Jump to content

నవనాథచరిత్ర/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

ఓమ్

నవనాథచరిత్ర

ప్రథమాశ్వాసము

శ్రీ సర్వమంగళాం ◆ చితవామభాగు
భాసుర భక్తాను ◆ పాల నోద్యోగుఁ
బరమ యోగీంద్ర హృ ◆ త్పద్మషట్చరణు
నురుజటా [1](జూటాగ్ర ◆ యుతశీతకి)రణు
నిగమాంత సంస్తుత్య ◆ నిత్యస్వరూపు
[2]ధగధగిత ప్రభా ◆ తత మేరుచాపు
వనజాతమిత్ర పా ◆ వక చంద్ర నేత్ర.
ఘనతర దురిత సా ◆ గర యానపాత్రు
లీలాతిసముపలా ◆ లిత మహాసేను[3]
శైలారి ముఖ దేవ ◆ సంసేవ్యమాను
గజచర్మ [4]వసను నం ◆ గజ మద గ్రసను
నజగవీ సంస్తుత్యు ◆ నజగవ హస్తు
నగరాజ నిలయుఁ బ ◆ న్నగరాజ వలయు
మృగ[5]శాబకరు మహా ◆ మృగకుల ముఖరు
సార సామృత ఘన ◆ సార నీహార
హార కైరవ సుధా ◆ హార కాసార
సార [6]సాహిత గంధ ◆ సారాబ్జ తార
తారకా కల్ప కాం ◆ తార గోక్షీర
రుచిరాంగు మల్లికా ◆ ర్జున మహాదేవు
నచలితభక్తి మ ◆ దాత్మలో నిలిపి
దరహాస కాంతి కం ◆ దలితాస్యబింబ
.................................నిర్జితబింబ
సురుచిర చూళికా ◆ స్ఫురిత కదంబ
..............................................
నురుకుచ వ్యక్త వీ ◆ ణోత్తర [7]తుంబ

నధిగత శ్రీపర్వ ◆ తైక నితంబ
బుధజనావన పరి ◆ స్ఫుట కృపాలంబ
భ్రామ [8] రాంబ నభిమత ◆ ఫల సిద్ధి నెరయ
విమలచిత్తమున భా ◆ వించి సేవించి
సారంబుగా [9] వేడ్క ◆ సమకొల్పు బీజ
పూరంబు వలకేలఁ ◆ బొల్చు రత్నాల
హారంబు డాకేల ◆ నాదిత్య మకుట
హీరంబు దలఁగల్గు ◆ హేరంబుఁ బొగడి
భద్రకాళీ ముఖ ◆ పంకజ భ్రమరు
భద్రదాయకు వీర ◆ భద్రేశుఁ గొల్చి
నందికేశ్వరు నభి ◆ నందించి ప్రమథ
బృందంబు నర్చించి ◆ పృథ్విపై నెల్ల
సిద్ధులు గలిగి ప్ర ◆ సిద్ధు లైనట్టి
సిద్ధముఖ్యుల నుతి ◆ సేసి మున్నెన్నఁ
దగిన బాణాది స ◆ త్కవులకు మ్రొక్కి

కృతి ప్రశంస


జగతిపైఁ గల సప్త ◆ సంతతులందు
నెఱయ నాకల్పమై ◆ నిర్మలకీ ర్తి
వఱలుట సత్కవి ◆ వఱలుటగాన
సురుచిర మద్వచః ◆ స్ఫురణ శోభిల్ల
విరచింతు నొకకథా ◆ వృత్తాంత మనుచు
నకలంకముగఁ గోర్కు ◆ లడరుచున్నంత
నొకనాఁడు మద్భాగ్య ◆ యోగంబుకతన

ముక్తిశాంత భిక్షావృత్తి రాయ ప్రశంస


శ్రీమహనీయ ప్ర ◆ సిద్ది పెంపెసఁగు
శ్రీ మల్లికార్జున ◆ శ్రీ మహాలింగ
సర్వలోకో త్తమ ◆ సామ్రాజ్యభార
నిర్వాహక ప్రౌఢి ◆ నీతికోవిదుఁడు
కుహనాంబరథ (?) జైన ◆ కోలాహలుండు

మహిత బిజ్జలరాయ ◆ మాన మర్దనుఁడు
సన్నుత శైవదీ ◆ క్షా గురుం డసమ
సన్నాహ గజపతి ◆ సప్తాంగ శూరు
శ్వేతాంబర ప్రాణ ◆ వితత జీమూత
జాత మహోదగ్ర ◆ జంఝానిలుండు
పరసమయాంభోధి ◆ బడబానలుండు
వరశరణాగత ◆ వజ్రపంజరుఁడు
విపుల విశ్వంభరా ◆ విశ్రు తాశేష
నృప[10]వరస్వీకృత ◆ నిజశాసనుండు
బంధుర నిజతపో ◆ బల విశేషాను
సంధాన రక్షిత ◆ సకలకర్ణాట
మండలాధీ[11] శర ◆ మా విలాసుండు
చండ విరోధి తు ◆ షార భాస్కరుఁడు
నరనుత వితరణ ◆ నందిత సుకవి
వరతిరస్కృత ..... ..... ..... ..... ..... .....
..... ..... ..... ..... ..... ..... ..... ..... ..... .....
..... ..... ..... ..... ..... ..... ..... ..... ..... .....
సంతాన [12] కృతకథా ◆ స్తవ పరిశ్రముఁడు
కలిత యశఃపూర ◆ కర్పూర తిలక
లలిత ది [13] క్కాంతాల ◆ లాటమండలుఁడు
ప్రణుత నిరంకుశ ◆ ప్రతిభా వధూత
ఫణిసార్వభౌముఁ డ ◆ ప్రతిమ ప్రభావుఁ
డవిరళ యోగవి ◆ ద్యా నిధి యపర
శివమూర్తి సంతతా ◆ శ్రిత కల్పతరువు
ఘన [14] ముక్తిశాంత భి ◆ క్షావృత్తి రాయఁ
డనుపమం బైన మ ◆ హా వైభవంబు
దనర విచిత్ర వి ◆ తాన రమ్యమును
కన దుదంచిత హేమ ◆ కలశ భాసురము
కర్పూర హిమజల ◆ కాశ్మీర మిళిత
దర్పసా రాంబుసి ◆ క్త ప్రదేశమును
దపనీయ జాల [15] కాం ◆ తరగత ధూప

విపుల సౌరభ సమ ◆ న్విత గంధవాహ
వాసిత దశదిశా ◆ వలయంబు నగుచు
భాసిల్లు నిజసభా ◆ భవనంబునందు
శ్రీసముజ్‌జ్వల రత్న ◆ సింహాసనమున
నాసీనుఁ డై బిరు ◆ దందె [16] బాగొందఁ
దాఁచిననీలాల ◆ తళుకు లొక్కింత
చాఁచిన నిజ వామ ◆ చరణాబ్జమునకు
మసలక మ్రొక్కెడు ◆ మండలేశ్వరుల
పసగల కోటీర ◆ పద్మరాగములఁ
బరగు క్రొమ్మించుల ◆ పైని రాణింప
నరుదైనపసిఁడి హం ◆ సావళి నన్నె
జిగి ధగధగ యను ◆ చీనాంబరంబు
మిగులఁ దీర్చిన కాసె ◆ మీఁదఁ జెన్నొందఁ
గట్టిన రత్నాల ◆ కటిసూత్ర రుచులు
దట్టమై [17] నిగిడి మ ◆ ధ్యము చుట్టిపాఱఁ
గలికి రాచిలుక ఱె ◆ క్కల చాయ ఠేవ
గలుగు పచ్చలపద ◆ కంబు సొంపెసఁగఁ
గళఁ దులకించు చు ◆ క్కలతోడ మాఱు
మలయు మౌక్తిక కంఠ ◆ మాలిక మెఱయఁ
గరభూషణంబులఁ ◆ గలవజ్రరుచులు
పరగి నభోమణి ◆ ప్రభలపై నణఁగ
ధళధళ మను నవ ◆ తంస మాణిక్య
లలిత కాంతులు కపో ◆ లములపైఁ బొలయ
సవరగాఁ జుట్టిన ◆ జడల నెట్టెమునఁ
జివురుఁగెంజాయ మిం ◆ చిన పాగ మెఱయఁ
బొలుపుగాఁ గర్పూర ◆ మున మేళవించి
పలుచగా నలఁదిన ◆ భసితాంగరాగ
సన్నుతోజ్జ్వల కాంతి ◆ చంద్రికల్ జనుల
కన్నుఁ గవలకు వి ◆ కాసంబు నెరపఁ
బ్రమథ వర్గము గొల్వ ◆ రజతాద్రిమీఁదఁ
బ్రమద మారఁగ నున్న ◆ పరమేశుఁ డనఁగ
మహిఁ బేరు (గన్నట్టి ◆ మహితాత్ముఁ గొల్చి)

వహి కెక్కు నిజ నిర ◆ వద్య చిహ్నముల
తోడ మహామహా ◆ త్ముల దపోమహిమ
రూఢి కెక్కిన మునీం ◆ ద్రులుఁ దత్వవిదులు
మరి పద వాక్య ప్ర ◆ మాణజ్ఞు లగుచుఁ
బరగు విద్వాంసులు ◆ బహువిధకావ్య
నాటకాలంకార ◆ నైపుణిఁ జాలఁ
జాటువ కెక్కిన ◆ సత్కవీశ్వరులు
నల రాగదోషంబు ◆ లాఱు నెనిమిదియుఁ
దొలఁగించు గుణము లై ◆ దును రెండు నెలమిఁ
దలకొని గాత్రజం ◆ త్రంబుల నేర్పు
గలిగి వాసికి నెక్కు ◆ గాయకోత్తములు
ననుపమం [18] బగు సర ◆ సాతంక కలిత
వినుతాభినయ చతు ◆ ర్విధ నాట్యములును
సరిలేని నటనటీ ◆ జనులుఁ బాఠకులు
దొరలు భృత్యులు నమా ◆ త్యులుఁ బురోహితులుఁ
బరిచారకులు రాయ ◆ [19] బారులు వైద్య
వరులు దైవజ్ఞులు ◆ వరుసతోఁ గొలువఁ
గొలువుండి బహుకథా ◆ గోష్ఠీ విశేష
ములు ..... ..... ..... ..... ..... ..... .....
నవిరళ యోగ వి ◆ ద్యాధికులైన
నవనాథవరుల [20] పు ◆ ణ్య ప్రవర్తనలు
పరగ, శ్రీగిరికవి ◆ పద్యబంధముల
విరచించినాఁ డది ◆ ద్విపద కావ్యమునఁ
జెప్పింపవలయుఁ బ్ర ◆ సిద్ధి పెం పలర

కృతికర్త


నిప్పుడుగల సుక ◆ వీంద్రులలోన
సరస సాహిత్య ల ◆ క్షణ వివేకముల
సురుచిర మధుర వ ◆ చో విలాసములఁ
గులశీలములను స ◆ ద్గుణ కలాపముల
నలవడ్డవాఁ డెవ్వఁ ◆ డని విచారించి
సింగయ మాధవ ◆ క్షితిపాలమంత్రి
పుంగవుఁడై యొప్పు ◆ పోతరాజునకు

[21] ననుజాతుఁ డగునయ్య ◆ లామాత్యుకూర్మి
తనయుఁ డుత్తముఁడు గౌ ◆ తమగోత్ర[22]జుండు
భ్రమరాంబికా వర ◆ ప్రాప్త విచిత్ర
విమల సాహిత్య ప్ర ◆ వీణాధికుండు
ననఘచిత్తుఁడు గౌర ◆ నాహ్వయఖ్యాతుఁ
దన సముఖమునకుఁ ◆ దగఁ బిలిపించి
కరుణామృతము నిండఁ ◆ గడలొత్తుచూపుఁ
బరగించి యుచిత సం ◆ భావన నెరయ

అంకితము


మన్నించి మా కొక్క ◆ మధురమై వెలయు
సన్నుత నవనాథ ◆ చరితంబు ద్విపద
కావ్యంబుగాఁ జెప్పి ◆ కమలజ విష్ణు
సేవ్యమానునకును ◆ శ్రీశైలపతికి
శంకరునకు బాల ◆ శశిశేఖరునకు
నంకితం బొనరింపు ◆ మనుచుఁ గర్పూర
పూరితం బైన తాం ◆ బూలంబు లొసఁగి
గారవించుటయు ది ◆ గ్గనఁ బ్రమోదంబు
దలకొని మత్కవి ◆ తావిలాసంబు
వెలయ మీపంపు గా ◆ వింప భాగ్యంబు
గలిగి ధన్యుఁడనై తిఁ ◆ గామితార్థములు
ఫలియించె ననుచు స ◆ ద్భక్తిఁ దదాజ్ఞఁ
దలమీఁద నిలిపి డెం ◆ దపుఁదమ్మిలోన
నెలకొ[23]న భ్రమరాంబ ◆ నిలిపి పూజించి
వరశివ సమయ [24] ని ◆ ర్వాణధుర్యునకుఁ
[25] బరసమయధ్వాంత ◆ బాలభానునకుఁ
బరమ యోగాంబుధి ◆ పాదరేణునకు
నిరుపమ శివతంత్ర ◆ నిర్మలమతికిఁ
బావనునకు సర్వ ◆ భాషావిశేష
కోవిదునకు రాయ ◆ గుణశిఖామణికి
దుర్వార జైన సిం ◆ ధుర మృగేంద్రునకు
సర్వజ్ఞునకు ముక్తి ◆ శాంతరాయనికి

ననవరతాభ్యుద ◆ యాభివృద్ధియును
ఘన తపోరాజ్య సౌ ◆ ఖ్య ప్రసిద్ధియును
గృప మీఱ నొసఁగు శ్రీ ◆ గిరిభర్తపేరఁ
ద్రిపురదానవ మద ◆ ద్విప సింహుపేరు
సురనదీధరుపేర ◆ శుక సనకాది
వరయోగి నుత దివ్య ◆ వైభవు పేర
ధరకన్యకా పయో ◆ ధర పరిలిప్త
సరస చందన సము ◆ జ్జ్వల వక్షుపేరఁ
గరుణాంబునిధిపేరఁ ◆ గనకాద్రిచాప
ధరుపేర భక్త మం ◆ దారునిపేర
వామదేవునిపేర ◆ వరదునిపేర
శ్రీ మల్లికార్జున ◆ శ్రీ మహాదేవు
పేర [26] నేనొనరించు ◆ ప్రియకథా సూత్ర

కథా ప్రారంభము


కైలాస వర్ణనము


మేరీతి ననిన ము ◆ న్నెల్ల కాలమును
శ్రీకరం బై సుప్ర ◆ సిద్ధమై సర్వ
లోక సంస్తుత్య మై ◆ లోచనానంద
జనక మై బహుసుఖా ◆ స్పద మై విచిత్ర
వినుత నానామణి ◆ విస్ఫురత్కోటి
విమల కుందాది సు ◆ వికచ ప్రసూన
సముదయ వర పారి ◆ జాత సుజాత
చూత చందన కుంద ◆ సురదారు చారు
కేతకీ కింశుక ◆ కేసర ప్రముఖ
సరస మహీరుహ ◆ చ్ఛాయ నిషణ్ణ
సురవధూ మధుర భా ◆ సురగీయమాన
హరబిరుదాంక మై ◆ యవిరళోత్ఫుల్ల
నిరుపమ కనకాబ్జ ◆ నికర కాసార
కలితమై నీహార ◆ కర్పూర పూర
[27]బల బలాంతక నాగ ◆ ఫణి రాజ రాజ
శారదామృతరస ◆ శారదాంభోద

