నారదీయపురాణము
ద్వితీయాశ్వాసము
క. |
శ్రీమద్బృందావనవీ
థీమధ్యవిరాజమానదృఢరాసక్రీ
డామాద్యద్వల్లవయువ
తీమోహకదంబభోగతృష్ణా! కృష్ణా!
| 1
|
ఉ. |
చంద్రకళాకలాపరుచిజాలముతో మహతీవిపంచికా
సాంద్రవినోదవాదనరసస్ఫురితానుభవంబుతో మహ
ర్షీంద్రుఁడు నారదుండు కమలేశపదాంబుజసేవనైకని
స్తంద్రుఁడు నిల్చె మౌనిజనసత్తములందఱు సన్నుతింపఁగన్.
| 3
|
తే. గీ. |
జ్ఞానవైరాగ్యభక్తినిష్ఠాపరుండు
వేదసీమంతమౌక్తికవిమలమూర్తి
ఘనతపోరాశిసత్వైకఖని యతఁడు ర
మేశుఁ డలరార వీణ వాయించె నపుడు.
| 4
|
తే. గీ. |
నలిననేత్రుఁడు సంకీర్తనమున మెచ్చి
నట్లు విజ్ఞానయజ్ఞయోగార్చనప్ర
ణామములచేత మెచ్చఁ డానంద మొంది
యట్లు గావునఁ గీర్తనం బర్హ మెచట.
| 5
|
క. |
పరమరసాయన మనఁదగు
నరవరజిహ్వాపరరసనవరుచి లోకాం
తరరక్ష యాగమంబుల
నరయఁగ నారాయణాహ్వయము గమ్యంబే?
| 6
|
తే. గీ. |
గరుడవాహనగుణకథాగానపరమ
గద్గదాలాపములఁ జొక్కి కడు నటించు
నారదునిఁ గాంచి హర్షవాఃపూరమగ్న
మానసంబుల నుండి శమంబు పూని.
| 7
|
క. |
అనిశప్రణయరసోత్ఫు
ల్లనిజేక్షణులైన మునికులప్రవరుల నా
మునిచంద్రుఁడు బోధరసాం
చనమృదుభాషావిశేషసంపదఁ బలికెన్.
| 8
|
తే. గీ. |
ఇచట మీ రున్న కారణం బేమి, మిమ్ముఁ
గాంచి చరితార్థత వహించి ఘనుఁడ నైతి
ననుచు నారదుఁ డడుగ మహర్షివర్యు
లద్భుతానందరస మాని యప్పు డనిరి.
| 9
|
సీ. |
కలివేళ నతిసమగ్రతరపుణ్యక్షేత్ర
ములలోన ముక్తికి మూలమైన
క్షేత్ర మెయ్యది యందుఁ జేరి వర్తించెద
మని తలపోసి నారాయణాహ్య
పరదేవతామౌళిఁ బ్రార్థింప నారాయ
ణాద్రియే యుండు యోగ్యంబు మీకు
ననుచు సంక్షిప్తవాక్యమున నానతి యిచ్చి
విస్తరంబున జగద్విదితుఁడైన
|
|
తే. గీ |
నారదుఁడు దెల్పు ననియె నా[1]నలిననాభ
భక్తిసుజ్ఞానయోగిప్రపన్నమౌని
నాయకాగ్రేసరుఁడవు నానావిచిత్ర
హరికథాలీల లెఱిఁగింపు మనఘచరిత.
| 10
|
క. |
నారాయణ యోగీంద్రుఁడు
సారజ్ఞుఁడు తానె యట్లు సన్నిధి యయ్యున్
బేరెన్నిఁక యదుశైలం
బారయఁ గలిదోషహారి యగు టెట్లు ధరన్?
| 11
|
వ. |
ఆయాదవశైలంబున నేయేయధికారి శౌరిం బూజించె? అచ్చటి
తీర్థంబునకుఁ గల్యాణనామం బెట్లు గలిగె? తచ్ఛ్వేతమృత్తిక యెందునం
బ్రశస్తంబయ్యె? నరసింహుం డేమి నిమిత్తంబునఁ బ్రాదుర్భవించె? ఈ
క్షేత్రంబునకు వైకుంఠవర్థనంబను పే రెట్లు సంభవించె? అయనవాసం
బున నెవఁడు విష్ణుపదం బందె? ఇచ్చట నపరాధంబు సేసినవాని కెట్టి
దుఃఖంబు ప్రాపించె? ఆనతీయవే యని పలికిన నారదుం డుత్సుకుండై
యిట్లనియె. మున్ను నేను విజ్ఞానసంచయంబైన సనత్కుమారుని వలన
|
|
|
వినిన యది మీకు నెఱింగించెద వినుఁడు — ఆత్మగుణపన్నగ
పరిదష్టులైనవారికి నజ్ఞానవారణంబైన గురూపదేశమే పరమౌషధము.
పరమధర్మము. పురుషోత్తములీలచే మున్ను చరాచరవిశ్వము
తమోమాత్రరూపవిశిష్టమై పరబ్రహ్మంబుఁ బొందియుండు. ప్రధాన
పురుషు లనంగా నీశ్వరునికి శరీరద్వయ మాధేయత్వ విధేయత్వ
శేషత్వములచే నఖిలజగంబులకుఁ దారకుండై నియంతయై శేషియైన
హరికిఁ దనువు గావునఁ దదాత్మకత్వముచేతఁ బ్రధానపురుషులు
విశ్వంబునకుం గారణంబని నిగమంబులయందుఁ బలుకంబడియె.
ప్రధానపురుషులు స్వతంత్రకారణంబులు గారు. తత్ప్రళయకాలము
నందును బురుషులు పురుషార్థరహితులై యుచిత్సదృశులై జడు
లగుదురు. అంత భోగనిర్ముక్తులై ప్రకృతిసంశ్రయులైన పురుషులం
జూచిన పుండరీకాక్షునకు నొకానొకయనిర్వాచ్యమైన కరుణ వొడము.
వారి రక్షింప సృజియింప నిచ్ఛ యుదయించు. ఈపురాణపురుషుని
సంకల్పంబునం బ్రకృతి మఱియు గుణంబులచే మహదాదిప్రభేదం
బైన వికారంబు నొందు. మహ త్తహంకృతిం గల్పించు. అయ్యహం
కృతి సాత్వికాదివిభాగంబు దగుగుణభేదంబులచేఁ ద్రివిధంబై యుండు.
సాత్వికాహంకారంబువలన నింద్రియసముత్పత్తియుఁ, దామసాహం
కారంబువలన భూతసంభవంబు నగు. ఆరెంటికి రాజసాహంకారంబు
ప్రకృతిఁ గావించు. పంచభూతంబులకు శబ్దాదు లుత్తరోత్తరాధికంబు లై
జనియించుం గాన మహి పంచగుణ యగు. తన్మాత్రానుభూతభేదంబు
సూక్ష్మస్థూలవిభాగంబున నగు కలకలంబై దేహరూపంబునఁ బొడమి
నట్లు తన్మాత్రారూపమే భూతత్వము నధిగమించుఁ, గార్యపరంపర
సేయు. నానావిద్యాన్వితంబై కూడక వేఱెవేఱెయై యున్న యీ
భూతంబు లండసృష్ఠియందు నశక్తంబులై యుండం, గార్యపరం
పర సేయ సత్యసంకల్పుండైన భగవంతుండు పంచభూతంబుల
యందుఁ బంచీకరణ మొనర్చి పంచభూతము లర్ధమర్ధములు తమభాగ
ములు గైకొని కడమ యర్ధమర్ధమును నాలుగుభాగములు చేసి తన
పేరైన నాల్గింటనుఁ గూర్చుట యది పంచీకరణము. ఆకాశాదులయందు
నాకాశాదివ్యవహారము స్వభావాధిక్యముచే నిష్టం బగు. దశోత్తరావరణ
పరీతంబైన యండంబు పరమపురుషుండు కనకఖండంబుఁబలె నుత్పా
దించి భూతంబులచే భూతాధిచే మహత్తుచే నీయండం బావరింపఁజేసి
సమష్టిసృష్టియు, సృష్టి మొదలగు వ్యష్టసృష్టి పిదపంగాఁ గలదు. అండ
మధ్యంబునం గార్యపురుషుండు త్రయీభాగస్తూయమానుండై జలా
శయంబున నధిశయించె మఱియును.
| 12
|
సీ. |
సకలనామస్తుతి సంఘటించుటకంటె
నారాయణాయను నామమొకటి
హరికిఁ బ్రియంబు వాక్యవిశుద్ధిదంబు శ్రు
త్యవలంబనంబు కామ్యప్రదంబు
సాధుకర్ణామృతసారమె వెవ్వనిజిహ్వ
యందుఁ దన్నారాయణాహ్వయంబు
పొడము నాతనియింట జలధికన్యకతోడ
నట్టి పరాత్పరుం డధివసించు
|
|
తే. గీ. |
అర్థ మెఱుఁగకయేని నారాయణాహ్వ
నరుఁడు కీర్తించి భయపరంపరఁ దరించు
సద్గురూదితసారార్థసరణిఁ దెలిసి
పలుకువారల నేమని తలఁపవచ్చు.
| 13
|
సీ. |
నారంబు జలమయనంబుగాఁ గలుగుట
సకలలోకంబులు సన్నుతింప
అక్షరము[2] జలౌఘమంతయు నారమౌ
నది యయనంబుగా నచ్చుపడుట
సరుఁడు విష్ణువు తజ్జనవరులు నారులు
వా రయనంబుగా వరలికొనుట
సకలచరాచరలోకములు నారములు వాని
కయనమై సౌభాగ్య మంటికొనుట
|
|
తే. గీ. |
జ్ఞానశక్తిబలాదికషడ్గుణములు
నారములు వాని కయనమై నయము గనుట
అమృతమూలంబు నారాయణాహ్వయంబు
నిర్వచింపంగఁదగుఁ ద్రయీనియత మగుచు.
| 14
|
వ. |
వ్యూహంబునందు వాసుదేవునికి షడ్గుణంబు లెటువలె నుండు నటువలెనే
నారాయణాహ్వయంబునందును షడ్గుణంబు లుండు. సంకర్షణాది
భేదంబు గుణాభివ్యక్తిమాత్రంబు. జ్ఞానశక్త్యాదిషడ్గుణంబులచేతను
తద్భేదంబులైన కరుణాదులచేతను పరిపూర్ణుండై శ్రీమన్నారాయణుఁ
డయ్యె. విశ్వాంతర్యామి బాలజఠరంబున జగంబులువోలె షాడ్గుణ్యో
దరం బాశ్రయించి గుణకోటులు వర్తించు. మఱియును.
| 15
|
చ. |
జలనిధిశాయియైన మధుశాసనునాభిని దివ్యమై మహో
త్పల ముదయించె నందు వితతస్ఫురితాంజలియై వినమ్రుఁడై
కలిత శుచిస్మితుండయి యొకానొకబాలుఁడు పుట్టె నాల్గుమో
ములను జతుర్భుజప్రథితమూర్తికి నిట్లు తగున్ [3]జనింపఁగన్.
| 16
|
మ. |
అని యీరీతి దిశాంతరంబుల సమస్తామ్నాయముల్ చాట న
బ్జనివాసాంగన సత్కృపామృతరసస్తన్యంబుచే వృద్ధిఁ బొం
ద నిజప్రేమ నొనర్చె శౌరిదయయే తా నిట్లనైయుండెనో
యన నాబిడ్డని కిచ్చె నైహికసుఖం బాముష్మికశ్రేయమున్.
| 17
|
శ్రీహరి నాభికమలమునఁ జతుర్ముఖబ్రహ్మ ముదయించుట
వ. |
అనపాయినియగు నిందిరాదేవి ప్రార్థించిన నప్పరమాత్మ వొమ్మనిన
నతండును బాల్యంబున 'నో౽మో'మ్మని పలుక నయ్యాదిదంపతులు
నగిరి. అంత హరి నగుచు హరి యన్నవెనుక హరి యని పలికె.
అదియ యావర్తింపుచుండె. ప్రణవంబును, బ్రణవాద్యక్షరద్వయమును
“హరిః ఓమ్” అని యుచ్చరింప వేదంబున కాదిప్రణవం బయ్యె. ప్రణ
వంబునకుఁ గారణం బకారం, బకారంబున కర్థంబు పరబ్రహ్మంబగు
నారాయణపదంబు. ఇట్లు ప్రణవంబు పలుకు నాత్మజుం గృపాదృష్టిం
జూచి భగవంతుండు హర్షించి నాల్గువేదంబులు నర్థంబుతో నభ్యసింపఁ
జేసె. రహస్యం బెద్దియుఁ బ్రథమపుత్రునకుఁ బ్రియశిష్యునకు నెఱిఁగింప
రానియది లేదు గావున సర్వంబును బోధింపవలయునని యాశౌరి
శరీరంబు రథంబుగా నెఱుంగుము. జీవు లయ్యుగ్యంబులుగా నెఱుంగుము.
షడ్గుణంబులు గుణంబులుగా నెఱుంగుము. సర్వధర్మంబులయందు
స్వతంత్రుండగా నని తలంచి నన్ను నేసాధనంబును తద్బలంబునుంగా
నెఱుంగుమని బోధింప బ్రహ్మ సర్వజ్ఞుండై యష్టాక్షరప్రభావం బడిగిన
నష్టాక్షరమంత్రంబు శ్రుతిదృష్టిఁ జతుర్వర్గసాధనము.
|
|
ఓం నమో౽నారాయణాయ అను అష్టాక్షరమంత్రపుఁబ్రభావమును శౌరి బ్రహ్మ కుపదేశించుట
|
బహుమంత్రంబు లేల? బహుకర్మంబు లేల? ఈయష్టాక్షర
మంత్రం బసాధారణం బయ్యు సర్వమూర్తులయందును సాధారణంబై
సహస్రపర్యంతంబులైన మంత్రంబులలో నిదియ యుత్కృష్టంబు.
|
|
|
అన్నియు నీమంత్రంబునకే యనుకూలంబులగు. వ్యాపకంబులైన
మంత్రంబులు మూఁడింటిలో నిది యుత్కృష్టంబు. దీనియందు వ్యాప్య
వ్యాపకవిశేషావబోధంబు గలుగుం గాన విష్ణుగాయత్రియం దాద్యం
బీమంత్రంబు.
| 18
|
క. |
ఈమంత్రశక్తి సద్గురుఁ
డేముఖ్యుఁడు తెలుప నన్యుఁ డెఱుఁగునె తెలుపన్?
