శ్రీరస్తు
నారసింహపురాణము
ఉత్తరభాగము
ప్రథమాశ్వాసము
శా. |
శ్రీమహిళాంతరంగసరసీజనభోమణి యాదవాన్వయ
గ్రామణి సర్వదైవతశిఖామణి యాశ్రితభక్తలోకవాం
ఛామణి శాంబరీమృగదృశామణి వేంకటశైలరాజర
క్షామణి ప్రోలుగంటి నరసప్రభురంగనం బ్రోచుఁ గావుతన్.
| 1
|
చ. |
మరుని జయించియు న్మరల మచ్చిక వచ్చి ప్రసన్నమూర్తి యై
గిరిజకు మేను జాహ్నవికిఁ గెంజడలుం దగ నిచ్చి నిచ్చలు
న్సురతసుఖప్రసంగతులఁ జొక్కెడుశంభుఁ డొసంగుఁగాత భా
స్కరసమతేజుఁ డైననరసప్రభురంగన కీప్సితార్థముల్.
| 2
|
సీ. |
చిలుకతోఁ దేనియ ల్చిలుకంగఁ బలుకుచు ముద్దాడు నేవేల్పుముద్దరాలు
తనతనూరుచిధారఁ దనరుచందురుడాలు వారించు నేవేల్పువారువంబు
మధురసం బానించి మధులిహంబుల కింపుపుట్టించు నేవేల్పుపుట్టినిల్లు
కల నన్నమాత్రానఁ గలకల నగుచు నానందించు నేవేల్పునందనుండు
కల్పితాఖిలలోకైకవేల్పు వేల్పుఁ, బెద్ద నలువ కృపాసముపేతదృష్టి
గలితయగుఁ బ్రోలుగంటి రంగప్రధాన, శేఖరున కాయురభివృద్ధి సేయుఁగాత.
| 3
|
చ. |
నరసురవంద్యుఁ డౌకమలనాభునురఃస్థలి నున్న మాడ్కిఁ గి
న్నరసముదాయభర్తసదనంబున నిల్చినవైఖరిం బ్రసూ
నరసమిళచ్ఛరాసను ననన్యజుఁ గన్నపయోధికన్య యీ
నరసయరంగమంత్రిభవనంబున వేడ్క వసించుఁగావుతన్.
| 4
|
ఉ. |
అంబ నిజాంఘ్రిపద్మవినతాఖిలదేవకదంబ చారువ
క్త్రాంబుజవైరిబింబ లలితాలకనిర్జితనీలనీలరో
లంబ సమగ్రమంగళవిలాసకళానికురుంబ ప్రోచు నే
య్యంబునఁ బ్రోలుగంటి నరసాధిపురంగయమంత్రిపుంగవున్.
| 5
|
చ. |
కలకలఁ గేలిచిల్క పలుకం బలుకం దళుకొత్తునెమ్మితోఁ
బులకల మేను దేలగిలఁ బొంగుచు బంగరువీణెఁ దానపుం
గులుకులు రాల్చి నల్వఁ జనుగుబ్బలతాకునఁ జొక్కఁజేయు నా
పలుకులకల్కి నిచ్చలును బాయక నామది నిల్చుఁగావుతన్.
| 6
|
మ. |
హరుఁ డంకంబున ముద్దుసేసి తను బాలార్పంగఁ దన్మస్తకాం
తరవిన్యస్తమృగాంకరేఖ బినసూత్రం బంచు లో శంక నొం
ది రతిం దుండము సాఁచి పట్టి తివియన్ దీకొన్నదానోల్లస
క్కరిరాజాస్యుఁడు మత్ప్రబంధమునకుం గావించు నిర్విఘ్నముల్.
| 7
|
సీ. |
వల్మీకసంభవవ్యాసభట్టారకకాళిదాసుల వేడుకల భజించి
భవభూతిశివభద్రబాణమయూరుల ఘనతరవాక్యవైఖరులఁ బొగడి
మలహణక్షేమేంద్రమాఘభారవిభాసదండిచోరులకు వందన మొనర్చి
హర్షసౌమిల్లమురారిసుబంధులఁ బటుభక్తిఁ దలఁపులోఁ బాదుకొలిపి
యసమయశులు నన్నపాచార్య తిక్కన, యాయజూకు లెఱ్ఱయప్రధాన
వర్యుఁ డాడిగాఁగ నహికి నెక్కినమహా, కవుల నాశ్రయించి గరిమ గాంచి.
| 8
|
క. |
ఇప్పటి దుష్కవు లొకకృతి, చెప్పంగా లేరు గాని చెప్పినకృతులం
దప్పులు పట్టను బ్రహ్మలు, మెప్పింపఁగ వశమె వారి మృడునకు నైనన్.
| 9
|
వ. |
అని యిష్టదేవతాభివందనంబును మహాకవీంద్రాభివందనంబును గుకవినిం
దనంబునుం గావించి సకలసుకవిజనశ్రావ్యంబుగా నొక్కకావ్యం బేను రచి
యింప నుపక్రమించుసమయంబున.
| 10
|
సీ. |
తనమండలాగ్ర ముద్దండారిమండలభూధరంబులకు దంభోళి గాఁగఁ
దనకృపారసము బాంధవసేవకాశ్రితోద్యానసీమకు వసంతంబు గాఁగఁ
దన చక్కఁదనము కాంతామనశ్చంద్రకాంతములకుఁ జంద్రికోదయము గాఁగఁ
దననీతివర్తన ధారణీజనచాతకంబుల కభ్రాగమంబు గాఁగ
వెలసె నేరాజు సముదగ్రబలసమగ్ర, కమఠకర్మద భుజపీఠగమితధరణి
యతఁడు నందెలసరసింగయాంతరంగ, తామరసహేళి చినయోబదానశాలి.
| 11
|
శా. |
ఆరాజన్యశిఖావతంసచతురాశాంతావనీచక్రభృ
ద్ధౌరంధర్యుఁడు శత్రునిర్మథనవిద్యాశాలి లీలావతీ
మారాకారుఁడు ప్రోలుగంటి నరసామాత్యాత్మజుం డార్యర
క్షారంభుం డగురంగమంత్రి యొకనాఁ డాత్మీయగేహంబునన్.
| 12
|
సీ. |
హితులు సామంతులు సుతులు దాయాదులు నృపులు బాంధవులు మనీషివరులు
పౌరాణికులు రాయబారులు సుకవులు వందిమాగధులు దైవజ్ఞమణులు
దొరలు పురోహితు ల్దుర్గాధినాథులు మంత్రులు గణికులు మాన్యజనులు
భటులు వారస్త్రీలు నటులు నాటకు లాదియగునియోగములెల్లఁ దగినయెడల
వరుసతోఁ గొల్వ వైభవస్ఫురణ మెఱసి, యెలమిఁ గైసేసి రెండవయింద్రుమాడ్కిఁ
గొలువుసకలంబుఁ జెంగల్వకొలనిఁ బోలఁ, గొలువు గూర్చుండి హరికథాగోష్ఠి దవిలి.
| 13
|
క. |
ననుఁ బిలువఁబనిచి యర్ధా, సనమున నుపవిష్టుఁ జేసి సన్మానములం
దనియింది చిఱునగవు మొగ, మున నీరికెలొదవ వినయమున ని ట్లనియెన్.
| 14
|
సీ. |
విను రాఘవమనీషి హనుమత్కృపానరలబ్ధకవిత్వవిలాసమహిమ
దనరి యేకాదశద్వాదశస్కంధము ల్దెనిఁగించె మీతండ్రి ధీయుతుండు
హరిభట్టు నిఖిలవిద్యాచతురాస్యుండు రాజమాన్యుఁడు కవిరాజనుతుఁడు
నారసింహపురాణపౌరస్త్యభాగంబుఁ జెదలువా డెఱ్ఱన మొదలుసేయఁ
బ్రతిభ దళుకొత్త నుత్తరభాగ మిప్పు, డంధ్రభాషను వచనకావ్యం బొనర్చె
నాప్రబంధంబు నాపేర నంకితముగ, నీవు గావింపవలయుఁ గవీంద్రగణ్య.
| 15
|
క. |
కృతము మనినసత్పురుషులు, కృతులవలనఁ గాదె భువినిఁ గీర్తి గని మహా
కృతకృత్యు లైరి గావునఁ, గృతి దక్కఁగ నొండు కీర్తి హేతువు గలదే.
| 16
|
వ. |
అని సకర్పూరవీటికాశాటికాలంకారపేటిక లిచ్చినం బరిగ్రహించి.
| 17
|
క. |
మిసిమిగలపసిఁడి[1]పుయిదకు, వసుదేవజముద్ర దొరకువడువున నస్మ
ద్రసవత్కవితాయువతికి, రసికుం డగుప్రోలుగంటి రంగన గలిగెన్.
| 18
|
వ. |
అని పరమహర్షోత్కర్షంబున నంగీకరించి యేతత్ప్రారంభంబునకు శోభనాచా
రంబుగాఁ దదీయవంశావతారం బభివర్ణించెద.
| 19
|
సీ. |
గాధినందనతపోగాధపయోధి పార్ష్ణిద్వయద్వయస మేనియతమతికి
నింద్రసన్నిభహరిశ్చంద్రాదిభూపతుల్ శిష్యు లై మెలఁగి రేశీలఖనికి
యోగీశవాఙ్మనసాగమ్యతత్త్వంబు కరతలామలక మేపరమమునికి
సకలవిద్యావిశేషజ్ఞానసారంబు హృదయస్థ మేవిజితేంద్రియునకు
నతఁడు ఫణివరకుంభజన్మాబ్జమిత్ర, నివసనోచితదండకుండీజపాక్ష
వలయుఁ డమరాదినుతతపోబలముకలిమి, జయముపూని[2] యరుంధతీజాని వెలయు.
| 20
|
క. |
ఆమునిమణికులజలనిధి, సోమునికైవడి జనించె సురుచిరవిభవో
ద్దాముఁడు సమధికసమర, స్థేముఁడు నౌ ప్రోలుగంటి తిప్పన ధాత్రిన్.
| 21
|
శా. |
ఆమంత్రీంద్రుఁడు ప్రౌఢరాయనృపదండాధీశసంపత్కళా
సామగ్రి న్విలసిల్లి మల్లి సుమ భాస్వత్కీర్తివిస్ఫూర్తి ను
ద్దామాసాధ్యమహోమహత్త్వమున సంధాయుక్తి దోశ్శక్తి వా
చామాధుర్యమునం బురావిభులతో, జర్చించు నర్చస్వియై.
| 22
|
క. |
అరుదంద లోకమాతని, బిరుదందియఁ గీలుకొన్నభీకరశత్రూ
త్కరములకు ననుదినంబును, సొరిది న్సమకూరు భోగసుకృతఫలంబుల్.
| 23
|
సీ. |
కదలనిభక్తితోఁ గట్టించెఁ బంపావిరూపాక్షదేవునిగోపురంబు
విఠ్ఠలపతికిఁ గావించి యర్పణచేసె మహనీయతరభోగమంటపంబు
మాల్యవంతము రఘుక్ష్మావధూభర్తకు ఘనకిరీటం బుపాయన మొసంగె
దరిసెనంబిచ్చె[3] మతంగవీరన్నకు[4]2 గట్టాణిముత్యాలకంఠమాల
బ్రాహణుల నిల్పె నగ్రహారములయందు, దిక్కు లన్నింటఁ గీర్తులు పిక్కటిల్ల
వెలసె దుర్మంత్రిసంఘాతవిభవజాత, తిమిరకుముదారి యగుచు నాతిప్పశౌరి.
| 24
|
చ. |
అతనికి భామినీతిలక మై నుతికెక్కినభైరవాంబకు
న్సుతు లుదయించి రిద్దఱు యశోరమణీయచతుర్దిగంతరు
ల్వితరణచాతురీజితరవిప్రభవామరధామధేనువు
ల్కుతలకనత్పురందరులు కొండనమంత్రియు నాగశౌరియున్.
| 25
|
ఉ. |
నిండినవేడ్కఁ దేగవహి నిల్పినబంగరుకొండ నాఁగ భూ
మండలి నెల్లవారు బహుమార్గముల న్వినుతింప నశ్వవే
తండవినూత్నరత్నసముదంచితకాంచనముఖ్యవస్తువుల్
కొండని తిప్పయప్రభుని కొండన యర్థుల కిచ్చు నిచ్చలున్.
| 27
|
గీ. |
వాడు నిర్మలనిజవంశవర్ధనుండు, వాఁడు బాంధవసముదాయవత్సలుండు
వాఁడు దేవేంద్రసన్నిభవైభవుండు, వానిఁ బోలఁ బ్రధాను లివ్వసుధఁ గలరె.
| 28
|
సీ. |
ఘోరాహవక్షోణి గుంది ధైర్యము దూలి కురురాజు మడుఁగులోఁ జొరకయున్న
జీవనస్థితి చౌకగా వానరములచే వడిసముద్రుఁడు గట్టువడకయున్నఁ
బోరిలో నడుఁకుచుఁ బూని ధర్మతనూజుఁ డాచార్యుతోఁ గల్లలాడకున్నఁ
బురహరనేత్రవిస్ఫురదనలాహుతిఁ గంతుఁ డనంగుండు గాకయున్న
|
|
|
జగతిపై మానగాంభీర్యసత్యరూప, గరిమలను గొంక యెనవత్తు రరసి చూడ
శ్రీశపాదాబ్జసేవాసమృద్ధుఁ డైన, మంత్రి తిప్పయకొండనామాత్యునకును.
