నానకు చరిత్ర/ద్వితీయాధ్యాయము
శ్రీ
నానకు చరిత్ర.
ద్వితీయాధ్యాయము.
విద్యాబుద్ధులు నేర్చుకొనవలసిన కాలమున జనకుడు కుమారుని మనసువచ్చినట్లు దిరుగుమని చెప్పుట యసంభవమేయైనను గాళుడు పుత్రుని నతనముచేత విసిగి యట్లు చేసెనేగాని బిడ్డను బాగుచేయవలయునను తలంపు లేక కాదు. కాళుడు పండ్రెండవ యేట నానకును స్వేచ్ఛావిహారమునకై విడిసి దృడ మనోబలము గలవాడగుటచేత నైదేండ్లలోపున మరలనెన్నడు వానిపురోవృద్ధివిషయమై వానితో ముచ్చటింపక యైదేండ్లు గడచినపిదప ననగా నానకునకు బదునేడేండ్లు వయస్సు వచ్చినపుడు బుద్ధియేమైన మరలినదేమో చూడవలయునని కొడుకునొకసారి పిలిచి తాను మరణము నొందకమునుపే నేదైననొక మంచివృత్తి నేర్చుకొనుట మంచిదనియు దనమరణానంతరమున మొగమైన జూచువారుండరనియు వ్యవహారము నేర్చుకొనవలసిన యదను దాటినచో మరల గూడిరాదనియు నయమున భయమున జెప్పి కొడుకును బుజ్జగించెను. చిన్నతనమునుండియు గాళుడు వ్యవహారమే చేయుటచే నదియే యుత్తమమైన వృత్తియనియు నదిలేనిచో గొడుకు బ్రతుకలేడనియు గాళుని యభిప్రాయము గావున నతడంత నొక్కిచెప్పెను. కొడుకు తండ్రిపలుకులు తలవంచుకొనివిని మిక్కిలి వినయముతో వెనుక చేసినదంతయు క్షమింప వలయునని యడిగి చేయుమన్న వ్యాపారము తప్పక చేయునట్లొడంబడెను. కుమారునియందేదో మంచి మార్పు కలిగిన దని తండ్రి సంతసించి యాపదును చెడకుండ వానిం దగినపనిలో నియోగింపవలయునని వానిచేతి కిరువది రూపాయలిచ్చి చుట్టుప్రక్క పల్లియలకుంబోయి సరకులుకొని తీసికొనిరమ్మనియు లాభమున కమ్ముమనియు జెప్పి యాచిన్నవ్యాపారములో జాగ్రత్తగా నడచుకొని ధనము మంచివినియోగము చేసినపక్షమున ముందుముందు వాణిజ్యము నిమిత్త మెక్కువధన మిచ్చునట్లు వాగ్దానముచేసి యాసపెట్టెను. అప్పలుకులు విని నానకు "యీధనము మంచివినియోగమే చేసెద" నని నుడివిబయలుదేరి పోయెను. కాళుడు కొడుకునందు పూణన్ విశ్వాసములేనివాడై యెందుకైనను మంచిదని బలుడను నొక కాపువానిని జతయిచ్చి తనకుమారుడు సొమ్ము పాడుచేయకుండ జూడుమని వానితో నొక్కిచెప్పి సొమ్ము కుమారుని చేతికివ్వక బలుని బొడ్డుకొంగున గట్టిగ మూటగట్టి పంపెను. కాళుడెంత జాగ్రత్తపడినను దైవనిణన్‌యము వేరుగనుండె ను. నానకు తండ్రికడ సెలవుగైకొని బయలుదేరినదిమొదలు "ఈదినము మంచి వినియోగమే చేసెద" నన్న మాటలకు తండ్రికిదోచిన యర్ధముకంటె విపరీతార్థము తోచనారంభించెను. ఇందుకు కారణము తండ్రి యభిప్రాయము తెలియకపోవుటకాదు. బయలు దేరిన తోడనే వానిమనస్సు సత్కార్యములమీదికి బోయి శరీరమును బరవశముచేయ నతడు తనతండ్రి యేమిచేసిననుసరే యత డిచ్చినసొమ్ముతో బియ్యము పప్పు మొదలగు సరకులుకొని మారుబేరమున కమ్ముటకంటె యాధనము భగవద్విషయమున వినియోగించుట యుత్తమమని భావించెను.
