నారసింహపురాణము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీరస్తు

నారసింహపురాణము

ఉత్తరభాగము

తృతీయాశ్వాసము


క.

శ్రీమందిర ధృతిమందర, భూమక్షేమాభిరామ పుణ్యతరమతీ
భూమధ్వజభీమద్యుతి, ధామస్ఫుటహేతి రంగదండాధిపతీ.

1


వ.

ఆకర్ణింపు మట్లు శౌనకాదులకు రోమహర్షణుం డిట్లనియెఁ దనసూక్తంబులకు
ననురక్తుం డగుప్రహ్లాదుం గూర్చి వామనుండు.

2


వామనుఁడు ప్రహ్లాదునకు నీతిం దెల్పుట

క.

జలమునఁ బుట్టిన జలజము, జలము విసర్జించినపుడె సమయువిధమునం
గులబలము విడిచి భూపతి, మలినుండగుఁ దేజ ముడుగు మఱుఁగున్ జరగున్.

3


క.

నీనెనరువార మిందఱ, మీనియతిని నిన్ను విడువ నెఱుఁగక శాకం
బేనియు ఫలమూలుజలము, లేనియుఁ గొని ననయుచున్కి నీ వెఱుఁగవొకో.

4


క.

ఇది బుద్ధిమంతుఁ డయ్యెడి, నిదె శాత్రవవిజయమునకు నేగెడి నీతం
డిదె మమ్ముఁ బ్రోచు నిజమని, యెదురెదురే చూచిచూచి యిటురావలసెన్.

5


క.

కరినఖరలూనమగు విరి, పరికింపఁగ నెండిపోవుపరువడి మూల
స్థిరబలము లేనిభూపతి, పరిభవముం బొందుఁ గాని ప్రబలఁడు మీఁదన్.

6


క.

దాక్షిణ్యంబున మముఁ దము, రక్షించుచు శత్రుపక్షరక్షివిగా కీ
వక్షీణాక్షుద్రభుజా, కౌక్షేయక్షతరిపుడఁవు గమ్ము కుమారా.

7


క.

తరతరమునాఁటి హితుల, న్నరపతి విడనాడి యురక నమ్మి యితరులం
బరివారముగా నేలిన, విరవిరగా కేల గాంచు విజయశ్రీలన్.

8


క.

తనవారి మీఱి చేసిన, పని ఫలితముగాదు వరటిపద నివిరిన భూ
మిని గర్షకుండు విత్తర, కిన దానం గనునె ఫలము కీర్తివిశాలా.

9


క.

తెగటార్పవలయుఁ బగఱుల, తేగలకుఱికి నిప్పు దూదితిట్టలఁ బోలెం
బగవారిక్రింద నణఁగిన, మగవాఁడు న్మగువయును సమాను లధీశా.

10

చ.

విమలమనస్కులై కపటవృత్త మెఱుంగనివారితోడ స
త్యము నతిశౌచముం గలిగి ధర్మ మెఱింగినవారితోడ ను
త్తము లగువారితోడ సతతంబును మైత్రి యొనర్చు టొప్పుఁ జి
త్తము లొకరీతియైనవిమతప్రకరంబులఁ గూడు టొప్పునే.

11


క.

ప్రాణానిలముల కన్న, న్మానమె యధికంబు గాఁగ మదిఁ దలఁపని య
జ్ఞానికిఁ గీర్తులు గలవే, దాననకులనాథ మెత్తఁదన మిది తగునే.

12


క.

దనుజులకును ననిమిషులకు, నెనయవు డెందములు వైరహేతిమదర్చుల్
మొనలెత్తియుండుఁ బాముల, కును మూషకములకుఁ గలదె కూటమి యెందున్.

13


చ.

ఘనతరదోర్బలోద్ధతి జగత్త్రితయంబును సంహరింప నో
పిన మముఁ జూచి దేవతలు భీతి నణంగిరి గాక మేము నీ
పనులకు రోసి పోయి తగుపట్లన యుండితి మేని యొంటిగాఁ
డని నిను నేమి సేయుదురొ యారయుమా నయమార్గచాతురిన్.

14


గీ.

అన్నశేషమున్న నాఁకలి చెడిపోవు, రోగశేషమున్న రూపు దఱుఁగు
శత్రుశేషమున్న ధాత్రికి ముప్పగు, సిరులు విరియు ఋణము శేషమున్న.

15


క.

అదిగావున శాత్రవుల, న్మొదలంటం దునుమలేని మూఢాత్ములకుం
గదనజయము చేకూరునె, పొదలునె సత్కీర్తిలతలు పూఁగొమ్మలతోన్.

16


సీ.

సంగ్రామముఖమహోత్సాహదోహలి యైన విబుధాధినాథునివెన్ను చఱచి
మంజుఘోష తిలోత్తమయు నాదిగాఁగల సింధురయానలఁ జెఱలువట్టి
నందనవాటికానందప్రదము లైనయమరశాఖుల మొదలంట నఱకి
ముల్లోకములు గిట్టి మువ్వెట్టి గొనిసి శత్రు వనుపేరు కలలోననైనఁ గనని
దితీవధూగర్భశుక్తిమౌక్తికఫలంబు, కనకకశిపుండు తండ్రిగాఁ గలుగు నీవు
వినుతమర్దనశాలివై వెలయుదేని, పరిమళము బంగరువునకు దొరకినట్ల.

17


క.

ముదలించి చంపనోపక, మదనగురుఁడు నీదుగురుని మానిసిమెకమై
విదళించె నట్టికుహనా, విదుని న్భజియించె దీవు వే ల్పనుబుద్దిన్.

18


మ.

కనకాక్షు న్వధియించెఁ బోత్రితనుఁడై కంబంబులోఁ బుట్టి శా
తనఖాగ్రంబుల వ్రచ్చె నీజనకునిన్ దండించెఁ బెక్కండ్ర న
ద్దనుజశ్రేష్ఠుల నిష్ఠురాసనరుచు ల్దర్పింప నీముందటన్
జనకద్వేషి భజంచు బేలు గలఁడే సప్రాణుఁడై యుండియున్.

19


గీ.

బలముఁ గులముఁ జలంబును గలఁడ యైన, సకలసౌభాగ్యసంపత్ప్రశస్తుఁ డైనఁ
బూనుకొని తండ్రిపగ యీఁగలేనివాఁడు, మీసములతోడియాడుది మిహిరతేజ.

20

సీ.

కరతలామలకసంకాశంబు లయ్యె నీ కచలవిద్యారహస్యంబు లెల్ల
భావసంభవుఁడును నీవు నేమవుదురో కాని లావణ్య మనూనతరము
గోష్పదాక యయ్యె గులిశాయుధునివిభవంబు నీయైశ్వర్యవారిధికిని
ముక్తాతపత్త్రమై మూఁడులోకములకు నీకీర్తిచంద్రిక నీడ యొసఁగెఁ
జతురకవికల్పశాఖి నీవితరణంబు, నీమహత్త్వంబు వర్ణింప నేరఁ డజుఁడు
నకట నీ కేల పగవారి నాశ్రయించి, రాజ్య మొనరింప దీన గౌరవము గలదె.

21


సీ.

ముదివేల్పుఁ గదిసి నెమ్మొగములు నగులంగ జెంపవెట్టఁగలేమె సింహశౌర్య
కంసారి నిద్రించుకడలి [1]వండలివండు చేసి చల్లఁగలేమె వాసవారి
పిడికిళ్ల నుష్ణాంశుఁ బొడిపొడి గావించి మేఁ జల్లుకొనఁగ లేమే బలాఢ్య
యనలజిహ్వలు పల్లవావలిక్రియఁ దున్మి [2]తూఁటాడలేమె బంధురవిహార
నీయుపేక్షన యేమెల్ల నివుఱుఁమీఁదఁ, గవిసియుండిననిప్పులగతి విహీన
బాహుశౌర్యులమై యుండి ప్రతిఘటించి, పలికితిమి దేవ విసివి నీ పాద మాన.

22


సీ.

బలిమిదప్పక మూలబలములఁ బోషించి జలగిరిస్థలదుర్గచయ మమర్చి
వనదుర్గములు కొన్ని వశములు గావించి చతురంగబలముల సంతరించి
చారచక్షువులచే శత్రుభూపాలవైభవమంత్రతంత్రసంపదలు దెలిసి
సామదానాదికసమయంబు లరయుచు గుప్తకార్యజ్ఞానకుశలుఁ డగుచు
మించి సర్వాంగరక్ష గావించి నిశిత, నీతిదర్శనమున ధరణీవిభుండు
పరభుజాశౌర్యపాథోధిబాడబాగ్ని, వోలె నింకింపవలవదె భువనవంద్య.

23


ఉ.

శాతకరాసిచే నిమతసంహరణం బొనరింపఁజాలు నే
జాతిమనుష్యుఁ డైన బలసంభృతశౌర్యవివేకయుక్తుఁ డౌ
నాతఁడె సర్వలోకవిభుఁ డాతఁడె పర్వతపక్ష[3]శాసనుం
డాతఁడె చంద్రఖండధరుఁ డాతఁడె పంకజనాభుఁ డెంచఁగన్.

24


సీ.

ఆదినుండియును నీయఖిలంబు జంగమస్థావరరూపమై తనరుచుండు
నందు జంగమములై యండజస్వేదోద్భవజరాయుజంబులవరుస లెసఁగు
స్థావరంబులు మహీధరపాదపాదు లేతద్వయాన్యము లేదు తర్కశయ్య
నారెంటిలోన ముఖ్యములు జంగమములు వానిలో మనుజులు మానధన్యు
లానరులకన్న దేవత లధికతరులు, వేలుపులకన్న నసురులు వెగ్గలంబు
తత్కులంబునఁ బుట్టియుఁ దగునె యిట్లు, దానవాధీశతనయ యీతడమఁదనము.

25

క.

తనువెత్తినందుకు రిపుఁ, జనముల భంజింపవలయు సద్భోగంబుల్
గొనవలయు బంధుపోషణ, మొనరింపఁగవలయు జయము నొందఁగవలయున్.

26


క.

సంతుష్టిలేని విప్రుఁడు, సంతుష్టుం డైనవిభుఁడుఁ జదియుదు రెందున్
సంతుష్టిలేక యునికి య, శాంతిని ధీరాజునకును సంపద నొసఁగున్.

27


క.

అడఁగినవారల శాత్రవు, లడఁతురు ఛల మగ్గలింప నడఁగక పరులం
గడకంటఁ జూచుధీరుల, [4]కడఁగొలుపవు శత్రునికరగర్వస్ఫూర్తుల్.

28


క.

అమరులయమరత్వము నీ, దుమనంబున నెన్నవలదు ధూర్జటినిభవి
క్రమ వారినెల్లఁ బదహతి, జమరుదుమే యమరతాప్రశస్తి యడంగన్.

29


క.

ఘనకీర్తికారణంబులు, మునుమగు ధర్మార్థకామముల కాశ్రయముల్
దనుజేంద్ర దానవాధిప, తనువులకు న్సాటి గావు తక్కినతనువుల్.

