నారసింహపురాణము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి

నారసింహపురాణము

ఉత్తరభాగము

ఉపోద్ఘాతము

ప్రాచీనాంధ్రకవిప్రవరులప్రశస్తకవిత కొంత, యిప్పటికిని దనసౌభాగ్యసంపత్తి నెఱుంగని జానపదులయట్టుకలపైఁ బడి మట్టిబ్రుంగిన త్రాటియాకులలో శిథిలశిథిలం బగుస్వరూపముతోఁ గొనయూపిరి గలిగి మూల్గుచున్నది. అట్టి యామె దురవస్థ నిప్పుడిప్పుడు కొందఱు భాషాభిమాను లత్యుదారభావములతోఁ దొలంగింపఁ బ్రయత్నించుచున్నారు. వాటిలో ముఖ్యముగా మన యాంధ్రసాహిత్యపరిషత్తువా రావిషయమై మిగులఁ బ్రశంసనీయముగఁ బనిచేసియున్నారు. వారియమూల్యప్రయత్నమువలననే యీహరిభట్టు నారసింహపురాణకృతికన్యక — ఇంతకాలమువఱకు జీవితసంశయస్థితిలో నున్నయీకృతికన్యక - ఇప్పటికి మన యాంధ్రదేశరంగమునఁ, జిరకాలాజ్ఞాతవాసముచేఁ గృశించి విశ్లధములైన శరీరభాగములతో నెట్లెట్లో తలయెత్తి ప్రజలలోఁ బడి నడయాడగలిగినది. మఱియు మనయాంధ్రదేశమున నింకను ని ట్లెన్నికృతు లడఁగిమడఁగి జీర్ణించుచున్నవో తెలియదు. కొన్నిసంవత్సరములక్రిందట, మ. రా. రా. మానవల్లి రామకృష్ణకవిగారు గద్వాలసంస్థానమునఁ దాము సంపాదించిన హరిభట్టు మత్స్యపురాణము (వ్రాఁతప్రతి) కడపట "This author also wrote another work called ఉత్తరనరసింహపురాణము as పూర్వనరసింహపురాణము was already handled by greater poets ఎఱ్ఱయ్య and వేములవాడ భీమకవి. But this work is not available and only one stanza quoted by జగన్నాథకవి in his రత్నాకరము survives to lament over the loss of it.

సీ. మందారకుసుమంబుఁ జందురుండును గూడి మౌళిభాగంబునఁ గీలుకొనఁగ
     ఫణికుండలంబును మణికుండలంబును గండభాగంబునఁ గప్పుకొనఁగ
     వరచక్రశూలాబ్జగరదహస్తములందుఁ గంకణభుజగకంకణము లమరఁ
     గనకకౌశేయంబు గజరాజచర్మంబు మునుకొని కటిభాగమున నటింప
గీ. దిమిరమును జంద్రికయు జోక నమరినట్లు, పుండరీకోత్పలద్యుతుల్ వొదలినట్లు
     నీలవజ్రంబు లొకచోట నిలిచినట్లు, హరిహరాకృతి త్రిభువనాహ్లాదమయ్యె.
Quoted in a రత్నాకరము. Canto I.

అని వ్రాసికొని కృతి నామావశేష యయ్యె నని భావించిన స్థితిలో నిది యిప్పు డిట్లు లభించుట యాంధ్రభాషాభిలాషుల కమూల్యమాణిక్యము లభించినట్లే కాదా? జగన్నాథకవిచే నుదాహృతమైన పైసీసపద్యమే ప్రస్తుతము ప్రకటింపఁబడిన యీనారసింహపురాణమునందు విశేషపాఠభేదములతో నిట్లు కనఁబడుచున్నది: ---
సీ.

మందారదామంబు నిందుఖండంబును మౌళిభాగంబునఁ గీలితముగఁ
మణికుండలమ్ములు ఫణికుండలమ్మును గండమండలముల మెండుకొనఁగఁ
జక్రాంకశూలాంకశయముల మాణిక్యకంకణభుజగకంకణము లమరఁ
గనకకౌశేయంబు గజరాజచర్మంబు మునుకొని కటిభాగముల ఘటిల్ల
రమయు నుమయును నుభయపార్శ్వముల నమరఁ
బులుఁగుఱేఁడును నందియుఁ గొలిచి మెలఁగ
వైష్ణవశ్రేష్ఠులును శైవవరులుఁ బొగడ
హరిహరస్ఫూర్తి యేకదేహమునఁ బొలిచె.

ఈరెండుపద్యములకును సీసపాదములలోఁ గొన్నిపాఠాంతరములు గాన్పించుచుండుట వింతగాదు: కాని కడపటి యెత్తుగీతము లొకదానితో నొకదానికిఁ బోలికయే లేక యున్నవి. ఇది చిత్రము! జగన్నాథకవిచే రత్నాకరమున సుదాహరింపఁబడిన దని రామకృష్ణకవిగారు వ్రాసిన సీసగీతి నించుమించుగాఁ బోలుచున్న మఱియొక సీసగీత మీగ్రంథమున నీహరిహరాకృతిసందర్భముననే యిట్లున్నది.


సీ.

 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -
నీలమును వజ్రఫలకంబుఁ బోలి యుత్ప, లంబుఁ గుముదంబున దగిలచ్చితోడి
యురము నగరాజపుత్త్రిక కునికియైన, యెడమవంకయుఁ గలిగి శ్రీ నిరవుకొనిరి.

మఱియు నిందలి ద్వితీయాశ్వాసమున మఱియొక సందర్భమునఁ జెప్పఁబడిన 15వ సంఖ్య గల కందపద్యములోని కొంతభాగము, మీఁద నుదాహరంపఁబడిన గీతపద్యభాగమును బోలు మన్నది.


క.

చీఁకటియుఁ జంద్రికారస, మేకస్థానంబునంద యిరవొందుగతిన్
నాకౌకోరిపుకులమున్, నాకాలయకులము నొక్కనంటున మెలఁగున్.

మఱియు నీహరిహరరూపైక్యమును వర్ణించు సీసపద్య మింకొకటి గూడ నిందుఁగలదు. పైపద్యములయం దిట్టివిశేషపాఠభేదము లెట్లు గలిగినవో నిర్ణయించుట గాని కవికంఠోక్త పాఠము లివియని నిశ్చయించుటగాని మనకు శక్యము గాదు. తఱచుగా నిట్టి భేదములు లేఖకులయు, సంస్కర్తలయు, ముద్రాపకు లయు బుద్ధిసూక్ష్మతచే సంభవింపవచ్చు నని నాయభిప్రాయము. ఇది ప్రసక్తానుప్రసక్తముగా వ్రాయబడిన విషయము. ప్రస్తుతవిషయ మేమనఁగా?