తండ్రి చెప్పినవిధమున జేయనొడంబడి మరల వాని యాజ్ఞకు విరుద్ధముగా వర్తించుట మంచిదికాదని నానకుకొంతసేపు విచారించెను; కాని వానిహృదయ మెన్నివిధముల మరల్చినను మరలదయ్యె. అతడట్లు ధర్మకార్యస్థిత మనస్కుడై చనుచుండ మధ్యమార్గమున నొక సన్యాసులగుంపు వాని కగపడెను. ఆవిరాగు లదివఱకు కొన్నిదినములనుండి యాహారము లేక మలమల మాడుచుండిరని విని నానకు మిక్కిలిజాలినొంది బలునివద్దనుండి బలవంతముగాసొమ్ముపుచ్చుకొని యాగుంపు పెద్దచేతికిచ్చెను. ఆవృద్ధసన్యాసియు దన కా సొమ్మక్కరలేదనియు దినుటకు పదార్థము లుపయోగించును గాని రూకలుపయోగింప వనియు జెప్పి యాదానమును నిరాకరిం ప బరమదయాళువగునానకు పరుగుపరుగున దాపుననున్న పల్లెకుబోయి గోధుమపిండి చక్కెర పప్పుమొదలగు సరకుల గొనితెచ్చి వానికి సమర్పించెను. సన్యాసులు వానింబరిగ్రహించి విందారగించిరి. నానకు వృద్ధసన్యాసితో జాలసేపు వేదాంత చర్చజేసి వారచ్చోటు విడిచినపిదప మెల్లమెల్లన యింటికి బయలుదేరెను. కాని వానియడుగులు మునుపటియట్లు సాగవయ్యె. తనతండ్రి యెట్టివాడో తనకుమూడ దలచిన యాపదయెట్టిదో యెఱుంగుటచే నతడు బెంగగొ దారిలో నడుమనడుమ "అయ్యో నేనేలపరవశుడనై పోతినోయి" యని బలునితో పలుక బలుడును "వద్దని నేనుమొత్తుకొనలేదటోయి నీవు విన లేదు కాని" యని బదులు చెప్పుచు వచ్చెను.
అటుమాటలాడుచు నిరువురు గ్రామసమీపమునకు జేరి నానకు తండ్రికి జడిసి యింటికిబోవక యూరుబయట చెట్లలో దాగికొనెను. బలుడు స్వగృహమునకు బోయెను. కాలుడు రావలసినవేళకు గుమారుడు రాలేదని వగచుచు బలుడువచ్చినట్లు విని విసవిస వానియింటికిబోయి యాత్రముతో దనకుమారుని వార్త యడుగ వాడు జరిగిన వృత్తాంతమంతయు బూసగ్రుచ్చినట్లు జెప్పెను. అదివిని కాలుడు రౌద్రాకారముంబూని ధనముపోయినందుకు నేరమంతయు వానిమీదమోపెను. బలుడు జంకక "నేవద్దని నుడివిన నీకొడుకే పాడుచేసె" నని బింకముతో బ్రత్యుత్తరము జెప్ప, కొడుకు జూపుమని జెబ్బపట్టుకొని వానిని లాగికొనిపోయి చెట్లచాటుననుండి కొడుకు నీవలకీడ్చి తిట్లవానవానిమీదజిత్తజలుగ గురిపించెను. తండ్రి యెన్నివధముల దూషించినను నానకు తలవంచుకొని ప్రత్యుత్తరము జెప్పక యూరకుండెను. కుమారుడు పుట్టినదిమొదలు వానినెన్నివిధములనో బాగుచేసి తనవృత్తియందు ప్రవేశపెట్టి ధనమార్జింప జేయవలయునని యూటలూరి కాలుడు పుత్రుని యప్రయోజగత్వముజూచి నిర్విణ్ణుడై యాసలన్నియు నడుగంట వాడెందుకు పనికిరాడని చచ్చిననుసరే బ్రతికినను సరే వానిజోలికి బోగూడదని నిశ్చయించుకొనియె.
