ధ్రువోపాఖ్యానము/పీఠిక

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పీఠిక.

ధ్రువోపాఖ్యానము భాగవతమున జతుర్థస్కంధమున వచ్చు స్వాయంభువ మన్వంతర కథాసందర్భమున జెప్పబడిన భక్తచరిత్రము. శ్రీమద్భాగవతము సంస్కృతమున వ్యాసమహర్షి చే విరచింపబడియె. ఇది యష్టాదశ పురాణములలో నొక్కటి యని పెక్కండ్ర యభిప్రాయము. దేవీ భాగవత మను పేర బార్వతీదేవి యవతార విశేషముల వర్ణించు మఱియొక గ్రంథము కలదు. అయ్యదియే పదునెనిమిది పురాణములలో బేర్కొనబడిన భాగవత మని కొందఱి యభిప్రాయము. శ్రీమద్భాగవతము విష్ణులీలా చరిత్రమును బ్రతిపాదించును. వ్యాసుడు వేదాంతశాస్త్రమును బ్రహ్మ సూత్రముల రూపముగా నెలకొల్పెను. అది సకల జనుల కధ్యేయము కాక పోవుటచే భాగవతకథారూపమున వేదాంతదర్శన రహస్యము లుద్బోధించుటకై వ్యాసులీ గ్రంథమును రచించిరి. దీనికి సంస్కృతభాషలో బెక్కులు వ్యాఖ్యానములు గలవు. వానిలో జాల బ్రాచీనమైనది శ్రీధరకృతము ఆది యద్వైతమునే విశేషముగా స్థాపించును.