పారద విశదప్ర ◆ భా రమ్యమైన
కలధౌత నగముపైఁ ◆ గమలజ విష్ణు

శివుని కొలువు


బలవైరి శిఖ కాల ◆ పలలాద వరుణ
పవన యక్షేశ్వర ◆ [28] ప్రముఖ నిలింప
నివహంబులును రజ ◆ నీచర గరుడ
పన్నగ తాపస ◆ ప్రవర గంధర్వ
కిన్నర చారణ ◆ కిం [29] పురుషులునుఁ
బరమయోగీంద్రులుఁ ◆ బ్రమథులుఁ గొలువఁ
బరగఁ జింతామణి ◆ భద్రపీఠమునఁ
జలికొండకూఁతుఁ బొ ◆ చ్చము లేని ప్రేమ
తలుకొత్త వామాంక ◆ తలముపై నునిచి
భరతకళాప్రౌఢిఁ ◆ బరగ వృషేంద్రు
కరమునఁ బరిపరి ◆ గతులకు మొరయు
మురజనాదంబుఁ దుం ◆ బురు గీతరవము
నారద రణిత వీ ◆ ణా నినాదమునుఁ
బలుమాఱు వీనుల ◆ పండువు [30] సేయ
విలసిల్లు నప్సరో ◆ విభ్రమ గతులఁ
దలకొని లోచనో ◆ త్సవ మొనరింప
గొలువున్న యా జగ ◆ ద్గురు నుమారమణు
బాలేందు శేఖరు ◆ భక్తమందారు
నీలకంధ్రరుఁ గొల్వ ◆ నెఱి వచ్చినట్లు

వసంత వర్ణనము


తరుల ప్రాయపుమందు ◆ తావులపొందు
విరహుల మంట కో ◆ విల [31] గమిపంట
రతిసుఖంబుల చొక్కు ◆ రసికుల మ్రొక్కు
రతిరాజు జోక వి ◆ రక్తులఢాక
పువ్వుబోణుల యుబ్బు ◆ పుష్పాస్త్రు గబ్బు
పువ్వుఁదేనెల పెచ్చు ◆ భోగుల మెచ్చు
వెలయ వసంత మ ◆ వ్వేళ నెల్లెడలఁ
గలయంగఁ బద నింకి ◆ కడవళ్లు వాడి

జిగి దప్పి చెఱఁగులు ◆ చిరుబీట లెత్తి
పగులుచు బిరుసనై ◆ పలఁకిన నాటఁ
దొడిమెలు వడి వాడఁ ◆ దుదగాలిఁ దూలి
కడువడి నందంద ◆ కారాకు రాలె
గుమురులు నయ మెక్కి ◆ క్రొమ్మోసు లొదవి
కొమరార నిగురొత్తి ◆ కెంపు సొం పెసఁగి
మట్టంపుఁ జిగురురె ◆ మ్మలు తొంగలించి
దట్టంపు నన లొత్తి ◆ తళతళ మించు
మొగ్గల నేచి బల్ ◆ మొగడలఁ ద్రోచి
దిగ్గన వికసించి ◆ తెలుపొందు విరుల
వలుఁదగుత్తుల నెత్తు ◆ వలపుల మించి
నలికంపుఁ బూపలై ◆ నలి నొగ లెక్కి
కాయలై పులుసున ◆ గరిగట్టఁ గలిగి
పాయక ఫలములై ◆ పదియాఱు వన్నె
బంగారు చాయ రాఁ ◆ బండిన పండ్లు
పొంగారు కొమ్మల ◆ [32]పొలుపున వీఁగు
వనమహీరుహములు ◆ వరుసఁ బెంపెసఁగె
మనమున [33] నెచరించి ◆ మగకోకిలములు
ముక్కులు ఱెక్కలు ◆ మురువుగాఁ దీర్చి
చొక్కంపు లేమావి ◆ సుదకొమ్మ లెక్కి
సెలసి లేఁగొన లెత్తి ◆ సెలవులఁ ద్రుంచి
కలగొన [34] లుకలుక ◆ గానప్పళించి
రసము పిచ్చిలఁ గూర్చి ◆ రమణుల కిచ్చి
మసలక తొలి చవుల్ ◆ మరపి మోహించి
నిక్కించి తమకముల్ ◆ నెరయఁ గూటములఁ
జొక్కించి పంచమ ◆ శ్రుతిఁ బిసాళించి
ముదముసఁ జెలఁగించె ◆ ముద్దుఁ గీరములు
మదగజకుంభసం ◆ భవ మౌక్తికముల
జిగి దువాళించు మిం ◆ చిన ద్రాక్షపండ్ల
పొగడొందు గుత్తుల ◆ [35]ప్రోవులు వెదకి
జాతిగా గళములు ◆ చాఁచి చెలంగి

మోతుకు మొగ్గల ◆ మురువు నటించు
నెలవంక ముక్కుల ◆ నేర్పునఁ జించి
తొలితొలి ఫలములఁ ◆ దొరఁగు రసంబు
లరగన్ను వెట్టుచు ◆ నందంద క్రోలి
బిరుదెక్కి కడు జిగి ◆ బిగిఁ బొనరించి
భావజు సురదాణి ◆ పచ్చపక్కెరల
మావులు రవళించు ◆ మాడ్కినిఁ జెలఁగెఁ
ద్రిజగంబులును గెల్వఁ ◆ దివురు మన్మథుని
విజయశంఖము లొత్తు ◆ విధమున మిగులఁ
బొగ డొంది వికసించు ◆ బొండుమల్లియల
మొగడలవై నుండి ◆ మొరసెఁ దుమ్మెదలు
పొలుచు సుధారసం ◆ బునఁ జాల నాని
మొలచినముత్యంపు ◆ మొలకలో యనఁగఁ
జలిమించు లుమియుబి • స ప్రరోహములు
వెలయ [36] లప్పలు మేసి ◆ వేడుకం బ్రియల
రమణమై గవిసె మ ◆ రాళసంతతులు
[37]సమరతికాంక్షలు ◆ సలుపు వల్లభుల
ముందటఁ గ్రీడించి ◆ మురియుచు వలపు
లొందంగ [38]మరుఁబను ◆ లొనరించు వేడ్క
దగిలించి రతులకుఁ ◆ దరితీపు సేసి
దగిలెఁ జక్కవలు గెం ◆ దమ్మి దీర్ఘికలఁ
బరగు[39] నేలాలతా ◆ భవనాంతరమున
నరుణ ప్రవాళ శ ◆ య్యలమీఁదఁ బ్రియులఁ
గొసరుచు నుపరతిఁ ◆ గూడి క్రీడించి
యసురసురైయున్న ◆ యప్సరఃస్త్రీల
చెక్కుల నెసఁగులేఁ ◆ జెమట లార్పుచును
జొక్కుమై వీతెంచె ◆ సోమరిగాలి
దొలకరి మెఱుఁగులఁ ◆ దొలఁచు ముత్యాల
తళుకులు వెలిచిన ◆ తళతళ మించు
వలరాజుసతిచేతి ◆ వజ్ర దర్పణము
పొలుపున మెఱుఁ గెక్కెఁ ◆ బూర్ణ చంద్రుండు
ఆవేళ బరమేశుఁ ◆ డారజతాద్రి

పై వనకేళి స ◆ ల్పఁగ మదిఁ గోరి
వెలయంగఁ దనదిక్కు ◆ వీక్షించె నపుడు
తలఁపు లెఱింగి భూ ◆ ధరరాజపుత్రి
మురుపెంబు నిండార ◆ ముఖమండలమున
దరహాస చంద్రికల్ ◆ దళతళ నెసఁగఁ
గనుసన్నసేయు నా◆ కాల కంధరుని
పనుపునఁ బ్రమథులఁ ◆ బరిపాటి నిలిపి
[40]మరి వృషభేంద్రుఁ డ ◆ మర్త్యుల మునుల
నరుగుఁడు చనుఁడు మీ ◆ రని యున్నవారిఁ
దలఁగి పొమ్మనియె నం ◆ తటఁ గొల్వు మాని
వలసినలీల నీ ◆ శ్వరుఁడుఁ బార్వతియుఁ
జని మాతులుంగకా ◆ సార జంబీర
పనస పాటల పారి ◆ భద్ర హింతాళ
తాళ తమాల చం ◆ దన సిందువార
సాల కౌలేయ కే ◆ సర సురదారు
నాగకేసర వట ◆ నారంగ లికుచ
పూగ పున్నాగ క ◆ ర్పూర ఖర్జూర
మందార కేతకా ◆ మలక కదంబ
తిందుక కదళికా ◆ తింత్రిణీ ప్రముఖ
వినుత పాదపముల ◆ విలసిల్లు నొక్క
వనము ప్రవేశించి ◆ వలపుల నొసఁగు
పొలు పొందఁ జదలఁ బు ◆ ప్పొడి వెదచల్ల
నలరులు గోయంగ ◆ నలయుచు నున్న
కొండరాచూలిఁ గ ◆ [41] న్గొని భవదాస్య
పుండరీకంబుపొ ◆ ల్పులు దందడించు
నిందిందిరములకు ◆ నిదియె మం దనుచుఁ
బొందైన సంపెంగ ◆ పువ్వులబంతి
నెఱరంగు దలకించు ◆ నెఱివేణిమీఁద
నొఱవుగాఁ దుఱిమి కే ◆ లూఁతగా నిచ్చి
క్రొన్నన లొత్తి తూ ◆ కొననూఁది చనుచుఁ
బున్నాగ మల్లదె ◆ పున్నాగగమన

మాకంద మిదెమందు ◆ మాకంద మబల
మాకందమగుఁ గాన ◆ మాకంద వెరవు
విరహుల చిత్తంబు ◆ విరవిరఁ బుచ్చు
విరవాది విరులు వా ◆ విరిఁ గోయఁ[42]బోవఁ
బరు వంద నీకేల ◆ బరు వందుచున్న
కురువిందపువ్వుల ◆ కురు వింద రమ్ము
నారజం బదె నయ ◆ నంబులలోన
నారజం బలికిన ◆ నారజం బగును
గేసరంబులు మించెఁ ◆ గేసరిమధ్య
కేసరంబులు మన ◆ కే సరియగును
వాలుఁగొమ్మలను గై ◆ వ్రాలు మంజరుల
వ్రేలఁ జూపెదఁ బూను ◆ వేళ గా దతివ
కేలఁ గైకొనుము నీ ◆ కే [43]లలితాంగి,
కేలికి మేలు కం ◆ కేలి క్రొవ్విరులు
జాతిగాఁ బద్మినీ ◆ జాతికిఁ దుఱుమ
జాతి మంచిదిపుష్ప ◆ జాతులలోనఁ
గొమ్మ యీసంపెంగ ◆ కొమ్మ తుమ్మెదల
కొమ్మ దా[44]పూరెమ్మ ◆ కొదల చే రెమ్మ
పొలఁతి మన్మథుజంత్ర ◆ బొమ్మ యీ నిమ్మ
అలివీడు పట్టుతొ ◆ య్యలి మొల్ల చెట్టు
మరుఁ డేలునట్టుకో ◆ మలి కలిగొట్టు
సరసఁ జెన్నారునీ ◆ సరసీరుహములు
కమ్మని తావులు ◆ గ్రమ్మ నింపెసఁగు
తమ్ములు చాలనె ◆ త్తమ్ము లై మెఱసెఁ
బసుడాలు నాకులు ◆ పచ్చని ఱెక్క
లెసఁగు కెంపుల డాలు ◆ నేలు తోరంపు
ముకుళంపు నెలవంక ◆ ముక్కులుం గాఁగ
[45] శుక భాతి దాల్చెఁగిం ◆ శుక మిందువదన
యనుచుఁ గాత్యాయని ◆ కనురాగ మాత్మఁ
[46] గనుచుఁ గో మలమౌ శు ◆ కపిక స్వరములు
వినుచు మయూరముల్ ◆ వేడ్క నటింపఁ

గనుచు దీర్ఘికలజ ◆ క్కవల వీక్షించి
చనుచు మవ్వంపుమం ◆ జరు లేఱికోసి
కొనుచు శాఖల దిగు ◆ గొలలఁ గ్రిక్కిరిసి
రస ముట్టివడఁ బట్టి ◆ రంజిల్లుమంచి
పసిఁడిబంతులఁ బోలు ◆ పండ్లకు మూఁగి
తీగెలం దూఁగి పూఁ ◆ దేనెలఁ దోఁగి
బాగైన గురువింద ◆ పందిరు లీఁగి
పొదరిండ్ల డాఁగి పు ◆ ప్పొళ్లెల్ల మేఁగి
నొదవు జొంపములపై ◆ నొయ్యన మూఁగి
కొలఁకులఁ గెలఁకులఁ ◆ గొమరార నాను
తలములఁ జలువలు ◆ తలకొల్పుపడెలఁ
గడలఁ జప్పరముల ◆ గతి నున్న మడల
యెడలను మెఱుఁగారు ◆ నిందు కాంతంపు
టరఁగుల చరఁగుల ◆ నలరారు గుహల
తెరువుల నొరపుగాఁ ◆ దిరిగి క్రీడించి
నిగనిగ మని మించు ◆ నిటలభాగమున
నిగుడు లేఁజెమటల ◆ నిరుపమలీల
విపుల పల్లవ తాళ ◆ వృం తానిలముల
ననుభవింపుచుఁ బుర ◆ హరుఁడుఁ బార్వతియు
రంగ దుత్తుంగ త ◆ రంగ భాసుర మ
భంగ కాంచన పద్మ ◆ పరిమళ లోల
[47]భృంగావళీనృత్తఁ ◆ పృథు లాంగహార
సంగ నిజాంగనా ◆ సన్నరథాంగ
మంగళ సలిల ని ◆ ర్మలిన మాతంగ
గంగను బ్రియ మెసఁ ◆ గంగను జేరఁ
జనుదెంచి పాండుర ◆ సైకతస్థలుల
మన మారఁ గళములు ◆ మడఁచి పక్షముల
సందుల మోములు ◆ సంధించి నేల
నొందొందఁ [48]బాదము ◆ లొక్కట మోపి
యరగన్ను వెట్టుచు ◆ నంకిలి నిద్ర

మరిగిన మదకల ◆ మల్లికాక్షములు
నంచ లంచలు వడి ◆ యంచితలీల
నంచల నున్నరా ◆ యంచల గములు
సార సముత్ఫుల్ల ◆ సారస తతుల
సారసంబుల నున్న ◆ సారసశ్రేణి
కావలిదెసహల్ల ◆ కావలికమ్మఁ
దావులు కడుపారఁ ◆ ద్రావు తుమ్మెదలుఁ
బుటపుటనై క్రొవ్వి ◆ పుటముగా నెగసి
[49]చటులతటిద్‌భ్రాంతి • సమకొనువాలు
వాలుగులునుగల్గి ◆ [50]వరలుచునున్న
మేలిమి మనముల ◆ మెచ్చులు నిగుడ
జలకేలి సలుపంగఁ ◆ జయ్యన నాత్మఁ
దలకొను వేడ్కభూ ◆ ధర రాజపుత్రి
దరి నీరు సొచ్చు న ◆ త్తఱిఁ దన్ముఖమును
[51]నరవిందమును దేంట్లు ◆ నలకపంక్తియును
గలికి కన్నులు నల్ల ◆ కలువలు నలరు
తెలినవ్వు నురువును ◆ దియ్యమోవియును
బొలుపారు బంధూక ◆ మును, [52]గంధరంబుఁ
జెలువారు శంఖంబుఁ ◆ జేతులుం బొసఁగు
బిసములుఁ జక్కవల్ ◆ బిగువుఁ జన్నులును
ననలారు నాభియు ◆ [53]నావర్తనంబు
నవ రోమరాజియు ◆ నాఁచుఁ దీగెయును
సరవి పిఱుందులు ◆ సైకతస్థలులు
నడుగులు [54]దరుణారు ◆ ణారవిందములు
దడఁబడుచుండె న ◆ త్తఱి సదాశివుఁడు
శ్రీతాద్రినందనఁ ◆ జేరి కై దండ
జాతిగా నిచ్చుచుఁ ◆ జనుఁగట్టు [55]బంటి
లోతున నిలిపి యో ◆ లోలాక్షి క్రుంకు
మీతోయముల మున్గు ◆ మీతోయ మనినఁ

