్రికడ నుండియు, పోలీసు ముఖ్యాధికారినుండియు ముఖ్య న్యాయవాదికడ నుండియు సెలవు పుచ్చుకొని, నారాయణరావుకడకు వచ్చెను. వారిరువురు గలసి కూనూరు వెళ్ళిరి. నారాయణరావు అత్తగారికి, భార్య మేనత్తకు నమస్కరించి కేశవచంద్రుని కౌగిలించుకొని మామగారికడ సెలవుపుచ్చుకుని, మధుర ప్రయాణమయ్యెను. తాను వచ్చుచున్నాననియు, విడుదల చేసెదరనియు తన బావ కాతడు మధురకు తంతినంపెను.

ఇటలీలో బ్రిండిజీకడ నాయిటాలి యను మహానౌక నెక్కినప్పటి నుండియు రామచంద్రరాయనికి దన దేశముపై, తన ఇంటిపై, తనబందుగులపై మనస్సు పరుగిడజొచ్చెను.

ఈ దేశములో నెంత యైశ్వర్యమున్న నేమి, ఎన్ని సౌకర్యములున్న నేమి, ఎంత నాగరికతయున్న నేమి తన దేశమున కీడువచ్చునా? ‘సుజలాం సుఫలాం మలయజ శీతలాం, సస్యశ్యామలాం, మాతరం వందేమాతరం.’

ఆహా! తనతల్లి కెన్ని నదులు, ఎన్ని క్రీడాసరస్సులు, ముక్కారులు బండు కేదారములతో, ఒడలు మరపించు చల్లదనముతో తనతల్లి తన్ను చేరపిలుచుచున్నది.

‘శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం
ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం మాతరం.’

అడవుల, కొండల, పట్టణాల, బయళ్ళ, పొలాల, తోటల, నదుల, సమ ద్రాల చల్లగా ధవళమై పుచ్చపూవువలె పడు వెన్నెలచేత పులకించిపోదువా తల్లీ. అందములై, ఆనంద మనోహరములై, అపరమిత సువాసనాలహరీ పూరితములై వివిధ వర్ణాలంకారశోభితములై పూవులచే అలంకరింపబడిన దామాత. ఆమె శిరోజము లా హిమాలయములు! అందమగు కాశ్మీరము, తమతల్లికి ప్రఫుల్లమగు ముఖమా!

ఒహో మాతా! నీగతి దుర్భరము. కానిమ్ము పుత్రులు నిన్ను మరచెదరా! జగన్మాతా!

‘త్రింశత్ కోటి కంఠ కలకల నినాదక రాశే
ద్వాత్రింశతో కోటి భుజై ధ్రుతకరకర వాలే.’

తల్లిముఖాన వినవచ్చు భాషలన్ని విని ఎంత కాలమయినది. ముద్దులుగులుకు తెలుగుభాష వినరాక చెవులు తుప్పులు పట్టినవి.

‘ఆంధ్రదేశము మాకు అమరదైవతము’

తల్లీ! తెలుగుమాతా! నీ తీపిలో తానెప్పుడు లీనమగునో అమ్మా! గోదావరీ, పుణ్యస్రవంతీ, నీ గంభీరత, నీ ప్రేమ తాను మరువగలుగునా? ఎప్పుడు దూరాన నా పాపికొండలు, నీలోని లంకలు, నీ నీలజములు కన్నుల కరవుదీర చూడగలుగుదునోకదా?

కృష్ణా! పెన్నా! ఏ నాటికి మీ దర్శనము. రాజమహేంద్రనగరము, కాకినాడ పురము, కాకినాడయందలి వీధుల తాను నడచిపోవలయును.

ఆతని మనస్సు తళుక్కుమన్న ది. కొత్తపేట, అత్తవారిల్లు తన చిన్నారి భార్యయగు సూర్యకాంతము.

ఏమి తెలివైన దాబాల! ఎంత అందగత్తెయయినది. సంపూర్ణ ప్రౌఢవలె నెదిగినది. పదునేడేండ్ల బాలిక; ఆ భగవంతునిమాయ. లియొనారా తన లక్షల నెంచక, తన్ను సంపూర్ణముగ నర్పించుకొన్నదే! జాతికి జాతికి శ్రుతి కలియదా యేమి? తన సౌందర్యనిధి, సర్వకళాశోభిత సూర్యకాంత మేమిచేయు చుండునో! తన భర్త పరీక్షల జయమంది వచ్చుచున్నాడని లోన సంతోషించు చుండునో? పరీక్షలలో నెగ్గినదా? తప్పక నెగ్గును, నారాయణరావు బావ చెల్లెలు. ఆమె నెప్పుడు చేరకలుగునో? తన్ను చూడగానే యామె మోమున నెట్టిమార్పులు కలుగునో?

నారాయణరావుబావ గంభీరస్వనములు విని యెన్నాళ్లయినది!

తనతల్లి, ఆమె యెన్ని అశ్రువులు రాల్చినదో? ఎంత చిక్కినదో? భార్యనైన వదలవచ్చును, తల్లిని వదలలేము. తల్లీ! ఈ నిర్భాగ్యుడు ఎంత తెంపరియయి సుదూర దేశాలు పోయినాడు. ఎప్పుడు కాకినాడలో అడుగుపెట్టునో? తల్లి పాదాలపై మోము నుంచవలె. ఆమెయొడిలో ఒరిగిపోవునుగాక. ఆమె తన తల నిమురునా? పూజ్యులగు తండ్రిగారికి నమస్కారములు. తా నమెరికాలో చదువుకొన్నంత కాలము, ఎంత విచిత్రపు ప్రేమ నొలికించు నుత్తరములు వ్రాసినారు! వర్తకులగు తన స్నేహితులచే, తన కొమరుని స్నేహితులచే ననేకములగు వార్తల నంపినారు. మామగారు గంభీరులు. ఆయనకు భయములేదు. మానవ మహోత్కృష్టతయం దెంతయో నమ్మకము. ఆయన మేరువువలె నుండును. ఆయన యే యుగపు వీరుడో?

సూర్యకాంతము తనతో మాటలాడునా? తన పెళ్ళినాటి యామె రూపము, యీ నాటి యామె రూపవిలాసము! ఎంత మారినది? ఎవరా యని ఒక్క నిమేషము తాను తెల్లబోయినాడు, ఆఖరి ఛాయాచిత్రము చూచినప్పడు. శాంతి ఉన్నదన్నారు. తన బావ ముహూర్తముకూడ పెట్టినామని ఏడెనుకు తంతి నిచ్చినాడు. అతనికి తనపై నెంత ప్రేమయో! ఈ అందరి ప్రేమకు దాను బాత్రుడగుట కేమి చేసెనో?

సింహళము దరిసినది. కొలంబోలో నౌక ఆగినది. నౌకలో భరతదేశపు భోజనము పెట్టిరి. ఇటలీ దేశస్థులు భారతీయుల నెక్కువ గౌరవము చేసెదరు.

రామచంద్రరావు నౌక దిగుచు వెనుకటి తన నౌకా ప్రయాణము జ్ఞాపకము తెచ్చుకొన్నాడు.

లియోనారాకన్య యెంత ప్రేమార్ద్రహృదయ! అతని కా సాయంకాల దివ్యముహూర్త మీ జన్మమున మరపురాదు. ఏమి యానందమిచ్చినది! అతిపవిత్ర హృదయ. కాని ఆట్లు తన్నర్పించుకొన్నదే. ఎంత ప్రయత్నించినను తా నామె సౌందర్యమునకు, ప్రేమకు ముగ్ధుడైపోక తప్పినదికాదు.

ఆమె యేమన్నది–‘నా ప్రియతమ స్నేహితుడా రామచందర్, నీ భార్యతోపోయి సుఖముగా కాపురము చేయుము. మమ్ముల మరచిపోకుము. మాకందరకు హిందూదేశముపై నున్న ప్రేమ ఏ దేశమునందు లేదు.

‘ఏల మేము హిందూదేశ స్వాతంత్ర్యమునకు సాయము చేయుట లేదు? అని ప్రశ్నకదా? ఏ దేశమున కా దేశము ప్రయత్నించి విజయమందవలెను. నీవు భారతములోని పద్యము చదివి నాకు అర్థము చెప్పినావే. అటులే చివరకు మా దేశమువంటి దేశములు సాయము చేయును. ‘మీ దేశ ముత్కృష్టమైనది. అట్టి పరమపూజ్యమగు దేశము స్వాతంత్ర్యమునకై పోరాడుచుండ ప్రపంచోద్ధారకమగు పరమశక్తి ఉద్భవిస్తుంది. యూదులు తమ దేశస్వాతంత్ర్యమునకై పోరాడుటవలననే అవతార పురుషుడగు క్రైస్తు జన్మించలేదా? ఆలాగు గాంధియో మరి యెవ్వరో ప్రపంచము తరింపజేయుటకు మీ దేశముననే యుద్భవించాలి.’

అని చెప్పినది. ఏమి యామె యుత్సాహము, ఆమె ప్రేమ! తప్పక హిందూదేశము వచ్చెదనన్నది. తనకు పునస్సంధానమహోత్సవము జరుగునాటి కామె బహుమతి వచ్చునట. తా నామెకు తన పునస్సంధానముహూర్తపు తారీకు తెలుపుచు తంతి నిచ్చినాడు. ఆత డిట్లాలోచించుకొనుచు అచటనున్న అరవల, తెలుగుల, ఔత్తరాహుల భాషల చెవులార వినుచు బులకించుచు రహస్యముగ దిరుగు కన్నీరు తుడుచుకొనుచు మంచి ఆంగ్లేయ హోటలులోనికి బోయి పూర్ణమగు భారతీయ భోజనము మాంసరహితమగుదానిని గొనిరమ్మని, గదిలోనికి బోయి భోజనపు దుస్తులు మార్చుకొని భోజనముచేసి రైలెక్కి పొలనారువా చేరుకొన్నాడు.

౨౦

రామచంద్రునిరాక

పొలనారువాలో (స్టీమరు) చిన్న పొగయోడ నెక్కి ధనుష్కోటిలో దిగి ఒళ్ళు పులకరించిపోవ భక్త్యావేశపూరితుడై, ఏరును చూడకుండ వంగి కొంత మన్ను తీసి ముద్దుగొని నోటిలో వేసికున్నాడు. అచ్చటనేయున్న యొక జానపదుడు ‘ఈ దొర మన్ను తిన్నాడేమి!’ యని యనుకొన్నాడు. ఇంతలో మువ్వురు పోలీసువారు, ఒక రక్షకభటాధికారియు, నిరువురు భటులు వచ్చి ‘అయ్యా, మీ పేరేమి?’ యని అడిగినాడు.

‘నా పేరు రామచంద్రరావు.’

‘ఇంటిపేరు?’

‘బుద్ధవరపు.’

‘అయ్యా! మిమ్ముల శ్రీ జార్జిసార్వభౌముని పేర నిర్బంధించుటకు నుత్తరు విదిగో. మిమ్ముల నిర్బంధించుచున్నాను’ అని యా రక్షకభటాధికారి యాతని భుజముపై చేయి వైచెను.

‘అలాగా అండి’ అని రామచంద్రరావు తెల్లబోయి, యిదేమి యని మనస్సులో చకితుడైనాడు. మోమున నిర్భయముతో చిరునగ వలంకరింప ‘ఇదేదో పొరపాటు. నన్నెందుకు మీరు నిర్బంధించుచున్నారో నాకు చెప్పగలరా?’ యనెను.

