నరుడు/నాలుగవ భాగం

వికీసోర్స్ నుండి


(నాలుగవ భాగం)

జలపాతం

మూర్తి నాలుగు రోజులు మదరాసులో ఉండి, కాంగ్రెసు నాయకుల్ని, కాంగ్రెసు మంత్రివర్గాన్నీ, హరిజన సేవాసంఘ నాయకుల్ని చూచినాడు.

వైస్రాయి: ఆంతరంగిక కార్యదర్శి నుండి పన్నెండు దినాలయిన వెనుక ఒక తారీఖు రోజున ఢిల్లీ రావలసిందని ఉత్తరం వచ్చింది. ఈ అయిదవ దినాన రాష్ట్ర గవర్నరు గారిని దర్శించినాడు.

ఈ అయిదు దినాలూ, తాను అమెరికాలో గడిపిన సంవత్సరాలూ మొదలయినవి చర్చించాడు. అందరూ అతన్ని మెచ్చుకుంటూ మాట్లాడారు. కాని అతని కర్తవ్యం ఎవ్వరూ నిర్ణయించలేదు.

లయొనెల్ ఎలిజబెత్తు చేసింది తప్పు అని ఎలా చెప్పగలడు? భార్యతో మూర్తిని పొగడి తమ స్నేహం ఎంత పవిత్రమో ఆమెకు తెల్పినాడు .

“మీ స్నేహం పవిత్రం కాదని నేను ఊహించలేదు. అంత మాత్రాన అతణ్ణి నీ చెల్లెలు వివాహం చేసుకొనడానికి నేనెలా సమ్మతించగలను?”

"వివాహానికి ప్రేమ ముఖ్యమంటావా లేక జాతి, సంఘము, రంగూ, ముఖ్యమా ప్రియా!”

“నువ్వు గజం పొడుగు ముందుకు వచ్చిన పెదవులు కలిగి, ఊలు జుట్టుతో, పీపాలాంటి కడుపుతో ఉన్న ఆఫ్రికా పిగ్మీ పిల్లను ప్రేమించగలవా?”

“ప్రేమించడం జరిగిన వెనుక ప్రేమను గురించి మాట్లాడాలి కదా! ఇక్కడ జెన్నీ మూర్తినీ మూర్తి జెన్నీని ప్రేమించుకొంటున్నారు గదా!”

“మూర్తి ఒక రిక్షాలాగే కూలీ అయితే వారి ప్రేమను నువ్వు ఒప్పుకుంటావా?”

"ఏదో అయితే గియితే అంటే ఏమి లాభం విజ్జీ! నా ప్రాణ స్నేహితుడు నా అనుంగు చెల్లెలూ ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకుంటే నేను ఆనందపూర్ణుడను కానా?”

“ఓహో కాకేమి? నేను ఉత్తమజాతి ఇంగ్లీషు బాలికను. మా వంశంలో వాడవు నువ్వు! నీకూ నాకూ కలిగిన ప్రేమను లోకం హర్షిస్తుంది.”

“ప్రేమకూ లోకానికీ సంబంధం ఏమిటి?”

“ప్రేమించుకునే మనుష్యులు లోకానికి సంబంధం లేకుండా ఉద్భవించారా?”

లయొనెల్ ఏమి చేయగలడు? అతడు విచార పూర్ణ బాధతో క్రుంగిపోయాడు.

“ఇంతకూ మా జెన్నీ విషయంలో నేనేమి చేయగలను. ఆమె జీవితం దారి ఆమె నిర్ణయించుకోవాలి!” అంటూ అతడు తల వాల్చుకొని, తన కచ్చేరీ గదిలోకి వెళ్ళాడు.

ఎలిజబెత్తు మనస్సు కరగలేదు. పైగా, పౌరుషంతో దుఃఖం తెచ్చుకొని కన్నీరు పెట్టుకుంటూ ఆ సోఫాపై కూలబడింది. ఆ చప్పుడు విని లయొనెల్ చప్పున తన గదిలోనుండి చక్కా వచ్చాడు. సోఫామీద వాలి విజ్జీ మూర్ఛపోయినట్టు గడబిడ పడుతున్నది. ఇంతట్లో లయొనెల్ పరిచారికను వాసనమందు తీసుకురమ్మనమని చెప్పి పరుగున వెళ్ళి ఫోను చేశాడు.

పరిచారిక విజ్జీకి ముక్కు దగ్గిర మందు వాసన చూపిస్తూ “యూడికోలోన్”తో తడిపిన గుడ్డతో నుదురు అద్దుతూ ఉన్నది. ఇంతట్లో డాక్టరుగారు చక్కా వచ్చారు.

ఆయన పరీక్షచేసి ఎలిజబెత్తు గర్భవతి అనిన్నీ ప్రథమ గర్భందాల్చి ఉన్న బాలికలు కొంత నరాల సంబంధమయిన గడబిడలకు పాల్పడతారనిన్నీ, కాని పదిరోజులపాటు మందు ఇచ్చి ఆ తర్వాత గర్భబలానికి ఆమె బలానికీ మందు ఇస్తూంటే పురుడు సరీగా జరగగలదని ఆ డాక్టరుగారు లయొనెల్‌కు చెప్పి మందు వ్రాసి యిచ్చారు.

ఇంతట్లో జెన్నీ ఇంటికి వచ్చింది. వదినగారి దగ్గరకు వెళ్ళి కౌగలించుకొని, ఆమెకు రెండు గంటల పరిచర్య చేసింది. విజ్జీకి ద్రవాహారం ఇచ్చి నిద్రబుచ్చింది.

జెన్నీ రెండు రోజుల సెలవుపెట్టి మూర్తితో ఒక్క మహా ప్రవాహానందంతో గడిపింది. అతడు పనిమీద వెళ్ళి మళ్ళీ వచ్చేవరకూ అతనికోసం ఎదురుచూస్తూ వుండేది. అతన్ని సినిమాలకనీ, విహారాలకనీ తీసుకుపోయేది. రాత్రి రెండు గంటలవరకూ అతని ఒడిలో వాలి వుండేది. అసలు నిద్రనేది లేకుండా వుంటే బాగుండుననుకునేదీ.

రెండు రోజులూ అయిన వెనక ఉద్యోగానికి వెడుతూ ఉండేది. పని అయిన వెంటనే తిరిగి తిరిగి ఇంటికి రావడం! రావడంతోటె ఎదురుగా ఎల్లమంద వుండాలని అతనికోసం ఎదురు చూడడం!

ఇదంతా చూచే ఎలిజబెత్తుకు మతిపోయింది. ఆరవ రోజు రాత్రి లయొనెల్ ఎలిజబెత్తులు తిరుచునాపల్లి వెళ్ళి పోయినారు. ఏడవ రోజు ఉత్తరాదికి పెద్ద కొడుకునూ, కోడలినీ, వారి బిడ్డలనూ చూడడానికి వెళ్ళిన ఎడ్వర్డు కార్ల్‌యిల్‌గారు ఆయన భార్యా ఇంటికి వచ్చారు.

ఎడ్వర్డు కార్ల్‌యిల్‌గారు అయిదు సంవత్సరాల క్రితమే విశ్రాంతి వేతనం తీసుకొని ఉద్యోగం నుండి విరమించారు. అతనికిప్పుడు అరవై రెండు ఏళ్ళు ఉన్నాయి. ఆయన భార్య పేరు డోరిస్. ఆమెకు ఏభై ఎనిమిది సంవత్సరాలున్నాయి.

వారిద్దరూ రావల్పిండిలో పెద్ద కొమరుడు మేజరు రిచ్చర్డుకు అతిథులుగా వుండి, అక్కడినుంచి కాశ్మీరము, ఆల్మోరా, ముస్సోరీ, కరాచీ, జయపురం మొదలయినవి తిరిగి, రావల్పిండి వచ్చి పదిరోజులుండి బయలుదేరి చెన్నపట్నం వచ్చినారు.

కార్ల్‌యిల్‌గారి బంగాళా ఇల్లు కీల్పాకులో పూనమల్లీ రోడ్డుమీద పెద్ద తోట మధ్య వుంది. యూరేషియనైనా మదరాసులో వర్తకం చేసేటట్టీ, ఉద్యోగాలలో ఉన్నట్టి బ్రిటీషు పెద్దల గౌరవం పొందుతూ తానూ తన భార్యా బిడ్డలూ వారి ఇళ్ళకు అతిథులుగా పోతూ, తానూ వారిని తమ ఇంటికి విందులకు పిలుస్తూ గౌరవం పొందుతూ వుండేవాడు.

కార్లయిల్ కుటుంబంలో కొందరు ఇంగ్లీషు విధవలను, కొందరు ఇంగ్లీషు బాలికలను పెళ్ళి చేసుకున్న మాట నిజం. ఆ బాలికలూ, ఇంగ్లీషు విధవలూ అంత పెద్ద కుటుంబాలవారు కాకపోవచ్చును. కాని,పదహారణాల ఆంగ్ల రక్తంవారు. మిస్టర్ కార్లయిల్‌గారు ఎంతో చక్కగా ప్రతిభతో ప్రభుత్వానికి భక్తితో పనిచేసి వుండడంచేత ఎం.ఎస్.ఎం. రైల్వేవారికి చీఫ్ యింజనీరు అయిన రెండేళ్ళకు 1924వ సంవత్సరంలో “నైటు బిరుదం పొంది సర్.ఎడ్వర్డు కార్లయిల్‌గారు కె.సి.ఐ.” అయ్యారు.

వీరిని ముఖ్య ఇంజనీరును చేయడంలో ప్రభుత్వంవారు రెండు పక్షుల్ని ఒకే బాణంతో కూలవేయగలిగారు సర్. ఎడ్వర్డు కార్లయిల్‌గారు భారతీయుడు. అందుకని ఆయనకే ఈ ఉద్యోగం ఇచ్చాము” అంటూ మొగం అవతలికి తిప్పి “ఎల్లాగైనా ఆంగ్ల రక్తం ప్రవహించేవానికి ఆ మాత్రమయినా చేయకపోతే యెల్లాగు” అని ఒకరినొకరు కళ్లు గీటుకున్నారు.

సర్. ఎడ్వర్డు కార్లయిల్‌గారు ఇంటికి వచ్చారు. వస్తున్నామని తెలియజేయగానే జెన్నిఫర్ తల్లిదండ్రులను ఎదుర్కోవడానికి వెళ్ళింది. ఉండే పరిస్థితులలో ఎల్లమందమూర్తి వచ్చి జెన్నీ తల్లితండ్రులను వివాహానికి అనుమతి అడగడంకన్న, తానే తన మాతా పితరులను ఒప్పించడానికి నిశ్చయం చేసుకొంది.

ఎల్లమందమూర్తి తన స్వగ్రామం వెళ్ళిపోయినాడు.

ఎల్లమందమూర్తి తన స్వగ్రామం వెళ్ళడానికి నిశ్చయించుకున్న రోజు సర్. ఎడ్వర్డు కార్లయిల్ వచ్చిన ముందురోజు. ఆ దినం ఒక్క నిమిషం విడవకుండా అతడు, జెన్నీ తిరిగారు.

“జెన్నీ! ఈ మానవ వ్యవస్థ చాలా విచిత్రమయినది. లోకంలో వున్న స్త్రీ పురుషులు నూరుకోట్ల సంఖ్య. అందులో ప్రేమించటానికి సిద్ధంగా వున్న వారి సంఖ్య కొద్ది కోట్లు అయినా ఈ ప్రేమల పరిణామం, పరిణత, చరిత్రా ఏ రూపాలు పొందుతాయో ఆలోచిస్తూ ఉంటే నాకు 'ఫాఘ్ట' చూచి దిగ్భ్రాంతుడయిన బ్రహ్మాండము కనబడుతూ వుంటుంది.”

“నీకు ఎప్పుడూ ఆలోచనలే, కార్య నిమగ్నత తక్కువ ప్రియతమా?”

“అవును, నీ అద్భుత మూర్తిని సందర్శించిన యువకుడు పనిలేనివాడై లోకం అంతా తిరుగుతూ వుంటాడు.”

“లోకంలో ఉన్న యువతీమణులు ఎన్ని జాతులవారు, ఎన్ని దేశాలవారు యెంతెంత అందంగా ఉన్నవాళ్ళు లేరు?”

“అది నిజమే. సౌందర్యశాస్త్రం ప్రకారం అందం కలవాళ్ళు ఒక జాతి అనుకుందాం. ఆ జాతిలో అంతరమయిన జాతులకు చెందిన సౌందర్యవతులను, ఒకరకం మానసిక ప్రవృత్తిగల యువకులు ప్రేమిస్తారు. అందులో ఒక్కొక్క అనుభూతి కారణాలవల్ల ఈ మనుష్యుడూ, ఈ స్త్రీ అని కేటాయింపయివుంటారు. ఆ కేటాయింపయిన జత మనం ఇద్దరం కాబోలు.”

“నీ మాటలు అగమ్యగోచరంగా వున్నాయి.” అని పకపక నవ్వుతూ జెన్నీ అతన్ని గట్టిగా అదుముకొంది.

“జెన్నీ, కొన్ని యుగాలు నిన్ను వదిలివుండాలి!”