పొంకమై విరియు [56]నం ◆ బుజములక్రేవఁ
గ్రుంకి జలంబులఁ ◆ గొంతసే పుండి
లేచి యదిర్పడి ◆ లేచి లలాట
లోచనుఁ గౌఁగిట ◆ లోలతఁ జేర్చి
ముదమున జడ వట్టి ◆ ముంచిన పంచ
వదనుండు లేచి భ ◆ వాని వీక్షించి
క్రుంకెద నీ వింక ◆ గుఱుతుగాఁ జూడు
పంకజానన యని ◆ పలి కటు మునిఁగి
చువ్వన వేఱొక్క ◆ చోఁ బొడసూపి
నవ్వు భూతేశుని ◆ నగరాజపుత్రి
వడినీఁది చని పట్టి ◆ వంచినఁబట్టు
వదలఁగ దాఁటియు ◆ వడిదాఁగు జలము
తళ్లునఁ బెకలు మ ◆ స్తకమున జడలు
చల్లెడిపట్టుల సలి ◆ లంబు లాడు
దివిజకాంతల జిగిఁ ◆ దేరెడు చన్ను
గవలఁ బూసిన సిరి ◆ గందంపుఁ దావి
పొలయునీ కలసొంపు ◆ పొలయ ఝాళించు
కలహంస తతులఱె ◆ క్కల గాలిఁ గదలు
తోరంపుఁ దమ్ములఁ ◆ దొరఁగుపుప్పొళ్ల
సౌరభంబులు మెచ్చు ◆ సమకొల్పు నెడలఁ
[57]బొందొందఁ దటములఁ ◆ బుష్పించు తరుల
నిందిందిరముల రా ◆ యిడిఁ బడి రాలు
కుసుమవాసన లూఁదు ◆ కొని క్రమ్మునెడల
వెసఁదోయములఁ గ్రుంకి ◆ వెడలు దిక్కరుల
మదగంధములు మాఱు ◆ మలయు ఠావులను
మదనారి హిమవంతు ◆ మక్కువకూఁతుఁ
గదియ నీఁదుచు వేగఁ ◆ గదియలేకున్నఁ
గదియ వచ్చుచుఁ బట్టఁ ◆ గడఁగినఁజేతి
కగపడ కీరీతి ◆ నలయించి వెంటఁ
దగులింప మఱియొక్క ◆ తఱి నేమఱించి
మునిఁగి తోయములందు ◆ మును వోయి భవుని

వెనుక దిక్కున లేచి ◆ వెస జడ వట్టి
పలుమాఱు ముంచిన ◆ బంతంబు వచ్చెఁ
దల మని మఱియు న ◆ త్తఱిని యొండొరుల
పైఁ దళ్లు తడియంగఁ ◆ బాణియంత్రముల
నాఁదటఁ జిమ్మియు ◆ నందంద చెలఁగి
చల్లు లాడియు నవ ◆ జల జాతములను
హల్లకంబులను వేఁ ◆ ట్లాడియు నిట్లు
జలకేళి సలిపి తు ◆ షారాద్రిసుతయు
మలహరుఁడును దమ ◆ మనమునఁ దనిసి
యలసి యున్నప్పు డ ◆ య్యంబుమధ్యమునఁ
గలిసి మన్మథకేళిఁ ◆ గ్రాలుచు నున్న
మీనదంపతులును ◆ మిక్కిలి వేడ్క
పూని కనుంగొన్న ◆ భూతేశ్వరుండు
మనసిజుఁ గృపఁ జూడ ◆ మదిఁ దలంపుచును
మునుకొన్న ప్రేమల ◆ ముదురు తత్తరము
వలపు దైవారఁ బ ◆ ర్వతరాజపుత్రి
వలను జూచినఁ బ్రాణ ◆ వల్లభు తలఁపు
తెలిసి నెయ్యము మీఱ ◆ దిగ్గనఁ గదిసి
వెలయఁ గేళికి డాయ ◆ వేగిరపాటు
సరగున నప్పుడు ◆ జలములలోనఁ
దొరఁగి తేలుచునున్న ◆ తుహినాంశుధరుని
రేత మామిషబుద్ధి ◆ మ్రింగె నాలోనఁ
బ్రీతిఁ జరించెడి ◆ పెంటిమీ నొకటి
యా మత్స్యగర్భంబు ◆ నందొక్క పురుషుఁ
డా మహాదేవు వీ ◆ ర్యంబునఁ గలిగి
ప్రవిమల జ్ఞానసం ◆ పన్నుఁడై యున్న
యవసరంబున శివుఁ డా వినోదములు
సాలించి యయ్యేటి ◆ సైకతస్థలిని
బాల పల్లవ తరు ◆ పఙ్త్కి నీడలను
సేమంబు మీఱ నా ◆ సీనుఁడై యున్న
యామహాదేవుని ◆ నంబిక చేరి
పద్మాసనంబునఁ ◆ బరగఁ గూర్చుండి
పద్మాసతీ ప్రియు ◆ భావంబులోనఁ

బదిలంబుగా నిల్చి ◆ పాణి పద్మములు
కదియఁగ నిల్పి ని◆క్కపు భక్తి నెఱయ
నిరుపమ దంత మా ◆ ణిక్యపురుచులు
అరుణాధరంబుపై ◆ నల్లన నిగుడఁ
బలికె విశ్వేశ నా ◆ పైఁ గృపామృతము
గులుకు నీచూపు ని ◆ గుడ్చి యధ్యాత్మ
విద్య నా కెఱిఁగింప ◆ వే భవరోగ
వైద్య నీ వని వేఁడ ◆ వసుధాధరేంద్ర
తనయవాక్యములకుఁ ◆ దరుణేందుధరుఁడు
తనమది నప్పు డెం ◆ తయు సంతసిల్లి
తెఱవ నీ వడిగిన ◆ తెఱఁగెల్లఁ దెలియ
నెఱిఁగింతు నీ వింక ◆ నేకచిత్తమున
వినయంబు సమకొన ◆ వెలుపల మఱచి
విను మని పలికె నా ◆ విశ్వేశ్వరుండు

ఆధ్యాత్మవిద్యోపదేశము.



అలరు జీవుల బ్రహ్మ ◆ కాదని మొదటఁ
గలిగిన నాలుగు ◆ కడపట రెండు
నేకమై యితరంబు ◆ నేమియుఁ జెప్ప
రాక వెలుంగొందు ◆ క్రమమును జెప్పి
యోలిఁ జతుర్ముఖ ◆ యోగములందు
నాలోన మతములు ◆ నభ్యాస విధులు
తనరు నవస్థలు ◆ తాత్పర్య వశ్య
జనిత సౌఖ్యములును ◆ సరి యటమీఁద
జరిగెడి సిద్ధిసూ ◆ చకముల వలను
నరయ నింతకు మూల ◆ మై స్థూలసూక్ష్మ
[58]కారణైక్యము పర ◆ కాయ సంస్థితులు
నేరుపు మీఱ న◆న్నియు నెఱింగించి
రాజిల్లు నటుమీఁద ◆ రాజయోగంబు
రాజుశేఖరుఁ డద్రి ◆ రాజనందనకు
వీనుల విందుగా ◆ వినిపించె నంత
నానంద రసమగ్న ◆ యై వెలి మఱచి
కైకొని ముందటి ◆ గతిఁ బ్రతిమాట

నూ కొననేరక ◆ యున్న నావేళ
నా సమీపమున న◆ల్లప్పటి మీను
భాసురంబగు గర్భ ◆ భవనంబులోనఁ
బరమ విజ్ఞాన ◆ సంపన్నుఁడై యున్న
పురుషుఁ డూకొనుచున్నఁ ◆ బురహరుఁ డాత్మ
నరు దంది మనుజవా◆క్యము లివి గావు
పరికింప నీటిలో ◆ పలి[59]నుండి యెవఁడొ
యూకొనుచున్న వాఁ ◆ డొకఁడు విచిత్ర
మీకీలు దెలియుద ◆ మింకని శివుఁడు
పలుక కూరకయున్నఁ ◆ బరమేశ యింకఁ
గలయంత పట్టును ◆ గడమ గాకుండ
నానతి యిచ్చి కృ◆తార్థుఁ గావింపు
మూనిన దయ నంచు ◆ నుల్లమలరఁగఁ
బలికినపలుకు నె◆ప్పటియట్ల చెవులఁ
జిలికిన వెఱఁ గంది ◆ చిత్తజాంతకుఁడు
తన మనోవీథి నెం◆తయుఁ దలపోసి
కనియుఁ జెప్పఁగ వినఁ◆గా మదిఁ గోరి
పలికెఁ దోయములలో◆పలఁ దను వడఁగి
పలికి తెవ్వఁడ వేమి ◆ పగిది నీయెడకు
నరుదెంచి నీ విధ ◆ మంతయుఁ దెలియు
పరిపాటి చెప్పు మే◆ర్పడ నన్న నలరి
యండజ గర్భంబు ◆ నందు తేజంబు
నిండార నున్న యా ◆ నిర్మలాత్మకుఁడు
కరములు సద్భక్తి ◆ గదియంగ మొగిచి

మీననాథుని జన్మప్రకారము



పరమేశ! నా విన్న ◆ పము దయతోడ
నవధరింపుము నీవు ◆ నచలపుత్త్రియును
నవిరళతోయ మ◆ధ్యమున సంప్రీతిఁ
దగిలి క్రీడించు న◆త్తఱి నీదువీర్య
మగు బిందు వుదకంబు ◆ లం దొలుకుటయు
మ్రింగెఁజయ్యన నది ◆ మీ నొక్క టపుడు
మ్రింగ నమోఘమై ◆ మిశ్రవీర్యమునఁ

బరిపూర్ణతనువును ◆ బహు సద్గుణములు
నురుతర జ్ఞానంబు ◆ నొక్కటం గలిగి
మీననందనుఁడనై ◆ మీనంబు కడుపు
లోనుండి వెడలితి ◆ లోలత మీఱ
వినిపించు నాయోగ ◆ విద్యావిధంబు
వినుచుండి యంతయు ◆ వినివిని గిరిజ
యూకొన మఱచిన ◆ నూకొనుచుంటి
[60]నోకాలకంఠ ధ◆న్యునిఁగా నొనర్చి
మన్నించు మనుచు న◆మ్మధురవాక్యముల
సన్నుతిచేయఁ బ్ర◆సన్నుడై శివుఁడు
తన వధూమణికి నిం◆తయుఁ జెప్పవలయు
నని తలపోయంగ ◆ నంత లోపలను
దెలిసి శంకరుని న◆ద్దేవి వీక్షించి
పలికె నప్పుడు మీరు ◆ పరిపాటిఁ జెప్ప
లలిత యోగామృత ◆ లహరిలోఁ జిక్కి
తెలిసితి నిటమీఁదఁ ◆ దేట తెల్లముగ
నెఱుఁగ నే నంతయు ◆ నెఱిఁగింపు మనుడుఁ
గఱకంఠుఁ డంబికఁ ◆ గనుఁగొని పలికె
నదియు నట్లుండె నా ◆ యాశ్చర్య మొకటి
విదితంబుగా నది ◆ విన వీవు మొదల
నతివేడ్కఁ దోయ మ◆ధ్యంబున మనము
రతికి దగ్గఱఁ దత్త◆రమున రేతంబు
తోయంబు లోపలఁ ◆ దొరఁగిన దాని
నాయెడ మ్రింగె నా ◆ యందు మీ నొకటి
దాననే గర్భ మ ◆ త్తఱిఁ దాల్ప నందు
లో నొక్క పురుషుండు ◆ లోలతనుండి
నీకు విన్పింప నే ◆ నిర్మలసూక్తు
లూకొనుచుండె నీ ◆ వూకొనకున్న
[61]ననిచెప్పి మఱియు ని ◆ ట్లనియెఁ బార్వతికి
మనసిజాంతకుఁ డిక్కు ◆ మారకుఁ డిపుడు
[62]మనము రమ్మనకయే ◆ మత్స్యోదరంబు

తనయంత వెడలి రాఁ ◆ దలఁకి యున్నాడు
నావుడు నగజ పి◆నాకి వీక్షించి
దేవ నామది నుప్ప ◆ తిల్లెఁ బ్రమోద
మానందనుని నయ ◆ నానంద మొందఁ
గానఁ దలంచెదఁ ◆ గాన నందనుని
రమ్మను మిటకుఁ బు◆త్త్ర స్నేహ మాత్మ
ముమ్మడి గొన దదే ◆ మోకాని నీకు
ననిన మహాదేవుఁ ◆ డాదరం బెసఁగఁ
దనయ రమ్మనిన న◆త్తఱి హస్తములను
మొగిచి ఫాలస్థల◆మ్మునఁ గదియించి
ధగధగ మించు కుం◆దనమునచెన్నుఁ
గొసరించుమేనును ◆ గుఱుచకెంజడలు
బిసరుహభాతి నొ◆ప్పెడు వదనంబు
నాజానుబాహులు ◆ నన్నువనడుము
రాజిల్లు వెడఁదయు ◆ రంబును జెవులఁ
గదిసిన వాలారు ◆ కన్నులుఁ గలిగి
పదిదిక్కులను నిజ ◆ ప్రభ లుల్లసిల్ల
నుదయించె నారీతి ◆ నురుతరమత్స్య
ముదరంబులో వెళ్లి ◆ యుత్తమపురుషు
వడితోయములు వెళ్లి ◆ వచ్చుభూతేశు
కొడుకుపైఁ బూవాన ◆ గురిసిరి సురలు
తెల్లంబుగా మ్రోసె ◆ దేవ దుందుభులు
మెల్లనై చల్లనై ◆ మెలఁగె వాయువులు
పాడిరి గంధర్వ ◆ పతు లుత్సహించి
యాడిరివేడుక ◆ నప్సరః స్త్రీలు
చతుర విద్యాధర ◆ సన్నుతు లెసఁగ
నతులితానందుఁడై ◆ యప్పు డేతెంచి
జడలలోఁ గడలొత్తు ◆ జాహ్నవి పెంపు
నొడికమై తెలిమించు ◆ నుడురాజుసొంపు
మరుని నెమ్మదమెల్ల ◆ మడఁచినకన్ను
నురురత్నకుండల ◆ యుగళంబు చెన్ను
మెడ నీలమణిలీల ◆ మించినకప్పు
కడునొప్పఁగట్టిన ◆ కరితోలువిప్పు

కురుఁ బున్కపూసలు ◆ గ్రుచ్చినపేరు
మరలఁ జర్మము కాసె ◆ మడఁచినసౌరు
నురుదుగా భూతిమై ◆ నలఁదినబాగు
నురగేంద్రు నందెగా ◆ నునిచినలాగు
గలమహాదేవుని ◆ కల్యాణమూర్తి
చెలఁగి చూచుచును సు◆స్థిరభక్తి వెలయ
నందంద మ్రొక్కుచు ◆ నల్లనఁగదిసి
పొందొందఁ బాదాబ్జ ◆ ములు శిరంబునను
గీలించి తనకు మ్రొ◆క్కిన నంబికయును
లీల మోహంబు ద◆లిర్పఁ బల్మాఱు
నాపుత్త్రరత్నంబు ◆నక్కునఁ జేర్చి
తీపారఁ దనచూపు ◆ త్రిపురమర్దనుని
పై నిగుడ్చుటయుఁ ద◆ద్భావంబుఁ దెలిసి

శివుఁడు మీననాథునికి వరము లొసంగుట.



