నానకు చరిత్ర/చరమావస్థ

వికీసోర్స్ నుండి

చరమావస్థ

నానకు షష్టిహాయన పూతిన్ చేసినందున మనుపటివలె సాధువులయొక్కయు సన్యాసులయొక్కయు పకీర్లయొక్కయు సహవాసము చేసి వేదాంతగోష్టితో గాలము బుచ్చుట కవకాశము లేకపోయెను. ఏదోయొకచోట స్థిరముగా నుండి పశ్చిమవయస్సు గడుపవలయునని నిశ్చయించి యేగ్రామము తనకనుకూలముగ నుండునోయని యతడు విచారింపదొడగెను. అట్లొకస్థానమేర్పరచుకొనక మునుపు జన్మభూమియగు తాల్వెండి కరిగి పిత్ర్వంశస్థులలో హతశేషుల నొకసారి చూడవలయునని కోరిక గలిగినందున నతడచ్చట కరిగెను. అతని పినతండ్రి యగులుల్లామాత్రమప్పటికి జీవించి యుండెను. నానకు పినతండ్రియింట బదునైదు దినములుం డెను. యావజ్జీవ మచ్చటనే యుండవలసిన దని పినతండ్రి నానకు ననేకవిధముల బ్రతిమాలెను. కాని యతడు దానికి సమ్మతింపలేదు. నానకు తన్ను విడిచిపోవునప్పుడు పినతండ్రి గుఱ్ఱమొకదానిని తెచ్చి సుకరముగ బ్రయాణము సేయుటకు వీలుగ నుండును గనుక దానినైన బరిగ్రహింపవలసిన దని పలువిధముల వేడుకొనెను. అదియు బరిగ్రహింపక నానకు వానికిట్లనియె. నేను భగవంతుని కొలువు చేయుచున్నాను.. ఇప్పుడు నామనస్సులో నేవిధమైన సంతాపము గాని బెంగగాని భయము గాని సందేహము గాని లేదు. ఇది పెట్టుబడిలేనివ్యాపారము కాని లాభము విశేషముగ వచ్చుచున్నది. ఇది యిమ్మని అది యిమ్మని యడుగువారు లేరు. ఎంతయదృష్టవంతులకో గాని యిటువంటి బేరము తగులునా అట్లు చెప్పి పినతండ్రిని వీడ్కొని చిరకాలమునుండి తన్ను సేవించుచున్న బలుని తన శుశ్రూషాబంధమునుండి విడిపించి యధేచ్చముగ విహరింపవలసిన దని యానతిచ్చి బియాసునదీతీరమున మిక్కిలి మనోహర మైనయొక స్థానము తనకు నిలయముగ నేర్పరచుకొని యాస్థానమునకు విశ్వకతన్ యగుపరమేశ్వరునిపేరు పెట్టదలచి కర్తారపురమని నామమిడెను. ఇచ్చట సాధువులు యోగులు పెక్కండ్రు చేరి యతనిని సేవించి యతని సహవాససౌఖ్య మనుభవించిరి. అతనిభార్య యగుచూనీదేవియు నానకుయొక్క కొడుకులు గూడ నచ్చోటనే జేరిరి, ఆబిడ్డలు ' వచ్చిరని యతని కానందములేదు. విచారము లేదు. సన్యాసులకు తమమనస్సె సమస్తానందములు గలుగ జేయును. గాని బాహ్యవస్తువులు సంతోష మొసంగ జాలవు. అత డీవిధముగ నొకచోట స్థిరముగ నుండుటవలన గొప్ప ప్రయోజనము గలిగెను. ఆమహాత్ము డదివఱకు బోధించిన బోధనములవలనను గానముచేసిన గీతములవలనను చేసిన వాదముల వల్లను నతని యభిప్రాయములు దెలియుచుండినను నవి యొక వరుసలేక చెదిరి విడివిడిగా నుండుటచేత నెల్లవారికి సులభముగ లభింపకుండెను. పూర్వోత్తర సందర్భములు చక్కగా గమనించి యవి యొకచో జేర్చివ్రాసి లోకుల కుపయోగముగనుండునట్లు చేయవలసిన భారము తనపై నుండెను. ఒకచో స్థిరముగ నుండుటవలన గలుగు ముఖ్యప్రయోజన మిదియె. ఆకర్తారపురమందుండి నానకు తనపని నెఱవేర్చుచుండ లెహనుడను నొకక్షత్రియుడు విష్ణుదేవి యనుక్షత్రియువకు యాత్రపోవుచు నీగ్రామమునకు బోయి యచ్చోట మహానుభావుడొకడున్నాడనివిని యాతని సందర్శించెను. ఆక్షత్రియుడు కర్తారపురమున నొక్కదినము మాత్రమె యుండదలచెను. కాని నానకుయొక్క బోధామృతపానముచేత నతడు పరవసు డై యచ్చోటు విడువజాలక నిరంతర శుశ్రూషలచేతను పరమార్థగ్రహణముచేతను వినయవివేక సంపత్తిచేతను సత్ప్రవతన్‌నముచేతను గురువుయొక్క యనుగ్రహము బడసెను. గురుశిష్యులకు గలపరిచయము స్వల్పకాలమునుండి యైనను నారాచవానిభక్తిజ్ఞాన వైరాగ్యములు గురువుమనస్సును సంపూర్ణముగ గరగించి యతనియందు పుత్రవాత్సల్యము గలిగెను.

