నానకు చరిత్ర/షష్ఠాధ్యాయము

వికీసోర్స్ నుండి

శ్రీ

నానకు చరిత్ర.

షష్ఠాధ్యాయము.

మర్దనుడు గురువును వీడ్కొని తాల్వెండీగ్రామమునకు బోయెను. ఆగ్రామవాసులు వానిరాకకు సంతసించి నానకునుగూర్చి మిక్కిలి యాత్రముతో నెన్నోప్రశ్న లడగజొచ్చిరి. మర్దనునకంటె ముందు పదునైదుదినముల క్రిందట బలుడు తాల్వెండికిబోయెను. నానకుతండ్రి యదివఱకే తన కుమారుడు సన్యాసులలో గలిసిపోయినాడని విని యామాట నిజమో యబద్ధమో కనుగొనుటకు బలునికడకుబోయెను. అది యదార్థమే యని బలుడు పలుకటయు భగ్నమనోరధుడగు కాళుడు కాళునికంటె నెక్కుడుగ ద్రిప్తాదేవియు మితిలేని నగపునొందిరి. కాళుడు పుత్రస్నేహము కతమున మనశ్శాంతి గోల్పోయి నిరపరాధుడగు నాకాపుకొడుకును జూచిన చోటనెల్ల దిట్టుచు దనకుమారునిపాలిటి దుష్టగ్రహమనియు దన కొంపదీసిన వాడనియు దు:ఖింపజొచ్చెను. కాళుడు, పుత్రుని దెస నాస విడిచియు మరల నతడు సంసారమును స్వీకరింపడని మనంబున నెఱింగియు నెవరిప్రోత్సాహముచేతనైన బలుడు విడిచిపోయినపిదప బుద్ధిమంతుడై సం సారమున వెండియు బ్రవేశించి యుండకూడదా యని కొంత లేనిపోని యాసపెట్టుకొని మర్దనుడు గ్రామమునకు రాగానే బలునికంటె వాడు బుద్ధిమంతుడని భావించి వాడు సుతుని విషయమున నేదైన మేలువాతన్ చెప్పునేమోయని భ్రమపడి వానినిం గలిసికొని నానకు వైరాగ్యమునుగూర్చి యనేకప్రశ్నము లడిగెను. తనయునిగూర్చి కాళుడు విన్నదంతయు యధార్థమని మర్దనుడు ప్రత్యుత్తరము చెప్పెను. అది విన్నతోడనే కాళునియొడలు జల్లుమనెను. మొగము తెల్లవారెను. మర్దనుడు కాళునిమాటలకు బదులుచెప్పునప్పుడు నిర్భయముగను జ్ఞానగర్భితముగను మాటలాడెను; మొదట కాళుడే తనయునివాతన్ యరసివచ్చుటకు మర్దనుని బుత్తెంచెనని చదువరు లెఱుంగుదురుగదా! మర్దనుడు తన యుదరపోషనార్థము గానవిద్య నేర్చుకొన్నవాడయ్యు గురునానకుతో గొన్నినాళ్లు సహవాసముచేయు నప్పటికి వానికిస్వలాభ పరాయణత యైహికవిషయాసక్తిదవ్వులయ్యెను. పారమార్థిక చింతప్రబలెను. తనవలెనే పుత్రుడు సంసారతంత్రములో దగుల్కొని నట్లు చేయవలయునని ప్రయత్నించుచున్న కాళునిచేష్టలయందతని కేవ గలిగెను. దయాళువు లోకబాంధవుడు నగు భగవంతుడు డొకడున్నవాడనియు వానిసేవయేమానవునకుప్రథమకృత్యమనియు నతడు తెలిసికొనెను. తెలిసికొని తన్ను పంపినయజమానికంటె మర్దనుడు జ్ఞానియయ్యె నానకుయొక్క ని శ్చలభక్తిని శాంతమును మనోధైర్యమును భూతదయను జూచినవారందరిదివఱ కెంతభక్తిహీనులైనను తప్పక భక్తితత్పరులగుదురు. అందుచేతనే మర్దనుడు స్వలాభాన్వేషిగాక నానకునకుశిష్యుడయ్యెను. పుత్రుడు చెడిపోయినాడని దు:ఖితుడైన కాళుని మర్దను డూరడించి గుణత్నాకరుడగు నట్టికుమారుడు గర్భమున జనించినందున దన్నుధనుడుగా భావించుకొనక విచారించుట యవివేకమనియు వానికుమారుడు లోకసామాన్యుడు కాడనియు శ్రీకృష్ణుని యవతారమనియు సూర్యచంద్రుల యంశమున బుట్టెననియు మఱియు బెక్కుభంగుల దన భక్తికొలది చెప్పి వాని వీడ్కొని మొదటినుండియు నానకునందు మంచియభిప్రాయము గలిగియుండిన రాయబులారు వద్దకుబోయి నానకు వృత్తాంతమంతయు వానికి కెఱిగించెను. రాయబులారు నానకువృత్తాంతమును కాళుడువిన్నట్లు వినక మున్ను తా ననుకొన్నదానికి నాడు విన్నదానికి సరిపోయెనని చాలసంతసించి తాల్వెండీ గ్రామమునకు గురునానకు నొకసారి బంపుమని మర్దనుని వేడుకొని తనమాటలుగా వానికి విన్నవింపుమని కొన్నిపలుకులు చెప్పి పుచ్చెను. మర్దనుడు తనవెంట నీసారి బలుని దోడ్కొని పయనమై యమ్నాబాదునకు బోయెను.

