Jump to content

నవనాథచరిత్ర/పంచమాశ్వాసము

వికీసోర్స్ నుండి

నవనాథ చరిత్ర

పంచమాశ్వాసము.

శ్రీ మనోహరమైన ◆ శీతాచలంబు
పై మీననాథుఁ డీ ◆ పగిది నానంద
ములను వర్తించుచు ◆ [1]మునుకొను కరుణ
దళుకొత్తఁ దనశిష్య ◆ తతిఁ జూచి పలికె
సమధికంబగు యోగ ◆ సామ్రాజ్యసుఖము
నమరంగఁ గైకొంచు ◆ నవనీధరంబు
నంద నే నిల్చెద ◆ నఖిలలోకముల

మీననాథుఁడు శిష్యులను మతవ్యాప్తిఁ జేయఁబంపుట.



నందమై యందువి ◆ ఖ్యాతి నెసంగు
పుణ్యతీర్థములను ◆ బుణ్యాచలముల
...... ...... ...... ...... ...... ...... ...... ......
నాతత ధర్మప ◆ రాయణులైన.
భూతలాధీశుల ◆ పురముల నూళ్ల
నొరులు మిమ్మెఱుఁగక ◆ యుండ నొక్కొక్క
వెరవునఁ బ్రచ్ఛన్న ◆ వేషంబుఁబూని
సంచరింపుఁడు మీరు ◆ శమమును దమము
నంచితజ్ఞానంబు ◆ నలవును మెఱయ
ప్రతుల విప్రులఁ బుణ్య ◆ వ్రతులను బాశు
పతుల గోవుల భూమి ◆ పతులను యతుల
వృద్ధుల బాలుర ◆ విగతకల్మషుల
సిద్ధుల విద్యాప్ర ◆ సిద్దుల హితుల
మన్నింపుఁ డకుటిల ◆ మతుల సన్మతుల
సన్నుత గురుభక్తి ◆ సహితుల హితులఁ
బరికించి వారల ◆ భావంబు దెలిసి
కర మర్థి శిష్యులఁ ◆ గాఁ బ్రమోదించి
ఘనసిద్ధదేహులఁ ◆ గావింపుఁ డెపుడు

నొనరఁ గల్పింపుఁడు ◆ యోగశాస్త్రములు
పరమతత్వార్థ దీ ◆ ప్తంబులు గాఁగఁ
జరితంబు చెప్పు డి ◆ చ్చటకి రావలదు
పాపంబు కఱువును ◆ భయమును లేక
యేపారు నటువంటి ◆ యెడల వసింపుఁ
డతులితంబైన యో ◆ గాభ్యాసశక్తి
నితరదుర్లభమైన ◆ యీ దేహశక్తి
సమకూరె మనకు వి ◆ చారించి చూడఁ
దమశరీరములు ని ◆ త్యము లని నమ్మ
రాదు నిజేచ్ఛాప ◆ రాయణుఁడైన
యాదినాథుఁడు దక్క ◆ నన్యు లెవ్వరికిఁ
గావున నంగర ◆ క్షణము నేమరక
మా వాక్య పద్ధతి ◆ మఱవకుం డెపుడు
నని యానతిచ్చి పెం ◆ పార గోరక్షుఁ
గనుఁగొని నీవాది ◆ గాఁగ నార్వురును
జనుఁడు చౌరంగి మో ◆ సమున నాతనికి
ఘనసిద్ధసంతతి ◆ గలుగక యుండఁ
బలికినారము గానఁ ◆ బనిలేదు తిరుగ
నెలమి నేముండిన ◆ యెడనె యుండెడిని
నావుడు శ్రీగురు ◆ నాథ నీపాద
సేవ చేసుక నేను ◆ స్థిరగతి నుందు
...... ....... ....... ....... ....... ....... ........
....... ........ ....... ...... ....... ...... .......
రభసంబు నను గో ◆ రక్షుఁడు గదలి
నభవు శంకరు విశ్వ ◆ నాథు భజించి
యారాత్రి యందుండి ◆ యా మఱునాఁడు
సారనిశ్శ్రేయసా ◆ స్పదమయి [2]నిఖిల
కామదంబగు మణి ◆ కర్ణి కాసరసిఁ
దామజ్జనాది కృ ◆ త్యంబులు దీర్చి
తత్తీరభూమినెం ◆ తయుఁ బరిపాటిఁ
జిత్తంబు లలరించు ◆ సికతాతలమున
విపుల తేజంబులు ◆ వెలయఁ గూర్చుండి

యపుడు గోరక్షుఁడి ◆ ట్లనియె వారలకు
నింక మీరిట నుండి ◆ యేఁగుఁ డొక్కొక్క
వంకగాఁ జరియింప ◆ వలయుఠావులకు
మఱవకుం డాత్మలో ◆ మన గురుస్వామి
యొఱపుగాఁ గఱపిన ◆ యుపదేశ సరణి
నేలీలఁ బనిలేని ◆ యెడలఁ జేయకుఁడు
కాలయాపన మని ◆ క్రమమున నిలిపి
యనుపమలాటగౌ ◆ ళాభీర భోట
జనపదంబులకుఁ దాఁ ◆ జనియెఁ బెంపొదవ
నరిగెఁ గళింగవం ◆ గాంగభూములకు
నరనుతుండగు మేఘ ◆ నాథుఁ డిం పెసఁగ
మఱియు మహారాష్ట్ర ◆ మ[3]హా దేశములకు
భూరితేజుఁడు సిద్ధ ◆ బుద్ధుఁడు పోయె
నెలమి విరూపాక్షుఁ ◆ డేఁగెఁ గర్ణాట
లలిత కన్నోజిమా ◆ ళవ దేశములకు
నూర్జిత యశుఁడు సొం ◆ పొదవఁ గాశ్మీర
ఘూర్జటేంకణ మత్స్య ◆ కోంకణంబులకుఁ
గలిత ప్రభావుండు ◆ ఖణికుండు నరిగె
మళయాళ బర్బర ◆ మగథాంధ్ర పాండ్య
చోళభూములు చనఁ ◆ జొచ్చె విజ్ఞాన
శీలి నాగార్జున ◆ సిద్ధుఁ డింపార
నీరీతి నందఱు ◆ నెల్ల దిక్కులకు
ధీరులై చని మున్ను ◆ తిరిగిన ఠావు
లనక వెండియు చతు ◆ రబ్ధి [4]మధ్యమున
వినఁజూడ వసియింప ◆ విస్మయకరము
లగు తీర్థములను దే ◆ వాలయంబులను
దగుపురంబులఁ బర్వ ◆ తగహనంబులను
మెలఁగుచు గురుబుద్ధి ◆ మెఱసి సజ్జనులఁ
దెలిసి మానస్థితిఁ ◆ దెలుపుచు దీక్ష
లొసఁగి సిద్ధులఁ జేసి ◆ రుర్విఁ బెక్కండ్ర
నసమానమహిమ వా ◆ రది యెవ్వ రనినఁ
బండిత ప్రవర స ◆ ద్వాది గోరక్ష

కుండు రతనఘోర ◆ కుండును లోక
నాథుండు నచ్యుత ◆ నాథుండు గగన
నాథుండు నవధూత ◆ నాథుండు చంద్ర
నాథుండు పశ్చిమ ◆ నాథుండు యోని
నాథుండు నర దేవ ◆ నాథుండు ప్రతిభ
నొనరగోడాచూడ ◆ యును నాగగోడి
యును జినారయును మ ◆ యూర సిద్ధుఁడును
పాయనిశాంతి సం ◆ పన్నుండు కీర్తి
శ్రీయును సోమవా ◆ సియు బచ్చళియును
బాలగోవిందుఁడు ◆ ప్రకట వివేక
శాలియు హరిమిండి ◆ సంజాయనంగ
భూవిశ్రుతులు మహా ◆ త్ములు చిరకాల
జీవులు గోరక్ష ◆ శిష్యులు సిద్ధ
పుంగవుండును మన ◆ ములను ద్రిప్పుటకు
సంగతిగాఁ జరి ◆ జలు చరియించె
సూర్య నాథుండును ◆ జోకాయ సుజను
కార్యానుకూలి తె ◆ క్కాపి సింధూరి
పాయయు మోహన ◆ పాయ గిమ్మీరి
పాయయు బరహిత ◆ పరుఁడైన నిత్య
నాథుండు సత్కీర్తి ◆ నాథుఁడు సత్య
నాథుండు నాకూరి ◆ నాథుండు సిద్ధ
రావుళా యును మనో ◆ రథుఁడు విజ్ఞాన
శేవడి పరువడి ◆ సిద్ధనాముండు
సిద్ధబుద్ధుని ప్రియ ◆ శిష్యులు విమల
బుద్ధిమైఁ జర్య లొ ◆ ప్పుగఁ జెప్పెనతఁడు
మఱి యుపవాయయు ◆ మహితవిఖ్యాతిఁ
బరగిన యట్టి క ◆ పాల దండియును
ఘనరసాయన వేది ◆ కాలవంచకుఁడు
అనపాయకీర్తి క ◆ ల్యాణయోగియును
మిక్కిలి మతముల ◆ మెఱయు పాషాణ
భుక్కును నరభుక్కు, ◆ భూతనాథుండు
....... ...... ....... ........ ....... ....... ...... ......
భుక్కులు ననుపుణ్య ◆ పురుషులు శిష్యు

లన మేఘనాథున ◆ కతఁడు జరిజలు
నొనరించె సరదుటి ◆ యును దూరభాతు
ననఘుండు సిద్ధనా ◆ గార్జునాహ్వయుఁడు
...... ...... ....... ....... ...... ..... ...... ...... .......
నాయతబుద్ధిఁ బెం ◆ పారెడి ధూమ
పాయయు భల్లూక ◆ పాయయుఁదైల
పాయయువ్యాళియు ◆ భానుమంతుండు
హేయదూరుఁడును ర ◆ సేంద్ర పాయయును
నుతమతి నాగార్జు ◆ నునిశిష్యు లతఁడు
హితకరుండైన ర ◆ సేంద్ర పాయయును
[5]నొగిరత్న పాయయు ◆ నుచ్చ యాఖ్యుఁడును
బొగడఁ జెన్నగు కక్ష ◆ పురి వసియించు
కాలపాయయు వజ్ర ◆ కాకనాథుండు
జాలాంధ్ర శిష్యుండు ◆ శైంద్ర పాలుండు
సుందర యోగీంద్ర ◆ సుమహితానంద
మందిరుండైన కా ◆ మండును బూర్ణ
గిరినాథుఁడును శుభా ◆ కృతి యెందియాణి
గురుఁడు నాళివ్యాప ◆ కుఁడు భువనేంద్రుఁ
డును ద్రిలోచనసిద్ధుఁ ◆ డునునను వార
లనవద్యుఁడగు విరూ ◆ పాక్షుని శిష్యు
లమృతజ్ఞసిద్ధియు ◆ నమృతంబు ననఁగ
నమ రెడు గ్రంథుబు ◆ లతఁడు నిర్మించెఁ
గమలనాథుండును ◆ గతరోషుఁడైన
యమృతనాథుండు స ◆ దానందరాళుఁ
డానుగన్నారా ళుఁ ◆ డను ఖేచరియు ను
నానత పరవాది ◆ యచలనాథుఁడును
మనుభావనిధి పర ◆ మానందయోగి
యనఁగను సుజ్ఞానుఁ ◆ డౌ యోగి మహిని
జెలఁగు లోహిత సిద్ధ ◆ సింగనాథుండు
....... ...... ....... ...... ....... ........ .......
శ్రీ గుణహారి వి ◆ రించి నాథుఁడును
రాగవర్జితుఁడు సౌ ◆ రంభుండు ననఁగఁ

గల భవ్యమూర్తులు ◆ ఖణికుని శిష్యు
లలవడఁ జరిజల ◆ నధికుఁ డొనర్చె
నీరీతి వినియు న ◆ నేకులు వారి
వారికి భువి శిష్య ◆ వరులైరి భక్తి
నంతగోరక్షకుం ◆ డాత్మ ప్రభావ
మెంతయు విలసిల్ల ◆ హిమనగ సేతు
పర్యంతమైన భూ ◆ భాగమంతయును
బర్యటనంబునఁ ◆ బరమ పూతముగఁ
గలయంగ మెలఁగి ది ◆ గ్గన నటు మరలి
వలనొప్పఁ దనగురు ◆ స్వామి వీక్షింపఁ
జనుచు దేశాంతర ◆ సంచారులైన
జనములచే నీల ◆ శైలంబుమీఁద
నలఘువిచిత్ర ది ◆ వ్యౌషధమణులు
గల వని విని చూడఁ ◆ గా మదిఁగోరి
వీకమైఁ గావేరి ◆ వేదికాతటముఁ
గైకొని నిజశిష్య ◆ గణములు గొలువఁ
బురములు వనములుఁ ◆ బుణ్యతీర్థములుఁ
గరమర్థి నడచి శీ ◆ ఘ్రంబున నరిగి
కనియుఁ జిత్తంబునఁ ◆ గౌతుకం బొదవ
ననతిదూరంబున ◆ నాయోగివరుఁడు
కటముల మదము లు ◆ త్కటములై దొరుఁగఁ
దటసంచయములు నా ◆ దట సంచరింపఁ
దమ కలవడిన దు ◆ ర్దమ కలభముల
గముల వీక్షించి సిం ◆ గములు గర్జింప
[6]నల బలాహక శంక ◆ నలబలం బెసఁగఁ
గలసి నటించు శ్రీ ◆ గల శిఖిప్రతతి
రుచిరలీలలు మనో ◆ రుచి రచియింప
[7]ఖచరంబు గలుగమి ◆ ఖచరగాములును
...... ....... ....... ....... ....... ..... ......
లలనలుఁగేరి లీ ◆ లల నలరార
......... ........ ........ ....... ....... ......
గురుపూగముల నవా ◆ గురుపూగములను

వరకదంబములశా ◆ వర కదంబముల
వారిజంబుల స్థల ◆ వారిజంబులను
వీరభూజముల సౌ ◆ వీరభూజములఁ
దనరుచులెందును ◆ దనరుచు నెగసి
ఘనకూటముల రాయ ◆ ఘన కూటములను
విరళత్వగతి విర ◆ విరఁ బోవఁజేసి
ధరనొప్పు నమ్మహా ◆ ధరణీధరంబుఁ
గని యానగంబు డ ◆ గ్గఱఁ బ్రవేశించి
మునిజనస్థితి నాద ◆ ముల నుల్లసిల్ల
మొగడలు విరియు త ◆ మ్ముల నగ్గలించు
భుగభుగ[8]మను వల ◆ పులు సూఱలాడి
కొనకొని చనఁజొచ్చి ◆ గురువులువారి
తనువులు విదలించి ◆ దళములయదుటఁ
దళుకొత్తు పూఁదేనెఁ ◆ ద్రావి మదించి
మలసి జుమ్మని మ్రోయు ◆ మధుకరంబులును
గొమరారు గంధపుఁ ◆ గొండ నెత్తములఁ
బ్రమదలీలల మించి ◆ పాడుకన్నియల
నలరించి మెల్లన ◆ నరుదెంచుగాలిఁ
దలలెత్తు నునుఁజిరుఁ ◆ దరఁగ యుయ్యలలఁ
బిరిగొన్నప్రేమలఁ ◆ బ్రియులతోఁగలసి
సరిదూఁగియాడెడు ◆ చక్రవాకములు
మిసమిసమను జిగి ◆ మించువెన్నెలలు
పొసఁగ నెసఁగు బిసం ◆ [9]బులలో సగంబు
మెసఁగి మేనులఁ బెంచి ◆ మేలంబుగొనుచు
రసికులై మెలఁగు మ ◆ రాళదంపతులు
సొలవక జఠరరో ◆ చులు నలుగడలఁ
దళుకుతళుక్కునఁ ◆ దఱుచుగాఁ బొలయ
నెడనెడ వడిఁబుటం ◆ బెగయుచుం బెల్లు
బెడయుచు నొండొంటిఁ ◆ బెనఁగుచుం బెరసి
తండతండంబులై ◆ [10]తమకంబు గొనుచు
నిండారుజలచర ◆ నికరంబుగలిగి
యనిమిషోత్సనకారి ◆ యగు తనవారి

మనమారఁజేరి స ◆ మ్మతిఁ గ్రుంకువారి
[11]కలుషంబులనుబాపి ◆ గరిమఁ జెన్నారి
పొలుపొందుజంభారి ◆ పురి మనోహారి
సులభసంగతిఁ జేరి ◆ సుఖములఁగోరి
చెలఁగుచుండెడివారిఁ ◆ జేర్చు కావేరి
రయమునదాఁటి తీ ◆ రంబున నుచిత
నియమంబు లన్నియు ◆ నిష్ఠతో జరిపి
నిండువెన్నెలమీఁద ◆ నిగిడిన వెండి
కొండ యొప్పారు లా ◆ గున భూతిపూఁత
నరుదైన గౌరదే ◆ హము ప్రకాశింపఁ
బరగు నాచంద్రిక ◆ పై నెఱసంజ
గిరిగొన్నగతిఁ దొడి ◆ గిన పట్టుగంత
[12]నెరయఁగ నగశృంగ ◆ నిలయమైవెలయు
వాసవు[13]ధనువు కై ◆ వడి మస్తకమున
భాసురంబై పట్టు ◆ పట్టియ మెఱయ
ననువొందఁ [14]దరి గొండ ◆ నడిచుట్టుకొనిన
ఘనభోగి భోగంబు ◆ కరణి నెన్నడుమఁ
బదిలమై యెడ్డాణ ◆ బంధంబుదనర
వదనచంద్రునిఁ గొల్వ ◆ వచ్చినరీతి
నక్షత్రచక్రంబు ◆ నాఁగర్ణకోటి
నక్షమాలిక యుజ్జ్వ ◆ లాకృతిమెఱయ
యోగదండము గేల ◆ నొప్ప మేదినికి
నాగతుండైన పు ◆ ష్పాయుధారాతి
చెలువున శోభిల్లి ◆ శిష్యబృందంబు
బలసిరా నానీల ◆ పర్వతం బెక్కి
క్రందుగా నామీఁదఁ ◆ గలుగు తీర్థముల
కందువ లన్నియుఁ ◆ గనుఁగొని యెలమి
నారాత్రి యందుండి ◆ యమ్మఱునాఁడు
చారుమార్గమున నా ◆ శైలంబు డిగ్గి
చరియింపనున్న దే ◆ శంబులు మీరు
చరియింపుఁ డని శిష్య ◆ చయములఁ బంపి
శ్రీ మల్లి కార్జున ◆ శ్రీమహాదేవు

సోమార్ధశేఖరుఁ ◆ జూచు [15]కౌతుకము
మనమున నిండార ◆ మహిమ మీఱఁగను
నెనయు శ్రీనగమున ◆ కే తెంచి యచట
వినఁజూడ నరుదార ◆ [16]వింతఁ దాఁజూచెఁ
దనరు మంజరుల నె ◆ త్తావులఁ జల్లు
భూరుహంబుల ముని ◆ పుత్రులు ప్రమద
మార భిక్షాందేహి ◆ యనుచు డగ్గఱినఁ
బరిపక్వ ఫలములు ◆ పత్రముల్ నిండఁ
గురియు పాదపముల ◆ గుంపుగాఁ బొదలి
తిరముగా నీడలు ◆ తిరుగని తరుల
సురత కేళీలోల ◆ సురసిద్ధ మిథున
పరిలులి తానల్ప ◆ పల్లవతల్ప
పరిమళ సురభిత ◆ బహులతాభవన
సముదయంబుల శివా ◆ ర్చన లాచరించు
సమయబు లెఱిఁగి ని ◆ శ్చలభ క్తిఁ జేరి
పొగడొందు ఫలదళ ◆ పుష్పమూలంబు
లోగి వృద్ధమునులకు ◆ నొసఁగు క్రోఁతులను
మరిగి పంచల బ్రహ్మ ◆ మంత్రజపంబుఁ
బరువడిఁ బలికెడు ◆ బాలకీరములఁ
బంచాక్షరీమంత్ర ◆ పఠనమైఁ బొందు
పంచమశ్రుతిసేయు ◆ పరభృతంబులను
గ్రందుగాఁ బథపరి ◆ శ్రాంత మానసుల
నిందిందు రండు మీ ◆ రిట మహీజముల
నీడల నొక్కింత ◆ నిలువుఁ డీపండ్లు
వేడుకఁ గొండను ◆ విహగసంతతులఁ
బరమేశ్వర ధ్యాన ◆ పరిణతానంద
పరిపూర్ణచిత్తులై ◆ బాహ్యంబు మఱచి
యున్న యోగీంద్రుల ◆ [17]నొడళులఁ గదిసి
నున్ననిమేనుల ◆ నూల్కొను తీఁట
నపహరింపగ రాయు ◆ హరిణపోతములఁ
దపసులుచోప రం ◆ ధ్రద్వారములను
ముదమునఁ దలలెత్తి ◆ ముని కుమారకులు

