నానకు చరిత్ర/ప్రథమాధ్యాయము
నానకు చరిత్ర.
ప్రథమాధ్యాయము.
నానకు క్షత్రియ వంశస్థుఁడు. తండ్రిపేరు కాళుఁడు. తల్లి పేరు త్రిప్తాదేవి. కాళుఁడు టాలువెండి గ్రామమునకు మునసబగుటచేత మిక్కిలి పలుకుబడి గలిగి లోకవ్యవహార వేదికయై మితవ్యయముచేత ధనముకూడబెట్టి వడ్డివ్యాపారము చేయుచు గౌరవముగ గాలక్షేపము చేయుచుండెను; కాని వాని నోరు మంచిదికాదు హృదయకఠినము. జనులతోఁ గలసి మెలసి యుండుట కిష్టములేనివాఁడు. ఆశగలవాఁడు అందుచేత గ్రామవాసులు వానికిఁజంకి పైకి వానియెడ మిత్రభావముఁ జూపినను మనసులలో వానిని ద్వేషించిరి. వానిభార్య త్రిప్తాదేవి గుణములలో మగనిం బోలక భిన్నశీలము గలదై నోటిమంచితనము సాథుస్వభావము గలిగి గ్రామవాసులచే గౌరవింపబడుచు వచ్చెను. మగఁడు ధూర్తవర్తనుఁడై చీటికిమాటికి మహాకోపపరవశుఁడై తన్ను సిలుగులఁబెట్టుచు వచ్చినను త్రిప్తా దేవి యోరిమిఁగలిగి మగనిమాట జవదాటక వానియెడ గడుభక్తిగలిగి యుండెను. తండ్రియొక్క మనోదార్ఢ్యము తల్లి యొక్క సాథుశీలము గ్రహించి యాదంపతులకే నానకు జన్మించెను.
ఆతని జన్మదినము నిర్ణయించుటకుఁ దగిన యాధారములు కానరావు. కొందఱు వాని పుట్టినదినము కార్తికశుద్ధ పూర్ణిమ యనుచున్నారు. మఱికొందఱు వైశాఖశుద్ధ తదియ యనుచున్నారు. కార్తికశుద్ధపూర్ణిమనాడు నానకు జ్ఞాపకార్థము టాలువెండి గ్రామములోఁ బ్రతిసంవత్సరము తీర్థము జరుగుచుండుటచే వాని జన్మదినము కార్తిక పూర్ణిమయేకాని వైశాఖశుద్ధతదియ కాదని నిశ్చయింపవలసియున్నది. ఆరాత్రి నిశీధసమయమున స్వధర్మభ్రష్టులగు హిందువులను మంచిదారినిం ద్రిప్పదలంచిన యామహత్ముం డవతరించెను.
మనదేశమున గొప్పవారి పుట్టుకలు సామాన్యమనుష్యుల జన్మములకంటె విలక్షణముగ వర్ణింపఁబడుచుండును. రామ, కృష్ణాది మహాత్ములు జన్మించినప్పుడు మహాద్భుతము లనేకములు జరిగినట్లు మనవారు పురాణములలో వర్ణించి యుండుటచే నిటీవలివారును మహాపురుషుల జన్మ కాలమునందు వింతలు పొడకట్టినట్లు వ్రాయఁదొడంగిరి. నానకు చరిత్రము వ్రాసినవారు గూడ నీవృద్ధాచారము నతిక్రమింపక వాని జన్మము లోకసామాన్యముగ వ్రాసిరి. నానకు పుట్టినతోడనే సగము నవ్వుచు సగము మాటలాడుచున్న మనుష్యుని కంఠధ్వని గలుగునట్లేడ్చెనని మంత్రసాని చెప్పెనఁట. అందలి సత్యమేమనగా నానకు తన తండ్రి పుట్టినట్లుఁ దాత పుట్టినట్లుఁ దక్కినమానవులందఱుం బుట్టినట్లు బుట్టియుండును. అందఱు శిశువు లేడ్చినట్లే యేడ్చియుండును. కాని యతని చరిత్రము వ్రాసినవారు వాని గొప్పతన మంతయు జూచిన పిదప నతడా కాలమున లోకైక పూజ్యుఁడైన పిదప వ్రాసియుందురు. కావున నంతటి మహానుభావుడు తక్కిన పామర మానవులవలె బుట్టియుండఁ డని నమ్మి మూర్ఖజనములు చెప్పుకొను మహాద్భుతములు కొన్ని వాని యవతార ఘట్టమునందుఁ జేర్చి యుందురు. అట్లె కాకున్న ప్రకృతిధర్మములు భేదమునందవలసియుండు. అద్భుతములు మహిమలు మొదలగునవి మూర్ఖుల మనస్సులలో నుద్భవించునుగాని నిజముగ జరుగవు.