30


క.

పంచత్వము నొందకమును, సంచితములు సేయవలయు సకలార్థంబుల్
పంచత్వము నొందినతుద, నించుక గొఱ యగునె నిర్జరేశ్వరుఁ డైనన్.

31


వ.

అని పలికి వామనుం డామహాత్మునితోడం దన డితోదనుజవీరులఁ జూపి యి
ట్లనియె.

32


సీ.

పొదివి ముష్టాముష్టిఁ బోర నింద్రునినైన గెలువఁజాలిన కాలకేయుఁ డీతఁ
డానవబిందుమర్యాద నంబుధులేడుఁ ద్రావనోపిన కాలదంష్ట్రుఁ డితఁడు
తాళంపుఁజిప్పలలీలఁ జంద్రార్కులఁ గదియింపఁ గల శూర్పకర్ణుఁ డితఁడు
కులనగంబుల నైన గులగులగాఁ గేలిబిరుసు వాటించు శంబరుఁ డితండు
దక్షుఁ డాహవమునకు ధూమ్రాక్షుఁ డితఁడు, కాంచనాహార్యధైర్యుఁ డీకంకటుండు
భూమిచక్రంబు నొక్కటఁ బూని పట్టి, పేషణము సేయనోపు నీదూషణుండు.

33


క.

ఖరుఁ డను దానవుఁ డితఁ డతి, ఖరకరతేజుండు మున్ను గగనచరుల ని
ష్ఠురుల సుకేతుకుమారుల, నరికట్టెం దూపువాన నంటఁగఁ బట్టెన్.

34


ఉ.

అక్షయసత్త్వశాలి కపిలాక్షుఁ డితం డొకనాఁడు పుండరీ
కాక్షుని వాహనం బగు ఖగాధిపుఁ డంబరవీథి నేగఁగాఁ
బక్షము లూఁచి ము క్కణఁగఁబట్టి ప్రయాసము సేయఁగాంచి యీ
రాక్షసు లెల్ల మాన్చిరి భవంబుగ నీతనివిక్రమోద్దతిన్.

35


గీ.

కల్పకేతుఁ డితఁడు కల్ఫాగ్నిసమమూర్తి, దీర్ఘజంఘుఁ డితఁ డుదీర్ణబలుఁడు
వక్రదంతుఁ డితఁడు శక్రాదులకు నైన, గెలువరాదు సమరతలమునందు.

36

క.

నియ్యానతి గలిగినచో, నియ్యాన సమస్తదేవనివహము నెల్లం
గయ్యంబునఁ బనిమార్చెద, రియ్యసురులు నీవు వీరి నేలుట తగదే.

37


క.

ఆరూఢశౌర్యసంయుతు, లై రణమున భయము లేక హాలాహలశిన్
శౌరి నజునైన గెలుతురు, వీరలు నీమూలబలము నీరవరేణ్యా.

38


క.

ఆట్టట వేలుపుగమిఁ జే, పట్టకుమీ ప్రాఁతవారి పట్టుడగకు నీ
యట్టి మహాత్మున కేటికి, పట్టువడ న్వీరకర్మధర్మ మడంపన్.

39


వామనుఁడు ప్రహ్లాదునకు హంసునికథ చెప్పుట

వ.

ఏతదర్థంబై యొక్కయితిహాసంబు గల దాకర్ణింపు మని వామనుం డారాక్ష
సాధ్యక్షుతో ననియె. మున్ను సుమాలివంశకుశేశయహంసుం డగు హం
సుండను దానవోత్తముండు వెలయు నబ్బలియుండు.

40


క.

తలమా సూడినమొదలున్, జలరాసులనీఁదు సప్తశైలము లూఁచున్
జలజల జుక్కల రాలుచు, నిలరాచు న్భుజగకులము నేఁచు న్వేఁచున్.

41


క.

సురలోకమువారల నీ, నరలోకంబునకుఁ దెచ్చు నరసురలోకే
శ్వరుల భుజంగేంద్రలోకాం, తరమునఁ గావించు దోర్మదము పూరించున్.

42


సీ.

ఆతపత్రచ్ఛాయ నరుదేరనొల్లఁడు నందన[5]వనినీడయందె కాని
యొఱగుముండా[6]మీఁద నొఱగంగ నొల్లఁడు రంభపాలిండ్లయోరలనె కాని
పార్థివం బగుభుక్తి పాటింపఁగా నొల్లఁ డలఘుసుధాసుధారలనె కాని
గజరథాశ్వముల నెక్కఁగ నొల్లఁ డమరర్షితతికృతబ్రహ్మరథంబె కాని
సత్యలోకంబుఁ బాలించు శంభులోక, మేలు శ్రీవిష్ణులోకంబు లాలనంబు
సేయుఁ బాతాళసురపదక్షితితలముల, [7]నుంబళికి నిచ్చుఁ దనుగొల్చియున్నప్రజకు.

43


క.

యోగబలంబుస నతఁ డీ, లాగున నానానిలింపలాఘవకరుఁ డై
యాగములు సేసె సిరు లుప, యోగించె నవీనశక్తి నొనరెం దనరెన్.

44


ఉత్సాహ.

హరునిఁ గొల్వఁ డజు భజింపఁ డంబుజాక్షసేవకుం
జొరఁడు హోమవిధికి రాఁడు సూర్యుఁ బేరుకొనఁడు సు
స్థిరచతుర్ద్వయాంగయుక్తదివ్యయోగసిద్ధివి
స్ఫురితుఁ డై నిశాటరాజు పొడవువడసెఁ గీర్తులన్.

45


క.

జలములు నగ్నులు నింధన, ములుఁ దక్రక్షీరదధి[8]సమూహమునుం దే
నెలుఁ దండులములు మొదలుగఁ, గలిగించు నతండు యోగగౌరవసిద్ధిన్.

46

ఉ.

దానవనాథుపంపున నుదగ్ర[9]బలాఢ్యులు వెగ్గలంబుగా
మానిసిదిండిమూఁకలు సమస్తజగంబుల నాక్రమించి వై
మానికులన్ బలారిభవమాధవధాతలు మున్నుగాఁగ నె
చ్చో నిలుపోపనీక వెసఁ జోఁపిరి తేనియఁయీగలుంబలెన్.

47


క.

బొక్కలు చొఱఁబాఱిరి తము, నిక్కువలకుఁ బాపి దానవేశ్వర యోధుల్
కక్కనపెట్టిన గాలియ, [10]బొక్కుచు శేషాదు లైనభుజగాధీశుల్.

48


క.

ఉర్వీవలయం బంతయు, నిర్వీరంబయ్యెఁ బ్రజలు నెళవుల కెరవై
పర్వతముల బాథోధుల, [11]*చేర్వల వసియించి రధికచింతాపగతిన్.

49


ఉ.

లోకములెల్ల నిట్టు లతిలోకపరాక్రమవిభ్రమ[12]క్రమో
త్సేకధురీణుఁడై యసుర చేకొని యేలుచునుండ గాఢశో
కాకులచిత్తులై యమరు లందఱు దుగ్ధపయోధియుత్తర
క్ష్మాకటకంబునందు గడుసందడిగా గమిగూడి వాడుచున్.

50


సీ.

నిశ్వాసధారలు నిగుడించువారలు శిథిలమానసముల జివుడువారుఁ
దలయూఁచి తలఁయూచి తగ్గి మ్రగ్గెడువారు ముఖకాంతులకు ముచ్చముణుఁగువారు
నంతఃపురక్లేశ మరసి ఘూర్ణిలువారు శిశుదైన్యమునకునై చిముడువారు
మాటలాడఁగఁ బోయి మాట తోపనివారు మతిలేక చేతిది మఱచువారు
బాపురే దైవమా యని పనుపువారు, నిది మహోత్పాతమని హంసు నెన్నువారు
నగుచు దైవతమునిసిద్ధయక్షసాధ్య, వరులు బెగడంగఁ జూచి శ్రీవరుఁడు పలికె.

51


శా.

ఓహో మీ రొకయింతసేపు నిలుఁ డే నూహించి లోకత్రయ
గ్రాహిన్ దేవవిరోధిఁ ద్రుంచునయముం గావించెదన్ మీకు నే
లా హైన్యంబు సహింప యోగవిభవోల్లాసంబుచే వాని కీ
మాహాత్మ్యం బొనగూడెఁ గాక యితరు ల్మాఱే నే మనుగ్రాసికిన్.

52


క.

మాయాబలమున రాక్షస, నాయకుని జయించి శంభునలినాసమరు
న్నాయకముఖ్యులు మెచ్చఁగఁ, చేయుదు భద్రంబు సిరులు చేకుఱు మనకున్.

53


వ.

ఆ రాక్షసుండు త్రిలోకాధ్యక్షుం డై యునికి మానవమానంబున లక్షహాయ
నంబు లయ్యెఁ దదీయం బగుపుణ్యఫలం బగు నింతియ యకర్కశనయ
తర్కనిపుణుండ నై సర్వంబును శుభోదర్కంబు చేసెద మీరు మీవలసపట్టు
లకుం జనుం డని పచ్చపట్టుబట్టగట్టు దేవర వియచ్చరుల నుపలాలించి విష

ధరవిధివిబుధరమణలం బిలిచికొని సురగురుసమేతంగా నంతర్ధానంబున
నవధరించి యొక్కయిక్కువ నధిష్టించి.

54


క.

భావించి కల్పతరువుల, రావిం చిట్లనియె హంసరక్షోహంసం
బావసుధాస్థలి నున్నాఁ, డీవేళ జగంబులెల్ల నేలి యలసుఁడై.

55


గీ.

ప్రతిదినాభ్యాసనైశిత్యపటిమ నెసఁగు, యోగవిద్యయు విడనాడి భోగపరత
నున్నదైతేయు మాయచే నోర్చుపనికి, నిదియె యభిసంధి వింటిరె వృక్షపతులు.

56


వ.

మీరు మీయేనుదెరంగులవారునుం గూడి కుతలంబున కరిగి యదృశ్యా
కారంబున దానవవీరునంతరంగంబు నధిష్టించి యతనికి నశ్రాంతవిశ్రాణన
పరాయణత్వంబు నుద్భోధింపఁజేయుండు పొండనిన నా[13]విదురువెల్లిపొదలు
గదాధరుపనుపు ననుసంధించుటకు నై వసుంధరకు నవతరించి దివిజారిహ
దయప్రవేశంబు సేయుటయు.

57


గీ.

సివము పట్టినకైవడి దివిజవినుత, పరివృఢునిబుద్ధి పాటిల్లెఁ బ్రౌఢగాఢ
వితరణస్ఫూర్తి కామినీవిభ్రమముల, గాముకునిబుద్ధి రాగంబు గ్రమ్ములీల.

58


సీ.