చదువు మనోహర ◆ సామ గానములఁ
గన్నుల విని సొక్కు- ◆ గడలుకొనంగఁ
బన్నుగా నటియించు ◆ పన్నగంబులను
నెమ్మిఁ బ్రాణాయామ ◆ నిరతుల మేనఁ
గ్రమ్మెడి ఘర్మాంబు ◆ కణములఁ గర్ణ
తాళవృంతంబుల ◆ తనుగాలిచేతఁ
దూలించు గంధసిం ◆ ధురసమూహముల
[18]నాతపశ్రాంతులై ◆ యరుదెంచు యతుల
కాతతనిజగరు ◆ దాతపత్రములఁ
జూటుసేయుచు నాక ◆ సంబున వచ్చు
మేటినమళ్లను ◆ మృదువాక్యసరణి
శివపరాయణములు ◆ సేయు సద్భక్త
నివహంబులకు నిజ ◆ స్నిగ్ధకాయంబు
లొరగుగద్దియలుగా ◆ నొగి నిశ్చలతల
వరలుబెబ్బులుల దు ◆ ర్వార హేమంత
వేళల సుష్ణమై ◆ వేసవినాఁడు
చాల శీతములైన ◆ సలిలాశయముల
శ్రీశైలనాయక ◆ సేవానురక్తు
లౌ శివలోక మై ◆ లారసోపాన
భంగంబులై నిజ ◆ ప్రభలెల్లఁ గడలఁ
దొంగలించెడు సము ◆ త్తుంగ శృంగములఁ
గామధేనువులను ◆ గమనీయ కల్ప
భూమీరుహంబులఁ ◆ బుణ్య వాహినుల
దేవఖాతంబుల ◆ దివ్యౌషధముల
దేవాలయంబుల ◆ దివ్య లింగముల
జలతృణగ్రాసకా ◆ ష్ఠ ప్రతానముల
బలసినజ్యోతులఁ ◆ బరుసవేదులను
విమల చింతామణి ◆ వేదికాస్థలుల
రమణీయమగు సిద్ధ ◆ రసకూపములను
విలసిల్లి నిజశృంగ ◆ వీక్షణమాత్ర
నలఘుపాపంబుల ◆ నన్నిటఁగడచి
క్రమ్మఱ మాతృగ ◆ ర్భములకు రాక

నెమ్మదినుండెడు ◆ నెలవుల నిలుపు
నతి మహిమోన్నతి ◆ నమరు శ్రీనగముఁ
గుతుకంబు మదిఁ గీలు ◆ కొన నెక్కియందుఁ
దపనప్రభాధగ ◆ [19]ద్ధగితవినూత్న
తపనీయకుంభ ప్ర ◆ తాన సంగతము
ధవళగోపుర చతు ◆ ర్ద్వారబంధురము
ప్రవిమలముక్తాత ◆ పత్రరాజితము
నరుణవితానర ◆ మ్యమును సమీర
తరళితవృషభ కే ◆ తనభాసురమును
మణిరంగవల్లికా ◆ మంట పోజ్జ్వలముఁ
బ్రణుతనానాధూప ◆ పటలవాసితముఁ
గాంతాసమర్పిత ◆ కర్పూరశకల
కాంతి నీరాజన ◆ కాంతిశోభితముఁ
బటహభేరీశంఖ ◆ పణవమృదంగ
పటుఘంటికాముఖ్య •◆బహువాద్యరవము
నైన [20]శ్రీమహమల్లి ◆ కార్జున నగర
భూనుతప్రాసాద ◆ మునకు సద్భక్తి
దీపింప నరిగి త ◆ ద్దివ్యలింగముల
నేపార దర్శించి ◆ యిలఁజూఁగి మ్రొక్కి
పదివేలభంగులఁ ◆ బ్రణుతించి యచటు
కదలి ప్రసిద్ధలిం ◆ గ స్థానములకుఁ
జనుచుఁదన్మహిమ లా ◆ శ్చర్యంబుఁ బెనుప
గనుఁగొంచుఁ బ్రియమొందఁ ◆ గా వచ్చివచ్చి
పాపవినాశన ◆ ప్రఖ్యాతిఁ దనరు
నాపుణ్యతీర్థంబు ◆ లాడుచు నందు
గుహనివాసంబున ◆ గోరక్షకుండు
మహిత యోగానంద ◆ మగ్నుఁడై యుండె

అల్లమప్రభునిరాక.



నావేళఁ బ్రభురాయుఁ ◆ డను మహాత్ముండు
ఈ వసుంధర నెవ్వ ◆ రెవ్వార లెట్టి
యాచార మొనరింతు ◆ రట్టివారలకు
నాచరిత్రకుఁ దగు ◆ నటువంటి సుప్ర

సన్నతఁ గృపఁజేసి ◆ చరియింతు ననుచు
సన్నుతస్థావర ◆ జంగమంబులకు
నురుబుద్ధి నుపకార ◆ మొనరించుకొఱకుఁ
గరమొప్ప కల్యాణ ◆ కటకంబు వెడలి
వచ్చె నా గురుగు హే ◆ శ్వర లింగలీల
నచ్చెరువందంగ ◆ నాత్రోవఁ గలుగు
ధరణీధరేంద్రముల్ ◆ తద్వీక్షణములఁ
బరుసంపు గిరులన ◆ భాసిల్లుచుండెఁ
గలతరుల్ దివిజ వృ ◆ క్షములన వెలసెఁ
లలితవల్లులు గల్ప ◆ లత లనవెలసెఁ
గొమరుమించిన కొలం ◆ కుల సలిలంబు
లమృతోపమానంబు ◆ లై విలసిల్లె
నిట్టి చందంబున ◆ నెలమిఁదా నడచి
మెట్టిన మార్గంపు ◆ మేదినియెల్లఁ
జిరపావనంబుగాఁ ◆ జేయుచుఁ జారు
చరితులై యుత్తరా ◆ శాశ్రితులైన
పరమపుణ్యులఁ జూతు ◆ భక్తిమై వార
లిరవొంద వేఁడిన ◆ నేమైన నిత్తు
నని సంతసిల్లుచు ◆ నల్లమ ప్రభువు
ఘనకృపాంభోరాశి ◆ గతిఁజను దేర
నామహాత్ముని చర ◆ ణాంబుజ స్పర్శ
సామర్థ్య సంపద ◆ జనఁగ [21]నెట్టెదురఁ
గ్రాలు నదీనద ◆ ప్రతతి పుణ్యంబు
లైలోక [22]పూజక ◆ ర్హంబులై వెలసెఁ
జెలఁగుచులీలని ◆ ల్చినఠావులెల్లఁ
జెలువొంద నిర్మల ◆ క్షేత్రంబు లయ్యె
నటఁజని ముందట ◆ నల్లమ ప్రభువు
దటముల దివ్యౌష ◆ ధంబులు గనులు
నిధినిధానంబులు ◆ నిర్మలంబైన
...... ....... ...... ...... ....... ...... .......
[23]సురల పాదపములు ◆ జూడఁ జిత్రంబు

లగుబిలప్రతతులు ◆ నంజనంబులును
దగు సిద్ధరసములుఁ ◆ దలఁపు రత్నములు
నలజాతివైరంబు ◆ లన్నియు విడిచి
కలిసి చరించెడి ◆ ఖగమృగంబులును
జన నిక్కి చూచిన ◆ సత్యలోకమున
కను వొంద నెగయించు ◆ నచలశృంగములుఁ
బరుసవేదులనఁగఁ ◆ బ్రఖ్యాతమైన
పరవస్తువుల నందు ◆ వరుసన నెదుట
వెదకుచు లెక్కింప ◆ వెగ్గలంబైన
విదిత సాధకులకు ◆ విస్మయం బొదవ
నడపాడుతీఁగెలు ◆ నవ్వెడు తరులు
నుడివెడి శిలలును ◆ నూతన రుచుల
దీపించు పొదలును ◆ దివ్య తేజముల
నేపారవెలుఁగు మ ◆ హీరుహంబులును
ద్రావినమాత్ర నం ◆ తఃకరణములఁ
బావనంబుగఁజేయఁ ◆ బరగు మడుఁగులుఁ
దఱిఁయజొచ్చిన రసా ◆ తలముల గొందు
లెఱిఁగించు బిరుదున ◆ నెసఁగు బిలములుఁ
దడయక సాధక ◆ తతి దమ్ముఁ జుట్టి
యడిగిన వస్తువు ◆ లవి యెవ్వియయినఁ
ద్రవ్వితండములుగాఁ ◆ దడయక యిచ్చు
నవ్వసుధాధరో ◆ దారకూటములుఁ
గలిగి త్రిలోక వి ◆ ఖ్యాతమై మోక్ష
ఫలదమై మెఱయు శ్రీ ◆ పర్వతాగ్రంబుఁ
గనుఁగొని యామీఁదఁ ◆ గామితార్థములు
తనుఁజెందు ననుచు ను ◆ ద్దామ విముక్తి
గొనసాగ నున్నయా ◆ గోరక్షనాథుఁ
డనియెడి యట్టి స ◆ మర్ధసాధకుని
[24]నెలవునుగనిపట్టి ◆ నిర్మలమూర్తి
నలర వినోదార్థ ◆ మై యీశ్వరుండు
[25]రోగార్తలకుఁ గుష్టు ◆ రోగంబుమాన్ప
నేఁగుదెంచినలీల ◆ నెసఁగు జీవంబు

విరిసిన బొందికి ◆ వెలయుసంజీవ
కరణి యే తెంచిన ◆ కరణి మూకునకు
వరవాగ్విలాసంబు ◆ వచ్చినయట్లు
కరుణ దీపింపఁ జ ◆ క్కన చనుదేర
నా మహాత్ముని చర ◆ ణాంబుజంబులకుఁ
దామ్రొక్క నొల్లక ◆ తద్దయు బిగిసి
కడు బింకమును నహం ◆ కారంబు నాత్మ
[26]సడలఁగాఁ జరణ హ ◆ స్తంబులు మొగిచి
గురుతరాసనమునఁ ◆ గూర్చుండ నునిచి
పరిపాటి నొయ్యన ◆ భావించి ప్రభున
కిరవొంద మరి యతం ◆ డిలఁ జాఁగి మ్రొక్కి
పరమసమ్మదమునఁ ◆ బలికె నెందుండి
యిటకు విచ్చేసితి ◆ రేమి కారణము
పటుగతి ననుఁబంపు ◆ పని తెరంగేమి
యల మీర లేతెంచు ◆ టతులితభాగ్య
ఫలసిద్ధిమూలంబు ◆ పరికింప మాకు
నని సముచితభాష ◆ లాడు గోరక్షు
వినతోక్తు లాలించి ◆ విని ప్రభు వనియె
జడియ కిచ్చట మను ◆ జశ్రేణి మనసుఁ
గడఁజేర్ప వలసియుఁ ◆ గాయంబు వలసి
యడియాస నుడుకుచు ◆ ననిశంబు దుఃఖ
పడువారి కళవళ ◆ పాటు మాన్పఁగను
గ్రచ్చఱ బలువైన ◆ కడనుండి కదలి
వచ్చినారము గదా ◆ వారక మేము
నావుడు గోరక్ష ◆ నాథుఁ డవ్విధము
భావింపఁ గొంత సే ◆ పరుగ లౌకికపుఁ
బలుకులు నుచితంబు ◆ పచరింప నితఁడు
పలికెడు పరమార్థ ◆ భావంబు దోఁప
నిదిగాక మున్ను న ◆ న్నెఱుఁగ కుండినను
మొదలఁ జూచిన వాఁడు ◆ పోలెఁ బేర్కొనెడి
నియ్యన మునిచంద్రుఁ ◆ డిచ్చఁ జింతింప
నయ్యాదినాథుఁ డై ◆ క్యంబు గావలయు

నని విచారించి యి ◆ ట్లను మహాపురుష

గోరక్షప్రభువుల సంవాదము.



నిను నిక్కముగ నిదా ◆ నించి యెందైన
నంతస్త మెఱుఁగ ని ◆ న్నరయ నాతరమె
వింత నీజాడ యె ◆ వ్విధమున నింక
నెఱిఁగెద మనఁబోల ◆ దేమి నీచొప్పు
నెఱయ నా యెఱుకకు ◆ నిగుడదు చనవు
నీవె యెఱుంగుదు ◆ నీయున్న నిజము
నావుడు గోరక్షు ◆ నకుఁ బ్రభు వనియె
మదిఁ దమ్మెఱుంగని ◆ మందబుద్ధులకు
నెదిరి యంతస్తంబు ◆ నెఱుఁగుట దలఁపఁ
జీఁకు దర్పణము వీ ◆ క్షించినయట్లు
నాకలరూపు మి ◆ న్నక నిదానించి
తేటగా నెవ్వరు ◆ తెలియలే రనిన
మాటనేర్పులకు నీ ◆ మది సాధ్య మగునె
యనిన గోరక్షుఁడా ◆ యల్లమ ప్రభువుఁ
గనుఁగొని మాయయౌ ◆ కరణిఁదాఁదానఁ
దగుదేహ మగు మరిఁ ◆ దనకు నాటిదిన
మగునట్టి యెఱుక చే ◆ మాయ ధర్మమునఁ
బరగు కాపాలిక ◆ పథమునఁ దన్ను
నెఱుఁగు నుపాయ మ ◆ దేమి చిత్రంబు
పనిలేని మాటలన్ ◆ బలిమినే మధికు
లనిపించుకొనువార ◆ మా ప్రభురాయ
యనిన నల్లమప్రభు ◆ వనియె గోరక్ష
విను నెమ్ములును దోలు ◆ విణ్మూత్రములును
నెత్తురు ముఱికియు ◆ నిండారురోఁత
తిత్తియై కుళ్లిన ◆ తెక్కలి డొక్క
తాననియెడు మూర్ఖు ◆ తన్నట్టు లెఱుఁగఁ
గానెట్లు చెల్లునె ◆ కాసాల సంప్ర
దాయంబునను నుండఁ ◆ దగునె యీకొఱఁత
యాయత సంప్రదా ◆ య స్థితి నింక
నెఱుఁగఁగఁ జూఱఁబో ◆ యినది నావుడును
మఱియు గోరక్షకుఁ డ ◆ మ్మహితాత్ము కనియెఁ

జేయనేరని జడ ◆ చిత్తుల కరయ
కాయంబు రోఁతౌట ◆ గలదేని నిజము
[27]చాయనేర్చిన రీతి ◆ సరసమై తనర
నే యుపాయము లేక ◆ యీ శరీరంబు
నిత్యమై మాయ పో ◆ ణిమి నిచ్చపఱచు
మృత్యుదేవత కడి ◆ మిని వెక్కిరించుఁ
దనువుసిద్ధము ప్రసి ◆ ద్ధము సుమ్మి యనిన
వినిప్రభు వతనిఁదా ◆ వీక్షించి పలికె
నోవెఱ్ఱి మృత్యువై ◆ యున్న యామాయ
యావలఁ దగ బలు ◆ వై యుండఁజేసి
చావఁబొమ్మని ప్రయో ◆ జనముకు రాని
యీ వట్టి యాస నీ ◆ వేల పొందెదవు
తెలిసి కన్గొనిన నీ ◆ దేహంబె సుమ్ము
నిలయ మంతకు నాకు ◆ నివ్విధి నమ్మి
పలికినయట్టి యా ◆ ప్రళయంబు నిన్ను
నలఁపకవిడుచునే ◆ యనిన గోరక్షుఁ
డలమహేశ్వరునితో ◆ ననియె నిట్లనుచు
....... ....... ....... ....... ....... ....... ......
వేవేగఁ దెమ్మింక ◆ వెసఁ బట్టుఁబట్టు
...... ....... ....... ...... ...... ....... .......
యది తీవ్రఖడ్గమై ◆ నట్టి సత్వమున
వదలక నామేను ◆ వడివేసి చూడు
ముఱకనా మైరోమ ◆ మొకటి దైవ్వినను
నెఱిదప్పి విఱిగిన ◆ నేను సిద్ధుఁడనె
యిదిచూచుకొను దృష్టి ◆ నింక నీపాద
మదియె ది క్కనుటయు ◆ నల్లమప్రభువు
చనునె ని న్నూరక ◆ చంపిపరీక్ష
గొనుట మే మెఱుఁగని ◆ క్రూరకర్మంబు
మఱి గుహేశ్వర లింగ ◆ మత మిది గాదు
నెఱయఁ దుత్తునుకలై ◆ నీమేను నేఁడు
చెడిపోవఁగా దేహ ◆ సిద్ధి ముందటను
బడయు వారెవ్వ ర ◆ ల్పజ్ఞుల కేము

వెఱతుము గోరక్ష ◆ విను మన్న నతఁడు
తెఱఁగొప్పఁ[28]గాఁ బ్రభు ◆ దేవు కిట్లనియె
నతితీవ్రశస్త్రాభి ◆ హతిఁ జావవచ్చు
గతియయ్యెనేని స ◆ ద్గతి యంట దరయ
వండనోర్చునే మున్ను ◆ వాయింపనోర్వ
కుండెడుకడప [29]యీ ◆ కొంకేల నీవు
నిరుపమశక్తిమై ◆ నిర్భరభావ
భరమున ననుమాన ◆ పడక నాతనువుఁ
[30]గొట్టి చూడు మటన్న ◆ గురుగు హేశ్వరుఁడు
పుట్టింపనొంప నే ◆ ర్పులు గలవారు
కడఁగి చంపిన నేమి ◆ కష్టంబు దీనిఁ
గడవనేటికి మాకుఁ ◆ గాదన వీని
కుతుకంబు చెల్లించి ◆ కొట్టెద నతఁడు
మృతుఁడై న నింతకు ◆ మిక్కిలి బలిమి
గలుగు గోరక్షు ని ◆ క్కడ సృజియింతు
నలవుమై నని మది ◆ నాయత్తమొదవ
నడిదంబు దృఢముష్టి ◆ నమరించి కదిసి
వడిఝళిపించి స ◆ త్వంబునం బూని
పెడచేతి పెట్టుగా ◆ బిట్టు వ్రేయుటయు
ఖణిఖణింగున మ్రోఁత ◆ గడలుకొనంగఁ
దనవ్రేటు చేతికెం ◆ తయు బిరుసైన
ననయంబు వెఱగందె ◆ నల్లమప్రభువు
కొండలు గంపించెఁ ◆ గుంభిని వణఁకె
నొండొంట వెస డొల్లె ◆ నురుగండశిలలు
నొడలగోరక్షున ◆ కొకరోమమైనఁ
జెడఁదెగ దేటి వి ◆ చిత్రమోకాని
యప్పుడల్లమప్రభు ◆ వనియె గోరక్ష
కప్పిన మోహంబు ◆ కతమున మాయఁ
గడుఁజూడ వైన నీ ◆ కాయసంసిద్ధి
వడసితి వీవుని ◆ ప్పటి యనువునను
పృథువజ్రశారీర ◆ పిండంబు బలిసి
ప్రథితమౌటకు నిది ◆ పనియయ్యె నేని

లేదు సందేహంబు ◆ నిలిపెదో ప్రళయ
మీ దేహసిద్ధి దా ◆ నేలకాలువనె
యని చేతికై దువ ◆ యవనిపై వైచి
యనియె వెండియుఁ బ్రభు ◆ వాతని తోడఁ
గడఁగి వేసిన సిద్ధి ◆ గలవాని మేన
నడరునె ఖణిలను ◆ నలరెడు మ్రోఁత
యరసిచూచిన సిద్ధి ◆ యైనదిగాదు
తిరముగా నమ్మకీ ◆ తెఱఁ గయ్యెనేని
కలుగుఁబో ప్రళయ మ ◆ క్కట సిద్ధదేహి
కలవడ సిద్ధత్వ ◆ మల్పమే యనిన
గోరక్షుఁ డిట్లనెఁ ◆ గులిశపాతమున
దారుణతర ఖడ్గ ◆ ధారాభిహతిని
శీతోష్ణములఁ జావఁ ◆ జెడక వజ్రంబు
భౌతిఁ [31]గాఠిన్యంబు ◆ బలసినయట్టి
కాయంబుగా దేని ◆ కడపటదీని
కే యుపాయము గుఱు ◆ తెద్ది సిద్ధింప
నట్టిమాటలఁ బని ◆ వలదు దృష్టంబు
నెట్టనఁజూపుమా ◆ నీనిజంబనఁగ
నాయల్లమప్రభు ◆ వనియె నట్లైన
నీయుగ్రకరవాల ◆ మెడపకపూని
నీచేతి లావెల్ల ◆ నెరయ నా తనువుఁ
బూఁచివేయుము ఖడ్గ ◆ మున నన్నుఁదాఁక
వచ్చెడుమాటలు ◆ వర్ణింపనేల
చెచ్చెర నిజము వీ ◆ క్షింపు గోరక్ష
యనవుఁడు దేహసి ◆ ద్ధైన [32]నీతనువు
ఘనశక్తియును సువి ◆ ఖ్యాత సిద్ధత్వ
మును గనుఁగొందమి ◆ ప్పుడు సాధనముకు
నిన తేజ పెనుఁబండు ◆ విదియె కొమ్మనుచు
నడిదంబుఁబూని స ◆ వ్యాపసవ్యముల
వడివ్రేయమూఁడుభా ◆ వంబు లణంగి
ప్రవిమలంబుగ బట్ట ◆ బయలైన తేజ
మవిరలంబుగఁ బర్వ ◆ నా ప్రభుమూర్తి

