నవనాథచరిత్ర/చతుర్థాశ్వాసము
నవనాథచరిత్ర
చతుర్థాశ్వాసము
శ్రీవిలసిల్ల నా ◆ సిద్ధ యోగీంద్రుఁ
డావలఁ గొంత ద ◆ వ్వరుగుచునుండ
నెలుకలుఁ బిల్లులు ◆ నెలమిమైఁ గూడి
పులులును గోవులుఁ ◆ బొందొంది పొసఁగ
సింగంబులును గరి ◆ శ్రేణులెసంగ
ముంగిసలును సర్ప ◆ ములును బొందొంది
గడిఁదిరేచులు శశ ◆ కములును గదిసి
వడిమీఱు లేళ్లు శి ◆ వంగులుఁ గదిసి
బలుసాళువములును ◆ బక్షులుఁ దొరసి
చెలఁగ నచ్చెరువంది ◆ శిష్యు లందఱును
ముదమారఁ గరముల ◆ మొగిచి యిట్లనిరి
మదనారిసుతుఁడై న ◆ మత్స్యేంద్రునకును
గురునాథ పశుతతి ◆ [1]కూడి యన్యోన్య
విరసత్వ ముడిగి యీ ◆ విధమునఁజేరి
యున్న చందము వెరఁ ◆ గొందించె ననుచు
విన్నవించిన నవ్వి ◆ వినుతింప నొప్పు
మునుల పుణ్యాశ్రమం ◆ బులఁ గల్గు ప్రాణు
లనిశంబు వైరమ ◆ న్యోన్యంబునొంద
వనుచున్న వేళ సం ◆ యమికుమారకులు
ఘనసమిత్కుశఫల ◆ కందమూలముల
కాచోటి కేతెంచి ◆ యమ్మీన నాథుఁ
జూచి తదీయ తే ◆ జో విశేషమున
నరుదంది గోరక్ష ◆ నాథుల నడిగి
తిరముగా నయ్యోగి ◆ తెఱుఁగెల్లఁ దెలిసి
యొసరఁ గౌతుకమున ◆ నొండొరుఁ గడవఁ
జని ముఖ్యులగు ముని ◆ జనములతోడ
నెందు నెన్నఁడుఁజూడ ◆ మిట్టి మహాత్ము
నిందు శేఖరుఁడు దా ◆ నీ జగంబునకుఁ
జరియించు వేడుకఁ ◆ జనుదెంచె ననఁగ
నురుతర భక్తి శి ◆ ష్యులు దన్నుఁగొలువ
భూనుతమహిమసొం ◆ పునఁ బెంపుమీఱు
మీననాథుండను ◆ మేటి సిద్ధుండు
వచ్చుచునున్నాఁడు ◆ వాఁడుపో యనిన
నచ్చెరువునఁ గుతూ ◆ హలము సంభ్రమము
లందుచు నిజహృద ◆ యారవిందంబు
లందు సందడిగాను ◆ నమ్మహామహుని
నాదివ్య యోగీంద్రు ◆ నా జగత్పూజ్యుఁ
[2]బోదాము దర్శింపఁ ◆ బొదఁడని యనుచు
డాలుగడ్డములు కుం ◆ డలములు మెడల
వ్రేలుజన్నిదములు ◆ వ్రేళ్ల దర్భలును
భూతిపూఁతలు దేవ ◆ పూజ సజ్జలును
నాతతకృష్ణాజి ◆ నాంబరంబులును
నలుదరుద్రాక్ష తా ◆ వళములు నక్ష
వలయంబులును నిడు ◆ వాలై న జడలు
వినుత [3]నదీపుణ్య ◆ విమలాంబుపూర్ణ
ఘన [4]కమండలములు ◆ గరుడ మాణిక్య
కాండంబులను బస ◆ గమకించు వేణు
దండంబులుసు ఘోర ◆ తపమునఁ జాల
నలజడిఁబడి గృశ ◆ మైన దేహములు
నలవడ నేతెంచి ◆ యమ్మహామునులు
తనుఁ బదివేలు చం ◆ దముల దీవించి
వినుతులు గావింప ◆ వికసిల్లి వారిఁ
గరుణామృతము నిండఁ ◆ గడలొత్తు చూడ్కిఁ
బరిపాటి నందఱఁ ◆ బరగ వీక్షించి
చెన్నొంద వేర్వేఱ ◆ సేమంబు లడిగి
మన్నించె నెంతయు ◆ మత్స్యనాథుండు
దాన నుప్పొంగి సం ◆ తసమున మునులు
మానసంబున భక్తి ◆ మల్లడి గొనఁగఁ
జేతులు మొగిడించి ◆ సిద్ధయోగీంద్ర
భూతేశనందన ◆ భువనైకపూజ్య
నేఁడు నూతపముల ◆ న్నియు ఫలియించె
నేఁడు మా జపము ల ◆ న్నియును సిద్ధించె
నేఁడు మా కోర్కెల ◆ న్నియు సంభవించె
నేఁడు శివుండు స ◆ న్నిధియయ్యె మాకుఁ
బరమపావన భవ ◆ త్పాద సంస్పర్శఁ
బొరసి మాయాశ్రమ ◆ భూము లన్నియును
నతి విచిత్రంబులై ◆ యమరెఁ గారుణ్య
మతి నింక నరుదెంచి ◆ మా మఖశాల
లలర వీక్షించి కృ ◆ తార్థులఁ జేయ
వలెనని యాయోగి ◆ నరునిఁ దోడ్కొనుచుఁ
జని యర్ఘ్యపాద్యాది ◆ సముచితవిధులు
దనరఁ గావించి ప్ర ◆ త్యాహవనమున,
దీపింపఁగా భక్తి ◆ ధేనుదుగ్ధములు
దీపులంటఁగ నిచ్చి ◆ తృప్తిఁ పొందింపఁ
దాను శిష్యులు ప్రమో ◆ దంబు నిండార
[5]నేను రాత్రంబులు ◆ నిచ్చ వసించి
కదలి మర్నాఁడు ఋ ◆ క్షకుని యాశ్రమముఁ
గదియఁబోవఁగఁ ద్రోపఁ ◆ గలగల మ్రోయు
కారాకుఁ బ్రోవులోఁ ◆ గానరాకుండ
బారుదూలమువలెఁ ◆ బడియున్న పాము
నడుము దిగ్గన మీన ◆ నాథుండు ద్రొక్క
వెడఁదగా విప్పి బల్ ◆ విడిఁబడగెత్తి
యడరించి జిహ్వల ◆ ల్లార్చి బిత్తరము
నొడియుచుఁ గన్నుల ◆ నొగి నిప్పులురుల
మిడికించి కోఱలు ◆ మెఱవంగ నోర
నుడుగక భగభగ ◆ నొదవు పూత్కార
జనిత విషాగ్ని న ◆ చ్చటి పొదల్ గమర
ఘనతర భీషణా ◆ కారతఁ బేర్చి
యంతలోననె యమ్మ ◆ హా భుజగంబు
వింతగా మానవ ◆ వేషియై నిలువఁ
గని మీననాథుఁ ◆ డెక్కడఁ బొడగాన
మెనయ నేమిటి కిందు ◆ నిట్టి విచిత్ర
మని వెఱఁగందుచు ◆ నతని కిట్లనియె
మును భుజంగాకార ◆ మున నేఁచి యిపుడు
మనుజుఁడ వయిన యా ◆ మార్గ [6]మెఱుంగ
వినుపింపు మనుటయు ◆ వినతుఁడై వాఁడు
తనపూర్వచరిత మం ◆ తయుఁ దెల్లముగను
వినుమని ముదమార ◆ వినుతించి పలికె
నాగార్జున సిద్ధుని కథ.
నిలలోనఁ దొల్లి న ◆ రేంద్రజిత్తనఁగఁ
గలఁడిందువంశ శే ◆ ఖరుఁడగు నృపతి
యారాజు సతి మాళ ◆ వావనీవిభుని
కూరిమికూఁతురు ◆ కొడుక నేనైతి
వారలు నేను ధ్రు ◆ వంబైన వేళఁ
జేరిన నాఁ డొక్క ◆ సిద్ధముఖ్యుండు
యెఱుకమైఁ దల పోయ ◆ నీ కుమారుండు
నెఱయోగి యగుఁగాని ◆ నృపుఁడుగాఁ డనుచు
నరిగిన పిమ్మట ◆ నై దేండ్లు చనఁగ
సరగున మాతండ్రి ◆ చదువు చెప్పించి
పరువడి నటమీఁద ◆ పండ్రెండొ [7]యేఁట
నురువైభవంబున ◆ నుపవీతుఁ జేసి
యరుదుగా నిరువాగె ◆ హయములఁ బరపఁ
గరులనేర్పునఁ జిత్ర ◆ గతు(ల) నమర్ప
నిటలంబుగా వింట ◆ నిరుగడ నేయ
నెటువంటి జెట్లతో ◆ నెదిరి పెనంగ
బరిజింప నేర్పించి ◆ పరిణయంబునకు
నిరవొంద సమకట్టు ◆ నెడ నొక్కనాఁడు
వేఁటాడ మనమున ◆ వేడుక వొడమి
గాటమైనను వేఁట ◆ కాండ్రును గొలువ
నీకాననము చొర ◆ నిచ్చట నొక్క
సూకరంబు దఱుమ ◆ సుడివడ నొంచి
సురిఁగిన మృగముల ◆ చొప్పు నందఱును
నరిగి రెవ్వరు నిల్వ ◆ కంతట నొంటిఁ
దెరు వెఱుంగక తిట్ట ◆ దిరుగుచు నెదుర
నురగ కళేబరం ◆ బొక్కటిఁ గాంచి
తెలియక త్రోవర్లు ◆ దీనిఁ గన్గొన్నఁ
దలఁకుదు రని వింటఁ ◆ దలఁగించి బిట్టు
చిమ్మిన నది పోయి ◆ చేరువం దపము
సమ్మదంబునఁ జేయు ◆ క్షణికుపైఁ బడియెఁ
బడుటయు నమ్ముని ◆ ప్రవరుండు గోప
మడర నామీఁదఁ ద ◆ ప్పరయక నన్నుఁ
గనుఁగొని వలికె భీ ◆ కరముగ నిట్టి
వనభూమి మునివృత్తి ◆ వదలక నీతి
...... ...... ....... ....... ...... ...... .......
పన్నగశవము[8]నె ◆ వ్వగచనవైచి
ముదముననున్న నీ ◆ మోహంబుకతన
నొదవుమత్తాగొని ◆ యురియుచు నిచట
పవనాశనంబవై ◆ పడియుండు మనుచుఁ
దివిరి పల్కినఁ దొంటి ◆ దేహంబు విడిచి
యురగంబనై దుఃఖ ◆ మోర్వంగలేక
పరుసగా నమ్ముని ◆ ప్రవరు నిట్లంటి
నక్కట నాదోష ◆ మరయక నన్నుఁ
దక్కక శాపింపఁ ◆ దగునే మునీంద్ర
యెఱుఁగకచేసిన ◆ యెడ నెగ్గుపెట్టి
చెఱుప రెవ్వాని సు ◆ స్థిరశాంతమతులు
కావరంబుననేను ◆ కల్లచేసినను
గావక తెగఁజూడఁ ◆ గలదె ఘనులకు
సురుకృపాహీనులై ◆ యోపికలేక
ధరఁజేయు తపసుల ◆ తప మెట్టితపము
ధరణీశ్వరుఁడ నేను ◆ దపసివి నీవు
దొరయుదే నాకు నా ◆ తోడి భూపతివె
శబరుండు ముట్టంగఁ ◆ జాలనిభుజగ
శబము నీమీఁద కొం ◆ చక పట్టివైవ
నే నంతనీచుండ ◆ నే తలపోయ
భూసుత దివ్యత ◆ పోధన ప్రవర
తెరువునఁ బడియున్న ◆ దీని వీక్షించి
నరులు వెఱతురు ప ◆ న్నగభీతి ననుచు
వింటికొప్పునఁబాఱ ◆ విసరితిఁగాని
కంటకంబున వేయఁ ◆ గఱకంఠుసాక్షి
ధరణీశ్వరుండనై ◆ తనరుటమాని
యురగంబనై పడి ◆ యుండ నెట్లోర్తు
ముదముమీఱఁగ సౌధ ◆ ముల నుంటఁదక్కి
యొదిగి యేపుట్టల ◆ నుండుదు నింక
సరసాన్నములఁ దృప్తి ◆ సలుపుట యుడిగి
పురువులఁ దిన నెందుఁ ◆ బోదు నేనింకఁ
బొసగఁ గర్పూర తాం ◆ బూలంబు విడిచి
విసము ఫుక్కిళ్ల నే ◆ వెరవునఁ దాల్తు
ననుఁజేరి ప్రేరేఁచి ◆ నరులు దవ్వులను
గని వెంటఁబడి చంపఁ ◆ గడఁగుదు రనుచుఁ
బలుమాఱు వగచునా ◆ పైఁ గృపామృతము
గులికెడిచూపు ని ◆ గుడిచి యాతపసి
తనమనోవీధి నెం ◆ తయుఁ దలపోసి
కనికల్ల నామీఁదనుఁ ◆ గలుగమిఁ దలఁచి
ననుఁజేరవచ్చి స ◆ న్మతిని నిట్లనియె
ననఘాత్మ నీ నేర ◆ మరయ కే నిట్లు
పాపంబుచేసి నీ ◆ పై నాగ్రహించి
శాపమిచ్చితి నేమి ◆ జాడ నీయఘము
పాయుదుఁ గాశిలో ◆ పలఁ దన్వువిడచి
పోయెడువారును ◆ బొల్చు శ్రీనగము
చేరి తదున్నత ◆ శృంగంబు చూచు
వారును గేదార ◆ వారిఁబుణ్యంబు
వలనొప్పఁ జేసిన ◆ వారును బాప
ములు తొలంగుదురని ◆ బుధులు చెప్పుదురు
గాని నే నటుచేయఁ ◆ గడఁగుట జాగు
మాన దీదురితంబు ◆ మరియొండు వెంట
నేల యీతలపోత ◆ యింద్రకీలంబు
శైలసానువులందుఁ ◆ జరియింపుచుండి
పడి తొలంగుదు నిట్టి ◆ పాప మేననుచు
....... ....... ....... ....... ........ ....... .......