‘క్షమించండి. నాకు తెలియదు. మా పై అధికారులకు తెలియును.’ ‘నన్నెక్కడికి తీసుకొనిపోయెదరు?’

‘మధుర. అక్కడ కారాగారమున నుంచెదము.’

‘మా వారికి తంతి నీయవలయునే?’

‘మధుర నుండి యిచ్చెదరు గాక.’

మరునాడు మధుర చేరినారు. మధుర నుండి బావమరదికి తంతినిచ్చినాడు. ఎందుకు తన్నిట్లు బంధించుట? తానేమియు చేయలేదే? నేను అసహాయవాదినికాదే! ఇక నెందుకు? విప్లవకారుడనా? అదియుకాదే. అమెరికాలో ఉపన్యాస మిచ్చిన సంగతి చటుక్కున జ్ఞాపకమునకు వచ్చినది. ఏమో యావేశమున నేదియో య న్నాడు. అంతమాత్రమునకే! బావమరది ఖైదుకు వెళ్ళలేదా! తానును కారాగారమునకు పోయిన దేశమాత సేవయే. ‘తల్లీ, నీ పాదములకడ అడుగు పెట్టగనే భారతీయుడు బంధింపబడవలెనా?’ యనుకొన్నాడు. తనకు విప్లవము, కుట్ర నచ్చదు. ఏదో దేశములో శాస్త్రజ్ఞానము వృద్ధినందింప బాటు పడవలెననియు భరతమాత కీర్తి సర్వదిశల ప్రకాశింపజేయవలయుననియు నాతని వాంఛ. ఏది ఎట్లయిన నంతయు భగవంతుని చేతిలో నున్నది.

నారాయణరావు, రామచంద్రరావును నిర్బంధించిన నాల్గవరోజున మధురకు జేరుకొన్నాడు. కూనూరునుండి యా యువకుడు మధుర జేరుకొను లోపలనే రామచంద్రరావును సగౌరవముగ విడుదల చేయవలెననియు, అయినను చెన్నపురివరకొక గూఢచారిని వెంటబంపవలయుననియు రహస్యపు వార్త చేరినది. జమీందారుగా రీ నిర్బంధమును రామచంద్రరావునకు గల్పించినందులకు ప్రభుత్వము వారిపై నాత డేచర్యయు తీసికొనకుండునట్లు వాగ్దానము చేసెను. రామచంద్రునికి తాను వచ్చుచున్నట్లు జిల్లా రక్షకభటాధికారి పేర నారాయణరావు తంతి నిచ్చెను.

మామగారికి మనస్సులో నానందముతో, గృతజ్ఞతాపూర్వకమగు వందనములు చేయుచు నారాయణరావు మధుర స్టేషనులో దిగి, జిల్లా పోలీసు అధికారికడకు బోయినాడు. అచ్చట ఒక్క నిమేషము, ఎవరో తన బావమరదియో, రక్షకభటాధికారి యెవరో గుర్తింపలేకపోయినాడు. ఆ భటాధికారి యాంగ్లేయుడు. మరుసటిక్షణములో నానవాలుపట్టి రక్షకభటాధికారికి ముందు నమస్కరించి, వెనుక రామచంద్రరాయనికి నమస్కరించి అధికారిచూపిన యాసనముపై కూర్చుండెను. వారు మువ్వురు అనేక విషయముల గూర్చి మాటలాడుకొనిరి.

నారాయణరావు వచ్చినపుడే రామచంద్రరావు ‘బావా, యీయన నాకు చూపిన గౌరవము అపరిమితము. వీరిని నేనెప్పుడును మరువను. ఈయనయు లెక్కలలో ఆక్సుఫర్డులో బి. ఏ. లో కృతార్థుడైనాడట. ఎన్ని విషయములు చర్చించుకొన్నాము’ అని అన్నాడు. ‘వారికి మేమెంతయు కృతజ్ఞులము’ అని తాను కొనివచ్చిన పూవులమాలలు, నాలుగు వెండికప్పుల దొంతర ఆయనకు బహుమతి నిచ్చినాడు నారాయణరావు.

దారిలో వారిని జమీందారు గారి కుటుంబము కలిసినారు. వారంతయు సంతోషమున చెన్నపురి చేరినారు. చెన్నపురిలో జమీందారుగారి యింట నందరు మకాముచేసినారు. మధుర నుండియే విజయవార్తలు కాకినాడకు, కొత్తపేటకు, అమలాపురమునకు బంపబడినవి.

చెన్నపురిలో పరమేశ్వరుడును, నారాయణరావును, రామచంద్రరావును స్నేహితులందరి యిళ్ళకు వెళ్ళిరి. అచ్చట వారెంతయో సంతోషమున కాలము పుచ్చిరి.

మధ్యాహ్నము భోజనములయినవెనుక వారందరు శ్యామసుందరీదేవి గారి యింటికి వెళ్ళిరి. అక్కసెల్లెళ్ళందరు రామచంద్రరాయని నమితముగ గౌరవముచేసిరి. ఈతడా సూరీడు భర్తయని వారు సంతోషించిరి.

ఆ రాత్రియే బయలుదేరి కాకినాడకు వెళ్ళవలె ననుకొన్నారు. కాని నారాయణరావునకు నమితానందదాయక మును, మహత్తరమునగు నొకయాలోచన తట్టినది. అందుకై మరునాడుకూడ వారు చెన్నపురిలో నాగిపోయిరి.

రాజారావు ఉత్కృష్ట పురుషుడు; శ్యామసుందరి పవిత్రచరిత్ర. వీరిరువు రేల వివాహమాడరాదు? ఇరువురు వైద్యవృత్తియం దారితేరినారు. ఇరువురు సేవజేయుటయే జన్మకు పరమార్థమని సంకల్పించుకొన్నారు. శ్యామసుందరి యొప్పుకొనునా? అతనికి ఒక నాటిరాత్రి జరిగిన యుదంతమంతయు దృశ్యమువలె గోచరించినది. ఆమె హృదయములో నేమున్నదో? తనపై ప్రేమ సోదరుని ప్రేమయైయున్నది. ఆ సోదరప్రేమయే ఉత్కృష్టమైనదట. దివ్యకరుణావేశ యైనదట. అంతియ!

నారాయణరావు శ్యామసుందరిని మరునాడు కలిసికొన్నాడు. ఆమెతో తన కోరిక ప్రసంగించుట యెంతకష్టము! ‘చెల్లీ, నా కొక దివ్యమగుస్వప్నము ఎప్పుడూ కనబడుతూ ఉంటుంది.’

‘ఏమిటది అన్నా?’ – ఆమెమాటలు చిరువెండి గంటలవలె మ్రోగినవి.

‘నువ్వు దేశసేవ, మానవసేవయు చేసి తరింప సంకల్పించుకొన్నావు. తరిబీతు లన్నియు పూర్తియైనవెనుక సబర్మతీ యాశ్రమమునకు బోయి సేవచేయు నధికారము సంపాదించుకొంటా నన్నావు.’

‘అవును అన్నయ్యా, ఆమహాత్ముని పాదాలకడ సేవచేయుట నేర్చుకొని నా జన్మము సేవలో ఐక్యము సేయవలెనని నేను నిశ్చయించుకొన్నాను. నే నెంతవరకు తగుదునో? నే నందుకు తగుదునా అన్నా?’

‘నీవు అన్యధా తలచనంటే నే నొక ప్రశ్న అడుగుతాను.’ ‘’అన్నా! నువ్వేదన్నా నేను వేరభిప్రాయం పడగలనా?’ ఏలనో యామెకు గుండెలు ఝల్లుమన్నవి. ‘ఏమది? ఏమది?’

‘నా కల చెప్పనీ తల్లీ! ఇన్ని దినాలూ నాకు అనేకములగు ఆలోచనలు పుట్టుతున్నవి, నశించిపోతున్నవి. అద్భుతములు, ఆనందదాయకములు. దేశసేవ చేయ కంకణము కట్టుకొన్న విద్యావతి, బ్రహ్మచారిణిగా ఈ కాలములో, ఇట్టి పరిస్థితులలో జన్మ మెట్లు గడపుట? ఎంతటి వైరాగ్యహృదయులైనా, వైరాగ్యకర్ములైనా మానవులు తమ కెదురువచ్చు సైతాను, కామదేవుని భయంకరమైన తంత్రాలకు పడిపోతారు. క్రీస్తు, బుద్ధుడు, గాంధి మొదలగు అవతారపురుషులే అనేకములగు ఇబ్బందులతో ఆ పిశాచాల్ని జయింపగలిగారు. భగవద్గీత అందుకనే కర్మమార్గ ముపదేశించింది తల్లీ.’

శ్యామసుందరి నిస్తబ్ధయై యూరకున్నది.

‘నాస్వప్నం, నాఆశయం! ఇరువురు ఉత్తములు, దేశసేవ చేయదలచినవారు, ఏకపథ సంచారులు, విడివిడిగా వారి జీవితముల వేరుమార్గాల ప్రసరించనీక ఏకాశయ పూర్ణావేశులై భార్యాభర్తలై దేశసేవ ఏల చేయరాదు? అని. నువ్వు బ్రహ్మచారిణివిగా ఉండటం ఎంత కష్టముతల్లీ! మనము మానవులం. ఎంత ఉత్తములైనా ఏ దుష్టకాలములోనో ఈ దేహానికి దాసులు కావలసి వస్తుంది తల్లీ! అది దాటుటకు మార్గమే గృహస్థాశ్రమం అని చెప్పారు. నీబోటి ఉత్తమురాలికి సరియైన స్నేహితుడు చేదోడైయున్న నీ యాశయం మరింత సులభంగా పూర్తి అవుతుంది కాదూ?’

శ్యామసుందరి మాట్లాడలేదు. ఎట్టకేలకు, ‘అన్నా, నీ ఉద్దేశం రెండు మాటల్లో చెప్పు’ అన్నది.

‘నువ్వున్ను, రాజారావున్నూ ఏల మీ జీవితనౌకలు జంటచేసి ఈ సంసార జలధిలో మీ ఆశయానంద ద్వీపం చేరరాదు? ఇరువురికీ ఒకే ఆశయము. ఒకేవిద్య. ఇరువురు ఉత్తములు. పారలౌకిక విషయములం దాపేక్ష, మిక్కుటముగా గలవారు. ఒకరికొకరు సహాయం. మీ యిద్దరు దేశానికి సేవచేయడం ఎంత ఉత్తమం! ఆ స్వప్నం నేను ఎన్నిసారులో నిర్మించుకొన్నాను. స్వప్నములో ఆనందం పొందాను. ఏమంటావు?’

శ్యామసుందరి నిర్ఘాంతయై ఆశ్చర్యమానసయై కొంతసేపటికి చిరునవ్వు నవ్వి,

‘అన్నా! నువ్వు యింటికి వెళ్ళు. నేను ఆలోచించుకొని నీకు తంతినిస్తా. నీ ఉదారమగు మనస్సు నా కెప్పుడు అవగతమే అన్నా’ అని యామె కన్నీరు విడిచినది. నారాయణరా వామె తలపై తన హస్తముంచి, యామెకు నమస్కరించి యందరికడ సెలవు తీసికొని వెడలిపోయినాడు.