నప్పుడు గోరక్షుఁ ◆ డాపెంపుఁజూచి
యిప్పుడు నావ్రేట్ల ◆ నితని దేహంబు
చప్పుడుగాదు శ ◆ స్త్రంబును నొప్పుఁ
దప్ప దంగములు సి ◆ ద్ధములుగా నెగసి
తూలవు వాడికై ◆ దూఁపదా బయలు
తేలెడు వాలుని ◆ దేమి చోద్యంబు
ఇతఁడు శ్రీగురునాథుఁ ◆ డిది నిత్యమనుచు
మతిఁ దలపోసి య ◆ మ్మహితాత్ముకనియె
వీఁకమై నను నీవు ◆ వ్రేయ నా మేను
దాఁకి ఖంగని నినా ◆ దంబు పెల్లెగసె
మిట్టించి యెగసె న ◆ మ్మెయిని [33]ఖడ్గంబు
నెట్టన దెసఁబూన్చి ◆ నే నిన్నువ్రేయ
బయలు వ్రేసిన లీలఁ ◆ బట్టింతలేక
నయమున మత్కృపా ◆ ణము జాఱిపోయె
నెఱిఁగింపవలయు మా ◆ కిట్టి నీగుణము
తెఱఁగు మహత్వంబు ◆ తెల్లంబుగాను
ననిన నల్లమప్రభు ◆ వాతనితోడ
ననియె గోరక్ష కా ◆ యంబు తానెంత
బలిసిన నంతియె ◆ బలియు నామాయ
బలియంగ మాయయు ◆ బలియును మూఁడు
బలిసిన సిద్ధిచే ◆ పడదట్లుగానఁ
గలిసి యిన్నియు సిద్ధిఁ ◆ గట్టిన యట్టి
మాయఁదలంగించి ◆ మన నేర్చువాఁడు
నేయెడ సిద్ధుల ◆ కెల్లను రాజు
నావుడు నయ్యాది ◆ నాథుఁడు దాన
యీవేష మలవడ ◆ నిటు వినోదమునఁ
దనువెదకెడి వారి ◆ తలఁపుల సిద్ధి
యొనరింప నుర్విపై ◆ నుదయించినాఁడు
నేఁడు నా కోర్కులు ◆ నెరయఫలంచెఁ
బోఁడిమి నని యుల్ల ◆ మున సమ్మదంబు
పొనర నా ప్రభులింగ ◆ మునకు గోరక్షుఁ
డనె దుర్మదాంధుండ ◆ నై యింతదాఁక

నూరక బిగిసియు ◆ నుంటి నావలని
నేరమి లోఁగొని ◆ నిండారు కరుణ
నవలోకనము సేయు ◆ మనుచు నందంద
యవనిఁ జాఁగిలి మ్రొక్కి ◆ హస్తముల్ మొగిచి
భయభక్తులొదవఁ ద ◆ త్పాదపద్మముల
పయిఁ దనఫాలంబుఁ ◆ బలుమాఱు గదియ
మ్రొక్కుచునుండె న ◆ ప్పుడు గుహేశ్వరుఁడు
గ్రక్కున నెరయఁ గ్రాఁ ◆ గిన యట్టి పదను
గని లోహ మదికిన ◆ కరణి గోరక్షు
ఘనభావపరిపాక ◆ గతియును మంచి
తనమును దెలిసి యీ ◆ తని కుపదేశ
మొనరింతు నింకని ◆ యుల్లంబులోన
నెసఁగిన కృపఁబ్రియం ◆ బెసఁగంగ నతని
నొసలంటి మన్నన ◆ నూల్కొన నెత్త
నా గుహేశ్వరు కరు ◆ ణావలోకనము
పైఁగీలుకొన నంతఁ ◆ బాసె గోరక్షు
మదమత్సరములు సం ◆ భాషణం జేసి
మది మఱపెల్ల గ్ర ◆ మ్మఱ మ్రగ్గిపోయెఁ
గరమునఁ బట్టిన ◆ కాయంబునందుఁ
దిరమైన మాయయుఁ ◆ దిగ్గనఁ దొలఁగె
మరి నిర్మలంబైన ◆ మనసునుం దనువు
దొరికె నాతనికి సం ◆ తోషంబు నెరయఁ
దోరంపుఁ బులకలు ◆ తోరణశ్రేణు
'లై రమ్యముగఁ దన ◆ యంతరంగమునఁ
గింకరత్వముఁ బూని ◆ గిరికొన్న భక్తి
నంకించి యా కరు ◆ ణామృత జలధి
నోమహామహిమ స ◆ ర్వోన్నత చరిత
యేమార్గమున నిల్తు ◆ నింక నే ననిన
నాలించి వినుమని ◆ యాతనితోడ
లీలనప్పుడు ప్రభు ◆ లింగ మిట్లనియె
నీదేహకాఠిన్య ◆ మీదేహసిద్ధి
భేదమింతియె కాని ◆ పృథునిత్యముక్తి
సిద్ధియీగతిఁ గాదు ◆ చెనటి దురాశ

పద్ధతిఁ--బోక స ◆ ద్భక్తి గుహేశ
పాదపద్మములకుఁ ◆ బ్రణతుండ వైన
నాదిశిష్యుండ వ ◆ త్యంతము మాకు
ననిన గోరక్షుఁ డి ◆ ట్లనియె గుహేశుఁ
డనునతం డెందుండు ◆ నా నెల వేది
యాతని సేవించు ◆ టది యెట్లు నమ్మి
యా తెఱం గెఱిఁగింపు ◆ మనుటయుఁ బ్రభువు
పలికె నావస్తువు ◆ పనిలేదు నీకు
నలగుహేశ్వరదేవుఁ ◆ డన నేనె సుమ్ము
గుహనాఁగ నాత్మ త ◆ ద్గుహతత్వ మెసఁగ
మహిమనొందుటఁ జేసి ◆ మాకుగుహేశుఁ
డనునామమయ్యె ని ◆ య్యభిధాన మేను
మునుకొని లోకుల ◆ మొఱఁగెడుకొఱకు
వెలయ నటింపుదు ◆ విహితమైనట్టి
చెలువున ననిన నా ◆ సిద్ధ పుంగవుఁడు
పలికెను నల్లమ ◆ ప్రభుతోడ మఱియుఁ
గలదె గుహేశ యీ ◆ గతి జూణతనము
పలుకులు విడువుమీ ◆ పరికింప నీవు
నల గుహేశ్వరమూర్తి ◆ వైన నీచేత
నిది లక్ష్యమై లింగ ◆ మేటి కున్న దియొ
నెదురు లేరైరె మీ ◆ కిది గారణముగ
గిరిగొన్నకర్మ భక్తి ◆ జ్ఞానమూర్తి
నెఱిఁగింపు మనుటయు ◆ నిట్లనుఁ బ్రభువు
తలకొని నాదువి ◆ ధంబుర్విఁ జెప్పఁ
గలవారినెల్లఁ జ ◆ క్కన లింగనిష్ఠఁ
దగిలించి ముక్తికాం ◆ తా వివాహంబు
తగ నొనరింతు ని ◆ తాంత సత్కరుణ
నీవెరవు నటింప ◆ ని ట్లగ్గలింప
భావభేదంబునఁ ◆ బరగు సంగంబు
గల దందు రేపట్టు ◆ గల శివభక్తి
నిలిపెడు భక్తుని[34] ◆ నిజవందనములఁ
బలికిన కీర్తన ◆ పదికోట్ల వచన

మతినిల్పి తత్‌ క్షణ ◆ మాత్రన తాను
దుమ్మెద యైనపొం ◆ దునను గోరక్షుఁ
డమ్మేనఁ బృథ్వ్యప్పు ◆ లాకార తనువు
నిమిషమాత్రంబున ◆ నిజగురుభక్తిఁ
గొమరుగాఁ గావించు ◆ కొనియె నాప్రభువు
దనలీల వెలయ నా ◆ తనిఁ గూర్చుకొన్న
వెనుకఁదా నటచనె ◆ విషయమన్ వ్యాధిఁ
బరితప్త [35]సాధక ◆ ప్రకరంబుమీఁద
గురుకృపామృతదృష్టిఁ ◆ గురియుచునుండె
నటఁ బెంపుమీఱ నా ◆ గార్జున నాథుఁ
డిట నటననక మ ◆ హీమండలంబుఁ
గలయఁ జరించి యొ ◆ క్కనిఁ దనపేర
వెలయ సిద్ధునిఁ జేసి ◆ వివిధౌషధముల
మణిమంత్రయోగాది ◆ మర్మకర్మలను
నణిమాది సిద్ధుల ◆ నాత్మప్రణీత
రసవాదసార శా ◆ స్త్రంబులఁ దెలిపి
మసలక దేహ మే ◆ మరక నీ వింకఁ
దిరుగఁ బొమ్మని యంధ్ర ◆ దేశంబు కతనిఁ
బరగ వీడ్కొలిపి దాఁ ◆ బ్రాలేయ గిరికిఁ
జని మీననాథుని ◆ చరణాబ్జములకు
వినతుఁడై నియతి సే ◆ వింపుచునుండె

నాగార్జునునిశిష్యుఁడు - రసవాదము.



నాసిద్ధ నాగార్జు ◆ నాఖ్యుండు గణఁక
భాసిల్లు రసవాద ◆ పాటవం బమరఁ
బసిఁడిగావించున ◆ ప్పరమ విఖ్యాతి
నెసఁగె జగంబెల్ల ◆ [36]నిదియరుదనఁగ
ననువు విచారించి ◆ యా కృత్యమునకు
ననువైన కందువ ◆ లరయుచు వచ్చి
శ్రీ మల్లి కార్జున ◆ శివలింగ దివ్య
ధామమై పురుషార్థ ◆ దాయకంబైన
శ్రీనగంబున కేఁగి ◆ శిష్యులు గొలువ
నా నగేంద్రముఁ గల ◆ యంగ వీక్షించి

.

మును గుశధ్వజ నామ ◆ మునఁ బొల్చు నతని
తనయ శంభుఁడుమెచ్చఁ ◆ దపమొనరించి
తనపేరు తత్పర్వ ◆ త స్థలిఁగీర్తు
లెనయఁ గల్పించిన ◆ యేలేశ్వరంబుఁ
గనిడాయఁ జని కౌతు ◆ కం బార నచటఁ
బనస చంపక పారి ◆ భద్రరసాల
సాలతిందుక గంధ ◆ సాల హింతాల
తాల ఖర్జూర కే ◆ తక పిచుమంద
మందార సంవీర ◆ మధురమాకంద
కందరాళాగరు ◆ కటకపున్నాగ
నాగ కేసరలుంగ ◆ నారంగపూఁగ
పూగశోభితములై ◆ భూరికల్యాణ
మూలంబులై ముని ◆ ముఖ్యులకెల్ల
కాలంబు వసియింపఁ ◆ గా నిరవైన
కూలంబులను జేరు ◆ కుసుమపరాగ
నాలంబులైమించు ◆ వసజవనాంత
రాళంబులందువా ◆ రక మ్రోయు మధుప
జాలంబులును సుధా ◆ సదృశ తోయముల
నోలంబులందుఁ బెం ◆ పొదవు మృణాళ
నాళంబు లింపార ◆ నమలి లీలాను
లోలంబులై ప్రియు ◆ లును దాముఁ గలసి
మేలంబు లాడుచు ◆ మెఱయు హంసములు
గాలంబులకునైనఁ ◆ గలగక క్రొవ్వి
దూలంబులన నతి ◆ స్థూలంబు లగుచు
వేలంబు విడిసిన ◆ విధమున నెరసి
వాలంబు లల్లార్చి ◆ వారివిహార
శీలంబులై విర ◆ సించి యొండొంటి
నాలంబులై డాయు ◆ నప్చరంబులును
గలిగి లోకులపాత ◆ కంబులఁ దన్ను
దలఁచినమాత్రాన ◆ దలఁగింసఁజాలి
వెలసినదౌ కృష్ణ ◆వేణి దర్శించి
పొలుసారు తత్తర ◆ ముల నుతికెక్కు
నవమహాదుర్గాల ◆ నవగుండములను

నవభై రవులనవ ◆ నందులఁజూచి
యవిరళానందుఁడై ◆ యా పుణ్యతటిని
నవగాహ మొనరించి ◆ హరుని భజించి
వావిరిఁ దీర్థోప ◆ వాసంబు జరిపి
వేవేగనాచార ◆ విధులొప్పఁ దీర్చి
భిక్షాశనంబును ◆ బ్రీతిగాఁ గొనియు
నీక్షించి తనవారి ◆ నెమ్మి నిట్లనియె
నాకు నాగార్జున ◆ నాథగురుండు
తేకువమై నుప ◆ దేశించినట్టి
యసమాన వాదవి ◆ ద్యావిశేషమునఁ
బసిఁడిగావింతు నీ ◆ పర్వతంబెల్ల
సిద్ధులలోనఁ బ్ర ◆ సిద్ధుఁ డెంతయును
సిద్ధనాగార్జున ◆ శిష్యుఁ డనంగ
నిది నాతలంపు మీ ◆ రెఱిఁగింపు డింకఁ
బదిలంబుగాఁగ మీ ◆ భావంబు లనిన
వారలందఱు గురు ◆ స్వామి తలంపు
భూరికీర్తికిఁ బుణ్య ◆ మునకునుఁ బొత్తు
....... ....... ....... ....... ........ ....... ...... .......
తగ వయ స్తంభవా ◆ దము దుర్లభమను
పలుకు లన్నియుఁ బూర్వ ◆ పక్షంబుగాఁగఁ
దలకొని సేయుఁ డు ◆ త్సాహ మొప్పార
నీ కార్య మనుటయు ◆ నెసఁగు మోదమున
నాకందువకుఁజేరు ◆ వగు పర్వతమున
మునుమైన తలిరాకుఁ ◆ బొదల జొంపముల
ననల[37] మొగ్గలఁ బ్రసూ ◆ నముల మంజరులఁ
బూపలఁ బిందెలఁ ◆ బులుసు దోరలను
దీపారుఫలముల ◆ దీపించు తరులఁ
బరివృతంబై మాటు ◆ వడి సెలయేటి
తరిఁగరం బొప్పు నా ◆ తతగుహాంతరముఁ
జొచ్చి వారలు మున్ను ◆ శోధించి చూచి
వచ్చినఁ బ్రియమార ◆ వసియించి యందు
రసములైదును నుప ◆ రసము లెన్మిదియుఁ

బసరులు మందులుఁ ◆ బాషాణములును
గలువంబులును జాలఁ ◆ గా సమకూర్చి
వలయు మంత్రౌషధా ◆ వళులకు బలియుఁ
జేసి మనోజయ ◆ సిద్ధిఁ బెంపొంది
యాసీనుఁడై లులా ◆ యాజినరచిత
గురుభ స్త్రికల నిన్ప ◆ గ్రోవులు సలిపి
సరములు బొందుగా ◆ సంధించి భక్తి
గురునాథుఁ దలఁచి త ◆ ద్గురువు భజించి
వరభైషజాది దై ◆ వములకు మ్రొక్కి
నేర్చిన మందు ల ◆ న్నియు వైచి యగ్నిఁ
గూర్చిపుటంబు గ్ర ◆ క్కునఁ బెట్ట నపుడు
వెసనూఁదువారును ◆ విసువక రసము
పసరులు గలిపి పా ◆ ల్పడ నూరువార
లనువొందఁగా మూస ◆ లమరించువారు
మొనసి క్రమ్మఱఁ బుటం ◆ బులు బెట్టువారు
కలయంగ నూఁదిన ◆ కనకంబుఁ దివిసి
యెలమిమైఁ బెనుఁబ్రోవు ◆ లీడ్చెడువారు
నై సంభ్రమింపుచు ◆ నయ్యయి పనుల
నాసన్ను లై శిష్యు ◆ లందఱు మెలఁగఁ
బొలివోక తాఁజేయఁ ◆ బూనినకార్య
మలవడ ఫలసిద్ధి ◆ నందిన హృదయ
నలినంబు వికసింప ◆ నాగార్జునుండు
కలయంగ వారలఁ ◆ గనుఁగొని పలికెఁ
దమ ప్రాణములకంటె ◆ ధర నెల్లవారు
నమరఁ బాటింపుదు ◆ రటుగాన దీని
కతమున నెవ్వరే ◆ కతమున దుష్ట
మతిఁ గీడొనర్తురో ◆ ...... ....... ......
........ ........ ...... ....... మహనీయమూర్తి
ఘనుఁడైన సిద్ధుఁ డొ ◆ క్కఁడు నానగంబు
నందున్నవాఁ డమ్మ ◆ హామహుకరుణఁ
జెందిన పగఱ ని ◆ ర్జింతుఁ బొమ్మనుచుఁ
గతిపయపరిజన ◆ కలితుఁడై వచ్చి
యతిభ క్తిమైఁ దన ◆ కవనతుఁడై న

నాతనితోడ నా ◆ గార్జున శిష్యుఁ
డాతత మధుర వా ◆ క్యముల నిట్లనియెఁ
బటుదంత హయవీర ◆ భటతతి నేలి
నటువంటి మహిమ నీ ◆ యందుఁ దోఁచెడిని
యెటనుండి వచ్చితి ◆ వెందుల కేఁగె
దిటు వివర్ణ తఁ బొంద ◆ నేల నీ కనిన
నా మహీపాలుఁ డి ◆ ట్లనె సిద్ధవర్య
నామీఁద నహితమా ◆ నవనాథుఁ డొకఁడు
చెలరేఁగి పూని వ ◆ చ్చినవాని తోడఁ
దలపడి యుద్ధతిఁ ◆ దక్కిమై నొక్కి
మదనారణముల సా ◆ మ్రాణి తేజులను
దుదిలేని ధనములఁ ◆ దొడవుల డించి
చెదరిన గతి గట్టు ◆ చెట్టునుం జేరి
యదవద నొంది యే ◆ యాసయు లేక
మది [38]గొల్ది దిరుగుచు ◆ మహినెల్లవారుఁ
బదివేల ముఖములఁ ◆ బ్రస్తుతి సేయ
నీవెంపు విని వేడ్క ◆ నీపాదసేవ
తేపగా శోకాబ్ధి ◆ తీరంబు చేరఁ
గాంతు నేనని వచ్చి ◆ కనుఁగొంటి నిన్ను
నింతలో నా పాప ◆ మెల్లను బాసె
దయమీఱ ననుఁ జూచి ◆ [39]దండితారాతిఁ
జేయు మద్రాజ్యంబు ◆ సమ్మతి నొసఁగు
మనుచుఁ జేతులు మోడ్చి ◆ యలికంబుఁ జేర్చి
వినతుఁడై యున్న య ◆ వ్విభు నాదరించి
యా సిద్ధ పుంగవుం ◆ డనియె నో రాజ
నీ సంపదలు నీవు ◆ నీ మహీతలము
నీ వారణంబులు ◆ నీ వాహనములు
వేవేగ మరల ర ◆ ప్పించి నీ కొసఁగ
రాకేమి మదిలోన ◆ రాజుల నమ్మి
[40]పోకుంట మహిలోన ◆ బుద్ధి యూహింప
మును జామదగ్ని స ◆ న్ముని శేఖరుండు
ఘనపదార్థములు ది ◆ గ్గన సమకూర్చి

ప్రియము మీఱఁగ విందు ◆ పెట్టినఁ గుడిచి
నయమేది కృతవీర్య ◆ నరనాథతనయుఁ
డాముని యింటఁ బెం ◆ పారుచునున్న
కామధేనువు బల్మిఁ ◆ గైకొని యతని
తలఁద్రెంపఁడే మహీ ◆ ధవుల చిత్తంబు
తెలిసి యెవ్వరి నివ ◆ ర్తింపంగ వచ్చుఁ
బొలుచు చిత్తరు వు సొ ◆ మ్ములు నీళ్ల వ్రాలు
కలలోని వార్తలు ◆ గంధర్వ నగర
ములు జలదాకార ◆ ములు మాయలేళ్లు
నిల నెండమావు లె ◆ య్యెడ రాచమాట
లలర నన్యాయ ధ ◆ నార్జనంబునకుఁ
దొలఁగరు పాపపుఁ ◆ ద్రో వొకింతయును
నోడరు తెగి చంపి ◆ నొప్పించు చోట
నాడరు మున్ను దా ◆ మాడిన మాట
మానరు గొండెంపు ◆ మాటలు వినుట
కానరు మత్తులై ◆ కార్యనిర్ణయము
తలఁప రల్పాధిక ◆ తారతమ్యములు
మలఁపలే రింద్రియ ◆ మదసామజము ల
వెఱవరు నిందకు ◆ విడువరు చలము
మఱవ రెన్నఁడుఁ బర ◆ మర్మభేదముల
ననుపమఖడ్గ ధా ◆ రావలేహసము
మొనయు కాళవ్యాళ ◆ ముఖచుంబనంబు
పటుతర పంచాస్య ◆ పరిరంభణంబు
చటుల తారోపరి ◆ స్థలతపశ్చరణ
మేరీతిఁ జూచిన ◆ నెట్టివారలకు
భూరిప్రమాదంబు ◆ భూపాలుసేవ
యని వెండియు నతండు ◆ నను మహీపాల
విను మిట్టివని రాజ్య ◆ విధములు దెలియఁ
బలుకుటగాని నీ ◆ పై నవగుణము
గలదని యాడుట ◆ గాదు మా మాట
నెలమి మైకొనఁజేసె ◆ దేనియు వినుము
...... ...... ..... ....... ...... ........ ...... ........
మీననాథునకు సం ◆ ప్రీతిమై శిష్యుఁ