భూమిన్ జాత్యంధుఁడు దా
నేమేనియుఁ జూప నెఱుఁగునే యంధునకున్.
| 19
|
క. |
[4]విమలమగు శ్రీనివాస
త్వ మసాధారణము నాకుఁ దగునట్ల త్రయీ
సముదితనారాయణపద
మమిత మసాధారణంబు నయ్యె న్నాకున్.
| 20
|
క. |
నారాయణనామము జి
హ్వారంగమునందు నిలుపు నతనికి నపవ
ర్గోరుఫలము తన్మంతకు
నారయ మంత్రాంతరంబు లవి యేమిటికిన్.
| 21
|
క. |
నియతాత్ముఁ డగుచు భోజన
శయనాసనయానకర్మసమయముల మనః
ప్రియముగ నారాయణ యను
శ్రియఃపతిసమాఖ్య వినుతి సేయఁగవలయున్.
| 22
|
క. |
ఏతన్మంత్రరహస్యము
స్వాతి సృజించెదవు సకలజగదంతరముల్
ఖ్యాతిగ నధికారాంతం
బేతెంచిన నన్ను నాశ్రయించెదు మీఁదన్.
| 23
|
బ్రహ్మదేవుఁడు అష్ఠాక్షరమంత్రావృత్తిప్రభావముచే హరపురందరాదులగు దేవతలను సృష్టించుట
క. |
సారతరపరమమంత్రస
మారబ్ధావృత్తి పూని యబ్జభవుఁడు స
ర్వారంభోన్ముఖుఁడై తా
నారూఢస్థితిఁ బ్రపంచ మంత సృజించెన్.
| 24
|
క. |
అక్షీణశక్తిని విరూ
పాక్షుండన నొక్కపుత్రుఁ డతనికిఁ గల్గెన్
దక్షుఁడు హరిభక్తిరతుం
డక్షయవిజ్ఞానవైభవాధిక్యుండై.
| 25
|
వ. |
అంత విధాత పురందరాదిదివిజస్తుతుండై దేవదేవుండన వెలసిన
తనయునకు భవోత్తారకం బుపదేశించి వేదవేదాంతంబులు చదివించిన
నతం డైశ్వర్యంబు వహించి సర్వభూతంబులకు నైహికంబులు కృప
సేయుచునుండ సర్వదేవతలను సర్వఋషులను జతుర్ముఖుండు
సృజించె. బ్రహ్మ సృజించుటకు, విష్ణుండు నిల్పుటకు, రుద్రుండు
హరించుటకుఁ బాల్పడిరి. మఱియును.
| 26
|
క. |
వెలయఁగ దక్షాదులు పు
త్రులు గొల్వ సరోజభవుఁడు తోడ్తో లక్ష్మీ
లలనాధవపదసేవా
కలనాస్థితి నాచరింపఁగాఁ జర్చించెన్.
| 27
|
బ్రహ్మ శ్రీమన్నారాయణుని అర్చారూపమును సేవింపఁగోరుట
క. |
అంతం బద్మజుఁడు రమా
కాంతార్చారూపమహిమ గనుఁగొని సకలై
కాంతికధృతిఁ జెందెదనని
చింతించె నశేషతీర్థసీమలయందున్.
| 28
|
క. |
పులకించి మున్ను చూచిన
బలవన్ముని[5]మానధనముఁ బరమాత్మమదిన్
దలఁపుచు సారోపనిష
త్కులతిలకము మంత్ర మునిచి గురుమతి వెలయన్.
| 29
|
తే. గీ. |
శమితపాపౌఘమై శంఖచక్రముఖ్య
చిహ్నములు చేత వెలయు నాశ్రితశరణ్య
భాగధేయంబనాఁదగు పరమపురుషు
[6]హసితవేశాశరాప్తిఁ బద్మాక్షుఁ గాంచి.
| 30
|
శ్రీమన్నారాయణుఁడు సపరివారుఁడై దివ్యవిమానంబున బ్రహ్మకు దర్శన మొసంగుట
తే. గీ. |
కాహళీనాదమేదురకలకలంబు
దివ్యదుందుభిఘోషంబు దివిఁ జెలంగె
నుపనిషన్మయ[7]పాంచజన్యోరురవము
కర్ణములు నిండెఁ గల్యాణకారణముగ.
| 31
|
క. |
అమృతంబైన తద్ఘననా
దము వీనుల సోఁకునంతఁ దామరసభవుం
డమితజ్ఞానకళాయో
గము యోగము మానియుండెఁ గడువిస్మితుఁడై.
| 32
|
క. |
వెలయఁగ విష్ణువె ఫలమున్
ఫల మిచ్చు నతండు ననుచు భజియించెద ను
జ్జ్వలమతి నాతని నాతని
వలననె పొందెద నటంచు వాంఛించె మదిన్.
| 33
|
తే. గీ. |
అష్ట[8]దిఙ్మధ్యవివ్వృతంబైన దివ్య
మగు ప్రకాశంబు గాంచె నయ్యబ్జసూతి
పద పదమటంచు నంత నప్రాకృతజన
మంతరిక్షంబునందు మెండై చెలంగ.
| 34
|
సీ. |
వేత్రహస్తులు పురోవీథిఁ గోలాహలం
బొనరింపఁ దద్వైణికోత్కరములు
నన్యగాథలు మాని నారాయణుని నభో
భ్యంతరాళమున గానం బొనర్ప
వేత్రహస్తుండయి వివిధోరుసంభ్రమో
పేతుఁడౌ సూత్రపతీశుఁ గాంచి
చండప్రచండాదిసైనికుల్ తత్పార్శ్వ
భాగంబునఁ జెలంగ భక్తి గాంచి
|
|
తే. గీ. |
ఘనత గజసంహననగజక్రములునగు గ
జాననాదులు శేషాశనాప్తసఖుల
అబ్జజుం డాత్మనేత్రాష్టకార్చనైక
పాత్రుఁడై యుండి యీక్షించెఁ జిత్రమహిమ.
| 35
|
క. |
రుద్రానుకీర్తిభూషా
ముద్రాంకభుజాంతరున్ సమున్నతుఁ ద్రిజగ
ద్భద్రకరు నీశకార్యా
నిద్రాణోద్యోగుఁ బతగనేతం గాంచెన్.
| 36
|
క. |
వితతఫణామణినీరా
జితభగవత్పాదపద్మస్థిరతరభక్త్యా
ధృతివిభ్రాంతశిరస్కుని
శతకోటిసుధాంశుతేజుఁ జక్రిపుఁ గాంచెన్.
| 37
|
క. |
కమలావిభ్రమపాండుర
కమలంబనఁ బూర్ణశీతకరజనకంబై
విమలంబగు ధవళచ్ఛ
త్రముఁ గాంచెన్ జక్రిపై నుదగ్రత మెఱయన్.
| 38
|
క. |
విరజామరుదంకూరో
త్కరపరిశ్రుతి మాతపట్టికామండితమై
గరుడాంకమైన యాశ్రీ
హరి విజయధ్వజముఁ గాంచి హర్షము నొందెన్.
| 39
|
సీ. |
పరిఫుల్లమల్లికాభ్రాంతమిళింద మం
డలమండితంబై యనంతవిద్యు
దాకీర్ణమేఘజాలావృతంబైన చం
దంబున రాణించి తరుణనీర
జాప్తసహస్ర[9]తేజో౽తిదైన్యప్రద
హేమకళిక సూచితేశ తత్త
దైశ్వర్యవైభవంబై ముక్తిమార్గని
త్యావబోధకసకలాగమోద్గి
|
|
తే. గీ. |
రణరణత్కింకిణీ ఘనరవన మిద్ధ
బద్ధకరపుటసంస్తువత్పంచహేతి
కృతజయస్వనమై మహోన్నతి వసించు
హరినివాసంబుఁ గాంచె నయ్యబ్జసూతి.
| 40
|
తే. గీ. |
సత్యలోకస్థులైన యాసనకముఖ్యు
లంబుజేక్షణు గరుడాంకు నపుడు గాంచి
విస్మయము నొంది రత్యంతవివశు లగుచు
నంతకంతకు నానంద మంకురింప.
| 41
|
తే. గీ. |
అద్భుతం బంది లేచి యత్యంతహర్ష
సంపద వహించె నర్తించె సంభ్రమించె
భువనభూషణమైన యంభోజనేత్రుఁ
దద్విమానంబుఁ గాంచి యాతమ్మిచూలి.
| 42
|
వ. |
అంత నప్పద్మజుని విష్వక్సేనుండు విమానంబుముందఱ నిడుకొని
మన్నించి కమలారమణుండు తులసీమాలికామోదవాసనావాసితో
రస్స్థలుండు జగన్నాథుం డానందైకార్ణవంబు నిన్నుఁ [10]గటాక్షింప నరు
దెంచె భజింపు, మితండె నీకు సర్వస్వంబు, భవవార్ధితారకుండు. నీవు
చేసిన తపంబు ఫలించె నన, నగ్రంబున సేనాధిపతి నారాధించి కన్ను
లకు ఫలంబై యన్యోన్యసల్లాపంబు లాడుచు నిందిర కరసరోజంబు
లచేఁ బదంబు లొత్త స్ఫురత్కిరీటహారకేయూరమంజీరవిరాజ
మానంబై తదన్యమణిభూషణంబులచేత శోభిల్లి, చక్రాద్యాయుధంబుల
చేత విజృంభించి, వైజయంతీ[11]మాలికాభిరామణీయకంబునం గనుపట్టి
పద్మామణిపీఠంబైన శ్రీవత్సంబున రాణించి, పుండరీకధవళామ్నాయ
పుష్కరేక్షణపద్దతియై, రాకాశశాంకసౌభాగ్యపరిభావిముఖాంబు
జంబై, కంబుగ్రీవంబై, సువిస్తీర్ణకవాట[12]ఘటితోరస్కంబై, చతుర్భు
జంబై, యుదారాంగంబై, పీతకౌశేయవస్త్రంబై, సమస్తజగచ్ఛరణ్య
పదాంబుజంబైన యొకదివ్యతేజంబు వీక్షించి, తదాపాదమస్తకాంతర
సౌందర్యం బనుభవించి యాపంకేరుహోద్భవుం డిట్లని వినుతించె
నంత.
| 43
|
క. |
మ్రొక్కుచు భావింపుచు మదిఁ
జొక్కుచుఁ గీర్తింపుచున్ వసుంధరఁ జిందుల్
ద్రొక్కుచు హరిపాదాబ్జముఁ
జక్కఁగఁ దలఁదాల్చి పద్మసంభవుఁ డంతన్.
| 44
|
క. |
దూరమున కేఁగు పరువున
దూరంబున నుండి పరువుతోఁ జనుదెంచున్
సారెకుఁ బైవల్కల మొ
య్యారంబున [13]నెగురవైచు నానందమునన్.
| 45
|
వ. |
ఇట్లు సంతోషసంభ్రమపులకితసర్వాంగుండైన చతుర్ముఖునిం జూచి
హర్షించి కారుణ్యరసదీర్ఘికాదీర్ఘలోచనుండై భగవంతుఁ డనుగ్రహించు
నెడ దేవవిద్యాధరకిన్నరులు వినుతించిరి. అప్సరఃకాంత లాడిరి.
ఉత్తాలంబులైన తాలంబులచేతను, దళితాంబరంబులైన మర్దళంబుల
చేతను, నర్తకకరకంకణంబులచేతను, గంధర్వగానంబుచేతను,
సనకాది జయజయశబ్దంబులచేతను జగద్వలయంబు శబ్దాత్మకంబై
యుండె. విధాత పరమభక్తిమయి పులకించి యపౌరుషేయవాక్యంబు
లం బ్రస్తుతించె.
| 46
|
బ్రహ్మ శ్రీమన్నారాయణుని స్తుతించుట
తే. గీ. |
దేవ నారాయణ నమో౽స్తు తే రమేశ
వాసుదేవ నమో౽స్తు తే వరద సర్వ
లోకరక్ష నమో౽స్తు తే పాకవైరి
పూజ్యపాదాబ్జ [14]మాధవ భోగిశయన.
| 47
|
తే. గీ. |
కారణాయ నమో రక్షకాయతే న
మో నమో వరతే నమో మునిజనైక
కుశలదాయపరేశ వైకుంఠవాసి
నే [15]నమః శ్రీనివాసాయ నిఖిలశరణ.
| 48
|
శ్లో. |
అచ్యుతాయ నమస్తుభ్య మనంతాయచ తే నమః
శాస్త్రే సమస్తలోకానాం గోవిందాయ నమో నమః.
| 49
|
శ్లో. |
పరాయ వ్యూహరూపాయ విభవాయచ తే నమః
అంతర్యంత్రే నమస్తుభ్య మర్చారూపాయ తే నమః.
| 50
|
శ్లో. |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమో నమః
ధారకో౽సి సమస్తానాం జగతాంచ జగత్పతే!
| 51
|
వ. |
అని వినుతించి మఱియు నిట్లనియె.
| 52
|
ఆ. వె. |
మహిమ నీ వజాయమానుండవై జాయ
మానుఁ డవనఁ దగుట మది దలంపఁ
గర్మహేతుశక్తి గాదు ప్రాకృతశక్తి
నైనఁ గాదు సంశయంబు లేదు.
| 53
|
సీ. |
దేవతామానుజ తిర్యగాదులు నీవ
యాదిమమూర్తిత్రయంబునందు
నొకఁడవు నీవ యీయున్నయేమును నీవ
నీవును నీవ యీనిఖిలజగతిఁ
దలకొని యీక్షణధ్యానసంస్పృష్టుల
నలమత్స్యకూర్మవిహంగమాది
రూపంబుల జనించు నాపరాత్మవు నీవ
యీలోకములు నిర్వహింప నీవ
|
|
తే. గీ. |
యను యుగంబనఁ గరుణతో నవతరించి
యిట్లు విశ్వంబు నిలుపు వే ల్పెవ్వఁ డనఘ
దాసుఁడను నీకు నాకుఁ ద్వద్దాస్యమహిమ
వశ్యులైరి సుపర్వు లోవనజనేత్ర!
| 54
|
వ. |
అది గావున సర్వలోకనాథుఁడవు నీవే. సర్వవైదికకర్మంబుల నిన్నె
యారాధింపుదు. దేవతాపితృదేవతలు భవత్కంచుకపాయత్వంబు
వహించినవారలు. వైదికనమోవాక్యంబులు భవత్పదంబునందే
[16]పర్యవసించుచున్నయవి. రాజులకుం జేసిన నమస్క్రియలు వారవాణం
బులకుఁ [17]బ్రాపింపవు. కాన మోక్షాపేక్షులు నీకంటె నన్యుని సేవింపరు.
అధికారంబులు వ్యక్తంబులైన కర్మఫలంబు లొసంగంబూనినవాఁడవు
నీవే. ఏనును, శంకరుండును, నధ్వర్యసర్వదేవతలును ద్వదా
యత్తత నున్నవార మని చతుర్ముఖుండు విన్నవించినఁ బ్రసన్నుండై
భగవంతుండు నీవు యుగాయుతంబు పూజించెదవు, ఆమీఁదఁ బుత్రు
లచేఁ బూజింపఁజేయుమని యాన తిచ్చిన నట్లనే కావింపుచునుండె. అంత.
| 55
|
క. |
భావమున భగవదావి
ర్భావము గావించి నీవు పలికిన విని స
ద్భావమున నుండు మిల నా
భావజగురుఁ డిడినయట్ల పరిపాలించెన్.
| 56
|
సనత్కుమారునకు బ్రహ్మ శ్రీహరియర్చామూర్తి గలదివ్యవిమానం బొసఁగుట
వ. |
భక్తవత్సలుండైన భగవంతుండు జగం బేరీతి నానందంబుఁ బొందించె
నానతీవే యని [18]ఋషు లడిగిన నారదుం డిట్లనియె.
| 57
|
క. |
కలశాబ్ధినుండి యొకనాఁ
డలఘుండు సనత్కుమారుఁ డాసనకాదుల్
గొలువన్ నారాయణపద
జలజప్రవణుం బయోజసంభవుఁ గాంచెన్.
| 58
|
ఆ. వె. |
కాంచి మ్రొక్కి శిష్యగణములలోఁ బెద్ద
యాత్మజుండు మీకు [19]నతిదయావి
భాస! జ్ఞానభక్తివైరాగ్యదాయివై
యాత్మలోఁ గషాయ మణఁచి తిపుడు.
| 59
|
క. |
పొగడఁగ[20]
సర్వాంగాన్విత
నిగమాధ్యాపన మొనర్చి నిష్ఠానియతిన్
దగి కర్మబ్రహ్మవిచా
రగరిమ సంశయముఁ దీర్చి రక్షించితిగా.
| 60
|
క. |
పరమగురుండవు నీవే
యరయన్ గురుఁ డొకఁడు గల్గఁ డన్యుఁడు మాకున్
సురహస్యార్థములన్నియుఁ
బురుషోత్తమ! తెల్పితి వపూర్వప్రజ్ఞన్.
| 61
|
క. |
ఈతఱి నీవు భజించు స
నాతను లక్ష్మీసనాథు నారాయణు సం
ప్రీతిం బూజించెదఁ బు
ణ్యాతతమగు తద్విమాన మర్పించు దయన్.
| 62
|
క. |
అనిన క్షణమాత్ర మబ్జా
సనుఁ డూరకయుండి శేషశాయివిమానం
బనఘచరిత్రుండగు నా
సనత్కుమారునకు నపు డొసంగఁదలంచెన్.
| 63
|
చ. |
తలఁచి సనత్కుమారుని ముదంబునఁ జూచి విరించి నాకుఁ బు
త్రులు జనియింప రెందఱు బుధుల్ [21]ఘను లందఱలోన నీవు కే
వలముగ జ్ఞానభక్తిరసవాసన మించి సదామనంబులో
పలఁ బ్రియవృత్తి నుందు నిను బ్రహ్మవిదున్ వినుతింప శక్యమే.
| 64
|
క. |
సన్మతి నారాయణుఁ డా
జన్మధనంబై చరించు సాత్వికుఁడు తనూ
జన్ముఁడు వంశమహాపా
పోన్మూలనకరుఁడు పొగడ నొరులకు వశమే.
| 65
|
తే. గీ. |
అని విమానంబుఁ బ్రియతనూజార్పితంబు
సేయ నూహించి యొకయింతచింత నొందఁ
బుండరీకాక్షుఁ డాశ్రితపోషకుండు
పల్కుల సుధారసము చిల్కఁ బల్కె నపుడు.
| 66
|
క. |
ఏల విషాదము నొందెదు
బాలక! యిది యిమ్ము పరమభాగవతసభా
మౌళిమణికి నీ కిత్తు ద
యాళుత నొకదివ్యవిగ్రహముఁ గొను మింకన్.