ఈనారసింహపురాణమును రచియించినకవి హరిభట్టు. ఏకారణముననో కాని, కృతికర్త యగుహరిభట్టుచేఁ గాక యతనికుమారుఁ డైన రాఘవమనీషిచే నీగ్రంథము ప్రోలుగంటి రంగప్రధానికిఁ గృతి యీయఁబడినట్లు కృత్యాదినిబద్ధమైన యీక్రిందిపద్యమువలనఁ దెలియవచ్చుచున్నది.


సీ.

విను రాఘవమనీషి! హనుమత్కృపావరలబ్ధకవిత్వవిలాసమహిమఁ
దనరి యేకాదశద్వాదశస్కంధముల్ తెలిఁగించె మీతండ్రి ధీయుతుండు
హరిభట్టు నిఖిలవిద్యాచతురాస్యుండు రాజమాన్యుఁడు కవిరాజనుతుఁడు
నారసింహపురాణపౌరస్త్యభాగంబుఁ జెదలువా డెఱ్ఱన మొదలుసేయఁ
బ్రతిభ దళుకొత్త నుత్తరభాగ మిప్పు, డాంధ్రభాషను వచనకావ్యం బొనర్చె
నాప్రబంధంబు నా పేర నంకితముగ, నీవు గావింపవలయుఁ గవీంద్రగణ్య!

ఈ పద్యమును బట్టి తండ్రి హరిభట్టు రచియించిన గ్రంథమునే కొడుకు రాఘవమనీషివలనఁ బ్రోలుగంటి రంగన్న కృతిపొందినట్లు స్పష్టమగుచున్నది; కాని తెలుగుకృతులలోఁ దఱచుగా గ్రంథకర్తయే తన గ్రంథమును గృతియిచ్చునాచార ముండుటచేతను, గృతికర్తృభిన్ను లిట్లు కృతు లిచ్చుట మిక్కిలి యరుదుగా నుండుట చేతను, బైసీసపద్య మన్వయసారళ్యము లేమింజేసి స్థూల దృష్టికి, నన్యార్థద్యోతకముగ నుండుటచేతను, మఱియు నందలి "వచనకావ్య" శబ్దమిప్పుడు ప్రత్యేకగద్యకావ్యపర్యాయమై వ్యవహరింపఁబడుచుండుటచేతను, దొలుదొలుత నీ గ్రంధము రాఘవమనీషికృత మైన ట్లించుక భ్రాంతి పొడమవచ్చును. అది కేవలము రజ్జుసర్పభ్రాంతియే కాని మఱియొకటి కాదు. తండ్రి హరిభట్టు గ్రంథమును సంపూర్ణముగా విరచించి యెవ్వరికిని గృతి యీయకమున్నే వార్ధక్యరోగాదులచే నశక్తుఁ డై యుండుటచేతనో, తనంతటఁ దాను నరులకుఁ గృతి యిచ్చి ప్రతిఫలము నొందుట కిచ్చగింపనివాఁ డగుట చేతనో, యొకవేళఁ గాలధర్మము నొందుటచేతనో యతనికుమారుఁడు రాఘవమనీషి కృత్యాదిపద్యములును గృతిభర్తృవంశావతారవర్ణనాదికమును రచించి రంగప్రధానకిఁ గృతి యిచ్చి యతనిచే "సకర్పూరవీటికాశాటికాలంకారపేటికా"ది పారితోషికములు పడసి యుండవచ్చును. ఇట్లే తెనాలిరామకృష్ణకవిచే రచింపబడిన ఘటికాచలమాహాత్య మాతనిపౌత్రుఁడు తీసికొనివచ్చి ఖండోజీ విచిత్రరాయఁ డనురాజునకు సమర్పింపఁగా నాతఁడు వేంకటగిరీంద్రు డనుకవిచేఁ గృత్యారంభమున నడపవలసిన దేవతాస్తోత్రాదికపద్యములును గృతిపతివంశావతారపద్యములును రచియింపఁజేసి కృతిపొందెను. ఈనారసింహపురాణమునందలి యాశ్వాసాంతగద్యము లన్నియు నీగ్రంథము హరిభట్టుకృత మనియే నొడువుచున్నవి. ఇందలిగద్యములకును హరిభట్టారకుని యితరగ్రంథములయందలి గద్యములకును గొంచె మైనను భేదము కాన్పించుట లేదు. సంస్కృతనారసింహపురాణమునఁ బూర్వభాగము చదలువాడ యెఱ్ఱన్న[1] మొదట నాంధ్రీకరింపఁగా, నిఖిలవిద్యాచతురాస్యుండును రాజమాన్యుఁడును, గవిరాజనుతుఁడును, ధీయుతుఁడు నగు మీతండ్రి హరిభ ట్టిప్పు డుత్తరభాగము నాంధ్రభాషయందు వచనకావ్యము (గద్యపద్యాత్మకమైన ప్రబంధము) గా రచించెను గావున నీ వాప్రబంధమును నాపేర నంకితముఁ గావింపవలయు నని రంగప్రధాని కోరఁగా రాఘవమనీషి యట్లు చేయుట కేమి యభ్యంతర ముండును? ఉండదు వచనకావ్య మనఁగా గద్యపద్యాత్మకమైన ప్రబంధ మనుట కాధారము హరిభట్టుకృత మగువరాహపురాణమున నీక్రిందివచనమునఁ గన్పట్టుచున్నది. "పురాతనకవీశ్వరానుసరణంబును గుకవినిరాకరణంబునుం జేసి శబ్దార్థభావరసాలంకారబంధంబుగా నొక్కప్రబంధం బాంధ్రభాషాభవ్యం బగువచనకావ్యంబుగా రచియింపం బూనిన సమయంబున" అను నీ వచనము గలవరాహపురాణము గద్యపద్యాతకమే కాని కేవల వచనకావ్యము కాదు. దీనింబట్టి చూడఁగా వచనకావ్య మన్న గద్యపద్యాత్మకకావ్య మని హరిభట్టుకాలమున వ్యవహృతిలో నున్నట్లు స్పష్టమగుచున్నది. ఇందలి కవిత్వమునకును హరిభట్టుకృతము లగువరాహపురాణాదులయందలి కవిత్వమునకును సర్వజన వేద్యము లయిన పోలికలుఁ గూడఁ బెక్కులు గలవు. ఆయీకారణములచే నీగ్రంథము నిస్సంశయముగ హరిభట్టకృతమే యని స్పష్టమగుచున్నసు, గించిద్భ్రాంతిజనకము లైనకారణాభాసములచే స్థూలదృష్టికి రాఘవమనీషికృత మని భ్రాంతిపొడము నేమో యని (అనవసర మైనను) ఇంతవఱకు వ్రాయవలసివచ్చినది.

