నారదీయపురాణము/తృతీయాశ్వాసము

వికీసోర్స్ నుండి

నారదీయపురాణము

తృతీయాశ్వాసము

క.

శ్రీరాధాహృదయేశ్వర
పూరితయమునానికుంజపుంజవిహారో
దారమనోరథదుర్మద
కౌరవ్యమనోగ్రదావకంబుగ్రీవా!

1


వ.

అవధరింపు మట్లు నారదుఁ డెఱింగించిన మునులు విని ప్రశ్నాంత
రంబునకు నుపక్రమించిరని సూతుండు శౌనకాదుల కిట్లనియె.

2


మ.

ధరలోనన్ హరిభక్తకోటి కపరాధంబుల్ జనుల్ సేయఁ ద
ద్దురితంబుం బరిహారముం దెలిపి సంతోషంబు గావించి తీ
వరయన్ లోకములెల్ల మే లనఁగ దత్తాత్రేయుఁ డామ్నాయచా
తురి పాషండులనెల్ల నయ్యదుగిరిన్ దూలించె [1]మున్నేగతిన్?

3


క.

వరవైష్ణవమౌళి పరా
శరుఁ డేచొప్పున నొనర్చె సన్మతి యదుభూ
ధరమున విష్ణుపురాణం
బరయఁగ నోమౌనినాథ యానతి యీవే.

4

పాషండమతభేదవచనము

వ.

అనిన (నతఁడు వారికి) నిట్లనియె. కాణాదశాక్త్యపాషండజైన
ప్రముఖులు నరకాంగారవర్ధనులై విజ్ఞానం బొకానొకప్పుడు [2]చెఱచి
దేహవ్యతిరిక్తంబైన యాత్మ లేదు. కేవల[3]మును దేహమె యాత్మ యనుట
యర్హం బని తెలియంబడుచున్నది గాన దేహానురూపంబుగా వర్తింప
వలయు. తపోయజ్ఞదానయోగార్చనంబులు సేయుట వృథాయా
సంబు లని తత్త్వంబునం జూచువారిని మహీతలంబున మోహంబు

నొందింతురు. కొంద ఱాత్మ దేహభిన్నం బని యెఱింగియు నాదేహంబు
నకు క్షణవినాశత్వంబు తర్కకర్కశులై పల్కుదురు. కొందఱు
దేహవ్యతిరిక్తంబైన యాత్మకు నాదేహంబునందు నుండుట నంగీకరించి
యంతర్యామి లేఁడందురు. కొంద ఱాపురుషుని శేషకారణం బని యంగీ
కరించి బ్రహ్మఁగాని తదన్యునింగాని యొకనిఁగాఁ బ్రతిపాదింతురు.
చిదచిద్రూపభేదంబున జీవేశ్వరవిభాగంబు గావించి ప్రమాణసిద్ధమై
సకలంబు నొక్కటియే యని పల్కు దురాత్మ తన్మాత్రరూపంబు
గాని జీవుండు గాఁ డీశ్వరుఁడు గాఁడు. ఆదేహమునకంటె నధికంబగు
వివర్తములను దానికంటె నధికముగాను[4] గొందఱు పల్కుదు రిది
విష్ణుమాయామోహితులై ప్రతిభామాత్రశరణులై పలికిరి. ప్రవాదకు
లైనవారు వాదంబులు ప్రమాణవిరోధులై నిరాలోకంబైన లోకంబును
నిందించిన నంత నాజ్ఞానంబు విస్తృతంబైన కలశాంబుధియందు విష్ణు
పాదంబులం బడి వేదంబులు మొఱలిడుచు మాధవా! సమస్తచిదచిద్వస్తు
శేషివి నీ వగుట యీయర్థంబునందు ననాదినిధనంబులగు మేమే
ప్రమాణంబు సత్త్వస్థు లిందులకుం బ్రమాత లెవ్వనికి నేతత్త్వంబు
దోఁచు నాతత్త్వంబు దైవతం బండ్రు. వీనికిం బ్రమాణము పాషండ
వాదములు మ్లేచ్ఛదేశనివాసు లిందులకు దేశికులై యుండ్రు. విశుద్ధుండగు
నాత్మకు స్నానాదులచేత నెటుల సిద్ధి యగునని స్నానాదికం బిచ్ఛా
వాదంబుచేత లుప్తంబు గావించి దుర్విజ్ఞానానువర్తులచేత వర్ణాశ్రమా
చారంబులు వదలియుం డ్రధ్యాత్మజ్ఞానంబు లింటింట నన్యప్రకారంబున
నుండుం గావున విజ్ఞానంబు నిర్వహింపవే యీశ్వరా! యని వేదంబులు
విన్నవించిన శ్రీపతి యిట్లనియె.

5


మ.

ధరణీమండలి నే గురుండ నయి శాస్త్రంబుల్ ప్రకల్పింతు మీ
రురుతేజంబున శిష్యులై మెలఁగుఁ డన్యోన్యానువాదంబునన్
చరితార్థత్వము గల్గి గెల్చెదము పాషండాలి నేఁ డంచు నా
హరివిద్యానియతాత్ముఁడై మెఱసి దత్తాత్రేయుఁ డయ్యెం ధరన్.

6


సీ.

కౌపీనకవచ[5]శిక్యత్రిదండ్యుపవీత
                       ములు పంచయాత్రంబు లలవరించి
మస్తశిఖాభిరామ్యంబును లలితోర్ధ్వ
                       పుండ్రచిహ్నములు ప్రభూతలీల

గలిగి సన్యాసియై కమలాక్షుఁ డట్లుండ
                       నుచితవేదములు బహ్వృచుఁ డనంగ
నాధర్వణికుఁ డన నధ్వర్యుఁ డన సామ
                       గుం డన సాంఖ్యలు దండిమెఱసి


తే. గీ.

యమ్మహాత్మునిశిష్యత్వ మాచరించి
యంగషట్కంబు నిజశిష్యులై చెలంగఁ
గలిగె నిజభక్తిపేరఁ బుష్కరిణి యనఁగ
నొక్కతీర్థంబు సకలలోకోత్తమంబు.

7


తే. గీ.

మానవాకారములను మీమాంసధర్మ
శాస్త్రగణమును న్యాయవిస్తరము దత్పు
రాణములుమించె నారమారమణుఁ డిట్లు
ఘనత వర్తించె [6]బహుశిష్యగణము లమర.

8


తే. గీ.

జగతిఁ బాషండశింశుపాషండదావ
వహ్నియై ప్రాంతదేశనివాసులైన
వారి శిక్షించె ధారుణీవలయమునను
జ్ఞానసంపత్తి వర్ధిల్ల సంఘటించె.

9


తే. గీ.

రూఢి శాండిల్యుఁడను మునీంద్రుండు మున్ను
బాంచరాత్రప్రమాణప్రభావశక్తి
నాగమార్థంబు వ్యర్థమౌ న ట్లొనర్చు
శఠులఁ బాషండ జినులను సంహరించె.

10


తే. గీ.

రాహుదంశనమునఁ బాసి యాహిమాంశుఁ
డలరుగతి మంచుతెరఁ బాసి యర్కబింబ
మంబరమునఁ బ్రకాశించునట్లు జ్ఞాన
మతిశయం బందెఁ బాషండు లణఁగినపుడు.

11

వ్యాఘ్రవానరకిరాతసంవాదము

వ.

ఇట్లు పాషండఖండనంబు గావింప నన్నిదిక్కులం దిరిగి వేదంబులు
కల్యాణతీర్థతీరంబున శాండిల్యసమేతుండైన దత్తాత్రేయుని గాంచి
స్వామీ! యొకయాశ్చర్యంబు చూచితి మనిన నది యేమి యని యడి
గిన నొకవానరుం డరణ్యంబున నొక్కనగాగ్రంబున నుండి వ్యాఘ్ర

భీతుండై కిరాతుం డొక్కరుండు నానగాగ్రంబునందే యుండినంతఁ
గిరాతుండు నిద్రింప వానరుం బిలిచి వ్యాఘ్రం బాఁకొన్నదాన [7]నీకిరాతుని
మద్భక్షణంబుగాఁ గోరి వచ్చితి [8]నీశాఖాగ్రం బూఁచిన వీఁడు వడిన
వీని భక్షించి యేఁగెద ననిన (నవ్వానరుండు) భయాతురుం డగుట వీని
నెట్లు పడనూఁతు నుత్తములు శరణాగతులం గావందగునని యంగీక
రింపకయుండె నంత నవ్వానరుండు నిద్రింప వ్యాఘ్రంబు కిరాతునిఁ
జూచి నిన్ను మ్రింగవచ్చినదాన నీ వీవానరంబుఁ బడంద్రోఁచిన
మెసంగి చనియెద ననఁ గిరాతుండు వానరంబు[9]ను బడంద్రోచె
(వ్యాఘ్రం బవ్వానరునిఁ జూచి) [10]నిన్ను విడిచెద శాఖాగ్రంబునకు నెక్కి
[11]వానిం బడంద్రోయుమని యనిచిన నమ్మహీరుహాగ్రంబునకు నెక్కి
యూరకయున్న వ్యాఘ్రంబు [12]వానిం ద్రోయుమనిన వానరం
బిట్లనియె.

12


మ.

తగునా యీతనిఁ ద్రోవ నాకు నిఁక నత్యంతాతురుండై గృహో
పగతుండై పగతుండు వచ్చినఁ గృపాపారాయణుల్ కావఁగాఁ
[13]నగు నేరంబులు గల్గనీ దురవలేపాంధుండు గానీ దుర
ధ్వగుఁడై యుండిన నుండనీ మనుచుటే ధర్మంబు లోకంబునన్.

13


క.

అని వానరముం దగఁగా
[14]గని వచ్చితి మనుచు వేదగణములు పలుకన్
విని దత్తాత్రేయుం డ
య్యనఘుని శాండిల్యుఁ గాంచి హర్షోన్ముఖుఁడై.

14


మ.

హరిశిష్యుల్ నిగమంబు లీకరణి నత్యాశ్చర్యముం బొంద ని
ద్ధరలోనన్ శరణాగతావనమహాధర్మంబె ధర్మంబు త
త్పరమాత్మాశయమెల్ల నిట్టిదియె నీభావంబునందున్ [15]మహ
త్తర మేతద్గుణ మంచుఁ దోఁచె నిది సత్యంబే ప్రమాణం బగున్.

15

తే. గీ.

అరసి శరణాగతులఁ బ్రోచునదియె ధర్మ
మగుట యేము నెఱుంగుదు మనఘ తిర్య
గాత్మలకు నిట్టిగుణ మెట్టు లమరె ననుచు
వేదములు పల్కె నపు డతివిస్మయముగ.

16

నాళీజంఘుని కథ

సీ.

వెలయఁ దిర్యగ్జంతువులను దిర్యగ్జంతు
                       వులకేని శరణాగతులను బ్రోవఁ
బరమధర్మము మున్ను భవ్యశీలంబైన
                       గంధర్వమిత్రమై ఘనత కెక్కు
రాజహంసంబు నాళీజంఘమను [16]పేరు
                       గలిగినయది సిరి గాంచి మెలఁగ
దారిద్ర్యమున ధరాతలమునఁ దిరుగుచు
                       నొకఁడు తత్సన్నిధినుండఁ గాంచి


తే. గీ.

ద్విజుని యట్లనె [17]తోఁచెదు, దీనవృత్తి
నేల వచ్చితి విచటికి? నేమి సేయ
వలయు నన బ్రాహ్మణుఁడు లేమివలన వచ్చి
నాఁడ నన హంస మప్పు డిట్లనుచుఁ బలికె.

17


శా.

గంధర్వేంద్రుఁ డొకండు మత్సఖుఁడు విఖ్యాతుండు దీనార్థి స
ద్బంధుం డాతఁ డొసంగు నీకు ధనసంపల్లబ్ధి యంచున్ స్వసం
బంధం బంతయుఁ దెల్పి రమ్మనుచు సంప్రార్థింప గేహంబులో
నంధోలేశము లేక స్రుక్కి చనె హంసావాస మావిప్రుఁడున్.

18


క.

ఆలో నిద్రాకులమగు
నాళీజంఘంబు కంఠనాళము విప్రుం
డాలోలతఁ బిసికిన వాఁ
డాలోకము చేరె భాస్కరాలోకమునన్.

19


సీ.