ఆ రాత్రి మెయిలు మీద భీమవరం వెళ్ళిపోయినాడు ఎల్లమందమూర్తి. 

2

ఆ మర్నాడు ఉదయం నిడదవోలులో రైలు మారి. మూర్తి భీమవరంలో దిగాడు. ఇదివరకే తమ పురోహితుడుగారి పేర టెలిగ్రాం అతడు ఈ దినానికి వస్తానని ఇచ్చి వుండడంవల్ల భీమవరం స్టేషనుకు జక్కరంవారూ, భీమవరం వారూ చుట్టుపక్కలవారు హరిజనులెందరో వచ్చి సిద్ధంగా వున్నారు. బండి రాగానే ఎల్లమందమూర్తికి “జయ్” అని వచ్చిన వారందరూ జయజయ ధ్వానాలు సలిపినారు. బండి ఆగగానే ఎల్లమంద దిగినాడు. ప్రజలందరూ పూలమాలలు వేశారు. ఖద్దరు దండలు వేశారు. హరిజన సంఘంవారు యెవరిదో కారు పట్టుకు వచ్చారు. ఎల్లమందను భీమవరం అంతా ఊరేగించి బోర్డు ఆఫీసుదగ్గిర పెద్ద సమావేశం జరిపినారు.

ఎల్లమంద ఉక్కిరి బిక్కిరై, చైతన్యం సగం తప్పి ఈ మహా భావానికి ఉన్న పరమార్థం తర్కించుకుంటూ కూచున్నాడు.

“హరిజనులు యుగయుగాలనుంచి ఇలా వేదన పడిపోతున్నారు. కాని యెవరో ఎల్లమంద వంటి కులోద్ధారకులు ఉద్ధరించి జాతిని తరింపచేస్తారు.” అని ఒకరన్నారు.

ఉత్తమ కులాలవారు వింధ్య పర్వతంలాంటి బరువును ఈ కులాలవారిమీద వేసి వుండడంచేత వారు అలా నీచ స్థితిలోపడి ఉన్నారు. తప్పు ఉత్తమ కులాలవారిది. ఇన్ని యుగాలనుంచి, ఊళ్ళ బయటకు నెట్టి, చూడకూడని వారు, ఉచ్చరింపకూడనివారు, గ్రామంలోనికి రానివ్వకూడనివారు అని చెప్పి వారిని, సాంఘికంగా, నైతికంగా, ఆర్థికంగా, విద్యా విషయికంగా, రాజకీయంగా అతి నీచస్థితిలో వుంచిన పరమ రాక్షసులం మనం!” అని ఒక బ్రాహ్మణ యువకుడు మాట్లాడినాడు.

ఎల్లమంద యెప్పుడూ ఉపన్యాసాలిచ్చినవాడు కాడు. అతడు లేచి పది నిమిషాలు తడబడినాడు. అక్కడినుంచి ఎదురుగుండా ప్రేక్షకులు లేరు, ప్రపంచం లేదు. అతని ఎదుట అతడు ఉన్నాడు. అతనికి అతడే మాట్లాడుకున్నాడు.

“ఈ పరిస్థితులు యెలా వచ్చాయి? చరిత్ర అతిక్లిష్టంగా ప్రవహించింది. దానికి ఇవి కారణాలనిగానీ, అవి కారణాలనిగాని ఎవరు నిర్ణయించగలరు? ఆ నిర్ణయించడం వల్ల ప్రయోజనం ఏముంది? నదిలో పడిన మనుష్యుడు ఏలా పడ్డాడో విచారణ చేస్తుంటే అతడు ప్రాణం అర్పించుకోవలసి వస్తుంది. వెంటనే అతన్ని రక్షించాలి.

“హరిజనులకు కాంగ్రెసు ప్రభుత్వాలు మనుష్యునకు పది యెకరాలకు తక్కువగాని భూమి ఇవ్వాలి. తక్కిన వారి మాట ఎల్లా ఉన్నా హరిజనాది హైస్య సంఘాలవారికి తప్పక పట్ట పరీక్ష వరకు చదువు చెప్పాలి. ఆ శాసనం యెవ్వరూ తప్పటానికి వీలులేదు. ప్రస్తుతం దేవాలయాలకు పోవడం వగైరాలన్నీ కార్యక్రమంలో తర్వాత వస్తాయి. అవి కావలసిన మాట నిజమే!”

ఈలా ఈలా మహా వేగంతో మాట్లాడినాడు.

ఉపన్యాసానంతరం ప్రజలు యెల్లమందకు బ్రహ్మాండమయిన జయజయధ్వానాలు సలిపినారు. ఆ మధ్యాహ్నం యెల్లమంద జక్కరం చేరినాడు. తన గుడిసె దగ్గిరకు వెళ్ళాడు. గుడిసెముందు పెద్దపందిరి. తోరణాలు, పందిరిలో కుర్చీలు, బల్లలు, మంచం, పరుపుదిండ్లు వున్నాయి. పరుపులు వేసిన మంచం చుట్టూ మూడు వెదురు తడికలు కట్టి ఒక గదిలా సిద్ధం చేశారు.

ఆ గూడెంలో దొరలు జీవించే విధానం ఎరిగివున్న క్రిష్టియనులు వున్నారు. వాళ్ళ సహాయంవల్ల చంద్రయ్య ఈ ఏర్పాటులు చేశాడు. తండ్రి ఆపేక్ష అనంతం! తల్లి ఆపేక్ష అనంతత్వానికి అవధి ఇవ్వగలదు! వారి ప్రేమ మధ్య అలాంటి ప్రదేశంలో ఇంగ్లండులో డి.యస్.సి ఇంజనీరింగు నెగ్గి అమెరికా వెళ్ళి రెండేళ్ళు ప్రవాహశక్తి జనిత విద్యుచ్ఛక్తిని గురించీ, ప్రవాహశక్తిని గురించీ నేర్చుకొని, విజయ పత్రాలు పొందిన ఎల్లమంద తడికెల పందిరి క్రింద మకాము.

తన అక్కచెల్లెండ్రు, అన్నదమ్ములు అతి విచిత్రంగా చూస్తున్నారు. ఈ మనుష్యుల అతి ప్రాథమిక జీవితం, ఒకే గుడిసెలో అందరూ పడుకోడం! ఇతరులు వున్నారని లేకుండా స్త్రీ పురుష సంగమక్రియ! యెంతటి నీచగతి!

ఏ పాపం చేశావు నా జాతీ!

ఎన్ని వేల సంవత్సరాలు ఈ భయంకర నీచస్థితిలో కుళ్ళిపోతూ ఉంటావు మాదిగవాడా?

నీకు విముక్తి లేదా?

ఎంతటి దీన చరిత్ర జరిగిపోతోంది!

తిండి లేకుండా!

మొండితనం కప్పే బట్ట లేకుండా!!

పండ పక్క లేకుండా!!!

ఉత్తమ జీవితం ఛాయలన్నా సోకకుండా, సత్తువలేని హృదయాలు స్వంతంలేని మనస్సులు, మత్తువాసన, కుళ్ళిన మాంసం వాసన హీనత్వం, లుకలుకలాడే భయంకర వాసన, వైద్యుణ్ణి, గురువునూ యెరుగని బీభత్సం. సేద్యం యెరుగని అడవి భూములకన్న హీనమే!

నా జాతీ!

నా మాదిగ జాతీ!

ఆశలేని భయంకరావస్థల క్రుంగే జాతీ!

ఏనాటికి నీకు ముక్తి?

ఏనాటికి నీకు ఏడుగడ?

అతడు వెక్కి వెక్కి రోదించాడు. తల్లితో తిండి సహించలేదని ఆ రాత్రే అలాగే పడుకున్నాడు.

గుడిసెలో తల్లీ తండ్రీ, మన తిండి వాడికి ఏం సయిస్తుంది, అనుకుంటున్నారు. తల్లి నెమ్మదిగా ఏడ్చింది.

“ఊరుకో నాయాలా! ఆడింటాడు,” అని తండ్రి. "ఏటింటాడో! సీమెల్లొచ్చాడు.ఆడికింత కూడెట్టవేం దైబమా!” అని ఎక్కి ఎక్కి రోదించింది తల్లి!

నెమ్మదిగా విన్నాడు ఎల్లమంద. “అమ్మా!” అని పిలిచాడు.

తల్లి పరుగున వచ్చి “ఏటి బాబో!" అని అడిగింది చిరుగుల చీరకొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ. తల్లిని తన మంచం మీద కూర్చోబెట్టి ఎల్లమంద “అమ్మా! నేను సీమ వెళ్ళి రావడంవల్ల ఈ విధంగా అవలేదు. నాకు తిండి సయించక పోవడమూ, దానివల్ల కాదు. నాకు సయించే తిండి పెట్టలేకపోతే మీ తప్పేమి ఉంది. కాని అసలు మన మాదిగ కులంవాళ్ళూ, అలాంటి నీచస్థితిలో వున్న మాలలు, ఇతర చోట్లవున్న మనబోటి వాళ్ళూ అనుభవించే పరమ అసహ్యకరమైన, భరించలేని బాధలు నా మనస్సును వికలం చేశాయి. అందుకు తిండి సయించలేదు. ఇప్పుడు బాగా ఆకలివేస్తూ ఉంది. తీసుకురా అన్నీ.” అని నవ్వుతూ వీపు తట్టినాడు.

ఆ వెర్రిబాగుల తల్లి ఒక్క గంతు వేసింది గుడిసెలోకి. ఈ బాలకుడు వస్తున్నాడని తమ చుట్టాలల్లా కిరస్తానీ మతం పుచ్చుకొని దొరల దగ్గిర బట్లరు పని చేస్తున్న జకరయ్య, దొరసానమ్మ నడిగి ఒక సెట్టు పింగాణీ గిన్నెలు వగయిరాలన్నీ పట్టుకువచ్చాడు. ఒక దాంట్లో బజారులో కొన్న నాను రొట్టె, ఒక దాంట్లో మాంసం కూరా, ఇంకో దాంట్లో అన్నం, మరో దానిలో పులుసూ మొదలయినవన్నీ పట్టుకువచ్చి మంచం దాపున వున్న బల్లపైన పెట్టింది.

మనస్సు నిర్మల మయిపోవడంచేత కడుపునిండా భోజనం చేస్తూ, ఎల్లమంద తల్లిని ఎంతో మెచ్చుకున్నాడు. తల్లి వెంకమ్మ ఎంతో సంతోషించింది.

అతనికి తన చిన్ననాటి భోజనం జ్ఞాపకం వచ్చింది. మూకుడులో గంజి, నాలుగు మెతుకులూ, ఉప్పు చేత నంజుకోవడమూ, అంతే భోజనం. ఉప్పుగల్లే షడ్రుచులు సంతకని తల్లి బుధవారంనాడు చిప్పలో పెట్టుకున్న ఆరణాల డబ్బులు అంటే ఆరణాల డబ్బులే రొంటిని ముడేసుకొని భీమవరం పోయేది.

అర్ధణా డబ్బులు ఎండు మిరపకాయలు, మూడు కాన్లు ఉప్పు, ఒక అర్ధణా వంకాయలు, కందిపప్పు అణా, ఘరంమసాలా అర్ధణా, కొబ్బరి నూనె అర్ధణా, వేరుశనగనూనే అర్ధణా, ఉప్పుచేపలు అణా, ఒక కాని దుంపలపోగు, పందిమాంసం అర్ధణా ఇదీ సంత ఖర్చు. ఈ కోటీశ్వరులకీ సంత ఖర్చుతో వారం అంతా గడవాలి. ఖామందుల ఇంటిలో ఏదైనా పండగా పబ్బమూ, శుభకార్యమూ వగయిరాలు వస్తే ఆ రోజు ఇంటిల్లిపాదీ కాస్త రుచులు చూస్తూ కడుపునిండా తింటారు.

ఖామందులు సుబ్రహ్మణ్యశాస్త్రులుగారు కాస్త డబ్బూ ఆస్తి ఉన్నవాడవటంచేతా, పదిమంది పిల్లలుగల వాడవటంచేతా వారింటిలో ఏవో శుభకార్యాలు వస్తూనే ఉంటాయి. ఆ శుభకార్యాల సమయంలో సాయంకాలం ఆకుల్లో పెట్టి కులం పాలేరువాళ్ళు ఇంటికి బైటదొడ్డిలో గడ్డి మేటికి యివతలగా పదిమందికి సరిపోయే అన్నం, పప్పు, రెండు కూరలు, పులుసు, రెండు పచ్చళ్ళు, పిండివంట రకాలూ పెడితే వెంకో, చంద్రయ్యో మూటలు కట్టుకొని ఇళ్ళకు తీసుకుపోతారు. అలాంటి భోజనాలు ఎన్నిసార్లో తిన్నాడు ఎల్లమంద. చిన్నతనంలో ఇలాంటి శుభకార్యాలు శాస్త్రులుగారి ఇంట ప్రతిరోజూ జరుగుతూ ఉంటే బాగుండిపోను అని అనుకున్నాడు.