డైన నాగార్జునుఁ ◆ డను సద్గురుండు
నా మీఁదఁ గృపఁజేసి ◆ నాకు నాత్రేయ
నామం బొనర్చి నా ◆ నా యోగ మతము
లెఱిఁగించి మరి సిద్ధ ◆ హేమవాదంబు
[41]నెఱిఁగించి నాకది ◆ యిడెఁ జలం బూని
పసిఁడికై విరసించి ◆ బంధువులైన
నసువులు గొనఁ జూతు ◆ రన్యాయమునను
ధనలోభనిరతులై ◆ తఱినేఁచు దుష్ట
మనుజుల [42]నృపులను ◆ మరి యాడఁగాదు
బలిమియుఁ దేజంబుఁ ◆ బాడియు మిగులఁ
గలనృపుఁ డొక్కఁడు ◆ గావలెఁ గల్మి
ననుచు విచారించి ◆ నట్టి మా కడకుఁ
జన నరోత్తమ నీవె ◆ చనుదెంచి తింక
నెవ్వరి వెతకఁబో ◆ నేటికి నీకుఁ
ద్రవ్వితండంబుగా ◆ ధనము నే నిత్తుఁ
జాలువుగా వాజి ◆ సామజభటుల
నేలి మారక్షణ ◆ మేమరకుండు
మనుటయు వినతుఁడై ◆ యమ్మహీనాథుఁ
డనియె నాతనికి మ ◆ హాత్మ నాపుణ్య
ఫలమున నీపాద ◆ పద్మముల్ గంటిఁ
దలఁప నస్థిరమైన ◆ ధారుణీరాజ్య
మల్పసుఖాపేక్షినై ◆ యుండఁ జేసి
కల్పాంతమున నర ◆ కంబున నెరియఁ
జాల నీచే యోగ ◆ సంగతిఁ గనుట
మేలుకార్యం బిట ◆ మీఁద నాకనిన
నీ నృపాలుఁడు రాజ్య ◆ హీనుఁడై తాప
మూని యిట్లాడుచు ◆ నున్నాఁడు సొలసి
ఘనమైన యితని దుః ◆ ఖము మాన్పవలయు
నని విచారించి నా ◆ గార్జునుఁ డనియె
నీలాగు వెడ బుద్ధు ◆ లేల భూపాల
యేలింతు నీచేత ◆ నెలమిని నేల
న్యా శిష్యుఁడవు నీవు ◆ నా గార్జునుండు

వాసిగా నాపేర ◆ వరగిరిదుర్గ
మీ చేరువను రచి ◆ యించి నీవుండు
మాచరింపుము మదీ ◆ యాంగరక్షణము
వేసర కిత్తునే ◆ వేఁడిన ధనము
చే సాచినపుడు రా ◆ సిగ నమ్ము మనుచు
నతని మస్తకముపై ◆ హస్తంబు చాచి
మితిలేని ధనము న ◆ ర్మిలి నపు డిచ్చె
నచ్చినఁ గైకొని ◆ యిచ్చలో నలరి
నచ్చిన భక్తి న ◆ న్నాథ ముఖ్యునకు
నభివందనముచేసి ◆ యనఘ నీకరుణఁ
బ్రభు వన సకల సం ◆ పదలును గలిగె
నీ వానతిచ్చిన ◆ నేర్పునఁ బనులు
వే వేగఁ బోయి కా ◆ వించెద ననుచు
నా కృష్ణవేణి మ ◆ హానది దాఁటి
వీఁక నేలేశ్వర ◆ విభు నుత్తరమున
నాయతంబై మించు ◆ నశ్వమేధాద్రి
వాయవ్యమున నవ ◆ ద్వార కవాట
పరిఘ సమున్నత ◆ ప్రాకార యంత్ర[43]
....... ....... ...... ........ ....... ...... .......
....... ...... ......తోరణ ◆ ధ్వజరాజమార్గ
పటుతరంబైన స ◆ ద్భట ....... ...... .......
..... ....... ...... మద ◆ కుంజరంబులును,
భటకుల సామంత ◆ పరివారములును
....... ...... ...... ...... ...... ...... కీర్తిమించి
త్యాగ నాగార్జునుఁ ◆ డను నొప్పు ...
జననాధు పై దండు ◆ చన విచారించి
గురుతైన ...... ....... ...... ...... ....... ......
...... ....... ...... ...... ..... బటు భూధరంబు
బగల శేషాయహి ◆ ఫణి....... ....... ........
క్రమ్మఱదనసీమఁ ◆ గైకొని ప్రజల
....... ....... ........ ...... సద్భక్తి మొక్కి
యతని మన్నన బొంది ◆ యాత్మ .... ......

బోవుచుం బ్రజలును ◆ బొగడ భూ విభుఁడు
...... ....... ...... ...... సిద్ధి ◆ చేకూరె నాకు
దీననీక్రియ యను ◆ దినమును హేమ
....... ....... ...... గావింప ◆ హాటకాచలము
తనయట్టి గిరిపెర ◆ ధర ....... ....... .......
మహికెక్కవనుచు గ ◆ ర్వంబును .... ....
యాయిష్టజనముల ◆ యనుమతింగూడ
ననుపమ బలు ..... ....... ...... .....
దగఁ గ్రోవు ◆ లమరించి రసము
....... ....... ....... ....... ....... ....... ........
లంగు గీలించి ది ◆ వ్యౌషధ సమితి
గుహలోన వైచి గ్ర ◆ క్కున ననలంబు
బహుళంబుగా నిడి ◆ పటు బిలద్వార
మున రసంబులు దిరం ◆ బుగఁ బొందుపఱచి
ఘనరవంబున నూఁదఁ ◆ గాఁ జొచ్చిరపుడు
ఆరవంబులును గ ◆ హ్వరములఁ జెలఁగ
భూరి ప్రతిధ్వనం ◆ బుల నిన్మడించి
పెనుగాలి కడలెత్తి ◆ పెల్లుగా మ్రోయ
వనధిఘోషంబు కై ◆ వడి నెడ వణఁక
నట్టి యుత్పాతంబు ◆ లంబుజోదరుఁడు

విష్ణువు నాగార్జున శిష్యునిఁ జంపుట



గట్టిగా నెఱిఁగి యీ ◆ కార్య విఘ్నంబు
ఘటియింపకున్న లో ◆ క వ్యవహార
మెటువలెఁ జెల్లెడు ◆ నిలమీఁద ననుచు
నొక కపటోపాయ ◆ మూహీంచి నొసలఁ
బ్రకటమై కనుపట్టు ◆ పట్టెవర్ధనము
వేలిమిబొట్టును ◆ వ్రేళ్ల దర్భలును
జాల జన్నిదములుఁ ◆ జంక సంబెలయుఁ
జెవిదోరమును దుల ◆ శియు మంజరియును
బ్రవిమల పోఁగులు ◆ బాగొప్పు గౌప్పుఁ
గర మొప్పఁగను నీరు ◆ కావి ధోవతియుఁ
గరతిత్తియును బుస్త ◆ కముఁ బట్టుగొడుగు
నూఁతకోలయు శిఖ ◆ నున్న దూర్వములు

[44]జాతిగా వృద్ధశి ◆ ష్టద్విజమూర్తి
ధరియించి కృశమైన ◆ తనువును వణఁక
హరహర యనుచు న ◆ ల్లల్లన వచ్చి
గిజిగొన [45]దెసలెల్ల ◆ గిరిగిరిగుహలఁ
దఱచైన చీకటిఁ ◆ దఱుము చండాంశు
మండల ద్యుతులతో ◆ మార్పడి దెసలు
నిండారఁ బర్వు గ్రొ ◆ న్నిగ్గులుమెఱయ
నవవిధా నర్ఘ్యర ◆ త్నము లెడలెడల
దవులఁగఁ గూర్చు చి ◆ త్రపుఁ బట్టుగంత
తళతళమను తప్త ◆ తపనీయ రుచులు
దలతల మన నొప్పు ◆ తపసుని ప్రభల
గములకుం బై కాపు ◆ గా సిద్ధరూపు
నమరఁ దాల్చిన రోహ ◆ ణాచలం బనఁగ
రసవాద విద్యాధు ◆ రంధరుండైన
యసమానతేజు నా ◆ గార్జును శిష్యుఁ
గనుఁగొని దక్షిణ ◆ కరపుటంబెత్తి
ఘనవేద మంత్రయు ◆ క్తముగ దీవింప
నతని సద్వర్తన ◆ నతని వేషంబు
నతని తేజముఁ జూచి ◆ యనురాగ మెసఁగ
నిందు రండని పిల్చి ◆ హేమాసనంబు
నందున నర్ఘ్యపా ◆ ద్యాదు లొనర్చి
యెందు నుండుదురు మీ ◆ రిచటకిఁ బ్రమద
మిందు వచ్చుటకును ◆ నమి యుద్యోగ
మని తన్ను నడిగిన ◆ నాసిద్ధవరుని
కనియెఁ గృత్రిమ వను ◆ ధామరోత్తముఁడు
మీ మహత్వంబును ◆ మీ చరిత్రంబు
భూమి జనంబు లె ◆ ప్పుడుఁ జెప్ప వినుచు
సన్నుత తాపసో ◆ జ్వల పుణ్యమూర్తిఁ
గన్నులారఁగఁ జూచు ◆ కౌతూహలమున
నిచటి కేతెంచితి ◆ నిట్టి చందమునఁ
బ్రచుర హేమక్రియా ◆ పారీణులైన
వారల నెందు నె ◆ వ్వరిఁగాన నేను

వారాశివలయిత ◆ వసుధాతలమునఁ
బరగు రసగ్రంథ ◆ పటలంబు లందు
దొరకొని చెప్పఁ గౌ ◆ తుకముల బ్రమసి
ధాతువాదము మీఁదఁ ◆ దహతహ బుట్టి
చేతివిత్తము మున్ను ◆ చెనఁటియై పోయె
మంత్రవాదులకును ◆ మందుమాకులకు
యంత్రవాదులకు స ◆ హాయకారులకుఁ
బలుదెఱంగుల వెచ్చ ◆ పడి యౌషధములఁ
గలిపి రసంబులఁ ◆ గల్వంబులందుఁ
గసబిసగా నూఱి ◆ కదడుగాఁ బోసి
వెసపుటంబులు వెట్టి ◆ విసవిసనూఁదఁ
బెట పెట మని పడి ◆ పెటలి పెల్లెగసి
మటుమాయ మై పోవ ◆ మదిఁ దలపోసి
...... ....... ...... ....... ...... ....... ....... .......
యలసి యీశ్వర బీజ ◆ మది గట్టువడునె
యిల రసవాదంబు ◆ లేల సిద్ధించుఁ
బొలుచు మే ఘోదకం ◆ బులఁ జూచి నమ్మి
దొననీళ్లు జల్లు వే ◆ దురు వానిరీతి
నని పూర్వ ధనహాని ◆ కలమటనొంది
వనరుచు నెవ్వ రే ◆ వసుధపై నీదు
ఘనమహత్వంబును ◆ గనకంబుకొండ
...... ....... ........ ....... ....... ........ ........
....... ........ ....... ........ ........ ........ .......
యిది మహాద్భుతమని ◆ యెఱిఁగి యిచ్చటికి
సదమల బుద్ధి శ్రీ ◆ శైలమంతయును
బదియాఱువన్నెల ◆ బంగారుచేయ
మదిఁబూని నట్టి నీ ◆ మహిమఁదలంప
హరిహర బ్రహ్మ శ ◆ క్రాదులకైనఁ
దరముగా దితరులఁ ◆ దడవంగ నేల
గొసకొని మీ కెట్టి ◆ గురువు సత్కరుణ
ఘనమైన యా విద్య ◆ గలిగెనో కాని
మునుకొని రస మగ్ని ◆ ముఖమునఁ గట్టఁ
జనదెట్టి రసకళా ◆ సంవేదికైన

[46]నులుకక రససిద్ధ ◆ యోగులయందు
నిలువలేఁ డెటువంటి ◆ నెఱయోగియైన
నే [47]లీల మందుల ◆ మృత్యువుఁ గెలువఁ
జాలఁ డెంతయుఁ జికి ◆ త్సాపరుఁడైన
నలిని నాకర్షంబు ◆ నాది దేవతల
వలన లేదేమంత్ర ◆ వాదికినైన
నని చెప్ప విందు మీ ◆ యనువును నేర్పు
ననఘ మున్నెవ్వరి ◆ యందు నేమెఱుఁగ
మనుటయు నా కప ◆ టాకారవిప్రుఁ
గనుఁగొని సిద్ధపుం ◆ గవుఁడు నిట్లనియె
నాదినాథుని సుతుఁ ◆ డగు మీననాథు
గాదిలి శిష్యుఁడై ◆ ఘనకీర్తి నెసఁగు
నాగార్జునుండు మ ◆ న్నన నాకు నొసఁగె
యోగభేదము రస ◆ యోగవాదమును
నతని సత్కృపఁ జేసి ◆ యమర శ్రీనగము
వితతహేమంబుఁ గా ◆ వింపఁ బూనితిని
గమలజ కమలేశ ◆ కమలహస్తాదు
లమరనా కభిముఖు ◆ లై యుండఁ జేసి
నావుడు నా సిద్ధు ◆ నకు విప్రుఁ డనియె
భావింప యోగికిఁ ◆ బరమయోగంబు
ధనముగాఁ గూర్చుట ◆ తగుఁగాక యిట్టి
ధనములు ధనముగాఁ ◆ దలఁపంగఁ దగునె
పసిఁడికై యోగంబు ◆ పసచెడి యిట్టి
గననిబొందఁగ నేమి ◆ గలదు నీకనిన
విను విప్రముఖ్య యీ ◆ విశ్వంబులోన
మును రసవిద్య నే ◆ ర్పును బెంపు వడయఁ
బూని యనేకులు ◆ పొందరాకున్న
మానినారనుచుఁ బ ◆ ల్మఱు లోకులెల్ల
నపహాస్యముగనాడ ◆ నారూఢమైన
యపకీర్తి వాయ నా ◆ యందు నా శక్తి
ప్రాకటంబు గ నిట్టి ◆ పని దొరకొంటిఁ
గాక యోగమునకుఁ ◆ గలదె సమాన

మనిన భూసురుఁడు నా ◆ గార్జునుశిష్యు
ననఘయోగమున దే ◆ హమునకు నిత్య
తెసఁగునే యనుటయు ◆ నిట్లనె నాతఁ
డసదృశంబైన యో ◆ గాభ్యాసమహిమఁ
గాయంబునకుఁ జేవ ◆ గలిగి యెప్పుడును
బ్రాయంబు దప్పక ◆ బహు[48] కాలముందు
నిట్టియోగమునీయ ◆ నే కాదుతమ్మి
పట్టియాదిగ నెన్నఁ ◆ బడు దేవతలకు
ననఁగ విప్రుఁడు నాడె ◆ నతనితో యోగి
జనులకు నొకవేళఁ ◆ జచ్చుట గలదొ
కలుగదో యనినఁ బం ◆ కజజకపాల
కలితాస్థి వనమాలి ◆ కావితానముల
నొప్పు మృత్యుంజయు ◆ కొకనికిఁ దప్పఁ
దప్పవన్యులకు ను ◆ త్పత్తినాశంబు
లనవుడు సిద్ధున ◆ కనియె బ్రాహ్మణుఁడు
ఘనమైన యోగంబు ◆ కతమునఁ జావు
గలుగకుండినను యో ◆ గము సల్పుఁగాక
తలకొని మరణంబు ◆ తప్పదంటేని
యనవరతంబు [49]బ్రా ◆ ణావరోధమునఁ
బనుపడి తనువు లం ◆ పటఁ బెట్టనేల
కాలమృత్యువుఁ గెల్వ ◆ గారానివిద్య
లీలీలఁ బదివేలు ◆ నెఱిఁగిన నేమి
మున్నాత్మహానికి ◆ మూలంబుగాక
సన్నుతంబగు విద్య ◆ చాలు నొక్కటియె
నావుడు నవ్విప్రు ◆ నకు సిద్ధుఁ డనియె
వావిరి మును బ్రహ్మ ◆ వ్రాసిన వ్రాఁతఁ
గలుగు నాయువుకంటె ◆ ఘనముగాఁ బ్రతుకు
నలవుఁ గల్పించిన ◆ యది విద్యగాక
ధర నన్యవిద్యలు ◆ [50]తథ్యములగునె
పరికింప ననిన నా ◆ బ్రాహ్మణోత్తముఁడు
యోగమేమరి దేహ ◆ మున్నతినిల్వ

[51]నా గిరీశు కొకని ◆ కగు నేరికైన
వశముగా దంటి స ◆ త్వము రసవిద్య
...... ...... ...... ...... ...... ...... ...... ....... ......
...... ....... ....... ...... ..... ...... ..... ...... ......
యీశుపైఁ జిత్తంబు ◆ నిడక యీవాద
విధికిఁ జొచ్చితి వట్టి ◆ వేళల నేమి
విధమునఁ దనువుకు ◆ విధిదాఁక కుండ
జరుపుదు వనిన నౌ ◆ షధశ క్తికలిమి
వెరవగు నదియోగ ◆ విహిత సత్క్రియల
నని చెప్పుటయు విప్రుఁ ◆ డా మందుమహిమ
జననుత చరిత దృ ◆ ష్టంబుగా నాకుఁ
జేయవే యనుట యా ◆ సిద్ధవ రేణ్యుఁ
డాయెడ నున్న ఘో ◆ రాతిశాతాసి
తనచేతి కందించి ◆ తనువ్రేయు మనుచుఁ
దను విచ్చియున్న నా ◆ ధరణీసురుండు
వెసఁబూన్చి వ్రేసిన ◆ వ్రేటు[52] కాంస్యమును
నసమున వేసిన ◆ యట్ల ఖంగనుచుఁ
దాఁకిన నడిదంబు ◆ ధారలు ముడిఁగె
నా కడిఁదికి బ్రాహ్మఁ ◆ డాశ్చర్యమంది
యీమహామహిమ నే ◆ మెన్నఁడుఁగాన
మామహనీయ ది ◆ వ్యౌషధం బిపుడు
గనుఁగొనఁ గుతుకంబు ◆ ఘనమయ్యె మాకు
ననఘాత్మ చూపవే ◆ యని తన్ను వేఁడ
నతని సాధుత్వ సౌ ◆ మ్యాకార గతులు
ధృతి నమ్మి నిజయోగ ◆ దృష్టిని విప్రు
తెఱఁగు తెల్లంబుగాఁ ◆ దెలియక మెఱుఁగు
గిఱికొన నిగుడఁ బు ◆ క్కిటనున్న ఘుటికె
నఱచేతనిడి చూప ◆ నంతలోఁ జక్ర
మఱిముఱి నతనిపై ◆ హరి ప్రయోగించెఁ
దటుకున నతని మ ◆ స్తక ముత్తరింప
నటు ప్రయోగించిన ◆ నద్దివ్య హేతి
వసమఱె నాశిష్య ◆ వర్గంబు నపుడు

మసలక యామందు ◆ మాయా ద్విజుండు
కుదియించి వెసఁ బుచ్చు ◆ కొనుటయుఁ దునిమె
నదరి సుదర్శనం ◆ బతని శిరంబు
పటువజ్ర[53] హతిఁగుల ◆ పర్వత శృంగ
మటువలెఁ గూలిన ◆ నట్లు గీలాల
ధార లుత్కటముగా ◆ ధరమీఁద బిట్టు
వార నాగార్జున ◆ వర కళేబరము
వేగంబెచూచి యు ◆ ద్వేగంబు గదుర
....... ....... ....... ....... ....... ........ ........
....... ....... ....... ....... ....... ........ ........
నతి రయంబునఁ బాఱి ◆ యచలంబు వ్రాకి
రంతశిష్యులు విస్మ ◆ యాక్రాంతు లగుచు
నప్పుడు విప్ర మా ◆ యా కారుఁ డైన
యప్పుండరీకాక్షుఁ ◆ డందఱు వినఁగ
నెలుఁగెత్తి యిట్లనె ◆ యితఁడహంకార
కలితుఁడై యనుచిత ◆ కర్మంబు పూనె
నది యెట్లనిన మాన ◆ వానళి కెందు
వదలక బహువిధ ◆ వ్యవహారములకుఁ
గారణంబై యుండు ◆ కాంచనం బిప్పు
డీరీతి శ్రీగిరి ◆ యెల్లఁ దానైన
వారికి వారికి ◆ వలసినంతైనఁ
గోరి కై కొని తమ ◆ కును దామె రాజు
లై యల్పు లధికులు ◆ నను వాసిలేక
రాయిడింపుడుఁ బ్రతి ◆ గ్రహదాన ముఖ్య
ధర్మంబు లన్నియుఁ ◆ దప్పి మర్యాద
నిర్మూలమై భూమి ◆ నెఱిదప్పుఁ గానఁ
దడయక లోకహి ◆ తంబుగా నితని
పొడవణఁగించితి ◆ భువన విద్వేషుఁ
గాసిగా శిక్షింపఁ ◆ గలవా రుపేక్ష
చేసిన దోషంబు ◆ సిద్దించుఁగాన
నేనే జగంబు ల ◆ న్నియును రక్షింపఁ
బూనిన లక్ష్మీవి ◆ భుఁడ నని చెప్పి

యంతర్హితుండయ్యె ◆ నంత నయ్యద్రి
నంతంత నున్న శి ◆ ష్య ప్రకాండంబు
చేరి మహాదేవ ◆ శివశివా యిట్టి
దారుణం బెటనుండి ◆ తలకూడె ననుచు
వగచి యచ్చటఁ దాము ◆ వసియింప నేమి
నెగులొందునో యని ◆ నిల్వ శంకించి
త్యాగనాగార్జున ◆ ధరణినాయకుని
వేగరప్పించి య ◆ వ్విధ మెఱింగింప
నతఁడు శోకార్తుఁడై ◆ యకట దైవంబు
ప్రతికూలమైన నే ◆ పని సిద్ధిఁ బొందు
నని యట్టతో శిరం ◆ బమరించి యొక్క
ఘనగుహాంతమున భూ ◆ గతము గావించి
జనుల కెయ్యెడఁ బ్రకా ◆ శము గాకయుండఁ
బెనురాళ్ల గలయఁ గ ◆ ప్పించెఁ దద్వార
మంతశిష్యులు వో ◆ యి రయ్యాయిదెసకు
నంతరంగమునఁ జిం ◆ తాక్రాంతుఁ డగుచు
నా మహీపాలుండు ◆ నరిగె మున్నేలు
భూమికి మిత్రాప్త ◆ పుత్ర యుక్తముగ

వ్యాళి సిద్ధుఁడు - కాయసిద్ధి.