తండ్రికోపము వడగండ్ల వానవలె మొట్టమొదట విజృభించెనేగాని తరువాత నంత మిక్కుటముగా నుండదగదని నానకు గ్రహించి యాదినము మొదలుకొని తండ్రి చూచుచుండగనే సాధువులతో సన్యాసులతో సహవాసము చేసి మాటలాడజొచ్చె వారిద్దరొక యింటనున్నను దండ్రికొడుకులా గుండక యొండొరుల మెఱుగనివారివలె నుండిరి. కాలునకు గుమారునివలన గలిగినష్ట పరాభవములను నానకునకు గలిగిన యవస్థయు నిరుగుపొరుగు వారందరువిని విచారించిరి. రాయబులారు మరునాడుదయమున కాలునిదనయింటికి రావించి నానకునెడ నతడు చూపినకాఠిన్యమునకు దనకు చాల విచారముగా నున్నదనియు వానింబాధపెట్టవద్దని తానొకసారి వెనుక కోరినను దనమాటయైన లక్ష్యముసేయకపోవుట యనుచితమనియు గలిగిననష్టము దానిచ్చుకొన గోరుచున్నవాడనియు జెప్పి యిరువది రూకలు దెచ్చి కాలునిచేతిలో బెట్టెను. కాలుడు మిక్కిలి సిగ్గుపడి తనకాసొమ్మక్కరలేదని చాలసేపు నిరాకరించెను కాని వానిప్రార్థనమీద నెట్టకేలకు స్వీకరించెను. కుమారుడు పాడుచేసినసొమ్ము కాలుడు రాయబులారువద్ద పుచ్చుకొన్నాడనివిని లోకులు కాకులు పొడిచినట్టు పొడిచి యాత్మగౌరవము జంపుకొని ధనమే పావనముగా నెంచుకొన్నందుకు వానిని మిక్కిలి నిందించిరి. ఆనిందలుపడలేక కాలుడు సొమ్ముతీసికొనిపోయి మరల రాయబులారునకీయబోవ నతడు పుచ్చుకొనక వానివద్దనే యుంచుమని బ్రతిమాలి వెండియు నిట్లనియె "నీకుమారుడు నీయింట బొత్తుగా సుఖపడుట లేదు. వానిని వేరొకచోట బసచేయింప వలయునని నేదలంచుచున్నాను. నేనుతురక నైపోతినిగాని లేనిచో వానిని మాయింటనే పరమానందముతో నుంచుకొందునుగదా; జాతిమతభేతములచేత నట్టిప్రాప్తి నాకులేదు" అని వానితో బలికి యది మొదలు రాయబులారు నానకునందు మిక్కిలి భక్తి ప్రేమలు గలవాడై వానికి సుఖమిచ్చు బస నేర్పరుపవలయునని దలపోయుచుండెను.
అట్లుండ నొకనాడు సుల్తాను పురవాసియగు జయరాముడను క్షత్రియుడొకడు పంజాబుదేశ పరిపాలకుడగు దౌలతుఖాను లోడీపనుపున పంటల యంచనా వేసికొనుటకు తాల్వెండీ గ్రామమునకుంబోయెను. అతని కప్పటికి వివాహముకాలేదు. ఆరాజకుమారు డొక్కనాడు కాలుని కుమాతెన్‌యగు నానకినిజూచి యామె చక్కదనము నచ్చుటయు నాకన్నియను దనకిమ్మని తండ్రినడిగెను. అతనికోరిక కనుగుణముగ రాయబులారుగూడ జయరాముని సద్గుణముల నుగ్గడింప గాలుడు సంబంధ మంగీకరించి ముందుగప్రధానముచేసి యల్పకాలములోనే కూతును జయరామునకిచ్చి వివాహముచేసెను. వివాహానంతరమున బెండ్లికూతురు పెండ్లికుమారునితో గృహప్రవేశమునకు బోన గాలుడు నానకును వానివెంట సుల్తానుపురమునకంపెను. నానకుతండ్రిమాట జవదాటక నచ్చటికి తిన్నగాబోయి చెలియలను మరల దోడ్కొనివచ్చెను. మరుసటిసంవత్సరము వైశాఖమాసమున జయరాము డత్తవారి యింటికి రాగా రాయబులారు వానిం బిలిచి నానకునుకు బొత్తిగా సుఖములేదనియు దండ్రి మిక్కిలి కఠినుడగుటచేత స్వగృహమున నున్నంతకాలము కష్టమే ప్రాపించుననియు దోబుట్టువు దగ్గరనున్న పక్షమున నతనికి సుఖము కలుగుననియు జెప్పెను. జయరాముడందుకు సమ్మతించి వానిని వెంటగొనిపోవుదునని