పరమేశుఁ దనమనః ◆ పద్మంబునందు
తిరముగా ...... ....... ....... ...... .......
ధర్మదేవత రూపు ◆ దాల్చి వేవచ్చి
నిర్మలాత్మక చావ ◆ నీకేల యనుచు
ననువొంద నటువట్టి ◆ యతనిఁ గూర్చుండ
నునిచి యిట్లనిపల్కె ◆ నోమునిచంద్ర
కడవఁజేసినపాత ◆ కమునకు మదిని
జడిగొను నట్టి ప ◆ శ్చాత్తాపమునకుఁ
బరిణమించితిఁ బూర్వ ◆ భవనమున నితఁడు
దొరకొని చేసిన ◆ దోషంబు కతన
నురగరూపంబున ◆ నుండంగవలసె
నరసిచూడఁగ విను ◆ మదియు నెట్లనినఁ
బరికింపఁ దొల్లిటి ◆ భవమున వీఁడు
ధరణీశుఁడై పుట్టి ◆ తద్దయు వేడ్కఁ
దడయక వేఁటాడు ◆ [9](తలఁపున మీఱి
కడుభయంకరమగు ◆ గహనంబుఁ జొచ్చి
ధీరుఁడై చనిచని ◆ తెరువున నున్న
ఘోరభుజంగంబు ◆ కుబుసంబుగాంచి
యంత నా తెరువున ◆ నరుదెంచు విప్ర
కాంతను బురుషునిఁ ◆ గడుముదమునను
నులికింపఁబూని యా ◆ యురగకంచుకముఁ
దలదూర్చుకొని ◆ చొచ్చి దారుణలీల
వడి బుస్సురని మ్రోయ ◆ వణఁకుచు నేలఁ
బడి బ్రాహ్మణుఁడు భీతిఁ ◆ బ్రాణముల్ విడిచె
నప్పుడు నెంతయు ◆ నంతరంగమున
ముప్పిరిగొను శోక ◆ మున నోర్వలేక
యావిప్రవనితయు ◆ నానృపుఁజూచి
కావరంబున నిట్లు ◆ కపటంబుఁ దాల్చి
నడుఁకక వెఱపించి ◆ నాప్రాణవిభునిఁ
దొడిబడఁజంపిన ◆ దోషంబు కతనఁ
దరువాతి భవమునఁ ◆ దరలక గట్టు
దరిఁ బెనుబామవై ◆ దారుణాటవిని
బడియుండు మన్చు శా ◆ పం బిచ్చి యగ్ని
వడిఁ జొచ్చెఁ దనప్రాణ ◆ వల్లభుఁగూడ
నావిప్రవరుఁడ వీ ◆ వాధరారమణుఁ
డౌ వీఁడు తొల్లిఁటి ◆ యా పెనుబాము
కుప్పుసమే ఫణి ◆ కుల మయి తోఁచెఁ
దప్పదు దైవ కృ ◆ తం బట్లుగాన
వలవదు మునివర ◆ వగపు నీ కనినఁ
దెలిసి యాతఁడు ధర్మ ◆ దేవత కనియె
నోవక యీరాజు ◆ కొసఁగిన శాప
మేవిధంబున వీడు ◆ నిటమీఁదఁ దెలియ
నానతి యిమ్మన్న ◆ నామునిపతికి
ధీనుత యాధర్మ ◆ దేవత పలికెఁ
గ్రమముతోనటు గొంత ◆ కాలంబు చనఁగఁ
బ్రమద మారఁగ ముని ◆ పతుల రక్షింప
మీననాథుండను ◆ మేటి సిద్ధుండు
తా నిందుఁ జనుదేరఁ ◆ దత్పదస్పర్శ
కా కుండలాకృతిఁ ◆ గ్రచ్చఱ నుడిగి
కైకొనుఁ దొల్లి యా ◆ కార మానృపతి
సిద్ధదేహం బగుఁ ◆ జెచ్చెర నట్ల
సిద్ధించు నీకును ◆ సిద్ధపదంబు
అరుగుము నీయాశ్ర ◆ యమునకుఁ దొల్లి
తెఱఁగున నని ధర్మ ◆ దేవత చనియె
మునియుఁ గ్రమ్మఱవచ్చి ◆ ముదమున నాకు
ననయము వృత్తాంత ◆ మంతయుఁ జెప్పి
మన్నన మీఱ నా ◆ మదిఁ గుందు వాపి
సన్నుతంబగు నిజా ◆ శ్రమమున కరిగె
నేనును జిరకాల ◆ మీ యేరుమద్ది
మ్రానిపెందలనుంటి ◆ మఱి యిపు డిచటఁ
బావనంబైన మీ ◆ పాదపద్మములు
నావీఁపు సోఁకినం ◆ తనె నొస మెడలెఁ
గారుణ్య మిగురొత్తఁ ◆ గనుఁగొని తనకు
శారీరసిద్ధి ప్ర ◆ సాదింపు మనిన
మీననాథుండు వి ◆ స్మితముఖుఁ డగుచు
నానరేశ్వరున కి ◆ ట్లని యానతిచ్చె
రాజవై నెమ్మది ◆ రాజసౌఖ్యంబు
యోజఁ గైకొనుచుండు ◆ టుడిగి యీ వెంటఁ
దగునె యోగీశ్వర ◆ త్వము నీకు ననిన
మగుడ నాతండనె ◆ మత్స్యనాథునకు
నోజగన్నుత దివ్య ◆ యోగినై మిగులఁ
దేజంబు గలిగి సు ◆ స్థిరభక్తియుక్తి
మ్రొక్కి, నీపాదాబ్జ ◆ ములఁ గొల్చుచుంటఁ
దక్కి రాజ్యములందుఁ ◆ దగులదు మనసు
అని యని మ్రొక్కుచు ◆ నందంద వేఁడు
కొనుచున్న నత్తఱి ◆ గురుఁడైన శివుఁడు
ముద మలరఁగఁ దన ◆ ముందట నిలిచి
కదియవచ్చిన యట్టి ◆ గతి పొడసూపెఁ
దనయ నీ వనితకిఁ ◆ దయ నుపదేశ
మొనరింపు వీఁడు శి ◆ ష్యుఁడు మాకు మున్ను
నని యానతిచ్చి మ ◆ హా దేవుఁ డంతఁ
జనిన నాశ్చర్యంబు ◆ సనుకొన మీన
నాథుఁ డాగోరక్ష ◆ నాథుకు మనుజ
నాథునిఁజూపి స్నా ◆ నంబు చేయించి
కొనిరమ్ము నావుడు ◆ కువలయేశ్వరునిఁ
గొనిపోయి చేరువ ◆ కొలనఁ గ్రుంకించి
మెయినిండ భసితంబు ◆ మెఱవడిఁ బూసి
...... ...... ...... ...... ..... ...... ..... ...... .....
కాయంబునకు ◆ కండమణిచేసి
...... ...... ...... ...... ..... ..... ..... .......
గుఱుతుగ నర్జున ◆ కోటరంబునను
నురగరూపంబున ◆ నుండుటఁజేసి
నాగార్జు నాఖ్యుండ ◆ నం దగు ననిన
రాగిల్లి శిష్యులు ◆ ప్రణుతించి రంత
నవనాథ చరిత్ర
ఖణికాఖ్య సిద్ధుని కథ.
నెసఁగు తపంబున ◆ నిఱ్ఱింకులింకి
వసివాళ్లువాడుచు ◆ వంగిన మేను
ముడివడి మడిమెలు ◆ మోవ వ్రేలాడు
జడలును వలచేతి ◆ జపమాలికయును
గాలిఁ దూలాడెడు ◆ గడ్డంబుఁ జంకఁ
బోల నునిచిన భూతి ◆ బుఱ్ఱకాయయును
సమలినజలపూర్ణ ◆ మగు కమండలము
కొమరారఁ [10]దూఁగాడు ◆ కుండలంబులును
దన కలవడఁ బ్రమో ◆ దంబు చిత్తమున
మొనయ నాక్షణమె స ◆ న్ముని వచ్చె నటకు
నాలీలఁ జనుదెంచి ◆ యసమలోచనునిఁ
బోలి దిక్కులఁ జను ◆ భూరితేజమున
నొవ్పెడు నాథము ◆ ఖ్యున్నిఁ గాంచి భక్తి
ముప్పిరిగొనఁజేరి ◆ [11]ముదమునఁ జాఁగి
మ్రొక్కిన నిజకరం ◆ బున లేవనెత్తి
మిక్కిలి కృపఁజూచు ◆ మీననాథునకు
మునిపతి కరములు ◆ మొగిచి యిట్లనియె
ననఘాత్మ నావీను ◆ లార నీమహిమ
విన్నది మొదలుగా ◆ వెలయు నీమూర్తి
కన్నులపండువు ◆ గాఁ జూచుభాగ్య
మెన్నఁడు సమకూరు ◆ నింక నా కనుచు
నున్నచో నిచటి క ◆ త్యున్నతలీల
నరుగుదెంచితిరి కృ ◆ తార్థుండ నైతి
సరగున నొసఁగవె ◆ శారీరసిద్ధి
నావుడు నమ్మీన ◆ నాథుండు దెలిసి
పోవఁగ నమ్ముని ◆ పుంగవుం డెవ్వఁ
డనుచు నాగార్జును ◆ నాననాంబుజముఁ
గనుఁగొన్న నాతఁడు ◆ గరములు మొగిచి
యితఁడువో ముని శాప ◆ మిచ్చి తన్నిట్టి
గతినుండఁ జేసిన ◆ ఖణికాఖ్యుఁ డనిన
నామునిఁజూచి యి ◆ ట్లనె మీననాథుఁ
డీ మూర్ఖుతనము నీ ◆ కేటికి నొదవె
బలియుకోపంబు పా ◆ పమునకుఁ దెరువు
కలఁగుఁ జిత్తము దాన ◆ గాసియౌఁ దపము
తపసికి శాంతంబు ◆ దయయు ధర్మంబుఁ
గృపయును దగుఁ గాక ◆ కినుక మే లగునె
మున్ను విశ్వామిత్ర ◆ మునియును నిట్ల
పన్నిన కింక ద ◆ పమును బోనాడె
నని పల్కుటయు నమ్మ ◆ హాత్మునితోడ
ననువుగా నాగార్జు ◆ [12]నఁడు చెప్పినట్లు
తన పూర్వవృత్త మం ◆ తయు నొప్పఁజెప్పి
వినుతించుటయు మోము ◆ వికసిల్ల నతని
దాయ రమ్మని పిల్చి ◆ తపముపైఁ బ్రేమఁ
జేయుము నీకును ◆ సిద్ధత్వ మేల
చనదు పొమ్మనిన నా ◆ సంయమీశ్వరుఁడు
మనమార నిట్లనె ◆ మత్స్యేంద్రుతోడఁ
గూరలు వేళ్లును ◆ గూడుగాఁ గుడిచి
నారచీరలు గట్టి ◆ నట్టడవందు.