ఏతద్గ్రంథకర్త యగుహరిభట్టు యజుర్వేదివైదికబ్రాహ్మణుఁడు.

మ.

అమృతప్రాయవిశేషకావ్యరచనాహంభావవాగ్రామణీ
రమణీమూర్తివి; వేదశాస్త్రవివిధగ్రంథార్థనిర్ణీత; వే
కముఖబ్రహ్మవు; యాజుషప్రకటశాఖాధర్మధుర్యుండ; వ
ర్యమతేజుండవు రాఘవార్యహరిభట్టా! సత్కవిగ్రామణీ!

అనువరాహపురాణపద్యము పైవిషయమును దెలుపుచున్నది. మఱియు నితనిగ్రంథములయందలి యాశ్వాసాంతగద్యములం బట్టి యితఁడు భారద్వాజసగోత్రుండును రాఘవమనీషి పుత్రుఁడును, హనుమదుపాసకుఁడును, అష్టఘంటావధానపరమేశ్వరబిరుదాంకితుఁడు నైయున్నట్లు తెలియవచ్చుచున్నది. ఆశ్వాసాంతగద్యములవలననే కాక వరాహపురాణము నందలి

గీ.

అష్టఘంటావధానవిశిష్టబిరుద, నీవు రచియింపదలఁచిన నిరుపమార్థ
రమ్యమగు నీవరాహపురాణకావ్య, మంకితము సేయు నాపేర నంచితముగ.

అనుపద్యమును బట్టియు నీతనికీ (అష్టఘంటావధాన) బిరుద మున్నట్లు విశద మగుచున్నది. ఇది యెవ్వరిచే నీయఁబడినదో తెలియదు. ఇతఁడు తనచే రచియింపఁబడిన వరాహపురాణమున:-

సీ.

వరుణదిగ్వీథి నేపురమునఁ బ్రవహించెఁ బావనసలిలసంపన్న పెన్న
దీపించె నేపురి గోపికామానసాస్పదవర్తి చెన్నగోపాలమూర్తి
బాసిల్లె నేవీటఁ బ్రహ్లాదభక్తివిశ్రాణి కొండనృసింహశార్ఙ్గపాణి
యేపట్టణంబునఁ జూపట్టె హితపద్మహేళి వీరేశబాలేందుమౌళి
చతురచతురంగబలరత్నసౌధయాథ, సాలగోపురతోరణ సకలవర్ణ
పౌరవారాంగనాజనప్రముఖవస్తు, మేదురం బట్టికంబముమెట్టుపురము.

అని కంబముమెట్టును వర్ణించియుండుటచే నాకంబముమెట్టయే యీతని నివాసస్థల మయియుండునేమో యని తోఁచుచున్నది. మరియు మత్స్యపురాణమునందలి:-

శా.

భారద్వాజసగోత్రసంభవుఁడ నాపస్తంబుఁడన్ దిమ్మమాం
బారాజద్వరగర్భసంభవుఁడ రామక్ష్మాసురానేకజ
న్మారూఢాధికపుణ్యలబ్ధ హరినామాంకాప్తసత్పుత్రుఁడన్
శ్రీరామానుజపాదపద్మయుగళీచింతాసమాయుక్తుఁడన్

అను పద్యమువలన నీకవి యాపస్తంబసూత్రుఁడును, రామమనీషికిని దిమ్మాంబకును బుత్రుఁడును, వైష్ణవమతాసక్తుఁడు నైనట్లు తెలియవచ్చుచున్నది. ఇతఁడు మొదట వరాహపురాణమును రచియించి కంబముమెట్టు కరణమగు కొలిపాక యెఱ్ఱన్నకుఁ గృతియిచ్చి యట్లు నరకృతి యిచ్చుటచేఁ గలిగినదోషమును బరిహరించుకొనుతలంపుతోఁ దరువాత మత్స్యపురాణమును రచించి శ్రీరంగనాథున కర్పించినట్లు మత్స్యపురాణమునందలి యీ క్రిందిపద్యము వలన నూహింపఁబడుచున్నది.

సీ.

ఆయురారోగ్యనిత్యైశ్వర్యములు గల్గి విభవంబుతో ధాత్రి వెలయుకొఱకు
ధనమునకై నరాధములసన్నుతిసేయఁ బొడమినపాపముల్ చెడుటకొఱకు
హృదయంబు లక్ష్మీశపదపంకజములందు నిశ్చలవృత్తితో నిలుచుకొఱకు
రౌరవమ్ములు వాసి రయమున వైకుంఠసదనంబునకు వేడ్కఁ జనెడుకొఱకుఁ
బరమవైష్ణవజనులెల్లఁ బ్రస్తుతింప, మత్కృతంబయి హరికథామాన్య మగుచు
నుత్తమంబగు విష్ణుధర్మోత్తరంబు, రంగనాథున కర్పింతు రాణ మెఱసి.