[63]సూనాయు ధారాతి ◆ సూనునిఁ జూచి
వరము లేమిట నీకు ◆ వలసిన వడుగు
మిర వొంద నీకిత్తు ◆ నిప్పుడే యనినఁ
గరములు మొగిచి యా ◆ కల్యాణశీలుఁ
డరుదుగా హరుని కి◆ట్లని విన్నవించె
అయ్యయ్య తమ రమ్మ ◆ కపుఁ డానతిచ్చు
నయ్యోగమాహాత్మ్య ◆ మంతయు వింటిఁ
గడమఁ జెప్పఁగ నెంత ◆ గల దటమీఁద
నెడపక నా కాన ◆ తిచ్చి మన్నింపుఁ
డనుటయుఁ బరమేశుఁ ◆ డనియె నాతనికిఁ
దనయ యీయోగ వి◆ద్యారహస్యంబు
లొనర గర్భస్థున ◆ కొసఁగఁ గా దింక
వినుము చెప్పెద నది ◆ వివరంబుగాఁగ
ననుచుఁ గుమారు సి◆ద్ధాసనంబునను
మనమార నునిచి త◆న్మస్తకస్థలిని
గరతలం బల్లనఁ ◆ గదియంగఁ జేర్చి
యురుతరం బగుట న◆య్యోగంబు పిదప

నలవడ, యోగంబు ◆ లాదిగాఁ గఱపి
కలుగు నభ్యాసయో◆గములెల్ల నేర్పి
యనుపమ రాజయో◆గామృతవార్ధి
నను వంద మత్స్యేంద్రుఁ ◆ డనువానిదృష్టి
వెరవుతో మరలించు ◆ విధ మెఱిఁగించి
తిరముగా వెలుపలఁ ◆ దెలుపులు దోఁప
వెలియును లోనును ◆ వీక్షించునట్టి
పొలుపుచూపియు ముఖాం◆బురుహంబు నొప్పు
నెపమున వినిపించి ◆ నిగమాదియైన
విపుల పదంబున ◆ వినుతికి నెక్కు
కోదండ గుణము ని◆క్కువముగాఁ దెలిపి
యాదరం బెసఁగఁ గృ◆తార్థుఁ గావింప
సకలవాదంబులు ◆ సకల సన్మణులు
సకల మంత్రంబులు ◆ సకలౌషధములు
సకల సంసిద్ధియు ◆ సమకొన నొసఁగి
యకలంక చరిత నీ ◆ వతులిత మహిమ
దీపింప నఖిల సత్ ◆ సిద్ధులకెల్ల
నేపార గురుఁడవై ◆ యెసఁగుచునుండు
మని పల్కి శంకరుఁ ◆ డతనికి నామ
మొనరింపఁ దలఁచి మీ ◆ నోదరంబునను
మును వసించిన నెప ◆ మున మీననాథుఁ
డనఁగ నెల్లందుఁ బ్ర◆ఖ్యాతి వహించి
విమలగుణాధార ◆ వెలయు నీవింకఁ
గ్రమమున ధరణిపైఁ ◆ గల తీర్థములును
నదులును నద్రులు ◆ నారణ్యములును
జెదరక తపములఁ ◆ జేయు సన్మునుల
యాశ్రమంబులును దే◆వాలయంబులును
నశ్రమంబునఁ జూచి ◆ యటమీఁద మెలఁగు
భయమును బొరయక ◆ పరిణామ మెసఁగ
నయమునఁ బ్రజల సం◆తసమునఁ బ్రోచు
జనపాలతిలకు దే◆శముల నొక్కొక్క
ఘన మహీధరము పైఁ◆గడురమ్యమైన
గుహ నివాసము చేసి ◆ కొని ధృతి మీఱ

మహితయోగాభ్యాస ◆ మార్గంబు వదల
కుండఁ బొమ్మనుచు న◆య్యుమయును జంద్ర
ఖండ ధరుండును ◆ గౌరవం బెసఁగ
నొడికంబుతో నప్పు ◆ డుమకును దెలుపఁ
గడమైన రాజయో◆గంబెల్లఁ దెలిపి
యెలమిఁ జెక్కిట ముద్దు ◆ నిడి వీడుకొలిపి

శివుడు కైలాసమున కేఁగుట.



కలధౌతగిరి కేగఁ ◆ గ్రమముతో శివుఁడు
తనమది వృషభేంద్రుఁ ◆ దలఁపఁ దత్ క్షణమె
ఘనతరం బగుమేను ◆ గగనంబుదాఁక
నురుజవంబున లేవ ◆ నుంకించి వడిని
ధర క్రుంగి ఫణిరాజు ◆ తలలంద నడువఁ
బటువజ్రనిష్ఠుర ◆ పాదఘట్టనలఁ
బటుచూర్ణమయి శిలా ◆ ప్రతతి రూపణఁగఁ
దోరంపు గొరిజలఁ ◆ దూలి కెంధూళి
భోరున బయలెల్లఁ ◆ బొరిబీళు లెసఁగ
గమన వేగంబున ◆ గమకమై గాలి
దుమురుగా వృక్ష పం◆క్తులు నేలఁదెళ్లఁ
జెలఁగి కొమ్ములఁ బాఱఁ ◆ జిమ్మిన గండ
శిలలు తారలతోడఁ ◆ జెదరిపో నడవ
రంతుగాఁ జిఱుకొట్టు ◆ రవమున దిశల
దంతి కర్ణములు జిం◆దరులు వొనర్ప
ఖురములఁ దాఁకు లాం◆గూల మల్లార్చి
యరుదుగా ఖణిఖణి◆ల్లన నంత నంత
రంకెలువేయుచు ◆ రత్న దీధితులఁ
బంకేరుహాప్తు బిం◆బము నప్పళించు
వినుత భూషణములు ◆ విలసిల్లు విమల
తనుకాంతి వెన్నెల ◆ తళుకుల నీన
నందెలు ఘల్లుఘ◆ల్లని రవళింప
నందంద దాఁటుచు ◆ నభినవలీల
ఘనఘంటలుఁ జిఱుమూ◆గలు నెడనెడల
నొనరించి కూర్చిన ◆ నురుగజ్జె పేర్లు
ఘల్లని మ్రోయంగఁ ◆ గలధౌత శైల

మల్లన నెదురు గా ◆ నరుదెంచు కరణి
వచ్చిన వృషభేంద్రు ◆ వదనంబు గళము
నచ్చుగా దువ్వుచు ◆ నంగముల్ నివుర
నుమయును దానును ◆ నొప్పుగా నెక్కి
రమణీయమగు నల ◆ రజితాద్రి కరిగె
నమరులు గొలువంగ ◆ నమర నందుండి
రమిత సౌఖ్యముల ని ◆ త్యానంద లీల

మీననాథుని దేశాటనము.



నామీఁదఁ కలియుగ ◆ మయ్యెగా యుగము
[64]సామర్థ్యమును దగ్గు ◆ జడతయుగల్గు
నలఁతయు మేనుల ◆ నాశ్రమ ధర్మ
ములు నల్ప మాచార ◆ ములు గర్మములును
గలిగి వర్తిల్లును ◆ గలికాలమందు
సలలితయోగాబ్ధి ◆ చంద్రుఁడై మెఱయు
నాథముఖ్యుఁడు మీన ◆ నాథుఁ డావిశ్వ
నాథుశాసనము మ◆నంబునఁ దలఁచి
కాళింగబంగాళ ◆ కరహాటలాట
గౌళకేరళ చోళ ◆ కర్ణాట ఘోట
కుకురుకోంకణ పౌండ్ర ◆ కురుకోసలాది
సకలదేశంబులు ◆ సాగరంబులును
దీవులుఁ బురములుఁ ◆ దీర్థముల్ గిరులు
దేవాలయంబులుఁ ◆ దిరిగి కన్గొనుచు
నలవడ నొకచోట ◆ నమ్మహాయోగి
తిలకుండు మాళవ ◆ దేశంబు చొచ్చి
వఱపుననిఁ గఱువున ◆ వైరులవలన
వెఱపును దెవులు నొ◆ప్పియును శోకంబు
నేడ నెన్నఁడులేక ◆ యేచి భూప్రజలు
పాఁడియుఁ బంటయు ◆ బహుళ సంపదలుఁ
గలిగి నెమ్మదినుండ ◆ గనుచుఁ దా వారి
వలన నా దేశంబు ◆ వల నొప్ప నేలు
నేలిక రాజమ ◆ హేంద్ర నరేంద్రుఁ
బోలరు తక్కిన ◆ భూభుజలెల్ల

.

దేజంబునను గాంతిఁ ◆ దేఁకువ [65]నిధుల
రాజసంబున గ్రహ ◆ రాజును రాజు
రాజశేఖరు రాజ ◆ రాజు రారాజు
ననిన నవ్విభుఁడు మ ◆ హావైభవమునఁ
దనర వసించు మాం ◆ ధాతనుపురము
సంగడి నంచల ◆ చాలు గ్రీడించు
చెంగల్వ కొలఁకులు ◆ జిలుకలు పలుకు
శృంగారవనములుఁ ◆ జెఱకుఁ దోఁటలును
బొంగారు చెఱువులుఁ ◆ బొడ వగ్గలించు
కోటలు నట్టళ్లుఁ ◆ గొలువుకూటములు
నాటకశాలలు ◆ నలినదీర్ఘికలు
ముత్తెంపు వాచూరు ◆ మొగడల మించు
గుత్తంపుఁ జవికలుఁ ◆ గ్రొత్తబా గొదవఁ
జిత్తరువు లమర వ్రా ◆ సిన గోపురములుఁ
జిత్తంబు లలరించు ◆ శివమందిరములు
వినుతి కెక్కిన బహు ◆ వివిధవస్తువులు
నొనరంగఁ బచరించి ◆ యున్న యంగళ్లుఁ
దెఱఁగొప్ప నద్దముల్ ◆ తెరవుచ్చినట్లు
మెఱుఁగారు వీథుల ◆ మిన్నులఁ గ్రాలు
పలుదెఱంగులఁ బట్టుఁ ◆ బడగల ప్రభలఁ
దులకించు రత్నాల ◆ తోరణంబులును
రాజులు రవుతులు ◆ రసికులు భటులుఁ
దేజీలు మదమెత్తి ◆ తిరుగునేనుఁగులు
వీరులు సూరెల ◆ విలసిల్లు పసిఁడి
తేరులు ధీరులుఁ ◆ దేఁకువమీఱు
భోగులుఁ ద్యాగులు ◆ పొలుపొంద మెఱఁగుఁ
దీగెలలాగుల ◆ తెఱవలఁ గలిగి
పొందొందు నప్పురిఁ ◆ బొలఁతుల నడపు
లందు జాడ్యంబు నీ ◆ లాలకపఙ్క్తు
లందు వక్రత మనో ◆ హరపయోధరము
లందు కాఠిన్య మ ◆ పాంగవీక్షణము
లందు మదంబులు ◆ [66]ననఁ గల్గుఁదక్కు

లందు లేవనుచు నం ◆ దంద వీనులకు
విందుగా వర్ణింప ◆ విని చూచు వేడ్క
నందుఁ దా నటఁజని ◆ యా యోగివరుఁడు
నర్మద నమరప ◆ న్నగసిద్ధమిథున
నర్మదఁ గని కృత ◆ స్నానుఁడై యచటఁ
గుంద పాటల చూత ◆ కురువక స్తబక
బృందసారంబుల ◆ భృంగ మనోజ్ఞ
ఝుంకారములు గల్గి ◆ సన్నుతి కెక్కు
నోంకార మనుతీర్థ ◆ మొనర వీక్షించి
యొదవిన సద్భక్తి ◆ నోంకారదేవు
ముదమారఁ బూజించి ◆ మ్రొక్కి యాక్రేవ
నున్న నరేంద్రాద్రి ◆ నొక కొంత దవ్వు
చెన్నొంద గిరిమీఁదఁ ◆ జెప్పఁగా మున్ను
వినినంతకంటె వి ◆ విధవైభవములఁ
దనరారుచున్నమాం ◆ ధాతపురంబు
గన్నులు విలసిల్లఁ ◆ గాఁ జూచి యందుఁ
గొన్నిదినంబులు ◆ గొఱఁతగా మూఁడు
మాసంబులుండి యా ◆ మత్స్య నాథుండు
భాసిల్లు తత్పుర ◆ ప్రాంతకాంతార
భూమధ్యమున నున్న ◆ పొడువైన కొండ
పై మనోహరగుహ ◆ భవనంబు దనకు
[67]నెలవుగా వసియించి ◆ నిజ గురులొద్దఁ
దలకొన్నయోగవి ◆ ద్యాపరిశ్రమము
జరుపుచు నొక్కొక ◆ సమయంబునందు
వెరవార వేఱొక్క ◆ వేషంబు పూని
యాలమందలలోని ◆ కరిగి దుగ్ధములు
గ్రోలివచ్చుచుఁ దన ◆ గుఱుతు లెవ్వరికిఁ
బొడ గానరాకుండఁ ◆ బొనుపడియున్న
యెడ నొక్కనాఁడు ప్రొ ◆ ద్దెక్కిన మీఁద
బసనుగా మిసిమిరాఁ ◆ బసుడాలు మించు
కసువు మేసెడి మేఁత ◆ క[68]యి గట్టు ప్రాకు
పసుల వెంబడిని గో ◆ పకులతోఁ గూడి

వెసనీల వెట్టుచు ◆ వెడపాట లెలమిఁ
బాడుచు వచ్చి యా ◆ మత్స్య యోగీంద్ర
చూడామణున్న భా ◆ సు గుహాగృహము
చక్కటి కొకగొల్ల ◆ సయ్యనవచ్చె
నెక్కువెట్టిన విల్లు ◆ నేర్చినయమ్ము
పీలిపాగయు మొలఁ ◆ బెట్టిన పిల్లఁ
గ్రోలు మూఁపున నిడు ◆ కొన్న గొడ్డలియు
నొసవు(?)గా మునుఁగిడ్డ ◆ యోర గొంగడియుఁ
గీసిన గుదియయుఁ ◆ గెంపారు గురిజ
పూసల పేరును ◆ బొంగుఁ గోలయును
గాసెదట్టియు మీఁదఁ ◆ గదియ బిగించి
చుట్టినయురుద్రాడు ◆ సొంపారు చెంప
గుట్టిన యెద్దుల ◆ కురుచ కొయ్యలును
మెఱుఁగు పించపుదండ ◆ మేటి బెబ్బులులు
గఱవకయుండ వా ◆ కట్టు బదనికెలు
మరువలు దిగకుండ ◆ మందుల వాడి
నెరయు చీరణములు ◆ నించిన తిత్తి
కుడిరొండి నొరపుగా ◆ గ్రుక్కిన చూడుఁ
గొడుపును నును జింక ◆ కొమ్మును జల్లి
చిక్కంబు దనకొప్ప ◆ సింగంబు లంటి
కుక్కలు దనవెంటఁ ◆ గూడి యేతేర
నాగతిం జనుదెంచి ◆ యా గుహాంతరము
తోగిచూచినఁ గనెఁ ◆ దుహినాంశుకాంతి
దళుకొత్తు పలుచని ◆ తనువు నద్దెసకుఁ
బొలయకయున్న చూ ◆ పులు మట్టు మడఁగి
నిలిచిన మనసును ◆ నిటలభాగమునఁ
బొలుచు త్రిపుం డ్రంబు ◆ పూఁతవిభూతి
తళతళమించు దం ◆ తంపు లాతాము
పొలుపారుపటికెంపుఁ ◆ బూసలపేరు
చిఱుతకెంజెడలును ◆ సింగినాదంబు
నెఱపట్టుగంతయు ◆ నిగనిగమించు
లడరెడుమణుల కా ◆ మాక్షులు మెఱయఁ
దొడలపైఁ జేతు లొ ◆ త్తుగ నూఁది నడుము