బ్రాహ్మణాధముఁడు తత్పలలంబు భక్షించి
                       నిద్రించునప్పు డానీడజంబు
పక్షముల్ గంధర్వపతి భటుల్ వీక్షించి
                       విప్రుని నెమ్మోము విన్నదనము

గని వీఁడె హింసించెఁగా యని వాని భం
                       జించిరి నాకంబు చేరె [18]రాజ
హంసంబు బ్రాహ్మణుం డరిగె హంసకుమార
                       మందిరంబునకు శ్రీమహిమ గలిగి


ఆ. వె.

యంత హంస మడిగె నయ్యమరవరుల
నన్ను నోర్చు బ్రాహ్మణవరుఁ డకట
యెందు నుండె నాకు నెఱుకసేయుం డన
ననిరి నరకవాసి యయ్యె ననుచు.

20


తే. గీ.

అమరులకు మ్రొక్కి యారాజహంస మాత్మ
సుకృతమున నేఁడు బ్రాహ్మణు సురపురమున
కధివసింపంగఁ గృపసేయుఁ డనుచు వారి
పాదనీరేరుహంబులఁ బవియె నంత.

21


క.

నిను హింసించిన పాతకి
ననఘా! నాకమున నునుపు మంటివి యేత
జ్జనులకు నిచటికి రావ
చ్చునె? యీ కార్యంబు వలదుసూ నీ కింకన్.

22


ఆ. వె.

అనిన మఱియు నతఁడు ప్రార్థింప నిర్బంధ
మున సుపర్వులెల్ల ననుమతింప
నాకమునకు వచ్చె నరకాంతరము మాని
భూసురుండు దుర్గుణాసురుండు.

23


క.

అనుకంపాశీలము గాం
చినవారికి శరణమన విశేషంబునఁ బ్రో
చిన యది సువ్రతమని స
జ్జను లాడుదు రఖిలధర్మసారజ్ఞులలోన్.

24


తే. గీ.

ఒనరఁ బ్రత్యక్షనారాయణోక్తపాంచ
రాత్రసారాంశ మఖిలైకపాత్ర మతివి
చిత్ర మమలపవిత్రచరిత్ర మిందు
నెంచ శరణాగతత్రాణ మింత మించు.

25

వ.

ఇ ట్లన్యోన్యసల్లాపోత్ఫుల్లమానసులైన వారియగ్రంబునకు శిష్య
సహితుండై పరాశరుండు చనుదెంచి దత్తాత్రేయునకుఁ బ్రణామం
బాచరించి తదనుమతంబునఁ గుశలంబు విన్నవించి నిజాగమనకారణం
బేది యనిన నిట్లనియె. పులస్త్యవసిష్ఠవరదానంబునఁ దత్త్వమంతయు
నాకుఁ బ్రకాశంబయ్యె. మైత్రేయునకు నది విన బుద్ధి వొడమె. నీ
సర్వోత్తరదేశంబున నిలిచెద. నారాయణమునీంద్రుండు బదరి
కాశ్రమంబున కంటె నారాయణాచలంబు నాకుం బ్రియం బనియె.
మునిస్థానంబునుం గలదని యానతి యిచ్చి యిచట విష్ణుపురాణం
బితనికి బోధింపుమనినఁ దద్వచనంబునంబని వింటి. ఆ నారాయణుం
డన నీవే వేదపురాణాదుల కన్నింటికి నీవే ఫలంబు నేఁడు నాదృష్టికి
నమృతపారణంబయ్యె [19]నను పరాశరునకు దత్తాత్రేయుం డిట్లనియె.

26


క.

తత్త్వము నీ విక్కడ [20]విని
తత్త్వమున యథార్థఘటన దగ బోధింపన్
సత్త్వాధికుఁ డవును సుధీ
సత్త్వాధికుఁడవును నీవె చతురత నరయన్.

27


క.

ప్రియమా సర్వోత్తర మతి
శయమున నేతత్పురాణసారం బిట్లన్
బ్రియతమమై కర్ణామృత
మయి మెఱయన్ వినియెదను నయంబున నేనున్.

28


ఆ. వె.

అని యనుజ్ఞ నొసఁగ నాపరాశరముని
హరియ పరమతత్త్వ మనుచుఁ దెలుప
విమలరూపమైన విష్ణుపురాణంబు
సంఘటించె శుద్ధసత్త్వమయము.

29


సీ.

తనదు కల్యాణతీర్థమునకుఁ గించిదు
                       త్తరభాగమున మహోదారమగు వ[21]
రాశరాశ్రమ మఘరాశిమాలానల
                       మాతీర్ధమణి ప్రతీచ్యంతరమునఁ

దగు పంచభాగవతస్థాన మాతీర్థ
                       మున కెంచఁ బ్రాగ్భాగమున వరాహ
దేవతాస్థాన మాతీర్థంబు దక్షిణ
                       స్థలిని సీతారణ్య మలరు నచట


తే. గీ.

లక్ష్మణుఁడు గట్టెఁ బర్ణశాలాగృహంబు
రామజనకసుతామనోరమము గాఁగ
స్థానములు నాల్గు నిట్టివి సంభవించె
నట్టి పుణ్యస్థలంబున యతివరేణ్య!

30


తే. గీ.

అంత మైత్రేయసహితుఁడై యాపరాశ
రుండు శాండిల్యమౌనిశార్దూలు వినయ
శీలు నత్యంతభక్తి భూషించి యపుడు
వినయసంపన్నుఁడై గారవించి పలికె.

31

తులసీహరివాసరాదిమహత్త్వము

తే. గీ.

ఎంచఁదగుఁ బాంచరాత్రప్రపంచవక్త్ర
మీ రెఱుంగనియది యింతయేని లేదు
ఘనదయానిధి దానిలోఁ గల విశేష
మంతయును నా కెఱింగింపు మాదరమున.

32


క.

శ్రుతులందుఁ గానుపించక
యతిగోప్యంబైన యర్థ మది లోకశుభ
స్థితి మెఱయఁ బాంచరాత్రం
బతిధృతి నారాయణుఁడు సమగ్రతఁ జేసెన్.

33


క.

తులసీహరివాసరని
శ్చలమాహాత్మ్యములు విష్ణుసంతతసేవా
ఫలములునుం దద్వాసనఁ
దెలివి పడన్ నేఁడు మాకుఁ దెలుపు మునీంద్రా.

34


వ.

అనిన శాండిల్యుం డిట్లనియె. భవతారకంబై సర్వజగత్కారణంబై
శాంతానందంబై మహానందంబై సత్యజ్ఞానమయంబగు మహా
రూపంబు గలదు. దానికంటెఁ బ్రియతరంబై వైకుంఠవాసిదృశ్యంబై
గుణభాషాదులచేత నద్భుతంబై మూర్తంబైన బ్రహ్మంబు
గలదు. దానియందు ననేకరూపంబులు గలవు. దాననే జీవనంబై

పరమానందంబున విహరించు. విష్ణునకు దివ్యరూపంబు లనేకం
బులు గలవు. వాసుదేవాదులు కొన్ని, కేశవాదులు కొన్ని, పద్మ
నాభాదులు కొన్ని, లక్ష్మీగాఢోపగూఢంబులైన రూపంబులసంఖ్యం
బులు గల వనురూపరూపంబుచే నేర్పడిన సర్వశ్రేష్ఠులగు లక్ష్మీనారా
యణులకు దాసదాసీజనంబులైన బ్రహ్మరుద్రాదిదేవతలు గలరు.
నారాయణుండు సృజించి రక్షించి యంతంబున విశ్వంబు హరించు,
నందునకు లీలం గారణంబు పృథివి ఘటికాయంత్రనిత్యారోహావ
రోహంబులచేఁ గర్మమాలికయందుఁ దిరుగువారిఁ జక్రాయుధుండు
తత్కర్మచక్రంబువలన(నుండి) నివారించుం గాన తచ్చరణార్చ
నంబే ప్రతిదినంబు గావింపవలయు. వర్ణాశ్రమాచారభ్రష్టులు విష్ణు
పూజార్హులు గారు. మఱియును.

35


క.

హరిపూజకుఁ దులసీదళ
మరయఁగ నానందకంద మది లేకున్నన్
స్మరియించినఁ దత్ఫలదం
బరవిందాక్షునకుఁ దులసి యర్హం బెందున్.

36


తే. గీ.

పద్మకల్హారచంపకభర్మకుసుమ
పూజఁ గావించ మెచ్చఁ డంభోజనాభి
శ్రీకరంబైన నవతులసీదళములఁ
బూజఁ గావింప [22]మెచ్చు నీభూమిలోన.

37


వ.

ఇందునకుఁ బురావృత్తం బెఱింగించెద.

38


సీ.

ధర్మకేతుండను ధరణీశ్వరుఁడు మున్ను
                       మునివృత్తిఁ జేసె నమోఘమహిమ
ధర్మంబులన్నియుఁ దద్ధరాశాసిత
                       హితుఁడైన నిజపురోహితునిఁ బిలిచి
యఖిలధర్మంబులు నఖిలవ్రతంబులు
                       నఖిలయజ్ఞంబులు నాచరించి
నాఁడ నారాయణనగమున నారాయ
                       ణార్చనం బొనరింతు ననుదినంబు

తే. గీ.

నిద్ధశీల! పురాణంబులెల్ల మాధ
వార్చనంబే ప్రశస్తమౌ ననియె నాకు
విష్ణుసంతోషకారణవృద్ధి కెద్ది
సాధనము? తెల్పవే యని సన్నుతింప.

39

ధర్మకేతుఁడనురాజు చేయు నారాయణార్చనాప్రకారము

తే. గీ.

సకలసుమములచేతఁ గాంచనసుమముల
చేత గంధాదికంబులచేత నఖిల
భక్ష్యములు వ్యంజనములు పాకశుద్ధి
విమలముగఁ జేసి హరికి నైవేద్య మొసఁగి.

40


వ.

సేవించుమని పురోహితుం డుపదేశించిన.

41


మ.

కనకం బెంతయుఁ దెచ్చి పద్మసుమనఃకల్హారచాంపేయకాం
చనపున్నాగకదంబకుంద[23]వకుళాంచద్రూపముల్ చేసి త
ద్ఘనరత్నాంకితపుష్పమాలికలు వేడ్కన్ మీఱఁ గల్పించి యా
ననలం బూజ యొనర్చె మహీనాథుండు హర్షంబునన్.

42


వ.

అంత.

43


ఆ. వె.

భక్తిమై సహస్రభారప్రమిత[24]నయి
వేద్య మిచ్చి యాదివిష్ణుదేవు .
నభినుతించి యవనియందు దండానతి
చేసి నృత్తమాడి చెలఁగు నంత.

44


సీ.

తత్కాలమునను యాధాలాభనామకుఁ
                       డవనీసురుం డొకఁ డనఘనిష్ఠ
నూని యేకాదశి నుపవాస మొనరించి
                       నియతవ్రతంబున నయము గాంచి
నరులు మెచ్చఁగ యోజనత్రయాంతర్హి త
                       దేశంబునందు నుద్దీప్తి మెఱసి
యుండి ద్వాదశి నా సముజ్జ్వలతులసికా
                       మాలికఁ బూజించి మహిమ వెలయ

తే. గీ.

నపుడు నైవేద్య మర్పించె నామహీత
లాధినాథుండు నారాయణాద్రినాథు
భక్తిఁ బూజించి యన్నంబు బ్రాహ్మణులకు
నెమ్మితోడ నొసంగి మన్నించి మించి.

45


తే. గీ.

సౌధభాగంబు నాసార్వభౌముఁ
డుచితసద్గోష్ఠి వర్తింపుచున్నయెడను
వచ్చి రిరువురు గంధర్వవరులు మింట
యదుగిరీంద్రునిఁ బాడుచు నద్భుతముగ.

46


వ.

రత్నాంగద విచిత్రాంగద నామంబులం బ్రసిద్ధులగు నాగంధర్వ
వరులు నారాయణుండు రాజదత్తసువర్ణకుసుమాదికం బంగీకరింపక
యాధాలాభదత్తంబైన తులసికామాలికయె మౌళియందుఁ దాల్చెననుచు
నేఁగునెడఁ దద్వార్త విని ధర్మకేతుండు నారాయణసన్నిధానంబుఁ జేరి
యట్లనె విలోకించి విస్మయంబంది యాధాలాభుని యున్నకడకుం జని
మ్రొక్కి మధువిరోధి తత్పూజఁ గైకొనుటయు నిజపూజం గైకొనకుండు
టయు నెట్లయ్యెననిన నతం డిట్లనియె.

47


తే. గీ.