బలిమి విద్వజ్జనంబుల సమారాధించి గుప్తదానములుగాఁ గొన్ని సేయు
నాచార్యగురుమిత్రయాచకావళికెల్లఁ దుదలేక తోరహత్తుగ నొసంగుఁ
బేదలసాదలఁ బిలిపించి వారికోర్కికి నలుమణుఁగుగాఁ గేలికిచ్చు
యోగసిద్ధులమంచు నొకకొన్నిబూటకంబులు పన్నువారి కేప్రొద్దురాల్చు
వందిమాగధకవినటావళులనెల్లఁ, గనకవృష్టులఁ దడిపించుఁ గామినులకు
నభిమతార్థప్రదానంబు లాచరించు, వాసవారాతి వితరణోల్లాసి యగుచు.

59


గీ.

అడుగువారు లేని యట్టి దినంబున, సురవిరోధినోరు చొరదు కూడు
వ్యసనవంతుఁ డైనవానికిఁ గలుగునే, ధీరతయును నయవిచారతయును.

60


క.

అనుదినముఁ గరవటమునం, జస మించుక తివియఁ దివియ సంశీర్ణం బై
చనుగతి దానవుసిరి పలు, చన యయ్యె నసంఖ్యదానసంభావనలన్.

61


సీ.

వైకుంఠపురలబ్ధవైడూర్యరాసులు వైధాత్రపట్టణవజ్రమణులు
నీలకంఠావాసనీలమాణిక్యంబు లమరేంద్రువీటిముత్యాలసరులు
గరుడకిన్నరయక్షగంధర్వనగరాబ్జరాగదళంబులు నాగనగర
మరకతంబులు మహీవరజయసంప్రాప్తగోమేధికంబులుఁ గుందనంపు
గట్టునందలి పుష్యరాగములు జలధి, విద్రుమద్రుమఖండము ల్వెచ్చపెట్టి
పచ్చపైకంబు లేకుండెఁ బాకవిమత, విమతుఁ డాలోచనము లేని వెడఁగునీగి.

62

క.

వల దన్నవానిఁ గినియును, వలయు ననినవాని మెచ్చి వస్తువు లొసఁగుం
దల తోఁక లేనియోగుల, [14]ములుచఁదనంబున సురారి ముగ్ధుం డగుచున్.

63


గీ.

కొల్లచనినరీతిఁ గుంభినీగర్భంబు, నందు నణఁగినట్టు లసురవిభుని
వసువిసరము లెల్ల నిసుమంత యిసుమంత, చిక్కె వేగుఁబోకఁజుక్క లనఁగ.

64


క.

గణికాజనవంచితుఁ డగు, మణిహస్తునిలీల రిత్తమానిసి యగుచుం
గుణపప్రాయుం డై సుర, గణవిద్వేషణుఁడు గీర్భుఘనమై(?) యుండున్.

65


గీ.

బేలునీగిచేతఁ బేర్చినమున్నింటి, విత్తరాసు లెల్ల రిత్త యైన
యోగ [15]మూని ధనము లాగించుటకుఁ బూనె, నసురలోకభర్త యాక్షణంబ.

66


గీ.

అంటుదాఁకినఁ బోవు సిద్ధాంజనంపు, మూలికయుఁబోలె నభ్యాసముక్త మౌటఁ
బనికి రాదయ్యె యోగప్రధానగరిమ,విధియ ప్రతికూలమైనచో వెరవు గలదె.

67


వ.

ఇ ట్లమరుతరుపంచకం బసురపంచానను వంచించి యథాస్థానంబునకుం జని
దానవారికి నత్తెఱం గెఱింగించిన బ్రహర్షించి యావిరించిజనకుం డనిమిష
పతిం జూచి యి ట్లనియె.

68


చ.

విను మమరేంద్ర యీక్షణమ వేలుపుఁగొమ్మలు యక్షకిన్నరాం
గనలను దివ్యవారుణియు గాయకనాయకసంయుతంబుగాఁ
జని తనుసౌరభంబులఁ బ్రసన్నముఖాబ్జసుధాంశురోచులం
జెనకుల దానవాధిపునిచిత్తము మత్తము సేయఁగాఁ దగున్.

69


గీ.

అర్థసంపదలు నిరర్థకవ్యయముచేఁ, గొల్లపుచ్చి నట్టి గుట్టుతోడ
నున్నవానిఁ జేరి యొల్లన నవశిష్ట, ధనములెల్ల మీరు గొనుట యొప్పు.

70


వ.

ఇవ్వారుణి యవ్వారాశిమథనావసరంబున సుధావిభాగంబుతఱి నాచేతఁ బ్ర
యుక్త యై కాదె నాకరిపులం జీకాకుపఱిచె నిమ్మత్తకాశినిచేత నేతత్ప్రయోజ
నంబు ఫలించు ననుటయు బలభేది జలశాయియానతి నొనరించుటయు.

71


సీ.

రత్నంపుమెట్లఁ దోరము లైనవీణెలు సన్నపుసరకట్ల [16]కిన్నెరలును
గాహళమురజశంఖపణవకింకిణుల్ ముఖవీణలును దాళములును నాగ
నరములుఁ దప్పెట్లధరవీణలు నుపాంగములు నావజంబులుఁ దళుకుఁబసిఁడి
చుయ్యంకులును దేశిశుధ్ధాంగవిదు లైననట్టువల్ పాత్రలతెట్టువలును
బంచవన్నెలచిలుకలపంజరములు, మరులుగొని వెంట వెన్నాడు హరిణములును
గలిగి పూచినతంగేళ్ళగతి విభూషి, తాంగలై దేవతాంగన లవని కరిగి.

72

గీ.

గరుడగంధర్వకిన్నరసురకుమార, వర్గములు [17]మేళగాఱు కైవడి నిజాను
కూలవృత్తిఁ జరింపఁ జకోరనయన, లసురకులనాథుపట్టనం బపుడు సొచ్చి.

73


వ.

విహరించు సమయంబున.

74


సీ.

ఉన్నయట్లన యుండి యూరక మధుమాస మఖిలాభిరామ మై యవతరించె
వలయయానములతో మలయానిలంబులు త్రొక్కనిచోటులు ద్రొక్కఁదొణఁగె
వలరాజు నెలరాజుఁ జెలికాఱుతనమున నిఖిలమోహనలీల నెళవుకొనియె
మరలఁ బ్రాయము వచ్చెఁ దరులతావితతికి మగువలకోపంపుమరులు మానె
గోఁకె హరిణిని హరిణంబు కొమ్ము చిమ్మి, చంచువును జంచువును గూర్చె నంచజోడు
తాపసులబ్రహ్మచర్యంబు తావుదలరె, నద్బుతోదయ మగుమాధవాగమమున.

75


వ.

అంత నొక్కకందువం బురందరప్రేషిత లగుయోష లశేషసంరంభసము
జ్జృంభితలై మురజంబులపై వైచిన బిరుదచామరంబులును బూదండలు సుట్టిన
దండియలును బురోవీథిమొరయుమలహరులం గలిగి వెలిహజారంబున నిండు
కొలువై యుండిన దానవమండలేశ్వరుం గని యతనికనుసన్న నుచితస్థానం
బుల నాశీనులై దేవా యీవచ్చినవార మెల్ల మును నల్లనేరేడుమ్రాని
క్రింద నీడలం గ్రీడించువారలము గంధర్వులకును మాకును సంబంధగం
ధంబు గల దలఘుతరప్రచారం బగునీకీర్తిసౌరంభంబు నాఘ్రాణించి శీఘ్ర
వేగంబున ద్విరేఫంబులం బోలె నేతెంచితిమి మమ్మం గరుణించి మాయాట
పాటలు పాటింపు మని వీణియలు తాటించి.

76


క.

[18]అపాతమధురగీతక, లాపంబున శ్రుతులు దనిపి లాస్యవిలాస
శ్రీపరిపాకమునఁ ద్రిలో, కీపతిడెందంబుఁ గరఁచి కేళీపరలై.

77


క.

నగవులఁ జూపుల మాటలఁ, దగవులఁ గందర్పశాస్త్రదర్శనముల నా
జగదేకత్యాగికి వా, రగణికపరమానురాగ మంరించుటయున్.

78


గీ.

నగరులోన నొక్కనాణెంబు లేకుంట, యెఱిఁగి హంసదైత్యుఁ డిచ్చెవారి
కన్ను దనియ హారకటకకేయూరకి, రీటపదకవలయకోటు లెల్ల.

79


ఉ.

ఇచ్చిన మెచ్చి పల్కి రసురేశ్వర యేటికి మాకు నీగి మా
వచ్చుట నిన్నుఁ గొల్చుటకు వచ్చుట యిచ్ఛక మింత లేదు మా
ముచ్చట దీరఁ గొన్నిదినముల్ భవదంఘ్రులు సేవచేసి నీ
నచ్చిన నాగవాసములనంటున నుండెద మన్న నాతఁడున్.

80

క.

ఆమేళముతో ని ట్టను, భామామణులార యీగిపని యెంత మముం
గామించి కొలువ వచ్చితి, రే మంచిది యయ్యె నిలువుఁ డిచ్చో ననుచున్.

81


వ.

వారలకుఁ బూర్వావశిష్టంబు లైన యష్టాపదవిశేషంబులు పరామర్శించి
పేరిపేరివరుస మేలువెచ్చంబునకు నిచ్చి వియచ్చరనగరోపమంబు లగు
విడుదు లొసంగిన నాకపటనటీనటఘట లాపుటభేదనంబున నిలిచి యుప్పట
ప్పటికి నప్పిశితాసికి నుల్లాసంబు దెచ్చు పొరపొచ్చెపుటిచ్చకంబుల మెచ్చు
నవయుచుఁ దొడిమ విడిచిన యుర్వారుఫలంబునుంబోలె సర్వసేవకసమూ
హంబునందును సర్వాంఛితుం గావించి సేవించి రయ్యవసరంబున.

82


క.

మదనుని యాఱవబాణము, మదిరాకన్యకకు మేలుమానిసి యై యా
మొదలిటివేలుపుదొర సద. మదమగుఁ దుదలేనిరతుల మాపు వ్రేపున్.

83


క.

రాగాంధుఁ ద్యక్తబాంధవు, భోగాంబుధిమగ్ను నస్రపుని విడిచి నిజో
ద్యోగంబు లుడిగి వెలవెల, నైగడిసీమలకుఁ జనిరి యాప్తులు హితులున్.

84


వ.

పరివారంబునుం బరిహృతజీవితం బగుటఁ బలుదెఱంగుల నంతరంగంబుల
బొక్కుచు దిక్కటకంబు లధిష్ఠించె నిట్లు.

85


సీ.

చినికి రూపఱి పోయె నవరత్నమయశతాంగములు వానల నెండగాలిఁ దూలి
గజహయంబులు గడ్డిఖాణంబు లెఱుఁగకనాఁడు నాఁటికిఁ దొంటిపోఁడి ముడిగె
బంగారుప్రతిమల ప్రతివచ్చు ననవచ్చు నుడిగంపుఁ గొమ్మలు బడుగు లైరి
దండనాయకులు మిత్రములు నీతిజ్ఞులు గురువులు దిటదప్పి కొంచెపడిరి
మధుమదాయత్తుఁ డై మేనుమఱచి మదిర, నంటువాయఁగనీక పుష్పాస్త్రవిశిఖ
శిఖలజంతికతొలు లైనచిత్తమగల, హంసుఁ డెరగొని యుండునయ్యవసరమున.

