Jump to content

ధనుర్విద్యావిలాసము/ప్రథమాశ్వాసము

వికీసోర్స్ నుండి

శ్రీ

ధనుర్విద్యావిలాసము

కృత్యవతరణిక

శా.

శ్రీవాణీగిరిజావిలాసనిధియై చెల్వొందు సీతామహా
దేవిం దక్షిణభాగమం దనుజు నర్థిన్ వామభాగంబునన్
ఠీవి గైకొని చాపరోపధరుఁడై ఠేవన్ బిసాళించు ల
క్ష్మీవంతు న్గుణవంతు నీవనిపుర శ్రీరాఘవుం గొల్చెదన్.

1


సీ.

ఏబాలికామణి హేలావతారంబు
        మిథిలాధిపతిమేలు మేలుకొల్పు
నేభామపరిణయ శ్రీభాగధేయంబు
        శివధనుర్దళన ముంకువ ఘటించు
నేమహాదేవీలలామంబు కరుణతో
        నింద్రాదిదివిజుల యిడుము లుడుపు
నేవధూత్తంసంబు హితలీల రాముల
        వామాంకపీఠంబు వదలకుండు


తే.

నేపరమసాధ్వి గుణము లీరేడు జగము
లందుఁ గులపాలికలకు నానందకరము
లట్టి సీతావధూటి నెయ్యంబు మీఱ
ప్రథనజయ మిచ్చు తిరుపతిరాయమణికి.

2


ఉ.

కోసలరాజనందనునకుం బరిచారకుఁడై నివాసశ
య్యాసనపాదుకాంశుకసితాతపవారణకల్పనావిధిన్
భాసిలి శేషభావ మనుబంధముగాఁ దగు లక్ష్మణుండు ధా
త్రీసురపోషకుం దిరుపతిక్షితిపాలునిఁ బ్రోచుఁగావుతన్.

3

మ.

వనధిం దాఁటి నిశాటఝాటకుటిలవ్యాపారఘోరంబుగాఁ
జని సీతారమణిం గనుంగొనుచు నక్షప్రాణవిధ్వంసనం
బును లంకాదహనంబుఁ జేసి రఘురాముం దేర్చి విశ్రాంతుఁడౌ
దినరాట్తేజు మరుత్తనూజుఁ దలఁతున్ ధీయుక్తికిన్ భక్తితోన్.

4


శా.

శ్రీ రాజిల్ల నిరంతరాయమునకై సేవింతు భావంబునన్
వైరిక్ష్మాధరశంబులన్ భువనదీవ్యత్కీర్తికాదంబులన్
బారావారవిడంబులన్ మునిమనఃపంకేజరోలంబులన్
సారాచారకళావలంబులను విష్వక్సేనహేరంబులన్.

5


సీ.

నక్రంబు కరినొంచు వక్రంబు వారించు
        చక్రంబు పాలించు సరణి నెంతు,
దామోదరుని డెంద మా మోదమునఁ జెందఁ
        గౌమోదకి నమందగతి భజింతు,
పరిచంచలాస్యమై పరికించ ధన్యమౌ
        హరి పాంచజన్యంబు నభినుతింతు,
నానందభవభాసితానందమునఁ జేసి
        యానందకాఖ్యాసి నాశ్రయింతు,


తే.

సుగుణకలనంబు మార్గణసుగమవృత్తి
నమ్రభావంబు దనకు విన్నాణ మొసగ
నవని నవఖండమండితంబై తనర్చు
శౌరి శార్ఙ్గంబు మదిలోన సన్నుతింతు.

6


ఉ.

వాణికి హస్తముల్ మొగిచి వారిజగర్భు మదిం దలంచి శ
ర్వాణికి నంజలించి వృషవాహు నుతించి మురారిపట్టపున్
రాణికి మ్రొక్కి చక్రధరు రాజితలీల భజించి సత్కవి
శ్రేణికి మోదముం బెనిచి చిత్తమునం బ్రమదం బెలర్పగన్.

7


క.

భాసుర సూరి గ్రామణి
భూసురముఖపంకరుహనభోమణి వినమ

ద్దాసనిచయచింతామణి
నే సింగర గురుశిఖామణిం గణుతింతున్.

8


ఉ.

రాముని చెట్టఁబట్టి రహి రాజిలు కావ్యపురంధ్రి కగ్గమై
వేమరు మించనాడుట వివేకము గాదని యేల తోచదో
పామరులార సత్కవుల పాలి శనైశ్చరులార దుష్కవి
గ్రామణులార యిట్లు కొఱగా దనఁగా వినరా నరాధిపుల్.

9


శా.

ఛందోలంకృతి భేదభావగుణదోషప్రౌఢులం దెల్ల ని
స్పందేహ ప్రతిభావిభాసురమనీషల్ గాంచు ధీరాత్మకుల్
నందింపం దగు నొక్కవేళ నెఱ సూనం గాఁ దగున్ గాక యే
సందుల్ రాని బిగాది పండితుల కెంచంబోలునే కావ్యముల్.

10


తే.

కానిపని కాని గవగవఁ గవయఁ గవయఁ
గవులు కవులని కవులాడు కవులు కవులె
ఐన పనికైనఁ గలగలమనక వెనుకఁ
గవులు కవులని లాలించు కవులు కవులు.

11


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబును కుకవినికరావమాననంబును సుకవి
సంకీర్తనంబునుం గావించి యెద్దియేనియు నొక్క ప్రబంధంబు ఘటి
యించి రఘుపతిచరణారవిందంబులకు సమర్పణంబు గావింపం దలంచు నవసరంబున.

12


సీ.

పెన్నురంబునఁ బాలమున్నీట నుదయించు
        తరుణీలలామంబు దనరు వాఁడు,
అభినవజలధరశ్యామలంబగు మేన
        రాణించు కనకాంబరంబు వాఁడు,
బొడ్డుదామరమీఁద భువనముల్ సృజియించు
        నలుమొగంబుల ప్రోడ గలుగు వాఁడు,
ఆద్యంతశూన్యుఁడై యఖలలోకంబుల
        నిజదివ్యతేజంబు నెఱపు వాఁడు,

తే.

కలశపాథోధి నడుదీవి కమ్రకనక
మణిమయంబైన భవ్యధామమున శేష
ఫణిగణాంగణశయ్యపైఁ బవ్వళించి
రహి గులుకుచుండు నాదినారాయణుండు.

18


శా.

శ్రీ నీలారమణీమణీకరతల శ్రీగంధలేపార్హమై
నానామౌని మనస్సరోజపరమానందానుసంధానమౌ
నా నారాయణునంఘ్రిఁ బుట్టిరి పవిత్రాచారులై విక్రమ
శ్రీ నిండార్మఁగఁ బదనాయకమణుల్ శ్రీగంగ సైదోడుగన్.

14


సీ.

ధర్మానుకూలవర్తనమున సుగుణులై
        వంశానుచరితంబు వదల రెందు,
సరసభాషారూఢిఁ జతురాననాఢ్యులై
        సత్యానుగతి వీడఁజాల రెందు,
తలఁకని ఘనతచే ధారాళవృత్తులై
        శరణ మందిన వారి సడల రెందు,
పద్మనాయకలీలఁ బద్మానుకూలురై
        కువలయక్షోభంబు గూర్చ రెందు,


తే.

నరయ గంగాసహోదరు లగుచు భూరి
జీవనమునకు నొడ్లను జెనక రెందు
శ్రీమహావిష్ణు చరణరాజీవయుగళి
నవతరించిన పద్మనాయకులు ధరణి.

15


శా.

అందుం డెబ్బదియైదు గోత్రములుగా నన్యోన్యమున్ బంధులై
చందంబుల్ విభజంచి యేకసమయాచారంబునన్ ధీరులై
డెందంబుల్ దళుకొత్త మోదములతో ఢిల్లీశుఁడౌ పాదుశా
హుందోరున్నతి మెచ్చఁ గొల్చిరి రణోద్యోగంబులం దాప్తులై.

16


ఉ.

డెబ్బది యైదు గోత్రముల ఠీవి నెనంగెడు పద్మనాయకుల్
ప్రబ్బిన కూర్మి నాద్యుఁడగు పాదుషహా హిత మాచరింపుచుం

నిబ్బరపున్ బ్రభావసరణిం బురణించి ధరాధినాథులై
జొబ్బిలి వేడుకం దనరుచుం గనుచుందు రభీప్సితార్థముల్.

17


ఉ.

పౌరుషశాలియై తనరు పాదుషహా హిత మాచరింపుచున్
భూరితరప్రభావమునఁ బొంపెసలారెడు పద్మనాయకుల్
వారికి వారికిం దగిన వైభవముల్ గని పెంపు మీఱగాఁ
గూరిమితోడఁ [1]బుణ్యపలి గోత్రభవుల్ గని రీప్సితార్థముల్.

18


గీ.

వారి వంశంబు కృష్ణా[2]నివంశ మయ్యె
రఘుకులంబునఁ గోదండరాము లీల
నందుఁ బ్రభవించె నొక్క మహామహుండు
సాహసోత్సాహనిధి బంధుజనహితుండు.

19


శా.

ఆధీరాగ్రణి జాగ్రదాగ్రహకృతాహంకారహుంకారదు
స్సాధాయోధనవీధికాధికరిపుగ్మాభృన్మహాసుచ్ఛటల్
క్రోధోద్యత్కరవాలకాలఫణిచేఁ గ్రోలింపుచున్ దుర్జన
ప్రాధాన్యం బెడలించుఁ దాఁ గుతుపశాపాచ్ఛాహితాపాదియై.

20


సీ.

తనయాజ్ఞ నౌఁదలఁ దాలిచి కోవెల
        కొండ యేలిన యట్టి నిండుదనము,
పదిలుఁడై తాఁ బంప [3]మెదకు మ(వ?)లంగర
        దుర్గంబు గాచిన దొడ్డతనము,
తనముద్రఁ జెల్లించి ధనికుఁడై పెదకొండ
        పలి దుర్గమునఁ జేయు ప్రాభవంబు
తనపంపు గని పెంపు దనరారఁగాఁ గొండ
        వీటి దుర్గము నేలు విక్రమంబు


గీ.

భావమున మెచ్చి కుతుపశా ఠీవి నొసగె
[4]తెలనిశానీ నగారా ప్రదీప్తధవళ

చామరద్వంద్వమును జగజంపుగొడుగు
పంచఘంటాతలాటంబు భద్రగజము.

21


వ.

వెండియు.

22


శా.

ఆజానేయము రత్నకుండలయుగం బాందోళికారత్నముం
బ్రాజాపత్యము ముర్తుజాన్నగరసామ్రాజ్యంపుమన్నెర్కమున్
రాజామానికరా వటంచు నభిధానం బిచ్చినం బ్రీతుఁడై
భ్రాజిష్ణుం డగుచున్ దగున్ గుతుపశాపాచ్ఛాసమక్షంబుగన్.

23


వ.

ఇ ట్లమ్మహీమండలాఖండలుండు కుతుపశానుగ్రహంబున నేనూ
టయెనుబది నాల్గు [5](వక)వరగ్రామంబులం బ్రసిద్ధంబగు ముర్తుజాన్న
గరంబునకుం దావలంబైన రాజ్యంబునకు మన్నెఱికంబును
దక్కుంగల సన్మానంబులుం బడసి యప్పాదుశాపనుపున ముర్తు
జాన్నగరంబు ప్రవేశించె నమ్మహారాజధాని వసుంధరాభరణంబై
ప్రవర్ధిల్లుచుండు.

24


సీ.

పసమించు భీష్మకప్రముఖావనీపాల
        కులకు వజ్రపుజోడు కొండవీడు,
శత్రురాజాధిరాజవిరాజదైశ్వర్య
        [6]కుదిరంబు ముకుద్రాడు కొండవీడు,
అఖిలయాచకరాజహంసయూధములకు
        క్రొందామరలకాడు కొండవీడు
దేవతాయత[7]నమై దీపించు కల్యాణ
        కుధరంబు సైదోడు కొండవీడు,


తే.

హరిహరవిరించిముఖదేవతావతంస
సంపదభిరామహేమవిశాల సాల
జాగ్రదగ్రముహుర్ముహుశ్చటుల పటహ
ఘుమఘుమధ్వానములగూడు కొండవీడు.

25

గీ.

పుట్టకోటగాక పొలుచుపైకోటకు
దండి బురుజులుండు రెండుపదులు
కొమలు రెండు నొక్క కొత్తడం బనఁదగు
నట్టికొత్తడంబు లాఱువేలు.

26


ఉ.

ఎక్కడఁ [8]జూచిన న్మదపుటేనుగుగున్నలు చెన్నుమీఱు నే
దిక్కునఁజూచినన్ బసిఁడితేరులబారులు సౌరు దేరు నే
వక్కమునం గనుంగొనిన వాజులరాజులు రాజిలున్ సిరుల్
గ్రక్కెడు కొండవీటినగరంబున నద్భుత మావహిల్లఁగన్.

27


శా.

అందుం దీర్పరి పెద్దయై ముకురనీహారామరహ్రాదినీ
కుందోరప్సరరాజరాజ కలశాకూపారహారావళీ
మందారద్రుమగంధసార లవలీమాద్యద్యశశ్శాలి మే
లందున్ మానికరాయభూవిభుఁడు బాహావిక్రమావక్రుఁడై.

28


సీ.

తనకునై కుతుపశా దయనిచ్చు విజయాంక
        బిరుదముల్ దనయింటఁ బెనుపుసూప
తనపేరు తనసంప్రదాయంబు వారల
        కన్వయాంకంబుగా నతిశయిల్ల
తా భక్తిఁ గొలుచు కోదండరామస్వామి
        తనవారి కులదైవతంబు గాఁగ,
తన భుజాబలసముత్థానంబుచేఁ గొండ
        వీటి దుర్గంబు భావితము గాఁగ,


తే.

నమరె ముర్తుజాన్న గర సింహాసనమున
చామరచ్ఛత్ర వేణునిస్సాణ పణవ
ముఖ నిఖల రాజచిహ్నముల్ మ్రోలఁదనర
ప్రధనజయశాలి మానికరాయమౌళి.

29


ఉ.

మండితమూర్తియై తనకు మానికరాయినికిం దనూజుఁడై
కొండలరాయభూవిభుఁడు కుండలిరాజశశాంక శంకరా

ఖండలదంతి పాండుర వికాస వికస్వరకీర్తి కీర్తితా
జాండకటాహుఁడై తనరు నాశ్రితకల్పమహీరుహం బనన్.

30


మ.

బలిమిన్ గొండలరాయ భూరమణుఁడున్ బాహార్గళోదగ్రుఁడై
సులతానబ్దులపాదుశాహునకు మెచ్చుల్ గూర్చుచుం గాంచెఁ బ
చ్చలహౌదాగజరాజుగొడ్గు తెలనిశ్శానీనగారాసము
చ్చలదశ్వంబును కాహళంబు సరిదేశాహీతనంబున్ రహిన్.

31


చ.

అతనికిఁ దిర్మల ప్రభుఁ డుదారయశుం డుదయించెఁ దిర్మల
క్షితిపతి గాంచె నప్ప నృపసింహుని నప్పవిభుండు గాంచె వ
ర్థితబలుఁ దిర్మల ప్రభునిఁ దిర్మలరాయడు గాంచె నప్ప భూ
పతి నతఁడాఢ్యుఁడయ్యెఁ బరిపాటి మెయిన్ నిజరాజ్యలక్ష్మికిన్.

32


క.

తానుం దేశాహీపర
మానా కౌరంగజేబు మహిమ బఫార
త్ఖానునిచే రోహిల్లా
ఖానునిచే నప్పవిభుఁడు గనియెన్ ఘనుఁడై.