ఒకనిపుట్టుకలో ఘనత యుండదు. ఒకనిపుట్టుకలో నైచ్యముండదు. ఎవఁడును జన్మించినతోడనే మాటలాడఁడు. తరువాత నెంత గొప్పవాఁడైనను మనుష్యుఁడు పుట్టినప్పుడందఱి వలెనె యాకలి దప్పిక నిద్ర మొదలగు లక్షణములు గలిగి యుండును. ఇట్లనుటచేత కొందఱు మనుష్యుల యం దద్భుత శక్తిలేదని నేననుట లేదు. మనుష్యుని బుద్ధి వికసించిన పిదప వాని విద్యంబట్టియు జ్ఞానముంబట్టియు నొక్కొక్కని కసాధారణ ప్రజ్ఞ గలుగుచుండును. ఒక్కొక్కనికి విస్తారము విద్యలేకపో యినను దైవభక్తి భూతదయ జిత్రేంద్రియత్వము బాల్యమునం దంకురించి నానాట నభివృద్ధి జెందును. ఇట్టి సత్పురుషులే పరోపకార పరాయణులై జీవితమంతయు పరమార్థమునకు ధారపోయుదురు. ఈనానకు పుట్టినప్పు డద్భుతములతో బుట్టకున్నను యుక్త వయస్కు డైన పిదప భక్తాగ్రగణ్యుడయ్యె.
హిందువులలో బుత్రసంతానముగలుగుట పరమానందహేతువు. అదివఱకు పుత్రసంతానము లేని పురుషునకు గుమారుడు గలిగినప్పు డాకుటుంబమునకు బొడము నానందము నెవడు వర్ణింపగలడు! పున్నమినాటిరాత్రి బుత్రుడుకలుగుటయు మరనా డుదయమున గాళునిగృహము మహానందనిలయమైయుండెను. కాళున కదివఱకొక కూతురుండెను. ఎంద రాడుబిడ్డలున్నను హిందువులలో మగబిడ్డలులేని మనుష్యుడు కేవలము మందభాగ్యుడుగ నెంచబడుటచే గాళుడు పుత్రోత్పత్తియైనతోడనే తాను ధన్యుడనయితినని తలంచి సంతోషపరవశుడై తక్షణము పురోహితుంబిలిపించి బాలుని భవిష్యద్దశను గూర్చిమున్నె యెఱుంగవలయునని జాతకము వ్రాయుమని కోరెను. ఇట్లు పురోహితుం బిలిపించి జాతకము వ్రాయుమనుటలో గుమారుని జాతక మఖండైశ్వర్యవంతముగ నుండుననియె తండ్రి యభిప్రాయము. జ్యోతిష్కుడును బరేంగితజ్ఞానము కలవాడు కావున దండ్రియను కొన్నట్లు కుమారుడఖం డైశ్వర్యవంతుడగుననియు గ్రహములన్నియు నుచ్ఛస్థానముననున్నవనియు జెప్పి యంతతో బోక బాలునకు స్వేతచ్ఛత్రాధిపత్యము గూడ గలుగునని వక్కాణించి తదనుకూలముగ జాతకమువ్రాయ తండ్రి యదిచూచి మేరమీరిన సంతోషమునందెను. పురోహితుడు జాతకము నందు బూర్వోదాహృతములగు విషయములకు దోడుగ నానకు గొప్పయవతార పురుషుడనియు వానింబోలినవారు మున్నెవ్వరులేరనియు వానిని హిందువులు మహమ్మదీయులు సమానముగ గౌరవింతురనియు బంచభూతములు వానికి లోబడియుండుననియు నతడు పరమేశ్వరారాధనమునందు నిరతుడైయుండుననియు గూడ వ్రాసెనట. ఈవిషయములు పురోహితుడు మొట్టమొదట జాతకమునందు వ్రాయుటయబద్ధము. నానకు మతసంస్కర్తయై లోకఖ్యాతుడైన పిదప వానిభక్తులు మొదలగువారు కల్పించుట నిజము. జాతకము లెట్టివో జాతకములువ్రాయు జ్యోతిష్కులెట్టివారో వారిమాట లెంతవఱకు బ్రమాణములో మనదేశస్థులు చక్కగా నెఱుగుదురు. గావున నిచ్చటవిస్తరించి వ్రాయనక్కరలేదు.