86


క.

తనరాజ్య మెల్ల నీక్రియ, నను వేదుట యూడిగముల యందలిజనము
ల్వినిపింప విని నిశాటుఁడు, తన మదిలోఁ దలఁచె వజ్రధరుఁ దలఁచుటయున్.

87


సీ.

ఆకుపచ్చనిచాయ నపమళింపెడు వేయుహయములఁ బూనిన యరుద మెక్కి
ధూమావృతానలద్యోత మై స్ఫీత మై ఝంపతో నశనిధ్వజంబు గ్రాల
హరిచందనాలిప్త మగుప్రకోష్ఠము గల పిడికిటఁ బట్టినభిదుర మమర
హారకిరీటకేయూరతులాకోటికంకణాదులకాంతి కడలుద్రొక్క
నలఁచివైచిన హరిచందనంపువలపు, ప్రబలి నలుదిక్కులందును గుబులుకొనఁగ
దివ్యమాల్యాంబరాదృతిభవ్యమూర్తి, మహితలంబున కేతెంచె మఘువుఁ డపుడు.

88


క.

ఏతెంచి తగినవిధమున, దైతేయాధీశుఁ గాంచి తత్పదములపై
భూతలము మ్రోవ మ్రొక్కిన, నాతం డత్యాదరమున హా వలదనుచున్.

89

వ.

ప్రత్యుత్థానం బొనరించి యాదిత్యపతిం గౌఁగిలించుకొని యాతిథ్యం బొసంగి
తథ్యంబులు హితంబులు నైన వాక్యంబులు కొన్ని వక్కాణించి పిశితభు
క్కులశ్రేష్ఠుం డిట్లనియె.

90


శా.

అన్నా యన్నలుఁ దమ్ము లైనమిము ము న్నాక్షేపము ల్పల్కి నే
నిన్నా ళ్ళేలితి మూఁడులోకములు మి మ్మేప్రొద్దుఁ గారించితిన్
వెన్నుం డుగ్రుఁడు నల్వయు న్మనుచు బల్వీ ళ్ళాఁగితిన్ లోకర
క్షౌన్నత్యంబున కోపభోగములయం దాసక్తి గొంటిం గడున్.

91


గీ.

ప్రాజ్ఞుడవు నీవు నయకళాప్రౌఢమతివి, యాబృహస్సతి నీకూర్చునాశ్రితుండు
తాల్మి గలవాఁడ వోపుదు ధరణిభుజగ, సదననాకంబు లొక్కట నవధరింపు.

92


క.

ఏకాతపవారణ మగు, లోకత్రయ మేలు మసురలోకమును మరు
ల్లోకము సరిగాఁ జూడుము, నా కాప్తుఁడ వగుచు నుండు నాకాధీశా.

93


గీ.

అనినఁ గపటనాటకారంభనిపుణుండు, నేఁడు చిక్కె [19]మత్తికాఁడు నాకు
ననుచు వజ్రి దలఁచి హస్తాబ్జముకుళన, శాలి యగుచు దనుజపాలుఁ బలుకు.

94


మ.

తపముల్ సేయుచు వ్రస్సి క్రుస్సి విపినాంతర్వాసు లై పద్మజ
త్రిపురధ్వంసులచే వరంబు గొని దైతేయారిచేఁ జచ్చున
ట్టిపలాదుల్ నినుఁ బోలఁగాఁ గలరె కంటి న్వారిచందంబు నీ
యపరిక్షీణపురాతపఃఫలము లత్త్యైశ్వర్య మిచ్చెం దగన్.

95


గీ.

ఒకనితెరువు సనక యొకని నొప్పింపక, సకలలోకములును సాధ్యపఱిచి
యేలుచున్న నీదులీలావిభూతికి, దలఁకి రచ్యుతాదు లలఘుచరిత.

96


క.

ఏనుఁగుపల్లం బేడిక, పై నునిచిన తెఱఁగు గాదె భవదురుబాహా
స్థాని సుఖ మున్నరాజ్య, శ్రీ నాపై నిలుపుటెల్ల జితశత్రుబలా.

97


వ.

అటు లేనియు భవదీయచరణస్మరణంబునఁ గృతకృత్యుండ నై దేవర యాన
తిచ్చినప్రకారంబున నవికారవిచారుండ నై సచరాచరం బగునీజగత్త్రయం
బుం బాలించెదఁ [20]గ్రేడించి చనిన దనుజకుమారవర్గంబు నిసర్గస్నేహంబున
రప్పించి తత్త్వజ్జీవితంబు లిప్పించెద మీర లిచ్ఛానురూపంబు లగువిభవకలా
పంబుల నాపోవుచు నెడనెడ మదీయం బగునడవడికి వెడఁగుదనంబు గలి
గిన [21]నుడిగించుచు సుఖం బుండుం డని యాఖండ లుం డతనిచిటికెన[22]వ్రేలి
కీలితమణిశలాకాశకలం బగుముద్దుటుంగరం బొసంగిన నంగీకరించి రాత్రించ

రపంచానను నభ్యంతరంబునకుం బోవ విన్నవించి తదీయం బగుపంచానన
పీఠంబున వసియించి.

98


క.

ఉరగుల నురగాలయమున, ధరణి నరశ్రేణి దివిఁ ద్రిదశవర్గము దొం
తరగ యథాపూర్వస్థితి హరిహయుఁ డునుచుటయు బ్రహ్మ కద్భుత మయ్యెన్.

99


గీ.

శూలధరుఁ డేలెఁ గైలాసశైలదుర్గ, మబ్జసంభవుఁ డుండె సత్యస్థలమున
గూర్మి వైకుంఠుఁ డమరె వైకుంఠమునను, దానవకృతాంతరాయము ల్దలఁగుటయును.

100


క.

యాగపురోడాశము లను, రాగంబుల నారగించి ప్రబలబలభుజా
భోగములు సూచుకొనుచు, న్వేగన్నులవేల్పుఁ బొదివె విబుధశ్రేణుల్.

101


క.

దేవవిరహితము లగుదే, వావసధస్థలము లెల్ల నహరహ మమరా
ర్చావిభవపూరితము లై , భూవలయంబున కొసంగె భూరిసుఖంబుల్.

102


క.

వాసవుకతమున విగత, త్రాసము లై ముజ్జగములుఁ బ్రమదము నొందెం
గాసరసమమతి యగురా, కాసులగమికాఁడు మదవికారార్జితుఁ డై.

103


క.

మదిరయు మదిరాదేవియు, మదనాహవతంత్రవిధికి మర్మము దెలుపం
బదియైదువత్సరము లా, త్రిదశారియు భోగకాంక్షఁ దెమలక [23]యుండెన్.

104


సీ.

అష్టావశిష్టంబు లానవా లొకకొన్ని చక్కెరపానకా లొక్కకొన్ని
పచ్చితేనెలు గాఱుఫలము లొక్కొకకొన్ని కొన్ని దివ్యామోదకుసుమసరము
లేణమదంబును నిందుఖండంబులుఁ గలపినపూఁతపింగాండ్లు గొన్ని
యుఃహ్వుననూదిననుడువీథిఁదాఁకుదివ్యాంబరములు గొన్ని యనుముహూర్త
మును బరంపరగాఁ బంపు ననిమిషేంద్రుఁ, డూడిగపుగత్తియలచేత మేడలోనఁ
గ్రీడ లాడుచునున్న యక్షీణమదన, రాగరసమత్తమతికి నారాక్షసునకు.

105


గీ.

హారములును జతుర్విధాహారభాండ, నికరములుఁ బచ్చికస్తూరినికరములును
ననుచు లోనికి రాజయోగ్యంబు లైన, వానిఁ దెందేపగాఁగ దైవతవిభుండు.

106


గీ.

విభుఁడు చెప్పినవానిలో వృత్రవైరి, దానవులకునె కడు నెగ్గుఁ దలఁచుఁ గాని
నాకమునకును దక్కినలోకములకు, నాదృతానందసౌందర్య మందఁజేయు.

107


గీ.

వేఁటలాడించు [24]దుర్ద్యూతవిధులు దెలుపుఁ, గామశాస్త్రరహస్యసంగతులు గఱపుఁ
గాని నీతికిఁ జొరనీడు దానవేంద్రుఁ, గూల్పఁ బొంచి వసించిన కులిశపాణి.

108


వ.

అంతఁ గొంతకాలంబు చన్నపిమ్మట మరుత్కాంతుం డేకాంతంబునకు శాం
బరి నాకర్షించి మహామాయా నీవు మాయనుమతంబున నంతిపురంబునకుం
జని మదిరాకన్యక నయ్యన్యాయవర్తికడం బ్రవర్తింపనీక తొలంగి దూరంబు [25]సనఁ

దన వెంబడిం జనుదెంచిన యాక్రించుడెందంబుఁ బ్రవేశించుమని నొడివిన
నప్పడంతియు వేల్పుమెఱియని వీడుకొని క్రీడాభవనంబు సొచ్చి వియచ్చర
పతి తన్నుం బనిచినపని సఫలంబు గావించుటయు.

109


ఉ.

నోరును నోరుఁ గీల్కొన దనూలతయుం దను [26]నల్లిబిల్లి యై
కూరిచినట్టు లుండఁ దలగోక యెఱుంగక పుష్పబాణు పె
న్బోరున సీధుపానమున బుద్ధివిదూరత నిద్రవోవు ర
క్షోరమణుం ద్యజించి జరగు న్మదిరాంగన సంగదూర యై.

110


గీ.

ధనము రాజ్యంబు దనకొఱకునె త్యజించి, మాఱుసేఁత లెఱుంగక మార్తురకును
బ్రియము చెప్పి చరించు నాప్రియుని బాసె, మదిర పాతకములకెల్లఁ గుదురుచెలువ.

111


క.

దానవుఁడు మేలుకని మది, రానీరజవదన గానరామి కులికి నా
నానిలయాంతరములకుం, దానె యరిగి వెడకు హృదయతాపముతోడన్.

112


క.

వచ్చినచోటికిఁ గ్రమ్మఱి, వచ్చుం RST బూఁదోఁట సూచి వచ్చుఁ బ్రియముతో
నెచ్చెలులనడుగునడుగుల, మచ్చమరయు నొఱలుఁదెరలు మలఁగుంగలఁగున్.

113


వ.