33


మ.

ప్రమదాపాదకమౌ ముహూర్తమున నప్పారాయ మాణిక్యరా
య మహారాయనికిన్ రహిం దిరుపతి క్ష్మాధీశ మాణిక్యరా
య మహారాజ కులావతంసుఁ డుదయంబై యేలె నజ్జానకీ
రమణుం గొల్చుచు ముర్తుజాన్నగరసామ్రాజ్యంబు పూజ్యంబుగన్.

34


సీ.

ఏమన్నె మదహస్తి హేలావిహారంబు
        పరవాహినీసరోవరము గలఁచు,
పద్మనాయకుం డెదుర వీరానీక
        ఘూకావలోకంబు గుడుసు పఱచు,
నే రాజసింహుఁడు వైరిరాజమదేభ
        విసరంబు పాలికి వేరు విత్తు,
నేరామభక్తుండు ధీరుఁడై కొను నన్య
        రజనీచరులు గొన్న రాజ్యలక్ష్మి,

తే.

నతఁడు పాదుశహా లబ్ధ చతురతురగ
కరటి రథలు చామర చ్ఛత్ర కాహళధ్వ
జాది వరరాజ లక్షణ శ్రీదలిర్ప
ప్రబలుఁ దిరుపతి మాణిక్యరాయశౌరి.

35


ఉ.

హుమ్మని సంగరమ్ముల సముద్ధతిఁజూపిన మెచ్చియిచ్చె రా
రమ్మని గోలకొండ నగరమ్ము నవాబు మెఱుంగు లీను వా
హమ్మును నాల్గునేనుఁగులు నాప్తులపాలి సుధాంబుపూరపుం
దెమ్మగదా మహిం దిరుపతిక్షితిపాలుఁడు రాజమాత్రుఁడే.

36


వ.

వెండియు నమ్మహీవల్లభుండు.

37


క.

చెలఁగి ముబారజు ఖానుని
వలనం దొలుతటి నిజామవరఖాజాబా
దులఖానుల వలనం గొనె
నల దేశాహీ మిరాశి కనువిహితంబుల్.

38


వ.

మఱియును.

39


గీ.

భవ్యగుణపేటి చక్రమాంబావధూటి
ధర్మపత్నిఁగాఁబడసి యత్తన్వి వలన
కడిమి నార్వుఱఁ దనయులఁ బడసె నవ్వి
భుండు సంపత్పరంపరాపూర్ణుఁ డగుచు.

40


సీ.

అందగ్రజుండు సాహసవిక్రమార్కు(డై
        రాణించు వెంకటరాయ విభుఁడు,
అతని తమ్ముఁడు సమూర్జిత కళాపరిభూత
        మదనుండు కృష్ణుక్షమావిభుండు,
అతని సోదరుఁడు బాహాబలాభీలుఁ డై
        భాసిల్లుచుండు నప్పప్రభుండు,
అమ్మహాభాగున కనుఁగుఁదమ్ముఁడు మహా
        బలశాలి రమణభూపాలకుండు,

తే.

ఆయనయనుంగుఁదమ్ముఁడై యలరుచుండు
రసికజనమౌళి వల్లభరాయమౌళి
తలప నందఱకును ముద్దుఁదమ్ము డగుచు
ప్రబల సీతన్న మాణిక్యరాయశౌరి.

41


గీ.

ఇందు వెంకటరాయ ధాత్రీశు నాత్మ
భవుఁడు గోపాలక క్షమాపాలకుండు
తండ్రి తాతల కైవడి ధరణి యేలె
నర్థిజనకల్పభూరుహం బనఁగఁ బరగి.

42


శా.

ఈగోపాలవిభుండు ముత్యపుతురాయీ మేలిసిర్పేషమున్
జాగీరున్ మనసోజ[9] నాల్గునగలున్ ఝండా నగారా కరిన్
బ్రాగల్భ్యంబున గోలకొండ దొరచేఁ బాపించి దీపించె రా
జాగోపాలకరావటంచు సవిశేషంబౌ కితాబందుచున్.

43


క.

సుతు లిరువు రప్ప ధాత్రీ
పతికిం ప్రభవించి రగ్రభవుఁడు రఘుపతి
క్షితిపతి రాజ్యము గైకొనె
నతని సహోదరుఁడు తిరుపతన్నయుఁ దనరెన్.

44


మహాస్రగ్ధర.

శూరుం డప్పావనీభృత్సుతుఁడు రఘుపతి క్షోణిపాలుండు రాజ్య
శ్రీరూఢుండై నిజామక్షితిపతి హిత మార్జించుచుం గాంచెఁ దా జా
గీరున్ ఝండా నగారా కెలకుల సిరులగ్గించు వింజామరమ్ముల్
స్ఫారత్కుంభిన్ దురాయీ బలుగొడుగు దెసల్ ప్రాకురాజాకితాబున్.

45


గీ.

శ్రీరమణభూమిపాలుండు నారసింహు
వల్లభేంద్రుండు శేషాఖ్యు వాసి మీఱ
గాంచి కొండొక కాలంబు కలిమి బలిమి
గలిగి చెలఁగిరి శత్రుభీకర నిరూఢి.

46


క.

అల తిరుపతి రాయనికిం
గులసతియెడ గలుగు నాఱుగురిలోపలఁదాఁ

గులవర్ధనుఁడై యిల విల
సిలు సీతారామవిభుఁడు జితశాత్రవుఁడై.

47


సీ.

పరవీర పరివార మరుదేర నిరుదార
        తరభైరవాకృతిఁ దనరుచుండు,
సుకుమారతకు మారునకు మారురక మేరు
        పఱుచు నొయ్యారంబు నెఱపుచుండు,
ఘనదానమున దీనజనమానసనిధాన
        మన మాననీయుఁడై యలరుచుండు,
తనపంపు గని పెంపు గనుపింపు జను సొంపు
        నెగయింపు సునయింపు పనులనుండు


గీ.

నతఁ డనఘుఁ డాఢ్యుఁ డనవద్యుఁ డఖిలహృద్యుఁ
డలఘుఁ డతిశూరుఁ డతిధీరుఁ ఉత్యుదారుఁ
డనుపమస్వాంతుఁ డతికాంతుఁ డమితశాంత
రసుఁడు సీతన్న మాణిక్యరాయ శౌరి.

48


గీ.

అతని పట్టపుదేవి భాగ్యముల దీవి
దీనజనకల్పవల్లి సాధ్వీమతల్లి
సమదభయదాత్రి సహనభావమున ధాత్రి
భవ్యగుణపేటి లక్మణాంబావధూటి.

49


సీ.

ప్రాణేశుఁ గికురించి పరులచాటున వీగి
        జాణయై విహరించు చానతెఱఁగు,
నీటుగాఁ గూర్చుండి నిజనాథు నాడించు
        రాజేశ్వరీదేవి రాజసంబు,
పతి కొద్దిపడి యంత బలికినై చేసాఁచఁ
        దనుకని సిరులభామినిహొరంగు,
తలవాకిటను సిగ్గు తలఁగి యొయ్యారంబు
        నెనయించు పలుకుమానినివిధంబు,

తే. పరిహరించుచు సమధికప్రాభవమున
బ్రాతిమెయి నాత్మపతి భక్తి పాదు కొలిపి
యత్తవారింటఁ బూలచేరెత్తి నట్లు
భవ్యములఁగూర్చు నచ్చమాంబావధూటి.

50


మ.

స్తిమితారాతి విచేష్టితుండు ఘనుఁ డాసీతన్న మాణిక్య రా
య మహారాజకులావతంసునకు నచ్చాంచావధూటీవతం
సమునందుం బ్రభవించి రిర్వురు సుతుల్ జంగన్నమాణిక్యరా
యమహారాజకులేంద్రుఁడుం దిరుపతిక్ష్మాధీశ్వరుండున్ రహిన్.

51


సీ.

శ్రీ పున్నెపలికుల క్షీరాబ్ధిచంద్రుండు
        బాంధవాననపద్మపద్మహితుఁడు,
కృష్ణానివంశవర్ణితరాజతిలకుండు
        శాత్రవద్విరదపంచాననుండు,
హంవీరవీరసాహసవిక్రమార్కుండు
        కామితఫలదానకల్పశాఖ,
పద్మనాయకవరప్రాగల్భ్యమహితుండు
        సంపత్పరంపరాసమహితుండు,


తే.

లాలితశ్రీవిలాసుండు లక్ష్మణాంబి
కాకలితగర్భశుక్తిముక్తాఫలంబు
మన్నెహంవీర బిరుద సీతన్నభూప
నరకుమారుండు జంగభూవల్లభుండు.

52


ఉ.

ఆయుగధర్మ మాయుగమునంద యథావిధి చోదితంబుగాఁ
జేయగలేరు నాఁటినృపసింహులు మానికరావు జంగభూ
నాయకసార్వభౌముఁడు ఘనస్థితిఁ దా ఘటియించు దానదీ
క్షాయుతుఁడై కలిం గృతయుగంబున కర్హములైన ధర్మముల్.

53


శా.

ఆజిన్ రాజిలి గుంటురీపురవరప్రాంతంబున న్నిద్దపుం
దేజీ నెక్కి గుబాటునన్ దఱుముచున్ ధేయంచు బిట్టార్చినన్

జేజే వెరెట్ట నీదుశత్రులు భళీ శ్రీమన్మహారాజ రా
జాజంగక్షితిపాలకోత్తమ బిడౌజా రాజతేజోనిధీ.

54


సీ.

అని పద్యముఖముగా నభినుతుల్ గావించు
        వరకవీశ్వరుల దీవనలు గాంచి,
దేవతాయతనసత్కృతితటాకవనాది
        సప్తసంతానప్రశస్తి గాంచి,
యాసేతుశీతాచలాంతరాళంబుల
        నిజయశఃస్థేమంబు నెఱయఁగాంచి,
నలువురు సతుల విన్నాణంబు దులకించి
        సీతావధూటితో సిరులఁగాంచి,


తే.

ఆయురారోగ్యపుత్రపౌత్రాభివృద్ధి
గలిగి రేపల్లెనగరశృంగారసౌధ
రత్నసింహాసనస్థితి రాజ్య మేలు
భవ్యగుణశాలి జంగభూపాలమాళి.

55


శా.

ఆజంగక్షితిపాలు తమ్ముఁ డలరున్ హస్తాగ్రభాస్వద్ధనూ
రాజద్వజ్రముఖాదిఘోరశరధారాదారితారాతిసే
నాజంఘాలగజాంగభూషణభరానమ్రావనీధారణే
హాజాగ్రన్నిజబాహుఁడై దిరుపతిక్ష్మాధీశ్వరుం డిమ్ములన్.

56


సీ.

శ్రీరామపదపద్మసేవాధురీణుండు
        వరదుఁ డాశ్రితజనవత్సలుండు,
కలనైనఁ బలికి బొంకని మహాసరసుండు
        సదమలాచారవిశారదుండు,
నీవార మనువారి నెఱవేర్చుధీరుండు
        శూరుండు పరవధూసోదరుండు,
హరివాసరవ్రతాధ్యవసాయనిరతుండు
        చేపట్టి వీడని సిరుల టెంకి,

తే.

ఘనగగనగాంగభంగచక్రాంగపూర్ణ
శశిశిశిరశైలశారదాశంఖవికచ
కాశనీకాశవిశదప్రకాశకీర్తి
రహిఁ జెలగుచుండు తిరుపతిరాయమాళి.

57


క.

తా నన్నమాట తప్పక
నానాఁట హితంబు గలిగి నడచిన కరణిన్
దా నన్నమాట తప్పక
నానాట హితంబు గలిగి నడపు హితులకున్.

58


ఉ.

రామునియందు లక్ష్మణుఁడు రాజభక్తికళాధురీణుఁడై
ప్రేమ ఘటించుటలీల దలపించుచు నన్నయడుంగుఁదమ్ములన్
దామహనీయభక్తి కలనానలంబున దేరు మానసః
స్థేమమునం దగున్ దిరుపతి క్షితిపాలుఁ డలోలశీలుఁడై.

59


సీ.

శ్రీమన్మహాదేవసేవానుభావంబు
        గొని ధనుర్ధరుఁడైన గుహునిలీల,
గాధేయుబోధంబు గాంచి కోదండదీ
        క్షాగురుండైన దాశరథిలీల,
పరశురాము భజించి శరశరాసనకళా
        ఘనుఁడైన జాహ్నవీతనయులీల,
ద్రోణు నారాధించి బాణాసనాభ్యాస
        పటిమంబు గాంచిన పార్థులీల,


తే.

శ్రీ మహమ్మదజాఫర నామధేయుఁ
డగు శరాసనగురువరు నాశ్రయంబుఁ
బడసి విలుదాల్చి కలియుగపార్థుఁ డనఁగ
ప్రౌఢిఁ జెలువొందెఁ దిరుపతి రాయశౌరి.

60


సీ.

అబ్దిరాజన్యకన్యాలలామంబుతో
        క్రీడించుహరికి మ్రొక్కిన ఫలంబు,
ప్రాలేయగిరిరాజబాలాసమేతుఁడై
        చెలగెడు హరునిఁ గొల్చిన ఫలంబు,

భారతీలోలుఁడై పరిఢవిల్లెడు విరిం
        చికిఁ బ్రియం బాచరించిన ఫలంబు,
జనకజాసహితుఁడై జగములఁ బ్రోచురా
        ముని దయాభ్యుదయ మందిన ఫలంబు,


తే.

మెఱయఁగా నప్పమాంబాసమేతుఁ డగుచు
ధనకనకవస్తువాహనధాన్యపుత్ర
పౌత్రదీర్ఘాయురారోగ్యభాగ్యభోగ్య
మహిమ గనుచుండు తిరుపతిక్ష్మావిభుండు.

61


వ.

వెండియు నమ్మహీవల్లభుం డఖండితలక్ష్మీకటాక్షవీక్షణానుక్షణ
ప్రచీయమానసంపత్పరంపరాభ్యుదయుండును సంపత్పరంపరాభ్యు
దయనిదానదైనందినదానధారాప్రవాహుండును, దైనందినదాన
ధారాప్రవాహపరివాహావగాహనవినిర్మలహరిదంతదంతావళ
స్కంధబంధురకీర్తినర్తకీచరణవిన్యాసుండును, నర్తకీచరణవిన్యా
సోద్భాసితమంగళమృదంగనిస్వనసముధ్యోతితకాలత్రయలక్ష్మీ
పూజామహోత్సవుండును, మహోత్సవసమయ సముజ్జృంభిత
కుతుపశాప్రముఖపురాతనపాదుశానుగ్రహపితృపితామహలబ్ధ
పటుతరపటహతమ్మటభేరీడిండిమప్రము హృద్యానవద్యవాద్య
ఘుమఘుమధ్వానపూరితదిగంతరాళుండును నై , రాకాశశాం
కోదయంబు విజృంభమాణం బగు పయఃపారావారంబు కరణి
ప్రాజ్యంబగు రాజ్యంబు పాలింపుచు రాజరాజాభిరక్షితంబగు నలకా
నగరంబుకైవడి, ధనధాన్యకరటిరథతురంగభటసముద్భటంబగు
రాచూరి పట్టణంబున యధేష్టభోగంబులం బ్రవర్తిల్లుచు నొక్క
నాఁడు హరివాసరవ్రతంబు నడపుచుఁ గృష్ణకథాశ్రవణంబునఁ బ్రొద్దు
గడపు నప్పుణ్యరాత్రి చతుర్థయామంబున.

62


సీ.

