నరుడు/ఆరవ భాగం
(ఆరవ భాగం)
భార్యాభర్తలిద్దరూ ఎల్లోరా, అజంతాలు వెళ్ళి వచ్చారు. ఆ ప్రపంచం అంతా చాలా విచిత్రంగా ఉంది.
భారతీయ చిత్రలేఖనమంటేనూ, శిల్పమంటేనూ వాళ్ళిద్దరకూ ఏమీ తెలియదు. ఎల్లమందమూర్తి ఇంగ్లండులో ఉన్నప్పుడు, సరదాకు మ్యూజియమంతా తిరిగి వచ్చాడు. కాని శిల్పమన్నా, చిత్రలేఖనమన్నా ఏమీ తెలియదు.
మూర్తికన్న జెన్నీ కొంత నయం. గృహం అలంకరించడం తెలుసును. చిత్రలేఖనం చూడగానే ఇది మంచిది అని మాత్రం చెప్పగలిగేది. అవైనా పాశ్చాత్య చిత్రలేఖనా శిల్పాలను గురించే. అందులో కూడా లియోనార్డో నుంచి వెలాస్‌క్వెజ్ వరకూ లెయిటన్, టర్నర్, బరన్‌జోన్సు మొదలయిన వారి చిత్రాలు బాగా అర్థమయ్యేవి. గ్రీకు, రోమను శిల్పాలు బాగా అర్థమయ్యేవి. కాని ఎయిప్ స్టెయిన్ శిల్పం వట్టి అగమ్యగోచరంగా ఉండేది.
మూర్తికి భారతీయ లలితకళా విషయాలు అగమ్యగోచరాలు. ఇంగ్లీషు సంగీతం మాత్రం నేర్చుకున్నాడు. పియానో వాయిస్తూ గంభీరమయిన కంఠంతో పాడుతాడు.
జెన్నీ, మూర్తీ ఎల్లోరా మొదట చూచారు. జెన్నీ భర్తను చూచి, “ప్రియతమా ఈ కైలాస గుహ చూచినా, తక్కిన బౌద్ద గుహలూ, హిందూ గుహలూ, జైన గుహలూ చూస్తూ ఉన్నా నా మనస్సు ఏదో చెప్పరాని ఆనందం అనుభవిస్తున్నది. నేను గ్రీకు శిల్పాన్ని గూర్చీ, ఇటాలియను చిత్రలేఖనాన్ని గూర్చీ బాగా చదివాను. కాని భారతీయ శిల్ప చిత్రలేఖన సంప్రదాయ చరిత్ర ఏమీ తెలియదు. నువ్వు చెప్పగలవా?”
“నువ్వు పాశ్చాత్య శిల్పాన్ని గూర్చెనా చదివావు. నేను ఏమీ తెలుసుకోకుండా కాలం ఇంతవరకూ వృధాగా పోనిచ్చాను.”
“ఆ కైలాసగృహం పనితనం చూస్తే నా హృదయం కరిగిపోయింది.”
ఇద్దరూ విస్తుపోయి చిన్న పిల్లలులా చేయి చేయి పట్టుకొని ఆ గుహలన్నీ తిరిగారు. ఇద్దరూ నైజాము ప్రభుత్వ విశ్రాంతి మందిరంలో మకాం పెట్టినారు. ఎల్లోరా గుహలు మూడు రోజులు వరుసగా చూచినారు.
ఎల్లోరా జైన గుహలలో ముఫ్పైనాలుగవ గుహలో శచీదేవి విగ్రహం ముందు జెన్నీ నిర్ఘాంతయై నిలుచుండి పోయింది. ఇంత ప్రపంచాద్భుత సౌందర్యం ఎలా శిల్పం చేయగలిగాడు శిల్పి? తాను “వీనస్ డెమెలో” అనే గ్రీకు సౌందర్య దేవతా విగ్రహం ఛాయాచిత్రం చూచింది. ఆ శిల్ప దేవత సౌందర్యం ఈ శచీదేవి విగ్రహ సౌందర్యం ముందు ఏ విధంగా నిలువగలదు? ఆ ఒయ్యారము, ఆ దేహ భంగిమ, ఆ పరమశ్రుతి, ఆ వదన విలాసము, అహో ఈ సుందరి సర్వవిశ్వంలో అతీత సౌందర్యవతి.
ఆ బాలిక ఆశ్చర్యము గమనిస్తూ ఎల్లమందమూర్తి తానూ ఆశ్చర్య చకితుడై అలాగే నిలుచుండిపోయినాడు. ప్రియతమా? ఇంతవరకూ పురుషమూర్తి యొక్క అద్భుత సౌందర్యం గమనించాము. ఈ స్త్రీ విగ్రహ సౌందర్యం ముందు ఇతర సౌందర్యం పోల్చడానికి ఎవరికి సాహసం ఉంటుందీ?”