ఏ దరిద్రుండ నర్థింప నెఱుఁగ నెట్లు
వాసుదేవుని [25]మెప్పించువాఁడ నెట్టి
ధర్మ మొనరింప శక్తుండ ధరణినాథ
ధరణితలమున నీ కిట్లు [26]తగును గాఁక.

48


వ.

అదియునుంగాక యాపరాత్మ తా నేమి సంకల్పించుకొనియుండునో
యది తానె కల్గుచున్నయది. కించిత్తేని యకృతమయిన యది యపే
క్షించఁడు గావున మహారాజా! నీచేతం జేయఁబడినయది చూడంబడక
యుండుట నిజం బనిన మఱియుం బ్రార్థించిన [27]నిట్లనియె.

49


మ.

తులసీమాలిక వైచి విష్ణునకు సంతోషంబుఁ బుట్టించి [28]ని
చ్చలు నైవేద్య మొసంగి వందనములున్ సద్భక్తి గావించుచున్
[29]లలి నష్టాక్షరమంత్రరాజమున నుల్లం బుల్లసిల్లంగ ను
జ్జ్వలనిష్ఠాప్తి జపంబు సేయుదు మహోత్సాహంబు దీపింపఁగన్.

50

భగవద్దర్శనము చేయు విధానము

తే. గీ.

ఎంచ నారాయణునకంటె నితరదేవుఁ
డనుపమాష్టాక్షరంబైన యట్టిమంత్ర
మౌళికంటెను మఱియన్యమంత్ర మిందు
గురునకంటెను వేఱొకగురుఁడు గలఁడె?

51


వ.

వినుము రాజ! ఏకవస్త్రంబుఁ గట్టి ప్రణామంబు సేయుట, వస్త్రంబు
వలెవాటు వైచుకొని మ్రొక్కుట, తైలా[30]భ్యంజనమున భజించుట,
కృష్ణకంబళధారణంబున నీక్షించుట, నఖకేశాదివిక్షేపంబునం
గాంచుట, యెదుట నిష్ఠీవనాదికంబు లొనర్చుట, పర్యంకబంధ
కరణంబున మెఱయుట, [31]యాసనపరివర్తనంబున విజృంభించుట,
[32]యాసనపరిగ్రహంబున వర్తించుట, లాలావిసర్జనంబున, విష్ణు
కథాశ్రవణరాహిత్యంబున, సంధ్యాహైన్యంబున, ననాచారంబున,
నస్నాంబున, నన్యదేవతాగీతపుష్పార్చనంబున, నన్యదేవతా
ప్రశంసంబున, విష్ణుముఖావలోకనంబు సేయక యన్యముఖావ
లోకనంబు సేయుచుండుటను, బానప్రదేశంబున విష్ణుభక్తీతరోపచా
రంబున, శ్మశానంబునకు నేఁగి స్నానంబు చేసియేనియు నర్చించుట,
మూర్ఖప్రదేశంబున నైవేద్యవీక్షణంబున, నివేద్యకుసుమాఘ్రాణం
బునఁ బూజాద్రవ్యాపలాపంబున, నిజబద్ధప్రలాపంబున, భగవ
ద్గృహంబున నుండి ప్రమత్తుండై తనయున్నచోటికిం భగవంతునిం
దెప్పించుకొనుట, కలహప్రవర్తనంబున నేతద్దేవతాద్రవ్యం బన్య
ప్రదేశంబునం బొందించుట, దుష్టుభాజనంబుల సమర్పించుట, లేవక
ప్రసాదంబు స్వీకరించుట, భగవత్సన్నిధి శయనాదికంబుఁ గావించుట,
తులన్యవమానంబు సంఘటించుట, యనర్హప్రసూనంబులం బూజించుట
యన్యులకు రహస్యం బెఱింగించుట, పుత్రాదిచింతనంబున, స్త్రీ
సంభాషణంబున, విష్ణగీతాన్యగీతోపలాలనంబున, విష్ణుమందిరంబునం
బ్రవర్తించుట యపచారంబుల తదపచారంబులం బ్రహ్మకల్పంబులు
నరకం బనుభవించు. ఈశ్వరుండు తత్పూజయుం గైకొనం డీదోషంబు
లలో నొకటి యెయ్యదియైన నీయందుఁ గలిగెనో కాక యనిన విని
రాజు కౌతూహలంబున.

52

క.

తులసిన్ సకలమనోరథ
ఫలదాయినిఁ దెచ్చి విష్ణుపాదాంభోజం
బులఁ బూజించెన్ హరికృప
గలిగెం దత్క్షణమునందె క్ష్మాపాలునకున్.

53


క.

తులసీతులసీమాంతర
ముల [33]నెందును బొంద రఖిలపుణ్యనిధానం
బల భూతభావివస్తువు
లిలలోఁ దత్సదృశవస్తు వెద్దియుఁ గలదే?

54


క.

తులసీకాననసౌరభ
కలితంబగు మారుతంబు గలచో యమదూ
తలు దిరుగ వెఱతు రుర్వీ
తలమునఁ దత్తులసిఁ బోలు ద్రవ్యము గలదే?

55


క.

తులసీ తులసీ యనుచున్
బలుకు నరోత్తముఁడు పరమపదమున లక్ష్మీ
లలనావల్లభపాదో
ల్లలనాకలనాదిసత్ఫలంబు వహించున్.

56


సీ.

దర్శనశ్రవణకీర్తనపరిస్పర్శన
                       స్మరణంబు లొనరించు జనులనెల్లఁ
దులసీవనము పవిత్రులఁ జేయు వెనుకటి
                       పదితరంబులు మీఁది పదితరములు
తులసీదళంబు లెందు వసించుఁ బద్మవ
                       నంబు లెచ్చటనుండు నలిననాభ
కీర్తనం బెందున వర్తిలు భాగవ
                       తోత్తము లేవంక నుంద్రు విష్ణుఁ


తే. గీ.

డచట వసియించు శంఖచక్రాబ్జశార్ఙ్గ
హస్తుఁడై సర్వలోకప్రశస్తుఁడై స
మస్తుఁడై కాన నీవును మనుజవర్య!
శ్రీధరార్చన తులసిచేఁ జేయవలయు.

57

క.

తులసి యెటువలెఁ బ్రియంబగు
జలజాక్షున కట్ల ప్రీతి సంపాదించున్
వెలయఁగ ద్వాదశి యేత
త్ఫల మేమని చెప్పఁగల నృపాలవతంసా!

58


తే. గీ.

ఘనతతోశయనము మదంగపరివర్త
నంబు నుత్థానమున సంకరంబు మెఱయు
హరిదినంబుల నుపవాస మందకున్న
హృదయశల్యంబు వెట్టిన ట్లెనసియుండు.

59


ఆ. వె.

అనిన భగవదుక్తి యనుమాన మొనరించు
నట్టినరుఁడు బాహ్యుఁ డద్దురాత్ము
సద్గుణంబులెల్ల శవవిభూషణములు
వంచకుండు వాని నెంచనేల?


క.

ఏకాదశి[34]వంటి వ్రతం
బేకలుషాత్ముండు సే యఁడిల నెన్నిక దా
నాకలుషాత్ముని సుకృతం
బాకడ భస్మాహుతి యగు ననియెన్ శ్రుతియున్.

61


క.

గురుశాసనానులంఘన
శరణాగత[35]సుజనహరణ చక్రాయుధ వా
సరభోజనములు దురితాం
తరములకున్ సమము లనుచుఁ దలఁచిరి పెద్దల్.

62


వ.

కావున శుక్లపక్షేకాదశీదినంబున నుపవసించి నారాయణభజనంబు
సేయుము. తులసీదళసమ్మిశ్రతీర్థంబుతో హరినైవేద్యంబు భుజించు
వారు షోడక్యలాబూబింబజంతుఫలకళింగకరకంబులు వాసు
దేవార్చనావిధికి నర్హంబులుగా వశనభక్షకధేనుక్షీరఘృతంబు
లెప్పటికి హరికి నర్పింపఁదగదు. హవిష్యంబున విష్ణునివేదితాన్నంబు
సేయవలదు. భక్త్యాదరంబులు నారాయణనివేదితాన్నంబు భుజించిన
సంసారసాగరంబు తరియింతు రనిన శాండిల్యుని వచనంబులు విని
పరాశరుండు సర్వంబు నాచరింపుచు నారాయణాచలంబున నారాయ
ణానుగులైన దత్తాత్రేయశాండిల్యమైత్రేయాదులతో నుండె ననిన విని
మునీంద్రు లిట్లనిరి.

63

తే. గీ.

ఘోరసంసారతాపనివారణంబు
చేసి పలికితి యో మునిసింహ! యట్టి
జనుఁడు [36]వైకుంఠగంగాంబుసక్తుఁ డగుచు
యదునగంబునఁ బరధామ మందె నెటుల?

64


వ.

అనిన నారదుం డిట్లనియె.

65

విష్ణుచిత్తుని కథ

సీ.

ఆచారపాలకుం డనుబ్రాహ్మణోత్తముఁ
                       డొకఁడు తద్భార్య లోకొత్తరైక
ధర్మచారిత్ర వర్ధని యనునది వారు
                       విష్ణుపూజాసక్తి విడువ కెపుడు
వర్ణాశ్రమోచితవరకర్మము లొనర్చి
                       శాస్త్రనిషిద్ధముల్ సంత్యజించి
యంభోజనేత్రనిజాజ్ఞావిలంఘన
                       భీతులై నిజధర్మరీతిఁ దిరిగి


తే. గీ.

రర్హతరసత్పదార్థంబు లర్పితములు
చేసి తచ్చేషమున నుల్లసిల్ల దేహ
ధారణ మొనర్చుకొని రమాధవచరిత్ర
సంతతాహ్లాదరసమున సంచరించి.

66


శా.

ఉన్నన్ వారికిఁ గల్గెఁ బుత్రుఁడు గుణాఢ్యుం డుత్తమాచారసం
పన్నుం డాఢ్యుఁడు సాధుసేవకుఁ డదంభస్వాంతుఁ డశ్రాంతుఁ డు
త్పన్నజ్ఞానవివేకశాలి హరిసద్భక్తిప్రవీణుండు వి
చ్ఛిన్నాహంకృతిదోషవర్జితుఁడు లక్ష్మీనాథసమ్యక్కృపన్.

67


ఆ. వె.

అతని విష్ణుచిత్తుఁ డనిరి సుధీవ్రత
నేతలంచితోపనీతుఁ డగుచు
వేదములును శ్రుతులు వేదాంగములు వేగ
నభ్యసించె జగము లౌననంగ.

68


వ.

అధ్యాత్మశాస్త్రంబు సర్వవేదియగు సన్మార్గదేశికుని వలన నెఱింగి
సర్వార్థసాధనంబయిన యష్టాక్షరమంత్రంబు గాంచి విద్య లెఱింగిన
తల్లిదండ్రులు వైవాహికవిధికి నుపక్రమింప విష్ణుచిత్తుం డిట్లనియె.

69

క.

పరిణయ మొల్లన్ బుత్రాం
తరవైభవ మొల్ల బంధుతతి యే నొల్లన్
హరిపాదాంబుజసేవా
పరతంత్రత యొకటి నాకుఁ బ్రాప్యం బరయన్.

70


వ.

అని విష్ణుచిత్తుండు వైరాగ్యంబు వహించి సకలమునిశరణ్యంబగు నైమి
శారణ్యంబున కేఁగి యోగాసనాసీనుండై ప్రాణాయామాదిసంయుతుండై
యున్న నొకనాఁడు వేఁట వచ్చి విక్రమాభరణుండను రాజు విష్ణుచిత్తునిం
జూచి సకలగుణాభిరామయగు కన్యక నర్పించెదనని తలంచి.

71


ఉ.

భూసురబాలుఁ డెవ్వఁడొ యపూర్వగుణోన్నతుఁ డిద్ధదివ్యమౌం
జీసకలాపధన్యుఁడు విశిష్టవరేణ్యుఁడు బ్రహ్మచారి యో
గాసనశాలి కృష్ణవిమలాజినధారి మదీయకన్య కీ
భాసురమూర్తి భర్తయగు భాగ్యము లెన్నటికిన్ లభించునో?

72


వ.

అని చేరవచ్చి యతనింజూచి యిట్లనియె.

73


సీ.

మందహాసాన్విత మధురభాషిణి విశా
                       లాక్షి పూర్ణేందునిభాస్య పక్వ
బింబాధర సుకేశిపేశలభ్రూనాస
                       కంబుకంఠి లతాంగి కంజహస్త
గుణవతి కించిదంకుఠితవయోధర్మ
                       నిమ్ననాభి సుమధ్యనిరతిశయని
తంబ రంభాస్తంభధన్యోరుయుగళ [37]సు
                       హల్లకపాద మోహనకపోల


తే. గీ.