| 29
|
క. |
ఆకొండమంత్రిమణికి శు, భాకృతిఁ జెన్నొందుమల్లమాంబకు రామ
శ్రీకృష్ణులగతిఁ బుట్టిరి, ధీకలితులు సరసవిభుఁడు దిమ్మఘనుండున్.
| 30
|
ఉ. |
కొండయదండనాయకునికూరిమితమ్ముఁడు నాగరాజు మా
ర్తాండుఁ డఖండతేజమున నంబుజవైరి సమగ్రకాంతి నా
ఖండలమూర్తి భోగమునఁ గర్ణుఁడు దానమునన్ లతాంతకో
దండుఁడు రూపసంపదల ధైర్యమున న్సురశైల మారయన్.
| 31
|
క. |
ఆనాగమంత్రివరునకుఁ, బ్రాణపదం బైన దేవమాంబకు దానే
దానీంతనకానీనుం, డోనాఁ దగి చెన్నశౌరి యుదయము నొందెన్.
| 32
|
సీ. |
ఆమంత్రిపుంగవుం డష్టభాషాకవివర్యుఁడై పొగడొందె వసుధయందు
ద్విపదగా నారసింహపురాణ మొనరించి భక్తి నహోబలభర్త కిచ్చె
బాలభారత మంధ్రభాషను వచనకావ్యంబు చేసెను గవీశ్వరులు మెచ్చ
సౌభరిచరితంబు జక్కులకథ చెప్పే లాలితననరసాలంకృతముగ
మఱియుఁ బెక్కుకృతు ల్పటుమతి రచించె, ఖ్యాతి నరసింగరాయలచేతఁ గొనియె
నగ్రహారంబులును వివిధార్థములును, వెలసె గొండమఁ బెండ్లియై విభవమెసఁగ.
| 33
|
క. |
ఆచెన్నయమంత్రికిఁ బు, ణ్యాచారకుఁ గొండమాంబ కంచితనీతి
న్వాచస్పతితుల్యుఁడు వి, ద్యాచతురాననుఁడు నరసనాఖ్యుఁడు పుట్టెన్.
| 34
|
గీ. |
తిప్పయామాత్యు కొండమంత్రికిని బుణ్య, సాధ్వి యగుమల్లమాంబకు సకలభాగ్య
సహితులై యుద్భవించిన మహితకీర్తి,హారు లగునారసింహతిమ్మాఖ్యు లందు.
| 35
|
సీ. |
శ్రీమదహోబలస్వామిపాదాబ్జము ల్మరగించినాఁ డాత్మమధులిహమును
దానాంబుధారల ధారణీసురదైన్యకర్దమపుంజంబుఁ గడిగినాఁడు
సత్కీర్తిమల్లికాసౌరభ్యములను వైరించాండపేటి[5] వాసించినాఁడు
చండప్రతాపమార్తాండమండలిచేత ధూర్తారితుహినంబుఁ దోలినాఁడు
ప్రణుతి యొనరింపఁ దగదె నృపాలసభలఁ, బరమభాగవతోత్తము భవ్యచరితుఁ
జారుతరపుణ్యగణ్యు నీసకలదండ, నాథకులసింహుఁ గొండయనారసింహు.
| 36
|
మ. |
పరకాంతామణిఁ దల్లిగా మనమున న్భావించు నేవేళ నె
వ్వరితో బొంకఁ డొకప్పు డన్యధనము ల్వాంఛింపఁ డశ్రాంతమున్
|
|
|
హరినామస్మరణంబె కాని యితరవ్యాసంగముల్ సేయఁ డా
నరసామాత్యునిసాటి యౌదురె ప్రధానశ్రేణిలో నెవ్వరున్.
| 37
|
క. |
నారదుఁ బ్రహ్లాదు న్శుకుఁ, బారాశర్యు న్వసిష్ఠు బలి గాంగేయుం
గోరి వినుతించువేళల, ధారణిలో నరసమంత్రిఁ దగు వినుతింపన్.
| 38
|
సీ. |
ఆనరసామాత్యుఁ డద్రినందనతోడ నలయరుంధతితోడ నదితితోడ
భూమిజతోడ లోపాముద్రతోడ నాజాహ్నవితోడఁ గౌసల్యతోడ
ధారణీకాంతతో భారతీసతితోడఁ బౌలోమితోడ సుభద్రతోడ
రుక్మిణీరమణితో రోహిణీదేవితో దమయంతితోడ గాంధారితోడ
సాటిసేయంగఁ దగినట్టి జలరుహాక్షిఁ, బరమకళ్యాణిఁ దిరుమలాంబను వరించి
రమ్యమగుప్రోలుగంటిపురంబునందుఁ, దనరె సౌభాగ్యముల బంధుజనులు వొగడ.
| 39
|
క. |
శ్రీదనర ననుదినంబును, మేదురభోగముల చేత మించిన వేడ్కన్
మేదినిలోపల వెలసిన, యాదంపతులకును బంధు లానందింపన్.
| 40
|
సీ. |
నెత్తమ్మితావిఁ జెందినపద్మినీజాతికొమ్మల కతనుండు తిమ్మఘనుఁడు
బంధువర్గంబులభవనాంగణంబుల వెలయువేలుపుఁదిప్ప వెంగళప్ప
వెలలేనివస్తువు ల్విద్వత్కవీంద్రుల కొసఁగుదానవిహారి యోబశౌరిఁ
నందేలచినయోబనాథహృద్వీణకు రంగుమీఱినతంత్రి రంగమంత్రి
చండమార్తాండసదృశుండు కొండవిభుఁడు, దిశల సత్కీర్తిచంద్రికల్ తేజరిల్ల
జనన మొందిరి కల్పవృక్షంబు లేను, బురుషరూపము ధరియించి పుట్టెననఁగ[6].
| 41
|
గీ. |
అందు నగ్రజుఁడైన తిమ్మాహ్వయుండు, ప్రేమతో లక్ష్మమాంబను బెండ్లియాడి
కుశలవులఁ బోలువారల విశదయశుల, సింగనను మాదనను గాంచెఁ జెన్ను మీఱ.
| 42
|
క. |
ఘనుఁ డైనవెంగళప్పయు, నొనరంగాఁ దిమ్మమాంబ నుద్వాహం బై
దిననాథప్రతిమప్రభు, జననుతచారిత్రు, సూరసచివుని గనియెన్.
| 43
|
చ. |
ఉరుతరపుణ్యగణ్యుఁ డగునోబయమంత్రియు గోపమాంబ నం
బురుహదళాయతాక్షిఁ బరిపూర్ణనిశాకరసన్నిభాననం
బరిణయమై చెలంగి కులపావనుల న్మహనీయవైభవ
స్థిరులను గాంచె నిర్వురను జెన్నచమూవరుఁ దిమ్మనాహ్వయున్.
| 44
|
చ. |
ఘనతరుఁ డైనదానగుణగణ్యుఁడు రంగనదండనాథుఁ డా
వననిధిరాజకన్య కెనవచ్చినకోమలి యజ్ఞవేదిమ
|
|
|
ధ్యను హనుమాంగనామణి ముదంబలరంగ వివాహమై సుహృ
జ్జనములు సన్నుతింప ఘనసంపద సొంపువహించె నెంతయున్.
| 45
|
క. |
అంగజనిభుండు కొండన, యుం గడువైభవము మీఱి నుత్పలగంధిన్
రంగాంబను నిరుపమితశు, భాంగి న్వరియించి మించె నంచితలీలన్.
| 46
|
గీ. |
ఆసరసమంత్రిశేఖరు నవరజుండు, గంధిలాశుగలావణ్యగణ్యమూర్తి
తిమ్మధీమణి వెలసె ధాత్రీతలమునఁ, బన్నగారాతివాహనభక్తిపరత.
| 47
|
మ. |
భువిలో నన్నమువెట్టు ద్వాదశుల నాభూదేవరత్నంబు రెం
డవరుక్మాంగదభూకళత్రుఁడొ యనా నర్థుల్ ప్రియంబందఁ గ
ర్ణవితీర్ణి[7]ప్రతిభావిభాసి యయి యెన్నం[8]జాలి మందాకినీ
లవలీకల్పలతాసితాంశుహిమఖేలత్కీర్తిసంపన్నతన్.
| 48
|
గీ. |
ఆతనికిఁ బుణ్యవతియైన యక్కమాంబ, వలనఁ దనయులు గలిగిరి వనధిసములు
తిమ్మధీరుండు నప్పమంత్రియును నరస, సచివుఁడును దిర్మలయ్యయుఁ జారుయశులు.
| 49
|
క. |
ఏవంవిధవంశంబున, నావిర్భూతప్రధానహర్యక్షులలో
శ్రీ వెలయఁ గీర్తిశుభగం, భావుకుఁడై రంగమంత్రి మహి నుతికెక్కెన్.
| 50
|
సీ. |
సర్వంసహామహాజలరుహాకరమున విహరించు నేమంత్రి విజయలక్ష్మి
దిగ్వధూదరహాసదీప్తులతోఁ జెల్ని గావించు నేమంత్రి ఘనయశంబు
పెరిమె నంభోధికిఁ బెక్కండ్రుసతుల నుత్పాదించు నేమంత్రి దానవారి
పున్నమజాబిల్లి చెన్ను నన్నువచేసి నవ్వు నేమంత్రి సౌందర్యరేఖ
యతఁడు హావళి చినయౌభళావనీశ, బహుళసామ్రాజ్యధౌరేయమహిమనిపుణ
విపులబాహార్గళాటోపవిజితభుజగ, సార్వభౌముండు రంగయసచివఘనుఁడు.
| 51
|
సీ. |
వైభవస్ఫురణచే వజ్రాయుధుండయ్యు నన్యభామినిఁ గోరఁ డాత్మయందు
సౌందర్యరేఖతోఁ జక్రాహితుండయ్యుఁ దొడిఁబడ నిజగురుద్రోహి గాఁడు
వరదానవైఖరి వైరోచనుండయ్యుఁ గించిత్తు నర్థికిఁ గ్రిందుపడఁడు
వల్గువిక్రమశక్తి ఫల్గునుండయ్యును వెఱచి పోర శిఖండి వెనుక నిలువఁ
డవుర కర్ణాటలాటచోటాంధ్రముఖ్య, మానవాధిపఘనసభామధ్యభాగ
మాగధానీకజేగీయమానకీర్తి, రమ్యగుణహారి నరసయరంగశౌరి.
| 52
|
శా. |
కట్టించెం గలశాంబురాశితనయాకాంతామితాగారము
ల్పెట్టించెన్ ధరలోన సత్రములు భూబృందారకశ్రేణికి
|
|
|
న్దట్టించెం[9]గపటారిమంత్రివరుల న్సత్కీర్తి లోకంబుల
న్రెట్టించె న్నరసయ్యరంగసచివశ్రేష్ఠుండు నిష్ఠారతిన్.
| 53
|
చ. |
ధనములు గూడఁబెట్టి వసుధాస్థలిఁ గొందఱు కూళమంత్రు లా
ధనములు రాజబాధల వృథా పొరివోవఁగనిత్తు రజ్ఞులై
జననుతచర్యుఁ డైననరసప్రభురంగనమంత్రి దా యశో
ధనములు గూడఁబెట్టి ప్రమదంబున మించె ధరాతలంబునన్.
| 54
|
ఉ. |
రంగనివాసనిర్మలధరంగని పంకజనాభపుత్రుదా
రంగని యభ్రవాహినితెరంగని సాంధ్రలసత్సుధాసుధా
రంగని సత్ప్రభాసురుచిరంబగు శ్వేతవరాహమూర్తికో
ఱంగని ప్రోలుగంటిపురిరంగనికీర్తి హసించు నిమ్మహిన్.
| 55
|
గీ. |
ఎలమి నందెలచినయౌభళేంద్రదత్త, సలలితాందోళికాచ్ఛత్రచామరాది
చిహ్నములు దాల్చియెంతయుఁ జెన్ను మీఱి, మంత్రి రంగన వెలయు భూమండలమున.
| 56
|
సీ. |
అమరమర్త్యభుజంగ మారాధ్యసౌరాష్ట్రసోమేశ్వరస్థానశోభితంబు
చెన్నకేశవదేవశేఖరప్రోత్తుంగభవనగోపురసౌధభాసురంబు
పాతకజీమూతపటలఝంఝానిల తుంగభద్రాతీరసంగతంబు
విహృతిలాలససౌరమహిళాంఘ్రిలాక్షాంక విలసితప్రాకారవేష్టితంబు
జవనసైంధవగంధేభసంకులంబు, చతురవారవిలాసినీసమధికంబు
బహులనిస్తులవస్తుసంపత్తివిజిత, గోపురం బొప్పుఁ బ్రోలుగంటీపురంబు.
| 57
|
క. |
ఆపురి కేశవమూర్తికి, దీపితమణిభూష లొసఁగి దృఢతరరాజ్య
శ్రీపాలనఖేలనధా,రాపాలుఁడు నరసవిభునిరంగన వెలయున్.