తొగఱేని జిగిఁబూని తగుమోము సొగసాము
        కొనుమోవినునుకావి గలుగువాఁడు
మునుకారుననుకారు కొనుమించు గనుపించు
        చెలువమై చెలువమైఁ జెలఁగువాఁడు,

బలుసింగముల భంగపడ నూను నడుమాను
        బంగారు రంగారు పటమువాఁడు,
జలజాతములభీతములఁ జేయఁగలచాయ
        కనుదోయిఁ గనిహాయిఁ బెనఁచువాఁడు,


తే.

పలుకు పలుకున నమృతంబుఁ జిలుకువాఁడు
చాపరోపాభిరూపహస్తములవాఁడు
కనకభూషణభూషితాంగములవాఁడు
కల నొకమహామహుండు సాక్షాత్కరించె.

63


సీ.

శశిబింబమున సుధాసార మెచ్చిలుభాతిఁ
        జిఱునవ్వు మొగమునఁ జెలఁగువాని,
జలజాతములతేనె చిలుకులై కన్నుల
        కరుణావలోకముల్ గలుగువాని,
నుదయాద్రినినులీల నుత్తమాంగమునందు
        కనకకోటీరంబు దనరువాని,
జలధరంబునఁ దోచు శంపాలతికరేఖ
        నొడల హేమాంబరం బొలయువాని,


తే.

శరశరాసనకలితహస్తములవాని
జత నొకలతాంగి రాఁ గూర్మి సలుపువాని
భువనమోహను నమ్మహాపురుషుఁ గాంచి
రాజతిలకుండు హృష్టాంతరంగుఁ డగుచు.

64


ఉ.

కించిదుపజ్ఞ నాత్మఁ బరికించి తదూర్జితచిహ్నముల్ విలో
కించి మదంబు మీఱఁ దిలకించి రఘూద్వహుగా మది న్విత
ర్కించి భయంబు భక్తి గమకించి తదంఘ్రిసరోజయుగ్మ మం
కించి భజింప మెచ్చి తులకించిన కూరిమి నవ్విభుం డనున్.

65


మ.

ధనురాచార ముదారతం బడసి నిత్యంబున్ దదభ్యాసముం
గని రేయుంపగలుం దదేకనిరతిం గల్యాణలాభంబుగై

కొని విన్నాణముగాంచి భావనలచేఁ గోదండదీక్షాగురున్
నను మెప్పించిన మేటివీన ధరణీనాథావతంసాగ్రణీ.

66


సీ.

ఋగ్వేదమును యజుర్వేదంబు మఱి సామ
        వేదం బధర్వణవేద మనఁగ,
నాల్గువేదంబులు నాల్గువిద్యలు తదీ
        యాంగముల్ శిక్షాదు లాఱువిద్య,
లనల మీమాంసయు న్యాయవిస్తరము పు
        రాణంబు ధర్మశాస్త్ర మివినాల్గు,
గాఁక నాయుర్వేదకార్ముకవేదగాం
        ధర్వనీతిప్రబోధములు నాల్గు,


తే.

వెరసి పదియును నెనిమిది విద్య లభవు
డఖిలలోకైకహితముగా నాది నుద్ధ
రించె నీవిద్యలందు పార్థివుల కధిక
విభవముల నిచ్చు నిద్ధనుర్వేద మవని.

67


వ.

అట్లగుటం జేసి.

68


క.

అలయష్టాదశవిద్యలు
గల దిద్ధనురాగమంబు గణనీయంబై
బలువిడి నిది కావ్యముగా
వెలయింపుము నీదుకీర్తి వెలయం దిరమై.

69


ఉ.

మానధనాగ్రణీ వినుము మాదృశహృద్యములైన సప్తసం
తానములందుఁ గావ్యము సనాతనమై ఘనమై తనర్చుటన్
మానవుఁ డెవ్వఁడేని సుషమంబగు కావ్య మభీష్టదేవతా
ధీనము సేయ నాయతగతిం జగతిం బొలుపొందుఁ బొందుగన్.

70


మ.

నరుఁ డాకుంభజు వేఁడినట్లు గురుఁ డానందనంబునం గ్రీడితో
బరిపాటిన్ వినిపించినట్లుగఁ గ థాభాగంబు భాగించి క్రొ
వ్విరులం దేనియగూర్చుకైవడి ధనుర్విద్యావిలాసాహ్వయం
బొరయం గావ్యము మాకు నర్పణముగా యోజింపు ముత్సాహివై.

71

సీ.

ఎంతగాలము భానుహిమభానుదీధితుల్
        జత నహోరాత్రంబు సలుపుచుండు,
నెంతగాలము ధాత్రిహేలావిలాసంబు
        గాంచి లోకుల నుద్ధరించుచుండు,
నెంతగాలము దివ్యదంతావళాష్టకం
        బష్టదిక్కూలంబు లానియుండు,
నెంతగాలము భుజగేంద్రుఁ డీభువనంబు
        నిజఫణాశక్తిపై నిలుపుచుండు,


తే.

నంతదడవు దిగంతవిశ్రాంతముర్తు
జాన్నగరరాజ్యసింహాసనానుభావ
పృథులతరవంశపారంపరీనిరూఢిఁ
బ్రబలుఁడవు గమ్ము తిరుపతిరాయమౌళి.

72


క.

నాదు కృతిసేయు మీకృతి
నీదగురాజ్యమున నీవనీనగరమునం
గోదండరాముఁ డనగా
నేఁ దనరుచునుందు నీకు నిలువేలుపనై.

73


తే.

అనిశరశరాసనములు నెయ్యమున నొసగి
కరుణ దళుకొత్త దీవించి గారవించి
యమ్మహాత్ముండు విచ్చేసినట్లు గాఁగ
మేలుకలగాంచి యంతట మేలు కాంచి.

74


వ.

వెండియు నమ్మహీవల్లభుండు స్వప్నదృష్టంబులగు నమ్మహాపురుషుని
సౌశీల్యవాత్సల్యతారుణ్యలావణ్యగాంభీర్యౌదార్యాదిమహారాజ
లక్షణంబులకు భయవినయసంభ్రమంబులు రెట్టింప కొండొకతడవు
తదేకాయత్తంబైన చిత్తంబెల్ల మెల్లన నెత్తమ్మిఱేకు విచ్చిన
కరణిం గనువిచ్చి నలుగడలుం గాంచుచు శయ్యామందిరోదరోపరి
విచిత్రతరచిత్రసందానితవితానమతల్లికాంచలవిలంబితగ్లానకు

వలయప్రసూనంబులను వికసద్బిసప్రసూనముకుళవకుళగర్భనిర్భర
ప్రసార[10]స్ఫారితారుణపరాగపరిమళపరిమేళనఘుమఘుమత్సమీర
కిశోరమంథరవిహారంబులను, ప్రతిప్రభాతకరణీయదేశాక్షిప్రముఖ
రసవిలసద్గానతానకగోష్ఠీవిధాయకగాయకనఖరముఖరద్వీణానిక్వా
ణంబులను భవిష్యత్ప్రభావిరహశంకాపిచండిలపాండురస్వరూపంబు
లగు దీపంబులను, గృహారామసీమాంతరమహాతరుకుటకోటరతట
ప్రబుద్ధశుకపికశారికానికరకాకలీకలకలంబులను, ప్రభాతంబుగా
నెఱింగి దిగ్గన లేచి పావనంబగు శయ్యాభవనంబు వెలువడి కుఱంగటి
కురంగశాబాక్షీలలామంబుల నిలువంబట్టిన నిద్దంపుటద్దంపు టొఱపులం
బిసాళంబు గాంచుచు ప్రాతఃకరణీయంబులగు కార్యంబులు యథావిధిం
గావించి మజ్జనభోజనంబు లాచరించి స్రక్చందనాంగరాగంబుల
నుపభోగం బవధరించి కనత్కనకమణిఖచితక్రైవేయహారకేయూర
కటకకాంచీప్రముఖంబులగు నాభరణంబుల నలంకృతుండై , సకల
జనసభాజనభాజనంబులగు వీజనంబులును, రాకాశశాంకప్రభా
పాత్రంబులగు నాతపత్రంబులను పరితఃస్థగితకాంచనపట్టంబులగు
నాలవట్టంబులును, శ్రుతిమధురగంభీరస్వరకళాతరంగంబులగు
మృదంగంబులును, రిపుశ్రనణభీషణనిర్దోషచండిమంబులగు డిండి
మంబులును నినాదమేదురసహృదయహృదయదోహళంబులగు
కాహళంబులును, లోనుగా నానావిధమహారాజచిహ్నంబులు ధరిం
చిన యయ్యైవినియోగంబులవారు, నలుగెలంకులం గొలిచి నడవ,
పసిండిపాదుక లెక్కి మదకలకంఠీరవరాజంబు చాడ్పున శుద్ధాంతని
శాంతంబు వెలువడి మంజులసాలభంజికాపుంజరంజితశాతకుంభ
స్తంభసంభృతంబును చలదుచ్చలాంచలాముక్తముక్తాఫలశోభి
తోల్లభంబును, సురుచిరతరకార్తస్వరభాస్వరాస్తరణంబును, సుగం
ధిలగంధవహస్తనంధయమంథరాగమసుగమగవాక్షలక్షితంబును
ద్వారస్ఫారితమరకతమణిగణకిరణప్రభాధగద్ధగితంబును నై ప్ర
దీప్తతప్తకార్తస్వరప్రభావిభాసితసితమణిరమణీచకచకచ్చకత

స్థూణకోణవిరచితరుచిరవిచికిలధానికానికాయంబుల ననపాయంబు
లగు మల్లికావల్లికావితానంబుల ప్రతానంబుల ననూనంబులగు
సూనంబులఁ బాదుకొను నామోదంబుల మోదంబుల నాస్వాదిం
చుచు మేదురంబులై సయ్యాటల నలుఁగెలకులందాఁటు తేఁటుల
పాటలసబాటంబులకు నివాటంబు గులుకుచు పటుతరకటకతటని
కటస్ఫుటఘటితమహానీలజాలకరుచిరింధోళికాభరంబులు జలధరం
బుల తెఱంగున నింపు సంపాదింప సొంపునఁ దుంపెసలాడు సంవర్ధితమ
యూరంబులవయారంబులు సంభావించు పంజరకీరంబులముగ్ధమధురా
లాపంబులు నాకర్ణించుమదకలకపోతంబులకు నాటపట్టులగు మణివిటం
కంబులను, ప్రతివాసరోద్భాసితమృగమదఘనసారకుంకమాగరులే
పంబులను, నిరంతరపరిస్ఫురితసాంబ్రాణిధూపంబులను, పరితః
పరిణద్ధమణికలాపంబులను, రామణీయకంబు దాల్చుచు జలధిరాజ
కన్యకాకటాక్షవీక్షణసుందరంబగు నాస్థానమందిరంబు ప్రవేశించి
భువనమోహనంబను సభాలంకారపారమ్యంబు గనుంగొన సాంగ
సాయుధసపరివారంబుగా నుపభాగంబుసం దావిర్భవించిన దిక్పాలక
నికరంబుల కరణిఁ బురణించు తత్తదాకారస్ఫారితపాంచాలికాసంచ
యంబులం జిత్రంబులగు ముత్తియంపు జగజంపు మేల్కట్టుక్రింద
మహార్హంబగు సింహాసనంబున సుఖాసీనుండై పంచశరసుకుమారు
లగు కుమారులును, సురుచిరప్రతిభావిచిత్రులగు పౌత్రులును, నిజ
కరుణాకటాక్షలక్షితసంపత్పరంపరానుబంధులగు బంధులును
ధీమంతులగు సామంతులును, విన్నాణంబులఁ గులుకు పలుకుల సంగ
డంపు గమికాండ్రగు నల్లుండ్రును, సంధివిగ్రహాదిషడ్గుణయథాను
గుణప్రయోగపరిహసితస్వరరాజమంత్రులగు మంత్రులును, కాల
త్రయకుశలసూచకజ్యోతిషమనీషాసమాహితులగు పురోహితు
లును, సుధీనికరావతంసులగు విద్వాంసులును, ప్రాచేతసవ్యాస
కాళిదాసప్రముఖపురాతనకవికవితాప్రశంసానుభవులగు
మహాకవులును, పురాణేతిహాసకథాప్రవచనానుగుణవాణీశ్రేణి
కులగు పౌరాణికులును, నిజాన్వయబిరుదావళీసంకీర్తనకళానందు
లగు నందులును, శ్రుతిమధురసంగీతగోష్ఠీవిధాయకులగు గాయకు

లును, సకలవర్ణవర్ణనకథాయథార్థసూచకులను పరియాచకు
లును, నిజవాహినీఘోషవిడంబితవాహినీపతులగు వాహినీపతు
లును, మహోదారులగు సరదారులును, భుజబలోదాత్తులగు
రాహుత్తులును, ధనకనకవస్తువాహనప్రముఖభవ్యద్రవ్యప్రవర్త
కులగు వర్తకులును, దక్కునుం గల వినియోగంబుల వారలు
యథార్హంబులగు నాస్తరణంబులం జేరి భయవినయంబులం గొలువ
దక్షిణభాగంబునం గూర్చుండి నిండుదనంబున నొండొరు లుపన్య
సించు పండితుల శాస్త్రోపన్యాసంబులకు వికాసంబు నొందుచు
వామభాగంబున నవరసాలంకారధోరణీపరిణతగద్యపద్యంబుల
తాత్పర్యంబులు వక్కాణించు మహాకవుల వక్కా ణంబులకు విన్నా
ణంబులు గులుకుచు, కుఱుంగట రాజకార్యపర్యాలోచనంబుల నా
మంత్రంబు సలుపు మంత్రుల మంత్రంబులకుం దగిన తంత్రంబు
లాకలింపుచు పిఱిందిదెస మెఱఁగు దీవియల తెఱఁగున బెణంగులు
కులుకు గణికానికరంబుల సాభిప్రాయవచనంబు లాకర్ణింపుచు
నిరుగెలంకులం గులుకుఁ గుబ్బెత లబ్బురంబుగా నొలయంజేయు
పావడచెఱంగులం దళతళమను నెత్తళుకులం బెళుకు చూపుచు వెను
కొని వినయంబున నూడిగంపుఁజేడియ లందించు మావడంపుం
గడానిపసిండిఱేకులంబోని తెలనాకుమడుపులకుం గటకాంగుళీయక
స్థగితమణికిరణప్రసారంబులం ప్రశస్తంబగు దక్షిణహ స్తంబు సాచుచు,
పురోభాగంబునం గడింది వేలుపు నాగవాసమ్ముల మెచ్చని విలాసం
బుల నెఱనీటు గులుకు కలికివెలయాండ్ర మొత్తమ్ములు నృత్తమ్ముల
చిత్తమ్ము లివురు లొత్తం జేయు జోహారు లవధరించుచు, మహేంద్ర
విభవమ్మునఁ బేరోలగంబుండి స్వప్నవృత్తాంతంబు పన్యసించిన వేద
విదులగు సభాసదు లిట్లనిరి.

75


చ.

శివుఁ డలఘుండు వింట శశిశేఖరుమించు నరుండు పార్వతీ
ధనసురరాజనందనుల ధాటికి మేలగు జామదగ్న్యుఁ డా
భవకపికేతుభార్గవులపాటికి మేటికుమారుఁ డీశవా
సవిజమదగ్నిరామశరజన్ముల మీఱు రఘూద్వహుం డిలన్.

76

వ.

