నరుడు/ఐదవ భాగం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఐదవ భాగం

విషాదయోగం

జెన్నీ ఏమయిపోయిందో లోనవాలాలో మకాం పెట్టి మూర్తి ఆలోచించుకుంటూ కూచున్నాడు. లయొనెల్ దగ్గిరనుండి ఇంతట్లో ఒక ఉత్తరం చక్కా వచ్చింది. మూర్తి బొంబాయి వచ్చి చార్జిపుచ్చుకుని మూడురోజులయింది. లోనవాలా వచ్చి రోజయింది. ఇవాళ లయొనెల్ దగ్గిరనుండి ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరం బొంబాయి మెట్టూరు, లోనవాలా, మైసూరు, శివసముద్రం, గరిసెప్ప, బొంబాయి వచ్చి అచటనుంచి మళ్ళీ లోనవాలా వచ్చింది.

మూర్తి ఢిల్లీలో ఉండే రోజుల్లో లయొనెల్‌కు ఎన్నో ఉత్తరాలు రాసేవాడు. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలయిలలో లయొనెల్ దగ్గిరనుండి ఉత్తరాలు వస్తూనే వున్నాయి. లయొనెల్ ఒకడే మూర్తికి సర్వవిధాలా మద్దతు చేస్తూ ఉండేవాడు.

జెన్నీ ఆ నాలుగున్నర నెలలూ మూర్తికి అరవై రెండు ఉత్తరాలు తన హృదయమే కావ్యమయినట్లు రాసేది. ఆగస్టు నెలాఖరులో జెన్నీ పట్టలేక ఢిల్లీ ప్రయాణమై వచ్చింది. వచ్చిన పదిరోజులలో మాయమైపోయింది.

తన ప్రేమచరిత్ర లెక్క చూచుకొంటూ జెన్నీ చిత్రం చేతిలో ధరించి లోనవాలా లోయలో తను మకాం చేసిన బంగాళాలో అధివసించిన మూర్తి తాను జెన్నీని కలుసుకున్నప్పటినుంచి తన ప్రేమ పొందిన పరిణామమూ, అది ప్రవహించిన వేగమూ, పతనాలూ, సుడులూ అన్నీ ఆలోచిస్తూ ఆమె చిత్రాన్ని రెండుసార్లు పవిత్ర ప్రేమతో కళ్ళకద్దుకున్నాడు.

ఏ మహాప్రేమ చరిత్రయినా రోజులలో మార్పులు, నెలలో మార్పులు అనేకం పొందుతూ ఉంటుంది. ఈ నాలుగున్నరనెలలలో తన ప్రేమ చరిత్ర అతి చిత్రమై, బాధాకరమై పరిణమించింది.

ఈనాడు లయొనెల్ ఉత్తరం చూస్తూనే ఎల్లమంద ప్రాణం జల్లార్చుకుపోయింది.

పెషావరు

కంటోన్మెంటు

12 సెప్టెంబరు, 1939

.

ప్రియమైన మూర్తీ!

నీ ఉత్తరం అందింది. మా అన్నగారు వట్టి జంతువులా తయారయ్యాడు. జెన్నీని మాయచేసి పెషావరునుండి ఎత్తుకుపోయాడు. నీ ఉత్తరం చూచి నేను మా వదినకు నిజంగా జబ్బుచేసి ఉంటే సహాయార్ధం జెన్నీని తీసుకు వెళ్ళడానికి వచ్చి నిన్ను కలుసుకొని తన అక్కసు అంతా తీర్చుకొని, జెన్నీని తీసుకువెళ్ళాడనుకొన్నాను. వెంటనే వదినకు ఎలా ఉందని మా అన్నకు తంతి కొట్టాను. కులాసాగానే వుందని నాకు జవాబు ఇచ్చాడు. ఆ సంగతే నీకు ఉత్తరం రాశాను. నీకు ఉత్తరం రాసిన వెంటనే వదినకు ఎలావుంది. జబ్బేమిటి అని జెన్నీకి రాశాను. అందులో మా అన్న నిన్ను ఏలా అవమానించాడో అదీ రాశాను. దానికి జవాబు రాలేదు. నాకు ఆశ్చర్యం వేసింది.

మా వదినకు జబ్బుగా వుంది. నేను వెళ్ళి చూసివస్తానంటే విజ్జీ సరేనంది. నాకు కూతురు పుట్టిన సంగతి వెనకే రాశాను. చిన్న విజ్జీ వెన్న ముద్దల పాపాయిలా తయారైంది. వారిద్దరినీ మదరాసులో దిగబెట్టి, నేను పెషావరుకు వెళ్ళాను.

మా వదినకు జబ్బూలేదు, గిబ్బూలేదు. జెన్నీ తరఫున మా అన్నే రాజీనామా పెట్టాడు. ఆమె గవర్నమెంటు ఉద్యోగానికి ప్రభుత్వంనుంచి విచారిస్తూ, ఆమెకు రాజీనామా అంగీకరించినట్లు ఉత్తరం వచ్చిందట.

ఆమెను ఎక్కడకు పోనీయడు. కొంచెం హెచ్చుతగ్గుగా ఖైదు. ఆమెవెంట ఎప్పుడూ ఎవ్వరో ఉండడం! జెన్నీ అన్నగారి ఉద్దేశం అంతా వెళ్ళిన రోజే గ్రహించింది.

మా డాడీ మా అన్నను మెచ్చుకుంటూ జెన్నీకి బుద్ధి చెపుతూ. పెద్ద ఉత్తరం రాశాడుట.

మూర్తీ! మూర్ఖుల పట్టుదల ఈ ఇరవైయో శతాబ్దములోకూడా ఈలా వుంటుంది. నేను మాట్లాడకుండా మర్యాదగా మాట్లాడినట్లు నటించి, ఒక రోజున షికారు వెళ్ళినట్లు బయలుదేరి మా జెన్నీని రైలు ఎక్కించి లాహోరు అక్కడనుంచి తిరుచునాపల్లి పొమ్మని పంపాను.

ఈ సంగతి ఆ అన్నకు తెలిసి ముష్టియుద్దం సలిపినాడు. దెబ్బలన్నీ తిని నేను అహింస అవలంబించితిని. మొగం వాచి పెదవి పగిలి పడిపోయాను. మా వదిన అడ్డం రాకపోతే మా అన్న ఎంతవరకూ వెళ్ళేవాడో! మా వదినే నాకు కట్టుకట్టింది.

ఈలోగా మా అన్న సాయంకాలం బండిమీద బయలుదేరి ఎలా గ్రహించాడో జెన్నీ ఢిల్లీలో ఉంటుందని అక్కడకు పోయి ఆమెకు బలవంతంగా రైలు ఎక్కించి తిరిగి పెషావరుకు తీసుకువచ్చాడు. ఇప్పుడు జెన్నీ ఆ ఇంట్లో ఖైదు. నేను ఒక ఇంగ్లీషు హోటలులో మకాం.

ఇంక నేను చేయబోయేది; మా అన్న సంగతి ముఖ్య సైనికోద్యోగికి తెలిపి జెన్నీని తీసుకుని నువ్వు ఎక్కడ వుంటే అక్కడకు వస్తున్నాను. నేను ఢిల్లీ వెళ్ళి నీ తిరగడం గురించి దర్యాప్తు చేస్తాను.

నా మొగం వాపూ అవీ తగ్గినాయి. ఏ సంగతీ వెంటనే ఉత్తరం వ్రాస్తాను.

ప్రియమైన

లయొనెల్.

ఈ ఉత్తరం చదువుకొన్నాడు. తెల్లబోయాడు. మళ్ళీ చదువుకొన్నాడు. కన్నుల నీరు తిరిగినంత అయింది. తన కోసం తన ప్రాణ స్నేహితుడూ, తన ఆత్మదేవి అంత బాధ అనుభవించారు. అతడు కోపంతో మండిపోయాడు. పళ్ళు బిగించాడు. ముష్టితో బల్ల కదిలిపోయేటట్లు గుద్దినాడు. నెమ్మదిగా తమాయించుకొన్నాడు. అవును మాదిగ వాళ్ళకు చదువేమిటి? ఉద్యోగం ఏమిటి? ప్రేమ ఏమిటి? పెళ్ళి ఏమిటి?