గాంధీజీ కాంగ్రెసు నాయకుడై, హరిజనోద్యమం వచ్చినప్పటినుండీ సభలు జరుగుతున్నాయి. అలాంటి హరిజన మహాసభలలో కూడా రెండు రోజులపాటు కాంగ్రెసు నాయకులు వంటలు చేయించి భోజనాలు పెట్టిస్తున్నారు.

ఎంత దుర్గతి తన జాతికి! ఏనాటికి, ఎన్ని వందలు సంవత్సరాలకైనా కడుపు నిండా తినడం తన సంఘానికి రాగలదా అని అనుకుంటూ ఎల్లమంద భోజనం ముగించాడు.

3

ఎల్లమందమూర్తి ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఇంజనీరును కలుసుకున్నాడు. ఇంజనీరింగు శాఖా సభ్యుని చూచినాడు. తాను ధరించిన విదేశీ దుస్తులు అతనికి అసహ్యం వేశాయి. కాని అవి ధరించి వెడితేగాని ప్రభుత్వోద్యోగుల్ని చూడడానికి వీలులేదు. హృదయానికి ఆ దుస్తులంటే ఇష్టంలేదు. తన సంఘం అతి నీచం అవడంచేత యీ పెద్దరకం విదేశీ దుస్తులు ధరించాలి. తక్కిన భారతీయులందరితో సమానంగా ధరించాలి. అప్పుడు ఇంకా గొప్పతనం కూడా ఉంది అన్న భావం వస్తుంది కదా..

అలాంటి భావాలన్నీ మహాత్మునితో మనవి చేసుకున్నాడు.

“మూర్తీ వేలకొలది సంవత్సరాలు బాధపడిన మీ జాతి బాధాస్నాతులై మహాపవిత్రత పొందారు. నేను మీకు సేస్తున్నానంటే వట్టి ధర్మపాలనకే కాదు. బాకీ తీర్చడానికీ కాదు. మీ సేవచేసి పవిత్రత పొందడానికి!” అని బాపూజీ దివ్యనేత్రాలు పలికినాయి.

“బాపూజీ! నా కర్తవ్యం నాకు తెలియటంలేదు. ఇంత చదువు చదువుకొని వచ్చి, నేను ప్రభుత్వోద్యోగం స్వీకరించకుండా ఉంటే నా చదువు వృధా! ఈ చదువు మన దేశానికి ప్రస్తుతం శిరోమణి వంటిది. ఆనకట్టలు లేక నదులు ఉపయోగం లేదు. ఆనకట్టలవల్ల విద్యుచ్ఛక్తి ఉద్భవిస్తుంది. ఈ శక్తి దేశానికి వెలుగూ, పొలాలకు నీరూ, గృహాలకు చిన్న పరిశ్రమలకు ఎన్ని విధాలో ఉపయోగం. పూర్వకాలపు గృహ పరిశ్రమలూ, గ్రామ పరిశ్రమలూ, కొద్ది రూపం మారుతాయి. వ్యవసాయమూ, మరీ రాక్షసం కాకుండా అనేక రూపాల ఉత్తమ విధానాలు అలవరచుకొంటుంది.” అని మనవి చేసుకొన్నాడు.

సేవా గ్రామంలో ఉన్నన్నాళ్ళూ వడుకుతూ ఉండే వాడు. వడుకుతూ ఉండవచ్చును. రాతసమయంలో, నడిచేటప్పుడూ ఇతర విధమయిన పని సమయములోనూ తప్ప తక్కినప్పుడు రోజుకు ఒక గంటో రెండు గంటలో ఎందుకు వడకకూడదు. ఆ నిశ్చయానికి వచ్చి ఆ పనే చేయడానికి సంకల్పించుకొన్నాడు.

సేవాగ్రామంలో ఉండే రోజుల్లో చేతిపరిశ్రమగా విద్యుచ్ఛక్తి పిడంబితమయిన వస్తువులు తయారుచేయడం, ఈలా అని దీపాలు వగైరాలు ప్రయత్నించాడు. వెదురుగొట్టంలో బాటరీలు పెట్టడం లోపలనుండి రెండు శక్తులూ కలిసేటట్లు ఏర్పాటు చేయడం దీపం వెలగడం ఈలాంటి చిత్రాలు చేస్తూ ఉండేవాడు. తన జక్కరం గ్రామంనుంచీ, ఢిల్లీనుంచీ, సేవాగ్రామం నుంచీ జెన్నీకి రోజు విడిచి రోజు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు.

జెన్నీ రోజు విడిచి రోజు ముత్యాలకోవవంటి దస్తూరితో ఉత్తరాలన్నీ చక్కని మంచిగంధం మంజూషలో పెట్టుకునేవాడు. మధ్యమధ్య జెన్నీకి తానూ, తనకు జెన్నీ తంతులు ఇచ్చుకొనేవారు.

141, పూనమల్లి రోడ్డు, కీల్పాకు,

మదరాసు,

6 మార్చి, 1939

“ప్రియతమా!

మా నాన్నకూ, అమ్మకూ నీ విషయం, మన ప్రేమ విషయం చెప్పాను. పెండ్లికి అనుమతి ఇవ్వవలసిందని కోరాను.

మా తండ్రి ఆలోచించుకోనిమ్మన్నాడు. మా అమ్మ మూతి ముడుచుకుంది.

మర్నాడు మా తండ్రి పిలిచి, “జెన్నీ ఈ వివాహం నాకేమీ ఇష్టంలేదు, మీ తల్లికీ అంతే! ఆమెతో నువ్వు మాట్లాడు.” అన్నాడు.

“నేను, ఎందుకు ఇష్టం లేదు డాడీ నీకు'?” అని ప్రశ్నించాను.

ఒక కారణం మన సంఘమూ పెరయా సంఘమూ కలియదు. నీ భావికి మంచిది కాదు.

రెండు, ఆ అబ్బాయి ఎంత చదువుకున్నా అతడు నీగ్రోజాతివాడు! మనం తెల్లవాళ్ళం. ఈ రెండు జాతులూ కలియడం నేను చూస్తూ చూస్తూ ఒప్పుకోదలచుకోలేదు.

మూడు, అసలు ఈ సంథానం నా మనస్సుకు ఎంత ప్రయత్నించినా ఎక్కటంలేదు. ఇది కారణం లేని కారణం.

నువ్వు ఈడుకు వచ్చిన పిల్లవు. ఇంకా మైనరువు కావు. ఉద్యోగంలో చేరావు. నీ భవిష్యత్తు నువ్వే నిర్ణయించుకొనే దశలోకి వచ్చావు. నీ కుటుంబం మంచీ, నా సంఘం స్థితీ ఆలోచనా సలహానే నువ్వు పాటించేటట్లయితే, మూర్తిని భర్తగా భావించుకోవడం మానెయ్యి.” ఇవి మా తండ్రి మాటలు.

ఈ రెండో పరాభవంతో నేను భూమిలోకి కుంగిపోయాను. ప్రాణప్రియా! నిజమయిన నిర్మలమయిన ప్రేమ వచ్చినచోట్ల ఈలాంటి అడ్డాలు ఉద్భవిస్తూ ఉంటాయి కాబోలు. నేను మాట్లాడకుండా వచ్చేశాను.

ప్రియతమా! నువ్వు దూరంగా వున్నావు. నిన్ను వదిలి వున్న ప్రతి నిముషమూ యుగాలై పోతున్నది. వైద్యాలయానికి వెడుతున్నాను. ఆ పనిలో మునిగిపోతాను. కాస్త కాళీ వచ్చిందంటే నువ్వు ప్రత్యక్షం అవుతావు. ఎన్ని అడ్డాలు వచ్చినా నువ్వే నాకు; నేనే నీకు ఈ అనుబంధం విచిత్రమే. నేను డాక్టర్ని, ప్రేమంటే ఒకటి ఉందని నాకు నమ్మకం లేకుండా ఉండేది. అలాంటి ప్రేమ మానవజన్మకు అత్యంత ఉత్తమత్వం ఆపాదించే మహత్తర విషయం. ప్రేమకు కులంలేదు. సంఘం లేదు. జాతి లేదు. మానవమైన ఒక మహత్తర వాంఛకు అది పవిత్ర రూపం.

ప్రియతమా

నీకు ప్రాణం అంతా ప్రోగుచేసుకొన్న ముద్దులతో

"జెన్నీ"


141, పూనమిల్లి రోడ్డు,

కీల్పాకు, మదరాసు

9 మార్చి, 1939

ప్రియతమైన ప్రియా!

నీ కౌగిలింతలు స్మృతి మాత్రం అయినా, అవి తలచుకొని పులకరించి పోతూ వుంటాను. నీ ఫోటోను మాత్రం పల్కరించుకొంటాను.

ఇది ఈలా అవుతుందా! ఇన్ని తీపులు బాధాపూర్ణమై స్త్రీలను ముంచెత్తి వేస్తవా? భారతీయాంగనలు తమలోని కామవాంఛా డాబులను కళ్ళేలు పెట్టి ఆపుకోగలరు. పాశ్చాత్య స్త్రీలు అగ్నిలా మండిపోగలరు. ఈ రెండూ నాలో ఎప్పుడూ యుద్ధం చేస్తూ వుంటాయి. అయినా నేను నిన్ను వాంఛిస్తున్నాను. నాలో తుచ్చకామం మొలకలెత్తనే లేదు. సంకరులైన వారికి తుచ్ఛవాంఛే పగ్గాలు తెంపుకొని దౌడులు తీసే గోడిగలవుతుందట! కాని, నాలో అటువంటి భావాలే కలగవు. ఆ విషయమూ నాకు ఆశ్చర్యం కలగజేస్తూ ఉంటుంది.

నా ఆత్మా! నువ్వే నాకు ఎట్టఎదుట. నాకు బడాయి లేదు. నీ ఎదుట నేను తలవంచిన “చెఱ్ఱి " పూల చెట్టునయ్యాను. నాలో వికసించే ప్రతిపూవు నీ కోసమే దాచుకొంటున్నాను.

మా అమ్మతో ఒక గంట తీవ్రంగా వాదించాను, ప్రాణస్వరూపా! మన వివాహ విషయం. ఆ అమ్మ పూర్వకాలం మనిషి. మా చుట్టాలందరూ నా ప్రేమ విషయం తెలిసింది, గంటగంటకూ పూటపూటకూ, ఓ చుట్టమో, ఓ పక్కమో, ఓ స్నేహితుడో, ఓ హితురాలో రావడం మా అమ్మతో, నాన్నతో తమ విడ్డూరం వెలిబుచ్చడం, నన్ను సన్నసన్నగా చివాట్లు పెట్టడం, నాకు సలహా ఇవ్వడం. నాకో ఉపన్యాసం చదవడం; వెళ్ళడమూ!

నేను ఒక్కొక్క చిరునవ్వు ఒక్కొక్కరికి జవాబుగా అర్పిస్తున్నాను.

నీమీద ఎలిజబెత్తుకు అంత కోపం ఎందుకూ? నిన్ను విడిచి యుగాలు ఉండగలనని నీ ఉద్దేశమా. నా అందం అంతా నీది. నా అందం రహస్యాలు నాకే తెలియవు. నా అందం నువ్వు పరిగ్రహించి అనుభవిస్తున్నప్పుడే ఆ రహస్యాలు నాకు అర్థవంతమవుతాయి కాబోలు.

గాఢ ప్రేమతో ముద్దులు

నీదే “జెన్నీ”



4

ఎల్లమందమూర్తి ప్రతిదినమూ ఉత్తరాలు రాయడమే. “నా హృదయం మధ్య సింహాసనం అధివసించి ఉన్న ప్రియా! మధుర మధురమయిన ఆలోచనలన్నీ వ్యక్తం చేయలేము. ఉత్తరంలో కాగితమూ కలమూ, ఆలోచనలూ మనమూ!

“కలం పాటలు పాడుతుంది; నాట్యం చేస్తుంది. వీణ, వాయులీనం, మాండోలీనం, పియాను, పిల్లంగ్రోవి గుండెలు కరిగేటట్లు మోయించకలదు. కలం నాట్యం చేస్తుంది. కలం దూరంగా ఉన్న వ్యక్తుల్ని దగ్గరగా తీసుకువస్తుంది.

“నాకు ఎదుట మాటలు లేవు! కాని నీ ఉత్తరాలు నిన్నే సర్వకాలం నా ఒడిలో కూర్చుండబెడుతున్నాయి.

“ఓయి ప్రియతమేశ్వరీ! నేను దారి తెలియని పసిబాలకునిలా ఉన్నాను. హడలి ప్రపంచాన్ని తెల్లబోయి చూస్తున్నాను. అంతా కొత్తగా కనబడి కంటనీరుతో కరిగి పోతున్నాను. అలాంటి నాకు తోటిపిల్లవూ, స్నేహితురాలవై నాకు ధైర్యం చెప్పే గురువువై నీవు కన్పించావు.

“ప్రపంచంలో పురుషుడు ముందుకు పోవాలంటే పురుషునికి స్త్రీయే సారధి. అలాగే స్త్రీకి పురుషుడనుకొంటాను. ఇది నిర్ధారణగా నాకు తెలియదుగాని, మొదటి విషయం నాకు తెలుసును. ప్రాణేశ్వరీ! నేను కౌగలించుకోడానికంటే సిగ్గుపడతాను. నేను చీకటిని, నువ్వు వెన్నెల వెలుగువు.