మహారాజకులశిఖామణీ! చిత్తగింపుమా! యట్టి జగదేకధనుర్ధరుండగు
రఘుకులతిలకుఁడు స్వప్నంబున సాక్షాత్కరించుట నరిష్టపరిహారం
బును, నితోధికసామ్రాజ్యలక్ష్మీవిభవాతిశయంబును గలుగు.
వెండియు నమ్మహాత్ముండు పనిచినకైవడి పద్యకావ్యంబుగా
“ధనుర్విద్యావిలాసంబు” సంఘటించి యద్దేవునకు సమర్పణంబు
గావింపుము. యుష్మద్ధనుర్విద్యాపరిశ్రమంబునకు నిది ఫలంబుగా
మా మనంబునఁ దోచుచున్నయది యనినం బృహష్టాంతరంగుం
డగుచు నజ్జనపాలతిలకుండు.

77


మ.

ననురామానుజపాదపద్మయుగళీనవ్యావ్యయధ్యానపా
వనహృద్భాగవతావతంసపదసేవాసక్తచిత్తున్ మరు
త్తనయారాధనలబ్ధచారుకవితాధారున్ సదారూఢభా
వను నాస్థానకవిన్ నిజాశ్రితునిఁ బిల్వబంచి పల్కెన్ దయన్.

78


క.

శ్రీరామభద్రుపనుపున
ధారాళంబై తనర్చు ధనురాగమ మి
ద్ధారుణిఁ గావ్య మొనర్పఁగ
నారంభించితి భవత్సహాయము కలిమిన్.

79


వ.

వెండియుఁ గోదండదీక్షాగురుండగు రఘుపతి కటాక్షంబునం జేసి
సద్గురులాభంబున నిద్ధనుశ్శాస్త్రంబు మాకు నధీతంబయ్యె, తల్లక్ష
ణంబులు శాస్త్రసమ్మతంబులుగా నుపన్యసించెద, నీవను దత్తత్ప్ర
కారంబు లధికరించి గద్యపద్యాత్మకంబుగాఁ గావ్యంబు రచియింపు;
మక్కావ్యంబు మత్కులదైవంబగు నీవని కోదండరామునకు నంకి
తంబు గావించి యద్దేవునికరుణాకటాక్షవీక్షణంబుల నాయురారో
గ్యపుత్రపౌత్రాతిశయసంపత్పరంపరాభ్యుదయంబులం గృతార్థుం
డ నయ్యెద వని పలికి మఱియును.

80


క.

పాత్రుఁడవై మైత్రేయస
గోత్రుఁడవై నారసింహ గురువర్యునకున్
బుత్రుఁడవై వెలయుదు వి
ద్ధాత్రిన్ మాపనుపు సేయఁదగుఁ గృష్ణకవీ.

81


క.

అని యాన తియ్య నేఁ జ
య్యన జనితామాదరసమయాంతఃకరణం
బున నట్లకాక యని ప
ల్కిన విభుఁ డానందకందళితహృదయుండై.

82


వ.

తాంబూలజాంబూనదాంబరాభరణంబుల నన్ను బహుమానితుం
గావించినం గృతార్థుండనై యిద్ధనుర్విద్యావిలాసంబునకుం గృతి
పతియగు రఘుపతి గుణకీర్తనంబు గావించెద.

83


సీ.

ఏదయాపరమూర్తి యింద్రాదు లర్థింప
        నర్కాన్వయంబున నవతరించె
నేదేవదేవుండు వైదేహిఁ బెండ్లియై
        పరశురామునిఁ బోర భంగపరచె,
నేవీరవర్యుండు రావణాదులఁ ద్రుంచి
        రహి నయోధ్యానగరంబు సేరె,
నేమహాభాగుండు భామినీసహితుఁడై
        పట్టాభిషేకవైభవము గాంచె,


తే.

నాఘనుఁ డెసంగు మందారహారహీర
గాంగడిండీరకర్పూరగంధసార
రాజధరరాజతాచలరాజభుజగ
రాజసితకీర్తి కోదండరామమూర్తి.

84


శా.

ఆరామప్రభుఁ డీవనీపురమునం దర్చాస్వరూపంబునన్
శ్రీరాజిల్లగ జానకీసహితుఁడై కృష్ణానదీతీరమం
దారూఢిన్ విలసిల్లుచుం దిరుపతి క్ష్మాధీశ్వరుండున్ మదిన్
గోరం గోరిక లిచ్చుచుం గనఁదగున్ గోదండరామాకృతిన్.

85

సీ.

సర్వసర్వంసహా సహతాహతారాతి
రాతి నాతిగఁ జేయు నీతిశాలి,
హరినీలనీలదేహకలాకలాపుఁ డా
పదఖర్వశార్వరభానుమాలి,
హారనీహారడిండీరపాండురకీర్తి
కీర్తితస్ఫూర్తి పొంగిన ఘనుండు,
హంవీరవీరసాహసహసద్వదనుండు
మదనకోటివిలాసమననశాలి,


తే.

శయకుశేశయశయశరాసన విరావ
కృశదకూపారపారంపరీపరీత
తిమితిమింగిలగిలకులోద్వీక్ష్యవిలస
దసమసమరామరారంభుఁ డవ్విభుండు.

86


షష్ఠ్యంతములు

క.

ఏవంవిధచరితునకును
శ్రీవైదేహీరతునకు ఆతదురితునకున్
సేవాశ్రితభరతునకుం
బావనగుణనిరతునకును భయవిరతునకున్.

87


క.

మంజులగుణసంగతికిన్
గంజాతభవాదిపుణ్యగతికిన్ గరుణా
రంజతమతికిన్ రక్షో
భంజనరతికిన్ ధరాధిపతికిన్ గృతికిన్.

88


క.

ఇందుధరానందకరా
మందభరాజగవహరణమహితాంగునకున్
సుందరమాకందరమా
మందిర[11]మానితవనాభిమతఖేలునకున్.

89

క.

కుండలమణిమండలఘృణి
గండలసనశాలి కమలకమలాక్షునకున్
జండభుజాదండజితా
ఖండలవేదండచండకరధోరణికిన్.

90


క.

జృంభితమదగుంభితబల
గంభీరనిశాటఝాటఘనతరబాహా
రంభాకుచకుంభపరీ
రంభకళారంభకోద్ధురశరోద్దతికిన్.

91


క.

అక్షాదిక రక్షోనిక
రక్షోభకరక్షమాభిరక్ష్మితసుమనో
రక్షకునకు భిక్షుకమద
శిక్షకునకు మాలికాలసితవక్షునకున్.

92


క.

లోలాలసలీలాలస
దేలాడోలాచలాంగహృదయంగమభూ
బాలాలికబాలాలక
జాలఋజూకరణకేళిచణవఖరునకున్.

93


వ.

అంకితంబుగా నాయొనర్పంబూనిన “ధనుర్విద్యావిలాసం"బను లక్షణ
గ్రంథంబునకుఁ గథాప్రారంభం బెట్టిదనిన.

94


కథారంభము

సీ.

శైలూషవృత్తికశాండిల్యభావంబు
        ఘటియించు నేదివ్యకాననంబు
ఘనశాబరాళికిఁ గాలవోద్యానంబు
        రహి నిచ్చు నేశుభారామవాటి,
సొరిదిజాతులకెల్ల సుమనోవిలాసంబు
        భావితంబుగఁ జేయు నేవనంబు,
భూమి జంబుకమాత్రములకు నైరావతో
        ద్ధతి గూర్చె నేమహోద్యానమౌళి.

తే.

వేయు నేటికి తనుఁ జేరు విషములకును
అమృతభావం బొసంగునే యాశ్రమంబు
అవని నది శౌనకాదుల కనుదినంబు
నవనవాగమఫలదంబు నైమిశంబు.

95


క.

ఆవన మతిపావనయతి
పావనమై రుచిరవిచరదమరమరాళీ
తేవనవరజీవనభర
భావనమై పరగు ధర నభంగురభంగిన్ .

96


వ.

అయ్యాశ్రమంబునందు.

97


క.

సూత[12]ముఖోద్భూతకథా
న్వీతసుధామధురధోరణీలాలసులై
శీతలగుణపూతలస
ద్భూతలులై శౌనకాది మునికులతిలకుల్.

98


వ.

నిఖిలపురాణవ్యాఖ్యానగోష్ఠీగరిష్ఠుఁడై న రౌమహర్హణివలన భారత
కథాక్రమంబు వినుచుండి పాండవధార్తరాష్ట్రసంభవంబును, కుంభ
సంభవువలన నక్కుమారులశస్త్రవిద్యాలాభంబును, నట్లు సతీ
ర్థ్యులును, సవయస్కులును నై యభ్యసించు వారలలోనఁ బార్థుం
డు సమర్థుండగుటయ, నాకర్ణించి యిట్లనిరి.

99


మ.

అనఘా పార్థున కట్లు దివ్యమగు విద్యాకౌశలం బేమి నే
ర్పునఁ బ్రాపించెను తక్కునుం గల కుమారుల్ జోడునం జూడఁగా
వినఁగానీక గురుండు పార్థునకు నీవిన్నాణ మేయిక్కు వన్
వినుపించెన్ వివరింపు మీకథ కృపావిర్భావభావోన్నతిన్.

100


వ.

అనినం బ్రమోదంబునం బొదలుచు సూతుండు శౌనకాదులం జూచి
యిట్లనియె.

101


గీ.

కుంభసంభవుఁ డొనరించు కూపపతిత
కందుకాకర్షణమునకు గారవించి

కృపుఁడు భీష్ముఁ డాచార్యు నగ్గించి విద్య
గఱపనునిచిరి పాండవకౌరవులకు.

102


ఉ.

పాండవకౌరవుల్ పరమపావనుఁడౌ గురు నాశ్రయించి కో
దండకళానుభూతి సతతంబు పరిశ్రమ మాచరింపఁగాఁ
బాండవమధ్యముండు గురుభావము రంజిల భక్తియుక్తుఁడై
నిండుఁదనంబునం గొలిచి నేర్చుచునుండు ధనుఃప్రయాసముల్.

103


వ.

అంత నొక్కనాఁ డాచార్యుండు విలువిద్యగఱచు రాజకుమారలో
కంబు నాలోకించి నామనోరథంబు సఫలంబు గావించువాఁడెవ్వం
డనవుడు, తక్కుంగల రాజకుమారు లొండొరులమొగంబులు సూ
చుచు నెద్దియుం బలుకకుండినం బార్థుండు యుష్మన్మనోరథంబు
సఫలంబు గావించెదనని పలుకుటయు, నతని ధైర్యస్థైర్యంబులకు మెచ్చి
యొక్కనాఁ డేకాంతంబున నతనికి ధనుశ్శాస్త్రంబు సవిమర్శకంబుగా
నుపదేశించువాఁడై తనకుఁ బ్రణామం బాచరించి సావధాన మన
స్కుండై విన నుద్యోగించు పార్థునితో వివరించినట్లు రౌమహర్ష ణి శౌన
కాదులకుం జెప్పెనని వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె.

104


సీ.

ఈమహావిద్యాలలామంబుగల యిల్లు
        పాలేటిరాచూలి పట్టుఁగొమ్మ,
యీశరాభ్యాససంహిత గాంచు మేటికి
        శాకినీఢాకినీలోక మొదుఁగు,
నీధనుష్పాండితీబోధంబు గలధీరుఁ
        డతులసామ్రాజ్యంబు లనుభవించు,
నీకళాపరిణతి కిరవైన ధారుణీ
        భాగంబు లోకైకపావనంబు,


తే.

ఇది మహానటనానట మిది గభీర
మిది కుమార[13](సమీరి)త మిది యుదార
మిది పరశురామకామిత మిది యపార
మిది సకలధారుణీశ్వరాభీష్టదంబు.

105

మ.

ఖగవిఖ్యాతి శిలీముఖమ్ము దళముల్ గాంచె న్మధుశ్రేణికా
దిగుణోద్యత్సుమనస్కమై ఫలదమై దివ్యాగమోత్తంసమై
జగతిన్ మంజులతాశ్రయంబగు ధనుశ్సాస్త్రంబు రాణించు ని
మ్ముగ మందారమహీరుహ మ్మనఁగ నామోదమ్ము పుట్టించుచున్.

106


పంచ.

హరిం గుఱించి యంచి తోపహారమిచ్చి తెచ్చిరా
పురాణపూరుషుల్ ఋషుల్ తపోబలంబుడంబునం
ధరామరామరాభయప్రదంబు లస్త్రశస్త్రముల్
ధరాధరుల్ ధరించి సంచితప్రతాపులై రిలన్.

107


వ.

అనిన విని యర్జునుండు కుంభసంభవుం గనుంగొని మహాత్మా! యేమి
కతంబున హరిం బ్రార్థించి మహర్షులు ధనుశ్శాస్త్రంబు వడసిరి. అట్లు
పెద్దగాలంబు తపం బాచరించినం బ్రాప్తంబగు నిమ్మహాగమంబు
భూపాలకులశ్రేష్ఠులకు నొసంగుటకుఁ గారణం బేమి వినవలతు సవిస్త
రంబుగా నానతీవలయునని పలుకు పాండవమధ్యముం గనుంగొని కల
శభవుం డిట్లనియె.

108


శా.

వేదాచారవిదూరగుల్ దనుజు లుగ్వం దుర్విధిం బర్వఁగా
వేదాచారవిశారదుల్ మునులు నిర్వేదింప సర్వేశ్వరుం
డాదిన్ మంత్రములున్ బ్రయోగ ముపసంహారంబునుం గా ధను
ర్వేదం బిచ్చిన నమ్మహాత్ములు దయావిర్భూతచేతస్కులై.

109


క.

అపకారికి నుపకారికి
నపకారము ద్విజుల కహిత మగు నుపకారం
మ్ముపకారికి నపకార
మ్మపకారికిఁ జేయు టర్హ మగు నృపతులకున్.

110


వ.

అని తలంచి ధనురాగమంబు సాంగోపాంగంబుగా రూపలక్షణంబు
ల నుపలక్షితులగు నృపకుమారులకు నుపదేశించినం గృతార్థులై
జగదుపద్రవంబు వారింపుచు లోకప్రవర్ధనకరులనం బ్రవర్థిల్లుచుం
డుదు రట్లగుట రాజులకు ధనుర్విద్యాకౌశలం బావశ్యకంబు.

111

క.

తేజమున ధనము వడయం
గా జవమున నేఁగి మున్ను గాంచితి నంచ
ద్రాజధరభూరికరుణా
భ్రాజితవిద్యాభిరాము భార్గవరామున్.

112


వ.

అమ్మహాత్ముండును మద్వాంఛితం బెఱింగినవాఁడై లోకరక్షణవిచ
క్షణంబులగు కటాక్షవీక్షణంబుల నుపలక్షింపుచు నిట్లనియె.

113


క.

ధాత్రిం గశ్యపమునికిని
బాత్రంబగు ధనమునెల్ల బ్రాహ్మణులకు లో
కత్రయ మెఱుంగ నిచ్చితి
గాత్రంబు మహాస్త్రశస్త్రగణముం దక్కన్.

114


క.

ధనమునకును వరవిద్యా
ధనమునకును దైర్యమాన ధనమున కాయో
ధనమునకును బట్టగు సా
ధన మస్త్రము దీనిబోలు ధనముం గలదే.

115


వ.

అనుచు సమంత్రకంబుగా నస్త్రశస్త్రంబు లిచ్చినం బడసి కృతార్థుం
డ నైతి విను మశ్వత్థామకంటె భక్తిస్నేహంబులం బెద్దయుం గూర్తువు
గావున నిద్ధనుశ్శాస్త్రంబు నీకు నుపదేశించెద భక్తియుక్తుండవై
యాకర్ణింపుము.

116


మ.