వ్యాళినామక సిద్ధ ◆ వరుఁడొకఁ డసమ
లీల దేశములు నో ◆ లిన సంచరించి
బల్ల [54]వక్షోణీశ ◆ పాలితం బగుచు
నెల్ల వైభవముల ◆ నెల్ల సౌఖ్యములఁ
గరమొప్పు కల్యాణ ◆ కటకంబు చేరి
నిరుపమ దేవతా ◆ నిలయంబులోన
నున్న నత్తఱిఁ బౌరు ◆ లొయ్యనడాసి
సన్నుత వివిధ ప్ర ◆ సంగంబు లతఁడు
గావింప విస్మయ ◆ కలితాత్ము లగుచు
వేవేగ దొరలకా ◆ విధమెఱింగింప
వార లేతెంచి త ◆ ద్వచన వైచిత్రి
గోరి చిత్రములు బై ◆ కొనఁ[55] బ్రమోదమున
దప్పకా తెఱఁగు ప్ర ◆ ధానులతోడఁ

జెప్పిన వారు న ◆ చ్చెరువంది యచటి
కరిగి భాషించియు ◆ నవనీశ్వరునకుఁ
దరమిడి యతని చం ◆ దము విన్నవింప
నా మహీనాయుకుం ◆ డా సిద్ధవరుని
తో మాటలాడు కౌ ◆ తుకమున నా ప్త
జనములతోడ వి ◆ చారించి వారి
యనునుతి నతనిఁ జ ◆ య్యనఁ బిల్వఁబంచి
పేరోలగమున సం ◆ ప్రీతిమై నుండె
వారును జని సిద్ధ ◆ వర్యునిఁ గాంచి
దేవ విచ్చేయు నీ ◆ దెస భక్తి కలిమి
భూవల్లభుఁడు పిల్వఁ ◆ బుత్తెంచె ననఁగఁ
నతఁడు వారలకు ని ◆ ట్లను మమ్ము మనుజ
పతి పిల్వఁ బంప నె ◆ వ్వరి వార మిచట
దేశాంతరంబులఁ ◆ ద్రిమ్మరు మాకు
దేశాధినాధుల ◆ తెరువు లవేల
యేవేళ నేదినం ◆ బెచట నుండితిమి
ఆవేళ నాదినం ◆ బచట మాతావు
తనర సిద్ధుల కుండ ◆ దా రాజసేవ
వినుత యోగాభ్యాస ◆ విఘ్న కారణము
కావున మాకు న ◆ క్కడకు రాఁ దగదు
దీవించితిమి యింక ◆ దివ్య నృపాలుఁ
జనుఁ డన్న వారలు ◆ చనుదెంచి తనకు
వినతులై యామాట ◆ విన్నవించుటయు
మఱియును దగువారి ◆ మానవాధిపుడు
తఱిగొని పంపి యా ◆ స్థాన రంగమున
కా సిద్ధపుంగవు ◆ నర్థి రప్పించి
భాసుర నవరత్న ◆ భర్మపీఠమున
నునిచి సత్కారము ◆ లొనరించి యతని
ఘన తేజమును శుభా ◆ కారసంపదయుఁ
దప్పక కనుఁగొని ◆ తలయూఁచి మెచ్చి
యప్పుణ్యుతోడ మ ◆ హాత్మ మీరెవ్వ
రెందుండి వచ్చితి ◆ రిందుల కిపుడు
నెందుఁ బోయెదరు మీ ◆ రెఱిఁగింపుఁ డనిన

రసయోగశాస్త్ర ని ◆ ర్మాతయై మహిమ
నెసఁగు నాగార్జును ◆ కేను శిష్యుఁడను
వ్యాళి నా పేరా మ ◆ హాత్ముని కరుణ
నోలీ చతుర్వేద ◆ యోగ భేదములు
వలయు మంత్రౌషధ ◆ మర్మకర్మములు
తెలిసితి దేహసి ◆ ద్ధియును సిద్ధించె
నా గురునాథు నా ◆ నతి నెల్ల కడకు
నీగతి భువిఁ జరి ◆ యింపు చున్నాఁడ
నావుడు నన్నర ◆ నాథుండు దేహీ
యేవిధంబున నిల్వ ◆ నెసంగు యోగంబు
తడయ కవ్వలి ఫలి ◆ తంబు లేరీతి
విడుపింపఁగావచ్చు ◆ వివరింపు మనిన
నతఁడును జిరకాల ◆ మధికయోగంబు
ధృతిఁజలుపుట నివ ◆ ర్తించు నాతండు
యోగంబు నడవ లే ◆ కున్నఁ గాలంబు
జాగు కోర్వకయున్న ◆ సయ్యననొండు
తనువుఁ గైకొని మాన్పఁ ◆ దరమగువాని
వినుమది యెట్లంటి ◆ వే నైదుపుట్ల
కొనరఁ [56]గృష్ణాగరు ◆ క్రొత్త తైలంబు
కొని యంతయును నిన్ప ◆ కొప్పెరఁ బోసి
...... ...... ....... ....... ...... ....... ........
యేర్పడఁ బొయిమీఁద ◆ నిడి యనలంబుఁ
గై కొల్ప యుడుకు రాఁ ◆ గాఁగెడి వేళ
వీఁకమైనందుఁ బ ◆ ర్విడి పడనుఱికి
ప్రాణంబు విడిచి రూ ◆ పఱవెచ్చి[57] ముద్ద
యైన యత్తఱి నౌష ◆ ధావలివైవ
ఘన వజ్ర దేహుఁడై ◆ కలిత లావణ్య
వినుత[58] యవ్వనలీల ◆ వెడలి యేతెంచి
యిలకెల్ల నొడయఁడై ◆ యెదు రెందు లేక
బలపరాక్రమముల ◆ భాసిల్లు ననిన
జగతీశుఁ డిట్లనెఁ ◆ జచ్చినవారు
మగుడివచ్చుట వింటి ◆ మా యెన్నఁడైన

మందులపస నమ్మి ◆ మరి వచ్చు దాని
మందుఁడె యైనను ◆ మరి యియ్యకొనునె
[59]కైతవక్రియలు ని ◆ క్కంబు గావనిన
నాతనితో సిద్ధుఁ ◆ డధిప నీ వొకని
నుడికెడు నూనెలో ◆ నుఱికింపు మగుడఁ
బడయలేకున్న నా ◆ ప్రాణంబు లిత్తు
ననవుడు మనుజేంద్రుఁ ◆ డతనితో సిద్ధ
జనముఖ్య యొరు లిట్టి ◆ సాహసంబునకు
వెఱతురు నీవె త ◆ ద్విద్యామహత్త్వ
[60]మెఱుఁగఁ జూపుము మాకు ◆ నే గతి నైన
మఱవక నీ వెర్గు ◆ మందు లన్నియును
గుఱుతుగా మాకుఁ గై ◆ కొని చూపి యిచ్చి
యుఱుకుము నూనెలో ◆ నుఱికినపిదపఁ
దెఱఁ గొప్ప నీవు బో ◆ ధించినయట్ల
పరమౌషధము మేము ◆ వై చెద మనిన
ధరణీశుతోడ నా ◆ తాపసి వలికె
విను మానవేంద్ర బల్వి ◆ డి రాజసమునఁ
జనఁజొచ్చి యనృతభా ◆ షలు ప్రకటించి
నమ్మించి యొరుల ప్రా ◆ ణములు హరించి
ముమ్మరంబగు పాప ◆ మునఁ బొంది యిహముఁ
బరమును లేక ని ◆ ర్భర నరకాగ్ని
నెరియుచునుండ నే ◆ నింత మూడుఁడనె
తరలక యీతప్త ◆ తైలంబులోన
నుఱికెద నేను మీ ◆ కొగి నిప్పు డిచ్చు
నీయౌషధమును వే ◆ యింపుమీ యపుడు
న్యాయంబు దప్పక ◆ నరనాథతిలక
సంతతవ్యసన ప్ర ◆ సక్తులై కుటిల
చింతాపరాయణ ◆ చిత్తులై రాజ్య
మత్తులై వర్తించు ◆ మండలాధీశు
లెత్తెఱంగున రోయ ◆ రేపాపమునకుఁ
గాన నీచేతికిఁ ◆ గాక మధ్యస్థు
లైనవారలచేతి ◆ కామందు లిత్తు

ననవుండు నగుఁ గాక ◆ యని రాజు మంత్రి
జనులఁ జూపుటయు నా ◆ సచివులతోడ
వేళమిట్లను[61] మంత్ర ◆ విదులారమీరు
వాలాయముగ నాదు ◆ వచనము ల్వినుఁడు
మానవాధిపుని న ◆ మ్మక మిమ్ము నమ్మి
నే నౌషధమ్ము ల ◆ న్నియును మీచేతి
కిచ్చుచున్నాఁడ ని ◆ ట్లిచ్చి తైలమున
వెచ్చిన తఱి నివి ◆ వేయుఁడు మీరు
వేయక తక్కిన ◆ విప్రుని గోవు
జాయ స్త్రీ బాలునిఁ ◆ జంపిన గతికి
గురుభామఁ దోఁ బుట్టు ◆ గును దమతల్లిఁ
దెరలక పట్టి పొం ◆ దినవాని గతికిఁ
జేవాఁడిఁ బసిఁడి మ్రు ◆ చ్చిలు వానిగతికిఁ
బోవువారగుదురు ◆ పూని మీ కగునె
నావుండు వారు భూ ◆ నాథుని మొగముఁ
గనుఁగొని యాతఁ డౌ ◆ గా కనుం డనిన
ననుమతించిరి సిద్ధుఁ ◆ డప్పుడు వారి
...... ...... ....... ........ ...... ..... ..... ..... .....
నెనమండ్రఁ బిలిచి మీ ◆ రేయుఁడు శల్య
కరణియు సంధాన ◆ కరణియు వజ్ర
కరణియు సంజీవ ◆ కరణియు నిందు
మొదలు నూనెను వెచ్చి ◆ ముద్దయై నపుడు
కదిసిరా సంధాన ◆ కరణి వై చుటయుఁ
బొలుపుగా వెండి పూఁ ◆ దేనెయుఁ బోలి
తెలుపార గట్టియై ◆ దీపింప శల్య
కరణి వైచినను నం ◆ గములు నెమ్ములును
వరుస నేర్పడు నంత ◆ వహ్ని పెంపెల్ల
పలుచఁగా దీపించి ◆ పాయంబు కొలఁది
తలఁప సంజీవనిఁ ◆ దడయక వైచి
సరగున ననలంబు ◆ చల్లార్చి వజ్ర
కరణి వై చిన వజ్ర ◆ కాయమై వెడలు
నని చెప్పి లోహమ ◆ యంబైన యొక్క

ఘనకటాహంబు చ ◆ క్కనఁ బొయ్యిమీఁద
నినిచి తై లంబందు ◆ నిండఁబోయించి
యనలంబు సమకొల్పి ◆ నటఁ బొంగు వచ్చు
నెడఁ బ్రధానులఁ జూచి ◆ యిట్లనె మీకు
నెడపక యేనిచ్చు ◆ నీ యౌషధముల
నే నిజం బొల్లక ◆ యిలఱేఁడు మీరుఁ
బూనిపాపముత్రోవఁ ◆ బోవుచున్నారు
తుది నిట్లు నయెనేనిఁ ◆ ద్రుంగు మీ రాజ్య
పదమని ఘోరశా ◆ పము నిచ్చి కడకఁ
జేరి శ్రీగురువును ◆ శివునిఁ దలంచి
ధారుణీపతియును ◆ దన కొల్వు వారు
వెఱఁగందఁ గొప్పెర ◆ వీక్షించి యుఱికె
మఱఁగఁ గాఁగిన తైల ◆ మధ్యభాగమునఁ
గడఁగి సేతువుఁ గట్టఁ ◆ గాఁ బూన్చి నలుఁడు
వడినార్చి వేసిన ◆ వారాశి నడుమఁ
బృథుతర ధ్వని లోఁ గు ◆ భిల్లనఁ బ్రథమ
పృథివీధరము నిట్టఁ ◆ బృథివిఁ బడ్డట్లు
ఆగతినుఱికి స ◆ య్యన దేలి మునిగి
వేగంబె ప్రాణముల్ ◆ విడిచి పెల్లుఱికి
ముడిఁగి పెంపఱవిచ్చి ◆ ముద్దయై రూపు
చెడియున్న నత్తఱిఁ ◆ జేరి వీక్షించి
సచివులు వరుస నౌ ◆ షధములు వైవ
పచరించుటయు భూమి ◆ పాలవరుండు
వారలతో మీరు ◆ వైచు నౌషధము
నేరుపు నను నాకు ◆ నెఱిఁగించి కాని
వైవకుండనవుడు ◆ వారు భీతిల్లి
దేవ నీకిట్లు చిం ◆ తింపఁగఁ దగునె
మతి మహీనృపతి న ◆ మ్మగఁ జాల ననుచు
నతఁ డిచ్చె మాచేతి ◆ కౌషధ ప్రతతి
నేమును మీ చిత్త ◆ మెఱుఁగమిఁ జేసి
యీ మహా దురితంబు ◆ కిచ్చగించితిమి
అడరి విశ్వాస మ ◆ హాపాతకంబు
కడక నీ యపకీర్తి ◆ గలిగె లోకముల

నురకయ పలుమాఱు ◆ నొ త్తిలి చెప్ప
వెఱతు మాలింపు మా ◆ విన్నపం బనిన
మందుల నిక్కంబు ◆ మది నెర్గ వలసి
యందులో మొదలింటి ◆ యౌషధం బపుడు
వేయించుటయు శుద్ధ ◆ విశదవర్ణమున
నాయితంబై మాదన్ ◆ వాపేతమైన
సిద్ధునిమేను వీ ◆ క్షించి (తద్) వచన
పద్దతి నిజముగఁ ◆ బతి నిశ్చయించి
యితఁ డిందు బ్రతికిన ◆ నిలకెల్లఁ దానె
పతియగు నసమాన ◆ బలరూఢుఁ డనుచు
నున్నమందులు వైవ ◆ కుండ మాన్పుటయు
నన్న రేంద్రునకు వా ◆ రనిరి వెండియును
నింక నన్నియు వేయ ◆ నిమ్ము భూనాథ
శంకింప కిట్టి య ◆ సత్యంబు కోర్చి
కనియెడు ఫలమేమి ◆ కాఁగలకీడు
నొనరు మేలును మాన్ప ◆ నొక్కని వశమె
సీతకై తపసియై ◆ చెఱఁ గొనిపోయి
దై తేయవిభుఁడు నే ◆ ధర్మముఁ బొందెఁ
దఱివేచి మాయజూ ◆ దమునఁ బాండవులఁ
బఱచి యే ఫలసిద్ధిఁ ◆ బరఁగె రారాజు
బతిమాలి కపట రూ ◆ పమున గౌతముని
సతిఁబొంది యింద్రుఁ డే ◆ సౌఖ్యంబు నొందె
ననిశంబు కపట మే ◆ షాకృతి మునులఁ
దునుము వాతాపికిఁ ◆ దుదనేమి గలిగెఁ
గావున నన్యాయ ◆ కార్యచింతనము
భావింవ సఖిల వి ◆ పత్కారణంబు
మఱి యదియునుగాక ◆ మానవాధిపులు
మొఱకులై దుర్మార్గ ◆ మునకుఁ జొచ్చినను
సామజంబులు తెగి ◆ చంపఁ జూచినను
బాములు వెనువెంటఁ ◆ బడి కఱచినను
ఘనవారధులు మేర ◆ కడచి వచ్చినను
జనదని వారింప ◆ శక్యమే ప్రజకుఁ
దప్పులు గలిగిన ◆ దండింపఁ గాక

తప్పనాడుట రాజ ◆ ధర్మమా యనుచు
నలరంగఁ దనునోవ ◆ నాడినవారి
పలుకుల కలిగి యా ◆ పార్థివేశ్వరుఁడు
మన్నింపు మనియెడు ◆ మందె మేలమున
నిన్ని మాఱులు కాఱు ◆ లేమి యాడెదరు
మనమునఁ గొంకక ◆ మాటి మాటికిని
నను మీరు శాసింప ◆ నాకు నేలికలె
నాపంపు చేసి మి ◆ న్నకయుండు మీరు
పాపంబునకు నేమి ◆ పని విచారింప
నీ నిమిత్తంబున ◆ నే దోషమైన
రానుండు మాకు నూ ◆ రకయుండు డింక
ననిన మాఱాడక ◆ భయఁపడి వగల
మునిఁగి కన్నీరొల్క ◆ మొగములు వంచి
తలఁగిరి మంత్రులం ◆ దఱుఁ గొల్వు విచ్చి
యెలమి నంతఃపురి ◆ కేగె వల్లభుఁడు
నంతట రాజ్యంబు ◆ నతఁడుఁ దదీయ
సంతానమును [62]సిద్ధ ◆ శాపానఁ బొలిసె.
వ్యాళియు [63]బల్లిదుం ◆ డనుచు భూజనము
లోలిఁ బూజింపఁ బెం ◆ పొందె వెండియును

గోరక్కుని వృత్తాంతము.



గుణరత్న నిధియును ◆ గోరక్కుఁ డనఁగఁ
బ్రణుతికి నెక్కు గో ◆ రక్షుని శిష్య
వరుఁడొక్క శిద్దుఁ డు ◆ ర్వరలోనఁ గలయఁ
దిరిగి పెంపున గౌళ ◆ దేశంబులోనఁ
బ్రవిమలంబైన సౌ ◆ రాష్ట్ర సోమేశ
భవనాగ్రమంటపా ◆ భ్యంతరసీమఁ
దను నెల్లవారును ◆ దగిలి సేవింప
వినుత ప్రసంగ ప్ర ◆ వీణుఁడై యున్న
నత్తరి నా మండ ◆ లాధీశ్వరుండు
చిత్తంబులోఁ దన ◆ ర్చినభ క్తికలిమి
నమ్మహా దేవుని ◆ నర్చింప వచ్చి
క్రమ్మఱి చనుచు నా ◆ ఘనుని వీక్షించి

యతని నామమును మ ◆ హానుభావమును
చతురతయును సదా ◆ చారంబు నచటి
జనులచే విని సంత ◆ సమును నచ్చెరువు
మనమునఁ బెనఁగొన ◆ మత్పురంబునకు
ననఘాత్మ విచ్చేయు ◆ మనుచుఁ బ్రార్థించి
ఘనశిబికారూఢుఁ ◆ గావించు కొనుచుఁ
జనిచని ముందటఁ ◆ జంపకాశోక
ఘనసార మధుర ష ◆ డ్గ్రంథ మాకంద
వకుళ చందన సింధు ◆ వార మందార
లికుచ దాడిమ కద ◆ ళీ నారికేళ
నారంగ తాళ వు ◆ న్నాగ హింతాళ
భూరుహవ్రాత ప్ర ◆ భూతశాఖాగ్ర
సంచరత్కలకంఠ ◆ శారికా కీర
చంచరీకానీక ◆ సమ్మదా రావ
వాచాలమై యొప్పు ◆ వనమధ్యవీథి
వీచి కాందోళన ◆ వికచారవింద
కుముద నీలోత్పల ◆ కుసుమపరాగ
సముదయ వాసిత ◆ సలిలమై విపిన
దేవతాకరతల ◆ స్థిత దర్పణంబు
కై వడిఁ గడునొప్పు ◆ కమలాకరంబు
కెలన వాసంతికా ◆ గేహాంతరమునఁ
జలువమించిన మంచి ◆ సైకతస్థలము
విడిదలపట్టు గా ◆ వించి యొక్కింత
వడి విశ్రమించి య ◆ వ్వన కేళి లీల
నలవోక మెలఁగుచు ◆ నపుడు దాఁగూర్చు
తలిరాకుఁబోఁణిఁ జి ◆ త్తము నందుఁ దలఁచి
పరువంపుఁ బూఁదేనె ◆ బాసటఁ బడిన
మరువాలు దూపుల ◆ మర్మముల్ నాటు
గాటంబునకుఁ జాలఁ ◆ గంపించి రతుల
తేటలై మించు నా ◆ తెఱప లీలాది
భావంబులును మృదు ◆ భాషలు నసమ
లావణ్య గతులుఁ గ ◆ లా వివేకములు
రూపురేఖలు నవ ◆ రూఢ యౌవనముఁ

