Jump to content

నారసింహపురాణము/ద్వితీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

ద్వితీయాశ్వాసము


క.

శ్రీరమణీహృద్రంజన, నారాయణచరణయుగళనారజసేవా
పారాయణ పరితోషిత, నారీనివహాంతరంగ నరసయరంగా.

1


వ.

ఆకర్ణింపు మట్లు శౌనకాదిమునివరులు రోమహర్షుని వలన శరభావతారవృ
త్తాంతం బెఱింగి సంతసించి మఱియు నిట్లనిరి.

2


క.

నరసింహదత్తరాజ్య, స్థిరుఁ డై ప్రహ్లాదుఁ డేమి చేసెనొ తుదఁ ద
చ్చరితంబు వినఁగవలయును, బరిపూర్ణవచోవిశేషపరమార్థజ్ఞా.

3


వ.

అని పలికిన మునివరులకు రోమహర్షణుండు సంతుష్టహృదయుం డై యి
ట్లనియె నట్లు ప్రహ్లాదుండు నరసింహరూపంబు ధరించిన లక్ష్మీవల్లభుని వర
ప్రసాదలబ్ధం బగు రాజ్యంబు నిష్కంటకంబుగఁ బాలనంబు సేయుచు.

4


సీ.

కండక్రొవ్వున రేసి కలహింపఁబూనిన సకలశాత్రవకోటిఁ జక్కుచేసి
న్యాయంబు విడిచి యన్యాయమార్గంబునఁ జనఁబూనుక్రూరులఁ జదియమోది
పరకామినీధనాపహరణోద్యుక్తులౌ చక్రాంకసమయదూషకులఁ దునిమి
శ్వాపదధ్వంసి యై సారంగశశశల్యరురుముఖ్యములకు నారోగ్య మొసఁగి
జవ్వనపువింతసంభృతోత్సాహుఁ డయ్యుఁ, గామరోషాధిరిపులచేఁ గట్టువడక
నవ్యధర్మప్రతిష్టాపనంబుచేత, నొసఁగెఁ బ్రహ్లాదుఁ డానందరసము రసకు.

5


క.

తమనోరికళ్లు గొని వై, రమునం గారించు దైత్యరాజు మఱచి యా
గములఁ బురోడాశము లా, యమరేంద్రాదులు భుజింతు రతనిమఖములన్.

6


సీ.

కలుషసంఘాతంబు గడికండములు చేసి దోషంబులకుఁ జేటుఁద్రోవఁ జూపి
యేనస్సమూహంబు లీనంబు గావించి వృజిననిర్బంధంబు వీడఁదన్ని
యంహోనికాయోగ్రరంహంబు బిట్టాఁగి దురితంబు లింతింత దుమురు చేసి
దుష్కృతశతముల ధూళిలో మ్రగ్గించి పాపరూపము పటాపంచ[1] చేసి
ధరణి ధేనువు నాల్గుపాదముల నిలిచి, తుష్టిఁ బురుషార్థమయపయోవృష్టి గురియ
నేలె రాజ్యంబు దానవాధీశసూతి, నాలుగంచుల నవయౌవనంబునందు.

7

సీ.

పౌలోమిపాలిండ్లపంచఁ జెక్కిలి చేర్చి సుఖయించె బలపాకసుఖవిరోధి
జముఁడు నారకలోకసౌఖ్యోపదేష్ట యై వర్తించె నతిభద్రవర్తనముల
వరుణుండు గావించె సురతరు ప్రసవనిర్గళదచ్ఛమధుపానకౌతుకంబు
వెలిఁ బాఱవైచిన వివిధనిధానంబు లర్థాధిపతి తెచ్చె నాలయమున
కాచరించిరి నిర్విఘ్న మగుతపంబు, మునులు కాలంబు దప్పక చినికె మొగులు
నారసాతలధరణీసురాలయములు, పూర్వగతి నిల్చెఁ జాంచల్యమును[2] దొలంగి.

8


సీ.

అశ్రులు హోమధూమావృతాక్షులయందె మద మత్యుదగ్రద్విరదములందె
వర్ణసాంకర్యంబు వ్రాయుచిత్తరువందె దృఢబంధకలన సత్కృతులయందె
చిరవక్రగతి వధూచికురవల్లరులందె కంపంబు కేతనాగ్రములయందె
తొట్రుకొంట గవాక్షధూపధూమములందె జాడ్యంబు కేలిహంసగతియందె
యధికమగు లేమి లేములయందె యతను, వృత్తివర్తనములయందెవెలయుఁ గాని
లేదు ప్రహ్లాదుఁ డేలెడుమేదినీత, లాంతరాళంబునందు నొక్కింత యైన.

9


సీ.

ఇభగండదానవాహినులు ఘోట్టాణాశ్వఖురవుటరజముచేఁ గ్రుక్కఁబాఱ
నామతీర్థపువేళ నారదముని తనపదములు మధువైరియెదుట నొడువ
శరలూనశత్రుశీర్షములు గన్గొని రాహువక్త్రంబు లని వివస్వంతుఁ డులుకఁ
గీర్తిచంద్రుఁడు పరిస్ఫూర్తిమన్మూర్తి యై భువనజీవంజీవములఁ బొదల్ప
వాసవపురి వితానవిన్యాసముగను, నేల పాదాంగుళీరవినీలముగను
నల్లబలియిక్కబొక్కస మిల్లు గాఁగ, వెలసెఁ బ్రహ్లాదుఁ డాహ్లాదకలితుఁ డగుచు.

10


ఉ.

ఖేచరవైరినందనునికీర్తి దిశావళి బిక్కటిల్లఁగాఁ
జూచి చకోరరాజి నలుచుట్టులుఁ ద్రిమ్మరుఁ జంద్రికామతిన్
వాచవి నంచపిండు గఱవం దమకించు మృణాలవల్లరీ
వీచిక లంచు నిట్టిశుభవిభ్రమశోభితుఁ డెందుఁ గల్గునే.

11


క.

ముసలహతి నసుహృదిభకట, విసర మసురపతి వగుల్ప వెడలినముక్తా
మసృణరజోమండలిసొం, పెసఁగుం దత్కీర్తిమూర్తి హేలావహ మై.

12


క.

మరుదశనభువన మేలెన్, హరిహయపుర మేలె ధరణి యంతయు నేలెం
దరతమభావజ్ఞుం డై, హిరణ్యకశిపూద్భవుం డహీనప్రౌఢిన్.

13


సీ.

ఏవేళఁ జూచినా యింద్రాదిదేవతాలబ్ధోపదానలీలావిభూతి
యేప్రొద్దు చూచినా హితపురోహితముఖోదితతత్త్వవాక్యసంగతమనీష

యేతఱిఁ జూచినా వాతంధయాధీశదత్తరత్నావళీదర్శనంబు
లేసమయము చూచినా సదాశివమిత్రగోచరగ్రంథార్థసూచనంబు
గాఁగ రాజ్యంబుఁ బ్రోచె సాగరముఁ జేరు, నేఱులునుబోలె లోకసమిధ్ధలక్ష్ము
లాతభవనాంతరంబున నతిశయింపఁ, బ్రోదిఁ బ్రహ్లాదుఁ డాశ్రితాహ్లాదకరుఁడు.

14


సీ.

ధర్మప్రజాప్తికై ధరణీతలేశ్వరార్పితకన్యకాశ్రేణిఁ బెండ్లియాడి
యవనీసురప్రీతికై న్యాయమార్గంబు జరపుచు విత్తంబు సంగ్రహించి
యధికకీర్తిప్రాప్తికై యెదిర్చిన వైరిమండలాధీశులమద మణంచి
దివిజసంతృప్తికై ధృతితోడ నశ్వమేధాధ్వరాదిక్రియ లాచరించి
యఖిలవిద్యావిశేషంబు లభ్యసించి, డెంద మంతయు హరభక్తియంద నిలిపి
గంధవద్వైరివంశనిర్గంధనముగ, ధాత్రిఁ బాలించె బలశత్రుశత్రుసూతి.

15


సీ.

హృదయంబు లక్ష్మీశపదపద్మములయంద వినుకులు హరికధల్ వినుటయంద
నయనంబు లిందిరాప్రియదర్శనమునంద శిరము కేశవనమస్కృతులయంద
పదము లంబుజనాభభవనయాత్రలయంద శయములు విష్ణుపూజనమునంద
ఘ్రాణంబు శార్ఙ్గినిర్మాల్యగంధమునంద రసన కైటభరిపుప్రణుతియంద
పాదుకొనఁ గామినీపుత్త్రబాంధవాది, కలితసుఖములు మిథ్యగాఁ దలఁచికొనుచు
వసుమతీచక్ర మేకోష్ణవారణముగ, లీలఁ బాలించె దైతేయపాలసుతుఁడు.

16


చ.

హరిహయువిందు పావకున కర్మిలి భానుజుమేనినీడ ని
ర్జరరిపుమంత్రి యబ్ధిపతి ప్రాణము వాయువుకాయ మాధవే
శ్వరుపరమాప్తుఁ డీశ్వరు వశంబుగఁ జేయు కుశాగ్రబుద్ధి యీ
సురరిపుసూనుఁ డంచుఁ దలఁచున్ భువనత్రయ మమ్మహామహున్.

17


క.

చీఁకటియుఁ జంద్రికారస, మేకస్థానంబునంద యిరవొందుగతి
న్నాకౌకోరిపుకులము, న్నాకాలయకులము నొక్కనంటున మెలఁగున్.

18


వ.

అట్లు సాదరగుణమేదురుండై ప్రహ్లాదుండు గురువులకుం బరిచర్యయు సుమన
స్కులకు మనస్తర్పణంబును గులంబునకు బలంబును సిరులకుం బరిపుష్టియు
వసుమతికిం బసిమియుఁ బాతాళంబునకుఁ బ్రీతియుఁ ద్రిదివంబునకు ముదం
బును దిక్పతులకు మక్కువయును నగ్నులకు హర్షనిమగ్నత్వంబును వైదాంతి
కులకుఁ బ్రమోదంబును దార్కికులకుఁ దర్కంబును బరమవైష్ణవులకు నిరుప
మానందనిష్ణాతుఁడగుటయు శ్రుతులకు నభిరతియుఁ బురాణంబులకు నపరి
క్షీణభావంబును శాస్త్రంబులకుఁ బ్రశస్తియుఁ గావించుచు భూవలయపాలన
ఖేలనలంపటుం డై సొంపుమీఱి నిజకీర్తిగంగాతరంగధారాప్రవాహంబున

రజనీచరచరిత్రదుర్దమకర్దమసంక్షాళన బాచరించుచు సింధునదీసవిధంబున
వివిధమణిప్రభాశుభావహం బై ప్రభావతి యనం బరఁగిన విశ్వకర్మనిర్మితం
బగుపురంబుఁ గరంబు తిరం బగునెయ్యంబు తియ్యంబున నరయచు నుండె
నందలి సౌభాగ్యం బెట్టి దనిన.