గోదావరి స్టేషనులో రాజారావు, లక్ష్మీపతి, వీరభద్రరావు, భీమరాజుగారు, సుబ్బారాయుడుగారు, జానకమ్మగారు, రామచంద్రరావు తల్లిగారు, రామచంద్రరావు స్నేహితులు, ఊరిలోని పెద్దలు రామచంద్రరావును ఎదుర్కొన్నారు. పూలమాలలు వేసినారు. రామచంద్రరావుమోము ప్రఫుల్లమయి పోయినది. అచ్చటనుండి అందరు కాకినాడ వెళ్ళినారు. కాకినాడ స్నేహితులు, ప్రముఖులు సామర్లకోట స్టేషనులో నెదుర్కొన్నారు. ఊరేగించెదమన్నారు. వలదని రామచంద్రరావెంత వారించినను, నారాయణరా వెంత ప్రార్థించినను కాకినాడ పురవాసులు రామచంద్ర రాయని నూరేగింపుచు, నాయన బసకడకు గొనిపోయిరి. కుమారుని నిర్బంధము, నారాయణరావు ప్రయత్నము, జమీందారుగారి సాయము భీమరాజుగారు, దుర్గమాంబగారు విని యెంతయు నానందించినారు. కుమారునకు ఖయిదు తప్పినదని యంతవరకు భీమరాజుగారు గాని దుర్గమాంబగారు గాని యెరుగరు. వారు సంతోషబాష్పములు విడుచుచునే యుండిరి.

దుర్గమాంబగారు కొడుకు విదేశములపా లయ్యెనను విచారమున కృశించి పోయినది. నేడామెకు వేయి యేనుగుల బలము వచ్చినట్లయినది. భీమరాజుగారు, సుబ్బారాయుడుగారు సంతోషమున కాలము పుచ్చిరి. రామచంద్రరావునకు గార్యము చేయుటకు పురోహితుని రప్పించి శుభముహూర్తము మరల నిశ్చయింపవలసి వచ్చెను.

జానకమ్మగారు దుర్గమాంబ గారిని కౌగిలించుకొని, తన ఆనందాశ్రువులు వియ్యపురాలి యశ్రువులలో గలిపి వేసినది.

రామచంద్రరావు భార్య పరీక్షలో విజయమందిన సంగతి తెలిసి యెంతయు సంతసించినాడు. శాంతి యేమిటో? ఇంకను కొన్ని వెఱ్ఱియాచారముల మనవారు వదలలేదు. అయినను దేనిలో ఏమర్థ మున్నదో? ఈలోన సూరీడును చూడరాదే! ఇక నెన్నిదినాలు ఆమెతో మాట్లాడుటకు? పదిహేను దినము లెట్లు? ఛీ! తానెంత వెఱ్ఱి వాడైనాడు!

మరచినాడు, రంగూనులో, జపానులో, అమెరికాలో, స్నేహితులందరికి గమ్మలు వ్రాయవలె. తా నెప్పుడును వారికి వ్రాయుచునేయున్నాడు. ఇంటికి జేరినట్లు వ్రాయవలె. లియోనారాకు సూరీడుచే నింగ్లీషున నుత్తరము వ్రాయించవలెను.

౨౧

సంబంధ నిశ్చయము

జగన్మోహనరావును సూర్ చంద్ – ప్రేమచందు కంపెనీవారు తమ అయిదువందల రూపాయల పైచిల్లర డిక్రీ బాకీకి చెన్నపురి వచ్చినప్పు డరెస్టు చేయించినారు. జగన్మోహనుడు అంతకంతకు అప్పులలో బడిపోయినాడు. ప్రతిచోటున బాకీలే, తన వివాహమునకే యనేక చోట్ల నప్పుచేసెను. సూర్ చందు కంపెనీ వారికి వేయిరూపాయలు బాకీపడి, అయిదువందలు తీర్చినాడు. తక్కిన అయిదు వందలు ఎన్ని సార్లడిగినను తీర్చలేకపోయినాడు. వారాతని జమీసంగతులు కనుగొని ముందుగా మేల్కొనుట మంచిదని, యాతనిపై సిటీ స్మాల్ కాజ్ కోర్టు (చిన్న న్యాయస్థానము) లో నభియోగము దెచ్చి డిక్రీపొందినారు. అప్పటికీ జగన్మోహనుడు లెక్క చేయలేదు. తన్ను నిర్బంధించగనే జగన్మోహనుడు తెల్లబోయినాడు. అప్పుడాతడు కారుమీద స్పెన్సరుహోటలునుండి జార్జిటవునులో విశాఖపట్నమునుంచి వచ్చిన డయానా యుండు మేడకు బోవుచుండెను. సూర్ చంద్ కంపెనీ వారి యుద్యోగి యొక్క మోటారు స్పెన్సరుహోటలు బయట న్యాయస్థానోద్యోగితో సిద్దముగానుండెను. శ్రీ జగన్మోహనరాయ బహద్దరు జమీందారుడు అద్దెకారు నెక్కిపోవుచుండ, దారిలో రౌండుటానా దగ్గర కారాగినది. వెనుకనే వచ్చుచున్న కారులో న్యాయస్థానోద్యోగివచ్చి నిర్బంధపు టుత్తరువు చూపించుటయు, జగన్మోహనరావు తెల్లబోయినాడు. అతనికి వెఱ్ఱికోపము వచ్చినది. సిగ్గుచే ప్రాణము చచ్చిపోయినది. పదిమందియు చుట్టును మూగినారు. ఆ సమయముననే నారాయణరావు ట్రిప్లికేనులో శ్యామసుందరితో మాట్లాడి యాలోచించుకొనుచు కారుమీద పోవుచున్నాడు. ఆ క్షణముననే పోలీసువారును ఇతరులును రెండుకారులు చుట్టు మూగియుండుటజూచి, ‘ఒక జమీందారుని బాకీకి అరెస్టు చేశారు’ అని ప్రజలనుకొనుమాటలు విని, కారాపు చేసి తా నా జమీందారుడు జగన్మోహనుడై యుండనోపునని గ్రహించి, చటుక్కున నక్కడికేగి యేమి సమాచారమని యడిగినాడు.

సంగతులన్నియు విశదముగా, నా యుద్యోగితో తాను మాట్లాడి అప్పు ధనమెంతయో తెలిసికొని తనకడ నా ధనము లేనందున హిందూస్థానీ బ్యాంకీకి చెక్కు నిచ్చెదనన్నాడు. సూర్ చంద్ కంపెనీ మనుష్యుడు నారాయణరావు గారి చెక్కు పుచ్చుకొని రశీదిచ్చెను.

ఎవరిదారినవారు వెడలిపోయిరి. జగన్మోహనుడు నిస్తబ్ధుడై, యేమి ఈ రాక్షసు డిట్లు చేసినాడు! అతనికడనే ధనమున్నదా? తనదగ్గర లేదా? తన్నవమానము చేయ నిట్లు చేసినాడు. తన కర్మము కాకపోయిన తనకీ నిర్బంధమును, నారాయణరావువలన నింత యవమానమును రానేల? నేడే ఆ ధన మెచ్చటనేని ప్రోగుచేసి నారాయణరావునకు పంపి వేయవలెను. వీడు వట్టి పంది. పంది గనుకనే భార్యయొక్క ప్రేమ చూరగొనలేకపోయినాడు. తనకెన్నో పనులుండి తీరుబడి లేకపోయినది కాని, శారద తన కౌగిలింతలకై యెదురుచూచు చుండవలసినదేకద యీపాటికి. సరే, వీడు తన్న వమానపరచినందులకు, వీని భార్యను పూర్తిగా వశముచేసికొనవలయును. తనకు వివాహమై నప్పటినుండియు ఆ విషయమున శ్రద్ధకలిగినదికాదు. తన మేనత్తగారి యింటికి కీలుపాకు వెళ్ళి, ఎవరెవ రెచ్చట నున్నారో తెలిసికొనవలయును. ఈమధ్య మేనత్తయు నామె భర్తయు కూనూరునుండి వచ్చెదరని తన తల్లికి తన మేనత్త వ్రాసినదికదా. అవును. శారద ఇక్కడనే యున్నదన్నారు. సరే తాను విశాఖపట్టణము వెళ్ళక పూర్వము శారదను గూర్చి కనుగొనవలయును. నారాయణరావు, రాజారావు, సుబ్బారాయుడుగారు, జానకమ్మగారు కొత్తపేట వెళ్ళినారు. దారిపొడవున నారాయణరావు ఏదియో యాలోచించుచునేయుండెను. రామచంద్రరావు ఇంటికి వచ్చినాడు. ముద్దుచెల్లెలగు సూర్యకాంతము భర్తను గలసికొనును. ఇక చెన్నపురిలో తానొక్కడు గాపురముండవలయును. కొత్తపేట వెళ్ళినపిమ్మట తన మదరాసు కాపురము సంగతి ఎట్లు తేల్చుకొనుట. శారదాదేవి తన ప్రియురాలై ప్రణయదేవతయగు సూచనలు ఎండమావులా? ఆమె హృదయము కరిగినదను సూచనలు తోచుచున్నవి. తన భావిస్థితి యెట్టిది? ఈ బ్రతుకుదారి ప్రయాణము ‘ఒంటరిగా ఉయ్యాల లూగుట’ యగునా? పూజించుటకైన, ఆ పరిమళము వహించని తన బ్రతుకుపూవు పరమ ప్రభున కంకితమియుటకైన తగునా?

ఒకసారి మనసార శారద దనతో మాటలాడినదా? కవోష్టమును, పరిమళపూరితము, నద్భుతానంద పూర్ణమును, సర్వసౌందర్యనిధియు నగు నా బాలికామూర్తి తన మెడచుట్టు బిగియార బాహువులు బిగించి, స్వప్నాల నీదులాడు ఆ వెడద నయనాలతో తన కన్నులలోనికి తనివోవ చొచ్చిచూచి, మాధురీ సర్వస్వములు సుడివోవు గులాబి మొగ్గలు, ఉభయసంధ్యారుణాలైన ఆ పెదవులతో తమివోవ, జన్మలు కరిగిపోవ ముద్దిడి తన దివ్యప్రణయినియై తన్ను చేరుట ఈ జన్మమునందున్నదో లేదో?

ఆనాడు జరిగిన మహాపరాభవము తన్ను దహించివైవనీక, తన్ను దుర్గమ హిమాలయ శీత శిఖరాలకు తరుమనీక, తన ప్రాణాల చిదిమివేయనీక, యేదియో యాశ ఈ నాటక మాడించుచున్నది. ఎంత కాలము దేవీ! జన్మరజ్జువునకు ఆఖరి సూత్రములు తెగువరకు నీ విటులుండుట?

ఇంటికి వచ్చునప్పటికి శ్యామసుందరి యుత్తరము వచ్చినది.

‘అన్నా! గంటలకొలది తరచి, తరచి యాలోచించితిని. ఇందులో అపారమైన ఈశుని కరుణజూచాను. నీవా ఈశుని వాక్కువు. నేను నీ యాజ్ఞకు బద్ధురాలను. నేను మీ స్నేహితుని ప్రేమించి ఎరుగను. నిన్ను మాత్రము నా ప్రియ సహోదరునిగా ప్రేమించి ఎరుగుదును. అయినను డాక్టరుగారు పూజ్యతములగు మహాపురుషులు. వారి సేవచేయుచు నా సర్వము వారి కర్పించుటకు నేను సిద్ధపడియున్నాను.