సరసాచారకలాకలాపకలనాసంయుక్తి లక్ష్మీమనో
హరునైనన్ హరునైన మానసమునం దశ్రాంతముం గొల్చి స
ద్గురుశుశ్రూషల నాచరింపుచు ధనుర్గోష్ఠీగరిష్ఠుండ నై
గురుభావంబు వహింతు వీవు నిఖలక్షోణీపతుల్ మెచ్చగన్.

117


గీ.

తండ్రి కొడుకున కన్నయుఁ దమ్మునకును
దెల్లముగ నస్త్రవిద్య బోధింపవలయు
నట్లుగాదేని సువిధేయుఁడైన యట్టి
శిష్యునకు నైన నఱలేక చెప్పవలయు.

118

సీ.

అఖిలవస్తుసమృద్ధి ననితరాసంగమై
        యుల్లాసమున భావ మొలయవలయు,
నుల్లాసమున భావ మొలయుచుండెడి వేళ
        కార్ముకాగమవేది గలుగవలయు,
ఘనుఁడైన కార్ముకాగమవేది సన్నిధి
        సంతతాభ్యాసంబు సలుపవలయు,
సంతతాభ్యాసంబు సలుపుచుండెడి మేటి
        కధికబాహాబలం బమరవలయు,


తే.

భాసురంబగు మానసోల్లాస మొకటి
లక్ష్యలక్షణవిద్గురులాభ మొకటి
సంతతాభ్యాస మొక్కటి సత్త్వ మొకటి
శస్త్రవిద్యకు నాలుగు సాధనములు.

119


వ.

మఱియు నొక్కవిశేషంబు గలదు.

120


క.

వారికి వారికిఁ దగుభుజ
సారము గలదనుచు దలఁచి సత్త్వము కొఱగా
ధీరులు తక్కినమూటిని
గోరుదు రివి దక్క. నేర్పు గొనకొనకునికిన్.

121


క.

బంగారు పరిమళించిన
భంగిన్ బాహాబలానుభావోజ్వలుఁడై
పొంగి విలువిద్యఁ బడసిన
సింగమువలె సభల నుల్లసిల్లు నధికుఁడై.

122


క.

భావింపఁగ నుల్లాసము
జీవుండగు యత్న ముల్లసిలుదేహంబై
యీవసుమతి గురుబోధము
లావల నంగీకరించు టాహారమగున్.

123


క.

ప్రాభవనిష్ఠయు సద్గురు
లాభం బభ్యాస మను కళాత్రితయమున్

శోభిల దొక్కటి దక్కినఁ
దా భిత్తిక యిడక నిలుపు ధామము కరణిన్.

124


సీ.

గురుబోధమునఁగాక కూలంకషంబుగా
        నిల విద్య లరయువాఁ డీశ్వరుండు,
కావున విద్యాధికారంబు గోరిన
        వసుధ సద్గురుఁడు కావలసియుండు,
సద్గురుబోధంబు సంధిల్ల ధీరుఁడై
        బలుపరీక్షల భంగపడకయుండు,
నసమసదభ్యాస మమరినవానికి
        నొరయుచో నుత్సాహ మొలయుచుండు,


తే.

భావసంవేది శాస్త్రార్థపారగుండు
శాంతుఁడును దాఁతుఁడును దయాసాగరుండు
సులభుఁడును సుస్థిరుండును సుముఖఁ డై న
శస్త్రధరుఁ డగు ధాత్రిపై సద్గురుండు.

125


క.

తెలిసియుఁ దెలియనివాఁడును
తెలిసియు శిష్యునకుఁ గలఁతఁ దీర్చనివాఁడున్
దెలియక తెలియుదుననుచుం
బలుదెఱఁగులు చూపు గురువు బాలిశుఁ డనఘా.

126


క.

అటువంటి వేషధారుల
తటవిటముల నాలకింప దలఁపక విద్యా
పటిమంబు గాంచు సద్గురుఁ
దటుకున నంగీకరింపఁదగు నేర్పునకున్.

127


ఉ.

ఆదట సద్గురుండు కరుణాతిశయమ్మున నిచ్చువిద్య యి
మ్మేదిని నెట్టివారలకు మిక్కిలి మేలు ఘటించుచుండు నౌ
పాదు ఘటించి నీరు పరిపాటిగ నించినఁ బట్టుగొమ్మలై
ప్రోది వహించుచుం జెలఁగి పూచి ఫలించు లతావితానముల్.

128

వ.

ఉపదేశార్హుండగు శిష్యు నిరూపించెద నాకర్ణింపుము.

129


సీ.

వినయమ్ము గురువరానునయమ్ము గలవాని
        పలుకు విన్నాణంబు గులుకువాని,
చెలువముల్ వెదచల్లు సింహమధ్యమువాని
        వలమురి నోడించు గళమువాని,
స్వచ్ఛంబులగు కాయకచ్ఛముల్ గలవాని
        సమములౌ పీవరాంసములవాని,
దృఢనిస్తులంబులౌ దీర్ఘబాహులవాని
        సమవిభక్తాంగమ్ము లమరువాని,


తే.

గాంచి తోషించి శిష్యునిగా వరించి
విల్లు పట్టించి నేర్పులు విస్తరించి
యలయికలు మాన్చి యభ్యాస మలవరించి
కూర్మ వాటించుఁ గీర్తిచే గురువరుండు.

130


సీ.

ఉర్వి ద్వాత్రింశదాయుధములలోపల
        నరయ బాణాసనం బధిక మండ్రు,
తాదృశంబగు విల్లుదాల్చిన చతురుండు
        విభవాభిరాముఁడై వెలయు నండ్రు
గావున విలువిద్య గఱపువానికి శిష్య
        వరుఁ డూర్జితుండు గావలయు నండ్రు,
జగతి నూర్జస్వలుఁడగువాఁడు షణ్ణవ
        త్యంగుళోత్సేధుఁడై యలయు నండ్రు,


తే.

సంగడంబున షణ్ణవత్యంగుళములు
మాన ముత్తమపురుషప్రమాణమంత
ఖర్వుఁడును దీర్ఘుఁడును గాని ఘనుఁడు (చూవె)
మహిసముఁడు సార్వభౌముఁడై మలయు నండ్రు.

131


వ.

ఇట్లు సమపురుషప్రమాణంబు నిరూపింపం దగు, నింక సమవిభక్తాం
గుఁ డగుటకు ఫలంబు వివరించెద నాకర్ణింపుము.

132

ఉ.

ఘ్రాణపుటమ్ములుం బొమలు కర్ణయుగంబులు చూచుకంబులున్
బాణులు కన్నుదోయి మణిబంధపుయుగ్మము కూర్పరంబులున్
శ్రోణులు జానులున్ బదసరోరుహముల్ వృషణావటుస్థలుల్
క్షోణి సమానవైఖరులఁ జొప్పడువాఁడు మహీశ్వరుండగున్.

133


ఉ.

ఈదృశరాజచిహ్నముల హెచ్చులు గుల్కెడు రాకుమారకుం
బోదన చేసి రాఁదిగిచి భూరిదయాభ్యుదయంబునన్ ధను
ర్వేదకళానిరూఢి వివరించిన నంచితశౌర్యధుర్యుఁడై
యాదట నక్కుమారుఁ డుదయార్కుని కైవడిఁ బ్రోచు లోకమున్.

134


వ.

అనిన విని యుధిష్టిరానుజుం డాచార్యుని కిట్లను, మహాత్మా! పురా
తనరాజకుమారులయందు శాస్త్రోక్తంబులగు మహాపురుషలక్షణం
బుల నుపలక్షితుండై ధనుర్విద్యాలాభంబునం గోదండదీక్షాగురుం
డును, సార్వభౌముండును నై ప్రజాపరిపాలనంబునం దేజరిల్లువాఁ
డెవ్వం డతని గుణలక్షణప్రకారంబులు వినవలతుం జెపుమనిన కుంభ
సంభవుం డిట్లనియె.

135


క.

సోమద్యోమణి కులముల
క్షేమంబున నుదయమందు క్షితిపతి సుతులం
దీమహి శుభలక్షణముల
రాముఁడు పరిపూర్ణుఁడగుచు రాజిలుచుండెన్.

136


మ.

విలసద్బుద్ధివ శేషశాలి శు వాగ్విస్తారుఁ డాలోడితా
ఖలనీతిప్రకరుం డుదారుఁ డుదరగ్రీవుండు సుస్నిగ్ధుఁడున్
సులలాటుండు సువిక్రముఁడు సుశిరస్కుండు సుగాత్రుండు వ
త్సలుఁ డాజానువిలంబిబాహుఁడు ఘనస్కంధోజ్జ్వలుం డాదటన్.

137


శా.

యోధాగ్రణ్యుఁడు గూఢజత్రుఁడు విశాలోరస్థలుండు సము
త్సేధుండు మృగరాజమధ్యుఁడు సమాశ్లిష్టాంగుఁడుం దీర్ఘబా
హాధుర్యుండు మహాహనుండు నవపద్మాక్షుండు భాస్వత్కటి
ప్రోధుండుం శుభలక్షణుండు గుణసంపూర్ణుం డుదీర్ణుం డిలన్.

138

సీ.

ధర్మస్వరూపుఁడై తనరు సత్యమునందు
        ధనదు నాక్షేపించు దానగరిమ,
కాలాగ్నితేజంబు గాంచుఁ గ్రోధమునందు
        విష్ణుసంకాశుండు వీర్యకలన,
కలశాబ్ధిసదృశుండు గాంభీర్యగుణమున
        మేరుశైలనిభుండు ధీరవృత్తి
క్ష్మాసమాతిశయుండు సహనభావంబునం
        దమృతాంశుతుల్యుఁ డాహ్లాదనమున,


తే.

సర్వదాభిగతుండు సత్సముదయమున
సర్వశాస్త్రార్థతత్వనిస్సంశయుండు
సర్వలోకప్రియుండును సర్వసముఁడు
వేదవేదాంగనిధి ధనుర్వేదవిదుఁడు.

139


క.

జ్ఞానానందమయుండును
ధీనిధివశ్యుఁడు యశఃప్రదీప్తుఁడు విజయ
శ్రీనిరతుఁడు సద్యఃప్రతి
భానుఁడు భానుకులజలజభానుఁడు తలఁపన్.

140


వ.

విను మిట్లు మహాపురుషలక్షణంబులం ప్రసిద్ధుండు గావున దశరథరాజ
నందనుండు వజ్రంబునకుం జోడు దొడిగినకరణి నిద్ధనుర్విద్యాలాభం
బునఁ గోదండదీక్షాగురుండను నామంబు వడసి త్రిలోకశ్రీధరుండై
వర్ధిల్లుచుండె వెండియు నిట్లు శరాభ్యాసంబునకుం గమకించు రాజ
కుమారులయం దుక్తంబులగు మహాపురుషలక్షణంబులం గొండొక
శుభలక్షణంబు లేమియు నిరూపించి యక్కుమారునకు సమర్మకం
బుగా నిద్ధనుశ్శాస్త్రంబునం గల విశేషంబు లుపదేశింపందగు.

141


శా.

నీయందున్ శుభలక్షణంబులు కడుం నిండారుటం జాప శి
క్షాయత్తంబయి చిత్త మిత్తఱి మహోత్సాహంబు నొందెం బరీ
క్షాయోగ్యుండవు గమ్ము కొమ్మిఁక ధనుశ్శాస్త్రంబు చిత్రంబు నే
వేయుం జెప్పగ నేల ని న్నిఁక ధనుర్విద్యానిధిం జేసెదన్.

142

వ.

వెండియు నిట్టి ధనుశ్శాస్త్రంబునం గురుసంకీర్తనంబును, శిష్యవరణం
బును, విద్యాప్రభావసూచనంబును, సఖం డాఖండకోదండద్వయ
నామోద్దేశంబును, ధనుర్నిర్మాణప్రమాణప్రముఖవిశేషవినివిభాగం
బును, మార్గణపరిగణనప్రణయనంబును, తద్విధానమానప్రశంస
నంబును, పుంఖోపసంఖ్యానంబును, పక్షపరిమాణప్రశంసయు, నిషం
గరచనాప్రవచనంబును, మౌర్వీవిధానకథనంబును, నంగుళిత్రాణ
ప్రకీర్తనంబును, జ్యారోపణప్రకరణంబును, ధనురూర్ధ్వాధరభాగవినిభా
గంబును, ముష్టిప్రకరణంబును, స్థానోపసంఖ్యానంబును, శరగ్రహణ
హస్తప్రతిపాదనంబును, సంధానక్రమవివరణంబును, నాకర్షణహ
స్తప్రస్తావంబును, బాణహస్తక్షేత్రనిరూపణంబును, దృష్టిలక్షణా
న్వీక్షణంబును, ధనురాకర్షణకౌశలోపన్యాసంబును, పుంఖోద్వేజన
విభజనంబును, చాపముష్టిప్రేరణవివరణంబును, శరమోచనప్రకా
రప్రవచనంబును, చాపోత్సరణలక్షణవినిభాగంబును, శరాభ్యా
సోచితమాసోపన్యాసంబును, శరవ్యాపారయోగ్యతిథివారతారకా
యోగకరణవివిస్తరప్రస్తావంబును, ఖురళికారంగప్రసంగంబును,
రంగప్రవేశలక్షణనిర్దేశంబును, ధనుశ్శరపూజాయోజనంబును,
గురుప్రణామస్థేమంబును, శరశరాసనగ్రహణపౌర్వాపర్యపర్యాలో
చన సూచనంబును, లక్ష్యశుద్ధిలాభంబును, లక్ష్యవేదికారచనా
వివేచనంబును, నారాచమోచనప్రకారసూచనంబును, చిత్ర
లక్ష్యభేదనపాయప్రతిపాదనంబును, శబ్దలక్ష్యశరాభ్యాసవిలాసం
బును, దూరనికటస్థలలక్షితలక్ష్యభేదనదృష్టిముష్ట్యంగుళనియ
మనలక్షణాన్వీక్షణంబును, రథారోహణశరాభ్యాసవిశేషభాషణం
బును, గజారోహణశరప్రయోగవిభాగంబును, హయారోహణ
శరమోక్షణలక్షణవివరణంబును, దూరాపాతిశరాభ్యాసవిస్తర
ప్రకీర్తనంబును, శరప్రయోగసమసమయాసమయనిరూపణంబును,
శరగమనగుణదోషవినిభాగంబును, దివ్యాస్త్రమంత్రతంత్రప్రయో
గవిస్తరప్రస్తావంబును, లోనుగా పంచచత్వారింశల్లక్షణంబులు
ఘటితంబులై యుండు క్రమక్రమంబున వివరించెద నాకర్ణింపుము.

143

మ.

ధను విష్వాసము ధన్వ కార్ముకము కోదండంబు బాణాసనం
బును చాపంబును నా సుధీప్రణిహితంబుల్ నామముల్ గాంచి స
య్యన శార్ఙ్గంబన వంశజంబయి సఖండాఖండభావంబులన్
దనరున్ విల్లు గిరీశవిష్ణుపురుహూతప్రోతమై ధారుణిన్.

144


గీ.

స్థవిరమహిషశృంగశకలయుగ్మంబును
బదరదారుఖండపంచకంబు
శైలసంఖ్య గూర్చి శార్ఙ్గంబు సేతురు
ధీరమతులు కొన్నిదేశములను.

145


ఉ.

రెండు విషాణఖండములు రెండును రెండును రెండు మీఁద నొ
క్కండును గాఁగ దారుమయఖండములుం జతగూడి తొమ్మిదై
యుండఁగఁ గొన్నిదేశముల నొయ్యన గూర్తురు శార్ఙ్గచాపమున్
ఖండము లేక వంశభవకార్ముకముం దగు సుప్రసిద్ధమై.