19


పురవర్ణనము

సీ.

వేదండతతు లెల్లఁ జౌదంతికొదమలు హరు లెల్ల నుచ్చైశ్శ్రవాన్వయము
లరదంబు లెల్ల దివ్యవిమాననిభములు భటు లెల్ల సింహడింభకసమాను
లంగన లెల్ల బుష్పాస్త్రునస్త్రంబులు విప్రు లెల్లరు వేదవిత్తనిధులు
క్షత్త్రియు లెల్లరు శరభశౌర్యాఢ్యులు కోమటు లెల్లరుఁ గోటిపతులు
శూద్రు లెల్లరు నిరవధిభద్రవశులు, తోఁట లన్నియు వేలుపుఁదోఁటలట్ల
దీర్ఘికలు దేవతాపురిదీర్ఘికాభి, రామములు దానవేంద్రుపురంబునందు.

20


గీ.

పద్మరాగాశఘటిత మౌ పఱపునేల, నంటు మెఱసిన ప్రహ్లాదునగరు మెఱయు
నీలనిర్మిత మగుచు నుత్తాలగరుడ, వాహనారూఢుఁ డగునీలవర్ణుఁ బోలి.

21


గీ.

మేటితలుపులమీలనోన్మీలనములఁ, బ్రజలులోడింద వెలిఁబర్వఁబరఁగుఁబురము
నిదురవోవుట లయమును నిదురలేమి, సృష్టియును గాఁగ విలసిల్లు స్రష్టఁ బోలి.

22


చ.

తరళసుధాకరప్రభలు దార్కొనుమాత్రఁ గరంగి చంద్రకాం
తరచితసౌధముల్ గురియు తజ్జలధారలఁ బొంగుచూపు ని
ర్జరనది యప్సరోగణకుచద్వయనిర్దయమర్దనక్రియా
స్ఫురితతరంగభంగదశ వోవఁగఁ బున్నమరేలఁ గ్రాలుచున్.

23


క.

పురగోపురవరముకురో, దరమునఁ దమనీడఁ జూచి దైవతముగ్ధో
త్కర మితరకాంత [3]లంచు, న్మురిపెంబున సారెసారె ముచ్చటలాడున్.

24


గీ.

గంధబంధురసింధురస్కంధపీఠి, మీఁదఁ దత్కరనిక్షిప్తమేదురోరు
పాంసువలయంబు చెన్నొందుఁ బర్వతాగ్ర, తలసుఖాసీనమేఘసందర్భ మనఁగ.

25


క.

హరులు సుదర్శనకరములు, పరిపంథిమదాపహములు బహువిధలక్ష్మీ
స్ఫురణాపరిణాహంబులు, పురితేజులు శార్ఙ్గపాణిఁ బోలుం జాలన్.

26


గీ.

విశ్వకర్మవినిర్మాణవేళఁ గూర్చు, నమరయానంబులకుఁ బడియచ్చు లనఁగఁ
జారుచామీకరాలేపసంప్రదాయ, కవచితము లైనరథములు గలవు పురిని.

27


క.

భటులు రణరంగలీలా, సటు లుద్భటసింహనాదనారదఘోషో
త్కటులు మృగీమదచర్చో, త్కటు లప్పుటభేదనమునఁ దనరుదు రెపుడున్.

28

గీ.

యజ్ఞశత మొనర్చు నవనీసురేంద్రులు, జయశతంబు గలుగు క్షత్త్రియులును
నిధిశతంబు గూర్చి నెరయువైశ్యులు గాని, తక్కువారు లేరు తత్పురమున.

29


సీ.

తములుఁ దారలుఁ దరుణశూరంబులు వరిపొట్ల లరఁటులుఁ గరిశి[రము]లుఁ
బిప్పలదళములు విప్పారుసుళ్ళునురు నాగడపలు గగనాంతరములుఁ
జలిచీమచాలును జక్కవపులుగులు ఫణిఫణంబులు బిసపాశములును
దగుపోఁకబోదులు దర్పణంబులుఁ బల్లవములు సంపెగమొగ్గవంగడములు
[4]బేడిసలు సింగిణులు విజృంభించు హిమక, రార్ధములు శ్రీలు హరినీలవర్ధనములుఁ
గూర్చి తాఁ జతురాస్యుఁడై కుసుమశరుఁడు, చేసెనోయనఁ బురివధూశ్రేణి మెలఁగు.

30


సీ.

హరికౌస్తుభం బైన నంగళ్లఁ గొనవచ్చు ననిన రత్నచయంబు లడుగనేల
లేకి యేనియుఁ బద్మినీకులోద్భవ యన్నఁ బడఁతులగరిమంబుఁ దడవనేల
కడపటి చెఱువైన గగనసింధుసమాన మనినఁ గేలిసరస్సు లరయనేల
కలినెకట్టియ యేన బల) ఛేదిళరువన్న నుపవనంబుల పెంపు లొరయ నేల
రుగ్ములేనియుఁ గందర్పరూపు లన్నఁ, బూరుషవిశేషములసొంపుఁ బొగడనేల
బాహుబలమున దైతేయుపాలుఁ డేలు, నిరుపమంబు ప్రభావతీపురమునందు.

31


సీ.

అరకూటపిశంగ మగుజటాజూటిపై నెలపువ్వు లేఁతవెన్నెలలు గాయఁ
ధళుకుధళుక్కంచుఁ గలికి నెమ్మొగమున ముచ్చూపు మెఱుఁగులు పిచ్చలింప
దంతపుఁగమ్మల ధావళ్యమంజరి గండదర్పణములఁ గలయఁ బ్రాఁకఁ
బటికియార్చిన హేమఘటయుగ్మమునుబోని పాలిండ్లమణిహారపంక్తు లులియఁ
జక్రశూలాంబురుహగదాచాపబాణ, చరఖడ్గము లాత్మహస్తముల మెఱయ
వీఁకఁ దత్పురరక్ష గావించుచుండు, గమలపత్రాక్షునాజ్ఞచేఁ గాళరాత్రి.

32


వ.

మఱియు నప్పురంబు కిరీటియుం బోలె సుభద్రాలంకృతబహువిధసౌధం బై
మాధవుండునుం బోలె విచిత్రపత్రనివహం బై దాశరథిసేనాసముదయంబు
నుం బోలె నమందమారుతకుమారవిహరణపరిచితం బై సమరయాత్రాస
ముత్సాహంబునుం బోలె నుద్యోతితోద్యానహృద్యం బై సుకవికవిత్వంబు
నుం బోలె బహువిధచిత్రవర్ణవర్ణితం బై గోకర్ణపతి నివాసంబునుం బోలె ననంత
భోగికులభాగధేయం బై వెలయు నందు.

33


ఋతువర్ణనము

ఉ.

సంతస మొందె నంతట వసంతము పుష్పమరందసింధువే
శంతము భోగిలోకచయశాంతము సంతతపుష్పమల్లికా

కాంతము మాన్మథస్ఫురణకాంతము దిక్కటకావగాహిరు
గ్భ్రాంతము షట్పదస్ఫురదుపాంతము చెన్నగు నున్నతోఉన్నతిన్.

34


సీ.

కోయిల లిగురాకుఁగొనలాని మునమూని కావించె బహుకుహూకారఫణితిఁ
బుష్పంధయములు సంఫుల్లమల్లీలతాప్రసవగుచ్ఛంబుల బ్రమరివాఱె
రాయంచచంచద్విరాజితోద్యానమధ్యస్థలి దీర్ఘికఁ దనువు దడిపెఁ
జిలుకలు పండ్లు భుజించె నేఁడాదియు సవసిన కఱువుదైన్యము దొలంగ
మురిసె సహకారమాధవీతరళకుసుమ, పరిమళోదారసౌభాగ్యభాగ్యనిధులు
మలయగిరిజాయమానము ల్మారుతములు, విరహిణీస్మరపావకవీజనములు.

35


క.

పొదలెఁ బ్రసూనపరాగము, లుదయార్కసమానరుచుల నుద్యానముల
న్మదనహరమూర్తితతులం, బొదివిన మన్మథవిభూతిపుంజము వోలెన్.

36


గీ.

మానినీమానవిత్తసమాజ మెల్ల, మరుఁడు గిలుబాడి గ్రొచ్చు నిర్భరకఠోర
నఖరరాజియు బోలెఁ గానలఁ జెలంగెఁ, గింశుకంబులు విస్ఫురదంశుకములు.

37


గీ.

మారనీరాజనాసంప్రసారచంద్ర, ఖండములు కారులచ్చి యఖండమహిమ
బొలుపుగావించుపొక్కిళ్లు వెలసె నుల్ల, సించుసురపొన్న లుద్యానసీమయందు.

38


గీ.

అంత హేమంత మరుదెంచె సమరవైరి, మేను యౌనతకుచయుగీమేళనమున
సంఘటింపంగఁ జాలిన శైత్యగరిమ, కతన ముల్లోకములును గొంకరలు వోవ.

39


గీ.

సకలకుసుమరహితజని యయ్యు హేమంత, వేళ యొప్పె విటుల విటజనంబు
నొక్కమేను గాఁగ నొద్దిక సేయుచు, మదనుదోఃప్రతాపమహిమ దనర.

40


క.

కునుమపరాగము దిఙ్ముఖ, విసరంబులఁ గలయఁ బర్వె [5]వేధించి హిమో
ల్లసనంబు మొదలు ద్రెంచిన, విసువుచు దేశాంతరంబు వెడలెడు కరణిన్.

41


గీ.

కలయనిండినమంచుమీఁగడలు వోయి, వెలసె బ్రహ్మాండభాండంబు చలియచిక్కి
కప్పురము గ్రుమ్మరించినకరవటంబు, పరిమళముమాత్ర చిక్కినపరిఢవమున.

42


ఉ.

మోమును మోము మోవియును మోవియుఁ జెక్కును జెక్కు నల్లిబి
ల్లై మర యింతలేని విమలాంగములుం గరపాదమేళన
స్థేమము గల్గి రాగములఁ జేసిన విభ్రమమూర్తులో యనం
గాముకులుం గళావతులు గ్రమ్మి రమింతురు సీతుగందువన్.

43


సీ.