“ఈ సౌందర్యం నాకు కాస్త చెప్పు ప్రాణాధికా.”
“ఓయి వెఱ్ఱివాడా, నువ్వు వట్టి శాస్త్రజ్ఞుడవులా కనబడుతున్నావే?”
“నువ్వు వట్టి డాక్టరువు కాదు కాబోలు.”
“డాక్టరుకు శరీర సకలమూ పరమాద్భుత సృష్టి రూపమని తెలుసును."
“అవును.”
“పరమ సౌందర్యవంతమయిన బాహ్య శరీరమూ మాకు తెలుసును.”
"ఆ సౌందర్యం ఒక చక్కని యంత్రంవంటిదిగానే మీరు భావిస్తారా? లేక కవులు వర్ణించే సౌందర్యంగానా?”
“కవులు వర్ణించనక్కరలేదు సౌందర్యాన్ని! సువాసన నువ్వు ఆఘ్రాణించి ఆనందం పొందుతావు కవులు వర్ణించి చెప్పాలా! అలాగే సౌందర్య భావమూ!"
“అద్భుతం!”
“ఏమిటి అద్బుతం?”
“నీ సౌంద్యం!”
“నేను సౌందర్యవతినని ఎలా తెలుసును?”
“నువ్వు ఈ విగ్రహం సౌందర్యవంతమైనదని ఎలా చెప్పగలవో అలాగే!”
“ఓ హృదయనాధుడమైన నా తెలివి తక్కువ భర్తా!”
మూర్తి పకపక నవ్వి తన భార్యను గట్టిగా హృదయానికి అదుముకొని, ఆమె పెదపులు తమిగా ముద్దిడుకొని, “ఈ శచీదేవి విగ్రహం అఖండ సౌందర్య పూరితం కావచ్చు కాని నా జెన్నీ సౌందర్యం ముందు -”
2
అజంతాలో మూడు రోజులున్నారు. దీపాలు పెట్టి చూచారు. ఈనాటి డేరాలు, ఈనాటి క్యాంపు కుర్చీలు, బల్లలు, ఆ ఆడవాళ్ళ చేతి సంచీలు, అన్నీ జెన్నీ చూచి ఆశ్చర్యం పొందింది. “ఆనాటి స్త్రీలు ఇప్పటివాళ్ళకన్న అందమైనవాళ్ళు. ఎక్కువ నాగరకత కలవాళ్ళుగా కనబడుతున్నారు ప్రియతమా!” అని ఆమె అన్నది.
“పురుషులూ అలాగే కనబడుతున్నారు. ఈ అజంతా ప్రపంచంలోని ఉత్తములు ఈనాటి ఉత్తములులానే కనబడుతున్నారు. ఈ బోధిసత్వులా బుద్దుడిలా ముఖాల్లో మహాత్ముని ముఖం కనబడటంలేదు నీకు. ఈ శిబిచక్రవర్తే ఈనాటి జవహర్‌లాల్ అయి ఉంటాడు. ఇక్కడ ఎక్కడో వీళ్ళందరిలో వెదికితే నేనూ కనబడతాను సుమా!”
“నేను కనబడను కాబోలు.”
“ఈ అజంతా బాలికలలో సౌందర్యవంతులయిన యువతులలో ప్రథమురాలు నీకన్న కొంచెం తక్కువ.” “ఏమిటా బడాయి?”
“నాకెందుకు బడాయి?”
“అంత అందమైన భార్య తనకే ఉన్నదని అందరు అనుకుంటారనీ!”
“ఆ గుహలు తిరిగి తిరిగి, ఆ ప్రదేశ సౌందర్యంలో మునిగిపోయి, మతులుపోయి వదలలేక వదలలేక, తిరిగి బొంబాయి ప్రయాణం అయ్యారు.
3
వీరు బొంబాయి చేరేసరికి ఎల్లమందమూర్తి ప్రణాళిక ప్రభుత్వంవారు ఒప్పుకున్నట్లూ, పని వెంటనే ప్రారంభించమనీ కాగితాలు వచ్చి వున్నాయి.
మూర్తి పక్కన ఉన్న భార్యను కౌగలించుకొని ఆమెతో నాట్యం చేయసాగినాడు.
