Jump to content

నరుడు/మంగళగీతము

వికీసోర్స్ నుండి


మంగళగీతము

అందరూ వచ్చినారు. ఇల్లంతా కలకలలాడిపోయింది. బిడ్డలందరికీ మూర్తి ఎంతో ఇష్టుడైనాడు. అతన్ని ఎక్కి తొక్కేవా రా బాలికలు. వారినందరినీ అతడు బొంబాయి సినిమాలకు తీసుకొని వెళ్ళేవాడు. అక్కడ బొమ్మలు, మిఠాయి దినుసులు బహుమతులిచ్చేవాడు. ఆ సమయంలో డాక్టరు గ్రేస్ టెంపిల్టనుగారు కూడ మేనకోడలి కాపురం చూడటానికి వచ్చింది.

వచ్చిన చుట్టాలందరూ వారం రోజులుండి అందరూ కలిసి వెళ్ళిపోయినారు. భార్య చుట్టాలందరితో తనకు తిరిగి ప్రేమ కుదరడం తన అదృష్టమని ఉప్పొంగిపోయాడు మూర్తి.

అతడూ, జెన్నీ ఇద్దరూ వారి వారి పనులలో నిమగ్నులైనారు. సాయంకాలం అతడు తిరిగి వచ్చేసరికి జెన్నీ తన వైద్యాలయంలో పనిలో మునిగి ఉండేది. మూర్తి స్నానంచేసి బట్టలు మార్చుకొని, భార్యకడకుపోయి, ఆమె పని పూర్తికాగానే, ఆమెతో కలిసి ఇంటికి వచ్చేవాడు. ఆమెకూడా స్నానం చేసి బట్టలు మార్చుకొని వస్తే ఇద్దరూ కారు ఎక్కి బొంబాయి సినిమాకు పోవడమో, లేక ఊరికే శీతల వాయుసేవానంద సంచారం చేయడమో కార్యక్రమం పెట్టుకొనేవారు. ఇంటికి వచ్చి భోజనంచేసి రాజకీయాలూ యుద్దమూ చర్చింపసాగేవారు.

మానవ ద్వేషమూ, పశుత్వమూ అతని హృదయాన్ని కలచివేసేది. ఆమె హృదయం అతని హృదయానికి శ్రుతి.

“ప్రియతమా! ఈ యుద్ధం తలచుకున్నప్పుడల్లా గుండె బేజారవుతూంటుంది.”

ఒక్కొక్కప్పుడు హిట్లరు సంధికి వస్తాడేమో అనే ఆశ పుట్టుతూ ఉంటుంది.

“వట్టి అడియాస జెన్నీ!”

“ఇప్పుడే దేశాలన్నిటా యుద్ధపు వేడి అలుముకుపోతోంది. హిట్లరు డెన్మార్కు ఆక్రమించాడు. నార్వే మీదకు విరుచుకుపడ్డాడు. మన వాళ్ళందరూ! వెళ్ళి ఇరవై రోజులు కాలేదు. నార్వే అయిపోయింది. హాలెండు, బెల్జియం, లడ్జెంబర్గులలోనికి ఒక్కసారిగా చొచ్చుకుపోయారు. ఆ దేశాలన్నీ అయిపోతున్నాయి.”

“వీడు సైతాను తమ్ముడు కాడుగదా?"

“ఇటు కాంగ్రెసు వారి ఉద్దేశమే తెలియటంలేదు!”

“లీగుకూ, కాంగ్రెసుకూ మధ్య దాటరాని అఖాతం వచ్చిపడింది.”

“మన దేశానికి ఇబ్బంది లేదని నా ఉద్దేశము. ఎందుకంటావా? మహాత్ముడు దేశంలో ఉన్నంతకాలమూ దుర్మార్గులు ఈ దేశంవైపు తేరిపార చూడలేరు.”