యువయుగ్మసంగమవ్యవహారవిఘ్నంబు చండాంశుకరవహ్నిసామిధేని
సర్వసర్వంసహాచక్రసారగ్రాహి దీర్ఘయామస్ఫూర్తి నిర్ఘృణంబు

మల్లికావల్లికామంజరీనిబిడాట్టహాసకారియుఁ బాటలాసఖంబు
ద్రాక్షాగుళుచ్ఛోరుమాక్షికమధువనం బక్షీణఘర్మగర్వాతిశయము
వచ్చె గ్రీష్మంబు మంచులు విచ్చె మధువి, కాస మొక్కింత ముణిఁగెఁ గైలాసశిఖరి
విడిచి హిమగిరికై యేగె విషమబాణ, సంహరుఁడు గ్రీష్మమత్యుగ్రరంహమగుడు.

44


ఉ.

నర్తితతాళవృంతపవనంబులఁ గొంత వధూకుచాంతర
స్ఫూర్తిమదిందుసమ్మిళితశోభనచందనచర్చఁ గొంత గా
ఢార్తిహరంబు లైనశిశిరానిలపోతవిభూతిఁ గొంత సం
వర్తశిఖాపదుగ్రకరవాసరతాపము నాఁపఁగాఁ దగున్.

45


వ.

అంత నవ్వేసంగి యంతరించిన తదనంతరంబు భూనభోంతరాళంబులు బోరు
కలంగంజేయు దంభోళిగంభీరధ్వానంబులు విజృంభించెఁ బంచవన్నియచిలుక
పలుకం గరకమలంబునం బ్రథమదిక్కాంత సంతసంబునం బాటించెనో
యన నిరాఘాటప్రభాపాటవహిండితం బగునాఖండలధనుఃఖండంబు మెండు
కోన నొండొండ నిండారం బూనిన ముత్యాలపేరులు గగనలక్ష్మీకంఠభాగం
బుననుండి వ్రేలెడినో యనఁ గరకావారంబు తోరంబుగ మయూరకేకావంది
వాక్యసందర్భనిర్భరానందం బై యొసంగిన వసనవిసరంబునుంబోలెఁ బయోధ
రచ్ఛేదంబులసాదప్రసాదంబులై చూపఱకుం బ్రమోదంబు లొసఁగ వినవిస
విసరు చలికరువలియు ముసరుకొన నసమముహీరజోరాజి యొండొండ నీడా
డం దలచూవు ప్రథమోదబిందుసందోహంబును వాతెఱలు దెఱచుచాత
కంబు లద్భుతప్రీతినికేతంబులై కొనియాడు క్రీడాసల్లాపంబులునుం గ్రేళ్లు
మెలంగు తటిల్లతలయుల్లాసంబును నత్యూర్జితంబు లగుగర్జితంబుల విస్ఫూర్జ
నంబును బంధురాంధకారపరిణాహంబును నుదారాసారప్రచారంబును
నుడ్డీనకుల్యామహోల్లాసంబును నుత్సాహవివర్జితసముద్రంబును నుద్యోగ
హృద్యహాలికంబును నుపవచితాతపవాసరతప్తతృణాంకురసంకులంబు నై వర్షాగ
మంబు మహోత్సవంబున నావిర్భవించి శరత్సమయవత్సనిపీతపయోధరపయః
పూరం బయ్యె నయ్యెడ.

46


సీ.

వారాకరంబుదేవేరి యాకావేరి కల్లోలఘటలలో నుల్లసిల్లి
ద్రవిళదేశాంగనాస్తనకుంభములమీఁది పసుపుపూఁతలతావి పాలుపట్టి
మధుపానకేళీనిమగ్నపుష్పంధయభాండవపరిపాటిఁ బరిఢవిల్లి
కీచకరంధ్రప్రకీర్ణమై ఘుమ్మంచు నభిరామనాదంబు నావటించి

నట్టువయుఁబోలె లతలకు నయముమీఱ, నటనమెఱిగించుచును జూడ విటుఁడువోలెఁ
గొమ్మలకు సౌఖ్య మొసఁగుచుఁ గొమరుమీరె, ఋతుసమాగతమలయమారుతవిభూతి.

47


సీ.

మిసమిసమనుగండుమీనుటెక్కెముతోడి పువ్వారుఁదేరిపైఁ బొలుపుమీఱి
రతిదేవి భారంబురారాపుచనుదోయి పుత్తడిబటువుల నొత్తగిల్లి
ముక్తామయం బైనమోహనచాపంబు తేఁటిలేనారిమన్దీఁగఁ గూర్చి
సంచితమంత్రప్రపంచమౌ నిజబాణసంచిక పొదిలోన సంఘటించి
మెత్త నిగురుదపారంబు మించుకలువ, రేకుదట్టియు మొల్లపూజోకజోడు
మొగలిమొగ్గకఠారంబు జిగిదొలంక, వెడలె మదనుండు విరహులవేఁటలాడ.

48


గీ.

ఋతువు లాఱుఁదనకు నతులవిభూతితోఁ, దోడు చూపుటయును దొలుతవేల్పు
పట్టి బహువిహారపరిణతబుద్ధి యై, సంచరించు వివిధసౌఖ్యలహరి.

49


క.

ఈరీతి మదనరాగక, ళారంజితహృదయుఁ డగుచు లలనాజననా
నారతిసౌఖ్యపరాయణుఁ, డై రక్షోరాజపుత్త్రుఁ డలరఁగ నంతన్.

50


రాక్షసమంత్రులరహస్యాలోచనము

గీ.

ఆహిరణ్యకశిపునాప్తమంత్రులు గొంద, ఱతనిపుత్త్రు గొలుచునాస విడిచి
నిజమనంబులందు గుజగుజవోవుచు, వంది సంచరింతు రిందునందు.

51


వ.

వారెవ్వ రంటేని.

52


సీ.

సూచీముఖుండును శూర్పకర్ణుండును వృశ్చికరోముండు వికటబలుఁడు
శంబరుండును దీర్ఘజంఘుండు బలియును గపిలాక్షధూమ్రాక్షకంకటులును
గాలకేయుండును గాలదంష్ట్రుండును వక్రదంతుండును వామనుండు
ఖరుఁడు ద్విమూర్దుండుఁ గల్పకేతుండును దూషణుండును జర్మపేషణుండు
నాదిగాఁగల పూర్వులౌ సమరవిమతు, మంత్రు లెల్లరుఁ గూడి సన్మంత్రగోష్ఠి
నతిరహఃకృత్యమునకు యోగ్యతమమైన, సింధువనమున కరిగి యాసీనులగుచు.

53


క.

ఆమంత్రిపరులు సంతత, ధీమంతుం డగుసరస్వతీసింధుసుతున్
వామనుఁ డనురక్కసుని న, వామనమతిఁ బల్కి రుచితవాక్యముఖరు లై.

54


క.

అనఘా సర్వంబును నీ, కని విన్నది గాదె వేఱె కఱపఁగ నేలా
మనకార్య మింక నెట్లగు, వినిపింపఁగఁ బాడి నీకు విమలవివేకా.

55


చ.

హరి పగవాఁడు దేవమును లంతకమున్నె విరోధు లిట్టిచో
హరి తనకూర్చునాయకుఁ డటంచు నిశాటకుమారుఁ డెప్పుడున్

సురలును దానుఁ గూడి మనచొప్పునఁ బోవక శౌర్యహీనుఁడై
యరులకుఁ గ్రిందివాఁ డగుచు నాహవదోహళి గాఁ డొకింతయున్.

56


సీ.

సమరాభిముఖు లైనయమరవీరులఁ గిట్టి యనిమొనఁ దుత్తుము రాడవలదె
దర్పితదండయాత్రాభేరిభాంకారఝంకారముల మిన్ను చఱవవలదె
యుత్పలదళములయొప్పునఁ జైకొను నరిశిలీముఖముల నాఁపవలదె
తుంగమాతంగశతాంగతురంగాంగశకలకోటుల నేలఁ జమరవలదె
కలవె యొకనిఁ గొలిచి గర్వవిహీనుఁడై, యూడిగములు సేయుచున్నపతికి
ధూర్తవిజయలబ్ధి కీర్తిప్ర తాపంబు, లసురసుతున కిట్టు లడఁగఁదగునె.

57


క.

మన మితనికిఁ బగవారము, మనపగరులు ప్రీతిపరులు మనవాక్యంబుల్
విననొల్లఁడు ప్రహ్లాదుఁడు, మనకార్యం బెట్లు నిలుచు మాన్యచరిత్రా.

58


గీ.

ఆహిరణ్యకశిపునందు నీమామిడి, కిందిసోమ రెట్లు బొంది యెత్తెఁ
బులికి మేఁకమఱక పుట్టినయ ట్లయ్యె, శిరసు లెత్తి తిరుగ సిగ్గుగాదె.

59


క.

అనిమిషు లితనికి సఖులై, మనుచుండిర యేని దివిజమర్దనకులముం
దునుముదురు పూర్వవైరము, మనముల నిడి పాముతోడిమచ్చిక దగునే.

60


క.

అందఱముఁ గూడి యీకసు, గందుం దునుమాడి యొక్కకఠినభుజబలో
గ్రుం దెచ్చి రాజుఁ జేసినఁ, బొందు నమందాఘనిచయములు ఘోరములై.

61


గీ.

రాజపుత్త్రుఁ దునుమరాదు వేల్పులచేతఁ, బడఁగరాదు దురితపదవి చొరని
కార్య మెద్దిగలదు ధైర్యంబుతో నది, నీవు నిర్ణయించి నిర్వహింపు.

62


మ.

ఘనసంగ్రామపరుల్ హిరణ్యకశిపుక్ష్మావల్లభుం గొల్చి త
ర్జనముల్మీఱ సురేంద్రముఖ్యవిబుధవ్రాతంబు భీతిల్లఁ ద
ద్వనితాజాతముఁ బట్టి తెచ్చు మన మాదైత్యారులం జేరి సి
గ్గున వర్తించుటకన్న మే ల్గిరిగుహాక్షోణీతతిన్ దాఁగుటల్.

63


ఉ.

పక్షికులేంద్రవాహనుని బల్విడిఁ దోలఁగరాదొ దేవతా
ధ్యక్షునివైభవంబులు ప్రతాపమునన్ హరియింపరాదొ త
త్పక్షమువారి నెల్ల శితబాణపరంపరఁ గూల్పరాదొ యీ
యక్షము రాక్షసేంద్రసుతు నాడెడి దేమి వివేకహీనునిన్.

64


చ.

మనము దొలంగినప్పుడె క్రమంబున దేవత లెల్ల దైత్యరా
ట్తనయుఁడు వీఁ డటంచు నతిదారుణవృత్తిఁ గడంగి దూషణం
బున కభివక్త్రులై నిమిషమున్ ధర యేలఁగనిత్తురేల యీ
ఘనునకుఁ జెల్లునా యసురకంటకు సఖ్యము సౌఖ్యహేతు వై.