నీ ప్రియమగు చెల్లెలు,

శ్యామ’

నారాయణరా వానందపరవశుడైనాడు. ఇంక రాజారావును ఒప్పింపవలయును.

ఆ సాయంకాలము ఒంటిగా రాజారావును తోటలోనికి తీసికొని పోయినాడు. ‘రాజా! నీకు కొన్ని గంటలు ఉపన్యాసము లీయాలోయ్! నిన్ను సమూలముగా కదల్చివేసే సంగతులు మాట్లాడలోయ్!’

రాజారావు భార్య పోయినప్పటినుండియు శుద్ధ వైరాగ్యమూర్తియైనాడు. ఏదియో ధ్యానము, విరాగమూనిన నతడు, ఈ జన్మము వృథా, ఈ జన్మము పెద్ద ఓటమి అన్న నిట్టూర్పు. డాక్టరున కుండవలసిన శుచిత్వము మాయమయిపోయినది. ఎందరు చుట్టములు కోరినను, ఎందరు స్నేహితులు ప్రార్థించినను మరల వివాహము చేసికొనుట కొప్పకొనలేదు. తల్లిదండ్రులు దీనముగ వేడినారు. వారు కాకినాడనుండి వారి స్వగ్రామమునకు, నటు వెనుక కుమారుని దగ్గరకు బోయినారు. ఛాందసులు, పూర్వకాలపు వారు.

రాజారావుకు పట్టుదల మెండు; పూర్వచారము లేమియు గిట్టవు. తన కుమార్తెలిరువురు పుట్టినప్పుడు బారసాల చేసికొనలేదు. రెండవకొమార్తె కలిగినప్పుడు శాంతియున్నను జరుపలేదు. పురిటిళ్ళలోనికి, మాలవాని యిళ్ళకు వెళ్ళినను బట్టలు విడుచువాడుకాడు. అదియంతయు తల్లిదండ్రులు భరించలేక పోవువారు. అయినను లోక మెరిగినవారు, ఎన్నియో యాచారములు మారిపోవుట కనుగొన్నవారును గాన పుత్రుని ఇష్టమువచ్చినట్లు పోనిచ్చినారు.

పుత్రుడు వివాహము చేసికొననని ఖండితముగ జెప్పుటచే వారు కుమారుని పట్టుదల నెరిగినవారు గాన కార్యములేదని మిన్నకుండిరి.

నారాయణరా విది యంతయు నెరుగును. ప్రపంచములో రాజారావు హృదయము మార్చవలెనన్న మార్చుటకు శక్తిగలవాడొక్క నారాయణరావే, నారాయణరావన్న రాజారావు ఆనందమున మునిగి పోవును. రాజారావన్న నారాయణరావు పరవశుడగును. ఇరువురు పరమేశ్వరుడన్న ప్రాణమువిడిచెదరు. పరమేశ్వరునకు నీ ఇరువురు కుంభక రేచకములు.

‘రాజా! నువ్వు యోగివా?’

‘కాను.’

‘ఈ ప్రపంచము, ప్రపంచ వాసనను నంతయు వదలివేసి సన్యాసివి. కావలెనని కోరికయున్నదా?’

‘అదే పరమావధిగా పెట్టుకొన్నాను.’

‘ముసలితనములోనా?’

‘ఎప్పుడు అంతరాత్మ ఆజ్ఞాపించితే అప్పుడు సిద్ధముగా ఉంటాను.’

‘అంతవరకు?’

‘రోగి నారాయణ సేవ చేస్తూయుంటాను.’

అరవిందాది మహాయోగులు, రాధాకృష్ణాది తత్వవేత్తలు ఏమి చెప్పారురా సన్యాసమును గూర్చి?’ ‘సంపూర్ణముగా త్రికరణశుద్ధిగా వైరాగ్యము కలిగినగాని సన్యాసము పుచ్చుకొనవద్దని.’

‘సన్యాసము పుచ్చుకొనునంతవరకు ఏమి చేసినచో నీకు నీ అంతరాత్మ ఆజ్ఞ వినబడుతుంది?’

‘పరిశుద్ధమగు కర్మయోగ మాచరించినప్పుడు.’

‘కర్మయోగ మాచరించినప్పుడు నీ హృదయము పరిశుద్ధముగా నుండవలెనుగదా! నీవు చేయు వైద్యసేవలో, నీవు తిరుగు ప్రపంచములో నీ హృదయము పంకిలం కాకుండా ఉండగలవా?’

‘చెప్పలేను.’

‘చెప్పలేవు సరే, ధర్మమార్గాన నడిచే గృహస్థుకు మనస్సు చంచలమవడానికి సావకాశం ఉన్నదా? నువ్వు, నీ భార్య జీవించి ఉన్నంతకాలం సంసారం అనుభవించేవాడివికదా! నీ మనస్సు చలించ లేదా?’

‘చలించలేదని చెప్పలేను. ఇంద్రియాలకు తృప్తికలిగేది, అందుకని.’

‘తృప్తికలిగినా హృదయం చలించే వారున్నారు. చాలాబాగాఉంటూ ఎప్పుడో ఒకప్పుడు జీవితం పంకిలం చేసుకున్న వాళ్ళున్నారు. వారి మాట అటుండనిచ్చి జ్ఞానియై మంచిమార్గాన నడచి చివరకు సంపూర్ణ వైరాగ్యం పొందుదామని ఆశయం ఉన్నప్పుడు, అలాంటి ఆలోచనలు, ధైర్యమూ, పట్టుదలా, ఆశయంఉన్న బాలిక చెట్టబట్టాలని ఉన్నప్పుడు ఆ పురుషుడేల ఒప్పుకోకూడదు? అట్టివాళ్ళిద్దరూ కలిసి జీవిత ప్రయాణం ఏల సాగించకూడదు?’

‘అబ్బాయీ, నీ ఉద్దేశం స్పష్టంగా చెప్ప, కవిత్వం మాట్లాడకు.’

‘సరే, శ్యామసుందరీదేవీ, నువ్వూ వైద్యులు. ఆమె సద్గుణగరిష్ట. గాంధీ మహాత్ముని ఆశ్రమానికిబోయి యచ్చట మానవసేవ చేయుటకు బూనుకొంది. రోగినారాయణసేవే ఆమెకీ పరమావధి. బ్రహ్మచారిణియై కాలము గడుపదలచుకొంది. నువ్వు తెలిసినవాడవు. మహాత్ముల కావ్యా లెన్నేని చదివినవాడవు, నువ్వు వివాహం చేసుకోకుండా రోగినారాయణ సేవ చేయలేవు. పరిపక్వదశ వచ్చిన గాని సన్యాసం పుచ్చుకోలేవు. ప్రతి నిముషముచాటున, ప్రతి యింటి లోను స్త్రీ వాంఛ పొంచి నిన్ను కూలదోయడానికి ప్రయత్నం చేస్తూఉంటుంది కదా! శ్యామను నువ్వు వివాహం ఏల చేసుకోరాదు? ఇది నా కెన్నిదినాల నుండియో స్వప్నానందము ఇస్తూ ఉంది. మీ యిద్దరి వివాహము ఆంధ్రదేశానికి ఆశయం అవుతుంది. మీ వాళ్ళు నీ కడ్డం. అదొక్కటే నువ్వు ఆలోచిస్తావని నాకు తెలుసురా! అది నువ్వు నీ ధైర్యంచేత దాటాలి.’

‘నారాయణా! నువ్వు నన్ను ఆకాశంలో ఉండే ఒక పరమపురుషుడని అనుకుంటున్నావు. నేను నీకన్న నీచుడను. నా మనస్సు పాము మెలికలు తిరుగుతూనే ఉన్నది. నేను బ్రహ్మచర్యం చేద్దామని పెట్టుకున్న దెందుకంటే, నేను నా భార్యతో మోహావేశాన సంచరించే వాణ్ణి, అదే ఆమెను కొనిపోయిందని నా నమ్మకం. అబ్బా! ...... (అతని కన్నుల నీరు తిరుగుచున్నది) నేను పాపిని. ఇక అలాంటి పాపాలు చేయకుండా ఉందామని ... కాని నాలో నేను ఆలోచించుకొని, నా అంతరాత్మకు ఇష్టం అయితే, తప్పక నా తల్లి దండ్రుల ఒప్పిస్తాను....... నాకూ నీ ఆలోచనే తట్టింది, చెన్నపట్నంలో శ్యామసుందరిని చూచినప్పుడు. ఆమె నా బిడ్డలకు అద్భుతమైన తల్లి కాగలదు. దివ్యురాలైన సూరమ్మ తప్పక సంతోషిస్తుంది. నన్ను ఆలోచించనీ. నీ ఆత్మ నాఆత్మ ఇంత సామ్యమైనవి కాబట్టి ఒక ఓ ఆలోచన తట్టినది నారాయణా.’ అతని కన్నులలో నీరు ప్రవాహమయ్యెను. నారాయణుని కన్నులు చెమర్చినవి.

ఇరువురు శోకమును దాటిన మహదానందమున నా చీకట్లలో, నా చెట్ల నీడలలో దిక్కులలో కలసిపోయిరి.

౨౨

దుస్తంత్రము

రాజమహేంద్రవరము వచ్చినప్పటినుండియు వరదకామేశ్వరీ దేవికి మలేరియా జ్వరము పట్టుకొన్నది. రెండురోజులలో తగ్గిపోవునని జమీందారుగారు ఎంచినారు గాని, నాలుగురోజులైనను నూటమూడు, నూటనాలుగు డిగ్రీల జ్వరము వచ్చుచున్నది.

కొమార్తెలతో రావలసినదని ఇరువురల్లుళ్లకు తంతి వార్త లంపినారు.

ఆ రోజుననే నారాయణరావు, శారదయు రాజమహేంద్రవరం ప్రయాణమైనారు. విశ్వేశ్వరరావుగారును, శకుంతలయు వచ్చినారు.

నారాయణరా వత్తగారికడకేగి, కుశలప్రశ్న చేసి, యామె నాడిజూచి, జ్వరము నూటనాలుగుండునని యంచనా వేసికొనెను. కొయినామందు గుప్పుచున్నారు. నారింజ, బత్తాయిరసము, బార్లీజావ యిచ్చుచున్నారు.

ఆమె ఏలనో నీరసించిపోయినది. రాజమహేంద్రవరములో జమీందారు గారి కొక పూర్వకాలపు వైద్యుడున్నాడు. ఆయన ఎం. బి. సి. ఎమ్. పరీక్ష నెగ్గి, యుద్యోగము చేసి, యుపకార వేతనము పుచ్చుకొనుచు రాజమహేంద్రవరములో వైద్యము ప్రారంభముజేసెను. ప్రప్రథమమున మంచి వేద్యము నేర్చినవాడే, పేరు పొందినవాడే. నేడు వృద్ధసింహమువలె కోరలులేకున్నాడు. క్రొత్త గ్రంథము లేమియు చదువడు. క్రొత్త పత్రికల పారజూడడు. కొత్త మందుల జోలికి బోడు.’

నారాయణరా వాతని వైద్యమునకు బలమాపాదింప సంకల్పించి మామగారితో మఱిమఱియు దెల్పి రాజారావును రప్పించినాడు.