| 67
|
శ్రీహరి తనయర్చామూర్తిని మఱియొకదానిని బ్రహ్మ కనుగ్రహించుట
తే. గీ. |
అనుచుఁ గమలాగళాభరణాంకశాలి
యైన నిజకరమున నిచ్చె నాత్మదివ్య
విగ్రహముఁ బద్మజునకు నావిగ్రహంబు
చక్కఁదనమునకై యాత్మఁ జొక్కె నలువ.
| 68
|
తే. గీ. |
అందుకొని [22]శ్రీమహీమోహనాభిరామ్య
శాలి నాదేవుఁ గొల్చె నాజలజభవుఁడు
వాణి సావిత్రియు నొసంగు వళితలలిత
కలితకంజాతమాలికల్ [23]గట్టవైచి.
| 69
|
బ్రహ్మ యానతిచే సనత్కుమారుఁడు శ్రీహరి దివ్యవిమానమును యాదవాద్రికి తెచ్చుట
వ. |
అంత సనత్కుమారునిం జూచి విరించి యిట్లనియె.
| 70
|
సీ. |
కలదు సహ్యగిరి విఖ్యాతమైనయది పు
ణ్యతరం బనాది, తదాకరమున
శ్వేతమృత్తిక విలసిల్లు నచ్చట నీవి
మానంబు నిల్పు మనూనమహిమ
నారాయణపదాబ్జపారాయణుండవై
వఱలు శ్రీవైకుంఠవాససౌధ
ముననుండి తానె వచ్చినయది యతిపావ
నము, వేదనిందక నళిననేత్ర
|
|
తే. గీ. |
భక్తి విరహిత, నాస్తిక, భాగవతవి
దూష కాత్యంతదుర్దోషదుష్టమతుల
నీవిమానంబుఁ జూడరానీక భక్తి
నందు వర్తించుమీ కుమారాగ్రగణ్య!
| 71
|
తే. గీ. |
నవ్యవైభవమున నాసనత్కుమారుఁ
డాదిదేవు, సనాతను, నజు, నగమ్యుఁ
జెంది యుప్పొంగి కనకాద్రిశిఖరసీమ
కరుగుదెంచె నిరంతరాహ్లాదుఁ డగుచు.
| 73
|
క. |
అనుపమదివ్యవిమానము
మననపరుం డాసనత్కుమారుఁడు గొనిరాఁ
గనకాచలశృంగంబుల
నినకోటిసహస్రకాంతు లెల్లెడ మెఱసెన్.
| 74
|
సీ. |
అప్సరఃకాంతలు నమరులు ననిమేష
నేత్రసాఫల్య మెన్నిక వహించి
హరివిమానముఁ జూచి హర్షాశ్రుపూర్ణత
మ్రొక్కిరి నవ్యప్రమోదలీల
ఆవిమానమునకు నగ్రంబునను వాహ
నారూఢు లగుచు నింద్రాదిదివజ
గంధర్వకిన్నరఖచరవిద్యాధర
సాధ్యులు నలువంక సవటి గొలువ
|
|
తే. గీ. |
నడుచునప్పుడు గాన్పించె నవ్యశార
దాంబుధర శుభ్రరూప శౌర్యాద్రిరాజ
మందునుండి యుమాజాని యరుగుదెంచి
యెదురుకొని వందన మొనర్చి యిచ్చ నలరి.
| 75
|
దివ్యవిమానస్థుఁడైన శ్రీహరియర్చామూర్తిని శివుఁడు స్తుతించుట
వ. |
కల్పాంతనర్తకుండైన హరుండు నర్తించి యిట్లని వినుతించి.
| 76
|
సీ. |
[24]ఆహా! జగన్నాథ! యరవిందలోచన!
యరుదేర నినుగంటి నాత్మ చల్ల
నయ్యె నేత్రాంబురుహంబులు వికసనం
బయ్యె నోస్వామి! తారాళి యెంచ
వచ్చిన ధారాళవర్షబిందువు లెంచ
వచ్చిన సికతాలవంబు లెంచ
వచ్చినదేవ! భవన్నాభినీరజ
నీరజసంభవానీకములు గ
|
|
తే. గీ. |
ణింప శక్యమే షాడ్గుణ్యనిధివి నీవ
విశ్వకారణమును నీవ విశ్వలోక
సత్తముండవు నీవ ప్రసన్నముక్తి
దాయకుఁడ వీవ సకలసంధాత వీవ.
| 77
|
క. |
అకలంకమహిమ నాబ్ర
హ్మ కిట [25]నిఖిలప్రపంచమంతయుఁ గ్రీడా
ర్థకలితపుత్రకు లట్లనె
ప్రకటశ్రీ నుండు నీకుఁ బరమాత్మ! హరీ!
| 78
|
మ. |
నిగమాంతాధ్వమహావబోధ నిధయే నేత్రే సుధీపాలినే
భృగుజాపీనపయోధరాంక [26]మకరీస్ఫీతాంసయుక్తాయతే
జగతీశాయ కృపాబ్దయే౽విత తురాసాహే నమస్తే నమః
త్రిగుణాతీత గుణాయ సాధుసుమనోధిన్యై నమస్తే నమః.
| 79
|
వ. |
అని కమలనేత్రుఁ, గారుణ్యపాత్రు, శరణాగతసర్వస్వచరణు, నిందిరా
భరణు వినుతించి వెంటనంటి యలకాపురప్రాంతంబున కరుగుదెంచి
నిజశ్రవణభూషలైన వైశ్రవణభాషలం జొక్కి నిల్చె, నంత నైహిక
పరమపదంబై, మునిసమాకీర్ణంబై వెలయు బదరికాశ్రమంబుఁ జొచ్చి
మునిరూపంబులనున్న నరనారాయణుల సన్నిధానంబున సనత్కుమార
ప్రముఖమునీంద్రులు తద్విమానంబు నిలిపి రంత.
| 80
|
శా. |
ఆనారాయణుఁ డమ్మహాశ్రమమునం దత్యంతమోదంబుతో
శ్రీనాథున్ దివసత్రయం బపుడు పూజించెన్ దదంతస్థులౌ
మౌనుల్ వచ్చిన మౌనులున్ సురలు నామ్నాయంబులన్, సంతత
ధ్యానం బొప్పఁగ బాహ్యదేశముల నత్యంతంబు సేవింపఁగన్.
| 81
|
వ. |
అంత బదరికాశ్రమంబు వీడ్కొని చని.
| 82
|
సనత్కుమారుఁడు యాదవాద్రిపై శ్రీహరిదివ్యవిమానంబును నిలుపుట
తే. గీ. |
అపుడు సర్వోత్తరం బగు నద్రి యొకటి
దక్షిణాశావిభూషయై తనరు తులసి
కాననావృతయై యున్నఁ గాంచి నలువ
తెలియఁజెప్పినజాడయై తెలివి గాంచి.
| 83
|
క. |
ఇది దివ్యధామనగ మని
మదిలోఁ గనె నాసనత్కుమారుఁడు హర్షం
బొదవన్ సేనాని వినుత
మిది శేషుఁడు నిదియ హరియు నిదియే యనుచున్.
| 84
|
వ. |
తత్పర్వతశిఖరమధ్యంబునఁ దీర్ఘనిషేవితంబైన యొకదివ్యతీర్థంబుఁ
గాంచి యది మహాస్థానం బంచు సర్వేశ్వరుండగు శ్రీహరి నారాధించెద
నని తలంచి తత్తీర్థతటంబునన్ బ్రహ్మార్చితంబైన విమానంబు నిల్పె.
మున్ను ధాత పూజించునెడఁ బంచలక్షయోజనప్రమాణంబగు తద్విమా
నంబు పంచపురుషమాత్రారూపంబునం గాననయ్యె. భగవంతుండును
స్వలీలచే భక్తపరతంత్రుఁడుఁ గాన తదంతఃపరిమితరూపంబునం
గాననయ్యె. ఆయుధంబులును, దివ్యభూషణంబులును విస్తారంబులు
దక్కి [27]తద్రూపానురూపస్వరూపంబులం గాంచె. అంత.
| 85
|
సీ. |
ఆవిచిత్రతఁ జూచి యౌర శ్రీనారాయ
ణాదిదేవుఁడు జగదద్భుతముగ
అప్రమేయప్రమేయాకారముల రెంటఁ
గనిపించె ననుచు వల్కలము లంతఁ
పొడవుగా నెగవైచి పొగడి నర్తింపుచు
వల్గనములు చేసి వందనములు
గావించి యిది యహో! కల్యాణ మిది యహో!
కల్యాణ మఖిలలోకము లెఱుంగ
|
|
తే. గీ. |
వచ్చి వైకుంఠనగరనివాససీమ
నుండి మమ్ముఁ [28]గటాక్షింప నుత్సహించె
ననుచుఁ దత్రత్యు లానంద మంది పలుకఁ
దేజము వహించెఁ గల్యాణతీర్థ మచట.
| 86
|
తే. గీ. |
తద్విమానస్థుఁ డగు రమాధవుని, విష్ణుఁ
బ్రాఙ్ముఖంబుగ నిలిపి [29]తత్పాంచరాత్ర
విధి సమర్చన మొనరించి విబుధతతికిఁ
బాదతీర్థం బొసంగెఁ దద్భక్తి మెఱసి.
| 87
|
వ. |
హర్షించి సాష్టాంగదండప్రణామంబు లాచరించి కోటీరరత్నమరీచి
పూరంబుచేఁ దోరంబుగా భగవత్పాదపీఠికానీరాజనంబు లాచరించిన
భగవంతుండు సుధామనోహరంబులగు నపాంగంబుల నీక్షించి మధుర
వాక్యంబుల.
| 88
|
కల్యాణతీర్థోత్పత్తి
మ. |
ఘనత న్మించు వరాహరూపమున నీక్ష్మామండలం బెత్తి యం
బునిధిన్ గ్రుంకి కలంచి లేచునెడ [30]నాపుణ్యోదబిందుచ్ఛటల్
గననయ్యెన్ జగముల్ నుతింప విలసత్కల్యాణతీర్థంబు పా
వన మాద్యంబు సమస్తతీర్థనిచయావాసంబు చర్చింపఁగన్.
| 89
|
సీ. |
ఊర్ధ్వకామతఁ దగి యూర్ధ్వరేతస్కులై
యజ్ఞవరాహరూపాస్మదర్చ
నాతిశయప్రాప్తి నందెడువారికి
నూర్ధ్వపుండ్రవిధాన మొప్పఁజేయఁ
బక్షికులాధీశుఁ బనిచిన నతఁడు శ్వే
తద్వీపమున నుండి ధవళమృత్తి
కాకర్దమముఁ దెచ్చి కల్యాణతీర్థప
శ్చిమభాగమున గనిచేసి నిల్పెఁ
|
|
తే. గీ. |
గాన యిది మృత్తికలకు నగ్రణి సమస్త
దేవతామూర్తి కల్యాణతీర్థమున ము
నింగి యీశ్వేతమృత్తికనిటల[31]తటిని
నునుప ననుపమమైన సాయుజ్య మమరు.
| 90
|
వ. |
ఈకల్యాణతీర్థంబున మునింగి యధికారానురూపంబుగా నను భజించిన
వారు మత్ప్రసాదంబున నిఖిలమనోరథంబులు నొందఁగలరు. ఈ
కల్యాణతీర్థతీరంబునఁ బైతృకక్రియలు గావించినఁ బితృగణంబులు
[32]హర్షించు పుణ్యపరవృత్తి నధ్యాత్మగుణసంపత్తి నపవర్గపరాయ
ణులై పెక్కండ్రుపుత్రులం బడయఁగలరు. ఈకల్యాణతీర్థతీరం
బున యజ్ఞంబుఁ జేసిన సహస్రగుణంబగు పుణ్యంబు సంభవించి యప
వర్గంబు గాంతురు. ఈకల్యాణతీర్థంబున నిష్కాములై నన్ను సేవిం
చినయేని యభీష్టంబు లొసంగుదు. ఈకల్యాణతీర్థతీరంబున
దానంబుఁ జేసినఁ జతురార్ణవీపరిమితమహీతలం బేలుచుఁ జక్రవర్తియై
పుత్రపౌత్రాభివృద్ధిగా వర్ధిల్లు. ఈకల్యాణతీర్థగర్భంబున వ్రతంబు
లాచరించిన బ్రహ్మలోకంబున బ్రహ్మతో ననుమోదించుచు నుంద్రు.
ఈకల్యాణతీర్థంబునఁ గోరిన కోరికలన్నియు మత్ప్రసాదంబున ఫలి
యించు. ఫాల్గుని ప్రశస్తంబు గాన నాఫాల్గునియందు సర్వధర్మంబులు
గావించి మీ రచ్చటికిం జనుదెం డనిన రుద్రముఖ్యత్రిదశాధిపులు భగవ
ద్వాక్యంబులు విని నిజస్థానంబులకుం జనిరి. అంత.
| 91
|
సీ. |
సనకాది ఘనయోగిజనవర్యులేను వె
న్వెంట రా నిందిరావిపులతరప
యోధరమకరికాయుక్తభుజాంతరు
వరదైవ మని యాత్మ నిరవు చేసి
పరిమితచ్ఛలచింతఁ బాసి నిరంతర
పరభక్తినియతుఁడై పద్మజాత
తనయుఁడు సేవించి తద్గిరిసంవాసి
సకలజనానీకసారదివ్య
|
|
తే. గీ. |
వర్యసిద్ధాంజనత్రిభువనవిచిత్ర
సుకృతపాకంబు, నకృతకసూక్తి గమ్య
పరమహేశాను యదుగిరీశ్వరు నిజాత్మ
యందు భావించి హర్షించె నద్భుతముగ.
| 92
|
వ. |
అంత నామునీంద్రులందఱు బదరికాశ్రమంబుననుండి నారదవాక్యంబు
విని యోమహాత్మా! భగవత్సమాగమకీర్తనంబు విని ధన్యుల మైతిమి.
శ్వేతమృత్తికాప్రభావంబును, గల్యాణతీర్థంబునకు గంగాతీర్థంబుల
కంటె నాధిక్యంబు గలుగుటయు, వరాహరూపవిష్ణుసన్నిధియుం జెప్పి
తివి. విస్తరంబుగా నానతీవే యని యడిగిన నారదుం డిట్లనియె.
| 93
|
కల్యాణతీర్థమహిమ — సుచరితుని కథ
సీ. |
వినుఁడు పురాతనవృత్తాంత మోమునీ
శ్వరులార యొకమహీసురవరుండు
సుచరితుం డనువాఁడు సుచరితుఁ డాతని
భార్య సుశీల శోభనసుశీల
సుమతి సువృత్తి నామములఁ బుత్రులు గల
రావిప్రమణికి నాయనఘమూర్తి
సకుటుంబుఁడై కాంచె సకలతీర్థంబులు
సకలపుణ్యస్థానచయము సకల
|
|
తే. గీ. |
పరమపుణ్యాయతనములు పాండురంగ
బదరికాశ్రమరంగ శోభన మహీధ్ర
సింహనగ కూర్మనీలాద్రి సేత్వనంత
శయన గోకర్ణ నైమిశాశ్రమ ఫణీంద్ర
శైలకాంచి కురుక్షేత్రసార మరసి.
| 94
|
వ. |
అంత జాహ్నవీ కావేరీ యమునా తుంగభద్రా తామ్రపర్ణీ సరస్వతీ
శోణా గోదావరీ నర్మదా పయస్వినీ కృతమాలా ముఖ్యనదుల నవగా
హించి యొకనాఁడు నారాయణగిరిఁ జేరి కల్యాణతీర్థంబున మజ్జనం
బాచరింపక పిదప గంగకు నేఁగి గంగం గానక యెచ్చట నున్నయది
యని తత్రత్యుల నడిగిన వారు హరచూడావిభూషణయైన గంగం
గానవా యన నెంత నిర్భాగ్యుండ. అగ్రంబున నున్న గంగాప్రవా
హంబుఁ గానక యున్నవాఁడ. ఏదుష్కృతం బొనరించితినో యని విషా
దంబు నొంది హరిపాదతరంగిణిం [33]బ్రార్థించుచుఁ జింతించుచున్నంత
[34]నీలోత్పలశోభనయైన యొకకన్యారూపంబునఁ దాను భాగీరథి వచ్చి
బ్రాహ్మణోత్తమా! యేల దుఃఖించెద వని యడిగిన నతం డిట్లనియె.
| 95
|
క. |
సురనదిఁ గానక యంతః
కరణంబున దుఃఖ మొంది కలఁగెద యత్నాం
తరవిఫలతకంటెఁ దదు
త్తరదుఃఖము వేఱె కలదె తామరసాక్షీ!
| 96
|
వ. |
అని విన్నవించిన గంగ పాపకర్ములకుం గానఁబడ దనిన బ్రాహ్మణుం
డేను పాతకి నైతినేని మోక్షోదయంబును సుఖంబును లేదు. ఆమోక్షో
దయంబును సుఖంబును, హరిపాదనదినేని సేవించి పాపసంక్షయంబు
చేయక లభించ దనిన గంగ యిట్లనియె.
| 97
|
కల్యాణతీర్థమహిమను గంగానది సుచరితునకు చెప్పుట
శా. |
గంగావాహిని నేను నాసఖియ యీకల్యాణి కాళింది స
త్సంగం బొప్పఁగ సర్వతీర్థనికరస్నాతుండవై పుణ్యరే
ఖం గాన్పించిన యాదవాచలమునన్ గల్యాణతీర్థంబునం
దుం గీర్తించి మునుంగవైతి వది దుర్దోషంబు నీ కిట్లగున్.
| 98
|
తే. గీ. |
ధరణి నిటువంటి పుణ్యతీర్థం బతిక్ర
మించు దుష్పాతకమునకు మేర గలదె?