ఇద్దరూ వెంటనే లోనవాలా పరుగెత్తినారు. ఆ మరునాటినుండి మూర్తి పనిలో మునిగిపోయాడు. వేలకొలది మేస్త్రీలు మూర్తి అనినా, జెన్నీ అనినా ఎంతో గౌరవంతో భక్తితో మెలగసాగినారు. జెన్నీ వారందరికీ ఎంతో ప్రేమతో వైద్యం చేస్తూ ఉంటుంది. ఒక్క పైసా పుచ్చుకోదు. ఆ పని మనుష్యులలో స్త్రీలకు ఎంత మందికో జెన్నీ పురుడు పోసింది.
లోనవాలాలో జెన్నీ వేరే ఒక ఇల్లు పుచ్చుకొని వైద్యాలయం ప్రారంభించింది. పనివాళ్ళల్లో ఇద్దరి బాలికలకు నర్సుల పని నేర్పింది. జెన్నీ పెళ్ళయి వచ్చిన కొత్త రోజులలోనే లయనెల్ మదరాసులో ఉన్న ఆమె మందులూ శస్త్ర వైద్యపు పనిముట్లూ అన్నీ పంపించాడు. ఆమె బొంబాయిలోను చాలా మందులూ పరికరాలు కొనుక్కున్నది.
ఈ వైద్యంతోపాటు చుట్టుపక్కల ఉన్న పర్వత నగరాలలో కాపురమున్న పెద్ద కుటుంబాలవారికీ, పాశ్చాత్యులకూ నెమ్మదిగా ఈమె వైద్యురాలయింది. దానివలన బాగా రాబడి రా నారంభించింది.
ఈలోగా తన భర్తకు ఆమే కోటి విధాల ఆలోచన చెబుతూ హుషారు ఇస్తూ వున్నది.
మూర్తి ఆ కొండరూపం మార్చినాడు. అమెరికాలో నేర్చుకొన్న విద్యకు అవసరాన్ని బట్టి ఇంకా కొత్త విధానాలు చేర్చి పనిని మహావేగంగా ప్రజ్ఞాపూర్ణంగా సాగిస్తున్నాడు. మూర్తి చేయించే పనిని చూడవలసిందని ప్రభుత్వం దేశ దేశాలనుంచి ఇంజనీర్లను పంపింది. మూర్తి దగ్గర పని నేర్చుకొనడానికి యువక ఇంజనీర్లెంతమందినో పంపించింది. వారందరూ మూర్తిగారి అఖండ విజ్ఞానమూ, కార్యాలోచనా నిశితత్వమూ చూచి ఆశ్చర్యం పొందినారు.
4
1940 సంవత్సరం మే నెలలో జెన్నీ తండ్రి, తల్లీ ఇద్దరూ బొంబాయి వచ్చి కొమరితను చూడడానికి రమ్మనమని ఉత్తరం వ్రాసినారు. జెన్నీ వెంటనే వారున్న తాజ్‌మహలు హోటలుకు తాను రావడానికి వీలులేదనీ, తనకు హాస్పిటలుపని తల మునిగినంత ఉన్నదనీ, కాబట్టి తల్లిదండ్రులే ఇద్దరూ రావలసిందని ఫోను చేసింది. ఆ ముసలి దంపతులు బింకం పట్టుకున్నంత కాలం ఉన్నారు. జెన్నీ భర్త కోర్కె చొప్పున తమ క్షేమ సమాచారాలను గూర్చి తలిదండ్రులకు ఉత్తరాలు రాస్తూ ఉండేది. పెద్దన్నగారు పెషావరునుంచి యూరపు వెళ్ళిన సేనలలో ఉన్నాడు. అతనికి ఆయన భార్యకూ ఎప్పుడూ జెన్నీ ఉత్తరాలు రాస్తూ ఉండేది. మేజరు భార్యా బిడ్డలు అందరూ మదరాసులో జెన్నీ తలిదండ్రుల దగ్గర ఉండినారు.
జెన్నీ ఎంతమందికి ఎన్ని ఉత్తరాలు రాసినా లయొనెల్ తప్ప చుట్టాలెవ్వరూ ప్రత్యుత్తరాలైనా వ్రాసేవారు కారు. అందువల్ల జెన్నీ కూడా వాళ్ళకు ఉత్తరాలు రాయడం మానివేసింది. తలిదండ్రులు జెన్నీకి ఉత్తరం రాయకుండా బొంబాయి వచ్చేశారు.
ఆమెతో ఫోనులో మాట్లాడడానికి తల్లి వచ్చింది.
"జెన్నీ!"
“మమా!”
“ఎన్నాళ్ళయింది నీ గొంతుక విని!”
“మమా! నువ్వు నన్ను ముద్దు పెట్టుకు ఎన్నాళైంది?”
“జెన్నీ ఏమంటావు?”
“మీ ఇద్దరూ మా ఇంటికి రావాలి!”