వంటినిండా గంధం రాసుకొని, పసుపు బట్టలు కట్టుకొని బానలు బానలు తాగుతూ పెళ్ళిళ్ళు చేసుకొనే మాదిగ వాళ్ళకు ఉత్తమ సంస్కార వివాహం ఏమిటి?

తమలో ప్రేమలు ఏమిటి? తామంతా ఊరకుక్కలు. ప్రేమలు లేవు, నీతులు లేవు, ఉత్తమ స్థితి లేదు.

మాదిగ వారిలో పుట్టి, మాదిగ వాడలో పెరిగి, తాను చదువుకొనేందుకు సాహసించడమా? ఒక ధవళ కాంతుల అందమైన బాలికను ప్రేమింప సాహసించడమా? తమ సంఘానికి ఇది ఇంత అని నుదుటిపైన రాసివుంది. దానికి మించి వెళ్ళడానికి ఎవరు సాహసించేది? మానవ ప్రపంచం మాదిగవాళ్ళంటే అసహ్యించుకొంటుంది. చీదరించుకొంటుంది. తన సంఘాన్ని గాంధీగారు ఉద్దరిస్తారని తాము గంపెడంత ఆశపెట్టుకొని వుండడం అంత వెర్రిపని ఇంకోటి వున్నదా? కరడుకట్టి, రాయైపోయిన సంఘాన్ని ఎవరు మార్చగలరు? ఎవరో తనబోటి నలుగురయిదుగురు, అంబేద్కరులు, శివరాజులు, పన్నీరు శెల్వాలు, రాజభోజులు, బి.ఎస్. మూర్తి మొదలయినవారు పైకివచ్చినా కూడా పై కులాల వారు తమ ఇంట్లో తమతో సమానంగా వారికి భోజనం పెడ్తారా?

తనకు ఈ నిర్వేదం అంతా ఏమిటి? ఎందుకీ ఏడ్పు గొట్టు కవిత్వం? నడుంకట్టి పనిచేయాలి. ఎంత ఇనుమైనా కొట్టగా కొట్టగా ముక్కలై పిండి అయిపోతుంది.

వెంటనే మూర్తి వారం రోజులు సెలవు పుచ్చుకొని, తిన్నగా పెషావరు వెళ్ళినాడు. లయనెల్ వున్న హోటలులో లయెనెల్‌ను కలుసుకున్నాడు. ఇద్దరూ ఫ్రెంచివారిలా, ముస్లిం సోదరులులా కౌగలించుకొన్నారు.

“నువ్వు వస్తావని నేను అనుకుంటూనే ఉన్నాను.”

“ఎలా రాకుండా ఉండగలను? జెన్నీ ఎక్కడ? ఎల్లా వున్నది?”

“జెన్నీ కులాసాగానే ఉన్నది. కాని మా అన్న ఆమెను ఒక గదిలో పెట్టి తాళం వేస్తున్నాడని నాకు రూఢిగా తెలిసింది.”

“ఈ రోజుల్లో-"

“రోజులు మారుతాయిగాని, మనుష్యులు మారుతారా మూర్తీ!”

“నీ ఆలోచన?”

“నా ఆలోచన మా చెల్లెలిని తీసుకురావడమే!”

“ఎలాగ సాధ్యం?”

“అదే ఆలోచిస్తున్నా, మా అన్నకు నేను ఇక్కడ వున్న సంగతి తెలిసింది.”

ఎల్లమంద ఆ హోటలులో స్థానం దొరక్క ఇంకో హోటలులో పెషావరుపురంలోనే మకాం పెట్టినాడు. తిన్నగా ఆ మర్నాడు చక్కనివేషం వేసుకుని ఆ స్కంధావారానికి సేనాపతి అయిన "కార్నెల్ - ” గారి దగ్గరకు పోయి తన చీటీ వారికి పంపినాడు. ఆయన లోనికి రమ్మని ఆజ్ఞ ఇవ్వగానే వెళ్ళి నమస్కరించి వారు చూపించిన కుర్చీపై కూర్చుండి తన కాగితాలన్నీ చూపినాడు. అవి చూచి "కార్నెల్ -” గారు సంతోషమైన ముఖంతో “ఆనందం” అన్నారు. అప్పుడు ఎల్లమంద జెన్నీ చరిత్ర వారికి చెప్పి, మేజరు కార్లయెల్ చేసినదంతా మనవి చేశాడు. ఎవరినైనా పంపి మేజరు తన చెల్లెల్ని తాళం వేసి ఉంచినాడో లేదో కనుగొనవచ్చునని మనవి చేశాడు.

“కాల్నెల్ -” గారు స్వచ్చమయిన ఇంగ్లీషువాడు. అతనికి మేజరు కార్లయెల్ సంకరం వాడైనా శుద్ద ఇంగ్లీషు వానిలా సంచరించడం ఏమీ ఇష్టంలేదు. కాని కాంగ్రెసు ప్రభుత్వాలు వున్న రోజులు. దేశంలో స్వాతంత్ర్య వాతావరణం బాగా వుంది. పైగా కేంద్ర శాసనసభలో ఎవరయినా ప్రశ్నలు వేయవచ్చును. ఇవన్నీ ఆలోచించి, చూచీ చూడనట్లు ఊరుకున్నాడు. ఇప్పుడు మూర్తి చెప్పిన సంగతులన్నీ విని ఈ సంకరులకు నల్లవాళ్ళ కన్న సంబంధాలకు ఎవరు బాగా పనికివస్తారేమి? అనుకొని, గంటకొట్టి ఆర్డర్లీన్ని పిలిచాడు.

నువ్వుపోయి "కేప్టను-” గారిని తీసుకురా అని ఆజ్ఞ ఇచ్చాడు. అయిదు నిమిషాలలో “కేప్టన్-” వచ్చి సైనిక వందనంచేసి కఱ్ఱలా నిలుచున్నాడు.

“ఏమయ్యా నీవు మేజరు కార్లయెల్ ఇంటికిపోయి నా ఆనతి చెప్పి, ఫలానా గదికి వేసిన తాళం తీయించి, ఆ గదిలో ఉన్న బాలికను ఇక్కడకు తీసుకుని రమ్మనమన్నానని చెప్పు.”

కెప్టెన్ మళ్ళీ సైనికవందనం సలిపి, పైకివెళ్ళి కారు ఎక్కి మేజరు కార్లయెల్ ఇంటికి వచ్చాడు.

ఈలోగా అక్కడే ఉన్న వేరే గదిలో కూర్చుండమని చెప్పి ఆ సేనాపతి మూర్తిని పంపినాడు. అరగంటలో కారు వచ్చిన చప్పుడయింది. లోనికి జెన్నీ, మేజరు కార్లయెల్, ఆ కెప్టనూ వచ్చిన చప్పుడయింది. సేనాపతి గది దగ్గిరగా ఉండడంవల్ల ఆ గదిలో మాటలు స్పష్టంగా మూర్తికి వినబడుతున్నాయి.

సేనాపతి: (లేచి జెన్నీకి కుర్చీ చూపిన చప్పుడు.)

గుడ్ మార్నింగ్. మీరేనా డాక్టరు జెన్నీఫరు కార్లయిల్?

జెన్నీ: అవును.

సేనాపతి: మేజరు కార్లయిల్ మీ అన్న?

జెన్నీ: అవును.

సేనాపతి: మిమ్మల్నెందుకు మీ అన్నగారు గదిలో ఉంచి తాళం వేశారు.

జెన్నీ: నిముషం (మౌనం)

సేనా: చెప్పండి డాక్టర్! మీకు భయంలేదు. మీ అన్న చేసిన ద్రోహం యావత్తూ నాకు తెలిసింద.