ఇంతకు మున్ను లభించిన యేతత్కవికృతము లగుమత్స్యవరాహపురాణములయం దీకవికాలమును నిర్ణయించుటకుఁ దగినయాధారము లేవియు లభించినవి కావు. కావుననే మ రా. రా. కందుకూరి వీరేశలింగము పంతులుగారు తమయాంధ్రకవులచరిత్రమునందు “కవికాలమును నిర్ణయించుట కీపుస్తకములు రెంటిలోను నాకాధారము లేవియుఁ గానరాలేదు - - - - నిర్దుష్ట మని చెప్పఁదగిన గ్రంథరచనను బట్టియు శైలిని బట్టియుఁ జూడఁగా నీ పుస్తకములు చిరకాలముక్రిందటనే రచియింపఁబడిన వైనట్టు తోఁచుచున్నది - - - అప్పకవి యీగ్రంథములనుండి లక్ష్యములఁ జేకొనకపోవుటచేత నీకవి యాతనికిఁ దరువాత నున్నాఁడేమో యని యూహ కలుగుచున్నది. కాఁబట్టి తగిన యాధారములు దొరకువఱకును మన మిప్పటి కీకవికాలము క్రీస్తుశకము 1660-వ సంవత్సరప్రాంత మని భావింతము. తెలియనివిషయముల నూహించి పెంచివ్రాయుటకంటె కవికృతగ్రంథములనుండి కొన్నిపద్యముల నుదాహరించి యింతటితో విరమించుట యుక్తము - - -” అని వ్రాసియున్నారు. తరువాత మఱికొంతకాలమునకు మే మీకవి మత్స్యపురాణమును మాకవితాపత్త్రికయందుఁ బ్రకటించియుంటిమి. అప్పటికిని మాకీతనికాలనిర్ణయ మొనరించుటకు మార్గమేమియును దొరకకుండుటం జేసి యాగ్రంథపీఠికయందు “ఈతని కాల మింకను జరిత్రకారులచే సరిగా నిర్ణయింపఁబడలేదు; కాని యపూర్వమగు గ్రంథోపక్రమమును బట్టి చూడ నీతఁడు మిక్కిలి ప్రాచీనుఁ డైనట్లు తోచుచున్నది.” అని వ్రాసియుంటిమి. ఇప్పుడాంధ్రసాహిత్యపరిషత్తువారిచే విశేషవ్యయప్రయాసములతో సంపాదింపఁబడి ప్రచురింపఁబడిన యీనారసింహపురాణమునందుఁ గాశకుశావ లంబనన్యాయమున నించుమించుగాఁ గవికాలమును నిర్ణయించుటకుఁ దగిన యాధారములు చూపట్టుచున్నవి. ఎట్లనిన:- ఏతద్గ్రంథకృతిభర్త యగు ప్రోలుగంటి రంగప్రధాని నందెల చినయోబభూపాలుని దండనాథుఁ డైనట్టు లీగ్రంథమునఁ గృతిపతిప్రస్తావమున రాఘవమనీషిచే నీ క్రిందిపద్యములయందుఁ జెప్పఁబడి యున్నది.

సీ.

తనమండలాగ్ర ముద్దండారిమండల భూధరంబులకు దంభోళి గాగఁ
దనకృపారసము బాంధవసేవకాశ్రితోద్యానసీమకు వసంతంబు గాఁగఁ
దనచక్కఁదనము కాంతామనశ్చంద్రకాంతములకుఁ జంద్రికోదయము గాఁగఁ
దననీతివర్తన ధారుణీజనచాతకంబుల కభ్రాగమంబు గాఁగఁ
వెలసె నేరాజు సముదగ్రబలసమగ్ర, కమఠకర్మఠభుజపీఠగమితధరణి
యతఁడు నందెలనరసింగయాంతరంగ, తామరసహేళి చినయోబదానశాలి.


శా.

ఆరాజన్యశిఖావతంసచతురాశాం తావనీచక్రభృ
ద్ధౌరంధర్యుఁడు శత్రునిర్మథనవిద్యాశాలి లీలావతీ
మారాకారుఁడు ప్రోలుగంటి నరసామాత్యాత్మజుం డార్యర
క్షారంభుం డగురంగమంత్రి యొకనాఁ డాత్మీయగేహంబునన్.

మఱియుఁ బ్రథమాశ్వాసము 14 వ పద్యమున:-

సీ.

- - - - - - - - - - - -
నందేలచినయోబనాథహృద్వీణకు రంగుమీఱినతంత్రి రంగమంత్రి.

అనియు నున్నది. ఈ నందెల చినయోబనృపాలుఁ డారెవీటి బుక్కరాజు వంశములోని వాఁడైనట్లు పింగళి సూరనార్యుని కళాపూర్ణోదయకృతిపతి వంశావతారపద్యములవలనఁ దెలియవచ్చుచున్నది. ఆరెవీటి బుక్కరాజునకు బెద్దభార్య యగునబ్బలదేవియందు సింగరయ్య, రామవిభుఁడు, అహోబలుఁడు నని ముగ్గురు పుత్రులు పుట్టిరి. వారిలోఁ బెద్దవాఁ డగుసింగరయ్యకు నరసింగరాజు, నారయ్య, తిమ్మయ్య, యని ముగ్గురుకొడుకులు. ఆ ముగ్గురలోను నరసింగరాజునకు సింగరయ్య, నారయ్య, కుమారౌబళుఁడు, వరదరాజు, రఘుపతి, యనునైదుగురు కుమారులు గలిగిరి. అందు సింగరయ్యకు నరసింహరాజు, రఘుపతి, ఓబరాజు, ననిముగ్గురు కొమాళ్లు. వారిలో నరసింహరాజు కొడుకు ఆవళిచినౌబళుఁడు. ఇతఁడే యీమననారసింహపురాణకృతిభర్త యగు ప్రోలుగంటి రంగన్న ప్రభువు. ఈతని పినతాతలు నలుగురలో నారయ్య కుమారుఁడు నరసింగయ్య. ఈ నరసింగయ్య కొడుకు కృష్ణమరాజు. ఈతఁడే కళాపూర్లో దయమును గృతిపొందిన నంద్యాల కృష్ణమరాజు. కనుక నీకృష్ణమరాజునకు ఆవళి చినౌబళుఁడు పెదతాతమనుమఁ డన్నమాట. మఱియు నీ నంద్యాలవంశమున నింకొక చిన్నయహోబళుడును, గుమారౌబళుఁడును, చిన్నయోబళుఁడును, ఓబయ్యయు, ఓబళరాజును, పెద్ద-ఉద్దండ-కనగిరి-శబ్దపూర్వకౌబళులును గనుపట్టుచున్నారు; కాని, నామసామ్యముచేతను బితృనామముం బట్టియు నావళి చినౌబళుఁడే ప్రోలుగంటి రంగన్న ప్రభు వైనట్లు నిర్ధారింపవలసి యున్నది. చూడుఁడు!

ఈ గ్రంథమునందే ప్రథమాశ్వాసాంతపద్యములయందు:-

క.

హావళిచినయౌబళవసు, ధావల్లభమంత్రివర్య! ధైర్యాహార్యా!
ధీవిభవశోషితార్యా! పావననేత్రాబ్జయుగకృపారసధుర్యా!

అనియును దృతీయాశ్వాసాంతపద్యములయందు:-

ఉ.

హావళి చిన్నయోభళధరాధిపశేఖరసైన్యపాల! నానావిధ ....

అనియు విస్పష్టము చేయఁబడినది. ఈయావళి చినౌబళుని గుఱించి పింగళి సూరనార్యుఁడు కళాపూర్ణోదయకృత్యాదియం దిట్లు వ్రాసియున్నాఁడు.,

క.

ఆనారసింహవిభుఁ డస, మానగుణుఁడు రఘుపతిక్షమావరుఁడు యశ
శ్శ్రీనిధియహోబళాఖ్యధ, రానాథుఁడు సకలగుణవిరాజితుఁ డయ్యెన్.


క.