మత్కుమారిక మనువంశమౌళినైన
రాజ నేనిత్తు నాయర్ధరాజ్య మిత్తు
నేలు మేలగు నీకు నూహింప సుతుఁడ
ననఘఁ శంకింపవలదు విఖ్యాతచరిత!

74


వ.

అని బోధించిన నగుమొగముతో బ్రహ్మచారి రాజున కిట్లనియె.

75

సీ.

సగరపుత్రులు రాజ్యసంపన్మదంబునఁ
                       గపిలరోషాగ్నిశిఖాప్రదగ్ధు
లగుట మాంధాత గర్వాంధుఁడై లవణదై
                       త్యోగ్రశూలాహతి నుక్కడంగి
యుండుట పౌలస్త్యు నొడిసి [38]బంధించిన
                       కార్తవీర్యుని భుజాగ్రములు పరశు
ధార ద్రుంగుట ధరాధ్యక్షులు ముయ్యేడు
                       మాఱులు సమయుట మహితకీర్తి


తే. గీ.

బలి రసాతలమునఁ గ్రిందుపడుట నహుషుఁ
డజగరంబయి నాకలోకాధిపత్య
ముడిగి వచ్చుట తెలియవే యో నృపాల!
యొల్ల నీకన్య రాజ్యంబు నొల్ల నింక.

76


చ.

వలసినవాని కిమ్ము నృపవల్లభ నీసుత నంగరేఖ దాఁ
గలిగిననేమి? నాకు నది గానఁ గనయ్యెఁడు చర్మభస్త్రికా
తులఁబలలాంత్రశల్యములతో నతిహేయదురుగ్రవాసనా
కలితత రోఁతయయ్యెడు నికం బలుమాఱు వచింప నేఁటికిన్.

77


వ.

నృపా! నేను వైకుంఠసామ్రాజ్యంబుపై మనంబు గల్గి వర్తింపుచున్నవాఁడ
ననిన రాజు సంతోషంబు నొంది చనియె, నంత బ్రహ్మచారి యుగ్ర
తపంబు సేయ నింద్రుండు కలంగి శతాప్సరోజనంబుల నియోగించిన.

78


సీ.

తళతళ మెఱసె మందారమాలిక రంభ
                       యొయ్యారమునఁ (జూచె) నూర్వశి కుచ
కలశముల్ మెఱయించెఁ గల్యాణకౌముది
                       కన్ను లల్లార్చ [39]యగ్రమునఁ బొలిచె
నుద్యానమాలిని యుప్పొంగె మేనక
                       యమృతంబు వెదచల్లి యాననమునఁ
బయ్యెద నెరిజాఱఁ బరతెంచె వీణావి
                       నోదిని హరిణి యామోదభరము

తే. గీ.

గ్రమ్మ పువ్వుల నెఱికొప్పుఁ గప్పుకొనుచు
మురిపె మందె వసంతవల్లరి వినోద
మంది సొలసెఁ దిలోత్తమ యతివిలాస
లాలనశ్రీలఁ దనయందు మేలు చూపె.

79


వ.

ఇట్లు పదుగురు మొనయై నిలుచునంత.

80


క.

వనితాసేనలతో నా
ననవిల్తుఁడు దండు వెడలె నాతియుఁ దానున్
దనమిత్రుఁడు మునిమానస
వనజంబులు [40]కలఁక వొంద వైభవనిధియై.

81


వ.

అంత.

82


తే. గీ.

సత్త్వనిష్ఠ మహాసాధుజనశరణ్య
నైమిశారణ్యమునకు మన్మథుఁడు పూర్ణ
గర్వమున నేఁగి చొచ్చె నక్కడ ననేక
సంభ్రమంబులు చేసె వసంతుఁ డపుడు.

83


క.

చిగిరించి పూచి కాచెన్
నగములు కోవెలలు మ్రోసె నానా[41]వనులన్
సొగసై ఝంకారంబులఁ
బొగరెక్కి చరించె మధుపపుంజం బంతన్.

84


ఆ. వె.

ఏకవీరుఁడై సమిద్ధశౌర్యమున మా
కందకుసుమశరము కంతుఁ డిక్షు
కార్ముకమునఁ దాల్చెఁ గాననాంతరముల
[42]గుఱులు వైచి యార్చుకొనుచుఁ దిరిగె.

85


చ.

వలపులు గ్రుమ్మరించు నిడువాలికచూపులఁ జూచి పయ్యెదల్
బెళకఁగ గుబ్బచన్ను లొకబిత్తరి లాగునఁ జూపి గానముల్
పలుకులు నృత్యవాద్యములు భవ్యవిలాసకళాకలాపముల్
దొలఁకఁగ బ్రహ్మచారికడఁ దూకొని నిల్చిరి చుట్టు నంగనల్.

86

తే. గీ.

ఏమి చెప్పంగ మదిలోన నించుకేని
చంచలత లేక యాబ్రహ్మచారి యుండెఁ
గేశవార్పితమతులఁ జొక్కింపఁగలవె
మర్మభేదకకందర్పమాయలెల్ల?

87


తే. గీ.

శాంతహృదయుండు తద్బ్రహ్మచారి తన్ను
నిట్లు వంచింపఁజూచు నయ్యిందుముఖుల
విఘ్నకాపేయమున బహువిధములైన
కర్మములు సేసితిరి మీరు కలుషవృత్తి.

88


క.

కాన కపు లగుచు ముందఱఁ
గానక పులకండమట్లు కమ్మనిమాటల్
మాని ఘనకిలకిలార్భటి
తో నిగుడుచుఁ గ్రోతు లగుచుఁ దూలుం డనుచున్.

89


క.

శాపం బిచ్చినఁ బుచ్ఛక
లాపంబులతోడఁ గిలకిలధ్వానముతో
సౌపర్వకామినులు ల
జ్జాపరలై యేగి రపుడు చనియె మరుండున్.

90


క.

అమరావతి నుండక యా
యమరాంగన లెల్ల నందనారామములో
భ్రమ మందగ నిజతనూవి
భ్రమ [43]మందఁగ నపు డపత్రపం గ్రుంగి రొగిన్.

91


క.

అంత వసంతుం డీవృ
త్తాంతం బంతయును దద్బలాంతకునకు న
త్యంతార్భటి నెఱిఁగించిన
సంతాపము నొంది యతఁడు చని యచ్చోటన్.

92


సీ.

బ్రాహ్మణాకృతి నిల్చి బ్రహ్మచారిం గని
                       యర్హమే నీకు మహాత్మ! రోష
మప్సరాంగనలు కీశాకారములు దాల్చి
                       నందున ఫల మేమి యయ్యె నీకు?

నన దైవగతి నవశాత్ముండనై యిట్లు
                       సేసితి నన సురశేఖరుండు
నిజరూపము వహించి నిలిచి మదర్ధాస
                       నంబు నీ కిచ్చెద నాకలోక


తే. గీ.

సతులవైరూప్య మణఁగించు శాంతి నొంది
యనఁ బురందర స్వర్గసౌఖ్యంబు సకల
దుఃఖదము పుణ్య మడఁగ నధోగతిం బ
డంగఁ ద్రోయుట నరకఖండంబు గాదె?

93


వ.

అని బ్రహ్మచారి మఱియు నిట్లనియె.

94


తే. గీ.

విశ్వరూపునిఁ జంపి యీవిశ్వ మెఱుఁగ
బ్రహ్మహత్యామహాపాప[44]బహుళదుఃఖ
వార్ధి మునిఁగితి స్వారాజ్యవైభవంబు
గణన సేయంగ నీకు సౌఖ్యంబె యింద్ర!

95


సీ.

ఆది దూర్వాసప్రసాదమాల్యావమా
                       లాతిబాధల లజ్జ నందవైతి
వమరావతీపురం బన్యేంద్రముగ ననిం
                       ద్రము గాఁగ నెఱుఁగవే ధైర్యశక్తి
గలుగు కౌశికు ధాటిఁ గానవే బంధించి
                       యార్చిన మేఘనాథాంబకోగ్ర
ఘాత మెఱుంగవే గౌతముం డొనరించు
                       తదవస్థ లెఱుఁగవే దర్ప మంది


తే. గీ.

అన్నియును [45]మఱచితె జగం బెన్న నీదు
పట్టణం బొల్ల నింద్రత్వపదము నొల్ల
నిత్యదుఃఖకరంబులు నిర్జరేంద్ర!
యింటిత్రోవనె మఱలు నేఁ డిన్ని యేల?

96


వ.

అనిన సురస్త్రీశావమోచనాదికాలం బెన్నఁ డయ్యెడునని ప్రార్థించిన
దినత్రయంబు నన్ను నృత్యగీతాదులచే బాధ నొందించుటం జేసి
వర్షత్రయంబు వానరత్వంబు ననుభవింపఁగలరనిన నింద్రుండు

నిజనివాసంబున కేఁగ నమ్మహాత్ముండు విష్ణుసేవాపరాయణుండై
యుండ వృషధ్వజుండు వచ్చి యిట్లనియె.

97


సీ.

బ్రాహ్మణోత్తమ! నీవు బ్రహ్మచారివి వ్రతం
                       బేటికి! నీ కిష్ట మెద్ది యడుగు
మైహికాముష్మికాత్మైశ్వర్యవైభవం
                       బొక్కటి వేఁడు మే నొనర నిత్తు
మత్పదంబున నుండ మది నీకుఁ బొడమిన
                       నదియు నిచ్చెద వేఁడు మనఘచరిత!
యన భవబంధసంయుతమైన పదవి యె
                       ద్దియు నొల్ల నావిష్ణుదేవుపదము


తే. గీ.

గాని తత్ప్రాప్తి యేరికిఁ గల్గుననిన
హరియె మోక్షప్రదుండు నే నబ్జజుండు
కర్తలము గాము మోక్షభాగముల కెల్ల
నరయ నాస్తంబధాతృపర్యంతమునకు.

98


వ.

ఆభగవంతుండు నాకును విధాతకును రక్షకుండు. పూర్వంబున నాకు
బ్రహ్మ శాపవిమోచనంబు గావించె. వృకాసురతపస్ఫూర్తికి మెచ్చి
వాఁ డెవ్వనిశిరంబునఁ దనహస్తంబు మోపిన (వాఁడు) భస్మంబు గావల
యునని వరంబు వేఁడిన నిచ్చితి. మచ్ఛిరంబున నునుపంజూచిన నేఁ
బలాయనంబు నొంద (హరి) బ్రాహ్మణరూపంబున వచ్చి మాయ పన్ని
తత్కరంబు తచ్ఛిరంబున నుండంజేసి వాని హరించి నన్ను నిర్వహించె
నెన్నియని తెల్పుదు నావిష్ణుండె నీకు పాస్యుండని బోధించి నిజ
నివాసంబునకుఁ జనియె నంత.

99


తే. గీ.

అబ్జజుండును జనుదెంచి యట్ల పలికి
తనపదం బొసఁగ నాత్మలోఁ దలఁచునంత
నొల్ల నేఁ బునరావృత్తి నొందు[46]వార
లో మహాత్మక! నీపురి నున్నవారు.

100


వ.

కావున నాపునరావృత్తిరహితపదంబు గోరుచున్నవాఁడ నని చతుర్ము
ఖుని ననిచి యనన్యమనస్కుండై యున్నసమయంబున సన్మార్గ
దేశికుండను నిజగురుండు వచ్చిన నతండు మ్రొక్కిన నంత నతని
నిష్టకుం బ్రమోదించి నారాయణాచలంబున వైకుంఠవర్ధనక్షేత్రంబున

నీయభీష్టంబు సిద్ధించునని చనిన నాక్షేత్రంబు చేరి నారాయణ
హ్రదాంతరంబున నివాసంబు చేసికొని తపంబు సేయుచుండె నంత.

101


శా.

శ్వేతద్వీపనివాసమాధవసమాసీనుల్ మునుల్ లోకవి
ఖ్యాతాయత్తుని విష్ణుచిత్తుని సమగ్రజ్ఞానదృష్టిన్ మనః
ప్రీతిం గాంచి ప్రశంస సేయుచు వితర్కింపంగ హర్షించి స
ర్వాతిక్రాంతగుణాభిరాముఁడగు ప్రహ్లాదున్ నిరీక్షింపఁగన్.

102


క.