146


సీ.

అటని కార్ముకశృంగ మాదండ గొనయమ్ము
        సరవి నెక్కిడు చోట్ల సవరణములు,
సవరణంబుల దండ ఠవణించు గొటిమలు
        గొటిమల కందముం గూర్చు కొమలు,
కొమలకు వెలిదండ కొమరారు పృష్ఠంబు
        లోదండ వక్షమ్ము నాఁదనర్చు,
సన్నంపుగౌను లస్తకము సంధించుచో
        సాయకం బిడుచోట శరధియండ్రు,


తే.

యిన్నియును విస్తరించితి నేరికైన
యిది శిరోభాగ మిది పుచ్ఛ మివ్వివిధంబు
చిరతరాభ్యాసవశమున చిత్త మెఱుఁగు
గాని యిదమిత్థ మని పల్కఁగాదు సుమ్ము,

147


వ.

శార్ఙ్గవిధానంబు వివరించెద నాకర్ణింపుము.

148

సీ.

గొఱియకొమ్ములు చీరి కుదురుగా సవరించి
        పలకపాళములుగా నిలవరించి,
అగ్రభాగముల కైదాఱంగుళమ్ముల
        కొలఁది తక్కువలుగా గుఱుతుఁజూచి,
అదుకు మాఱుట దాని యదుకు పట్టునఁ గాక
        మెలకువ నటునిటు మించనదికి,
అదికిన ఖండమ్ము లవి రెండు నొకటిగా
        బొత్తి మోపున సరిహత్తఁ గూర్చి,


తే.

యదుకుపై నొక్కటీవల నవలమూఁట
మూఁటదారు ఖండమ్ముల మొసలి వా న
మర్చి లోపల గెఱలూని మసృణరసవి
శేషముల రెండు నొక్కటి సేయవలయు.

149


వ.

ఇట్లు కోదండ శార్ఙ్గఖండంబును, వెలిదండ దారుఖండంబునుంగా
నమర్చి మఱియును.

150


గీ.

ఓదెగొంగనరము లురము పృష్ఠమ్మును
గ్రమ్మునటుల చటులగతి నమర్చి
జేవురలఁది కొలదిచే నార్చి గెజగీర్చి
యొరపు నెరపురంగు లునుపవలయు.

151


గీ.

అదికినపుడు తిన్ననై శలాకీలీల
చక్కఁదనము గులుకు శార్ఙ్గధనువు
ఎండ నెండెనేని కుండలస్ఫురణంబు
నందు వెలికి వలయితాగ్ర మగుచు.

152


సీ.

పదియాఱు పిడియలఁ బరగు దీర్ఘంబై న
        విల్లు యుద్దార్హమై వెలయుచుండు,
పదియేను పిడియల బలు కార్ముకంబు దూ
        రాపాతనంబున కలరుచుండు,

పదునాల్గు పిడియల బాణాసనము లక్ష్య
        వేదికారూఢమై వెలయుచుండు,
పదుమూఁడు పిడియల పటుశరాసము చలా
        చలశరవ్యములందుఁ జెలగుచుండు


గీ.

నెఱి సొబగులారు బంగారునీరుపూఁత
మెరుగు లిరుగడఁ దమతమమెలపు దెలుప
పరగ కోసలదేశాదిభావములను
వాసి కెక్కువ శార్ఙ్గశరాసనములు.

153


మ.

రమణీయంబయి దూరపాతివిశిఖార్హంబై పిసాళించు శార్
ఙ్గము రెండుంగొమ లంగుళద్వితయదీర్ఘంబుల్ సమంబుల్ సున
మ్రములుంగా దగునైన దూరమడలింపన్ మేలువాలమ్ములన్
క్షమ నివ్వింటికి నీవిశేష మెసగున్ శార్ఙ్గమ్ములన్ నాల్గిటన్.

154


గీ.

ద్రోణయొకటి గూర్చుదురు వింటికనువుగా
నళిక యండ్రు దానినామకంబు
నళిక నేయు శరము నాళీక మందు వి
శేషవిధము లుండు జేనకొలఁది.

155


ఉ.

ఈనళికన్ రచింపఁదగు నిత్తడిచే నయినం బసిండిచే
నైనను తామ్రఖండముల నైనను కంచున నైన వెండిచే
నైనను వంశనాళమున నైన కొలం బదిముష్టుఁ లుండ గాఁ
జేనిది రజ్జులంబితము చేసి ధరింపఁదగున్ ధనుర్ధరుల్.

156


మ.

ఖగమున్ మార్గణమున్ కదంబము పృషత్కంబున్ క్షురప్రం బజి
హ్మగమున్ రోపము సాయకంబు శరముం బాణంబునుం గాండమా
శుగమున్ బత్రియు నంబకంబు విశిఖేషుల్ కంకపత్రంబు నాఁ
దగు ధాత్రిం బ్రదరాభిధానము లుదాత్తమ్ముల్ హితమ్ముల్ గృతిన్.

157

సీ.

కలికాముఖమ్ము చక్రముఖమ్ము దంష్ట్రాము
        ఖంబు వజ్రముఖంబు క్రకచముఖము,
గజపాదముఖమును కలశముఖం బర్ధ
        చంద్రముఖంబును సర్పముఖము,
కుర్కురముఖమును ఘూకముఖంబును
        సూచీముఖంబును శుకముఖంబు,
భేకీముఖంబును గాకముఖంబును
        మకరీముఖంబు జంబుకముఖంబు,


తే.

నారసము ఫల్లమును కూర్మనఖము శూర్ప
ముఖ మిలీముఖ మంజలిముఖము కర్త
రీముఖ శిలీముఖ వరాటికాముఖములు
గలవు పెక్కువిశేషముల్ గల శరములు.

158


సీ.

ముక్తాఫలంబు డంబున మోము చెలువమ్ము
        గలయమ్ము ముక్తాముఖమ్ము సుమ్ము,
కోరకాకారకంబై రకంబగు మోము
        గలయమ్ము కలికాముఖమ్ము సుమ్ము,
ప్రోదిమై సూదిమైఁ బొలుపారు మొన సౌరు
        గలయమ్ము సూచీముఖమ్ము సుమ్ము,
కోరకైవడి నతిక్రూరమౌ వదనమ్ము
        గలయమ్ము దంష్ట్రాముఖమ్ము సుమ్ము,


తే.

ఆడయఱ్ఱలమొగము సోయగము గులుకు
మొనగలుగు సాయకము శిలీముఖము సుమ్ము
నళిననాళాభరంద్రితాననవిభాసు
రమ్మగు శరమ్ము నాళీముఖమ్ము సుమ్ము,

159


సీ.

కలికిరాచిలుక చొక్కపుమోమువలె మోము
        సొబగైన వాలమ్ము శుకముఖమ్ము,
మండూకవదనమ్ము మాడ్కి మోము రహించు
        బెడిదంపు వాలమ్ము భేకముఖము,

వాయసాననము కైవడి భీకరంబై న
        కఱుకుమోము శరమ్ము కాకముఖము,
ఘోరంపు గూబముక్కు బెణంగు గలమోము
        కొమరారు విశిఖమ్ము ఘూకముఖము


తే.

కూర్మనఖరోపమానమై పేర్మిగాంచు
క్రూరపు టలుంగు విశిఖమ్ము కూర్మనఖము
గవ్వవలె మవ్వములు గాంచు కలుకుములికి
గలిగిన కదంబము వరాటికాముఖమ్ము.

160


క.

సాయకములలో నలఘు
ప్రాయంబులు నాల్గు గరుల భాసిల్లు రహిం
జేయలఁతి సైనికుల పై
నేయందగు మార్గణమ్ము లివి పదిరెండున్.

161


సీ.

అర్ధేందుసన్నిభంబగు మోము గలయది
        తెగువ కిమ్మగు నజిహ్మగము సుమ్ము,
చేఱంపమనఁ జాలు చిత్రంపుమోముది
        తెగువ కిమ్మగు నజిహ్మగము సుమ్ము,
కఠినంపుటనుసుటుగ్రపుఁ బాఱవాతిది
        తెగువ కిమ్మగు నజిహ్మగము సుమ్ము,
అంజలించిన మాడ్కి నాస్యంబు గలయది
        తెగువ కిమ్మగు నజిహ్మగము సుమ్ము,


తే.

కత్తెర తెఱంగు వదనంబు గాంచునదియు
తెగువ కనురూపమగు నజిహ్మగము సుమ్ము
గాఢతరమండలాగ్రజాగ్రన్ముఖంబు
తెగువ కనురూపమగు నజిహ్మగము సుమ్ము.

162


క.

ధారావదయోవలయ
స్ఫారంబగు మార్గణంబు చక్రముఖ మనిం

దేరులపై వారణముల
బారులపై తెగువ కేరుపఱచిరి ధీరుల్.

163


క.

జంబుకవదనంబుసకా
శంబగు వక్త్రంబు గలది జంబుకముఖ మా
స్యం బాభషకంబానన
ముంబోలిన శరము శునకముఖమగు ధాత్రిన్.

164


గీ.

మకరికాముఖంబు మఱి జంబుకముఖంబు
కుర్కురాననంబు ఘోరలీల
మొసలి నక్క యేపి మొనసిన కైవడి
భండనమున రిపుల భంగపఱుచు.

165


చ.

యుగములు కార్ముకంబులును యుగ్యములుం బడగల్ గొడుంగులుం
నొగలును గంకటంబులును నుగ్గులుగా ధరణితలంబునం
దెగి పడనేయఁబూనఁగ విధించిరి ఫల్లములం ధనుర్ధరుల్
తగు కరవీరపిప్పలపలాశనికాశములౌ నలుంగులన్.

166


సీ.

గజపదాననమైన గజపాదముఖ మది
        బలితంపుటినుపతాపల నగల్చు
చిలువవాచెలువంబు గలది సర్పముఖంబు
        మకుటాదిదళనోద్యమంబు దాల్చు
చారుపిప్పిలపలాశముఖంబు ఫల్లంబు
        దూది జోడులు విండ్లు దుస్సిపాఱు
నళిననాళోపమాననము నాళముఖంబు
        కనదయఃఫలకభేదన మొనర్చు


తే.

ప్రాకటంబుగ నడుమ శలాక గూర్చి
రంగుగా జేవు రలఁది నరంబు సుట్టి
గరులు నాల్గిడి కఠినంబుగా సమర్ప
నిట్టి విన్నాణములు సూపు నీశరములు.

167

చ.

పలకలు మూడునాలుగును భాసిలుబెత్తెడలుం గమర్చి య
ప్పలకనుసుల్ గురిన్ గరులు పార్శ్వములందును రెండు పింజకుం
సెలవులు రెండుగా నదికి జేవు రలంది నరంబుఁ జుట్టినం
దలమగు సాయకం బినుపతాపలలోపల గాఁడిపారెడిన్.

168


వ.

వెండియు దూరాపాతిశరవిధానం బుపన్యసించెద నాకర్ణింపుము.

169


క.

ఈమహి వరకార్ముకవి
ద్యామహిమలు దూరపాతనార్హము లనుచున్
నేమించిరి శరముల ము
క్తాముఖము శిలీముఖమ్ము కలికాముఖమున్.

170


వ.

తద్విధానంబునకుం దగినసాధనంబు లెవ్వియనినం బ్రశంసించెద
నాకర్ణింపుము.

171


క.

కాండేక్షుకాండ మొకటి య
ఖండితగిరికర్ణికారకాండ మొకటియున్
దండిగ దూరాపాతన
కాండవిధానంబునకును గరిమ వహించున్.

172


క.

ఓలి గిరికర్ణికారము
మేలై యీరెంటిలోన మెచ్చుల్ గులుకున్
వాలాయంబుగ సింగపు
వాలమువలె మీఁద మీఁద వలమై యునికిన్.

173


సీ.

పైపయి వలముగాఁ బ్రబలి పర్వము లేక
        కోమలంబగు కొండగోరు కఱ్ఱ,
అచ్చునఁ దిగిచి తోయంబులలో నుంచి
        మానక నచ్చున మరలఁ దిగిచి,
యీటార్చి మొదలు బెత్తెఁడుదక్క రెండుగాఁ
        జీలిచి లోపల బూలవాపి,
యవల జేవురలంది యదికి దారముఁ జుట్టి
        రెండు మూఁడు దినంబు లుండనిచ్చి,

తే.

అపుడు సడలించి గరిదీర్చి హంసపాదిఁ
జేసి పుంఖంబులలుఁగులు చేసి గరులు
నేరుపున గూర్తు రిట్టిది దూరపాత
నంబుగల బాణములవిధానంబు సుమ్ము.

174


వ.

మఱియు నొక్కవిశేషంబు కలదు.

175


క.

బెడఁగైన పులుఁగు చర్మము
గుడు సెడలిచి జేవురలఁది కురువిందపురా
వొడిసల్లి యార్చి దాతురు
కడిది శరాసనముల గఱ దీర్చుటకున్.

176


వ.

ఇట్టి సంస్కారంబు హంసపాది యనందగు, మఱియును.

177


సీ.

అలతులాదండాభ మగు శరంబు రచించు
        విధము తన్మానంబు విస్తరింతు,
జగిగల కఱ్ఱ దీర్చిన యోగ్యమైయుండు
        చేవఁ జెక్కిన నతిశ్రేష్ఠతరము,
పుంఖ మగ్రము సన్నములు సేయగాఁ దగు
        మధ్యంబు వలముగా మనుపవలయు,
మొదట పుంఖము దీర్చి ముఖము పుంఖముకన్న
        సన్నంబు గావింప జను ధరిత్రి,


తే.

గలుగు శరముల మానంబుకంటెఁ గొఱఁతఁ
గాంచు సార్ధాంగుళము వాని నెంచిచూడ
కొద్దిమెకముల ఖగములఁ గూలనేయఁ
దగు తులాదండసన్నిభంబగు శరంబు.

178


వ.

ఇంక నాళీకంబులను శరంబులమానంబును, తదనుబంధంబులగు
లక్షణంబులు వివరించెద నాకర్ణింపుము.

179


ఉ.

తూకొను నన్నిబాణములు తూఁచినకైవడిఁ దూఁచ మానమున్
దీకొనుచుండు జేన కొలదిం బయి నంగుళమాత్రమేనియున్

బైకొను నంగుళద్వితయమాత్రపుతెక్కలు నాల్గు నుర్వి నా
ళీకములంచు పేరులు లలింగని దోనెలఁ దూగు బాణముల్.

180


చ.

పలకలు నాఱు నెన్మిదియు భాసిలు మించుటలుంగుమోమునం
గలిగిశలాక గూర్పఁబడి గాఢపులోహమయంపుకట్టులం
బలిమి వహించి పుంఖమున భాసిలి ఱెక్కలు మూఁడు దాల్చి ని
శ్చలదృఢలక్ష్యనిర్మధనసాధనమై తగు నారసం బిలన్.

181


వ.

అట్టి నారాచంబునకుం బర్యాయనామంబులును దద్భేదంబులును,
నేయందగిన కొలందులును, దద్వినియోగంబులును, దదనుబంధము
లగు విశేషంబులును, సవిస్తరంబుగా వివరించెద నాకర్ణింపుము.

182


సీ.

ప్రక్షేపణంబు నారాచంబు నాఁజను
        నారసంబునకును నామధేయ,
మందు శుద్ధము మిశ్రమన రెండువిధములై
        ధీరసమ్మతముగాఁ దివురుచుండు,
నాయసంబగు శుద్ధమంతశ్శతకంబు
        మిశ్రభావంబున మెలపుగాంచు,
సొరిది నేకవిధంబు శుద్ధనారాచంబు
        మిశ్రకం బష్టధా విశ్రుతమగు,


తే.