తీర్థములరాజు కల్యాణతీర్థ మింక
నీ కెఱింగింతు విను మతినిష్ఠఁ బూని.
| 99
|
మ. |
హరిపాదాబ్జమునందుఁ బుట్టి నదులం దాధిక్యముం జెందితిన్
హరిభూదారశరీరసంజనిత[35]సర్వాంగీణవాఃపూర మా
వరతీర్థంబు తదద్రిపై వెలసె భవ్యశ్రీల నారాయణుం
డురుతేజంబున నుండుఁ బ్రేమ రమతో యోగీశ్వరుల్ గొల్వఁగన్.
| 100
|
వ. |
అట్లౌటఁ దత్కల్యాణతీర్థంబు నాకంటెఁ బరమపవిత్రంబు.
| 101
|
సీ. |
చాంద్రసరోవరస్థలమునఁ జైత్రంబు
నం దనంతసరోవరాంతరమున
వైశాఖమునను బావనమైన తుంగభ
ద్రామహాతటినీహ్రదంబునందు
ఆషాఢమున నభస్యంబున స్వామిపు
ష్కరిణిలోఁ దులయందుఁ గంజహితుఁడు
వఱలఁ గావేరిప్రవాహంబునందు ఫా
ల్గుణమాసమునఁ గోటిగుణము మించు
|
|
తే. గీ. |
నట్టి కల్యాణతీర్థంబునందు నపుడు
సర్వనదు లుండు నందున సర్వఫలము
హరిపరాయణు లం దుండ్రు పరమనియతి
సకలతీర్థంబు లచ్చోట సంచరించు.
| 102
|
వ. |
అనిన విని విస్మయం బంది నిజరూపంబుఁ జూపుమని విన్నవించిన
దూరదేశంబు తిరిగి యలసినవాఁడ నడువ శక్తుండఁ గాను పుత్రులు
శిశువులు. నీవే కల్యాణతీర్థంబవై ప్రవహింపుమని బ్రాహ్మణుండు
మ్రొక్కిన యమునం జూచి నగి యాదరంబున నిలిచి యుత్తుంగ
తరంగయై యున్న యాతరంగిణిం బ్రార్థించిన నన్నుఁ గల్యాణతీర్థంబుగాఁ
ద్రిరావృతంబుగా నుచ్చరించి మత్ప్రవాహంబున నవగాహనంబు
గావించిన నభీష్టంబు లభించునని యానతి యిచ్చిన నట్లనే బ్రాహ్మణుం
డొనర్చి మునింగిన యదుశైలంబును, గల్యాణతీర్థంబును, దత్రత్యులగు
మునులును గానుపించిన విస్మయము నొందె. అంత నీ వెవ్వరు? నీ విచ్చటి
కెట్లు వచ్చితి వని యడుగు మునులకు నిజవృత్తాంతంబుఁ దెలిపి యీ
స్థానం బెయ్యది యని యడిగిన వారలు యదుశైలం బని యానతి యిచ్చిన
నానందంబు నొంది శ్రీమన్నారాయణుని సేవించి తన్మహానగంబు నిజ
నివాసంబుఁ జేసికొని, నివేదితాన్నంబును భుజించుచు నచ్చట నారాయ
ణుం డను నొకపుత్రునిం గని యపరిగ్రహయావల్లబ్ధోవజీవనుండై
యాబ్రాహ్మణుండు.
| 103
|
క. |
నారాయణుఁ డను నతఁ డం
భోరుహదృగ్భుక్తశేషభోజనుఁ డై స
త్వారూఢి జనులు మెచ్చఁగ
శ్రీరమణీనాథుసేవ సేయుచునుండెన్.
| 104
|
తే. గీ. |
అశ్మవర్షనిపాభిహతసమస్త
సస్యసంపత్సమృద్ధియై జగతియందుఁ
బొడమె దుర్భిక్ష మొకయేఁడు పూర్ణమగుచు
ధూమకేతువు చిందులు ద్రొక్కఁదొణఁగె.
| 105
|
వ. |
అప్పు డతనిభార్య సుశీల సుచరితుం జూచి యిట్లనియె.
| 106
|
సీ. |
శిశువుల సతిని రక్షించుట నీతి వా
స్తవ్యున కెట్టిదుష్కార్యకరణ
మేని కావించి స్త్రీత్వానర్థచాపల
ఫణితిఁ బల్కితిఁ గాని పల్కఁదగదు
సకలధర్మజ్ఞుండ వకట నీ వెఱుఁగని
ధర్మంబు లేదు భూతలమునందు
ద్రవిడదేశం బేలు దారిద్ర్యవారణుం
డనురాజు వేఁడిన యంతకంటెఁ
|
|
తే. గీ. |
దెలివితో నిచ్చు ననుచు బోధింపఁ దనయ
సహితుఁడై పోయి యారాజుసభను డస్సి
యతఁడు కార్యవశంబున నంపకున్న
దైన్యమునఁ గొన్నినా ళ్లందుఁ దల్లడించి.
| 107
|
ఆ. వె. |
అంతఁ గొంతసొమ్ము హస్తగతం బైనఁ
జోరు లధ్వసీమఁ జుట్టుముట్టి
లగుడ ఘాతశక్తి నొగిలించి దోఁచి రా
[36]విడుపు నంతఁ గ్రుస్సి విప్రవరుఁడు.
| 108
|
సుచరితునికొడుకు నారాయణు డనుబాలుని వ్రతనిష్ఠ
వ. |
వచ్చుచు నారాయణదేవుని విడిచివచ్చిన పాపఫలంబుతోడనే సిద్ధించె
నని పుత్రకులకుం జెప్పుచు నిజనివాసోన్ముఖుం డయ్యె. అంత.
| 109
|
సీ. |
[37]ద్రవిడేశుఁబొడ గనఁ దండ్రియన్నలుఁ బోవ
మాతులగృహమున మాతతోడ
ఆకట డస్సి శ్రమార్తుఁడై నారాయ
ణాఖ్యుఁడు చేరి భోజ్యంబు వేఁడ
అన్నంబు తల్లి పత్రాంతరమున నిడ
ననివేదితంబని యారగింప
ననిన నీవే నివేద్యము సేయుమట్లన్న
ననుమతి గావించి హరికి నొసఁగి
|
|
తే. గీ. |
యతని భుజియింపుమని మ్రొక్కి యంబుజాన
నార్పితోరుచతుర్విధాహారములు తృ
ణీకరించి భుజించె నాలోకవిభుఁడు
సంయమివరేణ్యులందఱు సంస్తుతింప.
| 110
|
వ. |
ఇట్లు భుజించిన పాత్రంబున సిక్థంబును లేక యుండ బాలుండును
హర్షించి తల్లికడ కేఁగి యన్నంబు వేఁడిన మునుగొని చనిన నివేదితా
న్నం బేమి యయ్యెననిన నీశ్వరుండు భుజించెననుట విని మార్జాలాదుల
కప్పగించి భగవంతుండు భుజించెననుట యుక్తంబే యని తర్జించి బిక్షాట
నంబు సేయుమని పాత్రం బిచ్చిన.
| 111
|
సీ. |
ఏగృహంబున కతఁ డేఁగిన నిందిర
యాగృహంబున కపు డరుగుదెంచి
దర్విచే భైక్ష్యంబుఁ దయ నొసంగిన నది
రత్నమయంబయి ప్రబలభార
సారమైయున్న నశక్తుఁడై హస్తద్వ
యంబునఁ దత్పాత్ర మట వహించి
శిరమునఁ బూని యాశిశువు తల్లికి నప్పు
డర్పింపఁ దత్పాత్ర మంది కాంచి
|
|
తే. గీ. |
[38]యేడుమా ర్లిట్ల యిచ్చె రమేందువదన
యెనిమిదవమాఱు ఘనమౌ నిజేష్టపాత్ర
మొకటి యిచ్చి కుమార! నీ వేఁగు మనుచుఁ
దల్లి యనిచిన వచ్చు పుత్రకునిఁ జూచి.
| 112
|
వ. |
దివ్యాన్నభైక్షంబు [39]వెట్టి లోకమాత యనుగ్రహించి యనుపవచ్చిన సుశీల
తానును దత్సుతుండును భుజించి హర్షించి రత్నంబులు గాంచి యక్కు
మారుం బ్రశంసించుచు ధనరక్షార్థంబుగా మేల్కనియుండె. అంత
సుచరితుండు చోరభగ్నాంగుండై యాఁకటం గృశించి పుత్రులతో
గృహంబునకు వచ్చుచుండె. అట్లు వచ్చు తనభర్తం గాంచి లజ్జితయై
నలి యెదుర్కొని.
| 113
|
క. |
సర్వాంగీణవ్రణుఁ డై
దుర్విధుఁడైయున్న మగనితో వేగమె యం
తర్వేదన దొలఁగఁగఁ గుల
నిర్వాహకుఁడైన సుతుని [40]నే ర్పెఱిఁగింపన్.
| 114
|
సుచరితుఁడు పశ్చాత్తప్తుఁడై కల్యాణతీర్థంబున తపస్సు చేయుట
సీ. |
ఎంత మూఢుండ నే నిందిరాసహితుఁడై
పత్రపుష్పఫలాంబుభక్ష్యములు ని
వేదితంబులు సేయ మోదించి సర్వస్వ
దాయియై యున్న నారాయణుని వి
సర్జించి యన్యదేశములకు నేఁగి య
త్యల్పజనంబుల నాశ్రయింపఁ
దగునె కృష్ణఘనుండు తతకృపారసములు
గురియంగ నన్యభిక్షుకుల వేఁడఁ
|
|
తే. గీ. |
దెలివి లజ్జాభిమానవృత్తినిఁ జరింప
నున్న నాకు నమస్కృతు లొక్కటైనఁ
జేయఁగా నర్హమని యాత్మఁ జింత నొంది
సుచరితాహ్వయవిప్రుఁ డచ్చోట నిలిచి.
| 115
|
వ. |
నారాయణభజనంబు సేయుచుం దనయుండగు నారాయణునకు వేద
శాస్త్రోపదేశంబులు గావించి లక్ష్మీప్రసాదలబ్ధసంవత్సమృద్ధిచే సదా
చారసమన్వితుండై ప్రియయుం దానును గల్యాణతీర్థంబునఁ దపంబు
సేసి యచ్యుతుని మెప్పించి సహస్రగుణితంబులుగా బ్రాహ్మణులకు
|
|
|
భోజనంబులు గావింపుచునున్న యాబ్రాహ్మణుని ధనవంతుడని
చోరులు ప్రచ్ఛన్నవేషధారులై ముగురు లలాటంబున, నితరాంగంబుల
ద్వాదశోర్ధ్వపుండ్రంబులు గావించుకొని నారాయణ నారాయణ
యనుచు, విష్ణుభక్తులం గనినఁ బ్రణమిల్లుచు వచ్చువారిం జూచి సుచరితుండు
భుజింపఁబెట్టిన విష్ణునివేదితాన్నంబులు భుజించి నారాయణపదాంభోజ
తీర్థపానం బొనర్చి కృతార్థులు నైనవారలందఱకు మనంబున [41]సర్వోత్త
రంబైన సాత్వికత్వ ముదయింప సాత్వికులై యేము చోరులము. భవ
ద్ద్రవ్యాపహరణంబునకు వచ్చినవారము. వేషమాత్రంబు చూచి యుపచ
రించితి వనిన నగి, యస్మత్కులధనంబు నారాయణాహ్వయంబు. ఆ
ద్రవ్యం బెవ్వరు హరింప సమర్థులు? అనిన విని సంతోషాశ్రుతరంగం
బులతోఁ బులకించి వందనం బాచరించి పరమపదప్రాప్త్యుపాయం బుప
దేశింపు [42]మనిన నాతఁ డట్ల కావింప వారు నైష్ఠికులై దేహావసానంబునఁ
బరమధామంబు నొందిరి అంత.
| 116
|
తే. గీ. |
సుచరితాత్మయుఁ డంత నస్తోకమహిమ
పుత్రపౌత్రసతీమిత్రపూర్ణభోగ
మంది నారాయణాంఘ్రిపరాయణాత్ముఁ
డగుచు వైకుంఠమందిర మందెఁ దుదకు.
| 117
|
క. |
ఈసుచరితు సుచరిత్రం
బాసక్తిన్ విని పఠించి హర్షించిన ల
క్ష్మీసఖతుల్యకుమారుల
చే సంతతి నిల్చి యుల్లసిల్లుదురు తుదిన్.
| 118
|
క. |
ధనధాన్యసంపదల్ గలు
గు నపారముగా సుచరితగుణసంతతికీ
ర్తన వారికి మఱి సద్గృహ
మున కేఁగిన నరుల కగును మురజిత్పదమున్.
| 119
|
వ. |
అనిన నమ్మునీంద్రులు సంతోషోత్ఫుల్లచేతస్కులై మునిశార్దూలుం
డగు నారదుం జూచి కర్ణంబులకు నమృతప్రవాహంబుగాఁ బల్కితి
వింక నొక రహస్యంబు తెలుపుము. వాసుదేవకథాప్రసంగంబు సేయ
నీకంటె నెవ్వఁడు నేర్చుననిన యుక్తకాలప్రశ్నకరులగు మీచేత లోచన
పారణయగు రూపంబున నాతలంపునఁ బొడమెనని యానారదుం
డిట్లనియె.
| 120
|
శ్రీరామచంద్రుఁడు సీతాలక్ష్మణసమేతుఁడై యాదవాద్రిస్వామిని పూజించుట
సీ. |
హరిభక్తినియతాత్ములైన మీ రవధాన
మున వినవలయుఁ బ్రమోదమంది
యొకపుణ్యకథ మహాయోగులు మీ రెఱుం
గనియది లే దైనఁ గరుణ గలిగి
యడిగితి రిట యాదవాచలసీమఁ బ్ర
శక్తి నారాయణార్చన మొనర్చి
కాకుత్థ్సవంశశిఖామణియైన శ్రీ
రామచంద్రుఁడు జగద్రక్షకుండు
|
|
తే. గీ. |
వనమునకు వచ్చి యొకనాఁడు వసుమతీకు
మారియును లక్ష్మణుఁడు గొల్వ మహిమ మెఱసి
యమ్మహాగిరితటమున నధివసించె
నవ్యయానంద మాత్మలో నంకురింప.
| 121
|
తే. గీ. |
లక్ష్మణుం డన్నఁ జూచి యుల్లమున విస్మ
యంబు దలకొన స్వేతన్నగాగ్రసీమ
మానసోపమకాసారమౌళి యొకటి
భాసురంబయ్యెఁ జూడు మప్రాకృతంబు.
| 123
|
ఉ. |
[43]తత్తటియందు రత్నకలితంబగు దివ్యవిమానవీథి భా
స్వత్తులమై సమాభ్యధికవర్జితసుందరవిగ్రహంబుతో
నుత్తమలీలచేతఁ బురుషోత్తముఁ డొప్పుచు నున్నవాఁడు లో
కోత్తర లక్ష్మి నీవువలె నుల్లమునం గనుపట్టె నా కటన్.
| 124
|
తే. గీ. |
ఆశుభాకారకాంతివీక్షాభిలాష
మాత్మ జనియించెనేని రమ్మనిన రామ
చంద్రుఁ డపు డేఁగె జానకీసహితుఁ డగుచు
దివ్యతరమైన కల్యాణతీర్థమునకు.