“కవులు - వెన్నెల చీకటిని తరిమివేస్తుందని వర్ణిస్తారు. నా ఉద్దేశంలో వెన్నెల అత్యంతమయిన దయతో చీకటిని తనతో లయింప చేసుకుంటుందని.

"నీ ప్రేమకు పాత్రుణ్ణా కానా? అనే పవిత్ర విషయం నాకింకా నిర్ణయంగా తేలలేదు. పాత్రా పాత్రదానం అంటో లేదా ప్రియా!”

“నీ వంటి దివ్యాంగన ప్రేమ ఎదుట ఉండే కల్మషాన్ని దహించి పవిత్రం చేసే శక్తిగలది.

ఇట్లు నీ పెదవులు భక్తితో

వరం క్రింద ఆస్వాదించే

నీ దాసుడు

“మూర్తి”

“ప్రియతమేశ్వరి!

మీ తండ్రికీ, తల్లికీ ఎలిజబెత్తుకూ, చుట్టాలకూ, మన ప్రేమ ఏమి అర్థం అవుతుంది. ఎలిజబెత్తు విషయంలో మాత్రం కొంత నాకు ఆశ్చర్యమే కలుగుతూ ఉన్నది. ఆమె శుద్దమయిన ఆంగ్ల బాలిక! కాబట్టి లయొనెల్‌ను వివాహం చేసుకోకూడదని తల్లీ, తండ్రీ చుట్టాలూ మూర్ఖపు పట్టుపడితే, నేను వారందరితో ఎంతో కాలం వాదించి ఒప్పించాను. ఎలిజబెత్తు నాకు అర్పించిన నమస్కారాలూ నా జన్మ అంతకూ సరిపోతాయి. అలాంటి ఎలిజబెత్తు ఈలా తయారయిందంటే ఏదో కారణం ఉందనే నాకు తోస్తున్నది. భారతదేశంలో సాధారణాంగ్లేయుల వర్తన విచిత్రం. ఇంగ్లండులో మాతో సమంగా చదువుకొన్న ఆంగ్ల యువకుడు ఏ ఉద్యోగిగానో మనదేశం రాగానే తనతోటి విద్యార్థి స్నేహితుని ఇక్కడ అవమానిస్తాడు. అతని ముక్కు పై కెగసిపోతుంది. ఫారెస్టర్ రాసిన “ఇండియాకు ఒక యాత్ర” అనే గ్రంథం చదవలేదా ప్రియతమా! ఆ భారతీయుడు తోడి ఉద్యోగిగా వచ్చినా ఆ ఆంగ్లేయుడు లెక్క చేయడు.

“నేను ఇంగ్లండులో చదువుకొంటున్నప్పుడు నన్ను మా కాలేజీవారు కాలిబంతి ఆట జట్టులోనికి తీసుకోవాలని ప్రయత్నించారు. ఎవరో కొందరు తప్ప తక్కినవారు. “భారతీయ నిగ్గర్ మాతో సమంగా జట్టులో ఉండడమేమిటి?” అన్నారు.

“కాని నేను ఆటలోనికి వెళ్ళక తప్పింది కాదు. కాలేజీ జట్టు మూడేళ్ళనుంచీ నెగ్గటంలేనిది, ఆ ఏడు మొదటి స్థానం ఆక్రమించి నెగ్గింది. ప్రతి విజయంలోనూ నేను ఎక్కువ గోలు చేయడం జరుగుతూ ఉండేది. ఆఖరి ముఖ్య పందెంలో చేసిన గోలు అన్నీ నేనే! అందుచేత మా కాలేజీ వాళ్ళు చేసిన ఉత్సవంలో నేను ప్రధాన నాయకుణ్ణి అయ్యాను. ఆ కాస్త పదవికీ చాలా కష్టపడిన వారున్నారు. ప్రాణేశ్వరీ, “ఈ నిగ్గర్ మనవాళ్ళందరికన్నా బాగా ఆడడమేమిటి?” అని ఒక యువకుడు అతని స్నేహితునితో అంటూ వుంటే ఆ ముక్కలు నా చెవిని పడినాయి.

“తెల్లవారు మన దేశంలో రాజ్యం చేస్తున్నారు. వాళ్ళది ఇండియా! ఈ భావం ఎలిజబెత్తులో ఉందని నేను కాస్త అనుకోవటానికి ఆమె మాటలే కారణం.

“ప్రాణప్రియా! నా ఆత్మ మధ్యస్థా! ఒక్కమాట మాత్రం బాగా నమ్ము. నువ్వు ఏది చేయమంటే అది చేస్తాను. నా జీవిత నౌకకు నువ్వే కెప్తానువు.

నీ దాసానుదాసుడు

అతి ప్రేమభక్తుడు

నీ పెదవి అమృతం ఆశించే

“మూర్తి”


15గ, గ్రాంటు హోటలు,

న్యూఢిల్లీ,

8 మార్చి, 1939.

ప్రియాతి ప్రియబాలికా,

నీ హృదయమే మూర్తి గట్టిన లేఖ అందింది. మీ తండ్రికీ, తల్లికీ ఇష్టం లేదన్న వార్త నా గుండెల్లో పిడుగులు కురిపించింది. అయితే మన కర్తవ్యం! మురుగుకాల్వలో పొర్లే జాతికి చెందిన ఒక దురదృష్టవంతుణ్ణి నువ్వు చేయిపట్టి ఈవలకు లాగినావు. ఏదో ఒక పరమాద్భుతమయిన దర్శనంలా నువ్వు నా ఎదుటకు వచ్చావు. పవిత్రమైన ఆశ్చర్యం కల్పించావు.

నేను ప్రేమ అంటే ఏమిటో, వివాహం అంటే ఏమిటో ఏనాడూ ఆలోచించని ప్రాథమిక మనస్తత్వంగల మనుష్యుణ్ణి. మా సంఘం నిజస్వరూపం నీకు పూర్తిగా తెలియదు. తప్పి జారి ఒక్క గులకరాయి మహారాణి రత్నాల హారాని కెక్కినట్లు నేను మా సంఘంలోంచి తప్పి జారీ బయటపడిన మనుష్యుణ్ణి.

మా సంఘం సరియైన గుడ్డకట్టడం ఎరుగదు. సరియైన తిండి ఎరుగదు, లోకం అంటే ఏమిటో ఎరుగదు. ఒక్క విజ్ఞాన విషయమూ ఎరుగదు. మా ఊరి చుట్టుపక్కల వున్న ఊళ్ళ విషయం తప్ప మా వాళ్ళేమీ ఎరుగరు. వాళ్ళ రాజకీయాలు పెద్ద ఆసామీల దెబ్బలాటలు. వాళ్ళ కావ్యానందం అసభ్యపు పాటలు పాడుకోవడం. కొన్ని చాలా చక్కనివీ, రసవంతమయినవీ ఉంటాయి. వాళ్ళ సినీమా తోలుబొమ్మలాట. వాళ్ళ పండగ భోజనం చచ్చిన గొడ్డు మాంసం, వాళ్ళ బిడ్డల ఆటలు పేడపోగు చేయడం, దుమ్ములో పొర్లడం. వాళ్ళ చదువు నోటిలో వేళ్ళు పెట్టుకోవడం. వాళ్ళ ఉద్యోగం దేహం వంచి పొలంపని, అందుకు జీతం చిట్టెడు గింజలు.

మా అత్తరు వాసనలు కుళ్ళుకంపు. మా రంగు నల్ల కారుదున్న. మా తలలు నూనెలెరుగవు, మా ఒళ్ళు సబ్బు లెరుగవు. మా గుడ్డలు తెలుపు, ప్రకాశమూ ఎరుగవు. మా కామాలు తిన్నగా స్త్రీ పురుషులు కలియడమే!

మా హంసతూలికా తల్పాలు నులకమంచం, పొలం గట్టు, ఇంటి ముందు స్థలం. మా మోటారు యజమాని వ్యవసాయం బళ్ళు. మా చుట్టాలు నక్కలు, ఊరకుక్కలు, రాంబందులు, పందులు.

మా దేవుళ్ళు పీనుగుల అమ్మవార్లు, మా గుళ్ళు హడలగొట్టే పోతరాజు గుడిసె. మేం అత్తరువులు, అగరువత్తులు, సబ్బులు, తల నూనెలు, దువ్వెనలు ఎరుగము. చీనాతో, అల్యూమినంతో, ఇత్తడితో, కంచుతో, రాగితో చేసిన వస్తువులు ఎరుగం.

మా కంచాలు మట్టిచిప్పలు, మా వంటసామాను కుండలు, మూకుళ్ళు, దాకలు, కర్రతెడ్లు.

ప్రాణకాంతా! అలాంటి పెంటకుప్పల్లో నేను ఉద్భవించాను, పెరిగాను, నీ ఎదుట నిలిచాను.

నన్నంటి నా చరిత్ర క్రీనీడలా కూడా వస్తుంది కాబోలు నా పేరు వినేసరికే మీ తల్లితండ్రులకు భయం వేసింది.

ఏమిటి మన కర్తవ్యం? ఈ విషయం ఇంతటిది?

ఇక కేంద్ర ప్రభుత్వం వారు నాకు తాత్కాలికంగా ప్రవాహ జనిత విద్యుచ్ఛక్తి సంస్థలనూ, ఆనకట్టలను పరీక్ష చేసే ఉద్యోగిగా అయిదువందల రూపాయల జీతంమీద ఏర్పాటు చేశారు. ఖర్చులు వేరేనట. మొదటి తరగతి రెండు టిక్కట్లూ, బేటా రోజుకు పది హేను రూపాయలు. కారుకు వేరే భత్యం ఇస్తారట. నా ఉద్యోగం ఏడాదివరకు తాత్కాలికమట. ఆ తర్వాత నేనిచ్చే నివేదిక, ప్రణాళికలనుబట్టి ఆ ఉద్యోగం ఉంచడమో, తీసివేయడమో చూస్తారట. నేను 15వ తారీఖున ఉద్యోగంలో చేరుతున్నాను.

నా ఆఫీసు న్యూఢిల్లీలోనే ప్రభుత్వంవారు ఏర్పాటు చేశారు. నేను కేంద్ర ప్రభుత్వ ముఖ్యఇంజనీరుగారికి లోబడి పనిచేయాలి. ఆయనే నాకో టైపిష్టునూ, ఒక గుమాస్తాను. బంట్రోతును ఇచ్చినారు. నా ఆఫీసు ముఖ్యఇంజనీరు ఆఫీసులో భాగం. నేను నెలల తరబడి తిరుగుతూ ఢిల్లీ చేరకుండానే ఉంటూ ఉండవచ్చును. అలాంటప్పుడు నా ఆఫీసు నాతోనే వస్తుంది.

నేను ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపవచ్చును. ఈరోజు ఉదయమే ఒక చిన్న చక్కని బంగళా న్యూఢిల్లీలో నాకు చూచిపెట్టారు.

నువ్వు ఢిల్లీలో వైద్యురాలవు అయితే! మనకు మన ఇల్లు ఎంత హాయిగా సరిపోతుంది! వేసవికాలంలో కూడా ఉండాలంటే వట్టివేళ్ళ తడికలూ అవీ ఏర్పాటు చేసుకోవచ్చును.

ప్రాణేశ్వరీ! పట్టిన చేయి విడవబోకు. నేను దారి తెలియని పాంధుణ్ణి. ఢిల్లీ కూడా నువ్వు దగ్గరలేక అడవిలా ఉన్నది.

నీ మహా మధుర చుంబనాలాశించే

నీ మూర్తి,

51, రీడింగ్ వీధి,

న్యూఢిల్లీ,

10 మార్చి, 1939

చేరాను ప్రాణేశ్వరీ కొత్త బంగళాలో ముద్దుగులికే తోట ఉంది. నా కంతా కొత్తగా ఉంది. ఆఫీసు పని ముందుగా పదిహేను రోజులపాటు నేర్చుకొనాలట. ఆ పైన పంజాబులోని ఆనకట్టల పరీక్షకు ఏప్రియల్ నెల ఆరంభంలో వెళ్ళవలసి ఉన్నది.

చుట్టాలు అందరూ మనకు వ్యతిరేకంగా ఉన్నారా? నా వివాహం సంగతి మా జక్కరంలో వచ్చింది. రంగూన్ వెళ్ళి కూలి పనిచేసి, తర్వాత కూలీల కంట్రాక్టు చేసిన మా కులంలో ఒకాయన ఏలూరు దగ్గిర దెందులూరు అనే గ్రామానికి చెందిన దెందులూరు రామస్వామినాయుడు అనే ఆయన చాలా భాగ్యవంతుడు. వారి అమ్మాయిని నాకు ఇస్తామని వచ్చారు. ఒక పంతులమ్మను పెట్టి ఆ అమ్మాయికి చదువు చెప్పించారట.