జూపులయొరపు న ◆ చ్చునఁ బోసినట్లు
మది నిల్ప మెలుపారు ◆ మలయమారుతము
పొదలెడువిరహాగ్నిఁ ◆ బ్రోదిగావింప
నంతకంతకు దట్ట ◆ మై నెట్టుకొనిన
సంతాపమునఁ బొందిఁ ◆ జరపఁగా లేక
పరిచారవర్తులఁ ◆ బంపి యా సిద్ధ
వరుని రప్పించి సౌ ◆ వర్ణ పీఠమున
నునిచి సమ్మతి పూజ ◆ లొనరించి వినయ
మెనయ నిట్లనె భువి ◆ నెల్ల విద్యలను
ఘనులంచు మి మ్మనే ◆ క ప్రకారములఁ
జనులు నతింతు రా ◆ శ్చర్యంబుగాఁగ
ననయంబు భవదీయ ◆ మగు మంత్రశక్తిఁ
గనుఁగొనఁ దివిరెడుఁ ◆ గౌతుకం బాత్మ
సొలవఁగ నిజముగాఁ ◆ జూపఁగా వలయు
వెలయ నాకర్షణ ◆ విద్య మా కనిన
నాపురుష శ్రేష్ఠుఁ ◆ డల్లన నవ్వి
రూపింప మద్గురు ◆ రూఢ్యుపదేశ
మేపార నెఱిఁగినే ◆ నెఱిఁగింతు నరయ
భూపాల వేఁడు మ ◆ ద్భుతము వేఱొకటి
నావుడు నమ్మహీ ◆ నాయకుం డనఘ
యీ విద్యపైఁ బ్రీతి ◆ యెంతయుఁ గలదు
నాకును నిపుడు మ ◆ న్మథ ప్రీతి నొకతె
నీ కందువను జూపు ◆ మింతియ చాలు
ననుటయు నతని ప్రే ◆ మాతిశయంబు
మనమునఁ గాంచి య ◆ మ్మదిరాక్షియున్న
గుఱుతును బ్రాయంబు ◆ కొలఁదియుఁ బేరుఁ
దెఱఁగొప్ప నడిగి య ◆ తి స్థిరధ్యాన
ధీరుఁడై మంత్రాధి ◆ దేవతఁ దలఁచి
సారంబుగాఁ గొంత ◆ జప మాచరించి
మీఁదుఁ జూచుచు మిట్టు ◆ మిడిచి హుంకార
నాదంబు చెలఁగ ము ◆ న్నవలీల మెఱసి
యాకర్షణముచేసి ◆ యానాథుఁ డప్పు
డాకాంత పలుదోము ◆ నవసరం బగుట

పొదిగొను బహువిధ ◆ పుష్ప వాసనల
వెదజల్లుచును వెస ◆ [64]వ్రేల్ముడి వైచి
రచితాంగరాగ సౌ ◆ రభ వాసనలను
బచరించి కట్టిన ◆ పసని దువ్వలువఁ
గనకకుంభముల బిం ◆ కము పిసాళించు
ఘనకుచద్వయకాంతిఁ ◆ గప్పి క్రొన్నిగ్గు
లొలయఁ గక్షముల బా ◆ గొనరించి మించు
గలభూషణంబులు ◆ గదియఁ గీల్కొలిపి
రాజితంబగు పద్మ ◆ [65]రాగ పుంగరము
తేజంబు పిడికిట ◆ దీటుకొనంగ
మెలుపొందఁ బూనిన ◆ మించుటద్దముల
నలరారు నిజవద ◆ నాబ్జమండలము
నొనరినప్రేమ నొం ◆ డొంటిఁ బూజింపఁ
గొనకొన్న మత్తచ ◆ కోరంబు లనఁగఁ
తెగగల్గి యింపారు ◆ తెలిగన్నుదోయి
నిగుడించి సమదృష్టి ◆ నిల్పి దక్షిణపుఁ
గరమున నఖ కాంతి ◆ కలితమై మించుఁ
బురడించు పలుకఱఁ ◆ బూని తాంబూల
రసనిరంతరరాగ ◆ రంజితం బగుచుఁ
బొసఁగ దాడిమబీజ ◆ ములగేలిసేయు
దంతప్తఙ్త్కికిఁ జారు ◆ తర కుందముకుళ
కాంతివి శేషంబుఁ ◆ గల్పించుచున్న
యునికిని వచ్చి యా ◆ యుర్వీశుమ్రోల
నొనరంగ నిలిచి య ◆ ట్లున్న చందంబుఁ
జూచి యచ్చెరువంది ◆ సుందరిఁ గదియఁ
జూచు నాతని తమిఁ ◆ జూచి వారించి
నరనాథ ! యాకర్ష ◆ ణ ప్రభావమున
నరుగుదెంచినయట్టి ◆ యంగనామణికిఁ
దెలివి చాలదు మంత్ర ◆ దేవత మేన
నొలసియుండుటఁ జేసి ◆ యును బొందఁదగదు
క్రమ్మఱఁ బంపు ట ◆ ర్హంబంచు నతని
సమ్మతి సిద్ధుఁడా ◆ చందంబు చేసె

నయ్యెడ వెండియు ◆ నమ్మహీ పాలుఁ
డయ్యోగిఁజూచి కా ◆ యజుకేళి గతులఁ
దిలకించు కామినిఁ ◆ దేవచ్చుఁ గాకఁ
కలుగునే బాలికా ◆ కర్షణంబనుచు
నతఁ డడిగినఁ జెప్పి ◆ నట్లయౌ ననుచు
జతురత మద్గురు ◆ స్వామిఁ దలంచి
రప్పింతు చెప్పుమా ◆ రాజన్య యనిన
నప్పుడా పార్థివుఁ ◆ డతిచిత్ర మనుచుఁ
దనకొల్వు కన్యకా ◆ తతిలో నొకర్తు
మనమునఁ దలఁచి నా ◆ మము నున్న తావు
నెఱిఁగించుటయుఁ ◆ బ్రీతి నెప్పటియట్ల
వఱలు మంత్రాధి దే ◆ వత సంస్మరించి
కరతలం బెత్తి యా ◆ కర్షించి (వేగ)
మరువంపు మొలక మ ◆ న్మథు కరవాలు
రతికేలితమ్మిన ◆ ర్మంపుఁజే చిలుక
లతకూన పసిఁడిస ◆ లాక పూమొగ్గ
తొలకరిమెఱుఁగు ముం ◆ దల చంద్రరేఖ
కలికి పుత్తడిబొమ్మ ◆ కడిగిన కల్వ
యననొప్పు బాలిక ◆ నవనీశు మ్రోల
నునిచె నుంచుటయును ◆ హోయని మెచ్చి
తలయూఁచి పెక్కు వి ◆ ధంబులఁబొగడి
యలఘుభూషణవిశే ◆ షా నర్ఘ్యపాద్య
కనకాంబరంబులఁ ◆ గట్ట నిచ్చుటయుఁ
గనుఁగొని నగి మహీ ◆ కాంత ! మద్గురువు
నుపదేశమునఁ గన్న ◆ యోగ మొక్కటియు
నపరిమితంబైన ◆ యర్థంబు గాక
మన్నించి యిచ్చు నీ ◆ మణిభూషణాదు
లెన్నియైనను మాకు ◆ నేటికిననుచు
నర్థిజాతంబున ◆ కవియెల్ల నొసఁగి
పార్థివుం డనుపఁ దా ◆ బదమున కరిగె
నయ్యెడ నినుఁడు దో ◆ షాగమ శంకఁ
జయ్యనఁ దొలఁగిన ◆ జాడ నస్తాద్రి
చాటున కరుగ ని ◆ జప్రియుఁ జూచి

సూటి నన్యుని నింకఁ ◆ జూడ నారాజు
నైన నన్నట్లు గా ◆ [66] ఢానురాగమును
బూని పద్మిని రయం ◆ బున మోమువంచె
దెసల సంధ్యా [67]జల ◆ స్తిమితంబు లగుచు
[68]ననులొత్తు తిమిరబీ ◆ జంబులో యనఁగ
వనజాతముల వెలు ◆ వడి వికసింప
మొనయు నీలోత్పల ◆ ముకుళ జాతముల
నలమి పాదుల మూతు ◆ లల్లనఁ జేర్చి
యెలదేఁటి కదుపు లె ◆ ల్లెడ నుల్లసిల్లె
నలి నాకభువనంబు ◆ నకు సుధాశనులు
తళుకుసుపాణి ము ◆ త్యాల మేల్కట్లు
గట్టిన గతి తార ◆ కా వితానంబు
దట్టమై యంబర ◆ స్థలిఁ బొల్పుమీఱెఁ
గినుకఁ గైకొని మీన ◆ కేతుఁడు విరహి
జనముపై వైచిన ◆ చక్ర మనంగఁ
గ్రొత్త మించులు గిఱి ◆ కొనఁ దూర్పుఁ గొండ
నెత్తంబుపైఁ దోఁచె ◆ నీరజారాతి
ఆ సమయంబున ◆ నమ్మహీనాథుఁ
డాసిద్ధవరుని పెం ◆ పాత్మ నూహించి
వితత సమాకర్ష ◆ విద్య యీభంగి
నితనికి సిద్ధించె ◆ నెద్దాని కలిమి
బలిమి నెవ్వని ప్రియ ◆ భామినినైన
నెలమి రప్పించి ని ◆ జేచ్ఛఁ గ్రీడింపఁ
గలవాఁడు వీని నే ◆ గతినైనఁ జంప
వలయు (నంచు) నిజాప్త ◆ వరుల మంత్రులను
రప్పించి తన విచా ◆ రము వారితోడఁ
జెప్పిన మనమునఁ ◆ జింతించి యకట
యీకుచ్చితపు బుద్ధి ◆ యీ నృపాలునకు
నేకీడు రానింత ◆ యెసఁగునో కాక
వలదన్న మా నెడు ◆ వాఁడు గాఁ డితఁడు
దెలుపరాదింక నే ◆ తెఱుఁగొకో యనుచుఁ
గలఁగి యొండొరులు మొ ◆ గంబులు చూచి

తలల వంచుటయుఁ ◆ బ్రధానుల లోనఁ
జనవరియగు నొక ◆ నచివుఁడా విభునిఁ
గనుఁగొని దేవ యీ ◆ కపట కర్మమునఁ
దగునె వర్ణాశ్రమ ◆ ధర్మబోధకులఁ
దెగ నాజ్ఞసేయ ధా ◆ త్రీ నాయకులకుఁ
బిలిపించి మది నీవు ◆ ప్రియపడి యడుగఁ
దలకొని తన మహ ◆ త్త్వము చూపెఁగాక
సొలవక సంసార ◆ సుఖములు రోసి
యెలమి యేకాకియై ◆ యీరీతిఁ దిరుగు
నతఁడేల చేయుఁ [69]బ ◆ రాంగనాసక్తి
నితరుల భంగి నూ ◆ హింతురే యిట్లు
తొలి తొలిఁ బ్రార్థించి ◆ తోడి తెచ్చుటకు
ఫలమెయిప్పుడు చంపఁ ◆ బంపు మనుటయు
నలఁకువు లేక మ ◆ హాత్ములఁ దొడర
వలదు నిష్కారణ ◆ వైరంబు పూని
నావుడు వినియు వి ◆ నని చెవుల్ చేసి
భూవల్లభుఁడు ప్రొద్దు ◆ వోయె మీరింక
పదఁడని యనిపి య ◆ భ్యంతర కేళి
సదనంబునకు నేగి ◆ శయనించె నంత
నల దేవశిల్పి జం ◆ భారి కొల్వునకు
నెలమి నిర్మించిన ◆ నెర [70] హేమమేడ
పొలుపున నరుణ వి ◆ స్ఫురణఁ గెంపారి
విలసిల్లు నుదయాద్రి ◆ విపుల శృంగమున
ఘనమైన మాణిక్య ◆ కలశమో యనఁగ
వనజమిత్రుఁడు తూర్పు ◆ వంక సొత్తెంచెఁ
దదనంతరమున ను ◆ ద్ధతి నిజాస్థాన
సదనంబు కే తెంచి ◆ జననాయకుండు
రత్న గోరక్కుని ◆ రప్పించి కపట
యత్నంబు నిరతి మి ◆ థ్యా వినయంబుఁ
గావించి మ్రొక్కి యె ◆ క్కడ మీకు నుండఁ
గా వేడ్కయయ్యె న ◆ క్కడికి విచ్చేయుఁ

డని వీడుకొని వేల ◆ మటు దాఁటిపోవ
ననిపించుటయుఁ బ్రీతి ◆ నతఁడు సౌరాష్ట్ర
పురికిఁ గ్రమ్మఱ సాగి ◆ పోవుచుండఁగను
ధరణీశుఁ డచట గు ◆ ప్త ప్రకారమునఁ
దెగువమీఱఁగ మృత్యు ◆ దేవతా నదృశు
లగువారిఁ బిలిచి మీ ◆ రతని యత్నమునఁ
బట్టి నట్టడవిలో ◆ పలఁ దలఁగొట్టి
రట్టుగాకుండ భో ◆ రన నొక చోటఁ
బాతి రండని వెంటఁ ◆ బంపిన వారు
నాతత రయమున ◆ నరిగి యా సిద్ధు
పిఱుదుగూడనె యేఁగి ◆ పెడగేలుఁ గట్టి
తఱమి కాననభూమి ◆ దరికి నీడ్చుటయు
వారిఁ గన్గొని సిద్ధ ◆ వరుఁడు మీకేల
దోరించి చన న రేం ◆ ద్రుఁడు మమ్ము నేమి
చేయఁ బుత్తెంచెఁ ◆ జెచ్చెర నట్లుచేసి
పోయి యాతనికిఁ జె ◆ ప్పుడు ముదం బెసఁగ
ననుటయు యోగితో ◆ నా భటు లనిరి
పనుపడ మారాజు ◆ బంపె నిన్‌జంప
నిలఁ బరాధీనుల ◆ కేలిక మనసు
కొలఁది నేపనియైన ◆ కోరి కావింప
వలయును గాని కే ◆ వల పాపములకుఁ
దలఁ గెద మనరాదు ◆ దలఁగిన యపుడె
మేకొనవలయు స్వా ◆ మి ద్రోహముకని
భీకరంబుగఁ గిన్క ◆ బిట్టు వ్రేయుటయు
నతని కంఠముదాఁకి ◆ యవ్వాఁడి వాలు
శతఖండమై మహీ ◆ స్థలమునఁ దొరఁగె
నది చూచి విస్మయం ◆ బడరి యందంద
పొదివి కుంతంబులఁ ◆ బొడిచిన నవియు
పొడి పొడియయె నంతఁ ◆ బోవకశిలల
వడినెత్తి నడునెత్తి ◆ వైవఁదోడ్తోన
శకలంబులై యున్నఁ ◆ జలమున మఱియుఁ
బ్రకటంబుగాఁ గాష్ఠ ◆ పటలంబు పేర్చి
యనలంబు దరికొల్పి ◆ యందులో వైవఁ

బొనుపడి భస్మమై ◆ పోయె నయ్యగ్ని
దాని తీరును జూచి ◆ తత్కంధరమున
గూనగిల్లఁగ నెత్తు ◆ కోలుగుం డొకటి
గట్టి యెంతయు లోఁతు ◆ గల యట్టిమడుఁగు
పట్టునఁ బడఁద్రోచి ◆ పై రాళ్లు వైచి
తేలకుండఁగఁ జూచి ◆ దిగ్గున మరలి
యాలస్యముడిగి ని ◆ జాధినాథునకు
నా విధంబెఱిఁగింప ◆ నరిగి రాలోన
వేవేగ బంధన ◆ విరహితుం డగుచుఁ
దా వారికంటెను ◆ దనరి తీవ్రముగ
భూవిభు నెదుట నే ◆ ర్పున వచ్చి నిలిచి
యోరాజ మదిఁగృప ◆ యొక్కింత లేక
దారుణాసురవృత్తిఁ ◆ దవిలి తన్నిట్లు
సమయింపు మని పంపఁ ◆ జనునె నీ కింత
తమకించి నాదెస ◆ తప్పేమియైనఁ
గలిగిన రాజవు ◆ గావె శిక్షింప
...... ...... ....... ....... ........ ........ ........
యే కారణము లేక ◆ యీరసం బొదవ
మాకు నల్గితివి భూ ◆ మండలాధిపులు
సిద్దుల నెలమిఁ బూ ◆ జింతురు గాని
బద్దవైరమున ని ◆ ర్భంధంబు చేయ
రటుగాన నీ దురి ◆ తాతి రేకమునఁ
గుటిలాత్మ భవదీయ ◆ కుల మెల్లఁ బోయి
నీరాజ్య భారంబు ◆ నీకిటమీఁదఁ
బూరగింపక చెడి ◆ పోవుఁ గాకనుచుఁ
బరుషాక్షరములుగాఁ ◆ బలికి యా సిద్ధుఁ
డరిగెను స్వేచ్ఛమై ◆ నంత తదీయ
శాపాగ్నిఁ గులమును ◆ స్వయము రాజ్యంబు
నే పణంగెను బోవు ◆ నే యిట్టికీడు

కృష్ణకందారభూపుని కథ.



రమణీయమగు మహా ◆ రాష్ట్ర దేశమున
నమిత వైభవముల ◆ కాస్పదంబైన
కందారమను పురి ◆ గలదు తద్విభుఁడు

బంధురకీర్తి సౌ ◆ భాగ్య సంపన్నుఁ
డతి ధైర్యశాలి మ ◆ హాదాన శీలి
వితత తేజుఁడు వైరి ◆ వీర భీకరుఁడు
సకల కళావేది ◆ సన్మార్గ [71]చారుఁ
డక లంకమతి విన ◆ యాన్వితుం డన్య
భామినీదూరుఁ డ ◆ ప్రతిమప్రతాప
ధాముఁడు గృష్ణ కం ◆ ధార భూపాలుఁ
డతఁ డతినియతిమై ◆ సర్ఘ్యతోయములు
ప్రతిదినంబును హేమ ◆ పాత్రిక నునిచి
తనకు నందించినఁ ◆ దరణి గైకొనుచుఁ
జను నభంబునకుఁ ద్రి ◆ సంధ్యలయందు
సురలు తచ్చరితంబు ◆ చూచి హర్షించి
గురుమతి నభివృద్ధి ◆ గోరుచుండుదురు
ఇట్టి మాహాత్మ్యంబు ◆ నిట్టి వైభవము
నిట్టి భాగ్యము లోక ◆ మెల్ల నుతింప
నుర్వి పాలింపుచు ◆ నుండి యారాజు
సర్వజ్ఞుఁ డొకనాఁడు ◆ సౌధాగ్రసీమ
నిలిచి నాగరలోక ◆ నియత ప్రచార
మెలమిమై వీక్షించు ◆ నెడ [72]మాదిఁ గాని
నెలఁతుక నగ్నయై ◆ నీరాడుదాని
లలిత లావణ్య వి ◆ లాస భావములు
తప్పక కన్గొని ◆ [73]దర్ప కాస్త్రముల
యొప్పున నిజ ధైర్య ◆ మూఁతయుఁ దప్పి
తన పెంపుఁ దొల్లిటి ◆ తగవును మఱచి
మనమునఁ దత్సంగ ◆ మంబు వాంఛింప
నమ్మఱునాఁడు సం ◆ ధ్యా సమయమున
నిమ్ముల నానృపుఁ ◆ డిచ్చు సర్ఘ్యములు
ముందటి వలెఁ బ్రియం ◆ బున నేగుదెంచి
యందుకొనండయ్యె ◆ నరవిందమిత్రుఁ
డది గనుఁగొని ఖిన్నుఁ ◆ డై యతఁడాత్మ
నిది యేమి చిత్రమో ◆ యినుఁడు నావలన
నెఱువైన కృపఁదప్పె ◆ నేఁడింక నేది

తెఱఁగొకో యనుచుఁ జిం ◆ తిలి (ధర్మశాస్త్ర)
(విదుల) రప్పించియ ◆ వ్విధ మెఱిఁగింప
మదిఁదలపోసి య ◆ మ్మానవ పతికి
వార లిట్లనిరి భూ ◆ వర నీవు ధర్మ
చారిత్రుఁడవు సర్వ ◆ జనసమ్మతుఁ డవు
సారసదాచార ◆ సరణి సన్మునులు
గారు నీ కెన పాప ◆ కర్మ మెయ్యెడల
నేదెస రూపింప ◆ నెఱుఁగరా దనిన
నేదోష బుద్ధి నేఁ ◆ డెసఁగెనో గాక
కమలబంధుఁడు నేఁడు ◆ గైకొనఁ డయ్యె
నమర నీచేతిహే ◆ మార్ఘ్య పాత్రంబు
నావుడు నమ్మహీ ◆ నాయకుం డాత్మ
భావించి [74] యపుడు వి ◆ ప్రతతి కిట్లనియె
వినుఁడు నా మది నుద్భ ◆ వించిన దురిత
మనఘాత్ములార సౌ ◆ ధాగ్రభాగమునఁ
గరమర్థి నేనుండ ◆ గత వాసరమునఁ
బురజనవ్యాపార ◆ ములు గనుఁగొనుచు
నవగతవసనయై ◆ యజిన [75] కారకుని
చపలాక్షి యొక్క తె ◆ సలిలంబు లాడఁ
జూచిన నా లోన ◆ సుందరిఁ గవయఁ
జూచితి నాలోన ◆ సూనాస్త్రుఁ డేయ
వడిఁ బురాకృత కర్మ ◆ వశమున నిట్టి
చెడుబుద్ది పొడమెఁ జే ◆ సిన పుణ్యమెల్లఁ
గాసియై పోయె పొం ◆ కము దప్పె నింక
నా సరివారెల్ల ◆ నవ్వఁ బాలైతి
నుల్లంబులోపల ◆ నొరుల భామినులఁ
దల్లుల మాఱుగాఁ ◆ దలఁచెడి మాకు
నీ మహాపాతక ◆ మేల సిద్ధించె
నేమిట నీదోష ◆ మేమి తరించు
ననుచుఁ బశ్చాత్తప్తుఁ ◆ డగు రాజుతోడ
ననిరి భూసురులు ప్రా ◆ యశ్చిత్త విధము
గల దిట్టి పనికి నా ◆ కర్ణింపు మధిప