కాళుడు పురిటిదినములు గతించిన వెనుక గుమారునకు జాతకకర్మములుచేసి నానకని నామకరణముచేసెను. కాళుడు ప్రథమసంతానమైన యాడుబిడ్డకు నదివఱకె నానకియని పేరుపెట్టుటచే నామెపేరే కొడుకునకుగూడ బెట్టదలచి యట్లుచేసెను. నానకు దృఢశరీరుఁడై దినదినప్రవర్థమానుడయ్యెను. ఈతని శైశవమునుగూర్చి చరిత్రకారులెవ్వరును దగినట్లు వ్రాయలేనందున వానిచిన్ననాటి లక్షణము లిట్టివనినిర్ణయింప మనశక్యముగాదు. అతఁడు బాల్యమున దోడిబాలురతోడను బాలకులతోడను గలసి మెలసి యాటపాటలలో మెలంగక తరుచుగ నితరులతో మాటాలాడ నొల్లకయుండు వాడని కొందఱువ్రాసిరి.
ఏడవసంవత్సరమందు దండ్రి వానికక్షరాభ్యాసముచేసి గురువునకు బహుమానములిచ్చి విద్యాభ్యాసము చేయింపుమని కొడుకు నప్పగించెను. హిందీభాషను వ్రాయుటచదువుట వర్తకుల కుపయోగించు లెక్కలువేయుట మాత్రమే యాగ్రామ పాఠశాలలోఁ జెప్పునట్టి విద్యలు. బడిపంతులువాని కక్షరాభ్యాసముం జేసి తన చెప్పగల విద్యలు గరపుటకు బాలకుని బడికిం దోడ్కొనిపోయెను. నానకు బడికిబోయి మొదటినాడు నెమ్మదిగ నుండెను; కాని రెండవనా డతఁడు చదువుకొనక యూరక గూర్చుండ గురువు వానిం గసిరి బెదరించెను. బెదరించుటయు శిష్యుడు గురువుపై దిరుగబడి గురువును ధిక్కరించి నాకు చెప్పుటకు నీకేమి చదువు వచ్చునని వాని నడిగెనఁట. శిష్యుని ప్రశ్నమువిని గురువు తెల్లబోయి తాను సకలశాస్త్రములు నేర్చినట్లు ప్రత్యుత్తర మిచ్చెను. ఆ మాటలు విని నానకు లౌకికవిద్య నిరుపయోగక మగుటయే గాక హానికరమనియు దాని నభ్యసించినవారు సంసారపాశములం దగుల్కొని యెన్నటికిం బయల్పడఁజాలరనియు మనుష్యులు శ్రద్ధతో నేర్చికొనవలసిన విద్య వేరొకటి యున్నదనియు సత్యమును గ్రహించుట భగవంతునియెడ భక్తిగలిగియుండుట భగవన్నామము కీర్తనముసేయుట మొదలగునవియే నిజమైన విద్యలనియు నవియే యుభయలోక తారకములనియు గురువునకు బదులు చెప్పెనఁట. అప్పలుకులు పలికి యంతట నూరకుండక నానకు భక్తితత్వముం దెలుపు శ్లోకము నొక దానిని జదివెనఁట. ఆశ్లోకార్థమిది.