నిక్కించి నిజముఖ ◆ నీరజం బెత్తి
తక్కకదృష్టిలోఁ ◆ దగుల మగుడించి
మహనీయ యోగస◆ మాధిఁ గూర్చున్న
యహిమాంశుతేజుని ◆ నామీననాథుఁ
గనుఁగొని చోద్యంబు ◆ గడలుకొనంగఁ
దనలోన వెఱచుచు ◆ దగ్గఱఁబోయి
యోగనిద్రావస్థ ◆ నొంది యట్లున్న
లాగెఱుంగక నిశ్చ◆ లంబుగ భక్తిఁ
దన మస్తకంబు ద◆ త్పాదపద్మముల
ననువొందఁ జేర్చిన ◆ నంగసంస్పర్శఁ
జేసి యోగసమాధి ◆ చెదరినఁదెలిసి
భాసురపాండుర ◆ పద్మపత్రముల
నల్లనె చనుదెంచు ◆ నళుల చందమునఁ
దెల్లనై మడఁచిన ◆ దృష్టులు గలుగు
కనుఁగవ నలుపులు ◆ గ్రమ్మరఁదోఁప
నొనర నూర్వుల నూఁది ◆ యున్నహస్తములు
మొగిచి నేత్రంబులు ◆ మూసి సద్భక్తి
నిగుడ శ్రీ గురునాథు ◆ నికి మ్రొక్కి వేడ్క
నొదవిన నొడ్డాణ ◆ మొయ్యన బిగిచి
పదిలంబుగా యోగ ◆ పట్టెడ గీల్చి
యొదుఁగుచుఁ దన మ్రోల ◆ నున్నగోపాలుఁ
గొదలేనికరుణఁ గ ◆ న్గొనియు నిట్లనియె
నెక్కడివాఁడ ◆ విట్లేటికి వచ్చి
తెక్కడ కేగితి ◆ వీగుహాంతరము
స్రుక్కక చొచ్చితే ◆ చొప్పుననొదవె
మిక్కిలిభక్తి నా ◆ మీఁద నీమదిని
నావుడు మఱియు వి◆ నమ్రుఁడై వినయ
మావహిల్లంగ ని◆ ట్లనియె గోపకుఁడు
భూజననుత! తాన ◆ భూమిపాలించు
రాజనరేంద్ర ధ ◆ రాతలేశ్వరుని
వేలసంఖ్యల వౌట ◆ వినుతికినెక్కు
నాలమందల కెల్ల ◆ నధికారి నఖిల
గోపాలకులపని ◆ గొందు నేనెపుడు

నాపాలి భాగ్యంబు ◆ నాఁ జనుదెంచి
పొలుచు మీవగుపాద ◆ ములు గని మ్రొక్కి
గొలువఁగావచ్చితిఁ ◆ గృపఁగలచూడ్కి
నామీఁదబొలయింపు ◆ నావుడువాని
నామీననాథుఁ డి ◆ ట్లని కృపంబలికెఁ
బసులఁ బోషించుట ◆ పరమపుణ్యంబు
వసుదేవసుతుఁడు గా ◆ వఁడె తొల్లి పసుల
గోవులఁగాచు లా ◆ గులుగొన్ని చెపుమ
నీవు నావుడు మ్రొక్కి ◆ నిలిచి వాఁడనియెఁ
దొలికోడి కూయు ప్రొ ◆ ద్దున మేలుకాంచి
వల నొప్ప గోపాల ◆ వరులును నేను
బ్రిదులక వేర్వేఱఁ ◆ బిలిచి ధేనువులఁ
బిదికి కుండలపాలు ◆ బిందెలఁ బోసి
కాఁపించి నగరికిఁ ◆ గావళ్లు వనిపి
దాఁపట నన్నంబు ◆ దాఁ గుడిచి యంతఁ
గదుపులు గదలించి ◆ కసవును నీరు
ముద మారఁ గలిగిన ◆ పొలముకుఁదోలి
మునుముగా మేపుచు ◆ ముందటమెకము
చనినజా డెఱిఁగి క్ర ◆ చ్చర నడ్డపెట్టి
మరలఁ గొల్పుచు వాఁగు ◆ మడలఁ బల్లములఁ
గొరమల మడుగులఁ ◆ గొండలదరిని
బాణాసనంబులు ◆ బటుతరబాణ
తూణీరములుఁ బూని ◆ దొంగముచ్చునకు
నగపడకుండ మా ◆ పగునంతదాఁకఁ
దగఁగాచి తెచ్చి మం ◆ దల పొందుఁ జేర్చి
గొడ్డువంజను దొడ్డ ◆ గొప్పున నూడు
బొడ్డును ముక్కున ◆ బొద్దునుంజూడఁ
గాని మెండును మెత్త ◆ గాలునుననెడి
వీనిఁబోనడుతు భూ ◆ విభునకుఁ జెప్పి
కొట్టక వెసబిట్టు ◆ గునిసి తా నెగయఁ
బెట్టఁగఁ బట్టుదుఁ ◆ బెనపరినైన
నొఱ్ఱెయై తనక్రేపు ◆ నొల్లకపోవు
కుఱ్ఱకి లేఁగవైఁ ◆ గూర్మిఁ బుట్టింతు

దూడ చచ్చిన నొండు ◆ దూడఁగై కొలిపి
యీడుదుఁ గ్రొత్తగా ◆ నీనినమొదవు
నీచుకొన్నప్పుడో ◆ యెటువంటిదైన
రాచమెచ్చుగఁ ◆ జెప్ప రాదయ్యెనంత
కడుపులోననె చచ్చి ◆ క్రచ్చరక్రేపు
వెడలకున్నను జూలు ◆ వెడఁబడకున్న
మసలక వెడలంగ ◆ మందులు వెట్టి
పసరంబు ప్రాణంబు ◆ పసనుగాఁ గాతు
నఱ్ఱనై నను నొంటి ◆ నడపించి యొంటి
నఱ్ఱ గట్టంగ నే ◆ నలవరింపుదును
మనసువచ్చినయట్టి ◆ మంచి కోడెలకు
ననువొందఁ బెట్టుదు ◆ నచ్చులు మఱియు
[69]బోగరినై మ్రానఁ ◆ బొడవక యుండ
బాగుగఁజెలఁగు గి ◆ బ్బలఁబాఱ నీను
తొరఁగువోయినఁదెత్తుఁ ◆ దోడనే తెలిసి
తొరఁగు వచ్చినవాని ◆ త్రోవనే వెదకి
వచ్చు సభ్యులఁ గని ◆ వారికి మగుడ
నిచ్చి పంపుదుఁ బ్రియం ◆ బెంతయు నెసఁగ
నరుదుకన్నును నీరు ◆ నాలిక చేర్లు
గురుదెవులును గంటి ◆ కురును కట్టూర్పు
కప్పనావురు గాలి ◆ గజ్జిపల్ తిక్క
వుప్పి పంపర యూడు ◆ బొడ్డు బొల్లూత
మొలవిడె సెలతెవులు ◆ ముకుబంతి కవటు
తలయేరు తొడకువా ◆ తము కల్లవాపు
నలదొబ్బతెవులును ◆ నాదిగా నెన్న
గల పసరాల రో ◆ గములకు నెల్ల
మందులుబెట్టను ◆ మంత్రింపఁదెవులు
కందువుగని చూడఁ ◆ గానేర్తు నొప్ప
..... ..... ..... ...... మరిపుండు గంటైన
ఘాటించి ఘోరమె ◆ కంబులు పట్టి
కఱచినఁ బ్రాణంబు ◆ గలిగినఁ జాలు
నెఱవుగా బ్రతికింప ◆ నేరుతుఁ బసులఁ

బసులపాపల జ్వర ◆ భారపీడితుల
కెసరు రోగంబులు ◆ నిఱ్ఱింకులింక
వారికిఁ గానని ◆ వారికి నాఁడు
వారికి మఱియు నె ◆ వ్వారికినైనఁ
జాలు మా కని తారె ◆ చనునంత దాఁకఁ
బాలుఁ బోయింపుదుఁ ◆ బాయసంబిడుదు
నాకాచు పశువులు ◆ నన్నేలు రాజు
నీ కృపఁ జల్లనై ◆ నెగడు నిచ్చలును
తీపులుండెడిపాలు ◆ తెచ్చి సేవింతు
నీపాదపద్మముల్ ◆ నేఁడాదిగాఁగ
నడుపుదు నన మీన ◆ నాథుఁ డుల్లమున
నడరిన భక్తికి ◆ ననురాగ మొంది
యనఘాత్మ నీమాట ◆ కనుమతించితిమి
విను మిట్టి భీకర ◆ విపినమధ్యమున
నిమ్మహాగిరిమీఁద ◆ నీ గుహలోన
నెమ్మది వసియించి ◆ నిఖిలంబు మఱచి
నాగభూషణుని మ ◆ న్నన నబ్బినట్టి
యోగామృతముగ్రోలు ◆ చున్న నాకడకు
నొంటి నీ వచ్చుట ◆ కొడఁబడి యూర
కుంటిమి గాన నిం ◆ కొరులు నీజాడ
కందుగా వచ్చి మా ◆ కందుపల్ గన్నఁ
గందు మా[70]మన మట్టు ◆ గాన నీ విందు
వచ్చు టెఱింగింప ◆ వలవ దెవ్వరికి
నిచ్చలు నిటమీఁద ◆ నీవు మాకడకు
తెచ్చి దుగ్ధంబులు ◆ తెఱఁగొప్ప నిచ్చి
చెచ్చెరఁ జనుచుండు ◆ చెడుగునెపంబు
పొచ్చెవోకుండ నే ◆ ర్పునఁ జరియింపు
మచ్చుగా నీవింక ◆ నావుల వెంట
మసలక చనుమన్న ◆ మత్స్యనాథునకు
వసుధఁజాఁగిలి మ్రొక్కి ◆ వాఁడటువాసి
మగుడి మందకుఁ బోయి ◆ మఱునాఁటనుండి
మిగులఁ బ్రొద్దున నిద్ర ◆ మేల్కనిలేచి

కదుపులలో నెల్లఁ ◆ గల మంచిమంచి
మొదవులందులదుగ్ధ ◆ ములఁ దాన పిదికి
యొనర శోధించి నీ ◆ రొక బొట్టు నిడక
కనలు నిప్పులమీఁద ◆ కమ్మని పాక
మొదవి మీఁగడగట్ట ◆ నొయ్యనఁ గాఁచి
పదిలంబుగా నవి ◆ పట్టి యాచేతఁ
కదియఁదెల్లనిబట్టఁ ◆ గట్టి మార్తాండుఁ
డుదయించువేళను ◆ యోగిముఖ్యునకు
ముదమార నిడి దినం ◆ బును నిట్టి బుద్ధి
వదలక కొలుచునా ◆ వల్లభోత్తముని
కొనసాగు భక్తిఁ గై ◆ కొనుచుండెఁ గరుణ
మనమునఁ జిగురొత్త ◆ మత్స్యనాథుండు
ఇట నంత రాజమ ◆ హేంద్ర భూవిభుఁడు
పటుతర బాహుద ◆ ర్పంబులు చెలఁగఁ
బరనరేంద్రులు తన ◆ పాదపద్మముల
నరుదుగాఁ గొలువ రా ◆ జ్యము సేయుచుండెఁ
గొడుకు నొక్కరుని స ◆ ద్గుణ విభూషణుని
బడయంగ మదిఁ ◆ గోరి భక్తవత్సలుని
బాలేందుశేఖరుఁ ◆ బార్వతీరమణు
నీలకంధరుఁ గృహ ◆ నిధి నాశ్రయించి
మతి నన్య మెఱుఁగక ◆ మరగి సేవింప
నతనికి వరదుఁడై ◆ యా సదాశివుఁడు
కలలోనఁ బొడచూపి ◆ కరుణ దీపింపఁ
బలికె భూపాలుని ◆ పట్టంపుదేవి
కతిభాగ్యవతికి ర ◆ త్నాంగికిఁ బుట్టు
సుతుఁ డార్యనుతుఁడు వి ◆ శ్రుతగుణోన్నతుఁడు
అని యానతిచ్చిన ◆ నంత మేల్కాంచి
చనుదెంచి వదనాంబు ◆ జము వికసిల్ల
మనుజనాథుఁడు దన ◆ మంత్రిముఖ్యులకు
మనమారఁ జెప్పి స ◆ మ్మదమున నుండె
నంత రత్నాంగికి ◆ నానెల మసలి
వింతగా నొదవె వే ◆ విళ్లును నోరుఁ
దనులత వాడి యెం ◆ తయుఁ దళుకొత్తె

నునుపారె నూరులు ◆ నూగారు మెఱసె
గొబ్బునఁ గలిమి గై ◆ కొనెఁ బేద నడుము
గుబ్బపాలిండ్లము ◆ క్కులు నల్పుమీఱెఁ
దెగగలకన్నుల ◆ తెలుపు రెట్టించె
జిగి ధగద్ధగయను ◆ చెక్కులు వలికె
వదనపద్మంబు మృ ◆ ద్వాసననెసఁగెఁ
బొదలెఁగోర్కులు చూలు ◆ బోణులుముట్టఁ
బరువడినిండారు ◆ పదియవనెలను
సురగురుఁ డేడవ ◆ చో నుండునంత
నుడురాజురాశి నా ◆ యుష్మంతుఁడైన
కొడు కుదయించె నా ◆ కుసుమకోమలికి
మనుజేశుఁ డపుడు స ◆ మ్మదమునఁ దేలి
ఘనరత్నములుఁ గన ◆ కములు మాడలును
భూసురోత్తములకు ◆ భూరిగా నొసఁగి
చేసెఁ బుత్రోత్సవ ◆ శ్రీబొగడొంద
నటుమీఁద సముచితం ◆ బగు దివసమునఁ
బటుబుద్ధి నెరయ న ◆ ప్పార్థివేశ్వరుఁడు
సారంగధరుఁడని ◆ చంద్రశేఖరుని
పే రిడి యాబాలుఁ ◆ బ్రియమునఁబిల్వఁ
బూటపూటకుఁ బెద్ద ◆ బోషించి ప్రేమఁ
[71]నాటినాటికి విదియ ◆ నాటిచందురుని
చెన్నొందఁగళలఁ బ్ర ◆ సిద్ధమై పెరుగు
చున్నయాతేజంబు ◆ నొరపురూపంబు
నెలప్రాయమును ముదం ◆ బెసఁగ వీక్షించి
కులశీలవిభవస ◆ ద్గుణములఁ దనకు
సరియైనఘూర్జరే ◆ శ్వరు కూర్మిపుత్రి
నరవిందముఖి మంగ ◆ ళాంగియన్ కన్యఁ
బరిణయం బొనరించి ◆ పరమసంతోష
భరితుఁడై నిజసభా ◆ భవనంబులోన
హితులు మంత్రులుఁ బురో ◆ హితులు గాయకులుఁ
జతురులౌ కవులును ◆ సమ్మతిఁ గొలువ
కొలువున్న తఱిఁగోర ◆ కొప్పిడిచెంప

చెలువార నునుఁబీఁకెఁ ◆ జెరివిజేవురునఁ
దిలకంబు సోగగాఁ ◆ దీర్చి క్రొమ్మించుఁ
దలఁగించు పూలదం ◆ డలు తలఁజుట్టి
చిన్నిమోదుగుమొగ్గ ◆ చెవినించి చిగురు
వన్నెలనొప్పు పూ ◆ వనమాలఁ దాల్చి
నత్తగుగురిజపూ ◆ సలు మెడఁగట్టి
మత్తగజంబుల ◆మదము మై నలఁది
తోరంపుఁ బులితోలు ◆ తో నంటబిగిచి
పారుటాకులకాసె ◆ బలువుగా వేసి
కొదిమె సింగంబుల ◆ కొనవెంట్రుకలును
గదియ నల్లని దండఁ ◆ గడియంబు బూని
బెడిదంపు గండుల ◆ పెడవంకవిల్లు
గడువడి నదరులు ◆ గ్రక్కువాలమ్ము
లలవడఁ గైకొని ◆ యచటి కేతెంచి
నెలమిఁ గొందఱతోడ ◆ నెఱుకుఱేఁ డొకఁడు
వచ్చి చాఁగిలి మ్రొక్కి ◆ వరుసఁ గానుకలు
పచ్చికస్తూరియుఁ ◆ బసనిజల్లులును
ఏనుఁగు తలలోన ◆ నెసఁగుముత్యములు
కానికగా నిచ్చి ◆ కరములు మొగిచి
వినవయ్య రాజ నా ◆ విన్నపంబొకటి
మును రామదేవర ◆ మ్రుచ్చురక్కసులఁ
జలమునఁ బొరిఁగొని ◆ జయము చేకొన్న
పొలమునకును వేఁటఁ ◆ బోయివచ్చితిమి
పల్లముల్ వెనుబడిఁ ◆ బరగుతేజీల
పిల్లలోయనగఁ గు ◆ ప్పించు జింకలును
బిట్టుదాఁటుచు జిగి ◆ బిగి నోసరించు
పుట్టచెండులరీతి ◆ పొదలుదుప్పులును
మిసిమిసి లంపులు ◆ మేసి తాఁ గ్రొవ్వి
దుసరులువారి గం ◆ తులుగొను లేళ్లు
కన్నులమసరులు ◆ గప్పి యాంబోతు
లున్న చందంబున ◆ నున్న మన్నులును
గరగరనై చింద ◆ కనువడి బలసి
గురువులు వాఱెడి ◆ గురుమెకంబులును