లలి నీవు చూచిన ◆ లలన చందముగ
నినుమున నొకరూప ◆ మిపుడు చేయించి
ఘనవహ్ని నది యటు ◆ కాఁగ నూఁదించి
కడుముదమున ◆ కౌఁగిటఁ జేర్ప
నడఁగెడు నీపాప ◆ మనుటయు నట్ల
గావించి వారల ◆ కడకుఁ దెప్పించి
భావగతంబైన ◆ పాప మందఱును
వినఁగఁ జెప్పుచు నుగ్ర ◆ విస్ఫులింగములు
గనుకలి చెదర భీ ◆ కరభంగి నున్న
పరితప్తలోహరూ ◆ పముఁ బ్రీతిఁ గదిసి
పరిరంభణము చేయు ◆ పాట నవ్విభుని
నలమి చేపట్టి స ◆ య్యనఁ బాయఁ దిగిచి
రెలమి భూసురవరు ◆ లెల్ల నంతటను
నతని దోషము వాసె ◆ నరవిందహితుఁడుఁ
బ్రతివాసరంబుఁ బూ ◆ ర్వప్రకారమున
నలరి చేకొనుచుండె ◆ నర్ఘ్యపాద్యములు
వెలయ నీగతి నిజ ◆ వృజిన నిర్ముక్తిఁ
గని ధర్మశాస్త్రాధి ◆ కారులకెల్లఁ
గనకాంబరాదు ల ◆ గ్గలముగా నొసఁగి
ఘనసమ్మదమ్ము వి ◆ క్రమముఁ బాడియును
జనులెల్లఁ బొగడ రా ◆ జ్యము సేయుచుండె
నటుగొన్ని దివసంబు ◆ లరుగ నాతనికిఁ
బటుతరంబై నట్టి ◆ పాపయోగమునఁ
దొడరెఁ గుష్ఠవ్యాధి ◆ తోడనె తునిసి
పడియెఁ గరాంగుళ ◆ పాదాంగుళములు
ముడిఁగెఁ గర్ణములు మో ◆ మునఁ గంతు లొదవెఁ
గడు నుబ్బెఁ బెదవు లం ◆ గంబులు నెల్లఁ
దడిసెఁబెన్జెమటలఁ ◆ దలమయ్యె జిహ్వ
మడఁగె నాసాగ్రంబు ◆ మడమలు ముడిసె
పిక్కలు పద నింకి ◆ బీటలు వాఱెఁ
గక్క సమ్ముగఁ బొర ◆ గప్పె నేత్రములు
వేమాఱు పై గోఁక ◆ వెడలె రక్తంబు
చీమును నింతింతఁ ◆ జేరరాకుండ

నడరె దుర్గంధంబు ◆ నందంద ముసిరె
బెడఁగు మక్షిక మీపి ◆ వెట్టె నయ్యెడలఁ
దొడిఁదొడిఁ బురువులు ◆ దొలువంగఁ జొచ్చె
విడువ కీ రీతిఁ బ ◆ ర్వెడు తెవు లణఁపఁ
బూని యనేకు ల ◆ ద్భుతమైన మందు
లానృపాలున కిచ్చి ◆ రవి వృథాయయ్యె
మఱియంత నొకనాఁడు ◆ మానవాధిపుఁడు
తెఱఁగొప్పఁ దనకూర్మి ◆ తెఱవ నీక్షించి
మదిరాక్షి యీగతి ◆ మందిరాంతమున
నొదిఁగి యుండఁగఁ జాల ◆ నోరంతప్రొద్దు
నటుపోయి వచ్చెద ◆ నా వేఁటలీల
నటవీస్థలమునకు ◆ ననిన నయ్యింతి
వదలక నాథుతోఁ ◆ వలదు నీ కధిప
పదచార మలవాటు ◆ పడదు నీకధిప
కరిహయా రోహణ ◆ క్రమశక్తిలేదు
తిరముగా మృగముల ◆ దృష్టింపరాదు
గుఱిబాణసంధాన ◆ కుశలత్వమునకుఁ
గరములు సాగవే ◆ గతివేఁట జరుగుఁ
బనిలేని యలజడిఁ ◆ బడి వోవనేల
వనభూములకు నని ◆ వారింపఁ బూర్వ
పరిచిత మృగయాను ◆ బంధుఁడై మనసు
మరలింపలేక యు ◆ మ్మలికంబు తోడ
నందలంబెక్కి యొ ◆ య్యన నేఁగి మృగము
బృందంబు నెనఁబెట్టి ◆ వేఁట లాడించి
క్రమ్మఱఁ దనపురి ◆ కై వచ్చి వచ్చి
యమ్మార్గమున సలి ◆ లాశయం బొకటి
గని దప్పిగొనుటయు ◆ గరగవాఁ డపుడు
వెనుకఁ జిక్కుటయుఁ ద ◆ ద్విమలతోయములు
ద్రావి దేహమున ర ◆ క్తంబునఁ జాల
నేవంబులగు చీర ◆ లెడలించి మేన
నొదవిన చెమటతో ◆ నుదకంబులాడి
యుదికిన శాలువు ◆ నొనర ధరించి
నగరికి వచ్చి స ◆ న్మతి వీరభటుల

తొగలను దొరల మం ◆ త్రుల వీడుకొలిపి
యనురాగ మొదవ న ◆ భ్యంతరంబునకుఁ
జని కుబుసంబు ల ◆ చ్చటఁ దివుచుటయు
వెస మేఘపటలంబు ◆ విరిసినఁ బ్రభలు
దెసలఁ బర్వఁగ నొప్పు ◆ దినకరుకరణి
విలసిల్లువిభుఁ జూచి ◆ విస్మయానంద
కలితాత్మ [76]యయి ప్రియ ◆ కాంత యిట్లనియె
దేవ నీ మేన నొం ◆ దిన మహారోగ
మేవిధంబునఁ బాసెఁ ◆ నిది కడుఁజిత్ర
మెచ్చోటఁ దిరిగితి ◆ వెచటఁ గూర్చుంటి
వెచ్చటఁ బవళించి ◆ తేయాకుఁ దింటి
వే మహీరుట్ఛా య ◆ కేగితి ఫలము
లేమి భక్షించితీ ◆ వేలతాంతములు
తలఁబూని తెక్కడఁ ◆ ద్రావితి నీరు
తలపోసి చెప్పు మం ◆ తయు నాకు ననిన
వినుదేవి నేఁ బోయి ◆ వేఁటలాడించి
చనుదెంచుచోఁ జిక్కె ◆ సగ్గెడవాఁడు
కడుదూరమున దప్పి ◆ ఘనమైన యెండఁ
బడి నీరుకందువఁ ◆ బరికించుకొనుచు
నడవిలోపల సలి ◆ లాశయం బొకటి
పొడగని యుదక మి ◆ మ్ములఁ గ్రోలి మేను
గడిగి [77]నిర్మలినాంశు ◆ కమ్ములఁ గట్టి
తడయక వచ్చితిఁ ◆ దత్ప్రభావంబు
గానోపు నింతకుఁ ◆ గారణం బనుచుఁ
దానది ఘనముగాఁ ◆ ద్రవ్వింపఁ దలఁప
నా రాజుదేవియు ◆ నా సలిలంపు
భూరిశక్తికిఁ జిత్త ◆ మునఁ జాల మెచ్చె
మఱునాఁడు నృపతి స ◆ న్మణి భూషణములు
మెఱయ మెఱుంగులు ◆ మీఱ మైకాంతి
కొమురొప్పగాఁ బెట్ట ◆ కొలువున నుండి
[78]కొమరుల నిజనియో ◆ గులఁ బిల్వఁ బంప
వారునువచ్చి భూ ◆ వరుఁ జూచి యతని

దారుణ రోగంబు ◆ దలఁగి పోవుటయు
ఘన సమ్మదాశ్చర్య ◆ కలితులై రంత
మనుజ నాయకుఁ డాప్త ◆ మంత్రుల తోడఁ
దనపూఁపు చెప్పినం ◆ దలపోసి చూచి
...... ....... ....... ....... ....... ........ ......
దేవ క్లుప్తములైన ◆ తీర్థంబు లెల్ల
నీవసుంధర నున్న ◆ వెవ రెఱుంగుదురు
భావింప నదియును ◆ బటుపుణ్యసరసి
గావలయుటకు శం ◆ కాలవమైన
వల దట్టిదిఁకఁ ద్రవ్వ ◆ వారిపూరంబు
లలమినఁ గొఱఁతలే ◆ దటు గాక నింక
నడఁగుఁ గీర్తియు నప ◆ ఖ్యాతియు నొదవుఁ
జెడుఁ దీర్థపదము ని ◆ శ్చిత మిది యనిన
వారలతోడ భూ ◆ వరుఁడు నేనాత్మఁ
గోరి యొనర్పఁ జే ◆ కొనిన యీ కార్య
మెవ్వరు వలదన్న ◆ నింతఁ జాలింప
నెవ్విధంబునను మీ ◆ రెదురుపల్కకుఁడు
నావుడు వెఱచి మి ◆ న్నకయుండి రంత
వేవేగఁ బనివాండ్ర ◆ వేనవేల్ గూర్చి
యల సరోవరమున ◆ కరిగి యచ్చోట
జల దేవతా సమ ◆ ర్చనము గావించి
నిడుపు యోజనమును ◆ నింతవెడల్పు
కడులోఁతు నగునట్లు ◆ గా నిర్ణయించి
త్రవ్వింప నందు ◆ నూతన సలిలంబు
నివ్వటిల్లుట మాని ◆ నెఱని దొల్లింటి
యుదకంబులును బోయె ◆ నురగలోకమున
కదిచూచి వెండియు ◆ నచ్చలం బెసఁగఁ
దడయక త్రవ్వింపఁ ◆ ద్రవ్వింప నీరు
పొడవణంగెనె కాని ◆ పొడసూపదయ్యె
నవుడు చింతాక్రాంతుఁ ◆ డై భీతినొంది
విపులాధిపతి హత ◆ విధిని గర్హించి
మనమున నక్కట ◆ మంత్రుల మాట
విననైతి నాయవి ◆ వేకంబుకతన

ననుచితక్రియలచే ◆ నందునే ఫలము
పనిలేని సడియుఁ బా ◆ పముఁ గట్టుకొంటి
నలసి తెంతయు నిందు ◆ నధికారు లెల్ల
సొలసిరి త్రోవయుఁ ◆ జొప్పడదయ్యె
నని వితర్కించి గు ◆ ప్తాకారలీల
ననుదినంబును బట్ట ◆ ణాభ్యంతరంబు
గలయఁజరించి యె ◆ క్కడ నెవ్వరైన
బలువిడిఁగూడి సం ◆ భాషించువారు
గలిగిన నటువంటి ◆ కడలకు నరిగి
నెలమి వారలవంక ◆ నేవి శేషములు
వినఁబడునో యని ◆ వేడ్క నాలించు
ఘనులైనవారలఁ ◆ గదిసి భాషించుఁ
బరువడిదేవతా ◆ భవనస్థులైన
పర దేశ వాసుల ◆ భావంబు లరయు
నీరీతి మెలఁగెడు ◆ నెఱి నొక్కనాఁడు
గోరంటకుం డను ◆ గోరక్షశిష్య
వరుఁ డొక్క రుఁడును భూ ◆ వలయంబు గలయఁ
దిరుగుచు ముదము సం ◆ ధిల్లఁ దత్పురికి
నేతెంచి మున్ను మ ◆ త్స్యేంద్రుఁ డీపొంత
నాతత ప్రియకరం ◆ బగు నొక్క మడువు
కెలన దుగ్ధము లార ◆ గించి యాచమన
మెలమిఁ గావించి తా ◆ నేఁగె నిందుండి
యవి సిద్ధసలిలంబు ◆ లయ్యె నానీరు
చవిగొన్న వారలు ◆ [79]చావుఁగరంబు
నడఁచి యాయుష్మంతు ◆ లగుదు రా మడువు
కడకేగి చూతము ◆ గాని రమ్మనుచు
తన శిష్యుఁ దోఁకొని ◆ తత్పదంబునకుఁ
జని కుంభ భవపీత ◆ సలిలమై బయలు
[80]వడియున్న మున్నీటి ◆ బయలు చందమునఁ
గడు శూన్యమగు మహా ◆ గర్తంబు గాంచి
యచ్చెరువునుబొంది ◆ యా తెఱంగెల్ల
నచ్చటి జనముల ◆ నడి గది యెఱిఁగి

యిట్టి పాపముసేయు ◆ నే నృపుం డనుచు
నెట్టన వగచి తా ◆ నిజదేశమునను
నాసీనుఁడై యుండె ◆ నట్లున్న యతని
డాసి యంతంతటఁ ◆ దగిలి వెన్వెంటఁ
గనిపెట్టుకొని వచ్చు ◆ కందరపతియు
నెనయవారలఁ జేరి ◆ యరం ..... .....
..... ...... యుండిన ◆ యున్నట్లు దప్పి
కూరుట గోరంట ◆ కునితోడ శిష్యుఁ
డైన మోహనసిద్ధుఁ ◆ డల్లనఁ దనకుఁ
బానీయ తృష్ణ పెం ◆ పగు చుండెననిన
నవలసమీపము ◆ నం దొక వెల్ల
తివిసి యా క్రింద న ◆ తి స్వచ్ఛమైన
జలములు చూపిన ◆ సమ్మదం బొలయ
నలయ... ... ... .... ..... .... ..... .... .....
వెఱఁగంది దేవయీ ◆ వెరవున మహిమ
నెరయ నిందును నీరు ◆ నిండింపరాదె
యనవుడు నతఁడంత ◆ నా శిష్యునితోడ
వినుము ..... ....... ...... ...... ....... .......
వలనొప్ప నొక పతి ◆ వ్రత యావధూటి
పలుకున జలములు ◆ పడయంగవచ్చు
ననుచున్న చెవి యొగ్గి ◆ యాలించి కదిసి
వినుచున్నయట్టి పృ ◆ థ్వీనాయకుండు
ఏమంటి రిపుడు మీ ◆ రేగతి నిండు
నీమాటు మడుఁ గాన ◆ తిమ్మని యెత్తి
యడిగిన వారుదా ◆ రా ...... ....... .......
...... ....... ....... ...... ....... ...... ....... మున
నయ్యింతిఁదోడి తెం ◆ డని యొద్దివారి
సయ్యన బంపినఁ ◆ జనివారు నిలువ
నప్పుణ్యవతి పతి ◆ కనురాగ .... ......
...... ....... ...... ...... ....... ....... ...... .......
పలుకకుండినఁ గొంత ◆ వడియుండి వచ్చి
యెలమి నిత్తెఱఁగువా ◆ రెఱిఁగించుటయును
నొకసిద్ధపురుషుఁడ ..... ...... ...... ..... ...... ......

..... ...... ...... ...... ...... నొకమాటకొఱకుఁ
జీరి తెమ్మనిరని ◆ చెప్పుఁ డింకొక్క
మాఱు నావుఁడును గ్ర ◆ మ్మఱ నేగి యట్ల
చెప్పిన నం ...... ....... ....... ...... ...... .......
(చప్పున) వినియతి ◆ సంభ్రమంబునను
బో పొమ్మనిన వచ్చి ◆ ముందట నున్న
యా పతివ్రతకు ని ◆ ట్లనియె సిద్ధుండు
పొల ....... ........ ....... ....... ........ .......
వెలయింతు ననుచుఁ ద్ర ◆ వ్వింప నీ మడువు
దైవికంబున నది ◆ తప్పె నప్పటికి
నీవాక్యమున నీరు ◆ నిండెడి నింక
కైకొని చెఱు ...... ..... ...... ..... .... .....
...... ...... ...... తమి చెప్పి ◆ నట్లు చేసెదను
ధాత్రిపై మత్కల్పి ◆ తంబైన జలము
పాత్రమౌ దేవభూ ◆ ద్విజపాత్రులకును
నావుడు విద్వజ్జ ◆ నంబుల నృ.... .....
....... ....... ...... ..... ....... ....... ....... ........
యమర విప్రులకు యో ◆ గ్యంబుగా వనిన
రమణిఁబోఁ బనచి దు ◆ రంత సంతాప
భరితాత్ముడై యేగె ◆ పట్టణంబునకు
నరిగె సిద్ధుఁడు దేవ ◆ తాలయంబునకు
నంత వర్షాకాల ◆ మరుదెంచె భాను
మంతువేఁడిమిపెంపు ◆ మానెఁ దోడ్తోన
చఱచి పెల్లడరెఁ గ్ర ◆ చ్చఱఁ దూర్పుగాలి
తఱచుగా మెఱసె ను ◆ త్తరదేశ ముఖము
పొడిచెఁ బశ్చిమమునఁ ◆ బురుహూతుచాప
ముడువీధిఁ బర్వె నెం ◆ డొంట మేఘములు
కొనసాగె నుఱుముల ◆ ఘుమఘుమ ధ్వనులు
ఘనవృష్టి తతులు న ◆ గ్గలముగాఁ గురిసె
నుదిత వేగంబులై ◆ యుప్పొంగె నేళ్లు
నొదిగి చూపఱకును ◆ నొప్పె నన్యంబు
నెసఁగె మేదినియందు ◆ నింద్రగోపములు
ప్రసవించెఁ గేతక ◆ ప్రసన వాసనలు

మలయుచు నటియించె ◆ మద మయూరములు
చెలఁగెను జన వన ◆ స్థితిఁ జాతకములు
తత్సమయమున కం ◆ దారాధినాథుఁ
డుత్సాహి యైవెర ◆ వొప్పగాలువలఁ
గట్టగాఁ జేయించి ◆ కడఁక నమ్మడువు
పట్టుకు నీరు రాఁ ◆ బరుపఁగానవియు
మొదలి శుద్ధోదకం ◆ బులు దిగంబడిన
విదితరసాతల ◆ వివరంబునందు
వడియె నానీరు ని ◆ ల్వకపోయె నంత
పుడిసెఁడులేక య ◆ ద్భుతముగా నింకె
నప్పుడా జనపాలుఁ ◆ డంతరంగమునఁ
గప్పిన వగల న ◆ క్కటకట నాకుఁ
బాపంబు నిందయుఁ ◆ బ్రాపించె దీనిఁ
బాపుకొనంగ ను ◆ పాయ మేదియును
బొడగాననైతిఁ దెం ◆ పున శరీరంబు
విడిచెద నింకని ◆ వెడవెడఁ గూర్క
వడి నుదకాధిదే ◆ వత గలలోనఁ
బొడసూపి తాఁ జెప్పి ◆ భూవర నాకు
బలిగాను శూద్రులఁ ◆ బదివేలనొండె
వలనొప్ప వేవుర ◆ వైశ్యుల నొండె
నుతికెక్కు రాజుల ◆ నూర్వురనొండె
ధృతిమీఱఁ బదుర భూ ◆ దివిజులనొండె
నొకసిద్ధపుంగవు ◆ నొండె నొప్పింపు
ప్రకటమై నిలుచుఁ బూ ◆ ర్వప్రకారమున
సిద్ధజలం బని ◆ చెప్పి పోవుటయు
నద్ధరావరుఁడు స ◆ య్యన మేలుకాంచి
యరుణోదయంబైన ◆ నాచారవిధులఁ
బరిపాటిఁ దీర్చి గొ ◆ బ్బునఁ గొల్వునకును
జను దెంచి తనకల ◆ చందంబు సచివ
జనుల కెఱింగించి ◆ చనుచు లోపలికి
వారిఁ జేయుండన ◆ వారు నావార్త
వారక యాబలి ◆ వశమునఁ జెఱువు
నెసఁగు టెంతయు నిజం ◆ బను మాట కల్ల

పొసఁగ దెట్లని చెప్పి ◆ పోదము గాక
యనియుండ నారాత్రి ◆ నప్పురి సకల
జనముల కలలను ◆ సచివుల కలల
వచ్చి జలాధిదే ◆ వత రూపు చూపి
చెచ్చెర నృపునితోఁ ◆ జెప్పిన యట్లు
చెప్పిన మేల్కని ◆ చిత్ర మీతెఱఁగు
తప్పదు పొమ్మని ◆ తడయ కేతెంచి
యావిధం బంతయు ◆ నప్పుర జనులు
భూవరు సమ్ముఖం ◆ బున విన్నవింప
నంత విభుం డమా ◆ త్యావళి తోడ
మంతనంబునను నే ◆ మాడ్కి సిద్ధించు
నీ కార్యమనుచు నొ ◆ క్కింత చింతింప
నా కార్యగతిఁ దె[81]ల్ప ◆ నందొక్క ముఖ్య
సచివుఁడిట్లను మహీ ◆ శ్వర విప్రవధము
ప్రచుర పాపములలో ◆ పల నధికంబు
భూపాలహింసకుఁ ◆ బూనుట తలఁప
నేపారువ్యధలకు ◆ నెల్ల మూలంబు
భయ పెట్టి వణిజులఁ ◆ బట్టి చంపింపఁ
గ్రయవిక్రయాదు లొ ◆ క్కటఁ బొడవడఁగుఁ
దొరపడి శూద్రులఁ ◆ దునుమ భూప్రజలు
కరము బెగ్గిలి యొండు ◆ కడ కేఁగ వలతు
రూరూరఁ దిరుగుచు ◆ నొక గుడిపంచఁ
జేరెడి జోగులఁ ◆ జేకూరఁ బట్టి
తొడిఁబడి చంపింప ◆ దోషంబు సడియుఁ
దొడరు హానియు వచ్చుఁ ◆ దుది నటుగాన
సనపరాధుల నట్లు ◆ నణఁగింపఁ బూనఁ
జనదు కారాగార ◆ జనముల లోన
వడిఁ జెఱఁ బెట్టిన ◆ వారిఁ దెప్పించి
తడకయ జల దేవ ◆ తకు బలి యొసఁగు
మనవుడు నగుఁ గాక ◆ యని యట్టివారిఁ
బనిగొని తెప్పించి ◆ పదివేలు గూర్చి
మడుఁగు పొంతకుఁ జొచ్చి ◆ మడియింప నున్న