దీని దెనిగించిన కవి బమ్మెర పోతనామాత్యుడు. ఇతడు శివభక్తుడగు కేసనకు లక్కమాంబయందు జనించినవాడు; కౌండిన్యగోత్రజుడు పరమేశ్వరోపాసనచే గవితాశక్తి బడసిన కవి. సహజపాండిత్యబిరుదము వహించినందున నితడు గురుకులక్లేశమున విద్య సాధింపక స్వయంకృతిచే సాహిత్యమునందును దర్శనములందును బ్రౌఢపాండిత్య మలవరచుకొనియె. ఇతని దేశకాలము గురించి భిన్నాభిప్రాయములు గలవు. క్రీ.శ. 1420 ప్రాంతమున నితని భాగవతము రచింపబడియుండునని పలువురి యభిప్రాయము. భాగవతాంధ్రానువాదమున కితడే మొదటివాడు. ఇత డోరుగల్లను నేకశిలానగరమున నుండె నని మామతము. కొందరితడు కడపమండలములోని యొంటిమిట్టలో వసించె నని చెప్పుదురు. ఓరుగంటివా డనుట కనేక హేతువులు గానవచ్చుచున్నది క్రింద సూచించెదము. ఆంధ్రభాషలో మహాగ్రంథము లగు మహాభారతమును భాస్కరరామాయణమును శ్రీమద్భాగవతమును బహుకవిప్రోక్తములయ్యె గాని కేవల మేకావిక్ర్తముగాకపోయె. భారతములో నారణ్యపర్వమున నన్నయ కవిత నిలిపోయె. తిక్కన విరాట పర్వమునుండి గ్రంథముముగింప నరణ్యపర్వ శేషము నెర్రప్రెగ్గడ తెనిగించెను. ఇట్లే భాస్కరుడు ప్రారంభించిన భాస్కర రామాయణము శిథిలము కాగా నారణ్యకాండ యుద్ధకాండ పూర్వభాగములుదక్క దక్కిన కాండములు మల్లికార్జునాదులచే బూరింపబడియె. భాగవతము సైతము పోతనకృత స్కంధములు కొన్ని శిథిలము కాగా గంగన బొప్పన నారనసింగనాదులు పూరించిరి. ఇట్లు శిథిలమగుటకు ముఖ్యహేతువేమి? రాజరాజనరేంద్రుడు క్రీ.శ. లో జనిపోవగా నతనిపుత్రుడు కులోత్తుంగుడు చోళదేశము పరిపాలించుచుండెను. రాజనరేంద్రుని తమ్ముడు విద్వత్పక్షపాతిగాక క్రూరుడగుట చేతను నన్నయ ప్రవయస్కుడగుటచే భారతరచన నిలిచియుండును. భాస్కరుడు ప్రతాపరుద్రుని సేనాని యగుమారని కంకితమిచ్చి రచించెను. 1335 కాలమున నోరుగల్లు తురకలచే -- నందున భాస్కర రామాయణము నష్టమయ్యె. నష్టభాగముల దత్పుత్రాదులు పూరించిరి. ఇట్లే 1430 ప్రాంతమున నోరుగల్లు తురకలచే నాక్రమింపబడినప్పుడు భాగవతము సైతము లోకవ్యాప్తము కాకమున్నే కొన్ని స్కంధ భాగములు నష్తములయ్యె ననుట సత్యమునకు దూరము కాదు. కాకతీయ రాజ్యము మహోన్నతదశలో నున్న కాలమున ననగా క్రీ. శ. 1000 నుండి 1440 వరకు రచింపబడిన గ్రంథసహస్రములలో నుభయభాషలలోను 20-30 కంటె నెక్కువగా మనకాలమునకు నిలిచినవి కావు. రాజ్యవిప్లవముల వలన బ్రజలు దేశభ్రష్టులై ప్రాణమానములు దక్కించుకొన బారిపోవునప్పుడు తాళపత్ర సంపుటముల గొనిపోవుదురనుట బసంభవము. అట్టి కాలములోని గ్రంథమగు భాగవతము కొంతభాగమైనను లభించుట మన భాగ్యమే యని సంతుష్టి సెందదగు. భాగవతములో 1, 2, 7, 10 (పూర్వ భాగము) స్కంధములు మాత్రమే పోతన కవిత్వమనియు 3, 4, 5, 8, టిలో గొన్ని భాగములు పరపూరితములనియు 6, 12 (ఉత్తరభాగము), 11, 12, స్కంధములు పోతన కవితగాదనియు బెద్దలు నిశ్చయించిరి. ఏప్చూరి సంగన షష్ఠస్కంధము మొదలుపెట్టెను. సింగనాదులు తృతీయ చతుర్థ పంచమ స్కంధములు పూరించిరి. అష్టమశేష నవమ స్కంథముల నేకాదశ ద్వాదశ స్కంథముల నారయాదులు ముగించిరి. పోతన కవిత శ్రేష్ఠమైనది ప్రాయశః నిర్దుష్టము. పూరించిన కవుల కవితలు నీరసములై దోషబహుళములై యుండుట నిస్సంశయము. దశమస్కంధమును మాత్రము మడికిసింగన్న ద్విపదరూపమున రచించె. అది పోతన గ్రంథమునకు శిథిలత్వ పూరణము కాదనిన్యు స్వతంత్ర రచనమనియు దోచుచున్నది. పూరించిన కవులలో నేర్చూరి సింగన, మడికి సింగనయు, నోరుగంటి కుత్తరమున రామగిరివాసులు ఏర్చూరి సింగన కువలయాశ్వ చరిత్ర కూడ రచించెను. బొప్పనాదులు త్రిభువనగిరి రాచగిరివారు షష్ఠైకాదశ ద్వాదశ స్కంథములు తెనిగించిన హరిభట్టు కంబముమెట్టవాసి. అన్య షష్ఠస్కంధకర్తలగు మల్లన సింగనలు బెజవాడ సమీపవాసులు దీని నూహింప భాగవత రచన నోరుగంటి చుట్టూ నేబది మైళ్ళదూరములో నిముడుచున్నది.