పెదపెదకండలు ◆ పెంచి పెందరులఁ
గదరిపోరాడెడి ◆ కారుపోతులును
తిరిగివెంట్రుకవడిఁ ◆ దెగిపాఱఁ బొడిచి
బిరుదె క్కిగమిఁబాయు ◆ పెద్దపందులును
బుద్దివచ్చిన మృగం ◆ బుల మాంసమెల్ల
గద్దగుత్తికవడఁ ◆ గసమస మెసగి
పుటపుటనై మదం ◆ బున సుమాళించు
పుటములుదాఁటు బె ◆ బ్బులుల మొత్తములు
గండస్థలంబులఁ ◆ గడఁగుతీఁటలకుఁ
గొండల చరులతో ◆ గోరాడుకరులు
ఘుమఘుమ నురుము మొ ◆ గుళ్లపై కెగుర
గమకించిగర్జించు ◆ కంఠీరవములు
నక్కడఁ దమపరం ◆ బై యున్న విపుడు
పిక్కటిల్లగఁ దొడ్డిఁ ◆ బెట్టినయట్లు
వేటాడఁ జయ్యన ◆ విచ్చేయుమనిన
మాటకు విలసిల్లు ◆ మనుజవల్లభుఁడు
వానికి తన కట్టు ◆ వర్గంబు నిచ్చి
పూనినవేడ్క న ◆ ప్పుడు గొలువిచ్చి
మేనికి జిగిగూడ ◆ మృగమదం బలఁది
వీనులకింపుగా ◆ విలసిల్లుచున్న
కలవన్నెగింటెంబు ◆ కందుపుట్టంబు
కొమరారవాసించు ◆ కుసుమపుఁబాఁగ
సిరసునఁజుట్టివ ◆ చ్చిన జడమీదఁ
గురువిందపూబంతి ◆ కొమరారఁ దుఱిమి
మించునీలపుదండ ◆ మెడఁబూని మిగుల
మంచిపచ్చల వన ◆ మాలిక పూని
పొసఁగఁగుంకుమపూవు ◆ బొట్టునుదీర్చి
[72]పసిమిడివన్నె కు ◆ ప్పస మొప్పఁదొడిఁగి
నెరవాడిములుకుల ◆ నించినగరుల
తరకసంబును బెడి ◆ దంపుసింగిణియు
మొలనంటబిగిచి యా ◆ మురువునవేఁట
కలవడశృంగార ◆ మధిపతిచేసె

వాటముగను వీర ◆ వరులును దొరలు
గాటమై తనవెంటఁ ◆ గదలిరాఁ దగిన
వారికి వేర్వేఱ ◆ వారువంబులును
బారున నొసఁగి శు ◆ భంబైన వేళఁ
బసిఁడి గుబ్బల మెత్త ◆ పట్టు క్రొమ్మెఱుఁగు
లెసఁగు కళ్లెమును బెం ◆ పెక్కిన పట్ట
పట్టెడయును గచ్చు ◆ పల్లంబు డాలు
పెట్టిన వజ్రాల ◆ పిడిక రాచూరి
బిరుదుతలాటంబు ◆ పీలిజల్లెడెలు
పరఁగబన్నిన యట్టి ◆ పాదరసంబు
కరణి భంజిళ్లు ◆ త్రొక్కనిచోట్లఁ ద్రొక్కు
తురగరత్నము నెక్కి ◆ తూర్యముల్ మొరయ
ఠీవిగాఁదనకుఁ బ ◆ ట్టిననీలి గొడుగు
భావింప రోహణ ◆ పర్వతాగ్రమునఁ
గనుపట్టు నీలమే ◆ ఘము లీల మెఱయ
జనవల్లభుఁడు వేఁట ◆ సనియె నయ్యెడను
మెచ్చులు నిగుడ న ◆ మ్మేదినీనాథు
నచ్చుగాఁ బన్నింప ◆ నా వేఁటకాండ్రు
నెఱరంగుదులకించు ◆ నీలిదట్టీలు
కుఱుచకాసెలు వేసి ◆ క్రొత్తబాగొదవఁ
బట్టుఁజిందెల మీఁద ◆ బలువుగా బిగిచి
చుట్టును బంగారు ◆ సురియల పరుజు
లొడియు బడియములు ◆ నొప్పు గావింపఁ
బెడగొంద వీనులఁ ◆ బెట్టి గెంటీలు
బెడకి క్రొమ్మెఱుఁగుల ◆ బిత్తరింపఁగను
గడిఁది మృగంబులు ◆ గరువక యుండ
వలనొప్ప వాకట్లు ◆ బదనిక పేర్లు
దలముళ్లు దిరముగాఁ ◆ దాల్చి మేనులను
బొలుచు జవ్వాది ల ◆ ప్పలు సోడుముట్ట
దలముగా నగురు గం ◆ ధము మేన నలఁది
తిరుమణి చాదుక ◆ దీర్చి చేమంతి
విరుల రేకులునుజుం ◆ జురు వెండ్రుకలును
తఱచుగా జల్లి దం ◆ తపుబిల్ల లమర

చిఱుత కత్తులు ◆ వల చెంపలఁ చెరివి
పసిఁడి కామలనొప్పు ◆ బలు పందిపోట్లు
వెసఁబూని చాటున ◆ వేఁట కుక్కలును
బట్టుపట్టెడ తాళ్లు ◆ బలువుగాఁ బట్టి
దట్టంపు మూఁకలు ◆ దందడి నడువ
నరుదుగా నరిగి మ ◆ హార్భటం బెసఁగ
ధరణీశ్వరుఁడు చొచ్చె ◆ దండకావనము
అప్పుడు మలల తో ◆ యములఁ బల్లములఁ
గప్పారు పొదల వృ ◆ క్షముల నీడలను
మడల తీరంబుల ◆ మడుఁగుల మేటి
పడియలం బనుడాలు ◆ పచ్చిక పట్లఁ
దమలోనఁ దామర ◆ తంపరై కలిసి
నెమరులు వెట్టుచు ◆ నెమ్మది నున్న
మృగములు బిట్టుల్కి ◆ మెడలెత్తి చెవులు
దిగదిగ నిక్కించి ◆ దిశ లాలకించి
బెదరి మూఁకలు కకా ◆ పికలుగా విఱిగి
చెదరి చిల్లాపొల్లఁ ◆ జేరఁగణంగి
కలగుఁడు పడుచున్నఁ ◆ గని సంభ్రమమున
బలము లెల్లను మృగ ◆ పంక్తినిజుట్టి
అదెయిదె పొద లందు ◆ నలజడి బిట్టు
కదలు మార్గంబులు ◆ గట్టి వేగమునఁ
బొడువుఁడ కదియుండ ◆ పోనీకుఁ డనుచు
వెడలపాఱఁగ నీక ◆ వెరవారఁ దొలుతఁ
బోఁగుకు లోనుగాఁ ◆ బొదవిచుట్టుచును
మేఁగి వలయముగా ◆ మృగముల నెల్ల
తెరలలోపలికొత్తి ◆ తెరలక తఱిమి
వరుస నొయ్యన దొడ్డి ◆ వలలకుఁ జేర్చి
బలువుగా దిగ్గనఁ ◆ బడవలల్ దిగిచి
చెలఁగి యార్చిన నృప ◆ శేఖరుం డలరి
గమకంబుగలతమ ◆ గంబుపై నుండి
తమకంబు మిగులఁ గో ◆ దండ మెక్కించి
వడినారిమ్రోయఁ గ్రొ ◆ వ్వాడి బాణముల
నెడపక తొడిగి ◆ పెల్లేసి చిత్రముగఁ

బదములు ఖండించి ◆ బరులు జక్కాడి
కుదురు కరము ద్రెంచి ◆ గొరిజలు నొంచి
నఖములు ద్రెంచి క ◆ ర్ణంబులు దునిమి
ముఖములు చెక్కి కొ ◆ మ్ములు నుగ్గుసేసి
నడుములు నఱకి కం ◆ ఠంబులు ద్రెంచి
తొడలు చెండాడి కు ◆ త్తుక లుత్తరించి
చంపలు చించి భు ◆ జంబులు తఱిగి
కొప్పరంబులు ద్రుంచి ◆ కొంకులు గ్రుచ్చి
గుండెలు భేదించి ◆ కోరలు నురిమి
బొండుగ లుచ్చి యా ◆ పొట్టలు చీఱి
వసుధ నెత్తుటఁ దోఁగి ◆ వనరుచుఁబడ్డ
యసువులఁబొరిగొన్న ◆ యా యింద్రజిత్తు
బిరుసున మృగముల ◆ పీఁచంబు లణఁచి
ధరణీతలేశుఁ డ ◆ త్తఱి వేఁటమాని
యల్లన చనుదెంచి ◆ యాసమీపమున
మొల్లమై విరియుత ◆ మ్ములకమ్మదావిఁ
జదలవసంతంబు ◆ చల్లెడిసరసి
గదిసి వేడుకనుండి ◆ గగనభాగమున
[73]నేడు గుఱ్ఱములదే ◆ రెక్కి చరించు
వేఁడితేజము గల ◆ వేలుపుఁ గొలిచి
పలుఁదెఱంగులఁబట్టి ◆ బారు మాంసములు
వలయువారును దాను ◆ వరుస భుజించి
చలువ లచ్చట సహ ◆ జంబుగాఁ బొదలి
విలసిల్లు సహకార ◆ వృక్షము నీడఁ
దలిరు పానుపుమీఁదఁ ◆ దగ విశ్రమించి
యలసతఁ గను మోడ్చె ◆ నంతటఁ బురిని
జనలోకనుతుఁడైన ◆ సారంగధరుఁడు
తనతోడనాడు రా ◆ తనయులఁ గూడి
వేడుక పందెంబు ◆ వేసి తానపుడు
కూడిచరించు రా ◆ కొమరులతోడఁ
బ్రేమఁబెంచిన యట్టి ◆ బిరుదు పావురము
మోము దువ్వుచు లఘు ◆ ముష్టి నమర్చి

వడిమీఁద నెరిగిపో ◆ వైచిన నదియు
నుడుమండలము దాఁక ◆ నుప్పర మెగసి
నృపతనూభవులపా ◆ యి[74]రములనెల్ల
నెపమాత్రమున గెల్చి ◆ నెమకిచూచినను
మినుకు మినుక్కను ◆ మిన్నులలోనఁ
గనుపట్టునంత ది ◆ గ్గనఁ బెంటిఁజూపి
పిలిచిన ఱెక్కలు ◆ బిగిసి యందుండి
తళుకువెన్నెల గాయఁ ◆ దన మేనికాంతిఁ
జక్కనై దివిదిగ ◆ జాఱంగఁ దోఁక
చుక్క చందంబునఁ ◆ జువ్వున నిగుడి
గతితప్పి వచ్చి భూ ◆ కాంతుని భోగ
సతి పుష్పనాయకు ◆ సామ్రాజ్యలక్ష్మి
చిత్రవిభ్రమకళా ◆ శృంగారసీమ
చిత్రాంగి ముద్దాడు ◆ చిలుకకు వ్రాలె
వ్రాలిన మోముకై ◆ వ్రాలి కౌతుకము
చాల బాలింబడి ◆ సారంగధరుఁడు
వెంటిఁ గన్గోకయా ◆ బిత్తరి పులుఁగు
గెంటి చిత్రాంగిలోఁ ◆ గిలికేలవ్రాలె
వచ్చునే వెసరాణి ◆ వాసంబులోన
విచ్చిలవిడిఁ జొచ్చి ◆ వెడల నన్యులకు
ధృతి దూల నేఁబోక ◆ తీఱ దిట్లుండ
మతముగాదని సంభ్ర ◆ మము దలకొనఁగ
నంతిపురంబున ◆ నరుగు నారూప
కంతుని చెయిపట్టి ◆ కార్యమూహించి
మతిమంతుఁడనియెడి ◆ మంత్రిపుంగవుని
సుతుఁడు సుబుద్ధి రా ◆ చూలి కిట్లనియె
నెందుఁ బో గమకించె ◆ దీసాహసంబు
డెందంబులోన బా ◆ టింపుట దగునె
భావింప మీఁద నాప ◆ ద నెరియించు
నీవిచారంబు నీ ◆ కేటికి నొదవె
నెటువోయెనొక్కొ నీ ◆ యెఱుక లోకమునఁ
గటగటా! నీ వెఱుం ◆ గని నీతి గలదె

[75]యలలకునున్ వెల ◆ యాండ్లకు మదిని
కలకాలములును నె ◆ క్కడివి నిల్కడలు
పతిలేని యెడ నొంటి ◆ పడి [76]పూవుఁబోణు
లతనుచిత్తంబున ◆ నలయు చున్నెడకుఁ
జక్కనివారికిఁ ◆ జనుటుచితంబె
మొక్కలింపకుము తెం ◆ పుకుఁ బనిలేదు
బాగెఱుంగక వేగ ◆ పడఁబనిలేదు
బాగెఱింగిన వానిఁ ◆ బాయు నాపదలు
ఊరక చొరఁబాఱ ◆ కూహించు కొనుము
పారువ వలతొ నీ ◆ ప్రాణంబు వలతొ
యేకాంతమున నున్న ◆ యెడ మగవారి
నాకాంత మదిఁ గోరు ◆ ననయంబు వదలి
యెవ్వని [77]కడఁకైన ◆ నేగెడుబాణ
మెవ్వని ధృతిఁగాడు ◆ నెదురుతాఁకై న
నొరపుగావలరాయఁ ◆ డొడ్డినయురులు
ఎలమితో మించుల ◆ యింతి వాగురులు
పొలుచు మన్మథుని తీ ◆ పుల వింటిబొమలు
నెలఁతల జిగిమించు ◆ నెలవంకతూపు
ననవిల్తు వాఁడిబా ◆ ణంబుల మొనలు
వనరుహాక్షుల నిడు ◆ వాలుగన్గొనలు
కాయజుసతి చేతి ◆ గజనిమ్మపండ్లు
తోయజాక్షులమించు ◆ తొలుకుపాలిండ్లు
పలుకులు బొంకులు ◆ పసలు వేసాలు
వలపులు వెడవెడ ◆ వావులు నున్న
మదిరాక్షులకు మది ◆ మాటలట్లుండె
విదితంబుగానింక ◆ విను మొక్కమాట
కన్నులపండువు ◆ గా నిందుముఖులు
చెన్నొంద నిన్నువీ ◆ క్షించిన పిదప
నల నలునై న జ ◆ యంతుని నైన
నలకూబరునినైన ◆ ననవిల్తునైన
చీరికిఁగొన రన్న ◆ చిత్రాంగి నొకతె

