నారదీయపురాణము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

నారదీయపురాణము

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతాస్తుత్యాదికము

శా.

శ్రీమైనుండు యువాంబుదంబు యమునాసింధూర్మిగాహార్థమై
భూమింజెంది నిజాప్తబంధువయి యొప్పుంగేకి భవ్యాంగమున్
దామౌళిం ధరియించెనోయన శిఖోత్తం సత్కలాపాంకుఁడై
శ్యామాత్యంతమనోజ్ఞమూర్తి యగుకృష్ణస్వామి నన్నేలుతన్.

1


ఉ.

సేవతఱిన్ బ్రియాంఘ్రి సరసీజము హస్తమునం దలిర్పఁగా
యౌవనరూపవిభ్రమదయాదిగుణాంబుధియై నిజేందిరా
భావము నెయ్యపుంజెలుల భావమునన్ బ్రకటించు రుక్మిణీ
దేవి యొనర్చుఁ గావుత మదీయమనోగృహపాళిఁ గేళికల్.

2


ఉ.

భాషితసారసౌరభ మపారముగా వెదచల్లుచున్ జగ
త్పోషకశేషిదంపతులు దూఁగ నతాంతలతాంతదోలికా
వేషమునన్ సుధోర్మ్యనిలవృత్తివశంబునఁ బొంగి సోలునా
శేషుఁ డశేషవాఙ్మయవిశేషము లీవుత మాకజస్రమున్.

3


మ.

వరలావణ్యవిలాసరూపమును సర్వజ్ఞత్వమున్ దారకా
వరతేజోలసమాన[1]వక్త్రమును సేవాసన్నదాసావళీ
వరదానప్రతిభావిశేషమును ఠేవం గల్గి [2]వేడ్కందు త
ద్వరచింతామణి శౌరి పూన్కొని మదాత్మన్ వేగఁ దా [3]నిల్చుతన్.

4


మ.

అతితేజోనిధులైన యాద్విరదవక్త్రాద్యుల్ నువిద్యుల్ శత
క్రతు లత్యూర్జితభక్తిఁ గొల్వఁగ జగ[4]త్కథ్యాంతరాయంబు ల
ద్భుతశక్తిన్ విరియించి మించిన జగత్పూజ్యోదయుండైన య
చ్యుతసేనాని నిరంతరాంచితశుభాభ్యుత్సాహమున్ జేయుతన్.

5

మ.

ప్రణతాత్మానుజనైకరక్షణవిలంబప్రాసహత్వంబు స
ద్గుణు లీక్షింపఁగఁ జూపుకైవడి ముకుందుం డాత్మహస్తంబులన్
బ్రణుతస్పూర్తి వహింపఁగా వెలయు తత్పంచాయుధిం గొల్తుఁ గా
రణమై నిత్యశుభంబు లిచ్చి నను సంరక్షింప నేవేళయున్.

6


సీ.

ధరణి వేదంబులు ద్రావిడంబుగఁ జేయు
                     శ్రీ పరాంకుశయోగిశేఖరులను
సకలసమ్మతమతస్థాపకుండైన శ్రీ
                       భాష్యకారుల రంగపతికి నున్న
తావరణములు దివ్యారామము నొనర్చు
                       ఘనుల, గోదాహ్వయకన్య నొసఁగు
యతిశిఖామణి, నిటలాక్షుఁ బాదాక్షిచేఁ
                       దర్జించు గురుకులోత్తంసు నియమ


తే. గీ

పరుల భూతనరోమహద్భట్టినాథ
ముఖ్యులగువారి నాళ్వారి మున్నవారి
తోత్సవంబున సేవించి యోగ్యతాభి
రామమూర్తుల వైష్ణవాగ్రణులఁ గొలుతు.

7


ఆ. వె

రామకృష్ణకీర్తిరత్నశాణనికష
కల్పితోక్తులయిన ఘనులఁ బుణ్య
తనుల మాన్యసత్యతనుల వాల్మీకి ప
రాశ రాత్మబవులఁ బ్రస్తుతింతు.

8


చ.

పొరిఁ బొరిఁ గాళిదాస భవభూతి మురారి మయూర బాణశం
కర జయదేవ మాఘముఖ కావ్యుల భవ్యుల సంస్కృతోక్తిబం
ధురరచనాధురంధరులఁ దోయజమిత్రసమానమూర్తులన్
సరసుల లక్షణజ్ఞులఁ బ్రసంగగుణజ్ఞుల సన్నుతించెదన్.

9


ఉ.

ఎన్నిక భారతీయకథలెల్ల సమంచితగోస్తనీరసా
చ్ఛిన్నధునీఝరంబులుగఁ జిత్రముగా రచియించి లోకముల్
సన్నుతి సేయ నాంధ్రపదచాతురి నిల్పిన సత్కవీంద్రులన్
నన్నయభట్టుఁ దిక్కకవినాథుని నెఱ్ఱనమంత్రిఁ గొల్చెదన్.

10

క.

అకలంకదివ్యతేజో
నికరసముజ్జృంభిసుకవినిచయార్కశ్రీ
[5]ప్రకరము నెదుటను నిలుచునె
కుకవిజనానీకఘోరఘూకోత్కరముల్.

11


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబును శిష్టకవిస్తోత్రంబును దుష్టకవి నిరాకర
ణంబునుం గావించి.

12

కవివంశవర్ణన

శా.

శ్రీమద్వేదమయాంగు శోభనకళాశృంగారలీలామహో
ద్దామున్ శ్రీరమణీమనోహరహయోత్తంసంబు సమ్యక్పురా
ణామోఘార్థశుభాంజనంబుఁ బతగాధ్యక్షోత్తముం గన్న యా
ధీమద్గ్రామణి కశ్యపాహ్వయుఁడు కీర్తిన్ మించె లోకంబులన్.

13


వ.

తద్వంశంబున.

14


క.

కరుణాకరమంత్రీంద్రుఁడు
కరుణావరుణాలయుండు గంభీరుం డా
తరుణార్కదివ్యతేజుం
డరుణానుజరాజరాజితాత్ముఁడు గలిగెన్.

15


తే.గీ.

ఆమహామహుభార్య విఖ్యాతచర్య
సారగుణధుర్యయైన నాంచారు చారు
భాగ్యసౌభాగ్యకీర్తి యాపద్మనద్మ
సద్మమున నుండి కావించె సద్ర్వతముల.

16


సీ.

రామానుజాచార్య రత్నకల్పితచతు
                       స్సింహాసనస్థసుశ్రీ భజించి
యుభయవేదాంతమహోన్నతసాత్వికా
                       చారలక్షణసత్ప్రశస్తిఁ గాంచి
శ్రీకృష్ణపూజావిశేషలబ్ధసమస్త
                       సౌశీల్యగరిమచేఁ జాలమించి
ప్రాక్తనదివ్యప్రబంధానుసంధాన
                       సంతతమహిమఁ దేజము వహించి

తే. గీ.

వెలసె వైష్ణవమాత్రుఁడే విబుధకోటి
యాశ్రయింపంగ సద్భక్తి నాదరించె
సిరుల నల్లాడు చెన్నప్ప శ్రీకరపు
భావభావుకకీర్తిప్రపన్నమూర్తి.

17


క.

మాజనకుఁడు చెన్నప్ప ర
మాజనకగభీరతాసమగ్రత మించెన్
రాజోత్తములున్ వైష్ణవ
రాజోత్తములున్ నుతింపఁ బ్రజ్ఞాశక్తిన్.

18


ఉ.

అంబకు జోడు పంచవిశిఖాంబకు జోడు విదేహరాజ జా
తాంబకు జోడు సాయకశయాంబకు జోడు పతంగలోకరా
జాంబకు జోడు మజ్జననియై భువనంబుల మించినట్టి కృ
ష్ణాంబ గుణావలంబ విబుధావళి నేలు భళీ భళీ యనన్.

19


సీ.

లక్ష్మీసమాఖ్యయౌ లలనతో గృహమేధి
                       భావంబుచేఁ జాలఁ బ్రబలినాఁడఁ
గవితవైభవులు సింగన్న యనంతుండు
                       నాదిగాఁ బుత్రుల నందినాఁడ
శోభితాపస్తంబసూత్రపవిత్రకీ
                       ర్తిస్పూర్తిచేత వర్తిల్లినాఁడ
నఖిలవైష్ణవరహస్యార్థోపదేశంబు
                       లనుపమభక్తిమై నందినాఁడ


తే. గీ.

నందనందనపూజనానందవార్ధి
నోలలాడుచు సద్గోష్ఠి నున్నవాఁడ
నూరి మాన్యుండ నల్లాడు నారసింహ
నామకుఁడ సంతతగురుప్రణామకుండ.

20


సీ.

ఏదేశికాధీశుఁ డిద్దబుద్ధిస్ఫూర్తి
                       బ్రహ్మరాక్షసులశాపం బణంచె
నేదేశికోత్తముఁ డెదిరించి నిలిచిన
                       శక్తికి చక్రాంకశక్తి యొసఁగె
నేదేశికాధ్యక్షుఁ డేకశిలాపురి
                       నిజమతంబంతయు నిర్వహించె
నేదేశికశ్రేష్ఠుఁ డాదిమై రామాను
                       జాచార్య విజయధ్వజాంక మయ్యె

తే. గీ.

నతఁడు వైష్ణవవీరసింహాసనస్థుఁ
డుభయవేదాంతవిద్యామహోన్నతుండు
శుద్ధసాత్వికధర్మప్రసిద్ధకీర్తి
శాలి కంచెర్ల కేశవాచార్య మౌళి.

21


వ.

తద్వంశంబున.

22


మ.

సిరులన్ సద్గురుశేఖరుం డనఁగ మించెన్ గొండమాచార్యుఁ డా
హరియే యీఘనుఁ డంచు శిష్యవరు లాత్మాయత్తులై కొల్వఁగా
వరవేదాంతరహస్యవేదియు భరద్వాజర్షిగోత్రాబ్ధిభా
సురశీతాంశుఁడునై ప్రసిద్ధి వెలసెన్ సూరులే ప్రశంసింపఁగన్.

23


వ.

ఆమహాగురుశిఖామణి యొక్కనాఁడు స్వప్నంబున నన్నుఁ గరుణించి
నారదీయసాత్వికపురాణంబు లోకోపకారార్థంబుగా నాంధ్రభాష
రచించి శ్రీకృష్ణాంకితంబు సేయుమని యానతిచ్చిన మేల్కాంచి కృష్ణ
భగవంతుని మనంబున నిడుకొని రచియింపంబూనితిఁ దదవతారక్రమం
బెట్టిదనిన.

24

మధురాపురవర్ణన

సీ.

శ్రీరాజవశ్యమై శ్రీరాజవశ్యమై
                       యఖిలలోకముల విఖ్యాతిఁ గాంచి
కల్యాణధామమై కల్యాణధామమై
                       యఖిలలోకముల విఖ్యాతిఁ గాంచి
సుమనోభిరామమై సుమనోభిరామమై
                       యఖిలలోకముల విఖ్యాతిఁ గాంచి
సత్కళాపూర్ణమై సత్కళాపూర్ణమై
                       యఖిలలోకముల విఖ్యాతిఁ గాంచి


తే. గీ.

ప్రబలెఁ భ్రాంతాభ్రశుభ్రతరంగిణీత
రంగరంగన్మహాఫేనరాజరాజి
తాజరపయస్సుధాలేపనాంచితోచ్చ
గోపురశ్రీల నగు మధురాపురంబు.

25

తే. గీ.

[6]పరిఖ యాదిమకచ్చపభరణ మగుట
సాల మభ్రగజోదారసార మగుటఁ
బ్రబలి తత్పురి గజకచ్ఛపప్రహారి
కన్న నేమం బొసంగదే కనకమున్న.

26


తే. గీ.

తద్రమాకాంతతోడ నాధరణికాంత
కవిత నిజరత్నమేఖల గాను[7]పింప
నంచితశ్రీలు ముచ్చట లాడినట్లు
పరిఖయును కోటయును మించె సిరుల నందు.

27


క.

మెండై యమరావతికిన్
భాండాగారంబువోలెఁ బ్రబలంబై బ్ర
హ్మాండమున వెలసె నప్పురి
నిండిన నవరత్నపూర్ణనిధులు చెలంగన్.

28


తే. గీ.

తతమదస్ఫూర్తి నైరావతం బుదగ్ర
విగ్రహంబున నెదిరి గర్వించెనేని
తదురుసప్తాంగహరణ ముద్ధతి నొనర్చి
తనరవే యందు భద్రదంతావళములు.

29


తే. గీ.

[8]జలధిలో ధారలొత్తు నుచ్చైశ్రవంబు
బలగుణాఢ్యంబె కఠినసాపత్న్యగర్వ
కలితసంగరవినుతాధికప్రతార
ణాంకము వహించె ననుఁ దదీయహయచయము.

30


తే. గీ.

నలువ మాకంటె ఘనుఁడె యామ్నాయశక్తి
నేకవచనంబు వరబుద్ధి నెఱుఁగుఁ గాని
యుభయవచనప్రకాశకయుక్తి యెఱుఁగఁ
డనుచు నవ్వీటఁ బ్రహసింతు రవనిసురులు.

31


క.

పేరై యుందురు వైభవ
శూరత్వము పూర్ణదానశూరత్వము ధీ
శూరత్వము రణధరణీ
శూరత్వము గలిగి రాజసుతు లవ్వీటన్.

32

తే. గీ.

అర్థవంతుండు దా విషమాక్షగోష్ఠి
సలిపె సంపన్నుఁ డగునె యీజగతి ననుచు
యక్షనాయకు నవ్వుదు రప్పురమున
భవ్యనవ్యార్థధుర్యు లారవ్యవరులు.

33


తే. గీ.

హస్తిపురభేదనోగ్రబాహాగ్రజాగ్ర
దాగ్రహులు బహుభోగభాగ్యాభిరాము
లధికబలశౌర్యసంపన్ను లతులకీర్తి
హారు లవ్వీటిశూద్రు లత్యంతఘనులు.

34

శ్రీకృష్ణజననము

ఆ. వె.

అతులశక్తి నుండె నామధురాపురి
శూరసేనుఁ డనఁగ శూరసేఁను
డాదురంధరుండు మాధురశూరసే
నములు జనపదంబు లమర నేలె.

35


క.

వసుదేవుఁ డతనిపుత్రుఁడు
వసుదేవుఁడు వెలసె భోగవైభవలీలన్
వసుధాంతరమున ననుపమ
వసుధాన్యశ్రీసమృద్ధి వైచిత్రముగన్.

36


వ.

దుష్టరాజన్యపీడితయై ధరణి గోరూపంబుఁ దాల్చిన దాది గోరూపంబం
తయు విన్నవించినఁ బద్మజుండు పద్మనాభుకడకు నేఁగి ప్రార్థించిన
యదుకులంబున జనియించి కంసాదుల శిక్షించెదనని శౌరి యానతి
యిచ్చిన విధాత సత్యలోకంబునకుం జనియె నంత నుగ్రసేనతనయుం
డగు కంసుం డాదేవకునకుం దనూజయగు దేవకి నవ్వసుదేవునకు
వివాహంబు చేసి తద్వధూవరుల నరదంబుమీద నిడుకొని పంపునప్పు
డాకాశవాణి యిట్లనియె. తదష్టమగర్భసంభవుండు భవద్విరోధి యనిన
భయంబంది దేవకీవసుదేవుల నిజగేహంబున నుంచె నంత సప్తమ
గర్భంబున నుదయించిన కుమారుండు.

37


క.

రాముఁడు శిశిరద్యుత్యభి
రాముఁడు శేషావతారరమణీయకళా
రాముఁడు గర్వితవైరివి
రాముఁడు రోహిణికి తనయరత్నంబైనన్.

38

వ.

అంత దేవకీదేవి యెనిమిదవగర్భంబు వహించె నప్పుడు.

39


మ.

పరితస్స్విన్నముఖాంబుజాతము గిరిప్రాయీభవత్సమ్మిళ
త్తరళోరోజ మనేకసంగ్రధికహృత్కామంబు కేలీసఖీ
సరసాలాపవిధానము న్ముఖనిజాంచద్భాగధేయంబు త
త్తరుణీరత్నము పూర్ణగర్భమతి చిత్రంబయ్యె నీక్షింపఁగన్.

40


ఆ. వె.

యదుకులోద్వహుఁడు నిజాత్మ నుండఁగఁ బాండు
జాతరుచి వహించె నాతిమోము
గరిమ ధార్తరాష్ట్రగతివిశేషంబులు
నడకఁ గొంచెపఱచె నాఁట నాఁట.

41


క.

తనువుం బ్రాణమునై యా
ఘనుఁడు జగద్వ్యాపి గర్భగతుఁడై యుండన్
దనువు తనువగుట చిత్రమె
తనువయ్యె విభూషణాలి తరళేక్షణకున్.

42


తే. గీ.

మేఘములు నిల్చెఁ గొండలమీఁద ననఁగ
నాతికిని చూచుకంబులు నల్లనయ్యె
ఫలము దీపింప నలసాస్యపాండిమంబు
చిత్రమై కానుపించుచుఁ జెలువు చూప.

43


క.

ఆరయ నానాభీగం
భీరతఁ దూలించునట్టి బిరుదుమగఁడు దు
ర్వారత నానాభీగం
భీరత గర్భస్థుఁ డగుచుఁ బెట్టు హరించెన్.

44


వ.

ఒకనాఁడు దేవకి నెచ్చెలిం జూచి ముచ్చటలన్ మెఱయ.

45


సీ.

తెల్లనిజడదారి దిట్టయై నడురేయి
                       తమిరేగి హెచ్చుగీతములు [9]వాడెఁ
దెరగంటి బోటులు దివినుండి యరుదెంచి
                       చెలఁగుచు ముందటఁ జిందులాడి

రొగి నాల్గుమోముల యొజ్జబాపఁడు వచ్చి
                       గొదగొని యంటువోఁ జదివిపోయె
వలికె నెక్కిన బేసియలుగుజేజేదొర
                       వింతగాఁ గొంత దీవించి చనియె


తే. గీ.

నుబ్బు మెఱయంగ ఖగరాగ యోర్తు వచ్చి
తమ్మి కెంగేలఁ ద్రిప్పుచు నెమ్మె చూపి
యేకతంబున గర్భస్థు నేమి చేసి
[10]యేగెనో కాని యంతట నెఱుఁగనైతి.

46


క.

నికటమునఁ గార్ముకముతో
నొకనల్లనిమేనిమేటియువిదయుఁ దానున్
వికవిక నవ్వుచు వరబా
లకుఁ డై యుండంగఁ జూచులాభముఁ గంటిన్.

47


వ.

[11]అక్కట రాత్రి నాకొదవిన యివ్విధంబు కలవలె నున్నది కాని
నిక్కంబ యని మహోల్లాసంబుగాఁ బలికి.

48


సీ.

రవి సింహమున నుండ శ్రావణకృష్ణాష్ట
                       మీనిశీధమున మేలైనరోహి
ణీతారయందు నెన్నిక గ్రహపంచకం
                       బుచ్చస్థమై యుండ యోగిజనులు
బ్రహ్మాదినిర్జరప్రవరులు గొనియాడ
                       శంఖచక్రగదాసిశార్ఙ్గరమ్య
బాహాచతుష్టయప్రకటమాణిక్యకి
                       రీటకుండలశుభశ్రీలు దనరఁ


తే. గీ.

గౌస్తుభాభరణము ఫుల్లకమలలోచ
నములు పీతాంబరము నూపురములు గాంచి
కాంగదంబులు నూత్ననీలాభ్రరుచియు
గల కుమారుని దేవకి గనియె నంత.

49

క.

అప్పుడు వసుదేవుఁడు సుతుఁ
దప్పక వీక్షించి కన్నుఁదమ్ముల నశ్రుల్
చిప్పిల్ల హర్షగద్గద
మొప్పు మెఱయ మేనఁ బులక లొదవం బలికెన్.

50


క.

అజరుద్రాదులకైనను
భజియింపఁగ రాని నీదుపావనచరణాం
బుజయుగళిఁ గంటి నీశ్వర!
గజవరద! ముకుంద! కృష్ణ! కమలాధీశా!

51


వ.

అని పలికి దివ్యరూపోపసంహారార్థంబుగాఁ బ్రార్థించినఁ దదనుమతం
బునఁ జిఱుతబాలుఁడైన యాకృష్ణుని నందవ్రజంబుఁ జేర్చి వసుదేవుండు
యశోధరాపుత్రికయగు మహామాయను నిజసతి సూతికాశయ్యను నిలిపె.
వసుదేవనందనుం డచట నంత.

52

శ్రీకృష్ణలీలలు - దుష్టసంహారము

క.

పూత నరనింద్య యగు నా
పూతన వీనులు నిమిరి యపుడు చన్నడఁగా
యాతన నొందాపుచు నా
యాతన [12]యార్భటి మురారి యడచెం దానిన్.

53


వ.

అంతటఁ గపటశకటంబు వికటంబుగా నుగ్గుచేసి తృణావర్తు నార్తుం
గావించి మరియును.

54


క.

నవనీతచోరుఁ డని తను
నవనీతల జనులు పొగడ నలరి జననికిన్
వివరముగల యాదొరముఖ
వివరంబునఁ జూపె విశ్వం బచటన్.

55


క.

ఖలమర్దనుఁ డాతఁ డులూ
ఖల కలన దలిర్ప మద్దికాయలరుచులున్
బెళుకుగ మద్దుల ద్రుంచెన్
మలయుచుఁ బ్రౌఢిమకు హద్దుమద్దులు గాగన్.

56

వ.

మఱియు నొక్కనాఁడు

57


చ.

ఫలములు వీథి నమ్మఁ గని బాలకలీలల శౌరి ఘంటికో
జ్జ్వలగతి రాఁగ ఛాన్యములు జారిన యంజలిఁ జూచి నవ్వి త
త్ఫలతతియందునించి మణిభాసినిజోన్నతభాండపాలికా
విలససమీక్ష చేసి ఫలవిక్రయిణీమణి పొంగె వేడుకన్.

58


తే. గీ.

ప్రేమ జలకేళి సలుపు నాభీరసతుల
యంశుకంబులు గొని కదంబాగ్రసీమ
సొగసుగా నిల్చి హరి ముద్దుమొగముఁ జూపె
జగ మలరఁ దత్పటంబులు మగుడ నొసఁగె.

59


వ.

ఆయంగనలకుం బ్రమోదంబుగా మఱియును.

60


తే. గీ.

[13]చింతయిత్రుల బ్రహ్మాదిసిద్ధమౌని
బహుతపఃప్రార్థనీయత్రిపాద్విభూతి
సతతసౌలభ్యసౌశీల్యశక్తి చూపి
మెచ్చి యిచ్చి మహోన్నతి నెచ్చుపఱిచె.

61


సీ.

వలపుకుప్పలు గాక వలిచన్నులా యివి
                       యోహో యటంచు నోరూరి యూరి
గండుమీ లగుఁ గాక కలికికన్నులె యివి
                       యోహో యటంచు నోరూరి యూరి
యెనరు సుధ ల్గాక నునుబల్కులా యివి
                       యోహో యటంచు నోరూరి యూరి
హేమవల్లరి గాక యిది మృదులాంగమా
                       యోహో యటంచు నోరూరి యూరి


తే. గీ.

చటులయమునాతరంగిణీతటనికుంజ
కుటకుటీరాంతరంబులఁ గొన్నినాళ్ళు
రాధతోఁ గూడి విహరించె రతికళత్ర
గురుఁడు సింధుసుతామనోహరుఁడు గురుఁడు.

62

సీ.

[14]జారుపయ్యెదయు నొయారిచూపుల ముగ్ధ
                       భావంబు మెరయించు భాషణములు
కలయికలోని ప్రాగల్భ్యంబు వింతలౌ
                       సింగారములు ముద్దు చిల్కు నవ్వు
గుబ్బలు చెన్క నుల్కుచుఁ దానె పైకొను
                       నంగాంగసంగతాలింగనములు
కంకణమంజీరకాంచికాకింకిణీ
                       రవ మొప్పు నొకమిటారంపునడపు


తే. గీ.

సిగ్గు సొగసును మురిపెంబు సిరియు వలపుఁ
గ్రుమ్మ రాచంగ రాధతోఁ గూడి మెలఁగె
నఖిలమోహాంతరాతీతుఁ డైనశౌరి
వన్నె యమునాతటీవనవాటికలను.

63


సీ.

తానే పన్నీటితోఁ దళుకొత్తు కస్తూరి
                       బొట్టు వింతగ ఫాలమున నమర్చుఁ
దాన నెత్తావి వింతగ నేర్చి కట్టిన
                       [15]పూదండ లపుడు కొప్పున ఘటించుఁ
దానె కట్టాణిముత్యాలు గ్రుచ్చినపట్టు
                       రవికె చన్నుల మించ [16]నవదరించుఁ
దానె కర్పూరయుక్తపటీరరసమునఁ
                       దళుకుఁజెక్కులను బత్రములు వ్రాయు


తే. గీ.

ధవళదీర్ఘవిశాలనేత్రములయందు
శ్రీలు మెరయంగ నంజనరేఖ దిద్దుఁ
దావి వెదజల్లుపుక్కిట తమ్మలంబు
నోరు నిండించు నాపూతనారి తానె.

64


వ.

ఇవ్విధంబున.

65


క.

తీరనిమమతల యమునా
తీరనికుంజముల వింతతీ రనిపించెన్
వారక రాధామాధవ
సారకళాకేళికుతుకసారస్యంబుల్.

66

క.