ఇవ్విధంబున నవ్విబుధారి వధూవియోగధూమధ్వజదందహ్యమానమాన
సుం డై యానిశాసమయంబున నసమనయనకఠోరకంఠకుహరఘటితహాలా
హలఘుటికాచటులం బగుకటికిచీఁకటిని నిశాచరుం డగుటను నిర్భయుం
డగుటను నెఱి దప్పక గుప్పునం బ్రాకారలంఘనం బాచరించి చరాచర
విలోచనభయదజ్వాలాకరాళం బగుకరవాలంబు దక్షిణకరంబునం జళిపిం
చుచు విలపించుచు నుత్తరాభిముఖుం డై తత్తనూసౌరభంబు పులుగునొడు
వఁ గడువడి నడువం జొచ్చె నిచ్చట.

114


క.

మానవతి దలఁగి పోకయు, దానవుఁ డట చనినవిధముఁ దా నెఱిఁగి మహా
సేనలతో వెన్నాడె బ, లానలజలధరము ప్రహసితాననుఁ డగుచున్.

115


మ.

చరణాంభోరుహయావకాంకములు భూషాస్రస్తమాణిక్యముల్
తరులగ్నాంశుకఖండముల్ పథిలుఠద్ధమ్మిల్లమాల్యంబులున్
సరసాంగచ్యుతగంధకర్దమ మలోలస్వేదసౌరభ్యముల్
తరుణీరత్నము చన్నత్రోవఁ దెలిపెన్ దైత్యాన్వయస్వామికిన్.

116


క.

[27]విఘటికలోపల సురపుర, విఘటనలంపటుఁడు గాంచె విమలతరసుధా
లఘుజల మధరీకృతసం, కఘనము మానససరశ్శిఖాశేఖరమున్.

117


సీ.

వినవచ్చె దవ్వుల వెక్కివెక్కి యొనర్చు పరిదేవనధ్వని పాటపాట
నావిలాపములోన హా దైవమా యను విధ్యుపాలంభనవిధము దోఁచె

నాదూఱుమాటలయంతరాంతరములఁ బొడకట్టె హంసుఁ దా విడిచిరాక
తత్తదుక్తులపిఱుందన హంసుఁ డిఁక నేమి యౌ నొకో యను మృషాహ్లాదభాష
లెసఁగె నెంతయు నాలించి యసురభర్త, కంటిఁ గలకంఠి ననుచు నుత్కంఠ మఱయ
నుట్టిపడ్డట్టు చెట్టుననుండి దిగిన, కరణి నయ్యింతియగ్రభాగమున నిలిచి.

118


క.

వెఱవకు మిఁక నే వచ్చితిఁ, దెఱవా నెఱవాఁడిసూది దెగిపాఱని యీ
కఱకుంజీఁకటి వచ్చిన, కఱటివి నిను దూఱ మాకుఁ గలవే ఫలముల్.

119


ఉ.

ర మ్మని చెట్ట వట్టుకొని రాజముఖిన్ గురివెందతీఁగమొ
త్తమ్ముల యింటిలోపలికిఁ దారిచి కూరుచుమాటలాడి నె
య్యమ్మునఁ గొఁగిలించుటయు నాసుదతీతిలకంబు పల్కు ఖే
దమ్మునఁ దల్లడిల్లెడువిధంబు ప్రవృద్ధము చేయుచుం బతిన్.

120


మ.

వినవయ్యా దనుజాధినాథ త్రిజగద్వీరా నినుం గూడి నా
యనుజవ్రాతముఁ దల్లిఁ దండ్రిని వయస్యాకోటులం బాసి కం
తు నిశాతాశుగతప్తచిత్త నగుచుం దొట్రిల్లు టెల్లన్ ఫలిం
చె ననుం జంపఁ గడంగినాఁ డఁట సునాసీరుండు క్రూరోద్ధతిన్.

121


వ.

తత్ప్రేషిత యగునొక్కయోష నిజభూషావిశేషమరీచిగండూషితాజాండ
మండలంబుగ మనక్రీడించుమేడకు వచ్చి మీరు విచ్చలవిడి నిద్రించువేళ
ననుం గనలి చూచుచు నోమచ్చెకంటి నీ విచ్ఛట నునికి వియచ్చరపతియి
చ్చకు వైరస్యకారి దూరంబు చనుము చనకున్న నిన్నుం దునుకలు సేసి “నీ
కతంబున నపాకృతరాజ్యభారుం డగుదానవవీరు నుదారోత్సవంబులఁ ద్రిజగ
త్సామ్రాజ్యపూజ్యుం జేయు"[28] నిది నిక్కంబ యని చక్కం జాగి పోవుటయుఁ
గపటనాటకసూత్రధారుం డగుజంభారి సంరంభంబునకుం గలంగితంగాక
నీకిచ్చినప్రాణంబు నొండుకడం జొనుపుదునే వినుము.

122


క.

సురనాథుతోడ వలవని, విరసత మన కేల నీదు విమలతరహృదం
తరమందిరదీపికనై, పొరయింతు నపారసౌఖ్యములు ముఖ్యగతిన్.

123


వ.

నీవు ప్రాణాయామపరుండ వగుము పవనపరంపరాప్రవాహసౌపానంబులు
మెట్టి నీడెందంపుం గందువకుం జని యనిమిషపతికిం గన వశంబు గాక
యశోకానందంబు నొందెద ననుటయు నాకుటిలకుంతలసట లెఱుంగక
నిశాపతి తద్వచనప్రకారం బాచరించుటయు.

124

క.

మదిరాకన్యక హంసుని, హృదయంబున నిలిచె సురమహీధరగుహలో
మదభుజగయువతి క్రుమ్మరు, విధమున లుబ్ధప్రసక్తవిత్తములీలన్.

125


క.

హృదయముచొచ్చిన మదిరా, మదచేష్టలచేత మేను మఱచి ప్రబోధా
భ్యుదయరవి గ్రుంక హంసుఁడు, నిదురయుఁ బోఁజొచ్చె నిఱ్ఱనీల్గుచు నచటన్.

126


క.

కొండంతమేను బూడిద, పండుగ నిలఁ బొరలిపొరలి ప్రబలనిజభుజా
దండము తలగడగా నా, ఖండల రాజ్యావహర్త కడు నిద్రించున్.

127


క.

నిద్రాసమయంబున నా, యుద్రిక్తస్వాంతుఁ డిచ్చునూర్పులవడి సా
ముద్రజలంబులు ఘూర్ణిలు, నద్రులు గంపించు ధరణి యట్టిట్టు వడున్.

128


క.

మును వెన్నాడినసురపతి, యును నచటికి వచ్చి వానియునికిఁ గని మనం
బున లరియు ఔr బెగడెఁ దదు, గ్రనిబిడనిశ్వాసవాతకంపితబలుఁడై.

129


గీ.

వజ్రి వేసెఁ దనదువజ్రంబు దైత్యేంద్రు, మేనుగొండఁ దునిమి మెఱయఁదలఁచి
యదియు దానవేంద్రుఁ డొదవించునిశ్వాస, మారుతాభిహతుల మ్రానుపడియె.

130


క.

ఆచంద మెఱిఁగి ఫాలవి, లోచనజలజాతపత్రలోచనవాణీ
లోచనచకోరచంద్రులు, వాచాలము లైన దివిజవర్గంబులతోన్.

131


వ.

అచ్చటికి వచ్చి మచ్చరంబున నవ్వియచ్చరపరిపంథిపై శూలచక్రదండం
బులు ప్రయోగించిన నవి యవిరళవేగంబున నయ్యోగవిద్యావిదుం
దాఁకి కాఁక యుడిగి శిరీషప్రసవమృదులప్రసారంబు లగుటయుఁ ద్రిజగం
బులు విన్ననయ్యె యోగానలతప్తంబు నుత్తప్తసువర్ణవర్ణంబు నగు నతని
యంగంబున ఖంగుఖంగు మనునినదంబుల కాని సప్తధాతువులుం బాఁతు
కలంగుట కానంబడదయ్యె నయ్యెడ.

132


క.

లోకత్రయవిజ్ఞానక, ళాకుశలుం డైనయాదిలక్ష్మీపతి తీ
వ్రాకారు వాయువుం గని, క్రేకంటం జేరఁ బిలిచి కృప వెట్టుటయున్.

133


వ.

అతండు సాష్టాంగనమస్కృతిచతురుం డై పుండరీకాక్షున కి ట్లనియె.

134


గీ.

దేవ పనిగొమ్ము నాకు నీసేపకునకు, నేఁడు ఫలియించెఁ దపములు నీరజాక్ష
యెద్ది పనిచినఁ గావింతు నెదురులేని, క్రీడనంబున విహరింతుఁ గీర్తిఁ గాంతు.

135


చ.

అన హరి వల్కు నోపవన యంతటివాఁడవ నీవు యోగసి
ద్ధి నితని మేను నొవ్వదు మదీయసుదర్శనతీక్ష్ణధారచే
మనసిజవైరిశూలమును మాటుమణంగె విరించిదండము
న్వనట మునింగెఁ గీడ్వడియె వాసవువజ్రము కంటివేకదా.

136


వ.

ఉపాయంబునం గాని యపాయకరం బగునీసురారిశరీరంబు చిరుంగదుమెఱుం
గు మెఱచి యడంగుతెఱుంగున నీ వితనియంతరంగంబు సొచ్చి మర్మంబులు

గ్రొచ్చి సంధులు బంధించి పలుకులు వాకట్టి బలంబు వోఁదట్టి [29]ద్వితీయ
భంగిం జేయుమనిన నతండు నట్ల చేసె నసురేశ్వరుండును నసువిదూరుం
డయ్యెఁ గావునఁ బగవారిం గలసి వర్తించుతుచ్ఛవర్తనుం డపకీర్తి రాకకు నైశ్వ
ర్యంబు పోకకు నెదురుకొని యుండుం గావున.

137


గీ.

[30]హంసునంతవాని కత్తెఱం గైనచో, నితరదనుజకోటి నెన్న నేల
మీఁదు దెలిసి వేల్పుమేలాటములు మాని, నిలువయ్య కీర్తి నిలుపవయ్య.

138


గీ.

తండ్రిఁ జంపినపగవాని దానవేంద్ర, నమ్మకుము తక్కురాజుల నమ్మరాదు
కృత్య మంతయు మాయందఁ గీలుకొనఁగఁ, జేయు నీకు నభీష్టంబు సేయువాడ.

139


ప్రహ్లాదుఁడు దేవతలపై విరోధించుట

క.

అని పలికినఁ బ్రహ్లాదుఁడు, తనమది దేవతలమీఁదితలఁ పుడిగి సుధా
శనవిమతమతము గైకొని, పెనిచె విరోధంబు సాధుబృందముమీఁదన్.

140


సీ.

నిప్పచ్చరం బయ్యె నిర్జరేశాసక్తి పావకుచేపట్టు పట్టు వదలె
శమనంబుఁ గనియెఁ దచ్ఛమనుమీఁదితలంపుకోణపుపక్షంబు గుంటుపడియెఁ
బాశపాణిప్రీతి పలుచన యై తోఁచె గాలిపై నెయ్యంబు [31]తీలు పడియె
ధనదానురాగంబు దవ్వులఁ దలచూపె శంకరప్రణయంబు క్రుంకువడియెఁ
దాపసులమీఁదితగులంబు తఱిఁగె వైష్ణ, వాగమంబుల తరితీపు బాగుదప్పెఁ
గుటిలదానవనిర్దిష్టకుత్సితప్ర, చారపారగుఁ డైనదేవారి కపుడు.