ఆమువ్వురలో నగ్రజుఁ, డైమించునృసింహునకుఁ దదంగనయగుశ్రీ
రామాంబకు నుదయించె మ, హామతి యావళి చినౌబళాఖ్యుఁడు వెలయన్.


ఉ.

దేవవిభుండు భోగమునఁ దీవ్రమయాఖుఁ డఖండచండతే
జోవిభవంబునం; దపనసూనుఁ డనూనవితీర్ణిపెంపునన్
దైవతమేదినీధరము ధైర్యమహత్త్వమునం దలంపఁగా
నావళి చిన్నయోబమనుజాధిపముఖ్యుఁడు రాజమాత్రుఁడే?

ఈపద్యములకును నీనారసింహపురాణములోని పైయాశ్వాసాంతపద్యములకును నామవిషయమున విసంవాదలేశ మేనియు లేకుండుటచేఁ బ్రోలుగంటి రంగప్రధానికిఁ బ్రభు వైన యావళి చినయోబభూపాలుఁ డితఁడే యని తెల్ల మగుచున్నది. కళాపూర్ణోదయకృతిభర్త యగునంద్యాల కృష్ణరాజువలెనే యీయావళి చినయోబభూపాలుఁడును ఆరెవీటి బుక్కరాజున కాఱవతరమువాఁ డగుటచే మ రా. రా. కందుకూరి వీరేశలింగముపంతులుగారి లెక్కప్రకారము క్రీ. శ. 1473-వ సంవత్సరము మొదలుకొని క్రీ. శ. 1481-వ సంవత్సరమువఱకు రాజ్యము చేసిన బుక్కరాజునకుఁ దరువాత వచ్చిన యతనిసంతతి వారు నలుగురు నొక్కొక్క రిరువదిసంవత్సరము లుండి రనుకొన్న పక్షమునఁ జినయోబనృపాలుఁడును గృష్ణరాజుకాలమున ననఁగా క్రీ. శ. 1560-వ సంవత్సరప్రాంతమున నున్నవాఁడగును. అతని దండనాయకుఁడగు రంగప్రధానియు నతని కీగ్రంథమును గృతియిచ్చిన రాఘవమనీషియు నించుమించుగ నాకాలమువారే యగుదురు. ఈ రాఘవమనీషి పసివాఁడై యుండఁగా హరిభ ట్టీగ్రంథమును రచించి యెవ్వరికి నంకితము సేయకుండ మృతినొందిన వాఁ డనుకొన్నయెడలఁ దండ్రియనంతరము రాఘవమనీషి పెరిఁగి పెద్దవాఁడై రంగప్రధాని కీగ్రంథమును గృతియిచ్చునప్పటికి అత్యధమ మిరువది వత్సరము లైనఁ బట్టును. కావున నాయిరువదివత్సరములుసు రాఘవమనీషికాల మనుకొనుచున్న 1560 లోనుండి తీసివైచినచో హరిభట్టు నిర్యాణకాలము రమారమి క్రీ. శ. 1540-వ సంవత్సరప్రాంతమై యుండును. ఈతఁడు కొంచె మెచ్చు తగ్గుగా నేఁబది సంవత్సరములు జీవించియుండునని భావించినచో నీతని జీవితకాల మించుమించుగా క్రీ. శ. 1490-వ సంవత్సరము మొదలు క్రీ. శ. 1540-వ సంవత్సరప్రాంతమువఱకు నని యేర్పడుచున్నది. ఇది యిట్లుండ గా నీకృతిభర్త యగురంగప్రధానికి ముత్తాత యగుతిప్పన్న ప్రౌఢదేవరాయని దండాధీశ్వరుఁ డైన ట్లీ గ్రంథము నందలి:-

క. ఆమునిమణికులజలనిధి, సోమునికైవడి జనించె సురుచిరవిభవో
    ద్దాముఁడు సమధికసమర, స్థేముఁడఁ నౌప్రోలుగంటి తిప్పన ధాత్రిన్.
శా. అమంత్రీంద్రుఁడు ప్రౌఢరాయనృపదండాధీశసంపత్కళా
    సామగ్రి న్విలసిల్లి మల్లిసుమభాస్వత్కీర్తివిస్ఫూర్తి ను
    ద్దామాసాధ్యమహోమహత్త్వమున సంధాయుక్తి దోశ్శక్తి వా
    చామాధుర్యమునం బురావిభులతతో జర్చించు వర్చస్వియై.

అనుపద్యములవలనఁ దెలియవచ్చుచున్నది. ప్రౌఢదేవరాయలు క్రీ.శ. 1422-వ సంవత్సరము మొదలుకొని 1447-వ సంవత్సరము వఱకును రాజ్యము చేసినవాఁడు కనుక నాకాలమున నున్నప్రోలుగంటి తిప్పన్నకు మూఁడవతరమువాఁ డగురంగన్న (తరమున కిరువది సంవత్సరముల వంతునఁ బెంచిన యెడల) క్రీ. శ. 1507-వ సంవత్సరప్రాంతమున నున్నవాఁ డగును. మొదటిలెక్కకు నీలెక్కకుసు సుమా రేఁబదిసంవత్సరములు భేద మున్నను మొత్తముమీఁదఁ బ్రోలుగంటి రంగప్రధాని క్రీ. శ. 16-వ శతాబ్ద్యాది నున్నవాఁ డగును గనుక నతనికి ముందున్న హరిభట్టు 15-వ శతాబ్దియం దుత్తరభాగమున నున్నవాఁ డగుటకు సందేహముండదు. అట్లగుచో నీకవి శ్రీకృష్ణదేవరాయల రాజ్యారంభకాలమునకు ముందే యల్లసాని పెద్దనామాత్యునికంటెఁ గొంచెము పూర్వుఁడు గానో సమకాలమువాఁడు గానో యుండి—యాధునికకవుల కాదియందుఁ జేర్పఁబడుటకు బదులుగా—మధ్యకవుల కాదినో పూర్వకవులకుఁ గడపటనో చేర్పదగినవాఁ డగును. అంతియే కాని శ్రీవీరేశలింగము పంతులుగారు వ్రాసినట్లు, అప్పకవి యీతనిగ్రంథములనుండి లక్ష్యములను జేకొనకపోయినంతమాత్రమున నీకవి యతనికిఁ దరువాతివాఁ డేమో యని యూహించుట యుక్తము గాదు. అప్పకవిచే నుదాహృతములు గాని ప్రాచీనాంధ్రగ్రంథము లెన్ని లేవు? అవి యన్నియు నప్పకవికంటె నర్వాచీను లగుకవులచే రచియింపఁబడి యుండునని భావింపవచ్చునా? అంతకంటే—ఈతఁడు రచించినగ్రంథము లన్నియుఁ బురాణాంధ్రీకరణములేయై యుండుటం బట్టియు మత్స్యపురాణమున నీతఁ డొనర్చిన యపూర్వగ్రంథోపక్రమమును బట్టియుఁ బ్రబంధకాలమునకుఁ బూర్వుఁ డని యూహించుట యుక్తమేమో?