వ్రజసతులందఱు దివిజ
వ్రజసతుల న్మించి మోహవశచిత్తములన్
భజనము సేయ నతఁడు డిం
భజనముతో నాలఁ గాచె మధురిపుఁ డచటన్.

67


క.

నందాదులు సకలశతా
నందాదులు మెచ్చ నాదినారాయణుఁ డా
నందాదులతో సనకస
నందనముఖ్యులు భజింప నయము వహించెన్.

68


క.

బృందావనమున నాశ్రిత
బృందావనశీలుఁ డహితభేదకుఁ డాగో
విందుఁడు సజ్జనరక్షా
విందుఁడు రాజత్పదారవిందుఁడు వెలసెన్.

69


క.

ధీరత్వము శూరత్వము
దారత్వము శోభనావతారత్వము గం
భీరత్వము సారత్వము
పారత్వము నెంచ గోపబాలుఁడు నొంచెన్.

70


వ.

అంత నింద్రోత్సవంబు సేయక యొక్కనాఁ డనర్గళదుర్గామహోత్సవ
మొనర్ప నింద్రుండు కనలి ఘనఘనాఘనంబుల నియోగించిన.

71


సీ.

తొలుదొల్త తోనవాతూలంబు లుత్తాల
                       శైలజాలవిదారిశక్తి విసరె
నంతట దిశల గాఢాంధకారము గప్పె
                       తఱచుఁ గ్రొమ్మెఱుఁగులు మెఱసె నపుడు
ఘనమై నెరసెఁ గీటకర్పటగ్రామని
                       మ్నోన్నతైక్యము గల్గు నురకరాశి
యఖిలలోకంబులు నందంద కంపింప
                       నమితార్భటుల గర్జితములు నిగిడె


తే. గీ.

ఘోరధారాళఘనశిలాధార మోలి
ఘోషజనఘోషభీషణోత్కర్ష మొదవ
ఘోరరవముగఁ గురిసె దిక్కుహర మదరఁ
జెదరె భూచరఖేచరశ్రేణి యంత.

72

శ్రీకృష్ణుఁడు గోవర్ధనంబు నెత్తుట

వ.

అప్పుడు నందాదులు.

73


క.

ఆర్తత్రాణపరాయణ
మూర్తీభవ దఖిలధర్మమునిజనవరదా
కర్తవు భోక్తవు నిన్నున్
గీర్తించెద మఖిలనాథ! కృష్ణ! ముకుందా.

74


వ.

వర్షభయంబుఁ జెందిన మమ్ము రక్షింపు మని ప్రార్థించిన గోపాలశేఖ
రుండు గోవర్ధనం బొకవ్రేల నెత్తె నపుడు.

75


తే. గీ.

వజ్రపంజరమున నున్న వాసిఁ గాంచి
గోపగోవత్సగోపికాగోగణములు
విస్మయము నొందె గీర్వాణవిభుఁడు మఱియుఁ
బూని యాకొండపై ఱాలవాన గురిసె.

76


ఆ. వె.

కరుణఁ బ్రోచె శౌరి కసుగందకుండ నా
ధేనువితతి గోపసూనుతతుల
నమృత[17]యుజులఁ జేసె నావేళ నిజశక్తి
నేమి సేయఁజాలఁ డీశ్వరుండు.

77


సీ.

"ఉఫ్" అని తానూఁద నుండు నేమింటిపైఁ
                       బుష్కలావర్తకాంభోధరములు
కట్టివ్రేయఁగలేఁడె గదిసి దామెనత్రాళ్ళ
                       నదలించి పర్జన్యు నైన నపుడె
ఒకపిడికిటిలోన నునుపనోపఁడె యని
                       వార్యంబులగు శిలావర్షతతుల
నెలమిఁ బుక్కిటిలోన నిలుపఁజాలఁడె ఘోర
                       వారిధారోగ్రప్రవాహములను


తే. గీ.

జిత్రముగ నమ్మహాత్ముండు సేయు మహిమ
లెన్ని లే వెన్ని గల్పింపఁ డెన్ని నిలువఁ
డెన్ని మాయింపఁ డెఱుఁగని వెన్ని చూపఁ
డతనికి నసాధ్య మెయ్యదియైనఁ గలదె.

78

సీ.

అలచుట్టు గట్టుచే నాగుణనిధి
                       యాలమందకు దొడ్డి యమర్చలేఁడె
కనకాద్రి యామేటి ఘనకేలి పాలుఁ గం
                       తులకును దిబ్బగా నిలుపలేఁడె
హిమశైలరాజంబు నీదొర నేర్పునఁ
                       బసులకఱ్ఱగఁ గేలఁ బట్టలేఁడె
వింధ్యంబు నీదంట వీక్షించి కడువింత
                       బంతి సేయఁగలేఁడె బాహుపటిమ


తే. గీ.

వ్రేల నీకొండ యెత్తుట వింత యగునె
యనుచుఁ దను సర్వఖేచరయక్షసిద్ధ
సాధ్యవిద్యాధరాదులు సన్నుతింప
లీల మెరయించె నపుడు గోపాలవరుఁడు.

79


వ.

అప్పు డింద్రుండు భీతింబొంది యాకృష్ణునకు మ్రొక్కి యిట్లని
వినుతించె.

80


క.

నీవాఁడను నీవాఁడను
నీవాఁడను నాకు దిక్కు నీవే తండ్రీ!
కావక మానితె మును లో
కావక శరణన్నకల్మషాత్ములనైనన్.

81


తే. గీ.

మదపరాధములైన సన్మహిమఁ గాతు
మదపరాధముఁ గావవే మాధవ! హరి!
కృష్ణ! గోవింద! వైకుంఠ! కేశవ! మధు
సూదన! మురారి! చక్రి! యచ్యుత! ముకుంద.

82


ఆ. వె

జయ యుపేంద్ర! కృష్ణ! శౌరి! నారాయణ!
జయ పురాణపురుష! చక్రహస్త!
జయ పరేశ! ఈశ! స్వామి! జగన్నాథ!
జయ రమాకళత్ర! జయ పవిత్ర.

83


వ.

అని నుతించిన.

84


క.

దరహాసచంద్రికారస
భరమున సురరాజు తాపభయము లణంచెన్
శరణాగతవత్సలుఁ డా
హరి గోపకు లంది రద్భుతానందంబుల్.

85

వ.

అంత.

86


క.

కాళియఫణిపతిగరళ
జ్వాలాపాళీవిలోలజలజాప్తసుతా
కూలంకషజల మానుచు
నోలిన్ గోవితతి మూర్ఛ నొందినయంతన్.

87


వ.

కృష్ణుం డొక్కకదంబభూజం బెక్కి యమునాహ్రదంబులో నురికి.

88


క.

తాండవముఁ జూపె కాళియ
చండఫణామండలమున శౌరి యఖండో
ద్దండమహాద్భుతచారీ
పాండిత్యవిశాలతాళపద్ధతి మెఱయన్.

89


వ.

అప్పుడు.

90


సీ.

బాహుమూలంబులఁ బసిఁడితళ్కులు గ్రమ్మి
                       బిగువుకుప్పసములం దగటు సేయఁ
బయ్యెదల్ జాఱినఁ బాలిండ్ల నలువంక
                       జడివట్ట మెఱుఁగులజళ్ళు గురియఁ
గలికికన్నుల వాలు కలువపూవులచాలు
                       బెళకించి యొకవింతనలుపు నీన
నతులభూషణమణిద్యుతులకు నెమ్మేని
                       నిగనిగసొగసువన్నియలు వెట్టి


తే. గీ.

మంజుమంజీరశింజానరంజితకటి
మేఖలానూనరావముల్ మేర మీఱ
నాగకన్యలు వచ్చి యానందసుతుని
యడుగుఁదమ్ములమీఁద నెయ్యమున వ్రాలి.

91


క.

పతిభిక్ష పెట్టవే శ్రీ
పతి పతితుని నితనిఁ గాచి పరమదయాసు
వ్రత! నీవు దక్క నెవ్వం
డతిదీనుని నితనిఁ గావ నాత్మఁ దలంచున్.

92

సీ.

గంధసారఫలాశిగణముతోఁ బెనఁగొని
                       యాపత్క్రమం బెన్నఁ డైనఁ గనఁడు
కంచుకివర్గ ముత్కటవృత్తిఁ గొనియాడ
                       నతిగర్వసంపద నధిగమించు
ఘనతరస్ఫటికాతికఠినాత్మ వర్తిల్లు
                       నైలబిలశ్రీల కానసేయు
నఖిలజగత్ప్రాణహారి యయ్యును మించి
                       నాకులలోన నాననము చూపుఁ


తే. గీ.

దన కధోగతి గాని లేదని జనంబు
లాడికొన్నను సుకృతమార్గాచరణము
సలుపఁ డీతని నీక్షించి చనినవాని
కగునె శుభకార్య మెన్నటికైన ననఘ.

93


వ.

అని బహువిధంబుల వినుతించిన వారిం గటాక్షించి యాకాళియల సముద్ర
మధ్యంబున కేఁగు మని యనియె. అంత నొక్కనాఁడు యశోదానంద
గోపికాజనంబులు కృష్ణుం డున్నసమయంబున.

94

శ్రీకృష్ణుఁడు దావాగ్నిని గ్రోలుట

స్రగ్ధర.

ఆవిర్భూతోగ్రకీలాహతచటులకుటా
                       భ్యంతరోద్యన్మహారూ
మ్యావేషోదీర్ణమేఘవ్యతికరరహితా
                       శ్యామికాభావమై వ
న్యావీథి ద్రాగటాట్యానతశబరజన
                       త్యాజితాజీవమై సం
ద్రావన్నానామృగాండోద్భవవిహితవిము
                       ద్భావమై దావ మున్నన్.

95


వ.

అయ్యమునాతటంబు డాయ న్వచ్చునావనహుతాశనుం జేరం జని.

96


క.

వ్యాపృతకాళియజయల
క్ష్మీపరిణయుఁ డైన గోపసింహము ఘనసం
దీపితదవదహనాత్మా
రోపణ మొనరించె ఖేచరులు గొనియాడన్.

97

వ.

అంత మఱియును.

98


సీ.

దధిఖండసిక్తనలినశాల్యన్న
                       విరళశిక్షకపుంజసరసఖండ
నాగరైలాచూర్ణనారికేళశకల
                       లవణాంబుమిశ్రమై వివిధగంధ
మొనరఁ జిక్కమునఁ బెట్టిన చట్టి శృంగిబే
                       రామలకామ్రవేత్రాంకురాగ్ర
బార్హత ముఖ్యశోభనము తానూరుఁగా
                       యలు వ్రేళ్ళఁ బొసఁగ నిజాప్తజనకృ


తే. గీ.

తేష్టసల్లాపగోష్ఠితో నెలమి దగ భు
జించె గోపకులును దాను జిత్రరుచుల
సరవి మెచ్చుచు ఖేచరవితాన
మపుడు భుక్తోజ్ఝితములకు నాసపడఁగ.

99


వ.

అప్పుడు.

100


క.

మొలవంకరైన యుంగర
ములు గుంజాభూషణాంకములు మూపులపైఁ
జలకంబళములు దండము
లలరఁగ గోపకులు నడిచి రావులవెంటన్.

101


క.

విశదధ్వజాబ్జవజ్రాం
కుశశంఖరథాంగకల్పకుజచామరము
ఖ్యశుభపదరేఖ లిల నన
దృశచిత్రత కరప వాసుదేవుఁడు నడచెన్.

102


వ.

అప్పుడు జలజసంభవుండు వత్సవత్సపాలకుల నపయింప శౌరి తత్స్వ
రూపంబులు దాన యగుటంజేసి యాచతురాననుండు లజ్జావనతాన
నుండై భగవంతుని గని.

103


దండకము.

లక్ష్మీపతీ! నీమహత్వంబు డెందంబునందు న్విచారింపఁగా లేక
మందుండనై దుష్టకర్మంబు గావించితిన్ మత్పతీ! యేరజోవృత్తివాఁడన్
విమూఢుండ గర్వాంధుఁడన్ నన్నుఁ బాలింపవే దీనకల్పద్రుమా! మించి

యాద్యుండవై వేదవైద్యుండవై యోగిహృత్కంజసింహాస[18]నస్థుండవై జ్ఞాన
వైరాగ్యభృద్భక్తసంరక్షణోద్యత్ర్కియానిత్యధన్యుండవై శాంబరీజాల
సంధాననీకాశనానావిధాజాండభాండప్రకాండస్ఫురల్లోకనిర్మాణదక్షుం
డవై యిందిరాభూమినీళావధూనీలసౌధాయమానోల్లసత్పీనవక్షుండవై
చక్రకౌమోదకీశార్ఙ్గముఖ్యాయుధాధారబాహాచతుష్కాంతిభవ్యుండవై సూత్ర
పత్యాత్మనాథాహిరాడ్వైనతేయాదిసేవ్యుండవై సర్వలోకైకనాథుండవై
పూర్ణభూతిస్థిరానందలక్ష్మీసనాథుండవై యుండు బ్రహ్మంబ వీ వంచు తామంజు
గుంజావళీకుండలశ్రీలతో బర్హిబర్హావతంసంబుతోఁ బుష్పదామచ్ఛటోద్దామ
కంఠంబుతో నవ్యనీరేరుహారణ్యవిభ్రాజిపాదాంబుజచ్ఛాయతో నాయతోదార
నేత్రాంతనిర్యద్దయాదృష్టితో వక్త్రచంద్రోల్లసచ్చంద్రికామందహాసంబుతో
గోపబృందంబు లానందముం జెంద వ్రేపల్లెలో భూజనశ్రేణి భాగ్యంబుచే నిల్చి
యున్నాఁడవౌ తండ్రి నీదివ్యరూపంబు నేఁ గానలేనైతి మౌళిస్ఫురన్నూత్న
రత్నాళినీరాజనశ్రీలు గన్పట్ట ప్రేమార్ధమౌ నేత్రపాత్రాంతరాపూరితానంద
బాష్పాంబుపూరంబు పాద్యంబుగా హృద్యమద్వాక్యపుష్పాళిచే నీకు నేఁ బూజఁ
గావించెదన్ స్వామి కైకొమ్ము నానేరముల్‌గాచి రక్షింపవే కృష్ణ! శౌరీ!
మురారీ! హరీ! కోటిసూర్య ప్రకాశంబు నీమూర్తి మచ్చిత్తకంజంబునన్ జాల
భావించెదన్ సారసాక్షా! నమస్తే నమస్తే నమస్తే నమః.

104


వ.

అని నుతియించిన.

105


లయగ్రాహి.

మౌళిశిఖి పింఛమును గేల వరవేణువును
                       ఫాలమునఁ గస్తురి భుజాలతల గుంజా
మాలికలపట్టెడలు డాలొలుకువత్స పద
                       ధూళి యలకంబుల విలోలవనయూధీ
జాలకము లాశ్రితులశ్రీలు విలసిల్లెడు క
                       పోలములు లేనగవు చాలఁ దగి మించన్
బాలుఁడగు దివ్యజనపాలుఁడు సరోజభవు
                       పాలిటికి నవ్యసురసాల మయి పొల్చెన్.

106


క.

ననవిల్తుజనకుఁ డగు నా
ఘనుఁడు దనుం గరుణఁ జూడఁగాఁ దగుహర్షం
బునఁ జనియె సత్యలోకం
బునకు నలువ పూర్ణభావములు రంజిల్లన్.

107

తే. గీ.

రాసభాకృతి ధేనుకరాక్షసుండు
రా సభాకృతిఁ దూలించి రాముఁ డొడిసి
పట్టఁ జేరి మహోద్భటార్భటి యశోద
పట్టి త్రుంచెఁ దదాప్తోగ్రబలమునెల్ల.

108


తే. గీ.

ఆదిఝషమైన హరియె యాహార మనుచు
మించి బకుఁ డచ్యుతుని నిజచంచువివర
గతునిఁగా మ్రింగ నంతఁ దద్గళము చొరక
వాని వ్రయ్యలుగాఁ జేసె దానవారి.

109


క.

బకుఁ డుచ్చలితారికదం
బకుఁడు భయంకరమహాంధభావవిరూపాం
బకుఁ డర్దనచిత్తాలం
బకుఁ డీల్గినఁ దీవ్రరోషపరవశుఁ డగుచున్.

110


ఆ. వె.

అఘుఁడు వానితమ్ముఁ డరుదెంచి యజగరా
కృతిని దలను మ్రింగఁ గెరలి వాని
నజగరంబువోలె హరి వేగఁ జీరి తా
వచ్చె వత్సపాలవరులకడకు.

111


క.

ఆవనమున నొకనాఁడు మ
హావిశ్వజనీనుఁ డైన హరి పంతంబుల్
గావించి హవ్యవాహక
భావంబున సఖులతోడఁ బన్నిద మాడెన్.

112


వ.

అప్పుడు గోపాలవేషంబునం బ్రలంబుండు బలభద్రు మూ పెక్కించు
కొని చనునంత.

113


శా.

తాలాంకుండు విదారితాహితమదోత్తాలాంకుఁ డత్యుద్ధతిన్
బ్రాలం[19]బాంత్రములెల్ల భూతతతికిన్ బ్రాలంబముల్ చేసె నా
భీలక్రూరభుజాశనిప్రహతిచే భేదించెనే తచ్ఛిర
శ్శైలం బుర్వరఁజూర్ణభావము వహించన్ రాచె దద్గాత్రమున్.

114

వర్షాగమము

వ.

అంత.

115


క.

తోరంబులయ్యెఁ [20]బ్రాచి?
న్మారుతములవాచి కేఁగె మబ్బులఁ బ్రతీచిన్
బేరయ్యె నింద్రచాపము
కారుమెఱుంగులును దివిని గడు రంజిల్లెన్.

116


తే. గీ.

అపుడు వర్షాగమమహేశుఁ డతులశక్తి
ఖగపురంబులు దూలింపఁ గడఁగి తేరి
చక్రములు గట్ట కమ్ములు సంఘటించె
ననఁగఁ బరివేషములు శశిహరులఁ జుట్టె.

117


క.

చేరిక వర్షాలక్ష్మి ధ
రారమణిం గౌఁగిలింప రాలిన కుచకుం
భోరుతరకుంకుమచ్ఛట
వై రాణించెన్ విచిత్రహరిగోపంబుల్.

118


క.

అవనీపవనంబులచే
నవనీపవనంబులెల్ల ననిచె బలాకల్
దివి నుండెఁ గుళీరంబులు
భువి నుండెన్ బాంథజనుల పొగులు న్నిండెన్.

119


సీ.

గంగాసరస్వతీతుంగభద్రాయము
                       నాకవేరుసుతాపినాకినీశ
రావతీసింధుగోదావరిగోమతి
                       కృష్ణవేణ్యాగండకీమలాప
హారిణీచంద్రభాగాలకచర్మణ్వ
                       తీనర్మదాబాహుదానదీశ
తద్రుఫేనావిపాట్తాపిపయోష్ణిప
                       యఃప్రవాహములు మిన్నంది వేగఁ


తే. గీ.

దద్దయును బొంగుచును విటతాటములగు
తటజకుటజము ల్వీచికాపటలిఁ దేల
దశదిశాచక్రనిమ్నోన్నతస్థలంబు
లేకమై యుండ నిండె సమిద్ధమహిమ.

120

తే. గీ.

కులికె నొకసిరియూధికాకుటజనీప
కేతకీకుసుమములు ప్రభూతమహిమ
మొనసి ఘనతరవనదుర్గముల దళంబు
లేర్పడ ఘనుండు మన్నించె హెచ్చుగాఁగ.

121


వ.

అప్పుడు.

122


క.

మురళీనాదము చేసెను
హరి హరిణిమానసంబు లానందకళా
భరణీభవభృతివద్వయ
శరణీభవదమృతసారసాగరములుగన్.

123


వ.

అంత.

124


క.

పొదలె నరవిందసంపద
కదలెఁ దటిల్లతలవేశ కాశజలక్ష్ముల్
మెదలె మరాళగణములకు
వదలెం గడు మానసాధివాసప్రేమల్.

125


సీ.

అభ్రముల్ వెలవెల నయ్యెఁ బంకం బింకె
                       [21]నమ్ముల నెరి తప్పె నభము తనరెఁ
తారలు మెఱసె [22]జ్యోత్స్నాపూరములు పొంగెఁ
                       గలమ సస్యము పక్వ కణిశ మయ్యెఁ
గనుపట్టె సైకతోత్కరము నదుల్ స్రుక్కె
                       వృషభముల్ మత్తిల్లె విరిసె సప్త
వర్ణముల్ సొంపారె బాణాసినంబులు
                       ఘటజుపెంపున నీటఁ గలఁకదీరెఁ


తే. గీ.

జాతకంబుల యామని జాఱితారె
నలబలాకలసంభ్రమం బాశ లెల్లఁ
జాల దీపించె రాజహంసగతి నెరసె
ధరణి శరదాగమము వింతసరణిఁ జెలఁగ.

126

వ.

అప్పుడు.

127


మ.

అవతంసాంచితనవ్యపుష్పములు నొయ్యారంపుఁజూపుల్ త్రిభం
గి విచిత్రాంగము పింఛలాంఛనము నాకీర్ణాంబుదచ్ఛాయయున్
నవలావణ్యము గల్గి గోపకుఁడు నానారూపగాంధర్వతా
నవితానంబులచే ననన్యసుకరానందం బొనర్చెం దగన్.

128


వ.

తదనంతరంబున.

129


ఆ. వె.

విసరెఁ జల్లగాలి వీగె నంభోజంబు
లా హసంతి మీద నయ్యెఁ బ్రేమ
నవనిపై హసంతియగు నాతి యింపయ్యె
మహిమతో హిమాగమంబు మెఱసె.

130


తే. గీ.

మొనసి మధ్యాహ్నపర్యంతమును సమగ్ర
తుహినముం ద్రొక్క వేగ మద్భుతబలంబు
హెచ్చ హయములు రవిరథం బీడ్చుకతన
నహరహస్ఫూర్తి గనుసన్న మయ్యె నపుడు.

131


మ.

గిరిశృంగాగ్రగుహానివాసి యగుచున్ గ్రీడించు గోపాలకో
త్కరయుక్తుండగు నయ్యదూత్తముఁడు నాదబ్రహ్మమూలంబునన్
బరమంబై జగదద్భుతంబయి సుధాపానోపమంబై తగన్
మురళీనాద మొసర్చెఁ దత్సురభు లామోదంబుతోఁ జొక్కఁగన్.

132


వ.

ఒక్కనాఁడు శౌరి గోపకయుక్తుండయి విహరించుచుఁ దత్సమీపంబున
ఋషులు యజ్ఞంబు సేయఁ దద్దీక్షితపత్నుల నన్నంబు వేఁడిన నాసతులు
పొంగి.

133


మ.

కలమాన్నంబున పూపసూపములు యోగ్యంబౌ నవీనాజ్యముల్
ఫలముల్ జీరకఖండహింగుమరిచప్రాయంబులౌ కాయగూ
రలు పచ్చళ్ళు రసాయనంబులును శీరస్ఫారనీరంబు పె
క్కులు దధ్యాదులు నింపుగా నొసఁగి రాగోపాలకశ్రేణికిన్.

134


వ.

అప్పు డాయన్నంబు గోపాలకులుం దానును భుజియించి యాహరిని
మన్నించిన యంతరంగంబులం బ్రమోదాంకురంబులు మొలవ నాదీక్షి
తాంగనలు నిజనివాసంబులకుం జని రప్పుడు.

135

వసంతాగమము

ఉ.

అంత ధరిత్రిఁ [23]జైత్రకుసుమాయుధయాత్రుఁడు చైత్రుఁ డొప్పె శ్రీ
కాంతవనాంతభాస్వరవికస్వరసూనమరందపానవి
శ్రాంతివిజృంభితభ్రమరఝంకృతిగానవిధానసంభ్రమా
క్రాంతఘనప్రమోదగుణరాజితభోగివరేణ్యమిత్రుఁడై.

136


క.

మావిచిగురాకుడాలను
కావిరి గనుపట్టె నపుడు ఘనవనసీమన్
ద్రావి విరితేనెవానలు
వావిరి నిఁకఁ గురియు ననఁగ వాసి దలిర్పన్.

137


తే. గీ.

పంచశరుఁ డుబ్బఁగా జీర్ణపటము లూడ్చి
సన్నకావులు పూనిన సతులఁ బోలి
పండుటాకు గముల్ రాలఁ బరఁగు నరుణ
కిసలముల నవవల్లరీవిసర మమరె.

138


తే. గీ

పోకుక్రియ నడ్డమై యవి పొంతపంక్తి
యమర భయమందుఁ బాంథమృగాళిఁ బట్టఁ
దలఁచి వైచెనొ పువ్వులవలమనోజుఁ
డనఁగఁ గ్రొవ్విరిజొంపముల్ పని తనర్చె.

139


సీ.

కలయంగఁ బర్వు చీఁకటి [24]మ్రాఁకుగమి చాయ
                       యనత ఘనాఘనఘనత నీనఁ
బల్లవదశపుష్పపటు[25]భాకలాప మా
                       ఖండలచాపంబు దండి చూప
పక్వములై రాలు ఫలములచాలుడా
                       లింద్రగోపమ్ముల యెమ్మెఁ గూర్పఁ
గొదమచిల్కలు రాయఁ జెదరిన యాకోర
                       కంబులు వడగండ్ల [26]పడ పొనర్ప

తే. గీ.

కలితమదయుతచంచరీకప్రకాండ
బహురవాటోప ముఱుముల బాగు నెరప
జనము సన్నుతి సేయంగ పనము తేనె
వాన గురిసిన మోదము వాసి బెరసె.