కాకినాడలో ఒక మా కులం అమ్మాయి బ్రహ్మ సామాజికుల పోషణలో పెరిగి బి.యే. లో నెగ్గిన అమ్మాయి ఉంది. ఇప్పుడు ఆంధ్రా యూనివర్శిటీ లో ఎం. ఏ. చదువుతున్నది. ఆ అమ్మాయి సంబంధం ఆలోచించవలసిందని మరొక రాయబారం వచ్చింది. ఈ రెండు రాయబారాలు నేను మా ఊళ్ళో ఉండగానే వచ్చాయి. నాకు నవ్వు వచ్చింది. మా వాళ్ళందరితోనూ నా వివాహ విషయం ప్రస్తుతం ఆలోచించవద్దనీ, నా హృదయంలో వేరే ఒక సంబంధం ఉందనీ తెలిపాను.

నాకు ఉద్యోగం అయింది. ఇంక నా తల్లిదండ్రుల విషయమూ మా అన్నదమ్ముల, అక్కచెల్లెండ్ర విషయము ఆలోచిస్తాను.

వారందరినీ తీసుకువెళ్ళి మా దేశంలో ఒక పెద్ద నగరంలో ఉంచి వారికి తగిన సదుపాయాలూ, చదువూ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉంది. ఢిల్లీ మొదలయిన ప్రదేశాలన్నీ ఒక మాటు త్రిప్పుతాను. మా అన్నదమ్ములు అక్క చెల్లెండ్రకు చదువుల విషయం ఒకటి జాగ్రత్తగా ఆలోచిస్తున్నాను. ఇక మన భవిష్యత్తు, ప్రాణప్రియా! ఏమి చేయాలి నేను? నాకు నువ్వు ఈ జన్మలో ఎందుకు ప్రత్యక్షమయ్యావు? అయినదానివి అయి ఊరుకోక ఈ ప్రపంచ ప్రేమ మహా చరిత్రలో ఎప్పుడూ సంభవించని సంఘటన ఒక తెల్లబాలిక ఒక నల్లవాణ్ణి ప్రేమించడం సంభవింప చేశావు ఎందుకు?

నేను నిన్ను ముట్టుకుంటేనే నీకు నా నలుపు అంటుతుందేమోనని భయపడ్డాను. వెనక డెస్టిమోనా ఒథెల్లోను వివాహం చేసుకుంది. ఒథెల్లో నా అంత నలుపు అయి ఉండడు. నా జన్మ ప్రతి అణువు నీది. నీ ఇష్టం వచ్చినట్లు ఆ జన్మను చేసుకో. నాకేమీ అవసరం లేదు. “నాకు” అని అనడం ఏమిటి? నీలో ఐక్యమైపోయిన తర్వాత, “నేను” అని విడిగా ఎలా ఉండగలను?

నా సామ్రాజ్ఞీ! “మన ప్రేమ” అనే దివ్య సన్నివేశం జరిగిన తర్వాత ఇంకా సంపూర్ణ చైతన్యం కలుగలేదు. ఏదో మహామత్తతతో తిరుగుతున్నాను. ధవళ శరీర కాంతి వికసిత విలాసినులు ఆసియా వారిని చేసుకుంటూ ఉండడము ఉన్నది. అయినా నువ్వు ఏ దివ్య కారణంచేత నన్ను స్వీకరింప పూనుకొన్నావో ఆ కారణం కారణ రహితంగానే నాకు కనబడుతున్నది.

లయొనెల్ నాకు ఇంతవరకూ మూడు ఉత్తరాలు రాసినాడు. నా ఉద్యోగానికి నాకు పూర్తిగా అభినందనలు పంపాడు. ఎలిజబెత్తు విషయంలో తనకూ ఏమీ గ్రాహ్యం కాక స్తబ్దుణ్ణయి ఉన్నానన్నాడు. ఇక మన వివాహం విషయం ఆ బాలికకు ఏమీ ఇష్టంలేదట. అందుకు తన్ను నేను క్షమించాలట; తన యందు మునుపటికన్న ఎక్కువ ప్రేమగా ఆమె సంచరిస్తున్నదట. నేను దక్షిణాదికి వెళ్ళినప్పుడు తనకు అతిధిగా ఉండాలట. నన్ను తమకు అతిథిగా ఉండమని “విజ్జీ” కోరిందట.

ఈ మనఃపరిస్థితి విచిత్రమయినది కాదా జెన్నీ ప్రియా? జెన్నీ ప్రియా! ఎప్పుడు నిన్ను చూడడం? ఎప్పుడూ నీ శరీర సౌరభాలలో తేలిపోవడం? ఎప్పుడు నీ దివ్యమూర్తిని రెప్పలు వాల్చక అనిమిషుడనై చూచి ఏ అద్భుతానందంలోనో తేలిపోవడం? ఎప్పుడు, ఎప్పుడు? నువ్వు సెలవు పెట్టి ఢిల్లీ ఒకసారి వెంటనే వచ్చి మన ఇల్లు చూచి పోగలవా? నీ గులాబీ మొగ్గ పెదవుల నాస్వాదించే,

నీ పాదాలకడ భక్తుడు,

మూర్తి.

5

మూర్తి రాసిన ఉత్తరాలు తన హృదయం దగ్గర దాచుకొనేది జెన్నీ ఒక్కొక్క ఉత్తరం ఎన్నెన్నిసారులు చదువుకుందో. జెన్నీ ఉత్తరాలు మూర్తి కోటిసార్లు చదువుకొనేవాడు. ఆమె ఉత్తరాలు ఒకటో రెండో అతని హృదయం కడ ఉండేవి.


పదిరోజులు సెలవు పెట్టి జెన్నీ ఢిల్లీ బయలుదేరింది. ఎందుకు బయలుదేరుతోందో తలిదండ్రులకు తెలిసింది. తండ్రి పిలిచి, “జెన్నీ నువ్వు ఎందుకు సెలవుపెట్టి ఢిల్లీ వెడుతున్నావో నాకు తెలుసును. ఈరోజుల్లో యువతీ యువకులలో విపరీతంగా తిరుగుబాటు భావాలు తాండవం చేస్తున్నాయి. ఒక్కటి మాత్రం నమ్ము. నువ్వు ఆ నిగ్గర్‌ను వివాహం చేసుకున్నావా నీ ముఖం నీ తలిదండ్రులకు చూపించనక్కరలేదు. మీ పెద్దన్నా నాతో ఏకీభవించాడు. నీకు నా సంపాదన పైస ఒక్కటీ రాదు. మీ అమ్మమ్మ తన డబ్బంతా నీకు ఇవ్వడానికి వీలు రాసిన మాట నిజం. కాని, నేనూ మీ అమ్మ మా శాయశక్తులా ఆమె వీలునామా నుండి నీ పేరు తీయించి వేస్తాము. వివాహం అయిన మరుసటి నిముషంనుండి నీ ముఖం మాకు చూపించనక్కరలేదు. ఇక వెళ్ళు.” అన్నాడు.

జెన్నీ ముఖంలో కత్తివాటు వేస్తే నెత్తురు చుక్కలేదు. అలాగే పది నిముషాలు నిలుచుంది. ఒక్కసారిగా ముఖం అంతా రక్తం పోటెత్తుకువచ్చి ఆపిల్‌పండు ఎరుపులా అయిపోయింది. డాక్టర్ అవడంచేతా, ఎప్పుడూ దేనికీ భయపడని జాతి బాలిక కాకపోవడంవల్లా వెంటనే దిట్టరి అయిపోయింది. పకపక నవ్వింది.

“డాడీ, నేను నీ కూతుర్ని, మా అమ్మ పోలికలు నాలో ఏమీ లేవు. ఆ సంగతి అందరికన్న బాగా నీకు తెలుసును. నేను మూర్తిని పెళ్ళి చేసుకోవడమే కాదు. మూర్తి మతమే నేనూ పుచ్చుకుంటున్నాను. పెళ్ళి అయేవరకూ మీరు చూస్తూ ఉండనవసరం లేదు. ఈ క్షణంనుంచి నా ముఖం మీ దృష్టిని వేసి మీ హృదయాలను కష్టపెట్టదలచుకోలేదు. నేను రాతి మనిషిని, సైతాను హృదయం కలదానిని అని అనుకోండి. అందుకు సర్వవిధాలా తగినదాన్నే. కాని మీ మీద నాకున్న ప్రేమా గౌరవం ఏనాటికీ పోవని గ్రహించండి. ఇక సెలవు.” అని ఆమె నిదానంగా వెళ్ళిపోయి తాను ఈ మధ్యనే కొనుక్కొన్న చిన్న కారెక్కి డ్రైవరును కారు నడపమన్నది.

ఢిల్లీ ఎక్స్ప్రెస్లో ఇదివరకే సెకండు క్లాసులో ఒక సీటు ఏర్పాటు చేసుకొని ఉంది. డాక్టర్ జెన్నిఫర్ ఉదయం కారులో దిగి సామాను బండిలో సర్దుకుని కూచుంది. రైలు నడక ప్రారంభించింది. చూపులేని చూపులతో కిటికీలోనుండి చూస్తూంది. ప్రపంచంలో ప్రేమ చరిత్ర సంభవించదు. సంభవిస్తే దారి పొడుగునా అన్నీ గడ్డయిన అడ్డులే అనుకొంది.

అతడు నల్లవాడని తాను ప్రేమించిందా? మనుష్యులలో ఫ్రాయిడ్ చెప్పినట్లు వ్యతిరేక హృదయ తత్వం ఉంటుంది. అందమయిన అమ్మాయి కోతివంటి వాడిని ప్రేమిస్తుంది. మన్మథుని వంటి భర్తను వదలి పుచ్చుకుంకని మిండగాణ్ణి చేసుకునే అప్సరస లుంటారట. రసజ్ఞుడు, విజ్ఞాని అయిన పురుషుని చేసుకోటం మాని, బండవాణ్ణి నీచ భావయుతుని ప్రేమించి పెళ్ళి చేసుకొంటుందట. అమెరికాలో నీగ్రోలను తెల్లవారు తమ సర్వస్వం అర్పించేటంత గాఢంగా ప్రేమిస్తారట. అలాగే తానూ అయిందేమో!

అయితే తన ప్రియుడు కారు నల్లవాడు కాడు. మోము చాలా గంభీరమైంది. ఆ మోమే తెల్లవారి మోమైతే అపోలోతో సమమయిన వాడని పోల్చేవారే! బలమైనవాడు. కష్టపడి ఉన్నతవిద్య సంపాదించుకొన్నాడు. రసజ్ఞుడు, జ్ఞానపిపాసి, సత్పురుషుడు, ఉత్తమగుణపూర్ణుడు మహారాణులు పాదదాసీలుగా రావలసిన వ్యక్తిత్వం కలవాడు. ఇవన్నీ కలసి తన్ను అతని హృదయంలోనికి వాలిపోవచేసి ఉంటాయి.

ఫ్రాయిడ్‌తత్వం నిజం కావచ్చును. కాకపోవచ్చును. కాని ఆ బాలకుడే తనకు ఏడుగడ, తన ప్రాణాధికం. తన్ను స్త్రీనిగా వాంఛించినట్టి, భార్యగా వాంఛించినట్టి వారిలో ఎంతో అందమైనవారూ ఉన్నారు. తెలివైనవారున్నారు. అద్భుతమైనవారూ ఉన్నారు. కాని వారెవ్వరూ తన హృదయంలో ఇంతైనా స్పందనం కలుగజేయలేకపోయారు.

తన అన్నగారు తనకు మూర్తిని గురించి ఉత్తరాలు రాసేనాడే విచిత్రమయిన ఆనందం కలిగేది. హిందూ వేదాంతంలో చెప్పినట్లు పూర్వకర్మ అంటూ ఒకటుందేమో? తనలో హైందవ రక్తం వుంది, అది ఊరికే పోతుందా? ఆ ఏనాటి సంబంధంవల్లనో మూర్తి తనకు సర్వస్వమూ అయ్యాడు. తన జాతి పోనీ, గౌరవం పోనీ, ధనం పోనీ తనకు కావలసింది తన మూర్తి.

తన మూర్తి తన పురుషుడు కానినాడు, తన్ను అతడు కౌగలించుకోలేని దినం తనకు సంభవించిననాడు, తన్ను మహోద్రేక కామకాంక్షా పరితృప్తిలో పరవశనుచేసి అతడు కరిగించలేని క్షణం ఆసన్నమయిననాడు తాను దేహమే వీడుతుంది.

ప్రేమకు కారణాలు ఉండగలవా? ప్రేమ పరిశోధనాతీతమయిన ఒక అద్భుత సంస్థ. ఒక స్త్రీ నలుగురు పురుషుల్ని ఒకే విధంగా ప్రేమించి దేహం అర్పిస్తూ ఉండగలదట. ఒక స్త్రీ ఒక్క పురుషుని ప్రేమించడమే ఎరగకుండా జీవితం ముగించగలదట. ఒక స్త్రీ ఒక పురుషుని హిమాలయ శిఖరితంగా ప్రేమించి వానికి తన దేహం అర్పించదట. కాని ఏమీ ప్రేమించని పశువులాంటి వానికి దేహం అర్పించడానికి ఏమీ సందేహించదట. ఒక స్త్రీ తాను ప్రేమించినవానికీ మరి ఎవ్వరికీ దేహం అర్పించడం అనే భావం వచ్చి మూర్ఛలూ మొదలయిన జబ్బులు పట్టుకొని బాధపడుతుందట.