పోయి "నానకును గాంచి యతడు రాయబులారుమాటలుగా నిట్లని విన్నవించెను" నేను చాలకాలమునుండి మహాత్ములగు మిమ్ము జూడగోరుచుంటిని. కాని వార్ధకము దేహ దౌర్బల్యము నారాక కాటంకములుగలిగించినవి. పయనమేడుదినములు పట్టుటచేతను బాధలు మిక్కిలిపడవలసివచ్చుటచేతను రాజాలనైతిని. కావున నాయెముకలుగోతిలో బడకమున్నె మీరే తాల్వెండీగ్రామ మొక్కసారి వచ్చి నాకు దరిశనమిచ్చి నన్ను ధన్యుని జేయవలయునని కోరుచున్నాను. "ఆసందేశము మిక్కిలి జాలిగొలుపునదై యుండుటచేతను తనమీద మొదటినుండియు నభిమానముగలిగి తనకెన్నో యుపకారములు చేసిన రాయబులారువద్దనుండి యాసందేశము వచ్చుటచేతను నానకు దానినిజులకనగ జూడలేకపోయెను. అందుచేత బలుడు మర్దనుడు జేరిన దినముననే నానకు లల్లోవద్ద సెలవుపుచ్చుకొని యమ్నాబాదు విడచి తాల్వెండికి బోవదలచెను.