“నీ లోకానురాగము సిరాజేసి నీబుద్ధిఫలకము కాగితము జేసి నీమనస్సు వ్రాతగాడుగ జేసి పరమేశ్వరుని గూర్చి వ్రాయుము. వ్రాసి వానియందు దృష్టినిలుపుము. ఏమివ్రాయవలయునని తలంచుచున్నాడవు. భగవన్నామము వ్రాయుము. భగవత్కీర్తనలు వ్రాయుము. భగవంతుఁ డాద్యంతశూన్యుఁడన్న మాట వ్రాయుము. మిత్రుడా! ఇట్టి వ్రాత నేర్చుకొంటివేని దేవుని యెదుటకు నీవు బోయి యీలోకమున నీవు నడచిన నడతకు సరిగ లెక్క చెప్పవలసివచ్చినప్పుడు తప్పక యావ్రాత నీపక్షము బూని కళంకరహితమై నిన్ను రక్షించును.”
ఏడుపదుల యేండ్ల వయసుగల వృద్ధుని నోటనుండి వెడలవలసిన యాభక్తిరస ప్రథాన వచనములు విని గురువు వాని యసాధారణశక్తి కచ్చెరువడి తన మనంబున నప్పుడప్పుడు పొడమి తనకు దుస్సాధ్యములయిన వేదాంతవిషయిక సందేహముల దీర్చుకొనుట కదియే సమయమని యాబాలు ననేక ప్రశ్నము లడిగెనట. అడిగినతోడనే నానకు వాని కన్నిటి కవలీలగ దగునుత్తరము లిచ్చెనట. ఆయుత్తరములు సహేతుకములుగ నున్నట్టు తోచుటయు గురువు బాలుడని యెంచక భయభక్తులు మెఱయ శిష్యునిపాదములకు నమస్కరించి యతడు సామాన్యుడు గాడనియు నవతారపురుషు డనియు శ్లాఘించెనట. ప్రపంచమందు మహాద్భుతమగు బుద్ధివికాసముగల బాలురు లేరని చెప్పజాలము గాని యేడేండ్ల యీడు గల బాలకు డట్టి పరమార్థబోధకములగు పలుకులు పలికెననుట విశ్వసనీయము కాదు.
అతడు పుట్టిపెరిగిన కుటుంబము నిరంతరము వేదాంత చర్చలలో గృషిచేయుచుండిన పక్షమున బాలకున కా సంబంధములైన మాటలు కొన్నిపట్టుబడి యుండునని మన మూహింపవచ్చును. అట్టిదేదియు నిచ్చట గానరాదు లేక సహజముగ మహాబుద్ధిమంతుండగు బాలుడు గొప్పవిద్వాంసులయు విరాగులయు సహవాసము జేయుచుండిన పక్షమున నీవిధములగు పలుకులు గాకపోయినను జ్ఞానగర్భితములగు కొన్ని పలుకులు పలికినాడని మనము నమ్మవచ్చును, అది యేదియు నానకు విషయమున గానరాదు. తల్లిదండ్రులకు వేదాంత కృషి లేదు. విరాగులతో సహవాసమున్నట్లు గనబడదు. మంచివిద్యావ్యాసంగ మదివఱకే యుండవచ్చుననుకొన్న బడికిపోయిన మరునాడే యీచిత్రకథ జరిగెనని చెప్పుచున్నారు. కావున నేవిధమున జూచినను మన మా కథ నమ్మదగినదిగ లేదు. దాని యాథార్థ్య మేమైయుండునన నానకు నోటనుండి యాపలుకులు బడికిపోయిన మరునాడే రాకపోయినను యుక్తవయస్కుడై జ్ఞానవంతుడై మతసంస్కర్తయైన పిదప వానినోటనుండి యావాగ్రత్నములు వెడలియుండవచ్చును. చరిత్రకారులు వానికి మహిమ లారూపింపందలచి పెద్దనాటి మాటలు పిన్ననాటికి మార్చి యుండవచ్చును.