తాను మాత్రం వక్రభావ రహిత అయిన స్త్రీ; పరమ సౌందర్యం కలిగిన స్త్రీ; ఒక్కడే పురుషుని ప్రేమించగలిగిన స్త్రీ ప్రేమించిన పురుషుని తనలో లయింప చేసుకొని తాను అతనిలో లయమై దివ్యానందం పొందగలిగిన స్త్రీ.

ప్రేమకోసం ఆకాశం అంటగలదు. ప్రేమను సర్వఅనుభవాలుకన్న మహదానుభవంగా ఆనందించగల పరమ యువతి. తండ్రి అడ్డయినా ప్రపంచమే అడ్డయినా తన పురుషుణ్ణి తాను పొంది తీరుతుంది.

తనకు తన అమ్మమ్మ ధనం రాకపోతే భయమా? తాను ఈ ప్రపంచ భోగాలు కుత్తిక బంటివరకూ ఆనందించదలచుకుందా? ఇదివరదాకా తన దేహం ఇతరులు చూచి ఆనందించడాని కనుకుంది. తాను ఎవరో తెర వెనుకనున్న ఒక పురుషునితో ఒకనాడు లోకాలను ఆవరించే ప్రేమను అనుభవిస్తాను అని నమ్మింది. అలాంటి పురుషుడు ఒక పుణ్య దినాన తన ఎదుటికి వచ్చిననాడే కరిగిపోయింది. తానే పోయి అతన్ని ప్రేమిస్తున్నానని తెలుపుకుంది.

అలాంటి సందర్భంలో తన తండ్రి తన కోర్కెను సఫలం చేయకపోవడం విచిత్రమే! రైలు అన్నది: జెన్నీ తన సంఘ పారిశుధ్యం తాను రక్షించుకోవాలని తన బిడ్డలను ఏ తండ్రి అయినా అదుపాజ్ఞలలో ఉంచకూడదా?

జెన్నీ హృదయం: సంఘ పారిశుధ్యం ఏమిటి? ఎక్కడ ఉన్నది. బ్రిటిషుజాతి స్వచ్ఛమయినదా? బ్రిటిషు రక్తంలో కెల్టిక్, జర్మన్, లాటిన్, స్లావోనిక్, యూదు రక్తాలు లేవా? ఏమో! ఏ నీగ్రో రక్తం ఉన్నదో, అమెరికా జాతి స్వచ్ఛమా? జాతి సంకరత ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అందులో మా జాతి? రైలు చక్రాలు: ఓసి మూర్ఖ బాలికా! నువ్వు వివాహం చేసుకోదలచుకున్నది భారత సంఘంలో అతి తక్కువ కులంలో ఉద్భవించిన బాలుడు.

జెన్నీ గర్వం: అందుకే అతణ్ణి తప్పకుండా చేసుకుంటాను! తెల్లజాతులలో అతి నికృష్టమయిన అతి ఆఖరు సంఘంలోనుంచి నేను ఉద్భవించలేదూ?

6

జెన్నీ బెజవాడనుంచి పక్క వేసుకొని వెంట తీసుకు వచ్చిన నవలలు, మాసపత్రికలూ చదవాలని ప్రయత్నించింది. కాని లాభం లేకపోయింది. మదరాసునుంచి ప్రయాణం ఎలా చేసిందో, ఏదో నిద్ర వచ్చేది. బొమ్మలు చూస్తూ కూర్చుంది. కొందరు దద్దమ్మ మగవాళ్ళూ నిజంగా స్త్రీ సౌందర్యం దర్శించి ఆనందించేవాళ్ళూ అటూ ఇటూ తిరుగుతూ ఆమెను గాఢంగా చూశారు. కాని వాళ్ళు చూస్తున్న విషయమే ఆమె గ్రహించలేదు.

తన ప్రాణ ప్రియుని గురించి కలలుకంటూ పడుకుంది. చూపులలో అతడు ప్రత్యక్షమయ్యే చూపులతో దెసలు చూస్తూ కూర్చుంది.

ఆమె బండిలో ఎవరో భారతీయాంగనలు మువ్వురు ప్రయాణం చేస్తున్నారు. అందులో ఇద్దరు ఒక కుటుంబం వారు. ఒక అమ్మాయి భర్తతో ఢిల్లీ వెడుతున్నది. ఆ భర్త వేరే రెండవ తరగతిలో ప్రయాణం చేస్తున్నాడు. ఆడవారి అందాల ముఖమూ, రూపమూ చూస్తూ ఇటూ అటూ పచారు చేసినంత మాత్రాన మగవాళ్ళు చచ్చువాళ్ళయిపోరు కాని, ఆ చూడడంలో పురుషులు వట్టి శుంఠలుగాక, సద్బుద్ధితో చూచే రసగ్రహణ పారీణులుగానో వ్యక్తం అవుతారు అని అనుకుంది జెన్నీ హైందవ యువతి భర్త నిముషానికో మారు ఈ ఆడవారి బండికి భార్యతో ఏదో మాట్లాడడానికి వచ్చినట్టు నటిస్తూ జెన్నీని తేరిపార చూస్తూ ఉండేవాడు.

ఆ అమ్మాయికి పదునెనిమిదేండ్లు ఉంటాయి. అందమైన బాలిక. బంగారు ఛాయకలది. ముక్కున, చెవులనూ అసలు వజ్రాల ఆభరణాలు తళుక్కుమంటూ మరీ అందం తెస్తున్నాయి. ఆ అమ్మాయి తన భర్త అంటే పట్టరాని బడాయితో, ప్రేమతో వుందని ఆమె కళ్ళల్లో కాంతులే జెన్నీకి చెప్పాయి. అంత చక్కని భార్యను పెట్టుకొని ఇంకో బాలికమీదకు ఆ యువకుడు తన చూపును ఏలా ప్రసరింపగలడు? ఆ చూపుల్లో కాంక్షలు పొర్లాడుతున్నాయి.

ఆ అబ్బాయిని ఏడిపించాలని జెన్నీకి అల్లరిబుద్ది పుట్టింది. డోర్నకల్లు దగ్గిర అన్నం గిన్నెల దొంతర భార్యకు పట్టించుకు వచ్చాడా యువకుడు. ఆ సమయంలో జెన్నీ ఆ యువకుడి వీపు తట్టి “ఏమండీ! నాకు ఇంగ్లీషు భోజనం ఇంకా రాలేదు. ఎందుకో కనుకువస్తారా?” అని అడిగింది.

ఆ అబ్బాయి ఉబ్బి తబ్బిబ్బయిపోయాడు. గబుక్కున పరుగిడిపోయి ప్లాటుఫారం మీద తల్లక్రిందులా పడ్డాడు. జెన్నీ క్రిందకు దిగి అతన్ని లేవదీసింది. అతడు “మేమే” మని ఏదో కృతజ్ఞత తెలుపబోయాడు. అప్పుడు జెన్నీ అతని భార్య వింటూండగానే “ఏమయ్యా, అంత అందమయిన భార్యను తీసుకు వెడుతూ మనస్సు నిర్మలంగా ఉంచుకో లేకపోతే తలక్రిందులుగా పడవా మరి. వెళ్ళు నీ పని చూసుకో! నీ భార్యను నేను జాగ్రత్తగా చూస్తానులే. నువ్వు స్టేషను స్టేషనుకు మా పెట్టెకు వచ్చి మా కందరికీ విసుగు పుట్టిస్తున్నావు. అంతగా నీవు పట్టలేకపోతే నీ భార్యను నీ పెట్టెకే తీసుకు వెళ్ళు!” అన్నది.

ఆ యువకుడు తెల్లబోయి తలవంచుకొని తన పెట్టెకు వెళ్ళిపోయాడు. జెన్నీ తన పెట్టెలోనికి వచ్చేసరికి ఆ అమ్మాయికి కళ్ళవెంట నీళ్ళు తిరుగుచున్నాయి. జెన్నీ ఆమెను బుజ్జగించి ఆమె హృదయం చూరగొంది. “రహస్యం చెప్పు స్నేహితురాలా?” అని ఆ బాలిక నడిగింది. ఆ బాలిక బి.యే ప్యాసయిందట. వాళ్ళు అయ్యంగారులు. ఆ కుర్రవాని తండ్రి ఇంపీరియల్ బ్యాంకు క్యాషియరట. చాలా ధనవంతుడట. ఈ అబ్బాయి లెక్కలలో బి.యే. ఆనర్సు మొదటి తరగతిలో నెగ్గి వ్యాపారపు లెక్కల పరీక్షకు చదివి నెగ్గాడట. అతనికి ప్రభుత్వం వారి అకౌంటెంటు జనరల్ ఆఫీసులో ఉద్యోగం అయిందట. పెళ్ళి అయిన ఏ రెండు మూడు నెలలో ఆ బాలికా అతడూ అతి ప్రేమగా ఉన్నారట. అక్కడనుంచి అతగాడు సినిమాతారల వెంటా, కొంచెం తళుక్కుమనే జావకడి మనస్సుగల డాబువేషాల బాలికల వెంటా కుక్కలా తిరగడం ప్రారంభించాడట. అందుకని తండ్రి బ్రహ్మ ప్రళయంచేసి, ఈ ఉద్యోగం ఇప్పించాడుట. ఢిల్లీ చేరి ఇల్లు చూసుకొని, ఆ అమ్మాయిని తీసుకు వెళ్ళుతున్నాడట. ఇవన్నీ జెన్నీతో చెప్పుకుని ఆ అమ్మాయి కుళ్ళిపోయింది. ఇక జెన్నీలో దాగివున్న మాతృశక్తి విజృంభించింది. ఆ బాలికకు తన చరిత్ర, చూచాయగా అందించింది.

ఆ తర్వాత నాలుగు ముఖ్య ఉపాయాలు అవలంబించమని సలహా ఇచ్చింది.

1 కొత్త పద్దతుల పైన చక్కగా అలంకరించుకొనుట.

2. ఇంటిలో తోటపనీ, గోడబంతి ఆటా అవీ చేసి కసరత్తు చేస్తూ దేహాన్ని సౌష్ఠవంగా బాగు చేసుకొనుట.

3. స్త్రీ పురుష సంబంధం విషయంలో తాను విముఖంగా ఉన్నట్లు నటించుట.

4. భర్త వచ్చినదీ, లేనిదీ, వున్నదీ, వెళ్ళినదీ ఏమీ గమనించనట్లు నటించుట.

వీనిని ఆచరిస్తూ కొన్ని హొయలు చూపిస్తూ వుండాలనిన్నీ, ఇల్లు దాటివెళ్ళి ఇతర పురుషులను చూస్తున్నట్లు నటించవద్దని ఇంగ్లీషు గ్రంథాలు, రాజకీయాలు, వేదాంతాలు, కళలు ఈ విషయాలవి తెప్పించుకుని చదువుతూ ఉండమనీ, ఇంగ్లీషు నూనె రంగులూ కుంచెలూ వగయిరా సామాను తెప్పించుకుని బొమ్మలు వేస్తూ ఉండమనీ ఉపాయం చెప్పింది.

7

జెన్నీ ఢిల్లీలో దిగి దిగడంతోటే “జెన్నీ” అంటూ మూర్తి ఎదురు పడి, ఆమె రెండు చేతులూ పట్టుకొని, ఆమె కళ్ళల్లోకి గాఢంగా తమిగా తేరిపార చూచాడు. ఆమె అంతమంది ఉన్నా అతని కౌగలి లోనికి ఉరికింది. మూర్తి చప్రాసీ ఆమె సామాను పట్టుకురాగా వారిరువురు "వచ్చావా నారాణీ” అంటూ, ఎలా ఉన్నావు “నరుడా!” అంటూ బయటకు వెళ్ళారు. మూర్తి ఒక మంచి పాతకారు కొనుక్కున్నాడు. ఆ కారులో ఎక్కి ముందు డ్రైవరూ, చప్రాసీ కూర్చుండగా వెనుక తానూ, తన ప్రియురాలు కూర్చుండినారు. కారు తిన్నగా మూర్తి బంగళాకు వెళ్ళింది.  బంగళా చిన్నది. అందంగా ఉంది. ఈ కొద్ది రోజులలో ఎంత శుభ్రంగా ఉంచాడు. గృహం మగవాని వల్ల శుభ్రత పొందగలదు. స్త్రీవల్ల సౌందర్యం సముపార్జించుకొంటుంది.

“చక్కని ఇల్లు, ప్రియతమా! చాలా అందంగా నేను ఈ ఇంటి బాలికను అలంకరించవలసి వుంది.” అని ఆ బాలిక స్నానాల గదిలోనికి పోయింది. ఆమె అతన్ని బంగళాలో వుండడానికీ, అతడు ఆమె ఢిల్లీలో వున్నన్నాళ్ళూ తన వెనకటి హోటలులో వుండడానికి ఏర్పాటు చేసుకున్నాడు..

ఆ రోజల్లా ఇద్దరు ఒకరి కౌగిలి ఒకరు వీడలేదు. ఇద్దరి ఒళ్ళూ వేడెక్కినాయి. మూర్తి భయస్తుడూ, ఔచిత్యం నూరుపాళ్ళూ పాటించేవాడూ అవటంవల్ల అంతటితో ఆగింది. లేకపోతే వారిరువరకూ గాంధర్వ వివాహం జరగవలసిందే!