| 58
|
సీ. |
గురుతరవాధూలగోత్రాన్వయాంభోధిపూర్ణిమాచంద్రుఁడై సొలుపు మీఱె
జైనచార్వాకాదిసకలదుర్మతఘోరగహనధూమాంకుఁడై కణఁకమించె
శిష్యకదంబకచిరతరసంపత్తివితరణఖ్యాతిమై వృద్ధిఁబొందె
శ్రీవేంకటాచలశిఖరమందిరదేవతాపరమూర్తియై యవతరించె
జగతిఁ గందాళభావనాచార్యవర్య, తనయుఁ డయ్యె గురుస్వామిఘనత కెక్కె
నట్టి శ్రీరంగగురునాథుఁ డాత్మగురుఁడు, గాఁగ సన్నుతివడసె రంగప్రభుండు.
| 59
|
క. |
ఏతాదృగ్గుణసుధికిని, ఖ్యాతాశ్రితసకలసుకవికలశాంబుధికిన్
వీతాభిమానశాత్రవ, జాతాభయదాననిపుణశయసేవధికిన్.
| 60
|
క. |
ఆర్వేలకులోజ్జ్వలునకు, గర్వితరిపుగహనదహనకనదనలునకున్
సర్వంసహామహాధిక, ధూర్వహబలునకును విగతదుశ్శీలునకున్.
| 61
|
క. |
ఖండితఘనదుష్కృతికినిఁ, బండితజేగీయమానపరహితకృతికిన్
గండస్థలమండితమణి, కుండలవితతికి నిరస్తకుహనామతికిన్.
| 62
|
క. |
పాత్రచరితాశ్వలాయన, సూత్రున కధికతరసుకృతశుభగుణచంచ
ద్గాత్రునకును బుధనుతచా, రిత్రున కశ్రాంతకృతహరిస్తోత్రునకున్.
| 63
|
క. |
శ్రీవరపాదాంభోరుహ, సేవాదత్తావధానచిత్తాబ్జునకున్
భావభవసదృశరూవధు, రావంచితనిష్కళంకరాకాబ్జునకున్.
| 64
|
క. |
హిమమండలరిపుమండల, సమచండిమభీమధామసంస్త్యాయునకున్
రమణీయసురమణీనిక, రమణిధ్యేయునకు దానరాధేయునకున్.
| 65
|
క. |
నరసప్రధాసురంగన, కరినృపదుర్మంత్రిగర్వహరిచంగునకుం
గరుణాగుణసంగునకును, బరమతరపరోపకారఫలితాంగునకున్.
| 66
|
వ. |
అభ్యుదయపరంపరాభివృద్ధిగా నే రచియింపం బూనిన యుత్తరనరసింహపురా
ణంబునకుఁ బ్రారంభం బెట్టి దనిన.
| 67
|
ఉ. |
పుణ్య మగణ్యయాగఫలభోగనిరస్తసమస్తదేవకా
ర్పణ్యము ముక్తియౌవతశరణ్య ముదగ్రసమగ్రబోధదా
క్షిణ్య మశేషకాననవిశేషవరేణ్యము నైన నైమిశా
రణ్యము చూడ నిం పగుఁ దరణ్యభిభావసరణ్యగాగ్ర మై.
| 68
|
సీ. |
ఏయరణ్యమునందు నింద్రాదిదేవతాతతి సకుటుంబమై తరలకుండు
నేయరణ్యమునందు నిసుమంత జాతివైరములేక సత్త్వజాతములు మెలఁగు
నేయరణ్యమునందు నిందుశేఖరధాతృకమలాక్షముఖులు సౌఖ్యంబు గాంతు
రేయరణ్యమునందు నాయురారోగ్యాభివృద్ధిప్రదాయి వివేక మడరు
నేయరణ్యంబునందు భక్తేప్సితార్థ, సిద్ధికరి యైనయోగలక్ష్మియుఁ జెలంగు
నట్టి శ్రీనైమిశారణ్య మఖలమౌని, విహరణస్థానియై యభివృద్ధి దనరు.
| 69
|
వ. |
ఆనైమిశారణ్యంబునం బ్రబోధనిస్తంద్రు లగుమహామునీంద్రులు నఖిలకళ్యాణా
కర్షణుం డగురోమహర్షణువలన హిరణ్యకశిపుజన్మంబును నతనితపోమహత్త్వం
బును జంభునికూఁతు రైనయంభోరుహాక్షిఁ గయాధు వనుదాని స్వయంవరం
బును మొక్కలంబున నక్కన్యకారత్నంబు హిరణ్యాక్షపూర్వజుం డఖర్వ
|
|
|
దోర్గర్వంబునం దెచ్చుటయును జంభహిరణ్యకశిపులయుద్ధసంరంభంబును
నారంభోరువువలనఁ బ్రహ్లాదు నుదయంబును నతండు దైత్యకుమారులకు
విష్ణుభక్తిప్రకారం బుపదేశించుటయును గనకకశిపుండు తనతనయుం గనలి
పలుకుటయును శ్రీనృసింహావతారంబును హిరణ్యకశిపువిశసనంబును మొద
లుగాఁ గలుగుకథావధానంబులు విని యక్కథకునకు శౌనకాదిమునీంద్రు
లిట్లనిరి.
| 70
|
ఉ. |
శ్రీనరసింహమూర్తి సురసిద్ధగణంబులు సన్నుతింప న
ద్దానననాథువక్షము శితత్రిదశేశ్వరవజ్రనిష్ఠురా
త్యానతవిస్ఫురన్నఖచయాగ్రముల న్విదళించి యంతఁ ద
త్సూనునిఁగాచి యెచ్చటికిఁ జువ్వున నేగెనొకో యకల్మషా.
| 71
|
గీ. |
విష్ణుకథలు తొల్లి వినినవేనియు నిత్య, నూతనోత్సుకంబు నూలుకొలిపి
పరిణమింపఁజేయు హరిణాంకకిరణంబు, లభినవములుగావె యనుదినంబు.
| 72
|
క. |
భవదీయముఖవినిర్గత, వివిధకథామృతము గ్రోలి వివశములై మా
చెవు లిపుడుఁ దనివిఁబొందవు, భవగుణరహితప్రచార పరమోదారా.
| 73
|
వ. |
అని పలుకు నమ్మహాతపోధనుల మునుమినుకులంబోని సూక్తిజాలంబు లాలించి
సహర్షోత్కర్షంబుగ రోమహర్షణుం డమ్మహాత్ముల కి ట్లనియె.
| 74
|
క. |
నారాయణపదయుగళాం, భోరుహసద్భక్తు లఖిలపూజ్యచరిత్రుల్
మీ రెఱుఁగని విష్ణుకథా, ప్రారంభము లున్నవే మహామతులారా.
| 75
|
గీ. |
అయిన నేమి యుష్మదంఘ్రిపదార్చనా, ఫలితబుద్ధి సిద్ధిఁ బరఁగి యేను
నృహరిదివ్యదేహనిర్యాణ[10]వృత్తంబు, వినినయంత మీకు విన్నవింతు.
| 76
|
నారదుఁ డింద్రునికడకు వచ్చుట
వ. |
అది యెట్టి దనిన నొక్కనాఁడు మహేంద్రుండు దేవగంధర్వసిద్ధసాధ్యరక్షో
యక్షదిక్పాలకకిన్నరకింపురుషగణంబులును రంభాదిసురకామినులుం గొలువ
నిండుకొలువున కేతెంచి యందు రత్ననిర్మితం బైనసింహాసనంబున సమా
సీనుండై యున్నసమయంబున సమరభోజనప్రయోజనవిశారదుం డగు నార
దుం డేతెంచిన నమ్మహాత్ముని నెదుర్కొని యర్ఘ్యపాద్యాదు లర్పించి
సముచితాసనంబున నుపవిష్టుం జేసి కృతాంజలియై యిట్లనియె.
| 77
|
క. |
భవదీయపాదరేణువు, దవిలిన మద్భవన మెల్ల ధన్యత నొందెన్
వివిధశుభాస్పద మయ్యెను, దివమును ద్వద్దర్శనమున దివ్యమునీంద్రా.
| 78
|
గీ. |
అడుగవలయు నొక్క టడిగెడ నది మాకు, నిర్ణయింపవలయు నేర్పుతోడ
నీజగంబులందు నెఱుఁగని దొకటైన, గలదె మీకు నఖిలకలుషదూర.
| 79
|
క. |
హరి నరహరియై నఖముల, సురవైరి వధించి యతనిసుతుఁ గాచి యనం
తరమున నిజతను వేక్రియఁ, బరిముక్తము చేసెనొక్కొ పరమార్థజ్ఞా.
| 80
|
వ. |
అని పలికిన దేవేంద్రునకు మునీంద్రుం డిట్లనియె.
| 81
|
ఉ. |
ఆ నరసింహుఁ డట్లు శరభాకృతిఁ దాల్చుపురాసురారితోఁ
బూనినరోషవహ్ని నిజభూత్కృతిమారుతవేగవర్ధితం
భై నలినోద్భవాండము నహర్నిశమున్ దహియింప దేవతా
దానవబృందము ల్బెగడఁ దా నొనరించె రణం బరీణుఁడై.
| 82
|
క. |
శరభనృహరు లీక్రియ దు, ర్ధరయుద్ధము చేసి చేసి తమతమతేజ
స్స్ఫరణాపరిణాహము లా, దరమున నజువలనఁ దెలిసి తత్ప్రియమునకై.
| 83
|
క. |
నరసింహశరభశూపము, లురవడి నుపసంహరించి యొద్దికతోడన్
హరిహరు లొకతనువున నిలి, చిరి సురలు నుతింప భువనచిత్రచరిత్రా.
| 84
|
క. |
ఆక్షేత్రము హరిహర మన, దట్మణదిక్ప్రధిత మయ్యెఁ దన్నికటమహిన్
మక్షికయు నిలిగి యక్షయ, మోక్షశ్రీ నక్షియుగళముకురము సేయున్.
| 85
|
వ. |
అని యిట్లు నారదుండు నృసింహావతారోపసంహారవృత్తాంతం బెఱింగించిన
విని పురందరుం డిట్లనియె.
| 86
|
క. |
హరిహరులు లోకరక్షా, పరులు నృహరిశరభరూపబంధురులై భీ
కరఖరకరకరశితముఖ, శరముల ననిసేయు టేమిచందమొ యనఘా.
| 87
|
క. |
సురభావితపదయుగ యగు, శరభాకృతి పూర్ణచంద్రశరభాకృతి శం
కరునకుఁ బూనఁగ నేపని, హరు వయ్యెనొకో రణాశనా తెలుపఁ గదే.
| 88
|
వ. |
ఇవ్విధంబున శచీవల్లభుండు పలికినఁ దపోధనవల్లభుండు విని శరభావతార
వృత్తాంతంబు స్వకీయాపరాధంబున నైనది యగుటం జేసి యతండు తత్క
థావిశేషంబు సంకోచంబునం జెప్పి బ్రహలోకంబున కరిగె నని రోమహర్ష
ణుండు శౌనకాదులకు విన్నవించిన నమ్మునీంద్రు లిట్లనిరి.
| 89
|
క. |
ఏమియపరాధ మొదవెం, దామరవిరిమనుమనందుఁ దత్కథ సర్వం
బామీఁదటివృత్తాంతము, ధీమహితా నీవు మాకుఁ దెలువఁగవలయున్.
| 90
|
వ. |
అనిన విని రోమహర్షణుం డమ్మునీంద్రుల కిట్లనియె.
| 91
|
సీ. |
హరి దానవాధీశు నణఁప నుద్యుక్తుఁడై పురుషహర్యక్షవిస్ఫురణ దాల్చి
త్రిభువనానందవర్ధిష్ణుఁడై యాహిరణ్యకశిపు నరికట్టి యరగఁబట్టి
|
|
|
యాదిభాగవతుఁ బ్రహ్లాదునిఁ దద్రాజ్యవిభునిఁగా నొనరించి శుభము లొదవఁ
బ్రజల రక్షించి భూభారమంతయు మాన్చి నిశ్చింతహృదయుఁడై నెగడియుండె
నంత హతశేషులైన దైత్యాధిపతులు,సంతతంబును భయసమాక్రాంతు లగుచు
మందరద్రోణికామధ్యమంబునకును, జేరి యచ్చో మిథస్సమాసీను లగుచు.
| 92
|
క. |
చింతాపరవశులై మది, నెంతయుఁ బరితాప మంది హితకార్యంబుల్
చింతించుచుఁ దమలో న, త్యంతంబును బ్రదుకుఁదెరువు తహతహ సూపన్.
| 93
|
ఉ. |
దానవనాయకుం డణఁగెఁ దత్సుతుఁ డిప్పుడు విష్ణుభక్తుఁడై
దీనునిమాడ్కి బ్రత్యహము దేవగణంబుల కాప్తుడై తదీ
యానుమతంబు లైనపను లర్థి నొనర్చుచు నున్నవాఁడు దు
ర్మానముతోడఁ దండ్రిపగ మానసవీథిఁ దలంపఁ డింతయున్.