141


క.

కరుణార్ద్రవీక్షణుం డై, హిరణ్యకశిపుప్రసూతి యేకాంతమునం
బరమాప్తులైన రాక్షస, పరివృఢులం బలికె వినయపరిచితఫణితిన్.

142


క.

పెద్దఱికంబున మును మా, పెద్దలకును వేల్సుకులముపెద్దలకు మహో
ద్యద్దాంతిశాంతికర మగు, నిద్దపునీపలుకు మాననీయము కాదే.

143


సీ.

సంవర్తసమయభీషణనవజ్రివజ్రాభఘోష మై పటుహయహేష మగుచు
సప్తానిలస్కంధసంధిబంధవిభేదవేగ మై నిర్భరోద్యోగ మగుచు
ఫాలలోచనఫాలఫలకరీలివిశాలతేజ మై శౌర్యనిర్వ్యాజ మగుచు
శమనకటాక్షవీక్షణపాతసన్నాహఘోర మై యాయుధోదార మగుచు
నాదుమూలబలంబు నానాదిగంత, రాళముల వేరుపాఱి యుత్తాల మైన
నేమి సేయంగ నోపుదు రెంతవారు, నాదివామననిభ వామనాభిధాన.

144


గీ.

నిప్పుమీఁది నివుఱుకప్పెల్ల నొయ్య నే, పార నూఁది యూఁది ప్రజ్వలితము
చేయు హోమి యనఁగఁ జిక్కులన్నియుఁ [32]బాపి, నామనంబు దేర్చి తో మహాత్మ.

145

క.

[33]ఎఱుఁగనికాలంబున నే, నెఱుఁగక దుర్బుద్ధి నైతి నెఱిఁగినతఱి మీ
రెఱుకపడఁ దెలిపినప్పుడ, మఱి యెఱుఁగకయునికి గలదె మాన్యవిచారా.

146


క.

గెలిచెద భూమీవలయము, గెలిచెద బలిపద్మతలము గెలిచెద దివియున్
గెలు పనఁగ నెంత యుద్య, ద్బలు లగుమీప్రాపు గన్నబలవంతులకున్.

147


ప్రహ్లాదుఁడు శ్రీవిష్ణువుపై దాడివెడలుట

క.

ఆయుధములు కంకటములు, నాయిత్తము చేసి దండయాత్రకు మీమీ
దాయాదులఁ గూరిచికొని, వేయరుగుఁడు సకలదిశలవెంబడి మీరల్.

148


సీ.

అని రాక్షసకుమారుఁ డర్హగుణంబులు విడిచి దుర్జనబుద్ధి వివశుఁ డగుచుఁ
దామసవిక్రియాస్థగితచేతస్కుఁడై యౌఁగాము లెఱఁగక యవఘళించి
త్రిజగత్కుటుంబి యై దీపించుగోపాలదేవునిపై వైరదృష్టి నిలిపి
తనతండ్రిఁ బట్టి చంపినపగ యీఁగుదు నీఁగకుండిన నన్ను నీఁగ యనరె
యనుచు శ్రీహరితనువులై యతిశయిల్లు, విప్రులకు ధేనువులకును వేదములకుఁ
బుణ్యతీర్థంబులకు నెగు ల్పొడమఁజేసె, జన్యజనకంబు లేకక్షణము లరయ.

149


వ.

ఇ ట్లాహ్లాదభరితాంతఃకరణుం డై ప్రహ్లాదుండు వామనుపలుకులయెడ సాద
రుం డగుచుఁ దత్సహితంబుగ నమరాహితులం దమతమయిండ్లకుం బోవం
బనిచి యనుదినప్రవర్ధమానస్పర్థానిర్ధౌతప్రణయహృదయుం డై [34]యయ్యద
యుండు జగత్రయగిళనోత్సాహంబున నుత్సేకంబు గైకొని యుండి యుండి
యొక్కనాఁడు.

150


సీ.

తొడిమలూడినజరద్రుమపుష్పములువోలెఁ జదలఁదారలు జలజలన రాలఁ
గ్రొత్తమెత్తిన యార్ద్రకుడ్యరేఖలువోలెఁ బేఁటెత్తి దిక్కుల బీఁట లెగయ
సమ్మెట నడిచిన సంతప్తలోహపిండమువోలె మిణుఁగుఱు లుమియ ధరణి
ధరణి పల్తాఱుఁ గుమ్మరిసారెయును బోలె గిరగిర నుడుగక తిరుపుగొనఁగ
గిరులు గోలాటమాడ నయ్యురగలోక, మురక వ్రేళ్లకుఁ బెకలంగఁ గఱకుటసుర
సమరసంరంబియై భేరిచఱనఁ జేయ, నందు గ్రందయ్యె భాంకారకందళములు.

151


సీ.

అశ్వరక్షకులార హయరత్నముల నెల్లఁ బల్లనకట్టుఁడీ పాటవమున
మావంతులాగ సంబాళించి ఘనపతాకంబు లెత్తుఁడు మత్తకరులమీఁద
సారథులార శస్త్రధ్వజంబులతోడ మెలపుఁడీ రథము లచ్చలము మిగుల
భటులార కదలుఁడీ చటులకార్ముకలతాజ్యాఘోషములు నభఃస్థలము మ్రింగఁ
ద్రిభువనాభీలభుజశక్తివిభవ మెసఁగ, దండయాత్రాభిముఖుఁ డయ్యె దనుజభర్త
యనుచు ఘోషించి [35]రిభమునం దధివసించి, రాజపురుషులు ఘంటికారావ మెసఁగ.

152

సీ.

 వింధ్యశైలమునందు వెడలునేనుంగులు నివియు నే మవునొకో యెన్ని చూడ
శాలిహోత్రునియందు జనియించునశ్వంబు లివియు నే మవునొకో యెన్ని చూడ
మరుదీశ విశ్వకర్మకుఁ బుట్టునరదంబు లివియు నే మవునొకో యెన్ని చూడ
[36]స్రష్టప్రాథమికమౌ వృష్టి నుద్భవమొందు నివియు నే మవునొకో యెన్ని చూడ
ననఁగ నిభములుఁ దురగంబు లరదములును, గాల్బలంబులు నడలె నొక్కటఁ గఠోర
భుజబలాటోపమున దైత్యపుత్రుఁ డఖిల, దిగ్విజయయాత్ర సేయంగఁ దివురు నపుడు.

152


సీ.

విభునిఁ బాయఁగలేక వెనువెంట దంటలై యరుగ నుద్యోగించునట్టివారు
బై చేలఁ గెంగేల బట్టి పోవఁగనీక ప్రాణనాథుల నొడంబఱచువారు
గద్గదస్వరములఁ గన్నీరు వెడలంగఁ బతులఁ బోఁజన దని పనుపువారు
మోహంబు సిగ్గును ముడివడఁ బ్రియులయొద్దనె నిల్చి తలవాంచికొనెడువారు
గూర్మిభర్తల దీవించి కుంకుమాక్ష, తలు శిరంబులపైఁ గీలుకొలుపువారు
నగుచుఁ దత్పురవీరనాయకులసతులు, విరహసంతాపతప్తలై వెల్లనైరి.

154


చ.

ఎడపక పార్శ్వభాగముల హెగ్గడికత్తెలు వేత్రహస్త లై
సుడియఁగనీక పౌరగతిఁ జోఁపుచు నర్మవచోవిలాసముల్
నడుపుచుఁ గప్పుసందులు దొలంగ జనావళి బ్రేమఁ జూచుచు
న్వెడలిరి రాజభోగినులు వేడుకతో శిబికాధిరూఢ లై.

155


చ.

అలయికఁ బోలెఁ బూర్వవిలహస్తము లూఁతగఁ బట్టి తేటలౌ
బులుపులమాటలిం జిలుకబోదల నేలుకలస్వరంబులుం
దలకొను లేఁతజంకెసల దట్టపుఁజూపుల నేపు చూపుచున్
వలపులు చల్లుచుం బురమువారసతుల్ చనఁ జొచ్చి రచ్చటన్.

156


వ.

మఱియుఁ జర్మకార లోహకార స్వర్ణకార యంత్రకారకులును భిషక్పురోహిత
జ్యోతిషికామాత్యవర్గంబులును గవిభటపాఠకపటలంబులును ధాన్యవస్త్ర
హిరణ్యరత్నముక్తాప్రవాళగుడతైలాజ్యతండులముద్గచణకహింగుమరీచ్యాది
పదార్థసార్థక్రయవిక్రయాది వ్యవహారప్రాజ్ఞు లైన వణిగ్జనంబులును మొద
లుగాఁ గలపౌరలోకంబు నిరాకుల ప్రమదంబునఁ జనుచుండి రప్పు డప్పిశి
తాశనులు సమరసన్నాహసమన్వితు లై.

157


మ.

మదిరా పానమదాంధనేత్రములలో మత్తద్విపారూఢుఁ డై
విదితానేకపసంయుతుం డగుచు విద్వడ్భూవతు ల్భీతి నొం

ద దివిన్ దేవగణంబు లెల్ల వణఁకన్ ధారధరాకారుఁ డై
కదలె న్వృశ్చికరోముఁ డుగ్రవిచరత్క్రవ్యాదయూధంబుతోన్.

158


ఉ.

భూరిబలప్రతాపములఁ బొంపిరివోవుచు శూలహస్తుఁ డై
హారిసువర్ణవర్ణము శతాంగమున న్విలసిల్లి గాఢసం
చారఘనాఘనధ్వనులచందముఁ జూపెడు బృంహితంబు లిం
పారుమతంగసంభవసహస్రము గొల్వఁ జనె న్బలీంద్రుఁడున్.

159


ఉ.

అక్షయశౌర్యసంపదయు నద్భుతశౌర్యము నింపుమీఱఁగా
రాక్షసకోటి గొల్వ మదరాగము మోమున నిండ నాసహ
స్రాక్షసరోరుహాక్షనిటలాక్షుల గెల్చిన మేటీజోదు ధూ
మ్రాక్షుఁడు పోరికి న్వెడలె నద్రినిభద్విపవాహనంబుతోన్.

160


క.

కౌక్షేయపాణియై కపి, లాక్షుఁడు చనఁదొడఁగె క్షోణి యల్లాడంగా
నక్షతబలమున నార్వే, లక్షీణము లైనహయము లాగుబ్బుకొనన్.

161


ఉ.

కంకటముల్ ధరించి శరకాండధనుర్ధరు లై కిరీటు లై
కంకటకాలకేయు లవికారరణోత్సవముత్సరోగ్రు లై
యంకముఁ గోరి యేగిరి భయంకరశంఖరవంబు దివ్యకూ
లంకషఁ గ్రీడలాడునబలాజనముం దలఁకొందఁ జేయఁగన్.