65

క.

మానంబు విడిచి యవ్వై, మానికులం గొలువలేము మనతెఱఁ గెటులో
మానము గలవారికి నభి, మానము రక్షించుటయె సమస్తశుభంబుల్.

66


వ.

అని నిజపక్షంబు రక్షోవీకు లుదాదార్థగౌరవగభీరంబుగాఁ బలికిన పలుకులు
విసి మనంబున మెచ్చి వినయవినమితసుధాజేమనుం డగువామనుండు
వారల కి ట్లనియె.

67


ఉ.

ధీరులు శౌర్యసంయుతులు దీర్ఘవచోరచనాచమత్క్రియా
పారగు లైనమీహృదయపద్మము లెంతయు సంతసిల్ల ర
క్షోరమణోత్సవాహ మకుత్సిత మార్యనుతంబు నై సుధా
హారులయత్నము ల్మలఁచునట్టి యుపాయ మెఱుంగఁ జెప్పెదన్.

68


మ.

చల మొప్పం బరిపంథినిర్జరతతి న్సాధించి వేధోవధూ
కలనిక్వాణవిపంచిక న్నిజయశోగాథాసహస్రంబు సం
ధిలఁగా వంశధురీణుడై ప్రతిభచే దీపించు దైత్యేశ్వరుం
దలఁపంగాఁ దగుఁ గాక తత్సుతుని చేతల్లెంత లూహింపఁగన్.

69


క.

ఏలికపుత్త్రు వధించిన, బాలిశులకు నిహముగలదె పరముం గలదే
శీలించెద నొకకార్యము, మే లెంచుఁడు నయము లెఱిఁగి మీమీయుక్తిన్.

70


చ.

పతి యతిమూఢుఁ డైన బహుపాపసమన్వితుఁ డైన రోగసం
తతి వినిమగ్నుఁ డేనియును దాంతియు శాంతియుఁ గల్గకుండినన్
సతులకుఁ బాయరానిక్రియ శౌర్యము ధైర్యము లేకయున్న భూ
పతిఁ దమకంబున న్విడువఁ బంతమె సేవకులైనవారికిన్.

71


చ.

క్రమమునఁ గాని వక్రమగుకార్యము చక్కన గాదు గాఢవి
క్రమము వివేకహీనుఁ డగురాజునకున్ హితకారణంబు గా
దమరులు నేఁడు దైవగతి నద్భుతశౌర్యసమేతులై యతి
ప్రమదము నొందినారు మన పౌరుషముల్ ఘటియింప వియ్యెడన్.

72


క.

సురపతియు నసురపతియును, నిరతంబును క్షీరనీరనిబిడహృదయులై
సరిపొత్తు మనెడిచోటన్, సురలపయిం గొలుప వాత్మశూరత్వంబుల్.

73


గీ.

రాజు లేనిబలము రాజీవశత్రుండు, లేనిరాత్రి మగఁడు లేనిమగువ
పౌరుషంబు లేని పతియును వృథగాదె, మీర లెఱుఁగరే సమిద్ధమతులు.

74


క.

నరపాలుఁడు తనబలములఁ, బురికొలుపకయున్న వానిపో టమరునె భూ
వరవిరహితసేనయు నం, బరరహితస్తనము నేకపర్యాయంబుల్.

75

వ.

ఏ నెఱింగించిన తెఱంగ మీయంతరంగంబులం దరంగితంబైనయది గదా
గదాధరచరణసేవనచతురుం డగు ప్రహ్లాదకుమారునకు నాహ్లాదంబు పుట్టు
నట్లు గొన్ని యుపాయంబులు పన్ని సర్వంబును శుభోదర్కంబు సేయుదము
వినుం డనిన వెండియు వార లిట్లనిరి.

76


చ.

కనలక దేవతావిభునికార్యవశస్థితియంద నిల్చుచు
[6]న్మనలను జేరనీఁడు లవమాత్రము నిర్జరశత్రుసూతి యే
యనువునఁ బుట్టెనో నిజకులాంబుధిశోషణబాడబాగ్ని యై
తనమదిలోనఁ బెద్దలప్రతాప మెఱుంగఁ డెఱుంగఁ డేమియున్.

77


క.

అతఁ డేకైవడి నస్మ, న్మతమున కొనగూడి దివిజమర్దనలీలో
ద్ధతి చూపు శ్రుతిసుఖంబుగ, హితసూక్తులఁ దెలుపవే యహీనవివేకా.

78


వ.

అనిన వారల కతం డి ట్లనియె.

79


క.

ఏ కార్యంబున నసుర, క్ష్మాకాంతుఁడు తెలిసి మనవశంబునఁ దిరమౌ
నాకార్యము వినిపించెద, నాకర్ణింపంగవలయు నందఱు మీరల్.

80


క.

ఏకాలంబున నెవ్వని, కేకార్యము జరపవలయు హితవెఱిఁగి నరుం
డా కాలంబున నతనికి, నాకార్యము సలుప ఫలము నందఁగవచ్చున్.

81


క.

ఆరూఢయౌవనుం డై, నారీజన సరసకేళి నర్మసఖుం డై
యారక్షోవీరుఁడు సం, చారము లొనరించుఁ గృతకశైలములందున్.

82


సీ.

మాధవవల్లరీమండపాంతరముల మధువేళ విహరించు మదమువొదల
గ్రీష్మాట్టహాససంకీర్ణపుష్పంధయధ్వానంబు వనుఁ దపవాసరముల
శైలకందరనటన్నీలకంఠోత్తాలవైఖరి పాటించు వర్షలందు
నుద్దండపుండరీకోత్పలచ్ఛన్నదీర్ఘికల శారదవేళఁ గ్రేళ్ళుమలఁగు
హిమశిశిరసముచిత మైన యిచ్చనిచ్చ, నంగనాలింగనాహ్లాద మాత్మఁగోరు
నిపుడు ప్రహ్లాదుఁ డతనికి నిందుముఖులఁ, గన్యకలఁ దెచ్చియిచ్చి రాగమునొనర్చి.

83


వ.

నేర్పు మెఱసి కందర్పవిహారలంపటుం డగునిలింపారిం జేరి పర్యాయగతిం
బాటవంబు మెఱసి బాంధవం బతిదృఢసంధానబంధురంబుగ నమరించి
యమరులయంటు వాసి మననంటున మెలంగునట్లు చేసిన సకలశోభనంబు
లుం గరతలస్ఫటికంబుల.......................కరణీయం బగు నతండు.

84


క.

కులమున రూపున గుణమున, బలమున సంబంధమునకుఁ [7]బాత్రుం డగు మీ
తలఁపునకు నెక్కెనేనియుఁ, దలఁచిన పనులెల్ల సఫలతాయుతము లగున్.

85

క.

అదిగావున నీయత్నము, పదరక మన మిపు డొనర్పఁ బ్రాప్తము లగు సం
పదయును శత్రుల గెలుచుట, విదితమనోవాంఛితములు విశ్వోన్నతియున్.

86


గీ.

కామమోహితునకుఁ గాంతాజనంబును, ధనవిహీనునకును గనకచయము
వ్యాధిమగ్నునకును వలనైనయౌషధం, బొసఁగుటయు నిజార్థయోజకములు.

87


క.

సంతుష్టులైన ధరణీ, కాంతులు సేవకులకోర్కెఁ గావింపుదు రా
నంతయు నింత యెఱుంగని, యంతఃకరణంబు నిత్తు రతిసులభగతిన్.

88


వ.

అని తామరససంభనశేముషీసముద్దాముం డగువామనాసురుండు పలికిన
నీతిప్రస్ఫీతం బగుసూక్తిజాతంబునకు బ్రీతహృదయులై దైతేయు లాతనిం
చోకొని నిజనివాసంబుకు మరల నేతెంచి కౌతుకాయత్తచిత్తులై చిత్తజు
పూములుకులుం బోని తమకులపాలికాసంభవ లగు సౌభాగ్యధన్యలం గన్య
కలం బెక్కండ్రఁ దెచ్చి యారక్కసులఱేనితనూజునకుం గానుకసేయుటయు
నానందకందళితహృదయారవిందుండై హిరణ్యకశిపు ప్రథమనందనుం డా
పృథులనితంబులం బరిణయంబై తరుణతరతరలసమీరకుమారతాండవితశిఖం
డకలతాతరుషండమండితోద్యానహృద్యపద్యాపరిసరంబులయందు మసృ
ణమసారమాణిక్యశకలమయకృతశైలకందరామందిరాంతరంబులయందును
నరవిందమకరందనిష్యందబిందుతుందిలపయఃప్రవాహమనోహరంబు లగు
కేలికుల్యాకులంబులయందును నిందుకాంతసందానితసోపానపరంపరావ్యా
నృతప్రాసాదవేదికలయందును మదనవేదవిద్యావ్యాఖ్యానవైఖరీమౌఖరీమ
హోపదేష్ట యై త్రివిష్టపవిమతులకు నభీష్టంబు లొసంగి ప్రసాదదృష్టిమధు
రంబుగ వారివారి యావాసంబులకుం బోవం బనిచె నంత నొక్కనాఁడు.

89


చ.

హరునిమనంబు తుత్తుమురు లైచన సేసినదంట మిక్కిలి
న్విరహులపాలిమంట నెఱవీరుఁడు మారుఁడు తియ్యవింట సు
స్థిర మగునిర్జరారిసుతుచిత్తము గెంటఁ బ్రసూనసాయకో
త్కరమున నంటనేసెఁ గడకంటికిఁ గోపపుఁబంట పాటిలన్.

90


క.

మరునిశరపుంఖములఁ గల, కరువలిచే దూలి యసురకంటకుహృదయాం
తర మతిభంగురగతిఁ ద, త్తరుణీకుచశైలసీమఁ దలఁదూర్చుకొనున్.

91


సీ.

హరిరూపదర్శనాయత్తంబు లగుకన్ను లతివలకుచములం దంటి నిలిచె
విష్ణుకీర్తనములు విని చొక్కువీనులు తరుణులగీతామృతముల నానెఁ
బురుపోత్తముని వేడ్కబొగడుచుండెడుజిహ్వ సమదాంగనాధరాస్వాద మెఱిఁగె
జలజాక్షపదభక్తి బులకించు నెమ్మేను ప్రమరలపరిరంభణములఁ బొదలె

నిట్లు ప్రహ్లాదవిభుని సర్వేంద్రియములు, మాధవారాధనక్రియోద్భోధ ముడిగి
నిత్యయౌవనపూర్ణ లౌ దైత్యదత్త, కన్యకలయందె యాసక్తిఁ గడలుకొనియె.