ప్రత్యుత్తరమీయ రాయబులారు "తొందరపడవద్దు ఇదిసమయముగాదు. సమయమువచ్చినప్పుడు నేనే పంపెద" నని యప్పటికి నివారించెను. అనంతరము జయరాముడు భార్యాసమేతుడై స్వగ్రామమునకు బోయెను. పిమ్మట కొన్ని మాసములుగడువ నొకనా డుదయమున స్నానముచేసి చెంబుచేతపట్టుకొని యింటికిబోవుచుండ దారిలో నొకసాధువు కనబడెను. కనబడినతోడనే యతడు వానికడకుబోయి చాలసేపు వానితో వేదాంతచర్చచేసి చెంబును వ్రేలనున్న యుంగరమును వానికిచ్చి గృహమునకుబోయెను. కాళుడు వానినిజూడగానే యావస్తువు లేవియని యడిగెను. నానకు వానిమాటలు కేయుత్తరమును జెప్పక తలవంచి నిలిచియుండెను. అప్పుడు కాళుడు దుర్భర కోపావేశమున వానిం బలుతెఱంగులదిట్టి యిట్లనియె. "నీవు నాకెందుకు బనికిరావు. నాగృహము తక్షణము విడిచి నీయిచ్చవచ్చినకడకుబోయి యన్నము సంపాదించుకొని బ్రతుకుము నేను నీవిషయమున నన్నియాసలు విడుచుకొన్నాను."
అహహా! కాళుడు బిత్తలుకతో నేబాలుని బరమ మూర్ఖునిగా భావించి నిందించెనో, యాబాలుని లోకులు సర్వజ్ఞునిగ భావింతురని యించుకేనియు నెఱుంగడుకదా! అతడెవ్వని తనగృహమం దుండనీయక వెడలనడపెనో యాబాలుని ముందుముందు రాజాధిరాజులు సింహాసనంబులు దిగివచ్చి ప్రణతులై నిజాంత:పురమునకు రమ్మని ప్రార్థింతురనిస్వప్నమందైన నెఱుగడుకదా! అట్లెఱుగక యింటనుండి కాళుడు కొడుకునుదోలుటయే లోకమునకు మేలయ్యె; రాయబులారు నానకును దండ్రి యింటనుండి లేచిపొమ్మనవిని కా ళునిబిలిచి "నీకు నీకొడుకునకు నింకపడదు. పడనప్పుడు మీ యిరువురు బగవారివలె నొండొరులవిడువ దగదు. కావుననానకును మంచిమాటలుచెప్పి జయరామునికడకు పంపుము నీకోరికప్రకారము నీయింటనుండక పోవుటయు వీలున్నపక్షమున బాగుపడుటయు సంభవించు"నని హితోపదేశము చేసెను. కాళు డాయుపదేశమువిని యదిలెస్సగానున్నదని కనిపెట్టికొడుకుమీద నెంతకోపము వచ్చినను గడుపుతీపిచేత సంబంధము బొత్తుగావదలుకొనుట కిష్టములేక జయరామునివద్ద నున్నపక్షమున నెప్పటికైన నానకు బుద్ధితెచ్చుకొని బాగుపడితనవద్దకు వచ్చుట కవకాశముండునని తలంచి యప్ప బావల వద్దకు బొమ్మని పుత్రునికానతిచ్చెను. రాయబులారు నానకును మిక్కిలి గౌరవింపవలసినదనియు వానికి జూపిన యాదరము తనకు జూపిన యాదరముగ నెంచుకొందుననియు జయరామున కొకజాబువ్రాసి నానకు చేతికిచ్చెను. ఆజాబుపుచ్చుకొని నానకు విషాదపూరిత మనస్కుడై సుల్తానుపురమునకు బోయెను. ఎంతవారికైన దలిదండ్రులను జన్మస్థానమును విడుచుట కష్టముగదా? జయరాముండు లోకముతోడి పాటువాడు కాడు గావున వానికీవిథమగు జా బవసరమేలేదు. జయరామునికంటెను వానిభార్య నానకి సద్గుణముల దొంతి యగుటచేతను నామె కున్నంత సోదరప్రేమ సాధారణముగ లోకమునందెవరికి నుండక పోవుట చేతను నానకు యిలువెడలినతోడనే సుఖపడు కాలమువచ్చినదని మనమునమ్మవచ్చును. బలుడును కాపుకుఱ్ఱవాడు మొదటినుండియు నానకు బరమభక్తుడు అందుచేత వాడయాచితముగ దలితండ్రులను గృహమును విడిచి నానకు వెంటబోయెను. పోయి యొక్కనాడైన సుఖింపక గురువుతో గలిసి యెన్నో యిడుమలబడెను.