బేరుకోనేల యా ◆ బింబోష్ఠి నిన్ను
వలవంతఁ జేపట్టి ◆ వదలకరతికి
బలవంతమునఁదీసి ◆ పైఁబడఁదివురుఁ
బరలోకభీతి నా ◆ పద్మాక్షి సరవి
జరగక విడనాడి ◆ చనుదెంచితేని
నృపునితో నొండు రెం ◆ [78]డును గాను జెప్పి
కపట మేర్పడఁబెట్టి ◆ కల్లతనంబు
నీమీఁద మోపుట ◆ నిక్కంబు వలదు
నామాట చేకొని ◆ నన్ను మన్నించి
తూలగించక [79]మోర ◆ త్రోపుఁదనంబు
చాలించు మనుడు నా ◆ సచివనందనుని
గనుఁగొని నిడువాలు ◆ కన్నులు కెంపు
సన నిట్టులనియె నా ◆ సారంగధరుఁడు
పోపొమ్ము చాలు నీ ◆ బుద్ధులు వట్టి
పాపంబు గట్టక ◆ పలుకులుమాని
నను నీవు పిన్నటి ◆ నాఁటనుండియును
మన సూఁదఁ గొలిచిన ◆ మందెమేలమునఁ
బలికితిగాని నా ◆ భావసంశుద్ధి
తలఁపనేరవు రవిఁ ◆ దఱుమునె తమము
నిప్పు[80]నుజెదలంటు ◆ నే నామనంబు
గప్పునే కామవి ◆ కారంబు లెందు
వామాక్షు లెటువంటి ◆ వారైననేమి
భూమీశ్వరుఁడు వేఁటఁ ◆ బోయిననేమి
మాతల్లి రత్నాంగి ◆ మాఱు చిత్రాంగి
పాతకంబనక నా ◆ పైఁ దప్పులెన్ని
పతితోడనేల కో ◆ పము పుట్టఁజెప్పు
నతఁ డేల ననుఁ బుత్రుఁ ◆ డనక దండించుఁ
జాలు నీపని శంక ◆ చయ్యనఁబోయి
వాలాయమునను బా ◆ ర్వముఁ గొనివత్తు
విడువిడుమని చేయి ◆ విడఁబాఱఁ దిగిచి

వెడమతిఁ దనపాలి ◆ విధిఁద్రిప్పఁబోవఁ
జక్కని వారిలోఁ ◆ జక్కనివాని
..... ..... ..... ..... ..... ..... ..... ..... ......
నిగనిగమనుజాతి ◆ నీలాలరంగు
[81]నిగుడు వక్రత గల ◆ నెఱివేణివానిఁ
గలువలచెలికాని ◆ కలకలనవ్వు
కళగలయ[82]టిముఖ ◆ కమలంబువానిఁ
దెలిదమ్మిరేకుల ◆ తెలివినొందించి
తలచుట్టి పాఱునే ◆ త్రంబులవానిఁ
బసిఁడి మించిన మంచి ◆ పసిఁడియు వన్నె
కొసరించుమైచాయఁ ◆ గొమరారువాని
చిన్నెలు వాఱఁ దీ ◆ ర్చినపట్టుకాసె
సన్నపుకటిమీఁదఁ ◆ జెన్నొందు వానిఁ
జరణపద్మంబుల ◆ ఝంకించిమ్రోయ
బిరుదునూపురమునఁ ◆ బెంపొందువానిఁ
జిలుకఱెక్కలకొత్తి ◆ జిగి దువాళించు
నలరారుపచ్చల ◆ హారంబువానిఁ
గడునొప్పు పద్మరా ◆ గముల పతకము
వెడదయురంబున ◆ విలసిల్లువానిఁ
గళకులవజ్రాల ◆ కమ్మగెంటీల
తళుకుల చెక్కుల ◆ తళుకులవానిఁ
బలుచనిపన్నీటి ◆ పదనిచ్చి మెదిచి
తిలకంబు కస్తూరిఁ ◆ దీర్చినవాని
శృంగారమలవడ ◆ చెలువొంద మంచి
చెంగల్వపువ్వులు ◆ చేర్చినవాని
ఠీవిగా జిగి ముర ◆ డింపంగమయిని
గోవజవ్వాజిని ◆ గుడ్చినవాని
భువన సమ్మోహనం ◆ బుగ నుదయించఁ
దివురుయౌవనలక్ష్మి ◆ దిలకించువాని
సారంగధరు రూప ◆ [83]సంపన్నుఁగన్ను
లారంగ ఱెప్పల ◆ ల్లార్పక చూచె
నాలోన భావజుం ◆ డలరులవిల్లు

లీలఁ గైకొని మంచి ◆ లేవింటినారిఁ
జెలువార నెక్కించి ◆ చెంగల్వమొగ్గ
ములికినారస మేర్చి ◆ [84]ముంచి(నతే)నె
పరగించి యాలీడ ◆ పాదస్థుఁ డగుచుఁ
దిరముగా సంధించి ◆ తెగనిండఁదీసి
గురుకుచమధ్యంబు ◆ గుఱిచేసి లాఁచి
సరిగోలఁ బడసేసి ◆ చలముననార్చె
నప్పుడు పూఁబోడి ◆ యంతరంగమునఁ
గప్పిన కామవి ◆ కారంబు కతన
మానంబు పేటెత్తి ◆ మర్మంబు గదలి
మేనెల్లఁ బులకించి ◆ మెచ్చులు వొదలి
తమకంబు నంతంత ◆ దట్టమై నిగుడ
గమకించి యందెలు ◆ ఘల్లుఘల్లనఁగ
మొలనూలురంతుగా ◆ మ్రోయ మాణిక్య
కలితకంకణఝణ ◆ త్కారంబు లెసఁగ
నొసపరి బాగుగా ◆ నొదవిననడల
దుసికిలఁబాఱి సం ◆ ధులనాభిదోఁప
దిన్నని నూఁగారు ◆ తీగె చూపట్టి
యన్నువ నెన్నడు ◆ మందంద వణఁక
గొబ్బునఁ బయ్యెద ◆ కొంగు దొలంగ
గుబ్బచన్నులమించు ◆ గురువులు దాఁటి
[85]తరళహారంబుల ◆ తళుకులు చెదర
నెరయు వెన్నెల గాయు ◆ నెఱినవ్వు దోఁప
ఘనరత్నతాటంక ◆ కాంతులు వెలయఁ
గనుఁదోయిమెఱఁగు ద్రొ ◆ క్కని చోట్లఁ ద్రొక్క
ముద్దుఁగ్రుమ్ముడి వీడి ◆ మొనగోర లీల
దిద్దిన కస్తూరి ◆ తిలకంబు గరఁగ
సీమంత మౌక్తిక ◆ శ్రేణి నెమ్మోము
తామరపువ్వుపైఁ ◆ దకతకలాడఁ
గురులు తూఁగంగను ◆ గ్రొన్నెలసోగ
మరువంపురెమ్మ మ ◆ న్మథుకరవాలు
చిత్తరురూపును ◆ చెంగల్వ[86]జోక

మత్త చకోరంబు ◆ మలయుక్రొమ్మించు
రతిపువ్వుఁబోడి భా◆రతి ముద్దు చిలుక
లత యనఁ బసిఁడి స ◆ లాకన నొప్పు
గరువంబు మురువును ◆ కలికితనంబు
మురిపెంబు నొయ్యార◆మును దడబడఁగఁ
గలహంసనడకల ◆ కస్తూరిమృగము
పొలసినలీల న◆ పూర్వవాసనలు
కలసి కదంబింపఁ ◆ గా నరుఁ జూచి
వలచి యేతెంచు నూ◆ ర్వసి చందమునను
వచ్చు చిత్రాంగికి ◆ వసుధేశసుతుఁడు
అచ్చుగా నెదురేగి ◆ యడుగుల కెఱఁగి
వినయ మేర్పడ మున్న ◆ వికసిల్లువానిఁ
గనుఁగొని యలవాలు ◆ గంటి యిట్లనియె
నీరూపురేఖలు ◆ నీ జాణతనము
నీరాజసంబును ◆ నిచ్చలుఁ బొగడ
వీనుల విందుగా ◆ వినివినివేడ్కఁ
గానఁగా వేడుక ◆ గంటి ని న్నిపుడు
తలఁపులు తలకూడె ◆ దైవంబు దెచ్చె
గలిగెఁగన్నుల విందు ◆ గాఁజూడ నిన్ను
నేపనికైన మా ◆ కిఁక నీవు గలుగ
భూపాలునెడ భయం ◆ బులు వొందనేల
మెచ్చువన్నెలు మాని ◆ మేడలోపలికి
వచ్చి యొకించుక ◆ వడి విశ్రమించ
విచ్చేయుమనినఁ దా ◆ వింతనవ్వొలయు
నచ్చారులోచన ◆ కతఁడు నిట్లనియె
నేణాక్షి వినుము నా ◆ కెప్పుడు మిగులఁ
బ్రాణపదంబైన ◆ పారావతంబు
పొడవు గాఁజని పెంపు ◆ పొడగాన లేక
వడివచ్చి యిచ్చోట ◆ వాలుటం జూచి
దానివెంబడి వచ్చి ◆ ధరణీశ్వరుండు
లేనిచోటైనఁ ద ◆ ల్లివి నీవు గాన
రవిరశ్మికిని జొర ◆ రాని నీవున్న
భవనాంగణమునకు ◆ భయమింత లేక

చనుదెంచి నీపాద ◆ జలజంబు లెలమిఁ
గనిమ్రొక్కఁ గంటిసౌ ◆ ఖ్యము లున్నవేళఁ
బనివినియెద నింకఁ ◆ బారావతంబు
గొనుచు నే ననిన రా ◆ కొమరువీక్షించి
పోయెదు గాకయీ ◆ పొరపొచ్చె మేల
నాయెడ ననుచు న ◆ న్నరనాథుసుతుని
జనవునఁ జేపట్టి ◆ సౌధంబుమీఁద
ననువొందఁ గొనిపోయి ◆ యచటఁ జిత్తమున
రతులకు నేర్పుగా ◆ రాజీవముఖులు
పతులతోఁ జౌశీతి ◆ బంధనంబులను
గ్రీడించుగతులఁ జి ◆ త్రించు మెఱుంగు
గోడలమెచ్చులఁ ◆ గొసరించుమంచి
చల్లని ధూపవా ◆ సనలరంధ్రములు
నొల్లనఁ జలువడి ◆ నొప్పారుచున్న
ముత్తెంపు జాలకం ◆ బులను బంగారు
గుత్తంపుఁ దలుపులఁ ◆ గొనియాడ నొప్పు
గాజులోవరిలోన ◆ గరగరిమీఱ
రాజిల్లు నవపుష్య ◆ రాగరత్నముల
మొగడలు వైడూర్య ◆ ముల మించుపంజు
పగడంపు వాచూరు ◆ పద్మరాగములఁ
గొమరార వెలుగొందు ◆ గోమేధికముల
నమరుకంభంబులు ◆ హరినీలమణులు
మలఁచిన కీలుబొ ◆ మ్మల పటికంపు
వెలుగాండ్లు తళతళ ◆ వెలయు దంతముల
మట్టంపుఁ దఱిగోళ్లు ◆ మంజి[87]టి తెరలు
పట్టుపట్టెడ వన్నె ◆ పరపును గలిగి
మహిఁ జెప్పఁదగు తెర ◆ మంచంబు క్రేవ
బహురత్నరుచులచే ◆ భాసిల్లుచున్న
గద్దెపై నా రూప ◆ కందర్పు నుంచి
తద్దయుం బ్రియమునఁ ◆ దత్పాదములును
పసిఁడికుంభములతోఁ ◆ బన్నీటఁ గడిగి
పొసఁగ వాసించిన ◆ భుగభుగ వగల

పచ్చడి బాగాలుఁ ◆ బండుటాకులును
బచ్చకర్పూరంబుఁ ◆ బాటించి యొసఁగి
కలగొని వీణియ ◆ కస్తూరి మెఱుఁగు
గులికి గేదంగిరే ◆ కులు తలఁ జెరివి
కడఁగి వాసించిన ◆ కమ్మజవ్వాది
కడునొప్పు నుదయభా ◆ స్కరమున మెదిచి
చిక్కగా మేళవిం ◆ చిన చందనంబు
మిక్కిలి తనుపుగా ◆ మెయినిండ నలఁది
తోరంపు వజ్రాల ◆ దుహిలీల డాలు
పేరెంపు కెంపుల ◆ పిడిమీఁదఁ దిరుగఁ
గరపద్మమున మించు ◆ గమకించు గచ్చు
సురటివట్రువ గాలి ◆ సుడియంగఁ ద్రిప్పి
పసిఁడి హంసావళి ◆ పట్టుపుట్టములు
నసదృశమణికీలి ◆ తాభరణములు
కట్టనిచ్చిన నవి ◆ కరపల్లవముల
ముట్టి కుమారుఁ డా ◆ ముదిత కిట్లనియెఁ
దల్లిదండ్రులు గూర్చి ◆ దాఁచిన ధనము
లెల్ల బుత్రులవిగా ◆ కెవ్వరి సొమ్ము
వలసిన యప్పుడే ◆ వచ్చి కొనిపోదు
నలినలోచన వీని ◆ నా దాఁపరముగ
నలమి బెట్టెలఁబెట్టు ◆ మని ప్రియంబెసఁగఁ
దలకొని పలుకునా ◆ తని నెమ్మనంబు
లలిత బిబ్బోక వి ◆ లాస భావములఁ
గలిత విభ్రమభావ ◆ గతుల నేమిటను
బదనుగావింప నో ◆ పక సిగ్గువిడిచి
కదిసి పట్టఁగఁ జొచ్చు ◆ కదలు వీక్షించి
తల్లి నేఁ జనుదెంచి ◆ తడవాయె ననుచు
నుల్లమారఁగ నన్న ◆ నొదవుఁ దత్తరము
మానంబు పేటెత్తి ◆ మఱచి చిత్రాంగి
వానికి నడ్డమై ◆ వాకిట నిలిచి
కందర్పునకు నన్నుఁ ◆ గట్టొప్పగించి
యెందు పోఁదలఁచెద ◆ వింక నీవనుచు
గుణవంతు రత్నాంగి ◆ కొడుకుఁ బోనీక

మణిబంధ బంధుర ◆ మాణిక్య ఖచిత
వలయ కాంతులు వైదు ◆ వాళంబు చేయ
వలచేత నతనిపై ◆ వలువంటఁ బట్టి
కలకల నవ్వుచుఁ ◆ గమలాయతాక్షి
పలికె నిశ్శంకతో ◆ భావజాకార
కన్నులకన్నెఱి ◆ కము కడుఁబాయఁ
జెన్నారఁగోరి చూ ◆ చినసుఖం బయ్య
జక్కవకవ రాజ ◆ సము బిసాళించు
చక్కని నాగుబ్బ ◆ చన్నుల మొనలు
దాకొని నీయుర ◆ స్థలమున నొత్తి
తూకొన సౌఖ్యంబు ◆ దొరకదుగాక
యనినఁ గాలిన సూదు ◆ లదరంటఁ జెవులఁ
జొనిపిన యట్లైన ◆ సురసుర స్రుక్కి
యొదవిన పెనురిమ్మ ◆ నొక్కింత సేపు
మదిబీరు వోయి క్ర ◆ మ్మఱఁ దెలివొంది
తలపోసి మంత్రినం ◆ దనుని వాక్యములు
దలఁగూడె ననుచు నెం ◆ తయుఁ జిన్నవోయి
వణఁకుచుఁ గన్నీరు ◆ వడియు వాతెరను
దడుపుచు సారంగ ◆ ధరుఁ డిట్టులనియె
పినతల్లి వని నిన్నుఁ ◆ బెద్దయు నమ్మి
చనుదెంచ నిట్టిమో ◆ సము చాలఁగలిగెఁ
దలపోయ వినఁజెప్పఁ ◆ దగునె యీపలుకు
నిలువక వాక్రువ్వ ◆ నెట్లాడె నోరు
ఎలనాగ యెదిరియె ◆ త్తెఱుఁగక వట్టి
వలవంతఁ బొరలెదు ◆ వావి వోవిడిచి
తల్లియే దైవంబు ◆ దలపోయ ననుచు
నుల్లమారఁగఁ జెప్పు ◆ చుందురు బుధులు
కలలోనఁ బరకాంతఁ ◆ గదియుట నాకు
చెలియలి గామించి ◆ చే పట్టుకొనుట
..... ..... ..... ..... ..... ..... ...... .....
కులశీలములు మది ◆ గోరి రత్నాంగి
కలవడ జన్మించి ◆ నట్టి నాకేల
మదికింపుగానిదు ◆ ర్మార్గవర్తనము