140


వ.

ఇట్లు సకలామోదకరంబై పుష్పపరాగరాగాక్రాంతపనాంతంబగు
వసంతంబు విజృంభించుటయు నాకృష్ణుండు గోపికాకలాపంబులతోడ
బృందావనంబుఁ బ్రవేశించె నపుడు.

141


క.

ఎలమావులతావుల దీ
వులపుప్పొడిప్రోవులన్ మిపులఁ దగు మరుమా
వుల నునుబల్కుల దీపుల
దెలివిరిగమితావులన్ [27]సతీతతి యెసఁగెన్.

142


క.

మాఁగినపండ్లకుఁ దేనెలఁ
దోఁగిన మరువిండ్లకును మృదులసుమగంధం
బాఁగిన పొదరిండ్లకుఁ [28]దమి
మూఁగిన తుమ్మెదలకున్ బ్రమోదం బొదవెన్.

143


సీ.

చిగురులు చిదిమిన దగు కేలుకెంజాయ
                       పల్లవస్ఫూర్తులఁ బాదుకొల్పఁ
బువ్వులు గోసిన నవ్వులతేటలు
                       ప్రకటప్రసూనవైభవము నిల్పఁ
దేటులఁ జోఁపిన నీటులౌ చూపులు
                       తుమ్మెదబారులు గ్రమ్మఁ జేయ
ఘనసుమనస్తబకంబులు ద్రుంచినఁ
                       గుచకాంతి క్రొవ్విరిగుత్తులు నుప


తే. గీ.

వనరమాప్తైకభావంబు వన్నె గాంచి
సరస మాధవుఁ డామోదగరిమ మెఱయ
వంజులమరందబృందాంకకుంజతతుల
హాళి విహరించె గోపకన్యాచయంబు.

144

మ.

కుచముల్ నిక్కగఁ గక్ష్యమూలముల తళ్కుల్ మించఁగా లోచన
ప్రచురశ్రీపయిఁ గ్రమ్మఁ బోకముడి జారన్ చిత్రమై సూక్ష్మమ
ధ్యచలత్వం బమరన్ విరు ల్చిదిమె సొంపౌ తీవ చేవంచి యొ
క్కచకోరాక్షి మరందలోలదలిఝుంకారంబు తోరంబుగన్.

145


రగడ.

ఉవిద పొదలె నోహో యెలమావులు
                       రవలి చేసె వలిరాయనిమావులు
పంత మటవె చెలిపజ్జన మెదలకు
                       నింత జళుకఁదగునే తుమ్మెదలకుఁ
గ్రొవ్వున నాలతకుం బో నేటికి
                       జవ్వని యలరులు చాలు న్నేటికి
మానిని యేమిఁక మదిలోఁ గుందము
                       తో నీచేతికి దొరకెం గందము
వలదు తేనియలవానల నానకు
                       కలికి యేల యుల్కవే మరునానకు
క్రమ్మెఁ దెమ్మెరలు కమ్మనితావుల
                       మ మ్మిఁక విడువకుమా యీతావులఁ
గలిగెను రంభల కపురపుఁబలుకులు
                       వెలసె గండుఁగోవెల గమిపలుకులు
తరుణి పొగడగాఁదగియె వనాంతము
                       ధరఁ గడుఁ బొగడఁదగియె వసంతము
కినుకలేక చొక్కితివె వరాళికి
                       నెనసె నసమనుతి యీజవరాలికి
అరిది చిగురు చాయలు దగుఁ బొదలకు
                       గుఱుచనడలనిక్కులచేఁ బొదలకు
వెలసెను జెవి సుమవిరచితహారము
                       కలిగెనె చెలువకుఁ గలితవిహారము
సొం పొదవెన్ నీసొమ్ములకెంపుల
                       గుండగుమోదుగు క్రొవ్విరికెంపుల
బాగమరెన్ సతి పతకము పచ్చల
                       సోగతీగెగమి చొప్పుడు పచ్చల
కలితేందిందిరకచ యౌరా యని
                       తెలివి నుతింపఁగదే వలరాయని

నెమ్మె మెఱయననునే యలవాటునఁ
                       గొమ్మలచే సుమగుచ్ఛము వాటున
మది చెదరకు సతి మరునసి వారికి
                       మదవతు లాడిన మాటల వారికి
హరిణవిలోచన యనుపమరాగము
                       పొరిఁ బొరి నిలిచెం బుష్పపరాగము
జగములు మెచ్చని శాఖల చాయల
                       నిగిడిన పుప్పొడి నిద్దపుఁజాయల
నని సరసోక్తుల నందఱ నాడుచు
                       వినుతలాస్యముల వెలయగ నాడుచుఁ
జెలువలు మెరసిన శృంగారంబునఁ
                       జెలువానిరి తను శృంగారంబున.

146


వ.

తద్వనీకేళీపరిశ్రాంతలై యున్న కాంతలుం దానును జలక్రీడ లొన
రింపంబూని యమున డాసె నప్పుడు.

147


తే. గీ.

శ్యామ నిన పుత్రిఁ దగిలి మాస్వామి మమ్ము
విడుచునో యని భయమున వెలఁదు లతని
కరము లంగుళులును మేను కటియుగమును
బాహువులు మూఁపు వదలక పట్టిరపుడు.

148


వ.

అంతకుమున్న భూషణాదులు తత్తటంబునం బెట్టి చదురుకావులు ధరి
యించి కనకమయశృంగంబులు కరంబుల వహించి రత్నమయసోపా
నంబుల వెంబడి నొయ్యన హరితోడం జని యమునాహ్రదంబుఁ జొచ్చి
కృష్ణభుజశాఖలం బోయి తదీయోత్తుంగతరంగంబుల విహరించుచుఁ
గాంతానిచయం బన్యోన్యకుచకచంబులు గురులు చేసి వాసిగాఁ బుప్పొ
డులు గ్రమ్ము తమ్మిరేకులచాలు తేనెజాలు కొసంగుప్పిన జక్కపల
కవల తుమ్మెదల పొదుల యరులవైవం దొడంగి రవిసముల్లోలకల్లోల
పాలికాసంచలత్పద్మాంతరాళచక్రవాకచంచరీకంబులు కడకుం
జనియె. [29]కొమ్మలు చిమ్మిన గ్రోవులం జిమ్మిన మకరందంబునఁ గాంతా
కరక్షిప్తమృణాళంబులును నంగనల యధరంబుల బాహువులపై నంటి
నిజాప్తభావంబు వెలయించెనో యన మెరసెన్ గృష్ణుఁడు గోపికలు

చల్లిన స్తనకలశకుంకుమారుణోదకంబులు గ్రమ్మ ధాతుమయనిర్ఝ
రాంబురక్తంబగు నంజనాచలంబు డంబు వహించె. ఇట్లు బహువిధ
జలక్రీడలు గావించి తత్కేలి చాలించి తత్తటంబునకుం జనుదెంచి
చలువలు గట్టి చిత్రమణిభూషణంబులు ధరియించి శీతలకుసుమ
మాల్యంబులు సవరించి యుచితవిహారంబుల వెలయుచు నుండి
రంత.

149


తే. గీ.

కృష్ణుఁ డన్నది గోపికాకేళిపరత
నోలలాడంగఁ జూచి నోరూరి యటుల
పద్మినులతోడఁ గూడి యప్పాటనవర
జలధిఁ జేరినకైవడిఁ జనియె నినుఁడు.

150


తే. గీ.

అట్లు పద్మాప్తుఁ డపరాబ్ధియందుఁ గ్రుంగె
నతనివెను చను నవ్యరక్తాబ్జలక్ష్మి
వోలె సంధ్యారుణప్రభాలీల మెఱసె
గగనకుంభీంద్రసింధూరకలన వొసఁగ.

151


తే. గీ.

అపరవారాశిఁ గసరెత్త నద్భుతముగఁ
దరణి మునిఁగిన తద్వనుతతులు దొరక
తేజము వహించె నవు డన్నిదిక్కులందు
హేతిమంతుండు జగమెల్ల నెన్నికొనఁగ.

152


సీ.

ఆకాశగంగాజలాంతరమ్ములయందుఁ
                       గొమరారు పేనఖండము లనంగ
నభ్రగజంబు దివ్యవిమానవితతి వా
                       రక రాయ రాలు హేమాంబు లనఁగ
నర్కుండు చెరగొని యపరాద్రి విడువంగ
                       వచ్చిన నవకైరవంబు లనఁగ
నలరువిల్తుండు సవ్యాపసవ్యముల ల
                       క్ష్యము వేయు కుందబాణము లనంగ


తే. గీ.

సమయమిషఘనఖరకరస్వామి విదళి
తాంధకారగజేంద్రకుంభాంతరాళ
కీర్యమాణసమగ్రమౌక్తికము లనఁగఁ
దార లుదయించె రుచిరజితారు లగుచు.

153

మ.

జను లోహో యని యద్భుతాబ్ధి మునుఁగ
న్‌సాయాహ్నరాముండు తా
దినలంకాధిపునాభికుండలిసముద్దీప్తామృతశ్రేణి ప
త్రినికాయోద్దతి తెచ్చి నిల్పెనన నెంతేఁ బొల్చెఁ బూర్వాద్రిపై
వనజాతారిరథాంగనామఖగగర్వధ్వంసియై యంతటన్.

154


మ.

పురుషోత్తంసుఁడు నేఁడు [30]తద్వ్రజవధూపుంజానురాగంబుతోఁ
బరఁగెన్ మోహము మించ మత్సుతఁ దలంపం డంచు దుగ్ధాబ్ధి ని
ర్భరభక్తిన్ జనుదెంచి తత్పదముపై వ్రాలెం గదా యన్ని వి
స్ఫురణం జంద్రిక కాయజాస్త్రసుమనఃపుంజంబుతోడం దగెన్.

155


క.

మధురాకృతితో మురళీ
మధురసుధానవధి గానమంజిమయుతుఁడౌ
నధునాతనవిధు నాతని
నధిగతపరమార్థలై యొయారము మెఱయన్.

156


వ.

సేవించి గోపిక లిట్లనిరి.

157

గోపికావిహారము

క.

ఈపంతము లీగానము
లీపలు కీకళలబెళుకు లీవింతల మే
లీపొలుపులు నీకే తగు
గోపాలక నిన్ను భక్తిఁ గొల్చెద మింకన్.

158


సీ.

వారవట్టినఁ గాకతీరు నేమైకాఁక
                       యధరామృతము జిహ్వ నానుకొనినఁ
దనువు లొక్కటిగాక తలకొనునే తృప్తి
                       కులుకు గుబ్బలి గ్రుచ్చుకొనినమాత్ర
గురి గళలంటస కరఁగకుండినఁ గాక
                       పారవశ్యంబు పైఁ బడినఁ గలదె
యనిమేషముగఁ జూపు లామతించినఁ గాక
                       బెళకించి చూచినఁ బ్రేమ యగునె


ఆ. వె.

తలఁచి తలఁచి పిలిచి పిలిచి నీపదములు
గొలిచి గొలిచి చాల నలసి యలసి
మ్రొక్కి మ్రొక్కి చొక్కి చొక్కి నీశుభమూర్తి
గాంచి కాంచి మనుట కలిమి బలిమి.

159

క.

నినుఁ జూడనిచూ పేటికి
నినుఁ బొగడనిజిహ్వ యేల నీదాస్యము సే
యనిబ్రతు కేటికి నిత్యము
నినుఁ గొల్వనిజన్మ యేల నీరజనయనా.

160


వ.

అని పలికి.

161


సీ.

సొగసుగా పింఛంబు దిగిచి కొప్పుననున్న
                       యలరుదండలు సిగ నలమియలమి
బెడఁగొప్ప రవికెపైఁ దొడిగించి కడుసొంపు
                       గులుకుసింగారముల్ కూర్చి కూర్చి
తళుకు బంగరుచీర [31]గట్టించి గళమున
                       నవరత్నహారముల్ [32]నవచి నవచి
పూనిక మురళిక పూరింతు మనుచు రం
                       ధ్రాంతరం బొకవింత యాని యాని


తే. గీ.

యాల వీవు మగల మేమ యనుచుఁ దమకు
మగతనంబు లొనర్చుచు మలసి మలసి
నందనందనుఁ డప్పు డానంద మంద
మందగమన లొనర్చి రమందరతులు.

162


సీ.

గుబ్బచన్నులఁ గ్రుమ్మి క్రుమ్మి వైచిననైనఁ
                       దెరలక వెనువెంటఁ దిరిగి తిరిగి
బెళుకు పయ్యెదయును బీతాంబరంబును
                       ముడిగొనఁ బ్రేమతో [33]ముడిచి ముడిచి
కన్నులు మూసిన గళగళ మందుచు
                       దడబా(మా)టుపేరున నొడివి నొడివి
కొప్పు నీడలనంటి కొనవ్రేళ్ళ మడమలు
                       ద్రొక్కుచు సొబగునఁ దూలితూలి


తే. గీ.

పాడుమనఁ బాడి వింతగా నాడుమనిన
నాడి యచ్చోట నిల్వుమ యనిన నిల్చి
యేఁగుమన నేఁగి యామ్రాకు లెక్కుమనిన
నెక్కి తగ హరి వలపించి రిందుముఖులు.

163

క.

మన సెఱిఁగి వయ సెఱిఁగి పొ
ల్చినచూపు లెఱింగి వలపుసిరు లెఱిఁగి వధూ
జనములతోడన్ బృందా
వనవంజులకుంజపుంజవసతుల మెలఁగెన్.

164


వ.

ఇట్లు మెలఁగుచు ననేకదినంబులు విహరించి కృష్ణుండు గోపికల రతులఁ
గరఁగించి యొక్కనాఁడు తిరోహితుండైన.

165


క.

కులిశాంకుశవజ్రధ్వజ
జలజధనుశ్చక్రకూర్మచామరరేఖల్
గల యడుగులచొ ప్పరయుచుఁ
గలకంఠులు వెదకి రపుడు కంజదళాక్షున్.

166


శా.

హా వేణుస్వరమాధురీసరణు లాహా మౌళిపింఛాంక మౌ
రా వేదాంతశిఖావతంసపదసౌరభ్యం బయారే దయా
శ్రీవాల్లభ్యమహోమహిమ లాశ్రీకృష్ణకల్పద్రుమం
బేవేళన్ ఫలియించునో మనలతో నేమేమి భాషించునో.

167


వ.

అని.

168


తే. గీ.

తరులతాకుంజఖగమృగతతుల నడిగి
గగనభూవారిపవన[34]తేజోంతరముల
నడిగి వేదశిఖాగమ్యమైనయట్టి
బ్రహ్మముఁ దలంచి కానక పద్మముఖులు.

169


వ.

మోహసంతాపంబులం బొరలుచునున్న యప్పుడు సౌలభ్యసౌశీల్యాద్య
నంతకల్యాణగుణపూర్ణుండైన కృష్ణుండు కరుణాయత్తచిత్తుండై
యాగోపికలకుఁ బ్రత్యక్షంబై నిలిచి.

170


ఆ. వె.

మ్రొక్కి కౌఁగిలించి ముద్దాడి పైఁబడి
తియ్యమోవిజాలుతేనె యిచ్చి
పొదలఁ బొదల ప్రేమఁ బొదలిన కాంతల
నందఱను రమించి యాదరించె.

171

వ.

అంత నార్చికగాధికసామికస్వరాంతరౌడువషాడవసంపూర్ణంబు
లగు సప్తస్వరంబుల శ్రుతిజాతిభేదంబు లెఱింగి మూర్ఛనావిశేషంబున
గ్రామత్రయరాగంబులు పరిసాధించి తత్తద్వేళానుసారంబున గ్రహ
సన్యాసంబులు పరిశీలించి మద్రకాదిగీతంబులు విదారిప్రమాణంబున
చతురశ్రత్రిశ్రమిశ్రతాళవిశేషంబులఁ బాతకళాకళాకలాపంబు లుగ్గ
డింపుడు మార్గదేశి వివిధంబుల పాదకటిపార్శ్వబాహుహస్తవక్షద్వక్ష(?)
గ్రీవాధరనానేకా(?)భ్రూశ్రవణనేత్రాంచల్లలాటిశిరోముఖితత్క
రణంబుల సాంగికసాత్వికమానసికాభినయంబుల మెఱయించి భూత
వ్యోమచారి(?) గతుల జొక్కింపుచు నంగనాద్వయమధ్యమాధవ
మాధవద్వయమధ్యగాంగనాశోభితమండలంబైన రాసమండలంబునం
గృష్ణగోపకన్యలు లాస్యంబు సలిపి రపుడు.

172


ఆ. వె.

ఒకతె చెక్కు నొక్కి యొక్కతె ముద్దాడి
యొకతెఁ గౌఁగిలించి యొకతె మెచ్చి
యొకతె కూఁత యిచ్చి యొక్కతె మన్నించి
రాసకేలి గోపరత్న మలరె.

173


తే. గీ.

కోటిసూర్యప్రకాశుఁడై కోటిమదన
కోమలోజ్వలమూర్తియై కోటిచంద్ర
శుభకళామోహనుండునై సొంపు మెఱయు
నచ్యుతుని జూచి గోపకన్యాచయంబు.

174


వ.

బహువిధక్రీడలఁ గృష్ణునితో నలరుచు నుండునంత.

175

నందుఁ డేకాదశి నుపవసించుట

మ.

పతితక్రూరనిషాదకీటకమహాపాపఘ్న మార్యస్తుతం
బతిలోకం బనవద్య మప్రతిమ మాద్యం బైహికాముష్మిక
స్థితినిర్వాహక మవ్రతప్రళయవిచ్ఛేదక్రియామూల మా
క్షితి నేకాదశి యంచుఁ దా నుపవసించెన్ నందుఁ డానందియై.

176


వ.

అంత ద్వాదశినిమిత్తస్నానంబు సమయంబు నొనర్ప వరుణదూతలు
నందునిం గొనిపోవ నిజప్రభావంబున హరి మరలం దెచ్చె నపుడు.

177

క.

లోకోత్తరుఁ డాహరి నిజ
లోకాభవలోకధాతృలోకబిడౌజో
లోకాదులైన యుత్తమ
లోకంబులు చూపె గోపలోకంబునకున్.

178


వ.

అంత.

179


సీ.

నందాదు లొకనాఁడు నవ్యోత్సవంబున
                       నంబికావనమున కరిగి యాస
రస్వతినది గ్రుంకి రహితో నుమామహే
                       శ్వరులఁ బూజించి భూసురులకెల్ల
గోహిరణ్యాంబరకోటు లర్పించి య
                       న్నము పెట్టి తా ముదకములు ద్రావి
తద్వ్రతంబున నుండ దైవయోగంబున
                       నందుని నజగర మందునుండి


తే. గీ.

మ్రింగ హరి దాని ద్రుంపఁ బొసంగ నదియుఁ
దాల్చె విద్యాధరత్వంబు దశదిశాంత
రాళ[35]దేదీప్యమానవిశాలమౌళి
మాలికాలంకృతశ్రీల మహిమ మెఱసి.

180


వ.

ఇట్లు మెఱసి యేను సుదర్శనుం డనువిద్యాధరుండ. మదీయప్రకా
రంబు విన్నవించెదనని యిట్లనియె.

181


తే. గీ.

అంగిరసులు కురూపులై యరుగుదేరఁ
గాంచి యే నవ్వఁ దత్పాతకమున నజగ
రంబవై యుండుమనిరి శాపంబు దొలఁగు
మీపదాబ్జంబు సోఁకినమీద ననిరి.

182


వ.

మీకతంబున శాపవిముక్తుండ నైతి నని విద్యాధరుండు యథేచ్ఛంబుగాఁ
జనియె.

183


సీ.

రామకృష్ణులు వనరాజిలో నొకరేయి
                       వెన్నెల గాయ నవీనమధుర
గానామృతము సోనకైవడి వెలయ గో
                       పాంగనల్ పరవశ లైన వారి

శంఖచూడుం డనఁజాలు యక్షేశ్వర
                       భటుఁడు దుర్ఘటమదోద్భటుఁడు వచ్చి
యోగబలంబున నుత్తరంబునకుఁ దో
                       డ్కొనిపోవ హా కృష్ణ! గోపగుణగ


తే. గీ.

భీర యను తత్సతుల విడిపించె శౌరి
యెచట చొచ్చిన విడువక యీడ్చి శౌరి
పూని దృఢముష్టిఁ జెండాడి వానిమౌళి
నున్నరత్నంబులెల్ల నింపూనికొనియె.

184


వ.

ఇట్లు గైకొని యున్నంత.

185


క.

వాహంబై ఖరధురవా
ర్వాహంబై కేశిదైత్యవర్యుఁడు రాఁ ద
ద్దేహంబు విరిచె నిస్సం
దేహంబున మింట సకలదివ్యులు పొగడన్.

186


వ.

అంత.

187


క.

వృషభాసురబల మణఁచెన్
వృషభాసురబలము నిలిపె వినివేశితగో
వృషభుఁడు సంరక్షితగో
వృషభుఁడు హరి శౌర్యధైర్యవీర్యస్పూర్తిన్.

188


సీ.

అవికలహృదయులై యవి కళలం గొంద
                       ఱవిపాలకత్వంబు నంది కొంద
రవిచారులై వనాభ్యంతరసీమల
                       నాటలాడుచునున్నయపుడు చేరి
మయతనూజుం డతిమాయావి యని మూర్తు
                       లైన గోపాలుర నవహరించి
గుహలోన నిది హత్తుకొన నొకశిల వైచి
                       మరలి వచ్చిన జూచి మాధవుండు


తే. గీ.

హస్తములఁ బట్టి బిర బిరఁ వార్చి త్రిప్పి
కొండపై వేయ వ్రయ్యలై కూలె వాఁడు
కురిసె వింతగ మందారకుసుమవృష్టి
తోయనిధు లుబ్బె దివ్యదుందుభులు మ్రోసె.

189

వ.

అప్పుడు గోపాలకుల విడిపించి తెచ్చి యచ్చక్రి సుఖంబున్నయెడ.

190


శా.

సారజ్ఞానకళాగుణైకఖని యౌశ్వాఫల్గుఁ డక్రూరుఁ డా
త్మారాముం బొరిఁజేరి మ్రొక్కినది బ్రహ్మానందమున్ దెల్పు దృ
ఙ్నీరేజంబుల బాష్పముల్ దొరుఁగఁగా నీరంధ్రరోమాంచుఁడై
సారం బేర్కొని గద్గదస్వరము మించన్ సన్నుతుల్ సేయుచున్.

191


క.

వనజాతోద్భవముఖ్యులు
గననేరని నీదుపాదకంజాతము లేఁ
గని ధన్యుఁడ నైతిన్ నా
జననంబు ఫలించెఁ దండ్రి! శౌరి! మురారీ!

192


ఆ. వె.

స్వామి మీకటాక్షకామధేనువు గల్గ
నేమి సంభవింప దీశ! దేవ
తాంతరముల సాధనాంతరములును మం
త్రాంతరములు నేల యరసిచూడ.

193


వ.

అని నుతియించి రామకృష్ణుల మధురకుం దోడ్కొని యేఁగుచు యమునా
తీరంబునం దరుచ్ఛాయ నమ్మహాత్ముని నిలిపి యక్రూరుండు తద్యమునా
జలంబులం గ్రుంకినం దన్మధ్యంబున.

194

అక్రూరుఁడు యమునాజలమున రామకృష్ణులఁ గాంచుట

తే. గీ.

స్ఫటికనీరదవర్ణుల శ్యామపీత
రుచిరపరిధానుల విచిత్రరూపతాళ
గరుడకేతనుల శుభప్రకాశనిధుల
రామకృష్ణులఁ గాంచె సారజ్ఞుఁ డతఁడు.

195

వ.