మేజర్ కార్లయిల్: నేను మనవి చేసేది.

సేనాపతి: ఊరుకోవయ్యా - చెప్పు బాలికా, ఏమీ భయంలేదు.

జెన్నీ: చేప్తానండి, నేను మూర్తి అనే హరిజన యువకుణ్ణి ప్రేమించాను. అతడూ నన్నుప్రేమించాడు. అతడు ఇంగ్లండు విద్యుత్ ఇంజనీర్ పరీక్షలో కృతార్థుడై అమెరికా వెళ్ళి ఉదకజనిత విద్యుత్ శాస్త్రం బాగా నేర్చుకొని తరిఫీదై వచ్చాడు. ఇప్పుడు కేంద్రప్రభుత్వంలో ఉద్యోగి.. సేనా: ప్రస్తుతం బొంబాయి ప్రభుత్వం విద్యుత్ ఇంజనీరు. కానీ అమ్మాయీ?

జెన్నీ: ఈ ప్రేమగాథ మా చిన్నన్నకు తప్ప మరి ఎవ్వరికీ ఇష్టంలేదు. నేను ఢిల్లీ వివాహంకోసం వచ్చాను. మా పెద్దన్న గారు మా వదినకు జబ్బు వంకతో నన్నిక్కడకు తీసుకువచ్చారు. మా చిన్నన్నగారు వచ్చి నన్ను పంపితే నేను ఢిల్లీ వెళ్ళాను, అక్కడకు నా వెంటనే మా పెద్దన్నగారు వచ్చి తీసుకువచ్చి నా బాగుకోసం నన్ను గదిలోపెట్టినారు.

సేనా: ఆహా. ఏమంటావయ్యా మేజరుగారూ?

మేజరు కార్లయిల్: అన్నీ ఒప్పుకుంటాను.

సేనా: ఆమెను పోనియ్యి. కెప్టెన్! మూర్తిగారిని ఇల్లా పిలు.

మూర్తి దగ్గిరకు కెప్టెన్ వచ్చాడు. గుండె కొట్టుకుంటూ ఉండగా మూర్తి లేచి వెళ్ళి సేనాపతికి వీరనమస్కారం చేశాడు. సేనాపతి మేజరు కార్లయిల్ వంక చూచి, “మీరు మూర్తిగారితో కరస్పర్శ గావించండి.”

మేజరు కార్లయిల్ మోము వాలిపోయింది. అయినా తనస్థితి తనకు తెలుసును. సేనాపతి దృష్టిలో తాను ఉత్తముడు కావాలి. వెంటనే చేయి చాపి, “క్షమించండి మూర్తిగారూ!” అన్నాడు.

సేనా: మీరు వెళ్ళండి మేజరు కార్లయిల్.

మేజరు కార్లయిల్ వెళ్ళగానే, జెన్నీ సేనాధిపతికి నమస్కరించి కళ్ళనీళ్ళు తిరుగుతుండగా, “మీ సహాయం నా జన్మలో ఎప్పటికీ మరచిపోలేను,” అన్నది. సేనాపతి లేచి భుజంచుట్టూ చేయి పోనిచ్చి.

“నువ్వు మా ఇంటిలో నాలుగు దినాలుండి వెళ్ళు,” అని కోరినాడు.

“మేము వెంటనే బయలుదేరి వెళ్ళి ఢిల్లీలో వివాహం చేసుకుంటాము. ఒక్క నిముషం ఆలస్యం చేయదలచుకోలేదు కాల్నెల్‌గారూ!” అని బ్రతిమాలుతూ జెన్నీ అన్నది.

“అందాకా ఎక్కడ వుంటావు?”

మూర్తి సేనాపతికి కృతజ్ఞత తెలిపి, “కార్నెల్‌గారూ మేజరు కార్లయిల్ సోదరుడు లయనెల్ కార్లయిల్‌గారు ఇక్కడే - హోటలులో వున్నారు. జన్నీఫర్‌ను నేను లయెనెల్‌కు అప్పగిస్తాను. మేము ముగ్గురం రేపే బొంబాయి వెళ్ళిపోతాము. బొంబాయిలో మా వివాహం అవుతుంది. తమ కరుణను ఎప్పుడూ మరువలేను. కృతజ్ఞుడను,” అని మనవి చేశాడు.

సేనాపతి తనకారుమీద వారిద్దరినీ లయనెల్ ఉన్న హోటలుకు పంపినాడు.

2

లయనెల్ వీరిద్దరినీ చూచి ఆశ్చర్యమూ, ఆనందమూ పొంది, ఇద్దరినీ హృదయానికి అదుముకొన్నాడు. చాలాసేపు జెన్నీ భవిష్యత్తు, జెన్నీ మూర్తుల వివాహమూ అన్నీ ఆలోచించుకుంటూ కూచున్నారు. లయనెల్ దగ్గర వదిలి మూర్తి తన హోటలుకు వెళ్ళిపోయినాడు. ఆ మర్నాడు వారు ముగ్గురూ బయలుదేరి ఢిల్లీ వెళ్ళినారు. ఢిల్లీలో వారు ముగ్గురూ మూర్తి యింట్లో మూడు రోజులు ఉండి జెన్నీ మూర్తులు రిజిష్టర్ వివాహం చేసుకొన్నారు.

జెన్నీ ఒక మంచి గుజరాతీ హోటలుకు ఆజ్ఞ ఇచ్చి పదిమందికి చక్కని విందు చేసింది. మూర్తి ఆ రాత్రే భార్యతో బొంబాయి మెయిలుమీద మొదటి తరగతి రిజర్వు చేసుకొని బయలుదేరినాడు. లయొనెల్ మదరాసు ప్రయాణం అయినాడు.

ఆ రైలు పెట్టెలో వారిద్దరూ ఒంటిగా ఉన్నారు. రైలు కదలగానే జెన్నీ వచ్చి భర్త ఒళ్ళోకూచుని అతని మెడచుట్టూ గట్టిగా చేతులుచుట్టి అతని పెదవులను ఉద్రేకపు చుంబనంతో అదిమివేసింది. అతడు పెన్నిధిలా ఆమెను తన హృదయానికి అదుము కొన్నాడు.

వారికి మాటలు లేవు. ఆమెతో కలిసి ఈ లోకాలలో ఎక్కడికో పోతున్నట్లు అతనికి భావం కలిగింది. ఆమె ఉద్రిక్త భావపూర్ణ అయినది. అతడు విద్యుత్ ప్రవహించే మేఘంలా వెలిగిపోయినాడు.

అతడు వేగంగా, మధురాతి మధురంగా, గాఢంగా ఆమె పెదవులను చుంబిస్తూ, ఆమె మోమును వెనక్కు వంచుతూ, ఆ బాలిక కన్నుల అందం చూచీ, కన్నులు చుంబిస్తాడు. కనుబొమల వంకర సొంపులు చూచి అవి ముద్దుగొంటాడు. ముక్కుపుటాలు, నాసికారేఖా ప్రవాహం చూచి, పెదవుల నాస్వాదిస్తాడు; పెదవుల ధనుర్విలాసం, ఆర్ద్రత వానిపై వర్తించే ఆనందమత్తతాపూర్ణ మందహాసరోచిస్సులు, ఆ పెదవుల మందారపు టెరుపులు చలించే అమృతాలు చూచి ఆ పెదవులను తన కర్కశపు పెదవులు చుంబిస్తే, అవి కరిగిపోతాయని భయపడి, 'క్షమించండి పెదవులారా!' అన్నట్టు చూపులు పరపి, కనులు మూసుకొని సిగ్గుపడు బాలకునిలా ముద్దుగొన ప్రారంభించి దొంగలా దోచుకొంటాడు.

ఇంతటితో తృప్తిపడడు. ఈ ముద్దులు ఇంకా దాహం కొలుపుతూ ఇంకా తృప్తితీరుస్తూ ఆ తృప్తిపై కాంక్షకు దారి చూపగా, ఆ కాంక్షనందుకొని దానిని తృప్తిపరుస్తూ కాంక్షాతృప్తులు అనంతంకాగా, ఆ అనంతతను అందుకోలేనని నిస్పృహపొందుతూ, తానూ నిత్యుడై తన శృంగారోద్రేక స్థాయినీ నిత్యను చేస్తాడు.