| 94
|
సీ. |
అవినీతుఁ డైనప్రహ్లాదుని మనకెల్లఁ బతిగాఁ దలంచినఁ బ్రాణహాని
వంద్యుఁడై దేవుఁడై వరదుఁడై దైతేయపతుల కెల్లను దిక్కు పార్వతీశుఁ
డామహాత్ముని నాత్మఁ బ్రేమతోఁ దలఁచినఁ గలుగు నిష్టము[11]లైన ఫలము లెల్ల
నీయఁడే తొల్లి దైత్యేంద్రుల కతిమోదమున వరంబులు లోకములు నుతింప
ననుచుఁ దలపోసి యాతుధానాగ్రచరులు, పద్మమిత్రునిపై దృష్టి పాదుకొలిపి
జలము వాయువు నాహారములుగ నడపి, తపము సేయంగఁ బూనిరి దర్ప ముడిగి.
| 95
|
దానవులు శివునింగూర్చి తపము చేయుట
చ. |
దనుజులు దేహవాంఛ విడఁదన్ని శివాధిపుఁగూర్చి సంతసం
బునఁ దప మాచరించునెడఁ బుట్టినతద్దహనోగ్రకీలల
న్మునుకొని సర్వలోకములు ముచ్చముణింగె బెహారి సంచుల
న్దినముతుది న్ముణించినగతిం బ్రవిముక్తబహిఃప్రచారతన్.
| 96
|
క. |
దనుజకృతం బగుతపమున, మనసిజసంహరునినిండుమనము గరంగెం
గనదనలద్రావితనూ, తననవనీతప్రపూరితకలశలీలన్.
| 97
|
సీ. |
వలమానదహనకీలల నీను నెమ్మోము ములికితో డావంక కలికితోడ
వెలఁది వెన్నెలరేల వికసించు విరవాజి[12]పువ్వుతో నిద్దంపునవ్వుతోడ
వలపు వసంతంబుఁ దలకొల్పు సుస్నిగ్ధభూతితో శృంగవద్వీతితోడ
వికటంపులీలలు ప్రకటించి నవ్వించు వందితో[13] విసురూపుమందితోడ
భుజగహారంబుతోడఁ గర్పూరతుహిన, రాశిసంకాశకాంతిపూరంబుతోడ
నమరరిపులకుఁ బ్రత్యక్ష మయ్యె నిఖిల, సంయమీవశంకరుం డగుశంకరుండు.
| 98
|
మ. |
కని రాదైత్యులు నందివాహనుని శ్రీకంఠుం ద్రిశూలాయుధు
న్వనజాతారికళాధరున్ హిమసుధావర్ణుం ద్రినేత్రున్ భుజం
గనికాయాంచితభూషణుం బ్రమథసంక్రాంతుకున్ జటాపర్యట
ద్ఘనపుష్పాకలితున్ హిమాద్రితనయాకాంతు న్మహాశాంతునిన్.
| 99
|
వ. |
అంత నద్దనుజవీరులు కరుణారసప్రవాహమకరందనిష్యందతుందిలంబును
నకుంఠితకంఠకాళిమకలభసలకలభమసృణంబును బ్రసవశరశరీరగంధసారసం
జనితక్షోదమేదురపరాగంబును సరాగజలపటలఝాటఘటితకుటిలకుముదినీ
విటకోరకంబును నుదారబాహామండలవిటపమండితంబును దుహినగిరిదుహి
తృలతాలింగితంబును నగు నాయనంగమథనునాకారంబు నిజతపఃఫలప్రదా
యకం బగు లేఖనాయకశాఖిశేఖరంబుగాఁ దలంచి యలంత కలంతయుం
దొలంగి తదీయశీతలచ్ఛాయాచక్రంబు నాశ్రయించుచు నవని కెఱఁగి లేచి
కరకమలపుటంబులు నిటలంబుల ఘటియించి యిట్లని స్తుతియించిరి.
| 100
|
రాక్షసులు శివుని స్తుతియించుట
సీ. |
శ్రీనీలకంఠ యాశ్రితభక్తవత్సల పురవిభేదన సర్వభూతనాథ
శంకర గౌరీశ శర్వ లోకేశ్వర గంగాంబుపరిషిక్తకాలరూప
కందర్పభసితసంక్రాంతభవ్యశరీర చంద్రశేఖర నాగచర్మవసన
నందివాహన జగద్వందిత శూలవిభ్రాజితకర లోకపాలవినుత
భవ మహాదేవ పన్నగాభరణ రుద్ర, ప్రమథనాయక దక్షాధ్వరప్రశమన
యంధకాసురహరణ సత్యస్వరూప, మమ్ము రక్షింపవలయు భీమప్రభావ.
| 101
|
క. |
పురుషుఁడు రుద్రుం డనుచును, మొరయుచు నలసకలవేదములు చాటెడిచోఁ
బరమేశ పురుషదైవాం, తరమున్న[14]దియే జగత్త్రితయమునఁ దలఁపన్.
| 102
|
క. |
జ్వలనవియన్మరుదచలా, జలదీక్షితచంద్రపంకజప్రియు లన మీ
విలసన్మూర్తులఁ ద్రిజగం, బులు నిత్యము వృద్ధిఁబొందు భూతనివాసా.
| 103
|
క. |
నారదసనకసనందన, మారుతభుగ్రమణవిబుధమంత్రిషడాస్యాం
భోరుహసంభవముఖ్యులు, మీరూపముఁ దెలియఁ గలరె మీనాంకహరా.
| 104
|
మ. |
కరిదైత్యేంద్రుని సంహరించి త్రిజగత్కళ్యాణముం గోరి శం
కర నీ వాక్రియఁ దాండవంబు సలుపంగా నీదుమై రాలుస
మ్మరులుం గమ్మనిబూది దేవమునిసామ్రాట్సిద్ధగంధర్వభా
స్కరచంద్రాదులు దాల్తు రౌదలల రాకాకాముకాభప్రభా.
| 105
|
చ. |
ధరణి రథంబు చక్రములు తారకనాయకలోకలోచను
ల్పరపగువేదజాలములు పన్నినతేజులు నల్వ యంత ని
ర్జరగిరి విల్లు సింగిణి భుజంగమభర్త శితాస్త్ర మిందిరే
శ్వరుఁడును నై చెలంగః బురసంహరణం బోసరించి తీశ్వరా.
| 106
|
చ. |
గరుసులుమీఱ మందరముఁ గవ్వము చేసి సురాసురావళుల్
తరువఁగఁ దర్వఁగా నిఖిదాహకరోత్కటకీలజాల మై
గరళము పర్వఁ గేలఁ గొని కంఠము సేర్చితి విట్టి మొక్కలం
బొరులకు సంభవించునె సురోత్తమ పాదనతాత్మవిత్తమా.
| 107
|
ఉ. |
దక్షుఁడు దక్షుఁడై క్రతువిధాన మొనర్పఁగ దర్పఘోరరూ
క్షేక్షణవిస్ఫులింగముల నెల్లజగంబుల వేఁచుచు న్విరూ
పాక్ష తదీయమస్తకము హస్తకనన్మణికందుకంబుగా
నాక్షణమాత్రఁ జేయవె మహాపురభైరవ కాంతికైరవా.
| 108
|
క. |
రక్షారుద్రాతోపరి, లక్షితశుభలక్షణులకు లంచము లిడు న
మ్మోక్షరమ యిక్షుకార్ముక, శిక్షాకౌక్షేయనిటలశిఖిజటిలశిఖా.
| 109
|
క. |
కలువీడు చేతికూడు, న్మలకలజందెంపుఁద్రాడు మదనునిసూడున్
వలచేఁ గంకటికోడుం, గలవాఁడౌ నీదుకరుణగలవాఁడు శివా.
| 110
|
చ. |
పరధనచోరకుండు గురుభామలతో రతిసల్పువాఁడు భూ
సురవరహంత మద్యపుఁడు సూనృతవాక్యవిహీనుఁ డాదిగా
బరఁగునశేషకల్మషులు పన్నగభూషణ మీపదాంబుజో
పరిపరిలగ్నభక్తిపరిపాకమున న్సుఖు లౌదు రెయ్యెడల్.
| 111
|
క. |
శివశివ యని మిముఁ దలఁచిన, భవభవరాహిత్య మొంది పంచజనుఁడు ప్రా
భవభవనాయితతనువై, కవకవ నగు జన్మపాశకాండావతులన్.
| 112
|
ఉ. |
సైకతదారులోహమణిచందనపంకములందు దివ్యలిం
గాకృతిగా నొనర్చి మిము నందుపయి న్విడియించుచున్ వృథా
పాకముగాని నేమముల భక్తిభరంబునఁ బూజసేయు పు
ణ్యాకృతు లుందు రెందుఁ బ్రమథాధిపులై రజతాద్రికందరన్.
| 113
|
క. |
శివలింగదాన ముర్వీ, దివిజులకు నొసంగునట్టి ధృతిమంతులు పు
త్రవధూధనవాహనబాం, ధవపరివతు లగుచు సంపదలు గాంతు రిలన్.
| 114
|
సీ. |
భసితత్రిపుండ్రము ల్ఫాలపట్టికలపై ధరియింపనేర్చినతత్త్వవిదులు
కంఠభూషలుగాఁగఁ గైకొని రుద్రాక్షదామము ల్దాల్చినధర్మరతులు
|
|
|
ప్రేమతోఁ బంచాక్షరీమంత్రరాజంబు జపియించు సంతతాచారపరులు
బాహ్యంబు మఱచి యా[15]భ్యంతరమ్మున మిమ్ము ధ్యానంబు సేయు పుణ్యస్వరూపు
లన్య మెఱుఁగక శైవమార్గానురక్తిఁ, బొదలుచుండెడు విశ్రుతాద్భుతచరిత్రు
లలఘుపుణ్యులు భవబంధములు త్యజించి, ప్రమథులై మిమ్ము సేవింతు రమరవంద్య.
| 115
|
నిరోష్ఠ్యసీసము. |
సతతసత్యాకార చంద్రశేఖర శైలతనయాధినాయక దైత్యహరణ
గరళసంక్రాంతకంధర దయాసాగర హరిరాజకటక యనంగదళన
గంగాధర యహార్యఖండనాద్యాశాదళేశార్చిత శ్రీశ హితగణేశ
ఘనగజాజినచేలకలితకటిస్థల రజితాద్రినిలయ సారజ్ఞరసిక
ఖరఖరానలశశినేత్ర కాంచనాగ, శార్ఙ్గరంజితకరకంజ చక్రహస్త
నిశితసాయక నిఖిలార్థ నిత్యచరిత, సకలజగదయనయద రసాశతాంగ.
| 116
|
చ. |
జయజయ పార్వతీరమణ చంద్రహుతాశనసూర్యలోచనా
జయజయ దేవతానివహసంతతసన్నుత భక్తవత్సలా
జయజయ పద్మజాదిమునిసంఘనిషేవితభావభావితా
జయజయ వామదేవ గజచర్మధరా బహుధర్మసాదరా.
| 117
|
వ. |
అని యిట్లు దానవవీరులు సాక్షాత్కరించిన దాక్షాయణీవల్లభుని ననేకవిధం
బుల సన్నుతించి మఱియు నిట్లనిరి.
| 118
|
సీ. |
విను విరూపాక్ష నీకనికరంబునఁ జాలఁ బొదలి హిరణ్యాక్షపూర్వజుండు
భూస్వర్గపాతాళములు మూఁడు నరికట్టి గరిగంటిగాని సౌఖ్యములఁ దనరి
విభవసంపూర్ణుఁడై వెలసియుండెడిచోట దంష్ట్రాకరాళవక్త్రంబుతోడ
నరసింహరూపంబు ధరియించి కఱివేలు పుక్కుఁ[16]గంబము చించి యుఱకవెడలి
తొడలపైఁ బెట్టి దైత్యేంద్రు నడఁగఁబట్టి, శితనఖరశిరములఁ గుక్షి చీరివైచి
సకలరాక్షసబలమెల్ల సంహరించి, తత్కుమారునిఁ గాచె నంధకవిదారి.
| 119
|
క. |
ఆనరకేసరినాసా, నూనానిలనిహతిఁ గెరలునురుదంష్ట్రాదం
డాననదహనజ్వాలకు, దానవసంతానములు పతంగము లయ్యెన్.
| 120
|
సీ. |
హలహలారవనర్తనారంభరంగమై మేటిజిహ్వికకోల మెఱుఁగులీనఁ
జిటచిటారభటితోఁ జెలఁగుదంష్ట్రాటంకసంవర్తవహ్ని పోసనముగొనఁగ
|
|
|
భుగభుగధ్వనులతో నెగసి మిన్నందుచు భూత్కారవయువు ల్పుటము లెగయఁ
గిటకిటచ్ఛబ్దసంకీర్ణంబులై దంతకూటకాటికలు కోలాటమాడఁ
బద్మజాదిసురలెల్ల భయమునొంద, నున్నవాఁ డదె నరసింహుఁ డుగ్రుఁ డగుచు
నతనికతమున నుద్భవం బైనసాధ్య, సంబుఁ దొలఁగించి మముఁ బ్రోవు చంద్రజూట.
| 122
|
వ. |
అని యిట్లు సురలు నరసింహావిర్భావవృత్తాంతం బెఱింగించిన నాకర్ణించి
పరమేశ్వరుం డిట్లనియె.