| 125
|
సీ. |
పూర్ణిమాచంద్రవిస్ఫురితముఖాంబుజు
విలసితరత్నకుండలకలాపు
హారకిరీటకేయూరముఖ్యవిభూషు
సంచితవిమలాంజనాభదేహు
సర్వలోకాధికసౌభాగ్యసంపన్ను
భువనార్హభూషణభూషితంబు
నద్భుతాకారదివ్యాయుధపరివృతుఁ
దప్తకాంచనపరిధానశాలి
|
|
తే. గీ. |
నాదినారాయణునిఁ గాంచి యభినుతించి
వందనముఁ జేసి రఘువంశవల్లభుండు
భూమినందన యాకర్ణపూర్ణనిర్ని
మేషదృష్టి నిరీక్షించి నెమ్మి మ్రొక్కి.
| 126
|
తే. గీ. |
లక్ష్మణానీతకమలకల్హారకుముద
కుసుమములు దెచ్చి పూజించి కొన్నినెలలు
రఘుకులాధీశ్వరుండు నిరంతరంబు
సన్నిధానముల వసియింపఁ జక్రి యనియె.
| 127
|
తే. గీ. |
రాక్షసానీకబాహుదర్పం బడంచి
నీ వయోధ్యకు నేతేర నిఖిలయోగి
జనులు గొల్వఁగ నిజనివాసంబునందు
నుందు నీచేతఁ దగఁ బూజ లందికొనుచు.
| 128
|
వ. |
అని యనిచె నంతఁ జతుర్దశవత్సరంబులు వనంబున నుండి రామభద్రుండు
నిజనివాసంబునకు వచ్చి తనుం బాసి చనలేక విభీషణుండు పరితపింప
రంగశాయి నిచ్చి యీరంగశాయిని నన్నుంగా భావించి పూజింపుమని
యనిచె. విభీషణుం డేఁగిన రంగశాయివిరహవిషాదంబున రాఘవుండు
వైమనస్యంబు నొందఁ జతుర్ముఖుండు దివ్యవిమానం బెక్కి చనుదెంచి
రామచంద్రునిఁ జూచి పూర్వంబున నీవు నారాయణాచలంబునఁ బూజిం
చిన యచ్యుతదివ్యమంగళవిగ్రహం బున్నయది. తద్విగ్రహంబుఁ
బూజింపుమని చెప్పి ధాత నిజలోకంబున కరిగె. ఆరఘుపతి నగు
|
|
|
మోముతో సౌమిత్రిం బిలిచి నారాయణాచలంబుననున్న హరిమూర్తిం
దెప్పింపుమనిన సౌమిత్రి యాంజనేయునిం బిలిచి తద్గిరిప్రభావంబుఁ
దెలిపి నియోగించిన నాతఁ డచ్చటి కేఁగి సేవించి వచ్చి రాఘవస్వామి
చరణంబుల కెరగి యిట్లనియె.
| 129
|
శ్రీరామాజ్ఞచే హనుమంతుఁడు యదుగిరి శ్రీహరిని పూజించుచుండుట
క. |
ఈరూపము నారూపము
నేరు పఱుపరాదు, మొగము నీక్షణములు, నా
సారామృతశుభరేఖా
పారంపరి పొడవు దొడపు బాహుల నిడుపున్.
| 130
|
వ. |
అనిన రామభద్రుం డిట్లనియె.
| 131
|
తే. గీ. |
అనఘ నను గొల్చినట్ల యయ్యదునగేశుఁ
గొలువు నిరతంబు నత్యనుకూలభక్తి
నని నియోగింప నప్పు డాయనిలసూతి
యొనర నిప్పుడుఁ గొల్చుచు నున్నవాఁడు.
| 132
|
కనకమాలినీ యదుశేఖరుల కథ
వ. |
తద్విగ్రహంబుం దెప్పించికొని రామభద్రుం డనేకసహస్రోపచారం
బులు గావించి సేవించి పరమధామంబున కేఁగుచు హనుమంతుని
చేతికి నిచ్చె, నతండు కుశునకు నర్పించె, నాకుశుండు నజకులధనం
బునుం బూజించె. అంత నాకుశునకుఁ గంఠస్థకనకమాలికలతో నొక
కన్య జనియింప బాంధవులు కనకమాలిని యని పిలిచిరి. అంత.
| 133
|
తే. గీ. |
సుదతి సుకచ సునేత్రాంత సురద సుకర
సుముఖి సుభ్రూయుగ సుగంధి సురుచిరాస
సుకుచ సువలగ్న సుశ్రోణి సుదరహాన
ఘనసువర్ణాభ కనకమాలిని చెలంగె.
| 134
|
తే. గీ. |
హంసగామినిఁ, బద్మవిహాసిచరణఁ,
బక్వబింబాధర, లతాంగి, భర్మకాంచి
మధుర మధురోక్తినిపుణ రమాధవాంఘ్రి
సేవనాసక్తచిత్త నాచెలువఁ గాంచి.
| 135
|
వ. |
కుశుండు సంతసిల్ల నక్కన్య ధన్యయై నారాయణసేవఁ గావించె.
కుశలవు రిరువురును కుశీలవులతోఁ గూడి తత్స్వామిసన్నిధిని రామా
యణగానం బొనర్చుచుండిరి. అంత.
| 136
|
సీతారాములు కుశునకు స్వప్నంబున దర్శన మిచ్చుట
మ. |
అలసాపాంగవిలోచనంబులు సముద్యన్నవ్యవక్షోజకు
ట్మలముల్ పూర్ణనవీనసత్కళలు సమ్యఙ్మంజుశోణాధరాం
చలమున్ సాలవిలాససంపదయు మించం గంతుసమ్మోహనా
స్త్రలసద్దేవతవోలె నత్తరుణి సౌందర్యంబుతో మీఱఁగన్.
| 137
|
వ. |
ఆయింతికిం దగినభర్తను విమర్శించి కానక, కుశుండు నిద్రించునంత
భరతలక్ష్మణశత్రుఘ్నసమేతుండై రామభద్రుండును, జననియైన
జానకియుం గాన్పించిరి. కుశుండు కౌతూహలంబున బ్రణామంబు
లాచరించిన యంతఁ దారాధిపవరాననుండై రామభద్రుండు తమోప
హారులైన వచనంబులచే నాదరింపుచు యదుశేఖరుం డనువానికి నీకన్య
నొసంగుమనియె. జనకసుతయుఁ దండ్రి యొసంగిన ద్రవ్యం బక్క
న్యకకుఁ బరమప్రీతి కారణంబుగా సకలవస్తువులు నక్కన్యకకు
యౌతకంబుగా నిచ్చి యవ్వరున కర్పింపుమని యానతి యిచ్చె. ఇట్లాజ్ఞా
పించి వా రదృశ్యులై చనిరి. కుశుండు మేల్కాంచి నిజకాంతతో నీ
స్వప్నంబు [44]వివరించి హర్షంబు నొందె నంత.
| 138
|
క. |
అరిగితి నే నాయదుశే
ఖరపాలితపురమునకు నఖండితతేజ
స్ఫురణంబున నారాయణ
గిరివరవరలబ్ధి నతఁడు క్షితి పాలించున్.
| 139
|
తే. గీ. |
పూర్ణశీలుండు యాదవభూషణుండు
నాఁగ నాతనితండ్రి భూనాథమౌళి
తద్గుణానుగుణవిలాస ధన్యఁ గన్య
నోర్తు వెదకుచునుండె నత్యుత్సవమున.
| 140
|
తే. గీ. |
సర్వసౌభాగ్యభాగ్యలక్షణములందుఁ
గుశతనూజాత మెఱయుట కుశలబుద్ధి
నే నెఱింగింపఁ దద్రాజధాని కేఁగి
పరిణయముఁ జేసికొని యదుప్రవరుఁ డేఁగ.
| 141
|
సీ. |
నూఱు రథములు మున్నూఱు దాసులు భద్ర
గజసహస్రము తురంగ మవరాయు
తము నవమణినియుతంబు జాంబూనద
నిష్కకోటి సస్యనిచయశాలి
శాలి సుక్షేత్రయోజనశతంబును ధేను
గణములు దివ్యాంశుకము లసంఖ్య
ములు భూషణస్తోమములు పల్లకులమేయ
ము లపుడు యౌతకముగ నొసంగి
|
|
తే. గీ. |
కనకమాలినిఁ జూచి యోకన్య నీమ
నంబులో నున్నయది సమ్మదంబుతోడ
వేఁడు మిచ్చెద ననిన నవ్విమలగాత్రి
యతని సత్యంబుఁ బలికించి యప్పు డనియె.
| 142
|
పుత్రికయైన హేమమాలినికి కుశుఁడు శ్రీరాముఁడు నారాధించిన శ్రీహరి అర్చామూర్తి నొసఁగుట
తే. గీ. |
వెలయు హరిదివ్యమంగళవిగ్రహంబు
రామచంద్రార్పితంబు తద్ద్రవ్య మొకటి
యది సమర్పించితేని నాయాత్మఁ గల్గు
కామితములు ఫలించు నిక్కముగఁ దండ్రి.
| 143
|
క. |
అన జనకతనయవాక్యము
మనమునఁ జింతించి కుశుఁడు మధుసూదనమూ
ర్తినిఁ దతకీర్తి నతులశో
భనవిస్ఫూర్తిని నిజాత్మభవ కర్పించెన్.
| 144
|
వ. |
ఇట్లు కుశుం డియ్యవలసినవి యెల్ల నిచ్చినం బుచ్చుకొని యదుభూష
ణుండు యదుశేఖరకనకమాలినీకన్యాసమేతుండై పురంబు వెడలి
చనునెడ వెదకి వెదకి మున్ను రాజు లడుగ వచ్చిన కుశుం డంగీక
రింపక పితృవచనప్రామాణ్యంబునఁ దద్యదుభూషణపుత్రుండగు
యదుశేఖరున కర్పించినఁ దద్రాజులు రోషంబునఁ దత్కన్యాపహర
ణంబు గావింపఁ దలంచి మార్గంబున.
| 145
|
శా. |
గర్వగ్రంథులు కొంద ఱుద్ధత మహీకాంతాగ్రణుల్ సాంపరా
యోర్విన్ దద్యదుభూషణాద్భుతభుజాగ్రోద్బూతతేజోనలా
ర్చిర్వీథిన్ శలభత్వ మందిరి జయశ్రీ నాంజనేయస్పుర
ద్దోర్వీర్యాహతిఁ [45]గొంద ఱేఁగిరి సురేంద్రుం డేలు నవ్వీటికిన్.
| 146
|
వ. |
అప్పుడు నాకు నేత్రోత్సవం బయ్యె, నేమి చెప్పుదు నయ్యాహవంబు!
| 147
|
క. |
హరికరుణ గలుగు నెయ్యెడ
పరిభవ మయ్యెడను లేదు పరిపూర్తి హృదం
తరమున నుండిన వారికి
నరయఁగ నెచ్చోఁ బరాజయంబులు గలవే?
| 148
|
వసుదేవుఁడు శ్రీహరి అర్చామూర్తిని బూజించుట
వ. |
యాదవభూషణుండు దంపతుల ముందట హరిదివ్యవిగ్రహంబుఁ
బల్లకిపై నిడుకొని నడిపించె. అందఱు మధురాకృతియైన మధురకు
నడచిరి. అట్టియెడఁ బౌరకాంతలుఁ దద్వృత్తాంతంబు విని యంత
రంగం బుప్పొంగ నెదురుకొనిరి. కంకణధ్వనిఝంకారమణిపూరశింజి
తంబుల చేతఁ దత్సంతోషసల్లాపంబులు గప్పంబడియె. కోణాభిహత
సంక్షుభితభేరీకుహరసంభ్రమఘోషంబులు వేణువీణాస్వనకర్బుర
మర్దళడిండిమధ్వానంబులును, కాహళధ్వానంబులు నన్నియెడల
విజృంభింప వైతాళికకులోద్భవు లుభయవంశప్రశంసలు గావింప
దంపతులతోఁ గూడ నాజగత్పతిని నిజపురప్రవేశంబు సేయించె. అంత
యదుశేఖరుండు కనకమాలినితోడ నర్థితాధికదాయియైన విష్ణుదేవు
నర్చించి తత్ప్రసాదంబున [46]సకలైశ్వర్యంబులుం గాంచె. ఆయదువం
శంబున నిట్లు నెలకొనిన భగవంతునియర్చామూర్తిని వసుదేవుఁ
డర్చించుచుండె. నిజోదరంబున విశ్వంబుగల యాదేవుండు దేవకిజఠ
రంబున నుండుటయు, అన్యబంధచ్ఛేదకుం డయ్యు నులూఖలబద్ధుం
డగుటయు, ఘంటాకర్ణమోక్షప్రదాయి యయ్యుఁ దాను పుత్రార్థియై
తపశ్చరణంబు గావించుటయు, ముచికుందబంధమోచకుం డయ్యుఁ
గాలయవనునివలనఁ బలాయనము గావించుటయు, బ్రహ్మచర్యా
పరిపాలకుం డయ్యు గోపీపరిష్వంగం బొనర్చుటయు, అన్యపుత్ర
రక్షణంబును స్వపుత్రపాలనంబును విశ్వరూపంబు చూపుటయుఁ
|
|
|
బాండవస్యందనంబునఁ జూపట్టుటయు, ననిరుద్ధకిరీటధారణంబును,
బింఛావతంసధరణంబును, [47]ధర్మప్రతిష్ఠాపనస్వీకృతమానవ
రూపంబును, నవనీతచౌర్యంబును, నిత్యావ్యాహలైశ్వర్యంబును, ఉగ్ర
సేననియామ్యత్వంబును, బ్రహ్మరుద్రాధిపత్యంబును, గుర్వాదినమ
స్క్రియయు మొదలైన చిత్రవిచిత్రంబులు మెఱయించుచు వర్తించె
ననిన మునులు సర్వంబును నెఱుంగుదుము. కాని యా కృష్ణునకు నని
రుద్ధకిరీటధారణం బెట్లు సంభవించెనది యెఱుంగము. దానిం దెలియఁ
జెప్పవే యని మును లడిగిన వారికి నారదుం డిట్లనియె.
| 149
|
శ్రీకృష్ణుని మణికిరీటధారణగాథ
సీ. |
అసురేశ్వరుండు ప్రహ్లాదపుత్రుండు వి
రోచనుండను వాఁడు రూఢయశుఁడు
కలశాబ్ధిమధ్యభాగమునందు ననిరుద్ధ
సేవ సేయుచు నతిస్థిరత నిలిచి
యొకరుండు నాహరియోగనిద్రాసక్తి
నుండఁ దక్కినమును లొయ్య నొయ్యఁ
జనఁగఁ బ్రహ్లాదాత్మజాతత్త్వమహిమ ప్ర
భూతశక్తి వహించి స్ఫుటత రాగ
|
|
తే. గీ. |
రంగభావంబు నొంది నిరంతరంబు
చేరి కొలుచుచుఁ దద్విష్ణుశీర్షదివ్య
మణికిరీటంబు గొని నాగమందిరాంత
రాళ మొగిఁ జొచ్చె వాఁడు దుశ్శీలుఁ డగుచు.
| 150
|
వ. |
అంత భగవంతుఁడు రమతో మేల్కొనిన సేవకజనంబులు చేరి హరి
కిరీటంబుఁ గానక యాహరి నడిగిన నే నిద్రింప నెవ్వఁడు హరించెనో
యేమియు నెఱుంగననినఁ దద్వాక్యంబులు విని వారలు విరోచనుండే
హరించి చనియె. ఏమందఱము నిచ్చటనే యున్నవారము, అతఁ డసుర
వంశోద్భవుండు, ఎల్లప్పుడు పాపంబే తలంచు, ఇప్పుడు మృచ్చిలిన
వాఁడై యుండియే పలాయనంబు నొందెనని నిశ్చయించి వైనతేయునిఁ
బిలిచి మాలో బలవేగసంపన్నుండవు నీవే విరోచనుని సాధింపుమని
ప్రార్థించిన.
| 151
|
వైనతేయుఁడు విరోచనుని చంపి మణికిరీటముఁ దెచ్చుట
సీ. |
పక్షాగ్రవిక్షేపబహుళవాతాహతిఁ
గులనగంబులు గలగుండు వడఁగ
ఉద్ధితవేగమహోద్దతి శాఖ జం
బూప్లక్షముఖ్యముల్ పొడ వడంగ
దుర్ధరస్ఫుటనటత్రోటికోటీధాటి
మేఘముల్ తునియలై మింట [48]నెఱయ
శఫవినిర్ఘాతసంస్ఫాలనోదగ్రతఁ
దపనమండలము నెంతయును [49]నఱుగఁ
|
|
తే. గీ. |
గూజితంబున రాకాసిగుండె లవియ
నక్షిరోషాగ్నివిస్ఫూర్తి నభ్రనిమ్న
గోర్మిజాలంబు తెకతెక నుడికి పొంగ
విభ్రమింపంగఁ జొచ్చెఁ బూర్వాభ్రగంబు.