"మూర్తి ఆ రాత్రి తన హోటలుకు నిద్రకోసం వెళ్ళబోయే ముందు, “ప్రియతమేశ్వరీ! ఎప్పుడు మన వివాహం?” అని ప్రశ్నించాడు.

ప్రియా! నువ్వు క్రిస్టియన్ కాదలచుకున్నావా?” అని అడిగింది. అతడు తెల్లబోయి ఆమెవైపు పది క్షణికాలు చూచినాడు. ఆమె వెంటనే, నువ్వు కలియాలని నా ఉద్దేశం కాదుసుమా! ప్రేమకు మతాలు లేవన్న మాట నిజం. మనం మతమూ, సంఘమూ దాటినవారము కాబట్టి భారతదేశ రిజిష్టర్ వివాహం చేసుకుందాము. మీలోనూ, మాలోనూ భగవంతుని ఎదుట అన్ని ఒట్టూ పెట్టి పెళ్ళి చేసుకొని, ఆ ప్రతిజ్ఞలన్నీ వెంటనే మరచిపోయేందుకు సిద్దం అవుతారు. మన కవన్నీ వద్దు.” అన్నది.

"కాని, నాకు భగవంతుడంటే నమ్మకం ఉంది. నీ ఎదుట నన్ను భక్తుణ్ణిగా తీసుకొని రాగలిగిన ఒక మహాశక్తి లేదని ఎట్లా అనగలను. నీతో కలసి ఎక్కడో భగవంతుని ఎదుట నిలుచుండి మన వివాహాన్ని ఆశీర్వదించవలెనని ప్రార్థించడానికి మాత్రం అనుమతి ఇయ్యమని చేతులు ముడిచి నిన్ను కోరుతున్నాను.”

ఆమె అతని ఒళ్ళో కూర్చుంటుంది. అతని మెడచుట్టూ చేతులు చుట్టి కౌగలించుకుంటుంది. తాను మంచముపై వాలిపోయి, తనతోపాటు మూర్తిని మంచంపైకి లాగుతుంది. అతనిమీద వాలిపోతుంది. ఆమె ప్రేమ ఉప్పొంగులో అతడు స్వచ్ఛనీరంలా కలిసి మెలసి పోయినాడు. అయినా వారిరువురు శృంగారోద్వేగ మహాగానంలో ఏ విధమైన అనౌచిత్యమూ రాకుండా అతడు చూచుకొన్నాడు. రెండు మూడు సారులు ఆమె తొందరపడింది. అతడు చక్కగా తప్పించుకొని, ఆమె ఉద్వేగానికి ఆనకట్టలు కట్టివేసినాడు.

ఒక ఉదయం టీ త్రాగుతూ ఉండగా అతడామె కంఠాన్ని తన చూపుడు వేలితో, మధ్య మాంగుళితో స్పృశిస్తూ "ప్రాణేశ్వరీ! నీ శరీర స్వచ్చతను నేను వేళ్ళతో నైనను ముట్టుకొనడానికి భయపడతాను. నేను ఇంగ్లండులో చదువుకొనే రోజుల్లో అమెరికాలో ఉన్న రోజులలో ఆయా దేశవాసులయిన స్త్రీ పురుషులకున్న స్వచ్చవర్ణం నాకు ఆశ్చర్యం కలుగచేసేది. నా చిన్నతనంలో మిషనరీ దొరల్ని, దొరసానులను చూచి వాళ్ళు దేవతలే అనుకునేవాణ్ణి. పెద్ద వాడినయిన వెనక తెల్లరంగులో అఖండమయిన తెలివి తేటలుగల మెదడులు వుంటాయని నిర్ణయానికి వచ్చాను.” “అది వట్టిమాట! జపానువాళ్ళ మాటో? దేహబలం అంటావా జోలూ యీ మూట? పైగా నిన్న మొన్నటివరకు తెల్లవాళ్ళ నాగరికత ఎంత? ఏవో కొన్ని ప్రస్తుత స్థితులను బట్టి సిద్ధాంతాలు చేయకు ప్రియతమా!”

“అవునులే, నారాయణుని ముందు నరుని నిర్వేదంలా ఈ మాటలేమిటి ?".

“ఎవరు వాళ్ళిద్దరూ?”

“కృష్ణుడూ, అర్జునుడూ!”

“వాళ్ళ గొడవ మనకెందుకుగాని, మన వివాహమైతేనేగాని నేను ఈ ఊరునుంచి కదలదలుచుకోలేదు. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయి. ఇంక నా ఉద్యోగం విషయమూ, నేను ఎక్కడ నా వృత్తి సాగించేదీ, అవి తర్వాత నిర్ణయం చేసుకుందాం!”

వారిరువురూ అతని కారుమీద ప్రతి సాయంకాలమూ ఎక్కడికైనా వాహ్యాళికి పోయేవారు. అర్థంలేని ప్రేమ సంభాషణలలో ఆనందం పొందేవారు.

ఎల్లమందమూర్తికి జెన్నీని చూచిన కొలదీ ఆమె తన్ను వివాహం చేసుకొని, ఏమి కష్టపడుతుందో అన్న తలపోత ఎక్కువై పోయింది. అతని కౌగిలిలో ఒదిగి కూర్చుండి ఆమె అతడు పరధ్యానంగా ఉండడం చూచింది.

“ఏమిటి ప్రియతమా ఆలోచన ఎక్కువైంది?” అని ఒకనాడు సాయంకాలం యమున ఒడ్డున గూర్చుండి ఆమె ప్రశ్నించింది.

“నా ఆలోచన నువ్వు, నా కలలు నువ్వు, నా జీవితం నువ్వు! ఇంకేం ఆలోచించగలను?”

“నన్ను గూర్చి ఏమి ఆలోచిస్తున్నావు?”

“నీ అందం చూస్తాను, నా అంద వికారం చూచుకుంటాను, “సుందరీ పశువుల” కథ జ్ఞాపకం వస్తుంది. నీ తీయని మధుర కంఠమూ నా అపశ్రుతి కంఠమూ తలపోసుకుంటాను. ఈనాటి అమెరికన్ జాజ్ అల్లరి జ్ఞాపకం వస్తుంది. నువ్వు ఇంగ్లీషు సంగీతం దివ్యంగా పాడటం గమనిస్తాను. ఆనందడోలికలో ఊగిపోతాను. నా కంఠంలో సంగీతం లేదు. ఈలా ప్రతి నిముషానికీ నా పనికిరానితనమూ, నీ దివ్యత్వమూ రెండూ కళ్ళ ఎదుట కడతాయి. నీళ్ళల్లో మునిగిపోవువాని పక్కకు పడవ కొట్టుకొచ్చినట్లు నా ఎదుట ప్రత్యక్షమయ్యావు.”

“వారెవా! ఇదంతా ప్రభువువారు తమ రాణీని ప్రసన్నను చేసుకునే విధానం కాబోలు!”

“కాదు రాణీ! ఇన్ని కోట్ల హరిజనులలో, చదువుకుని తక్కిన హిందూ పెద్దలతోపాటు పైకివచ్చేవారు ఏ ఇద్దరో ముగ్గురో వుంటారు. వారిలో ఒకణ్ణిగా నేను వచ్చానంటే నా యాత్ర రహదారిలో నువ్వు ఉన్నావు గనుకనే నేను రాగలిగాను.”

“అన్నీ బడాయి మాటలు చెప్పకు ప్రియా! నువ్వు అమెరికానుంచి వచ్చిన తరువాత గద నన్ను చూచింది?”

“నువ్వు ఉన్న విషయం నా బాహ్య ఇంద్రియాలకు తర్వాతనే తెలిసినందనుకో, కాని నాకు చదవాలని బుద్ది పుట్టించిందీ ఆకివీడులో ఉన్న మిషనరీ దొరసాని. ఆమె అందం చూచి ఆమె నాకు అమ్మమ్మ అంత పెద్దదీ అవటంవల్ల ఒక తెల్లని బాలికను నా స్వప్న ప్రపంచంలో నాకై సృష్టించుకొన్నాను. ఆనాటి ఆమె రూపు, సౌందర్యము, విలాసము నీలో మూర్తీభవించాయి.

ఆ బాలిక నిశ్శబ్దంగా మూర్తిని కౌగలించుకొని, “నా నాయకా! నేను అదృష్టవంతురాలనో నువ్వే అదృష్టవంతుడవో నిర్ణయించేది, ఆ అదృష్టదేవతే!” అని అతని పెదవులు తమిగా చుంబించింది.

8

మూర్తి మరునాడు ఆఫీసులో కూర్చుండి పనిచూసుకుంటున్నాడు.

నదులకు ఆనకట్టలు, తీరాల ఎత్తయినగట్టులు, ఆనకట్టలవల్ల పెద్దచెరువులు, చెరువుల క్రింద కాలువలు. నీరు మహావేగంతో బ్రహ్మరాక్షసియై చక్రాలను తిప్పడం, దానివల్ల డైనమోలు తిరగడం విద్యుచ్ఛక్తి ఉద్భవించడం, ఆ శక్తి దేశం అంతటా తీగెలతో సరఫరా చేయడం, ఆ శక్తివల్ల, మిట్ట ప్రదేశాల నూతులలోనుండి నీరు పైకి రావడం గ్రామాల పిండిమరలు, ప్రతి పూరిల్లులో వెలుగు, పల్లెటూళ్ళలో చిన్న చిన్న రోడ్ల పొడుగునా పెద్ద రాజ బాటలలో దీపాలు, గ్రామాల రేడియోలు, సినిమాశాలలు, చిన్న చిన్న యంత్రసహాయంవల్ల గ్రామ పరిశ్రమ, అందరికీ తిండి, అందరికీ బట్ట, అందరూ ఒకేజాతి, అందరూ ఒకే ఆనందం! ఆ స్వప్నంలో ఉండగా “సాబ్! ఒక సాహెబ్ (తెల్లాయన) ఈ కార్డు ఇచ్చినారు” అని చప్రాసీ మూర్తి బల్లమీద ఒక కార్డు పెట్టినాడు. “మేజరు కార్లయిల్, 3వ ఇండియను రైఫిల్సు, పెషావరు.” అని ఉంది.

ఎవరా అని ఒకే ఒక్క నిమేషం ఆలోచించాడు. ఆ వెంటనే మెరుపులా జ్ఞాపకం వచ్చింది. జెన్నీ పెద్ద అన్నగారు! వెంటనే లేచి అతిథులు కూర్చునే గదిలోకి బోయి “నేను మూర్తినండీ! లోనికి దయచేయండి” అని పిలిచాడు.

మేజరు కార్లయిల్ సంపూర్ణ మిలటరీ దుస్తులలో ఉన్నాడు. చేతనొక బెత్తం వుంది. మేజరు కార్లయిల్ తండ్రి పోలిక. అతని ఒతైన మీసాలు చివర సన్నంగా మొన వచ్చేటట్టు మెలిబెట్టి వున్నాయి.

మూర్తి చేయి అందిచ్చినా అతను చేయి చాచలేదు. తాను “మూర్తి”నని చెప్పుకున్నా అతడు తాను మేజరు కార్లయిల్ అని చెప్పుకోలేదు. అతడు కుర్చీమీద నుండి లేవలేదు.

మూర్తి ఆశ్చర్యమందాడు.

మేజరు కార్లయిల్ కూర్చుండే, “ఓరీ బ్లడీ నిగ్గర్ ఏదిరా మా చెల్లెలు? ఎక్కడ ఉందిరా? నీ తోలు ఊడేటట్లు ఈ బెత్తంతో నీ వీపు” - అని, పండ్లు బిగించి మాట్లాడాడు.

“మా చెల్లెల్ని కలుసుకునేందుకు ప్రయత్నించినా, మా చెల్లెలికి ఉత్తరాలు రాయడానికి ప్రయత్నించినా, నా ఉద్యోగం సంగతీ, నీ ఉద్యోగం సంగతీ ఆలోచించకుండా పదిమందిలో పట్టుకు నీ వీపు చితకగోట్టడం తథ్యం!” అని లేచి మేజరు కార్లయెల్ విసవిస నడిచి వెళ్ళిపోయాడు.

ఎల్లమందమూర్తికి కలిగిన ఆశ్చర్యం వర్ణనాతీతము. కోపం, ఉక్రోషం, విచారం, భయం, దుఃఖం, ఒకదాని వెంట ఒకటి తరుముకు వచ్చాయి. అలాగే నిరుత్తరుడై  కూచున్నాడు. ఈలాంటి సంఘటన ఏదైనా రావచ్చునని అతడనుకున్నాడు. కాని, ఇంత రాక్షసంగా సంధానిస్తుందని అతడు తన ఊహా విశ్వంలో ఎప్పుడూ, ఏ విధంగా అనుకోలేదు.