నుపవాసములఁ గ్రుస్సి ◆ యోరంత ప్రొద్దు
జపములు సలుపుచు ◆ జలముల నడుమఁ
జలికాలమునను వే ◆ సవి బలుమంట
లలము పంచాగ్ని మ ◆ ధ్యంబున మరియు
వానఁ దొప్పఁగఁ దోఁగి ◆ వణఁకుచు బయటఁ
బూని తపంబు స ◆ ల్పుట సాలఁగడిఁది
చాలు తపఃఫల ◆ చర్చ నీపాద
నాళికాయుగ సేవ ◆ నాకు సిద్ధించె
నింటిముంగటను బా ◆ లేఱుండ గుంట
వెంటఁ బాఱెడు నట్టి ◆ వీఱిఁడి గలఁడె
యని చాఁగిమ్రొక్కిన ◆ నమ్మహాయోగి
తన శిష్యవరుల నం ◆ దఱను వీక్షించి
తెఱఁగొప్ప నిమ్ముని ◆ దీక్ష యెట్లనుచుఁ
దరమిడి యేమి చే ◆ తము దీని కనిన
దేవ యీతనికి సు ◆ స్థిరముగా నిండు
శ్రీవిలసిల్లెడు ◆ సిద్ధపదంబు
అని విన్నవించిన ◆ నమ్మీననాథుఁ
డనురాగమెసఁగ నా ◆ గార్జునుఁ జూచి
యిమ్మునిముఖ్యున ◆ కిప్డు సిద్ధత్వ
మిమ్ము నెయ్యంబున ◆ నీవన్నఁబూని
యా సంయమీంద్రు సి ◆ ద్ధాసనాసీనుఁ
జేసి శంకరు నాత్మఁ ◆ జేర్చి హస్తంబు
సిరమున నునిచి యా ◆ శ్రితులకు భక్తి
తెరువైన యోంకార ◆ దివ్య మంత్రంబు
లలర నాదట మొద ◆ లను కర్మయోగ
ముల రాజయోగంబు ◆ ముదమారఁ దెలిపి
చెచ్చెర నణిమాది ◆ సిద్ధులన్నియును
నిచ్చితా గురుఁ జూచి ◆ యింక నామంబు
ననఘాత్మ గృపసేయు ◆ మనిన మత్స్యేంద్రుఁ
డనియె నీతఁడు తన ◆ యజ్ఞానమునకు
ననుతాపమునఁబడి ◆ యఘమెల్లఁ బాపు
కొనె ధర్మబుద్ధి కె ◆ క్కుడు ఖణిఁ గల్గి
కావున నీయోగి ◆ ఖణికాహ్వయమున
భూవలయంబునఁ ◆ బొగడొందుచుండు
నన శిష్యులును వేడ్క. ◆ నా మీననాథుఁ
గొనియాడ నా ఖణి ◆ కుండును దనకు
నమరు తపస్సాధ ◆ నాళియు ధేను
సమితియు విజ్ఞాన ◆ సంపన్నులైన
మునిముఖ్యులకు నిచ్చి ◆ మోదంబుమీఱఁ
జనియె మత్స్యేంద్రుని ◆ చరణముల్ గొలిచి
యాసిద్ధ ముఖ్యుఁడు ◆ నద్రులు నూళ్లు
వాసికెక్కిన నదుల్ ◆ వనములు గడచి
పొంగారు పశ్చిమాం ◆ బుధి తీరమునను
మంగళావృతమగు ◆ మహనీయమైన
పుటభేదనము డాయఁ ◆ బోయెడువేళ
నటఁబురీశుఁడు మృతుఁ ◆ డైనఁ దన్మంత్రి
పుంగవుఁడైన ప్ర ◆ బుద్ధుండు నేర్పు
చెంగలింపుచు నుల్ల ◆ సిల్లు వాకిళ్లఁ
జాలఁబెంపగు గజ ◆ శాలల నశ్వ
శాలల వడి రథ ◆ శాలల కడను
భండారమిండ్లలో ◆ పలివంక సేన
లుండఁగఁ దగిన తా ◆ వులను విశ్వాసు
లగువారి నునిచి య ◆ య్యవనీశ్వరునకుఁ
దగ నందనులు లేమిఁ ◆ దలపోసి చూచి
పట్టమేనుఁగు చేతఁ ◆ బట్టిన వానిఁ
బట్టంబుగట్ట నే ◆ ర్పడ నిశ్చయించి
యాసామజముకుఁ బ్రి ◆ యంబుతోఁ బూజ
చేసిన యావార్త ◆ చెవి సోఁకుటయును
మీననాథుఁడు వేడ్క ◆ మెఱయ శిష్యులకుఁ
దా నిది చెప్పియు ◆ ధాత్రీశుబొందిఁ
బ్రమద మారఁగఁ జొచ్చి ◆ రాజ్యవైభవము
లమరఁగై కొని మన ◆ మార భోగించి
క్రమ్మఱఁ జిత్రంబు ◆ గా వచ్చి యిట్లు
మిమ్ముఁ గూడుదుమ న్న ◆ మీననాథునకుఁ
జేతులు మొగిడించి ◆ శిష్యు లిట్లనిరి
యీతలంపేల మీ ◆ కిట్లు వాటిల్లె
ఘనయోగరాజ్య సౌ ◆ ఖ్యము ననిశంబు
ననుభవింపఁగ నొల్ల ◆ కకట సంసార
జనితసౌఖ్యముఁ గోరఁ ◆ జనునె యెట్లైన
ననఘాత్మ నినుఁదెల్ప ◆ నలవియె మాకు
ననునెడ గోరక్షుఁ ◆ డ మ్మహాత్మునకు
వినయమొప్పఁగ విన్న ◆ వించి మ్రొక్కుచును
జగతిలో సంసార ◆ సౌఖ్య నిర్మగ్నుఁ
డగునేని మరి వాయ ◆ నభవుండు నోపఁ
డదిగాన మీమేన ◆ నట్టి సౌఖ్యంబు
గదిసిన పెంపును ◆ గణుతింప మంచి
దీక్రియ నుండ మీ ◆ రిచ్చగింపుదురొ
మీకు బుద్ధియుఁ జెప్ప ◆ మే మెంతవార
మనఁగ మత్స్యేంద్రుఁ డి ◆ ట్లనియె గోరక్షు
ననఘాత్మ నీ చెప్పి ◆ నట్టిది బుద్ధి
యైనను సంసార ◆ మందలి సౌఖ్య
మాని చూడక తోఁప ◆ దది యెట్టి రుచియొ
యింక మాఱుత్తరం ◆ బిచ్చిన మీకు
శంకరు నాన మా ◆ చరణంబులాన
యనుటయు నొండాడ ◆ నలుకు గోరక్షుఁ
గనుఁగొని తాఁ బర ◆ కాయప్రవేశ
మరుదుగా నొనరించి ◆ యరుదెంచు దనుకఁ
దిరముగా మీరు మా ◆ దివ్య దేహంబు
నుడుగక కాఁచి యిం ◆ దుండుఁడ యనుచుఁ
మీననాథుని పరకాయప్రవేశము.
దడయక యొక పర్వ ◆ తపు గుహఁజొచ్చి
సిద్ధాసనస్థుఁడై ◆ శివునిఁ జిత్తమున
సిద్ధముఖ్యుండు సు ◆ స్థిరముగా నిలిపి
వాయువాకుంచన ◆ వశముగాఁ జేసి
యాయత కుండలి ◆ కరుగ నూల్కొలిపి
యలవడ గ్రంథిత్ర ◆ యమును భేదించి
యల యూర్ధ్వకుండలి ◆ కల్లనఁ జేర్చి
యరుదుగాఁ బూర్వ యో ◆ గాడ్యుఁడై పొల్చి
మరియుదశ ద్వార ◆ మార్గంబు లెల్లఁ
బ్రాతిగా సూక్ష్మ రూ ◆ పము దాల్చి మీఁద
జ్యోతి స్స్వరూపుఁడై ◆ చొప్పునవెడలె
వేమారు శిష్యులు ◆ వెఱఁగంది చూడ
నామీననాథుని ◆ యాత్మ భూనాథు
బొందిఁ జొచ్చుటయును ◆ బోయి జన్మంబు
చెంది క్రమ్మఱను వ ◆ చ్చిన రీతి దోఁప
కన్నులు విచ్చె వ ◆ క్త్రంబును దెఱచెఁ
జెఁన్నొంద మేనెల్ల ◆ జీవంబు నిండె
నెన్నిక బంధువు ◆ లేడ్చుట మాన
మున్ను పోయిన ప్రాణ ◆ ములు రాజునకును
మగుడి వచ్చె నటంచు ◆ మంత్రులు దొరలు
తగుబంధుజనులు నం ◆ తఃపురాంగనలు
సయ్యన ముదమంద ◆ సకలభూజనులు
దయ్యంబు మనమీఁద ◆ దయ చేసె ననుచు
మేటి వాద్యంబులు ◆ మిన్నంది మ్రోయఁ
బాటించి కనక కుం ◆ భంబులు నిలిపి
మకుటతోరణములు ◆ మణితోరణములు
ముకురతోరణములు ◆ ముదమొప్పఁ గట్టి
తఱచుగాఁ జిత్రప ◆ తాకముల్ నిలిపి
మెఱయుగలపడముల్ ◆ మెచ్చుగాఁ గట్టి
మహనీయమగు శివ ◆ మందిరంబులను
బహురత్నదీపికా ◆ పఙ్త్కులునించి
యాడెడి పాడెడి ◆ యట్టి వారలకు
...... ...... ...... ....... ....... ....... ......
భాసుర మణిమయా ◆ భరణసువస్త్ర
గోసువర్ణాదులు ◆ కొండుకొం డనుచు
వసుధామరుల కిచ్చు ◆ వారిఁ గారుణ్య
మెసఁగ బ్రాహ్మణముఖ్య ◆ మేధ్య జనాది
సమితికిఁ బాయస ◆ శర్కరాపూప
నుమహీతదధిమధు ◆ సూపాజ్యశాక
సరసఫలోపేత ◆ శాల్యోదనములు
వరుసఁ దృప్తిగఁ బెట్టు ◆ వారల నంత
నారాజ శేఖరుఁ ◆ డందఱఁజూచి
వీ రిట్టివారని ◆ వివరింపలేక
యూరకె మాటాడ ◆ కున్న నూహించి
యీ రోగమహిమచే ◆ నిట్టి విభ్రాంతి
[13]పరిగొనె నృపునని ◆ బంధువుల్ హితులు
[14]వరుస మీఱఁగ వైద్య ◆ వరుల నందఱను
మసలక రప్పించి ◆ మందు పెట్టించి
నుసరమై తెలివొందు ◆ చొప్పులేకున్న
భూవరుమంత్రిప్ర ◆ బుద్ధుఁడా తెఱఁగు
భావించి యెవ్వఁడో ◆ పరమయోగీంద్రుఁ
డేపారఁ దన యాత్మ ◆ నీరాజు బొంది
లోపల నిలిపెనో ◆ లోఁ గానవలయు
ధీయుక్తి నితనికిఁ ◆ దెలిపి రాజ్యంబుఁ
జేయింపవలెఁ బూర్వ ◆ శారీరిగాను
...... ...... ...... ...... ...... ...... ....... ......
బరితోషితునిఁ జేసి ◆ పరమానురాగ
భరితుఁడై రాజ్య వై ◆ భవముల దృష్టి
పురికొనఁ దొల్లిటి ◆ భూపాల సతులఁ
బరకాంత లని మాని ◆ భావజ్ఞు డెలమిఁ
బాటించు మోహన ◆ బాణంబు లట్టి
పాటలగంధులఁ ◆ [15]బన్నిరువురను
రమణతో నెంతయు ◆ రమణీయలైన
రమణికా దేవియు ◆ రత్నావళియును[16]
సౌమ్యాంగియుసు [17]బుష్ప ◆ సంపూర్ణ గంధి
రమ్యవిభ్రమయును ◆ రాజాననయును
జిత్రరూపికయును ◆ శీతావతియును
జిత్రభామినియును ◆ శ్రీగంధికయును
సొనర దాక్షాయణి ◆ శుభలక్షణయును
ననువారిఁ బరిణయం ◆ బై వారి పేర
బారహకన్యక ◆ పట్టణం బొకటి
ధారుణీస్థలిఁ బ్రసి ◆ ద్ధముగఁ గట్టించి
వారినందఱ నుంచి ◆ వరచిత్రవస్త్ర
చారు భూషణ పుష్ప ◆ చందనాదులను
జాల నింపెసఁగుచు ◆ జాతి సత్వములు
పోలఁగఁ గళలుండు ◆ పొందు మేలెఱిఁగి
యనుకూల రతికేళి ◆ నందంద నేర్పు
లొనరఁగ్రీడింపుచు ◆ నొక్కొక యెడలఁ
గడువేడ్క గజతురం ◆ గంబుల నెక్కుఁ
దొడిగి పూసియు కట్టి ◆ తుంటవి ల్తొప్పు
నసియాడు నడుములు ◆ నలసయానములు
రసమొల్కు బింబాధ ◆ రంబుఁ గ్రిక్కిఱిసి
....... ....... ....... ........ ...... ....... ....... ......
యొండొంటితో రాయు ◆ చున్న చన్నులును
గల వారసతులు డ ◆ గ్గఱి కుంచె లిడఁగఁ
గొలువుండి దిట్టయై ◆ కొండొక తడవు
మల్లులఁ బోరించు ◆ మధువేళ లీలఁ
జల్లుబోరాడును ◆ జలకూపములను
వనవాటికల లీల ◆ వర్తించు వెంటఁ
జను బంధుజనులతోఁ ◆ జలుపు సద్గోష్ఠి
నాటపాటల తోడ ◆ నభినవ రీతి
చాటువగా నర్థి ◆ జనులకు నొసఁగు
రాగిల్లి యీ రీతి ◆ రాజయి రాజ్య
భోగంబు లనుభవిం ◆ పుచు యోగసుఖము
మఱచి తా సంసార ◆ మగ్నుఁడై యున్న
తఱిఁబెద్ద దేవికి ◆ ధరణీతలేశుఁ
డతిమోహ మొనరింప ◆ నారమణికకు
...... ...... ...... ...... ....... ....... ...... .......