తలచెనుగాని పయనము గావలసి వచ్చినప్పుడు వాని మనస్సు మిక్కిలి సందేహించెను. రాయబులారుమీది విశ్వాసముచేత ననుగ్రహముచేత స్వగ్రామ దర్శినము వానికిష్టమైనను వాని మనస్సునకు మిగుల బాధను కలిగించునట్టివియు మనోధైర్యమును సంపూణన్‌ముగా శోధింప గల్గినట్టివియునగు స్థితిగతు లక్కడ నున్నట్లు వానికి బొడగట్టెను. ఎవ్వని గూర్చి గురునానకప్పటికిని భయపడుచుండెనో యాకాళుడక్కడ నుండెను. దయామయస్వరూపిణియు గన్నతల్లియునగు త్రిప్తాదేవియు నక్కడనే యుండెను. కోపోద్దీపితుడగు తండ్రి కఠోరభాషణముల నత డొకవేళ సైరించి సరకుసేయ క మనోధైర్యమును జిక్కబట్టిన బట్టుగాక! మూతీన్‌భవించిన కృపారసమో యన్నట్లు మృదువులగు మాటలతో, జాలిగొల్పుచూపులతో బాష్పపూరితములైన కన్నులతో దరికిజేరి మీద చెయివైచి తల్లి బ్రతిమాలుకొన్నప్పు డెంతనిశ్చలహృదయముగల కొడుకైన బేలవడి లోబడకుండునా! సహజముగ మాతృభక్తి యతిశయముగా నున్న నానకువంటి గుణవంతుడు తల్లిమాటల కెదురాడగలడా? మాటకు మాట యుక్తికి యుక్తి చెప్పి యతడు తొక్కినమార్గము సరికాదని సహేతుకముగా నెవరైన వాదించినచో వారి నతడు వాదమున నోడింపగలడు. అట్లు చర్చలు పెంచక వాదములు సలుపక కన్నీళ్ళనే యుక్తులుచేసికొని దయనీయములగు మాటలనే యాయుధములుగ జేసికొని కొడుకులం గెలిచి వారిమనస్సులం ద్రిప్పదలచు తల్లులముందఱ పుత్రుల నీమములు నిలుచుట యరిది. ఇందుచేతనే పూర్వకాలమునందు గౌతమబుద్ధుడు మొదలగు మహాత్ములందఱు సన్యసించి యా యాశ్రమమునందు జాలకాలము స్థిరపడినపిదప తల్లిదండ్రులు మొదలగు చుట్టములం జూడబోయిరి. అవి యన్నియు నానకు చక్కగా నెఱిగినవాడు గావున తాల్వెండికి బోవుదునా మానుదు నా యని మొదట నించుక సంశయించియు జననీజనకుల బ్రార్థనలకు మనోవైకల్యము నొందక స్థిరముగా నిలిచినప్పుడే తన వైరాగ్యము వైరాగ్యమగుననియు గానిచో నది వ్యర్థమ నియు భావించి తప్పక యా యూరికి బోయి తన మనోధైర్యమును బరీక్షించుకొన దలచేను. అట్లు కృతనిశ్చయుడై యిరువురు శిష్యులచేత నను గమ్యమానుడై నానకు తాల్వెండికి బోయి గ్రామము బ్రవేశింపక యూరుబైట చెరువు వద్ద బస చేసెను.

అతని రాక గ్రామములో దెలిసినతోడనే గ్రామవాసులు స్త్రీలు పురుషులు బాలురు వ్య్ద్ధులు దమతమ పనులు కట్టి తమ గ్రామవాసియైన యామహాయోగి దర్శనము చేయ తీర్థప్రజలె వచ్చిరి. నానకు మనసులో తలంచినట్లె తండ్రియగు కాళుడు తల్లి త్రిప్తాదేవి పినతండ్రులలో నొకడు వానికడకు వచ్చిరి. అప్పుడు నానకు సన్యాసి వేషముతో నుండెను. కాషాయవణన్‌ముగల రెండుగజముల గుడ్డ తలకు చుట్టుకొని యట్టిదే మఱియొకటి మొలకు జుట్టుకొని మఱియొక చిన్నగుడ్డ చేతబూని యతడు గూర్చుండెను. ఊరుబైట చెట్టుక్రింద నట్టిదీన వేషముతో గూర్చుండిన యాకుమారుని జూడ తల్లితండ్రుల మనసెట్లు పరితపించెనో చదువరులే యూహించుకొన వచ్చును. కాళుడు కుమారుని నీచస్థితి జూచినతోడనే మనోవైకల్యము నొంది కోపపరవశుడై నానకును దూషించుటకు బ్రయత్నించెనుగాని శాంతస్వభావుడగు వాని తమ్ముడక్కడనే యున్నందున మనస్సు స్వాధీనములో నుంచుకొమ్మని సోదరునకు హితోపదేశము చేసి వానిసంరంభమును మా న్పెను. అనంతరము దండ్రి కుమారునితో సభాషింప దలప నానకు పినతండ్రి లోకవృత్త మెఱిగినవాడయినందున గాళుడు మాటలాడ మొదలుపెట్టు నేని వానివాక్పారుష్యము వలన దండ్రికొడుకుల కదివఱకే గలిగిన వియోగము మఱింత యధికమగునని వానిని మాటలాడ నీయక తానే ముందు ప్రసంగమునకు దొరకొనెను. అన్నకొడుకును బినతండ్రి పలుకరించి ముందుగా స్వగృహమునకు రమ్మని నానకును బిలిచెను. నానకు వానికిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. "అయ్యా! నా యిల్లు వేరుగ నున్నది. మీయిల్లు నాయిల్లు గాదు. అన్ని యిండ్లతో సంబంధము వదలుకొంటిని." కొడుకిచ్చిన యీయుత్తరము చెవినిబడిన తోడనే త్రిప్తాదేవి, పుత్రస్నేహమితరాలోచనలను జయింప మనసు పట్టలేక వలవల యేడ్చుచు గుమారుని పాదములపై బడెను. మాతృవిధేయుడగు నాగురువు తల్లిని పరమ భక్తితో బాదములపైనుండి లేవనెత్తి వినయమున నిట్లనియె. "అమ్మా! క్షమయేనాకు దల్లి సంతుష్టియే నాతండ్రి మనోజయ కారణమయిన సత్యమే నాపినతండ్రి.