ఇల్లువిడిచి యైదుదినములు పయనముచేసి నానకు సుల్తానుపురము చేరెను. అక్కయు బావయు వానిని కడుబరమానందమునొంది మిక్కిలి గౌరవించి జయరాముడు మరది జూచి నీవునీయిచ్చవచ్చినట్లు భగవథ్యానముచేసికొనుచు గూర్చుండ వచ్చు, నీజోలికెవ్వరు రారని స్పష్టముగ జెప్పెను. అంతటి యాదరము జూపినందుకు నానకు తనయప్ప బావలకు గృతజ్ఞుడై వందనములుచేసి చిరకాలము మీకు వేను భారముగానుండ"నని తనయాత్మగౌరవము వెల్లడియగునట్లు బలికెను. తనయునికి బావకు భారముగానుండునని తలంచి నానకావిధముగా బలుక లేదు. చెడిచెల్లిలింటికి బోవుటకన్న స్నేహితునియింటికి బోవుట మంచిదను సామెతను బట్టిపాటు పడక సోమరియై యక్కసొమ్ముందని యాత్మగౌరవముం జంపుకొనుట యనార్యకృత్యమని యెఱింగి యాతడిట్లు పలికెను. ఆయూరు జేరినదిమొదలు నాన కేదో యుద్యోగము సంపాదించుకొని సొంతపాటువలన బొట్టపోసుకొని తన సేవకుడగు బలుని బోషింపవలయునని నిశ్చయించుకొనెను నానకు పని లో బ్రవేశించుట విజయరామున కంతగానిష్టము లేకపోయినను దోబుట్టువు సొమ్ముతినుట నానకున కిష్టములేదని గ్రహించి యట్టియాత్మగౌరవముండుట మంచిదే యని భావించుటచేతను నానకున కెదురాడుట కిష్టము లేపోవుట చేతను మరది యిట్టిప్రకారము పోవదలచి యతడు పనికొఱకు బ్రయత్నించెను. అప్పుడే దౌలతఖానులోడీ పెట్టించిన ధాన్యపుగొట్టుమీద గుమస్తా కావలసివచ్చెను.
ఆపనిలో బ్రవేశించుటకు నానకు సమ్మతించెను. అంతకు మునుపు నానకు మందకొడిగ గూర్చుండి యెవ్వరితో మాటలాడక నెల్లప్పుడు పరధ్యానముగ నుండుచువచ్చినందున నుద్యోగములో బ్రవేశించిన తోడనే కొంతమాంద్యము వదలుననియు కొడుకు వ్యాపారములో బ్రవేశించినాడని విని కాలుడు పరమానంద మొంది తనయెడం గృతజ్ఞుడగుననియు దలంచి జయరాముండు మరది సంకల్పమును గొనియాడి యవాతన్ భార్యకెఱిగించెను. నానకి తమ్ముని వాతన్ పతి ముఖమునవిని బాలు డంత యాకస్మికముగ నెట్లుమారిపోవునని విచారించి సోదరీగృహమునుండి కాలము బుచ్చుట కిష్టములేక సోదరుడట్లు తలంచెనేగాని స్థిరబుద్ధిగలిగి యామాటకు నిలువంబడి యుండడని భర్తతో జెప్పి యంతట నిలువక తమ్మునిం బిలిచి "మాకు నీవుభారమగా నుండవు మాకు గావలసిన పదార్థము లన్నియు నున్నవి గా వున మనమా నిమిత్తము నీవీ పనిలో బ్రవేశింప నక్కరలే" దని స్పష్టముగ జెప్పెను. ఎంత చెప్పినను నానకు తన యుద్యమమును విడువనందున నానకి వాని యుద్యమమున కొప్పుకొనియె పిమ్మట సతీపతులిరువురు జేరి గుదికఱ్ఱవంటి సంసారబంధమును నానకు మెడకు తగిలించినచో నతడత్యాసక్తుడుగాక యుండునని వాని కచిరకాలమున వివాహముచేయ నిశ్చయించిరి. కొడుకుద్యోగములో జేసినవాతన్ కాలుడు విని వణన్‌నాతీతమైన యానందము నొంది కొడుకింక బాగుపడి తీరుననియు ముందెంతవాడో యగుననియు నూటలూర జొచ్చెను.