ప్రస్తుత మీకవికాలనిర్ణయ మంతకంటె సరిగా నొనర్చుటకుఁ దగిన ప్రబలాధారములు నాకుఁ గనుపట్టకున్నవి. ఇంతకు ముం దీమాత్రమైన నాధారముఁ గానరాని యీతని జీవితకాలనిర్ణయమున కిప్పు డీయాధారమైన దొరికినందుకు సంతసింపవలసినదే. ఇప్పు డీ నేఁజూపిన నిర్ణయాంశము గూడ నెంతవఱకు సరియైనదో చరిత్రపరిశోధనములం దభినివేశము గల తద్జ్ఞులు పరిశీలింపవలసియుండును; గావున నాభారము వారిపై వైచి యీనారసింహపురాణమునందలి కవిత్వముంగూర్చి యొకించుక వ్రాసి ముగించుచున్నాఁడను. హరిభట్టు గ్రంథము లిప్పటికి నాల్గు లభించినవి. ఇవి గాక యాతఁడింక నేవైన గ్రంథములు రచియించి యుండె నేమో తెలియదు. లభించిన గ్రంథములు (1) వరాహపురాణము, (2) మత్స్యపురాణము, (3) భాగవతషష్ఠైకాదశద్వాదశస్కంధములు, (4) ఈ నారసింహపురాణము. వీనిలో నీగ్రంథ మెన్నవదో సరిగా నిర్ణయింపఁజాలము. కాని మత్స్యపురాణమునందలి: – సీ....ధనమునకై నరాధముల సన్నుతిసేయఁ బొడమినపాపముల్ చెడుటకొఱకు ........... అనుదానింబట్టి, నరకృతి యీయఁబడిన వరాహపురాణము, మత్స్యపురాణముకంటె ముందు రచియింపఁబడెనేమోయని తోచుచున్నది. ఈ నారసింహపురాణమునందు:— సీ. విను రాఘవమనీషి! హనుమత్కృపావరలబ్ధకవిత్వవిలాసమహిమఁ దనరి యేకాదశద్వాదశస్కంధముల్ దెలిఁగించె మీతండ్రి ధీయు తుండు హరిభట్టు [2]............. అన్ని చెప్పఁబడియుండుటచే నీగ్రంథము కంటె ముందుగా భాగవతస్కంధము లాంధ్రీకరించినట్లు స్పష్టమగుచున్నది. వరాహపురాణమత్స్యపురాణము లంతకుఁ బూర్వమే రచింపఁబడియున్నయెడల వానిప్రస్తావ మిం దేల చేయఁబడ లే దని యొకశంక పొడమును. పోనిండు. భాగవతస్కంధములకును నారసింహపురాణమునకును బరమందే వరాహమత్స్యపురాణములు విరచింపఁబడిన వసుకొంద మన్నచో నాగ్రంథములు రచియించునంతకాలమువఱకు నీనారసింహపురాణము కవిచే నెవ్వరిపేర నంకితము చేయఁబడక మిగిలియుండి యిట్లేల కవిపుత్రునిచేఁ గృతియీయఁబడు నని సంశయింపవలసివచ్చును. ఇట్లు సంశయాస్పద మగు నేతద్గ్రంథరచనాక్రమమును గూర్చి విశేషతర్కము లొనరింపవలసిన పనిలేదు. కాని గ్రంథకర్తచే నెవ్వరికి నంకితము చేయఁబడక మిగిలియున్న దగుటచేతను, నీకవిచేతనే రచియింపఁబడిన యితరగ్రంథములయందలి కవిత్వముకంటె నిందలికవిత్వము కొంత ప్రౌఢముగాఁ గాన్పించుచుండుటచేతను నీనారసింహపురాణ మీకవిగ్రంథము లన్నిటిలోను గడపటి దని సంభావించుకొని సంశయవిచ్ఛేదకమైన సందర్భాంతరము సమకూరువఱకును సంతోషింపవచ్చును.

భారతభాగవతరామాయణాదులవలెనే యిదియును గథాసందర్భమున సంస్కృతమూలము ననుసరించి యధేష్టముగాఁ దెలుఁగు సేయఁబడినట్లు కనుపట్టుచున్నది. కాని యెంతవఱకు మూలానుగుణముగా నున్నదో చూచి వివరించుటకు నాకుఁ దగిన యవకాశము చిక్కినది కాదు. ఇందలికథ యెఱ్ఱాప్రెగ్గడ నారసింహపురాణమునందలి కథ కుత్తరభాగమని తోఁచుచున్నది.

ఈ గ్రంథమునందలి కవిత్వము నిరర్గళమైన ధారగలదై ద్రాక్షాపాకమునఁ బడి చక్కఁగా నుండును.

చ. అలఘుభుజాబలప్రథితు లాశరపుంగవు లుగ్రసాధనం
బుల నరకేసరిం బొదువఁ బూనిన యంతనె తన్నృసింహుచూ
పుల యెఱమంటలం జిమిడిపోయిరి జీర్ణము లైరి జీవముల్
తొలఁగిలి తూలి రోటఱిరి తొట్రిలి వ్రాలిరి కూలి రందఱున్. ప్ర.ఆ.122