[18]మనమార మరినెల ◆ మసలె వేవిళులు
దనికి యాహార మం ◆ దలి చవిదప్పెఁ
[19]బలుచనై మైతీఁగె ◆ బడలె నెన్నడుము
కలిమిఁ గైకొనె నాభి ◆ కడువికసించె
నారుగప్పై జఘ ◆ నంబు నున్పెక్కె
నూరులదరులను ◆ నూగారు విరిసెఁ
బల కెక్కెఁ జెక్కులు ◆ పాలిండ్ల మొనలు
నలుపెక్కెఁ దెలుపారె ◆ నయనంపు యుగ్మ
మా విధంబున నవ ◆ మాసముల్ నిండి
యావధూమణి గాంచె ◆ నభిరామమూర్తిఁ
దరుణార్క తేజు నం ◆ దను నట్టివార్త
ధరణీశ్వరుఁడు విని ◆ తద్దయు నలరి
కనక రత్నాంబర ◆ గజవాజి ధేను
ధనధాన్య తతులు మో ◆ దంబు దీపింపఁ
గవిబుధవందిమా ◆ గధసమూహంబు
కవనీసురులకును ◆ నాదట నొసఁగి
మరియర్భకునకుఁ గు ◆ మార మంజనఁగ
వరుస పేరిడి మణి ◆ ప్రకర దీధితులు
తులకించు ముద్దుల ◆ తొడవులు దొడిగి
పలుమాఱు నింపులు ◆ పచరించు వాని
ముద్దులఁ గడుఁజిక్కి ◆ మొదలి దేహమున
సిద్దులఁ దలఁపునఁ ◆ జింతింప మఱచి
రాగిల్లి యుండ గో ◆ రక్షుఁడు మొదలు
గాఁగల శిష్యవ ◆ ర్గము దమలోనఁ
దలపోసి గురుఁడు నం ◆ తత రాజ్యభోగ
ములఁజిక్కి మఱచె ని ◆ ప్పుడును మనలను
గడుఁబెద్ద కాలమీ ◆ కల్యాణ తనువు
కడనుండి దరలకు ◆ కాచి యుండితిమి
ముదమున నమ్మహా ◆ త్ముని కడకేగి
వదలక తోడితే ◆ వలె నింక ననఁగఁ
జౌరంగికార్యంబు ◆ చర్చించి చూచి
గోరక్షునాథుఁ గ ◆ న్గొని యిట్టు లనియె
నరనుతుఁడగు మీన ◆ నాథు దేహంబు
కరమర్థిమే మిటు ◆ గాచియుండెదము
కొదుకక చని నీవు ◆ గురునాథునాత్మఁ
గదియింపు నీదివ్య ◆ కాయంబుతోడ
గురుఁడు మాకందఱ ◆ కును ముఖ్యుఁడైనఁ
గరుణించి తమయందుఁ ◆ గల మహత్వంబు
నెమ్మితో నీయందు ◆ నిలిపెఁగావునను
సమ్మదంబున మీరె ◆ చను టిప్పు డుచిత
మనితన్నుఁబ్రార్జింప ◆ నగుఁగాకయనుచుఁ
దనగురునాథుని ◆ తను వొప్పగించి
యచ్చోటుగదలి స ◆ య్యనఁ బట్టణంబు
చొచ్చే నవ్వేళ నా ◆ క్షోణీవిభుండు
పరిపరివిధములఁ ◆ బాదరసంబు
కరణి భంజళ్లఁ ద్రొ ◆ క్కని చోట్లు ద్రొక్కు
తురఁగరత్నము నెక్కి ◆ తూర్యముల్ మ్రోయఁ
గరులును భటులును ◆ గవులు గాయకులు
దొరలు ప్రధానులు ◆ తోఁ జనుదేర
నరుదుగా వయ్యాళి ◆ కరుగంగఁగాంచి
మరలియే తేరఁ ద ◆ న్మార్గంబునందు
మరులువేషముపూని ◆ మాసినచిక్కు
తలయును జింపిబొం ◆ తయు శునకములు
నొలయు గోలయుఁ జేత ◆ నున్న పుఱ్ఱెయును
సెలవులఁబడి నుబ్బి ◆ చెక్కులమీఁద
నొలికెడుజొల్లుఁ గ్రే ◆ ళ్లురుకు చూపులును
వెడనవ్వుగదుర భూ ◆ విభుని డాయుటయుఁ
గడురయంబునఁ గోల ◆ కాం డ్రదలించి
వడి వ్రేయవచ్చిన ◆ వారి వారించి
పుడమీశుఁడాతని ◆ పోలికఁ దెలిసి
దరహాస మిగురోత్తఁ ◆ దన వఠారముకు
నరిగి మంత్రులు మొద ◆ లగువారి ననిపి
యొక్కఁడునొక చోట ◆ నుండి యాజోగిఁ
దక్కకపిలిపించి ◆ దగ్గరనునిచి
వచ్చి తె గోరక్ష ◆ వరుఁడ నాబొంది
నిచ్చలుఁ గావంగ ◆ నినునమ్మియునిచి
వచ్చియుండఁగ నిట్లు ◆ వత్తురే నేను
వచ్చెద నని యున్న ◆ వాఁడ నావుడును
జాగిలిమ్రొక్కి హ ◆ స్తంబులు మొగిచి
శ్రీ గురునాథుతో ◆ శిష్యుఁ డిట్లనియె
చౌరంగి మొదలుగా ◆ సకలశిష్యులును
ధీరులై భవదీయ ◆ దివ్యకాయంబుఁ
గాచియున్నారది ◆ గాన మీయాత్మ
నాచింతవలదు మీ ◆ కని మఱిపలికె
నెటు వోయెనయ్య మీ ◆ యెఱుక మహాత్మ
కటకటా మున్నెఱుం ◆ గనివారిఁ దెలుప
నిరవగు నెఱిఁగియు ◆ నెఱుఁగనివారిఁ
దరమౌనె దెలుప వి ◆ ధాతృనకైన
రాజశేఖరుఁడు గా ◆ రవమున మీకు
నోజగాఁగఱపిన ◆ యోగమార్గమునఁ
దేజంబు మీఱి వ ◆ ర్తింపుట మేలు
రాజవై వెంపున ◆ రంజిల్లుకంటె
నలరునాభరణాదు ◆ లను వస్త్రములను
బొలఁతుల నందలం ◆ బుల గజంబులను
బొలుపొందు ఘనసౌధ ◆ ములు పట్టణములు
నిలువక చెడుటది ◆ నిక్కంబుగాన
వీనిపై మక్కువ ◆ విడిచివేంచేసి
ధీనుతభవదీయ ◆ దేహంబుచొరుము
అనియని పలుమాఱు ◆ నందంద తఱిమి
తనకుఁజెప్పంగ నా ◆ తని కిట్టులనియె
హరుఁడిచ్చి నట్టి యో ◆ గానందవార్ధి
పరఁగు నీసంసార ◆ బడబాగ్ని చేత
నివిలేని సౌఖ్యంబు ◆ లిటనాకుఁగలిగె
సవతుచేఁబాయని ◆ సంబంధమునను
గాయమేమైనను ◆ గానిమ్ము సుతునిఁ
గాయజుసన్నిభుఁ ◆ గాంచితి నొకని
నేలితిభూతలం ◆ బింతయు సౌఖ్య
లీలఁజాలంగఁ దే ◆ లితి నిదిమేలు
మీరలందఱును మా ◆ మీఁది సద్భక్తిఁ
జేరి యాబొంది ర ◆ క్షింపుఁ డేమరక
మఱికొంత కాలంబు ◆ మసలినపిదపఁ
దెఱఁగొప్పవత్తు ◆ తెఱఁగున నీవు
వచ్చుటదెలియ నె ◆ వ్వరికి రాకుండఁ
జెచ్చెర నాప్రియ ◆ శిష్యపొ మ్మనినఁ
దలయూఁచి వెఱఁగంది ◆ తనలోన గురుని
సొలయుచు సంసార ◆ సుఖము లీరీతిఁ
దీపిగావేయని ◆ ధీరుఁడై మరియు
గోపాలకుఁడు నిజ ◆ గురున కిట్లనియె
చిచ్చుకువేఁకియు ◆ సీతుకుఁ జలియు
వచ్చిన మాన్పఁగ ◆ వచ్చునే యనఘ
పుడమియు మిన్నును ◆ [20]పొనరంగఁ జేయ
వడిఁబాఱునేఱుల ◆ వంకలుదీర్పఁ
దిమిరిసింధువు నీరు ◆ తీయఁగాఁ జేయఁ
గమలారిఁజెందిన ◆ కందువాపంగఁ
తలమె ము న్నెట్టి పె ◆ ద్దలకుఁ జింతింప
నిలమహాత్ములఁబొంది ◆ నట్టితామసముఁ
దెలుప శక్తుఁడుగాఁడు ◆ దేవదేవుండు
సలలితసంసార ◆ సౌఖ్యంబు నీకుఁ
దలమున్కలయ్యె ని ◆ త్తఱి నని తన్నుఁ
బలుమాఱు దూఱు గో ◆ పాలు నీక్షించి
తఱలక సుఖముల ◆ తహతహఁ జిక్కి,
మఱియు నిట్లనియె నా ◆ మత్స్యనాథుండు
మదగంధముకు మూఁగి ◆ మలయుతుమ్మెదల
కదుపులుగలిగిన ◆ గంధేభములును
మంజిళ్లఁబరిపాటి ◆ మరిగిన నటన
రంజిల్లుచున్న సా ◆ మ్రాణితేజులును
వలనొప్పదండెల ◆ వజ్రాలమించుఁ
దులకింప మించు నాం ◆ దోళికావళులు
జిగిఁ దొంగలించు రా ◆ జీవంబులకును
మగలైనకన్నుల ◆ మత్తకాశినులు
బహురత్న భూషణ ◆ భర్మాంబరములు
బహుళంబులగుచున్న ◆ బంగారువిండ్ల
గాటమై యెదిరిన ◆ కడిఁదివైరులను
ధాటిమై నఱుము స ◆ ద్భటసమూహములు
కరమొప్ప నమృతంబు ◆ కంటె మేలైన
సరసాన్నములును నీ ◆ చవులును విడిచి
యుడుగక యొంటిమై ◆ యొక గుహలోన
మడఁగియుండెడు యోగ ◆ మార్గంబునొల్ల
వడిఁజను మింక నీ ◆ వచ్చినత్రోవ
...... ....... ....... ....... ...... ........ ....... .......
నదియుఁగాకను సృష్టి ◆ కంతయుఁ దామె
మొదలైనయట్టి శం ◆ భుఁడు పద్మజుండు
నిందిరారమణుఁడు ◆ నిష్టసౌఖ్యముల
పొందు వాయఁగలేక ◆ పుష్పకోమలుల
నొడల నాననమున ◆ నురమునఁదాల్చి
కొడుకులఁగాంచి యె ◆ క్కుడు వైభవములఁ
దగ నుండుదురు తమం ◆ తటివార లొరులు
నిగిడెడుఁ జిత్తంబు ◆ నీవాక్యసరణి
సనుడు గోరక్షుఁ డి ◆ ట్లనియె మత్స్యేంద్ర
వినుము లోకములుగా ◆ వింప రక్షింపఁ
జంపను గర్తలై ◆ జగములలోనఁ
బొంపిరివోవ రూ ◆ పులుమూఁడుదాల్చి
మెఱసియుందురుగాన ◆ మిన్నకవారిఁ
దఱుమలే దీషణ ◆ త్రయ మదిగాక
యెక్కడవోయె మీ ◆ యెఱుక మాకింక
దిక్కెవ్వ రిటమీఁద ◆ దివ్యయోగంబు
నేటికి విడిచితి ◆ రీశుండు మీకుఁ
బాటించి యొసఁగిన ◆ పరమవిజ్ఞాన
మును సర్వసిద్ధులు ◆ మొదలంటఁ బోయి
కనుగానలేక యీ ◆ కష్టసంసార
జలధిలోఁబడి మూఢ ◆ జనుని చందమునఁ
దెలియనేర టంచు ◆ దీన దోషమునఁ
బలుమాఱు గ్రమ్మెడు ◆ బాష్పబిందువులు
దలముగా వదన ప ◆ ద్మంబుపై నెరయఁ
జింతింపఁ దన ప్రియ ◆ శిష్యుతోడుతను
నిం తేల వత్స నీ ◆ కిట్లేడ్వఁ ననుచుఁ
దొరఁగు బాష్పములఁజేఁ ◆ దుడిచి తద్వక్త్ర
మురమునఁ జేర్చి య ◆ య్యోగి వ రేణ్యుఁ
డనియె గోరక్ష నా ◆ యంతరంగమున
ననవరతము వాయ ◆ కలిముద్దులాఁడు
గలఁడు కొమారుఁ డొ ◆ క్కరుఁడు నీ వతని
చెలువంబు తేజంబు ◆ చేష్టలు ముద్దు
...... ...... ...... ...... ....... ....... ....... ......