162


సీ.

దిగ్గజంబులఁ బట్టి తివియంగఁ బోనూకఁ జాలినమదసామజములతోడఁ
బవమానవేగంబు నవమానముగఁ జూచి సరఁగు నాజానేయహరులతోడఁ
గేతనానిలసమాకృష్ణతారకము లౌ రమణీయరత్నరథములతోడ
నఖిలాండకోటుల నఱచేతికిని దెచ్చు చటులరాక్షసవీరభటులతోడ
విమలముక్తామయాతపత్రములతోడఁ, గమియఁ బొదివిన వింజామరములతోడఁ
గాలదంష్ట్రుండు రథ మెక్కి కదలె దిగ్వి, జయమనీషావిశేషవిశాలుఁ డగుచు.

163


ఉ.

శంబరదీర్ఘజిహ్వులు విశంకటకంకటగర్భితాంగు లై
కంబుమృదంగగోసదనకాహళకాంస్యరవంబు లేక మై
యంబుధినీటి దాఁటుగొన నాజికి నేగిరి రాజమార్గమ
ధ్యంబు తురంగచంక్రమణధారలఁ జూర్ణముగాఁగఁ జేయుచున్.

164


క.

వికటబలశూర్పకర్ణులు, ప్రకటబలోపేతు లగుచు భద్రేభశతా
ధికషట్సహస్రములతో, వికసితవదనాబ్జు లగుచు వెడలిరి యనికిన్.

165


వ.

ఇవ్విధంబున నధికబలపరాక్రమవిధేయు లగుయాతుధాసవీరు లుదారాకారు
లై చతుర్విధశృంగారభంగీతరంగితనిజాంతరంగు లై సంగరంబునకు వెడల

నంగలించు రాక్షసపుంగవు నాగమనంబు గోరుచు హజారంబుకడం బవుజుఁ
దీర్చి రంత.

166


సీ.

వరరత్నకుండలద్వయరత్నదీధిత గండస్థలంబులఁ గప్పుకొనఁగ
నంగుళీయకకిరీటాంగదహారాది భూషణంబులతోడఁ బొలుపుమీఱి
పింజించి కట్టిన కెంజాయవలిపంబు మొలనూలికాంతులముసుగుఁ దివియఁ
గర్పూరకుంకుమాగరుదర్పసారాంగమృగనాభిపంకంబు మేఁ దలిర్ప
బిరుదులందియ వలకాల మొరయుచుండ, నలిననయనలు నీరాజనంబు లొసఁగ
దిగ్విజయయాత్రపై సముద్రేక మొదవఁ, బ్రోదిఁ బ్రహ్లాదుఁ డాహ్లాదపూర్ణుఁ డయ్యె.

167


సీ.

కంకణక్రేంకారసంకులంబుగఁ జేరి రమణులు వింజామరము వీవ
బంగారుగుదియలు వట్టి పొంగారుచుఁ గంచుకివ్రాతంబు [37]గజిబిజింప
మురజభేరీశంఖనిరుపమధ్వానంబు పాథోధిఘోషంబుఁ బరిహసింప
సంగీతవిద్యావిశారదగాయకస్తుతులు పార్శ్వములందుఁ దోడుసూపఁ
జిత్రపల్యంకికాసమాసీనుఁ డగుచు, ధవళముక్తాతపత్రశతంబుతోడ
రాజబింబాస్య లాచారలాజ లొలుక, సురవిరోధిసుతుం డంతిపురము వెడలె.

168


వ.

ఇట్లు ప్రహ్లాదుండు నిజపురంబు వెలువడి నలుదెఱంగుల దళంబులు బెడంగు
మెఱయఁ జనునప్పుడు ధూమ్రక్షకపిలాక్షాదిరక్షోమంత్రులు తమతమ
సేనాతంత్రంబులతోడఁ గూడి యద్దానవచూడామణిం బురస్కరించుకొని
తిరస్కృతదిగంతదంతిదంతనైశిత్యం బగు భుజబలంబున జిగిమీఱి యొక
యోజనమాత్రం బరిగి రంత నమరాంతకుడు హేమనగరప్రాంతమునఁ
బుష్పసరోవరతీరంబున నఖిలబలంబులను విడియ నేమించి యొక్కసుర
పున్నాగమూలంబున విశాలం బగురత్నకంబళంబునం దాసీనుం డై యున్న
సమయంబున.

169


సీ.

క్రయసమాగతజనప్రియవస్తువిస్తీర్ణవిశిఖాశతంబులు విశదపఱిచి
హేమకూటంబుతో నెక్కసక్కెం బాడుపటమండపంబు లావటము చేసి
గజఘటకోటి నొక్కట నీరు ద్రావించి కట్టుఁగంబంబుల మట్టుపఱిచి
పసిఁడి పక్కెరలతోఁ బల్యాణములు డించి శ్రమము మానిచి తురంగములఁ గట్టి
రథవినిక్షిప్తవివిధశస్త్రములు దెచ్చి, కదయ నొక్కొకఠావునఁ బదిలపఱిచి
రఖలసైనికు లధిపతి యౌననంగ, సేన విడియించి రింగితజ్ఞాను లగుచు.

170

గీ.

అసురనందను దోఃప్రతాపాగ్నిశిఖల, వెట్ట కోర్వఁగఁ జాలక [38]తొట్టగిలుచు
నపరవారిధిజలమగ్నుఁ డయ్యె ననఁగ, నస్తమించె దివాకరుం డంతలోన.

171


క.

హరిణాక్షీనయనద్యుతి, హరిమణిదళదుత్పలప్రియంభావుకభా
స్వరనైల్యగుణము లన్నియుఁ, బరువడి సురమార్గమహిమఁ బాటింపంగన్.

172


క.

మాసినయద్దంబులక్రియ, గాసిల్లెన్ హరిదిభేంద్రకటభాగంబుల్
వాసి వదలి నలువయు సం, త్రాపంబున బుద్ధి గలఁగి తహతహనొందెన్.

173


క.

మొక మడిచినఁ గానఁగలే, కొకవస్తువు నిట్టి దనఁగ నోడిరి లోకుల్
శకలితహరిహయమణికో, రకములలో నణఁగి రనఁగ రాత్రిటివేళన్.

174


సీ.

హేషారవంబులు నెఱుఁగంగ దగుఁగాని తురగరూపంబులు తోఁపవయ్యె
విపులఘీంకారము ల్విని తొలంగుటె కాని తెలియంగరావయ్యెఁ గలభఘటలు
చక్రనేమీరవ[39]ప్రక్రమంబునె కాని తిలకింపరాదయ్యెఁ [40]దేరిపిండు
స్వరమున భటునిపే రరయుమాత్రమె కాని దర్శనస్పర్శనస్థైర్య ముడిగె
దృష్టిగోచర మెల్ల నదృష్ట మయ్యె, మిన్ను మున్నును గోవెలవన్నె యయ్యె
గరవటమునిండ నించినకజ్జలంబు, కరణిఁ జీఁకటి బ్రహాండఘటము నిండె.

175


క.

ఆపంబినతిమిరంబుప్ర, తాపంబున సకలభువనదర్శన మాఁగన్
దీపస్తంభము లెత్తిరి, యాపటమండపములందు నసురేంద్రభటుల్.

176


సీ.

కరచపేటంబుల గాడాంధకారసింధురకుంభములు వ్రచ్చి విరియఁ జేసి
తారకామిషమునఁ దనౌక్తికంబులు పలుదిక్కులందునఁ బాఱఁజల్లి
కాఱు తద్దేహరక్తముచాయ నవసాంధ్యరాగవిలాసంబుఁ బ్రోగుచేసి
తద్వధదోషంబు తగిలెనో యన మేన మృగచిహ్నగరిమంబుఁ దగులుకొలిపి
నిగిడె గర్పూరపన్నీరనీర, హారనీహారహారిచంద్రాతపములు
వసుమతీచక్ర మఖిలంబు వాడుఁ దేర్పఁ, గైరవప్రియబింబప్రకాశమహిమ.

177


క.

ఈకరణిఁ జంద్రికాపరి, పాకము లోకముల కెల్లఁ బరమానందో
త్సేకంబు సేయ దానవ, లోకాధీశ్వరుఁడు మిత్రులును దా నలరెన్.

178


వ.

ఆసమయంబున సూచీముఖశూర్పకర్ణవికటధూమ్రాక్షకపిలాక్షులు మొదలై
కదలక యేప్రొద్దుం దన్నుం గొలిచి యున్న యన్నిర్జరారులం గనుంగొని
ప్రహ్లాదుం డి ట్లనియె.

179


ఉ.

ముందఱికార్య మిద్ది మనముం జతురంగబలాన్వితంబుగా
నిందుల కేగుదెంచితి ముదీర్ణులు మీరలు కర్ణధారు లై

సందడి గాకయుండ రిపుసైన్యపయోనిధిలంఘనక్రియా
మందతఁ జూపఁగావలయు మానుషభీషణభాషణోద్ధతిన్.

180


గీ.

ఎటకు నడువవలయు నిది మీరు తలపోసి, సర్వసమ్మతముగఁ జర్చ చేసి
నిర్ణయింపవలయు నీతిశాస్త్రవివేక, శౌర్యనిధులు సఫలకార్యవిదులు.

181


వ.

అని యిట్లు ప్రహ్లాదుండు పలికిన మహాహ్లాదంబునం బొంది బృందారకవిరోధు
లతని నభినందించి దేవా నరేశ్వరుం డగువాఁడు హస్త్యశ్వరథపదాతిప్ర
ముఖసకలసేనాసమన్వితంబుగా స్వామ్యమాత్యసుహృత్కోశరాష్ట్రదుర్గబలం
బులను సప్తాంగంబులుం గలిగి సంధివిగ్రహయానాసనద్వైధీభావసమాశ్ర
యంబు లనం బరఁగు షట్ప్రయోగంబులఁ గుశలుం డై సామదానభేద
దండంబు లను నుపాయంబులుం దత్ప్రయోగసమయంబు నెఱింగి చతుర్విధ
దుర్గావనభర్గుం డై నిజరాజ్యంబు నిష్కంటకంబుగం బాలించి మే లెంచు
నది యాకర్ణింపు మనుటయు నాత్రిలోకవినుతుండు వారలవాక్యంబు లంగీక
రించి సంగరోద్యోగవినిర్నిద్రహృదయుం డై వారలఁ బోవం బనిచి తాను
యథోచితప్రకారంబున నారాత్రి గడపె నప్పుడు.

182


మ.

రజనీపన్నగదష్టమూర్ఛితజగద్రక్షార్థ మై పూని పం
కజమిత్రుం డను తుండికుండు దశదిగ్భాగాంతరానోకహ
ద్విజకోలాహలమంత్రము ల్నుడువుచు న్వేగంబ మంత్రింప ని
ల్చె జలేశాంతరపూర్వభూభరమహాశృంగాగ్రపీఠంబునన్.

183


ప్రహ్లాదుఁ డంగరాజుపై దాడి వెడలుట

సీ.