క. ఎదిరినపగ మీలోపల, ముదిరినయది లేదు లోకములు గూఁకలిడన్
     గదనము సేయఁగఁ దగునే, మదనజనక మదనదమన! మానుఁడు గినుకల్. ప్ర. ఆ. 205
సీ. సమరాభిముఖు లైన యమరవీరుల గిట్టి యనిమొనఁ దుత్తుమురాడవలదె
     దర్ఫితదండయాత్రాభేరిభాంకారఝంకారముల మిన్ను చఱవవలదె
     యుత్పలదళముల యొప్పునఁ బైకొను నరిశిలీముఖముల నాఁపవలదె
     తుంగమాతంగశతాంగతురంగాంగశకలకోటుల నేలఁ జమరవలదె
     కలవె యొకనిఁ గొలిచి గర్వవిహీనుఁడై, యూడిగములు సేయుచున్న పతికి
     ధూర్తవిజయలబ్ధికీర్తిప్రతాపంబు, లసురసుతున కిట్టు లడఁగ దగునె? ద్వి. ఆ. 57
ఉ. పక్షికులేంద్రవాహనుని బల్విడి దోలఁగరాదొ------- ద్వి. ఆ. 64
శా. అన్నా! యన్నలుఁదమ్ము లైనమిము) మున్నాక్షేపముల్ పల్కి నే
     నిన్నాళ్ళేలితి మూఁడులోకములు--------- తృ. ఆ. 91
మ. తపముల్ సేయుచు వ్రస్సి క్రుస్సి విపినాంతర్వాసులై------ తృ. ఆ. 95
క. గర్వించి యశోవా మృ, త్యుర్వా యని దివిజబలమహోగ్రాకృతివై
     గీర్వాణ విమతజలనిధి, పర్వతమై నిలువవయ్య పాకధ్వంసీ. చ. ఆ. 26
క. జలధిపతి బలపరాక్రమ, ములు జలలిపులుగ నొనర్చి ముచ్చెరువుజలం
     బులు ద్రావించిన నీయు, జ్జ్వలవిక్రమ ముగ్రతరము శత్రుధ్వంసీ! పం. ఆ. 36

గ్రంథవిస్తరభీతిచే స్థాలీపులాకన్యాయముగ నీ పద్యము లెత్తి చూపఁబడినవి. కాని కవిత్వమంతయు నిట్లే మృదుమధురముగనుండును.

ఈ గ్రంథమునం దచటనచట నంత్యానుప్రాసాది శబ్దాలంకారములుగల పద్యము లుండుటం బట్టియుఁ గొన్నిపోలికలంబట్టియుఁ జూడ గ్రంథకర్తకు బమ్మెర పోతనామాత్యుని కవిత్వమునందు మిక్కిలి యాదరమున్నట్లు తెలియవచ్చుచుండును. ఈ యాదరమే యేతత్కవిని భాగవతస్కంధములు రచింపఁ బ్రోత్సహించెనేమో?

మ. శరభేంద్రుండు మనంబులోఁదలఁచె రక్షస్సైనికాభీలముం
     జిరవైరోద్ధతభాస్కరోద్భనశిరచ్ఛేదక్రియామూలముం
     బు రసప్రావళి భూరిమేఘవిలయప్రోద్భూతవాతూలమున్
     వరఘంటాజనితాతిదీర్ఘనినదన్యాలోలమున్ శూలమున్. ఆ.1.188
ఉ. విక్రమసత్త్వసంయుతుఁడు వీరనృసింహుడు లోఁదలంచె ని
     ర్వర్తపరాక్రమక్రమధురంధరసాహసికత్వవిభ్రమో

పక్రమమీనధామగృహపాలనిజధ్వజనీమహావుర
     శ్శుక్రము నిర్గళజ్జ్వలనశోషితనక్రమము నాత్మచక్రమున్. ఆ. 4.169
క. కదనంబున నాఱెక్కలు
సీ. వలమానదహనకీలల నీనునెమ్మోము ములికితోడావంక కలికితోడ ఆ. 1.98
సీ. హృదయంబు లక్ష్మీశపదపద్మములయంద వినుకులు హరికథల్ వినుటయంద.
క. నచ్చినచోటికిఁ గ్రమ్మఱి, వచ్చుం బూఁదోఁట సూచి వచ్చుఁ బ్రియముతో
     నెచ్చెలుల నడుగునడుగుల,మచ్చమరయు నొఱలుఁ దెరలుమలఁగుంగలఁగున్. ఆ. 3.113
శా. అన్నా! వెన్నుని నమ్మఁగా వలదు మాయనాట్యకేళీరతుం
     డన్నారాయణుఁ డాదితేయులకు రంధ్రాన్వేషసంపాది యై
     యిన్నీసంపద లన్నియుం గిలిబి తా నిచ్చు న్నిజం బీవు సం
     పన్నప్రౌఢి వహించి యేమఱకుమీ ప్రత్యర్థికృత్యంబులన్. ఆ. 4.169

యతిప్రాసపాదపూరణాదులకై వచ్చిపడు వ్యర్థపదము లీగ్రంథమున విశేషముగాఁ గానఁబడవు. శైలి సర్వత్రమనోజ్ఞముగా నున్నది; కాని యందందుఁ గొన్ని విరుద్ధప్రయోగములు గనుపట్టుచున్నవి.

క. ఏమి యపరాధ మొదవెం, దామరవిరిమనుమనందుఁ దత్కథ సర్వం ఆ.1.60
సీ. - - - - - - -- -- - - -
     మఱియు నీ వొనర్చ మానుషక్రమములు, లెక్కసేయువారు లేరు నిజము ఆ. 1.224
సీ. - - - - - - - - - - - - - - -
     ఏ సమయము చూచినా సదాశివమిత్రగోచరగ్రంధార్థసూచనంబు ఆ.2.14
గీ. ఆహిరణ్యకశిపు నందు నీమామిడి, క్రింది సోమరెట్లు బొందియెత్తె ఆ.2.59
క. భావించి కల్పతరువుల, రావించిట్లనియె------- ఆ.3.55
క. మొకమడఁచినఁ గానఁగలే, కొకవస్తువు నిట్టి దనఁగ నోడిరి లోకుల్
     శకలితహరిహయమణికో, రకములలో నణఁగిరనఁగ రాత్రిటివేళన్. 3.174
చ. హరికిని నీకు నేమిపని యాయన న న్నెఱు గే నెఱుంగుదున్?
     హరిని----------- ఆ.4.118.
గీ. కర్మనిర్ముక్తుఁడై చెంచుగబ్బిగుబ్బ, లాని కతమునఁ బాతిత్యలీనుఁడయ్యె 5.171

దండకము. వంచనాచుంచురత్వంబున న్నీపదాంభోజముల్.