నానకు విక్రమార్క శకము 1544 వ సం.రం మాఖ శుద్ధాష్టమినాడు సుల్తాను పురముజేరి కొన్ని దినములలోనే యుద్యోగమున బ్రవేశించెను. దౌలతుఖానులోడీ క్రొత్త గుమస్తాచేతికి ధాన్యపు కొట్టు స్థాపించునిమిత్తము మొదట వేయి రూపాయలిచ్చెను. నానకుయొక్క పూర్వచరిత్ర మెఱిగినవారు వాని స్వభావమున కంత విరుద్ధమైనపనిలో నెట్లు ప్రవేశింపగలిగెనో యని యచ్చెరువడ జొచ్చిరి. మాయామర్మము లెఱుగని బలుడును నానకు లౌకిక వ్యవహారము లందు బ్రవేశించుచున్నవాడు గావున తన సాయ మంతటి నుండి యక్కరలేదనుకొని స్వగ్రామమునకు బోవుటకు దనకు సెలవిమ్మని నానకునడిగెను. నానకు వాని వెంగలితనము నకు జిరినవ్వు నవ్వి యిట్లనియె. "ఓయీ! మోసపోకుము. నే నెట్లు కాదలచినవాడనో యట్లయితీరుదును దానికి నాకు నడుమ నేదియు నడ్డము రాజాలదు. ప్రస్తుతము కాలక్షేపము నిమిత్తము కొన్నినాళ్లీపని జేయబూనితినేకాని యిదినా పరమార్థము కాదు. సమయము వచ్చినప్పుడు మనమిద్దఱము గలిసియే పోవుదుము. గావున నీవు నావద్దనేయుండుము." అప్పలుకులు వినినతోడనే బలుని సందియములు తొలంగెను. తొలంగకపోయినను నానకుమీద వానికి మిక్కుటమగు ప్రేమ యుండుటచేత నతని కోరికప్రకారము వాడచ్చట నుండవలసినవాడే.
నానకు వ్యాపారము రెండునెలలు చేయునప్పటికి గుమారు నొక్కసారి యుద్యోగము చేయుచుండ జూడవలయునని యుబలాటపడి కాళుడు స్వగ్రామమున ముండ్లమీద నుండినట్లుండి యేమియుం దోచక సుల్తానుపురమునకు బోయెను. పోయి కొట్టుమీద కుదురుగా గూర్చుండి వ్యాపారము చేయుచున్న కొడుకుంజూచి పట్టజాలని సంతోష మొంది వ్యవహారమెట్లు జరుపుచున్నాడో తెలియగోరి కొడుకువ్రాసినలెక్కలు పరీక్షించెను. పరీక్షింపగా వచ్చినలాభములో నొక గవ్వయైన నిలువయున్నట్లు వానికి గనబడలేదు. అయినను కాళుడు కొడుకు నేమియుననక కాలక్రమమున నవియు జక్కబడునని తలంచి ప్రస్తుతము కొడుకు కొట్టుమీదకు వే ళకువచ్చి వ్యాపారముచేసి వేళ కింటికి బోవుచున్నా డదియే చాలునని సంతోషించెను.