పలుమాఱు నగవులుఁ ◆ బరగుతదంగ
సౌకుమార్యంబు లో ◆ చసపర్వ మొదవఁ
గైకొని చూడవు ◆ గాని చూచినను
నదియె కొండాటమై ◆ యన్నియు మఱచి
యొదుఁగుదు పబ్బాలు ◆ నొనర నిచ్చటికిఁ
గొనివత్తు నని పోయి ◆ కొంతసేపునకుఁ
జనుదేర నురవు ప ◆ చ్చల పదకంబు
కళుకుల రావి రే ◆ కయు నింద్రనీల
ములమద్దికాయలు ◆ పుష్యరాగముల
బొద్దులుం గురువింద ◆ ములవిలసిల్లు
ముద్దుటుంగరములు ◆ ముత్యాలసరులుఁ
బులిగోరు నేవళం ◆ బులు నందమైన
నులిగడియంబులు ◆ నూపురంబులును
కనకఘంటలును మూ ◆ గలును గజ్జలును
దనరు [21]మేఖల కటి ◆ స్థలి నలవడఁగ
ముద్దులార్పెడిపట్టి ◆ ముదమొప్పఁ దెచ్చి
యద్దివ్యయోగీంద్రుఁ ◆ డా శిష్యునకును
జూపి యక్కునఁ జేర్చి ◆ చుంచుదువ్వుచును
దీపు లుట్టఁగ వాని ◆ తెలివియు రూపుఁ
బలుమాఱు నంకించి ◆ పలికెడు గురునిఁ
దలఁపక గోరక్షు ◆ దగను నిట్లనియె
మును శుక్ల శోషితం ◆ బులు ముద్దగట్టి
ఘనసాపరతలైన ◆ కాంతల యుదర
ములఁ జాల మలమూత్ర ◆ మునను నుప్పొంగి
[22]నెలలు గా నేహ్యపు ◆ నెలవులం బుట్టి
నీరుబుగ్గలభంగి ◆ నిమిషమాత్రమున
భోరున రూపఱి ◆ పోయెడి వీరు
సుతులె భవత్కృపా ◆ సుధపొడవైన
మతిసిద్ధదేహుల ◆ మగు నేము గాక
యెందును నిల్వక ◆ యేగెడు నిట్టి
బొందికై విభ్రాంతిఁ ◆ బొరల నేమిటికి
నావుడు గోరక్షు ◆ నకు నిట్టు లనియె
నావరయోగీంద్రుఁ ◆ డకట రోఁతనుచు
ననియెదు మొదలు నే ◆ యనువున నీవు
జననంబు నొందితి ◆ సకలదేహులును
నీగతినే పుట్ట ◆ నెఱిఁగి నీకింత
[23]తీగఁదెంపఁగ నేల ◆ దీనఁగుమార
యను గురునాధుతో .◆నఱుక్రమ్మి మరియు
ననియె గోరక్షుఁ డి ◆ ట్లవధరింపంగ
నేల సర్వేశ్వరుఁ ◆ డీ జగంబాత్మ
లీలకై మొదలఁ గ ◆ ల్పించెడి కొఱకు
నమరించినట్టి మి ◆ థ్యా భ్రాంతిగానఁ
దమసొమ్మనుచుఁ జిచ్చు. ◆ దఱిఁ బట్టరాదు
తక్కిన వేమియు ◆ దాఁచినఁ బోవు
చక్కికిఁ గొనిపోవఁ ◆ జనదు మీ కింత
యజ్ఞాన మేటికి ◆ నలమె మీతోడి
సుజ్ఞాన మెల్ల నె ◆ చ్చోఁ జూఱఁవోయె
నీరీతిఁ దరువాత ◆ నెఱుఁగరే జగము
వారలచే నింద ◆ వచ్చు మీకరుణ
ననఘ సుజ్ఞానుల ◆ మైతిమి మేము
మును మీకుఁ బత్నిదా ◆ మొదలికి లేదు
తనువు మీఁదియు గాదు ◆ తనయుఁడేరీతి
జనియించె చెప్పుఁడా ◆ సహజమైనట్టి
మీ శరీరముతోడ ◆ మీయాత్మగూడి
వాసికెక్కినయట్టి ◆ వనితకుఁ గన్న
తనయునిఁ గొనియాడఁ ◆ దగు నదిగాక
జననాథులై మున్ను ◆ సమసినవారి
వీక్షింపవే యని ◆ వేవేల గతుల
నక్షణ సిద్ధ దే ◆ హాంధ కారంబు
చెప్పుచో నించుక ◆ చెవియొగ్గి వినెడి
యప్పుడు నందనుఁ ◆ డా యోగివరుని
చీరపై గింకిరి ◆ చేయ గోరక్షుఁ
జేరరమ్మని పిల్చి ◆ చేతికిఁ బుత్త్రు
నిచ్చి గోరక్షక ◆ యీ రోఁత గడిగి
తెచ్చి యిమ్మనుటయుఁ ◆ దెంపునఁ దిట్ట
మఱుఁగుకుఁ గొనిపోయి ◆ మత్స్యేంద్రుఁ దెలుపఁ
దెఱుఁగొండు లేదని ◆ దిగ్గన బాలుఁ
బడవైచి కుదుకనఁ ◆ బదములు నూఁది
మెడఁద్రొక్కి మెఱుఁగారు ◆ మృత్యువు కోర
వడువున మిక్కిలి ◆ వాఁడైన చూరి
వడిఁగేలఁగొని పొట్ట ◆ వ్రక్కలు వాఱఁ
బొడిచి ప్రేవులు డుస్సి ◆ బొడ్డు మోవంగఁ
గడుపాఱగాఁ గోసి ◆ గజగజ గుండె
లదరఁ జేతులు గాళ్లు ◆ నా డొక్కలోని
కదిమి ముద్దగఁ జేసి ◆ యది మీఁదు గడిగి
చక్కన నరనాథు ◆ సన్నిధిఁ బెట్టి
స్రుక్కక పలికె న ◆ చ్చుగ బాలురోఁత
చెచ్చెరఁ బాపి తె ◆ చ్చితినన్న రోఁత
నిచ్చలోఁ దలకొని ◆ యీక్షించి తన్ను
మునుఁగఁ గప్పిన పుత్ర ◆ మోహంబు కతనఁ
గనుగవ బాష్పపుఁ ◆ గణములు గ్రమ్మ
గోరక్షుఁ గనుఁగొని ◆ గురుఁడు నిట్లనియె
నీరీతి పాపంబు ◆ నేల చేసితివి
పక్షంబులేక నా ◆ పట్టినిఁ బట్టి
కుక్షివ్రచ్చితి విట్లు ◆ గురుసుతుఁ డనక
కొంతయు దయలేక ◆ కోసితి వీని
...... ...... ...... ....... ....... ....... ...... ......
శీతాంశుభంగిఁ బెం ◆ చితిని యీ శిశువు
...... ....... ....... ...... ..... ....... ...... .......
వధియించి చేసితి ◆ వట్టి దుష్కృతము
అని పుత్రకుని నుర ◆ మందునఁ జేర్చు
కొను గురునాథుతో ◆ గోరక్షుఁ డనియె
వినుఁడు మి మ్మీయవి ◆ వేకంబుఁ బాపి
కొనిపోదు నటుచేయఁ ◆ గూడక యున్న
నెరవాడికత్తి క్రొ ◆ న్నెత్తురులొలుక
తరలక దిగ్గనఁ ◆ దనతలఁ గోసి
నిలుపుదు నిప్పుడు ◆ నీ మృదుపాద
జలజంబుపై నని ◆ సయ్యనఁ గత్తి
గళమునఁ గదియింపఁ ◆ గని సంభ్రమమునఁ
దలకొని లేచి యా ◆ తనిచేయివట్టి
చనదు పుత్రక సాహ ◆ సంబు మదాత్మ
నణఁగిన దుమోన్‌హ ◆ మణఁగె నీ కతనఁ
బొంది క్రమ్మఱ దించి ◆ బుద్దిలో ననుచు
నందంద గోరక్షు ◆ నక్కున గదిమి
యీ జనపతి బొంది ◆ నేఁ బ్రవేశించి
రాజనై పెంపొంది ◆ రాజ్యంబు సేయు
వెరవునేరక యున్న ◆ విభుఁగూర్చు మంత్రి
పురుహూతు మంత్రి సు ◆ బుద్ధిఁ బ్రబుద్ధుఁ
డనువాఁడు నాకు రా ◆ జ్యము సేయునట్టి
యనువులు దెలుపుచు ◆ ననవరతంబు
నిచ్చలో నా తెఱఁ ◆ గెఱిఁగియు బయలు
పుచ్చక కొలిచె నే ◆ ర్పున నట్టి ఘనున
కెంతయు నెఱిఁగింప ◆ కేఁగుట మాకు
పంతంబుగాదింక ◆ పాపము వచ్చు
నని పిల్వఁ బంపఁ జ ◆ య్యనఁ జనుదెంచి
తనకు మ్రొక్కిన మంత్రిఁ ◆ దగ గారవించి
చేసన్నఁ గదియంగఁ ◆ జేర్చి గూఢమున
నా సిద్ధ ముఖ్యుఁ డి ◆ ట్లని యూనతిచ్చె
నోమంత్రి తిలక మీ ◆ యుర్వీశ్వరుండు
దా మేనుదొలఁగిన ◆ తఱి వానిబొంది
లోన మదాత్మ గీ ◆ ల్కొనఁజేసి రాజ్య
మూనిన వెలికి నే ◆ నుంట నీ వెఱిఁగి
తెఱఁగొప్ప నెనరికిఁ ◆ దెలుపక భక్తి
నరమర లేక మ ◆ మ్మనవరతంబు
కొలిచిన నీమంచి ◆ గుణముకు మెచ్చి
తలకొని నేనింకఁ ◆ దనయుఁగా నెలమిఁ
గైకొని యోగమా ◆ ర్గము నెఱిఁగించి
శ్రీకరంబగు దేహ ◆ సిద్ధియు నొసఁగు
కౌతుకమున నుంటిఁ ◆ గపటంబు లేక
నీతలం పెఱిఁగింపు ◆ నిజముగా ననుచు
నడిగెడు తఱిని మ ◆ త్స్యేంద్రుకు మ్రొక్కి
కడునుబ్బి మంత్రి శే ◆ ఖరుఁడు నిట్లనియె
నాకోరుకోర్కెలు ◆ నాకు సిద్ధించె
చీకుకు దృష్టియుఁ ◆ జెవిటికి వినికి
యాఁకొన్నవానికి ◆ నభిమతార్థములు
మూకుకు వాకు రు ◆ గ్మునకౌషధంబు
సారమైనట్టి మీ ◆ చరణపద్మములు
...... ....... ...... ...... ....... ....... .......
ఇంక నామనమున ◆ కించుసేవయును
శంకరునాన మీ ◆ చరణంబులాన
నావుడు మత్స్యేంద్ర ◆ నాథుఁడుల్లంబు
వావిరి విలసిల్ల ◆ వరకృపామృతము
దళుకొత్తుచూడ్కు లు ◆ దనరఁ బ్రబుద్ధు
నలరంగ వీక్షించి ◆ యనియె మున్నెలమి
శివుఁడు నాకొసఁగిన ◆ సిద్ధులన్నియును
నవిరళ విద్యార ◆ హస్యముల్ దెలిపి
తక్కిన మణి మంత్ర ◆ తంత్రౌషధముల
జక్కన నెఱిఁగించి ◆ సకల సిద్ధులకు
పూజ్యుఁడై వెలయఁగఁ ◆ బుణ్యతయోగ
రాజ్యపట్టము సుస్థి ◆ రముగాఁగఁ గట్టఁ
గోరి పాలించు నా ◆ కూర్మిశిష్యుండు
గోరక్షనాథుఁడీ ◆ గుణవిభూషణుఁడు
భూనుత సామ్రాజ్య ◆ భోగానురక్తి
నూని తమ్మందఱ ◆ నుల్లంబులోన
మఱచి యేమున్న నీ ◆ మరులు వేషంబు
తెఱఁగొప్పఁబూని యే ◆ తెంచినాఁ డిటకు
మముఁదోడుకొని పోవ ◆ మాకింక నిందు
నిముషమాత్రంబును ◆ నిలువంగఁ జనదు
జననాయకుని బొంది ◆ చయ్యనఁ బాసి
చనియెద మీ రాజ్య ◆ సంగతిఁ ద్రోవఁ
గావించి గోరక్షుఁ ◆ గదిసి రమ్మనుచు
వేవేగ బాలకు ◆ వృత్తాంతమెల్ల
నా విమలాత్ముతో ◆ నలయక చెప్పి
...... ...... ....... ....... ....... ....... .......
గోరక్షుచేతికిఁ ◆ గుణపంబు నిచ్చి
నేరుపుమీఱంగ ◆ నీవు దెమ్మనిన
పదపడి నామహీ ◆ పాలుని మేన
నొదవెఁ దాపజ్వర • ముత్తమాంగమున
[24]నెరుపగ్గలింప న ◆ య్యెడ వైద్యులెల్ల
నరిమురిఁ జేరపు ◆ డౌషధక్రియల
నుపచరింపుచుఁ గర ◆ మొయ్యనఁ బట్టి
విపరీతమై నాడి ◆ విడిచి మీఱెడిని
భూవరుఁ బ్రతికింపఁ ◆ బోల దింకనఁగ
నావేళ మత్స్యేంద్రుఁ ◆ డా సమీరణుని
నదిమి మూలాధార ◆ మందుఁ దానొత్తి
పదపడి కుండలీ ◆ పదమున మధ్య
ముననున్న నాళీక ◆ మున గొల్సియందుఁ
గొనకొన కటయూర్ధ్వ ◆ కుండలిఁ జేర్చి
తడయక బ్రహ్మరం ◆ ధ్రమునఁగా జీవు
వెడలించి యామహీ ◆ విభు బొందివిడిచి
చనిన బంధువులు నా ◆ శ్చర్యంబునొంది
కనుఁగొనిరట దివ్య ◆ కాయంబు చొచ్చి
పోలంగ నిద్దుర ◆ వోయిమేల్కనిన
లీలఁ దామరలఁ బో ◆ లెడి లోచనములు
విచ్చి శిష్యులనెల్ల ◆ వీక్షింపఁదడవ
గ్రచ్చఱ ముదము సం ◆ భ్రమమును భక్తి
తోరమై మనసులు ◆ తొంగలింపంగఁ
జౌరంగి మొదలుగాఁ ◆ జాఁగిలిమ్రొక్కి
చేతులు మొగుడించి ◆ శిరమునఁ జేర్చి
జాతిగా మత్స్యేంద్రు ◆ సన్నుతిఁజేసి
రట రాజుచావున ◆ కడలెడువారిఁ
బటుబుద్ధి నూరార్చి ◆ పార్థివేశ్వరుఁడు
మన్నించు తనతోడి ◆ మంత్రుల హితుల
మన్నీలఁబిలిపించి ◆ మఱి ప్రబుద్ధుండు
గప్పుమీఱఁగ నెఱుం ◆ గనివానిఁ బోలి
రప్పింపుఁడిప్పుడు ◆ రాకుమారకునిఁ
గ్రమమునఁబట్టంబు ◆ గట్టుద మనుచు
రమణీజనముఁ బంప ◆ రయమున నేఁగి
పాపని తల్లికిఁ ◆ బ్రణమిల్లి వారు
భూపాలు మంత్రి ప్ర ◆ బుద్ధుఁడు మమ్ముఁ
బంపె నిచ్చటికి నీ ◆ పట్టిఁబట్టంబు
సొంపారఁగట్టింప ◆ శుభలగ్నమరసి
నావుడు భీతి న ◆ న్నాతి చింతించి
భూవల్ల భుఁడువచ్చి ◆ ముద్దార్చివానిఁ
గొనిపోయె నప్పటి ◆ గోలరాఁడు నేఁడు
...... ....... ..... ...... ...... ....... ...... ......