కాంచి యరుణాతి శోభనాతి కోమలాతి ప్రసన్నంబులై యగణ్యలావణ్య
ప్రవాహసముత్ఫుల్లహల్లకకింజల్క కాంతులు మొల్లంబై గనికట్టె
నన రంజిల్లుపాదంబులును, బాదంబులు భజియించు సురేంద్రముఖ్యులకు
నిజాంశచ్ఛత్రచామరధ్వజకులిశంబులు కృపచేసితిమని తెలిపినట్లు
రాణించు తచ్చుభరేఖలును, సుధాపయోధి విహరించుతఱిఁ దదీయడిండీర
ఖండంబు లంటెననం జంద్రఖండనఖంబులై కలితయోగిమానససుఖం
బులగు నఖంబులును, నఖంబుల చెంగటఁ బాదంబున వెడలి గంగ
ప్రవహించునెడం గదలక నిలిచి కచ్ఛపపోతంబులన రాణించు మీఁ
గాళ్ళును, మీఁగాళ్ళపొంత వింతలై కాంతులదొంతరలు మెఱయ ఘనీభవ
చ్ఛృంగారరసఘుటిక లగు గుల్భంబులును, గుల్భంబులకేవలం
గందర్పశరశరదిందీవరపుంఖంబుల యొప్పు గుప్పళించు మడమ
లును, మడమలపై న్ఘూ(?)ధ్వనిప్రశ్రుతమంజుమంజీరనీలప్రభా
శలాకలో యన విజితమదనకాహళశ్రీసంఘములై తనరు జంఘలును,
జంఘలచేరిక నమందసౌందర్యనిధానంబు చూప వ్రాలిన ఖంజన
ద్వయం బన జనంబులకు నానందకరంబులైన జానువులును, జాను
పులమీదం బూచిన యతసీలతలు పెనఁగొనిన యనంటు లన నమరు
నూరుద్వయంబును, నూరుద్వయోపరిభాగంబున లావణ్యశ్రీకి మృగమద
పంకంబున వయఃకుంభకారుం డొనరించిన వరకుచకుంభనిర్మాణ
చక్రం బన ఘనంబగు జఘనంబును, జఘనాగ్రంబున వింతసిలి నివ్వ
టిలు పొన్నపువ్వుకళ నవ్వుచు వల్లవలతాంగీభృంగిమనోహరంబగు
నాభికుహరంబును, నాభికుహరంబు నంటి హరిసూక్ష్మరూపసంపత్క
ళాసామ్యలగ్నంబగు నవలగ్నంబును, నవలగ్నప్రాంతంబునఁ దను
కాంతితరంగిణీతరంగంబులతెరంగున రంగైన వళిత్రితయంబును,
వళిత్రితయంబునకు నెదుట భూనిశాసీమావిభాగద్యోతకంబై కవిత
శృంగారరసకుల్యోల్లేఖ యగు రోమరేఖయును, రోమరేఖం గదిసి
యిందిరావిహారరత్నవితర్దికయై చిత్రభూషణకాంతి లక్షితం బగు
వక్షంబును, వక్షంబునకు నిరువంకలఁ గళిందనందనాహ్రదమండలంబు
నిజపదంబు సోఁకిన పుణ్యవిశేషంబున నైక్యంబు నొంద నిలిచి
నట్లు మెఱయు శ్రీవత్సంబును, గాఁగల యల్లుండని కౌఁగలించిన రవి
బింబంబు తెఱంగున రాణించు చొక్కంబగు కౌస్తుభమాణిక్యంబును,
లక్ష్మీధామంబునకుం జుట్టుఁ గట్టిన చిత్రరత్నతోరణంబు ననుకరించు
వైజయంతియును, శ్రీవత్సకౌస్తుభవైజయంతీసన్నిధానంబున

సంఫుల్లకుసుమపుంజరంజితాతసీశాఖ లనందగు బాహువులును, బాహు
పరివేషం(శం)బు ననంజనాద్రిశిఖరంబులం బోలు నంసంబులును,
నంసంబులం డాసి విరజా[36]ధునీఘనీభవత్కళాదురంధర యగు కంధర
యును, గంధరోర్ధ్వసీమను హరిదీనకల్పకం బగుటకుం దగఁ గుసుమ
పల్లవశ్రీ లుల్లసిల్లుచందంబున మందస్మితాన్వితం బైన యధరంబును,
నధరంబు పొరుపున భూనీళాశృంగారావలోకనముకురంబు లనం
బ్రకాశించు చెక్కులును, జెక్కుల నుభయపార్శ్వంబుల సౌలభ్య
సౌశీల్యవాత్సల్యాదిగుణంబులం గలయది శ్రీశ్రీ యని చూపినతెఱం
గునం బ్రశంసించు శ్రీకారద్వయంబున మకరకుండలమణిమండల
ప్రభాపూర్ణంబులగు కర్ణంబులును, గర్ణంబులదండ నఖండకరుణాకల్లో
లినీపుండరీకంబు లనం జిత్రంబులైన విశాలనేత్రంబులును, నేత్రం
బులనడుమ యౌవ్వనకర్షకుండు శృంగారరససస్యంబు మొలిపించు
టకు నేరువాక వాఱం గోరువెట్టెనో యనందంగి గంధఫలకళాచిక
యగు నాసికయును, నాసిక యిరుచక్కి హరిహరులేనే యని తాల్చిన
శార్ఙ్గపినాకంబుల యట్లు రాణించు భ్రూయుగంబును, భ్రూయుగంబు
నెగువ ననుపమకందర్పఫలకంబునుంబోలె లలితకస్తూరికాతిలకం
బగు నలికంబును, నలికప్రభాన్వితంభై పంకజనాభాంకస్థితపంకజ
నివాసినీసందర్శనాగతాకలంకపరిపూర్ణశశాంకుండో యన సకల
కళాసదనంబగు వదనంబునుం గలిగి చిత్రరత్నకిరీటంబుఁ దాల్చి
హారకేయూరకంకణముద్రికాకటిసూత్రకనకాంబరాలంకృతుండై సతీ
జీవరత్నమయసాలభంజికయో యన వివిధమణిభూషణభూషితయై
కరుణాకటాక్షసంరక్షితసకలలోక యగు శ్రీకాంత మెఱుంగై కను
పట్టి ఘనంబగు విగ్రహంబునం జూపట్టు నప్పుడు.

196


తే. గీ.

ధరణి నీళయుఁ గంకణధ్వనులు వెలయఁ
గరములను వైచు చామరాగ్రములు సోఁకి
యిందు ధవళాతపత్రంబునందుఁ జిందు
నమృతబిందూత్కరంబు లంగమునఁ గ్రమ్మ.

197

క.

సనకసనందనముఖ్యుల్
వినుతింపగ వివిధరత్నవిరచితసింహా
సనమునను శేషశేషా
శననిత్యులు గొల్వఁగాఁ బ్రసన్నత వెలసెన్.

198


వ.

ఉన్న హరికిం బ్రణామం బాచరించి.

199


తే. గీ.

మత్స్య కచ్చప సూకర మనుజసింహ
వామన భృగుకులజ రాఘవ బలభద్ర
బుద్ధ కల్కి హరి ముకుంద భువననాథ
దీనరక్షక నీవు సూ దిక్కు నాకు.

200


వ.

అని యక్రూరుఁ డచ్యుతు నుతియించి యమున వెల్వడి వచ్చి రథంబున
నున్న రామకృష్ణుల నవలోకించి కీర్తించి సూర్యనందనయందుఁ దాఁ
గనినయట్టి యద్భుతంబు విన్నవించి మధురాపురప్రాంతంబున రామ
కృష్ణుల నందాదులతో నునిచి నిజగృహంబునకుం జనియె. రామకృష్ణు
లును మధురం బ్రవేశించి తత్పురవీథిం జనునెడ.

201


చ.

కనకలతాంగి యోర్తు హరిఁ గన్గొని కెంపులతళ్కు జాలిచే
గొనుచును నేఁగెఁ బూను నెడఁగూడక వేడుక భర్మహర్మ్యమో
హనశిఖరాగ్రవీథులకు [37]నార్తిని మూపున వాట్లఁబడ్డ వా
రిని సమయంబునన్ విడుతురే యమరీసమరీతిమానినుల్.[38]

202


మ.

కలకంఠీమణి యోర్తు కృష్ణుఁ డటు రాఁగాఁ జూచి గోవర్ధనా
చల మీ వెత్తుట యెంత యెత్తు మివె నాచన్గొండ లిట్లైన నీ
బలసంపత్తి యెఱుంగవచ్చునని యొప్పన్ బిల్చె నాతళ్కుగు
బ్బలు గాన్పింపఁగ సౌధవీథి నిలిచెన్ బంగారుబొమ్మో యనన్.

203


వ.

ఇట్లు వివిధోజ్జ్వలనిజచేష్టల నవలాలు చూడ నవలావణ్యధాళధళ్యం
బుతో మథురాపురమధ్యంబున కేఁగుచు.

204

ఆ. వె.

కడుమదమున వీగఁ బడివాలు మడివాలు
వసనభార భారి వరలు దాను
గంసమందిరమున కంసరాజితవేణి
హంసగములతోడ నరుగునపుడు.

205


వ.

తమకు ధౌతవస్త్రంబు లడిగిన నీక దుర్భాషలాడిన యాఖలున్
భంజించి తద్వీథిమధ్యంబున నేఁగుచు.

206


క.

పాయక మాలాకారులఁ
బాయక మన్నించి శౌరి బలుఁడుం దానున్
బాయక వర్గముతో నిర
పాయకళామహిమ మెఱసి పాటిలుచుండెన్.

207


వ.

అంత.

208


క.

అనులేపనములు దెచ్చిన
ఘనపాణిని కుబ్జఁ గుజ్జు గాంచి పదమునన్
దనువెల్ల మట్టి యాయం
గన నాకక కుబ్జఁ బోలఁగా నొనరించెన్.

209


ఆ. వె.

వాసి యెఱిఁగి యెపుడు వాసుదేవుఁడు దాని
బాసి విరహ మర్మదాసిఁ జేసె
[39]శిలబునర్చుతోంఛశిలఁ జేయు నాఘనుఁ
డేమి సేయ నేరఁ డీధరిత్రి.

210


ఉ.

ఆవల నుగ్రచాపము మహాబలసంపదఁ ద్రుంచి దానికిన్
గావలి యున్న కాలభటకల్పదురల్పవికల్పజల్పలో
కావళి నుగ్గుగాను రుచిహావళి చేసె దురంతదుర్మదుల్
ధావన మాచరించి వసుధావనవీథులవెంట నేఁగగన్.

211

శ్రీకృష్ణుఁడు కంసుని సంహరించుట

వ.

అంత.

212


తే. గీ.

అపుడు సాయాహ్నశౌరి భావ్యతిశయమున
దివసమల్లునితోఁ బోరి ధృతి జయించి
తదురుగైరికరక్తవస్త్రంబుఁ జించి
కేరి యెగవైచె నన సంజ కెంపు దనరె.

213

తే. గీ.

పద్మినీప్రియుఁ డయ్యుఁ జాపలముఁ బూని
యినుఁడు నిస్తేజుఁడై క్రుంకె నేమి చెప్ప
నపరకాంతాశఁ దిరిగిన యట్టివాఁడు
ధరణి వెలయునె యుద్దామధాముఁడైన.

214


తే. గీ.

ఘోరచాణూరమల్లోగ్రఘోషశక్తి
నంబరంబెల్ల నట్లౌనె యనుచు ధాత
తఱచు వెండిచీలలు తాము తాచినట్లు
తారకాజాల ముదయించె దట్టమగుచు.

215


సీ.

దనుజారికలహభోజనమహాధృతిసమా
                       యాతప్రహర్షి దేవర్షి యనఁగఁ
జాణూరమురళికానంచలద్భేతాళ
                       భర్త చిమ్మిన రౌప్యపాత్ర మనఁగఁ
గంసశిరఃక్షిప్తకాలదండంబున
                       బెళకి నిక్కిన వజ్రమలయ మనఁగ
జన్మదేశస్పృహాసంధావదుదయాద్రి
                       విశ్రాంతి హరివాజివిభుఁ డనంగఁ


తే. గీ.

గామినీకాముకానీకకలితహృదయ
కల్పితానేకసంకల్పకల్పశాఖి
నిర్మలస్ఫూర్తి గైకొని నిలిచె ననఁగ
సిరి దనరె నప్పు డుదయించె శీతకరుఁడు.

216


వ.

అంత ప్రభాతం బగుటయు.

217


క.

కెంజిగురుజొంపములతో
మంజులరుచి దొరయు గుజ్జుమావియపోలెన్
రంజిల్లె నుష్మకరుఁడు స
మంజసతేజంబు చేయ మాధవుఁ డలరెన్.

218


వ.

అప్పుడు కంసుం డొడ్డోలగంబై యుండ రామకృష్ణులు యుద్ధరంగాభి
ముఖులై చనునెడ.

219

సీ.

కువలయాపీడమౌ కువలయాపీడంబు
                       మావంతుఁ డత్యంతమత్సరమున
మావంతుఁ డప్పుడు మట్టింపఁ బూనిన
                       దంతంబు పెఱికి తద్దంత ముగ్ర
శక్తి గావించి యాశౌరి చాణూరము
                       ష్టికుల ముష్టిహతి సంస్థితులఁ జేసి
దరము పెంపున నిజోదరము భంగము నొందఁ
                       గంసుఁ డుగ్రారిచిక్రింసుఁ డగుచుఁ
దమకమున నుండఁ బడఁద్రోచి తగ జయించి
తల్లిదండ్రులఁ బూజించి ధన్యుఁ డైన
యుగ్రసేనునిఁ బాదాగ్రయుగ్రసేనుఁ
జేసి పట్టంబు గట్టె నూర్జితము గాగ.

220


వ.

అంత నాకృష్ణుండు సాందీపునియొద్ద సకలవిద్యాప్రవీణుండై గురు
దక్షిణ యొసంగెదనని విన్నవించినఁ దద్దేశికుండు ప్రభాసతీర్థంబున
మునింగిపోయిన పుత్రులం దిరుగం దెచ్చిన నదియ నాకు దక్షిణ యని
ప్రార్థించిన.

221


క.

పంచజనాకృతి గల హరి
పంచజనాఖ్యదైత్యు భంజించి విమ
ర్శించి కయికొనియెఁ గరమునఁ
జంచద్రుచి మించు పాంచజన్యమునంతన్.

222


వ.

బాణాసనశరఖడ్గాదిసాధనవిచిత్రంబైన యరదం బెక్కి కమలనాభుం
డతిరయంబున సంయమనీపురంబు చేరి బ్రహ్మాండంబు పగులునట్లుగాఁ
బాంచజన్యంబు పూరించిన.

223


క.

దండధరుఁ డంతఁ గని యు
ద్దండధరోద్ధరణ బాహుదండునకు ముహు
ర్ధండానతి సేయుచు బ్ర
హ్మాండానతి దృశ్యమహిమ యపుడు నుతించెన్.

224


వ.

నుతియించి వైవస్వతుం డొసంగినం గురుపుత్రుల నాహరి
గురువున కిచ్చి.

225

క.

అతిమానుష మతిదివ్యం
బతిలోకము నతివిచిత్ర మతిగూఢతరం
బతిసమ మతివైభవగుణ
మతని మహిమ మరయ నజహరాదులవశమే.

226

శ్రీకృష్ణుఁ డుద్ధవుని గోపికలకడ కంపుట

వ.

అని యందఱు నెన్నందగు నమ్మహానుభావుఁ డొకనాఁ డుద్ధవునిం
బిలిచి యేకాంతంబున నిట్లనియె.

227


క.

తనువుం బ్రాణము దైవము
దనువున్ హృదయంబు పరమతత్త్వము నేనే
యని నమ్మి గోపకామిను
లనఘా! యేమైరొ వారి నరయఁగ వలయున్.

228


క.

ఏనమ్మిక గలవారల
మానక రక్షింతుఁ జాల మన్నింతు ననున్
మానవతులఁ జూడని యా
మానవతుల కేమి కొఱఁత మహితార్థంబుల్.

229


వ.

అని యనిచిన నతండు నందవ్రజంబున కరిగి నందునియింట నద్దినంబెల్ల
నధివసించి; మఱునాఁడు గోపికలం బిలిపించి కృష్ణసందేశంబు విని
పించిన వారలలోఁ బ్రౌఢయగు గోపకన్యక యొక్కర్తు ప్రాంతభృంగం
బుతోఁ గృష్ణానురాగద్యోతకంబగు నర్థాంతరంబు వొడమ నిట్లనియె.

230


సీ.

బృందావనాంతరామందవంజులమంజు
                       కుంజఖేలామనోరంజనంబు
యమునాతరంగిణీహ్రదఫుల్లహల్లక
                       మధ్యసంక్రీడాసమగ్రలీల
వ్రజభామినీమణిప్రకరధమ్మిల్లాగ్ర
                       కుందసేవంతికాబృందకలన
రాధావిలాసినీరమణీయమాలతీ
                       చారుశయ్యాతలాస్పందనంబు

తే. గీ.

మఱచితే నీవు మన్నించి మమత మించి
పాయనట్లనె బ్రమయించి పంతగించి
యుల్ల మలర రమించి లోనూరడించి
కేవలారామపరివర్తి కృష్ణమూర్తి.

231


వ.

అని యివ్విధంబునం బలికిన గోపికల నూరడించి యుద్ధవుండు మరలి
చనుదెంచె నంత.

232


క.

సింధువు పొంగెనన జరా
సంధుఁడు పరిభూతసత్యసం[40]ధుఁడు వచ్చెన్
బంధురసింధురసైంధవ
బాంధవహితరథికవీరబలములతోడన్.

233


వ.

వచ్చి మథురఁ జుట్టుకొని యెదుర్కొన్న శౌరిం జూచి యిట్లనియె.

234

శ్రీకృష్ణుఁడు జరాసంధకాలయవనుల జయించుట

చ.

దరము వహించినట్టి నినుఁ దప్పక కాచితిఁ బొమ్ము పొమ్ము భీ
కరతరమైన నాదువిశిఖంబున కోర్వఁగ నీకు శక్యమే
నిరతము నీమనంబు నవనీతమయంబు రణంబు కొంచెమే
సురభులఁ గాయుటో మఱచి చొక్కిన కంసుని నేలఁ ద్రోయుటో.

235


సీ.

కరుణించి విడిచితిఁ గడకు నేఁగుము గూఢ
                       మైనభావంబు సొంపౌనె నాకు
మందరాగాధృతి నందంబు నొందెద
                       వొంటిగాఁడవు నట లూనఁదగునె
అడుగులోననె మించి తడఁబడఁ జేయుదు
                       పరశూరుఁ డన మించఁ బాటి యగునె
ఘనమహోదధివయోగర్వవర్ధనుఁడవు
                       నీ వహార్యస్ఫూర్తి నెరపినావు


తే. గీ.

సతులవ్రతములు జెఱిచితి జగము లెఱుఁగ
మ్లేచ్ఛకోటి నెదిర్చినమేర నిచట
పూని నిల్చెదు విక్రమస్పూర్తి మెఱసి
తవిలి మముఁ బోరఁ గెలువ నీతరమె కృష్ణ.

236

వ.

అనిన గృష్ణుం డిట్లనియె.

237


ఆ. వె.

మాగధుఁడవు గాన మన్నించి నీ వాడు
పలుకులెల్ల నాత్మఁ దలఁప నింకఁ
బ్రాణభయము లేదు బ్రతుకుము పోపొమ్ము
నిజపరాక్రమంబు నెరవ నేల.

238


వ.

అని పలుక నంత యాదవమాగధవీరులు రోషంబున నన్యోన్యంబును
రణం బొనర్చునెడ.

239


సీ.

కరవాలశూలతోమరగదాపట్టిస
                       ప్రాసముద్గరచాపపరశుముఖ్య
వివిధాయుధముల నవ్వీరు లొనర్చిరి
                       రథికుండు రథికుండు ప్రాసధరుఁడు
ప్రాసధరుఁడు హాస్తిపకుఁడు హాస్తిపకుఁడు
                       సాదియు సాదియు శక్తిహేతి
శక్తిహేతియుఁ బరశ్వధహస్తుఁడును బర
                       శ్వధహస్తుఁడును బోరి శక్తి చూప


ఆ. వె.

మస్తబాహుపార్శ్వహస్తపాదాగ్రోరు
చర్మమాంసరుధిరశల్యకేశ
కవచపటశిరస్త్రకటకకిరీటాదు
లాహవోర్విఁ గప్పె నక్షణంబ.

240


వ.

అంత నయ్యుద్ధరంగస్థలంబు రంగస్థలంబునుం బోలెఁ జటులాశికలాస్య
వర్షితపతాకాదివిన్యాసంబును, దండకారణ్యంబునుంబోలె సుతీక్ష్ణ
శరభంగప్రాప్తికలితంబును, మేరుగిరిశృంగంబునుంబోలె గైరిక
రక్తనిర్ఝరతరంగంబును, సూర్యాస్తమయసమయంబునుంబోలె విశ
కలితాతపత్రాణంబును నై జగదఘ్నరక్తవాహినులుం గలిగి శరపుంజం
బులు నాట నుత్తానశాయులై భావిభీష్మాకారంబులు దాల్చు వీరవారం
బును, బ్రగ్గిన ద్విరదంబులును మ్రొగ్గిన యరదంబులును విరిగిన భేరు
లును గూలిన వీరులును నర్తించు ఢాకినులును రణంబు కీర్తించు శాకి
నులుం గలిగి ఘోరం బయ్యె. మఱియు నివ్విధంబునం దగు రణంబుల
మాగధుండు పదియాఱుమాఱులు పోరి వీఁగి మఱియు రణంబున
కెదిరిన.

241

క.

హలి వానిం దురమున నా
హలాహళిఁ బట్టి వధింపఁబూన నప్పుడు కృష్ణుం
డలఘుతరప్రియభాషల
వలదని వారింపఁ గార్యవశమున విడిచెన్.

242


వ.

జరాసంధుండు యుద్ధసన్నద్ధుండై యున్నయెడ నారదుండు తెలిపిన.

243


ఆ. వె.

కాలయవనుఁ డమితకల్పితరిపునాయ
కాలయవనుఁ డంతఁ గంసవైరి
పురముఁ జుట్టుకొనిన హరి నిరాయుధవృత్తి
నెదుట నిల్చి కడకు నేఁగునంత.

244


సీ.

తేజితాశ్వము నెక్కి ధీరుఁడై యాకాల
                       యవనుండు చనుదేర నంటకుండ
వాయువేగమునఁ బోవఁగ వాడు నేతేర
                       నంత మనోవేగ మడర వెడలు
వెడలు డగ్గరు వానికడ నదృశ్యత నొందు
                       నయ్యదృశ్యత మాని యార్చి పేర్చు
వెఱచునో యన నిల్చు విఱిగినయ ట్లేఁగు
                       వలసిన యట్లుండు నడలి దూరు


తే. గీ.

నపుడె బయలెక్కు నగుఁ గేరు నరసి చూచుఁ
గఠినపాషాణకుశకంటకప్రరోహ
కాపథంబునఁ గోమలక చులవిజిత
చరణముల నడచుట కోర్చి చక్రధరుఁడు.

245


తే. గీ

హరి యొకనగంబుగుహ దూర నంత వాఁడు
గడిమిఁ జనుదెంచి కృష్ణునిఁ గానలేక
యందు నిద్రితుఁ డగు ముచికుందుఁ దాఁకి
భస్మమైపోయె ఖేచరప్రతతి యలర.

246


వ.

అంత.

247

సీ.

ఆజానుబాహు నీలాంబుదనిభదేహుఁ
                       గౌస్తుభాభరణు లోకైకశరణుఁ
బీతకౌశేయుఁ గంపితమహాదైతేయు
                       ధవళాబ్జనేత్రు నుత్తమచరిత్రు
మానితాఖండలు మణిమయకుండలు
                       సులలాటు వైఢూర్యశుభకిరీటు
భక్తజనాహ్లాదుఁ బద్మజనుతపాదు
                       వేదాంతనుతలోలు విబుధశీలు


తే. గీ.

విశదమందస్మితముఖారవిందవిందు
సమధిగమ్యసమంచితాచారచారు
వైజయంతీశుభశ్రీనివాసు వాసు
దేవుఁ గృష్ణుని ముదము సంధిల్లఁ గాంచి.

248


ఆ. వె.

నాతపఃఫలంబు నాభాగ్యదేవత
నామనోరథంబు నాబలంబు
నామహోదయంబు నాపుణ్యసంపద
యిటు లభించె ననుచు నిచ్చనలరి.

249


వ.

ఆముచికుందుం డిట్లనియె. దేవా! నే నిక్ష్వాకుకులసంభవుండ, మాంధాత
పుత్రుండ, ముచికుందుండ. దేవకార్యం బొనర్చి యలసి యిట నిద్రించు
చున్నవాఁడ. శంకరపితామహచక్రహస్తేంద్రానలాగ్నిచంద్రసూర్యులలో
నేఘనుండ వని యడిగిన. నేఁ గృష్ణుండ. నిన్నుం గృపాకటాక్షవీక్ష
ణంబున నీక్షింపవచ్చిన చక్రధరుండ. ఇంక నొండుజన్మంబున
బ్రాహ్మణుండవై భజించి ననుం జెందెదవని పల్కి భక్తానుగ్రహకారియై
యతని వీడ్కొనియె.నంత జరాసంధుండు పునరాయోధనసన్నద్ధుండై
యరుగుదేర విశ్వకర్మచే సముద్రమధ్యంబున ద్వారకాపురంబుఁ
గల్పించుకొని మథురాజనసహితుండై యాహరి యం దధివసించె
నప్పుడు.

250

శ్రీకృష్ణుఁడు రుక్మిణీసత్యభామలఁ బరిణయమాడుట

ఆ. వె.

ఘనుఁడు రైవతుండు కంజాతసంభవా
నుజ్ఞచేత నిజతనూజ సకల
లోకధన్య రేవతీకన్య నర్పించె
హలధరుండు బెండ్లియాడెఁ బ్రేమ.

251

క.

కుండినపతి యధిగతలో
కుం డినతేజుండు భీష్మకుం డనఘుం డా
ఖండలవైభవుఁ డవనీ
ఖండలసద్గుణకలాపకలితుఁడు వెలయన్.

252


తే. గీ.

ఇలఁ దగిరి రుక్మముఖ్యులు హేమశైల
ధీరు లనఘాత్ము లేవు రాశూరుసుతులు
వారికవరజ రుక్మిణి వసుమతీశ
కన్య గా దెంచ నంబుధికన్య గాని.

253


తే. గీ.

భోజకన్యకు మానసాంభోజసీమఁ
గలితమై కృష్ణపక్షంబు గలుగు టరుదె
భవ్యతరమైన ధమ్మిల్లబంధసీమఁ
గృష్ణపక్షంబు గరిమ మిక్కిలియుఁ దనర.

254


తే. గీ.

అధిపు జన్మాష్టమీదిన మాలతాంగి
ఫాలభాగాంతరంబునఁ బరిభవింప
నర్ధచంద్రుండు గాన్పించె నతిశయమునఁ
బర్వములలోన నుత్తమపర్వ మగుచు.

255


తే. గీ.