వెంటనే అతని చూపులు ఆమె విచిత్రశ్రుతిస్వరూప సౌందర్య విలాసిత చుబుకంపై ప్రసరిస్తాయి. ఆ చుబుకం అతని చుంబన పుంఖానుపుంఖితమైన దాడికి లోనవుతుంది. ఆ చుబుకాన్ని రక్షించడానికి ఆ బాలిక కపోలాల భావం అడ్డం వచ్చి నిలుస్తుంది..

ఆ కపోలాలు ఒకటికొకటి సహాయం చేసుకుంటూ అతని నాయకహృదయ శిఖరితోత్కంఠ వేగాన్ని చీకాకు పరుస్తాయి. ఆ వేగం ఓడిపోయి, ఆమె కంఠనిమ్నంలోనికి ఉరుకుతుంది. సరియైన పొడుగు, నీలిధమనిరేఖలు దంతంతో చెక్కిన ఆ కంఠసీమ అందంలో వెనకటికన్నీ మరచి ఆ చూపు దక్షిణ నాయకుడైపోయినది. పెదవులా కంఠాన్ని వదలలేదు.

ఇంతలో ఈ గడబిడ ఏమని కంఠసీమ పక్క కాపురం చేయు తెల్లమల్లెమొగ్గల గుత్తులుగా ఉన్న భుజస్కంధాలు రెండూ “ఏలనే నవ్వంటు” కనుక్కోవడానికి తొంగిచూస్తే చూపులు అల్లరి తుమ్మెద దొంగలులా ఆ మల్లెమొగ్గ గుత్తులు భుజాలపై వాలినవి. చూపు దొంగలగుంపుకు దారిచూపుడు గాడుకా వెంటనే పెదవిదొంగలు ఆ భుజద్వయార్ద్రతా నంతా తస్కరింప ప్రయత్నించి ఎంతకూ తగదని ఆ ధనం కొల్లగొనలేకపోయినవి.

కొంచెం దిగువను ఎవరో ఇరువురు తొంగిచూస్తూన్నారు. వేళ్ళు ఆ యిరువురిపై ముసుగులూ, బొత్తాములు దీసి సడలించినవి.

అప్పుడాతని దృష్టికి దంతాన్ని నలుపుచేసే ధవళకాంతులు కలవి, స్వచ్ఛహిమాచలశృంగాలపై పడిన ఉదయారుణకాంతులను కర్కశం చేసే పాటలవర్ణ దివ్యకాంతులు కలవి, గుండ్రని శిఖరాలు కలవి, లోకాద్భుత సౌందర్య విజృంభణము కలవి, సర్వమనోహరాలతో స్నాతులైనవి, ఉచ్చేస్రవం ముట్టె, కామధేనువు చిరుమూపురం, పారిజాతాల పరీమళం, లక్ష్మీదేవి నుదురు ప్రాభృతాలు పొందినవి.కోటివేల చిత్రవిచిత్ర పవిత్ర కాంక్షలు దాచుకొన్నవి. వక్షోజోన్నతాల సందర్శనం అయింది. గౌరీశంకర కాంచన గంగా శిఖర సందర్శనం చేసిన కళాకారుని మహదానందమూ, కైలాసశిఖర ప్రత్యక్షము వరమందిన భక్తుని దివ్యానందము! గంగా యమునలు సంగమమై అతని చూపులు ప్రవహించినవి. అతని హృదయ మాసంగమంలో సరస్వతిలా లయమై పోయినది.

పవిత్రచుంబనా లా చూచుక దివ్యత్వాల కర్పించి మూర్తి తెరలు కప్పివేసినాడు.

వారిరువురకు మాటలు లేవు. ఇరువురు సహ్యమలయ మధ్యస్థ లోనవాలాలో తమ నివాసగృహం చేరిన కాని ఆత్మమనస్సులతోబాటు, దేహాలలీనం కావింపదలచు కోలేదు. రైలు సాగిపోయింది.

3

లోనవాలా ఇంటికి ఢిల్లీ నుండి సామానంతా వచ్చినది. అవీగాక, బొంబాయిలో కొత్తసామాను కొన్నది జెన్నీ. ఆ గృహాన్ని ఆ ఎత్తయిన లోయ అందానికి శ్రుతిగా అలంకరించింది.

సాయంకాలం అయింది. జెన్నీ, మూర్తీ ఇద్దరూ కలసి ఆ లోయబాటలో వ్యాహ్యాళికి బయలుదేరారు. రెండువేల అడుగులకు మించి, మూడువేలు, నాలుగువేల అడుగుల వరకు పైకెగిసిన సహ్యామలయ పర్వతలోయలు, అడవులు, జలపతనాలు, పరమాద్భుత ప్రకృతి సౌందర్యవర్తిత మనోహరమై ఆ ప్రదేశం వారి హృదయాలను కరగించివేసింది.

ఆ దినం వారు నిర్ణయించుకొన్న పవిత్ర సంధాన దినం. ఆ ఇద్దరే ఆ ప్రకృతోత్సాహం మధ్య! పక్షులు గూళ్ళకు చేరుతున్నాయి. కిలకిల, గలగల, కూకూ, కువకువ స్వరాలు ఆ కొండ చరియలకు తాకి ఆ లోయలో ప్రతిధ్వనిస్తున్నవి. సూర్యబింబమూ కొండల చాటుకు దిగజారిపోయింది. ఆకాశంలో ఎరుపు, వంగపండు, కుంకుమ అరుణలు కాంతులు ఒరుసుకుపోతున్నవి.

ఇద్దరిలో మాటలు లేవు. ఇద్దరూ సిగ్గుపడుతున్నారు. అతడు నీలసుందరీనగ్నత పొరపాటున ఏ కాలవ రేవులోనో తన గూడెంలో స్నానాల సమయంలోనో చూచి ఉన్నాడు.

పాశ్చాత్య దేశాలలో ధవళసుందరుల నగ్నత దర్శించడానికి కోటివేల అవకాశాలున్నా ఎల్లమందమూర్తి హృదయంలో ఆ కోర్కె చాలాసారులు ఉద్భవించినా, ఆ భావానికే అతడు లజ్జపడి ఊరుకొన్నాడు. తన భార్య జెన్నీ ఈ దినం. ఈ పరమ పవిత్ర దినంలో తన్ను పూర్ణంగా భర్తకు అర్పించుకొంటుంది. అందుకు తాను తగునా అన్న భయం అతణ్ణి ఈ రెండు మూడు రోజులూ గడబిడ పెట్టింది.

శుభముహూర్తం దరికి వచ్చినకొలదీ అతనికి గుండెలు దడదడ కొట్టు కొంటున్నాయి.

జెన్నీ నిజమా కాదా? ఆమె తన భార్యయేనా? ఆమె ఇప్పుడు తన దగ్గరగా చేయీ చేయీ, పార్శ్వమూ పార్వమూ కలిపి నడుస్తూ ఉన్నదా? అతడు త్రపాపూర్ణుడై, భయకంపిత గాత్రుడై ఆమెతో తన సహచర్య ఊహించుకొంటున్నాడు.

జెన్ని ఒకచోట మూర్తిని ఆపింది. ఒక రాయి చూపించి దానిపైన కూర్చుండమన్నది. తానతని ప్రక్కనే కూర్చున్నది.

“మూర్తీ!”

"జెన్నీ!"

“నేను నిన్ను వివాహం చేసుకున్నానంటే, మనం ఇద్దరం సర్వసములమై కలసిపోతున్నాము అనే భావంతోనే! అంతేకాని నేను నిన్ను వివాహం చేసుకోవడంవల్ల కొంత దిగిపోయాను అనిగాని, నాకు పాశ్చాత్య స్త్రీలకున్న తెల్లతనం ఉండడంవల్ల నేను నీకన్న కొంత గొప్పదానిని అని గాని ఏ మాత్రమూ లేదు. ఈ విషయం నువ్వు దృఢంగా నమ్ము !”