92


చ.

కెరలు మదోడయంపుగిలిగింతలు వో నిడి బ్రహ్మచర్యని
ష్ఠురహృదయాంతరాళు లగుసూరిజనంబుల కైనఁ గామినీ
తరళకటాక్షవీక్షణసుధాకరచంద్రిక యింత సోఁకినం
గరఁగక యున్నె దైత్యకళికావిధుకాంతశిలాకలాపముల్.

93


గీ.

అంత నొక్కకందునందుఁ బ్రహ్లాదుండు, బాలికాశతానుకూలుఁ డగుచు
వనవిహారకాంక్ష జన సముద్యుక్తుఁ డై , మరునిజోడుకోడెమాడ్కిఁ దనరి.

94


సీ.

ఉదయార్కబింబంబు నొరవచ్చు నెరమెచ్చు [8]చిగురుచెంద్రికచాయచేల మమర
గంధానుమేయంబుగా మేన నలఁదిన చర్చరపొంకానుషక్తి(?) దోఁప
గంకణకుండలగ్రైవేయముద్రికాహారప్రభల రోహణాద్రిఁ బోలి
యాయాయిఋతువు లుపాయనం బొసఁగిన కుసుమంబు లలకలఁ గుస్తరించి
మదనశతకోటిలావణ్య మెదురుకొన్న, నిధ్ధ మగుమూర్తి యద్దాన నీడచూచి
కామినీమణిపరివారకలితుఁ డగుచుఁ, దనగృహోద్యానసీమకుఁ జనఁదలంప.

95


శా.

ఆదైత్యేంద్రకుమారుఁ గొల్చిరి మహోద్యద్రత్నహారావృతల్
పాదాబ్జక్వణదచ్ఛనూపురలు శంపాసంపదుద్యత్తమల్
మోదాపాదిసుగంధబంధురలు సంపూర్ణేందుబింబాననల్
యాదోలాంఛనమంత్రదేవతలు దైత్యాధీశకన్యామణుల్.

96


వ.

ఆప్రహ్లాదుం డాహ్లాదపరిపూరితహృదయుం డై యమ్మదవతీశతంబుఁ గర్ణీరథా
రూఢంబు గావించి పూవుందోఁటకు హాటకవిమానారూఢుండై చనునవసరంబున.

97


సీ.

శ్వేతాతపత్రాళి వెలఁదివెన్నెల గాసెఁ బార్వికశశిపరంపరలఁ బోలి
కలహించురాయంచగములసందడి చూపెఁ గామినీకరదత్తచామరములు
కంతుసేనాకలకలము నాకర్షించె నర్మగర్భోక్తివీణాస్వనములు
కర్పూరకస్తూరికాసంకుమదకుంకుమాదిసుగంధము లతిశయిల్లె
మసగదిత్తుల(?) నించి పల్మఱును జిమ్ము, సారపన్నీరనీరాతిశైత్య మెసంగె
నసమయౌవనపరిపూర్ణుఁ డసురరాజ, సుతుఁడు ననకేళి కరుదేర నతులమహిమ.

98


సీ.

కొంద ఱాందోళికాసందోహముల నెక్కి కేళిఁ గొందఱు పల్లకీల నెక్కి
ప్రకటశిల్పము లైనశకటంబు లొకకొంద ఱెక్కి హయంబుల నెక్కి కొంద

ఱిభరాజముల నెక్కి హేమలేపముల దూకొనుసర్వబంబరా(?) ల్గొంద ఱెక్కి
భీమసత్త్వము లైనవామీశతంబులపైఁ గొంద ఱెక్కి నృపాలగణిక
లసమపిశితవిశేషంబు లాపనములు, గుసుమఫలములుఁ బట్టించుకొని యరిగిరి
రాజు నిరుగడ రతిరాజు తేజు లనఁగ, సరసవాక్కుల నమృతపక్షములు గురియ.

99


క.

దండెత్తు మరునిగతి నా,ఖండలరిపునందనుండు గనుపట్టె మహీ
మండలకుండల మగుతరి, మండనివేశమున సకలసౌఖ్యోన్నతుఁడై.

100


క.

పిడియేనికెమొత్తము తన, బడిరా వైరావణంబు బలభిధ్వనిలో
నడరుక్రియఁ గనకకశిపుని, కొడు కుపవనవీథి నమరెఁ గొమ్మలుఁ గొలువన్.

101


సీ.

ఏడాకుపొన్నలు చోడుముట్టెడుచోట సురపొన్న విరితేని గురియుచోటఁ
జంద్రకాంతములు నిచ్చలుఁ గరంగెడుచోటఁ గపురంపుటరుఁగులు గలుగుచోటఁ
దరుణవాసంతికల్ దళ్లుగట్టెడుచోటఁ జిలుకబోదలు ముద్దుగులుకుచోటఁ
జలిగాడ్పువిసువులు తలలుసూపెడుచోటఁ గోయిల లిగురాకుఁగొఱుకుచోట
గర్వితస్మరచాపటంకార మఖిల, విరహిజనమోహనస్ఫూర్తిఁ బెరయుచోట
విపులవిహరణపరతంత్రవృత్తి హత్తి, విడిసె బ్రహ్లాదుఁ డుద్యానవీథినడుమ.

102


చ.

తొలకరి లేమెఱుంగు లనఁ దోయజగర్భుఁడు హేమపుత్రికా
వలుల సజీవభావమున వన్నియవెట్టె ననంగ నంగరే
ఖల విలసిల్లునంగనలు గబ్బున నిబ్బర మందికొల్వఁగా
వలపుల [9]రాచవానిచెలువంబున రాజతనూజుఁ డుండగన్.

103


క.

తరుణులకు నుపవనశ్రీ, కరుణించి యొసంగురత్నకనకాభరణో
త్కర మనఁగ వారు వారికి, ధరియించిరి ప్రసవకల్పితము లగుతొడవుల్.

104


గీ.

వనిత యొకతె కొమ్మ వంచి పూవులు గోయ, రాలె దనుజలోకపాలుమౌళి
గొన్ని యతఁడు కీర్తికుసుమముల్ శిరసున, నావహించి మించి యలరె ననఁగ.

105


ఉ.

ఇంతలె కాని నాకుచము లింతకు నెక్కుడు లేవు కామినీ
సంతతిలోన లేఁత నని సంజ్ఞ సురారికిఁ జేయుకైవడిం
గంతుని బెట్టకోల యొకకన్నియ మారెడుపండ్లు పాణిప
ద్మాంతరసీమ నించె సరసాగృతిఁ గందుకకేళి సల్పుచున్.

106


క.

మరుతూపు విభునిచూపుం, గరమూలములందు నొకటఁ గదలక నిలువ
న్విరు లరవిరిబాగున నొక, విరిబోఁడి నఖాంచలముల వేమఱుఁ జిదిమెన్.

107

క.

కరకందుకమున నొకసతి, సురవైరిన్ వైవఁబూనుసుళు గతఁడు హృదం
తరమునఁ గని లీలాపం, కరుహముఁ దొలఁగించి దాని కన్నులు గప్పెన్.

108


చ.

అలికులనీలవేణి విను మాపొదరింటికిఁ బోకు నీకుఁ గా
వలసినయేని యేమి కఱనా తరువాటమునందుఁ గ్రొవ్విరుల్
పెలుచన నీదుమోవిఁ గబళింపఁగఁ [10]బొంచెను గండుఁదుమ్మెదల్
దలఁపవు ముగ్ధ వంచు నొక తామరసాక్షి యదల్చె నెచ్చెలిన్.

109


క.

విరిసినకుంతలబంధము, మురిసిననీవియును హస్తములఁ బట్టి కృశో
దరియొకతె పసుపుఁబయ్యెద, గరువలి జడియింపఁ(?) గుంజగర్భము దూఱెన్.

110


తరల.

పదనుమీఱ రసాలపేశలపల్లవావళి ముక్కులం
జిదిమి కుత్తుకబంటి తద్రవసీధువుం గొని చొక్కున
క్కొదమకోయిలగుంపు కన్నులఁ [11]గోరగించెడుకెంపు సొం
పొదవెఁ బాంధులమీఁదికోపపుటు బ్బటంచు సతుల్ నగన్.

111


మత్తకోకిల.

తోర మౌ విరితేనెసంద్రపుఁదొట్టునం బడి యీఁదుచు
న్మారుసింగిణిమ్రోఁతలో యన మాటిమాటికి మ్రోయుచుం
దూర నెక్కి పరాగపంక్తులఁ ద్రొక్కి సౌరభ మానుచు
న్వారిజాక్షులచూపుచాయల వాలెఁ దుమ్మెద లమ్మహిన్.

112


సీ.

పల్లవపరిణాహపాదారవిందయుఁ గర్పూరరంభోరుకాండయుగయు
సుమరేణుసైకతసముదగ్రజఘనయు నవనవపున్నాగనాభితలయు
భ్రమరడింభకరోమరాజరాజితయును శ్రీఫలస్తనకుంభశీలితయును
వల్లీమతల్లికాప్రోల్లసద్బాహయుఁ గ్రముకకోమలకంబుకంఠయుతయు
మధురసాదరదళపుష్పమంజరీము, ఖియును మాయూరపింఛాగ్రకేశపాశ
శాలియును నైనవనరమాచపలనయన, మమతఁ బ్రహ్లాదు నాహ్లాదమగ్నుఁ జేసె.

113


చ.

అసురవరేణ్యుఁ గూడి హరిణాక్షులు వృక్షలతామతల్లికా
ప్రసవము లాహరింప ముఖపద్మము లించుక వాడుచూపెఁ బై
దుసికిలఁజొచ్చె ఘర్మభవతోయకణంబులు తొట్రుపాటునన్
విసవిసగాక మందగతి విభ్రమము ల్విలసిల్లె నత్తఱిన్.

114


క.

ఆకాశకృష్ణవక్షః, స్వీకృతకౌస్తుభమువోలె వెలుఁగులఱేఁ డు
ద్రేకించెఁ బట్టపగ లతి, లోకములై కిరణపంక్తులు పిసాళింపన్.

115

వ.