నానకీ జయరాములు నానకునకు వివాహము జేయ గృతనిశ్చయులైన ట్లిదివఱకే చెప్పియున్నారముకదా? జయరాముం డాసంకల్పము నెరవేరువఱకు సరిగ గుడవక నిద్రింపక చుట్టుప్రక్కల గ్రామములకు దడిమన్ను పొడిమన్నగు నట్లు దిరిగి ప్రయత్నించెను. అట్లు ప్రయత్నించుచుండ నొక గ్రామమున మూళుడను నొక క్షత్రియునివద్ద సంప్రాప్త యవ్వనయై వివాహయోగ్యయగు కన్య యొకతె యున్నదని వానికిం దెలిసెను. అల్లుడామాట మామకు నెఱిగింప కాళుడు మూళునితో వియ్యమందుట కియ్యకొని ప్రధానము చేసికొని రమ్మని జయరామునితో జెప్పెను. ప్రధానము యధావిధిగా జరిగెను. వివాహ ముహూతన్‌ము నిశ్చయింప బడెను. కాళుడు పెండ్లిపనులను జేయింప స్వగ్రామమునకు బోయెను. ప్రధానమైన యొక మాసమునకు జయరాముని వద్దకు కొందఱుపోయి నానకుధాన్యపుకొట్టు సంబంధమగు లాభమును మూలధనమును సాధువులకు సన్యాసులకు నిచ్చవచ్చినట్లు దోచిపెట్టి పాడుచేయుచున్నాడనియు దానివలన బావమరదుల కిద్దరకు నపాయము వాటిల్లుననియు జెప్పిరి. ఆమాటలు విని జయరాముడు తన ప్రాణముమీదికి వచ్చునని భయపడి కర్తవ్యమేమని భార్యనడుగ నామెమగని తెఱ గున భీతిల్లక తన తమ్ముడు లోకవ్యవహారము మెఱుగనివాడు కాడనియు నత డెంతధర్మాత్ముడైనను నీతిసంపన్ను డగుటచే నితరుల ధనము చేతికివచ్చినట్లు వమ్ముచేయడనియు దృడముగ జెప్పి వానివెరపు తీర్చుటకు దమ్ముని బిలువనంపి క్షేమమడిగి యిష్టాగోష్టి కొంతసేపు నడపెను. అదియే మంచిసమయమని జయరాముడు వినయముతోడను శాంతముతోడను మరదిం బలుకరించి యంగడి వ్యవహార మేరీతిం జరుగుచున్నది లాభనష్టము లెట్లున్నవని యడిగెను. నానకు బావనోటనుండి యప్పలుకులు వెడలినతోడనే కంఠస్వరమునుబట్టియు ముఖలక్షణమునుబట్టియు వానికి దనమీద నేదో యనుమానము కలిగినదని గ్రహించి తన్నొక రనుమానించుట కిష్టపడక తన నిరుపరాధత్వమును వెల్లడిచేసికొనదలచి తక్షణము లెక్కలు పరిక్షచేయుమని బావను కోరెను. నానకియు వాని మాటనే యనుసరించుటచే జయరాముడు వాని లెక్కలు శోధించెను. ఏమి చెప్పుదును లెక్కలుచూడగా పెట్టుబడిసొమ్ము దౌలతుఖానుగారి లాభము నిలువయుండుటయేగాక నానకునకు మూడువందల యిరువది రూపాయలు రావలసియుండెను. అది చూచి యక్కయు బావయు మిక్కిలి యానందము నొందిరి. కాని తన మరియాదయు దన న్యాయబుద్ధియు బాటింపక నిష్కారణముగ వారు తనమీదననుమానము నొందినందుకు నానకు మిక్కిలి నొచ్చుకొని మన:ఖేదమునొంది వ్యాపారము మాని పోవలయునని తలంచెను. కానీ సోదరీభావుకలు చాల బలవంతము చేయుటచేతను వారి మాట గౌరవింపవలయునని బలుడు ప్రార్థించుటచేతను నిలువవలసి వచ్చెను. దౌలతుఖాను వాని సత్యసంధతకు మెచ్చి పెట్టుబడినిమిత్తము రెండువేల రూపాయల నిచ్చెను. కొట్టు క్రమక్రమముగ వృద్ధిపొందెను. నెలనెలకు రాబడి హెచ్చెను. ఈవృద్ధికి నానకుమిక్కిలి సంతోషింప జొచ్చెను. కాని యాసంతోషము ధనలాభము వచ్చుచున్నదని కాదు. మరేమనిన సత్పురుషులకు సాధువులకు సన్యాసులకు దీనులకు దైవభక్తులకు సహాయముచేసి తన జన్మముసఫలము చేసికొనవచ్చునని యత డాయుద్యోగమునం దంతకాలముండెను. నానకుయొక్క యాత్మజలమందుండియు జలసంపర్కము లేని తామరపూవువంటిది గదా!