| 123
|
సీ. |
దనుజనాయకులార తథ్యంబు చెప్పెద వీనులు దనియంగ వినఁగవలయుఁ
గార్యసాధ్యము లైనకరన్యకర్మముల్ ఖడ్గసాధ్యంబులు గావు ఖడ్గ
సాధ్యంబు లైనట్టి సకలకర్మంబులు గార్యసాధ్యంబులు గావు తెలియ
నీరెండు నెఱిఁగి యెయ్యెది యెందు కర్హంబు తద్వినియోగంబు దగినకార్య
మందుఁ దలకొల్ప సిద్ధించు నర్థలాభ, మట్లు గావునఁ దత్తఱం బాత్మ నణఁచి
తపము చాలించుఁ డెంతయేనుపమఁ జేసి, పాదుకొల్పెద మీకార్యభాగ మిపుడు.
| 124
|
వ. |
అని యా కాకోదరకుండలుం డామహోదరదీర్ఘదర్శిదంతఘాటకప్రముఖు లైన
పూర్వబర్హిర్ముఖుల నాదరించి.
| 125
|
క. |
సురగరుడోరగనరకి, న్నరనానానుతులు చెలఁగ నాగాభరణుం
డరిగెఁ దనవెండికొండకు, గిరిజాకరజలజపత్రకీలికరుఁడై.
| 126
|
సీ. |
భర్గుమైభోగంపుఁ బచ్చడంబులకుఁ గెంజడరంగుచంద్రికచాయ వేయఁ
బండువెన్నెలమ్రుగ్గుపైనిండఁ బేరిన పద్మారిగతి మేనిభసిత మమర
నాకాశగంగామహాకుల్యవలిమలఁబోలెఁ జన్నిదముల పొంక మమరఁ
గరుణాంబుపూర్ణహృత్కములంబుగతిఁ గేలితీర్థకుండిక భానుదీప్తిఁ దెగడ
నక్షమణిభూషణాంకితుం డాదివైష్ణ, వాన్వయవతంస మఖిలవిద్యావిశార
దుండు నారదుఁ డేతెంచె ఖండపరశు, వెండికొండకుఁ గన్నులపండు వగుచు.
| 128
|
క. |
హరుని గనుంగొని తత్పద, సరసిజయుగమునకు మ్రొక్కి చతురయువతిక్రొ
మ్మురువున నురమునఁ బాయక, మరులుకొనఁగఁజేయు తనదు మహతి న్వీణన్.
| 129
|
వ. |
ప్రసారితంబులైన తంత్రీముఖములందు సారియలొనరంగూర్చి యందు స్థాయి
సంచార్యారోహావరోహభేదరూపంబుల వాద్యానువాది వివాదసంవాదులు
మొదలైన ద్వావింశతిశ్రుతిమండలసమేతంబులై నంద్యావరజీమూతసుభద్ర
నామకం బైనగ్రామత్రయంబును గలిగి యేకోనవింశతి మూర్ఛనానామ
భేదంబులం బ్రవర్తించు షడ్జర్షభగాంధారమధ్యమపంచమదైవతనిషాదస్వరం
|
|
|
బులు షాడవౌడవసంపూర్ణంబులం బ్రకీర్ణంబులుగా నావర్తనప్రకారంబులం బరి
భ్రమించు భైరవిభూపాళశ్రీరాగమాళవినాట రామక్రియా శంకరాభరణ
బళహంసాది స్త్రీపురుషరాగంబులు శుద్ధసాళగసంకీర్ణంబుల శ్రవణమనోహరం
బగున ట్లంగుళీస్పర్శనచమత్కారవిశేషంబునఁ బాదుకొలుపుచు రాగాలప్తి
సమేతంబుగాఁ ద్రిపురవిజయాపదానంబు రూపకాలప్తిమార్గంబున వినిపించిన
దద్గానంబు నాకర్ణించి గోకర్ణవలయుం డాదరించిన నంతఁ దద్భావం బెఱింగి
పరమేష్ఠికుమారుం డి ట్లనియె.
| 130
|
చ. |
ధరణిఁ బదద్వయం బనలతారకనాయకలోకబాంధవుల్
గరహర నీకు నేత్రములు గాడ్పులు నాభి జలంబు .... మం
బరము శిరంబునై నిగమపంజరకీరము నీశరీర మీ
శ్వర జగదేకపూర్ణవిలసన్మహిమంబున నుల్లసిల్లెడున్.
| 131
|
క. |
అవనతముఖమగు తామర, పువుటిత్తిగ మీదుగాఁగఁ బొంగించి శిర
స్థవనజసహస్రపత్రము, లవి క్రిందుగ నమృతమాను యతి యసమమతీ.
| 132
|
క. |
భుక్తియు ముక్తియు నొసఁగఁగ, శక్తుండవు నీవె యనుచు సంసారసుఖా
సక్తిఁగడకొత్తి భక్తులు, భక్తి న్నినుఁ గొలుతు రమృతభక్తాధీనా.
| 133
|
శా. |
బ్రహ్మాండోదరపూరితుండవగు నీపాదాంబుజద్వంద్వమున్
బ్రహ్మాదుల్గనలేరయైనను భవద్భక్తిప్రభావోన్నమ
ద్బ్రహ్మజ్ఞుల్ హృదయంబులం దలఁచుచుం బ్రఖ్యాతులై చాలఁద
ద్బ్రహ్మాహానందసుఖంబు నొందుదురు రుద్రా భద్రనిర్వాహకా.
| 134
|
వ. |
అని నానాప్రకారంబుల నిర్వికారాకారుండై నీరజాసనకుమారుండు కుమార
జనకుం బ్రణుతించిన నాపన్నగకంకణుండు ప్రసన్నుండై యతని కిట్లనియె.
| 135
|
చ. |
మునివర నీ వెఱుంగనివి మూఁడుజగంబుల లేవు దజ్జగ
జ్జనితములైన వృత్తము లజస్రము ధాతకుఁ గానిపించు నా
యనకడనుండి నీవిటకునై చనుదెంచుట కెద్దిహేతు వీ
వనిగనఁగోరి త్రిమ్మరుదు వంతియ కా కితరంబు గల్గునే.
| 136
|
గీ. |
భామినీసుతార్థపశుగతం బగుకోర్కి, లేదు నీకు నొక్కలేశమైన
ముక్తి వేఁడె దన్న ముక్తుండ విటమున్న, యేమి గోరి వచ్చి తో మునీంద్ర.
| 137
|
క. |
అని నీలకంధరుఁడు ప,ల్కినపల్కుల నాలకించి కేలిమొగుపుతో
మునివరుఁడు వినయవినమిత, తనుఁ డై యిట్లనియె నతనుదళనుని[17]తోడన్.
| 138
|
నారదుఁడు శివునకు నరసింహునిప్రతాపము చెప్పుట
సీ. |
దేవ నీకరుణార్ద్రదృష్టి నాపైఁ బర్వునఁట యింతకంటె నిష్టార్థ మెద్ది
నా కొక్కనిక కాదు నరనాగపశుపక్షితతికి నీకృపయ వాంఛితము లొసఁగు
వినవయ్య వే ఱొక్కవిన్నపం బమరారియురము నృసింహుడు కరరుహముల
విదళించి మించె నవ్విభుకోపవిభవంబు ముజ్జగంబులుఁ జుట్టుముట్టుకొనియె
నప్పు డింద్రాదిసుర లెల్ల నిప్పుద్రొక్కి, నట్లు మిట్టించి రంభాదు లైనయప్స
రోగణంబులఁ గొని బ్రహ్మ వేగఁ గదిసి, విన్నవించిన నతఁడును వెల్లనయ్యె.
| 139
|
వ. |
ఆహిరణ్యగర్భునకు హిరణ్యకశిపువిశసనకారి నివారించు భుజాసారంబు లే
దయ్యె వినుము.
| 140
|
సీ. |
పాదఘట్టనములఁ బగిలి భూవలయంబు నెఱిదప్పి యొడ్డులు విఱిగి పడఁగ
నాసాకుటీరనిశ్వాసమారుతహతి శైలసంఘము బొమ్మరాలఁ బోల
దంష్ట్రాక్షినిర్గళద్దహనకీలల వియద్భ్రాష్ట్రతారాలాజపటలి పెటులఁ
గుటిలనటాచ్ఛటాకోటికుట్టనముల విరిసి మేఘంబులు మురిసిపోవ
నట్టహాసార్తి బ్రహ్మాండ మావులింప, హలహాలారావమున జిహ్వ సెలసికొనుచు
మించి క్రోధంబు మూర్తీభవించె ననఁగ, నుద్భవించె నృసింహదేవోత్తముండు.
| 141
|
క. |
గిరినిష్ఠుర మగుదానవ, వరువక్షము వాడిగోళ్ల వ్రచ్చుట యె ట్లా
నరకేసరిపౌరుషవి, స్ఫురణాటోపమున కీడు జోడుం గలదే.
| 142
|
క. |
మసమసఁగఁ బడియె దిక్కులు, విసరె నసమయప్రభూతవిలయానిలముల్
కసుగందెఁ దరణి ధరణియు, వసివాఁడె నృసింహుకోపవహ్నులు నిగుడున్.
| 143
|
క. |
సురపరివృఢశత మేనియుఁ, బరమేష్ఠిసహస్ర మైనఁ బావకపవిభా
స్కరు లొక్కలక్ష యైనను, హరిహరి నరహరికి నెదురె హరిణాంకధరా.
| 144
|
క. |
ఆకాలకూటకబళీ, స్వీకారము చేసినట్టి వీరుఁడ వీ వే
మోకాని మాకుఁ జూడ మ, హాకాళ నృసింహు నితరు లాఁగంగలరే.
| 145
|
క. |
ఈనెఱిఁ బరిమీఱినయా, శ్రీనరకేసరిప్రతాపశిఖిచందము మీ
కే నెఱిఁగింపఁగ వచ్చితి, నూనాయుధదర్పహరణ సురనుతచరణా.
| 146
|
ఉ. |
మానుషలీల న న్నెదుర మారుతభుఙ్నరులందు లేరు వై
మానికు లెల్ల నట్ల పురమర్దనుఁ డొక్కఁడె విఱ్ఱవీఁగెడిం
దా నెఱబంట నంచుఁ గదనంబున నాతఁడె పన్ని నిల్చినన్
మానముఁ బ్రాణముం గొని సమగ్రయశంబు వశంబు చేసెదన్.
| 147
|
వ. |
అని పలుమాఱు నమ్మరులుమానిసిమెకంబు వికవిక నగుచుండు దేవా నీ
వావావదూకుం బోనీక యాఁగి మాగిన పంతంబు సంతయు విడిపించి
శాంతునిం జేసి యీసకలభువనక్షోభంబు నుపసంహరింపం జేయవలయు
నని కంజభవప్రభవుం డంజలి సేయుటయు నాయుగ్రుం డుదగ్రలోచనప్ర
భలు నిగుడఁ బాయక సేవసేయుచుం జేనచెయి మీఁదగు నమందప్రారంభు
నందికేశ్వరుం దమోగుణవికారశబలితహృదయుం డై చూచుటయు నాత్రి
లోచనదౌవారికుండు నారదున కి ట్లనియె.
| 148
|
క. |
ఇది యాడఁదగినవాక్యం, బిది యాడఁగరా దటంచు నెఱుగరు విప్రు
ల్మదిఁ దోఁచినకొలఁదిన యాఁ, డుదు రేమేనియు శ్రవఃకఠోరము గాఁగన్.
| 149
|
సీ. |
తెగ వ్రేయఁడే ధగధ్ధగదుగ్రశరవాలధార నంధకశిరస్తామరసము
గూల్పఁడే సురశైలకోదండనిరుక్తపుండరీకాక్షాస్త్రమునఁ బురములు
నుఱుమాడఁడే మామ నోము నోమఁగఁ జొ[18]చ్చు తిండిపోతుల వేల్పుదుండగీల
నఱచేత వెనుపట్టె చఱవఁడే ముందలవట్టి మృత్యువుఁ గిట్టి బాధ పెట్టి
యమ్మహాదేవునాస్థాని కరుగుదెంచి, మేరమీఱంగ మానిసిమెకముబీర
మేల కొనియాడెదవు నీకు నెఱుకలేదె, నయనహృత్పూర్ణతంద్రవీణామునీంద్ర.
| 150
|
చ. |
హరుని భుజాబలంబుఁ గనకాద్రి యెఱుంగు గదాభిఘాత మా
తరణి యెఱుంగు బింక మలతామరచూలి యెఱుంగుఁ దూపుబ
ల్పగుసదనం బెఱుంగుఁ బురపంక్తి లలాటకృశానుకీల ల
మ్మరుఁడె యెఱుంగుఁ గాక వెడమౌను లెఱుంగఁగ నంతప్రోడలే.
| 151
|
క. |
హరునిపరాక్రమమును నర, హరిశౌర్యము నెల్లి నేఁట నమరాసురపం
కరుహభవాదులు నీవును, బరికించెద రేల వేగపడ జటిలవరా.
| 152
|
క. |
మృగలక్షణధరు నాదిమ, మృగయుఁ గరాసక్తయజ్ఞమృగు విధిమృగప
న్నగమూర్తిఁ గనిన యీనర, మృగ మేమి యొనర్పఁగలదు మృడు నెఱుఁగవొకో.
| 153
|
క. |
శంకాతంకకళంకము, గింకము నొకకొంత లేక క్రిక్కిఱిసిన యీ
శంకరుసభలో నాడిన, బొంకరి నినుఁ దడవఁదగదు భూసురుఁ డగుటన్.