“అదేమిటి జెన్నీ?”

“ఉండు ప్రియతమా! కనక నువ్వూ నేను రెండు రేకులుగల పుష్పంలోని రెండు రేకలం. యమునా, గంగా సంగమం ఎంత నిత్యమో మన కలయిక అంతే నిత్యం. నేను నీకై, నీవు నాకై!” అని ఆ బాలిక అతని తలను వంచి ముద్దాడింది.

వారిద్దరూ రాత్రి ఎనిమిది గంటలకు ఇంటికి వేంచేసినారు. ఇద్దరూ స్నానంచేసి మనోహర వస్త్రాలు ధరించినారు.

బట్లరు ఆ దినం వండిన వంట దేవతలు రుచిచూచి ఆనందించతగినది.

భోజనమైన వెనుక రేడియో పాటకు నాట్యం చేశారు. ఆమె బొంబాయిలో కొని తెచ్చుకున్న చిన్న పియానోమీద “లా-ఎ-పాష నెషా” (ఉద్రిక్త ప్రేమ) మహా గీతాన్ని వాయించింది. అతడు తాను అమెరికాలో కొందరు నీగ్రో సంగీత పాఠక స్నేహితుల దగ్గిర నేర్చుకొన్న చొపిన్ గీతాలు కొన్ని పాడినాడు.

రాత్రి పన్నెండు గంటలు మ్రోగినవి.

అతని హృదయము దడదడ మ్రోగుచున్నది.

ఆమె మోమంతా గులాబి పూవులో కందిపోవ, భర్త వంక చూచి “ప్రియతమా! నేను ముందు వెడుతున్నాను. సరీగా ముప్పాతిక గంట అయిన వెనుక -" అని లోనికి ఆనందహాస - ప్రపుల్ల వదనంతో వెడలిపోయింది.

ఇక ఆ ముప్పాతికగంట అతనికి నిముషమొక యుగం చొప్పున కల్పాలై జరిగినది. అతను పియానో వాయించుకుంటూ కూచున్నాడు. కొంతసేపు రేడియో తిప్పినాడు. కొంతసేపు “మేరీస్టోప్సు” “భార్యాభర్తల ప్రథమ దినము” అనే గ్రంథము తీసినాడు. కొంతసేపు పైకి వెళ్ళి దూరపుటిళ్ళ వెలుగులు, ఆకాశంలో తారకల వెలుగులు ఆ దశమినాటి వెన్నెల రాయని ఆనందము గమనించాడు.

ఇంటిలోనికిపోయి గడియారం వంక చూస్తే ఇంకా పావుగంట వున్నది. రేడియో తగ్గించి వున్నందున నెమ్మదిగా “హవాయిస్” గీతాలు విచిత్ర మేళనపు హంగుతో పాడుతున్నది.

మూర్తి బొంబాయిలో ఒక ఛాయా చిత్రశాలలో తయారు చేయించిన జెన్నీ పెద్ద చిత్రానికి ఎదురుగా నిలుచుండి ఆమె సౌందర్యము, ఆమె విలాసము ఆమె మందహాసము, ఆమె చూపులలోని మంత్ర ముగ్ధత్వమూ తనివితీర గ్రోలుతూ సర్వము మరచి వున్నాడు.

బాల్యదశలో రాబోవు ప్రేమ, ప్రథమయవ్వనంలో ప్రేమకై ఎదురుచూపు, యౌవనమధ్యాన పొదివికొన్న ప్రేమ, యౌవనంలో ప్రేమమయత, కౌమార ప్రారంభములో ప్రేమఫలము, వృద్ధాప్యంలో ప్రేమస్మృతి, “ఓహో ప్రేమమయ మీ జగమూ!” అనే సినిమాపాట జ్ఞాపకం వచ్చింది మూర్తికి. తన ప్రేమలోని విచిత్రత, సర్వలోక ప్రేమికులకూ ఏలా సంభవిస్తుంది.

“ప్రేమింపవే రాణి ప్రేమింపు నన్ను
ప్రేమ కల్లోలాల మింటికెగరేయవే!”

మానవ జన్మలో ప్రేమ శిఖరము. ఆ ఉత్తమ సంధానంవల్ల మానవ జన్మంతా తేజోవిలసితమై మానవ లోకానికి కళ్యాణప్రదమై, మహోత్తమమై, పవిత్రాదర్శపులకితమై పోతుంది. జెన్నీ! సకల సౌందర్యరాశి! ఆమె శిరస్సు ఏ శిల్పులకూ అందని మూర్తిమంతము. ఆమె జుట్టు చాకొలేటు రంగుతో పట్టుకుచ్చులై ఒత్తయి భుజంమీద పతనాలుగా ప్రవహిస్తుంది. ప్రాచ్యలోచనాల దీర్ఘ వినీలత మధుర మత్తతతో వక్రాంచల సమనాశికా గులాబీపుష్ప పత్రపుటాలతో, మధ్యపూర్ణ ధనుర్వక్ర మధుమయార్ద్రిత మందార కుట్మల సదృశా ధరోష్టాలతో వెలుగొందే ఆమె ముఖం! జెన్నీ! ప్రేమదేవతా!

సరిగా శుభముహూర్తము వచ్చినది.

అతని కాళ్ళు వణకినవి. చిరు చెమటలు పట్టినవి. అతడింతవరకు ఆ పడకగది అలంకరణ చూడలేదు. ఆమె అతనిని లోనికి రానీయలేదు.

మూర్తి స్లిప్పర్సు చప్పుడు చేయకుండా నడిచి తలుపు దగ్గరకు చేరినాడు.

గుండెల చప్పుడు దెసలు మారుమ్రోగుతూ ఉండగా నెమ్మదిగా తలుపు తీసినాడు. తలుపులు లోనికి కొంత పోయినవి.

దీపములన్నీ ఆర్పి వచ్చినాడు. కావున ఆ చీకటిలోనికి తలుపు సందునుండి నీలివెలుగు పైకి నీలపు తీగలా ప్రసరించినది.

అతడు తలుపు దగ్గర ఆగిపోయినాడు.

అతని గొంతుకలో దగ్గుత్తిక వచ్చినది.

పది లిప్తలు తలుపు దగ్గర ఆగి, లోనకు కుడి అడుగు వేసినాడు. తలుపు నెమ్మదిగా ఇంకను తోసినాడు. తలుపు వెనక తెర ధరించిన కాండ పటము రాధకృష్ణ విలాసమగు ఒక బృందావన క్రీడాచిత్రంతో ప్రత్యక్షమయినది. రంగురంగుల మనోహరమైన ఆ చిత్రం పై నీలపు వెలుగు పడుతున్నది.

అతడు కాండపటం వెనకనే నిలుచుండినాడు. మరి పది క్షణికాలు గడచి పోయినాయి.

ధైర్యం పట్టుకొని తలుపుమూసి, నెమ్మదిగా గడియవేసి అతడు కాండపటం ప్రక్కనుండి లోనికడుగిడినాడు.

ఎదుట కనుపించిన దృశ్యము అతని హృదయ స్పందనమొక నిమేషం మాపుచేయగలిగిన దివ్యసౌందర్యపూర్ణము.

తల్పము పాలసముద్రంలో తేలిపోయే దేవవిమానంలా ఉన్నది. తల్పము తెల్లని సన్నని వల తెరలతో అచ్చాదితమై ఉన్నది. గది అలంకారము తల్పానికి శ్రుతిపూర్ణము.

అతడు నెమ్మదిగా అడుగడుగువేస్తూ తల్పంకడకు పోయి, ఆ తల్పంపై అస్పష్టంగా దృశ్యమయ్యే మనోజ్ఞత్వ రాశిని ఆస్వాదిస్తూ తెరలు ఒత్తిగించి చూచినాడు.