అజుఁడు శృంగారరసధార లతివమోముఁ
దమ్మి యలరార నరుదుగాఁ దాల్చె ననఁగ
నఖిలలోకములకుఁ జోద్య మావహిల్ల
నలికులాసితవేణి బొమ్మలు దలిర్చె.

256


క.

నిరతహరికథామృతరస
పరిపూర్ణత కూపలీల భాసిలు నా రుం
దర దనకర్ణంబులు సిరిఁ
బరఁగు త్రిదోషఘ్నరసశుభస్ఫూర్తి దగన్.

257


ఉ.

చేరలమీఁద నెక్కుడగు చెల్వు నటింపఁ జకోరలక్ష్మితోఁ
దోరపుఁజాయ కల్మిఁ దులఁదూఁగి మెఱుంగులు గాదె బోయె మిం
చౌ రహిఁ బూని కాయజశితాస్త్రము లేకరసాన దేరె నా
నారమణీలలామకు నొయారము గుల్కుచుఁ బొల్చు నేత్రముల్.

258

తే. గీ.

పసిఁడిసంపెంగవిరిచాయ భామమేను
నలువ గావించెఁ గాకున్నఁ బొలఁతి నాస
జగికల తదీయకళికచేఁ దగు నొనర్చె
మనుజులకు మచ్చు చూపఁబూనునె యతండు.

259


ఆ. వె.

అంబుజంబు పూర్ణిమాంభోజవైరి యొ
క్కటియ కమ్మటంచు గారవించి
యతివమోముచెంత నతనుండు తనవాలు
ముట్ట నిలిపె ననఁగ మోము దనరె.

260


క.

ఘనవదనకళాప్తికి ముద
మునఁ జంద్రుఁడు రెండురూపములు గైకొని ని
ల్చెను నేఁడు రెండువంకలు
ననఁగా రాజాస్యచెక్కుటద్దము లమరెన్.

261


తే. గీ.

రాజు తమ్ముల హెచ్చించి రహి యొసంగఁ
దలఁపఁడను వార్త నిజముగా నెలఁతమోము
రాజలక్ష్మి వహించి నిరంతరంబు
తమ్ములను గొంచెపడఁజేసి తానె మించె.

262


తే. గీ.

అక్షియుగళి విశాలమాయ యరగౌనె
మధురభాషాచమత్కృతి మణిపురంబు
తను లతిక గాఁగ సతికిఁ జిత్రంబె కంఠ
భాగమునఁ జూడ శంఖసంపత్ప్రశస్తి.

263


క.

లలనామణిభుజములు బిస
ములె యగుఁ గాకున్న సిరులు పూనిన హస్తో
జ్జ్వలజలజములు నురోజం
బులపేరిటి జక్కవలును బొలుచునె చెంతన్.

264


తే. గీ.

తగుబిలము పొన్నపువ్వును దెగడునాభి
చేరికఁ దనర్చు నింతినూగారుతీరు
నీలఫణి తేఁటిచాలును బోలి యమర
మధ్యమాయాసమాగతమహిమ మెఱయ.

265

తే. గీ.

ఏతదీయాంశమే సుమీ యే నటంచు
నమ్మహీకాంత నిజమండలాకృతిం ద
దవయవంబులలోన నొండయ్యె ననఁగ
బెళుకుఁజాయల నాయింతిపిఱుఁదు దనరె.

266


క.

చక చక నేమించిన యా
ముకురానన యూరుయుగము మోహనకాంతుల్
ప్రకటించి మెఱయఁ “గదళీ
సకదాచన" యనిరి బుధజనంబులు బళిరే.

267


తే. గీ.

ధన్యతారుణ్యవీరరత్నంబు బాల్య
విగ్రహంబునకై వచ్చి విజయమంది
యపుడు కతనిల్పు శరధులయట్లు మెఱసెఁ
గలితరుచి పొల్చుకన్య జంఘాయుగంబు.

268


తే. గీ.

కలికిచాయ నిశాలీల కడకుఁ దరమఁ
బొదలె నరుణోదయస్ఫూర్తి పదములందు
నబ్జవికసనమును హంసకారవంబు
నచ్చటనె మోహనంబుగా నావహింప.

269


వ.

పాదరేఖాకలితధ్వజకలశాతపత్రచిహ్నయై పరిపూర్ణయౌవనయగు
నారుక్మిణీసుందరి కాంచనాంబరచందనానులేపనమహాభూషణసురభి
మాల్యాలంకారభాస్వరయై యున్నయంత నారుక్మిణికిం బరిణయంబు
సేయుటకై.

270


క.

శిశుపాలుం డర్హుఁడు హరి
పశుపాలుం డనుచు రుక్మి పాణిగృహీతీ
వశగతు భీష్ము నొడంబడ
నిశితమతిం దెలుప లగ్ననిశ్చయ మైనన్.

271


వ.

వారు శిశుపాలునిం బిలువనంపిన.

272


క.

మాగధసాళ్వాదులతో
సాగర ముప్పొంగె ననఁగఁ జైద్యుఁడు మదవ
న్నాగరథహయపదార్భటి
నాగరకులు మెచ్చ వచ్చె నవ్యస్ఫూర్తిన్.

273

వ.

అప్పుడు.

274


ఆ. వె.

శౌరి చక్కఁదనము సత్వాతిశయలస
ద్గుణము లఖిలవిబుధకోటివలన
వింతవింత గాఁగ విని వినిశిత
కంతుకుంతనిహతిఁ గ్రాగి క్రాగి.

275


క.

ఆరుక్మిణి యొకవిప్రుని
సారజ్ఞునిఁ బిలిచి కలితసంకేతరహ
స్యారూఢశోభనోత్సవ
చారుతరాత్మీయవృత్తసందేశంబుల్.

276


వ.

తెలియం బల్కి కృష్ణుసాన్నిధ్యమునకుం బంపిన నాభూసురునివలనఁ
గృష్ణుండు తద్వృత్తాంతంబంతయు విని యతిరయంబున దారుకానీత
స్యందనం బెక్కి బలరామసహాయంబుగాఁ గుండినపురంబునకుం జని
భీష్మకుం డెదురుకొని యొక్కయుచితసౌధంబున నునుప నుండె
నంత.

277


సీ.

హరి యద్భుతము గాఁగ నరిగి రుక్మిణిఁ బట్టి
                       రథముపై నిడుకొని రామసహితుఁ
డై మాగధాదులతో మొనయై చైద్యుఁ
                       డని సేయఁ దద్బల మణఁచివైచి
గర్వాంధుఁడై రుక్మి గవిసిన నతని యో
                       ధావళి నురుమాడి హరి కఠోర
కరవాలమున నొంపఁ గదిసిన భీష్మక
                       కన్యక విడిపింపఁ గనలి వాని


తే. గీ.

కచవిఖండన మొనరించి కాచి యనిచి
పాంచజన్యంబుఁ బూరించి బహుళజైత్ర
చిత్రవాదిత్రఘోషంబు చెలఁగ ద్వార
కాపురంబున కేఁగె శృంగారలీల.

278


వ.

ఇట్లు కృష్ణుండు ద్వారకాపురముఁ బ్రవేశించి రుక్మిణిం బరిణయంబగుటకు
నుత్సాహంబు మెఱయనుండిన గర్గుండు శుభముహూర్తంబు నిశ్చ
యించె నప్పుడు.

279

సీ.

ప్రతినికేతనచిత్రపటమంటపంబును
                       బ్రత్యంగణాంచితభవ్యనవ్య
కర్పూరమృగమదగంధిలంబును బ్రతి
                       ద్వారరంభాస్తంభదామకంబుఁ
బ్రతిరాజవీథి సద్భటతోరణంబును
                       బ్రతినిమేషాహతపటహరవము
ప్రతిభూసురాశీఃప్రపంచసంధానంబు
                       ప్రత్యహనవసవారంభకంబు


తే. గీ.

ప్రతిరథాశ్వగజశ్రీశుభక్రమంబు
ప్రతికులస్త్రీపురుషకళాభ్యంచితంబు
ప్రతిసమోజ్ఝితశృంగారబంధురంబు
నైననగరంబు కనుపండు వయ్యె నపుడు.

280


వ.

అప్పుడు శోభనాలంకారభాసురంబైన తననగరిలోనఁ గృష్ణుండు
మంగళస్నానం బాచరించి వివిధభూషణశోభితుండై కల్యాణగృహ
వితర్దికపై బంధుజనసహితుండై రుక్మిణియుం బరిణయోచితశృంగా
రంబు మెఱయ నెచ్చెలులు దోడ్కొనిరాఁగ నూత్నరత్ననిర్మితంబైన
శోభనగృహంబుచెంత నిల్చె నప్పుడు వివిధవాద్యధ్వనులు వసుదేవ
బలభద్రోదితతచ్ఛుభసంభ్రమంబులును వెలసి యప్పుడు గర్గాదు
లిది శుభముహూర్తం బని పలుక మంత్రపూతంబైన హరిచేఁ దనకు
రుక్మిణికన్యక యాత్మదానం బొనర్చినఁ గైకొని భీష్మకునకు ధన్యత్వం
బొసంగె నప్పుడు మరియును.

281


తే. గీ.

శుభకరంబైన మంగళసూత్ర మపుడు
కట్టెఁ గృష్ణుండు రుక్మిణిగళమునందు
నకుహకోక్తుల మాధుర్యమందనుండు
గళమునకు మెచ్చొసంగినకరణి గాఁగ.

282


క.

తలఁబ్రాలు వోసెఁ గృష్ణుండు
కలకంఠీమణికి భీష్మకన్యకకుఁ బయో
జలధిసుధాకణములతో
వెలువడి చనుదెంచు కమలవిధమునఁ దనరన్.

283

తే. గీ.

హరికిఁ దలఁబ్రాలు వోసె భోజ్యాలతాంగి
రాధికాధరబింబధారాళతరసు
ఛారసోన్మిశ్రమోహౌషధంబు నిగ్గు
మించి తల కెక్కినను వెడలించె ననఁగ.

284


ఉ.

ఒప్పులకుప్ప రుక్మిణి సహోదరనేయములైన లాజలిం
పొప్ప రమాప్తమూర్తి మది నుండగ వేల్చెఁ గృశానునందు మైఁ
గప్పె వినీలధూమరుచికజ్జలసజ్జలబిందువారముల్
జిప్పిలె లోచనాబ్జములచెంత జనుల్ ప్రమదంబు నొందఁగన్.

285


తే. గీ.

మంజుమంజీరమాణిక్యపుంజకాంతి
వాహినీమధ్యమున కరవనజమత్స్య
మకరరేఖలు వెలయ నశ్మము వధూప
దమున మెట్టించె శౌరి చిత్తంబు గరఁగ.

286


తే. గీ.

విమలశాల్యన్న మాజ్యాన్నవీనముద్గ
శర్కరాపూపఫలరసక్షౌద్రదధిప
రంబు లానందముగఁ బ్రమదంబుతో భు
జించి రప్పుడు భూసురశ్రేష్ఠు లచట.

287


క.

గోపాలమౌళి యాత్మా
రోపణ మగ్నికి ఘటించె రూఢిం జైద్య
క్ష్మాపతి తేజఃపావకు
నీపగిది హరింతు ననుచు నెఱిఁగించుగతిన్.

288


వ.

ఇవ్విధంబునం గల్యాణంబు పరిపూర్ణం బగుటయు నవ్వాసుదేవుండు
ప్రమోదంబు వహింపుచు సకలోత్సవంబులు ననుభవించె నంత
నొక్కనాఁడు.

289


సీ.

అఖిలవిచిత్రవాద్యములు గాంధర్వవి
                       ద్యారూఢవివిధనృత్యములు భూసు
రాశీర్వచోఘోష మఖిలదేశాగత
                       రాజన్యమాన్యపరంపరలును
గంధమాల్యోల్లోచకంబులు పుణ్యసా
                       ధ్వీశుభగీతముల్ దివిజముక్త
కుసుమవర్షంబులు గురుతరోద్దీపిత
                       కరదీపకోటులు గజతురంగ

తే. గీ.

గణము గొడుగులు టెక్కెముల్ కలితసుభట
వందిమాగధజననుతవైభవంబు
దనరు శోభనమంటపాంతరమునందు
నసమమాణిక్యపీఠిక నధివసించి.

290


తే. గీ.

పద్మమిత్రప్రసాదలబ్ధశ్యమంత
కమణితో సత్రజిత్తు రా నమరు దద్వి
శాలరత్నంబు రవి యని సంశయంబు
నపుడు దెలిసి మురాంతకుం డభిలషింప.

291


తే. గీ.

బహుధనమునకు నీక యల్పమతి నేఁగె
నతఁడు తత్సోదరుఁడు మృగయావిహార
మునకు నామణిఁ బూని తాఁ బోవ నంత
నడవిలోపల మృగరాజ మతని నడఁచె.

292


తే. గీ.

జాంబవంతుండు దానిఁ దత్సమయమున హ
రించి మణిఁ గొని గుహలో వసించె నంత
సత్రజిత్తుఁడు నిందింపఁ జక్రధరుఁడు
సత్రజిద్దేవముఖ్యులు సన్నుతింప.

293


వ.

పౌరజనంబులు దానును నరణ్యానీకమధ్యంబునకు నేఁగి.

294


క.

కూలినహయమున్ ధరపై
వ్రాలిన నాఘనుఁ బ్రసేను వధియించి ధరన్
దూలినసింహముఁ దెలుపం
జాలిన భల్లూకపాదసరణియుఁ గాంచెన్.

295


వ.

కాంచి తత్పాదసరణి జాంబవన్నివాసగుహాద్వారంబు చేరి.

296


ఉ.

ఆగుహవాత నందఱ నిజాప్తుల నుంచి మురారి చొచ్చి తే
జోగరిమంబు కల్మి వరసూర్యుఁడపోలె వెలుంగు తన్మణి
శ్రీఁ గని యంది పుచ్చుకొని చేరిన భల్లుకరాట్సుతాంగర
క్షాగతధాత్రి బొబ్బలిడ నాముదియెల్గు మహోగ్రమూర్తియై.

297


వ.

కదిసిన.

298

క.

ఉద్ధతులై యిరువురును ని
యుద్ధముఁ గావించి రాగ్రహోద్ధవముల భూ
భృద్ధీరులు పరబలస
న్నద్ధులు జయకౌశలైకనయనిధు లనఁగన్.

299


క.

చరణంబులఁ జరణంబులఁ
గరములఁ గరములను గదల గదలన్ నఖరాం
తరముల నఖరాంతముల
నిరువదియెనిమిదిదినంబు లిరువురుఁ బోరన్.

300


ఆ. వె.

జాంబవంతుఁ డాత్మశక్తి జయించిన
శక్తి గలుగు కృష్ణు జగముఁ బ్రోచు
నాదిదేవుఁడా చరాచరకర్త నా
రాయణుండె యనుచుఁ బ్రస్తుతించె.

301


సీ.

జయ జయ రఘుకులచక్రీశ తాటకా
                       హరణ, విశ్వామిత్రయాగభరణ,
అనఘ, యహల్యాఘహారి, శంకరధను
                       ర్భంజన, జానకీప్రాణనాథ,
భార్గవభుజదర్పభంజన, పితృవాక్య
                       పాలన, ఖరముఖప్రళయకాల,
సుగ్రీవవరద, యశోనిధి, వాలిమ
                       ర్దన, వారిబంధన, దర్పితోగ్ర


తే. గీ.

కుంభకర్ణాతికాయాదికుటిలదైత్య
వీరసంహార, రావణద్విపమృగేంద్ర,
పుష్పకాన్వితసాకేతపురినివేశ,
రామ, శైలతనూజాభిరామనామ.

302


క.

దాసానుదాసుఁడను నేఁ
జేసినయపరాధ మాత్మఁ జింతింపక సీ
తాసఖ నను రక్షింపవె
వాసుకికంకణ విరించివందితచరణా!

303


వ.

అని జాంబవంతుండు మఱియును బ్రస్తుతించిన.

304

సీ.

హరి ప్రసన్నాత్ముఁడై యతనిఁ గౌగిటఁ జేర్చి
                       యపవాద మొదవిన నరుగుదేర
వలసె శ్యమంతకాహ్వయరత్న మిచ్చినఁ
                       దదపవాదము నాకుఁ దప్పు ననిన
నాదివ్యరత్నంబు నాత్మజారత్నంబు
                       నతఁ డొసంగఁగఁ బురి కరుగుదెంచె
గుహలోనఁ దానుండి గురు తెఱుంగక వచ్చి
                       ప్రలపించి తిరిగెడు బంధువర్గ


తే. గీ.

పౌరవర్గ సుధీవర్గ పార్థివేంద్ర
వర్గ మునివర్గములు మెచ్చ వాసుదేవుఁ
డమ్మణి యొసంగె సత్రాజితాఖ్యునకు ని
జాంతరంగమ్మునందు హర్షాబ్ధి విరియ.

305


తే. గీ.

అతఁడు లజ్జించి యపరాధ మణఁచికొనఁద
లంచి యారత్నమును సుకళాకలాప
యైన యాసత్యభామ ప్రియాశయముస
వచ్చి సద్భక్తి కానుక యిచ్చె హరికి.

306


వ.

అప్పుడు కృష్ణుండు సత్రాజిత్తునకు మణి మరల నిచ్చి సత్యభామం బరి
గ్రహించె నంత నరకాసురకారాగృహగృహీతలైన రాజకన్యలు పదాఱు
వేవురును శౌరికి నిజవృత్తాంతం బెఱుకపడంజేసిన సంభ్రమంబు మెఱయ
నాహరి సత్యభామాసమన్వితుఁ డగుచుఁ జతురంగబలయుతుండై తత్పు
రంబునకుం జనిన.

307

నరకసంహారము — పారిజాతాపహరణము

క.

అప్పుడు భౌముఁడు మదముల్
చిప్పిలు సింధురము నెక్కి క్షితి నసిదీప్తుల్
కుప్పలుగాఁ దద్భువన క
కుప్పలల భుజుల్ భుజింపఁ గ్రోధోద్ధతుఁడై.

308


వ.

ఎదిరిన యా కృష్ణుండును నతనిపైఁ గవిసి యనేకదివ్యబాణంబు లేసిన
నాధరానందనుండును నా కృష్ణుని బాణంబులం .................. నట్ల
యిరువురు మచ్చరంబు లెచ్చ బహువిధశస్త్రాస్త్రఘాతంబు లొదవఁ బోరు

నెడ హరి సంతసిల్ల సత్యభామ యిప్పుడె నరకాసురుని ఖండించెద
మదీయయుద్ధచాతుర్యంబు చూడుమని పల్కి వీరశృంగారరసనిధియై
కుచంబులపై జారు పయ్యెదకొంగు పదిలంబుగా సవరించి కీలుగంటు
బిగువుగా ముడిచి కరంబున శరచాపపల్లి మెఱయ జన్యసన్నాహంబు
మెఱయనున్నయెడ.

309


క.

ఆచూపుఁగోపు సొగసును
నాచాపాకర్ణనంబు నాయుద్ధకళా
వైచిత్రియుఁ జిత్రంబై
గోచర గోచరుల కపు డగోచర మయ్యెన్.

310


ఆ. వె.

చక్రధారుఁ ద్రుంచెఁ జక్రి దానవలోక
చక్రవర్తి శిరము చదల నమర
చక్రమెల్లఁ జూచి సంతోష మంద నా
చక్రవాళధరణిచక్రమద్రువ.

311


వ.

అప్పుడు మణికుండలంబులును వైజయంతియు వరుణదత్తసితాతపవా
రణంబు నొకమహాదివ్యరత్నంబు నొప్పగించి భూదేవి మురారాతిం
బొగడి మ్రొక్కి.

312


క.

భగదత్తుండను తత్సుతు
నగణీయదయావిలోకనామృతవృష్టిన్
జగదేకపతీ! ప్రోవుము
తగు నాశ్రితరక్షణంబు ధర్మాత్ములకున్.

313


వ.

అని మఱియు నుతించిన యాభూదేవికిం బ్రసన్నుండై భగదత్తునకుఁ
దద్రాజ్యాధిపత్యం బొసంగి.

314


క.

కాంతులవింతల దగు చౌ
దంతుల వరరూపవిభవధన్యాకృతులన్
గాంతలఁ బదారువేవుర
నంత మురాంతకుఁడు పంపె నా ద్వారకకున్.

315


వ.

అప్పుడు కృష్ణుండు సత్యభామాసహితుండై గరుడాధిరోహణంబు
మెఱయ నమరావతికిం జనిన సురాధినాథుం డెదుర్కొని సంభ్రమించి
యింద్రునినగరు ప్రవేశించి యందు.

316

తే. గీ.

అదితిదేవికి దివ్యంబులైన కుండ
లంబు లిడి యింద్రుచేఁ బూజనంబు లొంది
నందనంబున కేఁగి సనందనాది
వందితుఁడు పారిజాతంబు వన్నెఁ జూచె.

317


వ.

చూచి యాదివ్యమహీజాతంబు గైకొని.

318


క.

ఖగరాజుమీఁద నిడుకొని
ఖగవీథిం జనఁగ శరనికరవర్షములన్
ఖగవాహనులై కురిసిరి
ఖగముఖ్యులు దివిజరాజు గర్వము మెఱయన్.

319


క.

అపరాజితాధిపుఁడు హరి
యపరాజితమూర్తి యైన యమరేంద్రుఁడు శౌ
ర్యపరాజితుఁడై యుండఁగ
సపరాజితుఁ జేసి యతని ననిచెన్ బురికిన్.

320


వ.

ఇ ట్లనిచి కృష్ణుండు నిజనగరంబు ప్రవేశించి సత్యభామాగృహంబునఁ
బారిజాతంబు నిల్పి యారాజకన్యల ననేకరూపంబులు ధరియించి
బహువిధసుఖంబు లనుభవించుచు నుండె నంత.

321

ప్రద్యుమ్నవృత్తాంతము

శా.

వింత ల్మీఱ నవంతిదేశపతు లావిందానువిందుల్ శుభ
స్వాంతుల్ సోదరి మిత్రవిందకు ఘనస్వాయంవరశ్రీల న
త్యంతప్రీతిగ రాజులం బిలిచి యాస్థానిన్ విజృంభింపఁగా
నెంతే సంభ్రమ మొప్పఁ గృష్ణుఁడు భుజోదీర్ణప్రతాపోగ్రుఁడై.

322


వ.

ఆమిత్రవింద నపహరించి నిజపురంబునకుం దెచ్చి యాకన్యకను
వరించి హరి శుభంబున నున్న యంత.

323


ఉ.

కోసలదేశ మేలు నృపకుంజరుఁ డొప్పగు నగ్నజిత్సమా
ఖ్యాసుభగుండు తత్తనయయై తగు నాగ్నజితిన్ దటిత్ప్రభా
భాసురగాత్రిఁ జక్రి వృషభప్రవరంబుల మూఁటినాల్గిటిన్
గేసరియట్లు పట్టి పెళకించి జయించి వరించె నంతటన్.

324

క.

కరు లొకతొమ్మిదివేలును
గరివరశతగుణములైన ఘనరథములు ద
ద్వరరథశతగుణహయములు
హరి శతగుణభటుల నృపతి యల్లున కొసఁగెన్.

325


వ.

మఱియుఁ బదివేలుధేనువులును సకలభూషాభిరామరామాసహస్ర
త్రయంబును నగ్నజిత్తు తనకు నొసంగం గైకొని నాగ్నజితిసహితుండై
ద్వారకానగరంబుఁ ప్రవేశించె నంత.

326


క.

భద్రయను మేనమఱఁదలి
భద్రగుణాన్వీత దివ్యభామాజనశుం
భద్రత్నముఁ గైకేయిన్
భద్రవిమర్దనుఁడు శౌరి పరిణయ మయ్యెన్.

327


వ.

అంత.

328


క.

మద్రనృపాలుసుతన్ రుచి
మద్రత్నము లక్షణన్ సమస్తారిమనో
మద్రాజగణము చూడ స
మద్రక్షకుఁ డట వరించె మహితోత్సవుఁడై.

329


వ.

మఱియుం బాండవులఁ జూడ నింద్రప్రస్థపురంబునకుం జని అర్జున
సహితుండై వేఁటలాడుచుఁ గాళిందీపులినప్రదేశంబుననున్న కాళింది
కన్యను వివాహంబై ద్వారావతికి వచ్చె నిట్లు.

330


తే. గీ.

భవ్యయగు రుక్మిణియును జాంబవతి సత్య
భామ కాళింది మిత్రవిందా మృగాక్షి
నాగ్నజితి భద్ర లక్షణా నలినముఖియు
ననఁగ నెనమండ్రు ప్రియభార్య లగుచు నుండ.

331


వ.

సంతోషంబున శౌరి యుప్పొంగుచుండ నంత నొక్కనాఁడు.

332


సీ.

భోజకన్యాగర్భమున దర్పకుండు ప్ర
                       ద్యుమ్నాభిధానంబుతో జనింప
శంబరుఁ డరియని జలధి వైవ నతని
                       నొకమీను మ్రింగ మహోగ్రశక్తి

జాలికుల్ తెచ్చి తచ్ఛంబరదైత్యు మ
                       హాననంబున కపు డప్పగింప
యడబాల లంతట నామీను శోధింప
                       నం దుదయించిన యట్టి బాలుఁ


తే. గీ.

గాంచి మాయావతీసమాఖ్యన్ వసించు
రతికి నెఱిఁగింప నంత నారదుఁడు తత్క్ర
మంబుఁ దెలుపంగఁ దెలిసి శంబరుని నడిగి
చెలువ రతి తత్కుమారుఁ బోషించుచుండ.