“నీకు మహాత్ముడంటే అంత పవిత్ర భావం ఎందుకో ఇప్పుడు నాకర్థం అవుతున్నది.”

“మహాత్ముడు వ్యక్తి సత్యాగ్రహం ఎంత చక్కగా నిర్వహిస్తున్నాడో!” మూర్తి జెన్నీని చూచి "ప్రియా సంపూర్ణ స్వరాజ్యం రానీ హిమాలయాలనే అఖండ శక్తిని మేము మన దేశానికి వరమిచ్చేటట్లు చేయగలం. ఆ పర్వతాలలో యెన్నివేల లోయలు, ఎన్ని మహానదులు! అన్నీ ఆనకట్టలు కట్టి హిందూదేశం ఏమిటి సర్వ ఆసియాకు విద్యుచ్ఛక్తి సరఫరా చేయగలం. రాజపుత్రపు టెడారిని మహోద్యానవనం చేస్తాము.” అని పలికినాడు. జెన్నీ భర్త మోము చూచి అందు వెలిగిపోయే కాంతులు చూచి ఆనంద చకితయైనది.

అలా వారు గంటలకొలదీ మాట్లాడుకొనేవారు.

ఆనాటి కానాడు జెన్నీ భర్త ప్రేమ క్షీరవారాశిలో వటపత్ర శయని అయి ఆనందతరంగ డోలికాలోల పరవశమై పోతున్నది. ఆమె మూర్తిని హిందూ బాలికలవలె పూజింపసాగింది. ఆమె అద్భుతాలైన ఖద్దరు పట్టుచీరలు కొనుక్కొని కట్టడం నేర్చుకుంది. బెంగుళూరి పట్టురవికలు, భారతీయ భూషణాలూ అలంకరించు కొనసాగింది. ఆ నూత్న మనోహరి వేషం చూస్తూ మూర్తి పరవశుడై పోయినాడు.

మూర్తి పని జూన్ నెలాఖరుకు మూడుపాళ్ళు పూర్తి అయిపోయింది. జలాశయం, జలసూత్రాలు, గొట్టాలు, కొండపని అంతా పూర్తి అయినాయి.

వానలు ప్రారంభించాయి. పని అంతవరకూ బాగా ఉందని సంతోషిస్తూ, మూర్తి ఇంటికి వచ్చేసరికి, జెన్నీ ఇంటికి రాలేదు. మూర్తి స్నానంచేసి సావిడిలో పడకకుర్చీలో కూర్చుండి పైపు కాలుస్తూ, పగటి కలలు కంటున్నాడు. కాలం ఎంత జరిగిందో అతనికి తెలియదు. చటుక్కున జెన్నీ కలకలలాడుతూ లోననుండి నెమ్మదిగా నడిచి వచ్చి భర్త కన్నులు మూసింది. అతడులిక్కిపడి “దొంగా! నా సామ్రాజ్ఞివి నువ్వు! తెలుసుకున్నానులే!” అన్నాడు.

ఆమె చేతులు తీసి, అతని వైపు నోటనుండి తీసి బల్లమీద పెట్టి అతని ఒళ్ళో కూర్చుని అతని మెడచుట్టూ చేయి వైచి, అతని చెవిదగ్గర నోరుంచి “ఓ నా నరుడా! నువ్వు తండ్రివి కాబోతున్నావు!” అని చెప్పి, అతని కన్నులు మూసింది.

“ఆఁ!” అంటూ మూర్తి భార్యను గట్టిగా హృదయానికి అదుముకొని, “నా దేవీ! కుళ్ళు నీళ్ళలో పొర్లాడే ఈ పశువును ఐరావతాన్ని చేశావు. నాకు నా ఆత్మలో నీ ఆత్మ కలిపి ఒక దివ్య వరం ప్రసాదించావా?” అని ఆమె పెదవులు చుంబించినాడు.

ఓం అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
మృత్యోర్మా అమృతంగమయ.


★ ★ ★