| 154
|
క. |
విను దేవసభల వీణియఁ, గొని పాడెడుగాణ వగుటఁ గుసుమాయుధభం
జనుబలము చెప్పఁజూచితి, వినవె కనవె శంభుఁ బొగడువిద్వజ్జనులన్.
| 155
|
వ. |
అని యిట్లు సజ్జనానంది యగునంది డెందంబునం గుంది పలికిన పలుకుల కులికి
వెలితపసి వెలువడియె వెడవిలుతుపగఱయుఁ దగుపరివారంబును నంతర్ధా
నంబు నొంది రంత.
| 156
|
సీ. |
బలితంపుఱెక్కమొక్కల మొక్కలపుగాడ్పు ప్రాఁతగుబ్బలుల నుఱ్ఱూతలూఁప
మురియించు నిరువంక ముఖరంధ్రములనుండి పొగలేనిమంటలు బుగులుకొనఁగ
గజగాత్రములసావిఁ గబళింపఁ దునుకలై బలునీటిమోపరిబలఁగ మగల
మెట్టియూఁదిన[19] నేలపట్టువిచ్చిన గాడినెరియల బలియింటినెలవు దోఁపఁ
దారకలు రాల గ్రహములు ధరణి వ్రాల, జలధి ఘోషింప దిక్కులు జలదరింప
హరుఁడు శరభావతారంబు నవధరించి, వేగ మానవహరిపురోవీథి నిలిచె.
| 157
|
వ. |
ఇవ్విధంబున రుధిరోద్గారిముఖద్వయతిలకీకృతతృతీయలోచనద్వితయంబును
శాతచంచూపుటవిపాటితహరిదంతదంతికుంభకూటంబును బ్రహసితగ్రహర
మణకిరణధారాపరిణాహసితప్రహరణఘృణిద్విగుణీకృతవలయమణికిరణభుజా
దండంబును నఖండపక్షవిక్షేపప్రక్షుభితనభోభూమిభాగపాతాళగోళసంచారి
సంచయంబును దర్పితసర్పహారకర్పూరప్రకారకాంతిసంతానవర్ధితశరశరదభ్ర
విభ్రమంబును జతురచరణచంక్రమణసంచలితకులాచలనిచయంబును నపార
వీరావేశఘోరాటోపదీపితాంతరంగతరంగితక్రోధరసవికసనచకితజఠరస్థజగ
జ్జాలంబు నై యాభీలం బగు శరభాకారంబు తోరంపుబింకంబునం గొంకక
తనకట్టెదుటం జూపట్టుటయు నాకంబంపుంబుట్టు వాజగబెట్టి తనబెట్టిదంబు
వారించుటకు నై చేరిన మారవిరోధి మతకంపురూపుగా నెఱింగి కోపంబు
లోపలనే యడంచి గాంభీర్యగౌరవకాఠిన్యగర్వగర్భితవాక్యసందర్భంబున ని
ట్లనియె.
| 158
|
క. |
నీయందము నీచందము, నాయందములోనియవియు నాళీకహిత
చ్ఛాయకు లోపడనితమం, బేయెడ నున్నది యెఱుంగవే వికృతఖగా.
| 159
|
సీ. |
అర్ధపౌరుషము నీకనుషక్త మైనది యాలంబుమీఁదనె ట్లాసపుట్టెఁ
గరతలామలకమై కనుపట్టు శూలంబు భవవైద్యుఁ డనుకొంట పాటియగునె
తోలు గప్పియు నెట్లు తొడవనేర్చితి వుగ్రవారవాణము[20] వీరవర్ణితంబు
భంజళ్లఁ ద్రొక్కింపఁ బాండిత్య మున్నదే యిజంద్గవము విహీనజపము
పెంటబూడివపం డైనతొంటిమేను, విడిచి యొకపుల్లవై యేలవిఱ్ఱవీఁగె
దింత నిలు పోకుపోకు నీగంతు లెల్ల, మానిపించెద శరభసమాఖ్యతోడ.
| 160
|
క. |
ప్రద్యోతనతేజంబున, విద్యుత్ప్రభ యడఁగినట్లు విక్రమమున నీ
యుద్యోగము వారించెద, నాద్యంత ముదగ్రవిగ్రహానలశిఖలన్.
| 161
|
వ. |
అనిన విని కనలి సరభసంబుగ నాశరభశ్రేష్ఠంబు నిష్ఠురాలాపంబులు దీపింప
నాదివ్యహర్యక్షంబుతో ని ట్లనియె.
| 162
|
క. |
కులమును రూపును గుణమును, గలవాఁడవె పోలె నొరులఁ గఠినోక్తులచేఁ
గలఁగఁగ నాడెడు నీకును, గులమును రూపంబు నొక్కగుణముం గలదే.
| 163
|
సీ. |
సర్వ[21]జాతుల యథేచ్ఛాన్నవృత్తి వర్తింతు కుహనావిహారి వై రహివహింతు
వేకాకి వై యుందు వీరంపుగుహలందుఁ బట్టిచూడఁగరాదు పరుఁడ వెపుడు
తండ్రిబిడ్డలకైనఁ దలపెట్టుదువు పోరు కాద్రవేయ[22]ముపోలె నిద్రఘనము
పుణ్యజనశ్రేణి బొలియింతు వూరక దామోదరుఁడవు శ్రీధరుఁడ వెట్లు
కొలుచువారలలచ్చి కే[23]గ్రుచ్చదంతు, గబ్బుమీఱెద విసుమంతగాని లేవు
నిన్ను నీసుద్ధు లన్నియుఁ గన్నవార, మేల నామ్రోల నూరక ప్రేల నృహరి.
| 164
|
క. |
కదనంబున నాఱెక్కలు, సదనంబుగఁ బొడముదెంచు ఝంఝానిలముల్
వదనంబు సోఁకునప్పుడు, పద నంబుజనాభ తివిచి పఱచెద విచటన్.
| 165
|
క. |
ధరఁ దూఱిన గిరిఁ జేరిన, శరనిధి గ్రొచ్చిన నభంబు చని చొచ్చిన నా
కరచరణనఖరధారలఁ, బురుషమృగమ నిన్ను నిపుడ పొలియంజూతున్.
| 166
|
ఉ. |
సంధికి వచ్చినాఁడ విను సర్వజగంబులుఁ గ్రోధవహ్ని కి
ట్లింధన మేలచేసెద వొకించుక శాంతి వహించు నీకు మ
ద్బాంధవముద్ర మే లిటులు పల్కుట నిట్లని వీఁగి కాదు ధీ
బంధురు లైనవారిపరిపాటి సుమీ యిది చాటి చెప్పితిన్.
| 167
|
క. |
వీరమ కొని విఱవీఁగిన, దారుణమత్త్రోటికోటిదంభోళిమహో
దారతరధారలన నీ, గోరపురూపంబు నడఁగఁగొట్టుదుఁ గలనన్.
| 168
|
చ. |
అన విని యట్టసహాసభయదాననుఁ డై నరసింహదేవుఁ డా
మినుకులతేజిపుల్గుదొరమీఁదఁ గఠోరకటాక్షవీక్షణం
బొనరఁగఁ బల్కు నీవు వినవో కనవో దనుజారిపౌరుషం
బునదటు నిన్నుఁ బట్టి యిదే పొట్ట పగిల్చెద బిట్టుఁ గూల్చెదన్.
| 169
|
నారసింహశరభయుద్ధము
క. |
అని యన్యోన్యముఁ బరుసపుఁ, బెనుఁబలుకులు పల్కి వేల్పుప్రెగ్గడలు రయం
బునఁ గదిసి పోరఁ దొడఁగిరి, కనదనలోగ్రస్ఫులింగకలితేక్షణులై.
| 170
|
సీ. |
చఱచె ఱెక్కల నృకేసరిఁ గిట్టి శరభంబు పక్షీంద్రు గోళ్ల శ్రీభర్త చీరె
శూలి చంచున వనమాలిఫాలము చించె హరి ముష్టిహతి నొంచె నంగజారి
గద నురం బవియించెఁ గమలాక్షుఁ గామారి కొంగవాలున శార్ఙ్గి గొట్టె శివుని
హరుఁడు జానువులఁ గంసారి ప్రక్కలు నొక్కె బ్రమథేశుఁ జక్రి వాలమునఁ జుట్టె
మంత్రితవిభూతి నగ్నులు మండఁజేసి, విష్ణుదేవునిపైఁ జల్లె విషధరుండు
భుజగశయనుండు మాయంపుఁబొగలు ముంచెఁ, బంచవదనునిభూతప్రపంచ మదర.
| 171
|
సీ. |
క్రోధంబు చాలదే కుముదాహితుని మ్రింగఁ గడకంట మిడుఁగుఱుఁ గదువు లేల
యార్పులే చాలవే యఖిలంబు బధిరంబు గావింప బిగినవ్వుగమక మేల
క్షతజంబు చాలదే జలధులు పొంగింపఁ గమియు మేనుల నుబ్బుచెమట లేల
బుసకొట్లు చాలవే పుడమిదిద్దిరఁ ద్రిప్పఁ జటులహుంకారప్రచార మేల
యెంతయుద్రేక మెంతదుర్దాంతశక్తి, యెంతబింకంబు పొంకంబు నెంత యనుచు
నిలిచి దివమున నిర్జరావలులు పొగడ, నమరవృషభులు చేసి రుగ్రాహవంబు.
| 172
|
వ. |
ఈ ప్రకారంబున దీప్రాకారంబై యాప్రథమపురుషద్వయం బద్వయం బగు
పౌరుషంబునఁ దారసించి మేరలు మీఱిన వారాకరంబులును నార్పరానియన
లంబులును నుడివోవని యుగ్రవాయువులును నొండొంటిఁ దాఁకిన యుర్వీ
ధరశ్రేష్ఠంబులుం బోలె నాసాముఖనిష్ట్యూతకీలికీలాభీలంబుగ నాలంబు
సేయు సమయంబున నదభ్రభ్రమణచంక్రమణప్లుతపరివర్తనస్థానకోఠ్ఠవణాది
గతి విశేషంబులు గానిపించె నయ్యిద్ధఱయందునుం దారతమ్యంబు
సామ్యంబు చూపె నప్పుడు.
| 173
|
సీ. |
దివిమాసెఁ గనుమూసె దినకరబింబంబు కురిసె మేఘములు నెత్తురులవాన
విధి దూలె ధర వ్రీలె వేఁగెఁ దారాపంక్తి దిక్కులు చినచిన వ్రక్కలయ్యె
శిఖి మ్రగ్గె శశి మ్రొగ్గెఁ జింతాభరాక్రాంతి నుడుకెత్తెఁ బ్రజలకు నుదరపేటి*
ఫణి గుందెఁ గిటి గందెఁ బ్రథమకచ్ఛపరాజు తల పొట్టలో దూర్చె మలలు వడఁకె
మునులు వెఱచిరి సిద్ధులు ముచ్చముడిఁగి, రసురలోకంబు నసురుసు రయ్యె సిద్ధ
సాధ్యగంధర్వయక్షులు జలదరించి, రాశరభనారసింహులయాహవమున.
| 174
|
చ. |
హరి శరభంబుఁ దోలియును నాశరభేంద్రుఁడు నారసింహునిం
దెరలఁగఁ జేసియు న్మగుడ దీకొనియు న్సరిపోరి పోరి యా
సురగతి నుండువేళ హరుచుట్టునఁ బారిషదుల్ నరాదులు
న్సురియలు దాల్చి నిల్చిరి వచోనిచయారభటీవృతాశు లై.
| 175
|
క. |
మున్నాడి యసురవీరులు, పెన్నాటిక మైనసేన పిలపిల మనఁగా
నన్నారసింహుఁ గదిసిరి, కన్నారం జూచుఖచరగణములు వొగడన్.
| 176
|
చ. |
అలఘుభుజాబలప్రథితు లాశరపుంగవు లుగ్రసాధనం
బుల నరకేసరిం బొదువఁ బూనినయంతనె తన్నృసింహుచూ
పులయెఱమంటలం జిమిడిపోయిరి జీర్ణములైరి జీవము
ల్దొలఁగిరి తూలి రోటఱిరి తొట్రిలి వ్రాలిరి కూలి రందఱున్.
| 177
|
ఉ. |
ఆసమయంబునం బ్రమథు లార్చి రయంబొనగూర్చి పేర్చి బా
ణాసనసంప్రయుక్తనిశితాస్త్రములం బరఁగింప భూతసం
త్రాసకరంబులై నిగుడు తచ్ఛరము ల్నరసింహవక్త్రని
శ్వాసభవాగ్నిచే నడఁగి సర్వము భస్మము లయ్యెఁ జయ్యనన్.
| 178
|
క. |
ప్రమధుల సంగరలీలా, విముఖులఁ గావించుటయును విఱిగి పఱచి తా
సమున శరభేశువెనుకకుఁ, గమియఁజనిరి నృహరి నిలిచెఁ గల్పాగ్నిరుచిన్.
| 180
|
గీ. |
విఱిగి వచ్చినప్రమథుల వెఱపుదేరఁ, బలికి సంగరసన్నాహభయదలీల
నూలుకొనఁజేసి నంది యుల్లోలరోష, భీషణాకృతి ననిమొనఁ బెరిఁగి నిలిచి.