“నీ భర్తను కలుసుకోడానికి నీ డాడి కిష్టంలేదు -”
“ఇన్నాళ్ళనుంచీ నా మొగమే చూడనన్న డాడీ ఇప్పుడు బొంబాయికి రాగలిగినాడు. ఇంతవరకు వచ్చి మా ఇంటికి రావడానికి మీ ఇద్దరి కభ్యంతరం ఏమిటి? అంత అభ్యంతరమే ఉంటే నన్ను చూడకుండానే తిరిగి మదరాసు వెళ్ళండి!”
“అయ్యో!” విచారయుక్త స్వరపూరితమయి ఆమె మాటలు జెన్నీ హృదయాన్ని పిండిచేసినాయి. అయినా ఆశయాలలో మెత్తబడటం ఉండకూడదని పళ్ళు బిగించుకొని, “మమా! ఇక సెలవు పుచ్చుకుంటాను -” అన్నది..
ఆమె తల్లి హృదయంలో బాధపడినట్లు “అయ్యో” అన్నది. మళ్ళీ ఇంతట్లో జెన్నీ తండ్రి ఆ ఫోను రిశీవరు తీసుకొని, 'జెన్నీ'ని పిలిచాడు.
“ఏమిటి డాడీ! నువ్వేనా?” అన్నది జెన్నీ.
“నేనేనమ్మా! నేనే! నేను ఆలోచించిన కొలదీ నిన్ను ఇక్కడకు రమ్మన మనడం తప్పుగానే కనబడింది. మేము ఇద్దరం అక్కడికి రేపు ఉదయం మీకు అతిథులుగా వస్తున్నాము. ఈ విషయం నీ భర్తతో చెప్పు. నీ భర్త చాలా ఉత్తముడు. ప్రజ్ఞాశీలి. అతడు నా అల్లుడవడం నాకెంతో గర్వకారణం అని అనుకుంటున్నానని కూడా చెప్పు.” అని ఆ వృద్ధుడు గంభీర కంఠంతో అన్నాడు.
వారిద్దరూ ఒకరి దగ్గర ఒకరు సెలవు తీసుకొన్నారు. జెన్నీ నాట్యం చేసింది. సాయంకాలం భర్త రాగానే తన తలిదండ్రులు ఇద్దరూ తమ అతిథులుగా వస్తున్నారని చెప్పింది.
5
మర్నాడు ఉదయం సర్ ఎడ్వర్డు కార్లయిల్, భార్యా లోనవాలా స్టేషనులో దిగినారు. స్టేషనులో జెన్నీ, మూర్తి వీరికోసం ఎదురు చూస్తున్నారు. బండి దిగగానే మూర్తి మామగార్కి నమస్కరించినాడు. ఇద్దరు ఆనందంగా కరస్పర్శ కావించినారు. తల్లి కొమరితను కౌగలించుకున్నది.
అందరూ కలిసి మూర్తి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఫలహారాదులు అయిన వెనక అల్లుడూ, మామా కూర్చుండి మాట్లాడుకోవడం సాగించారు. ఆరోజు ఆదివారం అవడం వల్ల మూర్తికి సెలవు.
'సర్ ఎడ్వర్డూ: కాబట్టి నువ్వు ఇంకో ఆరు నెలల్లో పని పూర్తి చేయగలవన్నమాట?
మూర్తి: తప్పకుండా నండి!.
'సర్ ఎడ్వర్డూ: ఇంతవరకూ చేసిన పనిని పెద్దవాళ్ళెవరైనా వచ్చి చూచారా?
మూర్తి: మూడు నాలుగుసార్లు వచ్చి చూచారండీ!
ఆ సాయంకాలం నలుగురూ జలాశయం కట్టే స్థలానికి వెళ్ళి చూచినారు. సర్ ఎడ్వర్డు మంచి ఇంజనీరు అవడంవల్ల మూర్తి చెప్పేవి అన్నీ వింటూ, పరిశీలిస్తూ గమనించాడు. మూర్తి అఖండ ప్రజ్ఞావంతుడనిన్నీ అదృష్టవంతుడయితే భారతదేశం అంతకూ ఇలాంటి జలాశయాది నిర్మాణంలో ఈతడు రత్నస్థగితమకుటంలాంటి వాడు అవుతాడనీ అనుకున్నాడు.
వీరిద్దరూ ఇక్కడ వుండగానే మదరాసునుంచి మేజరు కార్లయిల్ భార్యా, బిడ్డలూ, తిరుచునాపల్లినుంచి లయొనెల్ భార్య ఎలిజబెత్తూ వస్తున్నామని తంతి ఇచ్చారు.
★ ★ ★