| 152
|
వ. |
అంతఁ బాతాళాంతరకోణంబున నున్న తేజోజితవిరోచను విరోచను
గాంచి మహత్తరయుద్ధంబుఁ గావించి శంకులాకోటితీష్ణంబైన చంచూ
పుటంబున వానిశిరంబు వ్రయ్యలు చేసి కిరీటంబుఁ గొని మింటి కెగసి
వచ్చుచు ముందట శ్యామలాద్భుతంబై యా బ్రహ్మలోకంబై యున్న
యొకదివ్యతేజంబుఁ గాంచి విస్మయం బంది యంత.
| 153
|
మహామణికిరీటము బాలమూర్తియగు శ్రీకృష్ణుని శిరమున సరిగా కుదిరి నిలుచుట
సీ. |
కర్ణాంతరస్ఖలత్కలితనేత్రాంచలు
వ్యత్యస్తవిన్యస్తవల్గుచరణు
విమలాసనాంభోజవితతపింఛావతం
సవిరాజమానుఁ బ్రసన్నతేజు
అనుపమగుంజోరుహారశోభితభూషు
గమనీయలాంగలికర్ణపూరు
గోపీవిలోచనాంకూరసుధాశీతు
నంచితపూర్ణకృపాభిరాము
|
|
తే. గీ. |
అధరవినిహితవంశనాళాంతరాళ
కలితవివరభ్రమత్కరాగ్రకరశాఖు
నఖిలలోకైకమోహశరాంచితాంగుఁ
బరివృతానేకబాలు గోపాలబాలు.
| 154
|
వ. |
వేణునాదాకర్ణనపారవశ్యార్ధదష్టతృణధేనుపరివృతుండై యున్నం
గాంచి.
| 155
|
మ. |
అనురాగంబున నాపతంగపతి దాసార్ధద్విలక్షోరుయో
జనదఘ్నేశ్వరు తత్కిరీటము [50]ప్రశస్యం బంచు గోపాలబా
లుని మస్తాగ్రమునందు నిల్ప ధరణిన్ లోకుల్ నిరీక్షింపఁ గీ
ల్కొనియెన్ మౌళియుఁ దత్ప్రమాణమున నుద్యత్పింఛధామంబుతో.
| 156
|
వ. |
అప్పుడు గరుత్మంతుండు విస్మయంబునం బ్రణమిల్లి క్షీరాబ్ధికి నరిగి
మునిసన్నిధానంబున నున్న భగవంతునకు విన్నవించినఁ బరమ
హర్షంబు నొందెనని నారదుండు చెప్పిన మునులు సంతసిల్లిరి. అంత.
| 157
|
నారాయణగిరికి యాదవాద్రి యనునామంబు గలుగుట
సీ. |
ఒకనాఁడు బలభద్రుఁ డుల్లాసమునఁ దీర్థ
యాత్రావశంబున నరుగుదెంచి
యాదవాచలశిఖరాగ్రంబునందుఁ గ
ల్యాణతీర్థంబున నాదిమౌని
గణములతోఁ బెక్కుకాలంబు లం దుండి
భవరోగభేషజభవ్యచరణు
నారాయణు భజించి చేరి చక్షుర్మనో
వాక్పూర్తి గాఁగ భవ్యమునఁ బొగడి
|
|
తే. గీ. |
ద్వారవతి కేఁగుదెంచి యాదవశిఖావ
తంసమగు కృష్ణు నీక్షించి దక్షిణాశఁ
గంటి యాదవశైలంబు కలితభోగ
భాగ్యసౌభాగ్యశీలంబు పద్మనేత్ర!
| 158
|
క. |
అందు ననురక్తిఁ గంటిన్
గందర్పసహస్రతుల్యకాయు నమేయున్
బృందారకమౌనిసభా
మందారకమైన దివ్యమంగళమూర్తిన్.
| 159
|
వ. |
ఆమూర్తి యస్మద్గృహదేవతామూర్తియ కాని యితరమూర్తి గాదని
ప్రశంసించినఁ గృష్ణుం డిట్లనియె.
| 160
|
క. |
ఈరీతి నేల పల్కెదు
సీరీ! యస్మత్కులధనసేవధి యగు ల
క్ష్మీరమణమూర్తితో సరి
గా రూపించితివి యదునగప్రభు నిచటన్.
| 161
|
తే. గీ. |
అన్న! క్రొత్తమాట లాడితివనిన నీ
తోడు నిజము నిజము దూరతరమె
కదలి చనుట భాగ్యకరమని వారించి
యరిగి రపుడు విగ్రహంబు[51]తోడ.
| 162
|
వ. |
అరిగి తద్దివ్యమంగళవిగ్రహంబు నారాయణగిరి హరిసన్నిధానం
బున నిలిపి మూర్తివైషమ్యంబుఁ గానక కలహంబు లుడిగి రామకృష్ణులు
తద్విగ్రహంబు లన్యోన్యంబునుం గలసియుండె. తదన్యోన్యసంగమం
బున నీశైలం బధికోచితవైభవంబగు రూపంబు గాంచె నది గాన
యాదవాచలంబు నందఱు సేవింపుదురు. మున్ను నారాయణగిరియై
యున్నయది నాఁడు మొదలుకొని యాదవాద్రి యన విలసిల్లె. ఈ
యాగమంబు వినినం, బఠియించినన్ గుణవంతుఁడై, ధనికుండై, ధర్మ
చారియై, పిత్రాద్యుత్తారకుండై, నారాయణపరాయణుండైన కొడుకును,
గనకమాలిని సమానయైన కన్యకం గాంచి యంతంబున వైకుంఠపదం
బునందు, పెక్కులు పలుకనేల? రామకృష్ణుల కటాక్షంబున సకల
సంపదలును గలుగు. వారిని దైత్యు లెదిరింప వెఱతురు. సురలు
మ్రొక్కుదురు. పూర్వాపరవంశంబులు పది తరింపంజేయుం గావున
నీయాదవాద్రిశిఖరికులశిఖరంబున మహావైభవంబున మమ్ము నుత్సు
కులఁ జేయు విష్ణుదివ్యరూపంబులు రెండు నుండు నన విని మునులు
నారదున కిట్లనిరి.
| 163
|
యాదవాద్రినాథు సేవించు భక్తుల కపచారము కావించినవారికిఁ గలుగు కీడు
సీ. |
పరమదయాక్రాంత భగవంత నారద
హరి యీనగంబున కరుగుదెంచె
ననుట యస్మల్లోచనాగ్రసాక్షాత్కార
మైన తెఱంగయ్యె ననఘమూర్తి
ధన్యతయుఁ గృతార్థత్వంబు గలిగె నీ
వచనంబుకతన నవార్యమహిమ
నైనఁ బ్రశ్నాంతరం బడిగిన శోధించి
తెలుపు నేర్పరివి సందేహ మణఁగ
|
|
తే. గీ. |
యాదవాచలవాసి జనాళి విష్ణు
కీర్తి. ధర్మప్రశస్తిమై వార్త కెక్క
నట్టివారికి నపరాధ మాచరించు
నదియ కర్తవ్య మంటి మహాత్మ! నీవు.
| 164
|
క. |
అది యెయ్యదియో వినియెద
మవిరళ సద్భక్తి వేగ నానతి యిమ్మా!
భవరోగవైద్యసేవా
ప్రవణాత్మక! పద్మజాత్మాభవ! మునిచంద్రా!
| 165
|
వ. |
అనిన మునులం జూచి నారదుండు మద్గురుండు నాకు నానతి యిచ్చిన
క్రమంబు వినుం డెఱింగించెదనని యిట్లనియె.
| 166
|
రాజపురోహితుం డైన చతుర్వేది కథ
సీ. |
మున్ను ప్రాజ్ఞుఁడు నతిమూర్ఖుఁడు రాజపు
రోహితుం డత్యంతరోషపరుఁడు
మనియెఁ జతుర్వేది యనుపేర నొక్కఁడు
నన్నింట నేర్పరి యైనజాణ
నారాయణైకనిష్ఠారతు లగువారి
యందు శక్తి సహింపఁ డనుదినంబు
అరసి నానాదేవతార్చకులను జాల
మన్నించికొనుచు ధర్మంబు విడచి
|
|
ఆ. వె. |
నియతభోజనంబు నిందించి మించ స
ర్వాతిథి యనువార్త నధిగమించి
భూధరాశ్రయపరిపూర్ణసంపదలచే
నతిశయంబు నొందె నాతఁ డంత.
| 167
|
వ. |
అతనికి మేధావి యను పుత్రుండు ప్రథమంబునం గలిగె. అట్లనే ఘనులై
శివనామముల ముగ్గురుతనయులు పితృగుణప్రవీణులు జనియించిరి.
ఆబ్రాహ్మణుండు రాజభటద్రవ్యంబు గొని దంభంబునం బ్రతివత్స
రంబును యాగంబు గావించుచుండె. నంత నొక్కనాఁ డాతఁడు పైతృ
కం బాచరించుచుండ, హరిభక్తిపరాయణుండును, వర్ణాశ్రమాచార
నిష్ఠానియతమానసుండును, నారాయణాద్రివాసుఁ డగుటంజేసి త్రిదశ
నమస్కృతుండును, మానావమానతుల్యప్రమోదహృదయుండును
నగు హరిరాతుండనువాఁడు తద్గ్రామంబుఁ జొచ్చి వృద్ధుండు నధ్వ
శ్రాంతుండును గాన సుతునితోఁ గూడ వచ్చి వేషమాత్రావైదికుండగు
చతుర్వేదిం గాంచి బ్రాహ్మణపరివృతుండై యుండునప్పుడు.
| 168
|
క. |
నారాయణదేవుపదాం
భోరుహతులసీదళములు భూసురవరకం
ఠీరవుఁ డర్పింపఁగ ని
స్సారంబుగఁ జూచి కేలు సాచక యున్నన్.
| 169
|
వ. |
మఱియు నొకసారి యావిప్రోత్తముండు తులసీదళంబు లొసంగ దరియ
వచ్చిన.
| 170
|
ఆ. వె. |
అంటరాకు స్నానమాడినవాఁడ నో
ద్విజకులేంద్ర! నీవు తెరువు నడచి
యంటుద్రొక్కినాఁడ వర్హంబె నీ కేల
నున్న తులసి ముట్ట నుపవసించి.
| 171
|
తే. గీ. |
అనుపనీతుండు నాపుత్రుఁ డతనిచేతి
కొసఁగు, కాకున్న నీచేత నుండనిమ్ము!
తులసి లోకంబులోపల దుర్లభంబె?
యిదియు నొకవస్తువే ధాత్రి నెంచి చూడ.
| 172
|
క. |
మెచ్చాయె నిచటి కేటికి
వచ్చితి వేగంబె తెలుపు వసుధామర! యే
నిచ్చట సన్మంత్రకలా
పోచ్చారణశక్తి మెఱసియుండినవాఁడన్.
| 173
|
వ. |
అని బ్రహ్మబంధుండు పల్కిన నాబ్రాహ్మణుండు.
| 174
|
సీ. |
అర్భకుం డధికదూరాధ్వపరిశ్రాంతి
నలసినవాఁ డింతయన్న మొసఁగు
మనియె నా హరిరాతుఁ డనఘ పైతృకము నేఁ
డర్పింపరాదని యాగ్రహించి
యనియెఁ జతుర్వేది, యన్నంబు మాన నీ
తండులంబు లొసంగు ధర్మబుద్ధి
నన్యగృహంబున నైనను వండించు
కొనియెదఁ గాని యాకొనిన యతిథి
|
|
తే. గీ. |
గడపకు మటంచుఁ దద్ద్విజుఁ డడుగ నడుగఁ
దగునె పైతృకదినమునఁ దండులంబు
లైన నర్సింపననుచు గర్వాంధబుద్ధి
నాచతుర్వేది తర్జించి యాడునంత.
| 175
|
వ. |
అధ్వపరిశ్రాంతి నలసి బ్రాహ్మణుండు మఱియు మఱియు వేఁడుకొన
సర్వాతిథియైన చతుర్వేది మఱియు మఱియు లేదన ధర్మం బెఱుంగుదు
విట్లేల పలికెదవు? నీగేహంబున నిడకయుండిన నీబంధుగృహంబున
నేని భుజియింపంజేయుమని యాభూసురవర్యుండు ప్రార్థింపఁ జతు
ర్వేది కృద్ధుండై నిరసించిన యేని పిశాచంబువలెఁ బలుమాఱు నడిగి
పీడించెదు. ఈనగరంబున మఱి గృహంబులు లేవె? పొమ్ము!
పొ మ్మిచ్చటఁ దొలంగుమని తర్జించినంతట నశక్తుండై పుత్రుఁడును
దానును నంగణభాగంబునం దోఁచక నిల్చిన నాచతుర్వేది తన
తనయులచేత బాహ్యభాగంబునకుం గరార్ధచంద్రక్రమంబునం
ద్రోయించి కవాటంబు బిగియించునెడఁ గవాటవేగసంభ్రాంతుండై
బాలుండు నేలంబడిన నష్టోభవ యని యాబ్రాహ్మణోత్తముండు బాష్ప
గద్గదవాక్యంబులం బలుకుచుఁ గుమారుని నెత్తికొని మేను నివురుచు
బుజ్జగించుచుండె. అప్పుడు.
| 176
|
క. |
కలుగదు క్రోధము లోభముఁ
గలుగదు గర్వంబు మదముఁ గలుగదు హరిభ
క్తులకుఁ బ్రదీపముక్రిందట
నిలుచునె ఘోరాంధకారనిచయం బెల్లన్.
| 177
|
శా. |
క్రూరాభీలభుజంగ నాకు కుహరక్రోడంబులో నున్న దు
ర్వారజ్వాల సముల్లసచ్ఛిఖిశిఖాగ్రశ్రేణిలోనున్నఁ గాం
తారవ్యాఘ్రగుహాంతరాళబిలమధ్యశ్రేణిలోనున్న మేల్
[52]సేరన్ వచ్చుటకన్న భక్తజనతాశ్రీనిందకావాసమున్.
| 178
|
తే. గీ. |
ధరణిఁ బిత్రార్థకల్పితధనము వ్యయము
సేయరాదండ్రు బుధులు చర్చించిచూడ
న ప్రధానవ్రతం బిది యనుచు నపుడె
దూరతరముగ ధర్మంబు తొలఁగిపోవు.
| 179
|
తే. గీ. |
బ్రాహ్మణోత్తముఁ డిట్లేఁగఁ బరమహర్ష
పూర్ణుఁడై పైతృక మొనర్చె భూసుపర్వుఁ
డర్థమును విద్య రాజమాన్యతయుఁ గలుగ
యుక్తము నయుక్తము నెఱుంగ నొకనివశమె?
| 180
|
విష్ణురాతుఁడు కావించిన భాగవతారాధనము
చ. |
అలసి యశక్తుఁడై ద్విజకులాధముసేఁతకు రోసి వీటిలో
వెలయఁగ నూర్ధ్వపుండ్రముఁ, బవిత్రభుజాయుగశంఖచక్రము
ద్రలు, నలినాక్షమాలికయుఁ దాల్చిన తద్ధరణీసురోత్తముం
గలుషవిదూరుఁ గాంచి కుతుకంబున భూసురుఁ డొక్కరుం డటన్.
| 181
|
తే. గీ. |
బ్రాహ్మణోత్తమ! పే రేమి? బాలుఁ డేమి
గావలయు? నేఁడు మనసులోఁ గలఁగినట్లు
గానుపించితి నాకు నిక్కముగఁ దెలుపు
మనిన సర్వము నెఱిఁగింప నాదరించి.
| 182
|
మ. |
హరిభక్తాంఘ్రిసరోజరేణుకణపూతాత్ముండనై శిష్టమం
దిరధాన్యౌఘము ముష్టిమాత్రముగ నాతిథ్యంబునన్ వేఁడి సు
స్థిరభక్తిన్ నిజదారపుత్రహితులన్ దీపింపఁ బోషింపుచున్
బరమానందముఁ బొందియుండుదును సౌభాగ్యప్రభావంబునన్.