నారాయణగిరికి దయా
పారాయణుఁ డగుచు వచ్చి బ్రహ్మజ్ఞానా
కారంబై మించిన యా
నారాయణభక్తియోగనవ్యగుణాఢ్యున్.

103


క.

నాసాగ్రన్యస్తేక్షణు
నాసాత్త్వికచక్రవర్తి ననఘాత్ముని నా
నాసాధువందనీయు న
నాసాధ్యుని నిత్యుఁ గాంచి యపు డిట్లనియెన్.

104


తే. గీ.

విష్ణుచిత్తా! నినుం జూడ వేడ్క గలిగి
యరుగుదెంచితిఁ బ్రహ్లాదుఁ డండ్రు నన్ను
నీమహత్వంబు విని విని నీరజాక్ష
భక్తినిష్టాపరత్వ మేర్పడఁగఁ గంటి.

105


వ.

అనిన లేచి వందనం బొనర్చి యుపచారంబులు చేసి యన్యోన్య
సల్లాపంబుల [47]నట్లన వర్తించి కొన్నినా ళ్లచట నుండి.

106


క.

మంగళకరమగు నొకయు
త్తుంగనగం బెదుటఁ గాంచి దోషాచరవం
శాంగారంబగు మర్త్యకు
రంగేంద్రుఁ బ్రతిష్ఠ చేసెఁ బ్రహ్లాదుఁ డొగిన్.

107


క.

అది సింహభూధరం బని
త్రిదశులు పల్కుదురు నృహరి శ్రీకరమోక్ష
ప్రదుఁ డీక్షించిన నొసఁగున్
సదయతఁ బ్రహ్లాదతుల్యసత్పుత్రమణిన్.

108

క.

తక్కినవారికి నగ్గిరి
యెక్కినవారికి నభీష్ట మిచ్చుం జుట్టుం
ద్రొక్కినవారికిఁ గన్గొని
మ్రొక్కినవారికిని లేదె మోక్షం బరయన్.

109


వ.

అప్పుడు విష్ణుచిత్తుభక్తిచే గరుడవాహనుం డుల్లసిల్లి
ప్రత్యక్షంబయిన.

110


సీ.

హారకిరీటకేయూరశోభితుఁ బద్మ
                       పత్రనిభేక్షణు భానుకోటి
భానిధిఁజంద్రబింబప్రతిభానను
                       ననుపమమందస్మితాభిరాము
తత నవేందీవరదళశోభనాకారు
                       నంబుజోదరదళాభాధరోష్ఠు
నుచితపీతాంబరు నుజ్జ్వలశ్రీవత్స
                       వక్షఃప్రదేశుఁ బావనచరిత్రు


తే. గీ.

హల్లకచ్ఛాయచరణుఁ జక్రాదినిరుప
మాయుధాంకితు శేషాశనాదివినుతు
గరుడవాహను లక్ష్మీప్రకాశమానుఁ
గాంచె నాబ్రహ్మచారి యుత్కంఠ మెఱసి.

111


వ.

కాంచి మ్రొక్కి నుతించి బ్రహ్మాదిలోకంబులు నిరసించిన యమ్మహాను
భావుండు సద్యోముక్తుం డయ్యెనని చెప్పిన, ఋషులు విని నారదున
కిట్లనిరి.

112


ఆ. వె.

విష్ణుచిత్తుమహిమ విని మహాత్మా! యేము
విష్ణుచిత్తుల[48]మయి వెలసితిమి స
మస్తమును లభించె ననఘ నీకరుణచే
యడుగవలసె నొకటి యట్లనైన.

113


మ.

అనఘా! మున్ను వసిష్ఠనందను లగమ్యంబైన శాపంబుఁ గ్ర
న్ననఁ బ్రాపించిన దీనులై రనుచు నానారాయణస్వామి వ
ల్కె నవార్యం బగునట్టిశాప మెటు లీక్షేత్రంబునం బాసెనో
ముని[49]కంఠీరవ! తెల్పవే యనిన నామోదంబు రెట్టింపఁగన్.

114

వ.

నారదుం డిట్లనియె.

115


సీ.

ఘనులు వసిష్ఠనందనులు విశ్వామిత్ర
                       శాపసంగ్రస్తులై సంచరించి
బ్రహ్మరాక్షసవృత్తిఁ బరగఁ జతుర్వేది
                       [50]యెచ్చోట ముక్తుఁడై యేఁగె వారు
నచటికి నేఁగి యత్యంతదుస్తరశాప
                       మణఁగి దివ్యాకారులైన యది ప
లాశతీర్థము పుణ్యరాశి యాతీర్థంబు
                       మహిమ నుతింప బ్రహ్మకుఁ దరంబె


తే. గీ.

యమ్మహాపుణ్యతీర్థంబునందు మునిఁగి
యఘములు దొలంగి పరిశుద్దు లగుచు వైష్ణ
వాంఘ్రరేణువు లెగయు తీర్థాంతరముల
కరిగి రధికారులై విశిష్ఠాత్మభవులు.

116


వ.

విష్ణుభక్తాంఘ్రిపాంసువులచే వార లపాంసులైరి. విష్ణుభక్తాంఘ్రి
రేణువులచే నణువేని పర్వతంబగు. తదవమానంబునం బర్వతంబేని
యణువగుం గావునఁ గొన్నిదినంబులు దత్పలాశతీరంబున నుండి
తీర్థాంతరంబుల నిరువదియొక్కదినంబు నిలిచి పాపంబులం బాసి
కల్యాణతీరంబున కేఁగి తపోవిద్యాశీలవయోవిశేషంబులం బెద్దయగు
రోమశమహామునిం గాంచి పాదంబులం బడి నిజవృత్తాంతం బంతయు
విన్నవించిన.

117


సీ.

పరమభాగవతు లేవురుఁ గల రీమహా
                       క్షేత్రంబునందుఁ బ్రసిద్ధి కెక్కి
సాత్వికు లంబరీష వికుక్షి కుక్షి రు
                       క్మాంగద పుండరీకాఖ్యు లమ్మ
హాత్ములచేఁ బూజ్యమై యొప్పెఁ దమతమ
                       కాలంబునందు నీఘనులు వచ్చి
యజ్ఞానవారకంబగు తత్సలాశభూ
                       రుహము దక్షిణమున మహిమ వెలసి

తే. గీ.

ప్రబలతరమైన కుహనావరాహరూప
మాత్మ నిడుకొని యర్చించి యతనివలనఁ
బూర్వవిజ్ఞాన మంది [51]యపూర్వశక్తి
శుద్ధసంకల్పు లగుచుఁ బ్రసిద్ధిఁ గనిరి.

118


వ.

ఇచ్చట నవ్వరాహమూర్తి భూకాంతకు శ్లోకద్వయం బుపదేశించె.
ఎప్పుడేనియు భక్తియోగంబున భజియించినవారికి నావరాహ[52]మూర్తి
విజ్ఞానంబు దెలుపు, నంబరీషుండు మున్ను జ్ఞానుల నుత్తమోత్తముండు.
భగవత్పాదంబులయందె యాత్యంతికనిష్ఠ నిలిపె. భగవత్పరు లెవ్వని
వాక్యంబేని యప్పుడ పఠింపుదురు. ము న్నంబరీషుండు భగవన్నిష్ఠ
నున్న విఘ్నంబు సేయ నింద్రుం డరుదెంచి వజ్రంబు వైచినఁ బురందరా!
ఏటికి వైచెదవు. గోవిందుని విడిచి యే నన్యుని భజింప. విష్ణుబలంబున
నున్నవాఁడనని భక్తిపరాధీనమానసుండై యారాజు స్వేచ్ఛావరాహరూప
సేవఁ గావించె. భగవంతుం డతనికి సర్వార్థంబులు ప్రసాదించి శరణాగత
ధర్మంబుఁ దత్వంబువలన నెఱింగించి యిట్లనియె.

119

న్యాసమాహాత్మ్యము

సీ.

ఒనర విద్యలకెల్ల నుత్తమోత్తమము లీ
                       వేదవేదాంతముల్ వివిధగతుల
విఖ్యాతమగు న్యాసవిద్య పూజ్యం బని
                       చాటి లోకములు ప్రశంస సేయ
శరణాగతియును న్యాసము సంవదనము న్యా
                       సంబు న్యాసంబు త్యాగంబు ననఁగ
సకలపురాణప్రశస్తంబు న్యాసంబు
                       పాంచరాత్రములందుఁ బ్రబలె న్యాస


తే. గీ.

మఖిలధర్మంబులను న్యాస మభిమతంబు
సర్వనియమంబులందు న్యాసంబు ఘనము
సర్వయత్నంబులందు న్యాసంబు శుభము
న్యాసమునకంటెఁ గలదె యన్యతర మొకటి.

120


సీ.

తపము శ్రేష్ఠంబు సత్యంబునకంటెను
                       తపమునకంటెను దమము యోగ్య
మాదమంబునకంటె నర్హంబు శమము శ
                       మంబునకంటె దానంబు ముఖ్య

మాదానమునకంటె నధికంబు ధర్మ మా
                       ధర్మరహస్యకృత్యమునకంటెఁ
బ్రవ్రజనము మహాభవ్యంబు తత్ప్రవ
                       జనమునకంటే శస్తంబు వహ్ని


తే. గీ.

వహ్నికంటెను యజ్ఞంబు వరతరంబు
మానసము యజ్ఞమునకంటె మహితతరము
ఘనము న్యాసంబు మానసగరిమకంటెఁ
దద్విశేషంబు లెంచంగఁ దరము గావు.

121


వ.

నన్ను శరణు వొంది యేనరాధిపులు వర్తింతురు వారి నే శరణంబు నొంది
హృదయంబులో నుండుదు. మదర్పితపరు లెవ్వరు వారు నిర్భరులు.
వారి నిచ్చటనేని యచ్చటనేని నిర్వహింతు. సర్వదేవతలకు నే
నుత్తముండ నైనట్లు సర్వకాంతలలో నిందిర యుత్తమ యైనయట్లు
సర్వధర్మంబులకు న్యాసంబె ముఖ్యంబు. కర్మనిష్ఠవానికి జ్ఞాననిష్ఠ
దగ దాత్మజ్ఞాననిష్ఠ శరణాగతనిష్ఠ యే[53]యంశమునుఁ బోలదు.
ప్రధాన మగుటను మహత్తర మగుట నకించన్యసారంబునకంటె
విశ్వాసంబునకంటె శరణాగతనిష్ఠయందు నాచిత్తంబు ప్రవర్తింపుచున్న
యది. శరణంబని నన్నుఁ గొల్చిన నరుల మనోవీథి నిల్తు నిందునకు
సందేహంబు లేదు.

122


క.

నాయందు సకలభారము
లేయెడ నిల్పునెడ వారి నెఱిఁగి సతతముం
బాయక నే రక్షింతును
నాయతమతి నిత్తు నైహికాముష్మికముల్.

123


వ.

అని యిట్లు భగవంతుండు పల్క నంబరీషుండు శరణాగతమాహాత్మ్యం
బిట్లని వర్ణించె. నానలువురివృత్తాంబు లనేకంబులు గలవు. విస్తరింప
నేర సంసారసంతాపాదిప్రశాంతికి [54]నిట ననేకులు నివాసంబు
చేసికొనిరి. కాన మీరు నిందుండి పవిత్రులు [55]గండని రోమశుం డాన
తిచ్చిన వసిష్ఠపుత్రు లచ్చటనుండి పరిశుద్ధులై సితారణ్యసముద్భూత
తులసీదళసంచయంబున నారాయణు నారాధించి పరమపదం బందిరి.
ఇంకం జేయు కార్యంబు వినుం డెఱింగించెద. కలియుగంబున

మహోగ్రతరులు పాషండులు [56]ముగురు గలరు. తత్త్వపాషండులు,
వృత్తిపాషండులును, దత్త్వవృత్తిపాషండులు నన. తత్త్వపాషండులు
కర్మంబులు విడిచినవారు. వృత్తిపాషండులు బ్రహ్మంబు విడిచినవారు.
కర్మబ్రహ్మంబులు విడిచినవారు తత్త్వవృత్తిపాషండులు. వారికి కర్మ
బ్రహ్మంబులు లేవు. కాకున్న విపరీతం బగుంగాన వికల్పింపం బడుటం
జేసి యుపాత్తజ్ఞానమాత్రంబున వైదికులవలెం దోఁతురు గాని యవైదికులు
దారు కొందరు మధుసూదను నన్యదేవతాసమానునింగాఁ దలంచి
మీమాంసా కబంధపరులు చెప్పుచుంద్రు. రాహుకల్పులగువారు శిరో
భాగంబు సంగ్రహింపుదురు. కొందరు యజ్వాగ్రణులు యజ్ఞంబుల
నన్యదంభమూర్తులై దండకమండలంబులచేతనే తమయోగ్యత మెఱ
యింతురు. భగవంతుం డంతర్యామి వాసుదేవుం డారాధనీయపదాబ్జుండు
వైదికకర్మంబు లొనరింప ఫలంబు గలుగంజేయునని శ్రుతియునుం
బలుకు నిట్లగుటకు సకలధర్మంబులకుఁ జక్రధరుండు కర్తయై యుండుట
యెఱుంగక దుష్క్రియలు సేయు మదాంధులైన విమూఢులైన దుర్దేశికులు
సాధనాంతరములు గలుగ బోధించుకతనం బ్రతిభ విడిచి.