333


క.

చక్కఁదన మెమ్మె చూపఁగఁ
జక్కిలిగిలిగింత గొల్పె జవరాండ్రకుఁ దా
నక్కొమరుండు మరుండగు
దక్కినవారలకు నిట్టి తనుకళ గలదే.

334


క.

చిలుకుల వాలుంబువ్వుల
యలుగులె నాబాలువిల్లు ననిలరథంబున్
గల జగజో దితఁడని మదిఁ
దలఁచిరి శంబరుఁడు దక్కఁ దక్కినజనముల్.

335


చ.

పలుకులలోన మోహములు పైకొని నవ్విన ముద్దునవ్వులున్
వలపులు వెల్లిగా మెఱయు వాలుఁగనుంగవ బొల్చు చూపులున్
గులికెడు బాహుమూలరుచి గుబ్బచనుంగవ చాయ వేఱులై
కలయఁగ నారతిప్రమద కంతునిఁ బైకొనియెం బ్రియంబునన్.

336


వ.

అప్పు డప్పువ్వులవిలుతుండు రతివలనఁ దద్వృత్తాంతంబంతయుం
దెలిసి సర్వశత్రువినాశినియైన మహామాయావిద్యం గాంచి.

337


క.

శంబరదైత్యసముద్భట
శంబరయోదారఘోరశాతాసితలన్
శంబరపోతమువోలెన్
శంబరనిధిశాయిసుతుఁడు చయ్యన నోర్చెన్.

338


తే. గీ.

అంత రతి గగనాద్యంబునందుఁ బతియుఁ
దానుఁ జని ద్వారకాపురోత్తంసహంన
మండలోద్దండమాణిక్యమండలప్ర
కాండసౌధాగ్రమున నిల్చి కాననయ్యె.

339

క.

రాజీవధ్వజుఁ గని వర
తేజము రుచిరాంగనవ్యదీప్తియు ధవళాం
భోజములఁ బోలు కన్నులు
రాజిల్లఁగ శౌరి యనుచు రమణులు గదియన్.

340


ఆ. వె.

ఆత్మ చల్లనగుట కానందబాష్పాంబు
ధార లుప్పతిల్లఁ దగఁ గుచములు
చేపి పాలు గురియఁ జెంత రుక్మిణి నిజ
సఖులుఁ దానుఁ గొంత సంభ్రమించి.

341


క.

జటిలాలకయై గంగా
తటినీతటి నెట్టితపముఁ దగఁ జేసెనొ నేఁ
డిటువంటికొడుకు గాంచిన
కుటిలాలకభాగ్యరేఖకుం గడ గలదే.

342


వ.

అని పలుకుచున్న నారదునివలనం దత్పూర్వవృత్తాంతం బంతయు
నెఱింగి కృష్ణుండు తత్సమీపంబునకుం జనుదెంచె వసుదేవదేవకీబల
రాములు తద్విధం బెఱింగి ప్రమోదాన్వితు లైరి. భోజకన్యక తనకు
వందనంబులు సేయు సుతునిం గోడలి నక్కునం జేర్చి చక్కనెత్తి
బహూకరించె నంత వారలందఱును నిజస్థానంబులకు జను
నట్టియెడ.

343


క.

ఆమ్నాయనికాయాజ
స్రామ్నాత సుకీర్తిశాలి యగు హరికి లస
ద్యుమ్నరుచికి రుక్మిణికిఁ బ్ర
ద్యుమ్నుఁ డతఁడు తిరుగఁ గలిగి యుత్సవ మొసఁగెన్.

344


వ.

అంతఁ బూర్ణయౌవనకళాభివృద్ధిగాంచిన ప్రద్యుమ్నకుమారునకు.

345


క.

రుక్మి తనయ నొసఁగెద నన
రుక్మాంబరుఁ డాప్తజనవరులు బాంధవులున్
రుక్మిణ్యాదులు రాఁగా
రుక్మరథం బెక్కి తగుసిరుల్ దళుకొత్తన్.

346


వ.

కుండినపురంబునకుం జని రుక్మినందనం బ్రద్యుమ్నునకు వివాహంబు
చేసినపిమ్మట.

347

తే. గీ.

భద్రతరమూర్తి యగు బలభద్రు నెదిరి
దర్ప మొప్పంగ రుక్మి జూదమునఁ గనలి
ప్రల్లదము లాడఁ దీవ్రకోపమున వాని
శిరముఁ ద్రుంచెను వరఘోరసీరమునను.

348


వ.

అంతఁ గృష్ణుండు తమవారినందఱిం దోడ్కొని ద్వారకాపురంబున
కుం జని సుఖంబున నుండునంత.

349

శ్రీకృష్ణుఁడు బాణాసురుని నోడించుట

క.

శోణపురము రిపుశోణిత
శోణపురస్థలము నేలు శూరుఁడు ఘనుఁ డా
బాణుఁడు పరితోషితహరి
బాణుఁడు సంపూర్ణకీర్తిపౌరుషమహిమన్.

350


క.

చండీపతి తాండవమున
మెండైన మృదంగరపము మెరవడిచే ను
ద్దండత మెప్పించిన దో
ర్దండంబులు వేయు గలిగెఁ దద్దైత్యునకున్.

351


తే. గీ.

తద్భుజాదండకండూతి దండినైన
దండినైనను తృణముగాఁ దలఁచి చంద్ర
ఖండజూటుని రమ్మను భండనమునఁ
గండనున్నట్టి రక్షఃప్రకాండ మమర.

352


సీ.

బాణాసురునిపుత్రి పరిపూర్ణయౌవన
                       నుషయను కన్య సౌధోపరిప్ర
దేశంబునందు నిద్రింప మోహనశుభా
                       కారుండు హితచాటుకారుఁ డమల
శృంగారనిధి శుభశ్రీశాలి యనిరుద్ధుఁ
                       డనిరుద్ధుఁడై యదృశ్యత వహించి
ప్రథమసంపర్కసంపద వెల్లివిరియించి
                       చనిన మేల్కాంచి యాచంద్రవదన


తే. గీ.

నాల్గువంకల నీక్షించి నవ్యదివ్య
గంధమాల్యానులేపనాక్రాంతతనుర
తాంతకళ దన కెంతయు వింత గాఁగ
హర్షఖేదంబు లుప్పొంగ నచట నిల్చి.

353

ఉ.

ఎన్నఁడు గాంతు నాదు హృదయేశ్వరు నెప్పుడు గౌఁగిలింతు నా
చన్నులతీపున న్వెడలఁ జక్కెరమోవిసుధారసంబు నే
నెన్నడు విందు సేయుదు మహేంద్రుఁడొ చంద్రుఁడొ యారతీంద్రుఁడో
యున్న మనుష్యమాత్రుఁడె యనూనమహత్వవిలాసనంపదన్.

354


వ.

నిద్రాసమయంబున ననుం గూడిన విభుండు కనుపట్టండయ్యెనని మదన
బాణమోహితయై యాయుషాకన్య యివ్విధంబునఁ జిత్రరేఖయను చెలి
కత్తెకు నెఱింగించిన నది చిత్రపటంబునందు సురాసురనాగనరలోకంబుల
ఘనులైన సౌందర్యనిధుల వ్రాసి చాతుర్యంబు మెఱయించినం జూచి
యందు ననిరుద్ధుం గాంచి లజ్జావనతముఖియై తదాసక్తభావంబుఁ దెలుప
నాబాణతనయతోడ నీవిభుని సత్వరంబుగాఁ దెచ్చెదనని పలికి యా
చిత్రరేఖ సంభ్రమంబున.

355


ఆ. వె.

ద్వారావతికి నేఁగి యారామ మాయచే
నడరి దివ్యరత్నహర్మ్యడోలి
కాంతరస్థుఁడైన యాయనిరుద్దుఁ జొ
క్కించి తెచ్చె పంతగించి యపుడు.

356


వ.

తెచ్చిన యతనితో బహుదినంబులు మదనకేళి విహరించుచునుండ నుషకు
గర్భంబైనఁ దద్రక్షకు లెఱింగి బాణునకు విన్నవించిన నతండు ఘోరా
హవంబున ననిరుద్ధు నాగపాశబద్ధుం జేసె నంత నారదునివలనఁ
గృష్ణుండు తద్విధం బంతయు నెఱింగి.

357


క.

బలభద్రప్రద్యుమ్నా
దులతో రథ మెక్కి వచ్చి దుర్వారభుజో
ద్బలమునఁ జక్రాద్యాయుధ
ములు మెఱయన్ శోణపురిని ముట్టడి చేసెన్.

358


తే. గీ.

హరిహరులు గూఢకర్ణకుంభాండముసల
హస్తులును సాంబబాణాసురాత్మజులును
శంబరారాతితారకశాత్రవులును
బాణశైనేయులును రణక్షోణిఁ గదిసి.

359

క.

శరకుంతముసలపట్టిస
కరవాలగదాస్త్రశస్త్రగణకోటులచే
సరిఁ బోరిరి జయకాంక్షా
పరులై బ్రహ్మాండమెల్లఁ బటపటఁ బగులన్.

360


వ.

అప్పుడు.

361


క.

బాణసుతుఁ డేఁగెఁ దనకుం
బ్రాణము దక్కించుకొని కృపాణము జారన్
బాణుఁడు వణఁకుచు సాత్యకి
బాణంబుల నిలువలేక భంగము నొందెన్.

362


క.

ముసలధరుభయము కడువె
క్కసముగఁ గుంభాండగూఢకర్ణులు చని రా
యసమానఘోరసంగర
వసుధయు నేరికిని జూడ వశమే యెదుటన్.

363


తే. గీ.

హరుఁడు బ్రహ్మాస్త్రముఖ్యదివ్యాస్త్రవితతి
శౌరిపై నేయ హరి వాని సంహరించి
జృంభణాస్త్రంబు పైనేయ శంభుఁ డంత
నుక్షకకుదాంతరంబుపై నొరిగి సోలె.

364


వ.

తత్సమయంబున బాణుం డెదిరి.

365


తే. గీ.

పంచశతబాహువులను చాపములు దాల్చి
శాతసాయకములు వైవ శౌరి తచ్ఛ
రాసనంబులు ద్రుంచి రథ్యములు నొంచి
సారథి హరించి యతని తేజం బణంచి.

366


వ.

నిలుచునెడ.

367


క.

కోటర పరిశుష్కవదన
కోటరయై సుతునిఁ గ్రావఁ గ్రొమ్ముడి వీడన్
శాటంబుజార భీతి ని
శాటంబు రణస్థలాగ్ర మప్పుడు చొచ్చెన్.

368


వ.

బాణుండు భయంబున నిజపురంబు సొచ్చె నంత హరుండు త్రిశిరఘోర
మూర్తియగు నుగ్రజ్వరంబుఁ గల్పించిన దాని నతిశీతలజ్వరంబు
గల్పించి హరి హరించె నంత.

369

ఆ. వె.

కదిసె బాణుఁ డెదిరి కయ్యంబునను శౌరి
జక్రియును నుదారచక్రధార
నతనిబాహుశాఖలన్నియు ఖండించె
నాల్గు దక్కఁ దత్క్షణంబునందు.

370


వ.

అంత హరుండు ప్రార్థించిన హరి కరుణ వహించి ప్రహ్లాదవంశజుండు
గావున వీనిం గాచితి ప్రమథాగ్రేసరుండవైన నిన్నుఁ గొలిచి యుండుంగాక
యని బాణుని మన్నించి యాహరుని వీడ్కొల్పిన నాఘనుండు నిజేచ్ఛం
జనియె నంతఁ దనకూఁతునకు ననిరుద్ధునకు ననేకశుభావహోత్సవం
బులు గావించి యయ్యుషాజనకుం డంపఁ గృష్ణుండు తమవారిం దోడ్కొని
మంగళవాద్యంబులతో బలసన్నాహంబు మెఱయ ద్వారకాపురంబు
ప్రవేశించె నంత.

371

నృగమహారాజు వృత్తాంతము - పౌండ్రకవాసుదేవుఁడు

క.

ఒకనాఁడు వనవిహార
ప్రకటోత్సాహంబు మెరసి ప్రద్యుమ్నకుమా
రకముఖ్యు లలసి విమలో
దకమునకై పాడునూతిదరినుండి తగన్.

372


క.

వికలాసమరూపంబునఁ
గృకలాస మొగర్చుకొనుచుఁ గృకలాసము దా
నొకటి పొడచూప దరికిన్
బెకలింపఁగలేకయున్నఁ బేర్చినవేడ్కన్.

373


వ.

కృష్ణుం డాకృకలాసకంబు చేరంజని.

374


చ.

కరమునఁ బట్టి యెత్తిన జగన్నుతదివ్యశరీరమున్ బరి
స్ఫురితసురత్నకుండలవిశోభితభూషణముల్ మనోహరాం
బరమును బూని యొక్కనరపాలకుఁడై యది శౌరిఁ గాంచి ని
ర్భరసుఖవార్ధిఁ దేలి బహుభంగుల నెంచి నుతించి వేడుకన్.

375


క.

ఇక్ష్వాకుకులనృపుఁడఁ బా
పక్ష్వాంకమృగాదనంబ భయహేతు మదీ
యక్ష్వేడ విన్నయంతనె
భిక్ష్వాకారమున విమతబృందం బేఁగన్.

376

ఆ. వె.

పరమపురుష కృష్ణ పరమదయానిధి
పరమయోగివంద్య పరమహంస
పరమధామయుక్త పరమశుభాకార
పరమతత్త్వ మీవ పావనాత్మ.

377


వ.

ఏ భవత్ప్రతిగా జగతీసురు లగణేయంబులగు ధేనువుల దానం బొనర్చితి
నందు నొకరికి నిచ్చిన ధేనువు నొకనికి నజ్ఞానంబున ధారవోసియిచ్చితి.
అన్యోన్యమత్సరంబున నున్న యాభూమీసురులలో నొకవిప్రుండు నన్ను
గృకలాసపం బగుమని శపియించె తచ్ఛాపదుఃఖంబు నీవలనం గడచితి నని
పల్కి యానృపాలుండు దివ్యలోకంబునకుం జనియె నంత.

378


ఉ.

పౌండ్రక వాసుదేవుఁ డురుబాహుపరాక్రమగర్వసంపదన్
గాండ్రతనంబు గాంచి మురఖండనుతోఁ గలహంబు పూని తా
వేండ్రములైన బాణముల వేఁచెదఁ జు మ్మొకభద్రదంతి యా
పుండ్రరసాలముంబలె రిపున్ నిను నొంచెద సాహసంబునన్.

379


ఆ. వె.

తెలియ నీవు వాసుదేవాహ్వయమున క
ర్హుఁడవే ధరిత్రి నుగ్రశాస
నప్రతాపకీర్తినయశాలినగు నాకు
దగుఁ బ్రసిద్ధి నెంచఁ దత్పదంబు.

380


వ.

అని ఇట్లనుమాటలు దూతకుం దెలిపిన నతండు చనుదెంచి యానృపతి
యాడినట్లు విన్నవించినఁ గృష్ణుండు కోపంబు మెఱయ నిట్లనియె.

381


తే. గీ.

కదలివచ్చితి నిలుమను కదనమునకు
శాకినీ ఢాకినీ పిశాచములకెల్ల
విందు చేసెద పౌండ్రకవిభుని మాంస
ఖండము లఖండజయలక్ష్మిఁ గాంచి యపుడు.

382


వ.

అని పలికి దూత మరలనంపి జయభేరి వేయించి రథం బెక్కి యనేక
బలంబులు గొలువం గృష్ణుండు కదలిన.

383


క.

రెండక్షోహిణు లిరుగడ
నుండఁగఁ బౌండ్రకుఁడు నిలిచె నుగ్రతఁ గాశీ
శుండును మార్కొనియెం దా
నండ నిజాక్షోహిణీత్రయంబు చెలంగన్.

384

వ.

అంత గృష్ణుండు వారికి నభిముఖుండై తద్బలంబుల నురుమాడుచు
డాయం జని.

385


క.

అరదంబుఁ ద్రుంచి సారథిఁ
బరిమార్చి సిడెంబు నఱికి పౌండ్రకుని శిరం
బురుశస్త్రనిహతిఁ ద్రుంచుచుఁ
బొరలంగాఁ జేసె వృష్ణిపుంగవు లలరన్.

386


ఆ. వె.

కౌశికేంద్రబలము ఖండించి యాతని
తల యిలాతలమునఁ బెళకకుండఁ
గందుకంబు రీతిఁగాఁ దత్పురంబులోఁ
దార్పఁ దత్సుతుఁడు సుదక్షిణుండు.

387


క.

అభిచారహోమకృత్తిన్
రభసంబునఁ బనుప నది దురాసదచక్ర
ప్రభ గెరలి తీవ్రరోష
క్షుభితమతిన్ వాని మ్రింగె సురలు నుతింపన్.

388


వ.

అంత శౌరి తజ్జయంబుఁ గాంచి సుఖం బున్నయెడ.

389

కౌరవపాండవసంబంధము

ఉ.

భోట విదర్భ సాల్వ కురుభోజ కరూశ వరాటలాటిక
ర్ణాట దశార్ణమద్రయవన ద్రవిళాంధ్ర కళింగ చోళ పా
నాట విదేహ ఘూర్జర వనాయుఖ నాయురినాయుతంబు స
య్యాటములన్ స్వయంవరసభాంతరమంచతలంబు లందగన్.

390


వ.

ఉన్నవిధం బెఱింగి జాంబవతీసుతుం డారాజలోకంబు చేరం జనియె.

391


క.

చని సాంబుఁడు దుర్యోధన
తనయను శుభయత్నమున రథముపై నిడ నా
ఘనులగు కర్ణాదులు తీ
వ్రనిశాతాస్త్రములఁ గట్టివైచిరి యతనిన్.

392

వ.

తద్వృత్తాంతంబు విని కృష్ణుం డాగ్రహంబున నున్న గురుండు గావున
బలభద్రుండు దుర్యోధనపక్షంబున హస్తిపురంబున కేఁగి రారాజునకు
నిజాగమనప్రయోజనం బెఱిఁగించిన నతండు గర్వించి యుద్ధతవచనం
బులు పలికిన సమిద్ధహలముఖంబున హస్తిపురంబు యమునలోఁ
బడఁదిగుచు కృష్ణాగ్రజునకు విచిత్రాంబరాభరణంబులు మెఱయు
లక్ష్మణకన్యకతోడ సాంబుని మరల నిచ్చి భీష్మాదిసహితుండై కురు
రాజు ప్రియంబు చెప్పిన నబ్బలదేవుండు నిజపురంబున కేఁగి తదుద్వా
హంబుఁ గావించె నంత.

393


తే. గీ.

రాజసూయంబునకు ధర్మరాజు పిలువ
నంపనేఁగి జరాసంధు నపుడు భీమ
సేనుచే నడఁగించె నాశ్రీధరుండు
తగు యుధిష్ఠిరభూవరాధ్వరమునందు.

394


క.

దమఘోషనందనుం డరి
దమఘోషముతోడఁ గృష్ణుఁ దార్కొని యపరా
ధము లొక్కశతం బపరా
ధము లెల్లన్ నవ్వఁజేసెఁ దా నుద్ధతుఁడై.

395


క.

ఆగోపనయనవిధుఁడు త
దాగోపనయన మొనర్ప నాగ్రహ మడరన్
వేగమునఁ ద్రుంచె రిపు ను
ద్వేగంబున విమతులెల్ల విఱిగి చలింపన్.

396


తే. గీ.

దురములోదంతవక్త్రవిదూరసాల్వ
ముఖ్యుల జయించె హరి లోకములు నుతింప
రాజసూయంబు గావించెఁ బ్రౌఢిరాజ
రాజసూయం బొరల ధర్మరాజసుతుఁడు.

397


క.

సూతుఁడు బ్రహ్మాసనయుతుఁ
డై తను గైకొనకయున్న హలి యుచితంబుల్
చేతోవృత్తి దలఁవక ప
రీతుని గావించె నతని ఋషులు వడంకన్.

398

వ.

ఇట్లు చేసి ఋషులవలన నేతత్పాపనిష్కృతి తీర్థాచరణంబున నగునని
విని తదాచరణోన్ముఖుండై యుండె నంత ఋషియాగవిఘ్ననిరాసంబు
సేయం దలంచి.

399


క.

పల్వలు కృతరిపుశోభిత
పల్వలు నిల్వలునియనుజు బలుఁ డుగ్రుండై
పల్వగలం బోరి తలఁచి
వల్వగలం గొట్టి నేలపైఁ బడఁద్రోచెన్.

400


వ.

ఇట్లు పల్వలుం ద్రుంచి కౌశికీసరయూప్రయాగగోమతీగండకీవిపాశా
శోణనదగయాగంగాసాగరసంగమసప్తగోదావరీకృష్ణవేణీపంపాసర
శ్రీశైలవేంకటాచలకాంచీపురరంగధామవృషభాద్రిమధురాసేతు
తామ్రపర్ణుల దర్శనస్నానాదులం గృతార్థుండై నియమంబు మెఱయ
యాగంబు గావించె నంత.

401

కుచేలోపాఖ్యానము

క.

కులసతి దారిద్ర్యంబునఁ
బలవింపుచు నొక్కనాఁడు భర్త కుచేలుం
బిలిచి మనప్రాణబంధుఁడు
గల కృష్ణుఁడు గలుగ లేమిఁ గందఁగ నేలా.

402


వ.

ఉపాయనంబులుగాఁ బృథుకంబులు గొని కృష్ణసాన్నిధ్యంబునకుం జని
పృథుకార్తిఁ దీర్పవే యని పలికిన.

403


ఉ.

ఏలికపై జుగుప్స యొనరించిన చేలము క్షౌరకర్మ మే
కాలములేని శ్మశ్రువులు కన్నుల దూషికశుష్కచర్మమై
పాలినమేను గల్గి తనపై కమలాగ్రజ నిల్వఁ బూర్ణల
జ్జాలసుఁడై మురారికడ కాద్విజవర్యుఁడు వచ్చువేళలన్.

404


తే. గీ.

వేత్రహస్తులఁ గనుఁగొని వెఱచు భద్ర
దంతిఘీంకారములు విని తల్లడించు
నెలమితో నెవ్వ రెదురైన నితఁడు ప్రభుఁ డ
టంచు దీవించు నున్ముగ్ధుఁ డగుచు నతఁడు.

405

తే. గీ.

హరి కనకరత్నభవన బాహ్యస్థలమున
నిలిచి యద్భుతమైన యీనిలయ మెట్లు
చొత్తునని భీతిఁ గలఁగి రాజిలు వసించు
కొలువు మొగసాల చొఱలేక కొంకికొంకి.

406


క.

భయ ముడిగి సాహసికని
శ్చయమున నానగరు చొచ్చి తద్భోజనుతా
ప్రియభాషలతోఁ జొక్కుచు
నయుతార్కస్ఫూర్తి మెఱయ నాదిమమూర్తిన్.

407


వ.

కాంచి యవ్విప్రుండు.

408


క.

గడగడ వడఁకుచు దీవన
లిడ మ్రొక్కి బహూకరించి యిల్లాలు ప్రియం
బడరన్ రత్నకలశమున
బడిబడి జల మొసఁగ శౌరిపదములు గడిగెన్.

409


వ.

ఇట్లు తనపదములు గడిగి నిజపూర్వవృత్తాంతంబు దెలుప లజ్జావనత
వదనుండై కానుక సమర్పింపనేరకయున్న కుచేలుని చేలాంచలంబున
నున్న యటుకులు భక్తపారిజాతంబైన యాకృష్ణుండు తానె పరిగ్ర
హించి యతని ననిచిన.

410


క.

అప్పతి సంపద యొసఁగఁడె
తప్పదు మత్పూర్వకలితదారిద్య్ర్యము నా
యొప్పమి యే మనుకొనియెద
నిప్పుడు నావంటి దీనుఁ డెందును గలఁడే.

411


వ.

అని చింతించుచు నతండు నిజపురంబుఁ బ్రవేశించె నంత.

412


క.

కలధౌతపూర్ణగేహం
బులు మణిసౌధములు దివ్యభూషణనికరం
బులు మత్తద్విపనాదం
బులు భూరిసుగంధవస్తుపూర్ణతయుఁ దగన్.

413


వ.

కనుపండువై రమామందిరంబైన నిజమందిరంబుఁ బ్రవేశించి భార్యా
పుత్రసహితుండై కుచేలుండు సుఖంబున నుండె నంత నొక్కనాఁడు.

414

శ్రీకృష్ణుఁడు వృకాసురుని భంజించుట

చ.

వృకుఁడను దైత్యుఁడొక్కఁ డతివీరుఁడు నారదమౌనిఁ గాంచి కౌ
తుకమున మ్రొక్కి నాకు దయతో నజవిష్ణుహరత్రయంబులో
సకలము నిచ్చి శీఘ్రమె ప్రసన్నత నొందెడివేల్పు దెల్పు మ
య్యకలుషమూర్తిఁ గొల్చి హృదయంబునఁ గల్గిన కోర్కె వేడెదన్.

415


వ.

అనిన నారదుం డిట్లనియె.

416


తే. గీ.

బాణరావణముఖ్యులౌ భక్తులకు మ
హేశ్వరుఁడు వేగ ఫల మిచ్చు నిద్ధమహిమ
నట్లు గావున నద్దేవు హరు మహాను
భావుఁ గొల్వుము దానవప్రభువతంస.

417


వ.

అని నారదుం డెఱింగించి చనిన దానవుండు పంచముఖు నఖిముఖుం
జేయందలంచి.

418


క.