సందడి నెటు తప్పి ◆ చనియెనో నిద్ర
నొంది యేగృహమున ◆ నున్నాఁడొ లేక
కడువెడసిద్ధుఁ డొ ◆ క్కడును భూపాలు
కడ నుండె నట వాఁడు ◆ గైకొని చనెనొ
యెఱుఁగలేననిన న ◆ య్యింతి వాక్యముల
తెఱఁగు ప్రబుద్ధుతోఁ ◆ దెలియఁ జెప్పుటయు
వెలిమచ్చులను బుర ◆ వీధిసౌధములఁ
దలమైన రచ్చలఁ ◆ దగువారి యిండ్ల
బావులఁ గొలఁకులఁ ◆ బర్ణశాలలను
దేవాలయంబులఁ ◆ దెరలక వెదుకఁ
బంపి పాపని చేటు ◆ పాటు నిక్కముగ
....... ....... ....... ....... ...... ....... .......
నరయించి వగచుచు ◆ నారాజకులుని
నురుభుజబలవిక్ర ◆ మోన్నతునొకని
వెలయఁ బట్టము గట్టి ◆ విభు బొందితోడ
వలనొప్పఁ దొల్లిటి ◆ వనజలోచనల
సరగనగ్నిప్రవే ◆ శంబు సేయించి
మరి పెండ్లియైనట్టి ◆ మానినీమణులఁ
గరమొప్ప బారహ ◆ కన్యకానామ
పురమున నునిచి ప్ర ◆ బుద్ధినేర్పునను
దనరు నమాత్యుల ◆ దగ్గఱఁ బిలిచి
వినుఁడుప్రాణంబులు ◆ విడుచు నవ్వేళ
ధరణీశ్వరుఁడు నన్నుఁ ◆ దనకుఁ బుణ్యముగ
నరసితీర్థంబుల ◆ నాడుమీ యనుచుఁ
బనిచెఁగావున నింకఁ ◆ బతిహితం బొదవఁ
జనియెదనని రాజ ◆ సతుల నందఱను
దనపుత్ర వర్గంబుఁ ◆ దానప్పగించి
...... ....... ....... ....... ....... ..... ......
వేడుకఁ దనపురి ◆ వెడలి గోరక్షుఁ
గూడి దిగ్గన వచ్చి ◆ గురునకు భక్తి
నానతుఁడై నిల్చె ◆ నపుడు గోరక్షుఁ
డానాథముఖ్యు ని ◆ ట్లని వినుతించె
శ్రీగురునాథ సు ◆ స్థిర దయోదార
యోగిపుంగవ దివ్య ◆ యోగసంస్తుత్య
యోగిపీయూషప ◆ యోనిధి చంద్ర
నాగేంద్రవలయనం ◆ దన భవన్మహిమఁ
బ్రణుతింప భాషాధి ◆ పతియును శేష
ఫణియును జాలరే ◆ పట్టున నైన
మఱి జనంబుల కల్ప ◆ మతులకుం దరమె
మెఱమెఱయునులేక ◆ మీ పదాబ్జములు
నిరుపమభక్తిని ◆ నిచ్చలుఁ గొల్చి
పరిణామమున నుండు ◆ భాగ్యంబు దొరకె
ననుచు నానందాశ్రు ◆ లందంద తొరఁగఁ
గొనియాడ ముదమంది ◆ గోరక్షనాథు
గారవం బెసఁగంగఁ ◆ గౌఁగిటఁ గదయఁ
జేరిచి నీయట్టి ◆ శిష్యుండు గలఁడె
గాన నీ జగములఁ ◆ గలకాలమెల్ల
నే నెపంబునను జే ◆ టెసఁగక మెలఁగు
నీ దివ్యతనువున ◆ నీవుండు మాత్మఁ
బాదుగాఁ బదనిచ్చి ◆ పరమేశు కరుణ
నబ్బిన భవ్య యో ◆ గామృత లహరి
నుబ్బుతోఁ జొక్కున ◆ నుబ్బంగఁ గలిగె
ననియని భంగించు ◆ నా మీననాథు
నొనర గోరక్షకుఁ ◆ డొందంగమ్రొక్కి
మరి గురునాథుకు ◆ మఱుఁగుపడంగఁ
గరమర్థిఁజౌరంగి ◆ కాళ్లకుమ్రొక్కి
చక్కనఁ దన పదా ◆ బ్జములకు నొరఁగఁ
దక్కిన సిద్ధులఁ ◆ దగఁ గౌఁగిలించి
యా మీననాథుతో ◆ ననియె గోరక్షుఁ
డేమి సేయుదునింక ◆ నీ బాలు ననిన
వినుము గోరక్ష మా ◆ వీర్యంబువలనఁ
బెనుపొందెఁ గాన నీ ◆ పిన్న వానికిని
నిర్మలోదకముల ◆ నిండారు కొనఁగఁ
గూర్మాసనంబుగాఁ ◆ గొనురార నునుపు
మంజునాథాఖ్యను ◆ మహిమఁబేరొంది
రంజిల్లు చిరతర ◆ ప్రఖ్యాతి ననిన
నగుఁగాక యని గురు ◆ నానతి క్రమము
తగనొనరించె నా ◆ తఁడు నాఁటనుండి
పుంజమై మేని దీ ◆ ప్తులు పర్వఁబొదలి
మంజునాథుండన ◆ మహిమఁ బెంపొంది
మెఱయుచునుండె నా ◆ మీననాథుండు
మఱి శిష్యవరుల స ◆ మ్మదమునఁ జూచి
పలికె నిచ్చట నుండఁ ◆ బనిలేదు మనకు
వలయు నెచ్చటికేని ◆ వడిఁజనవలయుఁ
గాకున్న సాకసా ◆ కల మన తెఱఁగు
లోకు లెఱింగిన ◆ లోకంబులోన
సపసడి వచ్చును ◆ నమ్మరు వెంపు
జపచపనౌ మునుల్ ◆ సలిపెడి భక్తి
నృపతు లీరసమున ◆ నిజపురప్రాంత్య
విపుల పర్వత గుహా ◆ విపిన భూచక్ర
పురవర ప్రాసాద ◆ ముల వసియించు
పరమయోగుల బాధ ◆ పఱతురుగానఁ
జను టుచితంబని ◆ చంద్ర శేఖరుని
తనయుఁ డచ్చటు వాసి ◆ ధరణీధరములు
పుణ్యాశ్రమంబులు ◆ పుణ్యవాహినులు
పుణ్యతీర్థంబులు ◆ పురములు గడచి
నిర్మలోదకములు ◆ నిండారుచున్న
నర్మదఁ గని కృత ◆ స్నానుఁడై యచటఁ
దరలి ముందటఁ గొంత ◆ దవ్వుల వరలు
నెఱెలు సొంపారుచు ◆ నిగనిగమించు
చఱులను ముత్యాల ◆ సరులనఁ దొరఁగు
సరులను బుష్పమం ◆ జరులను బొల్చు
తరులను ఫలములు ◆ దళములు నేల
నురుల శాఖలమీఁద ◆ నొండొంటిదాఁటు
హరులును నీల మే ◆ ఘంబుల కరణిఁ
....... ....... ....... ........ ....... ....... ........
కరులును గలిగి భీ ◆ కరముగా నొప్పు
గిరులను నిండారు ◆ కెందమ్మి దొనలఁ
దనరు నరేంద్ర భూ ◆ ధర మెక్కి యచట
ఘన గుహ ద్వారంబు ◆ గప్పిన శిలలు
తలఁగ వేయించి మో ◆ దముమీఱ నందు
నెలకొని గురుభక్తి ◆ నిరతు గోరక్షుఁ
జూచి ప్రబుద్ధునిఁ ◆ జూపి మత్స్యేంద్రుఁ
డేచిన కృపఁబల్కె. ◆ నిమ్మంత్రి ముఖ్యుఁ
డచ్చుగా మద్వాక్య ◆ మాత్మలో నమ్మి
వచ్చె సౌఖ్యములెల్ల ◆ వదలి నీ వెనుక
సమ్మదం బెసఁగ నీ ◆ సచివపుంగవుని
కిమ్ము నీవుపదేశ ◆ మెడసేయ కనిన
నగుఁగాక యని పోయి ◆ యా సమీపమునఁ
బొగడొందుకొలనఁ బ్ర ◆ బుద్ధుఁ గ్రుంకించి
ద్ధాసనంబుగాఁ ◆ జేసి శ్రీ గురుని
బుద్ధిలోపల తిరం ◆ బుగ నిల్పి యున్న
మును చతుర్విధ యోగ ◆ ముఖ్యసిద్ధులను
తనరారు దివ్యౌష ◆ ధములను మణుల
నిచ్చి ప్రబుద్ధు మ ◆ త్స్యేంద్రు సన్నిధికిఁ
జెచ్చరఁదెచ్చి సు ◆ స్థిర భక్తిఁ గేలుఁ
దామెరల్ మొగిడించి ◆ దగ బుద్ధసిద్ధు
నామ మా తనికి స ◆ న్మతిఁ గృపఁజేసి
యా మహా యోగీంద్రుఁ ◆ డా గుహలోన
క్షేమమారఁగ నిజ ◆ శిష్యులు దాను
నుప్పొంగ యోగామృ ◆ తోన్నత కళలఁ
దెప్పలఁ దేలుచు ◆ ధృతిఁగొంతకాల
ముండి తా శిష్యుల ◆ ముదమునఁ దెలిపి
నిండారు సత్కృప ◆ నీక్షించి మఱియు
మీననాథుఁడు పల్కె ◆ మిగుల భూతేశు
పూనిన కృపఁజేసి ◆ పుత్రకులార
యోగమంతయు మీకు ◆ నొనఁగూడె నిపుడు
వేగంబె చని పృథి ◆ వీ మండలంబు
గలయ గుమ్మరఁ బొండు ◆ ఘనుఁడు గోరక్షుఁ
డెలమి మీఱఁగ మీకు ◆ నెల్ల పూజ్యుండు
పరగ శాశ్వతసిద్ధ ◆ పట్టభద్రుండు
గురుభక్తి ప్రాపించు ◆ కొని యుండుఁ డతని
నరనుతుఁ జౌరంగి ◆ నాథు నే మలిగి
గురుపదముకు దొలం ◆ గుము నీ వటంచు
పలికినారము గాన ◆ భక్తి మమ్మతఁడు
కొలిచి నెమ్మదిఁ ◆ జలిగొండ కేతెంచు
మీరు మీనేర్పున ◆ మీకథ లెల్ల
ధారుణిపైఁ బ్రసి ◆ ద్ధము గాఁ[25]గఁజేసి
సన్నుతి యోగశా ◆ స్త్రములు మీపేరు
విన్నఁగౌతుకమార ◆ విరచించి మరియు
గురుభక్తి నిరతుల ◆ గుణరత్న నిధులఁ
బురుపార్థపరులఁ బ్ర ◆ బుద్ధుల బుధులఁ
గులశీలవ్రతులను ◆ గులవర్త నులను
నలము తేజులను స ◆ త్యవ్రతాన్వితులఁ
దెలిపి యోగం బుప ◆ దేశించి దెసలఁ
గలయఁ ద్రిమ్మరుచుండఁ ◆ గా నియమించి
యెలమి మీఱఁగ మీర ◆ లిందఱు మగుడఁ
జలిగొండ కే తెండు ◆ చనుఁడింక ననఁగ
ముదమారఁ గరములు ◆ మొగిచి ఫాలమునఁ
గదియించి యా సితి ◆ కంఠునందనున
కనియె గోరక్షుఁడీ ◆ యఖిల భూతములఁ
గనుకలిఁద్రిమ్మరఁ ◆ గతమేమి మాకు
మీ పాదములు గొల్చి ◆ మీ వెనువెంట
నేపార తుహిన మ ◆ హీరుహంబెక్కి
యందు మీరానంద ◆ మడర వసించు
కందువ నిక్కంబు ◆ గా నాత్మఁదెలిసి
తడయక మీయాజ్ఞ ◆ తలను వహించి
పుడమిఁ ద్రిమ్మర మరిఁ ◆ బోయెద మిట్టి
చనవిచ్చి కృపచేయఁ ◆ జను నన్నదాని
కనుమతి గావించి ◆ యా దివ్యయోగి
తరమున శిలలెత్తి ◆ తన గుహ వాతఁ
దెఱపి దోపకయుండఁ ◆ దెట్ట వేయించి
చేరి గోరక్షాది ◆ సిద్ధులు గొలువ
భోరన గిరిడిగ్గి ◆ పోవుచుఁ ద్రోవ
నతిసమున్నత ప్రాస ◆ హాటక ద్వార
వితతగోపుర రత్న ◆ వేది వితాన
సలలితధ్వజ హేమ ◆ సౌధ మాణిక్య
కలిత తోరణ తురఁ. ◆ గ ద్విరదాభి