వదలు మీతల్పు భూ ◆ వల్లభు నాన
పదివేలు నేల నా ◆ భావసంశుద్ధి
మదనాంతకుఁడు దక్క ◆మనుజు లెర్గుదురె
అనుటయు జాలి న ◆ వ్వలమ నాలేమ
మనుజేశుసుతునకు ◆ మఱియు నిట్లనియె
సారంగధర భూమి ◆ జనులెల్ల కడలఁ
గోరి నుతించు నీ ◆ గుణములు నీవు
తెలుపుకోనేల ప◆ తివ్రత గన్న
చెలువుండ వవుదువు ◆ చిత్తంబు గంటి
దైవంబు గాను నీ ◆ తల్లిని గాను
భావింప నృపభోగ ◆ భామినిగాని
భావజు [88]గుఱిబారిఁ ◆ బాఱిన పిదప
వావులేటికి ధర్మ ◆ వర్తనం బేల
రతిరాజునాన నా ◆ రాచిలుక తోడు
చతురత నీతోడి ◆ సరససంభోగ
లీలఁ దేలక వద ◆ లిచనిపోలేను
వాలయమిఁక నని ◆ వాకిలి మూయఁ
దివురు చిత్రాంగితో ◆ ధీరతఁ బలికెఁ
గువలయాధీశ్వరు ◆ కూరిమికొడుకు
పరగ మాతండ్రి చే ◆ పట్టిన యపుడె
తరళాయతాక్షి నా ◆ తల్లివి నీవు
ఎలనాగ రత్నాంగి ◆ యేమి నీవేమి
తలపోసి చూడు మా◆ తత్తర ముడిఁగి
తోయంపుబుగ్గల ◆ తోయంబులైన
కాయంబు ప్రాయంబు ◆ గట్టిగా నమ్మి
కావరంబునఁ గన్నుఁ ◆ గానవు జముఁడు
గావుపట్టక నిన్నుఁ ◆ గావఁడు సుమ్ము
నెమ్మది యట్లుండె ◆ నిమ్మహి నీకు
సమ్మదంబున నెల్ల ◆ చనవులనిచ్చి
లోలత నఱచేతి ◆ లోనిమ్మపండు
లీలఁ బోషింప లా ◆ లితవైభవమున
సుకసుకంబున నుండి ◆ స్రుక్కక చావఁ

గెకరించెదవు విధిఁ ◆ గెలువ నీవశమె
మటుమాయ మదనుని ◆ మాయలఁ జిక్కి
కటకటా యేటికిఁ ◆ గసమసచేసి
మును ని న్నెఱింగియు ◆ మునుమిడి నడువు
మనుటయుఁ జిత్రాంగి ◆ యనియె నాతనికి
నెన్నఁడు నేరిచి ◆ తీదిట్టతనము
లిన్ని విచారింప ◆ నేటికి నీకు
జముని నెక్కించి దో ◆ సము గొండఁజేసి
సుమహితసంసార ◆ సుఖమూలమైన
కాయంబు చపచప ◆ గా విడనాడి
ప్రాయంబు నొకతృణ ◆ ప్రాయంబు చేసి
సురిగిపోఁజూచెదు ◆ సుద్దులు మాను
నరనాథుఁ డిం కొక్క ◆ నాఁడు నాకల్ల
సాకుసాకులఁబట్టి ◆ చంపించు చావు
మేకొంటి నెక్కడి ◆ మీఁదటి తగవు
నెయ్యంబు గల దింక ◆ నీకును నాకు
..... ..... ..... ..... ..... ..... ..... ..... .....
నెక్కడి పాపంబు ◆ లెక్కడివావు
లెక్కడి కొడుకులు ◆ ఎక్కడితల్లి
యిల వారకామిను ◆ లెవ్వరియాండ్రు
వలచిపట్టిన[89]దాని ◆ వదలక వడుపు
వలచుట కష్టమా ◆ వలవదే రంభ
నలకూబరునకును ◆ నలమహీపతికి
వలవదె దమయంతి ◆ వలరాజునకును
వలవదె రతిదేవి ◆ వలపేమి చేసె
నించు విల్కాఁడు మ ◆ హేంద్రజాలకుఁడు
మంచివాడవు నీవు ◆ [90]మరపు మీవట్టి
జగజాలిమాటల ◆ జరిపెదుప్రొద్దు
సుగుణులు గారొకో ◆ సురలును దొల్లి
మరఁగఁడె కూఁతు దా◆ మరసాసనుండు
వలవఁడే గౌతమ ◆ వనిత కింద్రుండు
నిలుకడచాలదె ◆ నీకంటె ఘను(లు)

..... ..... ..... ..... ..... ..... ..... .....
ఈ వెడమాటలు ◆ ఇవియేలతల్లి
క్రమమున జగములు ◆ గల్పింపఁ బ్రోవ
సమయింపఁ గర్త ◆ లై సన్ను(తి గన్న)
..... ..... ..... ..... ..... ..... ..... ..... .....
బోవుగా కటువలె ◆ బోవ నన్యులకు
రమణి నీవెన్నిన ◆ రంభయు రతియు
దమయంతియును బట్టి ..... ..... .....
..... ..... ..... ..... ..... ...... భావజుకేళి
కలిచిరే యపకీర్తి ◆ గలగవులేచి
తొలఁగవు దురితంబు ◆ త్రోవకుమున్ను
కలఁగవు ..... ..... ..... ..... ..... .....
మెలఁగవునామాట ◆ మెయికొని బుద్ధిఁ
జెలఁగవు ముకురంబు ◆ [91]చేతికినేల
చాలు పోపొమ్మను ◆ సారంగధరుని
తా ..... ..... ..... ...... ..... ..... ..... .....
(పలుకు) చిత్రాంగినాఁ ◆ పై గృపారసము
కులుకు నీచూపు ని ◆ గుడ్చి కైకొనవు
కాకవియోగాగ్ని ◆ కాకచేఁ బూర్ణ
రాకాసుధాకారు రా..... ...... .....
డాకచే మకరాంకు ◆ డాకచే నిట్లు
పోక ప్రాణంబులు ◆ బొందితో నిలుతుఁ
జేకొమ్మని కనుల ◆ చిలుపలు గ్రమ్మ
మీటుచు వేడునా ◆ మెఱుఁగారు బోణిఁ
బొదవిన కందర్ప ◆ భూతంబు సోకు
వదలింప మాటల ◆ వశముగా(దంచు)
....................................న్నె-
జిలుగుదుప్పటి దాని ◆ చేతఁబో విడిచి
భయమునఁ బినతల్లి ◆ భవనంబువెడలి
రయమారఁ జనుచున్న ◆ (రత్నాంగిపుత్రు)
................................కదిపించి
పలుమారు చిత్రాంగి ◆ పగచాటి పలికె

నోరిమానము నిలుప ◆ నోపకనిన్ను
గోరిపట్టిన నోర (గొలఁదులువలికి)
..... ...... ...... ...... ...... (విర)హాగ్నిఁ ద్రోచి
కడపట తలపువ్వు ◆ కందక నీవు
వెడలిపోయెద విటు ◆ వినుము నా పూన్కి
పుడమీశు నిచటనె.....................
.......................నా కల్ల నీమీఁద
విపరీతముగఁ జెప్పి ◆ విరస మెక్కించి
తోడమచ్చంబు నీ ◆ దుప్పటిఁజూపి
వీడెల్లఁ గనుఁగొన ◆ విఱిచి కట్టించి
పనిచిన పదములుఁ ◆ బాణిపద్మములు
గనెలుగాఁ గోయింతుఁ ◆ గత్తుల ననిన
నటఁద్రోచి పోవఁ గా ◆ ళ్లాడక నిలిచి
పటుబుద్ధి పలికె భూ ◆ పాలనందనుఁడు
తల్లి నాయెడ నీకుఁ ◆ దగునె కోపంబు
మల్లడిగొనుచున్న ◆ మన్మథు వెతకుఁ
గాక నీపలుకువి ◆ ఘాతమాటలకుఁ
జీకాకుపడి ధర్మ ◆ శీలంబువదలి
తెక్కలిప్రాణంబు ◆ తీపిని గోర్కె
నిక్కంబుగాఁ దీర్చు ◆ నిమిషార్ధసుఖము
కొడఁబడ జనులచే ◆ నొగిఁరట్టు దిట్టు
గుడిచి యీతనువు వీ ◆ డ్కొని (నంత) జముని
దూతలచే నొచ్చి ◆ తుదివచ్చి హీన
జాతిఁబుట్టుట కంటె ◆ జగములోఁ గీర్తి
వెలయ నీకును మహీ ◆ విభునకుఁ బ్రియము
దలకొనునంతకుఁ ◆ దలయొగ్గి మనసు
గట్టిగా నిలిపి కొం ◆ కకచావు కాస
గట్టియుండఁగ దైవ ◆ గతి యటమీఁద
వనజాక్షి నేఁ బోయి ◆ వచ్చెద ననుచుఁ
దన నగరికివచ్చి ◆ ధరణీశసుతుఁడు
దొరల లెంకలను భృ ◆ త్యుల వీడుకొలిపి
వెరవిడి చిత్తంబు ◆ విరవిరఁబోవ
మృదుతల్పమున మేను ◆ మెల్లనఁ జేర్చి

కొదుకక తనచేసి ◆ కొన్న నేరమికి
విన్ననై వగచుచు ◆ వెచ్చనూర్చుచును
మిన్నుపైఁ బడ్డట్లు ◆ మిన్నకయుండె
నచటఁ జిత్రాంగియు ◆ నంగజుకేళి
కచలించు తనకోర్కె ◆ కాదని సుతుఁడు
సమ్మతించక త్రోచి ◆ చనుటయు నిట్లు
గ్రమ్ముకోఁ గోపంబు ◆ గజనిమ్మపండ్ల
చుట్టంబులై కోరి ◆ చూడనొప్పారు
మిట్ట చన్నుల వాఁడి ◆ మిగిలిన గోళ్లఁ
దనుఁదానె జర్ఝ‌రి ◆ తంబుగా వ్రచ్చు
కొని నేలఁబడి మైల ◆ కొంగు ముసుంగు
మునుగఁగైకొని బెట్టు ◆ మూల్గుచునుండె
అని చతుర్దశభువ ◆ నాధీశుపేర
వినుతవేదాగమ ◆ వేద్యునిపేర
సేవకోత్పలషండ ◆ శీతాంశుపేరఁ
భావనాతీతప్ర ◆భావునిపేర
భృంగీశతాండవ ◆ ప్రీతాత్ముపేర
గంగాతరంగసం ◆ గత ళిపేర
నభిమతార్థప్రదా ◆ యకదేవుపేర
శుభమూర్తి మల్లికా ◆ ర్జునదేవుపేర
ఘనముక్తికాంతభి ◆ క్షావృత్తి హృదయ
వనజప్రభాతది ◆ వాకరుపేర
నారవి తారాశ ◆ శాంకమై వెలయు
గౌరనామాత్యపుం ◆ గవ కృతంబగుచు
ననుపొంద నీనవ ◆ నాథచరిత్ర
మను కావ్యమునఁ బ్రథ ◆ మాశ్వాస మయ్యె

ప్రథమాశ్వాసము సంపూర్ణము.

  1. లుప్తభాగము పూర్తిచేసిన చోటఁ గుండలా కారమగు గుర్తుండును.
  2. తగశిత
  3. దురహ సేను
  4. వాసునగజ
  5. శాలిభిదరు
  6. సాహత
  7. తంబ
  8. రాంబికాభిమఫల
  9. వేల్పు ....... బుపడిగల . . . . . గల సకలామరమకుట భారంబు గల మహా ... అని వ్రాఁతప్రతి. ఈ కవియే రచించిన హరిశ్చంద్ర ద్విపదలోఁ బైరీతి నుండుటచే నట్లు సవరణ చేయఁబడినది, హరిశ్చంద్ర తాళపత్ర పుస్తకమునఁగూడఁ గొంత పాఠభేదము గలదు.
  10. సరసీకృత.
  11. శ్వరమా విలాసనుఁడు.
  12. గతకదా.
  13. క్కాంత తాలలాటమండలుండు.
  14. ముక్తి కాంతభిషా.
  15. కాంతాంతరధూప.
  16. ఁబొగడొంద.
  17. నిగుడి.
  18. బలర రసాటంక.
  19. భారు
  20. పుణ్యవర్తనములు.
  21. 'అనుజాతుండగు నయ్యలమాంబ్బకూర్మి' అని వ్రాఁతప్రతులు.
  22. జాతు.
  23. ని.
  24. నిర్వర్ణ.
  25. పరమయ యాద్యంతం.
  26. నే నొనర్చెడి.
  27. బలబలారి తరనాగ.
  28. ముఖనిఖిలంపు.
  29. పురుషవరులు.
  30. సెలగ.
  31. గమిపెంట.
  32. “పెంపునవిరిగి'
  33. ఎచరించు ఈకవియే యిందు మూఁడవ యాశ్వాసమునఁ బ్రయోగించెను.
  34. నలుకలుకగా కలునప్ప
  35. పువ్వులు.
  36. పంపులు.
  37. సంమతి
  38. గురుబసలొనరించు వెనుక.
  39. నేలోలతభ.
  40. మరియుషచం
  41. గనుంగొని భద్రాస్య, పుండరీకంబుల పులకలు సందడించి, నిందివరములక నిదియె మందనుచు.
  42. బోయ
  43. కేలల
  44. పూలెమ్మకొదల చెరిమ్మ; బొరిమ్మ
  45. 'సుకుంభాంతిదాల్చె'
  46. చనుచు కోకిల శుకపిక.

  47.    భృంగాంగు లిగురొత్త పృథివగ్రహార
       సంగవిహంగ నాసన్న రథాంగ
       మంగళసలిల నిర్మలాంగ మాతాంగ
       గంగప్రియం బెసగంగన వటి చేరి.
  48. బంధము
  49. సటిత తటిభ్రాం
  50. వరులుసునయన. మేలిమిమడుగుట
  51. నరపిండము మదేంట్లు నలతపంక్తి
  52. డండరంబు
  53. ఆవర్తపర్యాయముగాఁబ్రయుక్తము
  54. నరుణారవిందంబులమర
  55. కట్టి
  56. నంబుధి మలక్రేవ
  57. పొందొందవటముల బూజించుతరుల
  58. కారణయైక్య
  59. 'నుండి యొక్కడూ కొనుచున్నాడు యెవఁడో విచిత్ర'
  60. వోకాలకంధరధన్యుగానొనర్చి
  61. చెనిచెప్ప... బార్వతియు మనసిజాంతక యిక్కు
  62. 'మనము యే తెమ్మ నక మత్స్యయుద'
  63. 'నూనాయు దురితారి సూనుని'
  64. సామార్థ్యమునకు దగజడత్వములును
  65. నిండి
  66. లని
  67. నిరవు
  68. కలిగట్టు
  69. 'బోగరినైన మాను'
  70. మెరన
  71. చంద్రుండు చెన్నొందు కళలఁబ్రసిద్ధుఁడై
  72. పసురు వెన్నెల కుబుస
  73. నడరు గుర్రలందె లెక్కిచెరియించు
  74. పావురము
  75. లలనలకును మగవాండ్లకు మదను
  76. రతింబొణు లతనుచితంబు వలయుచున్నడకు
  77. కడకునె నెఱుంగుదు
  78. 'నృపు' లోని 'నృ' అనుదాని యుచ్చారణము 'న్రు' గా వినఁబడుటచేఁ గాఁబోలు ‘ండు' యతిస్థానమున నుపయోగింపఁబడినది. ఇట్టివి యింకను గలవు. ఇటఁ 'రెంటి' యని సవరించినచో యతి సరిపడును.
  79. మోరు
  80. నిప్పునెంజదలంటు
  81. నిగనిగమని.......... నిగిడివాతెర
  82. యట్టి
  83. సంపదగన్ను
  84. ముంచి... .... నెపదనిచ్చి.
  85. తార... నెరసి... లేనవ్వు
  86. జోకైనచెంగల్వ
  87. మంజిష్టి
  88. మహి
  89. తాల్మి
  90. మరవుమీ
  91. చెక్కునకేల