రాజారావు నాలుగురోజులు మలేరియాతో కుస్తీపట్టి అటెబ్రన్ బ్లాస్మో క్విన్ ఇచ్చి, నీలరక్తధమనిలోనుండి క్వినయిను మందు పొడిచి ఇచ్చినాడు మూడుసార్లు. బలమునకు వరదకామేశ్వరీదేవికి తెలియకుండ కోడిగుడ్లలోని తెల్లసొన చిలకరించి బత్తాయిరసములో ద్రాక్షరసము పంచదార కలిపి యిప్పించినాడు. నాలుగురోజులయిన వెనుక జ్వరము తగ్గిపోయినది. రాజారావు తగు సలహాలు, మందులు చెప్పి యమలాపురము వెళ్ళిపోవ సిద్ధమై, జబ్బు నిమ్మదించిన రెండురోజులకు పథ్యము పెట్టించి వెళ్ళిపోయినాడు.

పరిచారిక లెందరున్నను, బీదచుట్టములు చాకిరి చేయువా రెందరున్నను, రేయింబవళ్ళు అత్తగారి మంచముకడ కూర్చుండి మందులిచ్చియు, నాహార మిచ్చియు జ్వరాంశాలు చూచి వ్రాసికొనియు, శుశ్రూష చేసినాడు నారాయణరావు. అతని చేయి తనతలపై పడినప్పడు వరదకామేశ్వరికి ప్రాణము లేచివచ్చి హాయిగ నిద్దురపట్టినది. అతనిమాట ఆమెకు జోలపాట అయినది. అత డెదురుగ కూర్చుండియుండ పథ్యము వంటపట్టినది.

జ్వరతీవ్రతలో ఒడలు తెలియక పడియున్నప్పుడు వెనుకటి నారాయణరావును తిట్టినది. జగన్మోహనుని పొగడినది. శారద నెత్తుకొనిపోయిన రాక్షసుడని వచించినది. నారాయణరావు నవ్వుకొనుచు ‘ఇదియా రహస్య’ మనుకొని యాశ్చర్యపూరితుడగుచు, నెమ్మదిగ యూడికొలోనులో గుడ్డలు తడిపి నుదుటిపై వేయువాడు.

ఆనాటి అల్లుడు వేఱు, ఈ నాటీ అల్లుడు వేఱా! అని కనులు విప్పి వరదకామేశ్వరి ఆశ్చర్యమున మునిగి యల్లునిజూచి యానందించినది. అతడు దగ్గరలేనపుడు జ్వరపు నిద్దురలో నుండి మెలకువ వచ్చినచో ‘నారాయణరావు!’ అని నెమ్మదిగ బిలుచునది.

ఒకనాడు జమీందారు గారు భార్యకడ కూర్చున్నారు. ఆమెకు నూట అయిదంశముల జ్వరము వచ్చినది. ఒడలు పేలిపోవుచున్నది. జమీందారుగారు హృదయమున భయముతో భార్య మంచముపై గూర్చుండినారు. రాజారావు ‘ఏమి ఫరవాలేదండీ’ యన్నాడు. మామగారికి ధైర్యము చెప్పి నారాయణరావు భోజనమునకు బోయినాడు.

ఒడలు తెలియక పరుండియున్న వరదకామేశ్వరీదేవి కనులు తెరచి, భర్తను జూచి, ‘అల్లుణ్ణి పిలవండి’ అన్నది. జమీందారుగారు చకితులై, కన్నుల జలము స్రవింప నవనతవదను డయ్యెను.

ఇదివరకు నారాయణరావును అల్లుడని చెప్పుకొన్నది లేదు. ఈ నాటికి, ఈమె బాగుపడి పదిమందిలో మరల నడచునా?

రాజారా వది గ్రహించి ‘అయ్యా! ఇంతకన్న ఇక ఎక్కువరాదు. ఇంతకూడా ఇక రానేరాదు. ఇంక వారంరోజులలోపల ఆమెకు పూర్ణముగా నెమ్మదిస్తుందండి. మలేరియాయే. పోనీ రక్తము పరీక్ష చేద్దామంటే, ఇప్పడు క్వయినా యిచ్చుటవల్ల వీల్లేదు.’ ‘చెమటలు పట్టడం, క్వినయిను ఇంజెక్షను ఇవ్వగానే జ్వరము తగ్గడం, దాని మొగముమీద కనబడుతూనేఉంది. మనం లోపలకు, అటెబ్రేను, ప్లాస్మోక్వీను కాంపౌండు ఇస్తూనే ఉన్నాము’ అన్నాడు.

ఇంతలో నారాయణరావు వచ్చి అత్తగారికడ కూర్చుండెను. ఆమె మరల కన్నులుతెరచి అల్లునిపై చేయివైచి నిదురబోయినది. పదినిముషములకు జెమటలుపట్టి జ్వరము నెమ్మదిగా నూటరెంటికి దిగిపోయింది.

కేశవచంద్రుడు భయమున బెదురు చూపుతో దల్లికడకు వచ్చువాడు.

‘బావా! అమ్మకి బాగా నెమ్మదిస్తుందిలే. నువ్వేమి అధైర్యపడకు. ఎనిమిదేళ్ళ కుర్రాడివి ధైర్యంగా ఉండాలి’ అని నారాయణరావనగనే యాతడు ‘నువ్వుంటే మా అమ్మకు తప్పకుండా నెమ్మదిస్తుందండి బావగారూ’ అనుచూ ఆ బాలుడు శకుంతలా శారదలు వారి మేనత్తయు, ఇతర స్త్రీలు కూర్చున్న చోటికి వెళ్ళి ‘చిన్నక్కా! చిన్నబావ లేకపోతే అమ్మకు జబ్బు నెమ్మదించదు సుమా. బావను వెళ్ళిపోవద్దని చెప్పు’ అనెను. శారద సిగ్గుపడినది. శకుంతల ‘నిజము నాన్నా! యని యాతని జేరదీసి కౌగిలించుకొని ముద్దిడుకొన్నది. ముద్దిడినచోట తుడుచుకొన్నాడాతడు.

శకుంతలయు, పిల్లలును నారాయణరావుకడ అతిచనువైనారు, ‘చిన్న బాబయ్యగారు’ అని ఒకటేపాట.

జర్వమునుండి తేరినపిదప జమిందారిణి నారాయణరావును తనకు బూర్తిగా బలము పట్టువరకు నుండుమని కోరినది. మరి నాలుగురోజులు నారాయణరా వచ్చటనుండి అత్తగారు లేచి తిరుగుచున్నప్పు డందరి సెలవునంది కొత్తపేట వెళ్ళిపోయినాడు.

జ్వరములోనే జగన్మోహనరావు మేనత్తను జూచుటకు వచ్చినాడు. జ్వరమురోజులలో నప్పుడప్పుడు వచ్చి యామె క్షేమ మరయుచుండువాడు. అతడు శారదను తన మోహపాశములలో నిమిడ్చి బంధించుట యెట్లని యెత్తులు వేయుచుండెను. శారదతో నాతడన్ని సమాచారములు మాటలాడుచుండెను. తన మేనత్త జబ్బుసంగతి మాట్లాడుచు శారదకు ధైర్యము చెప్పుచుండెను. శకుంతలయు, జమీందారుగారును ఉదాసీనభావముతో నాతనితో మాట్లాడువారు. లోన హృదయము కోపదగ్ధమగుచుండ నారాయణరావుతో జగన్మోహనరావు ‘మీ లెక్క కొద్దిరోజులలో బంపెదను లెండి’ అని యనెను.

‘అదేమిటండీ అన్నగారూ! మీరు ఏమి పంపవద్దు. ఏదో మీకా సమయాన దగ్గరలేకపోవడంచేత, తుంటరులు అల్లా చేశారు. దానిమాట తలపెట్టకండి సుమా! పంపిస్తే తిరగకొట్టుతానండోయి!’ యని నవ్వినాడు.

‘నే నన్నగారిని, ఆ దున్నపోతు నాకు తమ్ముడు! ఓహో! మంచి హాస్యము (జోక్)’ అని గొణుగుకొనుచు జగన్మోహనుడు శారద యేదో నవల చదువుకొనుచు తనగదిలో గూర్చుండ, నచటికి వెళ్ళినాడు.

‘ఏమిటి చదువుచున్నావు శారదా?’ ‘లే మిజరబ్లే.’

‘ఏమిటీ!’

‘ఈమధ్యే హ్యూగో కవి రచించిన నవలలు చదువుట ప్రారంభించాను.’

‘హ్యూగోకేమిగాని, అలెగ్జాండరు డ్యూమాసు, వెల్సు నావెల్సు చదివినవా?’

‘డ్యూమాసు మాంటిక్రిష్టో చదివాను.’

అక్కడున్న నవలల నన్నియు నాతడు పరికించి చూచినాడు. అన్నియు మంచిరకమువి. బంగారు బైండు, మొరాకో తోలు, చక్కని కాగితములుగలిగి ‘శారదకు – నారాయణరావు‘ అని వ్రాసియున్న గ్రంథములే.

ఏమిటి, నారాయణరావుకు టేస్టుగూడా ఉన్నది! అచ్చా! ఈ యపహాస్యమంతకన్న నంతకన్న నెక్కువగుచున్నదే అని యాత డనుకొనెను.

నారాయణరావు వెళ్ళినవెనుక, జగన్మోహనుడు శారదహృదయము సంపూర్ణముగ లాగివేయ ప్రయత్నములు చేసెను. తంతిమీద నిరువదిరూకల ఖరీదుగల ఒమారుఖయ్యాం గ్రంథము తెప్పించి బహుమతియిచ్చెను. ఆమెతో నవలల గురించి, ఇంగ్లీషు కవిత్వమును గూర్చి చర్చ ప్రారంభించెను. ఇప్పు డింగ్లీషుభాషలో వెలువడు కవిత్వమే నిజమయిన కవిత్వము అని యొక గ్రంథమును చూపెను.

అందు స్త్రీ పురుష సంబంధ క్రియలన్నియు రహస్యములేక వర్ణింపబడి యున్నవి. శారద ఆశ్చర్యపడి ఇది నాకు వలదని తిరిగి ఇచ్చివేసినది. ఎంతయో అసహ్యించుకొన్నది.

వారమురోజులు శారదను బొగడినాడు. మెచ్చుకొన్నాడు. నీవు ఇంగ్లీషు భాషలో కవిత్వము వ్రాయుమన్నాడు. సంగీతము పాడుమన్నాడు. ‘సరియైన ఉన్నత కుటుంబములవారు గాని సంగీత తత్వం గ్రహించలేరు శారదా. కంసాలి నగలు చేస్తాడు. ధరించేవాళ్ళం మనం. ఆడవాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. మొగవాళ్ళలో తక్కువజాతి వాళ్ళు నేర్చుకోవాలి అంతే’ అని యాతడన్నాడు.

శారద కొంచెము విసుగుపడినది.

వారిద్దరు వివిధవిషయములు చర్చించినారు. సంగీతము, చదువు, ఆంధ్రవిశ్వవిద్యాలయం; ఆ చర్చలలో నొకసారి జమీందారుగారు, విశ్వేశ్వరరావుగారుకూడ పాల్గొన్నారు.

జమీం: ఏది ఎట్లయితే ఏం, బెజవాడ వదలి విశాఖపట్టణం వెళుతోంది.

విశ్వేశ్వరరావు: తెలుగుదేశానికి ఎంతో దూరాన పెడితే ఎలాగండి? కడప, కర్నూలు, బళ్ళారి, అనంతపురం వాళ్లూ మా నెల్లూరి వాళ్లూ గోల.