బలునిష్ఠ నసుర నిజతను
పలలము ఖండించి చిత్రభానునిలో ని
శ్చలుఁడై వేల్చి పిదపఁ దన
తల యసి ఖండించి వేల్వఁదలఁచిన యంతన్.

419


క.

హరుఁడు ప్రసన్నుఁడు గాఁ దన
కర మూనినవానిశిరము ఖండములై యి
ద్ధరఁ బడుఁగా కని వేఁడిన
వర మిచ్చిన హరునియందె వంచన మెఱయన్.

420


వ.

అతని శిరంబుపై దనుజుండు కరం బిడందలంచిన హరుండు భీతిం
బరువెత్తె నంత.

421


క.

వటుఁడై హరి లంబశిఖా
వటుఁడై చనుదెంచి దైత్యవరునిం గని నీ కే
మిటికిం బరువిడనని త
క్కుటిలత్వము దెలియ మాయఁ దొలఁకఁగఁ బలికెన్.

422

క.

శిర మంటివి కర మంటివి
వర మంటివి హరుఁడు పల్కువచనంబులకున్
ధరలో నిల్కడ గలదే
పరులవలెన్ నేఁడు నిన్ను భ్రమయించెఁ గదా.

423


వ.

అని పలికి దనుజవంచనాకరణచతురుండైన యచ్చక్రి శాంబరీ
విభ్రమంబుఁ గల్పించి దనుజుని శిరంబునం గరం బిడుకొనంజేసిన
వాఁడు భసితంబయ్యె, హరిహరులు సంతసిల్లి రంత.

424

అర్జునుఁడు సుభద్రను గొంపోవుట

క.

చోరులు బ్రాహ్మణసురభులు
ధీరత హరియింప వాటిఁ దెచ్చుటకై గో
త్రారితనూజుఁడు శస్త్రా
గారంబున కరిగి మదికిఁ గడుభయ మొదవన్.

425


వ.

పాంచాలీసహితుండైన యుధిష్ఠిరుం గాంచి గాండీవంబును నక్షయ
తూణీరంబులుం గైకొని యాసవ్యసాచి చోరుల భంజించి నారదముని
కృతమర్యాదాక్రమంబునఁ దీర్థాచరణంబు సేయుచు భిక్షుకవేషంబున
ద్వారక చేరి బలభద్రానుమతంబునఁ దద్గృహంబున కేఁగి.

426


క.

ఒకసొగ సొకసింగారం
బొకవయ్యారంబు మెఱయ నొప్పులకుప్పై
మకరాంకుశస్త్ర మనఁగాఁ
బ్రకటశ్రీఁ దగు సుభద్ర భక్తిం గొలువన్.

427


క.

కని మోహాంబుధిఁ దేలుచు
ననురూపార్థుండు పార్థుఁ డాబాలికపై
మన మువ్విళ్ళూరం బై
కొన సమయాంతరము గాచికొనియుండెఁ దగన్.

428


వ.

ఇట్లుండి కృష్ణానుమతంబున సుభద్రం దోడ్కొని నిజపురంబునకుం
జనియె నంత నొక్కనాఁ డుత్సవంబున నున్న మునులు మూర్తిత్రయ
పరీక్ష సేయ భృగువు నంపిన.

429

మ.

నలువం జేరి భృగుండు మత్తునిగతిన్ వర్తించ రోషించి యా
కులుఁడౌ తద్దుహిణుం ద్యజించి వడి భర్గుం డాసి యామేటి ని
శ్చలతం గౌఁగిటిఁ జేర్ప వచ్చిన నుపేక్షాదృష్టి దా నుండ ను
జ్జ్వలశూలంబున గ్రువ్వఁబూనునతనిన్ వర్జించి వేగంబునన్.

430


క.

వైకుంఠమునకుఁ జని ముని
వైకుంఠునిఁ జూచి కనలి వక్షముఁ దన్నన్
లోకోత్తరచరితుఁడు హరి
యాకర్మందినతిపాద మల్లన యొత్తెన్.

431


వ.

ఒత్తిన నీవే శుద్ధసత్త్వమూర్తివని జనార్దనుం బ్రశంసించి మగుడి చను
దెంచి భృగుం డామునీశ్వరులకుఁ దద్వృత్తాంతంబంతయు నెఱింగించె.

432


క.

పరమశుభాకారుఁడు శ్రీ
వరుఁడే సత్త్వనిధి బ్రహ్మవాసవముఖ్యా
మరవిభుఁడు కృపాంభోనిధి -
యరయఁగ నొసఁగున్ ధనాయురారోగ్యంబుల్.

433


వ.

అని తలఁచి ప్రమోదం బంది రంత.

434

ద్వారకలో శ్రీకృష్ణునిజీవితము

సీ.

దీపితశ్వేతాంతరీపప్రతీకాశ
                       వజ్రసంస్థాపితవప్రవలయ
యరుణాశ్మవైఢూర్యహరినీలగోమేధి
                       కాపూర్ణచతురుచ్చగోపురాఢ్య
ప్రత్యగ్దిశాసాగరభ్రాంతికృత్ప్రాగ
                       వాగుత్తరదిశానువర్తిఖేయ
యభితశుకచ్ఛదాత్యచ్ఛసచ్చాయనీ
                       రంధ్రతరారామరజ్యమాన


తే. గీ.

యజరలావణ్యరూపజనాస్పదంబు
ప్రతిదినోత్సవసేవనాగతసుపర్వ
యానకషణోత్థమణిరజోత్యంతపూర్ణ
రంగవల్లిక ద్వారక రాజధాని.

435

సీ.

నిరుపమదివ్యమాణిక్యరాజత్సహ
                       స్రస్తంభజృంభవిరాజమాన
స్థాపితానంతభాస్కరమండలాయమా
                       నాంచితరత్నకుడ్యాభిరామ
తారకాన్వీతసంధ్యారుణాభ్రోదగ్ర
                       చారుముక్తాంకకాంచనవితాన
పరభయస్థాపితాసురవరామృతహేమ
                       కుంభవిభ్రాజివిజృంభకలశ


తే. గీ.

ఘనఫణామణికుండలాకారశేష
భోగి నిరుపమసద్రత్నపుంజవేది
చంద్రకాంతోరుసోపానసమధికాభ
సౌధ వరలక్ష్మి యప్పురి చాల మించె.

436


వ.

ఆసౌధంబుచుట్టును మందారపారిజాతసంతానకల్పవృక్షహరి
చందనచందనచంపకనాగపున్నాగమాధవీకంకేశీజంబూజంబీర
ఫలపూరచూతపనసనారికేళకపిత్థామలకీప్రముఖనానాభూజరాజ
విరాజమానఫలకుసుమసంపత్సమృద్ధమహోద్యానంబును ద్రాక్షామాల
మాలతీమల్లికాలవంగలవలీలతావేల్లితంబై సూర్యరశ్మి సోఁకక నీరం
ధ్రమై మెఱయ శుకపికశారికాముఖ్యనానావిహంగమమధురకూజి
తంబులు వీనుల విందు సేయఁ గెలంకులఁ గొలంకులు నానారత్నసోపా
నంబు లమరఁ జుట్టును కర్పూరకదలికాతపస్వినిస్స్రుతఘనసార
ఖండంబులు జలంబునం బడ్డ సౌరభ్యశైత్యమాంద్యంబులు గలిగి
మలయానిలంబు విసర రాజహంసకలహంసబకచక్రవాకక్రౌంచాది
నానాజలపక్షికులంబు పద్మకుముదకల్హారహల్లకేందీవరషండ
మండితతరంగమాలికపై విహరించు నందు నపుడు కృష్ణుం డరుణో
దయంబున నంతఃపురంబున మేల్కాంచి మంగళస్నానంబు చేసి దివ్యాం
బరంబులు ధరియించి కస్తూరితిలకంబులు దీర్చి సంధ్యావందనాగ్ని
హోత్రంబు లాచరించి భూసురులకు గోహిరణ్యరత్నవస్త్రాద్యసంఖ్య
వస్తువు లొసంగి తాంబూలఫలపుష్పంబులు సమర్పించి యప్పుడు.

437

సీ.

వెలిదమ్మినిగ్గులు వెదఁజల్లు కన్నుల
                       ధాళధళ్యము ముఖశ్రీల మెఱయ
వజ్రంబు తళుకులవన్నెలు బెళకించు
                       దంతముల్ చిఱునవ్వుతళ్కు లీన
ముఖసౌరభాఘ్రాణమున కాభిముఖ్యంబుఁ
                       జెంది రాణించు నాసికము మెఱయ
మకరకుండలకాంతిమండలంబులచేతఁ
                       బొలుపు గాంచు కపోలములు చెలంగ


తే. గీ.

భక్తజనవాంఛితార్థసంపత్ప్రతాన
చతురచతురోల్లసత్కల్పశాఖిశాఖ
లైన భుజములు లక్ష్మీకరాంబుజాత
కాంకితంబైన పదములు నతిశయిల్ల.

438


సీ.

కాంచననవరత్నఖచితశోభననవ్య
                       దివ్యకిరీట ముద్దీప్తనీల
కుంతలంబులు శుభ్రకుసుమముల్ నవమణి
                       కాంచికాంగదహారకంకణములు
అరుణోపలాంగుళీయకములు సామ
                       గానారవమంజుమంజీరములును
బావనవైజయంతీవనమాలికల్
                       శ్రీవత్సకౌత్సుభచిహ్నములును


తే. గీ.

చారుపీతాంబరము శంఖచక్రశార్ఙ్గ
ముఖ్యదివ్యాయుధములు సముజ్జ్వలాత
సీసుమోల్లానకాంతియుఁ జెలఁగ శౌరి
యర్హచింతామణీపీఠి నధివసించె.

439


వ.

ఇవ్విధంబున సేవ సేయు నుచితజనంబులలో నున్నసమయంబున.

440


సీ.

వైడూర్యముద్రికల్ వజ్రతాటంకముల్
                       కలుకైన పచ్చలకంకణములు
గిలుకుమట్టియలును గెంపులమేఖలల్
                       సొగనైన రత్నాలమొగపుతీగె
సింగారములు చిల్కు సీమంతతిలకంబు
                       చొక్కపుముత్తెపుముక్కరయును
వెన్నెలనిగ్గుల వెదఁజల్లు చేలంబు
                       తగటు చేసిన మంచిబిగువురవికె

తే. గీ.

తళుకుఁగొప్పునఁ బారిజాతప్రసూన
మాలికలు క్రొమ్మెఱుంగుల నెలుఁగుమేను
బెళుకుఁజూపులు చిఱునవ్వు వెలయవచ్చె
సఖులు గొలువంగ రుక్మిణి శౌరికడకు.

441


సీ.

పసిఁడితళ్కులవ్రాఁతపనులలో సిరి గుల్కు
                       చిలుకు చందురుకావివలువ గట్టి
నునుముత్తియములు గూర్చిన పచ్చపట్టుర
                       వికె చన్నుఁగవ డాలు వెలయఁ దొడిగి
మొగులుపై మెఱుఁగు నా సొగసు సంపెంగక్రొ
                       న్ననదండఁ గీలుగంటున ఘటించి
నెమ్మోముబంగారుతమ్మిపై తేఁటినాఁ
                       బొలుపారు కస్తురిబొట్టు పెట్టి


తే. గీ.

యసమశరుతూపులై చూపు లెసఁగఁ బాద
కంజముల నందియల్ ఘలుఘల్లుమనఁగఁ
జెలులు గొల్వంగ శృంగార మలర వచ్చెఁ
జక్రిచెంతకు గుణసీమ సత్యభామ.

442


సీ.

కంకణంబుల కెంపుగములు దాడిమబీజ
                       ములఁ బోలు కీరంబు లెలమిఁ జేర
నీలకభారము మేఘమని తలంపుచు వెంటఁ
                       జాతకంబులు ప్రేమచేతఁ దిరుగ
ముఖపద్మసౌరభంబులు దిక్కులను నిండ
                       మకరందకాంక్ష బంభరము లెనయ
నందియలం గూడు మందయానము చూచి
                       యంచలు నడ నేర్వ నరుగుదేరఁ


తే. గీ.

జారుకుచకుంభయుక్తకస్తూరికాప
టీరకుంకుమవాసనల్ ధారుణీస్థ
లంబు నిండంగ బెళుకునేత్రంబు లలర
జాంబవతి వచ్చె నాయదుస్వామికడకు.

443


తే. గీ.

కనకవర్ణాంగరేఖయుఁ గనకపటము
కనకమాణిక్యభూషలు కనకశుకము
కనకకలశోరుకుచములు గలిగె నిలువు
కనకమై మిత్రవింద యక్కడఁ జెలంగె.

444

తే. గీ.

ధవళనవపుష్పమాలికల్ ధవళపటము
ధవళహారగుళుచ్ఛముల్ ధవళరత్న
వివిధభూషణములు దాల్చి ధవళనేత్రి
నాగ్నజితి వచ్చె రాయంచనడలతోడ.

445


తే. గీ.

భద్రవరదంతికుంభోరుభారసార
భద్రచారుపయోధర భద్ర నిలిచె
భద్రములు కన్నుగవయందుఁ బరిఢవింప
భద్రదారులతాసౌరభములు మెఱసి.

446


క.

ఈక్షణకల్పితవరశుభ
లక్షణయై నవకళావిలాసశ్రీలన్
సాక్షాన్మన్మథసాయక
లక్షితయై కృష్ణుకడకు లక్షణ వచ్చెన్.

447


సీ.

గండుతేఁటులవంటి కల్కిముంగురులును
                       బేడిసలను బోలు బెళుకుకన్ను
లంబుజంబులఁదేటయై మించు నెమ్మోము
                       ఫేనంబుజిగి దలపించు నవ్వు
వరతరంగంబులై వలనొప్పు బాహులు
                       శంఖంబె యని యెంచఁజాలు గళము
మంజులావర్తంబు మన్నించు నాభియు
                       సైకతశ్రీ మించు జఘనలీల


తే. గీ.

కమఠముల నీను మీగాళ్ళు గలిగి సూర్య
బింబసన్నిభరత్నకల్పితవిచిత్ర
కందుకముఁ బూని నవ్యశృంగారరేఖ
పొందు దగఁ జక్రికడకు కాళింది వచ్చె.

448


సీ.

కల్పకవల్లులో కలికిరాయంచలో
                       కామునిశరములో హేమలతలొ
కస్తూరిమెకములో కపురంపుఁదిన్నెలో
                       చక్కెరబొమ్మలో చంద్రకళలో
మరువంపుమొలకలో మాణిక్యకళికలో
                       చిత్తరుప్రతిమలో చిలుకగములొ
సంపెంగదండలో చందనశాఖలో
                       శృంగారరసములో సిరులగనులొ

తే. గీ.

యనఁగఁ బదియాఱువేవు రయ్యబ్జముఖులు
చారుకుచభార కచభార జఘనభార
భరవిలాసకళాకలాపములతోడ
నబ్జనాభునికడ నిల్చి రందమంది.

449


వ.

మఱియు జ్ఞానానందస్వరూపానంతకల్యాణగుణామృతసాగరో
భయభూతినాయక సమస్తచిదచిద్వస్తుశేషభూతుండునైన నమ్ము
కుందుండు దివ్యమాణిక్యసౌధంబున దివ్యచింతామణిపీఠంబునఁ
గోటిమన్మథలావణ్యశుభాకారుండును, గరుణాంతరంగిణీచారువిశాల
నేత్రుండును, నున్నతనాసిసుకుమారకపోలశుభాలంకారకర్ణవిరా
జితుండును, శరత్కాలధవళచంద్రప్రకాశమందహాసుండును,
భక్తజనరక్షణాభయహస్తుండును, జారువక్షస్థలశ్రీవత్సకౌస్తుభ
మాణిక్యమౌక్తికవిచిత్రవైజయంతీపుష్పతులసీవనమాలికా
ధరుండును, మహావర్తగంభీరనాభియు, దివ్యచందనసౌగంధవాసి
తుండును, గంజకింజల్కప్రకాశపీతాంబరధరుండును భక్తజనహృద
యాంధకారనివారకశ్రీపాదనఖచంద్రికావికాసుండును, దివ్య
మాణిక్యఖచితకిరీటమకరకుండలగ్రైవేయకహారకంకణాంగుళీ
యకమేఖలానూపురధరుండును, గోటిసూర్యప్రకాశమానుండును
నైయుండి శేషశేషాసనవిష్వక్సేనాదులును నిజమూర్తులు దాల్చిన
దివ్యాయుధంబులును గొల్వ నివ్విధంబున మాణిక్యస్తంభసహస్రో
జ్జ్వలమంటపంబున విలసిల్లి శ్రీభూనీళాంకలీలలైన రుక్మిణీజాంబవతీ
సత్యభామామిత్రవిందానాగ్నజితీభద్రాలక్షణాకాళిందులు షోడశ
సహస్రరాజకన్యలు విచిత్రాంబరభూషణదివ్యగంధదివ్యమాలికా
లంకృతశోభనాకారరేఖలఁ బయోధరంబుచుట్టును గరచరణాద్య
వయవంబులు దాల్చిన క్రొక్కారుమెఱుంగులో యన యౌవనవిలాస
విభ్రమంబులు మెఱయింపుచుఁ గొందఱు శుభ్రగంగాతరంగశృంగార
మంగళప్రదంబులగు చామరంబులు వీవఁ గొంద ఱకలంకపూర్ణ
శశాంకమండలసహస్రంబులై దీవించు ధవళాతపత్రంబులు పూనఁ
గొందఱు నానారత్నపాత్రల నీరాజనంబు లర్పింపఁ గొందఱు సనాళ
సువర్ణకమలంబులు ద్రిప్పుచు మెఱయించఁ గొందఱు నవరత్నకందు
కంబులును గుసుమకందుకంబులును నానావిచిత్రఫలంబులును

గరంబులం గీలించి యొకవింతయొయారంబు చూపఁ గొందఱు
నవరత్నకీలితకంకణహస్తంబులపై శుకశారికాదులు నిడుకొని హరి
నామాంకమధురగీతంబులు పాడింపఁ గొందఱు తాంబూలపేటికలు
వహించుకొని యగ్రంబున నిలువఁ గొందఱు కర్పూరాగరుధూపంబులు
వాసింప నివ్విధంబున నొడ్డోలగంబై యుండ నమ్మండపంబుదగ్గర
సనకసనందనసనత్కుమారసనత్సుజాతులు స్తోత్రంబులు సేయఁ
దుంబురునారదాదులు మధురగీతంబులు పాడ, బ్రహ్మరుద్రులు జయ
జయస్తవంబు లొనరింప నింద్రాద్యష్టదిక్పాలకులు సేవింప రంభో
ర్వశీమేనకాద్యప్సరసస్త్రీలు నృత్యంబులు సలుప వందిమాగధ
రూపంబుల ననంతవేదంబులు కైవారంబులు సేయ సిద్ధసాధ్యగరుడ
గంధర్వకిన్నరకింపురుషయక్షాదిసకలదేవతలు గొలువ నంగవంగ
కళింగమరుకాశ్మీరకాంభోజశకకుళిందమద్రగాంధారకేకయ
ద్రవిళవరాటఘూర్జరసింధుభోటలాటవిదర్భనిషధేశ్వరాదులైన
రాజులు పార్శ్వంబుల మెఱయ నుద్ధవాక్రూరసాత్యకిచేకితానకృత
వర్మభీమార్జుననకులసహదేవప్రద్యుమ్నసాంబముఖ్యానేకబంధు
వర్గకుమారవర్గంబులు సువర్ణవేత్రహస్తులై బరాబరులు సేయ నివ్విధం
బున శ్రీకృష్ణుండు నిత్యమహోత్సవంబుల భక్తజనులకు ననిష్ట
నివృత్తియు నిష్టప్రాప్తియు నొసంగుచునుండె సమస్తశ్రీలు
మెఱయ.

450

షష్ఠ్యంతములు

క.

ఏవంవిధశుభగుణల
క్ష్మీవరవాస్తునకు నుగ్రచేదిపతి మహా
గోవర్ధనశస్తునకున్
గోవర్ధనధారణానుగుణహస్తునకున్.

451


క.

బృందావనతులసీమక
రందాంచితలాస్యహేతురంగునకు ధృతా
మందాప్తతురంగునకున్
నంధాతారాతివీరచతురంగునకున్.

452

క.

ఉన్నతశుభరేఖాంచిత
పన్నతసురలోకసార్వభౌమున కురుసం
పన్నానటదాగ్రహకిం
చిన్నేత్రారుణ్యమాత్రజితభౌమునకున్.

453


క.

సంగరరంగమహోద్భట
రంగద్గాంగేయసంగరవినిర్వాహా
భంగసహస్రారధృతికి
మాంగల్వకలావిలాసమహితాకృతికిన్.

454


క.

ముచికుందవరదునకు నతి
రుచికుందముకుళవికాసరుచిరదనునకున్
కుచరసరోషనిశాటీ
కుచరసపానామృతైకగుణభరితునకున్.

455


వ.

సమర్పితంబుగా నా యొనర్పం బూనిన నారదీయపురాణమునకుఁ
గథాప్రారంభం బెట్టిదనిన.

456

కథాప్రారంభము

మునులు నారాయణుని సందర్శించుట

సీ.

వకుళపున్నాగకేతకినింబజంబీర
                       పనసబిల్వకపిత్థబదరికాక
దంబసాలార్జునదాడిమీనారంగ
                       మాతులుంగలవంగమరువకామ్ర
ఖదిరభల్లాతకీగాలవచందన
                       పారిజాతనమేరుపారిభద్ర
దారుశిరీషపాటలితాళజంబూత
                       మాలయూధీకుందమదనచంప


తే. గీ.

కాదినానామహీజసమగ్రమంజు
మల్లికాకుంజపుంజనిర్మత్సరోగ్ర
సర్వసంతానసంతతాశ్రయవిశేష
గణ్యమైనట్టి నైమిశారణ్యమునను.

457

సీ.

కపిల వసిష్ఠ మార్కండేయ కశ్యప
                       కౌశిక శౌనక గౌతమాత్రి
జమదగ్ని మను కుంభజాత భారద్వాజ
                       వాల్మీకి భార్గవ వామదేవ
జాబాలి కుత్స వైశంపాయన క్రతు
                       దక్షపులస్త్య మౌద్గల్య పులహ
గర్గ పిప్పల జహ్ను కణ్వ పరాశర
                       శుక దాల్భ్య గాధి కుశికమృకండు


తే. గీ.

వత్సరోమశ శారద్వ తౌత్సరేఖ
గాలవ వ్యాస పరతంతు కదవదండ
పర్వతాంగీరసద్రోణబైధచరక
శృంగిముఖ్యమహామునిశ్రేణి యపుడు.

458


క.

అనుపమమతి నేకాంతం
బున నందఱుఁ గూడి పోయి బోధకళాశో
భను ఘను నారాయణు నా
ద్యునిఁ గని తా బదరికాశ్రమోత్తమసీమన్.

459


వ.

కని వేదపఠనపరాయణుండైన నారాయణునకు దండప్రణామం
బాచరించి నరునకు వందనం బొనర్చి వినుతించి యిట్లనిరి. ప్రతి
యుగంబున మౌనివై జనియించి విష్ణుభక్తి వెలయు నిన్ను నేమని
వినుతించువారము; శ్రీనారాయణ సర్వవేదార్థతత్త్వనిర్ణేతవు
నీవే యని స్తుత్యుండును స్తవప్రియుండును నగు నతనితో మఱియు
నిట్లని వినుతించి రప్పుడు.

460


తే. గీ.

స్వామి నారాయణ రమేశ చక్రహస్త
శౌరి మ్రొక్కెదమయ్య మీచరణములకు
సర్వశేషివి సర్వరక్షకుఁడ వీవె
యీవు దక్కంగఁ బరమాత్మ యెవ్వఁ డరయ.

461


క.

జననీజనకసహస్రం
బునకంటెను వత్సలత్వమున జనులకు జీ
వనమైతి వస్మదవలం
బన మయ్యెన్ నీదుకరుణ పరమాత్మ హరీ.

462

క.

భవసంతాపహరు శ్రీ
ధవు నిన్ను భజించి పరమధామములో గౌ
రవ మంది నిత్యసూరి
ప్రపరులతోఁ గూడియుండ్రు పావనమూర్తుల్.

463


మ.

శరతూలం బనలంబు సోఁకినయెడన్ సందగ్ధమై పోవున
ట్లురుదుర్వారతరౌఘజాలములు మాయున్ నిన్ను నీక్షింప నో
పరమోత్తంస రమాధినాథ కరుణాపాత్ర ప్రసన్నాత్మ దృ
క్పరిపూర్తిన్ మముఁ జూడు మీపదము సంభావ్యంబు మా కెప్పుడున్.

464


క.

అని వినుతించు మునీంద్రులఁ
గని పురుషోత్తముఁడు వారిఁ గరుణించి సుశో
భనమధురవచోవిస్తర
మునఁ బల్కెఁ దదీయహృదయములు గరఁగంగన్.

465


సీ.

స్వాగతంబే మీకు సంయమివరులార
                       సుఖము మీకే మిమ్ముఁ జూచినపుడె
యానందమందితి నరయ మద్భక్తులే
                       మత్ప్రాణములు జగన్మహితయోగి
వరజనశ్రేష్ఠులు వాత్సల్యగుణనిధుల్
                       పరమలాభంబ తత్ప్రాప్తి మీకు
యుష్మదాగమనమహోద్యమంబునకుఁ గా
                       ర్యం బెఱింగించుఁ డత్యంతభక్తి


తే. గీ.