ఆయుత్తరము మిక్కిలి ప్రశంసనీయ మైనదిగదా? గురునానకు తన యెట్టయెదుట నున్న బంధువులు బంధువులుగారని విస్పష్టముగ జెప్పి దీనబంధువుడగు భగవంతుడే తన బంధువుడనియు వాని సన్నిధానమునకు గొనిపోవందగిన సత్యాది సద్గుణములే తనమిత్రములనియు దెలియజేసెను. అప్పు డాతనిపలుకులు వినినవా రందఱు వాని నిశ్చలభావమునకు సంతసించి యతడు గృహస్తాశ్రమమును సంపూర్ణముగ విడిచినాడనియు జితేంద్రియుడై యాశల జయించి సంసార సంబంధము ద్రెంపినాడనియు వానిచరిత్రము ముందుముందు సుజనవందితమై యుండుననియు నమ్మిరి. కష్టతరమైన మాతాపితృసందర్శన మీవిధమున బరిణమించినందుకు తన మనోధైర్యము వ్రీలకుండ దాను బయటబడినందుకు నానకు మిక్కిలి సంతసించెను.

"మాతృదేవోభవ, పితృదేవోభవ" యని వేదములు పలుకుచున్నవిగదా సమస్త మతములు తలిదండ్రులసేవ యుత్తమోత్తమమని యంగీకరించు చున్నవిగదా! అట్టియెడ తలిదండ్రులకు విధేయుడైన నానకు తన యకాల సన్యాసము వల్ల వారికిరువురకు నధికమనోవేదన నేల గలిగింపవలయు? తల్లిదండ్రుల దు:ఖపెట్టినయతడు గురువగునా యని కొందఱడుగవచ్చును. స్వలాభము నెంచుకొని తల్లిదండ్రులను విడుచువాడు దూష్యుడగును గాని లోకాను గ్రహార్థము గృహము దారపుత్రులను మాతాపితలను స్వలాభమును స్వసౌఖ్యమును బరిత్యజించి యేకాకియై సుజనులు చుట్టములుగ జ్ఞానులు సహకారులుగ శిష్యులు బిడ్డలుగ లోకమే యిల్లుగ భగవంతుడు తండ్రిగ భావించి పాపుల నభ్యుద్ధరింప బాటుపడి మేనులు ధారవోయునట్టి మహాత్ములు తలిదండ్రులకు మనోవేదన గలిగించి నంతమాత్రమున దూష్యులుగారు. ఈతండ్రి దు:ఖించినను బైనున్న యాతండ్రి:వాని గుణములకు సంతసించును. ఈపుత్రులు తగు జీవనాధారము లేక స్వల్పకాల మిడుమలు బడినను శిష్యపుత్రులు వేనవేలు సద్గతులు గలిగి సుఖింతురు. బుద్ధదేవుడు తలిదండ్రులమాట సరకు సేయక సన్యసించె. శంకరాచార్యుడు తల్లికన్నిష్టమైనను వివాహపూర్వమందె నాలవయాశ్రమము స్వీకరించెను. రామానుజాచార్యుడు కాపురమునకు వచ్చిన భార్యను విడనాడి భగవత్సేవకై త్రిదండ సన్యాసియయ్యెను. బసవేశ్వరు డుపనయనమే చేసికొననని గురులమాట ధిక్కరించెను. పురాణములలో నిట్టి యుదాహరణము లనేకములు గలవు. శుకుడు బాల్యముననే సన్యసించి తండ్రియగు వేదవ్యాసునకు మిక్కిలి మన:ఖేదము గావించెను. ప్రపంచారంభమునుండియు లోకోప కారులై మహాత్ములు గురువచనంబుల నతిక్రమించియే లోక బంధువులైరి. మాతాపితల శాసనము లతిక్రమింపగూడనివని వారు గృహములందుండిన మానవలోకము గతియేమి కావలసియుండును?