నలుఁగు లష్టాంగుళంబుల కొలఁదినుండి
కొలుచుటకు నంగుళము వాసి కొఱఁత గాగ
లాఁతి నేకాంగుళంబు కొలంది దనుక
ప్రబలు నెనిమిది మిశ్రనారాచములకు.

183


వ.

అందు ప్రథమోద్దిష్టం బగు శుద్ధనారాచంబునకు ననుబంధంబు లగు
విశేషంబు లుపన్యసించెద నాకర్ణింపుము.

184


ఆ.

పలక లెనిమిదాఱు పారొపించు క్రొవ్వాడి
యలుఁగు గలిగి పుంఖ మాది గాగ

గనదయోమయంబుగాఁ దగునారాచ
మొక్కవింటికొలఁది నునుపవలయు.

185


వ.

అట్టి శుద్ధనారాచంబునకు వజ్రపుటలుం గమర్చిన వజ్రముఖంబు నాఁ
బరగుఁ దత్ప్రభావం బుపన్యసించెద నాకర్ణింపుము.

186


మ.

ఆహితహేమదీప్తవలయావలితంబయి పుంఖ మాదిగా
లోహమయంబు వజ్రపుటలుంగును నై తగు నారసంబుచే
నోహరిసాహరిన్ గుధర మొయ్యన దూయఁగ నేయఁగాఁదగున్
వాహనములున్ రథంబులును వారణముల్ భరమే పగల్పగన్.

187


క.

కాంచనగిరి నెంచని హరి
నొంచెను రాఘవుఁడు పూర్వ ముగ్రస్ఫూర్తిన్
గొంచము భేదించెను ని
ర్వంచనుఁడై షణ్మఁఖుఁడును వజ్రముఖమునన్.

188


వ.

వెండియు నిట్టి శుద్ధనారాచంబునకు నొక్కవింటికొలందిఁ గఠినంబులగు
నయశ్శిలాఫలకంబు లేనియు భేద్యంబులైయుండు ద్విత్రిచతుర్ధనుః
ప్రమాణంబులఁ గఠినలక్ష్యభేదంబునకు సంధానంబుల నలవిగాకుండు
నని పలుకుదు రిట్టి శుద్ధనారాచప్రకారంబు వివరింపంబడుఁ దక్కటి
యష్టాంగుళ సప్తాంగుళ షడంగుళ పంచాంగుళ చతురంగుళ త్ర్యంగు
ళాంగుళిద్విత యైకాంగుళంబుల కొలందుల నలుంగులు గలుగు
నెనిమిదిమిశ్రనారాచంబులం గల విశేషంబులు గ్రమక్రమంబున
నుపన్యసించెద నాకర్ణింపుము.

189


గీ.

అంగుళాష్టకోన్నత మగు నలుఁగుగలుగు
నారసము రెండుతెఱఁగుల గూరుపఁదగు
నలుఁగున శలాకపుంఖంబు నాన నొకటి
మధ్యమున రెండవశలాక మలయ నొకటి.

190


వ.

అందు ప్రథమోద్దిష్టప్రకారం బుపన్యసించెద నాకర్ణింపుము.

191

చ.

అలుఁగు శలాకపుంఖమున నంటఁగ మధ్యమ మేకఖండమై
యలుఁగును పుంఖమగ్రమును నాదిమమై పొసగన్ ద్రిఖండమై
యలుఁగున పింజె నందదుకులై చెలువొంది పసిండికట్టునం
దలమగు నారసంబు ద్విరదం బరదంబు నగల్చు నుగ్రతన్.

192


క.

అలుఁ గష్టాంగుళమానము
గలనారాచంబునకును గరులిడ నదియున్
బలువిడి శార్ఙ్గము కొలఁదిన్
జులుకన కఠినంపుగుఱిని జొరనేయుటకున్.

193


వ.

వెండియు నొక్కవిశేషంబు గలదు.

194


ఉ.

ప్రోడతనంబునం గనకపుంఖము దాఁక శలాక నేకమై
కూడ నమర్చుచున్ గరులు గూర్చక తీర్చిన నారసంబునన్
వీడని పన్నిదంబునను విశ్రుతి మీఱ నిషంగరంగమం
దీడుగ మూఁడువిండ్ల కొలఁదిన్ నినుపన్ దగు లక్ష్యవేదికన్.

195


వ.

మఱియు నీయష్టాంగుళనారాచంబు సార్ధశార్ఙ్గత్రయంబు కొలదిని
సార్ధశార్ఙ్గపంచకంబున కొలందినిం గఠినలక్ష్యంబున సబాటంబుగా
నడిపిన ధనుర్ధరుండు ధనురాగమసాంప్రదాయజ్ఞుండని నిర్దేశింపంబడు,
నిట్లు ప్రథమోద్దిష్టంబగు నీయష్టాంగుళాయోముఖనారాచంబునంగల
విశేషం బుపన్యసించితి, ద్వితీయోద్దిష్టంబగు నయ్యష్టాంగుళాయో
ముఖనారాచంబునం గలవిశేషంబు లుపస్యసించెద నాకర్ణింపుము.

196


చ.

అలుఁగు శలాకకున్ నడుము నానఁగ మాఱుశలాకఁ గూర్చుచో
నలుఁగును మూఁడుఖండములు నాదటఁ బుంఖముగా నమర్చినన్
నలువుగ నైదుఖండములు నాల్గదుకుల్ గనుపట్టుచుండు ని
మ్ముల నలుఁ గంగుళాష్టకసమూర్జితమై తగు నారసంబునన్.

197


వ.

వెండియు నిన్నారాచం బేకశార్ఙ్గంబు కొలందిం గఠినలక్ష్యభేద
నంబగు నదియునుంగాక.

198

గీ.

అనిశ మష్టాంగుళోత్సేధ మలుఁగు గలుగు
వెడఁదనారాచ మది లక్ష్యవేధి యందు,
సార్ధశారంగత్రయాయతి సార్ధశార్ఙ్గ
పంచకాయతి నేయుట పౌరుషంబు.

199


వ.

మఱియును.

200


గీ.

ఆయసంబు నిశిత మష్టాంగుళాయతా
ననము గలుగునట్టి నారసంబు
లయిదువిండ్ల కొలఁది నవల లక్ష్యంబున
గాఁడిపాఱ నేయఁగా భరంబు.

201


వ.

మఱియు నొక్కవిశేషంబు గలదు; పూర్వోక్తప్రకారద్వయలక్షి
తంబు లగు నిట్టి మిశ్రనారాచంబుల కుభయపక్షంబులు నుప
వలయు నంగుళాష్టకపరిమాణంబున నలుంగు లునుపుటయు, లక్ష్య
భేదనంబునం గొలందియు నొక్కటియగుట నేకవిధంబుగా వక్కాణిం
పంబడియె, నిదియును శుద్ధనారాచంబు కరణి నత్యంతకఠినలక్ష్యం
బేనియు శార్ఙ్గంబు కొలంది నడపిన నిరర్గళంబై భేదింపంజాలి
యుండు, వెండియు బహుప్రయోగకుశలుం డగు ధనుర్ధరునిచేతం
గాని సార్ధశార్ఙ్గత్రయ సార్ధశార్ఙ్గపంచకదూరస్థం బగు లక్ష్యం
బున నిర్వక్రంబుగా నడవకుండు ని ట్లష్టాంగుళనారాచప్రకారంబు
నిర్ణీతంబగు, నింక సప్తాంగుళంబును, షడంగుళంబును, పంచాంగుళం
బును, గొలందులుగా నలుగు లమర్చిన నారాచత్రితయంబునుం
గల విశేషంబు లుపన్యసించెద నాకర్ణింపుము.

202


చ.

ప్రదరరసాచలాంగుళపరస్పరదీర్ఘములౌ నలుంగులన్
బదపడి మూఁడుచందముల భాసిలుచుండెడు నారసంబులం
దదుకులు నాలుగుం దునుకలైదును మధ్యగమై శలాకయున్
మూఁడుపక్షములు గూర్తుగురు కొద్దులు గొప్ప లేనియున్.

203


వ.

మఱియు నిన్నారాచంబులందు.

204

గీ.

అరయ సప్తాంగుళోత్సేధ మలుఁగు గలది
యనువుగ షడంగుళోత్సేధ మలుఁగు గలది
యవలఁ బంచాంగుళోత్సేధ మలుఁగు గలది
నికటదూరలక్ష్యంబుల నినుపవచ్చు.

205


వ.

వెండియు నొక్కవిశేషంబు గలదు.

206


గీ.

దూరమున నుండి లక్ష్యంబు దూయనేయు
నాణెమగు గొప్పఱెక్కలనారసంబు
కదిపి లక్ష్యంబు కరకరి గాఁడనేయ
నలువ మగుఁ గొద్దిఱెక్కలనారసంబు.

207


వ.

ఇట్టి నారాచత్రితయంబునకుం గఠినలక్ష్యభేదంబునం గొలంది యెట్టి
దనిన.

208


గీ.

వినుము పదునొకండువిండ్లకొలందికి
నడుపరాదు మిగుల నారసంబు
మిగుల నడుపునేని మిక్కిలి నాటదు
నాటదేని జారు నైపుణంబు.

209


వ.

మఱియు షడంగుళనారాచంబు సూచీసదృశంబుగా నలుం గమర్చిన
సూచీముఖంబునా బరగుఁ, దత్ప్ర కారంబును, దద్వినియోగంబును
నిరూపించెద నాకర్ణింపుము.

210


చ.

అదుకులు నాలుగుం దునుక లైదును మధ్యమునన్ శలాకయున్
గదియఁగ సూచికాకృతి ముఖంబు షడంగుళదీర్ఘమై తగున్
బదపడి మూఁడుఱెక్కలును భాసిలుచుండెడు నౌరసంబునం
గదనమునందు శత్రువులగాత్రముఁ గూర్తురు సూచికాకృతీ.

211


వ.

ఇట్లు సప్తాంగుళ షడంగుళ పంచాంగుళంబుల కొలంది నలుంగులుగల
నారాచత్రితయంబులంగల విశేషంబులు వక్కాణింపంబడె, నింక
చతురంగుళ త్ర్యంగు ళాంగుళద్విత యైకాంగుళంబుల కొలంది నలుం
గులు గల నారాచచతుష్టయంబునంగల విశేషంబు లాకర్ణింపుము.

218

ఉ.

ఆగమవహ్నిదృక్ఛశధరాంగుళదీర్ఘములౌ నలుంగులన్
బాగయి మూఁడుపక్షముల భాసిలు నాల్గును నారసంబు లా
లాగున లోనమాఱట శలాకికఁ గూర్పమి నాల్గుఖండముల్
లోగడలందు మూఁడదుకులుం దగి దూరము దూఁగు నాజిలోన్.

213


వ.

వెండియు నిన్నారాచాష్టకంబునం దష్టాంగుళ సప్తాంగుళ షడంగుళ
పంచాంగుళంబుల కొలంది నలుంగులు గల నాలుగునారాచంబు లతి
క్రూరంబులు, తక్కుంగల చతురంగుళ త్ర్యంగు ళాంగుళద్విత యై
కాంగుళంబుల కొలంది నలుంగులుగల నాల్గునారాచంబులు లఘు
ప్రాయంబులును, దూరగంబులునై విభజింపంబడు, నిందు యుద్ధం
బుల నియ్యెనిమిది నారాచంబులకు వినియోగంబు లుపన్యసించెద
నాకర్ణింపుము.

214


సీ.

అష్టాంగుళం బలుం గమరు నారాచంబు
        భార మంభారీల బారిసమరు,
నలుఁగు సప్తాంగుళం బమరు నారాచంబు
        వడి నయోమయరథావళి నగల్చు,
నాఱంగుళములయ ల్గమరు నారాచంబు
        స్ఫుటతరోరశ్చదంబులఁ బగల్చు
నలుఁగు పంచాంగుళం బమరు నారాచంబు
        హయఫాలఫలకంబు లాడిపారు,
న ట్లొకటి రెండు మూఁడు నాల్గంగుళముల
కొలఁది యలుఁగుల నారాచములను నాల్గు
భటతనూభేదకంబులై పరగు నిట్లు
వెలయు నెనిమిదినారాచముల తెఱంగు.

215


మ.

ముంగల నారసంబులకు ముష్టులు తొమ్మిది దూరపాతి కే
కాంగుళ మంగుళ ద్వితయమైన కొదం బది ముష్ టులుండుఁ ద
క్కుంగల సాయకావళులకుం బదిముష్టులమాన ముండు నీ
యింగిత మాకలింపఁదగు నెక్కువతక్కువ నిక్కువంబునన్.

216

వ.

వెండియు నిట్టి సకలవిధంబులగు శరంబులకుం బ్రమాణంబులు నిరూ
పింప నుపాయంబుగల దాకర్ణింపుము.

217


మ.

జ్యాలతమానమున్ మఱియు శార్ఙ్గపుమానము రెండు నొండుగా
దేలిచి మూఁడుభాగములు దీర్చుచు నందుల నొక్కభాగమున్
హాలి శరప్రమాణమగునం చల భార్గవరాముతోడ గౌ
రీలలనావిభుండు వివరించె జగద్ధితకార్యధుర్యుఁడై.

218


వ.

అట్లగుటం జేసి మౌర్వీశరాసనమానంబు లొక్కటిగాఁ గలయం
గూడి యది మూఁడుభాగములుగా విభజించి యం దొక్కభాగంబు
కొలంది శరంబులమానంబు నినుపందగు ననిన విని పాకశాసనతన
యుం డాచార్యున కిట్లనియె.

219


క.

నాలుగు కొలఁదుల శరములు
నాలుగు కొలఁదుల శరాసనంబులు గా మున్
బోలించితి రేధనువున
నేలాగునఁ గూర్పవచ్చు నిషువుల కొలఁదుల్.

220


వ.

అనిన నాచార్యుం డిట్లనియె.

221


సీ.

పదియాఱుముష్టుల బాణాసనమునందు
        తెగువ బాణంబులు దివియవలయు,
పదియేనుముష్టుల బాణాసనమునందు
        దూరపాతిశరంబుఁ దొడగవలయు,
పదునాల్గుముష్టుల బాణాసనమునందు
        నారాచనికరంబు నడుపవలయు,
పదుమూఁడుముష్టుల బాణాసనమ్మునం
        దిలఁ దులాదండేషు వేయవలయు,


గీ.

నే కొలది బాణ మేవింట నేయవలయు
నా కొలఁది బాణ మావింట నాకలించి
కొలఁది వివరించినట్లుగాఁ గూర్తురేని
తొడిగినశరంబు చక్కఁగా నడుచుచుండు.

222

వ.

వెండియు బాణాసనంబు కొలందికి ముష్టిమాత్రంబు కొలంది కొఱఁ
తగా మౌర్విం గొలందిఁ గూర్పవలయుఁ; దత్ప్రకారంబు మార్వీప్రకర
ణంబున వివరింపంబడు నట్లగుట పదునాల్గుముష్టుల శరాననంబులును
పదుమూఁడుముష్టుల మౌర్వియును, నీ రెండుకొలందులు కలయం
గూడిన నిరువదియేడుముష్టు లగు నందు మూఁడవపాలు తొమ్మిది
ముష్టు లగుటం జేసి నారాచంబుల కొలంది తొమ్మిదిముష్టు లనం
బరగు, నివ్విధంబున తక్కునుం గల బాణంబులకుం దగిన బాణాసన
జ్యాయుగళంబుల మానంబులు కలియంగూడి పూర్వోక్తప్రకారంబున
కొలంది గూర్పవలయు, నట్లు కొలందు లేర్పరచిన నర్ధాంగుళమాత్రం
బేనియు నంగుళమాత్రం బేనియు నెచ్చుతగ్గులుండిన నక్కొదువ
యలుంగుల తారతమ్యంబునం బ్రాపించునని నిర్ణయింపందగు, నిట్లు
సాయకంబులకుం గొలందు లేర్పఱించందగు మఱియును.