సంశ్రితత్రాణమునకునై సకలరూప
ములు వహింపుదు నని కృపఁ బలుక వారు
ఘనుఁ బరాశరసూనునిఁ గాంచి సన్న
చేసి నియమింప నమ్మౌనిసింహుఁ డనియె.

466


వ.

స్వామీ! నీయష్టాక్షరాత్మకంబైన మంత్రంబు పరమమంత్రంబు తన్మం
త్రోపదేష్టవు నీవు గాన నేము నీశిష్యులము. దేవదేవుండవు నీవె.
గురుండవు నీవె. తల్లివి నీవె. తండ్రివి నీవె. శ్రీమన్నారాయణా! నీకంటెఁ
బరమబంధుండు గలఁడే. ఎఱుఁగని యది యెఱింగించుటయుఁ బ్రవ
ర్తింపఁజేయుటయు నీకే తగును. నీవే సమర్థుండవు. సర్వంబు నీచేతనే
తెలియవలయు. పరమధామంబులలో దోషనిర్ముక్తంబైన స్థానం బెయ్యది
యని విన్నవించిన భగవంతుఁ డిట్లనియె.

467

నారాయణగిరి మహత్వము

క.

నారాయణగిరి యన సం
సారార్ణవతారకంబు సహ్యగిరికిఁ దూ
ర్పైరహిఁ దగు నొకగిరి పు
ణ్యోరుస్థితి సహ్యనందనోత్తరసీమన్.

468


క.

అది దక్షిణదేశంబునఁ
ద్రిదశులకు నగణ్యమై నుతింపఁగ వెలయున్
విదితభవదుఃఖసాగర
పదసేతువులైన శృంగపటలంబులచేన్.

469


తే. గీ.

కర్మలాలసుఁ డైనట్టి ఘనుఁడు తద్ద
రాధరంబున మాధవార్చనము చేసి
తపముఁ గావించెనేని యుత్తమపదమున
సతతసంపూర్ణకాముఁడై సంచరించు.

470


మ.

ఉపదేశం బొనరింప నే నిలుతు నయ్యుర్వీధరాగ్రంబునం
దపరిచ్ఛిన్నసమస్తధర్మహృదయం బామ్నాయసల్లోచనం
బపవర్గప్రథమాంకురంబు మునివిద్యాతత్త్వసర్వస్వ మ
ర్హపవిత్రంబు దలింప నగ్గిరియె లోకంబుల్ ప్రశంసింపఁగన్.

471


వ.

దక్షిణోత్తరభేదంబున నాకు రెండాశ్రమంబులు గలవు సర్వోత్తరంబులు.
ఆధిక్యంబున నదియ సర్వోత్తరగిరి యగు గుణత్రయభేదంబున నరుల
కుం బ్రకృతి భిన్నంబైన నారాయణాద్రినిష్ఠులకు రజస్తమోగుణం
బులు లేవు వినుండు.

472


తే. గీ.

జగతి శ్రీరంగమున శేషశైలమునను
బదరికాశ్రమసీమను బరమపదము
నందు నేవేడ్క జనియించు నట్టివేడ్క
యమ్మహాగిరి నాకుఁ దథ్యమునఁ గలదు.

473


ఆ. వె.

శేషవృత్తి నడుచు శేషుఁ డయ్యద్రి న
శేషశేషియై విశేష మందు
శ్రీనివాసునకును శేషాశనముఖుల
తోడ సేవ సేయు నాఁడు నేఁడు.

474

ఆ. వె.

ఆదిమై ననంతుఁ డయ్యె లక్ష్మణుఁ డయ్యె
నంతట బలభద్రుఁ డయ్యె నింకఁ
గలియుగమున నొక్కఘనయోగివర్యుండు
గాఁగలండు దేవగణము లెంచ.

475


తే. గీ.

రామకృష్ణులు నన్ను నిరంతరంబు
నచటఁ బూజించి కొలువ విఖ్యాతమయ్యె
జగతి నగ్గిరి యాదవశైల మనఁగ
శేషశుభమూర్తిని సహస్రశిఖరములను.

476


వ.

వైకుంఠాద్యచ్యుతస్థానలోకసారంబైన యాయదుశైలంబు సేవించిన
సమస్తమదీయస్థానంబులు సేవించినయట్లగు.

477


తే. గీ.

ఆద్యులగు శేషశేషాశనాదులైన
పరమవైకుంఠవాసు లాపర్వతమునఁ
దిర్యగచరస్వరూపముల్ తెలివి దాల్చి
సంతసంబునఁ బ్రేమ వర్తింతు రెలమి.

478


తే. గీ.

అందుఁ బ్రాకృతమనుజమృగాండజాది
సముదయంబులఁ గొంతదూరమునఁ గాంచి
ఘోరదుర్వారయమభటకోటులెల్లఁ
దొలఁగి మ్రొక్కుచు నపుఁ డేగుదురు భయమున.

479


తే. గీ.

యాదవాద్రికి నేఁగెద ననుచు నాత్మ
యందు నూహించు నరుఁడు నిత్యము వసించు
నట్టిదేశంబు చొరఁగ భయంబు నొంది
దూరమున కేఁగుదురు యమదూతవరులు.

480


సీ.

అటుగాన మీర లయ్యద్రిపైఁ గల్యాణ
                       తీర్థంబ గలదు నాతీర్థమునను
బుద్ధిమై మునిఁగి నమిద్దభవాంభోధి
                       దాఁటెద రదియె పుణ్యతరధామ
మాపుష్కరంబు సురాపగాయమునలు
                       వ్యాపించు నయ్యద్రి నణఁగు బ్రహ్మ
హత్యాదిపాపంబు లధికనాస్తికకృత
                       ఘ్నమఘవిఘ్నప్రదామ్నాయ పాశ(ద)

తే. గీ.

దూషక పరాంగనాసక్త ధూర్త పరధ
నాపహారక పాపభేదానురక్త
పరవినిందానిజస్తుతిప్రవణులేని
ముక్తు లగుదురు దోషనిర్ముక్తు లగుచు.

481


సీ.

పాషండశాస్త్రతత్పరులు శూద్రాన్నభ
                       క్షకులు శునకవరాహకృకవాకు
రక్షకుల్ కర్మవిక్రయపరుల్ శ్రాద్ధభో
                       క్తలు గ్రామయాచకుల్ దైవతస్వ
హరులు దుర్గర్వదంభాదిసంయుతులు ని
                       రంతరకనకవాసాభిరతులు
రాజసేవైకకర్మఠు లాత్మకన్యకా
                       విక్రయపరులు దుర్వర్తచరులు


తే. గీ.

కాకవృత్తులు గోక్లేశకరణపరులు
విప్రనిందక హరిభక్తి వరహిత శర
ణాగతద్రోహ వృషవిధవాసుచిత్ర
ముఖులు దద్గిరి సేవించి ముక్తిఁ గండ్రు.

482


తే. గీ.

ప్రబలతరమైన తద్గిరీంద్రమున కనతి
దూరమునఁ బుణ్యసంపదపారమహిమఁ
బరఁగు నరసింహభూధరప్రవర మతిప
విత్రుఁగాఁ జేయుఁ జూడ నపాత్రునైన.

483


క.

ఆయెడ నతిభక్తిపరుం
డై యాప్రహ్లాదుఁ డతిగుణాఢ్యుఁడు సులభో
పాయకృతనిఖిలలోక
శ్రేయంబుగ నన్ను శ్రీనృసింహుని నిలిపెన్.

484


తే. గీ.

అఖిలలోకోన్నతంబైన యన్నగంబు
మీఁదికెక్కిన మనుజుఁ డమేయదుర్ని
వారసంసారసాగరావర్తములను
మునుఁగఁ డెన్నఁడుఁ దన్మహాఘనత దెలిసి.

485


క.

కల దొకయశ్వత్థ మమృత
ఫలమై కల్యాణతీర్థపశ్చిమసీమ
స్థలినిఁ జతుర్వర్గదమై
యలఘుతరజ్ఞానదారకాహ్వయ మగుచున్.

486

తే. గీ.

అంబరీష వికుక్షి రుక్మాంగద శుక
పుండరీకులు మున్ను దద్భూరిసౌఖ్య
మనుభవించిరి తద్భక్తజనుల కేవు
రకు నిజస్థాన మది రమ్య మకలుషంబు.

487


క.

పొగడిన వరాహమూర్తగు
భగవంతుని భూమిఁ గాంచి పరమరహస్యం
బగు శ్లోకద్వయ మచ్చటి
నిగమశిఖార్థయుతమున్ మనీష నొసంగెన్.

488


వ.

ఆవరాహచరమశ్లోకంబులు రెండు నివి:


శ్లో.

స్థితే మనసి సుస్వస్థే శరీరే సతియోనరః
ధాతుసామ్యేస్థితేస్మర్తా విశ్వరూపంచ మామజమ్.


శ్లో.

తతస్తంమ్రియ మాణంతు కాష్ఠ పాషాణ సన్నిభమ్
అహం స్మరామి మద్భక్తం నయామి పరమాంగతిమ్.

489


తే. గీ.

అదియె వైకుంఠవర్ధనం బనఁగఁ దగిన
యనఘమగు యోజనద్వయ మన్నియెడలఁ
దన్మహాక్షేత్ర మెంతపర్యంత మక్షి
గోచరం బగు నది వేగఁ గూర్చు ముక్తి.

490


శా.

అం దానందమయం బనా నొకవిమానాగ్రేసరం బొప్పు శ్రీ
కందంబై పరిశుద్ధసత్త్వమయమై కల్యాణమై మ్రొక్కినన్
జిందున్ బాపము లంటఁ దాపము విసర్జించున్ బ్రశంసించినన్
గుందుం దుష్టరజస్తమోగుణనిజాంకూరోగ్రసంసారముల్.

491


ఆ. వె.

ఆది కృతయుగంబునందు వైకుంఠమ
ధ్యమున నుండి తానె యరుగుదెంచె
నవ్విమానరాజ మౌర మత్సంకల్ప
మహిమ లోకసజ్జనహితముగను.

492


వ.

విమానపశ్చాద్భాగంబునఁ బ్రాకారమధ్యంబున సుదర్శనమును
లక్ష్మియు సర్వకామంబుల నిచ్చుచుండు మఱియును.

493

చ.

మనుజుఁడు తద్విమానపరిమార్జన సేచన ధూపదీపమం
డనము లొనర్చెనేని ప్రకటస్థితమై ధవళాతపత్ర వీ
జనచతురంతయాన ధనసంపద గైకొని పుత్రపౌత్రవ
ర్ధనమునఁ జక్రవర్తి యయి ధారుణి నేలి విముక్తుఁడౌఁ దుదిన్.

494


సీ.

ఫాలభాగముననె పరమభాగవతస
                       త్తము లూర్థ్వపుండ్ర మత్యంతనియతి
ధరియింతు రవయవస్థలముల నన్యంబు
                       లందునేని వహింతు రతిశయమున
వారి సంశుద్ధభావంబు విలోకించి
                       వెఱతురు దానవుల్ మఱియుఁ బ్రేత
భూతపిశాచోగ్రబేతాళజాతులు
                       నిలువ రగ్రంబున నిబిడశక్తిఁ


తే. గీ.

దెల్లదీవిని శ్వేతమృత్తిక హరించి
తెచ్చి మచ్ఛాసనంబున దివ్యనగము
నందు ఖగభర్త యొకగని నది యొసంగెఁ
దన్మహత్వంబు సెప్పఁ జిత్రంబు గాదె.

495


వ.

సత్త్వప్రకృతిశుద్ధమృత్తికయు శుద్ధము తద్దివ్యస్థానంబును శుద్ధసత్త్వ
మయంబు.

496


మ.

యదుశైలాగ్రశిఖాంతరంబున జగంబౌ నౌననం గామిత
ప్రదయై నిర్ఝరధార యొకటి ప్రదీప్తశ్రీమహాపాపగ
ర్వదయై లోకములెల్ల నెన్నికొనఁగా వైకుంఠగంగాఖ్యయై
పొదలు న్విష్ణుపదంబునన్ వెడలి యీభూమిన్ విజృంభింపుచున్.

497

యాదవశైలము - అచటి విశేషములు

క.

తత్తీరావాసంబునఁ
దత్తోయస్నానదానతర్పణవిధులున్
దత్తత్త్వస్తోత్రంబును
జిత్తస్థితిఁ జేసెనేని చేకురు ఫలముల్.

498

సీ.

ఆత్రివిక్రముని పాదాంభోరుహంబు పం
                       కజసంభవుఁడు మున్ను గడిగినట్టి
తద్వారిధార యంధకవైరి వరమౌళి
                       మాలికయై నేల వ్రాలకున్న
వైకుంఠనగరాధివాసులు కృష్ణతీ
                       ర్థాభిలాషం బాత్మయందుఁ బొడమ
విరజాజలముఁ దెచ్చి తిరుగఁ దత్పాదాంబు
                       జాతంబునకును సంక్షాళనంబు


తే. గీ.

సేయఁ దత్తీర్థమెల్ల నీశిఖరరాజ
పార్శ్వమునఁ బ్రవహించి సుపర్వపర్వ
కల్పనాశక్తి వైకుంఠగంగ యనఁగ
సిద్ధసంకల్పు లెంచఁ బ్రసిద్ధి గాంచె.

499


తే. గీ.

భక్తిసార మహాయోగి భర్త మత్ప
దాంబుజస్తోత్రపాత్రుఁ డత్యంతనియతిఁ
దత్తటంబున నన్నుఁ జిత్తమున నిలిపి
ధ్యాన మొనరించి వైకుంఠధామ మందె.

500


వ.

మఱియు నావైకుంఠగంగాతీర్థంబు పైఁ బ్రోక్షించుకొనినన్ గామాది
దోషంబులు దొలంగి శమదమాదిసద్గుణంబులు సంభవింప నపవర్గంబు
నొందించుటం జేసి యది యుత్తమస్థానంబు గదా! ఆనయన
స్థానంబున నారాయణహ్రదంబను పుణ్యతీర్థంబు గలదు. తత్తీరంబునం
బునశ్చరణం బొనర్చిన వేగంబె మంత్రసిద్ధి యగు. తద్దర్శనమాత్రం
బునం గ్లేశంబు లడంగు. తద్ధ్యానంబు జేసిన విముక్తుం డగు. విష్ణు
చిత్తుండు నారాయణపదద్వయశరణాగతుండై యచ్చట పరమ
ధామంబు చేరె. నారాయణహ్రదస్నానంబున నరకాంగారకనాశన
మండ్రు. అందున నంత్యంబున హరిస్మరణంబు సేయ బుద్ది వొడమించు.
ఈనారాయణహ్రదంబునకు దక్షిణంబునఁ గల్యాణతీర్థంబునకు
నుత్తరంబునఁ బారాశరతీర్థంబు గలదు. మన్నియోగంబుచే మద్భక్తుం
డగు పారాశర్యుండు విష్ణుపురాణంబుఁ దత్తటంబున రచియించె. దాని
దక్షిణదేశస్థులు మైత్రేయకుండం బండ్రు. తచ్ఛైలోత్తరభాగంబున
యజ్ఞవృక్షపరీతంబై యాదవమహానది ప్రవహించినయది. ఇందు

ఖదిరపలాశసమిజ్జాలంబులచే యజనంబు చేసినఁ బరమపదంబు
లభించు. తత్తీరంబునందు యాదవేంద్రుండను నతండు తపంబు చేసి
యింద్రపదంబు నొంది పిడపం గైవల్యంబుఁ గాంచె. అయ్యాదవగిరి
దక్షిణపార్శ్వంబునఁ బరిధానశిల గల దాశిలకుం బ్రణామం బాచరించిన
వారికి సురాసురులు ప్రణామంబులు సేయుదురు. శిల శుద్ధసత్త్వ
మూర్తి గాన స్పృశించిన సత్త్వగుణము వొడము. ఐశానపాషండ
కాణాదులు భూమియందు వక్రవచనక్రమంబున వేదంబులు దూషించిన
నామ్నాయంబులు శిష్యులుగా నేను మానుషరూపంబున దత్తాత్రే
యుండనై త్రిదండధారినై యందుఁ గాషాయంబులుగాఁ జేసిన మత్పరి
ధానంబుచే శిల పరిధానశిల యయ్యె. అచ్చట నరులు కాషాయశాటికా
పరిగ్రహంబు చేసిన వారి ననుఁగా భావించి వందనంబు సేయందగు.
మద్భక్తులలో నుత్తమోత్తములు వారు. శిష్యులకు వేదం బర్థయుక్తం
బుగా నెచ్చట నే నుపదేశించితి నది వేదపుష్కరిణి యండ్రు. యాదవ
నగాసన్నభూమిని వేదపుష్కరిణి పశ్చిమభాగంబున దర్భతీర్థంబు
గలదు. మహత్తరదర్భప్రరోహంబులందు జనియింప నేను సన్న్యాసి
రూపంబు గైకొని నాదు తద్దర్భసంగ్రహం బెచ్చట నొనర్చితి నది
దర్భతీర్థంబు. సమస్తపంచరాత్రంబును నెవ్వండు ప్రవర్తకుండు,
ఎవ్వనిచేఁ బాంచకాలికధర్మంబు విశదంబుగాఁ జేయఁబడియె నట్టి
శాండిల్యుం డచ్చట నన్ను నారాధించె నది ప్రసిద్ధక్షేత్రంబు. తత్రత్య
దర్భశయ్యాశ్రితులై సంసారధర్మంబు విడుచువా రంత్యంబున విముక్తు
లగుదు రచ్చట.

501


తే. గీ.

తద్గిరీంద్రము దక్షిణస్థలమునందుఁ
గలదు తీర్థోత్తమంబు విఖ్యాతమహిమ
నమరమునులు పలాశతీర్థ మని దాని
సన్నుతించిరి ధారుణీస్థలమునందు.

502


క.

పాత్రత్వ ముడిగి విశ్వా
మిత్రమహాశాపవహ్ని మిడుకఁగఁ బుణ్య
క్షేత్రం బిదియె వసిష్ఠుని
పుత్రులఁ బావనము చేసెఁ బూని మదాజ్ఞన్.

503

శా.

తత్తీర్థోత్తరసీమ మించు నొకవింతన్ బద్మతీర్థంబు రా
జత్తోయోత్థితఫుల్లహల్లకవనీసంపన్నమై సద్గుణో
దాత్తుండైన సనత్కుమారుఁడు తదుద్యత్పద్మపూజన్ సుప
ర్వోత్తంసంబు ననున్ భజించె సనకాదుల్ వెంట సేవింపఁగన్.

504


ఆ. వె.

జగతిఁ బద్మతీర్థసంపుల్లపద్మాక్ష
మణికలాపదివ్యమాలికాంక
కంఠులైనవారు ఘనులు వైకుంఠోప
కంఠసౌధవీథిఁ గాంతు రెలమి.

505


మ.

ఘనమై పావనమై విశుద్ధతరమై కల్యాణతీర్థంబుచు
ట్టును గానంబడి యష్టతీర్థి దగ నేఁడు న్నాఁడు చూపట్టి య
మ్మనురాజంబున యోగులున్ బుధులు సమ్యగ్భక్తిఁ గీర్తించు నం
తనె సిద్ధించు నభీష్టముల్ మునిఁగినం బ్రాపించవే పుణ్యముల్.

506


తే. గీ.

సర్వతీర్థములందుఁ బ్రశస్త మట్టి
తీర్థ మేతన్మహాతీర్థతీరసార
తులసికాకాండమణిభూష వెలమిఁ దాల్చు
ఘనులఁ జూడ మహాపాతకములు దొలఁగు.

507


సీ.

జనుఁడు స్థానాంతరంబునఁ జేయు పుణ్యంబు
                       లెలయఁ బుణ్యక్షేత్రముల నొనర్పఁ
దద్దశగుణమయి తనరు పుణ్యక్షేత్ర
                       కల్పితపుణ్యసంఘముల మించు
పుష్కరంబునఁ జేయు పుణ్యంబు తచ్ఛత
                       గుణమయి పుష్కరగణితపుణ్య
మునకంటెను బ్రయోగమున సహస్రగుణమై
                       చెలఁగు పుణ్యము మహర్షిక్షేత్రమునను


తే. గీ.

గోటిగుణమగు బుణ్యంబు సూటిగ శత
కోటిపుణ్యంబు యాదవక్షోణిధరము
నందు మద్భక్తసన్నిధి నయ్యెనేని
కోటికోటిగుణము పుణ్యకోటు లెంచ.

508

వ.

యాదవాద్రికిం గాపుగా సుదర్శనపురుషుండు తిరుగు. యాదవశైలా
సక్తులగు మద్భక్తులం బీడించువారి దత్సుదర్శనజ్వాలామాలిక శల
భంబులంగాఁ జేయు ద్వాపరాంతంబునం గలిపురుషం డచ్చటికి రా నుపక్ర
మింప వేత్రదండధరులైన యమకింకరులు వారింపుదురు. వత్సరంబేని
పక్షంలేని పక్షార్ధంబేని త్రిరాత్రంబేని యేకరాత్రంబేని యదుగిరి నున్న
యతండే మద్భక్తుం డన్యుండు గాఁడు. ఫాల్గునియందు యామంబేని,
తదర్థంబేని నన్ను నాయాదవాద్రిని సేవించినవాని జననిస్తనంధయు
నింబోలె నను వర్తింపుదురు గాన మీ రచటికి నేఁగి నన్నుఁ బూజించి
పరమభక్తులై సంస్కృతి తరింపఁగలరని ధర్మపరాయణులు ధర్మంబు
లార్జించి పునర్జన్మంబు లొందుదురు గాని యాదవాద్రినివాసులైన
వారికిఁ బునర్జన్మంబులు లేవని భగవంతుఁ డానతిచ్చిన మునులు దండ
ప్రణామంబులు చేసి మాకుఁ బరమబంధుండవును పరమగతియు నీవే
యని విన్నవించినప్పుడు.

509


క.

సంక్షేపంబున నస్మ
త్కాంక్ష నివర్తింప దఖిలకలికర్దమని
స్సంక్షాళనంబు సేయు ని
దం క్షేత్రము మహిమ మాకుఁ దగఁ దెలుపు దయన్.

510


వ.

అనిన.

511


క.

మును పద్మభవునివలనన్
సనత్కుమారుండు దెలిసి సమ్మతిఁ దచ్ఛై
లనమహిమ నారదునకున్
ననుపమసద్భక్తి దెలిపె నతిహర్షమునన్.

512


వ.

ఆనారదుండు నీకు సవిస్తరంబున బోధించునని భగవంతుం డానతి
యిచ్చి యంతర్ధానంబు నొందె నంత.

513


ఉ.

మాలిక మాలికాభరణమన్మథ మన్మథయోగిహృన్మణీ
శాలిక శాలికామదవిశాలదృగంచలనూత్నచంద్రశా
బాలిక బాలికాజనరతాయనవచ్యుతమాలికాగ్రకం
కేలిక కేళికావనరగీత వినీతసుధాము ధాము దా.

514

క.

వసుదేవదేవకీసుత
కుసుమాయుధజనక వృష్ణికులమణిదావ
గ్రసనదురాసదభక్త
వ్యసననిరసనప్రభావవర్థితచరితా!

515


కవిరాజవిరాజితము.

యదుకులభూషణ శోభితవైభవ యర్జునసారధి యోగినుతా
మదయుతచేదిమవారణసింహ సమస్తజగత్పరిపూర్ణయశా
త్రిదశజనావనపావనశీల సుధీజనమానసహంసవర
ప్రదగత సాంబముఖాఖిలసేవితభవ్యమహోదయ నందనుతా!

516

గద్యము
ఇది శ్రీమత్కంజర్ల కొండమాచార్య
పాదారవిందమిళిందాయమాన చెన్నయామాత్యపుత్ర,
కశ్యపగోత్రపవిత్ర శ్రీమదల్లాడు నరసింహ ప్రణీతంబైన
నారదీయపురాణంబునందుఁ బ్రథమాశ్వాసము.

  1. వక్రము
  2. వేడ్కంబి
  3. నిల్వుతన్
  4. త్కథ్వాంత
  5. ప్రకరుల యెదుటను
  6. పరిఘ
  7. పించ
  8. జలధిలో దారవొత్త ఉచ్చైశ్రవంబు
  9. వాఁడె (సానుస్వారము)
  10. యేఁగె (సానుస్వారము)
  11. నిక్కట
  12. యార్భట
  13. చింత యింతికి
  14. చారుపయ్యెద
  15. నలదండ లపుడు కొప్పున
  16. రవికె చన్నుల మించ నలవరించు
  17. భుజులం జేసె
  18. మాన్యుండమై
  19. బాత్రములెల్ల
  20. ద్రోచిన్మారుతము
  21. నమ్ములు = నెమళ్ళు
  22. త్స్నానపూరము పొంగె
  23. చైత్రకుసుమాయుధ
  24. మ్రోకగమి
  25. భాక్కలాప
  26. యతి కుదురుట లేదు
  27. సతీతతి యొసఁగెన్
  28. దము మూఁగిన
  29. కొమ్ములు
  30. తద్వ్రతవధూపుంజ
  31. యతి తప్పినది.
  32. యతి తప్పినది.
  33. ముడిసి ముడిసి
  34. యతి చింత్యము
  35. దేదివ్యమాన..............శ్రీ లమర మహిమ మెఱసి
  36. ధునిఁ గని భవత్కళా
  37. నర్తను (పా)
  38. ఈపద్యభావము విశదముగా లేదు.
  39. పాఠము అర్థవంతముగా లేదు.
  40. సంధ్యుండు (పా)