అట్లు సూర్యోదయం బైనఁ బ్రహ్లాదుండు జయభేరి వేయించి చండవృత్తి
తురగేభరథపదాతులతోడ దైతేయభటసమూహము మహోత్కటము గాఁగ
విజయుఁ డై సర్వజగ్విజయంబు సేయంగఁ బూని మహేంద్రదిగ్భూమీపాల
పురములకై దాడివోవ నుద్యోగించి కదలి యాత్రేయనగంబునందు
విడిసి మఱునాఁడు శత్రుభూవిభులు వడఁక, నంగదేశాభిముఖుఁ డయ్యె నంతలోన
నంగభూపతి గజతురంగాదిసైన్య, సంయుతంబుగ నేతెంచె శౌర్యగరిమ.

184


క.

కరితురగరథభటాహ్వయ, పరివృతుఁ డై బాహుయుగము పక్షయుగముగా
శరచంచునిహతిఁ జించెన్, శరభముక్రియ నంగవిభుఁడు శత్రుబలంబున్.

185


క.

అంతం బోవక మఱియును, బంతంబున దైత్యబలముఁ బవనాస్త్రహతిన్
గంతులు వేయించె మహీ, కాంతుఁడు విలయానిలంబు కనకాద్రిబలెన్.

186

గీ.

అంగభూపతి యిట్లు నిజాంగబలము, చెంగఁ దోలిన దానవపుంగవుండు
రోషభీషణమూర్తి యై శోష మొందఁ, జేసె నాగ్నేయశరమున క్షితిపుబలము.

187


చ.

అరిబలమర్దనుండు దనుజాధిపపుంగవుఁ డంగదేశభూ
నరబలము న్నిజాశుగదివాకంపంక్తుల నింతలింత లై
ధరఁ దొరుగంగ నేయులయు దైత్యుమహోద్ధతి కోర్వలేక య
న్నరపతి వాఱ నాతనిధనంబులు చిక్కె నిశాటభర్తకున్.

188


క.

[41]అంగాధీశవిమర్దన, శృంగారపువింతసొబగు చెలు వమరంగా
నంగాలంకృతిబలుఁ డౌ, చుం గదలెన్ దైత్యరాజసుతుఁ డుద్ధతుఁడై.

189


వ.

ఇ ట్లంగరాజభంగప్రదుం డగుదానవపుంగవుం డచ్చోటు గదలి వియచ్చర
వాహినీసమీపంబునకుం జని బలాశ్వ ద్రోణశ్వ భూమధ్వజు చంద్రధ్వజ
సుభద్ర భద్రప్రముఖు లైనసముద్రతీరనివాసు లగు నౌసాధనభూధవులం
జయించి తదర్పితబహుపదార్థపరిబృంహితహృదయానురాగుం డై యానా
గరకోత్తముండు వియత్తరంగిణీసముత్తరణంబు చేసి పారియాత్రగోత్రసవిధం
బున వివిధబలంబులును విడియించి యడరునప్పుడు.

190


ఉ.

సైనికు లెల్ల నాసవరసంబులు గ్రోలి మదాంధచిత్తు లై
సానుమదగ్రభాగములఁ జందనశీతలచంద్రకాంతవే
దీనినహంబులందు వడఁదేఱి పథశ్రమ ముజ్జగించి నా
నానుపమానసౌఖ్యవిభవాతిశయంబునఁ బొల్చి రచ్చటన్.

191


గీ.

భానుఁ డంత నస్తపర్వతంబున కేగెఁ, దమము ముదిరె దారకములు మింటఁ
దెలివి మెఱసి నెఱసె జలజారి ప్రాక్ఛైల, శృంగ మెక్కి కళలఁ జెంగలించె.

192


ప్రహ్లాదునికడకు దేవరాతుఁడువచ్చుట

గీ.

అట్టివేళయందు నచటికి భువనైక , పూతుఁ డాదృతార్థజాతుఁ డఘవి
ఘాతుఁ డైనదేవరాతుండు చనుదెంచె, శుక్రశిష్యుఁ డుక్తిశక్రగురుఁడు.

193


వ.

ఇ ట్లేగుదెంచి యానీవారముష్టింపచుండు త్రివిష్టవపరిపూర్ణప్రభాపటలజటి
లుండై నిశాటపతిం గదియ నతం డతనిఁ బ్రత్యుత్థానప్రణామప్రార్థనా
ప్రముఖసపర్యాచర్యలం బరితుష్టహృదయుం గావించి యుచితాసనంబున
సమాసీనుం జేసి ఘటితకరకమలుం డై విమలవచోవిలసనంబు లొలయ
నిట్లనియె.

194

ఉ.

భూరితపోవిశేషమున బుద్ధివివేకమునందు శంభుభ
ట్టారకుఁ బోలు మీరలు జడత్వపయోనిధి యైన నాపయిం
గూరిమి గల్లి వచ్చితిరి కొంకక యానతి యిండు దేహమున్
దారములున్ ధనంబులు మొద ల్ననువేడిన వేగనిచ్చెదన్.

195


క.

భావించి యేను జేయం, గావలసిన దెద్ది యనుడుఁ గలకల నగి య
క్కోవిదవరుఁ డి ట్లనియె య, శోవిజితసుధామయూఖు సురరిపుసూనున్.

196


క.

నీ వంతవాఁడ వగుదువు, దేవాంతకవరకుమార దీర్ఘాయువ వై
యీవిశ్వ మేలు వేఁడం, గావచ్చినవాఁడఁ గాను గాంభీర్యనిధీ.

197


వ.

అవక్రనీతిక్రమచక్రవర్తి యగు శుక్రాచార్యుండు నీకడకును బనిచినఁ బని
విన్నవాఁజ నతనివాక్యప్రకారంబు వక్కాణించెద వినుము.

198


సీ.

మీతండ్రిఁ దీండ్రగా మించంగ వలదె యామేటికీటములైన మేదినీజ
నములఁ గారించెనే నముచిమర్దనముఖ్యదిక్పాకులము మద్దించెఁ గాక
చీమలపై దాఁటునే మహాసింహంబు కఱకుటేనుఁగులపై నుఱుకుఁ గాక
ధనము లర్పించి నిన్ గని మని కొలిచెద రన్న మర్త్యులమీఁద నాగ్రహింప
కాహవోత్సాహశక్తి నీ కగ్గలంబు, గలిగి యున్నదియేన నాకంబుమీఁద
నడువు సాళ్వంబుకొక్కెర నడఁచినట్లు, వాసవుని గెల్చి విక్రమోల్లాసి వగుము.

199


వ.

దుర్వారం బగుదూర్వాసుశాపంబు కారణంబుగ నిర్వాణలక్ష్మి పూర్వ
గీర్వాణాయత్తంబు గాఁగలిగి యున్నయది యిట్టియభిసంధి ననుసంధించి
యాసింధుశయనపూర్వజు గర్వంబుసర్వంబును విడిపించి త్రైలోక్యసామ్రాజ్య
సౌభాగ్యంబు ననుభవింపు మని దేవరాతుండు శుక్రవాక్యప్రకారంబుగా
నాన తిచ్చుటయు వల్లె యని యసురవల్లభుం డమరవల్లభుపైఁ జనుపనికి
నుల్లంబు పల్లవింప ధరాపల్లవికసమర్పితనానావిధపదార్థసంపూర్ణభాండాగా
రుం డై నిజరాజధానికి విజయంబు చేసి.

200


క.

భూరిభుజబలమున ర, క్షోరాజ్యం బేలుచుండె శూరశిఖామం
దారసుమకళిక దనుజకు, మారుఁడు మా ఱెందు లేనిమగఁటిమి నిగుడన్.

201


క.

బాహుబలానంతహయా, రోహ......................
మోహన సీమంతిన్యుప, గూహనలీలానితాంత కుశలజయంతా.

202


ఉ.

హావళిచిన్నయోభళధరాధవశేఖరసైన్యపాల నా
నావిధ..................................లాసతే

జోవనజాప్త ధర్మగుణశోభిత శిష్టజనానురాగ భా
షావరధీవిశేష మదశాత్రవమర్దన దానకుర్దనా.

203


ఉత్సాహ.

.............................
పత్రిరాజవాహనాంఘ్రి పద్మపద్మమానసా
పాత్రదాన సావధాన పద్మినీహితద్యుతీ
వృత్రదానవారిసూను విక్రమక్రియోన్నతా.

204


గద్యము.

ఇది శ్రీహనుమత్కటాక్షలబ్ధ వరప్రసాదసహజసారస్వత చంద్రనా
మాంక భారద్వాజసగోత్రపవిత్ర రామవిద్యన్మణికుమా రాష్టఘంటావ
ధానపరమేశ్వర హరిభట్టారకప్రణీతం బైన శ్రీనరసింహపురాణోక్తం
బగు నుత్తరభాగంబునందుఁ బ్రహ్లాదగుణవర్ణనంబును నతనికి దైత్యులు
దుర్నయం బుపదేశించుటయు - - - - - - వామనుండను దానవుండు
సుమాలివంశకుశేశయుం డగు హంసునివృత్తాంతంబు దెలుపుటయును
బ్రహ్లాదుని దిగ్విజయంబును - - - - - - చ్చటికి వచ్చి దేవరాతుండు ప్రహ్లా
దునితో దూర్వాసుశాపవృత్తాంతంబుఁ జెప్పుటయు ననంబరఁగు తృతీ
యాశ్వాసము.

205

  1. బండలివండు
  2. తూటడలేమె
  3. శాతనుండు
  4. కడుగొలుపడు
  5. వననీడ
  6. ఒరగుమూఢా
  7. యుంబశి
  8. సమూహమునం
  9. బలాగ్నులు
  10. బుక్కుచు
  11. ....ర్వల వసియించి
  12. క్రమోచ్ఛేక
  13. (విదర)విదురువెల్లిపొద - విదురు=(రాల్చు)ఇచ్చు, వెల్లి=తెల్లని, పొద-కల్పకము.)
  14. ములుస
  15. యోగమూగి
  16. కిన్నరులు
  17. మేళగారు
  18. ఆపాదమధుర
  19. మత్తిగాడు
  20. గేళించి
  21. నుడిగింపుచు
  22. వ్రేలంగ్లీలితమణి
  23. యుండ్డునూ
  24. దుద్యూత
  25. సని
  26. వెల్లిబిల్లి
  27. విఘడియ
  28. “....” ఈ చోట నేదో కొంతలోపించి యుండును.
  29. ద్వితీయ్యభృంగిం
  30. హంసుఁడంతవాని
  31. తీలిపడియె
  32. బాశి
  33. యెరిగినకాలంబున
  34. నెయ్యదయుండై
  35. రిభవమద్దధివశించ్చి
  36. ఈ చరణములోఁ గాల్బలము పేరు కనబడదు.
  37. గజభజింప
  38. తొట్రగిలుచు
  39. ప్రక్రమంబ్బయ్యె
  40. తేరుమిండు
  41. వంగాధీశ