జెన్నీ కోటిగులాబీలతో మూర్తికట్టిన జీవవిగ్రహము పాము కుబుసాల దుస్తులు హౌరీలా అలంకరించుకొని, ఒయ్యారంగా త్రిభంగిగా శయనించివున్నది. ఆమె కనులు అరమూతలై ఉన్నవి! ఆమె ఎఱ్ఱన పెదవులు కొంచెము విడివిడి ఉన్నవి.

తనివి ఎంతకును తీరనికాంక్షతో ఆమె సౌందర్యాన్ని గ్రోలుతూ అతడటులనే నిలుచుండి, మరునిమేషాన ఆమె పై వాలిపోయినాడు. ఆమె నెమ్మదిగా అతనివైపు తిరిగి చేతులు చాచి అతని మెడచుట్టూ ఆ దంతాలచ్చలతలు చుట్టివేసినది.

అతడామెపై వంగి విడివడి వున్న ఆ తేనె పెదవులను అతి తమితో ముద్దిడినాడు.

4

దేవీ పర్వతపులోయ, లోనవాలాకు పదిమైళ్ళున్నది. ఆ లోయలో అయిదారు సెలయేరులు కొండమీదనుండి పతనమై కలిసి పెద్ద నదిగా సంగమించి లోనవాలా లోయలోనికి ప్రవహిస్తున్నది. లోనవాలా లోయలో నదికి ఆనకట్ట కట్టి ఉదకశక్తి జనిత విద్యుచ్ఛక్తి సంస్థను ఇదివరకే ఏర్పాటు చేసినారు. ఈ జలాశయంలోనికి ప్రవహించే శైలివాలినులలో పెద్దదానిలో జలాశయానికి మూడువందల అడుగుల ఎగువనే రెండు పెద్ద ప్రస్రవణాలు సంగమిస్తున్నవి. ఆ సంగమస్థల దగ్గిర వేరొక్క జలాశయం నిర్మిస్తే, దానివల్ల మరికొన్ని లక్షల కిలోవాట్లు ఉద్భవించే విద్యుచ్ఛక్తి యంత్రాగారం నిర్మించవచ్చును.

ఈ భావము మూర్తికి ప్రత్యక్షమై, బొంబాయి ప్రభుత్వానికి రాయడంతోటే, వారెంతో ఆనందించి, ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి రాస్తూ, “మూర్తి” ఇంజనీరుగారిని తమ కా పనిని నిర్వర్తించేందుకు అప్పు ఇవ్వవలసిందని కోరినారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికీ, బొంబాయి ప్రభుత్వానికీ అతి తొందర కార్యం అవడానికి కారణం యుద్దం.

చిన్న చిన్న గాలిగా ప్రారంభించిన యుద్దం అప్పుడే ప్రళయ ఝంఝామారుతంలా పరిణమించినది. హిట్లరు సగం పోలండు ఆక్రమించితే, రష్యా తూర్పు పోలండు ఆక్రమించుకొన్నది. డాన్జిగ్ జర్మనీ పాలను పడింది. యూరపు దేశాలలో జర్మనీ దగ్గిర దేశాలన్నిటిలో నాజీ రాజకీయ వేదాంతాలు ప్రబలిపోతున్నాయి. పోలండు తర్వాత హిట్లరు ఎవరిమీద విరుచుకు పడతాడో తెలియలేదు. ఇంగ్లండుమీదకే దండెత్తవచ్చునన్న వదంతులు బాగా ప్రబలి ఉన్నాయి. 1939 అక్టోబరు నెలలో బొంబాయి ప్రభుత్వంవారిని కేంద్ర ప్రభుత్వం వారు పడమటి కనుమలలో విద్యుచ్ఛక్తి పరిశ్రమ బాగా వృద్ది చేయమన్నారు. ఆ పరిశ్రమను యుద్ధావసరాలలో ఒకటిగా కేంద్ర ప్రభుత్వం చేర్పించవలసి వచ్చింది. హిట్లరు ఇండియాకు రాలేడని ఎవరు చెప్పగలరు? అందుకై ఇండియా యుద్ద పరిశ్రమలలో ఎక్కువ పాలుపుచ్చుకోవాలి!

భారతీయ ప్రభుత్వంవారు కూడా జర్మనీపై యుద్ధం ప్రకటించారు. భారతీయ సేనలు సిద్దంగా ఉండవలసి ఉన్నది.

భరతదేశంలో పూనా సైన్య కేంద్ర పెరిగిపోతున్నది. పడమటి కనుమలలో కొన్నికొన్ని యుద్ధ పరిశ్రమలు స్థాపించవలసి వచ్చింది. ఆ పరిశ్రమలకు విద్యుచ్ఛక్తి అవసరము.

కాబట్టి మూర్తి కలలుకన్న ఆ విచిత్ర జలాశయ నిర్మాణానికి మూర్తి కోరిన రెండు కోట్ల రూపాయలు ప్రభుత్వంవారు వెంటనే మంజూరు చేసినారు. పెద్ద ఇంజనీర్లు వచ్చినారు. అందుకు సంబంధించిన వారెందరో వచ్చినారు.

మూర్తి వేసిన ప్రణాళిక ప్రకారం నిట్టనిలువునా వున్న ఆ రెండు కొండలూ కలిపి జలాశయం నిర్మించాలి. కట్టవలసిన రెండు కొండల నడుమ నది వేయి పతనాలుగా పడి ప్రవహిస్తున్నది. క్రింద జలాశయం ఇదివరకే నిర్మాణం అయి, దానివల్ల చాలా విద్యుచ్ఛక్తి ఉత్పత్తి చేసేటటువంటి పరిశ్రమాగారం నిర్మించారు.

నాలుగు వందల అడుగుల ఎత్తునుంచి వేయి చిన్న పతనాలుగా పడే ఆ నది ఒక చోట రెండు మూడు వందల చదరపు గజాల వైశాల్యం మాత్రం కలిగిన శిఖరంపైన ఒక చిన్న కొండమీద ఎగుడు దిగుడుగా, వంకరటింకరగా ప్రవహించినది. మళ్ళీ పతనాలై పడుతున్నది.

ఎల్లమంద ఆలోచన ఇది. ఆ రెండు వందల పైచిలుకు చదరపు గజాల ప్రదేశంలోనూ జలాశయం నిర్మించి, ఆ చరియను దిట్టంచేసి, అక్కడనుంచి పెద్ద గొట్టాల ద్వారా జలప్రవాహం ప్రక్కగా ఆ కొండలలో ఇంకో సమతలానికి తీసుకువెళ్ళి అక్కడ విద్యుచ్ఛక్తి కర్మాగారం స్థాపించాలి. అక్కడనుండి ఆ నీరు మళ్ళీ గొట్టాల ద్వారా తీసుకువచ్చి క్రింద జలాశయం లోనికి కలపాలి.

ఈ పనికై దగ్గిర ఉండి ఆ ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి లెక్కలు, ప్లాన్లు తయారు చేశాడు. అతని చేతి క్రింద నలుగురు ఒవర్‌సీయర్లు, డైనమైట్ పెట్టి ఆ శిఖరతలం అరుగులా సమంగా చేయ ప్రారంభించారు. పని అతివేగంగా తాను దగ్గిర ఉండి చేయిస్తున్నాడు. పగిలి విడివడిన రాళ్ళను ముక్కలుచేసి తన పనికి పనికిరావడంకోసం చిన్న చిన్న రైలుపట్టా బండ్లపై ఇంకో స్థలానికి లాక్కుని వెళ్ళి అక్కడ పోగు చేయించి అందులో కొన్నింటిని మరీ చిన్నవిగా సిమెంటు కాంక్రీటుకోసం కొట్టిస్తున్నాడు.