అది యటుండ నీ సంభాషణములు జరిగిన పిదప నానకు మఱియెన్నడు బడికి పోయియుండలేదనియు వానిచదువు రెన్నాళ్ళతో ముగిసెననియు చరిత్రకారులు చెప్పుచున్నారు. ఇదియును వాని శిష్యులు వానియందలి భక్తివిశేషముచేత దక్కిన ప్రాకృత పురుషులవలె నతడు చిరకాలము విద్య నేర్చికొనలేదని లోకమునకు దెల్పదలచి యట్లు వ్రాసియుందురేగాని యది నిజము కాదు. ఏలనన నెట్టికుశాగ్రబుద్ధికైన జదువుకొనకయే విద్య రాదు. అభ్యసించునప్పుడు విద్య సూక్ష్మముగ గ్రహించునట్టి మనీష యుండిన నుండవచ్చు. చదువక పండితుడైన వాడెవ్వడును లేడు. మఱియు నానకు హిం దీభాషం జక్కగం జదువను వ్రాయను నేర్చినట్లును లెక్కల వ్రాయుటలో బ్రోడయైనట్లు గొంతకాల ముద్యోగములు చేసినట్లును మనకు బెక్కుదృష్టాంతములు గలవు. అక్షరాభ్యాసమైన మరునాడే చదువు ముగించిన కుఱ్ఱవాని కంతటి ప్రజ్ఞగలుగుట యసంభవము గావున నతని చదువు రెన్నాళ్ల చదువుగాక రెండేండ్లచదువో, అంతకంటె కొంచముతక్కువ కాలపు చదువో యైయుండవచ్చునని మన మూహింప వలసి యుండును. ఎట్లయిన నానకు విద్యావిషయమున విస్తారము శ్రద్ధ జూపినట్లు గానబడదు. కుమారునకు జదువుమీద నెక్కుడు తమకము లేదనియో నేర్చినవిద్య సగౌరవముగ దేహయాత్ర గడపుటకు జాలుననియో యెందుచేతనో తండ్రి యచిరకాలమునే కొడుకుం జదువమానిపించెను. అట్లు పాఠశాల విడుచునప్పటికి నానకు తొమ్మిదియేండ్ల ప్రాయము వాడు.
చదువు మానిపించిన వెంటనే కాళుడు కుమారు నేదైన వ్యాపారమునం బ్రవేశపెట్టవలయునని నిశ్చయించుకొనెను. అది మొదలు తండ్రికి గొడుకునకు నెడతెగని వైరుధ్యమే సంభవించెను. నానకు ప్రత్యక్షముగ దండ్రిజెప్పిన పనిజేయ నిష్టము లేనట్లు గనబడకపోయినను దన కైహిక వ్యాపారములయం దెంతమాత్ర మిష్టము లేదని చేష్టలచేత జెప్పకయే చెప్పుచు వచ్చెను. విద్యాభ్యాసము ముగిసినతోడనే కాళుడు కుమారుని బనిలో మప్పదలచి వాని బసులకాపరి తనమున నియోగించెను. నియోగించుటయు నానకు వల్లెయని యాపని జేయ సమ్మతించెను. కాని యల్పకాలములోనే తన కుమారుడు పసుల కాచుటకు బనికిరాడని కాళుడు గ్రహించెను. ఏలయన నానకు పరమదయాళువగుటచే నోరులేని జంతువులను బలవంతముగ నిర్బంధించి యొక్కచో నిల్పుట కూడదని తలంచి పసుల నదలింపక యవియిచ్చవచ్చిన తెఱంగున విహరించుచుండ జూచుచు నూరకుండును. లేగ దూడ తల్లిపాలు కుడుపదలచెనా దాని తల్లిపాలది ఏల కుడువగూడదని తక్షణమె యాదూడను పాలు గుడుపనిచ్చును. ఆకుమడియైనను సరియే పండిన చేనైనను సరియే యావు మేయదలచెనా, పాప మది యిచ్చవచ్చినట్లేల కసవు తినగూడదని తక్షణమే దానిని మేయ విడుచును.