జగ: విశాఖపట్టణం సముద్రతీరం, కొండలు ఉన్నాయి. విశాఖపట్టణం ముందు ముందు ఆంధ్రదేశానికి రాజధాని అవుతుంది. రేవు కట్టుట మొదలు పెట్టారు. అల్లాంటిచోట ఉండగూడదా ఏమిటి? విశ్వే: ఒక మారుమూలకు ఎల్లా వెడ్తారు?

జమీం: ఇప్పుడేం చేయగలము? మా రాజమండ్రి వాళ్ళు కొంచెం తగలేశారు. కాని చాలా బాగా వృద్ధిఅవుతోంది ఆంధ్ర విశ్వవిద్యాలయం.

మేనత్తకు జ్వరము నెమ్మదించిన పదిరోజులకు జగన్మోహనరావునకు వీలయిన కాలము దొరికినది. విశ్వేశ్వరరావుగారు, జమీందారు రెండురోజులై వెళ్ళిపోయినారు. శకుంతలకు నీరాడు ప్రొద్దులు వచ్చుచున్నవి.

శారద జగన్మోహనునితో జనవుగా దిరుగుచున్నది. చనవుగ మాట్లాడుచున్నది. ఆ సమయములో ఆమెకు హుషారు పుట్టించి, ఆమెను కౌగిలించుకొని ముద్దిడుకొనవలయును. మోమోటముచే, దనకున్న చనువుచే, ప్రథమమున నామె కొంత యడ్డము పెట్టినను తన మోహమున నామె కరిగిపోవలయును.

ఆహా! ఏమి యీ బాల యందము! నవమోహనాంగి. ఇంత అందకత్తె యైనదే! ఈ యందానికి సాటియే లేదు. ఆమె యవయవములన్నియు నేదోషము లేక గ్రీకు దేవత వీనసువలె నున్నవి. ఈమెతో మోహానందపు లోతు నెరుంగని నాడు తన జన్మ వృథా!

ఆ సాయంకాలము శారదతో దాను భోజనమునకు ముందులేచి, తక్కిన యందరు భోజనము చేయుచున్నప్పుడే, మేడపై శారద గదిలో ... తాను పరిపూర్ణమగు సంతోషము ననుభవింపవలె.

ఆ రోజు జగన్మోహనుడు తనకున్న తెలివినంతయు జూపెను. హార్మోనియముపై ఇంగ్లీషు పాటల వాయించుచు పాటల బాడెను. నాట్యమాడుట చూపెను. శారద సమ్మోహనాస్త్రపీడితయైనట్లు, సర్పమునుజూచి చేష్టలుడిగిన మండూకమువలెని స్తబ్ధయై మెలంగినది. సాయంకాల మేడుగంటలకు నారాయణుడు కారులోనుండి దిగినాడు.

౨౩

చెంపపెట్టు

నారాయణరా వత్తవారింటినుండి వచ్చిన వెనుక నమలాపురం వెళ్ళి రాజారావును గలిసికొన్నాడు.

నారాయణా! నేనెంతో యాలోచించితిని. తల్లిదండ్రుల అయిష్టతకు లెక్కచేయను. పూర్ణముగ నాలో వాంఛ జనించినదేమోయని క్రుంగిపోవుచున్నానోయి!

‘ఓయీ, వెఱ్ఱివాడా! వాంఛా? మన యీ అల్పజీవితములో సరియైన మార్గాన్ని నడచినట్లయితే వాంఛే ఉన్నతమైంది అవుతుంది. నీ భార్యకానున్న యామెను వాంఛించుట ఎలాటితప్పు? సరే యిష్టపడ్డావు. నీకు ప్రేమసంతోషం మాటలచేగాక చేతలచే చూపిస్తే సిగ్గు, అయినా నిన్ను కౌగిలించుకొంటున్నా!’ యనెను. నారాయణరావు హృదయం వేయిపాలసముద్రముల మునిగినట్లయినది. తత్ క్షణమే యాతడు శ్యామసుందరీదేవికి బెద్దయుత్తరము వ్రాసినాడు. వా రిరువురు రాజారావు తల్లిదండ్రుల నొప్పించు మార్గ మాలోచించుకొనిరి. వేదోక్తప్రకారము వివాహము సలుపుట యుత్తమ మనుకొన్నారు. చెన్నపురిలో శ్యామసుందరీదేవి గారి కుటుంబమును నారాయణుని యింటిలో బెట్టి యచ్చట వివాహము సేయుట లెస్స యని నిర్ధారణ జేసికొన్నారు. కొన్నిదినము లాగి అనేక విధముల వాదనలు చేసి, అనునయించి రాజారావు తల్లిదండ్రులను, రాజారావు శ్యామసుందరీదేవుల వివాహానికి ఒప్పించినాడు నారాయణరావు.

నారాయణరావునకు దన లాయరువృత్తి యేమియు నచ్చలేదు. మొదటినుండియు నాతడం దేమాత్రము నిష్టములేకయే చేరినాడు. నేడు తండ్రి ‘బాబూ! ఈ సంపాదనంతా ఎవరు తింటారు? నేను అవధ్యుడనైనాను. ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు. నువ్వువచ్చి యిచ్చట ఉండవలసినదనిన్నీ, నీ చిత్తం వచ్చినట్లు జాగ్రత్తగా సంచరించవలసినదనిన్నీ నాకోరిక. పెద్దవాడు దగ్గరే ఉంటాడు. నేనింక కృష్ణా రామా అంటూ కాలక్షేపం చేస్తాను. పూర్తిగా వానప్రస్థుణ్ణేకద! మన దక్షిణపు తోటలో ఉన్న యింటిలో నీ తల్లీ, నేను తపస్సు చేసుకుంటూ ఉంటాము. బ్రతికి ఉన్నంతవరకూ నీకూ, అన్నయ్యకూ భగవంతుడు నాకు శక్తి యిచ్చినంతవరకు సహాయం చేస్తాను’ అన్నాడు.

రామచంద్రరావు, సూరీడు పరమప్రణయములో ఆకాశపథాల విహరింపనున్నారు. తా నా చెన్నపురి నుండుట యెందులకు?

కొత్తపేటలో నొక విద్యాశ్రమము పెట్టినచో? తండ్రి దక్షిణపు తోటలో వానప్రస్తుడై యుండెదనన్నాడు. తమకు వచ్చు రాబడిలో నెలకు నాలుగువందలిచ్చుట సులభము. తండ్రిగారి, అన్నగారి అనుమతి తప్పక లభించును.

బ్యాంకిలోనున్న నాలుగులక్షలలో, నేబది వేల రూకలు ఆశ్రమమునకని ఇచ్చి. అది రిజిష్టరు చేయించి, యందువలన వచ్చు నాదాయమున ఏల నా యాశ్రమము వృద్ధినొందింపరాదు? తండ్రిగారు సకలకళాసంపన్నులు, భాషా కోవిదులు. ఆయన ముఖ్యాచార్యులుగా నుందురు గాక.

అనుకొనుట తడవుగా నారాయణరావు రాజారావునకు, బరమేశ్వరమూర్తికి, శ్యామసుందరీ దేవికి, లక్ష్మీపతికి తంతుల నిచ్చెను. పరమేశ్వరమూర్తి భార్యతో, శ్యామసుందరీదేవితో మరునాడు భోజనము వేళకువచ్చెను. ఆ సాయంకాలము లక్ష్మీపతియు, రాజారావును కొత్త పేట వచ్చిరి.

రాజారావు ‘ఏమి రా నీవల్ల నా పనికి భంగము వస్తూఉంది’ అని అన్నాడు.

‘ఓయి అబ్బాయి, నీపనికి పూర్తిగా అడ్డువచ్చేపని చేస్తూఉన్నాను కాసుకో. నేను ఇక్కడ మహా విద్యాదానం ఇచ్చే ఆశ్రమం పెట్టదలచుకొన్నాను. పరమాత్మారాధన, దేశారాధనముఖ్యాశయములు, పురుషోత్తమునిలో ఐక్యమందు ఉత్కృష్ట కర్మమార్గము మనము అనుసరిస్తాముగాక. నేను వృత్తి మానేస్తున్నాను. రాజారావు, శ్యామసుందరి, పరమేశ్వరమూర్తి, లక్ష్మీపతి, నేను ఆ ఆశ్రమంలో ఆచార్యులం. నాకు మనదేశంలో పూర్వకాలంనుంచీ వస్తూఉన్న ఆయుర్వేద వైద్యంలో మందులన్నీ పరీక్షించి, దానిలోని గుణ గణాల్ని నిర్ధారణ చేసే పని చేద్దామని యున్నది.

‘ఆశ్రమానికి సంబంధించిన వ్యాపారాలన్నీ లక్ష్మీపతి చూస్తూఉంటాడు గాక. పరమేశ్వరుడే కవి, చిత్రకారుడు. ఇంకో కవిని, పండితుణ్ణి ఎవరినన్నా పట్టుకువద్దాము. నేను సంగీతము చెప్తాను. ఇంకో సంగీతపాఠకుణ్ణి తీసుకొనివస్తా. నాట్యం చెప్పే ప్రతిభావంతులైన ఆచార్యులను వెదకుదాం.

‘మా నాన్నగారు సర్వవిద్యాదక్షులు. పారలౌకిక విషయాలయందు మన కందరికీ గురువు అవుతారు గాక! మీ అభిప్రాయాలు ఏమిటో చెప్పండి.’

అందరు చాల సంతోషించిరి. ఆశ్రమాన్ని గూర్చి కష్టనిష్ఠురము లాలోచించిరి.

ఇంతలో స్నేహితులతో రాజారావు శ్యామసుందరీదేవుల వివాహపు సంగతులు నారాయణరావు చెప్పినాడు. లక్ష్మీపతియు, పరమేశ్వరుడును సంతోషస్వాంతులై రాజారావును, శ్యామసుందరిని అభినందించిరి.

శ్యామసుందరీదేవి చిరుసిగ్గున తలవాల్చుకున్నది. పరమేశ్వరు డప్పుడు మంగళగీతముపాడి వారిపై పూవులు చల్లినాడు. వారందరు సారాయణరావుతో నింటికి పోయినారు.

శ్యామసుందరీదేవి కొత్తపేటలో కొలదిరోజులుండి, తర్వాత ప్రేమపూర్వకముగ సూరీడును కౌగిలించుకొని, ‘నీవు భర్తను గలియు శుభముహూర్తాన నేనుండుటకు వీలులేదు, చెల్లీ’ యన్నది.

అందరికడ సెలవుతీసికొని శ్యామసుందరి చెన్నపట్నము ప్రయాణమైనది. పరమేశ్వరుడు, నారాయణరావు, రాజారావు, లక్ష్మీపతియు, శ్యామసుందరిని సాగనంపుటకు రాజమహేంద్రవరము వెళ్ళిరి. నారాయణరావు అత్తవారింటికి వెళ్ళి అత్తగారి ఆరోగ్యము సంగతి కనుగొనివచ్చెదనని చెప్పి యచ్చటకు బోయెను. తక్కిన వారందరు భోజనమునకు లక్ష్మీపతి గారియింటికి బోయిరి.

నారాయణరావు వచ్చుటయు జగన్మోహనునకు ఆపరానికోపము వచ్చినది. శారద తనతో భోజనము చేయుటకు వీలుండదు. శారద, జగన్మోహనుడును వెండియాకులలో ఒకేసారి భోజనమునకు గూర్చుండిరి. భర్తవచ్చినాడని విని శారద చిరునవ్వున లేచి మందహాసమున మొగమంతయు వెలిగిపోవ తన గదిలోనికి బోయినది.