క్రిందనుంచి పొట్టి గుర్రాలమీద రోజూ సిమెంటు బస్తాలు, లావుపాటి ఇనుపకడ్డీలు, తీగెలూ తీసుకు వస్తున్నారు. ఆ కష్టం అంతా చూచి మూర్తి ఆ సరుకు అతి సులభంగా విద్యుచ్ఛక్తి సహాయంవల్ల పైకి వచ్చే తీగదారి ఏర్పాటు చేశాడు. అంచెలు అంచెలుకడ యంత్రాలు ఉంటాయి. అక్కడినుండి పైకి బరువులుంచిన ఉయ్యాలలను లాగే తీగలుంటాయి. ఆ ఉయ్యాలలను ఒక తీగలాగుతూ ఉంటే రెండు తీగలమీద, రెండు చక్రాలతో ఈ ఉయ్యాలలు సువ్వున పైకి పోతాయి. వానిమీద మనుష్యులూ ప్రయాణించవచ్చును.

మూర్తి పనిచేస్తూంటే అక్కడికి మూర్తితోపాటు ఒక్కొక్కసారి ఉదయం వంటవానిచేత తయారు చేయించిన వంటకాలు, కాఫీ గొట్టాలు, పళ్ళు అవీ భోజనపు పెట్టెలలో పెట్టించుకొని అవి సేవకుల నెత్తిమీద పెట్టి జెన్నీ కూడా వచ్చేది.

జెన్నీతో ఆమె కొన్న పెద్ద “బుల్ డాగు” జాతిలో మేలుజాతి కుక్కకూడా వస్తుంది.

మూర్తికి పని అయి తనకడకు వచ్చేవరకూ జెన్నీ కుక్కతో ఆ కొండలలో తిరుగుతూ ఉంటుంది. ఆ కుక్క పేరు ఫెయిత్ (నమ్మకం) అని పెట్టింది. భార్య సరదాగా తిరగడం, తనకు వేళకు భోజనం తమకు ఆ దాపునే ఒక చెట్టు క్రింద వేసిన డేరాలో క్యాంపు బల్లమీద చక్కగా అంచులు కుట్టిన తెల్లటి గుడ్డవేసి భోజనం అమర్చి “ఫెయిత్! నీ యజమానుణ్ణి తీసుకురా!' అని పంపేది జెన్నీ. ఆ కుక్క మరుసటి నిమేషంలో మాయమై మూర్తి దగ్గరకు వచ్చి "దయచేయండి” అన్నట్టుగా కుర్రుమని అతనిపైకి ఉరికేది. బలువైన, బలపూర్ణమైన ఆ కుక్కను మూర్తి చేతులతో అందుకొని క్రిందికి దింపి “వస్తున్నాను ఫెయిత్?” అని యిద్దరూ డేరాకు బయల్దేరుతారు..

డేరాకు రాగానే మూర్తి పక్కనున్న చిన్న డేరాకు పోయి, అక్కడ మొగమూ చేతులూ కడుక్కొని, బట్టలు మార్చుకొని, ఆమెకు తనివితీర మూడు ముద్దులు అర్పిస్తాడు.

ఆమె, అతడూ ఎదురు బొదురుగా కుర్చీలలో కూర్చుండి తీయని, మత్తయిన కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తారు. ఒక బోయ్ వడ్డిస్తూ ఉంటాడు. భోజనాలు పూర్తి కాగానే అతడు సిగరెట్టు వెలిగించుకొని మాటలు చెబుతూ జెన్నీని చూచి తన అదృష్టం తానే నమ్మలేకపోతూ ఉంటాడు.

ఒకనాడు జెన్నీ భర్తను చూచి, “ప్రియతమా! మీ నాన్నగారూ, మీ అమ్మా, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు ఏమి చేస్తున్నట్లు?” అని ప్రశ్నించింది.

“కులాసాగానే ఉన్నారు.”

“కులాసాగానే ఉంటారోయ్! అది కాదు నేనడిగిన ప్రశ్న వాళ్ళ విషయం ఏమీ ఆలోచించావని?”

“వాళ్ళకై భీమవరం పాటిదొడ్డల్లో ఒక దొడ్డి కొనే ఏర్పాటు చేసినాను. ఆ దొడ్డిలో పాటిమన్నంతా అమ్మి ఇసుకపోసి పూడ్చినారట. ఒక గజం యెత్తు నల్లమన్ను పోయించమన్నాను. అలాగే చేశారట. ఎనిమిది గదులు ఒక హాలు వుండే డాబా ఇల్లుకు ప్లానువేసి పంపాను. వంట ఇల్లు వేరు. అన్నీ కలిపి ఆ ఊళ్ళో పన్నెండు వేలయిందట. నేను అమెరికాలో ఉన్న రెండేళ్ళు పదిహేనువేల డాలర్లు సంపాదించుకొన్నాను. ఇంక నా దగ్గర బాంకులో ఎనిమిదివేల రూపాయలు నిలువ వున్నాయి. మా తండ్రి పేర అయిదువేల రూపాయలు బ్యాంకులోవేసి ఉంచాను. వాళ్ళకు రెండేళ్ళకు సరిపోయే గుడ్డలు కొన్నాను. చదువు చెప్పడానికి నెలకు ముప్పది ఇచ్చి ఒక ఉపాధ్యాయుణ్ణి ఏర్పాటు చేశాను. ఆత్మేశ్వరీ! భగవంతుడూ, ప్రజలూ, కాంగ్రెస్‌వారూ మెట్లు కట్టుకొని నీ ఉత్తమపథం నువ్వు చేరు అని నన్ను పంపించారు. లోకంలోని అభ్యుదయమంతా పురుషునికి అతని స్త్రీ రూపంలో, స్త్రీకి ఆమె పురుషుని రూపంలోనూ ప్రత్యక్షమవుతుంది. నా దివ్యాభ్యుదయ "మూర్తివి నువ్వు!”

“చాలులే! నేను స్త్రీని, నువ్వు పురుషుడవు. నిన్ను నేనూ, నన్ను నువ్వూ కామపరతంత్రులమై వాంఛించుకొన్నాము. ఆ కామవాంఛను సాంఘిక సమదర్శనంకోసం, శాంతికోసం కాలువ త్రవ్వి ప్రవహింప చేయవలసి వచ్చింది. ఆ కాలువ వివాహం. అందుకని మనం ఇద్దరం వివాహమాడినాము.”

“అయితే యవ్వనం నశించిన తర్వాతకూడా మానవులకు ప్రేమలు ఎందుకుంటాయి?”

“అవి చిరకాల సహవాస జనిత స్నేహాలు.”

“భార్యాభర్తలకన్న పురుషులకూ, స్త్రీలకూ ఎక్కువ స్నేహితులుంటారు. అయినా ఆ స్నేహితులకు కూడా భార్యాభర్తలకున్న ఉత్తమ స్థితి రాదేమి?”

“చిరకాల కామస్నేహం అది. అది విచిత్రమైనది కాబట్టి మామూలు స్నేహంకన్న కామస్నేహం గొప్పది.”

“కామమే ప్రేమలో ముఖ్యభావం అయితే, ఒక స్త్రీ ఏ పురుషునిపడితే ఆ పురుషునిగాని, ఒక పురుషుడు ఏ స్త్రీని గాని కామ సంబంధంకోసం ఏరుకోక ప్రేమ అని అంటారేం?"

“వెర్రివాళ్ళు కనుక!”

“ఆ వెర్రే ప్రేమ గనుకా అను”

“ప్రేమ వెర్రితనం ప్రేమ అంటావు!”

“కాదు, ప్రేమికుడు వెర్రివాడు అంటారు ప్రియతమా?”

జెన్నీ లేచి భర్త మెడచుట్టూ చేయివైచి, “ప్రేమ అనే దివ్యగుణం లోకంలో ఉందని నాకు తెలియును ప్రియతమా! నీతో వాదించడం ఎంతో ఆనందం!”

5

యుద్దం సాగిపోతూ వుంది. 1940 సంవత్సరం మార్చి నెల వచ్చింది. ఆ సమయంలో మూర్తి కట్టిన ఒక పక్క సిమెంటు గట్టుతో కూడిన కొండచరియ క్రింద లోయలోనికి జారిపోయింది. ఆ జారిపోవడంవల్ల మూర్తి హృదయమూ జారిపోయింది. దానివల్ల జలాశయానికి ఇరువది రెండు చదరపు అడుగులు పోయాయి. ప్రభుత్వానికి రెండు లక్షల రూపాయలు నష్టం వచ్చింది.