తనయనంతరమున దాను బోధించిన మతములోకమునకు బోధించుటకు దగినవా డారాచవాడే యని నానకు వానినే పీఠాధిపతిం జేసెను. ఈకార్యము చూనీదేవికి మిక్కిలి కష్టముగ నుండెను. పీఠాధిపత్యము కుటుంబమునకు గౌరవము విశేషముగ గలిగించుటయె గాక కట్నములు కానుకలు మొదలగువానిరూపమున ధనలాభము గూడ గలిగించును. గావున నట్టిమహాపదవి తనకొడుకులకు రాక పరాధీనమగుటచే నాయిల్లాలు మిక్కిలివగచి యది తనపుత్రులయందె నిలుపు మని యతనిం బ్రార్థించెను. కాని మతబోధకు డైన పీఠాధిపతికుండవలసిన లక్షణము లేవియు దనకుమారులయందు బొడకట్టక క్షత్రియునియందె పొడగట్టుటచేత నతడు లోకోపకారార్థమై పుత్రస్నేహ మొకమూలకు ద్రోచి మతవ్యాప్తియె ప్రథానముగ జేసికొని యిల్లాలి మొఱలు పెడచెవిని బెట్టి రాచవానినె పీఠమున బ్రతిష్ఠించి యతనికి యంగదుడనునామమిచ్చెను. చూనీదేవి నెట్లయిన తనకావించిన యేర్పాటున కొడంబరుపదలచి నానకు తనకుమారులను రాచవానిని బలుసారులు భార్య యెట్టయెదుట బహువిధముల శోధించెను. ఆశోధనలలో క్షత్రియుడె సర్వవిధముల శ్రేష్ఠు డని చూనీ దేవికింగూడ దోచుటంజేసి సత్యమొప్పుకొనక తప్పదుగావున మనసులో నిష్టము లేకపోయినను నామె రాచవానినె బ్రతిష్ఠింప దగు నని నోటతో ననెను.