పై యంశము లాలోచింప బమ్మెర పోతన యోరుగంటిలో నుండెనని తోచకమానదు. గ్రంథము శిథిలమగుటకు గారణము సులభగోచరమగును. 1420 ప్రాంతమున గడపమండలము విద్యానగరరాజగు దేవరాయని పాలనముననుండెను, అతని మంత్రు లాంధ్రులు. పెక్కండ్రాంధ్రభాషలో గ్రంథరచన జేయించిరి. వారి రాజ్యములో భాగవతము వంటి గ్రంథము నశించుటకు వీలుండదు. పోతన ఏకశిలా నగరవాసి యని భాగవతములో జెప్పుకొనెను. నగరశబ్దము సాథారణముగా రాజధనికి నామము కార్వేటి కగరాదు లపవాదకోటిలో జేరును. ఏకశిలానగర మనుపేరు సుప్రసిద్ధముగా నోరుగంటికి బేరు. బమ్మెర గ్రామము తత్సమీపమున నున్నది. ఇప్పుడింటి పేరొకచోట వాసము మరియొకచోట దరచైనను బూర్వకాలమున నంత తరచుగా నుండదని మామతము. పోతన గ్రంథము సర్వజ్ఞసింగభూపాలుడు కోరె ననుటయు బోతన రచించిన భోగినీ దండక తద్వేశ్యాప్రశస్తికమనుటయు సింగభూపాలుడు రాచగిరిలో రాజ్యము చేసినవాడనుటయు బోతన తత్సమీప ప్రదేశవాఇ యను నంశము స్థిరీకరించుచున్నది. రసార్ణవసుధాకరచమత్కారచంద్రికాది గ్రంథముల రచించిన లేక రచింపించిన సింగభూపాలుడు శ్రీనాథుని కంట్ జాల బ్రాచీనుడని స్పష్టమైనది. చమత్కారచంద్రికలోని చక్రబంధశ్లోకము (నక్ష్మాచక్రదిశావిలాసి నయనా" అనునది) విద్యారణ్యుల సోదరుడగు సాయణునిచే విరచితమగు నలంకారసుధానిధిలో నుదాహరింపబడినది. సాయణుడు 1380 లో దీని రచించినందున రసార్ణవసుధాకరాది కర్త సింగభూపతి 1360 లో నుండె ననుట యసంభవము కాదు. కొందరితడు శ్రీనాథ సమకాలికుడని భ్రమపడిరి కాని యది యసాధ్యమని తేలెగదా! కర్ణాటరాజులక్రింద నుండు కడపమండలవాసి శ్రీనాథాదులచే --- కీర్తి -- దేవరాయల విడిచి పరరాష్ట్ర ప్రభువగు సింగభూపతి నాశ్రయించె ననుట మహత్తరమగు కారణమున్నంగాని మనకు సమ్మతిపాత్రము కాదు. శ్రీనాథుడు బహుదేశ సంచారి. రాజులును రాజ్యములును జెడుచుండ దానును రాజ్యలక్ష్మివలె నూతనప్రియుల నాశ్రయించుచుండె. కేవలము భగవత్కైంకర్యము నభిలషించిన పోతన రాజపరంపర స్తుతించి జీవించెనా యను నచ్చెరువు కలుగుచున్నది. పై యంశముల గ్రోడీకరించి నిష్పక్షబుద్ధితో జూచిన నత డోరుగల్లువాసి యనియు భాగవతము రాజ్యవిప్లవముల క్షీణించెననియు నంగీకరింపదగు.

పోతన శ్రీధరస్వామి శిష్యుడని యోరుగంటి ప్రాంతమున బ్రతీతి గలదు. పోతన శ్రీధరవ్యాఖ్యాను మూలముతో జేర్చి తెనిగించె ననుట నిశ్చయము. శ్రీధరుడు. రాచగిరిప్రాంతపుయతి. భాగవతముకాక వీరభద్ర విజయము కూడ బోతన రచితమే. ముద్రిత గ్రంథమున నాల్గవ యాశ్వాసము పోతన కృతము కాదు.

ధ్రువోపాఖ్యాన భాగమున నొండు రెండు పద్యములు దక్క బోతన కవననైపుణి యెందును గానరాదు. అది గంగనాదుల కవితారచనయాయని తోచును. అయినను వెన్నెలకంటి సూరన రచించిన విష్ణుపురాణములోని ధ్రువోపాఖ్యానపు రచనకంటె నిది పెక్కు భంగుల గుణవత్తర మనుట నిస్సంశయము.


ప్రకాశకులు.