అంత బ్రహ్లాదుండు ప్రచండమార్తాండకిరణమండలచండిమ సహింపనోపక
రూపవతీసహాయుండౌ రాయంచమించుఁబోఁడుల గూడి సంచరించు రాజ
హంసంబునుంబోలె భాసిల్లి సలిలకేళిక నగ్గలించు నంతరంగంబు పొంగార
నయ్యారామంబునం గలయందిరుగం దత్పురోభాగంబునఁ బరమయోగి
యుంబోలెఁ బంకరహితస్వభావంబును రాకారాత్రియుంబోలెఁ జంద్రశీత
లంబును భవసఖనివాసంబునుంబోలె మకరకచ్ఛపపద్మాదిసద్మంబును మహా
గహనంబునుంబోలె నుద్దండపుండరీకంబును బుండరీకాక్షుపొక్కిలియుం
బోలె సర్వతోముఖశోభితంబును నైనయొక్కసరోవరంబుఁ గని కనకకమల
కళికాపరాగపరంపరాపరిచయసరససలిలసమీరంబుల శరీరంబులకుఁ బ్రీణ
నంబు గావించుచు మదకలకారండవక్రౌంచప్రముఖఘనరసనిహగవిసరమ
సృణరణవంబులు శ్రవణరంధ్రంబులకుం బరమానందంబు నొందింపం దత్కా
సారసౌభాగ్యంబునకు మెచ్చుచు వచ్చి యచ్చటఁ బచ్చవిలుతువిడిదియుం
బోని గురువిందపొదరింట మృదులలతాంతశయ్యాతలంబున సుఖాసీనుండై
మానవతీజనంబుల వారివిహారం బొనరించుటకు ననుజ్ఞ నొసంగుటయు.

116


క.

జలకేళికి నుచితము లగు, వలిపంబులు గట్టి కనకవలయాదికభూ
షలు డించియు విలసిల్లిరి, లలనలు నీహారసమయలతలుంబోలెన్.

117


గీ.

కనకశృంగంబులును లక్కకరవటములు, నేత్రములు గందళీఫలనికరములును
మొదలుగాఁ గలసాధనంబులు ధరించి, కొలను సొచ్చిరి సంఫుల్లజలజముఖులు.

118


చ.

కుచములకుంకుమ ల్చెదరఁ గ్రుక్కినపూవులు పుక్కిలించుచుం
గచములు వీడ గండయుగకల్పితనూతనపత్రవల్లికా
రచనలు మిక్కిలిం గరఁగ రామలు కాంచనశృంగపూరితాం
బుచయము చల్లి రొండొరులఁ బూఁచి తనూతటిదాళిమీఁదటన్.

119


గీ.

చాలలోఁ తైనతత్సరస్సలిలపూర, మంగనలనాభిబిలములయందు నణఁగె
నెంతగంభీరు లేనియు నింతులకును, లోను గాకున్నవారిని గాన నరిది.

120


ఉ.

చల్లిన మాఱులే కెదురు చల్లెడువారలుఁ జల్లినన్ హస
ద్గల్లతలంబుగా నిజముఖంబులు ద్రిప్పెడువారు మూఁకపైఁ
జల్లుచు గెల్పుగొన్నసతిఁ జాగురె యంచు నుతించువారు నై
యల్లలనల్ సరోజలవిహారము సల్ఫిరి పొల్పుమీఱఁగన్.

121


గీ.

పడతి యొక్కతె కుత్తుకబంటినీట, నుండు నవ్వేళఁ గనుఁగొనును విదపిండు
భ్రమరమిథునసమాశ్రితపద్మ మనుచుఁ, జపలదృక్తన్ముఖంబుఁ బ్రశంసచేసె.

122

వ.

అట్టి సమయంబున.

123


సీ.

తరుణీదృగంజనద్రవలతాకీర్ణ మై యొకచోట నీలిమ నొదవఁజేసి
వామనేత్రీకుచద్వయకుంకుమాలేపకౢప్తిచే నొకచోటఁ గెంపునెఱపి
ననితాజనాంగచందనరసాక్రాంతిచే ధావళ్య మొకచోట నావటించి
సుదతులపసుపుపయ్యెదలని గ్గొదవుట నొకచోట హరితాళవికృతిఁ గూర్చి
కొలను బహువర్ణసాంకర్యకలిత మయ్యె, గుట్టు బయలయ్యెఁ గలఁకలోఁ దొట్టుకొనియె
నెట్టివారికి నేనియు నిందుముఖుల, గలసి మెలసినఁ గలుగునే గౌరవంబు.

124


గీ.

కామరూపుఁ డగుట గంధర్వమూర్తి య, య్యసురరాజసూతి యచ్చరలకు
నీడువచ్చుదానవేశ్వరదత్తక, న్యకలఁ గూడి క్రీడ లాడఁదొడఁగె.

125


క.

మరుఁ జేయుతూపుగములకుఁ, దరుణీమణివీక్షణములు తాపలొసఁగ ని
ర్దరవైరిసుతునిడెందము, గరఁగెన్ శిఖితప్తజతుశకలపరిపాటిన్.

126


సీ.

దానవాధీశవేదండంబు కాంతావశావశుం డగుట యాశ్చర్య మగునె
యసురమార్తాండుండు బిసరుహలోచనాప్రభలకు లోనౌట యభినవంబె
రాక్షసాధ్యక్షవళక్షభానుఁడు కాంత లనుతారకల గూడు టద్భుతంబె
క్రవ్యాదసింహంబు కలకంఠకంఠీగుహాలీనుఁ డగుట మహాఘనంబె
యనఁగ జలకేళివిహరణం బాచరించె, సారకాసారనవవారిపూరవీచి
ఘటలఁగుటిలేందునిటలాసగంధగాత్ర, గంధకలితాంగుఁడై మరుత్కంపనుండు.

127


గీ.

కంజపత్రాక్షి యోర్తు లాక్షాకరండ, తాడనంబునఁ జెనకిన దైత్యభర్త
దానికుచుమధ్యవీథిఁ గెందమ్మి నినిచె, ననవిలుతుఁ డేయుప్రథమబాణంబొ యనఁగ.

128


ఉ.

దానవరాజసూనుకరతామరసేరితవారిధారలన్
మానవతీశరీరనఖమండనముల్ పయిపూత లూడినం
గానఁగవచ్చెఁ బుల్కడుగఁగాఁ బ్రసవాస్త్రకృపాణపట్టికా
స్థానములందుఁ దోఁచునునుజాయలకైవడిఁ జూడ నందమై.

129


గీ.

తనదు[12]లోఁదొడఁ దేఁటిము ల్దాకెననుచు, మిట్టిపడునొక్కనునుజను[13]మిట్టలాఁడి
నోడ కోడకు మని నాథుఁ డూఱడించెఁ, జలువ కౌగిట జిగియార [14]సవదరించి.

130


ఉ.

దానవభర్త రత్నములు తాఁచినబుఱ్ఱటకొమ్మునీట న
మ్మానవతీజనంబుఁ బలుమాఱును జల్లుచుఁ గ్రేళ్లుదాఁటె వ
ర్షాసవమేఘమండలము చల్లనియుల్లసితాంబువృష్టిచేఁ
గాననభూములుం దడుపఁగా నగువిభ్రమ ముద్భవింపఁగన్.

131

క.

ఘలుఘల్లనఁ గరకంకణ, ములు మొరయఁగఁ గాంత లొక్కమొనయై నేత్రం
బుల ఫలములఁ బూబంతుల, జలజంబులఁ గప్పి రసురశాసనతనయున్.

132


గీ.

కామినీప్రేరితానేకగంధతోయ, ధౌతనిజదేహుఁ డై యొప్పె దైత్యభర్త
వడియుపూఁదేనెకాలువఁ గడుఁగఁబడిన, మేనుగనఁగల్గు మన్మథు నేనుఁగనఁగ.

133


సీ.

చక్రవాకస్తనాంచలఫేనహారబు లదుకులువిచ్చి యిట్టట్టు చనఁగఁ
దరుణశైవాలకుంతలకలాప మొకింత పద్మాస్యమునఁ గొంత ప్రాఁకుదేఱ
సైకతజఘనచంచద్రాజహంససంసత్కాంచికలకలస్వనము లుడుగఁ
జపలకల్లోలభుజాబంధముద్రల జడభావ మెంతయుఁ గడలుకొనఁగ
లోనఁ గలఁగుట సంగమజ్ఞానిగాఁగ, శైత్యమును బారవశ్యంబు సంభవింప
దనుజకందర్పుఁ గూడినతరుణివోలెఁ, గేళిదీర్షిక యొప్పె నవ్వేళయందు.

134


సూర్యాస్తమయాదివర్ణనము

వ.

అరవిందంబులవిందు మందమందకిరణప్రసారుం డై చరమశైలశిఖాసుఖా
సీనుం డగునంతఁ గాంతాసమన్వితుం డై దానవకాంతుండు సలిలకేళి
చాలించి మడువు వెడలి తత్తీరంబున నుచితశృంగారాంగీకారంబున నభిరామ
మూర్తి యయ్యె నయ్యావర్తనాభులును నలుదెఱంగుల నలంకృత లై చెలం
గుచుఁ బూజపెట్టిన వలరాజువాలురమ్ములుంబోలె భాసిల్లి రాసమయంబున.

135


గీ.

క్రుంకుమెట్ట దాఁకి గుఱ్ఱంబు మ్రొగ్గిన, నొంటికంటితేర నుండలేక
జిక్కువాఱె ననఁగ నర్కమండలము ప, శ్చిమపయోధిలోన శిరసు ముంచె.

136


స్రగ్ధర.

భానుం డస్తాద్రి దాటం బవిరియగొనుచుం బద్మసంఘంబులో భృం
గానీకం బార్తి నొందెన్ హరిణకులము కచ్ఛాంతరక్షోణి నిల్చెన్
నానావృక్షాగ్రశాఖోన్నతగృహములలో నమ్మయూరాళి కన్నుం
గోన ల్మోడ్చెం బ్రవాళాంకురరుచుల హరిత్కోణముల్ రాణమీఱెన్.

137


క.

మసమసగఁబడియెఁ బడమర, నిసువుంజీఁకటులమూఁకనీడలు దోఁచెం
గుసుమంబెట్టినగతి యా, కస మెంతయు నరుణకాంతిగర్భిత మయ్యెన్.

138


గీ.

సమయసింహంబు దివసగజంబు మ్రచ్చఁ, దొరఁగు నెత్తురుకరణీసాంధ్యరుచి దనరె
నందురాలినకుంభముక్తాంకురముల, తళుకుఁ దలకొల్పె నూతనతారకములు.

139


సీ.