అత్తగారు అల్లుడు వచ్చినాడను సంతోషమున, అల్లుని శారదకు వడ్డించినచోట గూర్చుండ నేర్పాటు చేసినది.

బ్రాహ్మణు డందిచ్చిన వేడినీటిచే స్నానమాచరించుచుండ శారద తువాలీయ నారాయణుని కడకు వచ్చినది. అతడా తువా లందిపుచ్చుకొనుచు, ‘శారదా, భోజనమైనదా?’ యని ప్రశ్నించినాడు. అట్లు ప్రశ్నించుట కాతనికి సిగ్గుపొడమినది. అత్యవసరమగు పనియున్న గాని శారద నాత డిదివరకు ప్రశ్నింపలేదు.

ఏదియో పరమానందము శారదను ముంచివేసినది. ఆ ఆనందమునకు కారణము భర్తరాకయని యామె గ్రహించినది. ఏమికోర్కె తోచినదో భర్తకడకు తువాలు పట్టుకోని పరతెంచినది. గొంతుకను హృదయము చిందరవందరచేయ,

‘లేదు. మీతో కూర్చుండవచ్చునా?’ యని జవాబిచ్చినది.

ఈ బాలిక శారదయేనా!

‘తప్పక. మన యిద్దరికి వేరే వడ్డించే యేర్పాటుచేయి. శ్యామసుందరి వచ్చి వెళ్లిపోవుచున్నది. రాజారావుకూ, ఆమెకూ సంబంధం నిశ్చయంచేశాము. ఆమెను అభినందించడానికి వస్తావా భోజనాలైనాక, రైలుకు సాగనంపనూ వచ్చును?’

‘శ్యామవదినకు పెళ్ళా! డాక్టరన్నగార్ని పెళ్ళి చేసుకుంటున్నదా? చాలాబాగుంది. దబ్బున భోజనంచేసి వెళ్ళి శ్యామవదినను కౌగిలించుకోవాలి.’

శారద లోనికి రెండంగలు వేసినది. ఆమె మోము ప్రఫుల్లమైపోయినది. నారాయణుడు దివ్యహాసము వెలుగ అక్కడకు నవ్వుచు వచ్చి శకుంతలందిచ్చు పట్టుబట్టను కైకొనినాడు.

‘ఏమండీ మరదిగారూ! కొత్తపేటలో అందరూ క్షేమంగా ఉన్నారా?’

‘ఉన్నారండీ! శారదకూ, నాకూ వేరే వడ్డించేఏర్పాటు చేయండి.’

ఇదేమిటి! చెల్లెలినిగూర్చి ఏ సందర్భమునను తనమరది ఇట్లు మాట్లాడుట తానెరుంగదు. శారదయు భర్తయన అంత అనురాగయుక్తయని యామె కెన్నడును దోచలేదు. కాని కుమారస్వామివలె నున్న ఈ ఉత్కృష్ట హృదయుని ప్రేమించని మానవుడుండగలడా? ఈయనవంటి వాడు భర్తయైనచో యే యమ అతని పాదములు కొలువక ఒక్క నిమేషము ఉండగలుగును?

శారదకు, నారాయణరావునకు వేరుగా నింకొక చోట వడ్డించినారు. శారదను సిగ్గును, కాంక్షయు ఒక్కసారే ముంచివేసినవి. తన భర్తకంచమున పెండ్లిలోనైన దాను తినలేదు. ఆయన ఎంగిలియే తా నెరుగదు. ఆయనతో గలసి ఒకేకంచాన భుజింప నామెకు గాఢవాంఛ కలిగినది. అది గ్రహించినాడో యనినట్లు నారాయణరావు ప్రాణము లుగ్గబట్టి, తన కెక్కువయినవని మామిడిపండుముక్కలు రెండు తన కంచముకడనున్న వెండి బాదము ఆకులలో నొక దానినుండి తీసి యామె వెండియాకులో వేసినాడు. ఆమె అతనివంక సాభిప్రాయియై చిరునవ్వు నవ్వుచు చూచి ఆ ముక్కలను మనసులో కళ్ళకద్దుకొని భుజించినది.

భోజనము లైనవి. శారద నిముషములో చక్కని వేషము వేసికొనినది. కారులో భర్తప్రక్కనే యధివసించి, ఏదియేని వ్యాజంబున నాతని నంటుచు గుండె దడదడలాడ ఆనందలహరీస్నాతయై తేలికొనిపోవుచున్నది. ‘శ్యామవదిన ఎప్పడువచ్చింది?’

‘మొన్న కొత్తపేటవచ్చింది. అక్కడే సంబంధం నిశ్చయం చేశాము. సూరీడు గంతులు వేసింది. నువ్వు బి. ఏ. లో, ఆమె ఎఫ్. ఏ. లో ఒకేసారి చేరాలి శారదా!’

శారదను శ్యామసుందరి కౌగిలించుకొనినది. నారాయణుని చెల్లెలికడకుపోయి ‘వదినగారూ, మాయింటికి ఎప్పడూ రారేమండి’ యని అడిగినది.

‘నువ్వు మాయింటికి యింతవరకు వచ్చావా వదినా? దొంగమ్మాయివి.’

‘రేపటినుంచీ రోజూ వస్తూఉంటానండీ.’

రెండుకార్లమీద అందరును బయలుదేరి రాజమహేంద్రవరం స్టేషనుకుబోయిరి.

‘రాజారావు తాను కూడా చెన్నపట్నం వెళ్ళకూడదురా నారాయుడు? దగ్గిర ఉండి రాబోయే మరదళ్లను, అత్తగారిని, బావమరదినీ వాళ్ళనూ తీసుకు రావచ్చుగా’ అన్నాడు పరమేశ్వరుడు.

‘ఫస్టురా! పరం’ అని నారాయణుడు.

‘చాలా బాగుంది’ లక్ష్మీపతి.

అందరును ఎంతయో మంచిదనిరి.

వారిద్దరికి రెండవతరగతి టిక్కెట్లు కొని జత సీటుల రెండవతరగతి పెట్టెలో నెక్కించినారు. శ్యామసుందరి శారదను హృదయాని కద్దుకొని ‘తల్లీ, నీ భర్త భగవంతుని అనుగుచెలికాడు. దివ్యుడు. నీ అదృష్టం తల్లీ! ఆయన్ని సర్వవిధాలా పూజచేయి’ అని యామె చెవిలో చెప్పి, శారదను చెక్కిళ్ళపై ముద్దులు గొనెను. శారద అప్రయత్నముగ శ్యామను మరల కౌగిలించి ‘వదినా, నీభర్తా దివ్యుడేసుమా! నా దగ్గరకు వస్తున్నావు. ఎంతో సంతోషంగా ఉంది, త్వరగా రా! అందర్నీ అడిగాను.’

రైలు కదలినది. నారాయణుడు, పరమేశ్వరుడు, శారదయు జమీందారుని ఇంటికి వచ్చినారు. రెండవకారులో లక్ష్మీపతి తన ఇంటికి బోయినాడు. జగన్మోహనునకు మతిలేదు. శారద చేతికి చిక్కినటులే చిక్కి ఇంతలో నా పరమ చండాలుడు వచ్చుటవలన జారిపోయినది. ఆ పశువునకు రసగ్రహణశక్తి యెక్కడున్నది? అతనికి ఆవేశ మెక్కువయైనది. రెండు మెతుకులు నోటిలో యెటులనో వేసికొని ఈవలకు వచ్చినాడు. అతని యొడలు వేడెక్కియున్నది. అతని తమస్సు సర్వాంగాలను సంపూర్ణముగ ఆవహించినది. అతనికి శారదాదేవి మోము, జవ్వనము, సౌందర్యముమాత్రమే ఆ చీకటిలో నుండి తళుక్కుమని మెఱయుచున్నవి.

ఇంతలో శారదయు, నారాయణరావును, పరమేశ్వరుడును కారునుండి దిగి లోనికి విచ్చేసిరి. భర్తను వెన్నంటివచ్చు శారదను చూచి జగన్మోహనుడు రౌద్రముచే కంపించిపోయినాడు.

శారద తిన్నగా లోనికిబోయి కాలిజోడులు విడిచి వంటింటిలో భోజ నముచేయు తండ్రిగారికడ కూర్చున్నది. ఆమెకు జగన్మోహనుని జూడగనే భయమువేసినది. తనదగ్గరకు జేరు పూజ్యపురుషుడగు భర్త నాతడు నెడముగా తరిమివేయడుగదా? ఆమె కుంచించుకొనిపోయి తండ్రికడనే ఒక పీటపై చతికిలపడియెను.

జమీందారుడు: (భార్యను జూచుచు) ఇందాక కాకినాడలో ఇద్దరు స్నేహితులు ఏవోసంగతులు నీ మేనల్లుణ్ణిగురించి చెప్పారు, ఎవరో కంపెనీ వారు ఇతన్ని బాకీకోసం అరెస్టు చేశారుట. ఆ సమయంలో నీ చిన్నల్లుడు బాకీడబ్బు ఇచ్చి నీ మేనల్లుణ్ణి వదిలించాట్ట!

‘ఎప్పుడండీ?’

‘మొన్న మనం వచ్చేటప్పడే. ఆ రోజు మనం అక్కడే ఉన్నాము సుమా! నారాయణరావు అప్పటికీ ఇప్పటికీ ఎవరితోను చెప్పలేదు. ఏమి గొప్ప హృదయం అతనిది!’

‘మా మోహనుడు ఇలాతయారయ్యాడేమిటి! అతిదుష్ట సావాసము చేస్తాడు.’

శారద ఈ మాటలన్నియు ఆశ్చర్యమునొందుచు విన్నది. భర్తను దలచుకొనుటయు నామె కన్నులు తళుక్కున కాంతిమంతములైనవి. ఆయనకు తీరని అవమాన మామె తెచ్చిపెట్టినది. ఎట్లు తాను ఆయనకు గల్పించిన బాధను నివారింప చేయగలదు? తన పాపానికి నివృత్తి ఉన్నదా?

భర్తను గురించిన యాలోచనలు తీపులై మధుర వేదనాకారణములై, ఆనందపూర్ణములై విషాదమిశ్రిత సంతోషయుతములై హృదయమును ఇట్టిటు ఊపివేయుచుండ పులకరించు హృదయముతో శారద తనగదిలోనికి బోవుచు మేడమెట్లకడ కేగ బయలుదేరినది.

అచ్చట పిల్లివలె, ఘూకమువలె, రాక్షసునివలె జగన్మోహనుడు పొంచియున్నాడు. లోని మేడమెట్లుండినహాలులోని విద్యుద్దీపములు ఆర్పినాడు. కాని పక్కహాలులోని దీపాల వెలుగుమాత్రమున్నది. అతిడక్కడనే పొంచియున్నాడు.

అత్తరువులతో ఆతడు ఘుమఘుమ లాడిపోవుచున్నాడు. ఉల్లిపొర పట్టు లాల్చీ, ఉల్లిపొరపట్టుపంచె ధరించి అతడు సర్వసౌందర్యములు సేకరించిననని పొంచియున్నాడు.

అతడు గోడపైనున్న తెల్లని బల్లివలె నున్నాడు.

అతడు మూలను వలపన్నుకొని అనేకములైన కన్నులతో జూచుచు పొంచియున్న సాలీడువలె నున్నాడు.