రామమై కుసుమితా ◆ రామమై పుణ్య
ధామమై లోకమా ◆ తకు మహాకాళి
కెలమితో వసియింప ◆ నెల్ల కాలమును
నెలవైన యుజ్జయ ◆ నీ పురిఁ గాంచి
సరిఁజొచ్చి యచ్చట ◆ సవిధముననుఖర
కరవాళ దళిత సూ ◆ కర కంఠరక్త
పంక పంకిల సమీ ◆ ప ప్రదేశమును
హుంకారరావ మ ◆ హోగ్ర భేతాళ
శాకినీ భూత పి ◆ శాచ సంకులము
నైకనత్కనక స ◆ మంచిత శిఖర
మంజుకీలిత శోణ ◆ మాణిక్య కిరణ
[26]పుంజ సంరక్త న ◆ భో మండలమున
నతిరౌద్రరూప మ ◆ హాకాళనాథ
వితత జటాజూట ◆ వివర భుజంగ
పటుతర పూత్కార ◆ భవ పవమాన
చటుల చిత్రధ్వజ ◆ శత విరాజితము
పణవ భేరీ పటు ◆ పటహ మృదంగ
ధణధణ ధ్వాన వి ◆ దారితాశాంత
కరికర కుహరంబు ◆ కర్పూర తైల
పరిచిత దీపికా ◆ ప్రకరంబు నైన
యా మహాకాళీ గృ ◆ హంబున కరిగి
వేమాఱు దన్మూర్తి ◆ వీక్షించి యందు
గఱగఱమని మేని ◆ కండ లొండొంటిఁ
దఱిగి వ్రేల్చెడివారు ◆ తలల మొదళ్లఁ
దిగిచి గంధంబుగ ◆ దేవిపై నెల్ల
నిగుడించు వారలు ◆ నెరయ సాహసము
తోరంపుఁ బ్రేవులు ◆ దుస్సిరాఁదిగిచి
తోరణంబులు గట్టఁ ◆ దొణఁగెడువారు
గాలాలఁ దలక్రిందు ◆ గా బిట్టు బడియు
వ్రేలెడు వారును ◆ విస్మయం బొదవ
నరములు ద్రెంచి కి ◆ న్నెర తంతులకును
నిరవుగాఁ గూర్చి వా ◆ యించెడివారు
తల లుత్తరించి త ◆ త్పాద పంకజముఁ
జలియింప కర్థిపూ ◆ జలు సల్పువారు
నైన సాధకుల నం ◆ తంతఁ గన్గొనుచుఁ
దాను వసించి మో ◆ దమున నారాత్రి
యా పురంబున నుండి ◆ యమ్మఱు నాఁడు
రేపాడి గదలి ధా ◆ త్రీస్థలిం బొదవ
నెసఁగు ద్వారాపురి ◆ కేగినాఁడందు
వసియించి మఱునాఁడు ◆ వనజ బాంధవుఁడు
పొడుపు గుబ్బలిమీఁదఁ ◆ బొడచూపువేళఁ
దడయక శిష్యులుఁ ◆ దానునుం గదలి
చనిపురంబులు నూళ్లు ◆ జగతీ ధరములు
వనములు నదులు దే ◆ వాలయంబులును
మనమారఁజూచుచు ◆ మరి యనుష్ఠాన
ధనుల నానావిధ ◆ దర్శన స్థలులఁ
బరమయోగులను ద ◆ ప్పక తాపసులను
పరధర్మ [27]రతులను◆. బహుకళావిదుల
యతివరులను సోమ ◆ యాజులఁ బాశు
పతులను బతిభక్తిఁ ◆ బరగు సాధ్వులను
వితత మంత్రాగమ ◆ వేదుల నీతి
చతురుల శంభుపూ ◆ జాపరాయణుల
నరుదారఁ గనుఁగొన్చు ◆ నమ్మీననాథుఁ
డురువీచిసంఘట్ట ◆ నోద్ధరాజీవ
రాజిపరాగాను ◆ రంజిత పక్ష
రాజమరాళ చ ◆ క్రక్రౌంచమిథున
కలకలాలాప సం ◆ గతి విలసిల్లు
సరయువు పొంతను ◆ జాలఁ బరిఘల
నట్టళ్ల నలవరు ◆ లగుకవాటముల
గట్టివౌ కోటల ◆ ఘన గోపురముల
మలయు పతాకల ◆ మణితోరణముల
ధళధళ మించు సౌ ◆ ధముల శృంగార
వనములఁ జెఱువుల ◆ వనజ దీర్ఘికల
మనసిజ మోహన ◆ మంత్ర దేవతల
మురువునఁ జెన్నారు ◆ ముదతలం గలిగి
పరుల కసాధ్యమై ◆ పరఁగు నయోధ్యఁ
జూచి యన్నగరంబుఁ ◆ జొచ్చి శిష్యులకు
నేచిన వేడ్క మ ◆ త్స్యేంద్రుఁ డిట్లనియె
నెలమి నీ పురము ము ◆ న్నే లెడి రాజు
జలరుహ మిత్రవం ◆ శ ప్రదీపకుఁడు
దశరథరాముఁడు ◆ దనపిన్ననాఁడు
దిశల సత్కీర్తి చం ◆ ద్రిక లుల్ల సిల్ల
తాటకి నొకకోల ◆ ధరఁగూల నేసె
చాటువగాఁగ వి ◆ శ్వామిత్రు ముఖము
గాచి సుబాహుని ◆ ఖండించి ఫాల
లోచనువిలు ద్రుంచి ◆ లోలత సీతఁ
బరిణయంబై పటు ◆ బాణ విక్రమునిఁ
బరశురాముని భంగ ◆ పఱచి కబంధు
నదటార్చి ఖరదూష ◆ ణాది రాక్షసుల
కదనరంగంబునఁ ◆ గాలునిఁ గూర్చి
బలియుని సుగ్రీవు ◆ బంటుగా నేలి
బలభేది తనయుని ◆ బాణ మొక్కటను
దునుమాడి యవలీలఁ ◆ దోయజగంధి
జనకజఁ జెఱఁగొన్న ◆ చనటి, రాక్షసుని
శిరములు చెండాడి ◆ సీతఁదోడ్కొనుచుఁ
దిరిగి యయోధ్య కే ◆ తెంచి యారాజ్య
మరుదుగా నొనరించు ◆ నంత కాలమును
....... ....... ...... ....... ....... ....... ....... ........
నపమృత్యుభయము న ◆ న్యాయ వర్తనము
కపటంబు మరి శత్రు ◆ ఘాతము లేక
తల్లియుఁ దండ్రియుఁ ◆ [28]దానెయై యేలె
నెల్లభూప్రజలఁ బెం ◆ పెసగిన కరుణ
నని మహాపాతక ◆ హరమైన రాము
వినుతచరిత్రంబు ◆ విని శిష్యు లలరఁ
జెప్పి మత్స్యేంద్రుండు ◆ చిరలీలఁ బరఁగు
నప్పట్టణంబుస ◆ నారాత్రి నిలిచి
యటబాసి యుత్తరం ◆ బరిగిన త్రోవఁ
బటుబుదిఁ [29]జనిపాప ◆ బహులతాపటల
దాత్రంబు నఖిల [30]భూ ◆ ధవ ఘనస్తోత్ర
పాత్రంబు నర్జున ◆ పతి చండ కంక
పత్రనిదన్‌ళి తారి ◆ పత్రంబు జూడఁ
జిత్రంబునగు కురు ◆ క్షేత్రంబు గాంచి
[31]యనువున మత్స్యేంద్రుఁ ◆ డచ్చటి మహిమఁ
దన శిష్యులకుఁ బ్రమో ◆ దమునఁ జెప్పుచును
నారాత్రి యందుండి ◆ యమ్మఱునాఁడు
భోరున పయనమై ◆ పోవుచు నెదుర
నలినాస్య కంబుకం ◆ ధరి యుత్పలాక్షి
నలినీలకుంతలి ◆ నావర్తనాభిఁ
గమనీయ చక్రవా ◆ క స్తనింజారు
కుముద గంధిని బిస ◆ కోమలహస్త
నతులశైవాల రో ◆ మావళీ కలిత
నతిసమున్నత సైక ◆ తాంచితజఘనఁ
[32]గలహంసగతిమంద ◆ గతిజలజాస్య
లలిత[33]శీకర హార ◆ లతికా సమేత
నిలజాహ్నవీకన్య ◆ నింపారఁ గాంచి
యెలమి శిష్యులకు మ ◆ త్స్యేంద్రుఁ డిట్లనియెఁ
జలిగొండకూఁతురు ◆ సవతి యీ గంగ
మలహరు జడలలో ◆ మలయు నీగంగ
కపిలుని కోపొగ్నిఁ ◆ గనలిన సగర
నృపతనూజులనెల్ల ◆ నిర్జరపురికి
ననుకంప చిగురొత్త ◆ ననిసిన గంగ
యొనర రానేరక ◆ యున్న వారైనఁ
దను గంగ గంగని ◆ తగఁ బేరుకొనిన
మును ఘోరమగు తపం ◆ బుల దానములను
సుపవాసవిధుల దే ◆ వోపచారముల
జపముల సంధ్యాది ◆ సత్కర్మములను
గ్రతువులఁ బుణ్యతీ ◆ ర్థ స్నానములను
వ్రతములఁ దక్కిన ◆ వాననేమిటను
బఱివోని మేటి పా ◆ పంబుల నెల్లఁ
జెఱచిఁ గైవల్యంబు ◆ చేర్చు నీ గంగ
యనుచు మత్స్యేంద్రుండు ◆ నాదివియందు
జనలోక సేవ్యమై ◆ జంతుసంతాన
జీవనౌషధ పుణ్య ◆ జీవనంబులను
సేవక శ్రీకర ◆ శిఖరంబు లయిన
పరలోక సోపాన ◆ భంగభంగముల
గురుధర్మమార్గాను ◆ కూల కూలముల
నాతతఖ్యాతిఁ ద ◆ టావనీజాత
జాతిలతాజూత ◆ సతతాను విగత
శీతలచ్ఛాయాది ◆ చిత్ర సుజాత
[34]చూతభూజని సత్ప్ర ◆ సూన గంధాది
సమదపుష్పంధయ ◆ ఝంకృతి ధ్వనుల
నమరినముక్తి ప ◆ దాంచిత శ్రవణ
కర్ణికయగు మణి ◆ కర్ణికంజేరి
వర్ణించితత్పుణ్య ◆ వారిలోఁ గ్రుంకి
యాపెంపు శిష్యుల ◆ కనురాగమాత్మ
నేపారమత్స్యేంద్రుఁ ◆ డిట్లనిచెప్పె
వినుఁడు విప్రునిఁ దెగ ◆ వేసినవాఁడు
అనిశంబు లనృతంబు ◆ లాడెడువాఁడు
గురుదేవతాదూష ◆ కుఁడు కృతఘ్నుండు
పరసతీలోలుండు ◆ బాలఘాతకుఁడు
కామించి గురుపత్నిఁ ◆ గవసినవాఁడు
తామసంబునఁ గల్లు ◆ ద్రావినవాఁడు
మొఱఁగి సువర్ణంబు ◆ మ్రుచ్చిలి నతఁడు
తెఱవల గోవులఁ ◆ దెగటార్చు నతఁడు
విరసంబు తలకొని ◆ విషమిడు నతఁడు
కెరలి యింగలమును ◆ గీలించువాఁడు
ఖలుఁడును నాదిగాఁ ◆ గల పాపరతులు
సొలవక వచ్చి యి ◆ చ్చొట మృతిఁ బొంది.
కన్నువినుకలి కం ◆ కణమును దమ్మి
గన్నపాపనిపుఱ్ఱె ◆ కంచంబు నలఁతి
వెన్నెలపువ్వును ◆ వెడవింటి జోదుఁ
దిన్నట్టి కన్నును ◆ ద్రివిధము బాఱు
నేఱును మేడకప్పు ◆ నెమ్ములపూస
పేరుగావించిన ◆ బెబ్బులి తోలు
మూఁడు ముల్కుల పోటు ◆ మునువ్రేలు జడలు
గూడఁదీర్చిన కోర ◆ కొప్పుఁ దామరలఁ
గలువల నగుపించు ◆ కన్నులు నాల
వలపులఁదగిలించు ◆ నాహనోత్తమముఁ
గలిగి నెమ్మదివెండి ◆ గట్టు నెత్తమున
నలవడ విహరింతు ◆ రని నాథముఖ్యుఁ
డటువాసి శ్రీకాశి ◆ హత ఘోరదురిత
పటుగతికాశి నొ ◆ ప్పగఁ బ్రవేశించి
యనవరతంబును ◆ నఖిలాగమముల
విని ముక్తిగలదను ◆ విశ్వాసమునను
దూరభూములనుండి ◆ తుఱుములుగట్టి
వారక చనుదెంచు ◆ వారును మరియు .