ఇల దనయంతయ కలదో లేదో యని కొలువవచ్చిన నభోవలయ మనఁగ
బలిబంధనమునాఁటి బలుమేను హరి వీడఁదాఁచినఁ బోవక యేచె ననఁగ
నక్షులు గప్పి పదార్థజాలంబుల మాయంబు సేయు పెన్మాయ యనఁగ
సూర్యవిజ్ఞానంబు సొరుగఁ గాలముమీఁదఁ గవిసిన మోహవికార మనఁగఁ

గప్పె రోదోంతరాళ మఖండఖండ, పరశుగళమూలకాకోలబాంధవంబు
బంధకీగాఢరాగానుబంధబంధు, రము సగంధాంధకారపూరము గరంబు.

140


గీ.

కాళయాహికినై పింఛమౌళి గలఁపఁ, బొరలు కాళిందిలోని బుద్బుదసమేత
భూరినీరప్రవాహంబుఁబోలెఁ దార, కాసమన్వితఘోరాంధకార మడరె.

141


క.

అసితరసాలశరాసము, భసలకలభగుణముఁ గూర్చి [15]ప్రసవాయుధుఁ డ
య్యసతుల నుపపతుల [16]వెసం, గసుగందనికలువయంపగములం బొదివెన్.

142


సీ.

వేగింపరానివియోగనహ్నులఁ గ్రాఁగి జక్కవపులుగులు పొక్కి పడియె
జడిపట్టి వర్షించె నుడివోక పథికారుణాధరానేత్రపయోధరములు
బలిమిఁ గల్వకుఁబోవఁ బయనంబు గాఁజొచ్చెఁ దామరనుండి లక్ష్మీమృగాక్షి
పతివోవఁ జింతాభిహత లైరొ యన దిగంగనలు చీఁకటిచేతఁ గప్పఁబడిరి
యపు డరాజక మైనరాజ్యంబునకును, రాజపుత్త్రుండు వచ్చుసంరంభ మెసఁగ
నుదయశైలసమీపంబు నొయ్యఁ జేరె, యామినీకాముకుఁడు కళాధాముఁ డగుచు.

143


గీ.

గగనభల్లూకవిభు మోముజిగి యనంగ, రాత్రికేతకభూరుహప్రసవకాంతి
యనఁగఁ దూరుపు తెలతెలనయ్యె నంతఁ, దారకారాజకరరాజి తారసింప.

144


గీ.

పంచజనుకుక్షి భేదించి పాంచజన్య, మంజనాభుండు యదువంశకంజనాభుఁ
డెత్తిపట్టిన చందంబు నిరవుకొలిపె, రక్తరుచి యైనశశియున్కిఁ బ్రథమశిఖరి.

145


ఉ.

వ్రేతలవీఁగుఁజన్నుఁగవక్రేవలఁ గుంకుమపంకపత్రసం
ఘాతము గప్పినన్ దివసకాంతసుతాసలిలంబు లోచన
ప్రీతి యొనర్చులీల నృపబృంహితనూతనచంద్రతామ్రచం
ద్రాతపసంగలబ్ధిఁ జెలువారె శిలాకఠినాంధకారముల్.

146


క.

గరళశిఖు లారగించిన, హరమూర్తులువోలెఁ దారకాధీశకరో
త్కరము కర మద్దవడి భీ, కరతిమిరౌఘముల నిలయగతములు చేసెన్.

147


చ.

సకలదిగంతరాళనిపసత్తిమిరంబులఁ గత్తిరించి పూ
ర్ణకుముదమిత్రచంద్రికలు నవ్యరుచిం దిలకించెఁ బాతక
ప్రకరముఁ ద్రుంచివైచి కడుభాసిలు యోగివరేణ్యుబోధవా
ఙ్నికరములీల శాంతమును నిద్దము నైనవికాససంపదన్.

148


సీ.

కొనవాఁడినిడుపముక్కులఁ ద్రుంచిత్రుంచి వెన్నెలమీఁగడలు మ్రింగె నెలపులుఁగులు
పేరెండతాఁకున బీఱువోయిన కైరవోత్పలావలిమేన మబ్బు వచ్చెఁ

బేఁటెత్తి కెరలు[17]గ్రీయూటతేటల చంద్రకాంతము ల్తాపప్రశాంతి చేసెఁ
జిమ్మచీఁకటిపేరిచీడ యంతయు వీడి బ్రహ్మాండభూజంబు పల్లవించె
నడరె నగవాసచటులాట్టహాసవాస, వకరికరికాండకాండకేవలసఖములు
దీప్రకాంతిప్రసారితదిఙ్ముఖములు, జలజరిపుసింహనఖముల [18]తళుతళుకులు.

149


ఉ.

శీతలవాతపోతముల చేతులు చూచుచుఁ గల్వలచ్చి కేం
తేతను పావహిల్లఁ దగుదీవెన లిచ్చుచుఁ బ్రత్యగారముం
బూతముగాఁగఁ బాదతలము ల్పచరించుచు జ్యోతిరాగమ
ఖ్యాతునిలీల శీతకిరణాకృతి ప్రౌఢిమచూపె నేర్పునన్.

150


వ.

అప్పుడు కకుప్పులం గుప్పలించుచుఁ దప్పుతారి యోలంబుల నణంగిన
కాలాంధకారంబు దూరంబుగ వెడలించుచు నుడివోనిరతులం బతుల
చేత [19]సదమదమైనముదవతీజనంబులకు ముదంబొదవించుచు నదీతటంబులఁ
బుటపాకచటులం బగువియోగవేదనాజాతవేదంబున ఖేదంబునొందు విర
హుల కతినిగ్రహకారి యగుచు నగుమొగంబులం జిగిదొలంకు జీవంజీవం
బులకుఁ జేవదెచ్చుచుఁ బచ్చవిల్తునకు నిచ్చకంబును గమ్మతెమ్మెరకు సమ్మతి
యును గలువకుం జలువయును గైరవంబులకు గౌరవంబును నమృతంబు
నకు సుముఖత్వంబును సమకొల్పుచు వెలఁదివెన్నెల మిన్నును న్నేలయుం
గప్పి కర్పూరపరాగపర్వతంబు లేకీభవించి యుద్రేకించె నన విజృంభించె
నత్తఱి మత్తకాశినీచిత్తంబులు సీధురసాస్వాదాయత్తంబు లయ్యెఁ దత్తత్పదార్థ
సార్థంబులు ప్రబలప్రసారితంబు లయ్యె నయ్యాతుధానుండు మానవతీ
సహితుండై బహువిధచమత్కారప్రకాశం బగునొక్కవివిక్తప్రదేశంబు
నందు నాసీనుం డగుటయు.

151


గీ.

పాటలప్రసూనపల్లవభంగశీ, తలము లైనసీధుధార లాని
గ్రీష్మతాపజనితఖేదంబు నదలించు, సతులఁ జూచి విభుఁడు మతిఁ జెలంగె.

152


క.

జలరుహకర్ణికమీఁదటఁ, దల మగుపూఁదేనెకరణిఁ దరుణి యొకతె వె
గ్గలమగు మధుపూరము కర, తలమనుచషకమునఁ బట్టి ధవు మెప్పించెన్.

153


క.

మును దా మానఁగ నొకచవి, వెనుక న్విభుఁ డాననాన వేఱొకచవి యా
వెనుక సఖులాని యిచ్చుట, వనితలకుం బెక్కుచవులు వారుణి యొసఁగున్.

154


చ.

కొదలు మృదూక్తులు న్మదవిఘూర్ణితలోచనపంకజంబులుం
బదిలము లేని సిగ్గుమనుపట్లును దొట్రిలుచున్నయానము

న్మదనునిఁబ్రోదివెట్టు మదిమ్రబ్బును గుబ్బటిలంగఁ జంద్రమో
వదనలు పానకేళివిభవంబు లొనర్చిరి వారివారికిన్.

155


సీ.

ఇదె తేనెపెర చూడు మించుకచవి యంచు నధరబింబఫలంబు నాననిచ్చి
యిడె పుష్పకందుకం బెద నించుకొమ్మంచు నురుతరస్తనకుంభ మురము సేర్చి
యిదె మృణాలమతల్లి పొదువు కంధరనంచుఁ గరకాండములచేత గళముఁ జుట్టి
యిదె కల్వరేకు నీవిందుచేఁ జెమటవోఁ జిమ్ముకొమ్మని గోరఁ జీరఁ జేసి
నాథుఁ బోనీక యాఁగి నానావికార, చాతురీధాతురీతిప్రసక్తవచన
రచన గల్పించె నొకలేమ ప్రచురపాన, వికృతినో కాక మోహప్రవేశముననొ.

156


గీ.

చంద్రకాంతశకలచషకసంపూరిత, మధువుఁ గ్రోలఁగ్రోల విధుకరములఁ
బానపాత్రగరఁగుపరిపాటి యెఱుఁగక, వెలఁది యొకతె సారె వెదకఁదొడఁగె.

157


ఉ.

నీలకనీనికావిజితనిర్జరనాయకరత్న యొక్కహం
సాలసయాన సీధురస మానుచుఁ దత్ప్రతిబింబితాత్మప
ద్మాలఘుకాంతివాసనకునై పచరించిన కల్వరేకులం
చాలిక నవ్వఁగా వెఱఁజియాడఁదొడంగె నఖాగ్రధారలన్.

158


సీ.

పవనంబునకు నైనం బాయఁదట్టఁగరాని పయ్యెదకప్పులు బయలుపడియె
నధరపల్లవకాంతు లక్షిపద్మములందు వేడ్క నోయొక్కింత విశ్రమించె
మాటాడనేరని మౌగ్ధ్యంబు విడనూకి ప్రౌఢిమ తనుదానె గాఢమయ్యెఁ
బరమయోగికి నైన భావింపఁగారాని యానందసంపద యల్లుకొనియె
మఱపు ఘనమయ్యెఁ జేష్టలతెఱఁగువికృతి, గనియెఁ దొలుతటికోప మెక్కడికొ చనియెఁ
గాపిశాయనమదమత్తకరివరేణ్య, యానలకు నాథకీలితధ్యానలకును.

159


వ.

వెండియు నమ్మధుపానచేష్టాప్రకటనంబు కుకవికవిత్వంబునుంబోలె నికట
పదబంధవాక్యవైకల్యంబె యవివేకివితరణంబునుంబోలెఁ బాత్రాపాత్ర
వివేకదూరంబై నామజాలానభూమియుంబోలె బహుప్రకారమదచమ
త్కారసరసంబై మందానిలుచందంబున నానావిధపరిమళసంక్రమణరమణీ
యంబును గంధర్వలోకప్రకారంబున బంధురగాంధర్వసంధానగంధిలం
బును నుపవనంబునుంబోలె నుపవసంతసఖశిలీముఖముఖరితంబును నయ్యె
నయ్యెడ నయ్యతుధానసూనుండు ప్రసూనపరంపరాపరికల్పితంబును
మరువకమందారపల్లవమాకందకిసలయవిసరవిరచితశయ్యూతలంబును గర్పూ
రదర్పసారకాశ్మీరవిస్మేరసౌరభగర్భితంబును నైనశయ్యాతలంబు నధిష్టించి.