ఆ సమయమున ఆ దారిని మేడమీదికి శారద తక్క నింకొక్కరు పోరని యాత డెరుగును.

దీపము లారియున్న వేమి యని గాని, ఏదియో ఘుమఘుమ సువాసనలు వెదజల్లుచున్న వేమి యనిగాని, ఎవరో యస్పష్టముగ మెట్లప్రక్క నిలుచుండి యున్నారని గాని శారదకు దెలియదు. ఆమెకు హృదయములో నారాయణరావు, బయట మోహవ్యాధుడు మోహనుడు.

ఆమె మెట్లు సమీపించినది. ఆత డామెను జేరినాడు.

‘శారదా? అని వినబడని ధ్వని.

‘ఎవరు!’ అని చకితయై శారద.

‘నేను, ప్రణయేశ్వరీ! నీ బావను.’

అత డామె భుజముపై చేయి వేసినాడు. ఆమె మూర్తిని ముట్టుటతోడనే యాతని ఒళ్ళు వేడెక్కినది. అతడు మోహావేశియైనాడు. శారదను గట్టిగా అదుముకొని కౌగిలించుకొన్నాడు.

ఆమె భయాశ్చర్యములకు లోనై మాటలాడలేకపోయినది. ఆత డామె మూర్తిని మరియు దన ఒడలికి అదుముకొన్నాడు.

ఆమె వ్యాఘ్రముకడ చేష్టలుడిగిన లేడియైపోయినది. జగన్మోహనుడు ఆమె మోము వెనుకకువంచి ఆమెను ముద్దుపెట్టుకొనబోయినాడు. ఆ చీకటిలో ప్రేతముఖమున అతని కన్నులు చింతనిప్పులవలె కణకణలాడుచున్నవి. ఆమె అతని ముఖము తన ముఖముకడకు రానీక చేతులుపెట్టి వెనుకకు నెట్టినది.

అత డామెచేతులు కుడిచేత బలవంతముగ నొత్తిగించి ఆమె పెదవుల కడకు తన పెదవులు జేర్చబోయినాడు. ఆతని నిట్టూర్పులు తన మోముపై బ్రసరించుటయు శారద మహాశక్తియైనది. ఒడలు కంపింప నొక్క ఊపున యాతని కౌగిలి సడలించి, యాతని రొమ్ముపై ఎడమచేయి వైచి నెట్టి, కుడిచేత జగన్మోహనుని చెంపపై ఫెళ్ళున నొక్క పెట్టు పెట్టినది.

అతడు తలతిరుగ తూలి, తెల్లబోయి, మేడ మెట్లకఱ్ఱలనాని తన్ను నిలుపుకొన్నాడు.

శారద చరచర మేడమెట్లెక్కి తన గదిలోనికిబోయి పందిరమంచముపై మేనువాల్చి క్రోధము సడల అవమానము తలచుకొని వెక్కి వెక్కి యేడ్చినది.

శారద చెంపపెట్టు కొట్టు సమయముననే యచ్చటకువచ్చిన మషాల్చీపోతిగాడు ఆదిచూచి ‘ఏమి ఈ వెధవయ్య నాతల్లి శారదపై చేయి వేయుటయె! మంచి పరాభవము చేసింది నాతల్లి’ అని కోపముతోపోయి దాటిచిట్టితో చెప్పినాడు.

దాదిచిట్టి పోయి శకుంతలతో నిది వర్ణించినది. ఆమె రౌద్రమూర్తియై చెల్లెలికడకు బోయి ‘తల్లీ వాడేమిచేశాడే’ యని యడిగినది. శారద దుఃఖ మాపుకొని కోపమురా లేచి యక్కతో జరిగినది చెప్పినది. శకుంతల క్రిందకు దిగి తల్లితో నంతయు జెప్పి, తల్లిరా చరచరనడచి, తన గదిలోనికిబోయి సోఫాపై నధివసించియుండి చెంప సవరించుకొను చున్న జగన్మోహనుని చూచి ‘ఏమోయి! నీ సంగతి బాగుండలేదు. నువ్వు ఇంక మా ఎవరిఇండ్లకు రావద్దు. పొద్దున్నే మెయిలుకువెళ్ళు. మాతో ఎవరితోను చెప్పనక్కరలేదు!’ అనియన్నది.

జగన్మోహనుడు అవమాన రోషాలతో చటుక్కున లేచి సామాను సర్దించుకొని, కారుపై తత్ క్షణమే స్టేషనుకు వెడలిపోయినాడు. 

౨౪

ప్రేమమహాతరంగిణి

సూర్యకాంతమునకు శుభముహూర్తము నిర్ణయించిన శుభదినమువచ్చినది.

సుబ్బారాయుడు గారి చుట్టములందరు విచ్చేసిరి. దొడ్డమ్మపేట నుండి తటవర్తి వారి జ్ఞాతులందరు వచ్చినారు. జమీందారుగారి కుటుంబము యావన్మందియు నరుదెంచినారు. సుబ్బారాయుడుగారి యిల్లు, మేడయు కిటకిటలాడిపోయినది.

దక్షిణపుతోట బంగాళా జమీందారుగారి కుటుంబమున కేర్పరచినారు. పగలంతయు నిచ్చటయుండి వారు రాత్రి యచ్చట విశ్రాంతితీసికొందురట.

పగలు శాంతి జరిగినది. రాత్రి శుభముహూర్తము జరిగినది.

సూర్యకాంతము మోము దివ్యజ్యోత్స్నల వెలిగిపోయినది. రామచంద్రుడు అనిరుద్ధమూర్తియైనాడు.

వారి ప్రేమ దిశల ప్రసరించినది. సర్వరాగాల మాధుర్య మేచికొన్నది. ఆ దంపతుల పొదివికొని, తన గర్భాన దాచికొన్నది.

సూర్యకాంతము సంజ్ఞాదేవివలె సర్వరాగరంజితయై, సూర్యునివలె వెలుగు రామచంద్రుని ఆవరించినది.

శారదా హృదయము నవనీతమై కరిగినది.

సూర్యకాంతమును తేల్చిపోవు ఆనంద శైవలిని యామెను సుడిచుట్టినది.

ప్రేమచే నుదయమున గుమ్మడిపండావుదూడ, బొమ్మవలె ముద్దులు గులుకుచు, స్ఫటికశిలా శిల్పాకారమై, వెండిగంటలు నననన ధ్వనులీన గంతు లిడుచుండ నారాయణరా వా దూడ నెత్తుకొని మూర్థము పుణికినాడు. గంగిగోవగు గుమ్మడిపండావు నారాయణరావుకడకు వెఱ్ఱి ప్రేమతో గంతులిడుచువచ్చినది.

‘గోవు మాలచ్చిమికి కోటిదండాలు’ అనుకొనుచున్నాడు నారాయణరావు.

ఆ ఆవు ఉప్పొంగుచు నారాయణరావును సమీపించుచున్న యపుడు శారద చూచినది. భర్త నా ధవళనందిని పొడు చునన్న భయముతో ‘అయ్యో!’ అనుచు భర్తకు, నా ధేనువునకు మధ్య వెళ్ళినది. ఆ ఆవు పక్కకు తప్పుకొన్నను శారదకు తగులుటవలన యామె పడిపోయినది.

నారాయణరావు భయమున నా దూడ నచ్చట వదలి వెనుకకుతిరిగి పడిపోయి లేవబోవు భార్యను పూలమాలవలె నెత్తుకున్నాడు. సుడిగాలివలె యామె నదిమి వేసినాడు. ‘ఏమి దెబ్బతగల లేదుగద?’ యని భయపూరిత స్వరాన నాతడు ప్రశ్నించెను. భర్త కౌగిలింతలో పారవశ్యమందిన శారద కనులు మూతపడ హాయియను ఆనంద మధురిమమునకు మధురిమమైనది.

‘శారదా! శారదా,’ అతని మాట విహ్వలస్వరపూరిత మైనది. అది శారదకు పంచమస్వరమైనది.

ఆమె నవ్వుచు కన్నులుతెరచి, అతని కౌగిలిలోనుండి సిగ్గువచ్చు వ్యంజనమున కదలి ‘దెబ్బ తగలలేదండి’ యని అస్పష్ట మధురవాక్కుల బలికినది.

నారాయణుడామె నట్లనే లోనికిగొంపోయి మంచాన పరుండబెట్టెను. చల్లాలు నారాయణరావుతో ‘మిమ్ము ఆవుపొడుస్తోందనుకొని శారదమ్మగోరు అడ్డమెళ్ళారండి’ యన్నది.

నారాయణరావు కనులు చెమర్చినవి. అతని కంఠమున దీపులు డగ్గుత్తికయైనవి.

సాయంకాలము నారాయణరావు తన గదిలోనికి బోయినాడు. ఆ గది యతి మనోహరముగ నలంకరింపబడియుండుట చూచి ఇది ఏమియని యక్కజబడినాడు. ఇంతలో శారదయు, సూర్యకాంతమును అక్కడకు వచ్చినారు.

సూర్యకాంతమును, శారదను జూచి నారాయణుడు వేరొండు మార్గమున నంతర్హితుడైనాడు.

ఆ యోషామణు లిరువు రాగది నింకను రమ్యముగ నలంకరించినారు. నారాయణరావు సముపార్జించిన చిత్రములను, శిల్పములను, గంధపు బొమ్మల నచ్చటచ్చట నుంచినారు. చక్కని తెరలమర్చినారు. బల్లలపై తమలపాకులూ, పోకలు మొదలైనవియు, ఉపాహారములను, ఫలములను అందం దమర్చినారు.

సుబ్బారాయుడుగారు శారదను భోజనములవేళ జూచినారు. నేడామె మోమింత పూర్ణానందవికసితమైనదేమి? తన గర్భశుక్తి ముక్తాఫలము, సంధి పరిగ్రాహి, తనకు పేరుదిద్దు నారాయణుని హృదయ మీనాడు గనుగొన్నది యీ బాల! బిడ్డలారా సుఖింపుడు. సుబ్బారాయుడుగారి దీర్ఘబాహువు మనఃపథమున నాశీర్వాదపూర్వకముగ నెత్తబడినది.

జమీందారు గారు తనయను జూచినాడు. ఆమెలోని ప్రేమవాహిని తళుక్కుమని యాతని హృదయాన జొచ్చినది. “శారదా! నా ముద్దు తల్లీ! నీకై దేశాల గాలించి సేకరించిన నాయకమణిని నీ తల ధరించుకో! అది అతి పవిత్రమైనది. అదిగో నారాయణరావు తేరిచూడరాకున్నా డు.”

నారాయణరావు రాత్రి పదునొకండు గంటలు దాటినవెనుక తన పడక గది చేరినాడు. శారద మంచముపై దివ్యరూపయై నిదురబోవుచున్నది.

రెండవమంచము లేదు. ఆ గది ఆకాశపథ గామియగు సుందరతర విమానమువలె నున్నది.

తల్పముపై శారద శయనించియున్నది. గంగానదీప్రవాహముల తేలియాడు శ్వేతహంసివోలె ఆమె పవళించియుండ, దుకూలాంబర రేఖిఖామూర్తిని అలలై తేల్చుచున్నవి ఆమె దివ్య సౌందర్య తేజఃపుంజము. ఒక ప్రక్కకుతిరిగి తలక్రింద లలిత లవంగీ సుందరమగు బాహువు నుపధానమొనర్చి ఆమె మోహన భంగిమారూపమై యందు బరుండియున్నది.