హిందూమతంలో వర్ణభేదం ఏర్పడడానికి, ఇదే కారణం. బంగారం కూడా వెండిని నిరసిస్తుంది. రాక్షసిబొగ్గు బొగ్గుని నిరసిస్తుంది. ఆర్యులు, పసిమిరంగు సుమేరియనులను, వారు గోధుమరంగు దస్యులను, వారు నల్లనిరంగు రాక్షసులను అసహ్యించుకొనేవారు. ఆర్యులంతా మొదట ఒకేరంగు. వారే ద్విజులై ఉంటారు.

తెల్లవాళ్ళకు రంగుల వాళ్ళంటే కడుపుమంట. అంతే కాబోలు చటుక్కున ఎల్లమంద లేచినాడు. ఏమీ పని పూర్తి చేసుకోకుండా కారు ఎక్కి తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటిలో జెన్నీ లేదు.

అతని గుండె పదినిముషా లాగినట్టయింది. “జెన్నీ! జెన్నీ!” అంటూ గదులు వెదికాడు. చప్రాసీ, పనిమనిషి పరుగునవచ్చి “సాబ్! ఒక మిలిటరీ సాహెబ్ వచ్చి, పది నిముషాలు దొరసానితో మాట్లాడి తన కారుమీద ఎక్కించుకొని పోయినాడు.” అని చెప్పినాడు.

ఎల్లమంద వారి మాటలు విన్నాడన్న మాటేగాని, అసలు తాను ఏమి చేస్తున్నదీ అతనికి తెలియలేదు. గదులన్నీ ఆమెకోసం వెదుకుతూ వెదుకుతూ తిరుగుతున్నాడు. ఆమె నివసించిన గదిలోని అద్దానికి తగిలించి ఒక ఉత్తరం ఉంది..

“ప్రియతమా! మా మేజరు అన్న పెషావరునుంచి వచ్చాడు. అతని భార్య, మా వదినకు చాలా జబ్బుగా ఉందట. కాబట్టి వెంటనే రమ్మనమని ఈ సాయంకాలం మూడు గంటల బండికి బయలుదేరమన్నాడు. నీతో చెప్పి వస్తానంటే వ్యవధి లేదన్నాడు. ఈ ఉత్తరం రాసి మూడు గంటల బండికి వెళ్తున్నాను. అక్కడినుంచి ఉత్తరం రాస్తాను. నిన్ను ఇలా వదలి వెళ్ళడం, నా ప్రాణం, నా మనస్సు ఇక్కడే వదలి వెడుతున్నాను. ఇంతే సందర్భం. ఇంత తొందరయినది ప్రాణాధికా! నీకు కోటి కోటి ముద్దులు, శతకోటి కోటి కౌగిలింతలు - హృదయ ప్రభూ! నువ్వులేని సమయంలో సిగ్గువదలి నా ప్రభువు అని కంఠమెత్తి పిలుచుకుంటున్నాను. అన్న తొందరపెడుతున్నాడు, సెలవు.

నీ పెదవుల నా పెదవులు

గాఢంగా ఆనించి

"నీ జెన్నీ"

అని ఉత్తరం చదువుకొన్నాడు.

పెద్ద నిట్టూర్పు విడిచి కుర్చీపై కూలబడిపోయినాడు. లోకం అంతా నల్లబడింది. ఒళ్ళు చెమటలు పోసినాయి.

“నా దివ్యమూర్తి నా జన్మనే వదలి వెళ్ళిపోయిందా!” అని పైకి అనుకున్నాడు.

జెన్నీ గుడ్డలు, కొన్ని స్త్రీలకు గోప్యమైన లోని దుస్తులు ఆమె ఉపయోగించు సబ్బు అవీ ఉన్న పెట్టె అక్కడే ఆమె నుంచి వెళ్ళిపోయిన విషయం అతడు కనిపెట్టినాడు.

అవి అన్నీ తీసి పెదవులతో చుంబించి, హృదయాని కదుముకొని, ఒక తోలుపెట్టెలో అన్నీ సర్ది తాళం వేసుకున్నాడు. అతడు ఆ రాత్రంతా నిద్రలేకుండా తిరిగినాడు. ఆ  బాలిక ఛాయాచిత్రాలను ఎన్నింటినో అతడు చిత్రచిత్రాలైన ఫ్రేములు కట్టించుకొని తన ఇల్లంతా అలంకరించుకొన్నాడు. ఆ చిత్రాలన్నిటినీ ఎన్నిసారులో పలకరించుకొన్నాడు.

పడక కుర్చీలో వాలి, ఏమిటి జెన్నీ అన్నగారి ఉద్దేశం? తానేమి చేయాలి? జెన్నీని తానెల్లా వదిలివేయగలడు? జెన్నీ ఏమంటుంది? ప్రపంచం అంతా తన పైనే కత్తిగట్టినారా? లయొనెల్‌కు రాస్తే అతడేమి అంటాడో!

“జెన్నీ! ప్రాణప్రియా! నిన్ను పొందలేని నాకు ఈ ఉద్యోగం వద్దు. మా జక్కరం గ్రామంపోయి అక్కడ ఏదో హరిజన సేవ చేసుకుంటూ ఉండవచ్చు. లేదా మహాత్ముని ఆశ్రమానికి పోయి, అక్కడ ఆ బాపూజీకి సేవచేస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారం నడవవచ్చు.” అని జెన్నీ చిత్రం వైపు చూస్తూ మాటలాడినాడు.

9

యుద్దం చల్లగా వచ్చింది. వచ్చినప్పుడు అంత ప్రళయం అవుతుందని ఎవరనుకున్నారు. జర్మనీ రష్యాతో సంధి చేసుకొని పోలండు మీదికి దిగింది. పోలండు జర్మనీ కత్తిపీటకు ఆనపకాయ అయింది. జర్మనీ పోలండు మీదికి వెళ్ళింది గనుక ఇంగ్లండు, ఫ్రాన్సులు జర్మనీమీద యుద్ధం ప్రకటించాయి. హిట్లరు అబ్బే అంటూనే ఆస్ట్రియా ఆక్రమించుకొన్నాడు. చెకొస్లావేకియా ఆక్రమించుకొన్నాడు. గొడుగు ధరించి ఛాంబర్లేనుగారు ఎంత తన రాజకీయపు టెత్తులు వేస్తే ఏమి? హిట్లరుకు భయమా!

ఇంగ్లండుకు ఏమంత బలం ఉంది? చీనా జపాను యుద్ధంలో ఏమీ చేయలేక పోయింది. ఒక మాటు చీనా పక్షం అంది, ఇంకోమాటు ఏ పక్షమూ కాదంది. బర్మా రోడ్డు తెరిచింది. చీనా సహాయంకోసం; తర్వాత జపానుకు కోపం వస్తే ఆ రోడ్డు మూసి వేసింది. అబ్సీనియాపై ఇటలీ విరుచుకుపడితే, ఆహాహా! అంది. ఇటలీ తన నావికాబలం, అదీ చూపించేసరికి తర్వాత చెప్తాలే అన్నట్టు ఊరుకుంది.

హిట్లరు ఇంగ్లండుకు ఎంత బలం ఉందో అప్పుడే తెలిసికొన్నాడు. ఫ్రాన్సు ఎప్పటికైనా తన చేతిలోనిదే. ఫ్రాన్సుకూ జర్మనీకి మధ్య ఫ్రాన్సువారి “మాజినో' దుర్గ శ్రేణి ఉన్నది. జర్మనీకి “సీగ్ ఫ్రీడ్” శ్రేణి వుంది. ఆ శ్రేణుల మధ్య మొదట వేళాకోళం యుద్దం సాగింది. పోలండు అయిపోయింది. అప్పుడు పడమటకు తిరిగాడు హిట్లరు.

ఎల్లమందమూర్తి ఉద్యోగ ధర్మాన పంజాబ్, సింధు, బొంబాయి, మద్రాసు రాష్ట్రాలు తిరుగుతూ, ఆయా రాష్ట్రాలలో ఇదివరకే స్థాపింపబడి వున్న ఉదక వేగజనిత విద్యుత్ సంస్థలను పరిశీలిస్తున్నాడు. ఎన్నో ఉత్తరాలు రాసినాడు జెన్నీకి, జెన్నీనుంచి ఒక్క వుత్తరమూ లేదు. ఏమిటీ రహస్యం. జెన్నీ అన్నగారు, ఆ మేజరు ఏదో చేసినాడు.

ఎక్కడకు వెళ్ళినా అతడు ఆ చుట్టుప్రక్కల హరిజన వాడలు పరిశీలించేవాడు. అతని గుండె తరుక్కుపోయేది. ఏమి చేయగలడు? ఒక పర్వతం నెట్టివేయడం వంటిదది. ఏనాటికి తన సంఘానికి విముక్తి? కాంగ్రెసు వారూ వెనకటి సంప్రదాయం వదలలేకుండా వున్నారు. అయినా ఏం చేయగలిగినా వారే! ఒక్కటే మార్గం ఉంది. హరిజన బాలికలు చక్కని విద్య నేర్చుకుని ఉత్తమ కులాల బాలకుల్ని వివాహం చేసుకోవాలి. చదువు, అలంకారం, శుభ్రత, నాగరకత, ఇవి మనుష్యులను పైకి తీసుకువెడతాయి.  ఆర్థికంగా తనవారు భూస్వాములు, ఉద్యోగులు, వర్తకులు అయిన మరునాడు ఈ దుర్భరస్థితి పోతుంది. ఉద్యోగం చేసే క్రిష్టియనులకు తన సంఘానికి వున్న దౌర్బాగ్యస్థితి ఏది? ముస్లిం మతం కాని, సిక్కు మతంకాని పుచ్చుకున్న హరిజనులకు ఈ దుర్భరస్థితి లేదు. ఒక మతంలో వున్న లోపాలను సవరించి, దాన్నే ఉత్తమ స్థితికి కొనిపోవడం మగతనమూ, పవిత్ర ధర్మమూ అవుతుంది అని అనుకున్నాడు.

మూర్తి తిరుగుతూ పై అధికారులకు తాను చూచినది, చేయవలసిన మార్పులు, వృద్ది చేయవలసిన విధానం అంచనాలు, లెక్కలు అద్భుత శాస్త్ర గ్రంథంలా తయారు చేసి పంపేవాడు. ఒకనాడు బ్రిటిషు దేశస్తుడయిన చీఫ్ ఇంజనీరు ఈతని నివేదికలన్నీ చదివాడు. అవి చదువుతూ చదువుతూ తక్కిన సర్వమూ మరిచిపోయి ఆ నివేదికలన్నీ పూర్తి చేశాడు. భాషమాట అట్లా ఉంచి విషయమూ, శక్తి చూచి ఆశ్చర్యమందినాడు. వెంటనే ఎల్లమందమూర్తిని గూర్చిన కాగితాలన్నీ తెప్పించుకు చూచినాడు. అతనికి ఎంతో సంతోషం వేసింది.

వెంటనే ఎల్లమందమూర్తికి బొంబాయి రాష్ట్ర ఉదక జనిత విద్యుచ్ఛక్తి సహాయ ఇంజనీరుగా, వేయి రూపాయల జీతం మీద ఉద్యోగం ఇచ్చి, వెంటనే వెళ్ళి చార్జి పుచ్చుకొమ్మని ఆజ్ఞ యిచ్చినాడు.

మూర్తి గరిసెప్ప జలపాతం దగ్గిర వున్నప్పుడా ఆజ్ఞాపత్రం అందినది. గరిసెప్ప జలపాతంవంటి మహాపాతాలు మూర్తి అమెరికాలో దర్శించినాడు. నయాగరా జలపాత మహాభావం అతడర్ధం చేసుకున్నాడు. నయాగరా భావం అమెరికా! గరిసెప్ప భారతదేశం. శివసముద్రంకన్న గరిసెప్ప ప్రతాపం అఖండమైనది. శివసముద్రపు బాలికా తాండవము, గరిసెప్ప పురుషుని తాండవము.

క్షణికంలో ప్రతికోటివంతు కాలమూ నీటిలోని ప్రతి అణువు క్రిందకు పడుతున్నది. అలాంటి అణువులు ఆ కాల భాగంలో ముందుకు వస్తున్నాయి.నిత్యమై జలం ప్రవహిస్తున్నది. నిత్యపతనము, నిత్యనూతనము. అలాగే ప్రేమ నిత్యనూతనము, ప్రేమికులు నిత్యనూతనము. ప్రేమ గరిసెప్ప మహాప్రతాపము, ప్రేమమహాప్రవాహము ప్రేమ సూక్ష్మమూ, స్థూలమూ! ప్రేమ కదలని స్థిరత్వము; అఖండ వేగంతో కదిలిపోయే మహాభయంకర తృణావర్తము. ప్రేమ ప్రేమకోసం, ప్రేమ జాతివృద్దికోసం.ప్రేమ సూర్యాగ్ని గోళం. ప్రేమ చంద్రశీతలం.


ఆ ఆలోచన కడ చటుక్కున ఎల్లమందమూర్తి ఆగిపోయినాడు. ఏమిటిది? నీటిశక్తి లెక్కల చూచుకొనే తనకు ప్రేమశక్తి లెక్కల చూడడం సంభవించిందేమి? జెన్నీ తన ఆలోచనలలో అంతభాగం ఆక్రమించుకొని పోయిందేమి? జెన్నీ! ఎక్కడ వున్నావు?

★ ★ ★