223


క.

తులకుం దూఁగిన విశిఖము
తలఁచినలక్ష్యంబు నడుమ దవులుఁ దిరంబై
తులకుం దూఁగని విశిఖము
తలఁచినలక్ష్యంబు నడుమఁ దవులదు చలమై.

224


వ.

అట్టి శరతులనాకలనంబు వివరించెద నాకర్ణింపుము.

225


క.

వాలాయమ్ముగ శరములు
పోలింపగ రెండుపాళ్ళు పుంఖమువైపున్
బా లలుఁగువైపు దూఁచిన
హాలిం దులదూఁగవలయు నటునిటు సమమై.

226


వ.

మఱియును.

227


క.

అలుఁ గుండెడు భాగమ్మున
బల మునిచిన సాయకంబు పరగుం దిరమై
అలుఁ గుండెడు భాగమ్మున
బల మునుపమి సాయకంబు పరగదు జడమై.

228

గీ.

అగుట నలుఁగు గలుగు నగ్రభాగమ్మున
పాలు పింజవైపు పాళ్ళు రెండు
గాఁగఁ గొలిచి తూఁచఁగాఁదగు బాణముల్
గురువు లఘువుఁ జూచి కూర్చు నపుడు.

229


సీ.

కాండేక్షు విష్వాసికయు వాయసేక్షువు
        కాకేక్షు వనగను గనప ఱెల్లు,
కాండప్రకాండముల్ గలుగు నాఱెల్లున
        నానత పర్వంబు లాయతములు,
కాండేక్షుకాండప్రకాండఖండంబులు
        ప్రధనసాధనములై పరిఢవిల్లు,
నట్టి ఖండములు సోయగముగా నచ్చున
        వడివంక దీర్పఁగా వలయు నండ్రు,


తే.

ధృతి పసిఁడితీవ లచ్చునఁ దిగిచినట్లు
తిన్నగా మూఁడుమారులు దిగిచి చూచు
నపుడు నొగులక కఠినంబు లగుచు నిలుచు
ఖండములు గూర్పఁగాఁదగు ఖగములందు.

230


వ.

అని మఱియు నిట్లనియె.

231


క.

అచ్చున దివియందగు శర
మచ్చున దివిచిన సవాటమై గుఱి కుఱుకున్
గ్రచ్చర నచ్చున దివియుట
విచ్చలవిడి నీకు నిపుడు వినిపింతుఁ గృపన్.

232


చ.

అమరగ నైదువేళ్ళు చతురశ్రమయఃఫలకంబు నాల్గురం
ధ్రములదిగాగ దారువివరంబునఁ దార్చి యనిం దదీయరో
కముల శరంబు సేయఁదగుఁగఱ్ఱగమిన్ మెలిదీరఁ దీసినన్
గ్రమమున నంబకంబులు నరాళములై కనుపట్టు ధారుణిన్.

233

వ.

ఇ ట్లచ్చునం దివిచిన కాండేక్షుఖండంబుల నారాచంబులుం దక్కటి
బాణంబులుం గావింపవలయు, నట్లు దీర్చిన బాణంబుల నదుకు
లును ఖండంబులును విభజించెద నాకర్ణింపుము.

234


సీ.

మొగి శుద్ధనారాచమును తులాదండాభ
        మును నఖండాకృతిఁ దనరుచుండు,
నడుమ మారుశలాక యిడని నారసముల
        కాద్యంతములను రెండతుకు లుండు,
నడుమ మారుశలాక యిడినవానికి నెల్ల
        నైదుఖండములు నాల్గదుకు లుండు.
తెఱఁగార దూరపాతిశిలీముఖములకు
        నాద్యంతములను రెండదుకు లుండు


గీ.

తక్కునుంగల విశిఖవితానమునకు
ఖండములు నాలు గదుకులు గలుగు మూఁడు
వజ్రముఖ మగు నారాచవరమునందు
ఖండములు రెండు నదుకు నొక్కటియు గలుగు.

235


వ.

మఱియు నలుంగుల తెఱంగు వివరించెద నాకర్ణింపుము.

236


గీ.

అతిసునిశితాగ్రభాగమై యాఱుపలక
లష్టఫలకంబు లేనియు నధిగమించి
కఱ్ఱలోనుండి మొలచినకరణి నలుఁగు
రహి గులుకుచుండవలయు నారాచములకు.

237


వ.

వెండియుఁ దక్కునుంగల బాణంబుల యలుంగుల ప్రకారంబు తత్త
త్ప్రకరణంబుల వక్కాణించితి నింక నీ యలుంగులకుం బద నిడం
దగిన శుద్ధద్రవ్యకూటంబు గలదు, వివరించెద నాకర్ణింము.

238


సీ.

పటిగ ముప్పదియాఱుభాగంబు లందుల
        సాఁబాలుగా నవాసాగరంబు,
సైంధవలవణంబు జత గుల్లసున్నంబు
        పది పది బాణముల్ పొదిపి నూఱి,

జలముల లెస్సగాఁ గలపి తజ్జలములఁ
        గాండంపుటలుఁగులు గ్రాఁచి ముంచి,
నెడలఁగఁ దివియుచో విశిఖంపుటలుఁగుల
        నెఱి మూఁడువర్ణముల్ నిలుపవలయు,


గీ.

అరసి తెలిచాయ కొన్నిటి యలుఁగులందు
నసితవర్ణంబు కొన్నిటి యలుఁగులందు
నిటు లుభయమిశ్రమగు పాల యీఁకవర్ణ
మనఁ బదంబుగాఁ గొన్నిటి యలుగుఁలందు.

239


వ.

వెండియు నిట్లు పద నునిచి వేర్వేఱ ధవళవర్ణంబులును, కృష్ణవర్ణం
బులును, తదుభయమిశ్రవర్ణంబులునుంగా విశిఖంపుటలుంగు లేర్ప
ఱచుటకు ఫలం బాకర్ణింపుము.

240


చ.

అలుఁగవదాత మైనఁ బద నందెడు బాణము ప్రాణిభేదకం
బలుఁగు వినీలమైనఁ బద నందెడు కాండము దారుభేదకం
బలుఁగుల పాలయీఁక విధమౌ పద నందెడు సాయకం బయః
ఫలకవిభేదనం బనుచుఁ బల్కదు రాదిమచాపశిక్షకుల్.

241


వ.

ఇంక పక్షప్రకారం బుపన్యసించెద నాకర్ణింపుము.

242


క.

పత్రమ్మును వాజమ్ము ప
తత్రమ్ము గరు త్తనంగఁ బక్షాహ్వయముల్
ధాత్రిం గనఁదగు శుభచా
రిత్రా గరి ఱెక్క యనఁగఁ బృథివిం దెనుఁగుల్.

243


గీ.

పృథివి నారాచములలోన రెండిటికిని
విను తులాదండ నిభశరంబునకుఁ దక్క
బాణముల కెల్ల గరు లేరుపరతు రవియుఁ
గంకగృధ్రమయూరపక్షములు సుమ్ము.

244


వ.

మఱియు నొక్కవిశేషంబు గల దాకర్ణింపుము.

245

క.

గరిగల బాణము కరణిన్
గరి లేనిది నిశ్చలంబుగాఁ జన దగుటన్
గరు లంబకంబులకు నే
ర్పరతురు విజ్ఞానఘనులు ప్రాక్తనులు మునుల్.

246


వ.

శరంబుల గరు లునుపందగిన విన్నాణంబుఁ లుపన్యసించెద నా
కర్ణింపుము.

147


గీ.

రెండుగాఁ బక్షములఁ దీర్చి రేఖవారు
పింజపై కఱ్ఱయును జివ్వి పెనుపు మీఱ
గరు లదికి కత్తిరింతురు కౌశలమున
నాశుగంబుల తారతమ్యంబు లరసి.

248


ఉ.

ఆచితపుంఖభాగమున కంగుళమాత్ర మెడంబు గాఁగ నా
రాచములందు పక్షముల రాజిల దీర్చుట నాణె మండ్రు నా
రాచము దక్క తక్కినశరంబులనన్నిట పుంఖ మానగా
సూచితవైఖరిం గరులు చొప్పడఁ దీర్చఁదగున్ యథావిధిన్.

249


గీ.

అధరముల రెండు సెలవులయందు రెండు
పక్షముల నాలు గిడఁదగు బాణములకు
నధరముల రెండు సెలవిపై నమర నొకటి
గరులు మూఁ డిడఁగాఁదగుఁ గాండములకు.

250


వ.

వెండియుఁ జక్రముఖార్ధచంద్రప్రముఖంబులగు నీరంచుటలుంగుల
బాణంబులకుం గరు లునుప నుపాయంబు గలదు.

251


శా.

సర్వగ్రంథి కదంబకంబునడుమన్ భాసిల్లుఁ దద్గ్రంథికిన్
బూర్వుల్ నాభికయంచుఁ బేరిడిరి మెప్పుల్ గూర్చు తన్నాభికిన్
నిర్వక్రంబుటలుంగు టీ రనుసుటీనెల్ నూలునం బట్టినం
బర్వంగాఁదగునయ్య పుంఖ ముఖపుం బైఱెక్కకుం జక్కనై.

252


క.

ఈరీతి పుంఖముఖమున
పై రాజిలు ఱెక్కగల్గు పైయనుసునకున్

దీరిక నాభికి సరిగా
గూరుచునతఁ డస్త్రశాస్త్రకుశలుం డనఘా.

253


క.

ఇల నారాచంబులకును
విలసితగతి దూరపాతివిశిఖంబులకున్
గొలఁదిని దరతమములుగా
కలితనమున మూఁడు మూఁడు గరు లిడవలయున్.

254


క.

దూరాపాతంబులకును
నారాచంబులకుఁ దక్క నాలుగుఱెక్కల్
ధారుణి నిఖలాంబకముల
కారూఢిన్ గూర్చవలయు నార్యానుమతిన్.

255


క.

పక్షములు కలుగుబాణము
పక్షిగతి న్నభమునందుఁ బ్రాఁకు నచలమై
పక్షములు లేనిబాణము
పక్షంబులు లేనిఖగముపగదిన్ బొదలున్.

256


వ.

పుంఖోపసంఖ్యానంబు.

257


మ.

నినుపం జూతురు పుంఖముల్ శరములన్ నీలంబు గోమేధికం
బును గారుత్మతమున్ బ్రవాళమును గెంపున్ వజ్రమున్ మౌక్తికం
బును వైదూర్యము పుష్యరాగశకలంబున్ లోనుగా వన్నెకె
క్కిన రత్నంబుల దారు శృంగములమాడ్కిన్ వాజివక్త్రాకృతిన్.

258


క.

కనకము వెండియు రాగియు
నినుమును దగరంబు సీస మిత్తడి కాంస్యం
బును సత్తు లోనుగా వసు
ధను గలలోహములఁ జేయఁదగు పుంఖంబుల్.

259


గీ.

మల్లెమొగ్గకరణి మఱి వాజివక్త్రంబు
కరణి సోయగంబు గల్గునట్లు
అలుఁగుకన్న సన్నమై తేజరిల్లఁగాఁ
దీర్చి పుంఖ మెలమిఁ గూర్చవలయు.

260

క.

నారాచములకుఁ బుంఖము
లారయ మణిలోహమయము లతిభాసురముల్
దూరాపాతములకు సుకు
మారంబులు దారుశృంగమయపుంఖంబుల్.

261


గీ.

పార్థ వేయు నేల బాణంబు బలిమికిఁ
గొలఁదిఁ జూచి పింజ గూర్చవలయు
కఠినములకు పింజ కఠినంబు గాఁదగు
లఘుశరముల పింజ లఘుతరంబు.

262


గీ.

అలుఁగు గలుగుభాగ మగ్రభాగము దాని
కన్న సన్నమైన నదరు పుంఖ
మగ్రమునకు పుంఖ మధికమై యుండిన
గాఁడిపాఱ దంబకంబు గుఱిని.

263


వ.

వెండియు నొక్కవిశేషంబు గల దాకర్ణింపుము.

264


గీ.

ఆర్ద్రమహిషచర్మంబుచే నైనఁ జేప
పొట్టచే నైన జేవుఱ వుట్ట నవని
చాపములు సాయకంబులు సంఘటించి
సరవి నదుకుట కివి సుమ్ము సాధనమ్ము.

265


గీ.

అనుచు నర్జునునకు నస్త్రగురుండు భా
వించి పలుకులీల విస్తరింప
నద్భుతముగ రౌమహర్షణిఁ బ్రార్థించి
రవలితెఱఁగు శౌనకాదు లెలమి.

266


మ.

కరుణాసాగర సాగరాన్వయజనుఃకల్యాణ కల్యాణసుం
దరసద్ధామక ధామకమ్రకలనాధారాళ ధారాలస
చ్ఛరలీలాభరలాభరంజితసుధీసంతాన సంతానవ
త్సురశోభావన భావనాతిగ మహస్సూర్యాదసూర్యాదరా.

267

మాలిని.

త్రిజగదవనదక్షా ధీరకోదండదీక్షా
విజయవిహితధాటీ విద్ధదోషాటకోటీ
సజలజలదవర్ణా సంతతానందపూర్ణా
సుజనభరణశాలీ సూర్యవంశాబ్దహేళీ!

268


గద్య.

ఇది శ్రీమత్కౌసల్యానందనకటాక్షవీక్షణపరంపరాసాదితకవి
తావిచిత్ర, సుకవిజనానుగ్రహపాత్ర, మైత్రేయసగోత్ర, నృసింహగు
రుపుత్ర, కృష్ణమాచార్యప్రణీతం బైన ధనుర్విద్యావిలాసం బను
లక్షణగ్రంథంబునందుఁ గ్రమంబున నిష్టదేవధ్యానంబును, సుక
విభూషణంబును, కుకవినికరావమానంబును, కృతికథాకల్పక
వంశావతారవర్ణనంబును, స్వప్నవృత్తాంతోపన్యాసంబును, కృతి
పతిగుణకీర్తనంబును, కథావతరణంబును, ద్రోణార్జునసమాగమం
బును, ద్రోణుం డర్జునునకు ధనుర్విద్యారహస్యంబు లుపదేశింప దొర
కొనుటయు, విద్యాప్రభావనూచనంబును, గురుసంకీర్తనంబును,
శిష్యవరణంబును, సఖండాఖండకోదండద్వయనామోద్దేశంబును,
ధనుర్నిర్మాణపరిమాణప్రముఖవిశేషవినిభాగంబును, మార్గణపరి
గణనాప్రీణనంబును శరవిధానమానప్రశంసనంబును, పుంఖోప
సంఖ్యానంబును, పక్షపరిమాణాదివిశేషవిభజనంబునుఁ లోనుగా
నేకోనవింశతిలక్షణంబులం దనరు ప్రథమాశ్వాసము సంపూర్ణము.

  1. పుణ్యపరి
  2. కృష్ణాతి
  3. మెదకువతో లింగ
  4. తెల....గారా
  5. వక
  6. కుళకంబు
  7. యతనైక
  8. జూచినన్మరవు లేనువు
  9. మనసోబు
  10. నాభివితారణ
  11. మానితరసాభి
  12. సూతయథాజాత
  13. తమిది