ఆమహాపదప్రతిష్ఠుడగు తన శిష్యుడు మత్సరగ్రస్తులైన జనులచేత బీడింపబడకుండ నతని స్వగ్రామమునకే బోయి యుండవలసినదని శాసించెను. తను వచ్చినపని సమాప్తమైనందున నానకు దేహత్యాగము చేయవలసినకాలము సమీపించు చున్నదని గ్రహించి యందుకు సన్నద్ధు డయ్యెను. మరణము సమీపించు చున్నదని యాతడు తెలిసికొని యొక నాడతడు రేపురాత్రిలోపుగ నేను లోకాంతరమున కేగుదునని చెప్పెనట. అతని బసకు సమీపమున నొక మర్రిచెట్టు గలదు. ఆవృక్ష మతనికి మిక్కిలి ప్రియము. అతడు పలుమాఱు దాని నీడకు వసియించి సుఖించెను. ఆదినమున గూడ నత డాచెట్టుక్రిందనే తన సెజ్జలపరపించుకొని పండుకొనియెను. ఆమహాత్మునకు గాలము సమీపించినదని విని హిందువులు మహమ్మదీయులు గూడ గడసారి యాతని దర్శనము జేయగోరి గుంపులు గుంపులుగ బోయి చూచి ధన్యులైరి. మరణము నిమిత్తము ప్రత్యేకముగ నతడు గట్టించుకొన్న యింటిలోనికి దన్ను తీసుకొని పొమ్మని సాయంకాల మతడు కోరెను. ఆగృహమున స్వబంధువులయొక్కయు శిష్యగణము యొక్కయు సన్నిధి నతడు 1526 వ సంవత్సరమున నాశ్వ యుజ శుద్ధ దశమినాడు జామురాత్రియుండగ బరమపదము నొందెను. చూనీదేవియు గొడుకులు పీఠాధిపత్యము తమ కుటుంబములో నుంచవలసినదని కట్టకడపటి దినమున సయితము గురుని యడుగులపైబడి వేడుకొనిరి. కాని యతడు నిశ్చయుడై వారివేడుకలుత్రోసిపుచ్చెను. గురుకళేబరమునకు దహనసంస్కారము చేయదలచి హిందువులా శవమును రుద్రభూములకడకు గొనిపోయిరి. అది విని యంతయు మహమ్మదీయులు నానకు తమ మతమే బోధించె ననియు దమవాడే యనియు శవము తమ యధీనమే కావలసినదనియు వాదించి శవమును ఖననము చేయుటకై తెమ్మనిరి. హిందువులందుకు సమ్మతింపకపోగా రెండుతెగలకు భయంకరమైన కలహము వచ్చుటకు సిద్ధమయ్యెను. ఉభయులు కత్తులు దూసిరి. అప్పుడొకజ్ఞాని యాగుంపులోనుండి వచ్చి నానకు వంటి మహాత్ములు తమకళేబరములోనుగూడ విడిచి పోవరు సుడీ యని పలికెను. ఆమాట విని హిందువులు మహమ్మదీయులు గూడ కళేబరమును మున్ను బెట్టిన నెలవునకు బోయి చూడ నచ్చట శవము లేకపోయెను. ఎల్లవారు విస్మితులైరి. ఆయన కప్పుకొన్న దుప్పటి మాత్రము లభించుటంజేసి యది హిందువులు మహమ్మదీయులు రెండుతునకలు చేసి చెరియొక తునక పుచ్చుకొనిరి. హిందువు లాతునకను దహనము చేసిరి. తురకలు నేలపూడ్చిపెట్టిరి. ఈవిధముగ మహానుభావుడైన నానకు పేదకుటుంబము పుట్టి తనవిజ్ఞానసంపత్తిచేత జగద్గురువై మతకతన్‌యై డెబ్బదియేండ్లు జీవించి జీతకాలములో నొక్కనిమిషమైనను వ్యర్థముచేయక జ్ఞానసంపాదనమునందే వినియోగించి సంసారశృంఖలముల నాసముగ నను ద్రెంపివైచి యెవ్వరికొలువు సేయక దేవ దేవునికొలువే చేసి చరితార్థుడై యాతని సాన్నిధ్యము బడసెను.

నానకు స్థాపించిన మతముపేరు సీకుమతము. తన్మతస్థులు సీకులు అని వ్యవహరింప బడుచున్నారు. వీరు పంజాబు దేశమున విశేషముగ నున్నారు. నానకుయొక్క మతము చైతన్యు వైష్ణవమతమువలె బసవేశ్వరుని జంగము మతమువలె వర్ణభేధశూన్యులై భక్తిరసప్రధానమైయుండును. విగ్రహారాధనము చేయ గూడదని నానకు బోధించెను. వేదమునందితనికి గౌరవము కలదు. కాని యిదియే పరమప్రమాణ మని యత డొప్పుకొనలేదు. జీవహింసాస్పదము లైన క్రతువులు మొదలగు కర్మలు పనికిరావని యతడుగర్హించెను. ఈశ్వరుడొక్కడే యనియు నతడు సర్వశక్తుడనియు సృష్టిస్థితి లయకారుణు డనియు భక్తిచేతనే యతడు సాధ్యు డగుననియు నితనియాశయము. శంకరరామానుజమధ్వాచార్యులవలె నితడు విద్వాంసుడు గాడు. జీవాత్మపరమాత్మభేదములు విచారించి యితడు తత్వనిర్ణయములు చేయలేదు. భక్తిజ్ఞానవైరాగ్యములవలన మానవుడు పాపబంథములు విడిచి యీశ్వరసా న్నిధ్యము నొందునని యతడు బోధించెను. సీకులమతగ్రంథముపేరు ఆదిగ్రంథము. దీనికే గ్రంథసాహెబులని పేరు. దీనిలో నానకుయొక్కయు నతని యనంతరమున మతరక్షకులైన గురువులయొక్కయు సిద్ధాంతము లున్నవి. ఇతడు తులసీదాసు కబీరుదాసు మొదలగువారియట్లే పరమభాగవతోత్తముడు. ఈమతము పదియవ గురువగు గురుగోవిందుని కాలమున మహోన్నతమైన స్థితికి వచ్చెను.

సమాప్తము.