| 184
|
వ. |
అని మఱియు నాకుం బన్నిద్దఱు నందనులు హరిద్వాదశనామంబులవారు,
వారి పేరు లోకంబునఁ బ్రసిద్ధంబగు. నేను నారాయణున కంటె సన్య
దేవతను భజింప, మద్భార్యయు నీవ్రతంబె యాచరించునది– అని
విష్ణురాతుండు తననడక విన్నవింపఁ బుత్రాన్వితుండై హరిరాతుండు
తద్గృహంబునకుం జనియె.
| 185
|
తే. గీ. |
విష్ణుభక్తగృహావాసవిభవమహిమ
విష్ణుభక్తులకే తగి వెలయుచుండు
క్షీరశర్కరలునుబోలెఁ, గ్రూరసంగ
మంబు విషనింబదళమేళనంబుఁ బోలు.
| 186
|
శ్రీహరి సన్యాసివేషంబున అతిథియై వచ్చి యనుగ్రహించుట
వ. |
అంత విష్ణురాతుని భార్య సుముఖి యనునది పరమసాధ్వి కలశంబున
నుదకంబు పట్టి పుత్రుండును, దానును మజ్జనంబాడి హరిరాతుండు
మాధ్యాహ్నికకృత్యంబులు దీర్చి నారాయణప్రీతిగా నైవేద్యంబు
నివేదించునప్పుడు శిష్యచతుష్కంబుతోఁ జరమాశ్రమి యొక్కఁడు
చనుదెంచె. ఆగృహస్థుండు నయ్యతిథిని వాసుదేవునింబలెం బూజించి
మ్రొక్కి పాదపరిమార్జనంబుఁ గావించి యహో భాగ్య మహో భాగ్య మని
తత్పాదతీర్థంబు శిరంబునం జల్లుకొనిన సన్న్యాసియు, నతని శిష్యులు
నలువురును, అతిథియు నతని పుత్రుండు నేకపంక్తిని భుజియించు
చున్నతఱి నావిష్ణురాతుని బాలుం డొకం డాఁకొని తండ్రికడకు వచ్చి
రోదనంబు సేయందొడంగె.
| 187
|
మ. |
సుముఖిం గన్గొని యన్న మీఘటములో శోధింపవే యంచుఁ ద
ద్రమణుం డాడిన, సాధ్వి లేదు కబళార్థంబైన నంచున్ యథా
ర్థముగాఁ బల్కె, మనోహరుండు మఱియున్ దర్జించి శోధింపు మ
న్న ముదం బొప్పఁగఁ జూడ నన్నపరిపూర్ణంబై ఘటం బుండినన్.
| 188
|
ఆ. వె. |
బ్రాహ్మణోత్తముండు పన్నిద్దఱును సుతుల్
తాను సతియు మనసు తనివి దీఱ
నారగించిరప్పు డత్యంతసంతోష
పూర్ణహృదయులై యపూర్వమహిమ.
| 189
|
వ. |
ఇట్లు ప్రతిదినంబును జతుర్విధాహారంబులు మెండుకొనియుండఁ
బ్రయత్నంబున నాగతులగు వైష్ణవుల భుజియింపంజేయుచుండె. ఆ
యతిథిపూజలో సుముఖి యేపాత్రంబులు వాడె నాపాత్రంబు సౌవర్ణంబు
లును, రాజతంబులునై వెలసె. సన్న్యాసి భుజించినయెడ నిరవధియైన
నిధి గానవచ్చె. సన్న్యాసివేషంబున నారాయణుండు వేదంబులు శిష్య
రూపంబు లై వెంటం జనుదేర నేతెంచెనఁట. పాషండివారణోద్యోగంబునఁ
ద్రిదండిధరరూపంబు గాంచి మున్ను విజృంభించు దత్తాత్రేయుండని
మీ రెఱుంగుదురు. నారాయణపరాయణుం డెవ్వనిగృహంబున భుజించు
నాతనిగృహంబున సాక్షాత్కారమున నారాయణుండు భుజించు.
| 190
|
భాగవతాపచారముచే చతుర్వేది మహాపదలపా లగుట
సీ. |
ఆచతుర్వేది పిత్రాద్యర్చనము సేయు
నపుడు పయఃపాత్రమందు విషముఁ
గ్రక్కె నొక్కమహోగ్రకాలాహి, భోజనా
నంతరంబున మృతులైరి భోక్త
లావిప్రుఁడును భార్య యాత్మజులును దాను
పానభోజంబున బ్రతికి రంతఁ
దద్విజాత్మజులు పౌత్రకులంగణములందుఁ
జాటిరి పైతృకాచరణ విషము
|
|
తే. గీ. |
చేత గరళంబు పెట్టి భజించె దుష్ట
శీలుఁడై ద్విజుఁ డంచు నాక్షితి సురేంద్రుఁ
బట్టి దట్టించి రా రాజభటులు కశల
మర్మములు దూలి యీల్గె నాదుర్మదుండు.
| 191
|
క. |
మేధావి వనము చొచ్చి తి
రోధానము నొంద ఘోరరూపంబగు వ్యా
ఘ్రాధివతి మ్రింగెఁ గొందఱు
భూధరమున కెక్కఁబోయి భువిఁ బడునంతన్.
| 192
|
వ. |
తల్లియు జిహ్వాచ్ఛేదంబొనర్చుకొని పరానుత్వంబు నొందె.
| 193
|
తే. గీ. |
అతనికన్యక లిరువు రత్యంతభీతి
రాజదండభయమున ద్వారంబునందు
ననలశిఖ లుంచి మడిసి రట్లాపురంబు
నణఁగెఁ దద్విష్ణురాతుగేహంబుదక్క.
| 194
|
వ. |
తత్సంబంధోపజీవు లగువారి రాజభటులు కారాగృహంబున నిలిపిన నందె
వారు మృతులైరి. ఇవి యన్నియు దినత్రయంబున నయ్యె. హరిభక్తుల
నవమానంబు చేసినను, గురువుల బహూకరింపకయున్నను, దుష్టుల
బహూకరించినను, తను దా బహూకరించుకొనినను సంపదలు నశించు.
ఇది యైహికదుఃఖంబు, ఇఁక నాముష్మికదుఃఖంబులు వినుండు.
| 195
|
మృతుఁడైన చతుర్వేది నరకప్రాప్తుఁ డగుట
ఉ. |
క్రూరులు కాలకింకరులు ఘోరతరాజినరజ్జుబంధని
స్తారితపాదుఁగా నిలిపి స్తంభముతోడ నధోముఖంబుగా
దారుణశక్తిఁ గట్టి బెడిదంబుగఁ బుత్రులతోడఁ గొట్టి రా
హారవవృత్తిఁ దద్ద్విజనిజాన్వయబాంధవులున్ జలింపఁగన్.
| 196
|
క. |
సర్వాతిథి దానంతట
సర్వజనంబులు వినంగ సమవర్తివి నా
దుర్వర్తన తెలుపవె బుధ
నిర్వాహక మొఱ వినవె! నియతగుణాఢ్యా!
|
|
క. |
అన్యాయం బన్యాయం
బన్యాయం బరయవే! మహాత్మా! త్రిజగ
ద్ధన్యుఁడవు సకలసురమూ
ర్ధన్యుండవు నన్నుఁ గావు తండ్రీ! కరుణన్.
| 197
|
వ. |
అను నాచతుర్వేదిని విడిపించి సమవర్తి యె ట్లన్యాయం బయ్యెనని
యడిగిన నతండు ప్రాంజలియై యిట్లనియె.
| 198
|
సీ. |
ఆమ్నాయములు నాల్గు నర్థయుక్తములుగాఁ
జదివితి మీమాంససారమెల్లఁ
నెఱిఁగి వైదికకర్మ మిట్ల నెన్నిక గాఁగ
నాచరించితి జగం బౌ ననంగ
ఆత్మజుల్ నాకన్న నధికులు గృహిణియు
నిత్యధర్మాన్విత నేఁడు నాకు
బాధ లేటికిఁ బూర్ణపరమదయానిధి
[53]సమవర్తి వివరింపు శాస్త్రదృష్టి
|
|
తే. గీ. |
శమన! నీ యాజ్ఞలోనివారము కటాక్ష
వీక్షమముఁ గావు మేమని విన్నవింతు
మనిన నాధర్మరాజు న్యాయంబుఁ బూని
యతనిదుర్వృత్తి కలుగుచు నప్పు డనియె.
| 199
|
వ. |
ఓరీ! దురాత్మా! నారాయణాచలంబునుండి వచ్చిన విప్రుని నారాయణ
పరాయణుండైనవానిం దిరస్కరించితి వది యెఱుంగుదువో? యెఱుం
గవో? పద్మారమణపాదాబ్జవాసితతులసీదళంబు లతం డర్పించిన నది
గైకొనవైతి వది యెఱుంగుదువో? యెఱుంగవో? ఓరి పాపాత్మా!
బాలకుం డధ్వపరిశ్రాంతుండై యుండ నద్విజోత్తముం డబ్బాలునకై
యన్నంబు వేఁడిన నవమానంబు చేసితి వది యెఱుంగుదువో? యెఱుం
గవో? కవాటవేగహతుండై పడి బాష్పవ్యాకులేక్షణుండైన హరిరాత
బాలకుం గరుణింపవైతి వది యెఱుంగుదువో? యెఱుంగవో? రాజ
కృప గలిగి గర్వించి శంఖచక్రాదిధారణంబు నిందించితి వది యెఱుం
గుదువో? యెఱుంగవో? ముక్తిమార్గోపదేష్టలగు మునులవచనంబుల
ప్రమాణంబు లంటివి మూఢ! యవి యెఱుంగుదువో? యెఱుంగవో?
వేదంబులు నారాయణుండె వరదేవత యన వైవర్ణ్యం బొందితి వది
యెఱుంగుదువో? యెఱుంగవో? నిత్యంబును రాజగోష్ఠియందు నాస్తిక
ప్రశంసయు, సాధుదూషణంబును నొనర్చితి వది యెఱుంగుదువో?
యెఱుంగవో? ఇన్నియు నేటికి? రాజసభను శరణాగతరక్షాధర్మంబు
దూషించితి వది యెఱుంగుదువో? యెఱుంగవో? యని పలికిన
బ్రాహ్మణుం డంగీకరించి కంపంబు నొంది యీమహాపాపం బెట్లు తరిం
తునో యని మఱియు మఱియుఁ బాదంబులం బడిన శమనుం డాతని
కిట్లనియె.
| 200
|
క. |
ఈయఘముల కే నెఱుఁగుదుఁ
బ్రాయశ్చిత్తంబు విష్ణుభక్తులయెడ న
శ్రేయముగఁ జేయునవమతి
పాయక నిష్కృతియు లేదు పాపంబునకున్.
| 201
|
ఆ. వె. |
అనిన మఱియు మఱియు నడుగులపైఁ బడి
కంప మొందువిప్రుఁ గాంచి నీదు
మరణవేళ నేడుమాఱులు గోవింద
యనియె విష్ణురాతుఁ డతులకరుణ.
| 202
|
చతుర్వేది బ్రహ్మరాక్షసరూపంబు నొందుట
క. |
అందున ఘనయాతన లిఁకఁ
బొందవు దుష్కర్మవృత్తి, [54]బూనెద వడవిం
జెంది జనరహితదేశము
నం దుండెదు బ్రహ్మరాక్షసాకారమునన్.
| 203
|
తే. గీ. |
బ్రహ్మరాక్షసి యగు నీదుభార్య, నీదు
పుత్రకులు గృధ్రమూర్తులై పొదలవెంట
[55]భవదభిహతినిహతజంతుభక్షణేచ్ఛఁ
దిరుగుచుంద్రు వనాంతరదేశములను.
| 204
|
వ. |
అని శమనుం డానతిచ్చిన బ్రహ్మరాక్షసవృత్తికిం గడ యెయ్యది యని
దీనుండై చతుర్వేది యడిగిన నెప్పుడు విష్ణుభక్తులం గాంచెద వప్పుడే
తద్దేహంబు వీడ్కొనియెద వని బంధనంబు విడిపించినఁ గుటుంబ
సమేతుండై పోయి యాభ్రష్టబ్రాహ్మణుండు వింధ్యారణ్యంబున నివ
సించుచుండె. మధురిపుపదసేవాపరిపక్వస్వాంతవృత్తియై యదుగిరి
తటంబున నున్న భాగవతు నెవ్వనినేని యవమానించినఁ జతుర్వేదివలెనే
నష్టుండగు ధరాతలంబున.
| 205
|
మ. |
హరిరాతోత్తమపుణ్యసత్కథలు నిత్యానందసంపత్తి నె
వ్వరు విన్నన్ బఠియించినన్ హరి కృపావారాశియై వారిమం
దిరసీమన్ భుజియించుఁ, దద్విమతు లెంతే నష్టులై పొల్తు రు
ర్వర నెంచన్ ధనధాన్యసంపదయు నైశ్వర్యంబు మించన్ దగున్.
| 206
|
వ. |
అనినఁ దద్బ్రహ్మరాక్షసత్వముక్తి వాని కె ట్లయ్యెనని మును లడిగిన
నారదుఁ డిట్లు తెలిపె.
| 207
|
సీ. |
ఫలమూలవర్జితబహుకంటకాకీర్ణ
తతతప్తవాలుకాధ్వప్రదేశ
ఘనతరారణ్య భాగంబున నాఁకొని
తనువు దూలఁగ దూర ర్శనమున
నగ్నిశిఖారుణోద్యత్కీర్ణకేశమ
స్తకముతో వాయసతనువికార
కళలఁ గృశించి దగ్ధమతి నచలవర
మును బోలి తూలైకమూర్తిధారి
|
|
తే. గీ. |
యతులదుర్వారఘోరాహియైన జిహ్వ
గలిగి పాతాళకల్పముఖంబుతోడఁ
[56]గోఱ లిరువంక భయములు గులుక నెలవు
లందు మాంసంబు మెసవుచు నంతనంత.
| 208
|
వ. |
నిమ్నదృష్టియు, శూర్పకర్ణుండును, వక్రబాహుండును, దిర్యక్ప్రేక్ష
ణుండును, గుక్కుటోరస్థ్సలుండును, బలలాశాతురశ్యేనశివాది
సంసేవితుండును, దాళప్రమాణపాదద్వయుండును, శూలఖడ్గ
ధరుండును, బ్రేతచీవరావరణుండును, గర్ణావలంబికపాలుండును,
గపాలమాలికాలంకారుండును, [57]భస్మోద్ధూళితసర్వాంగుండును బాప
కర్మదృష్టిగోచరుండును, నాంత్రమాలోపవీతుండును, దమనకోటి
బంధుండును, భైరవస్వరుండును నై పుత్రమిత్రభార్యాసహితుండై
బ్రహ్మరాక్షసత్వంబుఁ గాంచి యనేకవర్షసహస్రంబులు జీవకోటుల
భక్షించుచునుండె. వానిదారాపుత్రులు గృధ్రరూపంబునఁ దత్పార్శ్వ
వర్తులై యతండు హింసించిన జంతువుల మాంసంబులు భుజియించు
చుండిరి. ఈశ్వరద్రోహులకు ని ట్లనుభవించుట చాలునె నిత్య
నిరయంబులు గాక?
| 209
|
భాగవతానుగ్రహమున చతుర్వేదికి బ్రహ్మరాక్షసత్వము తొలఁగుట
శా. |
ఆకాలంబున నేఁగుదెంచిరి [58]మహోద్యద్ధీవిభాసుల్, నుత
శ్లోకుం డొక్కఁడు సత్యనిష్ఠుఁ డనఁ దేజోధర్మసంపన్నతన్
వైకుంఠప్రియనామకుం డొకఁడు నన్వర్థాహ్వయప్రక్రియన్
లోకుల్ చూడఁ జెలంగి రద్భుతగుణాలోక్య[59]ప్రభావాఢ్యులన్.
| 210
|
క. |
వారలు పుణ్యచరిత్రులు
నారాయణగిరివరాధినాథ శ్రీమ
న్నారాయణదేవాంఘ్రిస
మారాధన మాచరించి యరుదెంచుఘనుల్.
| 211
|
సీ. |
ఆది కాశ్మీరదేశాగతులై యదు
శైలేంద్రు సేవించి సమ్మదమునఁ
తద్దేశమునకు నాతతభక్తి మఱలి యేఁ
గుచు హరిభక్తు లకుంఠితావ
బోధనిష్ఠులు ద్విజపుంగవు లాహరి
క్షేత్రమ్మునం దుండి చేరి తమ్ముఁ
గలసి వెన్వెంట రాఁగా హరిఁ గీర్తించి
కొనుచు వింధ్యాటవీక్షోణిఁ జొచ్చి
|
|
తే. గీ. |
యొకతటాకమున మునిఁగి యుచితపుణ్య
కర్మములు దీర్చి యధికారగౌరవమునఁ
గేశవునిఁ గొల్చి విష్ణుసంకీర్తనములు
నియతిఁ గావించునంతలో నిలిచి తెలిసి.
| 212
|
వ. |
ఆబ్రహ్మరాక్షసుం డచ్చటఁ దిరుగుచున్నవాఁ డగుట సకలమహా
పాపంబులకు హరికీర్తనంబు సేయుటయే ప్రాయశ్చిత్తం బని శ్రుతి
స్మృతిపురాణేతిహాసంబులు ప్రమాణంబులుగా ఆభాగవతులు ప్రసంగ
వశమున చెప్పికొనుమాటలు దూరంబుననుండి విని గృధ్రరూపులై
యున్న భార్యాపుత్రులును దానును హరిభక్తిదర్శనకీర్తనంబుల
హృదయంబు ప్రసన్నంబైన ఆవిష్ణుభక్తపదాంభోజసంగపూతజలంబు
దృష్టిపథంబున నున్నఁ బానంబు చేసి యా రాక్షసుండ వైకుంఠ
తద్భక్తభుక్తశిష్టపాత్రక్షాళనతోయపరికీర్ణాన్నకబళంబులు భుజించి
గృధ్రంబులు దాను జాతిస్మరత్వంబు నొంది వైవస్వతుఁ డానతి
యిచ్చినక్రమంబుఁ దలంచుకొని విష్ణుభక్తాంఘ్రితీర్థంబున ముక్తియె
ఫలియించె; ఫలాంతరము లనిన నెంత? యని భావించుచు.
| 213
|
మ. |
అపు డుప్పొంగుచు బ్రహ్మరాక్షసుఁడు పూర్ణానందుడై, దక్షిణా
ధిపపూర్వోక్తవిశుద్ధ వైష్ణవవరుల్ [60]దీవ్యత్తనుల్ నిత్యధ
ర్మపరుల్ భూతలభాగ్యదేవతలు సారజ్ఞుల్ మునుల్ వీరెకా!