పరమేశ్వరుడు మనుష్యులను దదితర జంతువులను సమానముగ సృష్టించినను మనుష్యుడు లేనిపోని యధికారములబూని యతిక్రూరుడై నోరులేని యాజంతువులను దన యిచ్చవచ్చిన తెఱంగున బాధలుపెట్టి మంచిపదార్థములెల్ల దానే యనుభవించుచు నెల్ల సౌఖ్యముల దానే పొందుచు నుండుట యేటిన్యాయమనియు మనుష్యులలో తల్లులు పాలిచ్చి తమ బిడ్డల బోషించి యెంతో గారామునం బెంచుకొనుచుండ పసువు తమ యిచ్చవచ్చినప్పుడు తమ పొదుగుపాలను తమ దూడల కిచ్చుకొనుట కేల స్వాతంత్ర్యముండగూడదనియు మనసున సందేహములు పుట్టి వానిని బాధింపదొడగెను. ఏసందేహములు దోచిననేమి ఏయాలోచనలుతట్టిననేమి మొత్తముమీద కొడుకుచేసినపనులు తండ్రికి గిట్టవయ్యె. నానకు పసులకాపరియైయున్న కాలమున రెండు చిత్రకథలు జరిగినవట. నానకు పేరెత్తినవారందఱు తామునమ్మిన నమ్మకున్న నీయద్భుతకథలు రెండు జెప్పుకొనకమానరు. అందుమొదటి కథ యిది. నానకు మండు వేసగి నొకనాడు పగలు రెండుజాములవేళ నీచెవిగాడు పాచెవికి గొట్టుచున్నప్పు డూరబైట బసుల కాచుచుండి కునికిపాట్లురాగా నిద్దురనాపజాలక యొక చెట్టుక్రింద బండుకొనియెనట. సూర్యుడు పశ్చమమునకుబోవుచున్నకొలది చెట్లనీడలు మునుపున్న తావునుండక మారుచుండుట సహజముకదా! ప్రకృతిధర్మ మట్లున్నను నాడది యేమిచిత్రమోకాని నానకు పండుకొన్న చెట్టునీడ సూర్యగతింబట్టి మార్పు జెందక యున్నతావునేయుండి యాబాలున కెండతగులకుండ గాపాడుచుండెనట.
రెండవకథ యీవిధముగనున్నది. గ్రీష్మకాలమున మఱియొకదినమున నతడు పసులగాచుచు నిద్రాభరము నాపలేక మట్టమధ్యాహ్నము మరియొకతావున నెండలో బండుకొని గాడనిద్ర జెందెనట. అప్పుడొక నల్లత్రాచు తనపడగ బాలునితలమీద విప్పి వానికెండ సోకకుండ సంరక్షణముచేయు చుండెనట. ఆసమయముననే టాలువెండి గ్రామనివాసి రా యబులారు గుఱ్ఱమెక్కి యెటునుండియో స్వగ్రామమునకు బోవుచు నానకు పండుకొనియున్న స్థలము సమీపమునుండి చనుచు నామహాద్భుతమును జూచి విస్మితుడై రెప్పవాల్పక బాలుని వానింగాచు సర్పమును జూచుచు గుఱ్ఱము నాపెను. కొంతదవ్వుననున్న పరిజను లంతలో వానింగలుసుకొనుటయు రాయబులారు వానింజూచి "యాబాలుడు మృతినొందెనా" యని యడిగెను. మృతినొందలేదని వారు బ్రత్యుత్తరము చెప్పుటయు రాయబులారు కడునచ్చెరువడి పామును వెడలగొట్టుమని వారి కానతీయ వారుమిక్కిలి మెలుకవతో బాలున కపాయము గలుగకుండ సర్పమును బెదరించి యవ్వలకుదోలి బాలునిడాసి యతడు తా మెఱిగినవాడేయగుట వానిం తమయజమానునకుదెల్పిరి. రాయబులారు వెంటనే గుఱ్ఱముడిగి