అట్లు నానకు తల్లియొక్కయు బిన తండ్రియొక్కయు మాటల నిరాకరింప బిన తండ్రి కాలునితో నాలోచించి రాయబులారు మాట మీద దమకుమారునకు గౌరవముగలదని యెఱింగి యతనిచేత బుద్ధి చెప్పించవచ్చుననుకొని వాని యింట బసచేయుమని నానకును వేడుకొనెను. నానకు రాయబులారు నిమిత్తమే యక్కడికి వచ్చినందున వానియింటికి బోవుట కేయాటంకము జెప్పక కదలిపోయెను. పోయి యా మహాత్ముడు వార్ధకముచేత గదల లేకయున్న రాయబులారునుగాంచి వానిపాదములను దనహస్తముతో స్పృశించెను. ఆశతవృద్ధు మలినములగు తన పాదములను బవిత్రుడగు గురువు స్పృశించి నందుకు నొచ్చుకొని లేవలేక కూర్చుండియే నతని శిరస్సు మహనీయుడగు నానకు నడుగులం జేర్చెను. గురువు వృద్ధుని శిరస్సు సగౌరవముగా నెత్తి సేమమడిగెను. ప్రియబాషణంబులతో నిరువురు గొంతసేపు గడపిన పిదప నానకు బంధువులు వంట బ్రాహ్మణుని నొక్కని కుదిర్చి నానకు నిమిత్తము వంట జేయించిరి. కాళుడు ద్రిప్తాదేవి యాదినమంతయు రాయబులారు గృహమందే పడియుండిరి. వారు తనయింటివద్ద భృత్యులవలె నేలపడియుండిరో యాకారణము రాయబులారు చక్కగా నెఱిగి తానె ముందుగ నామాట కదపక వారి నోటనుండియే వారికోరికలు జెప్ప దలచి ప్రసంగింప జొచ్చెను. ఆతడు సంభాషణమారంభించి నాలుగు పలుకులు పలికినతోడనే ద్రిప్తాదేవి కన్నుల నీరుపెట్టుకొని తద్దయు దు:ఖితయై రాయబులారు హృదయము కరిగి పోవునట్లు వగచుచు వాని నిట్లు ప్రార్థించెను. "ఈకష్టకాలమందు మీరుతప్పక మాకు సాయముచేసి మమ్ము దేల్చువారెవరులేరు నాయనా నీయావచ్ఛక్తి వినియోగించి నాబిడ్డతో నెట్లు చెప్పవలయునో యట్లు చెప్పి వాడీ యూరునుండి పోకుండునట్లుచేసి పుత్రభిక్షము పెట్టుము. నీకెంతో బుణ్యముండును" రాయబులారు త్రిప్తాదేవి మాటలచేత బరవశుడై నానకును జూచి నీతల్లి యభీష్టమెట్లయిన నెరవేర్ప గలవాయని యడిగెను, అడిగి యంతట నూరకుండక రాయబులారు వెండియు నిట్లనియె. "నాకు విస్తారము సేవ్యము జేయదగిన భూమిగలదు. అందుకొంత నీ కుచితముగ నిచ్చెద. నీవు శిస్తు నీయనక్కరలేదు. కావలసిన పాలేళ్ళను బంపెదను. నీవేమియు శ్రమపడనక్కరలేదు. అది శేవ్యము చేయించుచు నిచ్చట నుండగలవా."