యపరిచ్ఛేద్యమహానుభావులని తా నాత్మన్ బ్రశంసించుచున్.
| 214
|
క. |
మన ముల్లసిల్ల దూరం
బున దండప్రణతి చేసి పొదవెడు పాపా
త్ముని బ్రహ్మరాక్షసుం గని
ఘను లాకాశ్మీరదేశకర్తలు విప్రుల్.
| 215
|
క. |
నీ వెవ్వఁడ వీవనమున
కీవచ్చినవార లెవ్వ రీరాక్షసజ
న్మావిర్భావము నీ కే
కైవడిఁ బ్రాపించె నెఱుఁగఁగాఁ బల్కు మనన్.
| 217
|
క. |
తనసేఁతయుఁ, దనజన్మము
తనతనయులకథలు [61]దార తత్తత్కృతులున్
వినయమున విన్నవించెన్
మునుకొని యాబ్రాహ్మణోత్తముల కతఁడు వడిన్.
| 218
|
సత్యనిష్ఠుఁడు వచించిన హరినామప్రభావము
ఉ. |
ఏ నెటులన్ దరింపుదు మహీసురరత్నములార! యన్న వి
ద్యానిధి సత్యనిష్ఠుఁడను నాతఁడు పల్కెను బ్రహ్మరాక్షసుల్
శ్రీనళినాక్షకీర్తనవిశేషమునన్ ఘనపాతకంబు లా
యేనును దూలు; నిల్చు నిఁక నెయ్యెడ నయ్యుపపాతకావళుల్.
| 220
|
క. |
నారాయణచారిత్రక
థారంభము మాని మర్త్యుఁ డన్యకథలకున్
బ్రారంభించుట గవ్యప
యోరుచి దిగనాడి కాంచికోత్సుకుఁ డగుటల్.
| 221
|
తే. గీ. |
మందరాచలమంథానమథిత మగుచు
సుధ యమర్త్యులజిహ్వలు సోఁకె నాత్మ
జిహ్వ నుదయించి హరికథాంచితరసాయ
నంబు నరులకు సకలభాగ్యంబు నొసఁగు.
| 222
|
క. |
భవదురుకాంతారాంతర
నివసనమలినాత్ములైన నీచాత్ముల క
ర్ణవశాయి కథామృతమును
[62]నవిరతముం గ్రోలఁ బూతతాత్మత గలుగున్.
| 223
|
క. |
దురితాహిదష్టనరులకుఁ
బరమౌషధ మెంచి చూడఁ బద్మాకాంతా
వరకీర్తన మొకటియే
యరయఁగ నేమిటికి దేవతాంతరమహిమల్.
| 224
|
క. |
వెల్లిగొను దుఃఖవారిధి
కల్లోలము లుత్తరింపఁ గమలాక్షకథా
సల్లాపయానపాత్ర స
ముల్లాసముచేతఁ గాక యొక్కటి గలదే?
| 225
|
క. |
తాపత్రయశమనమునకు
నోపన్ జగ మెఱుఁగ నయ్యదూత్తంసకథా
లాపం [63]బొక్కటియ దగు; గ
రోపమమగు నస్యదేవతోత్కర్ష మిలన్.
| 226
|
తే. గీ. |
ఘనత నారాయణాఖ్య యొకానొకప్పు
డైనఁ గీర్తింపలేని మూఢాత్మువదన
మరయ వల్మీక మతనిజిహ్వాంచలంబు
చర్చ సేయంగ ఘోరభుజంగమంబు.
| 227
|
తే. గీ. |
పాపులగు మానవులకు శ్రీపతికథాసు
ధారసప్రేమ ముదయించి తనరకునికి
యుష్ట్రపోతంబు మాకంద ముజ్జగించి
నింబపత్రంబు చవిగొన నిలిచినట్లు.
| 228
|
తే. గీ. |
అచ్యుతానంత గోవింద యనుచుఁ దిరుగఁ
దిరుగఁ బలుకు మహాత్ములు దిరుగ రుగ్ర
పాతకాబ్ధి మహావర్తపటలమధ్య
సంతతభ్రమణైకప్రచారములను.
| 229
|
వ. |
శ్రుతికర్మజ్ఞానంబులచేత హరికీర్తనంబునం గల ఫలంబు లభింపదు
కాన సర్వమహాపాపశాంతికొఱకు నారాయణనామం బుచ్చరింపుమని
సత్యనిష్ఠుం డూరకయున్న వైకుంఠప్రియుం డనునాతఁ డోరి బ్రహ్మ
రాక్షసా! నీవు నారాయణాచలంబునకు నేఁగి శిరోధార్యంబగు విష్ణు
|
|
|
భక్తాంఘ్రిరేణువుచేఁ బవిత్రంబగు కల్యాణతీర్థంబు శిరంబునఁ జల్లికొని
తద్గిరీంద్రప్రదక్షిణనమస్కారకీర్తనంబులు గావించిన భగవంతుఁడు
ప్రసన్నుండై ముక్తి నొసంగునని యానతిచ్చె. ఇట్లని వారు నిజ
నివాసంబున కేఁగి రంత.
| 230
|
ఆ. వె. |
బ్రహ్మరాక్షసుండు భార్యయు సుతులును
గృధ్రనికరము యదుగిరికిఁ జేరి
[64]గిరిప్రదక్షిణంబు నెరపి తత్తీర్థాధి
వాసిపాదుపాదవారిఁ గ్రోలి.
| 231
|
మ. |
ఇటులన్ మాసము లేను దాఁటిన రమాధీశుండు తదుస్తరో
త్కటపూర్వాఘములన్నియున్ మఱచి తత్త్వజ్ఞానసంపత్కరో
ద్భటులై మించిన యాజయున్ విజయు నుద్యత్ప్రేమ మీఱన్ సుధా
పటలప్రాయములైన సూక్తులఁ దగన్ బల్కెన్ బ్రమోదంబునన్.
| 232
|
సీ. |
హరిరాత ఘనునకు నపచార మొనరించి
యాచతుర్వేది భార్యకుమార
బంధుసమేతుఁడై బ్రహ్మరాక్షసుఁ డయ్యె
నట్టివాఁ డిట మదీయపదభక్తి
వరపాదతీర్థాంబుపానంబుచేతఁ బ
విత్రుఁడై విజ్ఞానవృత్తి గలిగి
యేతదమేయగిరీంద్రపార్శ్వంబున
నుత్తమమూర్తియై యున్నవాఁడు
|
|
తే. గీ. |
వాని మత్తీర్థములయందు వరుసతోడఁ
దీర్థమాడించి మది సేదఁదీర్చి తెండు
సింహ మెదిరిన దంతులు సెదరినట్లు
నాత్మభక్తులయెడలఁ బాపాళి యడఁగు.
| 233
|
ఆ. వె. |
అమ్మహానుభావుఁ డతనిబాంధవులు మ
త్తీర్థమున మునింగి దివ్యు లగుచు
నాకమునఁ బురాతనాకంబు వదలి వ
ర్తించుచుంద్రు గాత! తదీయు లలర.
| 234
|
హరిభక్తుల పాదతీర్థప్రభావము
క. |
అన జయవిజయులు కౌతుక
మునఁ జని సంపూర్ణతేజమున గిరిసేవా
ఘనుఁడైన బ్రహ్మరాక్షసు
ననఘాత్ములు వారు గాంచి రతిహర్షమునన్.
| 235
|
క. |
హరికింకరపాదాంబుజ
పరమపవిత్రోదకాతిపావనతనులై
పరఁగిరి నారాయణు శ్రీ
ధరుఁ గీర్తింపుచు నవామృతస్తోత్రములన్.
| 236
|
వ. |
వారలు బ్రహ్మరాక్షసుం గని యిట్లనిరి.
| 237
|
తే. గీ. |
అతులసద్భక్తి లక్ష్మితో నాపరాత్మ
యరసి నీకున్ బ్రసన్నుఁడౌ నభినుతింపు
మంతకంటెను దత్కటాక్షానురక్తి
గలుగనేర్చునె యెట్టి సత్కర్మములను.
| 238
|
తే. గీ. |
అష్టతీర్థావగాహ మట్లైన పిదపఁ
దీర్థమాడుము కల్యాణతీర్థరాజ
తీర్థమున నంత నీవు సుస్థితి వహించి
బ్రహ్మనిష్ఠ మెలంగెదు పరమనియతి.
| 239
|
వ. |
ఇట్లని విష్ణుద్వారపాలురు పల్కినఁ జదుర్వేది హర్షించి ప్రథమంబున
వేదపుష్కరిణీతీర్థంబునఁ, దదనంతరంబున దర్భతీర్థంబున, నాపిదపఁ
బలాశతీర్థంబున, నంత యాదవ తీర్థంబున, నంతటఁ బద్మతీర్థంబున,
నావెనుకం బరాశరతీర్థంబున, నాపిమ్మట నారాయణహ్రదతీర్థం
బున, నంతట వైకుంఠగంగాతీర్థంబున స్నానంబు చేసి ముమ్మాఱు
నారాయణమంత్రం బుచ్చరించి బ్రహ్మరాక్షసత్వంబు విడిచి సత్వంబు
వహించి, శిఖాయజ్ఞోపవీతంబులును, దండకమండలకుండలంబులును,
దర్భాంగుళీయకంబులును, గుశాసనంబును, ధౌతోత్తరీయంబును గలిగి
ధర్మపరాయణుండై, మృదుభాషియై, మృదుగతియై, మృదుమానసుండై
మంత్రజవశీలుండై, సమస్తప్రియవాదియై బ్రాహ్మణరూపంబున
భార్యాపుత్రబాంధవులుం దానును దత్తీర్థస్నానాధికారంబున లభించిన
పౌర్వదైహికవిద్యావిశేషంబు హస్తామలకంబైన ఘనుండై యుండె.
అంత.
| 240
|
క. |
కల్యాణతీర్థమహిమ య
తుల్యంబగుఁ దత్పవిత్రతోయాప్లవుఁడై
కల్యాణమందు మనుజుని
కల్యాణజలంబుఁ గ్రోలఁ గణఁగుదు రమరుల్.
| 241
|
క. |
తులసీవరమణిమాలా
కళికలు పద్మాక్షుమాలికలు పూనిన ని
ర్మలుఁడు మహాపాపాచల
కులిశంబై మెఱయు జగము కొనియాడంగన్.
| 242
|
ఆ. వె. |
ద్వాదశోర్ధ్వపుండ్రధారణార్హోత్తమ
స్థానముల గురించి జయుఁడు విజయుఁ
డవనిసురవరునకు నపు డుపదేశించి
[65]యాదరించినార లతని లెస్స.
| 243
|
క. |
ఘనశక్తిఁ దప్తచక్రాం
కన మావిజయుం డొనర్చెఁ గౌతుకమున, వి
ష్ణునకుం జక్రాదిశుభాం
కనముననే ప్రీతి కాని కా దన్యమునన్.
| 244
|
తే. గీ. |
బ్రాహ్మణక్షత్రియోరవ్యపాదభవులు
చక్రధారణసంపత్ప్రశస్తమహిమ
శ్రుతినిగళితంబు నియతైక మతిఁబ్రమాణ
మనుచు నది యాచరించుట యర్హతరము.
| 245
|
సీ. |
ఆత్మభర్తకుఁ జిహ్నమగుట సత్కర్మాంగ
మైనది యని సకలాగమములుఁ
దెలియఁబల్కుట, ప్రకృతి గ్రంధి దాహకం
బగుట యాత్మకు హృద్యమై తనరుట
స్వప్రియరూపమై సంఘటిల్లుట దేహి
దేహసంస్కారమై తేటపడుట
పరభావహేతువై పాటించియుండుట
ప్రభవదన్యపరిహారమునఁ దగుట
|
|
తే. గీ. |
శమనవిద్రావణం బౌట శఠుల కేని
యనిశకుశలాత్ములైన చేతనుల కేని
భుక్తిముక్తులు గల్గు నాపూర్ణమహిమ
చక్రలాంఛన మిలఁ బ్రశస్తములఁ దాల్ప.
| 246
|
తే. గీ. |
శంఖచక్రాదిహీనుఁడౌ జడుఁడు భోజ
నాదికర్మంబులం దయోగ్యత వహించి
విష్ణుభక్తిపరాయణవిబుధవర్గ
పంక్తి యుండంగఁ దగఁడు దుష్పాపి యగుట.
| 247
|
క. |
హరిభక్తిసమేతులఁ గని
ధరలోపల శంఖచక్రధారణము సభాం
తరముల నిందించిన వాఁ
డరయఁగఁ బాషండు [66]లండ్రు రాజన్యవరుల్.
| 248
|
వ. |
అంత నవ్విప్రుండు తప్తచక్రాదిభూషితుండై యూర్ధ్వపుండ్రంబులు
పూని విష్ణుశక్తులను గ్రహింప నారాయణపదాంభోజంబులు సేవిం
చుచుఁ బుత్రదారబంధుసహితుండై యైహికంబు లనుభవించి యంత
మున నిరపాయపదంబు నొందె. ఈయదుగిరిప్రభావంబు వినినఁ
బాపనిర్ముక్తులై ముక్తి నొందుదురని నారదుండు సవిస్తరంబుగా
నానతి యిచ్చె నంత.
| 249
|
మ. |
సమరోర్వీపరతత్త్వసాంశయికవాసవ్యాత్మబోధక్రియో
ద్యమసిద్ధాంతికయోగశాస్త్రమయగీతాధ్యాయమాత్రామరు
ద్ద్రుమనిత్యానతపార్వతీరమణవిద్యుద్వాదరజ్యజ్జటా
విమలారుణ్యపునఃపునఃప్రకటనావిద్యోతిపత్పల్లవా!
| 250
|
క. |
ఉద్ధవనామకహృదయ మ
హోద్ధవసంధాన సౌహృదోదితభాషా
శుద్ధ దయాంచితభూమ స
మిద్ధత భౌమాగ్రబలసమిద్ధతతేజా!
| 251
|
మయూరవృత్తము. |
పతగకేతన! వ్రజనికేతన! పాపశాశన! పూతనా
సుతనుదారణ! దురితవారణ! నూరితోషణకారణా!
యతిదృగంజన! యార్తిభంజన! యాప్తరంజన! యంజనా
ద్రితసుభాసుర! విదళితాసుర! దీప్యమానమహీసురా!
| 252
|
గద్యము
ఇతి శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర,
కాశ్యపగోత్రపవిత్ర శ్రీమదల్లాడు నరసింహ ప్రణీతంబైన
నారదీయపురాణంబునందు ద్వితీయాశ్వాసము.
శ్రీకృష్ణార్పణమస్తు.