ఇట్టివి మఱియుఁ గొన్ని గలవు. ఇవి యెట్లు దొరలెనో గానీ కవియజ్ఞతచేఁ బ్రయోగింపఁబడినవని చెప్పసాహసింపఁదగదు. మొత్తముమీఁదఁ గవిత్వము నిర్దుష్టమనియే చెప్పవచ్చును. మఱియు నిందు యతిప్రాసములయందు గురులఘురేఫభేదము పాటించినట్లు కనఁబడదు. ఇందలి పద్యగద్యములు చాలభాగము సంస్కృతపదభూయిష్టములై యున్నవి. కొన్నిచోట్లఁ దేటతెలుఁగుమాటలతో నలరారు వాటములగు పద్యములును గలవు. అందందు రూఢిపదములకు మాఱుగఁ బర్యాయపదములు ప్రయోగింపఁబడియుండుటచేఁ బద్యపఠనోత్తరకాలార్థావబోధమున కవి యించుక ప్రతిబంధముఁ గలుగఁ జేయుచుండును. అయిన నది యొక గొప్పలోపముగాఁ బరిగణింపఁజనదు. ఈ గ్రంథము పెక్కుతెఱఁగులఁ జాలఁ బ్రశస్తమైన దనియే తుదకుఁ జెప్పవలసినమాట. తినఁబోవువారికి రుచులు సెప్ప నేల యను తలంపుతోడను, ఆయాసందర్భములయం దింతకుము న్నుదాహృతములైన పద్యములే చాలు ననునాశయముతోడను గవితారీతిని దెలుపుటకై మరలఁ బ్రత్యేకముగాఁ గొన్నిపద్యము లెత్తి వ్రాయ లేదు. పాఠకమహాశయు లీగ్రంథమును సాంతముగఁ జదిని యిందలికవితారసము నాస్వాదించి యాంధ్రసాహిత్యపరిషత్తువారి పరిశ్రమము ఫలవంత మొనర్చుట యుభయతారకము. గ్రంథవిస్తృతి యేల?

కవితావిలాసముఓలేటి వేంకటరామశాస్త్రి
పీఠికాపురము
  1. ఈతఁడే కవిత్రయమునందలి యెఱ్ఱాప్రెగ్గడ యనిను శంభుదాసుని యింటిపేరు చదలువాడవా రనియు నామిత్రు లొకరు చెప్పిరి. చదలువాడ మల్లయ్యకవికృతమగు విప్రనారాయణచరిత్ర ఈవిషయమునకుఁ బ్రబలప్రమాణముగా నున్నది.
  2. హరిభట్టు భాగవతమున షష్ఠస్కంధముఁ గూడ నాంధ్రీకరించి యున్నాఁడు. అది మాపీఠికాపురమునందలి యాంధ్రపరిశోధకమహామండలియం దుండఁగా నేను జూచితిని. ఈ పద్యమున దానిప్రసక్తి యేల చేయఁబడలేదో తెలియదు. అప్పటి కీస్కంధ మాంధ్రీకరింపఁబడి యుండకపోవునా? అట్లయిన మఱి యెప్పుడు తెలుగు సేయఁబడి యుండును? ఈషష్ఠస్కంధకృత్యాదిపద్యముల యందుఁ గూడ నీతనికాలనిర్ణయాదుల కనుకూలించు విషయములు లభించినవి గావు. అందు:-

    శా. శ్రీ నీలాచలనాథు నంచితదయాసింధున్ జగన్నాయకున్
         నానావైభవసన్నుతున్ మునిజనానందాలమున్ సర్వదే
         వానీకా(మల?)మౌళిరత్నరుచిదివ్యాంఘ్రిద్వయీశోభితు
         న్సూనాస్త్రప్రభవాశ్రయున్ హరిని సంశోభింతు నెల్లప్పుడున్.
    మ. గురుకావ్యాదినిలింపసంఘములు వైకుంఠంబుతో సాటిగా
         బురణింపం బురుషోత్తమాహ్వయమహాపుణ్యస్థలం బంచు సా
         గరతీరంబున నీలశైలశిఖరాగ్రంబందు వేంచేసి యు
         న్నరమాకాంతుని భక్తవత్సలు జగన్నాథుం బ్రశంసించెదన్.
    మ. కర(క్రమ?) మొప్పన్ ముసలాయుధుండును సుభద్రాదేవియుం బార్శ్వభా
         గమునం బ్రేమయొనర్ప రత్నమకుటగ్రైవేయహారాంగద
         ప్రముఖానేకవిభూ- - - - - - -డై బ్రహ్మేంద్రగౌరీశ్వరా
         ద్యమరుల్ గొల్వ సుఖోపవిష్టుఁడగు నీలాద్రీశ్వరుం గొల్చెదన్.
    చ. ఎడపక విష్ణునిం బొగడ నెన్నఁడు నొల్లక దుర్మదంబునం
         గడుపులకై నరాధములఁ గావ్యముఖంబుల సన్నుతింపఁగా
         బొడమిన పాపజాలముల బొట్టణఁగం బొలియించు ముక్తిఁ బొం
         దెడుకొఱకై రచింతుఁ గృతి నీలగిరీంద్రున కర్పితంబుగన్.
    శా. ప్రస్కంధామరరాజ్యరక్షకుని భూభారాపహర్తన్ మహే
         శస్కందాభినుతప్రభావుఁ గమలాసంక్రాంతరాజన్మహో
         రస్కున్ విష్ణుఁ దలంచి భాగవతపౌరాణీయమైనట్టి ష
         ష్ఠస్కంధంబుఁ దెనుంగుఁ జేసెదను గృష్ణప్రీతిగా వేడ్కతో.
    క. కృతినాథుఁడు నీలాచల, పతియఁట శుకయోగి వచనభాషితమగు త
         త్కృతి భాగవతం బఁట యిది, మతిఁదలఁపఁగ నింతకన్న మాన్యము గలదే.
    వ. ఇవ్విధంబున సకలదేవతానాయకుండై యింద్రద్యుమ్నుసరోవరతీరంబున నీలగిరినిలయుం
         డైన జగన్నాథదేవునకు ననంతంబులైన సాష్టాంగదండప్రణామంబులు సమర్పించి తత్పాద
         పద్మంబులు మదీయమనఃపద్మంబునం గీలుకొల్పి తదర్పితంబుగా పష్ఠస్కంధంబు మతి
         గోచరించుకొలఁదిని దెనిగించెద.
    గీ. పరుసమునకు నినుము బంగారమును నొక్క, విధమ యైనయట్లు వీక్షసేయ
         శ్వపచుఁడైన విప్రవరుఁడైన శ్రీవిష్ణు, భక్తి కొక్కసమము పరిచరింప.
    క. సురవరమౌళి విరాజిత, సురుచిరరత్నప్రభాభిశోభితపాదాం
         బురుహద్వయాతినిర్మల, నిరుపమగుణసన్నివేశ నీలాద్రీశా!
    వ. అవధరింపుము.
    అను నీ పద్యగద్యములతో గ్రంథోపక్రమము సేయఁబడి:- “ఇది శ్రీ హనుమత్కటాక్షలబ్ధవరప్రసాద సహజసారస్వతచంద్రనామాంకరామవిద్వ
    న్మణికుమా రాష్టఘంటావధాన హరిభట్టారక ప్రణీతం బైన” ఇత్యాదిగద్యముతో
    షష్ఠస్కంధము పరిసమాప్తి చేయఁబడి యున్నది.