అతనిమాటలకు గురువిట్లు బదులు చెప్పెను. "అయ్యా! భగవన్నామ స్మరణమే విత్తన మగుగాక సంతుష్టియే నాగలి యగుగాక! వినయమే కలుపు తీతయగుగాక ఇట్లు కృషిచేసిన నీభక్తివిశేషము చేతను దైవానుగ్రహము చేతను మంచిపంట పండగలదు. నీయిల్లు నిత్యకళ్యాణ సదనమై వర్థిల్లగలదు" అప్పలుకులు విని దాపుననున్న పినతండ్రి నానకుతో మెల్లగ నిట్లనియె. నీవు వ్యవసాయము వంటి కష్టపు బని జేయలేని యెడల మంచియంగడి నొకదానిం బెట్టి సుఖముగ గూర్చుండి పనిచేయు చుండుము. అనవుడు గురువు పినతండ్రికిట్లనియె. ఇకనాలస్యము చేయక నీజీవితకాలమునే యంగడి చేసికొనుము. భగవన్నామమె యాయంగడిలో నమ్మెడు సరకుగా నేర్పరచుకొనుము. ధ్యానమె యాసరకును సంపాదించు సాధనముగ నుంచుకొనుము. ఈశ్వరనామవ్యాపారము చేయు వర్తకులతోనే బేరసారముల జేయుచు గాలము గడపుము. ఇంతకన్న వేరు వతన్‌కము చేయకుము" అట్లు పలికిన కొడుకుమాటలు విని పినతండ్రి వెండియు నిట్లనియె "నీకంగడి పెట్టుట కిష్టములేని పక్షమున విదేశములు చూడ నభిలాష గలిగినపక్షమున గుఱ్ఱములవతన్‌కము జేయుము. అది కారణముగా నీవెన్నో దూరపుపట్టణముల జూడగలవు" నానకు దానికిట్లు బదులు చెప్పెను. "నీవు శాస్త్రములను వినెడు వ్యాపారమునుండి సత్యమను గుఱ్ఱములను దూరదేశములకు దీసికొనిపోయి యమ్ముము. నీదారిబత్తెముగ సత్కార్యములు సౌజన్యత గొనిపొమ్ము. ఆవ్యాపారమువల్ల నీకుగలుగు లాభమేమన నీవక్షయలోకమున కఱిగి నిరాకారుడగు నీశ్వరు సాన్నిధ్యమునుజేరి మోక్షసుఖము ననుభవింపగలవు" జ్ఞానియగు కుమారుడన్ని విధముల నిహలోక వ్యాపారమురోసి బ్రహ్మజ్ఞానబోధకములగు పలుకులు పలుకుచుండ పినతండ్రి వాని నెంతమాత్రము గ్రహింపలేక సిగ్గులేక మరల నిట్లనియె. "పోనీ నీకు గుఱ్ఱపువతన్‌క మిష్టములేదేని సర్కారు వారివద్దనుద్యోగములో జేరుము." ఈమాటకు గురువు నోటినుండి ఈ క్రిందియుత్తరము వచ్చెను. "నీవు మనసార భగవంతుడను సర్కారును గొలువుము. నీయాత్మభగవన్నామము మీది భక్తిని వృద్ది పొందించునట్లు నడుచుకొనుము. నీయధికార మంతయు దోషములమీద జూపి దానిని నశింపజేయుము. అట్లుచేయుదువేని నీవు సిద్ధుడవగుదువు."