124


తే. గీ.

అహహ నగరాదులందు సర్వాన్నభోక్త
లగుచు సన్న్యాసులు చరింతు రందు నందు
మ్లేచ్ఛదుర్వృత్తి యాత్మలో మెఱసి బాహ్య
కృతదురాచారసంచారకీర్తిఁ గాంచు.

125


తే. గీ.

రాఘవునియాజ్ఞ సౌమిత్రి రణమునందు
నింద్రజిత్తునిఁ దునుమ నాయింద్రజిత్తుఁ
డతిసహాయంబు తానెయై యవనియందుఁ
గలిపురుషుఁ బాయక చరించుఁ గలుషవృత్తి.

126


క.

సమిదాధానవిసర్జిత
తమవృత్తిం బ్రహ్మచారితతి దిరుగుఁ దిగం
తములందుఁ గేవల తురం
గమనిత్యబ్రహ్మచర్యకలన చెలంగన్.

127


క.

ద్విజవరులందఱును మహీ
భుజుని నిజాజ్ఞం జరించి భూరిరణోర్విన్
భుజశక్తిం బాటింతురు
సుజనేతరు లగుచుఁ గర్మశూన్యత్వమునన్.

128

క.

కలిమియ యపరాధం బగుఁ
గలియుగమున నట్లు గాన ఘనులగు ధనవం
తులపై రాజులు పాపం
బులు దలఁచి ధనంబు గొండ్రు భూవలయమునన్.

129


క.

ఎడయక నిజేష్టదేవత
యెడ జనకుని[57]యెడల తల్లియెడ గురునియెడన్
బొడమదు మోహం బింతుల
యెడఁ గల్గిన యట్లుగా మహీవలయమునన్.

130

కలియుగధర్మము

వ.

[58]మఱియుఁ గలియుగంబున భరతాదివిద్యలే కాని వేదశాస్త్రపురాణా
ధ్యాత్మవిద్యలు సంభవింపవు. నవయౌవనదుర్దాంతమానసలై
యువతులు ముదిసినయత్తమామలం గైకొనరు. గుణవతులైన భార్యల
విడిచి పరదారానురాగంబునం బతులు పతితు లగుదురు. ధర్మార్థంబు
లేశంబేని పాత్రులకు నొసంగరు. ప్రశంసార్థంబు గాని నరకోత్తారణంబైన
హరిస్మరణంబు సేయరు. నరకప్రదదారస్మరణంబు గాని శూద్రద్వార
పాలకవేత్రహస్తనివారితులై బాహ్యస్థలంబున నుండు బ్రాహ్మణు
లేమి చెప్ప? రాజసేవోన్మత్తులైనవారు విష్ణుభక్తిపరాయణులు పల్కిన
పల్కులెల్ల నాక్షేపింతురు. ద్విజాధములు నారాయణు వర్ణించి దేవ
తాంతరసేవకులై యుంద్రు. దుష్టద్రవ్యంబుచేత దుర్గారాధనక్రియలు
హరిబాహ్యులగు నృపద్విజులు ప్రాణిహింసచేఁ గావింపుదురు. శ్మశాన
దేవతార్చనంబు శ్రేయస్కరం బని యొనరింపుదురు. హరిపదం
బెఱుంగక యహోరాత్రంబు స్వోదరపూరకులై నరులు వర్తింపుదురు.
సమస్తజగన్నాయకుండైన నారాయణుండు గలుగఁ గవు లొక్కొక్క
నరాధముని వర్ణింపుదురు. స్త్రీలకుఁ బాపమతియు నతిక్లేశంబు నగు.
ధనహీనులైన భర్తల వర్జింపుదురు. కులకాంతలు ప్రమదలై భర్తలు
గలిగియు నన్యపురుషస్పృహతో నుందురు. పర్జన్యుం డల్ప
వర్షంబును సస్యాల్పఫలంబునుంగాఁ గురియు. ఇట్లు నారమాధీశ్వ
రుండు తనలీలచేత యాదవగిరినుండి తద్వేత్రహస్తులు ద్వాపరాంతం
బునం గలిపురుషుండు వచ్చిన వారింపుదురు. విష్ణుపరాయణులైన
వారు యదుగిరీశ్వరుని సేవింపఁగలరని వర్ణించి మఱియు నిట్లనియె.

131

మ.

స్మరియించం దురితంబులెల్ల నణఁగున్ సాక్షాదనంతుండు త
ద్గిరి సేవించును శేషరూపమునఁ దద్దేవుం గృతం బుర్విపైఁ
బరగం ద్రేతను లక్ష్మణుండయి ప్రలంబధ్వంసి సన్మూర్తి ద్వా
పరవేళం గలివేళయున్ గొలుచు కుంభల్లీల యోగీంద్రుఁడై.

132


వ.

అట్లు గాన నారాయణుం జూచి మునీంద్రులారా! మీరు శేషాసనాద్యైశ్వ
ర్యంబు వేగంబునం బొందుండని నారదుం డానతి యిచ్చినఁ బరమ
సంతోషంబు నొంది నారాయణగిరి కేఁగ మదిం గోరి పుణ్యవతియగు నా
భాగీరథి త్రివిక్రమపాదాంభోజమధురసం బగుదాని బహుకల్లోల
విస్తారబంధుల యగుదానిం జూచి నావికోపనీతంబైన నావచేఁ
దరియించునప్పు డొక్కమహావాతంబు పడమటనుండి విసరిన నావికులు
గడప సమర్థులు గాక విభ్రాంతులై యున్న మునులు వ్యాసునిం జూచి యిది
తరియింపంజేయు మనిన నమ్మహాత్ముం డిది భగవదాజ్ఞ యని నావికుల
మఱియుం బ్రేరించిన వారలు మఱియు నశక్తుల మనిన నాద్వైపాయనుం
డీనావ భగవంతుండే నడపు. నదీతరణసాధనము లన్నియు
గంగలోనే యుండని మ్మనిన వ్యాసవాక్యప్రమాణంబున నన్నియు
వైచి ప్రపత్తి పట్టికొనియున్న నానావ తనయంతనె కూలంబు చేరె.
మునీంద్రులు విస్మయం బంది వ్యాసమాహాత్మ్యంబు గొనియాడి రంత
వ్యాసుండు వారల కిట్లనియె.

133


సీ.

మనలఁ బరీక్షింప మధుసూదనుం డిట్లు
                       గావించె నాశ్రితకల్పశాఖి
కడు నకించన పురస్కారంబు సేయ నా
                       కాంక్షించి సేయు నధ్యాత్మశాస్త్ర
సారంబులైనట్టి సకలసద్గుణసంప
                       దలకు విశ్వాసంబె తలఁప చక్ర
పాణికిఁ బ్రీతిసంపత్తికారణము సం
                       సారపారావారతారణైక


తే. గీ.

కారణంబైన ఘనుఁ డాపగాప్రవాహ
తారణం బొనరించు టెంత? యతఁ డేమి
సే యశక్తుండు గాఁడు చర్చించి చూడ
నిన్ని వర్ణింపనేల మునీంద్రులార!

134

క.

అత్తఱి నత్తరిలో దిగి
యుత్తమగురు జహ్నునందనోదకమున నా
సత్తములు తీర్థమాడి మ
హత్తరకల్మములు దీర్చి రనురాగమునన్.

135


తే. గీ.

సర్వమంత్రరహస్యప్రశస్తుఁడైన
యాదినారాయణునిఁ దమయాత్మలోన
నిలుపుకొని శుద్ధచిత్తులై నిత్యకర్మ
మాచరించిరి వేడ్క నయ్యఖిలమునులు.

136


క.

కొందఱు విధిచోదితులై
పొందిక నొనరిచిరి కరములు విష్ణ్వాజ్ఞా
కందళమునఁ గావించిరి
కొందఱు వైష్ణవులు తదనుకూలత మెఱయన్.

137


వ.

అంత.

138


క.

నలినోత్పలశోభితయై
తిలకించిన నర్మదానదీమణి నతిని
ర్మలశక్తి గడచి తా ర
వ్వల గోదావరికి నేఁగి వరనియమమునన్.

139


వ.

వర్తించునంత.

140


సీ.

తత్తీరమున నన్నదానపరాయణుం
                       డతిథిప్రియుండను నతఁడు విష్ణు
భక్తినిష్ఠాగుణపారాయణుం డుంఛ
                       వృత్తియను నతండు వెలయుచుంద్రు
వారిలో నమ్మునివర్యులఁ గని యతి
                       థిప్రియుం డాతిథ్యదృష్టి పూని
పాటించి నిత్యంబు బ్రాహ్మణోత్తమసహ
                       స్రమునకు నిడుదు భోజనము మీరు

తే. గీ.

మద్గృహమున [59]భుజింపుఁ డామ్నాయమూర్తు
లయిన మీర లటంచు నత్యంతనియతి
[60]నతఁడు ప్రార్థింప వానిపై నాదరంబు
వదలి యందఱు నని రేకవాక్యమునను.

141


మ.

హరిపారాయణవృత్తి లేని భవదీయాగారమధ్యంబునన్
ధరణీదేవ భుజింపనొల్లము సముద్యత్ప్రీతిమై దేవతాం
తరమంత్రాంతరసాధనాంతరము లాత్మం బాయు నవ్వైష్ణవాం
కురముల్ బాంధవు లెంచ మాకు నతియోగ్యుల్ గారు సంకీర్ణకుల్.

142


క.

కరవీరభుక్తి దేహ
స్ఫురణంబు హరించునట్లు పురుషోత్తమసం
స్మరణంబు లేని గృహముల
నరులు భుజింపంగ నాత్మనాశన మరయన్.

143


తే. గీ.

మేలు దేహంబు విడుచుట మేలు వహ్ని
శిఖల మ్రగ్గుట శ్రీపతిసేవ లేని
జడునిగేహమునందు భోజనము సేయ
మేలు గాదు జనంబులు మెచ్చ రచట.

144


వ.

అని యతిథిప్రియునిం బలికి యుంఛవృత్తి గృహంబునకు నేఁగ సంప
న్నుండనగు నాగృహంబు విడిచి యతిదీనుండగు నుంఛవృత్తి గృహంబు
నకు నేఁగి యేమి భుజించెదరో యని యతిథిప్రియుండు నవ్వె. నంత
నుంఛవృత్తి వారలం జూచి పరితోషంబు నొందె. లబ్దతుష్టయను పేరి
తత్పత్నియు నామునుల నవలోకించి చింతావ్యాకులయై కందమూల
ఫలాదికంబులవలనన పరితృప్తిం బొందించెదనేనకించన నని
వితర్కించునంత.

145


తే. గీ.

అప్పు డింద్రాదిదివిజులకైనఁ గోరఁ
దగిన సంపద గలిగె నత్యంతమహిమ
నీరజేక్షణభక్తులు నియతు లెందు
నుండ్రు సంపద లచ్చోట నుండు నిజము.

146

వ.

ఆశ్రమోపగతంబైన సంపదం గాంచి యుంఛవృత్తి మునీంద్రులఁ
దృప్తిఁ బొందించునంత వారు భుజించి సుఖాసీనులై యున్న లజ్జించి
యతిథిప్రియుం డచటికి వచ్చి భయంబున వందనంబు చేసిన వానిం
జూచి విశ్వామిత్రుం డిట్లనియె.

147


తే. గీ.

ఉంఛవృత్తికి దారిద్య్ర మొసఁగ నేమి
గలదు మందిరమున? నని గర్వవృత్తి
నగితి మముఁ జూచి పరమవైష్ణవులయింటఁ
గమలగేహ వసించుట కానవైతి.

148


క.