మహనీయమగు ముక్తి ◆ మంటపంబులను
బహుపుణ్యకథలు చె ◆ ప్పఁగ విన్నవారి
వరుసఁ జాంద్రాయణ ◆ వ్రతములు నెలలు
జరుపుచుమృతికి వా ◆ చఱచెడివారు
వరకురంగమ ఘన ◆ వ్యాఘ్ర మృగేంద్ర
శరభ చర్మములపై ◆ శంఖమయూర
గోముఖా ఘోర కు ◆ క్కుట మత్స్యసింహ
నామవాచిత్రాస ◆ నస్థులై బడలు
నడుముల నొడ్డియా ◆ ణములు బిగించి
పొడవుగాఁ దొడవులఁ ◆ బొంగి నిక్కించి
ముక్కులతుదలఁ జూ ◆ పులనుంచి వెదవు
లొక్కింత గదలంగ ◆ నుజ్వల స్ఫటిక
జపమాలికలు వ్రేళ్ల ◆ జరుపుచు మంత్ర
జపములు నిష్ఠమై ◆ జరిపెడువారు
నలవడ భూతి స ◆ ర్వాంగములందు
నలఁదిచెన్నారు రు ◆ ద్రాక్ష మాలికలు
ధరియించి చంద్రార్ధ ◆ ధరు నుమారమణుఁ
బరమేశు శతమఖ ◆ ప్రముఖ గీర్వాణ
మకుట కీలిత శోణ ◆ మాణిక్య దీప
నికర నీరాజిత ◆ నిజపదాంభోజు
భావజసంహారు ◆ భవరోగవైద్యు
శ్రీ విశ్వనాథు నా ◆ శ్రితపారిజాతు
నురగభూషణు షోడ ◆ శోపచారముల
వరుసతోఁ బూజించు ◆ వారిని బిల్వ
దళముల సర్ష ప ◆ తండుల వివిధ
ఫలపల్లవాంకుర ◆ ప్రసరమై మెఱయు
ఫలఘృతముల దధి ◆ పాయసాన్నముల
పలనొప్ప వేల్చెడు ◆ వారిని ధర్మ
రతులను యతులను ◆ వ్రతులనుం బాశు
పతులను జూచుచుఁ ◆ బ్రమదంబుమీఱ
నావిశ్వనాథు మ ◆ హామంత్ర నుతులు
గావించి సర్వాంగ ◆ కంబులు మోవ
నవనిఁజాఁగిలి మ్రొక్కి ◆ యచ్చట నేడు
దివసంబు లుండి య ◆ ద్దివ్య యోగీంద్రు
లటఁగాశి విడిచి ప్ర ◆ యాగకు నేఁగి
చటుల సితాసిత ◆ స్ఫారకల్లోల
పటలసంఘట్టనో ◆ ద్భట రవ విజిత
పటునట త్కల్పాంత ◆ పన్నగాకల్ప
చండభుజాదండ ◆ సంరటత్కఠిన
డిండీరదుస్సహ ◆ ఢమఢిమధ్వాన
మై నక్రచక్ర [35]పో ◆ తాధాననికర
మీనకర్కట భేక ◆ మేదురమకర
కులశింశుమార సం ◆ కులమై [36]యఘాద్రి
కులిశమై జగములు ◆ కొనియాడనెసఁగు
నాకసరిద్యము ◆ నాసంగమమునఁ
జౌక సేయక క్రుంకి ◆ సమ్మదంబెసఁగ
నద్దినంబెల్లఁ దా ◆ రటవసియించి
ప్రొద్దున మఱునాఁడు ◆ పోయి యచ్చోట
భువనేశ్వరునిభక్తిఁ ◆ బొడగాంచినాఁటి
దివస మచ్చట సుఖ ◆ స్థితినుండి కదలి
వరలుభూరుహకోట ◆ వైశ్వానరంబు
[37]నెరయుపాశుపతంబు ◆ నీలకంఠంబు
జాగేశ్వరం[38]బనఁ ◆ జను సరోవరము
నాఁ గొమరారు పు ◆ ణ్య స్థానములను
దినములు మూఁడును ◆ దివసద్వయంబు
దినము దినార్దంబు ◆ తెఱఁగొప్పనిలిచి
తారటు చని రట ◆ ధరణీధరంబు
చేరువలోనఁ బ్ర ◆ సిద్ధమైనట్టి
నరసురకిన్నర ◆ నాగగంధర్వ
వరసేవితంబై సు ◆ వర్ణకుంభముల
మెఱయు గోపురములు ◆ మేటికోటలును
[39]తురగలించెడిరత్న ◆ తోరణంబులును
అందంద మారుత ◆ హతినిఁ దొలంకు
నందులపడిగెలు ◆ సభమంద చెలఁగు
పణవభేరీశంఖ ◆ పటహమృదంగ
మణిఘంటికాడిండి ◆ మధ్వానములును
బైపైని దిక్కులఁ ◆ బర్వుదశాంగ
ధూపవాసనలుఁ బొం ◆ దుగఁగపురంపు
బలుకులు నిండారఁ ◆ బసిఁడి పళ్లెరము
నిలిపి ముట్టించిన ◆ నిండువెన్నెలల
తెలుపులు వెదజల్లు ◆ దీపమాలికలు
కలుగు కేదారలిం ◆ గముదిక్కు కేఁగి
యాభువనాధీశు ◆ నంబికారమణు
నాభక్తవత్సలు ◆ నర్థి దర్శించి
పదివేలభంగులఁ ◆ బ్రణుతించి మ్రొక్కి
మదిభక్తిసేకొన్న ◆ మత్స్యనాథుండు
సంశయింపకవచ్చి ◆ జలములు గ్రోలి
వంశపావనులగు ◆ వారు ముక్తికిని
హంసమండల మెదు ◆ రై చనంజేయు
హంసగుండముచూచి ◆ యాజలం బాని
యచ్చోట ననురక్తి ◆ నాదినంబుండి
చెచ్చెర మఱునాడు ◆ సితధామధామ
[40]తారాద్రితారక ◆ తార మరాళ
[41]సారసఘనసార ◆ సార సారంగ
ధర దరహాస చం ◆ దన[42]కుంద బృంద
హర హరిద్విప సుధా ◆ హార గోక్షీర
విశదప్రభావళి ◆ విన్నున సకల
దిశలెసఁగఁగ గప్పి ◆ తెట్టుకొనంగ
వెలుఁగొందు నవరత్న ◆ విమల శృంగముల
మెలఁగాడు కస్తూరి ◆ మృగములగముల
చలివెలుగులు వెద ◆ చల్లు నెత్తములఁ
జెలఁగాడు నప్పర ◆ స్త్రీలమొత్తములఁ
దరుణప్రవాళ[43]ల ◆ తాంకూరములను
విరిసియేప్రొద్దును ◆ నెలయు కంజములఁ
గొమరారు నెత్తమ్మి ◆ కొలఁకులదరుల
రమణఁజరించు మ ◆ రాళబృందములఁ
గమనీయముగఁ జంధ్ర ◆ కాంతంపుఁజరులఁ
బ్రమదంబునిండారఁ ◆ బాడుకిన్నరుల
ఘనరవంబుకు మాఱు ◆ గర్జించుహరుల
ననిశంబుఁ జరులఁ ◆ గోరాడెడి కరులఁ
దిరముగా నీడలు ◆ తిరుగని తరుల
సరితపంబులు సల్పు ◆ సన్ముని వరులఁ
జెలులను దాఁగూడి ◆ చెలఁగు నిర్జరుల
జలువిడి చరులపైఁ ◆ బారు వానరుల
దివ్యౌషధములను ◆ దివ్య వృక్షముల
దివ్య విహగముల ◆ దివ్య ధేనువులఁ
బరుసవేదుల బలు ◆ పారు మందార
తరుణ కదంబ చిం ◆ తామణీ తతుల
రమణీయమగు సిద్ధ ◆ రసకూపములను
సుమహిత [44]బహుపాద ◆ శోభితంబగుచుఁ
బొలుపొందు నీహార ◆ భూధరేంద్రంబు
నెలమి శిష్యులు దాను ◆ నెక్కి యొండొండ
నెసఁగ విచిత్రంబు ◆ లెల్లఁ గన్గొనుచు
మసలక చని మున్ను ◆ మదనాంతకునకుఁ
దెఱఁగొప్పఁ బార్వతీ ◆ దేవి తపంబు
నెరపిన తావును ◆ నీలకంధరుని
తాలిమిఁ జెరుపఁ బం ◆ తముఁబూని యేయఁ
దూలగింపుచు వచ్చి ◆ తుంట విల్కాఁడు
ఆదిదేవుని నిట ◆ లాగ్నిచే శిఖల
బూదియగాఁ గాలి ◆ పోయిన తావుఁ
బర్వతకన్యకా ◆ పరిణయోత్సవము
గీర్వాణులెల్ల వీ ◆ క్షించుచు వేడ్క
వచ్చినతావు నీ ◆ శ్వరునిచే సురలు
పచ్చనివిల్కాని ◆ ప్రాణముల్ మగుడఁ
బడసిన ఠావును ◆ బరమ సమ్మదము
గడలొత్త శిష్య వ ◆ ర్గముకుఁ జూపుచును
జనియందు లోచనో ◆ త్సవకరంబైన
ఘనగుహాభవనంబుఁ ◆ గని ప్రవేశించి
యాలోన దివ్య యో ◆ గామృత వార్ధి
నోలలాడుచును శి ◆ ష్యులుఁ దానునుండె
నని శతుర్దశ భువ ◆ నాధీశు పేర
వినుత వేదాగమ ◆ వేద్యుని పేర
భావనాతీతప్ర ◆ భావునిపేర
సేవకోత్పల షండ ◆ శీతాంశు పేర
భృంగీశతాండవ ◆ ప్రీతాత్ము పేర
గంగాతరంగ సం ◆ గతమౌళిపేర
ఘనముక్తిశాంత భి ◆ క్షా వృత్తిహృదయ
వనజ ప్రభాత ది ◆ వాకరు పేర
నభిమతార్థప్రదా ◆ యకు పేరనిత్య
శుభమూర్తి మల్లికా ◆ ర్జునదేవు పేర
నారవితార శ ◆ శాంకమై వెలయు
గౌరనామాత్య పుం ◆ గవ కృతంబగుచు
ననువొందు నీ నవ ◆ నాథ చరిత్ర
మను కావ్యమునఁ జతు ◆ ర్థాశ్వాస మయ్యె.
- ↑ కెల.
- ↑ పోదండుదర్శింప బోదాడుయనుచు
- ↑ సత్పుణ్యాది.
- ↑ 'కమండలువులు' ఆయుఁ బఠింపవచ్చును.
- ↑ నయిదురాత్రిళ్లు నచటవసించి.
- ↑ వగుటయామార్గమా తెఱగు.
- ↑ ఇది కవిప్రయుక్తమనియే తోచెడిని.
- ↑ నెవ్వరు చనగవైచి
- ↑ దద్దయుమీర.
- ↑ దూలగా.
- ↑ ముదము సాష్టాంగ.
- ↑ డుజ్జునకుఁ బూర్వముత్వము రాకపోవుట సంజ్ఞావాచకములలోఁ బ్రాయికముగాఁ గనఁబడుచున్నది.
- ↑ బలిశనె నృపుడని.
- ↑ నరులుమీరిన విప్రవరులు నందరును.
- ↑ పదినూరువురును.
- ↑ రత్నావతియును రమణికెయును రత్నా.
- ↑ బ్రనవ.
- ↑ మనువార.
- ↑ దంచనమైతీగె.
- ↑ పుడమి మిన్నెల్లను పొగడుంగమైల.
- ↑ మొలకట్టుకటి.
- ↑ నీలమై.
- ↑ తెగతెంపగా నేల.
- ↑ ఎరుపు-ఎరియు ధాతువునుండి యేర్పడినదై యుండునోపు.
- ↑ ద్దముగానుపించి.
- ↑ పుంజసంజనన నభో.
- ↑ ధర్మపరుల శాస్త్రాయితుల.
- ↑ దానెయైయపుడు.
- ↑ జనుచుండ.
- ↑ నఖిలలశే ధ్వజఘనస్త్రోత్ర.
- ↑ యనమున్ను.
- ↑ గతహంసగమన నుద్గతభాస్యరహిత
- ↑ శేఖర.
- ↑ చూతనాతని.
- ↑ వాతాయనమకర.
- ↑ హిమాద్రి.
- ↑ నేపారి.
- ↑ రముజెప్పజన.
- ↑ తరగభటరత్న.
- ↑ తారాతిరాభిసోద్దారమందార.
- ↑ సారసారస ఘనసారసాపూర, ధర.
- ↑ దనకురంగదబృంద
- ↑ తాతోరాం కుజముల.
- ↑ బహుహృద్య.