నానకునకు బినతండ్రికి జరిగిన సంభాషణము విని రాయబులారు నానకుయొక్క మనస్సునకు నిష్టముగా నుండు నట్టి పని వానిచుట్టములు చెప్పలేదనుకొని తాను చేయబోవు నుపదేశము తప్పక యంగీకరింపబడునని నమ్మి గురువుతో నీవిధమున బలికెను. "బీదవాండ్రకు నీవొకసత్రమును వేయుము దానిఫొషణకు గావలసిన ధాన్యమంతయు బండదగిన మంచిభూమి మూడునూతులుగలది నేను నీ కిచ్చెదను. నీవు శిస్తురూపకముగా నాకేమియునీయనక్కఱలేదు." ఇది సత్కార్యమగుటచే సాధారణముగ నానకుమెత్తబడి దానికొప్పుకొన వలసినదే. కాని యాతని మనోనిశ్చయము దృడమైనదగుటచే నతడు పార్వా పర్వములు విచారించి దానికి సమ్మతింప లేదు. ఇదియేగాదు ఎవ్వరెంతెంత మంచి యుపదేశముల జేసినను నానకు మనస్సున కవి యెక్కవయ్యె. అట్లు కొన్నిదినములు తాల్వెండిలోనుండి నానకు యెట్టకేల కాయూరువిడిచి పోదలచెను. ఏలయన నతడచ్చట నున్నందువలన బారమార్థిక చింతగల కొంతమందికే జ్ఞానోపదేశపూ ర్వకమగు నుపదేశము జరుగుచుండెనుగాని విశేషజనులకు వినోదముదీరుట తప్ప నెక్కువయుపయోగము లేకపోయెను. గ్రామమువిడిచి పోదలచినప్పుడు వానిని మిత్రులు జుట్టములు తలిదండ్రులు చుట్టుకొనిరి. తల్లిదండ్రులు సన్యాసాశ్రమమును విడువుమని చాలబ్రతిమాలిరి. రాయబులూరు సయితము తలిదండ్రుల పక్షముబూని వ్యాపారమేమియుం జేయనక్కఱలేదనియు నూరక స్వగ్రామమున నుండినంజాలు గావున దానికైన నియ్యకొనదగుననియు నానకును వేడుకొనెను. అందుకు నానకు తద్విషయమున దనయిష్టము చెల్లదనియు దనయిష్టమే చెల్లినపక్షమున జననీజనుకులను మెప్పించుటకంటె మరియొక కార్యము తనకు లేదనియు దనయిష్టముకంటె నతీతమైన పరమాత్మునియిష్టమెట్లో నట్లు జరుగవలసినదనియు బదులుచెప్పెను.

అట్లు చెప్పి బలమర్దనులు వెంబడింప గురువు ప్రయాణోన్ముఖుడైయున్నపుడు రాయబులారు వానిసమీపమునకు బోయి తనకొక ధర్మకార్యము జేయ నిష్టముగలదనియు నెయ్యది యుత్తమోత్తమ కార్యమగునో గురువు నోటనుండి విన వేడుక గలదనియు జెప్పెను. పరోపకారము జేయదలచిన సత్పురుషునకు నిరుత్సాహము జేయుట భావ్యముగాదని గురువు వాని మంచితలంపునకు సంతసించి తాల్వెండి గ్రామములో మంచిచెరువు లేనందున మంచినీళ్ళతటాక మొకటి త్రవ్విం పనగునని వానికుపదేశము చేసెను. నానకు స్వగ్రామములో నున్నపుడచట చెరువులేనందుకు మిగులవిచారించుచువచ్చెను. గ్రామస్థులు దానివలన జాల నిడుమలు బడుచువచ్చిరి. రాయబులారు గురువు నిర్ణయించిన ధర్మకార్యము సర్వజనోపయోగమైదని శ్లాఘించి తగినతావు వెదకి చెరువు త్వరలోనే ద్రవ్వించి దానికి గురునానకు పేరుపెట్టెను.