శ్రీనారాయణుఁ డుండఁగ
దీనాత్ముని వేఁడుకొనుట [61]దీవించిన క
ల్పానోకహ ముండఁగ మది
యానక శాల్మలినిఁ దలఁచి [62]యాచించు టగున్.

149


క.

నారాయణుఁ డుండ దురా
చారులఁ గొల్చుట సుధాబ్దిసంగతి మదిలోఁ
గోరక లవణాకరసీ
మారతి విహరించుటలు క్రమంబునఁ దెలియన్.

150


ఆ. వె.

మాధవాంఘ్రియుగము మఱచి వేఱొక్కని
రక్షకుం డటంచు భ్రాంతిపడుట
స్వర్ణదీతరంగజల మగ్రమున నుండ
మరుమరీచికాంబుమగ్ను లగుట.

151


క.

హరిఁదక్క నితరు నొక్కరు
శరణం బని తలఁచుటెల్ల సారతరంబై
తరి గలుగ భిన్నకుంభాం
తరమున నది దాఁట నాత్మఁ దలఁచుట గాదే!

152


క.

కమలావిభుండు దొరకఁగ
నమరాధము నొకనిఁ జేరి ప్రార్థించుట యు
త్తమచింతామణి [63]దొరకఁగ
నమితములగు చిరిపిఱాల కాశించు టగున్.

153

ఆ. వె.

మధువిరోధి గలుగ మానవు నల్పుని
నడుగఁజూచుటెల్ల నవనియందు
హాలికుండు వార్షికాభ్రంబు మఱచి నీ
హారవారిధార లడుగు నట్లు.

154


ఆ. వె.

మహిమతోఁ ద్రివిక్రమస్వామి దీపించఁ
దగునె యన్యదేవతాభజనము
కామగవి జగత్ప్రకాశమై కనుపట్టఁ
బొదుగుగల వరాహిఁ బిదికి నట్లు.

155


తే. గీ.

హరికి నవమాన మొనరించి యన్యునొకని
దేవత యటంచు గొలుచుట దీప ముండ
నంధతమసంబు భేదించునందునకును
మించు ఖద్యోతకాంతి గావించునట్లు.

156


తే. గీ.

వాసుదేవుండు గలుగ దేవతలవెంట
భ్రాంతిఁ దిరుగుట శర్కరాపానకంబుఁ
జవి గొనక యూసరక్షేత్రజలకణములు
ప్రచురమైయుండ జిహ్వపై రుచులుగొంట.

157


తే. గీ.

పద్మనాభసమాశ్రయపరుఁడు గాక
యన్యదేవతఁ బలుమాఱు నాశ్రియింపఁ
దలఁచియుండుట బర్బూరతరువునీడ
సంచరించుట చందనచ్ఛాయఁ బాసి.

158


ఆ. వె.

అంబుజాక్షు నాత్మయందు నిల్పక యధ
మాధములఁ దలంచు టరయఁ దండ్రి
నాఁటి ధనము విడిచి నరుఁడు స్వప్నాగత
నిధి గృహంబునందు నిలిపికొనుట.

159


తే. గీ.

ఆదినారాయణునిఁ బరమాత్మఁ బాసి
పరునిఁ దలఁచుట కర్పూరతరువు విడిచి
లాంగలీకందభక్షాభిలాషవృత్తిఁ
బూని తిరుగుట గాదె యీభూతలమున.

160

తే. గీ.

పరమపూరుషునిజసేవఁ బాసి నీచ
దేవతాంతరసేవతోఁ దిరుగు టెల్ల
మధురపుండ్రేక్షురసరుచి మఱచి దుష్ట
మైన [64]యేరండకాండంబు లందుకొనుట.

161


తే. గీ.

జడుఁడు సంకర్షణపదాంబుజములు మఱచి
తామసపుదైవసేవచేఁ దనరియుంట
యమృతమై యున్నయట్టి దివ్యౌషధంబు
మాని హాలాహలప్రీతి మరిగినట్లు.

162


సీ.

ప్రద్యుమ్నసేవాప్రపత్తి వాటించక
                       రాజసదేవతాపూజనంబు
సేయుట యిత్తడి చెంగటఁ గని కన
                       కంబుమీఁదం బ్రేమ గనక యుంట
సంకర్షణస్తోత్రజాలంబు విడనాడి
                       పరదైవతస్తోత్రపాఠమునకుఁ
జనుట మూఢాత్ముండు సచ్చూతఫలరసం
                       బానక వేముపై నాసపడుట


తే. గీ.

యనఘు ననిరుద్ధఁ గొల్వక యన్యదేవ
తలను గొల్చుట ప్రస్తుతస్తన్య ముడిగి
యయ్యజాగళకుచదుగ్ధ మాసపడుట
వినుము విప్రేంద్ర మున్ను నే ననఘుఁడైన.

163


వ.

వసిష్ఠాశ్రమంబునకు నేఁగి యధ్వశ్రమాతురుండనైన నారాక విని
యరుంధతిం బిలిచి వసిష్ఠుం డన్నపానంబులశ్రమంబు దీర్పుమని
నియోగించిన నమ్మహాసాధ్వి వచ్చునెడ నొకమహానది ప్రవహింప
మరలి తద్వృత్తాంతంబు విన్నవించిన వసిష్ఠుం డే ననాదిబ్రహ్మచారి
నైతినేని మార్గంబు చూపెడు నిట్లని ప్రార్థింపుమన నప్పరమపావనియు
నట్లనె కావించిన నత్తరంగిణి మార్గంబు చూపిన వచ్చి నాకు నన్నం
బొసంగి చనుచోఁ గల్లోలభీమార్భటి మరలం బ్రవహించిన మరలి
నాకు నెఱింగింప నేను నిత్యోపవాసి నగుదునేని మార్గం బిమ్మని పలికిన
యట్లనె ప్రార్థింప మార్గం బొసంగ నేఁగి భర్తం గాంచి పుత్రులం గనిన
నీవు బ్రహ్మచారి వెట్లైతివి? సద్యస్కారంబున నాచేతనె భుజించిన

విశ్వామిత్రుం డెట్లు నిత్యోపవాసి యయ్యె? నని యడిగిన వసిష్ఠుం
డిట్లనియె.

164


సీ.

నియమంబున స్వభార్యనియతుండనై యుక్త
                       కాలంబుననె రతికేలి సలిపి
యుండుట మఱి నాకు యుక్తంబు బ్రహ్మచా
                       రిత్వంబు జగము వర్ణించి పొగడ
గాధిపుత్రుఁడు కమలాధిపభక్తిని
                       ష్ఠాపరాయణుఁడు ప్రశస్తి గాంచి
జాత్యాశ్రయనిమిత్తసత్కర్మములు పూని
                       వీతదోషముగ నైవేద్య మొసఁగి


గీ.

యదియు ననిషేధకాలంబునందుఁ గృష్ణ
యనుచు గోవింద యనుచుఁ బరాత్మ యనుచుఁ
బ్రతికబళమును నుడువుచుఁ బరిభుజించె
వాసి నటుగాన నిత్యోపవాసి యయ్యె.

165


వ.

అనిన నరుంధతి విని హర్షించె నట్లుగాన హరిభక్తి లేని నీగృహంబున
భుజియింప నర్హంబుగా దుంఛవృత్తి భక్తుఁడు గావున తద్గృహంబున
భుజియించితి మనిన విశ్వామిత్రు వాక్యంబులు విని యతిథిప్రియుం డా
విశ్వామిత్రుం బ్రశంసించి సాత్వికవృత్తి వహించి చనియె నంత నమ్ము
నులు గోదావరీతీరంబున నున్న హరిణంబులు తమ్ము నీక్షించిన యంతనె
విమలహృదయంబులంగాఁ జేయుచు హరిణంబులుం దాముం జనిం చని.

166


క.

అక్కడ వీరధ్వజుఁ డన
నొక్కమహావీరవైష్ణవోత్తముఁ డురుస
మ్యక్కీర్తిశాలి యిచ్చెన్
జొక్కంబగు కనకరత్నశుభ్రపటంబుల్.

167


వ.

అవి గొనుచు వారలు.

168


సీ.

నారాయణున కర్పణము సేయ నరుగుచోఁ
                       బశ్యతోహరు లుగ్రపౌరుషమున
గదియ వచ్చిన వారి గాధిపుత్రుండు ద
                       క్షిణకరంబున నివసించె నడవి

నపుడు సహస్రసంఖ్యాతిబలోద్ధతుల్
                       భటు లుదయించి యుత్కటనిజాస్త్ర
సమితి నోర్చిన ధరాస్థలియందు నొరగిన
                       గాధేయుమహిమఁ దద్ఘనులు మెచ్చి


గీ.

యద్భుతం బంది కొనియాడి యతులతుంగ
శృంగమండలమండితచిత్రశాఖ
శాఖకావృతమై యక్షసాధ్యసిద్ధ
దివ్యపరమైన యదుగిరి తెలివి గాంచి.

169


క.

దూరంబున నానిర్జర
వారంబులు మ్రొక్కనున్న వరమౌనులు శ్రీ
నారాయణపదసేవా
పారాయణు లఖిలలోకపావనమూర్తుల్.

170


వ.

ఇది పరమధర్మంబైనయది యని హరిధామంబుఁ గని మ్రొక్కి యా
శైలంబున నధివసించి నేత్రామృతపానంబుగా నిరీక్షించిరంత.

171


సీ.

ఆనగరాజిమధ్యమున లక్ష్మీకళా
                       భ్యంచితమై వియదంతరాళ
సంవారకానేకసాలాభిరామమై
                       నానామహీరుహోద్యానలక్ష్మి
గనుపట్టె నిరుపమాకలితనిత్యోత్సవ
                       ధ్వజసమావృతదిశాంతమయి కాహ
ళీభేరిదరమురళీమర్దళధ్వాన
                       కలితమై జయశబ్దమిళితమై ప్ర


గీ.

శంసకామ్నాయఘోషభాస్వరము సౌధ
సౌధవిన్యస్తదీపికాసముదయంబు
నైన యొకపురిఁ గనిరి తదగ్రసీమ
నమ్మహామును లత్యంతహర్ష మొదవ.

172


క.

ధవళాతపత్రచామర
వివిధశ్రీ విస్తరిల్ల శ్వేతద్వీపం
బువలెం గనుఁగొను గీర్వా
ణవరుల కానందరసము నల్గడలఁ దగన్.

173

సీ.

అంత నమ్మునులు కల్యాణసరోవరో
                       దకమున మునిఁగి యత్యంతనియతిఁ
బౌర్వాహ్నికక్రియల్ పాటించి యానంద
                       మయమధ్యముననున్న మధువిరోధి
నాదిమూర్తి నిరామయాకారు సౌందర్య
                       వరసుధావార్థిఁ బావనచరిత్రు
ననుపమశ్రీలలితాంఘ్రిసరోజాతు
                       రత్నమంజీరవిరాజమాను


గీ.

హైమపరిధానుఁ గౌక్షేయకాభిరాము
జఠరమధ్యవిరాజితసమ్యగుదర
బంధు నాతురబంధు శోభనసువర్ణ
మణిమయాంగదు ఘనభుజామహితు స్వహితు.

174


క.

శ్రీవత్సవైజయంతీ
శ్రీవిలసదురస్కు నతివిచిత్రేతరభూ
షావారధామునీశ్వరు
సేవకమందారు దేవసేవితచరణున్.

175


క.

జలజగదాచక్రాద్యు
జ్జ్వలు విలసద్వదనకమలు సంస్ఫారితదృ
ఙ్నలినద్వయు నతులతరా
మలచారుకపోలభాగు మహితాభోగున్.

176


సీ.

ఘనరత్నమకుటశోభనుని నాపాదమ
                       స్తకకళాసౌందర్యసారవీచి
కాలంఘనక్షమకావితావలోకను
                       నిగమాంతపూజితు నిత్యనిత్యు
పద్మావధూమణీభాగ్యాధిదేవత
                       పశ్యజ్జనామృతపారణంబు
మూర్తిమదామ్నాయముఖ్యాంతరంగంబు
                       సేవకసందోహజీవధనము

గీ.

సకలనిశ్శ్రేయసార్థిహస్తగతఫలము
నభినుతించి భజించి నృత్యంబు సలిపి
యనఘులై చేరి వీరధ్వజార్యదత్త
[65]విత్త మంత నివేదించి బత్తి మ్రొక్కి.


వ.