దీన్ని గురించి మూడు రోజులు చమటలతో తడిసిపోతూ మూర్తి ప్రభుత్వానికి రిపోర్టు పంపించినాడు. నాలుగో రోజుకు పెద్ద ఇంజనీర్లందరూ అక్కడకు పరుగెత్తుకొని వచ్చినారు. వాళ్ళు నాలుగు దినాలు పూర్తిగా పరీక్షించి ఇందులో మూర్తిలోటు ఏమీ లేదని తీర్మానించినారు. అప్పుడు మూర్తి తానా ప్రక్క పెద్ద కొండను కొంత భాగం దొలుస్తానని దానికి ఇంకా పదమూడు లక్షలు ఖర్చు అవుతుందనీ, అందువల్ల వేయి చదరపు గజాలు వస్తాయని తెలిపినాడు. అవన్నీ ప్లానులు వేసి చూపినాడు.

ఆ ప్లానులన్నీ పట్టుకొని చీఫ్ ఇంజనీరు, మిలటరీ చీఫ్ ఇంజనీరు వారం రోజులు పరీక్షించినారు. వారికి మూర్తి వాదనలు నచ్చి, పని ప్రారంభించవచ్చునని ఆజ్ఞలు జారీ చేసినారు.

ఆ పదిహేను దినాలు మూర్తి తిన్నగా భోజనం చేయలేదు. జెన్నీ దగ్గిర లేకపోతే అతడు మతిచెడి ఏలాంటి పిచ్చి పనులు చేసి ఉండేవాడో!

“ప్రియతమా! నీ ధైర్యం అంతా ఏమయింది. అమెరికాలో నువ్వు చేసిన పని అంతా మంచులా కరిగిపోయిందా?”

“జెన్నీ దేవతా! నేను యే పని చేయగలను? యుగయుగాలనుంచీ భారతీయ సంఘంలో అట్టడుగున కుళ్ళిన మాదిగ కులస్థుణ్ణి!”

“అవునులే! భారతీయ సంఘంలో కొండ శిఖరాలు మీద కూర్చున్నవారే ఈలాంటి చదువులు చదవాలిగాని నీబోటి వాళ్ళు ఏం పనికి వస్తారు?”

“వేళాకోళం కాదు జెన్నీ.”

“కాదులే... కాదు! మూడక్షరాలా ని...జ...ము? నువ్వు మాదిగ కులస్థుడవు గనుక, నిజం మాట్లాడుతావని నాకు నమ్మకం లేకపోయినా, ఏమో నిజం అయితే కావచ్చును.”

“జెన్నీ, నే నేం జేయను.”

“ఏం చేస్తావు? మళ్ళీ జక్కరం వెళ్ళి పొలం కూలీపని చేసుకో. చచ్చిన గొడ్డు మాంసం తిను.”

“ఈ రోజు నన్ను కొరడా పుచ్చుకొడుతున్నావే?”

“లేక నీ ధైర్యానికి, నీ ఉత్సాహానికి, నీ ముందుచూపునకూ కష్టాలు లెక్కచేయకుండా చొచ్చుకుపోవడానికి ముద్దులు పెట్టుకోమన్నావా?”

“అబ్బబ్బా!”

“క్షమించు ప్రియా! భారతాంగన భర్తకు బానిస! అలాంటిది నీకు సలహా చెప్పడ మేమిటి?”

ఎల్లమందమూర్తి మౌనం వహించాడు. అతని మోము విషాద పూరితమైనది. అతని మోము తీక్షణంగా గమనించింది జెన్నీ. వెంటనే అతని చేయి పట్టుకొని డేరా లోనికి తీసుకు వెళ్ళింది.

అక్కడ అతని హృదయాన్ని బిగియార కౌగలించుకొని పెదవులు ముద్దిడి, “ప్రియా! అంత చిన్న బాలునిలా అయిపోయావేమిటి? నువ్వు చేయలేని పని ఒకటైనా ఉందా? కాక, నాకు నువ్వంటే నేనే వర్ణించుకోలేని ధైర్యం. నీకు వేడి పుట్టించడానికి అన్న మాటలు,” అని మళ్ళీ ముద్దు పెట్టింది. ఎల్లమందమూర్తి భార్య ముద్దు పెట్టుకొనటమే గమనించనివానిలా అయిపోయాడు. తాను ఏదో ఆలోచనా లోకానికి పోయినాడు. ఆ పరధ్యానంలో భార్య మోము చూడని చూపులతో చూస్తున్నాడు. జెన్నీ మూర్తి విశాల ఫాలము నల్లనిదైనా మోములోని కాంతీ, ఆతని అవయవ స్పుటత్వమూ గమనిస్తూ కూచుంది.

ఇంతలో ఒక ఉరుకు ఉరికి భార్య చంకలో చేతులు పెట్టి పైకి గబుక్కున ఎత్తి “నా ప్రాణప్రియా! నీ మాటలు నాలో ఏ మూలనో ఒదిగి ఉన్న కొత్త ఆలోచనలను స్పందించి పైకి తీసుకు వచ్చాయి.” అని ఆమెను హృదయం మీదకు దింపుకొని ఆమెను మోమంతా ముద్దుపెట్టుకొన ప్రారంభించినాడు. “నువ్వు నాకు దేవతవు, నాకు గురువువూ!”

“ఏమిటి నీ కొత్త ఆలోచన ప్రియతమా!”

“ఆ కొండ చరియనుండి బరువు వల్లగాని ఇంకో కారణంవల్లగాని రాళ్ళు కదిలి క్రిందికి జారిపోకుండా, సిమెంటు కాంక్రీటుతో గట్టిచేస్తాను. ఇంటి పైన కురిసే నీరుకు ఎల్లాపోయే ఏర్పాటు చేస్తారో అలాగే ఈ జలాశయం చుట్టుపక్కల కొండలలో కురిసిన నీరు పోయేటట్లు చేస్తాను.”

“ఈ విధానంవల్ల ఎక్కువ ఖర్చు ఎంత?”

“ఇరవై లక్షలు - ఇంకా తక్కువ కావచ్చును.”

“ఇదంతా ప్రభుత్వం ఒప్పుకోవద్దూ?”

“ఒప్పుకు తీరుతారు. అన్ని లెఖ్కలూ, పటాలూ వెంటనే సిద్ధం చేసి పంపుతానుగా!”

“ఈలోగా ఒక చక్కర్ కొట్టవద్దూ బొంబాయి అవీ! ప్రియతమా!”

“ఈరోజు మీ అన్నగారి దగ్గిరనుండి ఉత్తరం రావాలి?”

“అవును!”

“మీ నాన్నగారి కోపం ఇంకా తగ్గదా?”

“ఏం చేస్తాము? మన ఇద్దరం ఏ కొండ చివరో గూడు కట్టుకొని గరుడ పక్షులలా ఉందాము!”

“నీ వైద్యవృత్తి?”

“వృత్తిలేదు గిత్తీలేదు. నీవే నా వృత్తివి ప్రియతమా!”

“కాదు నా రాణి, జాగ్రత్తగా ఆలోచించు.”

“నీ ఉద్యోగంలో ఇక్కడకూ, అక్కడకూ మార్చడం ఉంటూ ఉంటుంది. నిన్ను వదలి నేనెక్కడో వైద్యవృత్తి ప్రారంభించనా? నీ కోసం బెంగ పెట్టుకొని కూర్చుండనా?”

“పోనీ నేను-”

“ఏమీ తొందరపడకు. నేను ఆలోచిస్తున్నాను. ఇద్దరం ఈ విషయం బాగా ఆలోచించే చేద్దాము ప్రియతమా!”

ఇద్దరూ దిగి ఇంటికి పోయారు.


★ ★ ★