యెడ నవ్వసుంధరా ◆ ధీశుని కొల్వు
వెలఁదుల కొకరి కా ◆ వేశంబు వచ్చి
పలికె నిట్లని మహీ ◆ పాల నే నుదక
దేవత నన్ను నా ◆ తెఱఁగున మొఱఁగి
చావునకై చెఱ ◆ సాల మున్నిడిన
పినుఁగుల [82]నర్పింప ◆ బెడియును వీరిఁ
బనివడి తెచ్చుట ◆ పంతంబు నీకు
నొల్లనే నిట్టి క ◆ ష్టోపచారములఁ
(దెల్లం)బుగాఁగోర్కెఁ ◆ దీర్చెదవేని
యే కళంకులు లేక ◆ యేసారువారి
నాకు నర్పింపు ము ◆ న్నతిని నట్లైన
భూగతంబై యింకి ◆ పోవక నిలుచు
నీగతి చెఱువున ◆ నెల్ల కాలంబు
తోయం బనావృష్టి ◆ దోషంబు లేక
శ్రీయువర్ధి లునని ◆ చెప్పి యాపడఁతి
పై నిజావేశంబుఁ ◆ బాపి తొలంగె
నానరేంద్రుం డమా ◆ త్య శ్రేణితోడఁ
దన నగరికి వచ్చెఁ ◆ దద్విధ మపుడు
ననువు విచారింప ◆ నప్పురం గలుగు
విప్ర బాహుజ వైశ్య ◆ వృషల సంఘంబు
లప్రమోదంబున ◆ నతిభీతిఁ బొందఁ
దమ చావు లొకజాడఁ ◆ దప్పించుకొనెడి
క్రమము విచారింపఁ ◆ గా విప్రు లప్పు
డొకచోటఁ గూడి యీ ◆ యుర్వీశుఁ డకట
ప్రకట మదాంధుఁడై ◆ బ్రహ్మ హత్యలకు
నింతయుఁ గడగునె ◆ యిల "బ్రాహ్మణోన
హంతవ్య" యనువాక్య ◆ మదియుఁ దా వినఁడె
మున్నిట్టి పాపక ◆ ర్ముల నిలలోన
నెన్నఁడై నను వింటి ◆ మేరాజులందు
బలిమిమై విప్రులఁ ◆ బట్టి భక్షించు
నల బకాసురుఁడు వీఁ ◆ డై పుట్టెఁబోలు
నీ దురాత్మకు సీమ ◆ నేల వసింప

నే దేశములకైన ◆ నేఁగుద మింక
నిందున్న మృతి తప్ప ◆ దితనిచేఁ ద్రోవ
యందుఁ జోరులు ప్రాణ ◆ హానిఁ గావింప
[83]రర్థ నాశమె కాని ◆ యనుచు నందఱును
దీర్థయాత్రలు సేయు ◆ తెఱఁగు నటించి
కుఱుపట్టు గొడుగులుఁ ◆ గోలలుఁ గావి
[84]యఱల దోవతులు నో ◆ రచ్చు చెప్పులును
దేవపూజలుఁ గర ◆ దిత్తులుఁ గంచి
కావళ్లు మాత్రలుఁ ◆ గైకొని వెడలి
తత్తరింపుచు వెంటఁ ◆ దలవరు లెఱిఁగి
వత్తురో యను భీతి ◆ వారక గునుకు
బరువు వెట్టుచుఁ దొట్రు ◆ బడుచుఁ బల్మాఱు
తిరిగిచూచుచు దారిఁ ◆ [85]ద్రెళ్లుచు శిఖలు
విడఁ గచ్చ లురుల బ ◆ ల్విడిఁ జమరింప
నడుఁకుచుఁ జనిరి నా ◆ నాపదంబులకు
మఱియంత రాజ కు ◆ మారు లాచంద
మెఱిఁగి యందఱుఁ గూడి ◆ యిది యేమి వీఁడు
కర్జంబు దలఁపక ◆ కడగి యసంఖ్య
దుర్జనంబులు చేయఁ ◆ దొడరె నేఁడిట్లు
తనపాలి దైవంబుఁ ◆ దా నే మెఱుంగు
మనకేమి కొఱఁత నె ◆ మ్మది నిండ్లకడల
నుండఁగాఁ దానూర ◆ కుండిన లెస్స
కండక్రొవ్వున నటు ◆ గాక రోషించి
పట్టఁ బంపినఁ బట్టు ◆ వడి దీను లగుచు
నట్టి పెల్లలలోన ◆ వసమఱి చచ్చి
యిహపరంబులు రెంటి ◆ కెడయగు టరయ
మహిలోన రాచధ ◆ ర్మము గాదు గాన
బలిమిఁ జూపుద మట్టి ◆ పట్టునంగూడి
[86]యిలనగును యశంబొ ◆ మృత్యువోయనుచు
ఘనయుద్ధమునను బ్రా ◆ కటముగానిల్త
మని దృఢనిశ్చయు ◆ లై యుండి రంత

గుడికూటముల రచ్చ ◆ కొట్టములందుఁ
బడియున్న జోగులు ◆ పద పద మనుచుఁ
గళవసంబులు జాఱ ◆ గంతలు దూలఁ
గళవళింపుచుఁ జంకఁ ◆ గప్పెర లూడి
[87]పడునెడ విడనాడి ◆ పాఱిపోఁ దొడఁగి
రెడపక యీ విధం ◆ బీక్షించి వైశ్యుఁ
డొక్కఁడు తన తండ్రి ◆ కొదిఁగెఱిఁగింపఁ
దక్కటి సెట్లు నా ◆ తనిఁ బిలిపింపఁ
జేరి కోమటి బాస ◆ జెప్పెఁ “బట్టింపు
భూరాము సల్లెడు ◆ భూరాము లొండె
మరి కెంబు బోడద ◆ మ్మని నొండె నతని
దరిమి గాలము త్రాట ◆ దమ్ముల నొండె
మలుచంపు బుడుగుల ◆ మాసల్లె డొండె
మలయక కాలము ◆ మాసల్లెడైన
వెలుకుల నొండేను ◆ వెస జెర్వులోనఁ
దిలకింత మనుచుఁ జిం ◆ తింపు చున్నాఁడు
చిరుపల మెట్టి జె ◆ చ్చెఱ నొండు కడకు
సురిఁగించి మనము పం ◆ జులలోన నొరుల
నునిపి బేరము వోవు ◆ నొరపిన భీతి
గొనుచు గమ్ముక యుండ ◆ గుణము గా"దనిన
కడుపులోపలఁగలఁ ◆ గఁగ గుండెలవిసి
నడుములు విరిగి ప్రా ◆ ణము మీఁదఁబోయి
పిడు గడిచిన రీతిఁ ◆ బెను రిమ్మపట్టి
పడియుండి కొంత సే ◆ పటికొయ్యఁ దెలిసి
నగరంబు వార లీ ◆ నగరంబులోన
నెగు లొంద రెన్నఁడు ◆ నేఁడిదె తుదకు
నితని తరంబున ◆ నీచేటు వచ్చెఁ
బ్రతికూలి యయ్యె మా ◆ పాలిదైవంబు
మొదల నర్థప్రాణ ◆ ములు గోలుపోయి
పిదపఁ జేసెడిదేమి ◆ పెనువగఁ దొలఁగ
నలయు నంచును బెడ ◆ వాకిళ్ల వెడలి
యలుగులమై జన ◆ నడ్డమై యెదిరి

యదలించి యిదియేమి ◆ యనియెడువారి
కొదవంగ లంచంబు ◆ లొసఁగెడు వారు
గ్రక్కున రాచలెం ◆ కలఁ బొడగాంచి
నక్కల వడువున ◆ నణఁగెఁడు వారు
వ్రేలెడు బొజ్జల ◆ వ్రేఁగున నెందుఁ
బోలేక పొరిగిండ్ల ◆ పొంతల డాఁగు
వారు నై రంత న ◆ వ్వార్త లెఱింగి
బీరంబు చెడి శూద్ర ◆ బృందంబు బెగడి
మన పెద్ద లెల్లను ◆ మనిన తా వనుచు
నొనర నెందును బోక ◆ యుంటి మిన్నాళ్లు
విడువఁ బాలయ్యె నీ ◆ విభుఁడు ద్రవ్వించు
మడువు కతంబున ◆ మన యిండ్ల పట్టు
కడుపు కూడెక్కడ ◆ గట్టడి మఱియుఁ
బడిచావఁగా నీడ ◆ ఫల మేమి గలదు
క్షితిఁ దాత గట్టిన ◆ చెఱువున మునిఁగి
మృతిఁ బొందవచ్చు నే ◆ మే మెయి నుండి
బ్రదుకంగ వలసినఁ ◆ బదఁ డొండుకడకు
నదిగాక ప్రాణంబు ◆ నమ్మనివారు
నుండుఁ డీయెడ నంచు ◆ నొండొరుఁ గడవ
నొండుచోటికిఁ జనిఁ ◆ రుర్వీశుఁడంత
సచివానుమతి శూద్ర ◆ సమితిఁదే నంపఁ
బ్రచరించి యనుకింక ◆ రాకృతి మెఱయు
తలవరుల్ గరవాల ◆ దండ పాశముల
నలవుమైఁ బూని బి ◆ ట్టదలించి కదిసి
కొట్టి పోనీక చి ◆ ల్కుల మెడఁబెట్టి
కట్టంగఁ దొడఁగినఁ ◆ గనుకని చెదరి
యీరంపు పొదలలో ◆ నీఁగియుఁ గదలి
పాఱఁ జాలక చెట్టుఁ ◆ బ్రాఁకి గోతులను
బడెలలో డాఁగియుఁ ◆ బఱవైన వాఁగు
మడలలో నడఁగియు ◆ మగువల సుతులఁ
గొనుచుఁ జయ్యన జీబు ◆ కొనియున్న కసవుఁ
జనఁజొచ్చి మెదలక ◆ చాఁగిలిపడియు
గొదికిలబడి భీతిఁ ◆ గొని బిక్కగుండె

లదర వాతెఱలెండ ◆ నంగముల్ వణఁక
ననదలఁ గావ రె ◆ యని వేళ్లు గఱచి
కొనియు ననేక భం ◆ గుల నతిదైన్య
మును జూపఁ దటకము ◆ పొంతకుఁ దెచ్చి
యునిచి రవ్విధమంత ◆ నొయ్యనఁ దెలిసి
గోరంటకుఁడు శిష్యుల ◆ గూడి యచ్చటికిఁ
జేరి వారలఁ జూచి ◆ చిత్తంబులోన
దయలేక యక్కట ◆ ధరణీశ్వరుండు
నయమేది పాపంబు ◆ నకు రోయఁ డయ్యె
దీనుల నొఱలఁగాఁ ◆ దెగటార్చి పిదపఁ
బూని తాఁ జేసిన ◆ పుణ్య మేమిటికి
మును “అహింసా పర ◆ మో ధర్మ" యనుచు
వినుతింతు రటుగాన ◆ విడిపింతు వీరి
నే వెరవునైన ◆ నిప్పు డే ననుచు
నా వసుధాధీశు ◆ నల్లన కదిసి
యోరాజ పలువుర ◆ నొఱలఁగాఁ దునిమి
నీ రిందు నిలుపఁగా ◆ నీకేమి ఫలము
గల దిట్టి దారుణ ◆ కర్మంబువలనఁ
దలపోయ భూపాల ◆ ధర్మ మదేమి
ప్రజలును నవ్వరే ◆ పాటింపకుండ
నిజముగా రక్షించు ◆ నీవె యీరీతిఁ
బట్టి యెఱిఁగియుఁ జం ◆ పఁగఁ బూనితేని
నెట్టన దిక్కుగా ◆ నిలుచు వా రెవరు
ఏల యీ పెక్కండ్ర ◆ హింస గావింప
...... ...... ...... ....... ....... ....... ........
భావింప నీతని ◆ భావ మీజాడ
....... ...... ...... ....... ..... ..... .......
...... ....... ......... ....... కొంటి లేని
అనవుడు జననాథుఁ ◆ డాతని మున్ను
...... ...... ..... ..... ◆ నీ చెప్పినట్లు
కావింతు నీ తటా ◆ కంబున జలము
లడఁగకుండినఁ జాలు ◆ ననియె గోరంట
కుఁడుబల్కె నప్పుడు ◆ గోరక్షనాథ

గురుని శిష్యుఁడ నేను ◆ గోరంటకుఁడను
తిరుగదు నెప్పుడు ◆ దేశంబులోన
నీ తటాకంబు నీ ◆ వెలమిఁ గట్టింప
నాతత జలశూన్య ◆ మగుటకు వగచి
జలదేవతా వాక్య ◆ సరణిమై నిపుడు
పలువురఁ బోలఁగాఁ ◆ బట్టిన తెఱఁగు
జనపరంపరచే ని ◆ జమ్ముగా నెఱిఁగి
విని మాన్ప వచ్చితి ◆ వినవె యవ్విధము
ఘనతరంబైన యీ ◆ గర్తమధ్యమునఁ
దనరారు నొక రసా ◆ తల వివరంబు
వారక చనుదెంచు ◆ వారిపూరములు
భోరున దిగఁబడి ◆ పోవు నాత్రోవఁ
గట్టింపు మొక శివా ◆ గార మా జలము
పట్టున నందు లో ◆ పలనే వసించి
కడ తలుపులు మూసి ◆ గడియలు పెట్టి
తడవ నిర్మలినమై ◆ తనరెడు నశ్వ
రత్నంబు నెక్కి వా ◆ రక తోలు కొనుచు
యత్నంబుతోడ నీ ◆ పరుగఁగా జలము
తఱిమెడి నీ పిఱుం ◆ దనె చనుదెంచు
మరలి నిల్చినచోట ◆ మరిరాక తక్కు
గుడిలోన నట్లుండి ◆ కొంత కాలంబు
గడచిన వెడలి ది ◆ గ్గన వత్తు నేను
అనవుండు ముదమంది ◆ యా సిద్ధవరుని
వినుతించి యట్ల కా ◆ వించిన నతఁడు
తొలుతను జఱల శూ ◆ ద్రుల విడిపించి
యెలమి నచ్చట జను ◆ లెల్ల వీక్షింప
నలఘు పాతాళ మ ◆ ధ్యమునఁ దటాక
బిలమార్గ కల్పిత ◆ పృథు శివాలయము
లోపలఁ జొచ్చి త ◆ ల్పులు మూసి ఘడియ
లేపార సంధించి ◆ యెఱుఁగఁ జెప్పుటయు
నతికౌతుకాత్ముఁడై ◆ యమ్మహీవరుఁడు
ప్రతిలేని జనమునఁ ◆ బవనుని మీఱు
మదలాశ్వమును నెక్కి ◆ మసలక వాగె

వదలించి యదలించి ◆ వడిఁ గదలించి
రాగల నొత్తి త ◆ ఱటున వేయుటయు
నేగతి నెవ్వరి ◆ కెఱుఁగఁ జొప్పడని
వడిబాఱు వాగె నమ్మహా ◆ శ్వం బావహింప
బడిన తోయంబు ని ◆ బ్బరమున వెడలి
వితత ఫేనారవ ◆ వీచికా వర్త
తతుల మున్నుగ నిరం ◆ తర శీకరములఁ
దను ముంచుకొని సము ◆ ద్రము ... ....
...... ....... ....... ....... ....... ....... ..... .....
నతుల విస్మయ కలి ◆ తాత్ముఁడై తాల్మి
మతి నిలువకయక్ర ◆ మ్మఱి చూచునంత
బారెడు ...... ...... ....... ...... ...... .......
........ ....... ....... ....... ....... ....... ...... ......
....... ....... ...... ...... .......భరిత
చిత్తులై మూఁగి వీ ◆ క్షించు జనంబు
లాసిద్ధ వరుని మ ◆ హానుభావంబు
భాసురంబగు నా నృ ◆ పాలు భాగ్యంబు
ఘనమైన యా తటా ◆ కము విశేషంబు
వినుతి సేసిరివేన ◆ వేలు చందముల
...... ....... ...... ..... ...... ...... ...... ......
నడర భూవిభుఁడు ◆ నిష్టాన్న సువర్ణ
దంతి తురంగ గో ◆ ధనధాన్య దాన
........ ......... ....... ....... ........ .......
వస్త్ర భూషణ భూమి ◆ వర దానములును
శాస్త్రోక్తముగ నగ్ర ◆ జన్ముల కిచ్చి
పురమున కేఁగి సం ◆ పూర్ణ భోగములఁ
జిరలీల రాజ్యంబు ◆ సేయుచు నుండె
నని చతుర్దశ భువ ◆ నాధీశు పేర
వినుత వేదాగమ ◆ వేద్యుని పేర
సేవకోత్పలషండ ◆ శీతాంశు పేర
భావనాతీత ప్ర ◆ భావుని పేర
గంగాతరంగ సం ◆ గత మౌళి పేర
శృంగీశతాండవ ◆ ప్రీతాత్ము పేర

ఘనముక్తి శాంత భి ◆ క్షావృత్తి హృదయ
వనజప్రభాత ది ◆ వాకరు పేర
నభిమతార్థప్రదా ◆ యకు పేర నిత్య
శుభమూర్తి మల్లికా ◆ ర్జునదేవు పేర
నారవి తారశ ◆ శాంకమై వెలయు
గౌరనామాత్య పుం ◆ గవ కృతం బగుచు
నను వొందు నీ నవ ◆ నాథ చరిత్ర
మను కావ్యమునఁ బంచ ◆ మాశ్వాస మయ్యె
నయ మొప్ప నీ నవ ◆ నాథ చరిత్ర
రయమునఁ జదివిన ◆ వ్రాసినవారు
ననిరళ భోగ భా ◆ గ్యంబులు గలిగి
భువిలోన నత్యంత ◆ పుణ్యు లగుదురు


___________
  1. నొకనాడు కరుణ.
  2. మిశ్ర.
  3. ఇట్టిప్రయోగములు శైవకవిత్వమునఁ బ్రసిద్ధములు.
  4. వలయమున.
  5. నొగిరత్నర సముచ్యయోఖ్యయులీల.
  6. నలబలాయక.
  7. ఖచరంబుగలిమి నాఖచరకాలములు.
  8. నిగుడునల.
  9. బులులొసగు.
  10. తమరపంబగుచు.
  11. కలుషపంబులుంజేరి.
  12. నెరయు నంగశృంగ.
  13. వాసవందనపుకైవడి.
  14. చలిగొండ.
  15. కరుణయు.
  16. విద్య.
  17. నొడపక.
  18. నాతపానీనులై.
  19. గంధగితవినూత.
  20. కార్జునమహానగరు.
  21. నెన్నెదుర.
  22. పూజారుహంబులై, అర్హ శబ్దమునకు ఆరుహమని శివకవుల గ్రంథముల గననగును.
  23. సురలు పాదుకలును.
  24. నెలవుకొనియట్టి యానిర్మల.
  25. రోగార్థులను ... దాల్చి.
  26. నడరగా.
  27. చేయ అను దానికి రూపాంతరముగా గవి వాడినట్లున్నది.
  28. ప్రభుదేవరకు నిట్లనియె
  29. యీ క్రొత్తవిధియాలనీవు.
  30. గుంమ్మి.
  31. గారిన్నాంబు.
  32. యాతనిని.
  33. నాఖడ్గ
  34. నిజనందములను పలికికీర్తియుంబది.
  35. నాయధప్రకర
  36. నియ్యరుదనగ
  37. మొల్లంగం బసూన.
  38. దర్పితారాతి.
  39. గొంద్ది.
  40. పోకుండ్డ మదిలోన బుద్ధినూహించి.
  41. నెఱింగింపనది యిడెంజాముబూని.
  42. నృపులకు మరియాదగాదు.
  43. ఇచ్చట 151 తాళపత్రములో సగముభాగము శిథిలము.
  44. ధాతుగా.
  45. వెసజల్లు.
  46. దలఁగక
  47. నేమందులను గాలమృత్యువు
  48. కాలమందునట్టియేగిన నేననై కాదు.
  49. బ్రాహ్మణావిరోధమున.
  50. తధ్యమానములె.
  51. నాగిరీశునికోర్కె నగువానికైన.
  52. కారూపుయసమున.
  53. హరిగైరి.
  54. బల్ల మహాక్షోణిపోలితం.
  55. ప్రయోగమున.
  56. కృష్ణాక్రొత్తతైలంబు.
  57. రూపున.
  58. వినుము.
  59. లవుకికక్రియలు
  60. నెరయ జూపుము
  61. మంత్రినిత్తాంతులార.
  62. సిద్ధశాపమునం బొలశ
  63. బెల్లగుం డ్డనుచు
  64. వేల్మిడి.
  65. రవియుంగరములు.
  66. గూడ ననురాగ మొదవ
  67. సమాసిక్తంబు
  68. నెదిరిన
  69. జేయన్యయాంగనాశక్తి.
  70. వ్రాత ప్రతినిబట్టి యీపాఠము గ్రహింపఁబడినది. పైడి మేడయని సవరించిన సవరింపవచ్చును.
  71. నరసిండకలంక.
  72. నెడమదిదాని.
  73. ధర్మశాస్త్రముల.
  74. యవ్విప్రపతికి నిట్లనియె.
  75. నారకుని.
  76. యుత.
  77. నిర్మలినలింగమున
  78. కొమలనిజయోగుల.
  79. జాలనికరంబు.
  80. బయలున్న.
  81. ల్సియందొక్కసచివు, డిట్లు మహేశ్వరయీప్ర.
  82. నొప్పింపబెడగను
  83. నందునాశమె.
  84. యెఱ్ఱదోవతులుగోరచ్చు.
  85. దాకితెల్లుచు.
  86. యలయశోవా మృత్యుదేవత యగుచు, ఘనయజ్ఞులును హాటంబుగా బలుకు.
  87. పడనెఁడవారాడ.