| 181
|
వ. |
పక్షికులాధ్యక్షుండు వీక్షింప మనుజహర్యక్షంబు నాక్షేపించుచు నక్షీణ
క్ష్వేళాముఖరితహరిన్ముఖుం డై ఖరకరసహస్రసహశ్రోతయు భూతజాతభయా
నకప్రభాపటలచటులంబును ద్రిపురపురపురంధ్రీకపోలతలముకురనికరమ
కరిపత్రికాలతాలవిత్రంబును నిజప్రతాపదహనధవిత్రంబు నగునొక్కశక్తిం
బ్రయోగించిన శేషజిహ్వాంచలాకారంబై తోరం బై మెఱయుచు నప్పర
మసాధనంబు మాధవరూపాంతరంబు పై నిగిడిన నాబలుమగండు గండు
మెఱసి దండధరదండోదారం బగునాక్రూరంపుటలుగును నేలం బెట్టి
కాలం జమరి కదియుటయు మదనహరదౌవారికుండు వైరంబు పేరిన మనో
వికారంబున ఘోరాననుం డై నారాచాసారంబు గురియుచు నరమహా
వీరంబుఁ గదిసి బెట్టిదంబుగ నిట్టు లనియె.
| 182
|
సీ. |
కనుఱెప్ప వేయక కనలిచూచిన నేమి సర్వతోముఖలీలఁ జనిన నేమి
ఘుర్ఘురధ్వనులతోఁ గొప్పరించిన నేమి బలునోరు దెఱచి గర్జిలిన నేమి
భువనసంపూర్తిగాఁ బొడవు సూపిన నేమి కొన్నెత్రు మైఁ బుల్ముకొన్న నేమి
యడవినుండక పోయి కడలి దాఁటిన నేమి మాయలముసలివై మనిన నేమి
|
|
|
కపటమునివృత్తిఁ బ్రౌఢిమ గనిన నేమి, కొదమసామ్రాణి నెక్కి తూకొనిన నేమి
నీకు వెఱతునె పోర నాళీకపత్ర, నయన శంకరభృత్యుండు నందివీఁడు.
| 183
|
క. |
నను గెలిచికాక శరభేం, ద్రునిపై నడరంగ వశమె దోషాచరమ
ర్దన నీబీరము గీరము, గనిపింపుము నాకుఁ గలనఁ గలనాశక్తిన్.
| 184
|
క. |
అనుటయు నమ్మాటకు మదిఁ, గనలి యనలశిఖలఁ బోలు కాండము లేసెన్
దనుజారి నందికేశ్వరు, తనువున నవి గ్రోలఁదొణఁగెఁ దద్రుధిరంబున్.
| 185
|
క. |
కడుదుఱులు గఱచి నట్లై, యొడలు విద్రుచుకొనుచు నందియును బఱచిన నా
కడసంజపొడుపుదేవర, వెడనవ్వుగ నవ్వి శరభవీరుని బొదివెన్.
| 186
|
లయగ్రాహి. |
వారిరువురుం గదిసి పోరిరి లయాంబుధులు పోరు నెఱజోక మదవారణకులేంద్రుల్
పోరుగతి సింగమ్ములు పోరు నెసకంబున సుదారుణభుజంగములు పోరుమరియాద
న్ఘోరదవనహ్నులొగిఁ బోరు చటులస్ఫురణ మారుతము లుద్దవిడిఁ బోరుబలువీఁకం
దార లిల రాలఁ దిమిరారి రుచి వ్రీల [24]బలవైరి నెరిదూల నిజపౌరుషము వాలన్.
| 187
|
మ. |
శరభేంద్రుండు మనంబులోఁ దలచె రక్షఃసైనికాభీలముం
జిరవైరోద్ధతభాస్కరోద్భవశిరశ్చేదక్రియామూలముం
బురవప్రావళిభూరిమేఘవిలయప్రోద్భూతవాతూలము
స్వరఘంటాజనితాతిదీర్ఘనినదవ్యాలోలము న్శూలమున్.
| 188
|
సీ. |
గబ్బిమే నుబ్బునఁ గదిసిన గజదైత్యుకండలు చెండిన గదురుకంపు
నలచిత్రకాయకాయము విదారించినఁ గడుఁజుట్టుకొను విస్రగంధలహరి
యంధకారఃకవాటాంతర్విపాటన మాచరించుటనైన నీచువలపు
కొనగోరఁ జిమ్మి వాకులకొమ్మమగని యౌదల గ్రువ్వఁ బొదువు మేదంపుఁబొలసు
సురకరవిముక్తమందారతరులతాంత, గంధములఁ బొత్తుగలసిన బంధురాత్మ
కీర్తిసౌరభవైభవస్ఫూర్తిచేత, నుడుపుకొను శూల మడరె నమ్మృడుని మ్రోల.
| 189
|
క. |
పుటములుగొను పెటపెటలుం, జిటచిటలుం గలిగి విలయశిఖు లుదయించెన్
జటిలము లై నిజతేజః, కుటిలములై మూఁడుమొనలక్రూరాస్త్రమునన్.
| 190
|
వ. |
ఇట్లుసాక్షాత్కరించిన యాశుశుక్షణికీలంబునుం బోని శూలంబుఁ గేలం
గీలించి శరభుం డసురభంజనుపై వైనం బూనుటయు.
| 191
|
ఉ. |
విక్రమసత్త్వసంయుతుఁడు వీరనృసింహుఁడు లోఁ దలంచె ని
ర్వక్రపరాక్రమక్రమధురంధరసాహసికత్వవిభ్రమో
|
|
|
పక్రమమీనధామగృహపాలనిజధ్వజినీమహాపుర
శ్శుక్రము నిర్గళజ్జ్వలనశోషితనక్రము నాత్మచక్రమున్.
| 192
|
క. |
తలఁచిన నిలిచె సుదర్శన, మలఘుసుదర్శనము సజ్జనానందంబుం
దలకొలుప నరిప్రభయము,[25] నెలకొలుపఁగ నృహరికేల నిర్బరలీలన్.
| 193
|
వ. |
ఇట్లు శరభనృసింహులు సంహారరుద్రాకారులై జగదుపప్లవకారణం బగు
మహారణంబునకు నుపక్రమించి శూలచక్రంబు లెత్తుటయు మొగులుమొ
త్తంబులు నెత్తురులు గురిసె ధరణి విరిసె గిరులు వడంకె సముద్రంబు లివు
రంబాఱె మహాకూర్మంబు బిలంబుఁ దూరె నరనాగసురాసురగరుడగంధర్వ
సిద్ధసాధ్యు [26]లసాధ్యం బగుమనస్తాపంబునం దపించిరి భూతప్రపంచంబు
కుంచితసంచారం బయ్యె నంత.
| 194
|
బ్రహ్మ హరిహరులయుద్ధము మాన్పవచ్చి స్తుతించుట
సీ. |
హస్తాబ్దముననున్న యక్షమాలిక వోవ వైచి మ్రోలను నున్న వాణి మఱచి
హరిపాదతీర్థపూరాభిపూరిత మైన పద్మరాగపుగిండి పగుల నడిచి
నలునంక మొగములఁ దలచూపు చెమటల మంచునేత్రంబుల ముంచుకొనఁగఁ
గీలుగంటూడిన లోలజటచ్ఛటావళి యొకకేలనె బలిమిఁ దుఱిమి
కోపమోకాక యావేశగుణమొకాక, గ్రహము సోఁకెనొకాక యీద్రుహిణునకును
ననుచు జనములు బెగడంగ నంచతేజి, రౌతు కాల్నడ వచ్చె నుద్భూతభీతి[27].
| 195
|
క. |
సమరము సేయుచు ఘూర్ణిలు, నమరేంద్రుల నడుమ నిలిచి యాగమసూక్త
క్రమమున నుతియించు వచో, రమణీరమణుండు చతురరచనారభటిన్.
| 196
|
సీ. |
జయ పుండరీకాక్ష జయ ప్రమథాధ్యక్ష జయ రమాతరుణీశ జయ యుమేశ
జయ యోగిగణసాధ్య జయ సజ్జనారాధ్య జయ జైత్రగుణజాల జయ సుశీల
జయ భక్తమందార జయ ధవళాకార జయ కవిస్తుతిపాత్ర జయ పవిత్ర
జయ సముజ్జ్వలవేష జయ తిరస్కృతదోష జయ మేఘసంకాశ జయ మహేశ
జయ సువర్ణపటావృతస్థపుటజఘన, జయ మృగాదనచర్మసంఛాదనఘన
జయ గదాపాంచజన్యాసిచక్రహస్త, జయ త్రిశూలాదిశస్త్రరాజప్రశస్త.
| 197
|
చ. |
జయ ఫణిరాజతల్ప జయ సర్వజగన్నుత కౌస్తుభాంకితా
జయ నరసింహరూప జయ శాశ్వత వార్ధతనూభవాధిపా
జయ రజతాద్రిగేహ జయ శంబరశాత్రవభూతిభూషితా
జయ శరభావతార జయ శంకర శైలసుతామనోహరా.
| 198
|
సీ. |
వెడఁదయురంబున నెడమభాగంబునఁ జలువపుట్టిండ్లకొమ్మలు చెలంగ
మడుగుఁబాన్పును గేళికడియంబునై గాడ్పుప్రత్తిలక్కయునైనప్రాణి దనరఁ
బ్రబలనాభీజటాపటలాంచలంబులఁ గమలంబులొకరెండు కాంతి మీఱ
నొఱపైన సాంబ్రాణియును ముద్దుగొడుకునై యనురాగమున వినాయకులు మెలఁగఁ
బంచజనసింహశరభరూపములు దాల్చి, ప్రాణమును మేనుఁబోలెనున్నట్టి మీకు
వందనంబును నతినమోవాక మంజ, లియును గావింతు నాదిమలేఖులార.
| 199
|
వ. |
అని యిట్లు నృసింహశరభరూపంబులు ధరియించిన కాంచనాంబరపంచవద
నులకు విరించి వందనంబు లందంద కావించి వెండియు నిట్లనియె.
| 200
|
గీ. |
ప్రజలఁ బ్రోచుపనికి బద్ధకంకణు లైన, యఖిలమయులు మీర లాగ్రహమున
మేరమీఱి పోరు కారణంబునఁ దమ్మి, యాకుమీఁదినీర మయ్యె జగము.
| 201
|
శా. |
భూమికంటకు లైన దైత్యవరులం బోనీక శౌర్యక్రియా
సామగ్రి న్ములుచూపు వారిశిరము ట్చక్కాడి యుక్కెక్కి యు
ద్ధామఖ్యాతిఁ జెలంగుట ల్విడిచి భూతశ్రేణి భీతిల్లఁగా
నీ మేరిద్దఱుఁ బోరుట ల్తగునె లక్ష్మీశా యుమావల్లభా.
| 202
|
క. |
మీరిరువురు భువనావన, కారణములు మీర లిట్లు గదిసి పెనఁగిన
న్నేరుచునె సర్వకర్మ, ప్రారంభము చక్క నిలువఁ బ్రకృతిస్థంబై.
| 203
|
గీ. |
ఈతమోవికార మేటికి మీకు మీ, నామపఠనమాత్ర నరులకెల్లఁ
జిక్కువడిన మనసుచీఁకట్లు వాయంగఁ, దెలిసికొనుఁడు మీప్రదీప్తమహిమ.
| 204
|
క. |
ఎదిరినపగ మీలోపల, ముదిరినయది లేదు లోకములు గూఁకలిడం
గదనము సేయఁగఁ దగునే, మదనజనక మదనదమన మానుఁడు గినుకల్.
| 205
|
సీ. |
కైటభమధుశిరఃఖండనావక్రంబు చక్రంబు తేజ మసహ్యతరము
లోలకాలానలాభీలానసం బైన శూలంబు జనమనశ్శూలగదము
గావున నివి రెండుఁ గదనజయాకాంక్ష మీరు ప్రయోగింప మేర లణఁగు
నావిన్నపము విని ననుఁ జాల మన్నించి యుపసంహరింపుఁ డీయుగ్రసాధ
నముల నని నల్వ ప్రార్ధింప నలిననేత్ర, ఫాలనేత్రులు తమపూఁచిపట్టియున్న
యాయుధంబులు క్రమ్మఱునట్లు సేయ, భూతజాలంబు సంతోషమునఁ జెలంగె.
| 206
|
వ. |
ఇ ట్లుపసంహృతాయుధం బై యాయోధద్వయంబు.
| 207
|
క. |
కర్పూరదీపకళికల, నేర్పునఁ దమయంత నుడిగి నిర్మలకాంతుల్
దర్శింప శాంతిమయహృ, ద్దర్పణమై నిలిచె భువనతాపము నుడిగెన్.
| 208
|
సీ. |
వైజయంతీలతోజ్జ్వలభుజామధ్యంబు విధిశిరోమాలికావేల్లికంబు
హరిచందనామందతరసౌరభమయంబు సూనాస్త్రతనుభూతిసురభిశంబు
దివ్యతీర్థౌఘమందిరపదాంభోజంబు మందాకినీవృతమకుటతటము
చక్రప్రముఖదివ్యశస్త్రాస్త్రకలితంబు శూలాదిసాధనశోభితంబు
నీలనీలంబు మృదుఫేనజాలనిభము, గరుడవాహంబు వృషభప్రకాండరథము
నైనరూపంబు హరియును హరుఁడుఁ దాల్చి, నిల్చిపొల్చిరి బహురామణీయకముల.