బాలుని ముద్దుపెట్టుకొని యతనెవ్వడో యవతారపురుషుడని నమ్మి గ్రామమునకుబోయి తనచూచినదంతయు బూసగ్రుచ్చినట్లు కాళునితో జెప్పి బాలకుడు సామాన్య మనుష్యుడు గాడు. కావునవానియెడల నెక్కుడు దయజూపుమని బ్రతిమాలి యింటికిబోయెను. ఇట్లు రెండుమూడు సంవత్సరములు కాళుడు కుమారుని గోపాలకవృత్తియందు నిలిపి దానికతడు తగడని గ్రహించి కొడుకు చాకచక్యమునుజూపి పాటుపడదగినదియు బడిన పాటునకు లాభము గలిగించునదియు నగు వృత్తిం బ్రవేశ పెట్టదలచి యొకపొలము వానికిచ్చి యందు వ్య వసాయము చేయుమని వానిని నియోగించెను. అదనునందే పొలముదున్నుట విత్తనములనాటుట మున్నగుపనులు జరిగెను. పక్షిదొంగల బారినుండియు పందులు మొదలగు జంతువులబారినుండియు జేను కాపాడుట నానకు పనియైయుండెను.
అతడును దనపొలమున వ్యర్థముగ గూర్చుండక పలు మారిట్టటుదిరుగుచు గేకలువేయుచు జప్పటులజరచుచు చేను కాచుచున్నట్లె యగుపడెను. కాని యొకనాడైన నతడు చేతులార వడిసేలత్రిప్పి యెఱుగడు మీదుమిక్కిలి ప్రక్కపొలములయందలి కాపుల పసువులు తనచేల బడినప్పుడు వానిం బారదోలుట తనకెంతో కష్టముగనుండెను. ఒక్కొక్కనాడతడు దయారసముచేత నొడలు మంచి మృగములు పక్షులు యధేచ్చముగ బండిన చేను మేయుచుండ గన్నులప్పగించి చూచుచు నూరకుండువాడు. కాళుని మనసెప్పుడును గుమారునిదెసయనుమానాస్పదమైయుండుటచే నొకనాడతడు పొలమునకుంబోయి చేను దెసజూచి యది పాడుగానుండుట గ్రహించి మితిమీరిన కోపమునంది యాబాలకుని మిక్కిలి తూలనాడి దానం దనివినొందక నింటికిబోయి తనయుండు మహైశ్వర్యవంతు డగునని జాతకమువ్రాసిన పురోహితునిమీదబడివానినెంతయు నిందించెను.
ఆపురోహితుడును శాంతముదాల్చి కాళుని కోపకారణమెఱిగి తనపలుకు లసత్యములు కావనియు నానకు సర్వ లోకపూజ్యు డగుననియు లక్షలకొలది జనులకతడు మహోపకారము చేయగలవా డగుననియు రాజాధిరాజులైన వాని గీచినగీటు దాటక వినయమున మెలంగుదురనియు జెప్పి వాని ననునయించి పంపెనట. నానకుయొక్క చరిత్రకారులు జ్యోతిశ్సాస్త్రమునందు నమ్మికగలవారగుటచే బై పలుకులు పురోహితుడు చెప్పినను చెప్పకున్నను వానినోట బెట్టియుందురు. ఇక్కడికి నానకు పసులకాపరి తనమున కేగాక వ్యవసాయము చేయుటకుగూడ దగనివాడని తండ్రి విస్పష్టముగ గ్రహించి వాని నేవృత్తియందు బ్రవేశపెట్టి బాగుచేయనగునోయని కొంతకాలము విచారించి యేపనియందు నియోగింపకుండ నూరకయే గొన్నిసంవత్సరము లుంచినపక్షమున బాలుండు బాగుపడవచ్చునని వాని నైదుసంవత్సరములవఱకు యధేచ్ఛముగ సంచరింపుమని చెప్పెను.