సర్వకర్మనిర్మలులగు నమ్మునులు, సువర్ణంబు రత్నంబులు నంబ
రంబులు రాజార్హంబగు నాసనంబులు చామరంబులు ఛత్రంబులు
చందనాదిసురభిద్రవ్యంబులు నంగీకరించినఁ గల్యాణతీర్థంబున
కుమారులు పరమభక్తి నారాయణు సేవించిన వారలం జూచి యా
దయారసాంబుధి యేను సంప్రీతిం బొందితి మిమ్ముఁ గాంచి భక్తి
సంభ్రాంతసర్వాంగులగు భక్తులే నాకు ధనంబు. ఏను గృపారస
పరవశుండం గృపయు భక్తిపరాధీన భక్తులు భక్తిపరాధీనులు భక్తియు
మత్ప్రసాదంబునం బుట్టినయది. మత్ప్రభావంబు భక్తపారవశ్యంబే
కాని యితరంబు లేదు. ఏను మీతోఁ బాసి వైకుంఠంబున నుండ నొల్ల.
ఇచ్చటనేని వైకుంఠంబుననేని మీతోఁ గూడి వర్తింపుదు, నెపుడు మీర
లిందుం డధికారావసానంబున వైకుంఠంబు నొందెదరు. వింధ్యారణ్య
వాసంబులగు నీహరిణంబులు దూరంబుననుండి వచ్చినయవి. వీనికిం
బరమపదంబు కృపసేసితిని. ప్రభావంబు మీకేయగు భవదన్వయంబునఁ
బశువులు సురదుర్లభంబైన పరమపదంబు నొందె. తృణచర్వణంబు
చేసి మదగ్రంబున సంచరించి కల్యాణతీర్థోదకపానంబు చేసి మాతృ
స్తన్యపానంబు సేయఁడు గాన నిది వైకుంఠవర్ధనంబను పేరి స్థానంబున
ప్రాజ్ఞుండేని పామరుండేని పశువులేని పక్షులేని నన్ను జపించినవారు
వైకుంఠంబు వృద్ధిం బొందింతురు. ఎవ్వరు కళ్యాణతీర్థంబునం దానంబు
సేయుదురు వారికి సహస్రగుణితఫలం బప్పుడె కలుగు నొక్కధేనువు
నేని కల్యాణతీర్థసంయుతుండై యొసంగినఁ గోటిప్రదానఫలంబులగు.
మఱియు దరిద్రుండైన విష్ణుభక్తునకుఁ గల్యాణతీర్థతీరంబున క్షేత్రం బొ
సంగినఁ దత్క్షేత్రరేణుసంఖ్యాతంబులగు వత్సరంబులు స్వర్గంబున
వసియించి యీప్సితంబు లనుభవించి యంతంబున నన్నుం గలయుఁ
గాకున్న భూమియందు సార్వభౌముండై పుట్టి పిదప నన్నుం జేరు
నెన్నఁటికి వాని విడనాడ. కల్యాణతీర్థతీరంబున బ్రాహ్మణభోజనం
బిడినఁ గాలత్రయంబునఁ జతుర్ముఖుండగు. కల్యాణతీర్థంబున వస్త్రం
బొసంగిన శ్రీమంతులై ముయ్యేడుతరంబులవారు సంసారం బుద్ధ
రింపుదురు. కల్యాణతీర్థతీరంబున ధనం బొకనికిం జాలున ట్గొసంగినం

గల్పాంతరంబునఁ గుబేరుండై జనించు. అశ్వంబేని స్యందనంబేని
గజంబేని కల్యాణతీర్థతీరంబున నిచ్చిన స్వారాజ్యం బనుభవించి
స్వారాజ్యంబు నొందు. అచ్చట మౌక్తికంబు లొసంగిన ముక్తభేద
బాంధవుండై హారాలంకృతవక్షస్కుండై తారాపథంబు నొందంగ
లఁడు. కల్యాణతీర్థతీరంబునఁ గాంచనవికారంబేని రజతవికారంబేని
యొసంగిన నాచంద్రతారకంబుగాఁ జంద్రలోకంబు నొందంగలరు.
కల్యాణతీర్థోదకంబు ఘటంబునం దెచ్చి సజ్జనుల కిచ్చిన వారి పితృ
గణంబులు తృప్తింబొందు. కల్యాణతీర్థసన్నిధి బాలకుల కధ్య
యనంబులు సేయించిన వక్తలై ధన్యులై మేధావులైన పెక్కండ్రు
పుత్రులం గందురు. ఎవ్వరు కల్యాణతీర్థతీరంబున నధ్యాత్మవిద్య
యుపదేశింపుదురు వారు మత్సహాయంబైన యుపదేష్ట్రుపదంబు
నొందంగగలరు. కల్యాణతీర్థతీరంబునఁ దిలదానంబు చేసినఁ బాపంబులు
తిలప్రమాణంబులై నాశంబునొందు. కల్యాణతీర్థంబునఁ గనకాద్య
లంకృతకన్యాదానంబుఁ గావించిన ధరణీతలంబున ధనధాన్య
సంపన్నుండై పుట్టి శ్రీభూనీళాసంయుక్తుండైన మత్పదంబుం బొందం
గలరు. కావున మునీంద్రులారా! ఇచ్చటనే యుండి నన్ను సేవింపుండని
పలికి నారాయణుం డానందమయసంజ్ఞింతంబగు విమానంబునందు
రమతోఁ గూడియుండెనని నారదుండు పలికిన మునీంద్రులు హర్షంబు
నొంది రంత.

178


తే.

యాదవాచలమాహాత్మ్య మరసి యతుల
భక్తి పఠియించి వినువాఁడు భగవదిష్ట
తముఁడు వానిగృహంబునఁ గమలగేహ
వెలయు నాపుణ్యఘనుని యవిద్య తొలఁగు.

179


క.

[66]యదుగిరిమహత్త్వ మెవ్వని
సదనంబున నుండు వాఁడె సత్తముఁ డతి సం
పద లాయువు నారోగ్యము
సదమలమతులైన సతులు సకలము గలుగున్.

180


చ.

సకలజనేప్సితార్థములు చాల నొసంగుచు సర్వదేవతా
నికరకులాధిపత్యమున నిల్చి రమారమణుండు యాదవా
ద్రి కుహరసీమనుండి వినుతించినవారికి నిచ్చు వేడ్క నం
ఘ్రికమలసేవనాధికపరిస్పుటరాజ్యరమావిశేషముల్.

181

మ.

బలివిధ్వంసిపదాంబుజాతముల సద్భక్తిన్ నరుం డెవ్వఁ డా
తులసీవర్ణ మొకానొకప్పు డిడినన్ దుష్టాంతరంగక్రియల్
ఫలియించున్ భజియింప ముక్తిపదసోపానంబులం బోవుచో
వెలయున్ నందనకల్పభూజసుమనోవృష్టిచ్ఛటల్ మించుగన్.

182


క.

పటుభక్తి యాదవాచల
తటమున వరవేదఘోషతత[67]కావ్యాద్యు
త్కటనాదము విని యుద్భట
పటహధ్వనిఁ గడను బరమపదమున కేఁగున్.

183


గీ.

నిఖిలభవనైకరక్షాతినిర్నిమేషుఁ
డైన యదుగిరిభర్త యొకప్పుడేని
కనిన వారి నిజాననకమలగంధ
కలన వైకుంఠవిభుఁడు స్వాగతము పలుకు.

184


గీ.

దైవయోగంబుచేత నేధార్మికుండు
యాదవాద్రిని క్షణమేని యధివసించు
సకలకాలంబును వసించు శాశ్వతముగఁ
బరమపురుషైకగోష్ఠి నాభవ్యమూర్తి.

185


క.

ఇది విని యదుశైలం బా
స్పదమున ఘనవీతరాగవర్యులు చిత్సం
పద నిల్చిరి లక్ష్మీధవ
పదముల శేషాశనాదిపరిషద్గోష్ఠిన్.

186

ఆశ్వాసాంతము

శా.

చాణూరాహ్వయమల్లహల్లక మదస్తంబేరమాకంసని
ర్చాణూరస్త మతితృపాలనకరాగ్రాఘాత లక్ష్మీవధూ
మాణిక్యాభరణాభిరామ యతిరాణ్మందార భూజాతప్రా
మాణిక్యస్ఫురితాత్తబోధ చతరామ్నాయాంత మాయాంతకా!

187


క.

అక్రూరవరద యదుకుల
చక్రేశ్వర లక్షణావశంవద ధాత్రీ
చక్ర[68]వినిర్వహణోత్సుక
చిక్రింసా! ధుర్యవాగ్రుచిరమాధుర్యా!

188

కవిరాజవిరాజితము.

దళితరసాదర సాదరపోషిత
                       ధర్మసుతాదిపృథాజ[69]మహా
ఖిలవదనాశనవాశనికల్పఫ
                       ణాకృతధీకృతచంక్రమణా
కలశపయోధిశయప్రభు సన్మణి
                       కాంతికిరీటసమించితపే
శలసురసామల సామలసన్ముఖ
                       సన్నుతసంతతధన్యగుణా!

189

గద్యము
ఇది శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర
కశ్యపగోత్రపవిత్ర శ్రీమదల్లాడు నరసింహ ప్రణీతంబైన
నారదీయపురాణమునందుఁ దృతీయాశ్వాసము
సంపూర్ణము
శ్రీశ్రీశ్రీ
శ్రీ

  1. మున్నీగతిన్ అని వ్రాతప్రతి
  2. చెరిచి
  3. ము
  4. గానున్ను అని వ్రాతపతి
  5. శిష్యత్రిదండ్యుపవీత అని వ్రాతప్రతి. (యతిభంగము)
  6. బహుశిష్యగణము లగుచు
  7. ఈకిరాతుని - అని వ్రాతప్రతి
  8. యీశాఖాగ్రం-
  9. నఁ బడంద్రోచె-
  10. ఇంకనేనియు నిన్ను
  11. వీనిం
  12. వీనిం
  13. దగు అని వ్రాతప్రతి. దగు అని యున్న యతిభంగము.
  14. గన్కని వచ్చితిమి. "కన్కను" అనుదానికి "సంభ్రమము" అని శబ్దరత్నాకరము. కనుగొనుట అను అర్థము దీనికి లేదు. సంభ్రమ మను అర్థ మిచ్చట సరిపోవుట లేదు. కావున "దగఁగాఁ గనివచ్చితి" మని యుండఁదగును. "కన్గొనవచ్చితి" మనిన యతిభంగము కాగలదు.
  15. మహాతర మని వ్రాతప్రతి. ఈరూపము అసాధువు.
  16. పేరఁగలిగినయది
  17. తోఁచెడు
  18. రాజు హంసంబు-
  19. ననుచుఁ బరాశరునకు – అర్థము సరిపడదు.
  20. వని
  21. వని
  22. నట్ల
  23. వకుళాకారంబులం చేసి (యతిభంగము)
  24. ఈరూపము చింత్యము - మార్చినచో గణభంగము.
  25. మెప్పింపువాఁడ
  26. చెల్లుఁగాక. (యతి?)
  27. మరియు నిట్లనియె.
  28. నిశ్చలు
  29. ప్రోల్లసదష్టాక్షర (ప్రాసభంగము)
  30. భ్యజనమున
  31. నాసన
  32. ఆసన
  33. నెద్దియ?
  34. కంటె
  35. జనన
  36. వేకుంఠ
  37. లహల్లకపాద
  38. ఖండించిన
  39. యుగ్రమున
  40. గలుగవో వైభవనిధియై
  41. వలఇన్
  42. గురులు వైచి
  43. మందత
  44. బహుల
  45. మరచితివె — గణభంగము.
  46. వారిలో
  47. నిట్లని
  48. మై. గణము?
  49. కంఠీవర?
  50. యచ్చోట ముక్తులై యేఁగె. యతిభంగము.
  51. యాపూర్వశక్తి
  52. మూర్తికి
  53. యంశమును నున్ను
  54. నిట్ల
  55. గమ్మని
  56. మగురు
  57. నతని
  58. మఱియు వేదశాస్త్రపురాణాధ్యాత్యవిద్యలు కలియుగంబున భరతాదివిద్యలు గాని
  59. భుజియింపుఁ డా
  60. ననుచుఁ బ్రా
  61. దీపించినఁ గ
  62. యాశించు టగున్
  63. దొరకిన
  64. హేరండ
  65. వితమంతయు నట నివేదించి మ్రొక్కి (యతిభంగము)
  66. యదుగరి
  67. కాహద్యుత్కట
  68. వినిర్వహనోత్సుక
  69. మహాఖిలవదనాననవాళనికల్పఫణాకృతధీకృత యతి(?) చంక్రమణా!