160

సీ.

పంచతంత్రంబులభావంబు లుబ్బించి యాలింగనంబుల నంటనలమి
సంస్కారముల షోడశస్థానములఁగల్గు కళ లొయ్యనొయ్యనె కరఁగఁజేసి
రాగంబు లెఱిఁగి సంయోగనీచాత్యుచ్చరతులం గూడక తుల్యరతులఁ గూడి
చక్రధనురైకముఖ్యచతురబంధంబులపాండిత్య మంతయుఁ బరిఢవించి
భావికృష్ణుండు గోపాలపద్మముఖుల, రాసకేళినిఁ దార్చునుల్లాస మెసఁగ
నొక్కఁడయ్యును బెక్కండ్ర యువతిమణుల, బరవశలఁ జేసి సంతసపఱిచె విభుఁడు.

161


వ.

అట్టి సమయంబున.

162


గీ.

సతులతోఁ గూడి రతిపరిశ్రాంతుఁడైన, దైత్యసుతుసేద దీర్పంగఁదలఁచెనొక్కొ
నవలతాన్తలతాంతగంధములు గొనుచు, బొలిచెఁ బ్రాభాతికానిలపోతకములు.

163


గీ.

ఆసనాస్వాదనిర్భరం బైనసురత, సౌఖ్య మధినాథుచే యథేచ్ఛముగఁ గాంచి
వేగఁ గరువలి వీవన వీచుచుండ, నందె నిద్రామహానంద మతివపిండు.

164


సీ.

ఆకాశలక్ష్మినాసాగ్రముక్తాఫలద్యోతంబు చూపెఁ బ్రభాతతార
యెండకాలమునాఁటియేటినీరునుబోలె డొంకివెన్నెలయు నిఱ్ఱింకు లింకెఁ
జలికందువఁ జరించువెలిదామరయుఁబోలె మధువైరిడాకన్ను మైలవడియె
ఱెక్కలు వచ్చి తా మెక్కడి కేగెనో చుక్కలగమి విచ్చెఁ జూడఁజూడ
జలజకాసారతటభూజకలితనిజకు, లాయకూలంబులందుఁ గోలాహలంబు
చేసెఁ బులుఁగులు జక్కవ చింతవాసె, దలఁగెఁ గందర్పుఁ డానిశాంతంబునందు.

165


ఉ.

తూరుపు తెల్లనయ్యె హిమతుందిలమారుతలూనవృంతమై
జాఱెఁ దరుప్రసూనతతి [20]జారజవారము తట్టువారెఁ గ్రోం
కారము చేసెఁ గుక్కుటనికాయము కల్వలు గన్నుమూసె నం
భోరుహ ముల్లసిల్లె నలిపోతము గీతము చేసె నల్లడన్.

166


గీ.

సమయఖనికుండు ప్రాగ్దిశాశైలతటము, త్రవ్వ నుద్భవ మైనకెందమ్మికెంపు
వట్రువయుఁబోలెఁ జీఁకటి కుట్రమన్నె, మూఁకవిప్పుచు నుదయించెఁ గాఁక వెల్గు.

167


క.

త్రిజగజ్జనసేవితుఁ డం, బుజబాంధవుఁ డుదయమైన భూసురముఖ్యుల్
భజియించిరి పాతకములఁ, ద్యజియించిరి దివ్యనవ్యతేజోధికులై.

168


వ.

ఇట్లు సూర్యోదయం బైనయనంతరంబ యాధైర్యధుర్యుండు భార్యాశతం
బుఁ గృశోదరీసహస్రసేవితం బగుదాని నుచితప్రకారంబున నగరికిఁ బనిచి
ననిచిన నిష్టాగరిష్ఠత్వంబున గ్రహకులశ్రేష్ఠు నారాధించి పురప్రవేశం బాచ
రించి విరించి సత్యలోకంబును వైకుంఠుండు వైకుంఠంబును ద్రిలోచనుండు

కైలాసంబును బాలించుకైవడి జావడింపక నిజరాజ్యపరిపాలనం బూజ్యుండై
యుండె నయ్యవసరంబున నొక్కనాఁడు సూచీముఖ శూర్పకర్ణ వృశ్చిక
రోమ వికటశంబర దీర్ఘజిహ్వ మహిషాదు లగుమానుషాదుల యాదేశం
బునఁ గావ్యోపదిష్టనయప్రయోగనిపుణుం డగువామనుండు తనకావించు
కపటోపాయంబునకు నవ్వేళ యనుకూలం బగుట యెఱింగి సింగంపుగద్ది
యం బ్రొద్దుజరపుచున్న యన్నారాయణప్రియుం గూర్చి యిట్లనియె.

169


వామనుం డను దానవుండు కొల్వునకు వచ్చుట

చ.

అవినయదూర సర్వభువనాధిప ధీనిధు లెల్ల మెచ్చ ని
య్యవనితలంబు నీకరతలామలకంబుగఁ జేసి మించి శా
త్రవులను మిత్రుల న్సమపదంబున నిల్పితి విట్టినేరు పా
దివియు రసాతలస్థలము దిద్దెడువారల కైనఁ గల్గునే.

170


సీ.

వృత్రాసురారాతి మిత్రత్వ మొనరింప ధనభర్త పరమబాంధవుఁడు గాఁగఁ
బానీయపతి సుహృద్భావంబు జరపంగ సఖుఁడై కృతాంతుండు సంతసిల్ల
మునులెల్ల జుట్టర్కమున మించి లిరుగంగ నెనరువాఁడై భానుఁ డనుమతింప
వశుఁడై గురుండు సర్వంబు బరీక్షింపఁ జంద్రుండు ప్రాణమై సవదరిల్ల
దివిజులకు నెల్ల మొదలైన దివిజుఁ డనఁగ, సద్గుణంబులయందు నాచారమహిమఁ
బ్రస్తుతింపంగఁ దొల్లింటి ప్రభువులట్లు, సాకితివి కీర్తి దానవచక్రవర్తి.

171


మ.

బలసౌభాగ్యవివేకవైభనములం బ్రఖ్యాతదానంబులం
గులవిద్యాగుణరూపశౌర్యమహిమన్ గోత్రావనజ్ఞానని
శ్చలత న్నిత్యదయావిశేషముల నాచారప్రభావోన్నతిం
గలరే నీ కెన మూఁడులోకముల లోకఖ్యాతతేజోనిధీ.

172


ఉ.

మొన్నఁటిపిన్నపాపఁడ వమోఘపరాక్రమసన్నుతుండవై
మున్నటివీరవర్యులకు [21]ము ల్లొకయించుక చూపుచున్న మీ
యున్నతి చూచి నాహృదయ ముబ్బెడు బాంధవమిత్రవర్గముల్
సన్నుతిసేయ సద్గుణవిశాలుఁడ వైతివి మే లనందగున్.

173


గీ.

నీవు చుట్టమవైన మనీషివర్య, చుట్ట మనరాదు రాజువై పట్టమేల
గుప్తకార్యంబు గాదు వాక్రుత్తు నొకటి, వినఁగవలతేని వినుము వివేకనిపుణ.

174


క.

కార్యాకార్యంబులు దగ, నార్యులతోఁ దలఁపు సేయనట్టిమహీశుల్
వీర్యసమన్వితు లయ్యును, శౌర్యమునం గెలువలేరు సమమదాహితులన్.

175

ఉ.

పెద్దఱికంబునుం బ్రియము పెంపు వహింపఁగ రాజ్య మేలు మీ
పెద్దలు భక్తితోడ మముఁ బేర్కొని పిల్చి సమస్తకార్యముల్
తద్దయు నేము చెప్పినవిధంబున నాచరణంబు చేసి యా
గద్దఱు లైన శాత్రవుల కండలు చెండి రుపాయచాతురిన్.

186


క.

అదిగావున మామాటలు, హృదయంబున కింపుచేసెనేనియు భక్తిం
బొదలుచుఁ దద్వృత్తాంతము, ముదలించెదఁ దేటతెల్లముగ సుగుణనిధీ.

187


క.

లోకాలోకనగేంద్ర, వ్యాకీర్ణప్రథితగుణలతానీక మహా
భీకరశాత్రవమదద, ర్వీకరవినతాతనూజ విభవబిడౌజా.

188


శా.

ఉల్లోకామలకోమలేతరకళానుష్ణచ్ఛవిక్షీర[22]వాః
కల్లోలస్ఫుట పుండరీకదివిషత్కల్లోలినీమల్లికా
వల్లీపల్లవఖడ్గఖండనశరద్వార్వాహసందోహసం
పల్లాలిత్యమిళద్యశోధవళిమభ్రాజద్దశాశాంతరా.

189


మాలిని.

శతధృతికులదీపా సత్యభాషాకలాపా
చతురనయధురీణా శౌర్యబాణారిబాణా
వితరణరవిపుత్త్రా విద్వదుద్యానచైత్రా
ప్రతిభటమదశిక్షా బంధురక్షాతిదక్షా.

190


గద్యము.

ఇది శ్రీహనుమత్కటాక్షలబ్ధవరప్రసాదసహజసారస్వత చంద్రనా
మాంకభారద్వాజసగోత్రపవిత్ర రామవిద్వన్మణికుమా రాష్టఘంటావ
ధానపరమేశ్వర హరిభట్టారకప్రణీతం బైనశ్రీనరసింహపురాణోక్తంబు
నందు నుత్తరభాగంబునందుఁ బ్రహ్లాదగుణవర్ణనంబును ఋతుసమాగ
మంబును నతండు దైత్యకన్యకలం బరిగ్రహించుటయును వనవిహా
రంబును బురప్రవేశంబును ననంబరఁగు ద్వితీయాశ్వాసము.

  1. పటాపంచు. మూ.
  2. జాంచల్యమున
  3. లలకు
  4. బేడలు
  5. వేధించుటుమొల్ల
  6. మనముల
  7. బ్రాప్తుండగు
  8. చికురు
  9. రాచవారి
  10. బొంచిన
  11. కోరకింపెడు
  12. లోదడ
  13. మిట్టలాని
  14. సవధరించ్చి
  15. ప్రసవాయుధుఁ డైయ్యసతుల
  16. నెసంగసుగంద్దని
  17. గ్రియ్యాట
  18. ధళుధళుకులు
  19. సదమదయైన
  20. జాలజకారము
  21. ముల్లోనరించుక
  22. వాక్కల్లోలస్పుట