| 209
|
సీ. |
ఆమ్నాయసూక్తి హృద్యముగాఁగఁ గీర్తించె సనకాదియోగీంద్రసంచయంబు
శబ్దానుశాసనసౌభాగ్యమధురంబుగాఁ గాద్రవేయపుంగవుఁడు పొగడెఁ
బరమమంత్రరహస్యపరిపాటి వాటిల్ల సైద్ధలోకంబు ప్రశంసచేసె
సంగీతమాధురీసాధుగీతి సెలంగఁ గిన్నరగంధర్వులు న్నుతించి
రఖిలభువననివాసు లాయాయితెఱఁగు, లేర్పడ భజించి రాకంసదర్పహరుని
సర్పహారుని గ్రూరప్రచార ముడిగి, రాజబింబాభిరాములై తేజరిల్ల.
| 210
|
మాలిని. |
హరిదిభకటదానాయత్తమత్తాలిపంక్తుల్
మరులుకొనుచు వెంట న్మాటికి న్మాటికి న్రా
సురకరపరిముక్తాక్షుద్రనిర్ణిద్రపుష్పో
త్కరము ముసురు వట్టెన్ గంధపాణింధమంబై.
| 211
|
క. |
సింధునినదగాంభీర్యధు, రంధరములు త్రిదివసౌధరంధ్రగతంబుల్
బంధురములు సురదుందుభి, ధింధిమములు చెలఁగె సకలదిక్కులయందున్.
| 212
|
వ. |
ఆసమయంబున వాసవాలయవధూనాట్యవైదగ్ధ్యంబులు విదగ్ధనయనరంజ
కంబులై చెలంగె భృంగీశ్వరుం డాపతంగధ్వజపుంగవధ్వజుల నిజమనోవృ
త్తంబు తనచిత్తంబున నెఱింగి నాట్యరంగంబున నిలిచి మృదంగతాళవీణా
వేణునినాదంబులు కందుకొనఁ బతాకత్రిపతాకాదు లైనయసంయుతచతు
ర్వింశతిహస్తంబుల నంజలికపోతస్వస్తికప్రధానంబులై సంయుతంబులైన త్ర
యోదశకరంబులును జతురశ్రరేచితార్థరేచితాభిధానంబులై తనరు త్రిం
శద్దాత్రో.....పాణితలంబులఁ బ్రయుక్తంబులైన ముద్రావిశేషంబుల భావార్థా
భినయంబు చూప నంగప్రత్యంగోపాంగరూపంబు లగునవయవంబులచేతఁ
దంతన్యమానం బై మార్గకుండలిదేశ్యుద్ధతబహురూపవిలాసంబు లనంబ
రఁగు షడ్విధంబులం బ్రవృత్తంబులై తత్కృతంబు లైనచౌకంబును మొగ
చాళియు నిస్సరణంబును నటనంబును భావంబును జివుకును దలారంబును మం
డలంబును నాయుధచారులును దిశయు నవదిశయుఁ దట్టుమానంబును దల
|
|
|
చంచును జచ్చళికెయుఁ జిత్రతాళంబును సళ్లు కత్రంబును నురుపును దువా
ళంబును బుష్పాంజలి మొద లయిన నటనపటిమంబులు తాళలయంబు లను
సరించి రూపక వార్తిక చిత్రక మానంబులం బ్రవర్తించు చంచుపుట చాచ
పుటాది తాళభంగు లెఱింగి యంగహారకరణస్థానకవృత్తిమండలసంయుక్తం
బుగఁ దాండవం బఖండపాండిత్యంబునఁ బ్రకటించుటయు నన్నిటలన
యనహాటకపటులు హాటికం బగునమ్మహాపారిషదునిం బారితోషికప్రదా
నంబున సన్మానించి రంత విరించి యప్పరమపురుషులం గూర్చి యిట్లనియె.
| 213
|
సీ. |
ఇది హేమమయపీఠ మే మున్ను గల్పించి పాటించి దాఁచితిఁ బాటవమున
నని బహుయోజనాయతము మాణిక్యసింహాంచితంబును ననర్ఘ్యంబు నైన
గద్దియ యొకటి వేగంబ యాకర్షింప నది భానుబింబసహస్రతుల్య
మగుచు నిల్చుటయు నాహర్యక్షపీఠిపై నజుఁడు నిల్పఁగ హరిహరులు నిలిచి
నీలమును వజ్రఫలకంబుఁ బోలి యుత్ప, లంబుఁ గుముదంబు ననఁదగి లచ్చితోడి
యురము నగరాజపుత్రిక కునికి యైన, యెడమవంకయుఁ గలిగి శ్రీ నిరవుకొనిరి.
| 214
|
గీ. |
అట్టివేళ నలువ యానందజలరాశి, నోలలాడుచున్నయుల్ల మలర
లోకనాథు లట్టు లేకాసనస్థులై, తేజరిల్లఁ గని నుతించె మఱియు.
| 215
|
మ. |
ఘనసంసారసముద్రవారినిజదుష్కర్మాగతానేకరో
గనిపీతాంగవిలాసు లై ధనసుహృత్కాంతావియోగార్తి సం
జనితం బైన మనోవ్యథం గుదియు తుచ్ఛస్వాంతు లెల్లన్ జనా
ర్ధన నీ పాదపయోజపత్రజలధారల్ గ్రోల రేకాలమున్.
| 216
|
క. |
ఉపవాసక్రతుదానము, లపరిమితము లాచరించు నైనం గానీ
త్రిపురాంతకసఖ నీయెడ, నపరాధము దలఁచెనేని యతియును యతియే.
| 217
|
క. |
నీనామస్మరణంబును, నీనామజపంబుఁ జేయు నిశ్చలహృదయుల్
శ్రీనాయక యపవర్గత, మానాయకు లగుదు రమరమానితు లగుచున్.
| 218
|
క. |
[28]బుజవైచితి వసురేంద్రుని, భుజమధ్యము చించి భువనమునఁ గలబాధల్
గజరాజనరద నీయ, క్కజపుపదటు నుదుటు మున్ను గని మది మెత్తున్.
| 219
|
క. |
దానవునెపమునఁ బొడమిన, నీనిర్భరతేజ మిట్లు నిఖిలము నొంచెం
గాని జగన్నాయక నీ, మానస మీజగముమీఁద మచ్చరపడునే.
| 220
|
వ. |
అని హంసవాహనుం డాహరిం బ్రశంసించి హరున కభిముఖుండై యి ట్ల
నియె.
| 221
|
చ. |
పురమథనం బొనర్చితివి పొంగువిషానల మారగించి ని
ర్జరులకు మేలుఁ జేసితివి చంగునఁ బైఁబడు బెబ్బులిన్ భయం
కరకరశూలఘాతములఁ గాలునిప్రోలికి నంచి మించి తీ
శ్వర భవదద్భుతోద్ధతి ప్రశంసయొనర్పఁగ నాకు శక్యమే.
| 222
|
క. |
భవదాకారము లింగ, వ్యవహృతిపై నావహించి యాగమసరణిం
దవిలి భజియించు శైవులు, కవయుదు రతిధన్యముక్తికన్యామణులన్.
| 223
|
సీ. |
చక్కాడితివొ లేదొ సంవర్తమున జగజ్జాలంబు శూలంబు కేలఁ గ్రాల
ముక్కు చెక్కితొ లేదొ మొక్కలంబున నఱ్ఱు ద్రొక్కి మృత్యువునెత్తితొడుపుఁగత్తి
వక్కలించితో లేదొ వారణాసురగాత్రగోత్రంబు నఖరాగ్రదాత్రలతలఁ
జెక్కువ్రేసితో లేదొ జక్కవచెలికానిఁ బట్టి గీపెట్టి లోఁదట్టువాఱ
మఱియు నీవొన[29]ర్చమానుషక్రమములు, లెక్కసేయువారు లేరు నిజము
గజముఖప్రసూతి గలవేల్ప నా యల్ప, జల్పసరణి నీప్రశంస కురునె.
| 224
|
అవతారద్వయోపసంహారము
వ. |
అని పంకజాసనుం డాసారాకారసుధాధారం బగు వాక్యప్రకారంబున సారె
సారెం బొగడిన నగుమొగంబు లొలయ నాజగద్రక్షకు లిద్దఱు నావేల్పుఁ
బెద్ద పెట్టినగద్దియపై నతనికోరిక లీరిక లెత్త నీరంబు నీరంబును దుగ్ధంబు
దుగ్ధంబును బారదంబు పారదంబునుం గలసినకరణి నేకీభవించి రాహరిహర
రూపం బాపదసంభవువకు వరప్రదానలాభంబై శోభిల్లె నాక్షణంబ.
| 225
|
గీ. |
బీజ మొకట రెండుభూజంబు లుదయించు, నోజ నట్టిదివ్యతేజమునను
హరియు హరుఁడు సంగతాంగులై యుదయింప, వదనవలయ మమరె వనజజునకు.
| 226
|
సీ. |
మందారదామంబు నిందుఖండంబును మౌళిభాగంబుసం గీలితముగ
మణికుండలమ్మును ఫణికుండలమ్మును గండమండలముల మెండుకొనఁగఁ
జక్రాంకశూలాంకశయముల మాణిక్యకంకణభుజగకంకణము లమరఁ
గనకకౌశేయంబు గజరాజచర్మంబు మునుకొని కటిభాగముల ఘటిల్ల
రమయు నుమయును నుభయపార్శ్వముల నలరఁ
బులుఁగుఱేఁడును నందియుఁ గొలిచి మెలఁగ
వైష్ణవశ్రేష్ఠులును శైవవరులుఁ బొగడ
హరిహరస్ఫూర్తి యేకదేహమున నిలిచె.
| 227
|
వ. |
ఇట్లు నారాయణస్థాణువు లొక్కతనువునం గ్రిక్కిఱిసిన నెలవు హరిహరాభి
ధానం బగుమహాతీర్థప్రధానం బయ్యె నందు.
| 228
|
సీ. |
తానంబు లొనరించు ధన్యుఁ డాకాశగంగానదీకల్లోలఘటల నీఁదు
దానంబు గావించుధర్మతత్పరుఁ డర్థపతినిధానములకుఁ బ్రభుతఁ గాంచు
రోగంబుగలవారిఁ బ్రోచుపుణ్యాధికుం డేబాధయును లేక యెసఁగు దివిని
నుపవాసజపతపోహోమంబు లొనరించు కృతిఁగీర్తనము సేయుఁ గిన్నరాళి
హరిహరారాధనము నన్వహమును జలుపు, నిష్ఠ నిను బాడు[30]వారలనిలయములకుఁ
జాల వశవర్తియై యుండు సకలలోక, గర్భపరిపూర్ణకీర్తిసందర్భుఁ డగుచు.
| 229
|
వ. |
అని రోమహర్షణుం డమ్మహర్షులకు నరసింహశరభసమరవ్యాజంబున హరి
హరతేజోవిశేషం బశేషంబును వర్ణించి వెండియు ని ట్లనియె.
| 230
|
క. |
శరభనృసింహులచరితము, నిరుపమసద్భక్తి వినిన నిర్మలమతులై
నరులు సుఖింతురు సుస్థిర, పరమైశ్వర్యానుభావభావితు లగుచున్.
| 231
|
క. |
హావళిచినయౌభళవసు, ధావల్లభమంత్రివర్య ధైర్యాహార్యా
ధీవిభవతోషితార్యా, పావననేత్రాబ్దయుగకృపారసధుర్యా.
| 232
|
ఉ. |
దానవిలాసకంధర ప్రధానయుగంధర హారకంధరా
మానవతీమనోభవ సమగ్రరమాభవ జిష్ణువైభవా
మానవిధాసుయోధన సమంచితబోధన సత్యశోధనా
మానసవైరిభీషణ తమఃపరిశోషణ బంధుపోషణా.
| 233
|
తోటకవృత్తము. |
దినకృద్యుతివత్పరిదీప్తివిభా, వనరాశినివాసనివాసమనా
వినయోజ్జ్వలభూషణవీర్యనిధీ, ధనరాశివితీర్ణకథాచతురా.
| 234
|
గద్యము. |
ఇది శ్రీ హనుమత్కటాక్షలబ్దవరప్రసాద సహజసారస్వతచంద్రనామాం
క భారద్వాజసగోత్రపవిత్ర రామవిద్వన్మణికుమా రాష్టఘంటావధాన
పరమేశ్వర హరిభట్టారకప్రణీతం బైన నరసింహపురాణోక్తం బగునుత్తర
భాగంబునందుఁ బ్రహ్లాదప్రతిష్టాపనంబును రాక్షసులతపోమహత్త్వం
బును వారలకు హరుండు ప్రత్యక్షం బగుటయు నారదాగమనంబును
నందికేశ్వరనారదసంవాదంబును శరభావిర్భావంబును శరభనృసింహు
లయుద్ధంబును బితామహసమాగమనంబును బ్రహ్మస్తవంబును నవ
తారద్వయోపసంహారంబును హరిహరక్షేత్రమహత్త్వంబు ననంబరఁగు
ప్రథమాశ్వాసము.
|
|